special pujas
-
ద్వారకలో స్కూబా డైవింగ్
ద్వారక: ఆరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని మోదీ ఆదివారం దర్శించుకున్నారు. గుజరాత్‌లోని ద్వారక పట్టణ తీరంలో పాంచ్కుయి బీచ్ నుంచి స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి కాసేపు గడిపారు. ‘‘సముద్ర గర్భంలో భగవంతుడికి పూజలు చేయడం అద్భుతమైన అనుభూతి! సాక్షాత్తూ దేవుడి సన్నిధిలో గడిపినట్లుగా ఉంది’’ అన్నారు. తెల్లని డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు. కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం తన అనుభవాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫొటోలను సైతం పంచుకున్నారు. ఇది సాహసం కంటే ఎక్కువని, ఇదొక విశ్వాసమని పేర్కొన్నారు. అనంతరం గుజరాత్లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారకా నగరాన్ని చేతల్లో తాకగానే, 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ల ముందు మెదిలిందని తెలిపారు. సముద్ర గర్భంలో కనిపించిన ద్వారక దృశ్యం దేశ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. ఆధ్యాతి్మక వైభవంతో కూడిన ప్రాచీన కాలంలో అనుసంధానమైనట్లు భావించానని చెప్పారు. శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్ సముద్ర తీరంలో ద్వారక పట్టణంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ మోదీ పూజలు చేశారు. -
శ్రీస్వామి వారి ఆదాయం 14, వ్యయం 11
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతోపాటు శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శ్రీశోభకృత్ నామ తెలుగు నూతన సంవత్సర వేడుకలను బుధవారం ఆచార్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వయంభూలు కొలువైన ప్రధానాలయంలో భక్ష్యా లు తయారు చేసి, షడ్రుచులతో సిద్ధం చేసిన పచ్చడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీస్వామి, అమ్మవార్లకు నివేదించారు. సాయంత్రం ముఖ మండపంలో శ్రీస్వామి వారిని అలంకరించి మాఢ వీధుల్లో సేవోత్సవం జరిపించారు. తూర్పు రాజగోపురం ముందు అధిష్టించి ఆచార్యులు పంచాగ పఠనం చేశారు. యాదాద్రి నృసింహస్వామిది తులా రాశి కాగా ఈ ఏడాది శ్రీస్వామి వారికి 14 ఆదాయం, 11 వ్యయం, శ్రీలక్ష్మీ అమ్మవారిది మేషరాశి కాగా ఆదాయం 5, వ్యయం 5, ఆండాళ్ అమ్మవారిది సింహ రాశి కాగా ఆదాయం 14 వ్యయం 2 ఉన్నట్లు ఆచార్యులు వివరించారు. శ్రీశోభకృత్లో భక్తులతో పాటు ప్రజలంతా ఆనందంగా ఉంటారని ఆచార్యులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని, వడగళ్లు సైతం పడతాయని తెలిపారు. రైతాంగానికి శ్రీ శోభకృత్ నామ సంవత్సరం కలసి వచ్చే అంశం అని అన్నారు. వేసవిలో ఎండలు దంచి కొడతాయన్నారు. ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని, ఎలాంటి వైరస్ ప్రజలకు సోకదని తెలిపారు. ఈ వేడుకల్లో ఈఓ గీతారెడ్డి, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఆలయ ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, ముఖ్య అర్చకులు, పండితులు, పురోహితులు పాల్గొన్నారు. -
వైభవంగా యాదాద్రీశుని బ్రహ్మోత్సవాలు
సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం స్వస్తివాచనంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. పంచారాత్ర ఆగమ సిద్ధాంతం ప్రకారం బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నారు. యాదాద్రి ప్రధానాలయం ఉద్ఘాటన తర్వాత జరుగుతున్న మొదటి బ్రహ్మోత్సవాలు మార్చి 3 వరకు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధానాలయాన్ని పూల మాలికలు, విద్యుత్ దీపాలతో అలంకరించడంతో బంగారు వర్ణంలో శోభాయమానంగా ఆకట్టుకుంటోంది. 0గర్భాలయ ఆవరణలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరాధన, ఉపాచారాల అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, నవకలశాభిషేకం, రక్షాబంధనం నిర్వహించారు. విష్వక్సేనుడు సమస్త సేవా నాయకులకు అధిపతి. అంటే.. సర్వసైనాధ్యక్షుడు కావడంతో ఈయనను ఈ ఉత్సవాలకు ఉద్యుక్తున్ని చేయడమే ఈ పూజ ప్రత్యేకత. అలాగే ధాన్యరాశిలో సత్యం, జ్ఞానం, ధర్మం అనే ముగ్గురు దేవతలను ఆవాహన చేసి ఆ కలశాలలో శుద్ధ గంగాజలాన్ని పోసి మంత్రోచ్ఛారణల మధ్య వాటికి ప్రత్యేక పూజలు చేశారు. రక్షాబంధనం ఈ ఉత్సవాల్లో పంచనారసింహుల శక్తిని పెంచడానికి కఠోర నియమాలతో దీక్షను తీసుకోవడమే రక్షాబంధనం. గర్భాలయంలో స్వామివారి వద్ద కంకణాలకు పూజ చేసి ఉత్సవమూర్తులకు కంకణధారణ చేశారు. అనంతరం అర్చకులు.. చైర్మన్ బి.నర్సింహమూర్తి, దేవస్థానం ఈఓ గీతారెడ్డిలకు రక్షాబంధనం చేశారు. అంకురార్పణ సందర్భంగా పోచంపల్లి పద్మశాలి మహాజన సంఘం ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు పోచంపల్లి పట్టు ధోవతి, కండువా, చీర సమర్పించారు. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం 8 గంటలకు అగ్ని పరీక్ష, ధ్వజారోహణం, రాత్రి 7.30 గంటలకు భేరిపూజ, దేవతాహ్వానం, హవనము జరుగుతాయి. -
మూడు రాజధానులకు మద్దతుగా ప్రత్యేకపూజలు
-
3 రాజధానులకు మద్దతుగా ప్రత్యేక పూజలు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ)/ఇచ్ఛాపురం రూరల్/చినగంజాం: మూడు రాజధానుల ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ, వాటికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మంగళవారం ఆలయాల్లో కొబ్బరి కాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. విశాఖపట్నం పెదవాల్తేర్‌లోని శ్రీకరకచెట్టు పోలమాంబ ఆలయంలో అమ్మవారికి వీఎంఆర్డీఏ చైర్పర్సన్, వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మేయర్ గొలగాని హరివెంకటకుమారి తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కొబ్బరి కాయలు కొట్టారు. విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని పూర్ణామార్కెట్ వెలంపేటలోని దుర్గాలమ్మ ఆలయంలో కార్పొరేటర్ విల్లూరి భాస్కరరావు నేతృత్వంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ పూజలు చేసి వెయ్యి కొబ్బరికాయలు కొట్టారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో జింక్ ఆంజనేయస్వామి ఆలయంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఆడారి ఆనంద్ ఆధ్వర్యంలో 101 కొబ్బరికాయలు కొట్టారు. శ్రీకాకుళం జిల్లా లొద్దపుట్టి ధనరాజులమ్మ ఆలయంలో ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ నర్తు రామారావుయాదవ్ పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్న జిల్లా టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బాపట్ల జిల్లా వంకాయలపాడులోని సంతానవేణుగోపాలస్వామి ఆలయంలో జెడ్పీటీసీ సభ్యురాలు భవనం శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు భవనం శ్రీనివాసరెడ్డి పూజలు చేశారు. -
Mysuru Dasara 2022: పండుగలు ఐక్యతకు ప్రతీకలు
మైసూరు: మైసూరు ఉత్సవాలు దేశ ఘన సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దసరా వంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పారు. ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు. చాముండి కొండపై మైసూరు రాచవంశీకుల ఆరాధ్యదైవం చాముండేశ్వరి విగ్రహంపై పూలు చల్లుతూ వేద మంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు చేశారు. ఇటీవలి కాలంలో మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్మునే. మైసూరు పట్టుచీరలో రాష్ట్రపతి ఈ సందర్భంగా రాష్ట్రపతి మైసూరులో తయారైన తెలుపు రంగు బంగారు జరీ గీతల అంచుతో కూడిన పట్టుచీరను ధరించారు. ఆమె కోసం దీన్ని ప్రత్యేకంగా నేయించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక బుడకట్టు గిరిజన కళాకారుల నృత్యాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. విద్యుత్‌కాంతులతో మైసూరు కరోనా నేపథ్యంలో మైసూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండేళ్లు సాదాసీదాగా జరిగాయి. ఈ నేపథ్యంలో జానపద కళా రూపాలతో కర్ణాటక సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈసారి 9 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు ప్యాలెస్, వీధులు, భవనాలు, కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించింది. మైసూరులోని ప్రముఖ్య రాజప్రాసాదాలైన అంబా విలాస్ ప్యాలెస్, జగన్మోహన్ ప్యాలెస్ వంటి 8 చోట్ల 290 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. -
మనోహరం.. మహిమాన్వితం
సర్వజనులకు శుభాలనిచ్చేవాడు శుభంకరుడైన శివుడు. దేవతలకూ దేవుడై మహాదేవుడయ్యాడు. క్షీరసాగర మధనంలో విషాన్ని తన గళంలో నిలిపిన శివుడు నిద్రిస్తే విషం ఒళ్లంతా వ్యాపిస్తుందని దేవతలు ఐదు జాముల పాటు ఆడిపాడి, శివుణ్ని మేల్కొనేలా చేసిన రోజే శివరాత్రి. శివపార్వతుల కల్యాణం, శివలింగోద్భవం కూడా ఇదే రోజున జరిగినట్టు శాస్త్రం చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకం, అర్చన, ఉపవాసం, జాగరణతో మంత్రాక్షరిని పఠిస్తే శివానుగ్రహం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. మార్చి 1న జరిగే శివరాత్రి పూజలకు విజయనగరం జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. మారేడుదళపతికి మనసారా అర్చనలు జరిపేందుకు భక్తలోకం సన్నద్ధమవుతోంది. – సాక్షి నెట్వర్క్, విజయనగరం భక్తసిరి ‘పుణ్య’గిరి ఎస్.కోట పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది పుణ్యగిరి. జలపాతాల నుంచి జాలువారే నీటి సవ్వడి, మర్కట మూకల సందడి, çపురాణాలతో ముడిపడి, ఉమాకోటిలింగేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రం పుణ్యగిరి. విరాటరాజ్య రక్షకుడైన కీచకుడు కొలువుదీరిన శృంగారపుకోట కాలక్రమంలో శృంగవరపుకోటగా మారింది. సైరంధ్రి పేరుతో ఉన్న ద్రౌపదిని బలాత్కరించబోయి భీముని చేతిలో నిహతుడైన కీచకునికి ముక్తి ప్రసాదించమని సోదరి సుదేష్ణ కోరిక మేరకు ధర్మరాజు శివుని ప్రార్థించగా, శివుని శిరోపాయల నుంచి వెలువడిన ధార నేటికీ భూగర్భంనుంచి వస్తూ శివలింగాన్ని స్పృశిస్తుంది. అదే పుట్టుధార, శివధారగా వాసికెక్కింది. కొండ శిలకు అంటిపెట్టుకుని భూమికి అథోముఖంగా ఉన్న లింగాల నుంచి నీటి బిందువులు పడుతుంటాయి. పూర్వం ఈ నీరంతా ఒకే చోట పడేందుకు గొడుగులు కట్టడంతో దీనిని గొడుగులధారగా భక్తులు పిలవనారంభించారు. కీచకుని అస్థికలను ఇక్కడే నిమజ్జనం చేశారని, ఇక్కడ అస్థినిమజ్జనం చేస్తే చనిపోయిన వారికి సద్గతులు కలుగుతాయన్న నమ్మకం ప్రబలంగా ఉంది. పుణ్యగిరిలో ఉమాకోటిలింగేశ్వరుడు, పుట్టుధార, పార్వతీదార, కోటిలింగాల రేవు, త్రినాథగుహ, ధారగంగమ్మలోయ, బూరెలగుట్ట వంటి స్థలాలు ఉన్నాయి. శివరాత్రి వేళలో రెండురోజుల పాటు జరిగే జాతరలో పుణ్యగిరికి పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు. చరిత్రాత్మకమైన చాతుర్లింగేశ్వరాలయం బలిజిపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో ఉన్న చాతుర్లింగేశ్వర దేవాలయం అపురూప శిల్ప సంపద, రాతికట్టడాలకు నెలవు. 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. రాతి కట్టిన నీలకంఠేశ్వర, సంగమేశ్వర, మల్లికార్జున, శ్రీనీలేశ్వర ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. దేవాలయ స్తంభాలపై ఉండే శాసనాలు, ఆలయాలపై ఉండే చెక్కడాలు ఆనాటి చరిత్రకు ఆధారాలుగా నిలిచాయి. గళావళ్లి గ్రామంలో కామలింగేశ్వర ఆలయం 11వ శతాబ్దపు నిర్మాణశైలికి ప్రతీకగా నిలిచింది. తూర్పుగాంగరాజులలో అగ్రగణ్యుడైన అనంతవర్మ చోడగంగ (కీ.శ 1176–1174), కస్తూరీ కామోదినుల కుమారుడైన కామఖ్కవుని (కీ.శ 1147–1156) పేరున ఈ ఆలయం నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి. పుణ్యగిరిలో ఉమాకోటిలింగేశ్వరుడు ధాన్యంతో వచ్చిన దయామూర్తి జైపూర్ నుంచి నాటుబళ్లతో ధాన్యం తెస్తుండగా ధాన్యం బస్తాల్లో నీలకంఠేశ్వరస్వామి విగ్రహం 250 యేళ్ల కిందట సీతానగరం మండలం నిడగల్లుకు చేరింది. ధాన్యంతో వచ్చిన దయామయుౖడైన శివునికి నిడగల్లు గ్రామ శివార్లలో శనపతి పాత్రుడు కుటుంబీకులు ఆలయాన్ని నిర్మించారు. నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏటా శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఇటీవల రూ.50లక్షలు మంజూరు చేసింది. సంగమ క్షేత్రం సోమేశ్వరాలయం నాగవళి–జంఝావతి నదుల సంగమ క్షేత్రం గుంప సోమేశ్వరాలయం. ఉత్తరాంధ్ర సిగలో వెలిసిన ప్రసిద్ధ శైవక్షేత్రం. కొమరాడ మండలం కోటపాం పంచాయతీ దేవుని గుంపలో ఉన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు గోహత్య దోష నివారణ కోసం నదీ తీరాన ఐదు శివలింగాలు ప్రతిష్టించాడని, బలరాముడు తన నాగలితో దున్నడంతో నాగావళి నది ఏర్పడిందని, మార్గంమధ్యలో అటంకాలు ఎదురైన చోట శివలింగాలను ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. అలా, నది వెంబడి ఒడిశా రాష్ట్రంలో పాయకపాడులో భీమేశ్వరుడు, దేవునిగుంపలో సోమేశ్వరుడు, వంగర మండలం సంగాం వద్ద సంగమేశ్వరుడు, శ్రీకాకుళం వద్ద రుద్రకోటేశ్వరుడు, కళ్లేపల్లి వద్ద శ్రీనాగేశ్వరునిగా పూజలు అందుకుంటున్నాడు. వీటిలో దేవుని గుంపలో సోమేశ్వరుడుని దర్శిస్తే కాశీయాత్ర ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. సోమేశ్వరుని దర్శించి తోటల్లో వనభోజనాలు చేయడం ఈ ప్రాంతీయుల ఆనవాయితీ. సంతానం ప్రాప్తిని కలిగించే సన్యాసేశ్వరుడు సంతానసిద్ధి కలిగించే గొప్ప క్షేత్రంగా శృంగవరపుకోట మండలంలో ధర్మవరం పంచాయతీలో సన్యాసయ్యపాలెంలోని సన్యాసేశ్వర ఆలయం పేరుగాంచింది. 15వ శతాబ్దంలో ఒక సన్యాసి కాశీయాత్రకు వెళ్తూ ధర్మవరంలో మజిలీ చేయగా, గ్రామస్థులు తమ పిల్లలను ఏదో శక్తి చంపేస్తోందని మొర పెట్టుకోగా ఆయన తన మంత్రబలంతో శక్తిని బంధించి, ఆలయంలో సంతానగోపాల యంత్రం, బైరవ యంత్రాలను ప్రతిష్టించినట్టు చరిత్ర. నాటి నుంచి సంతానం లేనివారు సన్యాసేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించి, పూజలు చేస్తే సంతానవంతులు అవుతారని ప్రగాఢ విశ్వాసం. శివరాత్రి వేళ పుణ్యగిరి జాతరకు వచ్చిన భక్తులు సన్యాసేశ్వరున్ని దర్శిస్తారు. మహాశివరాత్రికి 160 ప్రత్యేక బస్సులు విజయనగరం టౌన్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ రీజియన్ పరిధిలో 160 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు రీజనల్ మేనేజరు ఆకాశపు విజయకుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి ఒకటి, రెండు తేదీల్లో భక్తులకు అనుగుణంగా నెక్ రీజియన్‌లో అన్ని డిపోల నుంచి ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక బస్సులు ఉంటాయన్నారు. పార్వతీపురం–గుంప మధ్య 10 బస్సులు, సాలూరు–పారమ్మ కొండకు 25, ఎస్.కోటలోని పుణ్యగిరికి 30, విజయనగరం–రామతీర్థం 35, పాలకొండ–రామతీర్థం 17, శ్రీకాకుళం–రామతీర్థం 35, టెక్కలి–రావివలసకు 8 బస్సులు కలిపి మొత్తం 160 బస్సులు నడుస్తాయన్నారు. భక్తులంతా సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అద్భుతం అడ్డాపుశీల క్షేత్రం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నందీశ్వరుని విగ్రహం పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వరుని ఆలయ ప్రత్యేకత. శివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలు చేస్తారు. ప్రాచీన కాలం నుంచి అర్చకులుగా ఒడియా బ్రాహ్మణులు కొనసాగుతున్నారు. కాశీనుంచి తీసుకొచ్చిన గంగాజలంతో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. ప్రాచీనం.. నగిరేశ్వరాలయం... బొబ్బిలి మండలంలో పెంట గ్రామంలో ఉన్న నగిరేశ్వరాలయం 200 యేళ్లనాటిది. ఆలయంలో నగిరేశ్వరుడు స్వయంభువు కావడం ఇక్కడి విశేషం. చిత్రకోట బొడ్డవలస పంచాయతీ పరిధిలోని దేవుడిబొడ్డవలస మానసాదేవి ఆలయంలో పురాతన విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. కలువరాయిలో రమణమహర్షి ఆశ్రమంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. -
శ్రీగిరికి కార్తీక శోభ
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల మహా క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు డిసెంబర్ 4వ తేదీ వరకు జరుగుతాయి. కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శుక్రవారం వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రధానాలయానికి ఎదురుగా గల గంగాధర మండపం వద్ద, ఆలయ దక్షిణ మాడ వీధిలో దీపారాధన చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. సాయంత్రం ఆలయంలో దీపోత్సవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా కార్తీకమాసం అంతా స్పర్శ దర్శనం నిలుపుదల చేసి, స్వామివారి అలంకార దర్శనం మాత్రమే భక్తులకు కల్పిస్తున్నారు. కార్తీక మాసంలో ప్రతి సోమవారం, కార్తీక పౌర్ణమి రోజున ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
మైసమ్మకు మద్యం తీర్థం
గీసుకొండ: ఎప్పుడు వివాదాలను సృష్టించుకుంటూ మీడియా ఫోకస్ తనపై ఉండేలా చూసుకునే సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ మంగళవారం తన కొత్తచిత్రం ‘కొండా’ప్రారంభోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా కోటగండి వద్ద వరంగల్–నర్సంపేట రహదారి పక్కన ఉన్న కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి తీర్థంగా మద్యం ఉంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక్కడి అమ్మవారికి భక్తులు మద్యాన్ని తీర్థంగా పోయడం సంప్రదాయంగా వస్తోంది. అమ్మవారికి మద్యంపోయడంపై ఆర్జీవీ స్పందిస్తూ..తానెప్పుడూ వోడ్కా తాగుతానని, అమ్మవారికి విస్కీ పట్టించానని తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు. -
త్రిష ప్రత్యేక పూజలు
మధ్యప్రదేశ్‌లోని ఓ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు హీరోయిన్ త్రిష. కానీ ఆమె ఈ పూజలు చేస్తున్నది తన కోసం కాదు... ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా కోసం. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ ఫిల్మ్ షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఓర్చా లొకేషన్స్‌లో జరుగుతోంది. అక్కడ కార్తీ, త్రిష, ప్రకాశ్ రాజ్ తదితరులు పాల్గొనగా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఓర్చా లోకేషన్లోనే కాకుండా మధ్యప్రదేశ్‌లోని వివిధ లొకేషన్స్‌లో ఈ నెలాఖరు వరకు ‘పొన్నియిన్ సెల్వన్’ షూటింగ్ జరుగుతుందని కోలీవుడ్ టాక్. విక్రమ్, ‘జయం’రవి, ఐశ్వర్యా రాయ్, ఐశ్వర్యా లక్ష్మీ, శరత్‌కుమార్, పార్తీబన్ ఈ చిత్రంలోని ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమా తొలి భాగం వచ్చే ఏడాది విడుదల కానుంది. -
ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి
-
ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారి ఆలయంలో శ్రావణమాసం సందడి నెలకొంది. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి శుక్రవారం పెద్దసంఖ్యలో అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం మొదటి వారం నుండే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకొని అమ్మవారి దర్శనానికి భక్తులు వస్తున్నారు. దుర్గమ్మని దర్శించుకోవడం ఆనందంగా ఉందని భక్తులు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఇంద్రకీల్రాదిపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. శ్రావణ శోభకు కరోనా దెబ్బ.. శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా భావిస్తారు. మహిళలు ఈ మాసం అత్యంత శుభ ప్రదమైనదిగా భావించి నోములు, వ్రతాలు నోచుకుని, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఇక పెళ్లిళ్లు తది తర శుభకార్యాలకు ఇది దివ్యమైన మాసం. ఈ నెల రోజులు నగరంలో పండుగ వాతావరణం సంతరించుకుంటుంది. ప్రతి ఏడాది అన్ని రకాల వ్యాపారాలు జోరుగా సాగుతాయి. అయితే కరోనా ఎఫెక్ట్‌తో శ్రావణం మూగబోయే పరిస్థితి నెలకొంది. -
నైవేద్యంగా మద్యం బాటిళ్లు
అన్నానగర్: వర్షం కురవాలని, కన్నవారు మద్యం సేవించకూడదని మదురై వీరన్‌స్వామికి మద్యం బాటిళ్లను పెట్టి చిన్నారులు ప్రత్యేక పూజలు చేశారు. ఇంకా గ్రామంలో ఎవరూ మద్యం తాగకూడదని కన్నవారి కాళ్లకు నమస్కరించారు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. దిండుక్కల్ జిల్లా వేడచందూర్ సమీపంలోని ఇ.చిత్తూర్లో మదురైవీరన్ ఆలయం ఉంది. ఇక్కడ పూర్తిగా కూలీలే నివసిస్తూ వస్తున్నారు. ఇక్కడ కొన్నేళ్లుగా వర్షం కురవడంలేదు. మద్యానికి బానిసలై పలువురు దీనస్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన చిన్నారులు, వర్షం కురవాలని, ఎవరు మద్యం సేవించకూడదని వారి కులదైవం మదురైవీరన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందుకోసం చిన్నారులు చందాలు సేకరించారు. ఆదివారం మేళ, తాళాలతో మద్యం బాటిళ్లు, పూజా వస్తువులను చిన్నారులు ఊరేగింపుతో ఆలయానికి తీసుకొచ్చారు. మద్యం బాటిళ్లను మదురైవీరన్‌కి నైవేద్యంగా పెట్టారు. పొంగలి పెట్టి పూజలు చేశారు. నైవేద్యంగా పెట్టిన మద్యం బాటిళ్లను ఆలయం ముందు పోసి ఎవరు మద్యం సేవించకూడదని, వర్షం కురవాలని చిన్నారులు ప్రార్థించారు. తరువాత కన్నవారి కాళ్ల మీద పడి నమస్కరించారు. -
పురుషుల కోసం ప్రత్యేక పూజలు
సాక్షి, చెన్నై: తై మాసం ఆవిర్భావంతో పురుషులకు ప్రమాదం పొంచివున్నట్లు వదంతులు వ్యాపించడంతో విళ్లుపురం పరిసర ప్రాంతాల మహిళలు తమ ఇళ్ల ముంగిట దివ్వెలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తై మాసం మొదటి రోజు, తమిళుల పొంగల్ పండుగ రోజున ప్రజలు ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవడం ఆనవాయితీ. దీంతో ఆదివారం పొంగల్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆరోజు సాయింత్రం 5.09 గంటలకు ఉభయ లగ్నంలో సూర్యుడు అస్తమించే సమయాన తై మాసం అవిర్భవించింది. ఇది ఘోర అనే దేవత ద్వారా రాజగోపలంలో తూర్పు వైపుగా పుట్టిందని, ఈ కారణంగా ఇళ్లలోని పురుషులకు ప్రమాదమని, దీంతో మహిళలు పరిహార పూజలు చేయాలన్న వదంతులు విళ్లుపురం పరిసర ప్రాంతాల్లో ప్రాంతంలో గత రెండు రోజులుగా వ్యాపించాయి. దీంతో ఈ ప్రాంతాల మహిళలు తమ ఇళ్ల ముంగిట దివ్వెలను వెలిగించి ఇళ్లలో పరిహార పూజలు చేస్తున్నారు. -
నేడు వైకుంఠ ఏకాదశి
-
రామయ్యకు సువర్ణ పుష్పార్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారికి ఆదివారం సువర్ణపుష్పార్చనను వైభవంగా నిర్వహించారు. ఆదివారంను పురష్కరించుకొని తొలుత అంతరాలయంలో మూలవరులకు అభిషేకం, అనంతరం సువర్ణపుష్పార్చనను గావించారు. ఆ తదుపరి బేడా మండపంలో నిత్య కల్యాణోత్సవంను కన్నులపండువగా జరిపారు. వేడుకలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని భద్రుని మండపంలో స్వామి వారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. పవిత్ర గోదావరి నది నుంచి అర్చకులు, ఆస్థాన విద్యాంశుల మంగళవాయిద్యాల నడుమ తీసుకొచ్చిన గోదావరి పుణ్య జలాలతో భద్రునిగుడి లో స్వామి వారిపాదుకుల వద్ద అభిషేకం నిర్వహించారు. శ్రీసీతారామచంద్రస్వామి వారి మూర్తులకు అంతరాలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పల్లకిపై మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఆలయ ప్రాకార మండపంలో ఆశీనులు చేసిన స్వామివారికి ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. శ్రీసీతారాముల వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామి వారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల వేద మంత్రోచ్చరణల మధ్య అర్చకులు అత్యంత వైభవోపేతంగా రామయ్యకు నిత్యకల్యాణం జరిపించారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు స్వామి ప్రసాదాలను అందజేశారు. అదే విధంగా అంతరాలయంలో స్వామి వారి దర్శనం కల్పించారు. -
వనభోజనాల సందడి
– ఉసిరి చెట్టుకు పూజలు - ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు – హాజరైన ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నాయకులు కర్నూలు(అర్బన్): జిల్లాలో ఆదివారం కార్తీక వనభోజనాల సందడి కనిపించింది. వివిధ కులాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు, రాజకీయ ప్రముఖులతో ఆయా ప్రాంతాలు కళకళలాడాయి. పద్మశాలి, కురువ, యాదవ, వాల్మీకి, రజక, బ్రాహ్మణ, కుర్ణి (నేసే) తదితర కులాలకు చెందిన సంఘాలు వన భోజన కార్యక్రమాలను నిర్వహించాయి. ప్రజాప్రతినిధిలతోపాటు కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు. మహిళలు రాజకీయంగా ఎదగాలి: ఎంపీ బుట్టా రేణుక మహిళలు రాజకీయంగా ఎదగాలని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక అన్నారు. నగర శివారులోని వెంగన్నబావి సమీపంలో కుర్ణి (నేసె) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, రిటైర్డు తహసీల్దార్ సీబీ అజయ్‌కుమార్, సంఘం జిల్లా అధ్యక్షుడు బి. వాసుదేవయ్య, దైవాచారం, వనభోజన కార్యక్రమ సభ్యులు చెన్నప్ప, మల్లికార్జున, శేఖర్, సి. నాగరాజు, కేపీ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ... వాల్మీకి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాలు స్థానిక వెంగన్నబావి సమీపంలో జరిగాయి. సంఘం జిల్లా అధ్యక్షుడు బుర్రా ఈశ్వరయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు, వీఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సుభాష్ చంద్రబోస్, కానాల వెంకటేశ్వర్లు, కుభేరస్వామి, శ్రీనివాసులు, చిత్రసేనుడు, బాలసంజన్న, మాజీ జెడ్పీటీసీ వలసల రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో ... జిల్లా కురువ సంఘం ఆధ్వర్యంలో నందికొట్కూరు రోడ్డులోని కేవీఆర్ ఫంక్షన్హాల్లో కురువల 14వ కార్తీక వనభోజనాలు జరిగాయి. ముందుగా కనకదాసు చిత్రపటానికి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకట్రాముడు, బళ్లారి మాజీ డిప్యూటీ మేయర్ శశికళా క్రిష్ణమోహన్, సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు డా.టీ పుల్లన్న, కార్యదర్శి ఎంకే రంగస్వామి, కోశాధికారి కేసీ నాగన్న, మాజీ ఎంపీపీ పెద్ద అమీన్ తదితరులు పాల్గొన్నారు. వీరశైవ లింగాయతీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ... నగర వీరశైవ లింగాయతీ సంక్షేమ సంఘం (గౌళీ) ఆధ్వర్యంలో కర్నూలు మెడికల్ కళాశాల మైదానంలోని నీలకంఠేశ్వర స్వామి దేవాలయ ఆవరణలో కార్తీక వనభోజన కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా నీలకంఠేశ్వర స్వామికి, ఉసిరి చెట్టుకు పూజలు నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యాక్రమాలు, ఆటలపోటీలు నిర్వహించారు. యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ... యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్థానిక నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని దేవీ ఫంక్షన్హాల్లో యాదవులు కార్తీక వనభోజన కార్యాక్రమాలను నిర్వహించారు. ఆదర్శ కళాశాల అధినేత తిమ్మయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇంజనీరు తిమ్మయ్య, సమితి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యన్నయాదవ్, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావుయాదవ్, సమాజ్‌వాది పార్టీ జిల్లా అధ్యక్షుడు దండు శేషుయాదవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మద్దిలేటియాదవ్, నాయకులు శేషఫణి, సింధు నాగేశ్వరరావు, డా.వెంకటరమణ, డా.జీవీ క్రిష్ణమోహన్, డా.శ్రీనివాసులు, డా.నాగేశ్వరయ్య, డా.వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం ఆధ్వర్యంలో ... రజకుల 5వ కార్తీక వనభోజన కార్యక్రమాలు వెంగన్నబావి సమీపంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఏపీ రజక సంఘం లీగల్ సెల్ అధ్యక్షుడు కంభంపాటి కోటేశ్వరరావు మాజరయ్యారు. ఈ సందర్భంగా 10, ఇంటర్లో మంచి మార్కులు సాధించిన రజక విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు సీపీ వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సీహెచ్ లింగమయ్య, నాయకులు శంకర్, రాజు, గణేష్, నరసింహులు, బీసన్న తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ... పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో లయన్ కొంకతి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆదర్శ కళాశాల మైదానంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎంపీ బుట్టా రేణుక, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్‌భాస్కర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ భరత్ హాజరయ్యారు. సంఘం కార్యదర్శి విజయకాంత్, వెంకటసుబ్బయ్య, దవరథరామయ్య, ప్రముఖ నేత్ర వైద్యులు డా.చెన్నా ఆంజనేయులు, కస్తూరి ప్రసాద్, భావనారాయణ, కాంచానం బాలాజీ, మహిళా విభాగం అధ్యక్షురాలు యు భారతీ తదితరులు పాల్గొన్నారు. -
కార్తీకం..శుభప్రదం
– రేపటి నుంచి కార్తీకమాసం – సోమవారంతో మొదలు - సోమవారమే వచ్చిన పౌర్ణమి, అమావాస్య // న కార్తీకసమో మాసో న కృతేన సమం యుగమ్/న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్// కార్తీకమాసంతో సమానమైన మాసము, కృతయుగముతో సరిౖయెన యుగము, వేద సదృశమైన శాస్త్రము, గంగా సమానమైన తీర్థము లేవు. కార్తీకమాసంలో చేసిన జప, హోమ, దానములు, శివాభిషేకములు, విష్ణుపూజలు, విశేష ఫలప్రదములు. కార్తీకమాసం పాడ్యమి(31–10–2016) నుంచి పాడ్యమి(29–11–2016) వరకు నెలరోజులు అత్యంత విశేషమైనది. శివకేశవులకు ఈ నెల ప్రీతికర. సంవత్సరంలో వచ్చే అన్ని మాసాల కన్నా ఈ కార్తీకమాసం అత్యంత అధిక ఫలదాయకమైనదని పురాణాల్లో చెప్పబడింది. ఈ సారి ప్రత్యేకం.. ఈ ఏడాది కార్తీకమాసం సోమవారంతో మొదలవడం విశేషం. అలాగే కార్తీకపౌర్ణమి, అమావాస్య కూడా సోమవారం రావడం చాలా అరుదు. ఇలాంటి అరుదుగా వచ్చే కార్తీక మాసం సహస్రాధికమైన ఫలాన్ని ఇస్తుందని మహానంది దేవస్థానం వేదపండితులు రవిశంకర అవధాని తెలిపారు. ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయడం అత్యంత శక్తిదాయకమన్నారు. మహానంది క్షేత్రంలో గంగాదేవి(రుద్రగుండం కోనేరు), ఈశ్వరుడు ఇద్దరూ ఉన్నారని, యధాశక్తి దీపారాధన చేయడం ద్వారా అనంతమైన ఫలం లభిస్తుందని చెప్పారు. నియమాలివి.. కార్తీక సోమవారం పగలు అంతా ఉపవాసం చేసి రాత్రి నక్షత్ర దర్శనానంతరం భోజనం చేస్తూ ఆ రోజంతా భగవధ్యానంలో గడిపేవాళ్లు శివసాయుజ్యం పొందుతారని సూత ఉవాచ. ఈ మాసంలో ఏకభుక్తం, నక్తభోజనం చేస్తారు. అయితే నక్తం ఉండలేనివారు ఒక కార్తీక పౌర్ణమి రోజు అయినా ఉన్నా ఎంతో పుణ్యం. కార్తీకమాసం అంతా తెల్లవారుఝామునే స్నానం చేయాలి. అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్ర వేళల్లో ఆవునేతితో లేదా నువ్వులనూనెతో దీపారాధన చేసి అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అర్చనలు చేయడం వలన మహాపుణ్యం లభిస్తుంది. ఈ నెలలో ఎక్కడైతే మహావిష్ణువును పూజిస్తారో అక్కడ భూత, పిశాచ, గ్రహగణాలు దూరంగా ఉంటాయి. శివుడికి ప్రీతికరమైన జిల్లేడు పూలతో పూజిస్తే దీర్ఘాయులై మోక్షాన్ని పొందుతారు. వనభోజనం .. కార్తీకమాసంలో వనభోజనాలది ప్రత్యేకత. ఉసిరిచెట్టు క్రింద శ్రీ మహావిష్ణువు ఫోటో పెట్టి పూజించడంతో పాటు అదే చెట్టు క్రింద సహపంక్తి భోజనాలు చేయాలి. గోమాతను పూజించాలి. తులసీదళాలతో శ్రీ మహావిష్ణువును కార్తీకమాసంలో పూజిస్తే ముక్తిదాయకం అని శాస్త్ర వచనం. ఈ మాసంలో విష్ణువు దామోదర నామంతో పిలవబడతాడు. కార్తీక దామోదర ప్రీత్యర్థం అని ఈ మాసాన వ్రత దీక్ష ఆచరించాలి. తులసీ చెంత హరిపూజ పుణ్యప్రదం. సత్యనారాయణ వ్రతం, విష్ణుసహస్రనామ పారాయణం, కార్తీకపురాణం రోజుకో అధ్యాయం పారాయణం చేయడం శుభకరం. గృహిణులు, యువతులు వేకువనే స్నానం చేసి తులసీకోట ముందు దీపారాధన చేసి గౌరీదేవిని పూజిస్తే ఈశ్వరానుగ్రహంతో సౌభాగ్యాన్ని, సకల శుభాలను పొందుతారు. -
పవిత్రోత్సవాలకు అంకురార్పణ
రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు పెంచలయ్యస్వామి మాట్లాడారు. పవిత్రోత్సవాలు మూడు రోజల పాటు జరుగుతాయని చెప్పారు. స్వామివారికి ప్రత్యేకంగా పట్టుతో తయారు చెసిన పవిత్ర మాలలకు వివిధ పూజలు నిర్వహించి స్వామి వారి మీద ఉంచి అభిషేకం చేస్తారని వివరించారు. మంగళవారం రాత్రి స్వామి వారి అలంకార మండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల నుంచి పుట్టమట్టిని తీసుకొచ్చి అందులో నవధాన్యాలను కలిపి విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. దేవస్థాన అధ్యక్షుడు నానాజీ, పాలకవర్గ సభ్యులు సోమయ్య, టీటీడీ పాంచరాత్ర ఆగమపండితుడు రామానుజాచార్యుల స్వామి, అర్చకులు చందుస్వామి, శశిస్వామి, నాగరాజస్వామి, ఉభయకర్త అమరా శ్రీరాములుశెట్టి, తదితరులు పాల్గొన్నారు. -
గజాననా..
వైభవంగా నవరాత్రి ఉత్సవాలు గణనాథునికి లక్ష పుష్పార్చన జోరుగా అన్నదాన కార్యక్రమాలు మెదక్ మున్సిపాలిటీ: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మెదక్ పట్టణంలోని పలు వీధుల్లో ఏర్పాటుచేసిన వినాయక మండపాల వద్ద ప్రజలు ప్రతినిత్యం భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. గణనాథునికి నైవేద్యాన్ని సమర్పిస్తూ..తమ భక్తిని చాటుకుంటున్నారు. ఇందులో భాగంగా మంగళవారం పెద్ద బజార్‌లోని కళాజ్యోతి గణేశ్ మండలి వద్ద లక్షపుష్పార్చన చేశారు. జంబికుంటలోని శ్రీ సూర్యగణేశ్ మండలి వద్ద గణపతిహోమం నిర్వహించి భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు మధు, గంగాధర్, కృష్ణయాదవ్, ఆనంద్, విక్రమ్, శ్రీధర్, బాబు, సంతోష్, సంగమేశ్వర్, ప్రభు, రాజేష్, రవీందర్, శ్రీకాంత్‌తోపాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోరుగా అన్నదాన కార్యక్రమాలు పట్టణంలోని పలు వినాయక మండపాల వద్ద జోరుగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఫతేనగర్‌లోని శివరాజ్ గణేశ్ మండలి ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆజంపురాలోని చైతన్య బాల గణేశ్ మండలి వద్ద ఉత్సవ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఉత్సవ కమిటీ సభ్యులు కాసకిట్టు, జగన్, సైదులు, వంశీ, వెంకట్, నరేష్, యాదగిరి, భూదేష్, శ్రీను, రాము, నాగరాజు, బాలరాజ్, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
పంచమఠాల్లో రుద్రాభిషేకాలు
శ్రీశైలం: పంచమఠాల్లోని శివలింగ స్వరూపాలకు లోక కల్యాణార్థం బుధవారం శాస్త్రోక్తంగా రుద్రాభిషేకాలను నిర్వహించారు. జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ శివాచార్య స్వామీజీ సూచనల మేరకు వీరశైవ గురుకుల పాఠశాల వ్యవస్థాపకులు దానయ్యస్వామి చిత్రపటానికి ప్రత్యేకç ³Nజలు చేసి ఊరేగింపుగా పంచమఠాలకు చేరుకున్నారు. అక్కడి శివలింగాలకు నమకచమకాలతో శాస్త్రోక్తంగా ఆగమ పాఠశాల విద్యార్థులు అభిషేకాలను నిర్వహించారు. శ్రావణమాస అనుస్థానంలో భాగంగా ప్రతి ఏడాది చివరి బుధవారాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా జగద్గురు స్వామీజీ ఆదేశించినట్లు గురుకులపాఠశాల నిర్వాహకులు మల్లికార్జునస్వామి తెలిపారు. -
ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు గండేడ్ : శ్రావణమాస చివరి శనివారాన్ని పురస్కరించుకుని మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని గంగర్లపాడు ఆంజనేయస్వామి, రామాలయం, గాధిర్యాల్ వీరహనుమాన్, గండేడ్, పగిడ్యాల్ కృష్ణతాత ఆలయం, వెన్నాచేడ్ సాయిబాబా ఆలయం, రామాలయం, రంగారెడ్డిపల్లి గట్టు చెన్నరాయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గట్టు చెన్నరాయుని ఆలయం దగ్గరికి వెళ్లి భక్తులు ఉదయం 5గంటల సమయంలో రథోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం తమ ఉపవాస దీక్షలను విరమించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
పెద్దమ్మగుడిలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 62వ జన్మదినోత్సవం సందర్భంగా బుధవారం పెద్దమ్మగుడిలో జన్మదిన వేడుకులు ఘనంగా జరిగాయి. పెద్దమ్మగుడిలో అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దమ్మగుడిలో టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కార్యకర్తలు, అభిమానుల మధ్య కేసీఆర్ కేక్ కట్ చేశారు. -
ప్రత్యేక సేవలు, దర్శనాలు రద్దు
సాక్షి, తిరుమల: ఈనెల 14 నుంచి 22వ తేదీ వరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా అన్ని రకాల ఆర్జిత సేవలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, వృద్ధుల ప్రత్యేక దర్శనాలు, గదుల అడ్వాన్స్ బుకింగ్ రద్దు చేసినట్టు జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు వెల్లడించారు. శుక్రవారం సీవీఎస్వో నాగేంద్రకుమార్, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, ఎస్ఈ-2 రామచంద్రారెడ్డితో కలసి ఆలయ వీధుల్లో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఆలయ మాడ వీధుల్లో పటిష్టమైన గ్యాలరీలు, బారికేడ్లు నిర్మించామని తెలిపారు. 18వ తేదీ గరుడ వాహన సేవ రోజున ద్విచక్ర వాహనాలను వేకువజాము ఒంటిగంట నుంచి 19వ తేదీ ఉదయం 10 గంటల వరకు అనుతించేది లేదన్నారు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామని తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గోపీనాథ్‌జెట్టి తెలిపారు. -
తిరుచానూరు ఆలయంలో సామూహిక వ్రతాలు