ముదిరిన వివాదం
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఈవో, ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం మరింత రాజుకుంది. ఈవోకు వ్యతిరేకంగా ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు గురువారం కూడా పరిపాలనాపరమైన సేవలు నిలిపేసి సహాయ నిరాకరణ చేపట్టారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా నిరసనకు దిగారు. ‘ఈవో డౌన్ డౌన్’, ‘ఉద్యోగులను వేధిస్తున్న ఈవోను సస్పెండ్ చేయాలి’ అని రాసిన ప్లకార్డులు చేబూనారు. ఈవోకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
స్వామి వారికి పూజలు, భక్తుల సందర్శనకు ఎటువంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయంలోని అన్ని కేడర్ల ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరికి టీఎన్‌జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు సంఘీభావం ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఇలా ఆందోళనకు దిగాల్సిన పరిస్థితులు ఏర్పడడం విచారకరమన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈవో ఇక్కడి ఉద్యోగులపై కక్షపూరితంగా వ్యవహరించినందునే సమస్య జటిలంగా మారిందని అన్నారు. దీనిని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని అన్నారు.
దేవస్థానం ఉద్యోగుల సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటప్పయ్య మాట్లాడుతూ.. ఈవో రఘునాధ్ నిరంకుశ వైఖరి కారణంగా అనేకమంది ఉద్యోగులు మానసిక వ్యథతో ఉన్నారని అన్నారు. ఈవోను సస్పెండ్ చేసేంత వరకు ఆందోళన కొనసాగుతుందన్నారు.
కార్యక్రమంలో టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరరావు, ఆలయ ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు నరసింహరాజు, ఏఈవో శ్రావణ్ కమార్, ఏఈ రవీందర్, నిరంజన్ కుమార్, పీఆర్‌వో సాయిబాబా, ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, స్థానాచార్యులు స్థలశాయి, వేద పండితులు మురళీ కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
మురళీ కృష్ణమాచార్యులు బదిలీకి లేఖ
దేవస్థాన అధర్వణ వేద పండితులు జి.మురళీ కృష్ణమాచార్యులును ఇక్కడి నుంచి బదిలీ చేయాలంటూ దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఈవో రఘునాధ్ గత నెల 31న లేఖ రాశారు. ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా మురళీ కృష్ణమాచార్యులు వ్యవహరిస్తున్నారని, ఈ కారణంగా దేవస్థానం ప్రతిష్టకు భంగం వాటిల్లుతోందని పేర్కొన్నారు. ఆ లేఖలో... ‘ఆలయ సంప్రదాయాలకు విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారు. ‘శ్రీరామచంద్రస్వామినే వరాయ’ అనే పదాన్ని తొలగించి ‘రామనారాయణ వరాయ’ అంటూ ప్రవచనాలు చెప్పారు.
ఈ ఏడాది జరిగిన స్వామి వారి కల్యాణోత్సవంలో ‘కల్యాణ వేడుకలో భద్రాచలములో కొలువైన శ్రీరామచంద్రుడు దశరధ తనయుడు రాముడు కాదని, అట్లు అనుకొనుచున్న రామ భక్తులు మూర్ఖులు, అవివేకులని, భద్రాద్రిలో కొలువున్న రాముడు వైకుంఠ రాముడనియు, రామ నారాయణుడనియు వ్యాఖ్యానించి భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దీనిపై వివరణ కోరుతూ మెమో ఇవ్వగా, టీఎన్‌జీవో నాయకులను నా చాంబర్‌కు తీసుకొచ్చి అర గంటకు పైగా బయటకు వెళ్లనీయకుండా నిర్బంధించారు. పరిపాలనాపరమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటూ వివాదాలకు కారణభూతుడవుతున్నారు. ఆయనను వెంటనే బదిలీ చేయాలి’’ అని ఉంది. ఈ లేఖ గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ లేఖపై ఆలయ ఉద్యోగులు, వేద పండితులు, అర్చకులు తీవ్రంగానే స్పందించారు.
ఆర్థిక లావాదేవీలపై విచారణకు డిమాండ్
ఆలయ సంబంధ ఆర్థిక లావాదేవీల్లో ఈవోగా రఘునాథ్ అక్రమాలకు పాల్పడ్డారని వేద పండితులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. వివిధ పనులను టెండర్లు లేకుండా తనకు అనుకూలమైన వారికి కట్టబెట్టారని, వారి నుంచి పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని కోరాారు.
సెలవులో ఈవో
ఆలయ ఉద్యోగుల సహాయ నిరాకరణ నేపథ్యంలో ఈవో రఘునాధ్ రెండు రోజులపాటు సెలవు పెట్టారు. ఆయన బుధవారం రాత్రి ఇక్కడి నుంచి వెళ్లిపోయారు.