భద్రాద్రిలో వైభవంగా మహాక్రతువు
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో మహాక్రతువు వైభవంగా కొనసాగుతోంది. భక్తరామదాసు కాలం నాటి విగ్రహాలకు బంగారు కవచం వేయనున్న నేపథ్యంలో శ్రీరామాయణ మహాక్రతువు నిర్వహిస్తున్నారు. వందేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ కార్యక్రమం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అందులో భాగంగా చిత్రకూటమండపంలో శ్రీరామాయణ పారాయణం 20 సర్గలను పఠించారు. తిరువారాధన, ప్రాబోధిక చతుద్వారార్చన, చతుస్థానార్చన, వేదాది విన్నపాలు చేశారు. శ్లోక హవనం గావించి, నిత్య పూర్ణాహుతి ఇచ్చి బుధవారం నాటి కార్యక్రమానికి ముగింపు పలికారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.