
మైసూరు: మైసూరు ఉత్సవాలు దేశ ఘన సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దసరా వంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పారు. ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు. చాముండి కొండపై మైసూరు రాచవంశీకుల ఆరాధ్యదైవం చాముండేశ్వరి విగ్రహంపై పూలు చల్లుతూ వేద మంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు చేశారు. ఇటీవలి కాలంలో మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్మునే.
మైసూరు పట్టుచీరలో రాష్ట్రపతి
ఈ సందర్భంగా రాష్ట్రపతి మైసూరులో తయారైన తెలుపు రంగు బంగారు జరీ గీతల అంచుతో కూడిన పట్టుచీరను ధరించారు. ఆమె కోసం దీన్ని ప్రత్యేకంగా నేయించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక బుడకట్టు గిరిజన కళాకారుల నృత్యాలను ఆమె ఆసక్తిగా తిలకించారు.
విద్యుత్‌కాంతులతో మైసూరు
కరోనా నేపథ్యంలో మైసూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండేళ్లు సాదాసీదాగా జరిగాయి. ఈ నేపథ్యంలో జానపద కళా రూపాలతో కర్ణాటక సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈసారి 9 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు ప్యాలెస్, వీధులు, భవనాలు, కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించింది. మైసూరులోని ప్రముఖ్య రాజప్రాసాదాలైన అంబా విలాస్ ప్యాలెస్, జగన్మోహన్ ప్యాలెస్ వంటి 8 చోట్ల 290 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది.
Comments
Please login to add a commentAdd a comment