
ఘనంగా శ్రావణమాస ఉత్సవాలు
భక్తులతో కిటకిటలాడిన దేవాలయాలు
గండేడ్ : శ్రావణమాస చివరి శనివారాన్ని పురస్కరించుకుని మండలంలోని ఆయా గ్రామాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మండలంలోని గంగర్లపాడు ఆంజనేయస్వామి, రామాలయం, గాధిర్యాల్ వీరహనుమాన్, గండేడ్, పగిడ్యాల్ కృష్ణతాత ఆలయం, వెన్నాచేడ్ సాయిబాబా ఆలయం, రామాలయం, రంగారెడ్డిపల్లి గట్టు చెన్నరాయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గట్టు చెన్నరాయుని ఆలయం దగ్గరికి వెళ్లి భక్తులు ఉదయం 5గంటల సమయంలో రథోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం తమ ఉపవాస దీక్షలను విరమించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.