Sri Sita Ramachandraswamy Temple
-
జగదభిరాముడికి పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి గురువారం పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం యాగశాలలో చతుఃస్థానార్చన హోమం జరిపారు. 10 గంటలకు శంఖు, చక్ర, ధనుర్బాణాలు ధరించిన సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తిని మేళతాళాలు, కోలాటం, భక్తుల జయజయ ధ్వానాల నడుమ పల్లకీ సేవగా తీసుకొచ్చి మిథిలా స్టేడియంలోని వేదికపై సింహాసనంలో కొలువుదీర్చారు. శ్రీరాముడి పట్టాభిషేకం నిర్వహించేందుకు వైదిక మంత్రాలతో వశిషు్టడు, వామనుడు, జాబాలి, కశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, విజయుడు, సుయజు్ఞడులను వేద పండితులు వరింపజేసుకున్నారు. మధ్యా హ్నం 12 గంటలకు అభిజిత్ ముహూర్తాన బంగారు సింహాసనంపై స్వర్ణఛత్ర, స్వర్ణపాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, వజ్రకిరీటాలను స్వామివారికి ప్రదానం చేశారు. లక్ష్మీదేవిని ఆవా హన చేసి రాజముద్రికను కుడిచేతి వేలికి తొడిగారు. ఆ తర్వాత పూర్తి రాజ లాంఛనాలతో సామ్రాట్ కిరీటాన్ని శ్రీరాముడికి అలంకరించారు. రామదాసు చేయించిన పచ్చల పతకం శ్రీరాముడికి, చింతాకు పతకం సీతాదేవికి, రామ మాడను లక్ష్మణుడికి అలంకరించారు. స్వర్ణఛత్రం నీడలో ఎడమవైపు రాజఖడ్గం, కుడి వైపున రాజదండంతో శ్రీరాముడు దర్శ నం ఇవ్వగా, తిలకించిన భక్తులు పులకించిపోయారు. అనంతరం మండపత్రయంలో మంత్రించిన జలాలను శ్రీరాముడిపై ప్రోక్షణ చేస్తూ పట్టాభిషేకాన్ని పూర్తి చేశారు. చివరగా ముత్యాల దండతో ఆంజనేయుడికి పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. వేడుకలకు హాజరైన గవర్నర్ పట్టాభిషేక వేడుకకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువ్రస్తాలు సమ ర్పించారు. మొదట ఆలయానికి వచ్చిన గవర్నర్‌కు అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకోగా పండితులు వేదాశీర్వచనం అందచేశారు. పట్టాభిషేకం పూర్తి కావడంతో.. ఈనెల 23 వరకు జరిగే వసంత పక్ష ప్రయుక్త తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టాలు ముగిశాయి. రామరాజ్యమే ప్రతి ఒక్కరి ఆశయం కావాలి: గవర్నర్ రామరాజ్యం నిర్మించడమే ప్రతి ఒక్కరి ఆశయం కావాలని గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ అన్నారు. రామరాజ్యంలో ప్రతి ఒక్కరి హక్కులకు రక్షణ ఉంటుందని, తప్పులకు చోటులేదని, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని చెప్పారు. సమాజంలో కుటుంబాలు మరింత ఐక్యంగా ఉండాలని, తద్వారా శాంతి నెలకొనాలని ఆకాంక్షించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ, ఎవరికీ అన్యాయం చేయకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. -
భద్రాద్రి మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి నలువైపులా మాడ వీధుల్లో గ్వాలియర్ పందిరి నిర్మాణానికి ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇటీవల జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్ చైర్మన్ జీబీఎస్ రాజు దంపతులు స్వామివారి దర్శనానికి భద్రాచలం రాగా, భక్తుల సౌకర్యార్థం మాడవీధుల్లో శాశ్వత ప్రాతిపదికన గ్వాలియర్ షీట్లతో పందిరి నిర్మాణానికి సహకరించాలని ఆలయ ఈవో రమాదేవి కోరారు. దీంతో ప్రతిపా దనలు రూపొందించేందుకు జీఎంఆర్ సంస్థ ఇంజనీరింగ్ అధికారులను శనివారం భద్రాచ లం పంపించగా.. ఆలయ ఈఈ రవీందర్, ఏఈవోలతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. నాలుగు వైపులా 80 వేల చదరపు అడు గుల పందిరి నిర్మాణానికి రూ.8 కోట్లు ఖర్చవు తుందని అంచనా వేశారు. కాగా దక్షిణ భాగం నుంచి తూర్పు మెట్లు, వైకుంఠ ద్వారం వరకు తొలి విడతగా పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
టీఎస్ఆర్టీసీ ఆఫర్.. ఇంటి వద్దకే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా తెలంగాణ దేవాదాయ శాఖ సహకారంతో రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేసేందుకు సన్నద్దమవుతోంది. తలంబ్రాలు కోరుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం అనంతరం ఈ తలంబ్రాలను భక్తులకు టీఎస్ఆర్టీసీ హోం డెలివరీ చేయనుంది. హైదరాబాద్‌లోని బస్ భవన్లో బుధవారం భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ పోస్టర్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు ఆవిష్కరించారు. అనంతరం బిజినెస్ హెడ్ (లాజిస్టిక్స్) పి.సంతోష్ కుమార్‌కు రూ.116 చెల్లించి రశీదును ఆయన స్వీకరించారు. తొలి బుకింగ్ చేసుకుని తలంబ్రాల బుకింగ్‌ను ప్రారంభించారు. ‘భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలకు ఎంతో విశిష్టత ఉంది. నియమ నిష్టలతో ధాన్యాన్ని గోటితో ఒలిచి తీసిన కోటి బియ్యం గింజలను తలంబ్రాలుగా ఎన్నో ఏళ్లుగా కల్యాణంలో ఉపయోగిస్తున్నారు. విశిష్టమైన ఆ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలని గత ఏడాది టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఈ ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. తమ సంస్థపై ఉన్న విశ్వాసంతో భక్తులు భారీ సంఖ్యలో తలంబ్రాలను బుక్ చేసుకున్నారు. గత ఏడాది దాదాపు 89 వేల మంది భక్తులకు తలంబ్రాలను అందజేశాం. తద్వారా రూ.71 లక్షల రాబడి వచ్చింది. గత ఏడాది డిమాండ్ దృష్ట్యా ఈ శ్రీరామ నవమికి భద్రాద్రిలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను కోరుకునే భక్తులకు అందజేయబోతున్నాం. ఈ సారి రాములోరి కల్యాణంతో పాటు 12 ఏళ్లకో సారి నిర్వహించే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. భద్రాద్రిలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలకు వెళ్లలేని భక్తులు ఈ సేవల్ని వినియోగించుకోవాలి. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందాలి’ అని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. రాష్ట్రంలోని అన్ని టీఎస్ఆర్టీసీ కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ సేవలను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగ ఫోన్ నంబర్లు 9177683134, 7382924900, 9154680020ను సంప్రదించాలన్నారు. తమ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌లు భక్తుల వద్ద కూడా ఆర్డర్‌ను స్వీకరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సి.టి.ఎం (ఎం అండ్ సి) విజయ్‌కుమార్, సీఎంఈ రఘునాథ రావు, సీఎఫ్ఎం విజయ పుష్ప, నల్లగొండ ఆర్ఎం శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
నరసింహావతారంలో భద్రాద్రి రాముడు
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు సోమవారం నాలుగో రోజుకు చేరాయి. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యస్వామి నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం బేడామండపంలో వేద పండితులు దివ్యప్రబంధనం పఠించాక, స్వామిని నరసింహావతారంలో ప్రత్యేకంగా అలంకరించి పల్లకీ సేవ నిర్వహిస్తూ మిథిలా స్టేడియంలోని వేదికపై కొలువు తీర్చారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాగా, అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య మంగళవారం వామనావతారంలో దర్శనమివ్వనున్నారు. -
భద్రాద్రి రామయ్యకు ముస్లిం భక్తుడి వితరణ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి నిత్యాన్నదాన పథకానికి గురువారం ఖమ్మానికి చెందిన రామయ్య భక్తుడు ఎస్కే జాన్ మహ్మద్ రూ.1,00,116 వితరణగా అందజేశారు. రామయ్య ఆలయాన్ని గతంలో కూడా పలువురు ముస్లిం భక్తులు సందర్శించి స్వామివారిని దర్శించుకున్న సందర్భాలున్నాయి. – భద్రాచలం -
కూకట్‌పల్లిలో... దేవాలయం శిఖర ప్రతిష్ట చేసిన చినజీయర్ స్వామి
కూకట్పల్లి: నగరంలోని కూకట్‌పల్లిలో ఉన్న 436 ఏళ్ల నాటి శ్రీ సీతా రామ చంద్రస్వామి దేవాలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమం సోమ వారం త్రిదండి చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఆలయానికి విచ్చేసిన చినజీయర్ స్వామికి స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దంపతులు, ఆలయ అధికారులు, వేద పండితులు సాదర స్వాగతం పలికారు. గర్భగుడిలో యంత్ర ప్రతిష్టాపన తరువాత వెండి ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. యాగశాలలో పూర్ణాహుతి, మూల విరాట్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. -
భద్రాద్రిలో వైభవంగా ధ్వజారోహణం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ధ్వజారోహణం కనుల పండువగా జరిగిం ది. నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన చేయ డమే కాక ఇతర పూజలు నిర్వహించారు. తొ లుత ప్రధానాలయం నుంచి వేద పండితు లు సమస్త లాంఛనాలతో తిరుకల్యాణ ఉత్స వమూర్తులైన శ్రీ సీతారామలక్ష్మణ స్వామి వారిని ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చే స్తూ ధ్వజస్తంభం వద్దకు తోడ్కొని వచ్చా రు. అనంతరం గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ముమ్మార్లు ప్రదక్షిణ జరిపి.. బ్రహ్మోత్సవ ర క్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆ హ్వానిం చి ఆరాధన చేశారు. అనంతరం శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రు డైన గరుత్మం తుడి పటాన్ని మంగళ వాయిద్య ఘోష మధ్య ధ్వజస్తంభంపై ఎగుర వేశారు. ఆ తర్వాత సంతానం లేనివారికి గరుడ ముద్దలను అం దజేశారు. ఈ ముద్ద తీసుకున్న వారికి సం తానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. -
శ్రీరామ నీ నామమెంతో రుచిరా..
భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో శుక్రవారం భక్త రామదాసు 389వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం, చక్ర సిమెంట్స్, నేండ్రగంటి అలివేలు మంగ సర్వయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్రకూట మండపంలో వివిధ నగరాల నుంచి వచ్చిన ప్రముఖ సంగీత విద్వాంసులు రామయ్యతో పాటు భక్తరామదాసుకు నవరత్న ఘోష్టితో ‘స్వరార్చన’ జరిపారు. తొలుత రామదాసు ప్రతిమతో భద్రగిరి ప్రదక్షిణ, నగర సంకీర్తన, రామదాసుకు అభిషేకం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా మూడు రోజుల పాటు నిర్వహించే రామదాసు జయంతి ఉత్సవాలను కరోనా ఆంక్షల నేపథ్యాన ఈసారి ఒకేరోజుకు పరిమితం చేశారు. -
Bhadrachalam: రామాలయంలో ఇక ‘పెళ్లిసందడి’
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఇకపై పెళ్లి బాజాలు మోగనున్నాయి. 2018 వరకు రామాలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఉపాలయం పక్కన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుమతి ఇచ్చేవారు. అనంతరం పలు కారణాలతో ఆలయ ప్రాంగణంలో శుభకార్యాలను నిరాకరించారు. భక్తుల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, ఈలోపు కోవిడ్ కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు. తాజాగా కరోనా నిబంధనలు సడలించడం, భక్తుల నుంచి సైతం విజ్ఞప్తులు పెరగడంతో ఆలయ ఈవో శివాజీ తాజాగా వైదిక కమిటీతో చర్చించారు. వైదిక కమిటీ, ఈవో తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రూ.1,116 చెల్లించి శుభకార్యాలు జరుపుకోవచ్చు. అలాగే, చిత్రకూట మండపంలోని విశాలమైన వేదిక వద్ద శుభకార్యాల నిర్వహణకు రూ.10,116 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ శుభకార్యాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అల్పాహారం, భోజనాలకు మాత్రం అనుమతించరు. కాగా, వివాహాది శుభకార్యాల్లో అన్యమతాలకు చెందిన వస్తువులు, ఇతర సామగ్రి వినియోగించకుండా చూడాలని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. -
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఆదివారం సువర్ణపుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఆదివారంను పురష్కరించుకొని తొలుత అంతరాలయంలో మూలవరులకు అభిషేకం, అనంతరం సువర్ణపుష్పార్చనను గావించారు. ఆ తదుపరి బేడా మండపంలో నిత్య కల్యాణోత్సవంను కన్నులపండువగా జరిపారు. వేడుకలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని భద్రుని మండపంలో స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి అర్చకులు, ఆస్థాన విద్యాంశుల మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చిన గోదావరి పుణ్య జలాలతో భద్రునిగుడి లో స్వామి వారిపాదుకుల వద్ద అభిషేకం నిర్వహించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి మూర్తులకు అంతరాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పల్లకిపై మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ ప్రాకార మండపంలో ఆశీనులు చేసిన స్వామివారికి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. శ్రీసీతారాముల వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు అత్యంత వైభవోపేతంగా రామయ్యకు నిత్యకల్యాణం జరిపించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా అంతరాలయంలో స్వామి వారి దర్శనం కల్పించారు. -
కల్యాణం.. కమనీయం
♦ వైభవంగా శ్రీసీతారాములవారి కల్యాణం ♦ లక్షలాది మంది భక్తులతో పులకరించిన భద్రాద్రి ♦ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ఇంద్రకరణ్‌రెడ్డి సాక్షి, భద్రాచలం/కొత్తగూడెం: జై శ్రీరాం.. జై శ్రీరాం అంటూ భక్తుల జయజయ ధ్వానాలు.. వేద పండితుల మంత్రోచ్చారణలు, విద్వాంసుల మంగళ వాయిద్యాల నడుమ భద్రాచల శ్రీసీతారాముల వారి కల్యాణం బుధవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగిన కల్యాణానికి వేదికైన మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలపించింది. ఈ మహోత్సవాన్ని తిలకించడానికి వచ్చిన అశేష భక్తజనంతో భద్రాద్రి పులకించింది. రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పుణ్యస్నానాలు ఆచరించే వారు, తలనీలాల మొక్కు తీర్చుకునేవారితో గోదావరి తీరం నిండిపోయింది. పట్టువస్త్రాలు సమర్పించిన ఇంద్రకరణ్ స్వల్ప అనారోగ్యం కారణంగా సీఎం కేసీఆర్ ఈ కల్యాణానికి హాజరుకాలేకపోయారు. దాంతో ప్రభుత్వం తరఫున దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కేసీఆర్ కుటుంబం తరఫున ఆయన మనవడు, కేటీఆర్ కుమారుడైన హిమాన్షు.. రామచంద్రస్వామికి, సీతమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఇక భద్రాద్రి ఆలయ విశిష్టతను, వైకుంఠ రాముడి ప్రాశస్త్యాన్ని, భక్తరామదాసు సేవలను, ఆయన సీతారాములకు చేయించిన బంగారు ఆభరణాల ప్రాశస్త్యాన్ని ఆలయ వేద పండితులు వివరించడం భక్తులను ఆకట్టుకుంది. గోత్రం, ప్రవరలపై దుష్ప్రచారం వద్దు కల్యాణ సమయంలో సీతమ్మ, రామచంద్రస్వామి గోత్రం, ప్రవరలు చెçబుతున్న తీరుపై జరుగుతున్న ప్రచారాన్ని వేద పండితులు ఖండించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన భద్రాచలం ప్రాధాన్యతను, ప్రతిష్టను దెబ్బతీసేందుకే కొందరు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని, అది వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రామచంద్రస్వామిని నారాయణుడిగా, సీతమ్మ తల్లిని లక్ష్మీదేవిగా భావించి భగవంతుడి గోత్రాలను చదువుతుంటామని, రాముడికి అచ్యుత గోత్రం, సీతమ్మ తల్లికి సౌభాగ్య గోత్రం చదివి లోక కల్యాణం జరిపిస్తామని వివరించారు. నేడు మహా పట్టాభిషేకం భద్రాచలంలోని మిథిలా స్టేడియం ప్రాంగణంలో కల్యాణోత్సవం జరిగిన మండపంలోనే గురువారం శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ వేడుక జరగనుంది. పట్టాభిషేక మహోత్సవానికి ప్రభుత్వం తరఫున గవర్నర్ నరసింహన్ విచ్చేసి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కాగా ఈ సీతారాముల కల్యాణ మహోత్సవానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జైశ్వాల్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి తుమ్మల, ఎంపీ సీతారాంనాయక్, డీజీపీ అనురాగ్ శర్మ, టీటీడీ ఈవో సాంబశివరావు, దేవాదాయ కమిషనర్ శివశంకర్, పలువురు ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
భద్రాద్రికి ఏడువేల మంది భక్తుల పాదయాత్ర
భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణాన్ని వీక్షించేందుకు ఒక రోజు ముందే వేలమంది భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ కనిపించింది. వీరు ముందుగా పవిత్ర గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించారు. ఆ తరువాత స్వామి వారి దర్శనానికి బారులుతీరారు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఏపీలోని జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, రాజమండ్రి నుంచి పాదయాత్రగా దాదాపు 7000 మంది భక్తులు భద్రాచలం చేరుకున్నారు. స్వామి వారి దర్శనానంతరం బేడా మండపంలో స్వామి వారి భజనలు చేశారు. వీరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
నగల మాయంపై కొనసాగుతున్న విచారణ
సీసీ టీవీ పుటేజీల పరిశీలన భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బంగారు నగల మాయంపై విచారణ కొనసాగుతోంది. సీతమ్మ వారి పుస్తెలతాడు, లక్ష్మణస్వామి లాకెట్ మాయమై, పది రోజుల తర్వాత తిరిగి అదే చోట కనిపించిన వ్యవహారంలో కొంతమంది అర్చకులు, దేవస్థానం ఉద్యోగుల పాత్ర ఉందనే ప్రచారం సాగింది. దీనిపై డీఈ రవీందర్‌ను విచారణ అధికారిగా నియమించారు. గర్భగుడిలో నగలు భద్రపరిచే బీరువాలోకి ఎవరెవరు వెళ్లారో సీసీ టీవీ పుటేజీలను ఆదివారం పరిశీలించారు. పవిత్రోత్సవాలు ప్రారంభమైన ముందు రోజు ఓ అర్చకుడు నగలు భద్రపరచగా.. పవిత్రోత్సవాలు ముగిసిన తరువాత స్వామివారి కల్యాణం ప్రారంభించిన రోజున మరో అర్చకుడు నగలు బీరువాలోంచి తీసుకొచ్చినట్లుగా వెల్లడైంది. నగలు మాయమై, తిరిగి ప్రత్యక్షమైన రోజు వరకు మొత్తం 12 మంది అర్చకులు గర్భగుడిలోని బీరువా వద్దకు వెళ్లి వచ్చినట్లుగా సీసీ పుటేజీల్లో వెల్లడైనట్లు తెలిసింది. ఈవో రమేశ్‌బాబుతో చర్చించిన తర్వాత అర్చకుల నుంచి వాంగ్మూలం తీసుకోనున్నట్లు సమాచారం. అయితే, దేవస్థానంలోని అధికారితోనే నగల మాయంపై విచారణ జరిపించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీతమ్మ పుస్తెల తాడు, లక్ష్మణుడి లాకెట్‌ను అమెరికాలోని ఓ ఆధ్యాత్మిక సంస్థకు అమ్మే క్రమంలోనే వాటిని మాయం చేశారని, ఇందులో దేవాదాయశాఖకు చెందిన ఓ కీలక వ్యక్తి ప్రమేయం కూడా ఉందనే ప్రచారం సాగింది. భక్తుల నుంచి వస్తున్న విమర్శలతో దీనిని మరుగున పరిచేందుకే దేవస్థానం అధికారులు విచారణకు ఇక్కడి అధికారిని నియమించారనే ఆరోపణలు వస్తున్నారుు. ఈ మొత్తం పరిణామాలపై తీవ్ర ఆవేదనతో ఉన్న కొంతమంది అర్చకులు త్వరలోనే దేవాదాయశాఖ ఉన్నతాధికారులను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. వైదిక కమిటీలోని ఓ కీలక వ్యక్తి తన పదవికి రాజీనామా చేయటం కూడా చర్చనీయాంశంగా మారింది. -
భద్రాద్రిలో హీరో సంపూ, డీఐజీ పూజలు
భద్రాచలం: శ్రీసీతారామచంద్ర స్వామి వారిని వరంగల్ రేంజ్ డీఐజీ టి.ప్రభాకర్ రావు దంపతులు శుక్రవారం దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు. అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సినీ హీరో సంపూర్ణేష్‌బాబు దేవస్థానానికి వచ్చి అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. శ్రీ లక్ష్మీతాయారమ్మ వారిని, ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. -
రాములోరి ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు
పట్టాభిషేకం తేదీలో మార్పు నిర్లక్ష్యంపై ఈఓ జ్యోతి సీరియస్ భద్రాచలం : భద్రాచలం దేవస్థానం అధికారుల నిర్లక్ష్యం మరోమారు బయట పడింది. శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ముద్రించిన ఆహ్వాన పత్రికలో అచ్చుతప్పులు దొర్లాయి. శ్రీరామ మహా పట్టాభిషేక వైశిష్ట్యమును తెలియపరుస్తూ ఆహ్వానపత్రికలోని ఓ పేజీలో ముద్రించారు. అందులోనే పట్టాభిషేకం ఎప్పుడు నిర్వహించేది తెలుపుతూ తేదీని ముద్రించారు. వాస్తవంగా పట్టాభిషేకం ఈ నెల 16న జరగనుండగా, ఆహ్వాన పత్రికలో మాత్రం చైత్ర శుద్ధ దశమి ఆదివారం అనగా 29-03-2015న జరుగుతుందని పేర్కొన్నారు. దీనిపై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వేలాదిగా ముద్రించిన ఆహ్వాన పత్రికలు ఇప్పటికే పంపిణీ మొదలైంది. రాష్ట్ర మంత్రులు, ఇతర ఉన్నతాధికారులకు వీటిని దేవస్థానం అధికారులు అందజేశారు. జిల్లాలో ఉన్న వివిధ ఆధ్వాత్మిక సంస్థల నిర్వాహకులకు ఈ పుస్తకాలు వెళ్లాయి. అదే విధంగా వీటిని మీడియాకు కూడా అందజేశారు. పట్టాభిషేకం నిర్వహణ తేదీ త ప్పుగా ముద్రితమైందనే విషయాన్ని మీడియా ప్రతినిధులు దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన తర్వాతనే తప్పిదాన్ని వారు గుర్తించారు. జరిగిన తప్పిదంపై దేవస్థానం ఈఓ కూరాకుల జ్యోతి తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆహ్వాన పత్రిక తయారీలో భాగస్వామ్యులైన వారి నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని భావిస్తున్న ఆమె సదరు ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల కాలంలో దేవస్థానంలో తరచు తప్పిదాలు జరుగుతున్నప్పటకీ, వాటిని ఎత్తి చూపేవారిపై ఆలయ పెద్దలు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు. తాజాగా జరిగిన ఈ పరిణామాలపై వారు ఏ రీతిగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. -
మహాక్రతువులో దివ్యప్రబంధ విన్నపాలు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో నిర్వహిస్తున్న శ్రీరామ మహాక్రతువు శనివారం ఘనంగా జరిగింది. పది రోజులుగా నిర్వహిస్తున్న మహాక్రతువులో భాగంగా శనివారం ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. తొలుత విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం నిర్వహించి.. అష్టాక్షరి, ద్వాదశాక్షరి, షడాక్షరి, శ్రీరామ తారక శ్రీమంత్ర పునశ్చరణ హోమం నిర్వహించారు. హోమంలో అగ్ని ప్రతిష్ఠ చేసి వేద దివ్య ప్రబంధాది పారాయణాలు చేసి చతుష్టానార్చనలు, వేదాది విన్నపాలు చేశారు. శ్రీరామాయణం నుంచి 20 సర్గలను శ్లోక హవనం చేశారు. అనంతరం నిత్య పూర్ణాహుతి, భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం గావించారు. -
భద్రాద్రిలో వైభవంగా మహాక్రతువు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మహాక్రతువు వైభవంగా కొనసాగుతోంది. భక్తరామదాసు కాలం నాటి విగ్రహాలకు బంగారు కవచం వేయనున్న నేపథ్యంలో శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. వందేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులో భాగంగా చిత్రకూటమండపంలో శ్రీరామాయణ పారాయణం 20 సర్గలను పఠించారు. తిరువారాధన, ప్రాబోధిక చతుద్వారార్చన, చతుస్థానార్చన, వేదాది విన్నపాలు చేశారు. శ్లోక హవనం గావించి, నిత్య పూర్ణాహుతి ఇచ్చి బుధవారం నాటి కార్యక్రమానికి ముగింపు పలికారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. -
ఎంతో మంది చూపు...
- భద్రాద్రి దేవస్థానం పాలక మండలిపై కసరత్తు - దరఖాస్తుదారుల జాబితాపై పరిశీలన పూర్తి - భద్రాచలం నుంచి తలపడుతున్న 27 మంది.. - బయటి జిల్లాల నుంచీ పోటీ.. - మంత్రి తుమ్మల ఆశీస్సుల కోసం యత్నాలు భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం పాలక మండలి ఎంపికపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలక మండలిలో చోటు కల్పించాలని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సమగ్ర వివరాలపై ఇప్పటికే పరిశీలన పూర్తయింది. దేవాదాయశాఖకు చెందిన ఓ ప్రత్యేక అధికారి అభ్యర్థుల వివరాలను సేకరించి, ఉన్నతాధికారులకు అందజేశారు. భద్రాచలం దేవస్థానం పాలక మండలి సభ్యులుగా ఎంపికయ్యేందుకు ఇలా రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలతో కూడిన జాబితా దేవాదాయశాఖ కమిషనర్‌కు చేరింది. విచారణ అనంతరం సిద్ధం చేసిన జాబితా నేడో రేపో దేవాదాయశాఖ నుంచి ప్రభుత్వానికి అందనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చైనా పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు. దసరాకు ముందే ప్రభుత్వం పాలక మండళ్లను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో ఆశావాహులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. లోకల్ డిమాండ్ దేవస్థానం పాలకమండలిలో చోటు కల్పించాలని కోరుతూ భద్రాచలం నుంచి 27 దరఖాస్తులు అందారుు. గతంలో ట్రస్టుబోర్డు సభ్యులుగా పనిచేసిన వారితో పాటు వివిధ రంగాలకు చెందిన వారు, టీఆర్ఎస్ నేతలు దరఖాస్తు చేశారు. దేవస్థానం పాలక మండలిలో 9 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఒకరు చైర్మన్‌గా నియమితులవుతారు. వీరిలో దేవస్థానం ప్రధానార్చకుల్లో ఒకరిని నామినేటెడ్‌గా ఎంపిక చేయటం ఆనవారుుతీ. ఉమ్మడి రాష్ట్రంలో రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011 నవంబర్‌లో భద్రాద్రి పాలక మండలిని నియమించారు. ఇది రెండేళ్ల పాటు కొనసాగింది. రాష్ట్ర విభజన జరిగాక ఇప్పటి వరకు పాలకమండలిని నియమించలేదు. ఎవరిని వరించేనో..! రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కావడంతో భద్రాచలం దేవస్థానం పాలకమండలిలో చోటు కోసం గట్టి పోటీనే ఉంది. చైర్మన్ పదవి కోసం భద్రాద్రి వాసులే విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందేరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మార్కు తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పాలక మండలి చైర్మన్ రేసులో భద్రాచలానికి చెందిన ఓ విద్యాసంస్థల అధినేత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మంత్రి తుమ్మలకు నమ్మినబంటు కావడంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఆయనకు ఒకింత ఎక్కువే కావడంతో అతని వైపు మొగ్గుచూపే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి చైర్మన్ పదవి కోసం తీవ్ర పోటీనే ఉంది. ఆదాయం పెరుగుతున్నా అభివృద్ధి లేదు.. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానానికి ఏటేటా ఆదాయం పెరుగుతున్నా ఆ స్థారుులో అభివృద్ధి మాత్రం జరగటం లేదు. భక్తులిచ్చే కానుకులు, హుండీల ద్వారా వచ్చే ఆదాయంతోనే ఆలయంలో ఉత్సవాల నిర్వహణ, ఉద్యోగులు, సిబ్బంది జీతాలకు చెల్లించాలి. దీనివల్ల ఆశించిన స్థాయిలో ఆలయాభివృద్ధి జరుగటం లేదు. దేవస్థానానికి పాలక మండలి ఉంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టే అవకాశం ఉంది. దాతల నుంచి వివిధ రూపాల్లో పనులు చేయించుకునేందుకు ప్రయత్నాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. పాలకమండలి ఉంటే ప్రయోజనాలనేకమనే వాదన భక్తుల నుంచి వినిపిస్తోంది. -
రామాలయంలో టిక్కెట్ల మాయాజాలం!
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన అవకతవకలు ఒక్కోటి వెలుగులోకి వస్తున్నాయి. ‘సాక్షి’లో వస్తున్న వరుస కథనాల నేపథ్యంలో ఇక్కడి ఉద్యోగుల బాగోతం బట్టబయలౌతుంది. రాములోరి సొమ్మును సొంతానికి వాడుకుంటున్న ఇంటిదొంగల ఆటకట్టించేందుకు ప్రస్తుత ఈవో కూరాకుల జ్యోతి ఒకింత కఠినంగానే వ్యవహరించేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. భద్రాచలం స్టోర్ నిర్వహణలో తలెత్తిన లోపాలు, పర్ణశాలలో మాయమైన సరుకులు, తాజాగా పర్ణశాలలో వెలుగులోకి వచ్చిన టిక్కెట్ల మాయాజాలం ఇలా వరుస ఘటనలు ఆలయానికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాయి. ఆయా విభాగాల అధికారులు సరిగా పర్యవేక్షణ చేయకపోవటంతోనే ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈవో జ్యోతి సెలువులో ఉన్న సమయంలో ఇంచార్జి ఈవోగా వ్యవహరించిన రమేష్‌బాబు భద్రాచలం స్టోర్ ఇంచార్జి, పర్ణశాలకు గుమస్తాలను సస్పెండ్ చేసిన సంగతి విధితమే. రెండు నెలల స్టాక్ నిల్వలను పుస్తకంలో నమోదు చేయలేదనే కారణంతో సెలవులో ఉనా, స్టోర్ ఇంచార్జిపై వేటు వేసిన అధికారులు, వరుస తప్పిదాలు బయటకు వస్తున్నా, పర్యవేక్షకులపై మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంలో ఏదో మతలబు దాగిఉందనే ప్రచారం జరుగుతుంది. రెండు నెలల పాటు స్టాక్ వివరాలను రికార్డుల్లో నమోదు చేయలేదనే విషయం ఈవోను గమనిస్తే కానీ వెలుగులోకి రాలేదు. ప్రతీ వారం దీనిపై పర్యవేక్షణ ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. అదేవిధంగా పర్ణశాలలో పుష్కరాలకు సంబంధించిన టిక్కెట్లును ఉద్యోగులకు పంపిణీ చేసిన సమయంలోనే ఏ నంబర్ నుంచి ఏ నంబర్ వరకూ ఇచ్చామనేది నమోదు చేయాల్సి ఉంటుంది. కానీ పుష్కరాలు గడిచి, నెల రోజుల తరువాత డబ్బులు జమ చేసే సమయంలో ఇవి బయటం పడటం పర్యవేక్షణ లేమిని వెల్లడి చేస్తుంది. ఈ మొత్తం పరిణామాలకు ఒక్కరే పర్యవేక్షకులు కాగా, జరిగిన లోపాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఆలయలోని మరికొంతమంది అధికారులు అతనికి వత్తాసు పలుకుతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఈవో జ్యోతి ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి. కాగా ఇదే విషయమై ఈవోను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె ఫోన్‌కు అందుబాటులోకి రాలేదు. -
వైభవంగా రామయ్యకు పర్యంకోత్సవం
భద్రాచలం: భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి పర్యంకోత్సవం(16 రోజుల పండుగ) ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారి కల్యాణం తర్వాత పదహారో రోజున నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎడబాటు ఉత్సవం అని కూడా పేరు. పర్యంకోత్సవంలో భాగంగా స్వామి వారికి అభిషేకం జరిపించారు. ఉత్సవ పెరుమాళ్లను బేడా మండపం పైకి తీసుకొచ్చి నూతన పర్యంకోత్సవ కర్మాంగ స్నపనం చేశారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన గావించారు. పుణ్య జలాలను స్వామి వారి మూలవరుల వద్దకు తీసుకెళ్లి అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. వారితో బేడామండపంలోని ఉత్సవ పెరుమాళ్లకు అభిషేకం జరిపించారు. యాగశాలలో హోమం నిర్వహించారు. రాత్రికి ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీపై తిరువీధి సేవ నిర్వహించారు. -
వైభవోపేతంగా ధ్వజారోహణం
-
‘రథం’పై రామయ్య
భక్తులతో కిటకిటలాడిన భద్రాద్రి నిత్య కల్యాణంలో 125 జంటలు భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆలయ అర్చకులు రథసప్తమి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రథసప్తమిని పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజామున అంతరాలయంలో మూలవరులు, ఉత్సవమూర్తులకు ఏకాంత అభిషేకం జరిపారు. స్వామివారికి నూతన పట్టు వస్త్రాలతో అర్చకులు అలంకరించా రు. సాయంత్రం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని కొలువు తీర్చారు. మేలతాళాలు, వేద మంత్రాలు, భక్తుల కోలాటాల నడుమ తిరువీధి సేవ ఘనంగా నిర్వహించారు. వెండిరథోత్సవం, ఆలయ చుట్టు సేవలు నిర్వహించి ప్రత్యేక పూజ లు చేశారు. రథసప్తమి, వారంతపు సెలవులకు తోడు రిపబ్లిక్ డే సెలవు కూడా కలిసిరావడంతో భద్రాచలంలో సోమవారం భక్తుల తాకిడి పెరిగిం ది. రాష్ట్ర, ఏపీ నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించా రు. క్యూలైన్లలో స్వామివారిని దర్శించుకున్నారు. బేడామండపంలో స్వామివారికి నిర్వహించిన నిత్యకల్యాణంలో 125జంటలు పాల్గొన్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆధ్వర్యంలో నిత్యకల్యాణాన్ని కమనీయం గా జరిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తు లు పెద్దసంఖ్యలో రావడంతో లడ్డూ కౌంటర్ల వద్ద భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. -
భద్రాద్రిలో వైభవంగా రథోత్సవం
భద్రాద్రిలో వైభవంగా రథోత్సవం సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక పూజలు యాగశాలలో మహా పూర్ణాహుతి నేడు విశ్వరూప సేవ భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం గురువారం సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులతో పోటెత్తింది. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం, భీష్ముడు అంపశయ్య నుంచి లేచిన రోజు కావటంతో ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో ప్రత్యేక హోమం చేశారు.. మహా పూర్ణాహుతి ఇచ్చారు. సాయంత్రం రథోత్సవ వేడుక కోసం రథాన్ని పూలతో అలంకరించారు. రథం వద్ద 20 సేర్ల తెల్లప్రసాదాన్ని దిష్టికుంభంగా పోశారు. పుణ్యహవచనం గావించి రథానికి సంప్రోషణ చేశారు. రథం నలుదిక్కుల బలిహరణం, సంపదాద్యంను జరిపించి రథంపై ఉన్న రంగనాథస్వామి వక్షస్థలంపై ఆరోపణగావించారు. గర్భగుడిలో స్వామివారికి దర్భార్‌సేవ, వేదస్వస్తి అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ప్రత్యేక పల్లకిపై ఉంచారు. బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ సకలరాజ లాంచనాలతో ఊరేగింపు నిర్వహించారు. తరువాత స్వామివారిని రథంపై ఉన్న ఊయల ఎక్కిం చారు. చక్కరపొంగలి నివేదన గావించి, హార తి ఇచ్చారు. అష్టోత్తర శ తనామార్చన చేశారు. రథంపై ఉన్న స్వామివారికి దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి ప్రత్యేక పూజలు చేశారు. వైభవంగా రథసేవ రథసేవకు బయలుదేరే ముందు స్వామివారికి ఈవో హారతి సమర్పించారు. ఆమె కూడా స్వయంగా రథం లాగారు. స్వామివారు కొలువుతీరిన రథాన్ని లాగితే సంసార బాధలు తొలగుతాయనే నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు ఈ వేడుకలో పాల్గొన్నారు. స్వామివారి రథాన్ని లాగేందుకు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆలయం నుంచి రాజవీధి మీదుగా తాతగుడి వరకు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా సాగింది. దారి పొడువునా భక్తులు స్వామివారికి నీరాజనాలు పలికారు. మొక్కు లు సమర్పించి ప్రసాదాలు స్వీకరించారు. తిరి గి ఆలయానికి చేరుకున్న తర్వాత స్వామివారికి ప్రణయకళోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రావణ్‌కుమార్, పర్యవేక్షకులు వెంకటప్పయ్య, పీవో టు ఈవో నిరంజన్, పీఆర్వో సాయిబాబా, ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, సీతారామానుజాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, వేద పండితులు ప్రసాదావధాని, సన్యాసి శర్మ తదితరులు పాల్గొన్నారు. నేడు విశ్వరూప సేవ శ్రీ సీతారామచంద్రస్వామి వారికి శనివారం విశ్వరూప సేవ నిర్వహిస్తారు. ఆలయ ప్రాంగణంలో జరిగే ఈ వేడుకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారితో పాటు ఆలయ పరివార దేవతలను ఒక చోటకు చేర్చి పూజలు నిర్వహించటం ఈ సేవ ప్రత్యేకత. కమనీయంగా సాగే ఈ వేడుకలో పాల్గొనేందుకు భ క్తులు ఎంతో ఆసక్తి చూపుతారు. దీనిలో పాల్గొనే భక్తులు రూ.1000 టికెట్టు తీసుకోవాలని దేవస్థానం ఈవో సూచించారు. -
హంస వాహనాధీశుడై..
గోదారిలో రామయ్య విహారం వైభవంగా తెప్పోత్సవం పల్లకి మోసిన మంత్రులు భద్రాచలం: గోదావరి నదీ తీరం భక్త జనంతో పులకించింది. హంసవాహనంపై శ్రీ సీతారామచంద్రస్వామి వారు విహరిస్తుంటే వీక్షించిన భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. జయజయధ్వానాలు చేశారు. మిరిమిట్లు గొలిపే బాణసంచా వెలుగుల్లో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామివారు కొలువుదీరారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ నదిలో విహరించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో బుధవారం నిర్వహించిన ఈ వేడుకకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న హాజరై స్వామివారి పల్లకిని స్వయంగా మోశారు. తెప్పోత్సవానికి ముందు స్వామివారు వివిధ పూజలు అందుకున్నారు. దర్భారు సేవ శ్రీ సీతారామచంద్రస్వామివారికి గర్భగుడిలో వేదపండితులు దర్భారు సేవ నిర్వహించారు. ఉత్సవమూర్తులకు విశ్వక్సేనపూజ, పుణ్యహవచనం గావించారు. ఉదయం సేవాకాలం, శ్రీ తిరుమంగై ఆళ్వార్లు పరమపదోత్సవం చేశారు. మధ్యాహ్నం రాజభోగం, శాత్తు మురై, పూర్ణశరణాగతితో పగల్‌పత్తు ముగిసింది. గర్భగుడిలో ప్రభుత్వోత్సవం ( దర్భార్ సేవ) నిర్వహించారు. తెప్పోత్సవం.. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య తెప్పోత్సవం కోసం స్వామివారిని ఆలయం నుంచి ఊరేగింపుగా గోదావరి తీరానికి తీసుకోచ్చారు. రాజాధిరాజ వాహనంపై గోదావరి నదిలో విహరించేందుకు బయలుదేరిన శ్రీ సీతారామచంద్రస్వామివారిని వీక్షించి తరించేందుకు దారి పొడవునా భక్తులు బారులు తీరారు. గోదావరి తీరంలో అర్చకులు ముందుగా పుణ్యజలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామి వారిని హంసవాహనంపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి మాతకు వేదపండితులు చతుర్వేదాలు, నాళాయర్ దివ్యప్రబంధం, పంచసూత్రాలు, స్తోత్ర పాఠాలు చదివారు. మంగళహారతి, చక్రపొంగలి నివేదన చేశారు. రామనామ సంకీర్తనలు, భక్తుల కోలాహలం మధ్య స్వామివారి తెప్పోత్సవం వైభవంగా సాగింది. ఆకట్టుకున్న కోలాటం ఆలయంలో ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారు సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక పల్లకిపై ఊరేగింపుగా గోదారి తీరానికి బయలుదేరారు. రాజాధిరాజ వాహనంపై స్వామివారు వెళ్లే సమయంలో పల్లకి ముందు వివిధ కోలాట బృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వేద విద్యార్థుల కీర్తనలు, వికాస తరంగణి, శ్రీ కృష్ణ కోలాట భజన మండలితో పాటు వివిధ సంస్థలకు చెందిన మహిళలు అధిక సంఖ్యలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం నుంచి గోదావరి స్నానఘట్టాల వరకు కోలాట బృందాల కీర్తనలతో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. బాణసంచా వెలుగుల్లో... సాయంత్రం 5 గంటలకు స్వామివారు హంసవాహనంపై కొలువుదీరారు. వాహనం 6 గంటలకు బయలుదేరింది. గోదావరిలో స్వామివారు ఐదుసార్లు విహరించారు. నదిలో హంసవాహనం తిరుగుతున్నంత సేపు బాణసంచా వెలుగుల్లో ఆకాశం హరివిల్లైంది. తెప్పోత్సవ సమయానికి నదీ తీరం భక్తజనంతో పోటెత్తింది. స్వామివారి సేవలో మంత్రులు.. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి భద్రాద్రిలో నిర్వహించిన తెప్పోత్సవానికి రాష్ట్రమంత్రులు, రాష్ట్రస్థాయి అధికారులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి జోగు రామన్న స్వామివారి పల్లకిని మోశారు. తెప్పోత్సవ వేడుకలో పాల్గొని స్వామివారికి పూజలు చేశారు. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సిర్పూర్ కాగజ్‌నగర్, అశ్వారావుపేట, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తాటి వెంకటేశ్వర్లు, బాణోత్ మదన్‌లాల్, సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడపల్లి కవిత, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం, ఐటీడీఏ పీవో దివ్య, ఆర్డీవో అంజయ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, ఏఈవో శ్రావణ్‌కుమార్, వెంకటప్పయ్య తదితరులు పాల్గొన్నారు. మావోయిస్టుల కదలికలు ఎక్కువగా ఉండటం, రాష్ట్ర మంత్రుల రాకతో భద్రాచలం ఏఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఓఎస్డీ జోవెల్డేవిస్ పర్యవేక్షణలో పోలీసుబందోబస్తు కట్టుదిట్టం చేశారు. -
భద్రాద్రి రాముడి తెప్పోత్సవం
పులకించిన గోదారి తీరం భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం స్వామి వారి తెప్పోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. పవిత్ర గోదావరి నదిలో హంసవాహనంపై విహరించిన స్వామి వారిని చూసిన భక్తులు పులకించిపోయారు. వెకుంఠ ఏకాదశి ఉత్సవాలలో భాగంగా బుధవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటలకు వేదమంత్రోచ్ఛారణలు, మేళతాళాలు, భక్తజనుల రామనామస్మరణల మధ్య శ్రీసీతారామచంద్రస్వామి వారిని ఆలయం నుంచి ప్రత్యేక పల్లకిలో గోదావరి నదీ తీరానికి తీసుకొచ్చారు. స్వామి వారి పల్లకిని రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జోగు రామన్న మోసి సేవలో పాల్గొన్నారు. అనంతరం గోదావరి నదిలో ప్రత్యేకంగా తయారు చేసిన హంసవాహనంపై స్వామి వారిని ఉంచి వేదపండితులు ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు స్వామివారికి హంసవాహనంపై తెప్పోత్సవం నిర్వహించారు. బాణ సంచా వెలుగులతో శోభాయమానంగా సాగిన ఈ కార్యక్రమాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వం చెందారు. స్వామి వారు తెప్పోత్సవంపై విహరిస్తున్నంత సేపూ గోదావరి తీరాన భక్తులు శ్రీరామ నామ జయజయ ధ్వానాలు చేశారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, సిర్పూర్ కాగజ్‌నగర్, అశ్వారావుపేట, వైరా, భద్రాచలం ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్, సున్నం రాజయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్పర్సన్ గడపల్లి కవిత, కలెక్టర్ ఇలంబరితి, జేసీ సురేంద్రమోహన్, ఎస్పీ షాన్వాజ్ ఖాసీం, ఐటీడీఏ పీవో దివ్య, దేవస్థానం ఈవో కూరాకుల జ్యోతి పాల్గొన్నారు.