శ్రావణ మాసం వస్తోంది. అసలే పెళ్లిళ్ల సీజన్. అదీకాక శుభకార్యాలు అధికంగా జరిగేది ఈ నెలలోనే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా శుభవార్త. అది ఏంటంటే..
ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపును అమలు చేయడంతో బంగారం ధరలు 9% తగ్గుతాయని అంచనా. తాజా బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తవడంతో గురువారం నుంచి తక్కువ ధరలో బంగారం మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది.
కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం కొన్ని రోజులుగా బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి నుంచి బంగారం ధరలు రూ.4,000 మేర తగ్గాయి. అయితే అవసరమైన కస్టమ్స్ విధానాల కారణంగా ప్రకటన అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీలన్నీ పూర్తయినందున సవరించిన దిగుమతి సుంకం ప్రకారం బయటి నుంచి బంగారం భారత్ చేరుకోవడం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1 నుంచి రిటైల్ అమ్మకానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
ఎంత మేర తగ్గుతాయి?
కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టిందని ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి తగ్గిన దిగుమతి సుంకం ప్రకారం బంగారం దేశంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది రిటైల్ బంగారం ధరలపై ప్రభావం చూపనుంది. దిగుమతి సుంకంలో 9% తగ్గింపుతో తులం (10 గ్రాములు) బంగారంపై రూ. 5,000 నుంచి రూ. 6,000 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.
దిగుమతి సుంకం తగ్గింపు బంగారం బ్లాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని యోగేష్ సింఘాల్ పేర్కొన్నారు. అధిక సుంకం కారణంగా ఆభరణాల వ్యాపారులు అక్రమ దిగుమతి పద్ధతులు అవలంభించేవారు. దీంతో ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసేవారు. ఈ రూపంలో వినియోగదారుల నుంచి 15% వసూలు చేసేవారు. ఇప్పుడు సుంకం తగ్గడంతో అక్రమ పద్ధతులకు నగల వ్యాపారులు స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. దీంతో ఆ అదనపు భారం కూడా కస్టమర్లపై తగ్గుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment