narsimharaju
-
అంతా కొత్తగా ఉంటుంది
కృష్ణ హీరోగా వచ్చిన ‘నెంబర్‌వన్’ చిత్రంతో బాలనటుడిగా పరిచయమైన దిలీప్‌కుమార్ చలవాది దాదాపు 30 సినిమాలు చేశారు. ఆ తర్వాత హీరోగా మారి నాలుగు సినిమాలు చేశారు. తాజాగా ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘దిక్సూచి’. బేబి సనిక సాయిశ్రీ రాచూరి సమర్పణలో శైలజ సముద్రాల, నరసింహరాజు రాచూరి నిర్మించారు. పద్మనాభ్ స్వరపరచిన ఈ చిత్రం పాటల్ని హైదరాబాద్‌లో విడుదల చేశారు. దిలీప్ కుమార్ చలవాది మాట్లాడుతూ– ‘‘ఆడియో ఫంక్షన్ అనగానే చాలా మంది నన్ను ‘గెస్ట్ ఎవరు అని?’ అడిగారు. నాకు ఎవ్వరూ గెస్ట్‌లు వద్దు.. ప్రేక్షకులే నా అతిథులు అన్నాను. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన రాజు అన్నకు థ్యాంక్స్. 1970 నేపథ్యంలోని కథతో తెరకెక్కిన చిత్రమిది. సినిమా చాలా బాగా వచ్చింది. ఫ్యామిలీతో వెళ్లి చూడొచ్చు. సినిమా కోసం చచ్చిపోతాం.. అలాంటి ఫ్యామిలీ మాది. ‘దిక్సూచి’ అనే ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేశాను. ఈ సినిమా చూసి నన్ను సపోర్ట్ చేయాలి’’ అన్నారు. ‘‘దిలీప్ స్టోరీ లైన్ చెప్పినప్పుడు నాకు అర్థం కాలేదు. కానీ సినిమా చూశాక అనిపించింది.. నేనేనా ఈ చిత్రాన్ని నిర్మించింది అని. అంత కొత్తగా ఉంటుందీ సినిమా’’ అన్నారు నరసింహరాజు. చాందిని, సుమన్, అరుణ్, గాంధీ, చైల్డ్ ఆర్టిస్ట్ ధన్వీ తదితరులు మాట్లాడారు. -
ప్రజా సంక్షేమం కోసం పోరాడతాం
ఉండి : ప్రజా సంక్షేమం కోసం ఎందాకైనా పోరాడతామని, భయపడేది లేదని ఉండి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు తెలిపారు. నియోజకవర్గంలో టీడీపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఆదివారం చిలుకూరులో పల్లెనిద్ర, రచ్చబండ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నిర్వహించిన ర్యాలీలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని తమ సమస్యలను విన్నవించారు. పార్టీని అభిమానిస్తున్న వారిపై టీడీపీ నాయకులు కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీని అభిమానించి బ్యానర్లు వేస్తుంటే బ్యానర్లో ఉన్న వారి ఫొటోలను, పేర్లను సేకరించి బెదిరింపులకు దిగుతున్నారని పార్టీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ అధినేత ప్రజా సంక్షేమం కోసం దేనినైనా ఎదిరించి ఏ విధంగా అయితే ముందడుగు వేస్తున్నారో అలాగే ఆయనను అభిమానించే ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు ముందడుగు వేస్తామన్నారు. ఎవరైనా భయపెట్టాలని చూసినా, అక్రమంగా కేసులు బనాయించినా తాను ముందుంటానని కార్యకర్తలు, అభిమానులకు నర్సింహరాజు భరోసా ఇచ్చారు. పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పాతపాటి సర్రాజు మాట్లాడుతూ దివంగత రాజశేఖరరెడ్డి పరిపాలనలో అన్నివర్గాల ప్రజలు, అన్నివృత్తుల వారు సుఖసంతోషాలతో ఉన్నారని ఇప్పుడు చంద్రబాబు పరిపాలనలో అన్నివర్గాల ప్రజలు ఆవేదన చెందుతున్నారని విమర్శించారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్(బాబు), మండల పార్టీ అధ్యక్షుడు గులిపల్లి అచ్చారావు, జిల్లా నాయకులు అల్లూరి వెంకట్రాజు, జి.సుందర్‌కుమార్, మద్దా అభిషేక్, అంగర రాంబాబు, మునుకోలు సింహాచలం, కరిమెరక చంద్రరావు, ఎంపీటీసీ వర్రే పైడియ్య, బందెల ప్రమీల, కొరపాటి అనిత తదితరులు పాల్గొన్నారు. -
బాబు మోసాలు ఎంతోకాలం సాగవు
ఉండి : ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలు, అన్యాయాలు ఎంతోకాలం సాగవని వైఎస్సార్ సీపీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. మంగళవారం చెరుకువాడలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక పెదపేటలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని అర్హతలు ఉన్న నిరుపేదలకు కూడా సంక్షేమ పథకాలు అందకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. దివ్యాంగులకు, వితంతువులకు పింఛన్లు ఇవ్వకుండా ఏళ్ల తరబడి తిప్పుకుంటున్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అ«ధ్యక్షుడు మంతెన యోగేంద్రకుమార్‌వర్మ (బాబు), మండలాధ్యక్షుడు గులిపల్లి అచ్చారావు, గ్రామ పార్టీ అ«ధ్యక్షుడు కొండవీటి సత్యనారాయణ, జిల్లా నాయకులు అల్లూరి వెంకట్రాజు, కొరపాటి అనిత, బందెల ప్రమీల, కరిమెరక చంద్రరావు, అంగర రాంబాబు, ఎంపీటీసీలు అందుకూరి రాజు, వర్రే పైడియ్య, మేకా పార్వతి, పుప్పాల సత్యనారాయణ, అంబటి రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
చర్చలు మరోసారి విఫలం..
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయ ఈఓ, ఉద్యోగుల మధ్య చర్చలు మరోసారి విఫలమయ్యాయి. వేధింపులకు పాల్పడుతున్న ఈఓను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థాన ంలో పని చేస్తున్న ఉద్యోగులు, వేదపండితులు, అర్చకులు, నాల్గవ తరగతి ఉద్యోగులు సమష్టిగా రిలే దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఈఓ కక్షపూరితంగా ఉద్యోగులపై జారీ చేసిన మెమోలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆల య ఉద్యోగులు టీజేఏసీ నాయకుల ఆధ్వర్యం లో సహాయ నిరాకరణ చేస్తున్న విషయం విదితమే. ఈ విషయంపై ఈఓతో శుక్రవారం టీజేఏసీ నాయకులు చర్చలు జరిపారు. ఉద్యోగులు భేషరతుగా క్షమాపణ చెబితే మెమోలు ఉపసంహరించుకుంటానని ఈఓ తెలపడంతో ఉద్యోగుల నిరసన కొనసాగిస్తున్నారు. నాల్గవ రోజైన శనివారం చిత్రకూట మండపం వద్ద బైఠాయించి ఈఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈఓతో ఉద్యోగ సంఘ అధ్యక్షుడు చర్చలు మరోమారు విఫలం..... ఈ క్రమంలో దేవస్థాన ఉద్యోగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నర్సింహారాజును ఈఓ మరోసారి క్యాంపు కార్యాలయంలో చర్చలు జరపటానికి ఆహ్వానించారు. ఈ చర్చలలో కేవలం ఇద్దరి ఉద్యోగులపై ఉన్న మెమోలను మాత్రమే ఉపసంహరించుకుంటానని తెలపడంతో నర్సింహారాజు తిరిగి వెనక్కి వచ్చారు. సాయంత్రం కూడా ఈఓ మరోసారి పిలిచి ఇదే విషయాన్ని పేర్కొనడంతో చర్చలు విఫలం అయ్యాయి. ఉద్యోగుల డిమాండ్లను పూర్తిస్థాయిలో అంగీకరిస్తేనే చర్చలకు ఆహ్వానించాలని, లేకుంటే వద్దని నర్సింహరాజు స్పష్టం చేశారు. డిమాండ్లను సాధించే వరకు విరమణ లేదు.... తమ డిమాండ్లు ఒప్పుకునే వరకు ఈఓతో చర్చలకు వెళ్లేది లేదని ఆలయ ఉద్యోగులు, సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు. టీజేఏసీ డివిజన్ కన్వీనర్ మాట్లాడుతూ ఈఓ మోసపూరిత వైఖరికి తాము విసిగిపోయామని, అందుకే సహాయ నిరాకరణతో పాటు రిలే దీక్షలకు సిద్ధమయ్యామన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వహిస్తూనే పరిపాలన స్తంభింపజేస్తామని అన్నారు. ఈఓగా రఘునాథ్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన అన్ని పనులపై కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపితే అనేక అక్రమాలు వెలుగులోకి వస్తాయని, ఈ విచారణ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈఓ ఉద్యోగుల పట్ల రాజీ మార్గంతో కాకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఈఓపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలనే నినాదంతో ఆదివారం రిలే దీక్షలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీజేఏసీ నాయకులు వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, బాలకృష్ణ, ఆలయ ఉద్యోగ సంఘ నాయకులు నర్సింహరాజు, రవీందర్, శ్రీనివాసరెడ్డి, నిరంజన్, సూపరింటెండెంట్ కనకదుర్గ, కత్తి శ్రీను, భాస్కర్, వెంకట్, సుబ్బారావు, స్థలశాయి స్థానాచార్యులు, వేదపండితులు హనుమత్‌శాస్త్రి, లింగాల రామకృష్ణ ప్రసాదఅవధాని, ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, సీతారామానుజాచార్యులు, ఉపప్రధాన అర్చకులు కోటి శ్రీమన్నారాయణచార్యులు, అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, శ్రావణ్కుమారాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.