దేశవ్యాప్తంగా అమ్ముడవని 7 లక్షల యూనిట్లు
పండగలు, రాయితీలే ఆధారం
భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో ప్యాసింజర్ కార్ల విక్రయాలు తగ్గుతున్నాయి. దాంతో రిటైల్ డీలర్ల వద్ద అధిక సంఖ్యలో వాహనాలు పేరుకుపోతున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఫాడా) విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశీయంగా డీలర్ల వద్ద పోగైన వాహనాలు ఏకంగా 7 లక్షల యూనిట్లు. వీటి విలువ సుమారు రూ.73,000 కోట్లు ఉంటుందని అంచనా. పండగల సీజన్ రాబోతుండడంతో వీటిలో కొంతమేర విక్రయాలు జరిగే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. అయినా క్షేత్రస్థాయిలో ఈ కార్లకు భారీగా డిమాండ్ తగ్గినట్లు పేర్కొంది.
ఫాడా తెలిపిన వివరాల ప్రకారం.. రిటైల్ డీలర్ల వద్ద విక్రయానికి సిద్ధంగా ఉన్న(ఇన్వెంటరీ) ప్యాసింజర్ కార్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇన్వెంటరీను అమ్మే సమయం అధికమైంది. జులై 2024 ప్రారంభంలో 65-67 రోజులుగా ఉన్న ఇన్వెంటరీ క్లియరెన్స్ సమయం, ప్రస్తుతం 70-75 రోజులకు పెరిగింది. దాంతో అమ్ముడవని వాహనాల సంఖ్య అధికమవుతోంది. ఈ వ్యవహారం డీలర్లలో ఆందోళన కలిగిస్తోంది. ఇన్వెంటరీ నిర్వహణ భారంగా మారుతోంది. దాంతో కొన్ని కంపెనీలు వాటి ఉత్పత్తిని తగ్గించుకుంటున్నాయి. ఇప్పటికే దాదాపు రెండు నెలల విక్రయాలకు సమానమైన సుమారు 7 లక్షల యూనిట్ల వాహనాలు పోగయ్యాయి. ఇదిలాఉండగా, రానున్న పండగల సీజన్‌ల్లో విక్రయాలు పెరిగి కొంత ఊరట లభిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పెరుగుతున్న వాహనాల ఇన్వెంటరీ నేపథ్యంలో మారుతీసుజుకీ కంపెనీ ఇండియా లిమిటెడ్ ఇప్పటికే ఉత్పత్తిని తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి కంపెనీ అంచనాలకు తగిన అమ్మకాలు నమోదు కావడంలేదు. దాంతో ఇన్వెంటరీ నిర్వహణ భారమవుతుందని ఊహించి ఉత్పత్తిని తగ్గించింది. జులై 2024లో మారుతీ సుజుకీ విక్రయాల్లో ఏడాది ప్రాతిపదికన 9.65% క్షీణత నమోదైంది.
రిటైల్ మార్కెట్లో కార్ల ధరలో రాయితీ ఇచ్చి ప్రముఖ కంపెనీలు వాటి ఇన్వెంటరీని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే మునుపెన్నడూ లేనంతగా కార్ల ధర తగ్గిస్తున్నాయి. 2023 ఆగస్ట్‌తో పోలిస్తే ఈ సారి డిస్కౌంట్లు రెండింతలు అయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకు ఈ తగ్గింపులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నాయి. మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ మొదలుకుని హ్యుందాయ్, టాటా మోటార్స్, స్కోడా, హోండా..వంటి ప్రముఖ కంపెనీలు డిస్కౌంట్లు ఇస్తున్నాయి.
ఇదీ చదవండి: కొత్త పెన్షన్ విధానం.. కీలకాంశాలు..
నగదు తగ్గింపు, ఎక్స్చేంజ్ బోనస్, అదనపు ప్రయోజనాలను కల్పిస్తున్నాయి. పాపులర్ మోడళ్లకూ వీటిని వర్తింపజేస్తుండడం విశేషం. ఆఫర్స్, ప్రయోజనాలు మారుతీ సుజుకీ బ్రెజ్జా రూ.25,000, గ్రాండ్ విటారాపై రూ.1,28,000 వరకు అందిస్తోంది. హ్యుండై ఎక్స్‌టర్‌పై రూ.40,000, ఆల్కజార్‌పై రూ.90,000 వరకు, టాటా మోటార్స్ నెక్సన్ రూ.16,000–1,00,000, హ్యారియర్‌పై రూ.1,20,000 వరకు ఆఫర్ చేస్తున్నాయి. హోండా ఎలివేట్‌పై రూ.80,000 వరకు ఆఫర్స్, ప్రయోజనాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment