Dussehra 2022
-
ఆస్టిన్‌లో ఉత్సాహంగా దసరా - దీపావళి వేడుకలు
టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్‌లో తెలుగు కల్చర్ అసోషియేషన్ ఆధ్వర్యంలో దసరా, దీపావళి పండుగల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వందలాది మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. సినీ గాయకులు గీత మాధురి ,అఖిల మమందుర్, ఆదిత్య ఐయాంగర్లు తమ పాటలతో ఉర్రూతలూగించారు. ఈ కార్యక్రమంలో టీసీఏ కమిటీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ బత్తుల ప్రెసిడెంట్ ఎలెక్ట్ అర్జున్ అనంతుల ,సెక్రెటరీ శ్రీనివాస్ బైరపనేని ,ట్రెజరర్ వెంకట్ సాదినేని , స్పోర్ట్స్ కమిటీ చైర్ పరమేశ్వర్ రెడ్డి నంగి, ఫైనాన్స్ సెక్రటరీ మధుకర్ , ఫుడ్ అండ్ లాజిస్టిక్స్ సెక్రటరీ చిన్నపరెడ్డి, మెంబర్షిప్ సెక్రటరీ భరత్ పిస్సాయ్ , కల్చరల్ సెక్రటరీ శైలజ మరియు బోర్డు అఫ్ డైరెక్టర్స్ వెంకటరామి రెడ్డి ఉమ్మ, రామ్ హనుమంత్ మల్లిరెడ్డి, మురళీధర్ రెడ్డి వేలూరు ధన్యవాదాలు తెలిపారు. -
టీడీఎఫ్ అట్లాంటా ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
అట్లాంటి తెలుగువారి తెలంగాణా సంప్రదాయ పండుగ బతుకమ్మను నాలుగువేల భారీ జనసందోహం మధ్య తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరుపుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన నిర్వహించిన బతుకమ్మ, దసరా ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకలు ఆరంభమైనాయి. తెలుగింటి ఆడుపడుచులు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు ఆహుతులను అలరించాయి. పిల్లలూ పెద్దలూ కలిసి వందకు పైగా కళాకారులు ప్రదర్శనలు నిర్వహించారు. ఆరుగంటలపాటు బతుకమ్మల ఆటపాటలతో సందడిగా సాగిన ఈ వేడుక, బతుకమ్మల నిమజ్జనంతో ముగిసింది. ఆకట్టుకునే బతుకమ్మలతో మహిళలు రెండువేల డాలర్ల వరకు క్యాష్ ప్రైజులు, డైమండ్ రింగ్, సిల్వర్ కాయిన్లు సిల్వర్ బౌల్ సెట్లు, వెరా బ్రాడ్లీ పర్సులు వంటి ఆకట్టుకునే ప్రైజులు గెల్చుకున్నారు. ఆహుతుల కోసం కాంప్లిమెంటరీ సాంప్రదాయ భోజనం ఏర్పాటు చేశారు వివిధ రకాల వెండర్ స్టాల్స్ ఏర్పాటు చేశారు. టీడీఎఫ్ కోర్ టీమ్ సమిష్టి కృషితో ఘనమైన బతుకమ్మ పండుగను నిర్వహించి విజయవంతం చేయటం గర్వంగా ఉందని టీడీఎఫ్ అట్లాంటా చాప్టర్ అధ్యక్షురాలు స్వప్న కస్వా కృషిని కొనియాడుతూ అలాగే ఈ కార్యక్రామానికి సహకరించిన మహిళలతోపాటు, కార్యక్రమ విజయవంతం చేసిన వాలంటీర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు. ఫోర్ ఓక్స్ ఇన్సూరెన్స్, పీచ్ క్లీనిక్, ర్యాపిడ్ ఐటీ, ఈఐయెస్ టెక్నాలజీస్, ఎవరెస్ట్ టెక్నాలజీస్ మొదలగు దాతలు స్పాన్సర్ చేయగా, టీడీఎఫ్ కోర్ టీమ్, అట్లాంటా చాప్టర్ కమిటీ, మరెందరో వాలంటీర్లు కలిసి ఈ కర్యక్రమాన్ని ఆద్యంతం రక్తి కట్టించారు. -
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
-
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వర్యంలో ఘనంతో బతుకమ్మ, దసరా వేడుకలు
చార్లెట్ తెలంగాణా సంఘం ఆధ్వరంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంగిలి పువ్వు బతుకమ్మ వేడుకను సెప్టెంబరు 25 వ తేదీన ఉత్తర చార్లెట్ లో ఉన్న జే ఎం రాబిన్సన్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో సద్దుల బతుకమ్మ, దసరా సంబరాలను అక్టోబర్ ఎనిమిదవ తేదీన దక్షిణ షార్లెట్‌లో లో గల కమ్యూనిటీ హౌస్ మాధ్యమిక పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ రెండు కార్యక్రమాలకు కొరకు తెలంగాణా సంఘం కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని పాఠశాల ప్రాంగణాలను సర్వాంగ సుందరంగా అందముస్తాబు చేశారు. ప్రాంతాల నుండి రంగు రంగుల పూలతో పేర్చి అందంగా తీర్చిదిద్దిన బతుకమ్మలతో చక్కగా ముస్తాబైన మహిళలు పిల్లలతో సహా వందల కుటుంబాలు తరలివచ్చారు. నోరూరించే తినుబండారాల దుకాణాలు ఒకపక్క, జిగెల్లుమనే ఆభరణాలు, వస్త్ర దుకాణాలు,ఇతర వ్యాపార పరిచయ వేదికలు అక్కడివారిని ఆకర్షించాయి. అనంతరం మహిళల కోలాటాలు, మేళతాళాలతో ఊరేగింపుగా బతుకమ్మలను తీసుకొచ్చారు. బతుకమ్మ ఆట పాటలుతో, గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పదడుగుల బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, పిల్లలు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని, సెల్పీలు, ఫోటోలతో సందడి చేశారు. తరువాత బతుకమ్మలను ఊరేగింపుగా ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన కొలనులో విడిచిపెట్టారు, తరువాత ముత్తయిదువలు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. సద్దుల బతుకమ్మ దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ జానపద గాయకుడు జనార్దన్ పన్నెల పాడిన పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. చార్లెట్ తెలంగాణా సంఘం వరుసా పదమూడో సంవత్సరం జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన చార్లెట్ తెలంగాణా సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి బోధ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. -
పండుగ ముగిసింది.. తిరుగు పయనం
బండెనక బండికట్టి పదహారు బండ్లు కట్టి పట్నం పోదాం.. అన్న విధంగా.. బారులు తీరిన వాహనాలు ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జాతీయ రహదారిపై కనిపించాయి. దసరా సెలవులు ముగియడంతో హైదరాబాద్ జంట నగరాల నుంచి స్వగ్రామాలకు వచ్చిన వారంతా తిరుగు పయనం కావడంతో వాహనాల రద్దీ ఏర్పడింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, యాదాద్రి భువనగిరి -
Mohammed Shami: షమీపై దారుణమైన ట్రోల్స్.. అతడు చేసిన తప్పేంటి?
Mohammed Shami- Dussehra- T20 World Cup 2022: సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులకు మరింత చేరువయ్యే అవకాశం దొరికింది. తమకు సంబంధించిన ప్రతీ అప్డేట్ను పంచుకోవడంతో పాటు.. పండుగ సమయాల్లో విష్ చేయడం పరిపాటిగా మారింది. అయితే, ఒక్కోసారి ఇలాంటి సమయాల్లో పోస్టులు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నా.. హేటర్స్ నుంచి మాత్రం అదే స్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. దసరా శుభాకాంక్షలు.. షమీపై ట్రోల్స్ టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి ఇటీవల ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. విజయదశమి సందర్భంగా.. ‘‘దసరా శుభ సందర్భంగా... రాముడు మీకు సకల సంతోషాలు ప్రసాదించాలని, విజయాలనివ్వాలని కోరుకుంటున్నా. మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు’’ అని షమీ ట్వీట్ చేశాడు. ఇందుకు స్పందించిన నెటిజన్లు కొంతమంది.. ‘‘ధన్యవాదాలు షమీ భాయ్! మీకు కూడా పండుగ శుభాకాంక్షలు’’ అని సంతోషం వ్యక్తం చేయగా.. మరికొందరు మాత్రం అతడిని దారుణంగా ట్రోల్ చేస్తూ విద్వేషపు కామెంట్లు చేశారు. ఈ విషయంపై తాజాగా స్పందించిన కేంద్ర క్రీడా శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. షమీకి అండగా నిలబడ్డారు. షమీ చేసిన తప్పేంటి? ‘‘దసరా అనేది దేశవ్యాప్తంగా అందరూ కలిసి చేసుకునే పండుగ. భారత క్రికెటర్లు కూడా అంతా కలిసి పండుగ జరుపుకొంటారు. మహ్మద్ షమీ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటే తప్పేంటి? అతడిని తప్పుబడుతున్న వారికి అందరూ కలిసి ఉండటం ఇష్టం లేనట్లే అనిపిస్తోంది. ఏదేమైనా దేశమంతా అన్ని పండుగలు కలిసి జరుపుకోవాలి. అంతా కలిసి ఉండాలి’’ అని అనురాగ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో స్వదేశంలో సిరీస్‌కు షమీ ఎంపికైనా కరోనా బారిన పడిన కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఇక ప్రపంచకప్-2022 టోర్నీ నేపథ్యంలో స్టాండ్‌బై అతడికి అవకాశం దక్కింది. అయితే, ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరం కావడంతో షమీ అతడి స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. చదవండి: Ind Vs SA: పరుగులు సాధిస్తున్నా టీమిండియాలో చోటు దక్కడం లేదు! స్వీట్లు, చైనీస్ ఫుడ్ మానేశా! ఇకపై.. On the happy occasion of Dussehra, I pray that Lord Ram fills your life with lots of happiness, prosperity, and success. Happy Dussehra to you and your family. #mdshami11 #Dussehra pic.twitter.com/wsFk7M1Gj5 — Mohammad Shami (@MdShami11) October 5, 2022 -
మదర్సా ప్రాంగణంలో మూక దుశ్చర్య
బీదర్(కర్ణాటక): బీదర్‌లో 1472లో నిర్మించిన మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలో అన్యమత ప్రార్థనలకు ఒక గుంపు తెగించింది. దసరా ఉత్సవాలను పురస్కరించుకుని ఆ ప్రాంగణంలో పూజలు చేసింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. తెల్లవారుజామున దుర్గామాత విగ్రహం నిమజ్జనం కోసం గుంపుగా వెళ్తున్న జనంలోని దాదాపు 60 మంది హఠాత్తుగా మదర్సా, మసీదు ఉన్న ప్రాంగణంలోకి చొరబడి అక్కడి శమీ చెట్టు ఉండే చోట పూజలుచేశారు. ఘటనపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో కర్ణాటక హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర స్పందించారు. ‘ ఆ ప్రాంతంలో చాలా ఏళ్లుగా శమీ చెట్టు ఉండేది. ప్రతి ఏటా నలుగురైదుగురు వచ్చి దర్శించుకుని వెళ్లేవారు. ఇప్పుడా చెట్టు లేదు. అయినాసరే ఈ ఏడాదీ వచ్చారు. వీడియోలు తీసి వైరల్ చేయడంతో వివాదమైంది’ అని మంత్రి అన్నారు. దీంతో పట్టణంలో ముస్లింలు ఆందోళనకు దిగారు. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని అరెస్ట్‌చేశారు. -
AP: ఆర్టీసీకి జై కొట్టిన ప్రయాణికులు.. రెగ్యులర్ చార్జీలతోనే రెట్టింపు ఆదాయం
సాక్షి, అమరావతి: దసరా సీజన్లో కూడా రెగ్యులర్ చార్జీలే అమలు చేసిన ఆర్టీసీకి ప్రయాణికులు జై కొట్టారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 4,500 సర్వీసుల్లో ఏకంగా 1.84 లక్షల మంది ప్రయాణాలు సాగించారు. 80 శాతం ఆక్యుపెన్సీ రేటుతో రూ.4.42 కోట్ల ఆదాయం సమకూర్చారు. కొత్త రికార్డు సృష్టించారు. వివరాల్లోకి వెళితే... దశాబ్దకాలంగా ఆర్టీసీ దసరా సీజన్లో అధిక చార్జీలు వసూలు చేస్తూ వచ్చింది. రెగ్యులర్ టికెట్ల కంటే 50శాతం పెంచడం పరిపాటిగా మారింది. చదవండి: జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో కీలక పురోగతి నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది దోహద పడుతుందని భావించేవారు. అయితే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగుల జీతాల వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో సర్వీసులే తక్కువుగా నడిపారు. తొలిసారిగా ఈ ఏడాది దసరా సీజన్లో అధిక చార్జీలు వసూలు చేయకూడదని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 25 నుంచి దసరా వరకు 2,206 ప్రత్యేక సర్వీసులు నడిపింది. రెగ్యులర్ చార్జీలతోనే ప్రత్యేక బస్సులు నడపడంతో ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల కంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణానికే ప్రాధాన్యమిచ్చారు. గతేడాది 150 శాతం చార్జీలు వసూలు చేసినా సరే రూ.2.10కోట్ల రాబడే వచ్చింది. ఆర్టీసీపై ప్రయాణికుల్లో పెరుగుతున్న ఆదరణకు ఈ దసరా సీజన్ ప్రతీకగా నిలిచింది. ఇదే స్ఫూర్తితో 10వ తేదీ వరకు 2,400 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమవుతోంది. -
అంగరంగ వైభవంగా మైసూరు ప్యాలెస్‌లో దసరా ఉత్సవాలు.. (ఫొటోలు)
-
Hyderabad: బాగానే లాగించేశారు!.. ఒకే రోజు అన్ని లక్షల కేజీలా?
సాక్షి, హైదరాబాద్: దసరా పండగ రోజు గ్రేటర్ పరిధిలో మాంసం విక్రయాలు భారీగా జరిగాయి. నగరవాసులు ‘ముక్క’పై మక్కువ కనబర్చారు. సాధారణ రోజుల్లో 10 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుంటాయి. దసరా సందర్భంగా బుధవారం 30 లక్షల కిలోల చికెన్, 10 లక్షల కిలోల మటన్ విక్రయాలు జరిగినట్లు హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. కిలో మటన్ రూ. 850– 900.. కిలో చికెన్ రూ.230– 250కి విక్రయించారు. మాంసం అమ్మకాల జోరు ఆదివారం వరకు ఉంటుందని వ్యాపారులు చెబుతున్నారు. చదవండి: (Dussehra 2022: కాసులు కురిపించిన దసరా) -
Dussehra 2022: కాసులు కురిపించిన దసరా
సాక్షి, హైదరాబాద్: ప్రజా రవాణా సంస్థలకు దసరా పండగ కాసులు కురిపించింది. రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దసరా సందర్భంగా నగరం నుంచి సుమారు 30 లక్షల మందికిపైగా సొంతూళ్లకు వెళ్లినట్లు అంచనా. వీరిలో 25 శాతం మంది సొంత వాహనాల్లో వెళ్లగా.. మిగతా 75 శాతం ఆర్టీసీ బస్సులు, రైళ్లలో బయలుదేరారు. ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రైవేట్ బస్సుల్లో ఎక్కువగా వెళ్లారు. ప్రయాణికుల రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే సుమారు 40 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. కొన్ని రైళ్లలో సాధారణ బోగీల సంఖ్యను పెంచింది. మరికొన్ని రైళ్లకు స్లీపర్ బోగీలను అదనంగా ఏర్పాటు చేశారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4600 అదనపు బస్సులకు ఆర్టీసీ ప్రణాళికలను సిద్ధం చేసింది. మరోవైపు సాధారణ చార్జీలపైనే అదనపు బస్సులను నడపడంతో ప్రయాణికుల నుంచి అనూహ్యమైన ఆదరణ లభించింది. ఆర్టీసీకి ఆదరణ.. సద్దుల బతుకమ్మ, దసరా సందర్భంగా ఎక్కువ శాతం నగరవాసులు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు బస్సులే అందుబాటులో ఉండడంతో ఆర్టీసీ సైతం విస్తృత ఏర్పాట్లు చేసింది. గతేడాది దసరాకు రూ.10 కోట్లు సమకూరగా.. ఈసారి సుమారు రూ.15 కోట్లకుపైగా లభించినట్లు ఓ అధికారి తెలిపారు. సాధారణ రోజుల్లో మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు నడిచే 3500 బస్సులతో పాటు రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను ఏర్పాటు చేశారు. నగరవాసులు పూర్తిస్థాయిలో బస్సులను వినియోగించుకుంటే ఆర్టీసీకి మరింత ఆదాయం లభించేదని, ఎక్కువ శాతం సొంత వాహనాలు, టాటాఏస్‌లు, అద్దె కార్లకు ప్రాధాన్యమిచ్చారని అధికారులు భావిస్తున్నారు. బైక్‌లపై కూడా పెద్ద ఎత్తున వెళ్లినట్లు సమచారం. పండగ చేసుకున్న ప్రైవేట్ యాజమాన్యాలు.. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రైవేట్ బస్సుల్లో రెట్టింపు చార్జీలను వసూలు చేశారు. పండగ రద్దీని సొమ్ము చేసుకున్నారు. టూరిస్టు బస్సులుగా నమోదైనవి కూడా స్టేజీ క్యారేజీలుగా రాకపోకలు సాగించాయి. మినీ బస్సులు, ట్రావెల్స్ కార్లు సైతం రెండు రాష్ట్రాల మధ్య పరుగులు తీశాయి. దక్షిణమధ్య రైల్వేకు.. దక్షిణమధ్య రైల్వేకు సుమారు రూ.45 కోట్ల వరకు లభించినట్లు అంచనా. దసరా సందర్భంగా వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. అన్ని రూట్లలోను ప్రయాణికుల రద్దీ పెరిగింది. అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్‌లిస్టు 250 దాటిపోయింది. దీంతో రద్దీ ఉన్న మార్గాల్లో అదనపు రైళ్లతో పాటు అదనపు బోగీలను ఏర్పాటు చేయడం వల్ల కొంత మేరకు ఊరట లభించింది. కోవిడ్‌కు ముందు.. అంటే రెండేళ్ల క్రితం నాటి ఆదాయంతో పోల్చితే ఈ ఏడాది చాలా తక్కువే లభించినట్లు అధికారులు చెప్పారు. -
Dussehra 2022: సమగ్ర జనాభా విధానం కావాలి
నాగపూర్: దేశంలో అన్ని వర్గాలకు సమానంగా వర్తించే ఒక సమగ్ర జనాభా విధానాన్ని (పాపులేషన్ పాలసీ) రూపొందించాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ అన్నారు. విస్తృతమైన చర్చలు, సంప్రదింపుల తర్వాత ఈ విధానాన్ని తయారు చేయాలని చెప్పారు. నాగపూర్‌లో బుధవారం నిర్వహించిన దసరా వేడుకల్లో మోహన్ భగవత్ మాట్లాడారు. కమ్యూనిటీ ఆధారిత జనాభా అసమతుల్యత అనేది చాలా కీలకమైన అంశమని, దీన్ని విస్మరించడానికి వీల్లేదని స్పష్టం చేశారు. జనాభా అసమతుల్యత అనేది దేశ భౌగోళిక సరిహద్దులను సైతం మార్చేస్తుందని వ్యాఖ్యానించారు. వివిధ వర్గాల జనాభా మధ్య సమతుల్యత కోసం అన్ని వర్గాలకు సమానంగా వర్తించే నూతన జనాభా విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు. దేశంలో వర్గాల మధ్య సమతుల్యత ఉండాలన్నారు. ‘‘జననాల రేటులో భేదాలు, బలవంతపు మత మార్పిడులు, ప్రలోభాలు, అత్యాశ కారణంగా మతాలు మారడం, దేశంలోకి అక్రమ చొరబాట్లు.. ఇలాంటివన్నీ ముఖ్యమైన అంశాలు. వీటిని కచ్చితంగా అరికట్టాలి’’ అని మోహన్ భగవత్ సూచించారు. భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఆంగ్ల భాష ఒక్కటే ముఖ్యం కాదని తెలిపారు. మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మాతృభాషను ప్రభుత్వమే ప్రోత్సహించాలని మనం ఆశిస్తున్నామని, అదే సమయంలో మనం సంతకం మాతృభాషలోనే చేస్తున్నామా లేదా అనేది ఆలోచించుకోవాలని హితవు పలికారు. మన ఇళ్లపై నేమ్ప్లేట్లు మాతృభాషలోనే ఉంటున్నాయా? అని ఏదైనా ఆహ్వానం పంపేటప్పుడు మాతృభాషలోనే పంపిస్తున్నామా? అని ప్రశ్నించారు. జనాభా పెరుగుదలను నియంత్రించాలని ప్రయత్నించేటప్పుడు చైనాలో ఏం జరుగుతోందో చూడాలని చెప్పారు. ‘ఒక కుటుంబం, ఒక బిడ్డ’ విధానం వల్ల చైనా వృద్ధ దేశంగా మారుతోందన్నారు. భారతదేశ జనాభాలో 57 శాతం మంది యువతే ఉన్నారని, మరో 30 ఏళ్లపాటు మన దేశం యువదేశంగానే కొనసాగుతుందని మోహన్ భగవత్ ఉద్ఘాటించారు. 50 ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటి? ఇప్పటి యువత వృద్ధులుగా మారుతారు, వారందరి ఆకలి తీర్చేటంత ఆహారం మనవద్ద ఉంటుందా? అని ఆన్నారు. యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంత వ్యాపారాలు ప్రారంభించాలని, స్వయం ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. అందరికీ ఉద్యోగాలిచ్చే శక్తి ప్రభుత్వాలకు ఉండదన్నారు. -
మందుబాబుల దసరా ‘ధమాకా’
సాక్షి, హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని మద్యం ఏడురోజులు ఏరులైంది. రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు రోజుల్లో మద్యం విక్రయాలు రూ.1,100 కోట్లు దాటాయి. అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 5(దసరా)న రెండురోజులు రాష్ట్రంలోని మద్యం డిపోలకు సెలవులుండగా, గత ఏడు పనిదినాల్లో కలిపి ఈ మేరకు మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సెప్టెంబర్ 30న రికార్డుస్థాయిలో రూ.313 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు సాగాయి. అయితే, సెప్టెంబర్ నెలాఖరులో వైన్‌షాపుల యజమానులు లిక్కర్‌కు ఎక్కువ ఇండెంట్ పెట్టి బీర్లు తగ్గించారు. గత ఏడు పనిదినాల్లో అమ్ముడైన మద్యం గణాంకాలను జిల్లాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్ల మేర మద్యం అమ్ముడైంది. వరంగల్ అర్బన్ (149.02 కోట్లు), నల్లగొండ (124.44 కోట్లు), కరీంనగర్ (111.44 కోట్లు), హైదరాబాద్ (108.24కోట్లు) జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయించారు. -
హాంగ్ కాంగ్లో వైభవంగా దసరా - సద్దుల బతుకమ్మ సంబరాలు
ప్రపంచవ్యాప్తంగా భారతీయులు దసరా శరన్నవరాత్రులు ఎంతగానో ఇష్టంగా ఎదురుచూసే పండుగా అని చెప్పవొచ్చును . లలితా పారాయణం, బొమ్మల కొలువు, పేరంటాలు, గర్భాలు, దాండియా ఆటలతో పాటు బతుకమ్మ సంబరాలు కూడా విశిష్ట స్థానాన్ని పొందాయి. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు శరన్నవరాత్రులు - దసరా (విజయ దశమి) మరియు బతుకమ్మ పండుగలు జరుపుకుంటారు. శరన్నవరాత్రులు, తొమ్మిది రోజులలో, రోజు ఉదయం, సాయంత్రం, ఎవరింటీలో లలిత పారాయణం చేస్తారు అంటూ, ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు, ఏ రంగు అమ్మవారికి ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి..ఇటువంటి వివరాలతో ఒక పట్టికను తయారు చేస్తారు, హాంగ్ కాంగ్ లాంటావ ద్వీపంలోని తుంగ చుంగ్ 'లలిత సహస్రనామం చాంటింగ్ గ్రూప్'. ఆ ప్రకారంగా వారు ప్రతి ఇంటా ఘనంగా అమ్మవారిని అందంగా అలంకరించి, మనసారా కొలిచి, అమ్మకు ప్రీతికరమైన నైవేద్యాలు పెడతారు. విచ్చేసిన ఆడపడుచులందరు పారాయణానికి వెళ్తూ, పూలు పండ్లు కాకుండా వారి శక్తికొలది ఒక డొనేషన్ బాక్స్ లో ధనాన్ని వేస్తారు. నవరాత్రులు పూర్తయ్యాక ఆ డబ్బులని మన దక్షిణ రాష్ట్రాలలోని ఏదైనా ఒకటి రెండు వృద్ధాశ్రమానికి లేదా అనాధ పిల్లల ఆశ్రమానికి విరాళంగా ఇస్తారు. ఈ గ్రూప్ ను ప్రారంభించిన శ్రీమతి సంధ్య గోపాల్ మాట్లాడుతూ ఇలా తామందరు కలసి మానవ సేవ - మాధవ సేవ చేసుకోగల్గుతున్నందుకు ఎంతో తృప్తిగా ఆనందంగా అనిపిస్తోందని అన్నారు. ఈ బతుకమ్మ (గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది. అంటే బెంగాలీ వారు దుర్గాష్టమి నాడు ఘనంగా వేడుక చేసుకున్నట్లు, తెలుగింటి ఆడపడుచులు సద్దులబతుకమ్మ వేడుకలు జరుపుకొంటారు. ఈ శుభకృత నామ సంవత్సరం, ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆడపడుచులు, స్థానికంగా ఉన్న కఠినమైన కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, ఎంతో వుత్సాహంగా సద్దుల బతుకమ్మను ఆరాధిస్తు బతుకమ్మ ఆడారు అని సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి తెలిపారు. తమ సమాఖ్య మహిళా విభాగం "సఖియా" సంయుక్త కార్యదర్శి శ్రీమతి కొండ నాగ మాధురి, శ్రీమతి జెఖ అశ్విని రెడ్డి, సాంస్కృతిక కార్యదర్శి శ్రీమతి రమాదేవి సారంగా, శ్రీమతి హర్షిణీ పచ్ఛంటి అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారని తమ సంతోషాన్ని వ్యక్త పరుస్తూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ సద్దుల బతుకమ్మ పండుగ, విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. హైద్రాబాద్ లో బతుకమ్మ సంబరాలు ఎంతో వైభావంగా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం తనకి మరింత ఉత్సాహాన్నిచ్చిందని, తన బంధు మిత్రులతో కలిసి ఆనందంగా బతుకమ్మ ఆడారని, అందమైన బొమ్మల కొలువులు చూశానని, లలిత దేవి పారాయణం - పేరంటాలకి వెళ్లానని చెప్పారు. చాలా కాలం తరువాత హైద్రాబాద్ లో ఈ పండుగ చేసుకోవడం ఒక మరపురాని మధుర జ్ఞాపకంగా ఉంటుందని ఆనందంగా తెలిపారు. త్వరలో తమ సమాఖ్య దీపావళి వేడుకలని ఘనంగా చేసే ఏర్పాట్లు చేస్తోందని సంతోషంగా ప్రకటించారు. -
అమ్మవారి విగ్రహ నిమజ్జనంలో అపశ్రుతి.. 8 మంది మృతి, షాకింగ్ వీడియో
కోల్‌కత: విజయదశమి వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పైగురిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా 8 మంది మృతి చెందారు. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు పెద్ద ఎత్తున భక్తులు మాల్ నదిలోకి దిగారు. అయితే, ఒక్కసారిగా వరద ప్రవాహం పెరగడంతో పలువురు కొట్టుకుపోయారు. వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోగా మరికొంతమంది గల్లంతయ్యారు. మృతుల్లో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. ఈ ఘటన బుధవారం రాత్రి 8.30 ప్రాంతంలో జరిగిందని జల్పైగురి జిల్లా కలెక్టర్ మౌమితా గోదర తెలిపారు. వందలాది మంది విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని వీక్షించేందుకు మాల్ నది ఒడ్డున పోగయ్యారని, అంతలోనే భారీ ఎత్తున వరద ప్రవాహం పెరగడంతో కొందరు కొట్టుకుపోయారని వెల్లడించారు. 50 మంది స్థానికుల సాయంతో బయటపడ్డారని, కొందరు గల్లంతయ్యారని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 13 మందిని ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. గల్లంతైన వారికోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, స్థానిక యంతాంగంతో ముమ్మర గాలింపు చర్యలు కొనసాగున్నాయని అన్నారు. మాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర బీసీ వెల్ఫేర్ మంత్రి బులు చిక్ బరైక్ మాట్లాడుతూ.. మృతుల సంఖ్య పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడే ఉన్నట్టు తెలిపారు. బలమైన వరద కారణంగా కళ్లముందే చాలామంది నదిలో కొట్టుకుపోయారని అన్నారు. కాగా, మంత్రి బులు, మరికొంతమంది తృణమూల్ నేతలు సహాయక చర్యలను సమీక్షిస్తున్నారు. సహాయకచర్యలను ముమ్మరం చేయాలని ప్రతిపక్షనేత సువేంధు అధికారి పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. జల్పైగురి దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. Saddening news coming from Jalpaiguri as flash flood in Mal river during Durga Puja immersion swept away many people. Few deaths have been reported till now. I request the DM of Jalpaiguri & @chief_west to urgently step up rescue efforts & provide assistance to those in distress. pic.twitter.com/4dZdm2WlLO — Suvendu Adhikari • শুভেন্দু অধিকারী (@SuvenduWB) October 5, 2022 8 Dead, Several Missing During Idol Immersion In West Bengal. #JalpaiguriAccident #Jalpaiguri pic.twitter.com/hTgAAJvYmq — Jagadanand Pradhan (@JPradhan_) October 6, 2022 Anguished by the mishap during Durga Puja festivities in Jalpaiguri, West Bengal. Condolences to those who lost their loved ones: PM @narendramodi — PMO India (@PMOIndia) October 5, 2022 -
రావణ దహనంలో అపశ్రుతి... ప్రజలపైకి దూసుకొచ్చిన దిష్టిబొమ్మ
న్యూఢిల్లీ: దేశంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా చివరిరోజు విజయదశమి సంబరాలు మిన్నంటాయి. అదీగాక విజయదశమి అనేది చెడుపై మంచి సాధించిన గుర్తుగా పలుచోట్ల రామలీల ప్రదర్శనలతోపాటు, రావణదహనం చేస్తుంటారు. అచ్చం అలానే హర్యానాలో కూడా రావణదహనం చేస్తుండగా... పెనుప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా రావణుడి దిష్టిబొమ్మ ప్రజలపైకి దూసుకువచ్చింది. దీంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని యమునా నగర్లో బుధవారం చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. #WATCH | Haryana: A major accident was averted during Ravan Dahan in Yamunanagar where the effigy of Ravana fell on the people gathered. Some people were injured. Further details awaited pic.twitter.com/ISk8k1YWkH — ANI (@ANI) October 5, 2022 (చదవండి: చిరుత పిల్లకు పాలు పట్టించేందుకు యోగి పాట్లు) -
జమ్మిబండ.. మన అండ!
ఖమ్మం గాంధీచౌక్ : శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే పండుగ దసరా. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమిగా జరుపుకోవడం అనాదిగా ఆచారం. ప్రాంతాల వారీగా పండుగను వివిధ రూపాల్లో జరుపుకుంటుండగా... ఖమ్మంలో కూడా పండుగకు ప్రత్యేకత ఉంది. జిల్లాలోని కారేపల్లి మండలంలో కోట మైసమ్మ జాతర ఇదేరోజు ప్రారంభమవుతుంది. అలాగే, ఖమ్మం నగరంలో విజయదశమి రోజున జమ్మిబండపై ప్రత్యక్షమయ్యే శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామిని ప్రజలు దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. దేవస్థానమే మూలంగా ఖమ్మం ఖమ్మంకు మూలం స్తంభాద్రి గుట్ట. శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఆధారంగానే ఖమ్మం ఆవిర్భవించిందని చరిత్ర చెబుతోంది. ప్రాచీన దివ్యక్షేత్రంగా శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వెలుగొందుతోంది. త్రేతాయుగంలో మౌద్గల్య మహాముని తన శిష్యులతో గుహలో తపస్సు చేయగా స్వామి ప్రత్యక్షమయ్యారని నమ్మిక. అప్పుడు స్వామిని ఈ కొండపై లక్ష్మీ సమేతుడవై కొలువై ఉండాలని ముని ప్రార్థించగా స్వామి దక్షిణ ముఖంగా గుహలో వెలిశాడు. స్తంభం నుంచి ఉద్భవించిన స్వామి కావడంతో ఈ క్షేత్రానికి స్తంభాద్రి అని పేరు స్థిరపడి, కాలక్రమంలో స్తంభాద్రిపురంగా, ఖమ్మం మెట్టుగా, ప్రస్తుతం ఖమ్మంగా వాడుకలో ఉంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన ప్రతాపరుద్రుడి హయంలో ఆలయాన్ని లకుమారెడ్డి, వేమారెడ్డి సోదరులు నిర్మించినట్లు చరిత్ర పేర్కొంటోంది. ప్రతాప రుద్రుడి కాలం నుంచి.. ఖమ్మం నగరంలోని జమ్మిబండపై ఏటా విజయదశమి రోజున నిర్వహించే కార్యక్రమాలను ప్రభుత్వ లాంచనాలతోనే జరుపుతున్నారు. ప్రతాపరుద్రుడి కాలం మొదలు నిజాం నవాబు కాలంలో కూడా ఇది అమలవుతోంది. ప్రస్తుతం కూడా దేవాదాయ, ధర్మాదాయ శాఖ ద్వారా విజయదశమి వేడుకలను నిర్వహిస్తుండగా, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పాల్గొంటారు. ఆపద్బాంధవుడు నృసింహుడు ఆపదలో ఆదుకునే ఆపద్బాందవుడు లక్ష్మీనరసింహస్వామి. విజయదశమి రోజున స్వామి జమ్మిబండపై పారువేటకు ప్రత్యక్షమవుతారు. స్వామిని ఈ రోజు దర్శించుకుంటే శుభం జరుగుతుందని నమ్మిక. కాకతీయుల కాలం నుంచి ఇక్కడ విజయదశమి వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. – నరహరి నర్సింహాచార్యులు, ప్రధాన అర్చకులు, శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం ప్రభుత్వ లాంఛనాలతో వేడుకలు ఖమ్మం జమ్మిబండపై విజయదశమి వేడుకలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహిస్తాం. స్తంభాద్రి గుట్టపై నుంచి పల్లకీలో స్వామిని బోయలు మోస్తూ జమ్మిబండపైకి తీసుకొస్తారు. పారువేట, శమీ పూజ, స్వామి వారి దర్శనం తర్వాత తిరిగి స్తంభాద్రి ఆలయానికి చేరుస్తాం. – కొత్తూరు జగన్మోహనరావు, ఈఓ, శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం విజయ దశమి వేడుకలు బుధవారం జరుపుకోనున్నారు. ఖమ్మంలోని స్తంభాద్రి గుట్టపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని ఊరేగింపుగా బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ప్రజల దర్శనార్థం తీసుకువస్తారు. స్వామి వారి వద్ద శమీ పూజలు నిర్వహించి, ప్రజల దర్శనం అనంతరం రాత్రి 9:30 గంటలకు తిరిగి స్తంభాద్రి ఆలయానికి గుట్టపైకి తీసుకుకెళ్తారు. నగరంతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు జమ్మిబండపై స్వామి వారి దర్శనానికి బారులు తీరుతారు. ఇందుకోసం దేవాదాయ శాఖతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా ఏర్పాట్లుపూర్తిచేశారు. -
పండగ కళ పదింతలు.. ఆదుర్దా వద్దు.. ఇలా చేయండి!
పండగ వేళ ఇల్లు కళగా వెలిగిపోవాలంటే ఏం చేయాలా అని ఎక్కువ ఆదుర్దా పడనక్కర్లేదు. సింపుల్‌గా అనిపిస్తూనే, ఎక్కువ శ్రమ లేకుండా కొన్ని వస్తువులతో అలంకరణ ద్వారా పండగ కళను రెట్టింపు చేసుకోవచ్చు. దశమి నాడు పది విధాల మేలైన కళ ఇది. 1. ఇత్తడి, రాగి పాత్రలు ఇవి ఉంటే చిటికెలో పని అయిపోయినట్టే. అందులోనూ దేవతా రూపాలతో ఉన్న వస్తువులైతే అలంకరణ మరింత సులువు అయిపోతుంది. మర చెంబులు, వెడల్పాటి ప్లేట్లు ఉన్నా.. వీటిలో నీళ్లు పోసి పువ్వులు వేస్తే చాలు పండగ కళ వచ్చేసినట్టే. 2. డిజైనర్ రంగోలీ ముంగిట్లో ముచ్చటైన రంగవల్లికలు అందం. అలాగని పెద్ద పెద్ద ముగ్గులు వేసే టైమ్ లేదు అనుకునేవారికి సింపుల్ చిట్కా.. మార్కెట్లో డిజైనర్ రంగవల్లికలు రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. సాయంకాలపు వెలుగుకు ఈ ముగ్గులు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. 3. పువ్వులు–ఆకులు ముగ్గుల స్థానంలో పువ్వులు, ఆకులతో ఇలా ముచ్చటైన డిజైన్లుగా రూపుకట్టవచ్చు. ఈ అలంకరణ ఎప్పుడు చేసినా పండగ నట్టింట్లో కొలువుదీరినట్టే. 4. డిజైనర్ తోరణం మామిడి, బంతిపూలతోనే కాదు ఇవి కూడా డిజైనర్ తోరణాలే. ఎంబ్రాయిడరీ జిలుగులు, అద్దకం, కుందన్స్ మెరుపులతో తీర్చిదిద్దిన అందమైన తోరణాలు ఎన్నో. వాటిని ఒకసారి తెచ్చుకుంటే ప్రతి పండగకూ మెరిపించవచ్చు. ఇలా అందమైన కళను తీసుకురావచ్చు. 5. వాల్ హ్యాంగింగ్స్ టెర్రకోట గంటలు, ఫెదర్ తో కూడిన పక్షుల బొమ్మలు .. ఇలా రకరకాల హ్యాంగింగ్స్ తెచ్చి గుమ్మం ముందు వేలాడదీస్తే ఎంత కళను తెచ్చిపెడతాయో కళ్లారా చూడాల్సిందే. 6. పువ్వుల హ్యాంగింగ్ ఎన్ని పూల దండలను వేలాడదీస్తే అంత అందంగా కనిపిస్తుంది ఇల్లు. అయితే, ఎక్కడ ఎలా అలంకరించాలో మాత్రం ఎవరి అభిరుచి వారిదే. 7. డెకార్ కుషన్స్ చిన్న చిన్న పిల్లోస్ లేదా కుషన్స్ సోఫా– దివాన్ల మీద వేస్తూ ఉంటారు. వాటికి రంగు రంగుల కాంబినేషన్లో ఉన్న కవర్స్ వేస్తే పండగ కళ అదిరిపోయిందనే కితాబు రాకుండా ఉండదు. 8. బొమ్మలు దసరా పండగ అంటే చాలామంది బొమ్మల కొలువులతో అలరిస్తుంటారు. అన్ని బొమ్మలు లేకపోయినా ఈ పండగ నాడు కొన్న కొన్ని బొమ్మలతో షోకేస్‌ని అలంకరిస్తే చాలు. వాటిలో మన దేశీయ హస్త కళాకృతులను చేరిస్తే మరింత అందం వస్తుంది. దసరా పండగను పురస్కరించుకుని వచ్చిన వాల్ స్టిక్కర్స్‌ను కూడా ఉపయోగించవచ్చు. 9. పూజా ప్లేట్ పూజలలో వాడే ప్లేట్‌ని కూడా అందంగా అలంకరించుకోవచ్చు. డిజైనర్ థాలీ పేరుతో ఇవి మార్కెట్లో లభిస్తున్నాయి. పువ్వులు, ఆకులు, నెమలి ఈకలు.. మొదలైనవాటిని ఉపయోగించే పూజా ప్లేట్స్ లేదా అలంకరణ ప్లేట్లను తయారు చేసుకోవచ్చు. 10. నీటిపైన పువ్వులు అలంకరణకు ఏ వస్తువులూ లేవని చింతించనక్కర్లేదు. కొన్ని రకాల పువ్వులను ఒక పెద్ద పాత్రలో ఉంచి గుమ్మానికి ఒక వైపున లేదా ఇంటిలోపల గుమ్మానికి ఎదురుగా అలంకరించినా చాలు... పండగ కళ రెట్టింపుగా మిమ్మల్ని పలకరిస్తుంది. -
గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక
సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖ పరిధిలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు తెలంగాణ ప్రభుత్వం దసరా కానుక ప్రకటించింది. ప్రస్తుతం వారికి చెల్లిస్తున్న నెలవారీ వేతనానికి అదనంగా 30 శాతం పెంచుతున్నట్టు వెల్లడించింది. గోపాలమిత్రలకు రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరహాలోనే 30 శాతం వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేశామని, ప్రస్తుతం నెలకు వస్తున్న రూ.8,500కు తోడు పెంచిన 30 శాతం (రూ.2550) కలిపి రూ.11,050 చెల్లిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మంగళవారం తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని రైతాంగానికి అందుబాటులో ఉంటూ పాడిగేదెలకు కృత్రిమ గర్భధారణ, వ్యాక్సినేషన్, నట్టల నివారణ మందుల పంపిణీ లాంటి కార్యక్రమాల అమలులో సేవలందిస్తున్న గోపాల మిత్రలను ప్రభుత్వ గుర్తించి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందని చెప్పారు. తెలంగాణలో గోపాలమిత్రలకు ఇస్తున్న వేతనాన్ని దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తాజా పెంపుతో 1,530 మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. (చదవండి: ఉపఎన్నికలో ఓ గ్రామ ఇన్చార్జిగా కేసీఆర్.. ఏ గ్రామానికి అంటే?) -
లండన్‌లో ఘనంగా ‘టాక్ - చేనేత బతుకమ్మ- దసరా’ సంబురాలు
లండన్: లండన్‌లో చేనేత బతుకమ్మ - దసరా సంబరాలను తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్ డమ్(టాక్) ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యుకే నలుమూలల నుంచి రెండు వేలకు పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలం, భారత హై కమిషన్ ప్రతినిధి లక్ష్మి నారాయణన్, స్థానిక హౌన్సలౌ డిప్యూటీ మేయర్ కౌన్సిలర్ ఆదేశ్ ఫర్మాన్లు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతకు చేయూతనిస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో తమ వంతు బాధ్యతగా చేనేతకు చేయూతనిస్తూ ప్రతీ సంవత్సరం లాగా ఈసారి కూడా వేడుకలను "చేనేత బతుకమ్మ-దసరా" గా జరుపుకున్నామని సంస్థ అధ్యక్షుడు తెలిపారు. ప్రతీ సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ లోని ఏదో ఒక ముఖ్యమైన చారిత్రాత్మక కాట్టడాల నమూనాని ప్రత్యేక ఆకర్షణగా నిలుపుతున్నామని, ఈసారి యాదాద్రి దేవాలయ నమూనా ప్రదర్శించామని చెప్పారు. ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. టాక్ వ్యవస్థాపకుడిగా ఒక తెలంగాణ కార్యకర్తగా దాదాపు దశాబ్ద కాలం లండన్ గడ్డ పై పని చేశానని, ప్రస్తుతం అతిథిగా అదే గడ్డపై ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా గర్వంగా ఉందన్నారు. యూకే ప్రవాస సమాజమంటే ప్రత్యేక గౌరవముందని, ఎక్కడికి వెళ్లినా ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరిని గుర్తుపెట్టుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల, టాక్ ఉపాధ్యక్షులు శుష్మణ రెడ్డి - సత్యమూర్తి చిలుముల, ఎన్నారై తెరాస యూకే అధ్యక్షుడు మరియు టాక్ కన్వీనర్ అశోక్ గౌడ్ దూసరి, టాక్ ప్రధాన కార్యదర్శులు సురేష్ బుడగం - జాహ్నవి దుసరి, అడ్వైసరి బోర్డు చైర్మన్ మట్టా రెడ్డి, కమ్మూనిటీ అఫైర్స్ చైర్మన్ నవీన్ రెడ్డి, మాజీ అధ్యక్షురాలు పవిత్రా రెడ్డి, ముఖ్య సభ్యులు స్వాతి బుడగం, సుప్రజ పులుసు, వెంకట్ రెడ్డి దొంతుల, మల్లా రెడ్డి, సత్యపాల్ పింగిళి, గణేష్ పాస్తం ,రాకేష్ పటేల్, రవి రేటినేని, రవి ప్రదీప్ పులుసు, నవీన్ భువనగిరి, మాధవ్, సతీష్ రెడ్డి గొట్టిముక్కుల, శ్రావ్య, శ్రీవిద్య, వేణు నక్కిరెడ్డి, హరి గౌడ్ నవాబ్ పేట్, రాజేష్ వర్మ, క్రాంతి రేటినేని, మమత జక్కీ, శ్వేతా మహేందర్, మధుసూదన్ రెడ్డి, శ్వేతా రెడ్డి, శశి, ప్రశాంత్ మామిడాల, శ్రీకాంత్ ముదిరాజ్, తేజ, నిఖిల్, సందీప్ బుక్క, అక్షయ్, మౌనిక, ప్రవీణ్ వీర, రంజిత్ , వంశీ , నరేష్ , నాగరాజు, మ్యాడి తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు. -
కొనుగోలుదారులకు టాటా మోటార్స్ బంపరాఫర్
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొనుగోలు దారులకు బంపరాఫర్ ప్రకటించింది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా కొనుగోలు దారులకు టాటా టియాగో, టైగోర్,టైగోర్ సీఎన్జీ, హారియర్, సఫారీ కార్లపై పలు ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో రెండో స్థానంలో టాటా హారియర్‌పై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ ,రూ.5000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తుంది. దీంతో పాటు టైగోర్ సీఎన్జీపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ.15,000 , రూ.10 వేలు డిస్కౌంట్ అందిస్తున్నట్లు టాటా ప్రతినిధులు తెలిపారు. అన్ని టాటా సఫారీ వేరియంట్లపై రూ.40 వేల వరకు ఎక్స్ఛేంజ్ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. టైగోర్పై ఎక్స్ఛేంజ్ బోనస్‌గా రూ.10 వేలు, క్యాష్ డిస్కౌంట్ రూ.10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3000 బెనిఫిట్ లభిస్తుంది. టాటా టియాగోపై ఎక్స్చేంజ్ బోనస్‌గా రూ.10వేలు, క్యాష్ డిస్కౌంట్‌గా రూ.10 వేలు బెనిఫిట్ పొందవచ్చు. హ్యాచ్‌బ్యాక్ టియాగోపై కార్పొరేట్ బెనిఫిట్ కింద రూ.3000 అందిస్తున్నది. -
చితిలో దూకి.. దేవతగా మారి..
జయపురం: దసరా ఉత్సవాల్లో జయపురం మా పెండ్రాని దేవికి ప్రముఖ స్థానం ఉంది. నవరంగపూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ ప్రాంతంలో పెండ్రాహండి ఓ కుగ్రామం. 400 ఏళ్ల క్రితం ఓ ఆదివాసీ కుటుంబంలో జన్మించిన పెండ్రానికి వివాహమైన తరువాత ఆమె తల్లిదండ్రుల ఆహ్వానం మేరకు భర్త పెండ్రా ఇల్లరికం వచ్చారు. ఇరువురినీ వారు ఎంతో ఆదరంగా చూసేవారు. అయితే పెండ్రాని నలుగురు అన్నదమ్ములకు ఈ విషయం గిట్టలేదు. దీంతో అతను పొలానికి వెళ్లిన సమయంలో పథకం ప్రకారం హతమార్చి, పాతి పెట్టారు. ఎంతటికీ భర్త ఇంటికి రాకపోవడంతో అనుమానించిన పెండ్రాని.. అతన్ని వెతుక్కుంటూ వెళ్లింది. తన సోదరులే భర్తను చంపి, పొలం వద్ద పాతి పెట్టారని గ్రహించి, సమీపంలోని చితిలో పడి మరణించింది. అనంతరం ఆమె ఆత్మ దేవతగా మారి గ్రామాల్లో సంచరిస్తూ ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ ప్రజలను కాపాడుతుంది. దీంతో తమను రక్షిస్తున్న దేవతగా విశ్వసించిన ఆదివాసీ ప్రజలు.. అక్కడే ఆమెకు గుడికట్టి, పూజించడం ప్రారంభించారు. చదవండి: (Padampur MLA: పద్మపూర్ ఎమ్మెల్యే మృతి) అమ్మవారి మహత్యం తెలుసుకున్ను జయపురం మహారాజులు.. దసరా ఉత్సవాలకు ఆమె లాఠీలను ఆహ్వానిస్తూ వచ్చారు. గత 4 దశాబ్దాలుగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా నవరంగపూర్ జిల్లా ఉమ్మరకోట్ నుంచి ఆదివారం రాత్రి పెండ్రాని దేవి లాఠీలు జయపురం చేరాయి. ఎంతో మహిమ గల అమ్మవారు తమ కోర్కెలు తీర్చుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యలో పెండ్రాని దేవికి కోళ్లు, మేకలు, గొర్రెలు బలులు సమర్పిస్తారు. చదవండి: (దసరా ఉత్సవాల్లో అపశ్రుతి.. స్టేజ్‌పైనే కుప్పకూలిన ప్రముఖ గాయకుడు) -
రిలయన్స్ డిజిటల్ దసరా ఆఫర్లు
హైదరాబాద్: దసరా సందర్భంగా రిలయన్స్ డిజిటల్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. బ్యాంకు కార్డులపై 10% తగ్గింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. యాపిల్ వాచ్‌ను రూ.17,100కు, శామ్సంగ్ వాచ్‌ను రూ.6,490కు అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే, స్మార్ట్‌వాచ్‌లు రూ.1,599 నుంచి అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ఫోన్లపైనా ప్రత్యేక ఆఫర్లను ఇస్తున్నట్టు తెలిపింది. శామ్సంగ్ ఎం53 5జీ ఫోన్‌ను కేవలం రూ.19,999కు, శామ్సంగ్ ఎస్22ను రూ. 49,990కే ఆఫర్ చేస్తున్నట్టు ప్రకటించింది. సమీపంలోని రిలయన్స్ డిజిటల్ స్టోర్లు లేదా మైజియో స్టోర్ లేదా రిలయన్స్డిజిటల్ డాట్ ఇన్ పోర్టల్ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని సూచించింది. -
ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు. లోక కంటకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు.. దుష్ట శక్తులపై దైవ శక్తుల విజయానికి ప్రతీకగా ఈ పండుగ జరుపుకొంటున్నామని సీఎం జగన్ అన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికీ విజయాలు కలిగేలా దుర్గామాత దీవెనలు, ఆశీస్సులు ఉండాలని ఆయన ఆకాంక్షించారు. -
పండుగ విక్రయాలపై భారీ ఆశలు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు ఈ విడత పండుగల విక్రయాలపై మంచి సానుకూల అంచనాలతో ఉన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల కాలంలో విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 35 శాతం మేర పెరుగుతాయని లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడాన్ని సానుకూలంగా చూస్తున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం అప్రమత్త ధోరణితో ఉన్నాయి. ప్యానాసోనిక్, ఎల్జీ సోనీ, శామ్సంగ్, హయ్యర్, గోద్రేజ్ అప్లయన్సెస్, వోల్టాస్, థామ్సన్, బీఎస్‌హెచ్ హోమ్ అప్లయన్సెస్ క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలపై మంచి ఆశలే పెట్టుకున్నాయి. క్రితం ఏడాది విక్రయాలపై కరెనా రెండో విడత తదనంతర పరిణామాలు ప్రభావం చూపించడం గమనార్హం. కంపెనీల ఏడాది పాటు విక్రయాల్లో 35 శాతం వరకు ఓనమ్ నుంచి దీపావళి మధ్యే నమోదవుతుంటాయి. ఈ విడత పండుగల సీజన్లో రూ.75,000 కోట్ల విక్రయాలు నమోదు కావచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పథకాలు, ఆఫర్లు.. పండుగల సమయాల్లో విక్రయాలు పెంచుకునేందుకు అప్లయన్సెస్ కంపెనీలు మంచి ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు వారంటీ, సులభంగా చెల్లించే ఈఎంఐ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. చిన్న పట్టణాల నుంచి ఆరంభ స్థాయి మాస్ ఉత్పత్తుల విక్రయాల విషయంలో కంపెనీలు కొంత ఆందోళనతోఉన్నాయి. ఎందుకంటే ఇంకా చిన్న పట్టణాల్లో విచక్షణారహిత వినియోగం పుంజుకోలేదు. అలాగే, దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాత లోటు నెలకొనడం, ఉత్పత్తుల ధరలను 7–8 శాతం మేర పెంచడం విక్రయాలపై ప్రభావం చూపుతుందా? అని కంపెనీలు సందేహంతో ఉన్నాయి. బెడిసి కొట్టదుగా..? ‘‘వర్షపాతం దేశవ్యాప్తంగా ఎలా నమోదైందన్నది వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తుంది. ప్రీమియం ఉత్పత్తుల విభాగం ఎప్పటి మాదిరే మంచి వృద్ధిని చూస్తోంది. కానీ, మాస్ (తక్కువ, మధ్య స్థాయి) ఉత్పత్తుల అమ్మకాలపైనే మాలో ఆందోళన ఉంది’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఈ పండుగల సీజన్లో స్మార్ట్ ఏసీలు, పెద్ద సైజు తెరల టీవీలు, గృహోపరణాలు డబుల్ డిజిట్ విక్రయాలను నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నట్టు ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ పేర్కొన్నారు. వినియోగదారులు నేడు తమ ఎంపికల విషయంలో స్పృహతో వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని, పండుగల విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. పండుగల విక్రయాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నట్టు సోనీ ఇండియా ఎండీ సునీల్ నాయర్ వెల్లడించారు. ఎల్జీ ఇండియా పండుగల డిమాండ్‌కు అనుకూలంగా మలుచుకుని, విక్రయాలు పెంచుకునేందుకు కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కరోనా ముందుకంటే అధిక విక్రయాలను నమోదు చేస్తామన్న నమ్మకాన్ని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ వ్యక్తం చేశారు. పండుగల విక్రయాలు ఓనమ్, వినాయక చవితి సందర్భంగా సానుకూలంగా ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. 55 అంగుళాలు అంతకుమించి సైజు టీవీలు, 300కు పైగా లీటర్ల సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, 8కేజీలు, అంతకంటే పెద్ద వాషింగ్ మెషిన్లకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. -
తెలుగు రాష్ట్రాల్లో.. దసరా
-
శరన్నవరాత్రి ఉత్సవాలు :భక్తులతో కిక్కిరిసిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)
-
దసరా పండగకి పల్లె బాట పట్టిన పట్నం (ఫొటోలు)
-
సెప్టెంబర్.. టాప్ గేర్
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ల సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో ఉత్పత్తి పెరగడం, పండుగల డిమాండ్ తోడు కావడంతో దేశీయంగా కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో 3,55,946 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 91 శాతం అధికం. చిప్‌ల కొరత సమస్య తగ్గి ఉత్పత్తి మెరుగుపడటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ మొదలైన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ డీలర్లకు మరిన్ని కార్లను సమకూర్చగలిగాయి. సెప్టెంబర్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు 63,111 యూనిట్ల నుంచి 1,48,380 యూనిట్లకు పెరిగాయి. గత 42 నెలల్లో అమ్మకాలపరంగా ఇది తమకు అత్యుత్తమమైన రెండో నెల అని సంస్థ సీనియర్ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. చివరిగా 2020 అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దేశీ మార్కెట్లో ఏకంగా 1,63,000 వాహనాలు విక్రయించింది. కంపెనీ మార్కెట్ వాటా తాజాగా సెప్టెంబర్‌లో దాదాపు 8 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల వాహనాల విక్రయాల మార్కును దాటిందని శ్రీవాస్తవ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ అమ్మకాలు 50 శాతం పెరిగి 49,700గా నమోదయ్యాయి. టాటా మోటార్స్ 47,654 కార్లను, కియా ఇండియా 25,857, టయోటా కిర్లోస్కర్ మోటార్ 15,378, హోండా కార్స్ 8,714 వాహనాలను విక్రయించాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 5,07,690, టీవీఎస్ మోటర్ కంపెనీ 2,83,878 యూనిట్లను విక్రయించాయి. -
దశమి రోజు ధ్వంస రచనకు కుట్ర.. భగ్నం చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్: దసరా రోజున హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి పాకిస్తాన్ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్రను కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో నగర పోలీసులు భగ్నం చేశా రు. లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఫర్హాతుల్లా ఘోరీ ఆదేశాలతో నగరంలో దసరా ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధ్వంసాలు సృష్టించడంతోపాటు నగరానికి చెందిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతల్ని హతమార్చాలనుకున్న ముగ్గురు ముష్కరులను అరెస్టు చేశారు. ఫర్హాతుల్లా ఘోరీ ప్రధా న అనుచరుడైన ముసారాంబాగ్వాసి మహ్మద్ అబ్దుల్ జాహెద్, ఐసిస్ ఉగ్రవాది, హుమాయున్‌నగర్‌లోని రాయల్ కాలనీకి చెందిన మాజ్ హసన్ ఫారూఖ్, సైదాబాద్ పరిధిలోని అక్బర్‌బాగ్ ప్రాంతానికి చెందిన మహ్మద్ సమీదుద్దీన్ అలియాస్ అబ్దుల్ సమీలను అరెస్టు చేశారు. వారి నుంచి 4 హ్యాండ్ గ్రెనేడ్లు, 5.41 లక్షల నగదు, సెల్ఫోన్లు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అసాంఘిక కార్యకలాపాల నిరోధక చట్టంలోని 18, 18 (బీ), 20 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రధాన అనుచరుడి ద్వారా కుట్ర... అబ్దుల్ జాహెద్ 2004లో ఘోరీ ఆదేశాలతో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు జరిగిన కుట్రలో పాలుపంచుకున్నాడు. అప్పట్లో పేలుడు పదార్థాలను దాచి ఉంచిన కేసులో అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. అలాగే 2005 అక్టోబర్ 12న సరిగ్గా దసరా రోజునే హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు (బంగ్లాదేశీ డాలిన్) దాడి కేసులోనూ అరెస్టయి 2017 వరకు జైల్లో ఉన్నాడు. అయితే ఈ రెండు కేసులూ సరైన సాక్షా«ధారాలు లేక కోర్టులో వీగిపోవడంతో విడుదలైన జాహెద్.. సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఘోరీతో నిరంతరం టచ్‌లోనే ఉన్నాడు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతోపాటు నగరంలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరోసారి హైదరాబాద్‌లో ఉగ్రదాడులు జరపాలన్న లష్కరే తోయిబా ఆదేశాలతో ఘోరీ జాహెద్‌ను రంగంలోకి దించాడు. జైల్లో పరిచయమైన మాజ్‌తో కలిసి... నగరంలో దాడుల కోసం జాహెద్ తన స్నేహితుడైన మహ్మద్ సమీయుద్దీన్తోపాటు గతంలో ఐసిస్ కేసులో అరెస్టయిన మాజ్ హుస్సేన్ ఫారూఖ్‌ను ఎంచుకున్నాడు. 2015లో ‘ఐసిస్’ఉగ్రవాద సంస్థలో చేరేందుకు సిరియా వెళ్తూ నాగ్‌పూర్ విమానాశ్రయంలో అబ్దుల్లా బాసిత్ సహా చిక్కిన ముగ్గురు యువకుల్లో మాజ్ హుస్సేన్ ఒకడు. 2016 వరకు జైల్లో ఉన్న అతనికి అక్కడే జావేద్‌తో పరిచయమైంది. ఘోరీ చెప్పిన ఆపరేషన్ పూర్తి చేయడానికి సహకరించాలంటూ జావేద్ కోరడంతో మాజ్ అంగీకరించాడు. ఆరు చోట్ల రెక్కీలు... ఈ ఆపరేషన్‌కు అవసరమైన నగదును ఘోరీ హవాలా రూపంలో పంపాడు. పాక్‌లో తయారైన నాలుగు హ్యాండ్ గ్రెనేడ్స్‌ను తన నెట్వర్క్ సాయంతో హైదరాబాద్‌కు చేర్చాడు. ఆన్లైన్లో ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ 6 చోట్ల రెక్కీలు కూడా చేయించాడు. దసరా ఉత్సవాల ఊరేగింపు జరిగే మార్గాలతోపాటు ముగ్గురు బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుల ఇళ్లు, కార్యాలయాలు వాటిలో ఉన్నాయి. ఈ ముగ్గురూ దసరా రోజున ఎవరికి వారుగా విడిపోయి గ్రెనేడ్స్తో దాడులు చేయాలని పథకం వేశారు. నగర శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో ట్రయల్ రన్ కోసం ఓ గ్రెనేడ్ వాడాలని భావించారు. ఈ సన్నాహాల్లో ఉండగా కేంద్ర నిఘా వర్గాలకు ఉప్పందింది. వాళ్లు అప్రమత్తం చేయడంతో శనివారం రాత్రి సిటీ సీసీఎస్ అధీనంలోని సిట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రంగంలోకి దిగిన హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఈ ముగ్గురితోపాటు సైదాబాద్, మాదన్నపేట, పాతబస్తీకి చెందిన మరో నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ప్రమేయం లేని వారిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురినీ అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకోవాలని నిర్ణయించారు. 24 ఏళ్లుగా అజ్ఞాతంలో ఘోరీ... హైదరాబాద్ మాదన్నపేట సమీపంలోని కూర్మగూడకు చెందిన ఫర్హాతుల్లా ఘోరీ అలియాస్ అబు సూఫియాన్ 1998లోనే ఉగ్రవాదం వైపు మళ్లి అ/ê్ఞతంలోకి వెళ్లిపోయాడు. 2002లో గుజరాత్‌లోని అక్షర్ధామ్ ఆలయంపై జరిగిన ఉగ్ర దాడితోపాటు దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయం వద్ద పేలుడు, అదే ఏడాది ముంబైలోని ఘట్కోపర్ వద్ద జరిగిన బస్సులో పేలుడు, 2004లో సికింద్రాబాద్‌లోని గణేశ్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర, అదే ఏడాది బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర, 2005లో నగర కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి కేసుల్లోనూ అతను నిందితుడు. చాలాకాలం దుబాయ్ కేంద్రంగా కార్యకలాపాలు నడిపిన అతను ప్రస్తుతం పాక్‌లోని అబోటాబాద్ నుంచి కార్యకలాపాలు సాగిస్తూ నగర యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నాడు. అతనిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు కూడా జారీ చేసింది. -
టీఆర్ఎస్సే బీఆర్ఎస్..!
విషయం: భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందనున్న టీఆర్ఎస్ ముహూర్తం: దసరా రోజు మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు.. వేదిక: తెలంగాణ భవన్ ఆవిర్భావ సభ: డిసెంబర్ 9న ఢిల్లీలో.. (అధికారికంగా ప్రకటించాల్సి ఉంది) జెండా: గులాబీ రంగులోనే (చిహ్నం మార్పుతో) ఎజెండా: నీళ్లు, నియామకాలు, రైతులు, అభివృద్ధి (దసరా రోజు భేటీలో కేసీఆర్ స్పష్టత ఇస్తారు) సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి ఇక భారత రాష్ట్ర సమితిగా రూపాంతరం చెందుతోంది. దసరా పండుగ సందర్భంగా ఈ నెల 5న మధ్యాహ్నం ఒంటి గంటా 19 నిమిషాలకు తెలంగాణ భవన్ వేదికగా కొత్త జాతీయ పార్టీ పేరును టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రకటించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక భేటీలో ఈ మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రులతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులు, ఇతర కీలక నేతలతో కలిసి భోజనం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం వారితో సమావేశమయ్యారు. సుమారు గంటన్నర పాటు సాగిన ఈ భేటీలో చాలా వరకు జాతీయ రాజకీయాలు, బీజేపీ పాలన తీరు, కాంగ్రెస్ పరిస్థితి, కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుకు వస్తున్న స్పందన తదితరాలపై మాట్లాడినట్టు తెలిసింది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలంటూ పలువురు మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆహ్వానించినట్టు సమాచారం. దసరా రోజు విస్తృతస్థాయి సమావేశం కొత్త జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ కీలక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 5న తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పోరేషన్లు, జిల్లా పరిషత్, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లను ఆహ్వానించారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గం, 33 జిల్లాల అధ్యక్షులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులనూ కలుపుకొని మొత్తం 283 మంది ప్రతినిధులు విస్తృతస్థాయి భేటీలో పాల్గొననున్నారు. జిల్లాల వారీగా ఆహ్వానితులను సమన్వయం చేయాల్సిన బాధ్యతలను మంత్రులు, పార్టీ అధ్యక్షులకు అప్పగించారు. తెలంగాణ భవన్లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుండగా.. నిర్ణయించిన ముహూర్తానికి టీఆర్ఎస్ కొత్త జాతీయ పార్టీగా మారుతున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటన చేస్తారు. సమావేశం ముగిశాక తెలంగాణ భవన్‌లోనే పార్టీ ప్రతినిధులతో కలిసి కేసీఆర్ భోజనం చేస్తారు. డిసెంబర్లో.. ఢిల్లీ వేదికగా.. ఈ ఏడాది డిసెంబర్ 9న దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కొత్త జాతీయ పార్టీని కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ ఎత్తున ఆవిర్భావ సభ ఏర్పాటు చేసి.. కొత్త జాతీయ పార్టీతో కలిసి వచ్చే నేతలు, జాతీయ స్థాయిలో భావ సారూప్య పార్టీలకు చెందిన నేతలను ఆహ్వానిస్తారు. ఢిల్లీ బహిరంగ సభ డిసెంబర్ 9నే ఉంటుందా, లేక మరో తేదీన జరుగుతుందా అన్నదానిపై ఈ నెల 5న తెలంగాణ భవన్లో జరిగే సమావేశంలో స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి ఉన్న గులాబీ రంగు జెండా, చిహ్నం స్వల్ప మార్పులతో కొత్త జాతీయ పార్టీ కొనసాగనుంది. కొత్తగా ఏర్పాటయ్యే జాతీయ పార్టీ పేరు భారత రాష్ట్ర సమితిగా దాదాపుగా ఖరారైనా.. ఈ నెల 5వరకు సస్పెన్స్ కొనసాగే అవకాశముంది. కొత్త పార్టీ విధి విధానాలు, తదుపరి కార్యాచరణపై దసరా రోజు జరిగే సమావేశంలో కేసీఆర్ స్పష్టత ఇవ్వనున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు! ‘‘బీజేపీ దుర్మార్గాలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్రంలో ఇదే ప్రభుత్వం కొనసాగితే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం. బీజేపీ అధికార దాహంతో ప్రజస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తోంది. కాంగ్రెస్ పార్టీ క్రమంగా జనాదరణ కోల్పోతోంది. మనం ఏర్పాటు చేస్తున్న జాతీయ పార్టీ బీఆర్ఎస్కు అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు లభిస్తోంది. తెలంగాణ అభివృద్ధి మోడల్‌ను, రైతు సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ వస్తోంది..’’ అని ఆదివారం ప్రగతిభవన్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్టు తెలిసింది. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రస్తుతం రాజకీయంగా అత్యంత బలంగా ఉందని.. మునుగోడు ఉప ఎన్నికలో మంచి మెజారిటీతో గెలవబోతున్నామని స్పష్టం చేసినట్టు సమాచారం. దీనితోపాటు జాతీయ పార్టీ ఏర్పాటు ప్రయత్నాలు చేస్తున్నందునే బీజేపీ ఇబ్బందులకు గురి చేస్తోందని కూడా పేర్కొన్నట్టు తెలిసింది. -
మరో అదిరిపోయే సేల్..ఏకంగా 80 శాతం డిస్కౌంట్లు, ఆఫర్లు ఇవే!
కొనుగోలు దారులకు ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ బంపరాఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30వ తేదీ వరకు ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ను నిర్వహించింది. తాజాగా దసరా సందర్భంగా ఈ నెల 5 నుంచి 8 వరకు బిగ్ దసరా సేల్ 2022ను నిర్వహించనున్నట్లు తెలిపింది. నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ సేల్‌లో కొనుగోలు దారులకు భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు ప్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ వస్తువులపై 80 శాతం వరకు తగ్గింపులు, టీవీలపై 75 శాతం డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చని చెప్పింది. ఫ్యాషన్ వస్తువులపై 60 నుంచి 80 శాతం, ఏసీలు 55 శాతం తగ్గింపు ధరతో ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు 4కే అల్ట్రా హెచ్డీ టీవీలు రూ.17,249 నుంచి ప్రారంభం కానుండగా..వాషింగ్ మిషన్లు రూ.6,990 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఈ సేల్‌లో టీవీల ప్రారంభ ధర రూ.7199 కాగా, బ్యూటీ, ఫుడ్, టాయ్స్,హోం, కిచెన్ వస్తువుల ప్రారంభ ధరలు రూ.99గా ఉన్నాయని ఫ్లిప్ కార్ట్ పేర్కొంది. -
బెజవాడ కనక దుర్గమ్మ దసరా అలంకారాలు... నైవేద్యాలు
ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలు దశమి వరకు శక్తి ఆలయాలన్నింటా అమ్మవారిని రోజుకో రూపంలో అలంకరించి అంగరంగవైభవంగా, అత్యంత సంప్రదాయబద్ధంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. ఆ చల్లని తల్లి భక్తులకు రోజుకో అలంకారంలో దర్శనం ఇస్తుంది. వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఎక్కడెక్కడినుంచో విచ్చేస్తారు. అయితే విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై అవతరించిన దుర్గాదేవికి చేసే అలంకారాలకే ఎనలేని ప్రాధాన్యం ఉంది. అందుకే విజయవాడ కనకదుర్గమ్మ దసరా అలంకారాలను అందిస్తున్నాం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో బెజవాడ కనక దుర్గమ్మ రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. మొదటి రోజు: స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవి (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి, సోమవారం) శరన్నవరాత్రి మహోత్సవాల్లో తొలిరోజు శ్రీ అమ్మవారిని స్వర్ణకవచాలంకృత శ్రీ కనకదుర్గాదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారంలో అమ్మ బంగారు రంగు చీరలో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మను దర్శించుకుంటే సకల దారిద్య్రాలూ తొలగుతాయని ప్రతీతి. నైవేద్యం: చక్కెరపొంగలి. రెండవ రోజు: శ్రీబాలాత్రిపుర సుందరీదేవి(ఆశ్వయుజ శుద్ధ విదియ, మంగళవారం) దసరా ఉత్సవాల్లో రెండవ రోజు శ్రీ దుర్గమ్మను లేత గులాబీ రంగు చీరలో శ్రీ బాలాత్రిపురసుందరీదేవిగా అలంకరిస్తారు. బాలామంత్రం సమస్త దేవీమంత్రాల్లోకి గొప్పది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశిస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యంకొలువుండే పవిత్రమైన శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొదటి దేవత ఈ బాలాదేవి. బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపురసుందరీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. నివేదన: కట్టెపొంగలి మూడవరోజు: శ్రీగాయత్రి దేవి (ఆశ్వయుజ శుద్ధ తదియ, బుధవారం ) దసరా మహోత్సవాల్లో మూడవరోజున అమ్మవారు శ్రీ గాయత్రిగా దర్శనం ఇస్తారు. సకల మంత్రాలకీ మూలమైన శక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొందిన ఈ గాయత్రీదేవిని నారింజ రంగు చీరలో అలంకరిస్తారు. పంచముఖాలతో, వరదాభయహస్తాలను ధరించిన శ్రీ గాయత్రి అలంకారంలోని అమ్మవారిని దర్శించుకుంటే సర్వపాప హరణం జరుగుతుంది. నివేదన: పులిహోర నాలుగవ రోజు: శ్రీ అన్నపూర్ణాదేవి (ఆశ్వీయుజ శుద్ధ చవితి, గురువారం) సకల జీవరాశులకు అహారాన్ని అందించే దేవత అన్నపూర్ణాదేవి. గంధం రంగు లేదా పసుపు రంగు చీరను ధరించి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో అమృతాన్నాన్ని, వజ్రాలు పొదిగిన గరిటెతో తన భర్తౖయెన ఆదిభిక్షువు పరమ శివుడికి అన్నం పెడుతున్న అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే క్షుద్బాధలు ఉండవని భక్తుల నమ్మకం. నివేదన: దద్ధ్యోదనం, క్షీరాన్నం, అల్లం గారెలు. ఐదవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి (ఆశ్వీయుజ శుద్ధ పంచమి, శుక్రవారం ) త్రిమూర్తులకన్నా పూర్వం నుంచి ఉన్నది కాబట్టి త్రిపుర సుందరి అని పిలుస్తారు. లలితా త్రిపుర సుందరీ దేవియే శ్రీ చక్ర అధిష్ఠానశక్తిగా, పంచదశాక్షరీ మహామంత్రాధి దేవతగా తనను కొలిచే భక్తులను అనుగ్రహిస్తోంది. లక్ష్మి, సరస్వతి ఇరువైపులా వింజామర లు వీస్తుండగా, చిరు దరహాసంతో చెరుకుగడను చేతపట్టుకుని శివుని వక్షస్థలంపై కూర్చున్న శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిని దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరతాయని ప్రతీతి. నివేదన: అల్లం గారెలు ఆరవ రోజు: శ్రీ మహాలక్ష్మీదేవి (ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి, శనివారం) మంగళప్రదమైన దేవత శ్రీమహాలక్ష్మీదేవి. లోక స్థితికారిణిగా ధన, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి, సమష్టిరూపమైన అమృతస్వరూపిణిగా గులాబీ రంగు చీరను ధరించి, సర్వాభరణ భూషితురాలై ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే అషై్టశ్వర్యాలకు కొదవ ఉండదని ప్రతీతి. నివేదన: రవ్వకేసరి ఏడవ రోజు: శ్రీ సరస్వతీదేవి (ఆశ్వీయుజ శుద్ధ సప్తమి, ఆదివారం) మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణిమైన దుర్గాదేవి తన అంశలోని నిజరూపాన్ని సాక్షాత్కరింప చేయడమే మూలా నక్షత్రం నాడు చేసే సరస్వతీ అలంకారం ప్రత్యేకత. తెల్లని పట్టుచీర ధరించి, చేతిలో వీణతో సరస్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారి జన్మనక్షత్రం రోజున దర్శించుకుంటే భక్తుల కష్టాలు తీరతాయని, కోరిన విద్యలు వస్తాయనీ నమ్మకం. విద్యను, బుద్ధిని ప్రసాదించే సరస్వతీదేవి అలంకారంలోని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. నివేదన: పెరుగన్నం ఎనిమిదవ రోజు: శ్రీ దుర్గాదేవి (ఆశ్వీయుజ శుద్ధ అష్టమి, సోమవారం) దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అష్టమి రోజునే. అందుకే అమ్మవార్ని దుర్గాదేవిగా కీర్తిస్తారు. అందుకే ఈ అష్టమిని దుర్గాష్టమి అంటారు. దేవి త్రిశూలం ధరించి సింహవాహనాన్ని అధిష్ఠించి, బంగారు కిరీటాన్ని ధరించి తన కాలి కింద మహిషాసురుణ్ణి తొక్కిపెట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తుంది. దుర్గాదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే దుర్గతులు దూరం అవుతాయి. నివేదన: కదంబం (కూరగాయలు, ఆకుకూరలు, బియ్యం కలిపి వండే వంట) తొమ్మిదవ రోజు: శ్రీ మహిషాసుర మర్దిని దేవి, (ఆశ్వయుజ శుద్ధ నవమి, మంగళవారం) అష్ట భుజాలతో ఒక చేత త్రిశూలాన్ని ధరించి, సింహవాహనంపై దుష్ట రాక్షసుడైన మహిషాసురుడిని సంహరించి లోకానికి మేలు చేసింది. ఈ రూపంలో అమ్మ దర్శనం మానవాళికి సమస్త భయాల్ని పోగొట్టి ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదిస్తుంది. నవమి రోజున మహిషాసురుని సంహరించింది కాబట్టి ఈ పర్వదినాన్ని మహర్నవమి అని వ్యవహరిస్తారు. నివేదన: గుడాన్నం విజయదశమి: శ్రీరాజరాజేశ్వరీ దేవి (ఆశ్వీయుజ శుద్ధ దశమి, బుధవారం ) దసరా ఉత్సవాల్లో ఆఖరు రోజున దుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరిదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది. సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. షోడశ మహామంత్ర స్వరూపిణీ, మహాత్రిపురసుందరి, శ్రీ చక్ర అధిష్ఠాన దేవత శ్రీరాజరాజేశ్వరీదేవి విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడింది. విజయాన్ని సాధించింది కాబట్టి విజయ అని అంటారు. పరమ శాంత స్వరూపంలో చిరునవ్వులు చిందిస్తూ చెరుకుగడను చేతిలో పట్టుకొని ఉన్న అమ్మవారిని విజయదశమినాడు దర్శించుకుంటే అన్నింటా విజయం సాధిస్తారని నమ్మకం. నివేదన: పరమాన్నం (పాయసం) --డీ.వీ.ఆర్ భాస్కర్ ఫొటోల సహకారం: షేక్ సుబాని, సాక్షి, ఇంద్రకీలాద్రి -
Dussehra: నవదుర్గా అవతార రహస్యాలు.. ఏమిటీ దసరా? ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి
‘అమ్మ’ అంటే ఆత్మీయతకు ఆలవాలం. ఎందుకంటే, తనలోంచి మరొక ప్రాణిని సృజించగల శక్తి అమ్మకే ఉంది. ‘జగన్మాత’ అంటే జగత్తుకే తల్లి. ‘మా అమ్మ’ అంటే మనకు జన్మనిచ్చిన తల్లి. జగజ్జనని అంటే అన్ని లోకాలకూ అమ్మ. అందుకే భారతీయ ఆధ్యాత్మికత అమ్మకు ఎంతో విశేష ప్రాధాన్యాన్ని ఇచ్చింది. అమ్మకు తన బిడ్డలంటే ఎంతో వాత్సల్యం. అంతటి వాత్సల్యమూర్తి అయిన అమ్మ కూడా తన బిడ్డలు చెడ్డవారిగా తయారవడాన్ని, లోక కంటకులుగా మారడాన్ని సహించలేదు. వారిలోని దానవత్వాన్ని దునుమాడటానికి ఏమాత్రం వెనుకాడదు. ముందు మంచిగా చెబుతుంది. వినకపోతే ఆయుధాన్ని ధరిస్తుంది, బెదిరిస్తుంది. అప్పటికీ తీరు మార్చుకోక పోతే రౌద్రమూర్తిగా మారి సంహరిస్తుంది. వేల ఏళ్ల కిందట జరిగింది అదే. లోక కంటకులుగా మారిన దుష్టరాక్షసులను అమ్మ వెంటాడి, వేటాడి మరీ సంహరించింది. అందుకు ప్రతీకగా జరుపుకుంటున్న ఉత్సవాలే దసరా మహోత్సవాలు. ఈ సృష్టి యావత్తూ మంచి–చెడు శక్తులతో నిండి ఉంది. మానవాళిని పీడించే చెడు శక్తులను లోకరక్షణ చేసే దైవశక్తులు నిర్మూలిస్తాయి. అందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు అమ్మ నుంచే లభిస్తాయి. అయితే తాను అందించిన శక్తి సరిపోకపోతే తానే శక్తి స్వరూపిణిగా మారి, దానవత్వాన్ని దునుమాడుతుంది. ఉగ్రరూపిణిగా ఉన్న అమ్మను ప్రసన్నం చేసుకునేందుకు బిడ్డలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. గడ్డం పట్టుకుని బతిమాలుతారు. అప్పటికీ దిగిరాకపోతే పాదాల మీద పడి పూజిస్తారు. అమ్మకు ఇష్టమైనవన్నీ ఆమె పాదాల ముందు ఉంచి అమ్మ ప్రేమను, అనుగ్రహాన్ని అందుకుంటారు. ‘అమ్మ’ అనే శబ్దం తరతమ భేదాలతో దాదాపు అన్ని భాషల్లోనూ గొప్పగా ధ్వనిస్తుంది. బిడ్డలోని లోపాలను పట్టించుకోకుండా అక్కున చేర్చుకునే అమృతమూర్తి అమ్మ. లోకంలో తమ బిడ్డలను ఎంతో ప్రేమగా చూస్తారు తల్లులు. అయితే, తల్లి లేని వారిక్కూడా జగజ్జనని ఆ ప్రేమను అందిస్తుంది. అమ్మవారిది దివ్యానుగ్రహం. అది అందుకోగలిగిన వారిదే అదృష్టం. భారతీయుల గొప్పదనం తల్లిని దేవతగా ఆరాధించడం. తల్లి ఆరాధన ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో విధంగా జరగడం సర్వసాధారణం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో జగన్మాతను ‘బతుకమ్మ’ పేరుతో ఆరాధిస్తారు. బతుకమ్మ పండుగను చాలా శ్రద్ధాసక్తులతో నిర్వహించుకుంటారు. ఈ వేడుకల్లో మహిళల పాత్ర ఎక్కువగా కనిపిస్తుంది. బతుకమ్మ పండుగలో ఆటపాటలతోపాటు నైవేద్యాలది కూడా పెద్దపీట. ఆ అలంకరణలలోని ఆంతర్యం మాయావులైన రాక్షసులు అమ్మవారి కళ్లు కప్పేటందుకు రకరకాల వేషాలు వేశారు. వారి ఆట కట్టించేందుకు అమ్మవారు కూడా రోజుకో వేషం ధరించి తొమ్మిది రోజులు– రేయింబవళ్లూ మహాసంగ్రామం చేసింది. అందుకు ప్రతీకగానే నేటికీ భక్తులు అమ్మవారిని తొమ్మిది రోజులు ప్రత్యేక శ్రద్ధాసక్తులతో రోజుకో రూపంలో అలంకరించి, భక్తిశ్రద్ధలతో పూజించుకుని పరవశిస్తారు. పదోరోజున విజయోత్సాహ వేడుకలు జరుపుకుంటారు. విశిష్ట ఆరాధకులు తొమ్మిది మంది బాలికలను పూజించి, నూతన వస్త్రాలు సమర్పిస్తారు. పూజలు, ఆరాధనలు జరుగుతుంటాయి. కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా కోల్‌కతా, కర్ణాటక వంటి ప్రదేశాల్లో దసరా మహోత్సవాల్లో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. మైసూరు కూడా దసరా ఉత్సవాలకు ప్రసిద్ధి. ఏమిటీ దసరా? ‘దశహరా’అనే సంస్కృత పదం వికృత రూపంలోకి మారి ‘దసరా’ అయ్యింది. దశహరా అంటే పది జన్మల పాపాలను, పదిరకాలైన పాపాలను పోగొట్టేది అని అర్థం. దుర్గాదేవి కూడా తన భక్తుల జన్మజన్మల పాపాలను తొలగిస్తుంది కాబట్టి ఈ దేవిని స్మరిస్తూ చేసే ఉత్సవాలు దసరా ఉత్సవాలయ్యాయి. ఇక శబ్దార్థపరంగా చూస్తే ‘ద’ అంటే దానవులను, ‘సరా’ అంటే దూరం చేయునది–రాక్షసులను సంహరించి, ప్రజలకు సుఖశాంతులు అందించింది కాబట్టి ఆ ఆనందంతో దసరా వేడుకలు జరుపుకుంటున్నాం. నవరాత్రి వైశిష్ట్యం దసరా ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు జరుగుతాయి. అందుకనే వీటిని నవరాత్రులు అంటారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు జరిగే ఉత్సవ కాలమే నవరాత్రులు. నవరాత్ర వ్రతం ద్వారా తనను ఆరాధించిన వారిని దుర్గాదేవి అనుగ్రహిస్తుంది. రాత్రి శబ్దానికి పరమేశ్వరి అని, నవ అనే శబ్దానికి పరమేశ్వరుడనే అర్థాలు ఉన్నాయి. ఈ ప్రకారం చూస్తే పార్వతీపరమేశ్వరుల ఆరాధనమే నవరాత్ర వ్రతం. నవదుర్గా అవతార రహస్యాలు నవరాత్రి ఉత్సవాల్లో అందరినీ సమ్మోహితులను చేసే అంశం – అమ్మ వారి అలంకారాలు. రాక్షస సంహార క్రమంలో దుర్గాదేవి ధరించిన రూపాలకు ప్రతిగా రోజుకు ఒక్క అలంకారం చొప్పున నవరాత్రులు జరిగే రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. అసుర సంహారం చేసి సాధించిన విజయానికి చిహ్నంగా పదో రోజున విజయదశమి పర్వదినాన్ని జరుపుకుంటారు. మధుకైటభాది రాక్షస సంహారం కోసం అమ్మ ధరించిన ఈ రూపాలనే ‘నవదుర్గ’ రూపాలుగా దేవీ, మార్కండేయ, భవిష్య పురాణాలు చెబుతున్నాయి. దేవీ భాగవతం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిద అనేవి నవదుర్గా రూపాలు. ప్రతి అవతారానికి ఓ ప్రత్యేక ఆధ్యాత్మిక, ఉపాసనా రహస్యాలు ఉన్నాయి. జమ్మి బంగారమే!(Jammi Chettu- Health Benefits) ఈ పండగ సమయంలో అన్నిటికన్న ముఖ్యమైంది ముళ్ళకంపలాంటి ... కొండవాలుల్లో పెరిగే శమీవృక్షపూజ. దానికి కారణం రామరావణ యుద్ధానికి ముందు రాముడు, అరణ్యవాసాన తమ ఆయుధాలను మూటకట్టి ఈ చెట్టుపై ఉంచి పాండవులు ఈ చెట్టును పూజించడం వలన ఇది విజయమిచ్చే పూజనీయ వృక్షమైంది. ఈ చెట్టుబెరడుతో చేసే కషాయం దగ్గు, ఉబ్బసం వ్యాధులను నిరోధించి ఆరోగ్యాన్ని తద్వారా శుభాల్నిస్తుంది. అధిక జీర్ణశక్తిని కలిగిస్తుంది. ఆరోగ్యానికి ఔషధంలా జమ్మి చెట్టు ఎలా పనిచేస్తుందో, ఈ చెట్టు గొప్పతనమేంటో తెలియచెప్పటానికి, తెలుసుకోవటానికి జమ్మి ఆకులను పెద్దలకిచ్చి వారికి పాదాభివందనం చేసి వారి ఆశీస్సులు తీసుకుంటారు పిల్లలు. జమ్మి ఆకును తెలంగాణ ప్రాంతంలో బంగారమని పిలుస్తారు. ఈ పండుగ నాడు పెద్దలకు, పూజ్యులకు, ఆత్మీయులకు ఈ జమ్మి బంగారాన్ని ఇచ్చి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీ. దసరాకు ఇది మామూలే! దసరా రోజులలో వివిధ దేవుళ్ళ వేషధారణ చేసి ఇంటింటికి తిరిగి గృహస్థులు ఇచ్చినది పుచ్చుకోవడం కొందరు వృత్తిగా ఆచరిస్తారు. వీటికి దసరా వేషాలు లేదా పగటి వేషాలు అంటారు. సంవత్సర కాలంలో సేవలందిచిన వారు గృహస్థును మామూళ్ళు అడగటం, వారు కొంత ఇచ్చుకోవడమూ అలవాటే. దీనిని దసరా మామూలు అంటారు. కొత్తగా వివాహం జరిగిన ఆడపడచుని భర్తతో సహా ఇంటికి ఆహ్వానించి అల్లుడికీ కూతురికీ తలంటు పోసి నూతనవస్త్రాలు, కానుకలు ఇచ్చి సత్కరించడం కూడా అలవాటే. విజయాలకు కారకమైన దశమి విజయుడు (అర్జునుడు) విరాటరాజు కొలువులో ఉండి కౌరవ సేనలను ఓడించి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసిన రోజు కాబట్టి విజయ దశమి అయ్యింది. శ్రీరాముడు రావణ సంహారం చేసింది కూడా విజయ దశమినాడే. అందుకే ఈ దసరా పర్వదినాన రామ్‌లీలా ఆడటం ఆనవాయితీ. అదేవిధంగా షిరిడీ సాయిబాబా సమాధి చెందింది కూడా దసరా నాడే. నిజానికి దశ, హర అంటే పది చెడు లక్షణాలను తొలగించుకోవడం అని అర్థం. మనిషిలో పది దుర్గుణాలే అధర్మం వైçపు నడిపిస్తున్నాయి. ఆ చెడుగుణాలపై విజయం కోసమే దసరా పండుగ చేసుకుంటాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానుష, అహంకారాది లక్షణాలు మనుషులను దారి తప్పిస్తాయి. చెడు పనులకు ప్రోత్సహిస్తాయి. అవి ఇతరులకు హానిచేస్తాయి. వీటిపై విజయం సాధించడం మన ప్రథమ కర్తవ్యం. అందుకు అవకాశం కలిగిస్తూ విజయదశమి వేడుకలు జరిపించుకుంటున్న జగజ్జననికి జయము... జయము... దసరా ఉత్సవాల్లో ఆఖరి రోజు విజయ దశమినాడు రాత్రి సమయంలో ఇంద్రకీలాద్రి అధిష్ఠాన దేవత శ్రీ కనకదుర్గాదేవి, మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణానదిలో హంసవాహనంపై నదీవిహారం చేస్తారు. అమ్మవారి త్రిలోక సంచారానికి గుర్తుగా నదిలో మూడుసార్లు హంసవాహనాన్ని (తెప్పను) తిప్పుతారు. కన్నుల పండువగా సాగే ఈ తెప్పోత్సవంతో దసరా ఉత్సవాలు ముగుస్తాయి. -డీవీఆర్ భాస్కర్ ఫొటోల సహకారం: షేక్ సుబాని, సాక్షి, ఇంద్రకీలాద్రి -
టోల్ ప్లాజాలకు ‘దసరా’ వాహనాల తాకిడి.. కిలోమీటర్ల మేర..!
చౌటుప్పల్ రూరల్, బీబీనగర్: దసరా పండుగ నేపథ్యంలో హైదరాబాద్– విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఇప్పటికే స్కూళ్లకు, కాలేజీలకు సెలవులు ఇవ్వడం, ఆదివారం సెలవు దినం కావడంతో, శనివారం ఉదయం నుంచే వాహనాల్లో బయలుదేరారు. దీంతో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై, హైదరాబాద్–వరంగల్ రహదారిపై రద్దీ పెరిగింది. పంతంగి, కొర్లపహాడ్, గూడూరు టోల్ ప్లాజాలకు వాహనాల తాకిడి విపరీతమైంది. సరాసరి రోజుకు 27వేల వాహనాలకు పైగా రాకపోకలు సాగిస్తుండగా, శనివారం మరో 5వేల వాహనాలు అదనంగా వెళ్లాయి. పోలీసులు కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఇదీ చదవండి: Hyderabad: సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు -
మన మైసూర్.. ఇల్లెందు
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: దసరా ఉత్సవాలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసులకు గుర్తొచ్చేది ఇల్లెందు. కర్ణాటకలోని మైసూర్ తరహాలో ఇక్కడ భారీగా ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ముఖ్యంగా విజయదశమి రోజున జరిగే జమ్మిపూజ, దేవుడి శావ(ఊరేగింపు) చూసేందుకు ఇతర ప్రాంతాల వారు సైతం ఇల్లెందుకు వస్తుంటారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచీ జరుగుతున్న ఉత్సవాల తీరుతెన్నులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. గోవింద్ సెంటర్ చుట్టూ.. దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా బొగ్గుతవ్వకాలు ఇల్లెందులో ప్రారంభమయ్యాయి. బొగ్గు గనుల్లో పని కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. బొగ్గు తవ్వకం, రవాణా ఇతర పనుల పర్యవేక్షణ కోసం బ్రిటిష్ సిబ్బంది, అధికారులు ఇల్లెందులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇక బొగ్గు గనులకు, బ్రిటీషర్లకు రక్షణగా నాటి సైన్యాన్ని, ఇతర సిబ్బందిని నిజాం రాజు నియమించాడు. అలా ఇల్లెందులపాడు చెరువు నుంచి ప్రస్తుత గోవింద్ సెంటర్ వరకు ఉన్న ప్రదేశంలో స్థానికులు, బ్రిటీషర్లు, నిజాం సేనలు నివసించేవారు. ఉల్లాసం కోసం భజన బృందాలు సాంకేతిక పరిజ్ఞానం అంతగాలేని ఆ రోజుల్లో చిన్న చిన్న బావులను తవ్వి బొగ్గు వెలికితీసేవారు. ఆ బావుల చుట్టే కార్మికులు ఇళ్లు నిర్మించుకుని ఉండేవారు. ప్రస్తుతం దో నంబర్ బస్తీగా పిలుస్తున్న ప్రాంతాన్ని అప్పుడు బండమీద బాయిగా పిలిచేవారు. అక్కడ రెండో నంబర్ పేరుతో గని ఏర్పాటు చేశారు. అందులో పనిచేసే కార్మికులు అక్కడే నివసించేవారు. పని ప్రదేశాన్ని మినహాయిస్తే చుట్టూ దట్టమైన అడవిగా ఉండేది. రాత్రివేళ అడవి జంతువుల భయంతో కార్మికులు వణికిపోయేవారు. అంతేకాదు.. దుర్భరమైన పరిస్థితుల మధ్య ప్రాణా లకు తెగించి బొగ్గు ఉత్పత్తి చేసేవారు. దీంతో వారికి మానసికోల్లాసం కోసం తొలిసారిగా నంబర్ 2 బస్తీ ఏరియాలోని కార్మికుల కుటుంబాలతో కలిసి శ్రీకృష్ణ భజన బృందం ఏర్పడింది. రాత్రివేళ కార్మికులు, వారి కుటుంబసభ్యులు ఒక చోట చేరి కృష్ణుడి భజన చేసేవారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని ఇల్లెందులోని ఇతర కార్మిక వాడల్లోనూ భజన బృందాలు ఏర్పడ్డాయి. అలా ఇల్లెందులపాడులో హనుమాన్, శ్రీరామ భజన బృందాలు ఏర్పాటయ్యాయి. ఇల్లెందులో జరిగిన దసరా ఉత్సవాలకు హాజరైన ప్రజలు (ఫైల్) మిషన్ స్కూల్ వద్ద జమ్మిపూజ ప్రస్తుతం మిషన్ స్కూల్‌గా పిలుస్తున్న ప్రాంతంలో బ్రిటిష్ అధికారుల వసతిగృహం, మిషన్ హాస్పిటల్ ఉండేవి. ఈ బంగళాల సమీపంలోనే జమ్మిచెట్టు ఉండేది. దసరా రోజున ఈ జమ్మిచెట్టు చెంతన పూజలు నిర్వహించేవారు. దీంతో విజయదశమి నాడు నంబర్ 2 బస్తీకి చెందిన కృష్ణ భజన బృందం, ఇల్లెందుల పాడు నుంచి శ్రీరామ భజన బృందం సభ్యులు కృష్ణుడు, రాముడి ప్రతిమలను కావడి/పల్లకిలో మోసుకూంటూ ఈ జమ్మిచెట్టు మైదానానికి చేరుకునేవారు. అక్కడ సామూహిక భజనతో పాటు జమ్మిపూజలు ఘనంగా జరిగేవి. 1940వ దశకంలో మొదలు గోవింద్ సెంటర్ పరిసర ప్రాంతాల్లోనే అధికంగా నివసించే బ్రిటిష్ కుటుంబాలు, నిజాం ఉద్యోగుల కుటుంబాలు సైతం క్రమంగా ఈ వేడుకల్లో భాగస్వాములయ్యేవి. అలా 1940వ దశకం నుంచి ప్రభుత్వ, పాలకులంతా కలిసి ఘనంగా దసరా నిర్వహించడం మొదలైంది. దేశానికి స్వాత్రంత్య్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది. సందడే సందడి.. ఒకప్పుడు శ్రీరామ, శ్రీ కృష్ణ భజన బృందాలే ఇక్కడికి శావలు తీసుకొచ్చేవి. ఆ తర్వాత ఇతర కాలనీలు, అసోసియేషన్ల తరఫున కూడా శావలు తీసుకురావడం ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి వరకు శావలు జమ్మిగ్రౌండ్‌కు చేరుకునేవి. జమ్మిపూజకు వచ్చిన భక్తులు చివరి శావ వచ్చేవరకూ ఎదురు చూసేలా ఉండడం కోసం 1993 నుంచి మ్యూజికల్ నైట్ సైతం ఈ వేడుకల్లో భాగమైంది. ఆ తర్వాత డ్యాన్స్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 2013 నుంచి రావణవధ సైతం ఇక్కడ వేడుకగా నిర్వహిస్తున్నారు. వీఐపీల రాక.. రాష్ట్రంలో విజయదశమి వేడుకలు అంటే ఇల్లెందులోనే అనేంత ఘనంగా జరుగుతాయి. ప్రతీ దసరా కు స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా ముఖ్య అతిథులుగా వస్తుంటా రు. క్రమంగా ఇల్లెందులో కార్మికుల సంఖ్య తగ్గినా ఉత్సవాల నిర్వహణలో మాత్రం ఏ మార్పూ రాలే దు. ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన వారు సైతం దసరాకు ఇల్లెందు రావడానికి ఆసక్తి కనబరుస్తారు. జమ్మి వేడుకల అనంతరం సమీపంలోని కోటమైసమ్మ జాతరకు పోటెత్తుతారు. విజయదశమి రోజు న పట్టణంలోని అన్ని సినిమా థియేటర్లలో తెల్లవార్లూ ప్రదర్శనలు ఉంటాయి. దాదాపు 80 ఏళ్లుగా మిషన్ స్కూల్ మైదానంలో జరుగుతున్న ఉత్సవాలను ఈసారి జేకే స్కూల్ గ్రౌండ్‌కు మార్చారు. ఈ కొత్త వేదికలో జమ్మి వేడుకలు ఎలా జరుగుతాయో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. భక్తి భావాన్ని కొనసాగిస్తున్నాం.. మా పూర్వీకులు ప్రతిరోజూ సాయంత్రం శ్రీరామ భజన మందిరంలో స్వామివారిని స్మరిస్తూ భజన చేసేవారు. దసరా ఉత్సవాల సమయంలో రథాన్ని అందంగా అలంకరించి జమ్మి గ్రౌండ్ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి పూజలు చేసేవారు. 80 ఏళ్ల క్రితం నాటి ఆనవాయితీని నేటికీ కొనసాగిస్తున్నాం. – శ్రీరామ భజన బృందం సభ్యులు, ఇల్లెందు భక్తులను ఉత్సాహ పర్చేందుకే ఇల్లెందులో దసరా, వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేవాళ్లం. దసరా ఉత్సవాల్లో జమ్మిగ్రౌండ్‌కు వచ్చే భక్తులను ఉత్సాహపర్చేందుకు 1983 నుంచి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 2013 నుంచి రావణ వధ కూడా చేస్తున్నాం. – మడత వెంకట్‌గౌడ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, ఇల్లెందు భక్తులు ఆశించిన విధంగా దసరా ఉత్సవాలు దశాబ్దాలుగా ఇల్లెందులో దసరా ఉత్సవాలు మైసూర్ తరహాలో కొనసాగుతున్నాయి. గతానికి ఏ మాత్రం తీసిపోకుండా ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తాం. ఇందుకోసం మున్సిపల్ పాలకవర్గం, స్థానిక ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అందరం కలిసి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నాం. – దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్, ఇల్లెందు. -
Dussehra: కానరాని పాలపిట్ట.. జాడలేని జమ్మిచెట్టు!
భద్రాద్రి జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణవాసులు దసరా ఉత్సవాలు జరుపుకొనే రైటన్ బస్తీ వేదిక దగ్గర ఉన్న చిన్న జమ్మి మొక్క ఇది. ప్రజలంతా పూజ చేసేందుకు ఇదే దిక్కు. పక్కనే ఉన్న పాల్వంచ కనకదుర్గ ఆలయం వద్ద పూజలందుకునే జమ్మి చెట్టు కూడా రేపోమాపో కనుమరుగయ్యేలా ఉంది. ఈ రెండు చోట్ల అనే కాదు. పల్లెపట్నం తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా జమ్మి చెట్ల సంఖ్య తగ్గిపోతోంది. అంతే ప్రాశస్త్యమున్న పాలపిట్టల దర్శనమూ అరుదైపోయింది. సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడి పండుగలకు ప్రాధాన్యం పెరిగింది. బతుకమ్మ సంస్కృతి విదేశాలకు కూడా విస్తరించింది. దసరాను ఘనంగా జరుపుకోవడమూ పెరిగింది. కానీ ఆ రోజున జమ్మిచెట్టుకు పూజ చేయడం, పాలపిట్టను దర్శించుకోవడమనే సంప్రదాయం మాత్రం క్రమంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు పంట పొలాల్లో, చెరువు గట్ల వెంబడి, రోడ్ల పక్కన విరివిగా కనిపించిన పాలపిట్టలు ఇప్పుడు కానరాకపోవడం, జమ్మి చెట్ల జాడ లేకుండా పోతుండటమే దీనికి కారణం. రకరకాల కారణాలతో.. కాకులు, పిచ్చుకలు, గద్దల తరహాలో మనుషులు సంచరించే చోటే ఎక్కువగా పాలపిట్టలు మనగలుతాయి. అవి పంటలను ఆశించే క్రిమికీటకాలను తిని బతకడమే దీనికి కారణం. సాగులో పురుగుల మందుల వాడకం పెరగడం, పంటల సాగు తీరు మారిపోవడంతో పాలపిట్టలపై ప్రభావం పడింది. మొక్కజొన్న, జొన్న, చిరుధాన్యాల వంటి ఆహార పంటలను ఆశించే పురుగులను పాలపిట్టలు తింటాయి. కానీ వాటి స్థానంలో పత్తి, పొగాకు, ఇతర వాణిజ్య పంటల సాగు పెరిగింది. వీటిలో పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉండటం, లద్దె పురుగు, గులాబీ పురుగు వంటివి రాత్రివేళ పంటలపై దాడి చేస్తుండటంతో పాలపిట్టలకు ఆహారం కరువైంది. పురుగుమందుల ప్రభావంతో పాలపిట్టల సంతానోత్పత్తి సామర్థ్యం క్షీణిస్తోంది. ఒక సీజన్లో మూడు, నాలుగు గుడ్లు పెట్టే స్థాయి నుంచి క్రమంగా ఒకట్రెండుకే పరిమితమవుతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పంట పొలాల వెంట ఉండే చెట్లు, చెరువు గట్ల వెంట ఉండే నల్లతుమ్మ వంటి చెట్లను నరికివేయడం వల్ల పాలపిట్టలకు ఆవాసం కరువైపోతోంది. ఈ కారణాలతో పాలపిట్టల సంఖ్య తగ్గిపోతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొమ్మల నరికివేతతో పాల్వంచ పెద్దమ్మ ఆలయం వద్ద జమ్మిచెట్టు పరిస్థితి ఇలా... జమ్మి చెట్టుకు చోటేదీ? దసరా పండుగ రోజు తెలంగాణలో ఊరూరా జమ్మిచెట్టుకు పూజ చేస్తారు. ఇప్పుడు ఊళ్లలో జమ్మిచెట్లు కనుమరుగవడంతో.. అడవుల్లో వెతికి జమ్మిచెట్టు కొమ్మలను తెచ్చి తంతును పూర్తిచేస్తున్నారు. హరితహారం కింద, పల్లె ప్రకృతి వనాల్లో భారీగా మొక్కలు నాటుతున్నా ఎక్కడా జమ్మిచెట్టుకు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పాలపిట్టలు తగ్గిపోతున్నాయి వ్యవసాయంలో పురుగు మందుల వాడకం, పొలాల్లో చెట్ల నరికివేత వంటివాటితో పాలపిట్టలు కనుమరుగవుతున్నాయి. అందుకే ఊళ్లలో పాలపిట్టలు కనిపించడం లేదు. అడవుల్లో మాత్రమే ఉంటున్నాయి. పాలపిట్టల సంరక్షణ, జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నాం. – కట్టా దామోదర్‌రెడ్డి, వైల్డ్ లైఫ్ ఎఫ్డీఓ, పాల్వంచ డివిజన్ -
ట్రిపుల్ ఐటీలకు 9 వరకు దసరా సెలవులు
నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు 9వ తేదీ వరకు దసరా సెలవులను ప్రకటించారు. దీంతో ట్రిపుల్ ఐటీలకు చెందిన విద్యార్థులందరూ శనివారం ఇంటిబాట పట్టారు. సెలవుల నేపథ్యంలో నూజివీడు ట్రిపుల్ ఐటీలోని విద్యార్థులందరూ నేరుగా వారి ప్రాంతాలకు చేరుకునేందుకు గాను ఆర్టీసీ నూజివీడు అధికారులు ట్రిపుల్ ఐటీ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. దాదాపు 8 వేల మంది విద్యార్థులుండగా వారి కోసం రాజమండ్రి, అమలాపురం, రాజోలు, కాకినాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, గుంటూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు 56 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో ఈ బస్సలు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు విద్యార్థులను వారి ప్రాంతాలకు తీసుకెళ్లాయి. అయితే దూర ప్రాంతాలకు చెందిన కొందరు విద్యార్థులు విజయవాడ, హనుమాన్ జంక్షన్ రైల్వేస్టేషన్లకు వెళ్లారు. -
మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా బెజవాడ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం అమ్మవారు మహాలక్ష్మీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శనివారం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 11 వరకు దాదాపు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మహాలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల ఐశ్వర్యప్రాప్తి, విజయం లభిస్తాయని భక్తుల నమ్మకం. శనివారం సాయంత్రం నగరోత్సవం కనుల పండువగా సాగింది. ఆదివారం అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి 2.5 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఆదివారం రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. వీఐపీలకు, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలుండవని అధికారులు చెప్పారు. కొండపైకి వాహనాలను అనుమతించేది లేదన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా నగరంలోకి వాహనాలు రాకుండా వెలుపల నుంచే మళ్లిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి వినాయక టెంపుల్ వరకు, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు, కుమ్మరిపాలెం నుంచి మోడల్ గెస్ట్‌హౌస్ వరకు వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. కాగా, శనివారం అమ్మవారిని మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ దర్శించుకున్నారు. నేటి అలంకారం శ్రీ సరస్వతిదేవి ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): దసరా ఉత్సవాల్లో భాగంగా కనకదుర్గమ్మ మూలా నక్షత్రం రోజైన ఆదివారం సరస్వతిదేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. సరస్వతిదేవిని దర్శించుకోవడం వల్ల సర్వ విద్యలలో విజయం లభిస్తుందని భక్తుల నమ్మకం. -
దసరా.. కొత్త పార్టీ.. ఊరూవాడా సంబురాలు
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో ఊరూవాడా సంబురాలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అటు దసరా పండుగ, ఇటు కొత్త పార్టీ నేపథ్యంలో భారీ ఎత్తున ర్యాలీలు, సమావేశాలు, వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించి టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతిభవన్‌లో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులతోపాటు టీఆర్ఎస్ పార్టీకి చెందిన 33 జిల్లాల అధ్యక్షులనూ ఈ సమావేశానికి రావాల్సిందిగా శనివారం ఆహ్వానం పంపారు. సీఎం కేసీఆర్ ఆదివారం ఉదయం గాంధీ ఆస్పత్రి ఎదుట గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకుంటారు. మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేస్తారు. ఆ తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. అయితే సమావేశ ఎజెండా ఏమిటనే దానిపై మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఊరూరా భారీగా సంబురాల కోసం జాతీయ పార్టీ ఏర్పాటుపై ఈ నెల 5న దసరా రోజున పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ వేదికగా సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నారు. ఆ కొత్త పార్టీ ప్రకటన, ఏర్పాట్లకు సంబంధించి ఆదివారం జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ కీలక సంకేతాలు, సూచనలు ఇవ్వనున్నట్టు తెలిసింది. జాతీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేసిన వెంటనే దేశవ్యాప్తంగా కేసీఆర్‌ను జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ ప్రకటనలు వెలువడేలా ఇప్పటికే ఏర్పాట్లు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు, కటౌట్లు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదే సమయంలో కొత్త జాతీయ పార్టీని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున సంబురాలు నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నట్టు తెలిసింది. మంత్రులు, జిల్లా అధ్యక్షులకు బాధ్యతలు కొత్త పార్టీ ప్రకటనకు మరో మూడు రోజులు సమయం ఉన్నందున ఊరూరా సంబురాలు నిర్వహించేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై ఆదివారం జరిగే భేటీలో కేసీఆర్ దిశానిర్దేశం చేసే అవకాశముంది. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో పండుగ వాతావరణాన్ని ఇనుమడించేలా కొత్త పార్టీని స్వాగతిస్తూ సంబురాలు ఉండాలని కేసీఆర్ భావిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దసరా రోజున పార్టీ ఏర్పాటు ప్రకటన వెలువడిన వెంటనే ఊరూరా ర్యాలీలు, ఊరేగింపులు, ముఖ్య కూడళ్ల అలంకరణ తదితర ఏర్పాట్లు చేయనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు, సమన్వయం చేసే బాధ్యతను మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులకు అప్పగించనున్నట్టు సమాచారం. ఈ అంశాలన్నింటికీ సంబంధించి ఆదివారం జరిగే భేటీలో సీఎం కేసీఆర్ సూచనలు చేయనున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌కు జాతీయ నేతలు కొత్త పార్టీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే జాతీయ స్థాయిలో పలువురు ప్రముఖ నేతలను కేసీఆర్ ఆహ్వానించారు. కేసీఆర్ నుంచి ఆహ్వానాలు అందుకున్న వారిలో ఇప్పటివరకు బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, మాజీ ముఖ్యమంత్రులు అఖిలేశ్ యాదవ్ (ఉత్తరప్రదేశ్), కుమారస్వామి (కర్ణాటక), శంకర్‌సింగ్ వాఘేలా (గుజరాత్) తమ రాకను ఖరారు చేశారు. 5న ఉదయం వారు ప్రగతిభవన్‌కు చేరుకుని.. అదే రోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగే టీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ భేటీలో వారు సీఎం కేసీఆర్‌తో కలిసి పాల్గొననున్నారు. మరికొందరు నేతలు కూడా వచ్చే అవకాశం ఉందని.. వారి పర్యటన ఒకట్రెండు రోజుల్లో ఖరారు అవుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా రేపు (02.10.2022, ఆదివారం) మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దర్శించుకోనున్నారు. అంతేకాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కార్యక్రమం అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక ఇంద్రకీలాద్రిపై దసరా శోభ కనిపిస్తోంది. దసరా నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మూలానక్షత్రం సందర్భంగా భక్తులు భారీగా పోటెత్తుతారని ఆలయ అధికారులు అంచనా వేసి.. అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. -
Hyderabad: పండగ ప్రయాణాలపై పోలీసుల అలర్ట్.. సోషల్ పోస్టులొద్దు!
సాక్షి, హైదరాబాద్: ‘దసరా పండగకు సొంతూరికి వెళ్తున్నామని, ఫ్యామిలీతో లాంగ్ టూర్లో ఉన్నామని..ఇలా రకరకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టకండి. ఎందుకంటే మీరు తిరిగొచ్చేసరికి మీ ఇల్లు గుల్లయ్యే ప్రమాదముంది.’ అంటూ పోలీసులు నగర పౌరులను హెచ్చరిస్తున్నారు. ఇటీవల నేరస్తులు సైతం తెలివిమీరి సోషల్ మీడియాను ఫాలో అవుతూ ఊరెళ్లిన వారి ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పలు సూచనలు చేశారు. ► మీరు ఊరెళుతున్న విషయాన్ని స్థానిక పోలీసుస్టేషన్లో సమాచారం ఇవ్వాలి. ► ఇంటి లోపల సీసీ కెమెరాలు అమర్చుకొని, వాటి డీవీఆర్లు బయటికి కనిపించకుండా రహస్య ప్రదేశంలో ఉంచాలి. ► సీసీ కెమెరాలను ఆన్లైన్లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ► బంగారు, వెండి ఆభరణాలు, నగదును బ్యాంకులో భద్రపర్చుకోండి. లేదా ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. ► ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సార్లను ఏర్పాటు చేసుకోవాలి. ► కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 9490617444 వాట్సాప్ నంబరులో సమాచారం ఇవ్వాలి. -
దేవీ శరన్నవరాత్రులు: అమ్మవారికి రూ.5,55,55,555తో అలంకారం
దేవీ శరన్నవరాత్రోత్సవాలతో ఆధ్యాత్మికశోభ వెల్లివిరుస్తోంది. వేడుకల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లు స్కందమాతగా దర్శనమిచ్చారు. విజయవాడ కనకదుర్గను, వరంగల్ భద్రకాళిదేవిని శ్రీలలితాత్రిపుర సుందరిగా అలంకరించారు. – జోగుళాంబ శక్తిపీఠం(గద్వాల జిల్లా)/ హనుమకొండ కల్చరల్/ బాసర(ముథోల్) దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌నగర్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారిని మహాలక్ష్మి దేవి రూపంలో అలంకరించారు. రూ.5,55,55,555.55(5 కోట్ల 55 లక్షల 55 వేల 555 రూపాయల 55 పైసలు)ల కరెన్సీ నోట్లతో అలంకరించి పూజలు చేశారు. – స్టేషన్ మహబూబ్‌నగర్ -
డాడీ.. మంచి ఒక ముచ్చట జెప్పవే!
బహుశా.. ఆ పోరడు సంబురంగా ఇంటికి చేరే ఉంటడు. మధ్యల ఆగి షాపుల కొత్త బట్టలు కొనుక్కునే ఉంటడు. ముక్కవాసనొచ్చే దుప్పట్లు, ఇడిసిన బట్టలు ఉతికించుకుని కూడా ఉంటడు. అట్లే.. అమ్మ చేసిన గారెలు, కారప్పుస తింటూ.. సరదాగా దోస్తులతో ఆడుకుంట.. బాంబులు పేల్చుకుంట.. డాడీ చేతిల తన్నులు వడుకుంట ఉండాలనే కోరుకుందం. ఎందుకంటే ఆ పోరడు అవ్వయ్యలను అంతగా ఒర్రిచ్చిండు కావట్టి. పండుగలొస్తే సొంత ఊళ్లకు బయలుదేరే జోష్‌లో మునిగిపోతుంటారు అంతా. కానీ, హాస్టల్ స్టూడెంట్స్‌కు మాత్రం అవి భావోద్వేగాలతో నిండిన క్షణాలనే చెప్పొచ్చు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు వస్తారా? అనే ఎదురుచూపులు వర్ణణాతీతం. అలాంటి పిలగాడి ఆడియో క్లిప్ ఒకటి ‘హాస్టల్ తిప్పలు’ పేరుతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ‘‘డాడీ.. నాకు మనసొప్పుతదలేదే..’’ అంటూ మొదలుపెట్టిన ఆ చిన్నారి.. తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన ఆడియో క్లిప్ ఒకటి గత రెండు మూడు రోజులుగా విపరీతంగా వైరల్ అవుతోంది. వాట్సాప్ మొదలు.. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసినా ఈ క్లిప్ సందడి చేస్తోంది. ‘‘డాడీ.. ఒక మంచి ముచ్చట చెప్పవే.. అన్నీ సర్దుకుని రెడీగా ఉండమంటూ’’ తల్లిదండ్రులు చెప్పాల్సిన మాటలను కూడా తనే చెప్పి.. వాళ్లకు విసుగు తెప్పించాడు ఆ చిన్నారి. అంతేకాదు ఆ తండ్రితో పాటు తల్లి కూడా అతన్ని సముదాయించేందుకు చెప్పిన మాటలు, పదే పదే ఫలానా డేట్‌కు కన్ఫర్మ్ వస్తరు కదా అని అడగడం, గిదే లాస్ట్ అంటూ చివర్లో ఆ చిన్నారి పలికిన పలుకులు నవ్వులు పూయిస్తున్నాయి. అయితే.. అదే సమయంలో ఊపిరి తీయకుండా ఆ చిన్నారి మాట్లాడిన మాటలు, అతనిలోని బాధ-ఆందోళన.. అన్నింటికి మించి సున్నితత్వాన్ని ప్రతిబింబించాయని చాలామంది అభిప్రాయపడుతున్నారు. హాస్టల్లో ఉంటేనే.. అలాంటి కష్టాలు తెలుస్తాయని కామెంట్లు చేస్తున్నారు. దసరా సెలవులంటే.. బహుశా ఇది ఈ మధ్య సంభాషణ అయి ఉండొచ్చు. ఆడియో క్లిప్ ఉద్దేశం ఏదైనా.. వైరల్ మాత్రం విపరీతంగా అయ్యింది. మరి.. అనుకున్నట్లు ఆ తల్లిదండ్రులు ఆ పిలగాడి దగ్గరకు వెళ్లారా? ఇంటికి తీసుకువెళ్లారా? అనే ఆత్రుతతో ప్రశ్నించే వాళ్లే కామెంట్ బాక్స్‌లో ఎక్కువైపోయారు. మొత్తానికి ఆ ఫ్యామిలీ ఎవరో.. ఎక్కడుంటారో!. Video Credits: pranks telugu -
Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా
Ghee Rice, Paneer Jalebi Recipes In Telugu: ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిచ్చే అమ్మవారికి వివిధ రకాల వంటకాలను నైవేద్యాలుగా పెడుతుంటాము. ఈ దసరాకు ఏటా పెట్టే వాటితోపాటు ఎంతో రుచికరమైన ఈ కింది నైవేద్యాలను కూడా అమ్మవారికి సమర్పించి మరింత ప్రసన్నం చేసుకుందాం.. ఘీ రైస్ కావలసినవి: ►బాస్మతి బియ్యం – కప్పు ►నెయ్యి – రెండున్నర టేబుల్ స్పూన్లు ►బిర్యానీ ఆకు – ఒకటి ►యాలకులు – రెండు ►లవంగాలు – రెండు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►అనాస పువ్వు – ఒకటి ►మరాటి మొగ్గ – ఒకటి ►జీలకర్ర – టీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను ►పచ్చిబఠాణీ – అరకప్పు ►స్వీట్ కార్న్ – అరకప్పు ►పచ్చిమిర్చి – మూడు (సన్నగా తరగాలి). తయారీ: ►స్వీట్‌కార్న్, పచ్చిబఠాణీలను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూను నెయ్యి వేయాలి. ►వేడెక్కిన నెయ్యిలో బాస్మతి బియ్యాన్ని కడిగి వేసి రెండు నిమిషాలు మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, అనాసపువ్వు, మరాటి మొగ్గ, అరటీస్పూను జీలకర్ర వేసి తిప్పాలి. ►దీనిలో ఒకటిన్నర కప్పులు నీళ్లుపోసి అన్నం పొడిపొడిగా వచ్చేలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►స్టవ్ మీద మరో బాణలి పెట్టి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు నెయ్యి వేయాలి. ►నెయ్యి వేగాక అరటీస్పూను జీలకర్ర, జీడిపప్పు పలుకులువేసి వేయించాలి. ►ఇవి వేగాక తరిగిన పచ్చిమిర్చి, ఉడికించిన పచ్చిబఠాణి, స్వీట్ కార్న్ వేసి మీడియం మంటమీద వేయించాలి. ►ఇప్పుడు అన్నం వేసి అన్నింటిని చక్కగా కలిసేలా కలియతిప్పి దించేయాలి. ►నెయ్యి, బాస్మతీల సువాసనలతో కాస్త ఘాటుగా, తియ్యగా ఉండే నెయ్యి అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పనీర్ జిలేబీ కావలసినవి: ►పనీర్ ముక్కలు– అరకప్పు ►మైదా – అరకప్పు ►వంటసోడా – చిటికెడు ►కార్న్‌ఫ్లోర్ – టేబుల్ స్పూను ►ఆరెంజ్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను ►పాలు – పావు కప్పు ►నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా ►పిస్తాపలుకులు – గార్నిష్‌కు తగినంత. సుగర్ సిరప్ కోసం: పంచదార – కప్పు, నీళ్లు – అరకప్పు, కుంకుమపువ్వు రేకలు – ఎనిమిది, నిమ్మరసం – రెండు చుక్కలు, యాలకులపొడి – పావు టీస్పూను. తయారీ: ►పనీర్ ముక్కలను బ్లెండర్లో వేసి పేస్టులా గ్రైండ్ చేయాలి ►పనీర్ పేస్టుని ఒక గిన్నెలో వేయాలి. ఈ గిన్నెలోనే కార్న్‌ఫ్లోర్, వంటసోడా, మైదా, ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి కలపాలి. ►ఇప్పుడు టేబుల్ స్పూన్ చొప్పున పాలు పోసి కలుపుతూ మెత్తటి పిండి ముద్దలా కలుపుకోవాలి. ►పిండి ఎండిపోకుండా తేమగా ఉండేలా పాలు అవసరాన్ని బట్టి పోసి, కలిపి పక్కన పెట్టుకోవాలి. ►పంచదారను మందపాటి బాణలిలో వేసి నీళ్లు, నిమ్మరసం, కుంకుమ పువ్వు వేసి మీడియం మంటమీద పంచదార తీగపాకం రానివ్వాలి. ►పాకం వచ్చిన వెంటనే యాలకుల పొడి వేసి కలిపి దించేయాలి. ►కలిపి పెట్టుకున్న పిండిముద్దను మౌల్డ్‌లో వేసుకుని నచ్చిన పరిమాణంలో జిలేబీ ఆకారంలో వేసి డీప్‌ఫ్రై చేసుకోవాలి. ►జిలేబీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసి పాకంలో వేయాలి. ►రెండు నిమిషాలు నానాక మరోవైపు తిప్పి మరో రెండు నిమిషాలు నాననిచ్చి పిస్తా పలుకులతో గార్నిష్ చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకోవాలి. ఈ వంటకాలు ట్రై చేయండి: Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! తయారీ ఇలా Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
దసరావళి ధమాకా! బంపరాఫర్, కొనుగోలు దారులకు భారీ డిస్కౌంట్స్
హైదరాబాద్: మొబైల్ రిటైల్ విక్రయాల్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న సంస్థ బిగ్ ‘సి’ దసరా, దీపావళి పర్వదినాల సందర్భంగా దసరావళి పేరుతో ఆకర్షణీయమైన డబుల్ ధమాకా ఆఫర్లను అందిస్తోంది. ప్రతి స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై రూ.3,000 వరకూ ఇన్స్టెంట్ డిస్కౌంట్, రూ.1999 విలువగల ఇన్‌బేస్ ఇయర్ బడ్స్ కేవలం రూ.199కే కస్టమర్లకు అందించడం లేదా జిగ్‌మోర్ కాలింగ్ స్మార్ట్ వాచ్ కేవలం రూ.899కే లభించడం, బ్రాండెడ్ యాక్ససరీలపై 51% వరకూ డిస్కౌంట్, ఎస్బీఐ ద్వారా కొనుగోలుపై 7.5% వరకూ డిస్కౌంట్ వంటి పలు ఆఫర్లు వినియోగదారులకు లభించనున్నాయి. ఈ ఆఫర్ల ప్రకటన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు, సీఎండీ బాలు చౌదరి పాల్గొన్నారు. -
Secunderabad: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు
సాక్షి, హైదరాబాద్: దసరా ప్రయాణికుల కోసం పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్. రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలిలా ఉన్నాయి. సికింద్రాబాద్–సంత్రాగచ్చి (07645/ 07646) స్పెషల్ ట్రైన్ ఈ నెల 30న ఉదయం 8.40 గంట లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.25కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటలకు సంత్రాగచ్చి నుంచి బయలుదేరి మరుసటి రోజు రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్–షాలిమార్ (07741/07742) స్పెషల్ ట్రైన్‌అక్టోబర్ 2వ తేదీ ఉదయం 4.30 కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం 2.55కు షాలిమార్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. రేపటి నుంచి రైళ్ల వేళల్లో మార్పులు: అక్టోబర్ 1 నుంచి కొన్ని రైళ్ల వేళల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మేరకు ప్రయాణికులు ఆయా రైళ్ల వేళల సమాచారాన్ని ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవాలనీ, 139 నెంబర్ నుంచి కూడా రైళ్ల వేళల్లో మార్పులను తెలుసుకోవచ్చునని సీపీఆర్వో తెలిపారు. -
కేంద్ర ప్రభుత్వోద్యోగులకు... 4% డీఏ పెంపు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక లభించింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ), 4 శాతం పెంచుతూ కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ పెరుగుదల జులై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వంలోని 41.85 లక్షల మంది ఉద్యోగులకు, 69.76 లక్షల మంది ఫించనుదారులకు లబ్ధి చేకూరుతుంది. మూల వేతనంపై 34శాతంగా ఉన్న డీఏకి అదనంగా 4% పెంచడంతో 38శాతానికి చేరుకుంది. ఈ పెంపుతో ఖజానాపై ఏడాదికి 12.852 కోట్ల అదనపు భారం పడుతుంది. మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ కరోనా సంక్షోభ సమయంలో లాక్డౌన్లతో ఉపాధి కోల్పోయిన నిరుపేదల్ని ఆదుకోవడానికి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పేరుతో ఉచితంగా ఇచ్చే రేషన్ పథకం ఈ శుక్రవారంతో ముగిసిపోనుంది. ధరల భారం, పండుగ సీజన్ వస్తూ ఉండడంతో మరో మూడు నెలలు ఉచితంగా రేషన్ అందించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ బుధవారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎంజీకేఏవై కింద ఉచిత రేషన్ పథకాన్ని మరో మూడు నెలలు కొనసాగించాలని నిర్ణయించింది. వివరాలను కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు గరీబ్ కళ్యాణ్ అన్న యోచన పథకం కింద నిరుపేదలు ఒక్కొక్కరికి ప్రతీ నెల 5 కేజీల బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ పథకాన్ని పొడిగించడంతో కేంద్రానికి అదనంగా రూ.44,762 కోట్లు ఖర్చు అవుతుంది. ప్రతీ నెల 80 కోట్ల మంది ఉచిత రేషన్‌ని తీసుకుంటున్నారు. రైల్వేల అభివృద్ధికి రూ.10వేల కోట్లు రైల్వేల అభివృద్ధి ప్రాజెక్టుకి రూ.10 వేల కోట్లు కేటాయించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై సీఎస్ఎంటీ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం రైల్వే చేసిన ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఈ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ 2.5 నుంచి మూడున్నరేళ్లలో పూర్తి చేయనున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ వెల్లడించారు. -
Kanaka Durga Temple: నేడు గాయత్రీదేవి అలంకారం
సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. దసరా ఉత్సవాల్లో మూడోరోజు బుధవారం కనకదుర్గమ్మ.. గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సకల మంత్రాలకు మూలశక్తిగా, వేదమాతగా ప్రసిద్ధి పొంది.. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలతో ప్రకాశించే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవి. ఈ తల్లి శిరస్సుపై బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖలో రుద్రుడు ఉండటంతో గాయత్రీదేవి త్రిమూర్త్యాంశగా వెలుగొందుతోంది. గాయత్రీదేవిని దర్శించుకుంటే ఆరోగ్యం, తేజస్సు, జ్ఞానం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఇంద్రకీలాద్రిపై నేడు ►తెల్లవారుజామున నాలుగు గంటలకు అమ్మవారి దర్శనం ►ఉదయం 5 గంటలకు ఖడ్గమాలార్చన ►ఉదయం 7 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక శ్రీచక్రనవార్చన ►ఉదయం 9 గంటలకు ప్రత్యేక చండీయాగం ►ఉదయం 10 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన రెండో బ్యాచ్ ►సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి మహానివేదన, పంచహారతుల సేవ ►రాత్రి 11 గంటలకు అమ్మవారి దర్శనం నిలిపివేత మయూర వాహనంపై కొలువుదీరిన భ్రామరీ సమేత మల్లికార్జునుడు బ్రహ్మచారిణిగా భ్రమరాంబాదేవి శ్రీశైలం టెంపుల్: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీశైల క్షేత్రంలో మంగళవారం భ్రమరాంబాదేవి.. బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. రాత్రి భ్రమరాంబాదేవి, మల్లికార్జునస్వామి మయూర వాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. తొలుత ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ చేయించి ప్రధానాలయ రాజగోపురం నుంచి రథశాల వద్దకు తీసుకొచ్చారు. రాత్రి 8 గంటల తర్వాత ప్రారంభమైన గ్రామోత్సవం నందిమండపం, అంకాలమ్మగుడి, బయలు వీరభద్రస్వామి ఆలయం వరకు వెళ్లి తిరిగి ఆలయ ప్రవేశం చేసింది. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామిఅమ్మవార్ల అలంకారమూర్తులను దర్శించుకుని కర్పూర నీరాజనాలర్పించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు, ఈవో ఎస్.లవన్న, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. పూజలు చేస్తున్న స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి మహేశ్వరిగా రాజశ్యామల అమ్మవారు సింహాచలం: విశాఖ శ్రీశారదాపీఠంలో జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రెండోరోజు మంగళవారం శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారు మహేశ్వరిగా దర్శనమిచ్చారు. అమ్మవారికి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి, స్వాత్మానందేంద్ర సరస్వతి విశేషంగా పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. అంతకుముందు అమ్మవారి మూలవిరాట్‌కి స్వరూపానందేంద్ర సరస్వతి అభిషేకం చేశారు. దాదాపు 40 నిమిషాలు జరిగిన అభిషేకసేవలో భక్తులు అమ్మవారి నిజరూప దర్శనం చేసుకున్నారు. పీఠం ప్రాంగణంలో చండీహోమం, చతుర్వేదపారాయణ, దేవీ భాగవత పారాయణ నిర్వహించారు. శ్రీచక్రానికి నవావరణార్చన చేశారు. ఈ సందర్భంగా శంకర విజయం అనే అంశంపై ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ధూళిపాళ కృష్ణమూర్తి చేసిన ప్రవచనం భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. సాయంత్రం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర చేతులమీదగా రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరస్వామికి పీఠార్చన చేశారు. -
Vijayawada: బాలా త్రిపుర సుందరీదేవికి భక్తుల నీరాజనం
సాక్షి, విజయవాడ: దుర్గమ్మ కొండపై ‘శరన్నవ’ సంబరం కొనసాగుతోంది. ఒకవైపు భక్తుల కోలాహలం, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల సందళ్లతో కృష్ణా తీరం పులకిస్తోంది. దసరా ఉత్సవాల్లో రెండో రోజైన మంగళవారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున అమ్మవారికి విశేష అలంకారం, నిత్య పూజల అనంతరం ఆలయ అధికారులు అమ్మవారిని తొలి దర్శనం చేసుకున్నారు. నాలుగు గంటల నుంచి సర్వ దర్శనం ప్రారంభం కాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. స్పీకర్ తమ్మినేని సీతారాం దంపతులు, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, వెస్ట్ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి నిర్వహించిన ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, చండీహోమం, శ్రీచక్రార్చనలో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. ఉత్సవాల నేపథ్యంలో అనధికార వీఐపీల కట్టడికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ టి.కె. రాణా క్యూలైన్లను పలు మార్లు పరిశీలించి, దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. టికెట్లు లేకుండా దర్శనానికి ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించవద్దని ఆలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఉత్సవ ఏర్పాట్లు అద్భుతం: స్పీకర్ తమ్మినేని అమ్మవారి దర్శనానికి విచ్చేసిన స్పీకర్ తమ్మినేని సీతారాంనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఈవో భ్రమరాంబ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను బహూకరించారు. అనంతరం మీడియాతో స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడారు. దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఉత్సవాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయన్నారు. సామాన్య భక్తులకు పెద్ద పీట వేయడం అభినందనీయమన్నారు. అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్ దేవీశరన్నవ రాత్రి ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు విచ్చేస్తున్నందున అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆదేశించారు. ఉత్సవాల ఏర్పాట్లతో పాటు క్యూలైన్లు, టికెట్ల జారీ పక్రియను కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. కొండపై టికెట్లు విక్రయిస్తున్న తీరును పరిశీలించడంతో పాటు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. టికెట్లు కొనుగోలు చేసేలా చూడాల్సిన బాధ్యత అన్ని శాఖల అధికారులపై ఉందని, రూ. 300, రూ.100 టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు ఆయా క్యూలైన్ మార్గాలలోనే అమ్మవారి దర్శనానికి పంపాలన్నారు. మహా మండపం మీదుగా కొండపైకి ఎవరూ రాకుండా కట్టుదిట్టంగా చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. పాస్ లేకుండా కార్లను కొండపైకి ఎందుకు అనుమతిస్తున్నారని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్బంది లేకుండా దర్శనం: మంత్రి కొట్టు భక్తుల రద్దీ నేపథ్యంలో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. వినాయకుడి గుడి, రథం సెంటర్, టోల్గేట్, ఓం టర్నింగ్ వద్ద మంత్రి క్యూలైన్లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. వినాయకుడి నుంచి కొండపైకి చేరుకునేందుకు 30 నిమిషాలు పడుతుందని పలువురు భక్తులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని టికెట్ల కౌంటర్లలో ఆన్లైన్ టికెట్లు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఫుట్ స్కానర్ ద్వారా భక్తుల సంఖ్యను నమోదు చేస్తామన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించి, అందుకు తగిన రీతిలో ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు దర్శనానికి విచ్చేశారని, 60 వేల లడ్డూలను విక్రయించామన్నారు. ఈవో భ్రమరాంబ, స్పెషల్ ఆఫీసర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి నయనమనోహరం నగరోత్సవం వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): దసరా మహోత్సవాల్లో భాగంగా ఆదిదంపతుల నగరోత్సవం నయనమనోహరంగా జరిగింది. గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామి వార్ల ఉత్సవమూర్తులతో మల్లేశ్వరాలయం దిగువన ఉన్న మహామండపం సమీపంలో ప్రారంభమైన నగరోత్సవంలో అర్చకులు, వేదపండితులు, కళాకారులు, అధికారులు పాల్గొని సేవలందించారు. తొలుత ఈవో భ్రమరాంబ కొబ్బరికాయ కొట్టి నగరోత్సవాన్ని ప్రారంభించారు. పోలీసులు, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, సెక్యూరిటీ సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
Dasara Special: దసరాకు బంగారం ధర దిగి వస్తుందా? కొనేద్దామా?
పండగో, పబ్బమో వచ్చిందంటే కొత్త బట్టలతో పాటు బంగారంపై మనసు మళ్లుతుంది భారతీయులకి. అందులోనూ దసరా, దీపావళి సీజన్ వచ్చిందంటే గోరంత బంగారమైనా తమ ఇంటికి తెచ్చుకోవాలని ఆశపడతారు. ఈ పర్వదినాల్లో పసిడిని కొనడం అంటే సాక్షాత్తు ఆ శ్రీలక్ష్మీ దేవిని ఇంటికి తీసుకొచ్చినంత సంబరం. సాంప్రదాయం. అయితే సాధారణంగా బంగారం కొందామన్న ఆలోచన రాగాలనే అందరి మదిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.... మనం కొన్నాక ఇంకా తగ్గుతుందేమో కదా..అవునా?మరి ఈ దసరాకి బంగారం ధరలు దిగి వస్తాయా? లేక అక్కడక్కడే కదలాడతాయా? ఓ సారి చూద్దాం! సాక్షి, ముంబై: దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు ఈ ఏడాది మే నుండి పెద్దగా హెచ్చు తగ్గులు లేకుండా కదలాడుతూ ఉన్నాయి. 10 గ్రాముల బంగారం ధర కనిష్టంగా 49,500, గరిష్టంగా రూ. 52,700 మధ్య పరిమితమైంది. అయితే ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారీ వడ్డింపు, మన రూపాయి, దేశీయ స్టాక్ మార్కెట్లపై భారీ ప్రభావాన్నే చూపుతోంది. ఫెడ్ వడ్డింపు తరువాత ముఖ్యంగా డాలరు విలువ 20 ఏళ్ల గరిష్టాన్ని తాకింది. డాలరు మారకంలో మన కరెన్సీరూపాయి 81.62 వద్ద ఆల్‌టైం కనిష్టాన్ని తాకింది. అటు ఆసియా మార్కెట్లన్నీ బేర్ మంటున్నాయి. అలాగే డాలర్ ఇండెక్స్ బలం పుత్తడిపై కూడా పదింది. ఇది మరికొంత కాలం కొనసాగవచ్చనేది నిపుణుల అంచనా. అంతర్జాతీయ మార్కెట్లలో, ధరలు ఔన్సుకు 1680 డాలర్ల మార్క్ వద్ద గట్టి మద్దతు ఉందనీ, ఇది బ్రేక్ అయితే తప్ప బంగారం ధరలు దిగి వచ్చే ఛాన్సే లేదనది ఎనలిస్టుల మాట. కానీ ఆ స్థాయిలో గోల్డ్ ధరకు మద్దతు లభిస్తుందని అంతర్జాతీయ బలియన్ వర్తకులు అంటున్నారు. పండుగ సీజన్: బంగారం కొందామా? ఇప్పటికే బంగారం ధరలు ఆల్ టైం గరిష్టం నుండి దాదాపు 10 శాతం దిగి వచ్చింది. దీనికి తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం , గ్లోబల్‌గా పలు సెంట్రల్ బ్యాంకుల అధిక వడ్డీ రేట్ల మధ్య ప్రపంచ మాంద్య భయాలు పసిడి ధరకు ఊతమిచ్చేవేనని చాలామంది ఎనలిస్టులు వాదన. ఇక దేశీయ మార్కెట్లలో, ధరలు 10 గ్రాముల రూ. 48,800 స్థాయివద్ద దగ్గర గట్టి మద్దతు ఉంటుంది. ఇది బ్రేక్ అయితే బంగారం ధరలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుందని దేశీయ బులియన్ ట్రేడర్ల అంచనా. రాబోయే పండుగ కాలంలో ఫిజికల్ మార్కెట్లో బంగారం డిమాండ్ పెరుగుతుందని దుకాణ దారులు విశ్వాసం. దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్, వివిధ పండుగలు నగల డిమాండ్‌ను పెరుగుతుందని భావిస్తున్నారు. మరోవైపు ఆయిల్, బంగారం ప్రధాన దిగుమతిదారుగా ఇండియాలో బంగారం ధరలపై ఆయిల్ ధరల ప్రభావం కూడా ఉంటుంది. పంట చేతికి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోపుంజుకునే డిమాండ్, తక్కువ ధరల్లో పెట్టుబడి డిమాండ్‌ను పెంచుతుందని, గ్లోబల్ అ నిశ్చితుల నేపథ్యంలో బంగారం వైపు పెట్టుబడులు మళ్లే అవకాశం ఉందంటూ సానుకూల ధోరణిని కనబరుస్తున్నారు. అలాగే, రాబోయే సీజనల్ డిమాండ్ పరిగణనలోకి తీసుకుని బై ఆన్-డిప్స్ వ్యూహం బెటర్ అని స్పష్టం చేస్తున్నారు. -
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా ఉత్సవాలు ప్రారంభం (ఫోటోలు)
-
Mysuru Dasara 2022: పండుగలు ఐక్యతకు ప్రతీకలు
మైసూరు: మైసూరు ఉత్సవాలు దేశ ఘన సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పేవని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. దసరా వంటి పండుగలు సమాజంలో ఐక్యతను పెంచుతాయని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా నిలుస్తాయని చెప్పారు. ప్రఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను సోమవారం ఆమె ప్రారంభించారు. చాముండి కొండపై మైసూరు రాచవంశీకుల ఆరాధ్యదైవం చాముండేశ్వరి విగ్రహంపై పూలు చల్లుతూ వేద మంత్రోచ్ఛరణల మధ్య ఉత్సవాలను ప్రారంభించారు. అంతకుముందు ఆలయంలో విశేష పూజలు చేశారు. ఇటీవలి కాలంలో మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ముర్మునే. మైసూరు పట్టుచీరలో రాష్ట్రపతి ఈ సందర్భంగా రాష్ట్రపతి మైసూరులో తయారైన తెలుపు రంగు బంగారు జరీ గీతల అంచుతో కూడిన పట్టుచీరను ధరించారు. ఆమె కోసం దీన్ని ప్రత్యేకంగా నేయించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక బుడకట్టు గిరిజన కళాకారుల నృత్యాలను ఆమె ఆసక్తిగా తిలకించారు. విద్యుత్‌కాంతులతో మైసూరు కరోనా నేపథ్యంలో మైసూరులో శరన్నవరాత్రి ఉత్సవాలు రెండేళ్లు సాదాసీదాగా జరిగాయి. ఈ నేపథ్యంలో జానపద కళా రూపాలతో కర్ణాటక సాంస్కృతిక వైభవాన్ని చాటేలా ఈసారి 9 రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరు ప్యాలెస్, వీధులు, భవనాలు, కూడళ్లను విద్యుద్దీపాలతో అలంకరించింది. మైసూరులోని ప్రముఖ్య రాజప్రాసాదాలైన అంబా విలాస్ ప్యాలెస్, జగన్మోహన్ ప్యాలెస్ వంటి 8 చోట్ల 290 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనుంది. -
శ్రీశైలంలో దసరా మహోత్సవాలు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు సోమవారం ఉదయం యాగశాల ప్రవేశంతో ప్రారంభం కానున్నాయి. సంప్రదాయాన్ని అనుసరించి శాస్త్రోక్తంగా ఈ ఉత్సవాల్లో అమ్మవారికి నవదుర్గ అలంకారాలు, ప్రత్యేక నవావరణపూజలు, స్వామి అమ్మవార్లకు వాహనసేవలు, చండీయాగం, రుద్రయాగం నిర్వహించనున్నారు. దసరా మహోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శ్రీశైల భ్రమరాంబాదేవి శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భృంగివాహనంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజల అనంతరం అంగరంగ వైభవంగా గ్రామోత్సవం నిర్వహిస్తారు. -
Osmania University: ఓయూలో దసరా సెలవులు ఇలా
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీకు దసరా సెలవులను ప్రకటించారు. వివిధ పీజీ కోర్సుల కాలేజీలకు శనివారం నుంచి వచ్చే నెల 9 వరకు, ఎల్ఎల్ఎం విద్యార్థులకు అక్టోబరు 2 నుంచి 8 వరకు సెలవులను ప్రకటించారు. పండుగ సెలవుల కారణంగా విద్యార్థులు లగేజితో హాస్టల్ గదులను ఖాళీ చేయాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. 26న పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూలు ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ షెడ్యూలు ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు సీపీజీఈసెట్–2022 కన్వీనర్ ప్రొ.పాండురంగారెడ్డి శుక్రవారం తెలిపారు. ఓయూతో పాటు రాష్ట్రంలోని ఇతర వర్సిటీలలో 2022–23 విద్యా సంవత్సరానికి ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఈడీ, ఎంపీడీ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌లతో పాటు ఐదేళ్ల పీజీ, పీజీ డిప్లొమాలో ప్రవేశాలకు మొదటి విడత ఆన్లైన్ కౌన్సెలింగ్ వచ్చే వారం నుంచి ప్రారంభంకానున్నట్లు వివరించారు. పీజీ ప్రవేశ పరీక్షలో (సీపీజీఈసెట్–2022) అర్హత సాధించిన విద్యార్థులు డిగ్రీ సర్టిఫికెట్లతో పాటు టీసీ, కులం, ఆదాయం సర్టిఫికెట్లు తప్పనిసరిగా ఉండాలన్నారు. సర్టిఫికెట్లు లేని పక్షంలో అడ్మిషన్ తిరస్కరించనున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. (క్లిక్ చేయండి: టీహబ్–2లో 200 స్టార్టప్‌ల కార్యకలాపాలు ప్రారంభం) -
పండక్కి కొత్త బండి కష్టమే!
సాక్షి, హైదరాబాద్: దసరా సందర్భంగా కొత్త వాహనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. అయితే కష్టమే. నచ్చిన బండి కోసం మరి కొద్ది నెలల పాటు నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాయాల్సిందే. గ్రేటర్లో కొత్త వాహనాలకు భారీగా డిమాండ్ పెరిగింది. కానీ అందుకు తగినవిధంగా వాహనాల లభ్యత లేకపోవడంతో వేలాది మంది కొనుగోలుదార్లు ఇప్పటికే తమకు కావలసిన కార్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో దసరా సందర్భంగా ఇప్పటికిప్పుడు కొత్త కారు కొనుగోలు చేయడం కష్టమేనని ఆటోమొబైల్ షోరూమ్ డీలర్లు చెబుతున్నారు. సాధారణంగా దసరా, దీపావళి వంటి పర్వదినాల్లో మధ్యతరగతి వేతన జీవులు కొత్త వాహనాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం శుభప్రదంగానూ, ఒక సంప్రదాయంగాను భావిస్తారు. ఈసారి కూడా అలాగే కొత్త వాహనాల కోసం ఆసక్తి చూపే వాళ్లకు నిరాశే ఎదురుకానుంది. ఇప్పటికిప్పుడు బుక్ చేసుకున్నా కనీసం ఐదారు నెలల పాటు ఆగాల్సిందేనని ఆర్టీఏ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. గత రెండేళ్లుగా వ్యక్తిగత వాహనాలకు గణనీయమైన డిమాండ్ నెలకొన్నది. కోవిడ్ దృష్ట్యా చిరుద్యోగులు మొదలుకొని మధ్యతరగతి వర్గాల వరకు వ్యక్తిగత వాహనాలకే మొగ్గు చూపారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలు, కార్లకు భారీగా డిమాండ్ పెరిగింది. అందుకు తగిన విధంగా వాహనాలు మాత్రం దిగుమతి కావడం లేదు. దీంతో కొరత ఏర్పడింది. ఆగాల్సిందే... గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 150 ఆటోమొబైల్ షోరూమ్‌లలో కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు జరుగుతున్నాయి. రవాణాశాఖలో ప్రతి రోజు 1500 నుంచి 2000 వరకు కొత్త వాహనాలు నమోదవుతాయి. కొత్త వాహనాలకు డిమాండ్‌కు పెరగడంతో నమోదయ్యే వాహనాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. వ్యక్తిగత వాహనాల కేటగిరీలో అన్ని రకాల వాహనాలకు వెయిటింగ్ తప్పడం లేదు. హ్యూందాయ్, కియా, టయోటా, నెక్సాన్, మారుతి తదితర కంపెనీలకు చెందిన కార్ల కోసం 4 నుంచి 5 నెలల పాటు వెయిటింగ్ ఉంది. బాగా డిమాండ్ ఉన్న కొన్ని ప్రీమియం వాహనాలకు 6 నెలల వరకు కూడా డిమాండ్ నెలకొంది. ద్విచక్ర వాహనాలలో యూనికార్న్, హోండా యాక్టివా 125కి ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఆటోమొబైల్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వాహనాలకు 3 నెలల వరకు ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ ఏడాది చివరి వరకు ఇదే ట్రెండ్ కొనసాగవచ్చునని ఆటోమొబైల్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. దీపావళికి కూడా డిమాండ్ భారీగానే ఉండే అవకాశం ఉంది. చిప్స్ కొరతే కారణం... వాహనాల తయారీలో కీలకమైన సాఫ్ట్వేర్ చిప్స్ దిగుమతి తగ్గడం వల్లనే ఈ కొరత ఏర్పడినట్లు చెబుతున్నారు. మలేసియా, తైవాన్, చైనాల నుంచి మన దేశానికి వాహనాల చిప్స్ దిగుమతి అవుతాయి. రెండేళ్లుగా కోవిడ్ వల్ల చైనా నుంచి చిప్స్ దిగుమతి తగ్గిపోయింది. ఉక్రెయిన్ యుద్ధం వల్ల డిమాండ్ పెరగడంతో మలేసియా, తైవాన్‌ల నుంచి సరఫరాలో జాప్యం చోటుచేసుకుంటుంది. దీంతో వాహనాల తయారీ కూడా మందకొడిగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ‘గత నెలతో పోలి్చతే ఈ నెలలో చిప్స్ కొరత కొంత వరకు తగ్గింది. దిగుమతి పెరిగింది. గతంలో 80 శాతం వరకు కొరత ఉండేది. ఇప్పుడు 40 శాతానికి తగ్గింది. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం కావచ్చు’. అని ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామ్ తెలిపారు. (చదవండి: తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి) -
తల్లిదండ్రులుంటేనే పిల్లలు ఇంటికి!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ గురుకులాల్లో దసరా సెలవుల హడావుడి ప్రారంభమైంది. ఈనెల 25 నుంచి వచ్చే నెల 9 వరకు విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. దీంతో పిల్లలంతా వారి తల్లిదండ్రులతో గడిపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థులను ఇళ్లకు పంపించేందుకు గురుకుల సొసైటీలు కొన్ని షరతులు విధించాయి. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ గురుకుల సొసైటీలు.. ప్రిన్సిపాళ్లకు పలు సూచనలు, హెచ్చరికలు జారీ చేశాయి. పిల్లలను గురుకులం నుంచి ఇంటికి పంపాలంటే తప్పకుండా ఆ విద్యార్థి తల్లి లేదా తండ్రి లేకుంటే సంరక్షకుడు తప్పకుండా రావాల్సి ఉంటుంది. అలా వస్తేనే విద్యార్థులను ఇంటికి అనుమతించాలని గురుకుల సొసైటీలు నిర్ణయం తీసుకున్నాయి. స్నేహితులు, తోబుట్టువులు, ఇతర పరిచయస్తులతో పిల్లలను ఇంటికి అనుమతించవద్దని తేల్చిచెప్పాయి. ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. విద్యార్థులను తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు కాకుండా ఇతరులకు అప్పగిస్తే తలెత్తే పరిణామాలకు ప్రిన్సిపాళ్లే బాధ్యత వహించాల్సి వస్తుందని సొసైటీ కార్యదర్శులు స్పష్టం చేశారు. బాలికల విషయంలో మరింత కఠినంగా నిబంధనలు పాటించాలని సూచించారు. పిల్లలను అప్పజెప్పే సమయంలో తల్లిదండ్రులు/సంరక్షకులు వచ్చినప్పటికీ వారు సరైన వ్యక్తులేనా అనే విషయాన్ని ధ్రువీకరించుకుని రిజిస్టర్లో ఎంట్రీ చేయాలని స్పష్టం చేశారు. దీంతో పిల్లల అప్పగింతకు కాస్త సమయం పట్టే అవకాశం ఉంటుందని చెపుతున్నారు. తల్లిదండ్రులు సైతం కాస్త ఓర్పుతో ఉండాలని ప్రిన్సిపాళ్లు చెబుతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలను అప్పగించే సమయంలో విద్యార్థి చదువు గురించి సైతం వివరించాలని స్పష్టం చేయడంతో టీచర్లు ప్రోగ్రెస్ కార్డులను సిద్ధం చేసుకుంటున్నారు. కాగా, సెలవుల అనంతరం కూడా విద్యార్థులు తిరిగి వచ్చే సమయంలో వివరాలను పరిశీలించి నిర్ధారించుకోవాలని, వెంట తెచ్చుకున్న సరుకులు, సామగ్రిని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతించాలని సొసైటీ కార్యదర్శులు క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. -
ఊళ్లోనే పరిష్కారం.. దసరా తర్వాత ‘ధరణి’ సమస్యలపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న ‘ధరణి’ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. దీనికి సంబంధించి ఇంతకుముందు ప్రకటించిన రెవెన్యూ సదస్సులు కార్యరూపం దాల్చని నేపథ్యంలో.. నేరుగా గ్రామ, మండల స్థాయిలో స్పెషల్ డ్రైవ్‌లను చేపట్టాలని భావిస్తోంది. ధరణికి సంబంధించి 10 లక్షలకుపైగా ఫిర్యాదులు రావడంతో.. వీటన్నింటినీ ఎలా పరిష్కరించాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. వచ్చే నెల (అక్టోబర్) రెండో వారంలో ధరణి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టంగానే చెప్తున్నా.. సిబ్బంది లేమి, క్షేత్రస్థాయిలో పరిష్కార వ్యవస్థలు లేకపోవడం వంటి అవరోధాలు కనిపిస్తున్నాయి. తొలి నుంచీ సమస్యలే.. రాష్ట్రంలో వ్యవసాయ భూముల క్రయ, విక్రయ లావాదేవీలను పూర్తి పారదర్శకంగా జరిపేందుకు వీలుగా ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. కానీ పోర్టల్‌లో భూముల వివరాల నమోదుకు అనుసరించిన విధానం, సాంకేతిక సమస్యలతో తలనొప్పులు మొదలయ్యాయి. భూమి విస్తీర్ణం నమోదు నుంచి నిషేధిత జాబితాలోని భూముల వరకు ఎన్నో సమస్యలు తలెత్తడంతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణికి సంబంధించి ఏ చిన్న అంశాన్ని అయినా ఆన్లైన్లో పరిష్కరించే అవకాశం కేవలం జిల్లా కలెక్టర్లకు మాత్రమే ఉండటం, ఆన్లైన్ దరఖాస్తులను వివిధ దశల్లో పరిశీలించడం క్లిష్టతరంగా మారడంతో ఫిర్యాదులు పేరుకుపోతూనే ఉన్నాయి. ధరణి పోర్టల్ గ్రీవెన్సులు (ఫిర్యాదులు) పది లక్షలు దాటాయని అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. ఈ ఏడాది జూలై 5న ధరణిపై సమీక్షించిన సీఎం కేసీఆర్.. పది రోజుల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు. కానీ ఇది అమల్లోకి రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా.. కేవలం పైలట్ ప్రాజెక్టు కింద సిద్దిపేట జిల్లా ములుగులో మాత్రమే రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. తర్వాత విషయం అటకెక్కింది. తమ సమస్యలు పరిష్కరించాలని రైతుల నుంచి డిమాండ్ పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ దీనిపై దృష్టిపెట్టింది. గ్రామస్థాయిలో సదస్సులు నిర్వహించాలని.. ఇందుకోసం దసరా తర్వాత ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని భావిస్తోంది. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించాలని యోచిస్తోంది. పుట్టెడు సమస్యలు.. పిడికెడు సిబ్బంది.. ధరణి పోర్టల్ సమస్యలకు గ్రామ స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని భూచట్టాల నిపుణులు కూడా చెప్తున్నారు. గ్రామ స్థాయికి వెళ్లి సమస్యలను తెలుసుకుని.. మండల, రెవెన్యూ డివిజన్ల స్థాయిలో వాటిని పరిశీలన జరపాలని, జిల్లా కలెక్టర్ స్థాయిలో పరిష్కరించేందుకు నిర్ణీత కాలవ్యవధి ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో సిబ్బంది కొరత అవరోధంగా మారే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీఆర్వోల వ్యవస్థను ప్రభుత్వమే రద్దు చేయడం, ఉన్న వీఆర్ఏలు 60 రోజుల నుంచి సమ్మెలో ఉండటం, తహసీల్దార్లు తమ కార్యాలయాలను వదిలి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో.. క్షేత్రస్థాయిలో ధరణి ఫిర్యాదులను విచారించే వ్యవస్థ లేకుండా పోయిందని అంటున్నాయి. మరోవైపు రెవెన్యూ శాఖలో ఇప్పటికే పని ఒత్తిడి పెరిగిందని.. సిబ్బంది లేరని, పదోన్నతులు కల్పించడం లేదని రెవెన్యూ ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. ఈ సమస్యలన్నీ పరిష్కరించాకే.. ధరణి సదస్సులపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఇక ధరణి సమస్యల పరిష్కారం జిల్లా కలెక్టర్ల చేతుల్లో ఉండటమూ ఇబ్బందిగా మారిందని.. కలెక్టర్లకు ఉండే పని ఒత్తిడి కారణంగా పరిష్కారంలో జాప్యం జరుగుతోందని విమర్శలు ఉన్నాయి. వీటన్నింటి నేపథ్యంలో సరైన ఏర్పాట్లు చేయకుండా ముందుకెళితే ‘ధరణి’ తేనెతుట్టెను కదిపినట్టే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థాయిలో ఎలా? సీఎం కేసీఆర్ మాత్రం ధరణి సమస్యలను త్వరగా పరిష్కరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించారని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో దసరా తర్వాత ధరణి సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ శాఖ గ్రామస్థాయికి వెళుతుందా? వెళ్లినా దరఖాస్తుల స్వీకరణ వరకే పరిమితం అవుతుందా? అక్కడే పరిశీలన, పరిష్కారానికి చర్యలు తీసుకుంటుందా? ప్రభుత్వం దీనిపై ఏ రూపంలో కార్యాచరణ తీసుకుంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిపై ప్రభుత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందని అధికారులు అంటున్నారు. -
Telangana: దసరా సెలవులు.. విద్యార్థులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త
సాక్షి, వరంగల్: వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తున్న టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు చేరువయ్యేందుకు పరుగులు పెడుతోంది. బస్సుల వద్దకే ప్రయాణికులు రావడం కాదు.. ప్రయాణికుల వద్దకే బస్సును పంపే కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాలలకు ఈ నెల 25 నుంచి బతుకమ్మ, దసరా పండుగ సెలవులు ఇస్తున్న క్రమంలో వారి వారి స్వగ్రామాలకు వెళ్లే విద్యార్థుల సౌకర్యార్థం హాస్టల్ వద్దకు ఆర్టీసీ బస్సులు పంపే ఏర్పాట్లు చేశారు. 30మందికి పైగా విద్యార్థులు ఒకే రూట్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కల్పించడం ద్వారా విద్యార్థులు లగేజీ బరువుతో బస్టాండ్‌కు చేరుకునే ఇబ్బందులు తప్పుతాయి. ఆటో, ఇతర రవాణా ఖర్చులు తగ్గుతాయి. విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు సమీపంలోని బస్ డిపోకు సమాచారం అందించాల్సి ఉంటుంది. సమాచారం ఇస్తే బస్సు పంపుతాం దసరా సెలవుల్లో స్వస్థలాలకు వెళ్ళే విద్యార్థుల సౌకర్యార్థం వారి వద్దకే బస్సులు పంపే ఏర్పాట్లు చేశాం. 30 మందికి పైగా విద్యార్థులుంటే సరిపోతుంది. బస్సు వారి ఆవాసం ఉంటున్న వసతి గృహం వద్దకు చేరుకుని విద్యార్థులను ఎక్కించుకుని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతుంది. విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, హాస్టల్ నిర్వాహకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – వంగాల మోహన్ రావు, వరంగల్–1 డిపో మేనేజర్ చదవండి: తక్కువ ధరకే ఐఫోన్ వస్తుందని.. ఫోన్ పే ద్వారా రూ. లక్ష పంపించాడు.. చివరికి -
TS: దసరా సెలవులు కుదింపు వాస్తవమేనా?.. విద్యాశాఖ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: దసరా సెలవుల్లో ఎలాంటి మార్పులు లేవని.. సెలవుల కుదింపుపై వస్తున్న వార్తలను తెలంగాణ విద్యాశాఖ ఖండిచింది. కుదింపుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 9 వరకు దసరా సెలవులు కొనసాగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. అక్టోబర్ 10న పాఠశాలల పునఃప్రారంభమవుతాయని పేర్కొంది. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది.. కావాలనుకుంటే వెళ్లి చూడొచ్చు! కాగా, విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా దసరా సెలవులను తగ్గించాలని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి(స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యు కేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్–ఎస్సీఈఆర్టీ) రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి మంగళవారం.. పాఠశాల విద్య డైరెక్టర్‌కు ఓ లేఖ రాశారు. జూలైలో కురిసిన భారీ వర్షాల కారణంగా ఆ నెల 11 నుంచి 16 రోజులపాటు సెలవులు, ఈ నెల 17న జాతీయ సమైక్యతాదినోత్సవాన్ని పురస్కరించుకుని మరో సెలవు.. ఇలా అనుకోకుండా వచ్చిన సెలవుల వల్ల స్కూళ్లు మూతపడ్డాయని పేర్కొన్నారు.