న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో లగ్జరీ కార్లు అమ్ముడవుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. హై ఎండ్ మోడళ్లకు డిమాండ్ నేపథ్యంలో 2019 సంవత్సరాన్ని మించి అమ్మకాలు నమోదవుతాయని ధీమాగా ఉన్నాయి. పండుగల సీజన్‌లో పెద్ద ఎత్తున విక్రయాలు ఉంటాయని చెబుతున్నాయి. 2019లో దేశంలో 40,000 లగ్జరీ కార్లు రోడ్డెక్కాయి. ఒక ఏడాదిలో ఈ స్థాయి అమ్మకాలు ఇదే తొలిసారి.
‘పరిశ్రమ మరింత స్థితిస్థాపకంగా మారింది. కోవిడ్ థర్డ్ వేవ్ అంత తీవ్రంగా లేకపోవడంతో స్థిరమైన పునరుద్ధరణ ఉంది. లగ్జరీ కస్టమర్ల తీరులో మార్పు, స్టార్టప్‌లు విజయవంతం కావడం, యువ సంపన్న వినియోగదారులు, దేశీయంగా కార్ల తయారీ.. వెరశి అధిక అమ్మకాలకు దారి తీస్తుంది. విక్రయాలు 2019 స్థాయిని దాటతాయి’ అని లెక్సస్ ఇండియా ప్రెసిడెంట్ నవీన్ సోని తెలిపారు. జూలైలో కంపెనీ అత్యధిక యూనిట్లను సాధించింది. ఇప్పటి వరకు సంస్థ సాధించిన ఉత్తమ అమ్మకాలతో పోలిస్తే పండుగల సీజన్లో మూడు రెట్ల వృద్ధి ఆశిస్తున్నామని
వివరించారు.
సెంటిమెంట్ సానుకూలం..
వినియోగదార్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండడంతో రెండవ త్రైమాసికం నుంచి పండుగల సీజన్ వరకు బలమైన డిమాండ్ ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో మార్టిన్ ష్వెంక్ తెలిపారు. ‘సరఫరా సవాళ్లు ఉన్నాయి. పండుగల సీజన్లో సెమీకండక్టర్ల కొరత కొనసాగుతుందని భావిస్తున్నాం. ఏఎంజీ, ఇతర వర్షన్స్‌లో ఈక్యూఎస్ లగ్జరీ సెడాన్ ఈ పండుగలకు రానుంది’ అన్నారు. కొన్ని నెలలుగా డిమాండ్ క్రమంగా పెరుగుతోందని ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు.
కంపెనీ కార్లకు డిమాండ్ తీవ్రం కావడంతో వెయిటింగ్ పీరియడ్ అధికమైందని చెప్పారు. ప్రపంచ సవాళ్లు కొత్త కార్ల సరఫరాను ప్రభావితం చేయడమే కాకుండా ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయని వెల్లడించారు. దేశంలో మొత్తం కార్ల పరిశ్రమలో లగ్జరీ మోడళ్ల వాటా 2 శాతం లోపే ఉంది. ఈ విభాగం దశాబ్ద కాలంగా అదే స్థాయిలో కొనసాగుతోంది. లగ్జరీ కార్లపై జీఎస్టీ 28 శాతంగా ఉంది. సెడాన్స్‌పై 20, ఎస్‌యూవీలపై 22 శాతం సెస్ అదనం.
Comments
Please login to add a commentAdd a comment