డాక్టర్ వీకే పాల్
న్యూఢిల్లీ: పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగే ప్రమాదముందని ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సాధ్యమైనంత వరకు జనం గుమికూడే చోటుకు వెళ్లొద్దని సూచించింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఆన్‌లైన్ పద్ధతుల్లోనే షాపింగ్ చేసుకోవాలని కోరింది. మహమ్మారి సెకండ్‌వేవ్ ఇంకా ముగియలేదని పునరుద్ఘాటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో రోజువారీ కేసులు 20 వేల వరకు నమోదవుతున్నాయని గుర్తు చేసింది.
‘‘ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని, ఏమరుపాటు తగదు. మహమ్మారి ఇంకా మనమధ్యే ఉంది. అప్రమత్తంగా లేకుంటే అనుకోకుండా పరిస్థితి విషమించవచ్చు’ అని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ గురువారం మీడియాతో అన్నారు. దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 34 రాష్ట్రాల్లో వారం పాజిటివిటీ రేట్ 10%కి మించి ఉందన్నారు.
దేశంలోని అర్హులైన 71% మంది కనీసం ఒక్క డోసైనా కోవిడ్ టీకా వేయించుకోగా, వీరిలో 27% మందికి రెండు డోసులు పూర్తయిందని వివరించారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత లేనే లేదని స్పష్టం చేశారు. ఒక వేళ రోజువారీ కరోనా కేసులు 4.5–5 లక్షల వరకు పెరిగితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 8.36 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 1.35 లక్షల ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment