చర్చలు మరోసారి విఫలం..
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ ఈఓ, ఉద్యోగుల మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. వేధింపులకు పాల్పడుతున్న ఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ంలో పని చేస్తున్న ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులు, నాల్గవ తరగతి ఉద్యోగులు సమష్టిగా రిలే దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
ఈఓ కక్షపూరితంగా ఉద్యోగులపై జారీ చేసిన మెమోలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల య ఉద్యోగులు టీజేఏసీ నాయకుల ఆధ్వర్యం లో సహాయ నిరాకరణ చేస్తున్న విషయం విదితమే. ఈ విషయంపై ఈఓతో శుక్రవారం టీజేఏసీ నాయకులు చర్చలు జరిపారు. ఉద్యోగులు భేషరతుగా క్షమాపణ చెబితే మెమోలు ఉపసంహరించుకుంటానని ఈఓ తెలపడంతో ఉద్యోగుల నిరసన కొనసాగిస్తున్నారు. నాల్గవ రోజైన శనివారం చిత్రకూట మండపం వద్ద బైఠాయించి ఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈఓతో ఉద్యోగ సంఘ అధ్యక్షుడు చర్చలు మరోమారు విఫలం.....
ఈ క్రమంలో దేవస్థాన ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నర్సింహారాజును ఈఓ మరోసారి క్యాంపు కార్యాలయంలో చర్చలు జరపటానికి ఆహ్వానించారు. ఈ చర్చలలో కేవలం ఇద్దరి ఉద్యోగులపై ఉన్న మెమోలను మాత్రమే ఉపసంహరించుకుంటానని తెలపడంతో నర్సింహారాజు తిరిగి వెనక్కి వచ్చారు. సాయంత్రం కూడా ఈఓ మరోసారి పిలిచి ఇదే విషయాన్ని పేర్కొనడంతో చర్చలు విఫలం అయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లను పూర్తిస్థాయిలో అంగీకరిస్తేనే చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే వద్దని నర్సింహరాజు స్పష్టం చేశారు.
డిమాండ్లను సాధించే వరకు విరమణ లేదు....
తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు ఈఓతో చర్చలకు వెళ్లేది లేదని ఆలయ ఉద్యోగులు, సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. టీజేఏసీ డివిజన్ కన్వీనర్ మాట్లాడుతూ ఈఓ మోసపూరిత వైఖరికి తాము విసిగిపోయామని, అందుకే సహాయ నిరాకరణతో పాటు రిలే దీక్షలకు సిద్ధమయ్యామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహిస్తూనే పరిపాలన స్తంభింపజేస్తామని అన్నారు. ఈఓగా రఘునాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన అన్ని పనులపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని, ఈ విచారణ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈఓ ఉద్యోగుల పట్ల రాజీ మార్గంతో కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఈఓపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలనే నినాదంతో ఆదివారం రిలే దీక్షలు చేపడతామని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ, ఆలయ ఉద్యోగ సంఘ నాయకులు నర్సింహరాజు, రవీందర్, శ్రీనివాసరెడ్డి, నిరంజన్, సూపరింటెండెంట్ కనకదుర్గ, కత్తి శ్రీను, భాస్కర్, వెంకట్, సుబ్బారావు, స్థలశాయి స్థానాచార్యులు, వేదపండితులు హనుమత్‌శాస్త్రి, లింగాల రామకృష్ణ ప్రసాదఅవధాని, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, సీతారామానుజాచార్యులు, ఉపప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణచార్యులు, అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రావణ్‌కుమారాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.