రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఆదివారం సువర్ణపుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఆదివారంను పురష్కరించుకొని తొలుత అంతరాలయంలో మూలవరులకు అభిషేకం, అనంతరం సువర్ణపుష్పార్చనను గావించారు. ఆ తదుపరి బేడా మండపంలో నిత్య కల్యాణోత్సవంను కన్నులపండువగా జరిపారు. వేడుకలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని భద్రుని మండపంలో స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు.
పవిత్ర గోదావరి నది నుంచి అర్చకులు, ఆస్థాన విద్యాంశుల మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చిన గోదావరి పుణ్య జలాలతో భద్రునిగుడి లో స్వామి వారిపాదుకుల వద్ద అభిషేకం నిర్వహించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి మూర్తులకు అంతరాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పల్లకిపై మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ ప్రాకార మండపంలో ఆశీనులు చేసిన స్వామివారికి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. శ్రీసీతారాముల వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు అత్యంత వైభవోపేతంగా రామయ్యకు నిత్యకల్యాణం జరిపించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా అంతరాలయంలో స్వామి వారి దర్శనం కల్పించారు.