festival sessions
-
సెప్టెంబర్.. టాప్ గేర్
న్యూఢిల్లీ: సెమీ కండక్టర్ల సరఫరా మెరుగుపడిన నేపథ్యంలో ఉత్పత్తి పెరగడం, పండుగల డిమాండ్ తోడు కావడంతో దేశీయంగా కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) అమ్మకాలు సెప్టెంబర్‌లో 3,55,946 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఇది 91 శాతం అధికం. చిప్‌ల కొరత సమస్య తగ్గి ఉత్పత్తి మెరుగుపడటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ మొదలైన ఆటోమొబైల్ దిగ్గజాలు తమ డీలర్లకు మరిన్ని కార్లను సమకూర్చగలిగాయి. సెప్టెంబర్‌లో మారుతీ సుజుకీ అమ్మకాలు 63,111 యూనిట్ల నుంచి 1,48,380 యూనిట్లకు పెరిగాయి. గత 42 నెలల్లో అమ్మకాలపరంగా ఇది తమకు అత్యుత్తమమైన రెండో నెల అని సంస్థ సీనియర్ ఈడీ (మార్కెటింగ్, సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. చివరిగా 2020 అక్టోబర్‌లో మారుతీ సుజుకీ దేశీ మార్కెట్లో ఏకంగా 1,63,000 వాహనాలు విక్రయించింది. కంపెనీ మార్కెట్ వాటా తాజాగా సెప్టెంబర్‌లో దాదాపు 8 శాతం పెరిగి 42 శాతానికి చేరింది. జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో పరిశ్రమ తొలిసారిగా 10 లక్షల వాహనాల విక్రయాల మార్కును దాటిందని శ్రీవాస్తవ చెప్పారు. మరోవైపు, హ్యుందాయ్ అమ్మకాలు 50 శాతం పెరిగి 49,700గా నమోదయ్యాయి. టాటా మోటార్స్ 47,654 కార్లను, కియా ఇండియా 25,857, టయోటా కిర్లోస్కర్ మోటార్ 15,378, హోండా కార్స్ 8,714 వాహనాలను విక్రయించాయి. ద్విచక్ర వాహనాల విభాగంలో హీరో మోటోకార్ప్ 5,07,690, టీవీఎస్ మోటర్ కంపెనీ 2,83,878 యూనిట్లను విక్రయించాయి. -
మేడిన్ ఇండియా బొమ్మల హవా
చెన్నై: లెగో, బార్బీ లాంటి విదేశీ ఉత్పత్తులను పక్కన పెట్టి దేశీయంగా మన ఆటలు, బొమ్మలు, ఆట వస్తువులకు డిమాండ్ పెరుగుతోంది. బొంగరాలు, విక్రమ్ బేతాళ్ పజిళ్లు, ఇతరత్రా దేశీ థీమ్స్‌తో తయారవుతున్న ఆటవస్తువులపై పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. టాయ్స్ పరిశ్రమకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గతేడాది నిర్దిష్ట నిబంధనలను తప్పనిసరి చేయడంతో కొన్ని రకాల బొమ్మలను దిగుమతి చేసుకోవడం కొంత తగ్గింది. అదే సమయంలో దేశీ టాయ్స్ తయారీ సంస్థలు కూడా వినూత్నంగా ఆలోచించడం మొదలుపెట్టాయి. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఉత్పత్తులను రూపొందించడంపై దృష్టి పెట్టాయి. మార్కెట్ లీడర్లయిన ఫన్‌స్కూల్, హాస్బ్రో, షుమీ లాంటి సంస్థలు ఆట వస్తువులు, గేమ్స్‌ను రూపొందిస్తున్నాయి. జన్మాష్టమి మొదలుకుని రామాయణం వరకు వివిధ దేశీ థీమ్స్ కలెక్షన్లను కూడా తయారుచేస్తున్నాయి. పిల్లలు ఆడుకునే సమయం కూడా అర్థవంతంగా ఉండాలనే ఆలోచనా ధోరణి కొత్త తరం పేరెంట్స్‌లో పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి హాట్ కేకులుగా అమ్ముడవుతున్నాయి. సంప్రదాయ భారతీయ గేమ్స్‌కు ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందనే లభిస్తోందని ఫన్‌స్కూల్ వర్గాలు తెలిపాయి. దీంతో తాము బొంగరాలు, గిల్లీడండా (బిళ్లంగోడు) లాంటి ఉత్పత్తులను కూడా ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నాయి. తాము చిన్నప్పుడు ఆడుకున్న బొమ్మలు, ఆటల్లాంటివి తమ పిల్లలకు కూడా పరిచయం చేయాలన్న ఆసక్తి సాధారణంగానే తల్లిదండ్రుల్లో ఉంటుందని, ఇది కూడా దేశీ గేమ్స్ ఆదరణ పొందడానికి కారణమవుతోందని హాస్బ్రో ఇండియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ బొమ్మలు, గేమ్స్ మొదలైనవి పూర్తిగా దేశీయంగానే తయారవుతున్నాయని, దీనితో స్థానికంగా కొనుగోళ్లు, తయారీకి కూడా ఊతం లభిస్తోందని వివరించాయి. తాము మోనోపలీ ఆటను తమిళంలో కూడా అందుబాటులోకి తెచ్చామని, దీన్ని తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నామని పేర్కొన్నాయి. అటు జన్మాష్టమి కలెక్షన్ ఆవిష్కరించిన ఆటవస్తువుల కంపెనీ షుమీ కొత్తగా దీపావళి కలెక్షన్‌ను కూడా ప్రవేశపెడుతోంది. 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే.. దేశీ టాయ్స్ మార్కెట్ 1.5 బిలియన్ డాలర్లుగా ఉంటుందని అంచనా. ఇందులో సింహభాగం 90 శాతం వాటా అసంఘటిత సంస్థలదే ఉంటోంది. అంతర్జాతీయంగా టాయ్స్ మార్కెట్ 5 శాతం మేర వృద్ధి చెందుతుంటే మన మార్కెట్ మాత్రం 10–15 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. దీంతో వచ్చే రెండేళ్లలో మార్కెట్ పరిమాణం 2–3 బిలియన్ డాలర్లకు చేరవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఎంతో కాలంగా భారత్‌లో దేశీ ఆటవస్తువులు, బొమ్మలు, గేమ్స్‌కు డిమాండ్ ఉన్నప్పటికీ తయారీ సంస్థలు ఇప్పుడు దాన్ని గుర్తిస్తున్నాయని టాయ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ శరద్ కపూర్ తెలిపారు. -
లగ్జరీ కార్లు రయ్.. రయ్!
న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో లగ్జరీ కార్లు అమ్ముడవుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. హై ఎండ్ మోడళ్లకు డిమాండ్ నేపథ్యంలో 2019 సంవత్సరాన్ని మించి అమ్మకాలు నమోదవుతాయని ధీమాగా ఉన్నాయి. పండుగల సీజన్లో పెద్ద ఎత్తున విక్రయాలు ఉంటాయని చెబుతున్నాయి. 2019లో దేశంలో 40,000 లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. ఒక ఏడాదిలో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారి. ‘పరిశ్రమ మరింత స్థితిస్థాపకంగా మారింది. కోవిడ్ థర్డ్ వేవ్ అంత తీవ్రంగా లేకపోవడంతో స్థిరమైన పునరుద్ధరణ ఉంది. లగ్జరీ కస్టమర్ల తీరులో మార్పు, స్టార్టప్‌లు విజయవంతం కావడం, యువ సంపన్న వినియోగదారులు, దేశీయంగా కార్ల తయారీ.. వెరశి అధిక అమ్మకాలకు దారి తీస్తుంది. విక్రయాలు 2019 స్థాయిని దాటతాయి’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని తెలిపారు. జూలైలో కంపెనీ అత్యధిక యూనిట్లను సాధించింది. ఇప్పటి వరకు సంస్థ సాధించిన ఉత్తమ అమ్మకాలతో పోలిస్తే పండుగల సీజన్లో మూడు రెట్ల వృద్ధి ఆశిస్తున్నామని వివరించారు. సెంటిమెంట్ సానుకూలం.. వినియోగదార్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో రెండవ త్రైమాసికం నుంచి పండుగల సీజన్ వరకు బలమైన డిమాండ్ ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘సరఫరా సవాళ్లు ఉన్నాయి. పండుగల సీజన్లో సెమీకండక్టర్ల కొరత కొనసాగుతుందని భావిస్తున్నాం. ఏఎంజీ, ఇతర వర్షన్స్‌లో ఈక్యూఎస్ లగ్జరీ సెడాన్ ఈ పండుగలకు రానుంది’ అన్నారు. కొన్ని నెలలుగా డిమాండ్ క్రమంగా పెరుగుతోందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. కంపెనీ కార్లకు డిమాండ్ తీవ్రం కావడంతో వెయిటింగ్ పీరియడ్ అధికమైందని చెప్పారు. ప్రపంచ సవాళ్లు కొత్త కార్ల సరఫరాను ప్రభావితం చేయడమే కాకుండా ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని వెల్లడించారు. దేశంలో మొత్తం కార్ల పరిశ్రమలో లగ్జరీ మోడళ్ల వాటా 2 శాతం లోపే ఉంది. ఈ విభాగం దశాబ్ద కాలంగా అదే స్థాయిలో కొనసాగుతోంది. లగ్జరీ కార్లపై జీఎస్టీ 28 శాతంగా ఉంది. సెడాన్స్పై 20, ఎస్‌యూవీలపై 22 శాతం సెస్ అదనం. -
ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి
న్యూఢిల్లీ: పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగే ప్రమాదముందని ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సాధ్యమైనంత వరకు జనం గుమికూడే చోటుకు వెళ్లొద్దని సూచించింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఆన్లైన్ పద్ధతుల్లోనే షాపింగ్ చేసుకోవాలని కోరింది. మహమ్మారి సెకండ్‌వేవ్ ఇంకా ముగియలేదని పునరుద్ఘాటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో రోజువారీ కేసులు 20 వేల వరకు నమోదవుతున్నాయని గుర్తు చేసింది. ‘‘ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని, ఏమరుపాటు తగదు. మహమ్మారి ఇంకా మనమధ్యే ఉంది. అప్రమత్తంగా లేకుంటే అనుకోకుండా పరిస్థితి విషమించవచ్చు’ అని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ గురువారం మీడియాతో అన్నారు. దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 34 రాష్ట్రాల్లో వారం పాజిటివిటీ రేట్ 10%కి మించి ఉందన్నారు. దేశంలోని అర్హులైన 71% మంది కనీసం ఒక్క డోసైనా కోవిడ్ టీకా వేయించుకోగా, వీరిలో 27% మందికి రెండు డోసులు పూర్తయిందని వివరించారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత లేనే లేదని స్పష్టం చేశారు. ఒక వేళ రోజువారీ కరోనా కేసులు 4.5–5 లక్షల వరకు పెరిగితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 8.36 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 1.35 లక్షల ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. -
ఆటవిడుపా.. ఆటవికమా..
► సంప్రదాయం పేరుతో మనుషుల జంతుక్రీడలు! ► ప్రపంచ దేశాలన్నిటా కొనసాగుతున్న జంతుహింస ► కీటకాల నుంచి తిమింగలాల వరకూ జీవాలన్నీ బలి (సాక్షి నాలెడ్జ్ సెంటర్) సంప్రదాయం.. ఆటవిడుపు.. పేరేదైనా మనిషి తన ఆనందం కోసం జంతువుల మధ్య బలవంతపు పోరాటాలు నిర్వహించడం శతాబ్దాలుగా కొనసాగుతోంది. జంతువులను స్వయంగా సామూహికంగా హింసించే ఆటవిక క్రీడలూ ఏదో ఒక స్థాయిలో జరుగుతూనే ఉన్నాయి. మనకు సంక్రాంతి వచ్చిందంటే కోళ్ల పందేలు, జల్లికట్టు నిర్వహణ మీద ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది. జంతు ప్రేమికులు ఎంతగా అభ్యంతరం వ్యక్తంచేసినా.. చట్టాలు ఏం చెప్తున్నా, కోర్టులు ఏ ఆదేశాలు ఇచ్చినా సదరు ‘క్రీడా ప్రేమికులు’, ‘సంప్రదాయవాదులు’ ఆయా హింసాత్మక క్రీడల నిర్వహణకే మొగ్గుచూపుతున్నారు. ఇది ఒక్క మన రాష్ట్రానికో, మన దేశానికో పరిమితం కాదు. ప్రపంచమంతటా ఈ ఆటవిక క్రీడలు సంప్రదాయం రూపంలో కొనసాగుతున్నాయి. చాలా చోట్ల అది నిత్య జూదంగా కూడా అభివృద్ధి చెందింది. అందులో కొన్ని ముఖ్యమైన హింసాత్మక జంతుక్రీడలు... కోళ్ల పందెం: కోడి పుంజుల మధ్య నిర్వహించే పోటీ ఇది. ఆంధ్రప్రదేశ్‌లో ఈ సంప్రదాయ క్రీడకు చాలా ప్రాచుర్యం ఉంది. ఇండియాలోనే కాకుండా.. చైనా, జపాన్, ఇరాక్, పాకిస్తాన్, ఫ్రాన్స్, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి చాలా దేశాల్లో కోళ్ల పందేలు శతాబ్దాలుగా నిర్వహిస్తున్నారు. గుర్రపు పందెం: మనకు తెలిసి గుర్రపు పందెం అంటే పరుగు పోటీ మాత్రమే. కానీ.. కొన్ని దేశాల్లో మగ గుర్రాల మధ్య పోరాటం నిర్వహిస్తుంటారు. చాలా పోటీల్లో ఏదో ఒక గుర్రం చనిపోయే వరకూ పొటీ కొనసాగుతుంది. చైనాలోని మియావో ప్రజలు ఫిలిప్పీన్స్ దీవి మిండానావోలో ఈ గుర్రపు పందేలు నిర్వహించడం వందల ఏళ్లుగా సంప్రదాయంగా వస్తోంది. థాయ్‌లాండ్, దక్షిణ కొరియా, ఇండొనేసియా, ఐస్ ల్యాండ్లలో కూడా ఈ పోటీలు నిర్వహిస్తున్న దాఖలాలు ఉన్నాయి. ఒంటెల పందెం: ఇది కూడా పరుగు పందెం కాదు. ఒంటెల మధ్య పోరాటం. టర్కీలో నవంబర్ నుంచి మార్చి మధ్య కాలంలో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో దించే ఒంటెలను ఇరాన్, అఫ్ఘానిస్తాన్‌లలో ప్రత్యేకంగా ఉత్పత్తి చేసి పెంచుతారు. మధ్య ఆసియా, దక్షిణాసియాల్లోని మరికొన్ని దేశాల్లోనూ ఈ ఒంటెల పోటీలు జరుగుతుంటాయి. కుక్కల పందెం: మన కోళ్ల పందెం తరహాలోనే కుక్కల మధ్య జరిపే పోరాటం. చైనా, జపాన్, పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్‌లలో ఈ క్రీడకు ఎక్కువ ఆదరణ ఉంది. అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలతో పాటు పలు ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో కూడా రహస్యంగా డాగ్ ఫైట్ క్లబ్‌లు నిర్వహిస్తుంటారు. కొన్ని రకాల జాతి కుక్కలను ప్రత్యేకంగా పెంచి శిక్షణనిస్తుంటారు. చాలా పోటీల్లో ప్రత్యర్థి కుక్క చనిపోయే వరకూ పోరాటం కొనసాగుతుంది. దున్నల పందెం: ఎడ్ల పోటీలు మన తెలుగు వాళ్లకు తెలుసు. అందులో ఎడ్ల బలాల ప్రదర్శన జరుగుతుంది. ఇక జల్లికట్టు, బుల్ ఫైట్ పోటీల్లో ఎడ్లు, దున్నలతో మనుషులు పోరాడతారు. కానీ.. అస్సాంలో సంక్రాంతి పండగకు కోళ్ల పందెం తరహాలో దున్నల మధ్య పోరాటంతో పోటీలు నిర్వహిస్తుంటారు. ఈ క్రీడను కూడా సుప్రీంకోర్టు నిషిద్ధ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ నిర్వహిస్తున్నారు. పొట్టేళ్ల పందెం: మన దేశంలో పొట్టేళ్ల పందెం కూడా నిన్న మొన్నటి వరకూ నిర్వహించిన విషయం తెలిసిందే. నైజీరియా, ఉజ్బెకిస్తాన్, ఇండొనేసియా వంటి దేశాలు ఈ పొట్టేళ్ల పందేలకు పేరుగాంచాయి. ఈ పందెం కోసం కొన్ని పొట్టేళ్లను ప్రత్యేకంగా ఉత్పత్తి చేసి పెంచుతుంటారు. బుల్ బుల్ పందెం: అస్సాంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగే మరో పక్షుల పందెం ఇది. బుల్ బుల్ పిట్టల మధ్య పోరాటం నిర్వహించి ఆనందించడం ఏళ్ల తరబడి సంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ పోటీల నిర్వహణను నిషేధించే అంశంపైనా ఎప్పుడూ పండుగ సమయాల్లోనే చర్చ వస్తుంటుంది. బుల్ ఫైటింగ్: ఎద్దులు, దున్నలతో మనుషులు చేసే పోరాట క్రీడ. తమిళనాడులో జల్లికట్టు పేరుతో జరుగుతుంది. స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్, మెక్సికో, కొలంబియా, ఈక్వెడార్, వెనిజువెలా, పెరూ తదితర దేశాల్లో ఈ క్రీడను నిర్వహిస్తున్నారు. చాలా దేశాల్లో ప్రత్యేకంగా పెంచే కొన్ని జాతుల ఎడ్లు, దున్నలను ఈ క్రీడకు ఉపయోగిస్తారు. డాల్ఫిన్ల వేట: డెన్మార్క్ లోని ఫెరో దీవి సముద్ర తీరం రక్తంతో నిండిపోతుంది. ఆ దీవిలో యువక్తవయసుకు వచ్చిన యువతీయువకులు ఆ విషయాన్ని ప్రకటించడానికి వందలాది కాల్డెరాన్ డాల్ఫిన్లను వేటాడి హతమారుస్తారు. ఏటా సగటున 838 పైలట్ తిమింగలాలు, 75 డాల్ఫిన్లను చంపేస్తారు. పవర్ బోట్లలో సముద్రంపైకి వెళ్లి ఈ తిమింగలాలు, డాల్ఫిన్లను ఒడ్డుకు తరుముకువచ్చి కర్కశంకా నరికి చంపుతారు. గత 300 ఏళ్లుగా సాగుతున్న ఈ సంప్రదాయంపై అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాతు లాగుడు పోటీ: నేలకు కొన్ని అడుగుల ఎత్తున ఒక తాడుకు బాతును తలకిందులుగా వేలాడదీస్తారు. గుర్రం స్వారీ చేసుకుంటూ వచ్చి ఆ బాతు మొడను పట్టుకుని తల తెంచుకెళ్లాలి. ఈ పని విజయవంతంగా చేసిన వ్యక్తి హీరో. యూరప్ లోని నెదర్లాండ్స్, బెల్జియం, ఇంగ్లండ్‌లతో పాటు అమెరికాలోనూ ఈ క్రీడను నిర్వహిస్తుంటారు. గాడిదపై మూకుమ్మడి దాడి: స్పెయిన్‌లో పెరో పాలో పండగ పేరుతో జరిగే మరొక సంప్రదాయ క్రీడ ఇది. చాలా ఏళ్ల కిందట ఒక రేపిస్టును పట్టుకున్న ఘట్టానికి ప్రతీకగా ఈ క్రీడను కొనసాగిస్తున్నారు. మద్యం మత్తులోని మగాళ్ల గుంపు ఒక గాడిదపై దాడి చేసి, దానిని సామూహికంగా అన్ని రకాలుగా హింసిస్తూ, నగరంలోని విధుల వెంట ఈడ్చుకెళ్లే క్రీడ ఇది. గాడిద పడిపోయినా దాన్ని మళ్లీ మళ్లీ నిల్చోబెట్టి హింసిస్తూ, దాని గొంతులోనూ మద్యం పోస్తూ ఈ క్రీడను కొనసాగిస్తారు. చివరికి ఆ గాడిద చనిపోతుంది. చేపల పందెం: కోళ్ల పందెం లాగానే కొన్ని రకాల చేపల మధ్య పోరాటం నిర్వహించడం మరొక సంప్రదాయ క్రీడ. నీటి తొట్టెలు, గాజు జాడీలు, మట్టి తొట్టెలు వంటి వాటిల్లో ఈ పోటీలు నిర్వహిస్తారు. ఇండొనేసియా, వియత్నాం, మయన్మార్, కంబోడియా, లావో వంటి ఆగ్నేయాసియా దేశాల్లో ఈ పోటీలు జరుగుతుంటాయి. కుక్కలను చెట్టుకు వేలాడదీసి: స్పెయిన్‌లో వేట కోసం ఉపయోగించే స్పానిష్ గ్రౌండ్ జాతి కుక్కలు గాల్గో. వేట సీజన్ ముగిసిన తర్వాత వేటగాళ్లు తమ కుక్కలను చంపేయటం ఆనవాయితీ. ఎందుకంటే మిగతా సీజన్లో ఆ కుక్కలను అనవసరంగా పోషించటం వారికి ఇష్టం లేదు. ఈ కుక్కలను చెట్లకు వేలాడదీసి, పాడుబడ్డ బావుల్లో వేసే చంపే ఆ ఆనవాయితీ ఇప్పటికీ పలు ప్రాంతాల్లో కొనసాగిస్తున్నారు. ఎద్దును హింసిస్తూ..: దక్షిణాఫ్రికాలో ఉక్వేష్వామా అనే పండుగ జరుగుతుంది. ఒక ఎద్దు నాలుక కోసివేసి, నోట్లో మట్టి కుక్కుతూ, దాని కళ్లు పీకివేసి, వృషణాలు ధ్వంసం చేస్తూ ఈ క్రీడ సాగుతుంది. కానీ.. దేశ ‘సాంస్కృతిక స్వాతంత్య్రం’ పేరుతో ఈ క్రీడకు జంతు చట్టాల నుంచి మినహాయింపునిచ్చారు. సముద్రంలోకి తరిమేసి: బ్రెజిల్లో ఫార్రా డె బొయి అనే పండుగ జరుగుతుంది. కొన్ని ఎడ్లను వెంటాడుతూ అవి చనిపోయే వరకూ హింసించడం ఈ క్రీడ. వాటిని సముద్రం వైపుగా తరుముకెళ్తారు. మనుషుల హింసతో బెంబేలెత్తిన ఆ ఎడ్లు వడ్డుకు రావడానికి భయపడి నీళ్లలో మునిగి చనిపోతాయి. కీచురాళ్ల పందెం: మంగ కీచురాళ్ల (క్రికెట్) మధ్య పోరాటం నిర్వహించడం చైనాలో సంప్రదాయ క్రీడ. కీటకాల బరువు, జాతి ప్రాతిపదికన ఈ పోటీ జరుపుతారు. ఒక గిన్నెలో కీచురాళ్లను ఉంచి వాటి మీసాలను కదిలించి రెచ్చగొట్టడం ద్వారా పోటీ నిర్వహిస్తారు. పేడపురుగుల పందెం: జపాన్, థాయ్‌లాండ్‌లలో రైనో జాతి పేడపురుగుల (బీటిల్) మధ్య పోటీ నిర్వహించి ఆనందిస్తుంటారు. స్పైడర్ల పందెం: ఫిలిప్పీన్స్, జపాన్, సింగపూర్‌వంటి దేశాల్లో సాలిపురుగుల (స్పైడర్) మధ్య పోటీలు నిర్వహిస్తుంటారు. కొన్ని దేశాల్లో ఆడ సాలీళ్లు, మరికొన్ని దేశాల్లో మగ సాలీళ్ల మధ్య పోరాటం నిర్వహిస్తారు.