సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది మూడోరోజు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,96,330కు పెరిగింది. 3,89,851 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,529 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,83,248కు పెరిగింది. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 3,89,851 కరోనా రోగులు కోలుకున్నారు.
దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,19,86,363కు పెరిగింది. రికవరీ రేటు 86.23 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,26,719కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులో 69.02 శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 32,03,01,177 కరోనా పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 20,08,296 పరీక్షలు చేపట్టారు. ఇది అంతర్జాతీయ రికార్డు. భారత్‌లో ఒకే రోజు ఇంత ఎక్కువ కరోనా టెస్ట్‌లు చేయడం ఇదే తొలిసారి. గత వారంతో పోలిస్తే భారత్‌లో 13 శాతం తక్కువగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రోజూ రెండు లక్షలకు మించి కొత్త కేసులతో ప్రపంచంలోనే అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ తొలిస్థానంలో ఉందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment