ద్వారక: ఆరేబియా సముద్ర గర్భంలోని ద్వారకా నగరాన్ని మోదీ ఆదివారం దర్శించుకున్నారు. గుజరాత్‌లోని ద్వారక పట్టణ తీరంలో పాంచ్‌కుయి బీచ్ నుంచి స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర అడుగు భాగానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి కాసేపు గడిపారు. ‘‘సముద్ర గర్భంలో భగవంతుడికి పూజలు చేయడం అద్భుతమైన అనుభూతి! సాక్షాత్తూ దేవుడి సన్నిధిలో గడిపినట్లుగా ఉంది’’ అన్నారు. తెల్లని డైవింగ్ హెల్మెట్ ధరించి నేవీ సిబ్బంది సాయంతో స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోకి చేరుకున్నారు.
కృష్ణుడికి పూజలు చేసి నెమలి పింఛాన్ని సమర్పించుకున్నారు. అనంతరం తన అనుభవాన్ని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఫొటోలను సైతం పంచుకున్నారు. ఇది సాహసం కంటే ఎక్కువని, ఇదొక విశ్వాసమని పేర్కొన్నారు. అనంతరం గుజరాత్‌లో ఒక సభలో మాట్లాడారు. సముద్రంలో ప్రాచీన ద్వారకా నగరాన్ని చేతల్లో తాకగానే, 21వ శతాబ్దపు వైభవోపేత భారతదేశ చిత్రం తన కళ్ల ముందు మెదిలిందని తెలిపారు.
సముద్ర గర్భంలో కనిపించిన ద్వారక దృశ్యం దేశ అభివృద్ధి పట్ల తన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసిందని వివరించారు. ఆధ్యాతి్మక వైభవంతో కూడిన ప్రాచీన కాలంలో అనుసంధానమైనట్లు భావించానని చెప్పారు. శ్రీకృష్ణుడు మనందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రాచీన ద్వారకా నగరాన్ని సందర్శించాలన్న తన దశాబ్దాల కల నెరవేరిందని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. గుజరాత్ సముద్ర తీరంలో ద్వారక పట్టణంలోని శ్రీకృష్ణుడి ఆలయంలోనూ మోదీ పూజలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment