భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఇకపై పెళ్లి బాజాలు మోగనున్నాయి. 2018 వరకు రామాలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఉపాలయం పక్కన పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు అనుమతి ఇచ్చేవారు. అనంతరం పలు కారణాలతో ఆలయ ప్రాంగణంలో శుభకార్యాలను నిరాకరించారు. భక్తుల నుంచి విజ్ఞప్తులు వచ్చినప్పటికీ, ఈలోపు కోవిడ్ కారణంగా అధికారులు నిర్ణయం తీసుకోలేకపోయారు. తాజాగా కరోనా నిబంధనలు సడలించడం, భక్తుల నుంచి సైతం విజ్ఞప్తులు పెరగడంతో ఆలయ ఈవో శివాజీ తాజాగా వైదిక కమిటీతో చర్చించారు.
వైదిక కమిటీ, ఈవో తీసుకున్న నిర్ణయం మేరకు ఆలయ ప్రాంగణంలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద రూ.1,116 చెల్లించి శుభకార్యాలు జరుపుకోవచ్చు. అలాగే, చిత్రకూట మండపంలోని విశాలమైన వేదిక వద్ద శుభకార్యాల నిర్వహణకు రూ.10,116 వసూలు చేయాలని నిర్ణయించారు. అయితే ఈ శుభకార్యాల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో అల్పాహారం, భోజనాలకు మాత్రం అనుమతించరు. కాగా, వివాహాది శుభకార్యాల్లో అన్యమతాలకు చెందిన వస్తువులు, ఇతర సామగ్రి వినియోగించకుండా చూడాలని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment