మనోహరం.. మహిమాన్వితం | Shiva temples that are getting ready for Shivratri pujas | Sakshi
Sakshi News home page

మనోహరం.. మహిమాన్వితం

Published Mon, Feb 28 2022 5:54 AM | Last Updated on Mon, Feb 28 2022 8:58 AM

Shiva temples that are getting ready for Shivratri pujas - Sakshi

అడ్డాపుశీలలో శివుని విగ్రహం

సర్వజనులకు శుభాలనిచ్చేవాడు శుభంకరుడైన శివుడు. దేవతలకూ దేవుడై మహాదేవుడయ్యాడు. క్షీరసాగర మధనంలో విషాన్ని తన గళంలో నిలిపిన శివుడు నిద్రిస్తే విషం ఒళ్లంతా వ్యాపిస్తుందని దేవతలు ఐదు జాముల పాటు ఆడిపాడి, శివుణ్ని మేల్కొనేలా చేసిన రోజే శివరాత్రి. శివపార్వతుల కల్యాణం, శివలింగోద్భవం కూడా ఇదే రోజున జరిగినట్టు శాస్త్రం చెబుతోంది. శివరాత్రి వేళ అభిషేకం, అర్చన, ఉపవాసం, జాగరణతో మంత్రాక్షరిని పఠిస్తే శివానుగ్రహం కలుగుతుందన్నది భక్తుల నమ్మకం. మార్చి 1న జరిగే శివరాత్రి పూజలకు విజయనగరం జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. మారేడుదళపతికి మనసారా అర్చనలు జరిపేందుకు భక్తలోకం సన్నద్ధమవుతోంది.  
– సాక్షి నెట్‌వర్క్, విజయనగరం   

భక్తసిరి ‘పుణ్య’గిరి  
ఎస్‌.కోట పట్టణానికి కూతవేటు దూరంలో ఉంది పుణ్యగిరి. జలపాతాల నుంచి జాలువారే నీటి సవ్వడి,  మర్కట మూకల సందడి, çపురాణాలతో ముడిపడి, ఉమాకోటిలింగేశ్వరుడు కొలువుదీరిన క్షేత్రం పుణ్యగిరి. విరాటరాజ్య రక్షకుడైన కీచకుడు కొలువుదీరిన శృంగారపుకోట కాలక్రమంలో శృంగవరపుకోటగా మారింది. సైరంధ్రి పేరుతో ఉన్న ద్రౌపదిని బలాత్కరించబోయి భీముని చేతిలో నిహతుడైన కీచకునికి ముక్తి ప్రసాదించమని సోదరి సుదేష్ణ కోరిక మేరకు ధర్మరాజు శివుని ప్రార్థించగా, శివుని శిరోపాయల నుంచి వెలువడిన ధార నేటికీ భూగర్భంనుంచి వస్తూ శివలింగాన్ని స్పృశిస్తుంది. అదే పుట్టుధార, శివధారగా వాసికెక్కింది.

కొండ శిలకు అంటిపెట్టుకుని భూమికి అథోముఖంగా ఉన్న లింగాల నుంచి నీటి బిందువులు పడుతుంటాయి. పూర్వం ఈ నీరంతా ఒకే చోట పడేందుకు గొడుగులు కట్టడంతో దీనిని గొడుగులధారగా భక్తులు పిలవనారంభించారు. కీచకుని అస్థికలను ఇక్కడే నిమజ్జనం చేశారని, ఇక్కడ అస్థినిమజ్జనం చేస్తే చనిపోయిన వారికి సద్గతులు కలుగుతాయన్న నమ్మకం ప్రబలంగా ఉంది. పుణ్యగిరిలో ఉమాకోటిలింగేశ్వరుడు, పుట్టుధార, పార్వతీదార, కోటిలింగాల రేవు, త్రినాథగుహ, ధారగంగమ్మలోయ, బూరెలగుట్ట వంటి స్థలాలు ఉన్నాయి. శివరాత్రి వేళలో రెండురోజుల పాటు జరిగే జాతరలో పుణ్యగిరికి పొరుగు జిల్లాలు, రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తుతారు. 

చరిత్రాత్మకమైన చాతుర్లింగేశ్వరాలయం  
బలిజిపేట మండలంలోని నారాయణపురం గ్రామంలో ఉన్న చాతుర్లింగేశ్వర దేవాలయం అపురూప శిల్ప సంపద, రాతికట్టడాలకు నెలవు. 11వ శతాబ్దంలో ఆలయాన్ని నిర్మించారు. రాతి కట్టిన నీలకంఠేశ్వర, సంగమేశ్వర, మల్లికార్జున, శ్రీనీలేశ్వర ఆలయాలు ఒకే ప్రాంగణంలో ఉండడం ఇక్కడ ప్రత్యేకత. దేవాలయ స్తంభాలపై ఉండే శాసనాలు, ఆలయాలపై ఉండే చెక్కడాలు ఆనాటి చరిత్రకు ఆధారాలుగా నిలిచాయి. గళావళ్లి గ్రామంలో కామలింగేశ్వర ఆలయం 11వ శతాబ్దపు నిర్మాణశైలికి ప్రతీకగా నిలిచింది. తూర్పుగాంగరాజులలో అగ్రగణ్యుడైన అనంతవర్మ చోడగంగ (కీ.శ 1176–1174), కస్తూరీ కామోదినుల కుమారుడైన కామఖ్కవుని (కీ.శ 1147–1156) పేరున ఈ ఆలయం నిర్మించినట్టు శాసనాలు చెబుతున్నాయి.  

పుణ్యగిరిలో  ఉమాకోటిలింగేశ్వరుడు 

ధాన్యంతో వచ్చిన దయామూర్తి  
జైపూర్‌ నుంచి నాటుబళ్లతో ధాన్యం తెస్తుండగా  ధాన్యం బస్తాల్లో నీలకంఠేశ్వరస్వామి విగ్రహం 250 యేళ్ల కిందట సీతానగరం మండలం నిడగల్లుకు చేరింది. ధాన్యంతో వచ్చిన దయామయుౖడైన శివునికి నిడగల్లు గ్రామ శివార్లలో శనపతి పాత్రుడు కుటుంబీకులు ఆలయాన్ని నిర్మించారు. నిత్య ధూపదీప నైవేద్యాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఏటా శివరాత్రి పర్వదినాన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం ఇటీవల రూ.50లక్షలు మంజూరు చేసింది.
 
సంగమ క్షేత్రం సోమేశ్వరాలయం  
నాగవళి–జంఝావతి నదుల సంగమ క్షేత్రం గుంప సోమేశ్వరాలయం. ఉత్తరాంధ్ర సిగలో వెలిసిన ప్రసిద్ధ శైవక్షేత్రం. కొమరాడ మండలం కోటపాం పంచాయతీ దేవుని గుంపలో ఉన్న ఆలయానికి ఘన చరిత్ర ఉంది. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడు గోహత్య దోష నివారణ కోసం నదీ తీరాన ఐదు శివలింగాలు ప్రతిష్టించాడని, బలరాముడు తన నాగలితో దున్నడంతో నాగావళి నది ఏర్పడిందని, మార్గంమధ్యలో అటంకాలు ఎదురైన చోట శివలింగాలను ప్రతిష్టించినట్లు చరిత్ర చెబుతోంది. అలా, నది వెంబడి ఒడిశా రాష్ట్రంలో పాయకపాడులో భీమేశ్వరుడు, దేవునిగుంపలో సోమేశ్వరుడు, వంగర మండలం సంగాం వద్ద సంగమేశ్వరుడు, శ్రీకాకుళం వద్ద రుద్రకోటేశ్వరుడు, కళ్లేపల్లి వద్ద శ్రీనాగేశ్వరునిగా పూజలు  అందుకుంటున్నాడు. వీటిలో దేవుని గుంపలో సోమేశ్వరుడుని దర్శిస్తే కాశీయాత్ర ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. సోమేశ్వరుని దర్శించి తోటల్లో వనభోజనాలు చేయడం ఈ ప్రాంతీయుల ఆనవాయితీ.  

సంతానం ప్రాప్తిని కలిగించే సన్యాసేశ్వరుడు  
సంతానసిద్ధి కలిగించే గొప్ప క్షేత్రంగా శృంగవరపుకోట మండలంలో ధర్మవరం పంచాయతీలో సన్యాసయ్యపాలెంలోని సన్యాసేశ్వర ఆలయం పేరుగాంచింది. 15వ శతాబ్దంలో ఒక సన్యాసి కాశీయాత్రకు వెళ్తూ ధర్మవరంలో మజిలీ చేయగా, గ్రామస్థులు తమ పిల్లలను ఏదో శక్తి చంపేస్తోందని మొర పెట్టుకోగా ఆయన తన మంత్రబలంతో శక్తిని బంధించి, ఆలయంలో సంతానగోపాల యంత్రం, బైరవ యంత్రాలను ప్రతిష్టించినట్టు చరిత్ర. నాటి నుంచి సంతానం లేనివారు సన్యాసేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించి, పూజలు చేస్తే సంతానవంతులు అవుతారని ప్రగాఢ విశ్వాసం. శివరాత్రి వేళ పుణ్యగిరి జాతరకు వచ్చిన భక్తులు సన్యాసేశ్వరున్ని దర్శిస్తారు.  

మహాశివరాత్రికి 160 ప్రత్యేక బస్సులు  
విజయనగరం టౌన్‌:  మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో 160 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు రీజనల్‌ మేనేజరు ఆకాశపు విజయకుమార్‌ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మార్చి ఒకటి, రెండు తేదీల్లో భక్తులకు అనుగుణంగా నెక్‌ రీజియన్‌లో అన్ని డిపోల నుంచి ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక బస్సులు ఉంటాయన్నారు.   పార్వతీపురం–గుంప మధ్య 10 బస్సులు, సాలూరు–పారమ్మ కొండకు 25, ఎస్‌.కోటలోని పుణ్యగిరికి 30, విజయనగరం–రామతీర్థం 35, పాలకొండ–రామతీర్థం 17, శ్రీకాకుళం–రామతీర్థం 35, టెక్కలి–రావివలసకు 8 బస్సులు కలిపి మొత్తం 160 బస్సులు నడుస్తాయన్నారు. భక్తులంతా సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అద్భుతం అడ్డాపుశీల క్షేత్రం 
ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిల నందీశ్వరుని విగ్రహం పార్వతీపురం మండలంలోని అడ్డాపుశీల కాశీవిశ్వేశ్వరుని ఆలయ ప్రత్యేకత. శివరాత్రి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలు చేస్తారు. ప్రాచీన కాలం నుంచి అర్చకులుగా ఒడియా బ్రాహ్మణులు కొనసాగుతున్నారు. కాశీనుంచి తీసుకొచ్చిన గంగాజలంతో శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు.

ప్రాచీనం.. నగిరేశ్వరాలయం... 
బొబ్బిలి మండలంలో పెంట గ్రామంలో ఉన్న నగిరేశ్వరాలయం 200 యేళ్లనాటిది. ఆలయంలో నగిరేశ్వరుడు స్వయంభువు కావడం ఇక్కడి విశేషం.  చిత్రకోట బొడ్డవలస పంచాయతీ పరిధిలోని దేవుడిబొడ్డవలస మానసాదేవి ఆలయంలో పురాతన విగ్రహాలు పూజలు అందుకుంటున్నాయి. కలువరాయిలో రమణమహర్షి ఆశ్రమంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement