
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాచలంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూలి ఆరుగురు మృతిచెందారు. ఆరంతస్తుల భవనం కూప్పకూలింది. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. క్రేన్లు, పొక్లెయిన్లతో శిథిలాలను తొలగిస్తున్నారు. పాత భవనంపైనే మరో నాలుగు అంతస్తులు నిర్మిస్తుండగా ప్రమాదం జరిగింది. నిర్మాణంలో లోపాల వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి.. భవన నిర్మాణం చేపట్టినట్లు తెలిసింది.
పట్టణంలోని రామాలయ పరిసర ప్రాంతంలోని సూపర్ బజార్ సెంటర్‌లో ఈ భవనాన్ని నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నట్లు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ ఈ భవనాన్ని నాసిరకమైన పిల్లర్లతో నిర్మాణం చేపట్టారని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సామాజిక కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. ఐటీడీపీవో రాహుల్ ఈ భవనాన్ని కూల్చివేయమని పంచాయతీ శాఖకు ఆదేశాలు జారీ చేశారని సమాచారం. అయినప్పటికీ ప్రాజెక్టు అధికారి ఆదేశాలను నిర్లక్ష్యం చేయడంతోనే ఈ ప్రమాదం జరిగి పలువురు మరణానికి కారణమైందని పలువురు చెబుతున్నారు.

సామాజిక కార్యకర్తలపై ఇంటి యజమాని బెదిరింపులకు దిగారనే ఆరోపణలున్నాయి. పట్టణంలోని పలు భవన నిర్మాణాలు ఇలాగే నిబంధన విరుద్ధంగా జరుగుతున్నాయని ఎవరు ఫిర్యాదు చేసిన సంబంధించిన శాఖ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదానికి పూర్తిగా పంచాయతీ శాఖ బాధ్యత వహించాలని పలువురు అంటున్నారు.

Comments
Please login to add a commentAdd a comment