భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు మంగళవారంతో ముగిశాయి.
భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ముక్కోటి ఏకాదశకి ముందు పదిరోజులు పగటి పూట పగల్ పత్తు ఉత్సవాలు, అనంతరం పదిరోజులు రాత్రి పూట ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో రాపత్‌సేవలను నిర్వహించటం ఆనవాయితీ. ఇలా 21 రోజుల పాటు అధ్యయనోత్సవాలు కన్నులు పండువగా జరిగాయి. పగల్‌పత్తు ఉత్సవాలలో తొమ్మిది అవతారాలలో స్వామి వారిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు.
నృసింహదాసు మండపంలో రాపత్ ఉత్సవం..
భద్రాచలం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మంగళవారం నృసింహదాసు మండపంలో రామయ్యకు రాపత్ ఉత్సవం నిర్వహించారు. ప్రత్యేకంగా అలకంరించిన స్వామివారిని గరత్మంత వాహనంపై కొలువుదీర్చారు. శ్రీకృష్ణకోలాట సమితి మహిళల కోలాటాలు, వేద పండితుల మంత్రోఛ్చారణలు, భక్తుల కోలాహలం నడుమ ఊరేగింపుగా నృసింహదాసు మండపానికి తీసుకొచ్చారు. అక్కడ ఆలయ అర్చకులు స్వామి వారికి విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం గావించి హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి జగన్నాధాచార్యులు, నర్సింహాచార్యులు, ఎంపీడీవో రమాదేవి, పంచాయతీ ఈవో శ్రీమన్నారాయణ, సర్పంచ్ భూక్యా శ్వేత దంపతులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నేటి నుంచి విలాసోత్సవాలు...
అధ్యయనోత్సవాలు ముగిసిన అనంతరం స్వామి వారికి మూడు రోజుల పాటు విలాసోత్సవాలు నిర్వహిస్తారు. బుధవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో శ్రీరామదాసు మండపంలో, విలాసోత్సవాలలో భాగంగా స్వామి వారికి బుధవారం రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో శ్రీరామదాసు మండపంలో, గురువారం దసరా మండపంలో, శుక్రవారం దేవస్థానం సిబ్బంది ఆధ్వర్యంలో వశిష్ట మండపంలో సేవలు నిర్వహిస్తారు.