‘నవమి’కి ప్రత్యేక ఏర్పాట్లు | special arrangements to 'Navami' | Sakshi
Sakshi News home page

‘నవమి’కి ప్రత్యేక ఏర్పాట్లు

Published Thu, Mar 13 2014 2:57 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM

special arrangements to 'Navami'

భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలంలో ఏప్రిల్ 8, 9 తేదీలలో జరిగే శ్రీ సీతారాముల కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఈఓ ఎం.రఘునాధ్ తెలిపారు. ఈ ఏర్పాట్ల వివరాలను ఆయన బుధవారం ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.

 ఈ వివరాలు ఆయన మాటల్లోనే...
  కల్యాణం జరిగే మిథిలా స్టేడియంలో చివరి సెక్టార్లలో కూర్చున్న భక్తులందరికీ స్వామి వారి కల్యాణం కనిపించేలా 40 అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్లు 20 వరకూ ఏర్పాట్లు చేస్తున్నాం. ఇవి కాకుండా, స్టేడియం చుట్టూ మరికొన్ని పెద్ద స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తాం.
  స్టేడియం లోపల 40 కూలర్లను సిద్ధం చేస్తున్నాం. వంద రూపాయల సెక్టార్లలో భక్తుల కోసం పందిళ్ల ఎత్తును పెంచుతున్నాం.
  రూ.45లక్షల వ్యయంతో ఇంజనీరింగ్ పనులు చేయిస్తున్నాం. వీటిలో పది పనులకు టెండర్లు ఖరారయ్యాయి. మరో ఐదు పనులకు రీ-టెండర్లను 17వ తేదీన నిర్వహిస్తాం. భక్తుల కోసం వసతికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చలువ పందిళ్లను, షామియానాలను పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాం.

  ఐదు రూపాయలకే రెండు ముత్యాలతో తలంబ్రాలు విక్రయిస్తాం. స్వామి వారి ముత్యాల తలంబ్రాలకు ఏటేటా ఆదరణ పెరుగుతోంది. అందుకే, వీటిని సామాన్య భక్తులకు కూడా అందించేందుకు కేవలం ఐదు రూపాయలకే విక్రయించాలని నిర్ణయించాం. దీని కోసం 100 కేజీల ముత్యాలు, 100 క్వింటాళ్ల బియ్యంతో ఆరులక్షల ప్యాకెట్లు అందుబాటులో ఉంచుతాం. ఈ పనులు వసంతోత్సవం తరువాత ప్రారంభమవుతాయి. గతేడాది 2.5 లక్షల లడ్డూలు విక్రయించాం. ఈ ఏడాది మూడులక్షల లడ్డూలను సిద్ధం చేసి, క్యూ లైన్లలోనే ప్రత్యేక కౌంటర్లలో విక్రయిస్తాం.

  శ్రీరామ నవమి ఆహ్వాన పత్రికలతో గురువారం దేవాదాయ శాఖ కమిషనర్ వద్దకు వెళ్తున్నాం. కల్యాణం, పట్టాభిషేక మహోత్సవాల ఆహ్వాన పత్రాలు గవర్నకు అందజేస్తాం. మరికొంతమంది ఉన్నతాధికారులకు ఆహ్వాన పత్రాలు ఇస్తాం. కల్యాణ మహోత్సవానికి గవర్నర్ వచ్చే అవకాశముంది.

  ఈ నెల 20వ తేదీ నుంచే వీఐపీ; 500, 200, 100 రూపాయల టిక్కెట్లను బ్యాంకర్ల ద్వారా అందుబాటులో ఉంచుతాం. ఉభయ దాతల టిక్కెట్ల విక్రయాన్ని ఇప్పటికే ప్రారంభించాం. మిగతా టిక్కెట్లను ముందుగానే అమ్ముతాం. గతేడాది టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.70లక్షల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది రూ.కోటి వచ్చేలా టిక్కెట్ల అమ్మకాలకు సన్నాహాలు చేస్తున్నాం.

  2015 ఆగస్టులో జరిగే పుష్కరాలకు వచ్చే భక్తుల వసతి కోసం మూడు కాటేజీలు, వివిధ ప్రదేశాలలో 250 గదులు, 100 డార్మెటరీ లాకర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఐదుకోట్ల రూపాయల వ్యయంతో టీటీడీ ప్రతిపాదించిన గదులను తానీషా మండపం వద్దనున్న 2.6 ఎకరం స్థలంలో నిర్మించేందుకు ప్రణాళికలు తయారుచేస్తున్నాం. రంగనాయకుల గుట్టపై మూడు కాటేజీల నిర్మాణం ప్రారంభమైంది. అభయాంజనేయ స్వామి ఆలయం పక్కనున్న 90 సెంట్ల దేవస్థానం స్థలంలో భక్తుల కోసం 100 లాకర్లతో డార్మెటరీ హాల్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement