భద్రాచలం టౌన్, న్యూస్‌లైన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో ఇరుముడులు సమర్పించేందుకు వచ్చిన హనుమాన్ భక్తులు గోదావరి స్నానఘాట్‌ల వద్ద తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గోదావరి తీరంలో ఎటు చూసినా అపరిశుభ్ర వాతావరణమే కనిపించటంతో.. స్నానాలు చేయడానికి కూడా సంకోచించారు.
అడుగడుగునా అధికారుల నిర్లక్ష్యం
హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయడంలో ఇటు రామాలయం, అటు పంచాయతీ అధికారులు ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. వారి నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. శ్రీరామ నవమి, ముక్కోటి ఉత్సవాల తరువాత హనుమాన్ జయంతికి జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి హనుమాన్ మాలధారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈసారి సుమారు 50వేలకు పైగానే భక్తులు రావచ్చని ముందుగానే అంచనా వేసిన అధికారులు.. తదనుగుణంగాఏర్పాట్లు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. స్నాన ఘాట్‌ల వద్ద కనీసంగా చెత్త కుండీలను కూడా ఏర్పాటు చేయలేదు. ఉన్న ఒక్క కుండీ వ్యర్థాలతో నిండింది. ఆ చెత్తచెదారం, దుర్వాసన మధ్యనే కొందరు హనుమాన్ భక్తులు ‘ఓ రామా.. ఏమిటీ దురవస్థ..’ అనుకుంటూ స్నానాలాచరించారు. గోదావరి తీరంలోని అపరిశుభ్ర వాతావరణంలో స్నానమాచరించేందుకు మనసొప్పని అనేకమంది భక్తులు.. నావలపై గోదావరి మధ్యలోకి వెళ్లి పుణ్యస్నానాలు చేసి వచ్చారు.
ఒడ్డునే మొక్కులు....
భక్తులు తలనీలాలు సమర్పించేందుకు గోదావరి ఒడ్డున తాత్కాలిక కళ్యాణ కట్ట ఏర్పాటు చేయా లి. హనుమాన్ జయంతికి అధికారులు ముందస్తుగా ఇటువంటి ఏర్పాట్లేమీ చేయలేదు. దీంతో, మాలధారులు, భక్తులు తమ వెంట తెచ్చుకున్న క్షురకుడితో గోదావరి ఒడ్డునే తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. గోదావరి తీరమంతా ఆ జుట్టుతో అపరిశుభ్రంగా తయారైంది.
ఓ రామా.. ఏమిటీ దురవస్థ...!
Published Sat, May 24 2014 2:38 AM | Last Updated on Tue, Nov 6 2018 6:01 PM
Advertisement
Advertisement