న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ల సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో ఉత్పత్తి పెరగడం, పండుగల డిమాండ్ తోడు కావడంతో దేశీయంగా కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో 3,55,946 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 91 శాతం అధికం. చిప్‌ల కొరత సమస్య తగ్గి ఉత్పత్తి మెరుగుపడటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ మొదలైన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ డీలర్లకు మరిన్ని కార్లను సమకూర్చగలిగాయి. సెప్టెంబర్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు 63,111 యూనిట్ల నుంచి 1,48,380 యూనిట్లకు పెరిగాయి.
గత 42 నెలల్లో అమ్మకాలపరంగా ఇది తమకు అత్యుత్తమమైన రెండో నెల అని సంస్థ సీనియర్ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. చివరిగా 2020 అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దేశీ మార్కెట్లో ఏకంగా 1,63,000 వాహనాలు విక్రయించింది. కంపెనీ మార్కెట్ వాటా తాజాగా సెప్టెంబర్‌లో దాదాపు 8 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల వాహనాల విక్రయాల మార్కును దాటిందని శ్రీవాస్తవ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ అమ్మకాలు 50 శాతం పెరిగి 49,700గా నమోదయ్యాయి. టాటా మోటార్స్ 47,654 కార్లను, కియా ఇండియా 25,857, టయోటా కిర్లోస్కర్ మోటార్ 15,378, హోండా కార్స్ 8,714 వాహనాలను విక్రయించాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 5,07,690, టీవీఎస్ మోటర్ కంపెనీ 2,83,878 యూనిట్లను విక్రయించాయి.
Comments
Please login to add a commentAdd a comment