cases increase
-
మరో నాలుగు హెచ్ఎంపీవీ కేసులు
అహ్మదాబాద్/డిబ్రూగఢ్/పుదుచ్చేరి: దేశంలో మరో నాలుగు హ్యూమన్ మెటాన్యూమోవైరస్(హెచ్ఎంపీవీ) కేసులు బయటపడ్డాయి. గుజరాత్లో రెండు, పుదుచ్చేరి, అస్సాంలలో ఒక్కోటి చొప్పున గుర్తించారు. బాధితుల్లో ముగ్గురు చిన్నారులు కాగా ఒకరు 59 ఏళ్ల వ్యక్తి. తాజాగా నిర్ధారౖణెన కేసులతో కలిపితే గుజరాత్లో వారం వ్యవధిలో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదుకు చేరినట్లయింది. అహ్మదాబాద్‌కు చెందిన 9 నెలల మగ శిశువుకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడం కష్టం కావడంతో ఈ నెల 6న ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఎలాంటి ప్రయాణ చరిత్ర లేని అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు నిర్ధారణైందని మున్సిపల్ అధికారులు తెలిపారు. అదేవిధంగా, కచ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడికి హెచ్ఎంపీవీ సోకినట్లు గుర్తించారు. ఈ బాధితుడికి కూడా ఎలాంటి ప్రయాణ చరిత్రా లేదని చెప్పారు. గుజరాత్లో ఈ నెల 6న మొదటి హెచ్ఎంపీవీ కేసు వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా, అస్సాంలోని డిబ్రూగఢ్‌కు చెందిన 10 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు తేలింది. జలుబు సంబంధిత లక్షణాలతో నాలుగు రోజులుగా డిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు వెల్లడించారు. ఇంకా, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారికి హెచ్ఎంపీవీ సోకినట్లు వెల్లడైంది. ఆరోగ్యం మెరుగవడంతో ఇతడిని శనివారం డిశ్చార్జి చేశారని అధికారులు చెప్పారు. హెచ్ఎంపీవీ బాధితుల కోసం ప్రత్యేకంగా గొరిమేడులోని ప్రభుత్వ ఆస్పత్రిలో 10 పడకలతో కూడిన ప్రత్యేక ఐసీయూ విభాగాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
Mpox Virus: హడలెత్తిస్తున్న మంకీపాక్స్
మధ్య ఆఫ్రికా దేశం డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎంపాక్స్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోందని ఆ దేశ ఆరోగ్య మంత్రి శామ్యూల్-రోజర్ కంబా తెలిపారు. కేసులు పెరగుతున్న క్రమంలో అమెరికా, జపాన్ నుంచి వచ్చే వ్యాక్సిన్ల కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మేము ఖండాంతర అత్యవసర పరిస్థితి గురించి మాట్లాడుతున్నాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్‌ను ఎదుర్కోవడానికి టీకా కార్యక్రమాలను వేగవంతం చేయాలని ప్రభావిత దేశాలకు పిలుపునిచ్చింది’’ అని అన్నారు.స్వల్ప వ్యవధిలో పెరుగుతున్న కేసులుపై కాంగో ఆందోళన వ్యక్తం అవుతోంది. మరోవైపు.. కేసులు పెరుగుతున్న కాంగోకు 50 వేల టీకాలు పంపిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. మరోదేశం జపాన్ కూడా 35 లక్షల టీకా డోసును కాంగో పంపిస్తామని పేర్కొంది. అయితే జపాన్ ప్రధానంగా ఈ టీకాలను చిన్నపిల్లలకు అందిస్తామని వెల్లడించినట్లు అధికారులు పేర్కొన్నారు. ‘‘35 లక్షల పిల్లలతో సహా 40 లక్షల మందికి టీకాలు వేయించాలని కాంగో యోచిస్తున్నాం. వచ్చే వారం నాటికి మేము పొందగలమని ఆశిస్తున్నాం. వ్యాక్సిన్ మా సమస్యలకు పరిష్కారం చూపుతుంది. మా వ్యూహాత్మక టీకా ప్రణాళిక సిద్ధంగా ఉంది. మేము వ్యాక్సిన్ల కోసం ఎదురు చూస్తున్నాము’’ అని కంబా తెలిపారు.కేంద్రం అలెర్ట్:ఎంపాక్స్‌పై భారత్ అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ వార్డులను సిద్ధం చేయడం, విమానాశ్రయాల్లో తనిఖీలు చేయడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆసుపత్రులను ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని మూడు నోడల్ ఆసుపత్రులు సఫ్దర్‌జంగ్, లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్,రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఎంపిక చేసింది. అనుమానిత రోగులపై ఆర్టీ పీసీఆర్ టెస్ట్ చేసి అవసరమైన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. విమానాశ్రయాలను కూడా అప్రమత్తం చేసింది.ఎంపాక్స్ లక్షణాలు..జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, అలసట, వాపుతో పాటు చీము నిండిన పొక్కులు ఎంపాక్స్ వైరస్ సోకిన వ్యక్తుల్లో సాధారణ లక్షణాలుగా కనిపిస్తాయి. ఈ పొక్కులు ముఖంపై మొదలై క్రమంగా శరీరమంతా విస్తరిస్తున్నాయి. సాధారణంగా ఈ పరిస్థితి రెండు నుంచి నాలుగు వారాలు ఉంటుంది. ఏ చికిత్స తీసుకోకున్నా అది తగ్గిపోతుంది కానీ.. ఆ తర్వాత దాని వల్ల రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అది ఏకంగా మరణానికీ దారితీస్తుండటం ఆందోళన కలిగించే అంశం. మరీ ముఖ్యంగా రోగనిరోధకశక్తి తక్కువ ఉండేవాళ్లు, అప్పటికే కొన్ని దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ వైరస్ బారిన పడితే కోలుకోవడం కష్టంగా మారుతోందని వైద్యులు పేర్కొంటున్నారు.మంకీపాక్స్‌ను ఎంపాక్స్ అని కూడా అంటారు. 1958లో కోతులలో పాక్స్ లాంటి వ్యాధి వ్యాప్తి చెందినప్పుడు దీనిని తొలిసారిగా గుర్తించారు. ఇటీవలి మధ్య, పశ్చిమ ఆఫ్రికాలో సోకిన జంతువులతో సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్న వ్యక్తులలో ఎంపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చాయి. -
COVID-19: సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ వేవ్
సింగపూర్: సింగపూర్‌లో కోవిడ్–19 మరోసారి విజృంభిస్తోది. ఈ నెల 5 నుంచి 11వ తేదీ వరకు కేవలం వారం వ్యవ ధిలో 25,900 కేసులు నమోద య్యాయి. దీంతో, ప్రభుత్వం మాస్క్‌లు ధరించాలంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. ఆరోగ్యమంత్రి ఓంగ్ యె కుంగ్ శనివారం ఈ వివరాలను వెల్లడించారు. ‘దేశంలో కోవిడ్ వేవ్ ప్రారంభ దశలో ఉంది. వచ్చే రెండు నుంచి నాలుగు వారాల్లో, జూన్ మధ్య నుంచి చివరి వరకు భారీగా కేసులు నమోదవుతాయి’ అని చెప్పారు. గత వారంలో మే 5 నుంచి 11వ తేదీ వరకు కేసులు 25,900పైగా నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులొచ్చాయి. ఆ వారంలో రోజుకు 181 నుంచి 250 మంది ఆస్పత్రుల్లో చేరారు. అయితే, ఐసీయూ కేసులు సరాసరిన రోజుకు మూడు మాత్రమే ఉన్నాయని ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. 60 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారు, వృద్ధాశ్రమాల్లో ఉండేవారు అదనపు డోసు కోవిడ్ టీకా తీసుకోవాలని మంత్రి సూచించారు. -
కోవిడ్ కొత్త కేసులు 774
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 774 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్రం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసుల సంఖ్య 4,187గా ఉందని తెలిపింది. ఒక్క రోజు వ్యవధిలో తమిళనాడు, గుజరాత్‌లలో ఒక్కరేసి చొప్పున బాధితులు చనిపోయారని పేర్కొంది. శీతల వాతావరణం, కోవిడ్–19 వేరియంట్ జేఎన్.1 వ్యాప్తి కారణంగా కేసులు వేగంగా పెరుగుదల నమోదవుతోందని తెలిపింది. -
619కి చేరిన జేఎన్.1 కేసులు
న్యూఢిల్లీ: దేశంలోని 12 రాష్ట్రాల్లో జనవరి 4వ తేదీ వరకు కోవిడ్–19 సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులు 619 నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో కర్ణాటకలో అత్యధికంగా 199 కేసులు నమోదయ్యాయన్నారు. ఆ తర్వాత కేరళలో 148, మహారాష్ట్రలో 110, గోవాలో 47, గుజరాత్లో 36, ఏపీలో 30, తమిళనాడులో 26, ఢిల్లీలో 15, రాజస్తాన్‌లో 4, తెలంగాణలో 2, ఒడిశా, హరియాణాల్లో ఒక్కటి చొప్పున కేసులు వెలుగు చూశాయి. -
ఒక్కరోజులో 797 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా జేఎన్.1 ఉప వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 797 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. ఒకేరోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం గత ఏడు నెలల్లో ఇదే మొదటిసారి. మొత్తం యాక్టివ్ కేసుల 4091కి చేరుకుంది. ఇప్పటివరకు జేఎన్.1 వేరియంట్ బారినపడిన బాధితుల సంఖ్య 162కు చేరింది. అత్యధికంగా కేరళలో 83 కేసులు, గుజరాత్లో 34 జేఎన్.1 కేసులు వెలుగుచూశాయి. గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్తాన్, తమిళనాడు, తెలంగాణ, ఢిల్లీలో జేఎన్.1 ఉప వేరియంట్ కేసులు నమోదైనట్లు ఇండియన్ సార్స్–కోవ్–2 జినోమిక్స్ కన్సారి్టయం(ఇన్సాకాగ్) శుక్రవారం తెలియజేసింది. ఇదిలా ఉండగా, గత 24 గంటల్లో కరోనా కాటుకు ఐదుగురు బలయ్యారు. -
Covid-19 JN.1 Variant: మళ్లీ కోరలు చాస్తున్న కరోనా..!
న్యూఢిల్లీ: కరోనా కేసుల ఉధృతి నెమ్మదిగా ఊపందుకుంటోంది. గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 656 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,742కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం వెల్లడించింది. కేరళలో మరో వ్యక్తి కోవిడ్‌తో కన్నుమూయడంతో దేశంలో ఇప్పటిదాకా కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,33,333కి ఎగబాకింది. భారత్‌లో తొలికేసు వెలుగుచూసిననాటి నుంచి ఇప్పటిదాకా 4,50,08,620 మందికి కరోనా సోకగా వారిలో 4,44,71,545 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 220.67 కోట్ల డోస్‌ల కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. ఆగ్నేయాసియా దేశాలు జాగ్రత్త శ్వాససంబంధ కేసులు ఆగ్నేయాసియా దేశాల్లో పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తంచేసింది. కోవిడ్ వ్యాధి విస్తృతిపై ఓ కన్నేసి, నిఘా పెంచి, వ్యాప్తి కట్టడికి కృషిచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రాంత డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ఆగ్నేయాసియా దేశాలకు సూచించారు. ‘‘ పండుగల సీజన్ కావడంతో జనం ఒక్కచోట గుమిగూడే సందర్భాలు పెరుగుతున్నాయి. దీంతో కరోనా వ్యాప్తి పట్ల జనం అప్రమత్తంగా ఉండాలి’’ అని ఆమె చెప్పారు. జేఎన్1 ఉపవేరియంట్‌కు వేగంగా సంక్రమించే గుణం ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన పనిలేదని డబ్ల్యూహెచ్‌వో స్పష్టంచేయడం తెల్సిందే. ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు జేఎన్1సహా అన్నివేరియంట్ల కరోనా వైరస్ల నుంచీ సమర్థవంతంగా రక్షణ కలి్పస్తాయి’’ అని ఆమె చెప్పారు. ముందస్తు చర్యల్లో భాగంగా భారత ప్రభుత్వం సైతం అవసరమైన చోట్ల కోవిడ్ నిబంధనలను తప్పక అవలంభించాలని రాష్ట్రాలకు ఇప్పటికే సూచించింది. -
Covid-19: కరోనా కేసుల ఉధృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో ఏకంగా 614 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 21వ తేదీ తర్వాత ఒక్క రోజులో ఇంతగా కొత్త కేసులు నమోదవడం ఇదే తొలిసారికావడం గమనార్హం. గత 24 గంటల్లో కేరళలో ముగ్గురు కోవిడ్‌తో కన్నుమూశారు. భారత్‌లో కొత్తగా వెలుగుచూసిన జేఎన్1 ఉపరకం వైరస్ కేసులు ప్రస్తుతం మూడు రాష్ట్రాల్లో 21 నమోదయ్యాయని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ చెప్పారు. ఈ వైరస్ సోకినవారు 92 శాతం వరకు ఇంటివద్దే చికిత్స పొందుతున్నారని ఆయన వెల్లడించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 2,311కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, జార్ఖండ్, కర్ణాటకల్లో రోజువారీ కేసుల సంఖ్యలో మరింత పెరుగుదల కనిపించింది. ఆరోగ్య మంత్రి ఉన్నతస్థాయి సమావేశం కేసుల ఉదృతి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ రాష్ట్రాల ఉన్నతాధికారులతో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘‘ పెరుగుతున్న కేసులతో ఆందోళన అక్కర్లేదు. కానీ అప్రమత్తంగా ఉండండి. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం, కరోనా కేసుల నిర్ధారణ పరీక్షల పెంపు, ఆస్పత్రుల్లో చికిత్స సన్నద్ధత అంశాలపై సూచనలు చేశారు. కొత్తరకం వేరియంట్‌గా భావించే అనుమానిత కేసుల శాంపిళ్లను వెంటనే ఇన్సాకాగ్ జన్యక్రమ విశ్లేషణ ల్యాబ్‌లకు పంపండి. కేసుల నిర్ధారణ, నిఘా, చికిత్స విధానాలను పటిష్టంచేయండి. ఆస్పత్రుల్లో మెడికల్ ఆక్సిజన్, పడకలు, వెంటిలేటర్లు, వైద్య ఉపకరణాలు, ఆక్సిజన్ ప్లాంట్లు తదితరాల లభ్యతను ఎప్పటికప్పుడు సరిచూసుకోండి. ఈ సన్నద్దతపై ప్రతి మూడు నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించండి. వైరస్ విస్తృతిపై ప్రజల్లో అవగాహన పెంచండి’’ అని మంత్రి ఉన్నతాధికారులకు సూచించారు. దేశంలో ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి వివరాలతో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‡్ష పంత్ మంత్రికి ఒక ప్రజెంటేషన్ చూపించారు. కొత్త జేఎన్1 సబ్‌వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ ఇంట్రస్ట్’ పరిగణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. వ్యాప్తి వేగం ఎక్కువగా ఉన్నా రిస్క్ తక్కువేనంది. అమెరికా, చైనా, సింగపూర్, భారత్‌లలో ఈ వైరస్ వెలుగు చూసింది. -
కోవిడ్ కేసులు పైపైకి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీచేసింది. కోవిడ్ కేసుల్లో పెరుగుదల, కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్1 (బీఏ 2.86.1.1) వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది. ‘‘ కోవిడ్ కేసుల్లో ఉధృతి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. భారత వాతావరణాన్ని తట్టుకుని వేరియంట్లు విజృంభించేలోపు ముందస్తు చర్యలతో సమాయత్తం అవుదాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‡్ష పంత్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఐదుగురు కోవిడ్‌తో కన్నుమూశారు. కొత్తగా వందలాది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
National Crime Records Bureau: అయినా భర్త మారలేదు
ఎన్ని కథలు రాసినా..ఎన్ని సినిమాలు తీసినా..ఎన్ని చట్టాలు చేసినా హింస వల్ల భార్యాభర్తల బంధానికి ఎంత గట్టి దెబ్బ తగులుతుందో వార్తల ద్వారా నిత్యం చదువుతున్నా భర్త మాత్రం మారడం లేదు. ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) డిసెంబర్ 3న విడుదల చేసిన తాజా నివేదికలో భార్యల మీద భర్తల హింస 2021తో పోలిస్తే 2022లో ఇంకా పెరిగిందని తెలిపింది. ఐదు రాష్ట్రాల ఫలితాలు వెలువడే రోజున వచ్చిన ఈ నివేదిక ఎన్ని ప్రభుత్వాలు మారినా మగాణ్ణి మార్చలేకపోతున్నాయన్న కఠోర సత్యాన్ని ముందుకు తెచ్చింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న డిసెంబర్ 3వ తేదీన ‘నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో’ (ఎన్.సి.ఆర్.బి.) ఏటా దేశంలో జరిగే నేరాలపై ఇచ్చే వార్షిక నివేదికను 2022 సంవత్సరానికి విడుదల చేసింది. 2022లో జరిగిన అన్ని నేరాల్లో భార్యలపై భర్తలు నెరపిన హింసాత్మక చర్యల కేసులే ప్రథమ స్థానంలో నిలిచాయని ఈ నివేదిక చెప్పింది. అంటే పెద్ద చదువులు, భారీ జీతాల ఉద్యోగాలు, చట్టాలు, సంఘపరమైన మర్యాదలు... ఏవీ మగాణ్ణి మార్చలేకపోతున్నాయని అతడు రోజురోజుకూ మరింత తీసికట్టుగా తయారవుతున్నాడని ఈ నివేదిక వల్ల అర్థమవుతోంది. తానే సర్వాధికారి అన్నట్టుగా ఇంటి యజమాని స్థానంలో ఉంటూ భార్యతో హింసాత్మకంగానే వ్యవహరిస్తున్నాడు. ‘ఇది మగ సమాజం’ అని మగవాడు భావించడమే ఇందుకు కారణం. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎంత మంది స్త్రీలకు సీట్లు దక్కాయో, ఎంతమంది స్త్రీలు గెలిచారో గమనిస్తే అవును.. ఇది మగసమాజం అనుకోకుండా ఉండగలరా ఎవరైనా? కాబట్టి ఎన్నికల ఫలితాల రోజే ఈ నివేదిక వెలువడటం యాదృచ్చికం కాదు. పిల్లలూ బాధితులే ఈ నివేదికలో మరో బాధాకరమైన వాస్తవం ఏమిటంటే దేశంలో 2022లో స్త్రీల తర్వాత అత్యధికమైన కేసులు నమోదైనవి బాలలకు జరిగిన హానిపై నమోదైనవే. 2022లో పిల్లలపై హింసకు సంబంధించి 1,62,449 కేసులు నమోదయ్యాయి. వీటిలో సగానికి సగం కిడ్నాపులు. మిగిలినవి పోక్సో కేసులు. వీటిలో పిల్లలపై జరిగిన లైంగిక అసభ్యతతో పాటు అత్యాచారాలు కూడా ఉన్నాయి. గమనించాల్సిన సంగతి ఏమిటంటే భార్యాభర్తల మధ్య హింస చోటు చేసుకుంటున్నప్పుడు పిల్లలపై శ్రద్ధ పెట్టే అవకాశం తక్కువ. లేదా తల్లిదండ్రుల తగాదాలను చూసి ఇల్లు వీడే పిల్లలు, ఇంట్లో ఉండలేక వేరే చోట ఆడుకోవడానికి వెళ్లి లైంగిక దాడులకు గురయ్యే పిల్లలు అధికంగా ఉంటారు. అంటే గృహహింస వల్ల కేవలం స్త్రీలే కాక పిల్లలు కూడా బాధితులవుతున్నారని తెలుసుకోవాలి. 2022లో స్త్రీలపై, పిల్లలపై జరిగిన నేరాల తర్వాత 60 ఏళ్లు దాటిన వృద్ధులపై ఎక్కువ నేరాలు జరిగాయి. అంటే మన దేశంలో స్త్రీలు, పిల్లలు, వృద్ధులు ఎక్కువగా హింసను ఎదుర్కొంటున్నారు. భర్తలూ మారాలి వివాహం అంటే స్త్రీ పురుషులు కలిసి నడవాల్సిన సమాన వేదిక అనే భావన ఇంకా పురుషుడికి ఏర్పడకపోవడమే స్త్రీలపై నేరాలకు ప్రధాన కారణం. పెళ్లి ద్వారా తనకు భార్య అనే బానిస లేదా సేవకురాలు లేదా తాను అదుపు చేయదగ్గ మనిషి అందుబాటులోకి రాబోతున్నదని పురుషుడు భావిస్తూనే ఉన్నాడు. పైగా ‘ఇదంతా మామూలే. తాతలు తండ్రులు చేసిందే నేనూ చేస్తున్నాను’ అని తాను నమ్మడమే కాక ‘మీ నాన్న మీ తాత చేస్తున్నదే నేనూ చేస్తున్నాను’ అని భార్యతో అంటున్నాడు. ఇందుకు భార్య అభ్యంతరం పెడితే, తన నిర్ణయాలను వ్యతిరేకిస్తే, మరొక అభిప్రాయం కలిగి ఉంటే ఆమెపై హింస జరుగుతున్నది. భర్త హింస చేయకపోతే అతని సంబంధీకులు ఇందుకు తెగబడుతున్నారు. గాయపరచడం నుంచి హత్య చేయడం వరకు ఈ దాడులు ఉంటున్నాయి. నమోదైనవి మాత్రమే ఎన్.సి.ఆర్.బి. ఈ నివేదికను నమోదైన కేసుల ఆధారంగానే ఇస్తుంది. మన దేశంలో ఎంతమంది భార్యలు కేసుల వరకూ వెళతారో ఊహించవచ్చు. పది శాతం స్టేషన్ దాకా వెళితే 90 శాతం ఇంట్లోనే ఉంటూ ఈ హింసను అనుభవిస్తుంటారు. పురుషులను మార్చడానికి సాహిత్యం, సినిమా, సామాజిక చైతన్యం ఎంతో ప్రయత్నం చేస్తున్నాయి. అయినా సరే పురుషుడు మారకపోతే ఎలా? కాఫీ చల్లారిందని, కూర బాగలేదని, కట్నం పేరుతోనో, ఉద్యోగం చేయవద్దనో, మగ పిల్లాణ్ణి కనలేదనో, పుట్టింటికి తరచూ వెళుతోందని, అత్తింటి వారిని అసలు పట్టించుకోవడం లేదనో ఏదో ఒక నెపం వెతికి హింసకు తెగబడితే ఎలా? భర్తలూ ఆలోచించండి. 4,45,256 కేసులు 2022లో స్త్రీలకు జరిగిన హానిపై దేశవ్యాప్తంగా 4,45,256 కేసులు నమోదయ్యాయి. 2021 కంటే 2022లో ఈ నేరాలు 4 శాతం పెరిగాయి. అయితే ఈ మొత్తం నాలుగున్నర లక్షల కేసుల్లో ప్రథమస్థానం వహించినవి భార్య మీద భర్త, అతని సంబంధీకులు చేసిన హింసకు సంబంధించినవే కావడం గమనార్హం. రెండవ స్థానం వహించిన కేసులు స్త్రీల కిడ్నాప్. మూడవ స్థానంలో నిలిచిన కేసులు స్త్రీ గౌరవానికి భంగం కలిగించే చర్యలు. నాల్గవ స్థానంలో నిలిచినవి అత్యాచారాలు. అంటే భర్త, కుటుంబ సభ్యుల సంస్కార స్థాయి మెరుగ్గా ఉండి స్త్రీని గౌరవించే విధంగా ఉంటే దాదాపు సగం కేసులు ఉండేవే కావు. -
COVID-19: మరో 6,155 కేసులు
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల వ్యవధిలో మరో 6,155 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా, యాక్టివ్ కేసులు 31,194కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. తాజా కేసులతో కలిపి మొత్తం కేసులు 4,47,51,259కు చేరాయి. అదే సమయంలో మరో 11 మంది బాధితులు చనిపోవడంతో మొత్తం మరణాలు 5,30,954కు పెరిగినట్లు వెల్లడించింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.07% కాగా, రికవరీ రేటు 98.74%గా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 5.63గా నమోదైనట్లు ఆరోగ్య శాఖ వివరించింది. -
కరోనాతో జాగ్రత్త: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి మళ్లీ వేగంగా పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ శుక్రవారం రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, అదనపు ముఖ్య కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా వ్యవహరించాలని, కోవిడ్–19 మేనేజ్మెంట్ కోసం సన్నద్ధం కావాలని సూచించారు. కరోనా లక్షణాలు ఎక్కడ అధికంగా వ్యాప్తిలో ఉన్నాయో ఎప్పటికప్పుడు గుర్తించాలని చెప్పారు. ఎమర్జెన్సీ హాట్స్పాట్లలో నివారణ చర్యలు చేపట్టాలన్నారు. కరోనా నిర్ధారణ పరీక్షలతోపాటు వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన నమూనాల జినోమ్ సీక్వెన్సింగ్‌ను పెంచాలని కోరారు. కోవిడ్–19 వ్యాప్తి, నియంత్రణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రజా చైతన్యం ద్వారానే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేయాలి గతంలో కరోనా వ్యాప్తి ఉధృతంగా ఉన్న సమయంలో కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేశాయని, చక్కని ఫలితాలు సాధించాయని మాండవీయ గుర్తుచేశారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సమన్వయంతో పనిచేయాలన్నారు. పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆరోగ్య శాఖ సన్నద్ధతపై ఈ నెల 8, 9న జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులకు పిలుపునిచ్చారు. 10, 11న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్‌డ్రిల్స్ నిర్వహించాలన్నారు. కొత్త వేరియంట్లతో సంబంధం లేకుండా వైరస్ నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అమలు చేయాలని వివరించారు. టెస్ట్–ట్రాక్–ట్రీట్–వ్యాక్సినేట్‌తోపాటు కోవిడ్–19 నియంత్రణ చర్యల పటిష్ట అమలుతో సత్ఫలితాలు లభిస్తాయని వెల్లడించారు. అర్హులైన వారందరికీ కరోనా టీకాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవారిపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని సూచించారు. కోవిడ్–19 బాధితులకు ఆసుపత్రుల్లో సరిపడా పడకలు సిద్ధంగా ఉండేలా, ఔషధాలు లభ్యమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సమీక్షా సమావేశంలో పుదుచ్చేరి సీఎం ఎన్.రంగస్వామి, తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావుతోపాటు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. 6 వేల మార్కు దాటిన కోవిడ్ కేసులు దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా శుక్రవారం 203 రోజుల తర్వాత 24 గంటల వ్యవధిలో కొత్తగా 6,050 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో యాక్టివ్ కేసులు 28,303కు చేరుకున్నట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. మొత్తం కేసులు 4.47 కోట్లకు చేరాయి. దీంతోపాటు, మరో 14 మరణాలు నమోదు కావడంతో మొత్తం మరణాలు 5,30,943కు చేరాయి. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.39%కాగా, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.06%గా ఉంది. ప్రతి 10 లక్షల జనాభాకు 100 టెస్టులు ఎక్స్‌బీబీ.1.5తోపాటు బీక్యూ.1, బీఏ.2.75, సీహెచ్.1.1, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీఎఫ్, ఎక్స్‌బీబీ.1.16 వేరియంట్ల ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నిశితంగా పరిశీలిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఒమిక్రాన్, దాని ఉప వేరియంట్ల వ్యాప్తి అధికంగా ఉందని వెల్లడించింది. ఇతర వేరియంట్ల ప్రభావం బాగా తగ్గిందని పేర్కొంది. ఎక్స్‌బీబీ.1.16 అనే వేరియంట్ వ్యాప్తి ఫిబ్రవరిలో 21.6 శాతం ఉండగా, మార్చిలో 35.8 శాతానికి చేరిందని వివరించింది. అయితే, వైరస్ వ్యాప్తి పెరిగినప్పటికీ ఆసుపత్రుల్లో చేరికలు, మరణాలు పెద్దగా నమోదు కాలేదని స్పష్టం చేసింది. దేశంలో ప్రతి 10 లక్షల జనాభాకు నిత్యం సగటున 100 కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్, తమిళనాడు, హరియాణాలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు పేర్కొంది. -
కొత్తగా 3,824 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. ఆదివారం ఒక్కరోజే కొత్తగా 3,824 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఆరు నెలల్లో ఇవే ఒకరోజు అత్యధిక కేసులు కావడం గమనార్హం. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 18,389కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 4,47,22,605 కరోనా పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. 5,30,881 మంది ఈ మహమ్మారి కాటుకు బలయ్యారు. మరోవైపు రికవరీ రేటు 98.77 శాతంగా ఉంది. 4,41,73,335 మంది కరోనా బారినపడి, చికిత్సతో పూర్తిగా కోలుకున్నారు. కరోనా సంబంధిత మరణాల రేటు 1.19 శాతంగా రికార్డయ్యింది. కేంద్ర ప్రభత్వుం ఇప్పటివరకు 220.66 కోట్ల కోవిడ్–19 వ్యాక్సిన్ డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. -
COVID-19: కరోనా కొత్త కేసులు 1,805
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మళ్లీ విజృంభిస్తోంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 1,805 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్రం సోమవారం తెలిపింది. అదే సమయంలో, యాక్టివ్ కేసులు 134 రోజుల తర్వాత 10 వేల మార్కు దాటాయంది. రోజువారీ పాజిటివిటీ రేట్ 3.19%, వీక్లీ పాజిటివిటీ రేట్ 1.39 శాతంగా ఉంది. యాక్టివ్ కేసులు 10,300కు పెరిగినట్లు వెల్లడించింది. చండీగఢ్, గుజరాత్, హిమాచల్, యూపీ, కేరళల్లో ఆరుగురు చనిపోయారు. -
చైనాలో కోవిడ్ మరణ మృదంగం..అంతకంతకూ పెరిగిపోతున్న కేసులు
చైనాలో అంతకంతకు పెరుగుతున్న కరోనా కేసులతో కుదేలవుతోంది. దీనికి తోడు రోజుకు వేల సంఖ్యలో మరణాల సంభవించడంతో తీవ్ర భయాందోళనలతో సతమతమవుతోంది చైనా. అదీగాక బీజింగ్ కోవిడ్ ఆంక్షలు సడలించాక కేసులు ఘోరంగా పెరగడం ప్రారంభమై అందర్నీ విస్మయపర్చింది. ఈ క్రమంలో ఇటీవలే ఒక వారంలోనే దేశవ్యాప్తంగా ఆస్పత్రులలో దాదాపు 13 వేల మరణాలు సంభవించినట్లు నివేదికలో పేర్కొంది. మరణించిన వారిలో చాలామంది వైరస్ బారిన పడినవారేనని ఆరోగ్య అధికారి తెలిపారు. ఈ మేరకు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్(సీడీసీ) కేవలం కరోనాతో ఆస్పత్రుల్లో చేరి శ్వాసకోస వైఫల్యంతో 681 మంది మరణించారని, కరోనా తోపాటు ఇతర వ్యాధుల కారణంగా సుమారు 11,977 మంది మరణించినట్లు పేర్కొంది. కానీ హోం క్వారంటైన్‌లోనే ఉండి చనిపోయిన వారి సంఖ్యను వెల్లడించలేదు. ఆంక్షలు సడలించాక జనవరి12 నాటికి ఒక్క నెలరోజుల్లోనే దాదాపు 60 వేల మరణాలు సంభవించాయని ఒక వారం ముందు వెల్లడించింది. అంతేగాదు కోవిడ్ ఆంక్షలను ఎత్తేసిన డిసెంబర్ నుంచి అంతకు ముందు కలిపి మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు ఆరు లక్షలకు పైగా ప్రజలు మరణించినట్లు తెలిపింది. చైనాలో జరుపుకునే లూనార్ న్యూ ఈయర్ వేడుకలకు ముందుగానే సుమారు 36 వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వేడుకలను పురస్కరించుకుని మిలియన్ల మంది ప్రజలు తమ సొంతగ్రామాలకు రావడంతో ఈ కరోనా మరింత వ్యాప్తి చెందుతుందని భయాలు ఎక్కువయ్యాయి. ఐతే దేశంలో ఇప్పటికే 80 శాతం మంది ఈ వైరస్ బారిన పడ్డారు, కాబట్టి ఇప్పట్లో కరోనా సెకండ్‌వేవ్ వచ్చే అవకాశం లేదని చైనా సీడీసీలోని చీఫ్ ఎపిడెమియాలజిస్ట్ వూ జున్ యూ అన్నారు. (చదవండి: కాలిఫోర్నియా: చైనీస్ న్యూఇయర్ పార్టీలో కాల్పులు.. పలువురి మృతి) -
40 రోజులు.. 200 కోట్ల ప్రయాణాలు
షాంఘై: చైనాలో ఒక వైపు భారీగా కరోనా కేసులు నమోదవుతుండగా ‘చున్ యున్’లూనార్ కొత్త సంవత్సరం వచ్చిపడింది. శనివారం నుంచి మొదలైన ‘చున్ యున్’వేడుకల 40 రోజుల సమయంలో చైనీయులు దేశ, విదేశాల నుంచి సొంతూళ్లకు 200 కోట్ల ప్రయాణాలు సాగించనున్నట్లు అంచనా. గత ఏడాదితో పోలిస్తే ఇది 99.5% ఎక్కువని, 2019 ప్రయాణాల్లో 70.3% అని చైనా రవాణా శాఖ తెలిపింది. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వలస సందర్భంగా పేర్కొంది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020 నుంచి చైనీయులు కొత్త ఏడాది ఉత్సవాలకు, ప్రయాణాలకు దూరంగా ఉండిపోయారు. ఇటీవల ప్రభుత్వం ఆంక్షలను సడలించడంతో ఈసారి భారీగా ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 21 నుంచి అధికారికంగా మొదలయ్యే లూనార్ కొత్త ఏడాది ఉత్సవాలు 40 రోజులపాటు కొనసాగుతాయి. జనమంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబసభ్యులతో కలిసి పండుగను ఘనంగా జరుపుకుంటారు. ఇప్పటికే దేశం కోవిడ్‌తో సతమతమవుతుండగా, కోట్లాదిగా జనం రాకపోకలు సాగించడం అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాలు, గ్రామాల్లో కేసులు పెరిగితే, ఆస్పత్రుల్లో సరిపడా ఐసీయూ బెడ్లు, వెంటిలేటర్లు లేవని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కోవిడ్ పరీక్షలను నిలిపివేసి చికిత్సలు, వ్యాక్సిన్ల పంపిణీపై దృష్టి పెట్టింది. మార్చి 31వ తేదీ వరకు బాధితులకయ్యే చికిత్స ఖర్చులో 60% తగ్గిస్తామని ప్రభుత్వం తెలిపింది. జనరిక్ కరోనా టీకా పాక్స్‌లోవిడ్‌ను చైనాలో తయారు చేసి, పంపిణీ చేసే విషయమై ఫైజర్ కంపెనీతో చర్చలు జరుపుతోంది. -
కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్ మరణాలు
న్యూఢిల్లీ: చైనాలో కొత్త ఏడాదిలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరనుంది. ఈ నెల 13వ తేదీ కల్లా రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని, మరో 10 రోజుల తర్వాత రోజుకు 25 వేల కరోనా మరణాలు సంభవిస్తాయని యూకేకు చెందిన అధ్యయన సంస్థ ఎయిర్ ఫినిటీ తెలిపింది. డిసెంబర్ ఒకటో తేదీ నుంచి చైనాలో కరోనాతో రోజుకు 9 వేల మంది చొప్పున చనిపోతున్నారని తెలిపింది. జనవరి చివరి నాటికి చైనాలో 5,84,00 కోవిడ్ మరణాలు చోటుచేసుకుంటాయని పేర్కొంది. ఏప్రిల్ కల్లా కోవిడ్‌తో మృతుల సంఖ్య 17 లక్షలకు చేరుకుంటుందని తెలిపింది. మార్చి 3వ తేదీ నుంచి మరో విడత విజృంభణతో రోజుకు 42 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేసింది. -
రిటైల్‌లో కొనసాగనున్న కన్సాలిడేషన్
న్యూఢిల్లీ: దేశీ రిటైల్ రంగంలో బడా కంపెనీలు కొత్త ఏడాది తమ స్థానాలను పటిష్టం చేసుకోవడంపై మరింతగా కసరత్తు చేయనున్నాయి. దీంతో 2023లోనూ కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వృద్ధి అవకాశాలు ఆశావహంగానే కనిపిస్తున్నా, ద్రవ్యోల్బణంపరమైన ప్రతికూలతలు.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో ఆందోళనల కారణంగా పరిశ్రమ కొంత ఆచితూచి వ్యవహరించవచ్చని విశ్లేషకులు తెలిపారు. సమర్ధమంతమైన పెద్ద సంస్థలకు చాలా మటుకు చిన్న రిటైలర్లు తమ వ్యాపారాలను విక్రయించి తప్పుకునే అవకాశాలు ఉండటంతో 2023లో కన్సాలిడేషన్ కొనసాగవచ్చని భావిస్తున్నట్లు డెలాయిట్ ఇండియా కన్సల్టింగ్ పార్ట్నర్ రజత్ వాహి చెప్పారు. కస్టమరుకు అత్యుత్తమ అనుభూతిని ఇచ్చేందుకు స్టోర్స్‌లో టెక్నాలజీ వినియోగం మరింత పెరగవచ్చని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా మిగతా కీలక మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో రిటైల్ విభాగం మెరుగైన వృద్ధి సాధించగలదని రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ చెప్పారు. ఓఎన్డీసీ (డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్) వంటి కాన్సెప్టులతో రాబోయే రోజుల్లో అసంఖ్యాకంగా చిన్న రిటైలర్లు డిజిటల్ కామర్స్‌లో పాలుపంచుకుంటారని వివరించారు. ఆదాయాల్లో 20 శాతం వరకూ వృద్ధి .. 2023 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సంఘటిత రంగ ఆహార, నిత్యావసరాల రిటైలర్ల ఆదాయాలు 15–20 శాతం శ్రేణిలో పెరగవచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా రూపొందించిన ఒక నివేదిక వెల్లడించింది. అయితే, ద్రవ్యోల్బణంపరమైన ఒత్తిళ్ల కారణంగా నిర్వహణ లాభాల మార్జిన్లు 5–6 శాతం శ్రేణికి పరిమితం కావచ్చని వివరించింది. సామర్థ్యాలను మెరుగుపర్చుకునేందుకు టెక్నాలజీని వినియోగించుకోవడం, మెట్రో నగరాలను దాటి కార్యకలాపాలను విస్తరించడం తదితర అంశాలపై కంపెనీలు దృష్టి పెట్టనున్నట్లు కన్సల్టెన్సీ సంస్థ ఈవై భారత విభాగం లీడర్ (కన్జూమర్ ప్రోడక్ట్స్, రిటైల్) అంశుమన్ భట్టాచార్య తెలిపారు. ఇక, కొత్త ఏడాదిలోకి ప్రవేశించే తరుణంలో ఒకసారి 2022లో రిటైల్‌లో చోటు చేసుకున్న కీలక పరిణామాలు కొన్ని చూస్తే .. ► ఏకంగా 16,600 పైచిలుకు స్టోర్స్‌తో రిలయన్స్ రిటైల్ దేశీయంగా అతి పెద్ద ఆఫ్‌లైన్ రిటైలరుగా ఎదిగింది. 18 బిలియన్ డాలర్ల ఆదాయంతో అంతర్జాతీయంగా టాప్ రిటైలర్లలో 56వ స్థానంలోనూ, అత్యంత వేగంగా ఎదుగుతున్న రిటైలర్లలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జర్మన్ రిటైల్ సంస్థ మెట్రో ఏజీకి చెందిన భారత కార్యకలాపాలను రూ. 2,850 కోట్లకు కొనుగోలు చేసేందుకు డీల్ కుదుర్చుకుంది. అలాగే, అబు జానీ సందీప్ ఖోస్లా (ఏజేఎస్కే), పర్పుల్ పాండా ఫ్యాషన్స్ మొదలైన పలు ఫ్యాషన్స్ బ్రాండ్స్‌లో, రోబోటిక్స్ కంపెనీ యాడ్వర్బ్లోనూ మెజారిటీ వాటాలు దక్కించుకుంది. ► ఆదిత్య బిర్లా గ్రూప్‌లో బాగమైన టీఎంఆర్‌డబ్ల్యూ సంస్థ ఫ్యాషన్ కేటగిరీలో ఎనిమిది డిజిటల్ ఫస్ట్ లైఫ్‌స్టయిల్ బ్రాండ్స్‌లో మెజారిటీ వాటాలు తీసుకుంది. ► ఆన్లైన్లో కార్యకలాపాలు విస్తరించే దిశగా వీ–మార్ట్ సంస్థ లైమ్‌రోడ్‌ను కొనుగోలు చేసింది. ► దేశీ రిటైల్ పరిశ్రమలో దిగ్గజంగా వెలుగొందిన ఫ్యూచర్ రిటైల్ కుప్పకూలింది. దివాలా పరిష్కార చర్యలు ఎదుర్కొంటోంది. -
కోవిడ్ కేసులు పెరుగుతున్నాయ్.. జాగ్రత్తలు పాటించండి
న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కోవిడ్ కేసులు సరాసరిన 15 వేలకు పైగా నమోదవుతున్నందున అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది. ముఖ్యంగా ఈ స్వాతంత్య్ర వేడుకల సమయంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని కోరింది. ముందు జాగ్రత్తలు పాటిస్తూ, ఉత్సవాల సమయంలో పెద్ద సంఖ్యలో జనం గుమికూడకుండా చూసుకోవాలని కేంద్ర హోం శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాసింది. దీంతోపాటు, ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రోత్సహిస్తూ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలోని ఒక ప్రముఖ ప్రాంతంలో పదిహేను, నెల రోజులపాటు కొనసాగించాలని పేర్కొంది. ప్రభుత్వ విభాగాలు, విద్యాసంస్థలు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని కూడా కోరింది. -
ఫోర్త్ వేవ్‌లో అనవసర ఆంక్షలు ఉండవు
బనశంకరి: కోవిడ్ నాలుగో దాడి పేరుతో అనవసరంగా ఎలాంటి ఆంక్షల్ని విధించరాదని, అవసరమైనంత వరకే నిబంధనలు ఉండాలని ప్రధాని మోదీ సూచించారు, ఆ మేరకు రాష్ట్రంలో చర్యలు తీసుకున్నామని సీఎం బసవరాజ బొమ్మై తెలిపారు. బుధవారం నివాస కార్యాలయమైన కృష్ణాలో విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో జరిగిన సీఎంల వీడియో సమావేశంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి గురించి చర్చించాను. రాష్ట్రంలో కోవిడ్ పూర్తిగా నియంత్రణలో ఉంది. ఈ నెల 9 తరువాత బెంగళూరులో పాజిటివ్ రేటు పెరిగింది అని చెప్పారు. ప్రతిరోజు 30 వేల కోవిడ్ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. ఆస్ట్రేలియా, ఇండోనేషియా, న్యూజిలాండ్, సౌత్ కొరియా నుంచి వచ్చే వారిపై నిఘా పెట్టామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50 వేలకు పైగా పడకలు, ప్రైవేటు ఆసుపత్రుల్లో లక్షకు పైగా బెడ్లు అందుబాటులో ఉన్నాయి, ఆక్సిజన్‌ను సిద్ధం చేశామన్నారు. 12 ఏళ్లలోపు పిల్లలకు వ్యాక్సిన్ వేయడానికి కేంద్రం అనుమతించిందన్నారు. ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలని, అలాగే వసతులను పెంచాల్సి ఉందన్నారు. జూన్ మొదటివారం నుంచి కేసులు పెరగవచ్చు కరోనా కేసులు పెరిగితే లాక్‌డౌన్‌తో పాటు కొన్ని కఠిన నియమాలను తెస్తారనే వార్తలను ఆరోగ్య మంత్రి సుధాకర్ తిరస్కరించారు. జూన్ మొదటి వారంలో కోవిడ్ వేవ్ రావచ్చునని నిపుణులు తెలిపారు, ముందు జాగ్రత్తలు చేపట్టామన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ఉచితంగా కోవిడ్ బూస్టర్ డోస్ వేస్తామని, 18 ఏళ్లు దాటినవారు వారికి రెండోడోస్ తీసుకున్న 9 నెలల తరువాత మూడో టీకాను వేసుకోవచ్చన్నారు. కోవిడ్ కాంట్రాక్టు వైద్య సిబ్బంది సేవలను 18 నెలల వరకు పొడించాలని ఆర్థికశాఖను కోరినట్లు తెలిపారు. నాలుగో వేవ్‌కు బీబీఎంపీ సిద్ధం కోవిడ్ నాలుగో వేవ్ పంజా విసిరితే సమర్థంగా ఎదుర్కొనేందుకు బీబీఎంపీ సిద్ధమైంది. సిబ్బంది, ఆరోగ్యచికిత్స పరికరాలను సమకూర్చుకోవడంలో పాలికె అధికారులు నిమగ్నమయ్యారు. బెంగళూరులో నిత్యం 60 నుంచి 80 కేసులు వెలుగుచూస్తున్నాయి. బెళందూరు, గసంద్ర, కోరమంగల, హెచ్ఎస్ఆర్.లేఔట్, వర్తూరు, హూడి, కాడుగోడితోపాటు మొత్తం 10 వార్డుల్లో కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ చికిత్సకు నాలుగు ఆసుపత్రుల్లో 1,365 సాధారణ పడకలు, ఐసీయు, వెంటిలేటర్ తో పాటు మొత్తం 2392 పడకలు సిద్ధం చేశారు. కరోనా వ్యాక్సిన్ రెండోడోస్ వేసుకోనివారి ఆచూకీ కనిపెట్టి పోలీసుల సాయంతో వారి ఇళ్ల వద్దకే వెళ్లి వ్యాక్సిన్ వేయాలని యోచిస్తున్నారు. 60 ఏళ్లు లోపు వారికి బూస్టర్ డోస్ అందించడం పట్ల సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు. కోవిడ్ విరుచుకుపడితే అధికంగా నష్టపోయేది బెంగళూరేనని మూడుసార్లు స్పష్టమైంది. (చదవండి: ఫోర్త్ వేవ్ ముప్పు తప్పదంటున్న నిపుణులు..) -
కరోనా వైరస్ ఉధృతి: షాంఘైలో ఒక్క రోజే 51 మంది మృతి
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. బీజింగ్‌లో ప్రముఖులుండే చయోయంగ్ ప్రాంతంలో కరోనా కేసులు పదుల్లో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. సోమవారం నుంచి మూడు రోజులపాటు ఇక్కడి 35 లక్షల మందికి మూడు విడతల్లో నిర్థారణ పరీక్షలు ప్రారంభించింది. బీజింగ్‌లో ఆదివారం బయటపడిన 14 కేసుల్లో 11 చయోయంగ్ జిల్లాలోనివేనని అధికారులు తెలిపారు. షాంఘైలో ఒక్క రోజు వ్యవధిలో అత్యధికంగా మరో 51 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. దీంతో, ఇక్కడ కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 138కి చేరుకుంది. షాంఘైలో కొత్తగా 2,472 కేసులు నిర్థారణయ్యాయి. చైనా ప్రధాన భూభాగంలో ఆదివారం ఒక్క రోజే మరో 20,190 కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. -
భారత్‌లో 16,522కు యాక్టివ్ కేసులు
న్యూఢిల్లీ: దేశంలో సోమవారం కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 4,30,60,086కు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. యాక్టివ్ కేసులు 16,522కు పెరిగినట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో మరో 30 మంది కోవిడ్ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాలు 5,22,223గా నమోదయ్యాయని తెలిపింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.04%గా ఉన్నట్లు వివరించింది. అదేవిధంగా, దేశ రాజధాని ఢిల్లీలో మరో 1,022 కరోనా కేసులు సోమవారం వెలుగుచూశాయి. ఐఐటీ మద్రాస్‌లో సోమవారం మరో 18 పాజిటివ్ కేసులు నిర్ధారణ కావడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 78కి చేరింది. -
ఢిల్లీలో వెయ్యి కరోనా కేసులు
న్యూఢ్లిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: దేశంలో కరోనా కలకలం కొనసాగుతోంది. వరసగా మూడో రోజు 2 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 2,451 కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసులు 14,241కి చేరాయి. 54 మంది మరణించారు. ఢిల్లీలో ఒక్క రోజే 1,042 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. ఢిల్లీలో స్కూళ్లో ప్రత్యేక క్వారంటైన్ గదులు సిద్ధం చేశారు. విద్యార్థులు లంచ్ బాక్స్‌లను షేర్ చేసుకోద్దని సూచించారు. మరోవైపు తమిళనాడునూ కరోనా వణికిస్తోంది. ఐఐటీ మద్రాసులో 30 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. శుక్రవారం 700 మందికి పరీక్షలు నిర్వహించగా 30 మందికి పాజిటివ్ వచ్చినట్లు తమిళనాడు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రాధాకృష్ణన్ తెలిపారు. స్వల్ప లక్ష్యణాలు ఉన్న విద్యార్థులను కళాశాల ప్రాంగణంలోనే హోం క్వారంటైన్లో ఉంచినట్లు చెప్పారు. క్యాంపస్‌లోని 19 హాస్టళ్లలో కరోనా నిర్మూలన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఢిల్లీ, తమిళనాడుల్లో శుక్రవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను మళ్లీ తప్పనిసరి చేశారు. లేదంటే రూ.500 జరిమానా తప్పదని ప్రభుత్వాలు హెచ్చరించాయి. షాంఘైలో లాక్డౌన్ పొడిగింపు బీజింగ్: చైనాలోని షాంఘైలో కరోనా కలకలం కొనసాగుతోంది. దాంతో కోవిడ్ లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 26 దాకా పొడిగించారు. నాలుగు వారాలుగా లాక్డౌన్ అమలు చేస్తూ కఠినమైన ఆంక్షలు విధిస్తుండటంతో అక్కడ ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొనడం తెలిసిందే. చైనాలో గురువారం 2,119 కేసులు నమోదయ్యాయి. వాటిలో 1,931 షాంఘైలో వెలుగు చూశాయి. 11 మంది మరణించారు. దాంతో తాజా వేవ్ మృతుల సంఖ్య 36కి చేరింది. -
కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!
న్యూయార్క్: గత వారం ప్రపంచవ్యాప్తంగా 2.1 కోట్ల కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక వారపు కేసులు ఇవేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. అయితే మరణాల సంఖ్య స్థిరంగా 50వేలకు పైగా కొనసాగుతున్నాయని పేర్కొన్నది. కొత్త కరోనావైరస్ ఇన్ఫెక్షన్ల సంఖ్య 5 శాతం పెరిగిందని, కొన్ని ప్రాంతాల్లోనే పెరుగుదల కనిపిస్తోందని, మొత్తంగా చూస్తే పెరుగుదల రేటు మందగిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో 39శాతంతో అత్యధికంగా కేసులు పెరిగాయని, ఆగ్నేయాసియాలో 36 శాతం పెరిగిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, అమెరికాలలో మరణాలు పెరిగాయని, ఇతర ప్రాంతాలలో తగ్గాయని వివరించింది. ప్రజలంతా కరోనా నిబంధనలను పాటించి వైరస్ వ్యాప్తిని అడ్డుకోవాలని సూచించింది. దేశాలన్నీ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని కోరింది. -
సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేరియెంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని కోవిడ్‌పై అధ్యయనం చేసే కేంద్ర సంస్థ ఇన్సాకాగ్ హెచ్చరించింది. మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయని చెప్పింది. సార్స్–కోవిడ్ జన్యుక్రమాన్ని విశ్లేషించడంతో పాటు వైరస్ వ్యాప్తిపై అవగాహన, దాని కట్టడికి మార్గాలు, ప్రజారోగ్యంపై సూచనలు సలహాలు ఇన్సాకాగ్ ఇస్తూ ఉంటుంది. ఒమిక్రాన్ కేసుల్లో స్వల్ప లక్షణాలు, లేదంటే లక్షణాలు లేకుండా ఉన్న కేసులే ఎక్కువగా వస్తున్నాయని జనవరి 3, 10 తేదీలలో విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఆ బులెటిన్‌లో వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఆస్పత్రిలో చేరే కేసులు, ఐసీయూ కేసులు ఎక్కువగా లేకపోయినప్పటికీ ముప్పు మాత్రం పొంచి ఉందని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ‘‘భారత్‌లో ఒమిక్రాన్ ప్రస్తుతం సామాజికంగా వ్యాప్తి చెందే దశలో ఉంది. పలు మెట్రో నగరాల్లో ఈ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ.2 కేసులు కూడా వ్యాపిస్తున్నాయి’’ అని ఆ బులెటిన్‌లో వెల్లడించింది. అంతర్గతంగా వ్యాప్తి విదేశీ ప్రయాణికుల నుంచి కాకుండా అంతర్గతంగానే ఒమిక్రాన్ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఇన్సాకాగ్ తన బులెటిన్‌లో పేర్కొంది. వైరస్‌లో జన్యుపరమైన మార్పులు అధికంగా చోటు చేసుకుంటూ ఉండడంతో నిరంతరం అందులో జరిగే మార్పుల్ని పర్యవేక్షిస్తున్నామని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌లో ఎన్ని రకాల జన్యు మార్పులు జరిగినప్పటికీ కోవిడ్ నిబంధనల్ని తు.చ తప్పకుండా పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడమే మనకి రక్షణ కవచాలని వివరించింది. తగ్గిన ఆర్ వాల్యూ : మద్రాస్ ఐఐటీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మద్రాస్ ఐఐటీ చేసిన అధ్యయనంలో కాస్త ఊరటనిచ్చే అంశం వెల్లడైంది. . కోవిడ్–19 వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే తీవ్రతను వెల్లడించే ఆర్ వాల్యూ 1.57కి తగ్గింది. ఆర్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టుగానే భావించాలి. ఆర్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే వ్యాధి తగ్గుముఖం పడుతున్నట్టు లెక్క. జనవరి 14–21 మధ్య ఆర్ వాల్యూ 1.57 ఉన్నట్టుగా ఐఐటీ మద్రాస్ అధ్యయనం నివేదిక వెల్లడించింది. జనవరి 7–13 మధ్య ఆర్ వాల్యూ 2.2 ఉండగా జనవరి మొదటి వారంలో అత్యధిక స్థాయిలో ఆర్ వాల్యూ 4కి చేరుకుంది. ఇక డిసెంబర్ 25 నుంచి 31 మధ్య ఆర్ వాల్యూ 2.9గా ఉంది. ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంప్యూటేషనల్ మోడల్ ద్వారా కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేసింది. ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయ, ప్రొఫెసర్ ఎస్. సుందర్‌లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. దీని ప్రకారం ఆర్ వాల్యూ ముంబైలో 0.67, ఢిల్లీలో 0.98, చెన్నైలో 1.2, కోల్‌కతాలో 0.56గా ఉంది. ఇక వచ్చే 14 రోజుల్లో ఒమిక్రాన్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఆ అధ్యయనం అంచనా వేసింది. 3.33 లక్షల కేసులు నమోదు దేశంలో వరసగా నాలుగో రోజు 3 లక్షలకి పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,33,533 కేసులు నమోదయ్యాయి. ఇక క్రియాశీల కేసుల సంఖ్య 21, 87,205కి చేరుకుంది. తాజాగా ఒకే రోజు 525 మంది కరోనాతో మరణించారు. కరోనా రికవరీ రేటు 93.18గా ఉంది. కేరళలో కేసుల కట్టడికి ఆదివారం ఒక్క రోజు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. అత్యవసరాలకి తప్ప మరి దేనికి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్డౌన్ అమలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి. -
మరో 2.64 లక్షల కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంక్రమణ వేగం ప్రతిరోజూ మరింతగా పుంజుకుంటోంది. గత 24 గంటల్లో ఏకంగా 2,64,202 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,65,82,129కు చేరుకుంది. వీటిలో 5,753 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. గత 220 రోజుల్లో లేనంతగా యాక్టివ్ కేసులు 12,72,073కు పెరిగాయి. మరో 315 మంది కోవిడ్‌తో కన్నుమూశారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,85,350కు ఎగబాకింది. రికవరీ రేటు 95.20 శాతానికి తగ్గింది. రోజువారీ పాజిటివిటీ రేటు గణనీయంగా 14.78 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 155.39 కోట్ల కోవిడ్ టీకాలను కేంద్రం పంపిణీచేసింది. ఇప్పటిదాకా 3,48,24,706 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరోవైపు ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో 29.21 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 24వేలకుపైగా కేసులులొచ్చాయి. మహారాష్ట్రలో 43వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. -
రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వచేయండి
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల వేగం అనూహ్యంగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చేరికలు పెరిగే ప్రమాదం మరింతకానుంది. దీంతో ఆస్పత్రుల్లో కనీసం 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. ప్రైవేట్ వైద్య కేంద్రాల్లోనూ ఆక్సిజన్ సేవలు అందుబాటులో ఉన్నందున డిమాండ్ ఒక్కసారిగా పెరిగితే అందుకు అనుగుణంగా సరఫరా ఉండేలా కార్యాచరణను అమలుచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ఇన్–పేషెంట్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సేవలందించే కేంద్రాల వద్ద ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. ద్రవ ఆక్సిజన్ ట్యాంక్‌లను నింపాలని, రీఫిల్లింగ్ కోసం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద అదనపు ఆక్సిజన్ సిలిండర్లు, నిండుకుంటే వెంటనే తెప్పించే ఏర్పాట్లూ చేయాలని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ తాజా పరిస్థితిపై గురువారం సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోదీ సీఎంలతో వర్చువల్ సమీక్ష నిర్వహిస్తారు. కరోనా కేసుల ఉధృతి ఆగటం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ను జలుబుగా లెక్కకట్టొద్దు కరోనా కేసుల్లో వారపు పాజిటివిటీ మూడొందలకుపైగా జిల్లాల్లో ఐదు శాతాన్ని మించడంతో ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని, తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ చెప్పారు. -
అమెరికాలో ఒకే రోజు 13.5 లక్షల కేసులు
వాషింగ్టన్: అమెరికా ఒమిక్రాన్ బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడమే తప్ప తగ్గుదల కనిపించడం లేదు. ప్రపంచంలోని మరే దేశంలో లేని విధంగా సోమవారం ఒక్కరోజే ఏకంగా 13 లక్షల 50 వేల కేసులు నమోదయ్యాయి. శని, ఆదివారాల్లో రాష్ట్రాలేవీ కేసులు రికార్డు చేయని కారణంగా సోమవారం నాటికి తారాస్థాయికి కేసులు చేరుకుంటున్నాయి. గత 3 వారాల్లో ఆస్పత్రులో చేరే వారి సంఖ్య రెట్టింపు అయింది. వర్జీనియా, టెక్సాస్, కెంటకీ, కన్సాస్, చికాగోలలో వైద్యుల్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చైనాలో మరో నగరంలో లాక్డౌన్ కోవిడ్–19 విలయానికి చైనాలో మూడో నగరం మూతబడింది. 55 లక్షల జనాభా ఉన్న అన్యాంగ్ నగరంలో లాక్డౌన్ విధించి మూకుమ్మడి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జియాన్, యుఝో నగరాల్లో లాక్డౌన్ విధించారు. మూడు అతిపెద్ద నగరాల్లో లాక్డౌన్ విధించడంతో దాదాపుగా 2 కోట్ల మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. -
బడ్జెట్ సమావేశాలపై వెంకయ్య, ఓం బిర్లా సమాలోచనలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్న సమయంలో పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌ను సురక్షితంగా ఎలా చేపట్టాలనే అంశంపై సోమవారం రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమాలోచనలు జరిపారు. సుమారు 400 మంది పార్లమెంట్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులపై సమీక్ష జరిపి రానున్న బడ్జెట్ సెషన్‌ను సురక్షితంగా జరిపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వెంకయ్య, ఓం బిర్లా ఉభయసభల సెక్రటరీ జనరళ్లను ఆదేశించారు. ఈ మేరకు పార్లమెంట్ భవన సముదాయంలో వచ్చే రెండు, మూడు రోజుల్లో విస్తృతంగా డిస్ ఇన్ఫెక్షన్ డ్రైవ్ చేపట్టనున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు కాకున్నా, సాధారణంగా జనవరి చివరి వారంలో ఈ సెషన్ ప్రారంభమవుతుంది. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను అమలు చేస్తూ 2020 వర్షాకాల సెషన్లో ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ కార్యకలాపాలు జరిగిన విషయం తెలిసిందే. -
వర్క్ ఫ్రమ్ హోమ్.. ఇక అవసరమైతేనే ఆఫీస్‌కి!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరిగిపోతుండడం, కరోనా మూడో ఉధృతి ఖాయమన్న పరిస్థితుల నేపథ్యంలో దేశీయ కంపెనీలు.. అత్యవసర విధానాలను అమలు చేయడంపై దృష్టి మళ్లించాయి. కరోనా కేసులు గతేడాది జూలై నుంచి తగ్గుముఖం పట్టడంతో ఇంటి నుంచే పనిచేసే ఉద్యోగులను (వర్క్ ఫ్రమ్ హోమ్/డబ్ల్యూఎఫ్‌హెచ్) తిరిగి కార్యాలయాలకు క్రమంగా రప్పించుకునే ప్రణాళికలను అమలు చేస్తున్నాయి. కానీ, ఒక్కసారిగా కరోనా రూపంలో మళ్లీ కేసుల తీవ్రతను చూసిన కంపెనీలు ఉన్న చోట నుంచే సౌకర్యవంతంగా పనిచేసే విధానాలను ఆచరణలో పెడుతున్నాయి. అత్యవసర ప్రయాణాలనే అనుమతిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లోని కంపెనీలు గడిచిన కొన్ని నెలల కాలంలో కేసులు తక్కువగా ఉండడంతో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తున్నాయి. ఇప్పుడు కేసులు పెరగడం మొదలుకావడంతో తిరిగి పూర్తి స్థాయిలో ఇంటి నుంచి పనివిధానానికి మారిపోవడం లేదంటే కీలకమైన సిబ్బంది వరకే కార్యాలయాలకు వచ్చే విధానాన్ని అనుసరిస్తున్నాయి. అత్యవసరమైతేనే ఆఫీసుకు.. ఐటీసీ గత కొన్ని నెలలుగా గ్రూపు పరిధిలో హైబ్రిడ్ పని నమూనాను అమలు చేస్తోంది. ‘‘అత్యవసరమైన పనుల కోసమే కార్యాలయానికి రండి’’అంటూ తాజాగా ఢిల్లీ ఎన్సీఆర్, కోల్‌కతా, ముంబైలోని ఉద్యోగులకు సూచనలు జారీ చేసింది. ఇతర పట్టణాలు, కేంద్రాల్లో 30 శాతానికి ఉద్యోగుల హాజరును తగ్గించింది. అంటే ఏకకాలలో 30 శాతం మించి కార్యాలయంలో పని చేయకూడదు. మిగిలిన వారు తామున్న చోట నుంచే పనులను నిర్వహించాల్సి ఉంటుంది. పూర్తి సన్నద్ధత..: కార్యాలయంలో ఉద్యోగుల హాజరు 50 శాతానికి మించకూడదన్న ప్రభుత్వ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నట్టు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ అదానీ విల్మార్ సీఈవో అంగ్షు మాలిక్ తెలిపారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం తాము మెరుగ్గా సన్నద్ధమై ఉన్నట్టు చెప్పారు. ‘‘గత రెండేళ్లలో సరఫరా చైన్ సవాళ్లను చవిచూసింది. ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్నాం. దీంతో మా ఉత్పత్తులకు ఎటువంటి కొరత ఏర్పడకుండా మిగులు నిల్వలను సిద్ధం చేశాం’’ అని మాలిక్ వివరించారు. గోద్రెజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ వారమే తన బృందాలకు ఇంటి నుంచి పని చేయాలని సూచించింది. అంతకుముందు ఈ సంస్థ హైబ్రిడ్ పని నమూనాను (ఇంటి నుంచి, కార్యాలయం నుంచి) అమలు చేసింది. 50% సిబ్బంది ఒక రోజు కార్యాలయానికి వచ్చి, మరుసటి రోజు ఇంటి నుంచి పని చేసేవారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో సేల్స్ విభాగంలో సిబ్బందిని సైతం 100% ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించింది. ప్రాంతాల వారీగా విధానం.. చెన్నై కేంద్రంగా పనిచేసే శ్రీరామ్ గ్రూపు పరిధిలో 75 శాతం మంది ఉద్యోగులే కార్యాలయానికి వచ్చి పనిచేసే వారు. ఇక నుంచి 50 శాతం మంది ఇంటి నుంచి పనిచేసేందుకు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ‘‘రాష్ట్రాల వారీగా పని విధానాలను అమలు చేస్తున్నాం. మహారాష్ట్రలో కేసుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అక్కడ ఎక్కువ మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాం. హైదరాబాద్‌లో కేసులు తక్కువ ఉండడంతో అక్కడ తక్కువ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తారు’’ అని శ్రీరామ్ గ్రూపు అధికార ప్రతినిధి తెలిపారు. ఇక ముంబైకు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, మహీంద్రా గ్రూపు, టాటా గ్రూపు, ఆదిత్య బిర్లా గ్రూపు తదితర కంపెనీల పరిధిలో కార్యాలయానికి వచ్చి కొద్ది మందే పనిచేస్తున్నారు. ఉద్యోగులకు టీకా క్యాంపులు ‘‘సౌకర్యవంతమైన పని విధానం అమలవుతోంది. నచ్చిన చోట నుంచి ఉద్యోగులు పనిచేయొచ్చు. అదే విధానం కొనసాగుతుంది’’ అని మహీంద్రా గ్రూపు సీనియర్ ఉద్యోగి ఒకరు తెలిపారు. టాటా మోటార్స్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయవచ్చని సూచించింది. కార్యాలయంలో కొద్ది మంది ఉద్యోగులే ఉండేలా రొటేషన్ విధానంలో హైబ్రిడ్ పని విధానాన్ని అమలు చేస్తున్నట్టు టాటా మోటార్స్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మారుతి సుజుకీ తన ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి టీకాలు ఇప్పిస్తోంది. బూస్టర్ డోసులను కూడా ఇప్పిస్తున్నట్టు సంస్థ ఎగ్జిక్యూటివ్ రాజేష్ ఉప్పల్ తెలిపారు. స్టార్టప్‌లు ఉద్యోగుల రక్షణ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. ఓకేక్రెడిట్ అయితే ఉద్యోగులకు హెల్త్ కవరేజీని రూ.10 లక్షలకు పెంచింది. డెస్క్‌లో పనిచేసే ప్రతి ముగ్గురిలో ఇద్దరికి వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతించింది. సంబంధిత వార్త: డామిట్.. కంపెనీల కథ అడ్డం తిరిగింది -
దేశంలో 6 లక్షలకు క్రియాశీలక కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 1,59,632 కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీలక కేసులు భారీగా పెరిగి 6 లక్షల సమీపానికి చేరుకున్నాయి. కరోనా కేసుల రికవరీ రేటు 96.98 శాతానికి తగ్గడం కూడా యాక్టివ్ కేసుల్ని పెంచేసింది. ప్రస్తుతం 5,90,611 యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. శనివారం 4,72,169 ఉన్న యాక్టివ్ కేసులు ఒక్క రోజులోనే 1,18, 442లు పెరిగిపోవడం ఆందోళనకరంగా మారింది. రోజువారీ పాజిటివిటీ రేటు 10.21 శాతానికి చేరుకుంది. ఇక సాంకేతికంగా ఒమిక్రాన్ కేసులు 3,623 ఉన్నప్పటికీ మొత్తం కేసుల్లో అగ్రభాగం అవే ఉండవచ్చునని అంచనాలున్నాయి. ► పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముందున్న వేళ లోక్‌సభ, రాజ్యసభ సిబ్బంది 400 మందికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. జనవరి 4–8 మధ్య వరకు పార్లమెంటు సిబ్బందికి నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఏకంగా 400 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. ► కరోనా కేసులు పెరిగిపోతూ ఉండటంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గర్భిణులు, దివ్యాంగులు కార్యాలయానికి హాజరు నుంచి మినహాయింపునిచ్చినట్టుగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. వారు ఇంటి నుంచి పని చేసే సదుపాయాన్ని కల్పిస్తున్నట్టుగా వెల్లడించారు. ► ఢిల్లీలో రోజుకి 20వేలకు పైగా కేసులు వస్తున్నప్పటికీ లాక్డౌన్ విధించాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చెప్పారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరిస్తే లాక్డౌన్ అవసరం ఉండదన్నారు. ► మహారాష్ట్రలో అత్యధికంగా 41 వేలకు పైగా కేసులు నమోదైనప్పటికీ ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉండడంతో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల్ని సవరించింది. జిమ్స్, బ్యూటీ సెలూన్లను 50% సామర్థ్యంతో జనవరి 10 అర్ధరాత్రి నుంచి నడుపుకోవచ్చునని ఉత్తర్వులు జారీ చేసింది. ► పంజాబ్‌లో ఆక్సిజన్ అవసరం ఉన్న కరోనా రోగుల సంఖ్య పెరిగిపోవడం ఆందోళన పెంచుతోంది. శుక్రవారం నాడు 62 మందికి కృత్రిమ శ్వాస అందిస్తే, శనివారానికి వారి సంఖ్య 226కి చేరుకుందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ వెల్లడించింది. నలుగురు సుప్రీం జడ్జీలకు కరోనా అత్యున్నత న్యాయస్థానంలో కూడా కరోనా కలవరం రేపుతోంది. సుప్రీంకోర్టుకి చెందిన నలుగురు న్యాయమూర్తులు, 5% సిబ్బందికి కరోనా సోకినట్టుగా కోర్టు అధికారులు వెల్లడించారు. సుప్రీంలోని 32 మంది న్యాయమూర్తులకు గాను నలుగురికి, 3 వేల మంది సిబ్బందిలో 150 మందికి కరోనా సోకినట్టుగా తెలిపారు. -
కరోనా కేసులు లక్ష దాటేశాయ్
న్యూఢిల్లీ : దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. 214 రోజుల తర్వాత రికార్డు స్థాయిలో మళ్లీ లక్షకి పైగా కేసులు వెలుగుచూశాయి. ఒక్క రోజులోనే 1,17,100 కేసులు నమోదయ్యాయి. ఇక ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 3,007 వచ్చినట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఒకే రోజు లక్షకు పైగా కేసులు రావడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కి చేరుకుంది. ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు రావడం 120 రోజుల తర్వాత ఇదే తొలిసారి. గత 24 గంటల్లో 302 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రోజువారీ పాజిటివిటీ రేటు 7.74% ఉంటే, గతవారం రోజుల పాజిటివిటీ రేటు 4.54 శాతంగా ఉంది. కరోనా రికవరీ రేటు 97.57శాతంగా ఉంది. గత ఏడాది జూన్ 7న దేశంలో తొలిసారిగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఢిల్లీలో గత 24 గంటల్లో 17,335 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఏకంగా 17.73 శాతానికి పెరిగింది. ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు శుక్రవారం వచ్చిన మరో విమానంలో 173 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రోమ్ నుంచి వచ్చిన ఈ విమానంలో 285 మందికి పాజిటివ్ వస్తే, మరో 50 మంది కోవిడ్ పరీక్ష ఫలితం ఇంకా తెలియాల్సి ఉందని అమృత్సర్ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ వి.కె.సేథ్ చెప్పారు. కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూ ఉండడంతో అస్సాం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకోని వారు బహిరంగ ప్రదేశాలకు రాకూడదని ఆదేశించింది. హోటల్స్, మాల్స్, రెస్టారెంట్స్, సినిమా హాల్స్‌లోకి టీకా రెండు డోసులు తీసుకోని వారికి అనుమతిస్తే ఆయా యాజమాన్యాలకు రూ.25,000 జరిమానాగా విధిస్తామని హెచ్చరించింది. వ్యాక్సినేషన్ @150 కోట్లు భారత్ కోవిడ్ వ్యాక్సినేషన్లో మరో కీలక మైలురాయిని అధిగమించింది. శుక్రవారం నాటికి దేశంలో 150 కోట్ల డోసుల కోవిడ్ టీకా పంపిణీ పూర్తయిందని కేంద్రం తెలిపింది. ఆరోగ్య కార్యకర్తల అవిశ్రాంత కృషి వల్లే ఈ చారిత్రక విజయం సాధ్యమైందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమంతో ఎన్నో జీవితాలను కాపాడినట్లయిందన్నారు. దేశంలోని అర్హుల్లో 91% మంది కనీసం ఒక్క డోసు టీకా వేయించుకోగా, 66% మందికి రెండు డోసులు పూర్తయిందని అధికారులు తెలిపారు. జనవరి 3వ తేదీ నుంచి మొదలైన వ్యాక్సినేషన్లో అర్హులైన 22% మంది బాలబాలికలు టీకా వేయించుకున్నారని చెప్పారు. ప్రికాషన్(ముందు జాగ్రత్త) డోస్ కోసం కొత్తగా రిజిస్ట్రేషన్ అక్కర్లేదని, నేరుగా, ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకోవచ్చని ప్రభుత్వం శుక్రవారం స్పష్టంచేసింది. -
వారిలో 50% మందికి వర్క్ ఫ్రం హోమ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ముందుజాగ్రత్తగా ప్రభుత్వ కార్యాలయాల్లోని అండర్ సెక్రటరీ స్థాయికి దిగువన ఉండే సిబ్బందిలో 50% మందికి వర్క్ ఫ్రం హోమ్‌కు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వశాఖలు, విభాగాలకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని సోమ వారం తెలిపింది. వాస్తవ సిబ్బంది సంఖ్యలో 50% మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరుకావాలని, మిగతా సగం మందికి వర్క్‌ఫ్రం హోమ్‌ను అమలు చేయాలని వివరించింది. దివ్యాంగులు, గర్భిణులకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. అదేవిధంగా, కంటెయిన్మెంట్ జోన్లలో నివాసం ఉండే వారికి కూడా ఆయా జోన్లను డీ నోటిఫై చేసే వరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగులంతా ఒకే సమయం లో కార్యాయాలకు రాకుండా వేర్వేరు పనివేళలను అమలు చేయాలని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సిబ్బంది వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బంది అంతా హాజరు పట్టికలో సంతకాలు చేసి తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. -
అలా పైపైకి...
న్యూఢిల్లీ: భయపడినట్లే జరుగుతోంది. దేశంలో కరోనా కేసులు శరవేగంగా పెరిగిపోతున్నాయి. డిసెంబరు 28తో పోలిస్తే జనవరి 3 తేదీకల్లా (వారం రోజుల్లో) కేసుల్లో 500 శాతానికి పైగా పెరుగుదల నమోదు కావడంతో ఆందోళనను రేకెత్తిస్తోంది. ఫిబ్రవరి నెల మధ్యకు వచ్చేనాటికి ఒమిక్రాన్ కారణంగా భారత్‌లో థర్డ్‌వేవ్ పీక్కు చేరొచ్చనే అంచనాలు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. డిసెంబరు 28న 6,358 కేసులు నమోదుకాగా... సోమవారం (జనవరి 3న) ఏకంగా 33,750 కొత్త కేసులొచ్చాయి. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1,700లకు చేరింది. వీరిలో 639 మంది కోలుకోవడమో, ఇతర ప్రదేశాలకు వెళ్లిపోవడమో జరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం తెలిపింది. మహారాష్ట్ర (510), ఢిల్లీ (351)లు అత్యధిక ఒమిక్రాన్ కేసులున్న రాష్ట్రాలు. దేశవ్యాప్తంగా రోజువారీ పాజిటివిటీ రేటు 3.84 శాతంగా నమోదైంది. ► దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం ఒక్కరోజే 4,099 కేసులు వచ్చాయి. మే నెల తర్వాత ఇదే అత్యధికం. 6.46 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. జీనోమ్ స్వీక్సెనింగ్‌కు పంపిన శాంపిళ్లలో 81 శాతం ఒమిక్రాన్ కేసులొచ్చాయి. ► ముంబైలో కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కొత్తగా 7,298 కేసులొచ్చాయి. దాంతో ముంబైలో 1–9 తరగతులకు, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు బడులు/కాలేజీలను జనవరి 31 దాకా మూసివేయాలని నిర్ణయించారు. -
వేగంగా పెరుగుతున్న కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో ఒక్కరోజే 22,775 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కొత్త కేసులు అత్యధికంగా నమోదు కావడం అక్టోబర్ 6 తర్వాత ఇదే తొలిసారి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మూడురోజులపాటు వరుసగా 9 వేలు, 13 వేలు, 16వేల పైచిలుకు డైలీ కేసులు నమోదు కాగా శుక్రవారం దాదాపు 23 వేల కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 161 ఉన్నాయి. దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల 1,431కి చేరాయని, అదేవిధంగా దేశంలో యాక్టివ్ కేసులు లక్షను దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నూతన కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలో అది కూడా ముంబైలో నమోదయ్యాయి. దేశీయ డైలీ పాజిటివిటీ రేటు 2.05 శాతం వద్ద ఉండగా, వీక్లీ రేటు 1.10 శాతం వద్ద ఉంది. 24 గంటల్లో కరోనాతో కొత్తగా 406 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇంతవరకు 145కోట్ల టీకా డోసులిచ్చారు. మరోవైపు టీనేజర్ల టీకా రిజిస్ట్రేషన్ శనివారంనుంచి కోవిన్ పోర్టల్‌లో మొదలైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వీరికి జనవరి 3 నుంచి టీకాలిస్తారు. 10 మంది మంత్రులకు కరోనా మహారాష్ట్రలో 10మందికి పైగా మంత్రులకు కనీసం 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. అందువల్లే రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు తొందరగా ముగించామని వెల్లడించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా ముంబై, పుణెలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. కేసులు ఇలాగే పెరిగితే రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. కరోనా సోకిన రాజకీయ ప్రముఖుల్లో ఎంపీ సుప్రియా సూలే, మంత్రులు వర్షా గైక్వాడ్, యోశ్మతీ ఠాకూర్, కేసీ పద్వి, జితేందర్ అవ్హద్, ధనుంజయ్ ముండే, దిలీప్ వాల్సె తదితరులు ఉన్నారు. -
ఆర్–వాల్యూ 1.22.. కరోనా ఉధృతానికి ఇదే సంకేతం
న్యూఢిల్లీ : కేసులు పెరుగుతుండటం తో దేశంలో సగటు ఆర్– వాల్యూ 1.22గా ఉందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. కరోనా వైరస్ ఒకరి నుంచి సరాసరిన ఎందరికి వ్యాపిస్తుందో సూచించేదే ఆర్– వాల్యూ. ఆర్–వాల్యూ అనేది ఒకటి లేదా అంతకంటే తక్కువగా ఉంటే వైరస్ వ్యాప్తి అదుపులో ఉన్నట్లు లెక్క. ఒకటిని దాటి ఏమాత్రం పెరిగినా కరోనా ఉధృతం కాబోతుందనే దానికి సంకేతంగా పరిగణిస్తారు. ఇప్పుడు దేశసగటు 1.22గా నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ వ్యాప్తంగా 121 దేశాల్లో నమోదైన 3,30,379 ఒమిక్రాన్ కేసుల్లో 59 మరణాలు మాత్రమే సంభవించాయని భార్గవ తెలిపారు. ఢిల్లీ, ముంబైల్లో డేంజర్ బెల్స్ కేసులు పెరుగుతున్న ఢిల్లీ, ముంబై మహానగరాల్లో ఆర్–వాల్యూ 2పైగానే నమోదైనట్లు పరిశోధకులు గురువారం తెలిపారు. చెన్నై, పుణే, బెంగళూరు, కోల్‌కతాల్లో కూడా ఆర్ వాల్యూ ఒకటికి పైగానే ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని చెన్నైకి చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమెటికల్ సైన్సెస్ పరిశోధకులు అన్నారు. డిసెంబర్ 23–29 తేదీల మధ్య ఢిల్లీలో ఆర్–వాల్యూ 2.54 వద్ద ఉండగా, ముంబైలో ఈనెల 23–28 తేదీల మధ్య ఆర్–వాల్యూ 2.01గా ఉందన్నారు. -
10 రాష్ట్రాలకు కేంద్ర బృందాలు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అధిక కేసులు నమోదవుతున్న 10 రాష్ట్రాలకు కేంద్రం సహాయ బృందాలను పంపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బిహార్, యూపీ, జార్ఖండ్, పంజాబ్‌ల్లో కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడంతో నిపుణుల బృందాలను పంపామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3–5 రోజులుండి రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తాయని తెలిపింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్, తగినన్ని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడంపై ఈ బృందాలు ప్రత్యేక శ్రద్ధ పెడతాయి. కోవిడ్ నిబంధనల అమలు, ఆస్పత్రుల్లో పడకల వివరాలు, అంబులెన్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లభ్యత, టీకా కార్యక్రమంపై సమీక్ష చేస్తాయి. ఆవివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాయి. ఒమిక్రాన్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ప్రకటించింది. బీఎంసీ పరిధిలోని ఎక్కడా ఉత్సవాలు జరపకూడదని కమిషనర్ ఇక్బాల్ సింగ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే ముంబైలో రాత్రి పూట ఐదుగురికి మించి గుమికూడడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. భారత్‌లో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య శనివారానికి 415కు చేరింది. వీరిలో 115మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర(108)లో నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో ఢిల్లీ(79), గుజరాత్(43), తెలంగాణ(38), కేరళ(37), తమిళనాడు(34), కర్ణాటక(31) ఉన్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 7,189 కరోనా కేసులు, 387 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 58వ రోజు కూడా కొత్త కేసులు 15వేలకు లోపు నమోదు కావడం విశేషం. అదేవిధంగా మొత్తం యాక్టివ్ కేసులు 77,032కు చేరాయి. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఇది 0.22 శాతానికి సమానం. -
Coronavirus: ముప్పు తొలగినట్లేనా ?
న్యూఢిల్లీ: రోజుకో కొత్త రకం వేరియంట్‌తో భారత్‌ను ముప్పతిప్పలు పెట్టిన కరోనా నుంచి భారత్‌కు ఉపశమనం లభించినట్లేనా? సెకండ్ వేవ్‌తో జనజీవనాన్ని ఛిద్రం చేసిన కోవిడ్ మహమ్మారి దేశంలో ఇక తగ్గుముఖం పట్టినట్లేనా? అంటే వైద్య నిపుణులు అవుననే అంటున్నారు. పట్ట పగ్గాల్లేని కరోనా దూకుడుకు ఫుల్స్టాప్ పడినట్లేనన్న ఆరోగ్యరంగ నిపుణుల అంచనాలతో దేశ ఆర్థిక రంగం మళ్లీ పట్టాలెక్కనుందనే శుభసూచనలు కనిపిస్తున్నాయి. దీపావళి పర్వదినం తర్వాత గడచిన మూడు వారాలుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్యే ఇందుకు మేలిమి ఉదాహరణ. దసరా, దీపావళి, కాళీపూజ తదితర పండుగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్ కాలంలో వైరస్ విజృంభణతో దేశంలో పరిస్థితి అదుపుతప్పవచ్చని అంతటా భయాందోళనలు పెరిగాయి. అయితే, ఆ గండం నుంచి గట్టేకేశాం. పండుగల సీజన్ ముగిశాక కూడా కొత్త కేసులు అత్యల్ప స్థాయిల్లోనూ నమోద వుతున్నాయి. సెకండ్ వేవ్ కాలంలోనే దేశ జనాభా లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అయితే 98.32 శాతం రికవరీ రేటుతో దాదాపు అందరూ కోలుకున్నారు. కోవిడ్‌ను జయించిన వీరందరి లోనూ కరోనా యాంటీబాడీలు పెరిగాయి. మరోవైపు భారత్‌లో కోవిడ్ టీకా కార్యక్రమం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 117.63 కోట్ల డోస్‌లను ప్రభుత్వం అందజేసింది. దీంతో కోవిడ్ టీకా తీసుకున్న కోట్లాది మందిలో కరోనా యాంటీబాడీలు పెరిగాయి. ఒక వైపు కోవిడ్‌ను జయించి, మరోవైపు వ్యాక్సినేషన్ ద్వారా రెండు రకాలుగానూ వయోజనుల్లో కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి. కరోనా నుంచి కోలుకున్న వారిలో టీకా తీసుకోకమునుపే ‘హైబ్రిడ్ ’ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా రాని వారు టీకా తీసుకుంటే పెంపొందే యాంటీబాడీల కంటే హైబ్రిడ్ ఇమ్యూనిటీ మరెంతో మెరుగ్గా వైరస్‌ను ఎదుర్కోగలదు. ఇలా ‘హైబ్రిడ్’ ఇమ్యూనిటీని సంతరించుకున్న భారత్‌లో కరోనా మూడోవేవ్ పొద్దు పొడవక పోవచ్చని వైద్య నిపుణులు ధీమాగా చెబుతున్నారు. అయితే, కొత్త వేరియంట్ ముప్పు, శీతాకాలంలో దట్టంగా కమ్మేసే చలి వాతావరణం వంటి సవాళ్లు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటాయని, సరైన జాగ్రత్తలతో ఆ ప్రమాదాన్ని ముందే నివారించవచ్చని ఆరోగ్యరంగ నిష్ణాతులు హెచ్చరిస్తున్నారు. వారికి గతంలోనే కరోనా సోకింది ‘దేశంలో డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి పెరిగాక కూడా తక్కువ కేసులు నమోదయ్యాయంటే ..అప్పటికే జనాభాలో ఎక్కువ మందికి కరోనా సోకి, తగ్గిపోయిందని అర్ధం. దేశవ్యాప్తంగా పలు సీరో సర్వేల్లో తేలింది ఇదే’ అని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్ఐఆర్)– ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయోలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ స్పష్టంచేశారు. ప్రస్తుతం భారత ‘పరిస్థితి’ బాగానే ఉందని, భవిష్యత్‌లో వెలుగుచూసే తేలిగ్గా లొంగని వైరస్ వేరియంట్లతో పరిస్థితిలో ‘మార్పు’లు రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్ నుంచి కోలుకోవడం, వ్యాక్సినేషన్ వల్లే దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గుతోందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మరో పరిశోధకురాలు వినీతా బాల్ అన్నారు. డిసెంబర్–ఫిబ్రవరిలో అప్రమత్తత అవసరం చుట్టేస్తున్న చలి, కొత్త వేరియంట్లు ఉద్భవిస్తే డిసెంబర్–ఫిబ్రవరి కాలంలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, అయితే సెకండ్ వేవ్ నాటి దుర్భర పరిస్థితులు ఉండబోవని సోనిపట్‌లోని అశోకా విశ్వవిద్యాలయ బయోలజీ విభాగం ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ విశ్లేషించారు. ‘ వ్యాక్సినేషన్ భారీ ఎత్తున కొనసాగుతున్న ఈ తరుణంలో వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉండబోదు. ఆస్పత్రిలో చేరడం, మరణం సంభవించే స్థాయి ప్రమాదకర పరిస్థితులు ఉండవు. కోవిడ్ నుంచి కోలుకున్నాక టీకా తీసుకున్న వారికి రెండోదఫా కోవిడ్ నుంచి గణనీయమైన రక్షణ లభిస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జులైలో ఐసీఎంఆర్ నాలుగో జాతీయ సీరో సర్వే ప్రకారం దేశజనాభాలో 67.6 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయి. వయోజనుల్లో 82 శాతం మంది తొలి డోస్ తీసుకున్నారు. 43 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది మూడో వేవ్ వచ్చి, వెళ్లింది! చెన్నైలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ సితభ్ర సిన్హా వాదన మరోలా ఉంది. ‘ యూరప్‌లోని థర్డ్ వేవ్‌కు భారత్‌లోని రెండో వేవ్‌కు చాలా సారూప్యత ఉంది. నా ఉద్దేశం ప్రకారం భారత్‌లో మూడో వేవ్ సెప్టెంబర్ మధ్యలోనే వచ్చి, అంతర్థానమైంది’ అని ఆయన అంచనావేశారు. కాగా, ముంబై, పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఆర్–వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటోందని ఆయన హెచ్చరించారు. 543 రోజుల కనిష్టానికి కేసులు దేశంలో గత 24 గంటల్లో అత్యల్పంగా 7,579 కరోనా కొత్త కేసులు నమోద య్యాయి. గత 543 రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,45,26,480కు పెరిగింది. మరో 236 మంది కోవిడ్‌తో కన్నుమూశారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,66,147కు పెరిగింది. ఇప్పటిదాకా 3,39,46,749 మంది కోవిడ్ కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584కు తగ్గింది. ఇంత తక్కువ యా క్టివ్ కేసులుం డటం గత 536 రోజుల్లో ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు 0.79శాతానికి చేరుకుంది. మరణాల రేటు 1.35 శాతంగా నమోదైంది. -
టీకా వేయించుకోని వారికి ఆస్ట్రియాలో లాక్డౌన్
బెర్లిన్: కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతుండటంతో ఆస్ట్రియా ప్రభుత్వం అప్రమత్తమైంది. కోవిడ్ టీకా వేయించుకోని వారు ఇల్లు వదిలి బయటకు రావద్దంటూ ఆదివారం ఆదేశించింది. దేశవ్యాప్తంగా ఈ ఆంక్షలు పది రోజుల పాటు అమలవుతాయని తెలిపింది. దేశ జనాభాలో కేవలం 65% మంది మాత్రమే కోవిడ్ టీకా రెండు డోసులు వేయించుకున్నారు. దీంతో, 12 ఏళ్లు పైబడి టీకా వేయించుకోని వారు మరీ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆంక్షలు విధించింది. కేసులు పెరిగితే ఆస్పత్రుల్లో సరిపోను వైద్య సౌకర్యాలు లేవని పౌరులను హెచ్చరించింది. -
మరో 14,348 కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా 14,348 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,46,157కు చేరుకుంది. ప్రస్తుతం 1,61,334 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం ప్రకటించింది. కరోనా వల్ల మరో 805 మంది మృతిచెందారు. దీంతో కరోనా సంబంధిత మరణాల సంఖ్య 4,57,191కు ఎగబాకింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు ప్రస్తుతం 0.47 శాతం ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.19 శాతానికి చేరింది. దేశవ్యాప్తంగా 3,36,27,632 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. మరణాల రేటు 1.34 శాతంగా ఉంది. -
రష్యాలో కరోనా మరణమృదంగం
మాస్కో: రష్యాలో కోవిడ్ 24 గంటల వ్యవధిలో వెయ్యి మందిని బలి తీసుకుంది. ఒకే రోజు 33,208 కొత్త కేసులు నమోదు కాగా, 1,002 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,58,384కి చేరుకోగా, ఇప్పటివరకు 2,22,315 మంది ప్రాణాలు కోల్పోయారు. యూరప్ దేశాల్లో అత్యధిక కరోనా మరణాలు రష్యాలోనే సంభవించాయి. అమెరికా, బ్రెజిల్, భారత్, మెక్సికో తర్వాత కరోనా కేసులు అధికంగా రష్యాలోనే వెలుగులోకి వస్తున్నా యి. అయితే, ప్రభుత్వం మాత్రం కరోనా ఆంక్షలు విధించాలో, వద్దో స్థానిక యంత్రాంగం నిర్ణయించాలని అంటోంది. ఇప్పటి వరకు కేవలం 29% మంది జనాభాకి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. -
ఈ మూడు నెలలు జాగ్రత్తగా ఉండండి
న్యూఢిల్లీ: పండుగలు, పెళ్లిళ్ల సీజన్లో కోవిడ్ కేసులు మళ్లీ పెరిగే ప్రమాదముందని ఈ మూడు నెలలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ప్రజలను కోరింది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో సాధ్యమైనంత వరకు జనం గుమికూడే చోటుకు వెళ్లొద్దని సూచించింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఆన్లైన్ పద్ధతుల్లోనే షాపింగ్ చేసుకోవాలని కోరింది. మహమ్మారి సెకండ్‌వేవ్ ఇంకా ముగియలేదని పునరుద్ఘాటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.. ప్రస్తుతానికి పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ ఇప్పటికీ దేశంలో రోజువారీ కేసులు 20 వేల వరకు నమోదవుతున్నాయని గుర్తు చేసింది. ‘‘ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని, ఏమరుపాటు తగదు. మహమ్మారి ఇంకా మనమధ్యే ఉంది. అప్రమత్తంగా లేకుంటే అనుకోకుండా పరిస్థితి విషమించవచ్చు’ అని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ గురువారం మీడియాతో అన్నారు. దేశంలోని 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 34 రాష్ట్రాల్లో వారం పాజిటివిటీ రేట్ 10%కి మించి ఉందన్నారు. దేశంలోని అర్హులైన 71% మంది కనీసం ఒక్క డోసైనా కోవిడ్ టీకా వేయించుకోగా, వీరిలో 27% మందికి రెండు డోసులు పూర్తయిందని వివరించారు. ప్రస్తుతం దేశంలో వ్యాక్సిన్ కొరత లేనే లేదని స్పష్టం చేశారు. ఒక వేళ రోజువారీ కరోనా కేసులు 4.5–5 లక్షల వరకు పెరిగితే పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో 8.36 లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరో 1.35 లక్షల ఐసీయూ బెడ్లు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. -
రెండోవేవ్ ఇంకా ముగియలేదు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ రెండో వేవ్ కేసులు తగ్గుముఖం పట్టలేదనీ, ఆ తీవ్రత ఇప్పటికీ కొనసాగుతోందని కేంద్రం తెలిపింది. మొత్తమ్మీద కేసుల తీవ్రతలో తగ్గుదల 50% కంటే కొద్దిగా తక్కువగా ఉందని వివరించింది. దేశంలోని 35 జిల్లాల్లో వారం పాజిటివిటీ రేట్ 10%పైనే ఉండగా, మరో 30 జిల్లాల్లో 5–10% మధ్యన నమోదవుతోందని వెల్లడించింది. గత వారం దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో 68.59% ఒక్క కేరళ నుంచే ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ గురువారం మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘వినాయక చవితితో ప్రారంభం కానున్న ఈ పండుగల సీజన్లో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు తక్కువ సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొనాలి. అదేవిధంగా, మరీ అవసరమైతే తప్ప ప్రయాణాలు చేయరాదు’అని తెలిపారు. ‘దేశంలోని 58 శాతం మందికి కనీసం ఒక్క డోసు టీకా అందగా, 18% మందికి రెండో డోసు కూడా పూర్తయింది. 24 గంటల్లో వేసిన 86.51 లక్షల డోసులను కలుపుకుని, ఇప్పటి వరకు దేశంలో 72 కోట్ల డోసుల టీకా వేశారు’అని తెలిపింది. ఇప్పటి వరకు సిక్కిం, దాద్రానగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌ల్లో 18 ఏళ్లు నిండిన వారందరికీ కనీసం ఒక్క డోస్ కోవిడ్ టీకా వేసినట్లు తెలిపారు. కాగా, స్కూళ్లను తిరిగి తెరిచేందుకు విద్యార్థులందరికీ వ్యాక్సిన్ కచ్చితంగా ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదని వారు వివరించారు. అయితే, ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది, తల్లిదండ్రులు టీకా వేయించుకోవడం మంచిదని తెలిపారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇందుకు సంబంధించి ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. కోవిడ్ బాధిత చిన్నారుల్లో మరణాల రేటు తక్కువగా ఉండటం, వ్యాధి బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేని వారే ఎక్కువగా ఉండటం వంటి కారణాల రీత్యా కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధమైన వైఖరితో ఉంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను చిన్నారులకు కూడా వినియోగించేందుకు అవసరమైన శాస్త్రతీయ పరమైన ధ్రువీకరణ దిశగా ప్రభుత్వం చురుగ్గా పనిచేస్తోంది’ అని వారన్నారు. 99% ఆరోగ్య కార్యకర్తలకు మొదటి డోసు, 84% మందికి రెండో డోసు కూడా పూర్తయిందన్నారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లందరికీ మొదటి డోసు, 80 శాతం మందికి రెండో డోసు కూడా పూర్తయిందని తెలిపారు. రోజువారీ కేసుల్లో 14% పెరుగుదల న్యూఢిల్లీ: దేశంలోని కరోనా కేసుల్లో గురువారం ఒక్క రోజే 14% పెరుగుదల నమోదైంది. 24 గంటల్లో 43,263 కొత్త కేసులు నిర్థారణ కావడంతో మొత్తం కేసులు 3,31,39,981కు చేరుకున్నట్లు కేంద్రం తెలిపింది. కోవిడ్ బారిన పడిన మరో 338 మంది మృతి చెందడంతో మొత్తం మరణాలు 4,41,749కు పెరిగాయని పేర్కొంది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,93,614కు పెరగ్గా మొత్తం కేసుల్లో ఇవి 1.19%గా ఉన్నాయని తెలిపింది. -
రెండు నెలల గరిష్ట స్థాయికి కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి మళ్లీ నెమ్మదిగా పెరుగుతోంది. గత రెండు నెలల్లో ఎప్పుడూ నమోదుకానంతటి స్థాయిలో గురువారం ఒక్క రోజే 47,092 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,28,57,937కు పెరిగింది. కేరళ రాష్ట్రంలో గురువారం 32,097 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే 188 మంది మరణించారు.మరో 509 మంది కోవిడ్‌తో మరణించారు. దీంతో దేశంలో కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,39,529కు పెరిగింది. రికవరీ రేటు 97.48 శాతంగా నమోదైంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.8 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే 81.09 లక్షల టీకాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటిదాకా 66.30 కోట్ల టీకాలు ఇవ్వడం పూర్తయింది. అర్హుల్లో సగం మందికిపైగా టీకా కరోనా టీకా తీసుకోవడానికి అర్హులైన వారిలో 54 శాతం మందికి కనీసం ఒక డోస్ టీకా ఇచ్చామని కేంద్రం వెల్లడించింది. అర్హులైన జనాభాలో 16 శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చినట్లు పేర్కొంది. సిక్కిం, దాద్రా, నగర్ హవేలీ, హిమాచల్‌లో యుక్తవయసు వారందరికీ కనీసం ఒక డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ చెప్పారు. ఆగస్ట్ నెల చివరి ఏడు రోజుల్లో సగటున రోజుకు 80.27 లక్షల టీకాలు ఇచ్చామన్నారు. దేశంలోని మొత్తం హెల్త్‌కేర్ వర్కర్లలో 99 శాతం మందికి ఒక టీకా, 84 శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చారు. -
దేశంలో 45,083 కొత్త కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో ఆదివారం 45,083 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,26,95,030కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,558కు పెరిగింది. యాక్టివ్ కేసులు పెరగడం ఇది వరుసగా అయిదో రోజు. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.13 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 460 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,37,830కు చేరుకుంది. శనివారం 17,55,327 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. టెస్టు పాజిటివిటీ రేటు 2.28గా నమోదైంది. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద 63.09 కోట్ల డోసుల టీకాలు వేశారు. ఇటీవల వరుసగా నాలుగు రోజుల పాటు కేరళలో 30 వేలకు పైగా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో 29,836 కరోనా కేసులు బయటపడ్డాయి. -
Corona Virus: బెంబేలెత్తిస్తున్న కేరళ
తిరువనంతపురం/న్యూఢిల్లీ: కేరళలో వరుసగా మూడో రోజూ 30 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం 31,445 కేసులు, గురువారం 30,007 కేసులు, శుక్రవారం 32,801 కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 1,70,703 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. టెస్టు పాజిటివిటీ రేటు ఏకంగా 19.22 శాతం నమోదైంది. శుక్రవారం దేశంలో మొత్తం 44,658 కరోనా కొత్త కేసులు నమోదు కాగా, వాటిలో 32 వేలకు పైగా కేసులు కేరళలోనే నమోదు కావడం గమనార్హం.మొత్తం కేసుల్లో 73.45శాతం కేసులు కేరళలోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. చదవండి: కోవిడ్–19తో కళ్లకు ముప్పు ఉంటుందా? ఇటీవల బక్రీద్, ఓనం వంటి పలు పండుగలు జరిగిన నేపథ్యంలో ప్రజలు గుంపులుగా చేరడం వల్ల కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కేరళలో నమోదవుతున్న కేసులు దేశంలో థర్డ్ వేవ్‌కు కారణమవుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్‌లో శుక్రవారం 44,658 కరోనా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 3,26,03,188కు చేరుకుంది. మరోవైపు యాక్టివ్ కేసుల సంఖ్య 3,44,899కు పెరిగింది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.03 శాతం ఉన్నాయి. గత 24 గంటల్లో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,36,861కు చేరుకుంది. చదవండి: Corona Virus: ‘లాంగ్ హాలర్స్’ అంటే ఎవరో తెలుసా.. -
కరోనా కొత్త కేసులు 46,164
న్యూఢిల్లీ: దేశంలో 24 గంటల్లో మరో 46,164 కరోనా కేసులు కొత్తగా నమోదైనట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. దీంతో, మొత్తం కేసులు 3,25,58,530కు చేరుకున్నాయని వెల్లడించింది. అదే సమయంలో, 607 మంది కరోనా బాధితులు మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 4,36,365కు పెరిగిందని తెలిపింది. యాక్టివ్ కేసులు కూడా 3,33,725కు పెరిగాయని, మొత్తం కేసుల్లో ఇవి 1.03%గా ఉన్నాయని పేర్కొంది. జాతీయ స్థాయిలో రికవరీ రేటు 97.63%గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 51,31,29,378 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపట్టినట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.58% కాగా, ఇది గడిచిన 31 రోజులుగా మారలేదని వెల్లడించింది. అదేవిధంగా, వీక్లీ పాజిటివిటీ రేటు గత 62 రోజులుగా ఎలాంటి మార్పులేకుండా 2.02%గానే ఉంటోందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 60.38 కోట్ల కోవిడ్ టీకా డోసులు పంపిణీ చేసినట్లు పేర్కొంది. కేరళలో ప్రమాదఘంటికలు కేరళలో కరోనా తీవ్రత ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో బుధవారం 31,445 కేసులు, గురువారం 30,007 కేసులు నిర్ధారణయ్యాయి. దేశంలో తాజాగా నమోదైన కేసుల్లో 66% ఒక్క కేరళ నుంచే ఉన్నాయి. దేశవ్యాప్తంగా గతవారం నమోదైన మొత్తం కేసుల్లో కేరళలోనివే 58.4% ఉన్నాయి. దీంతో, గురువారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆ రాష్ట్ర అధికారులతో మీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేపట్టారు. వైరస్ వ్యాప్తి, కరోనా కట్టడికి అమలు చేయాల్సిన వ్యూహం, మౌలిక వసతులపై చర్చించి, అవసరమైన సూచనలు చేసినట్లు హోం శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ నెల 16వ తేదీన కేరళను సందర్శించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాష్ట్రంలో ఆరోగ్య వసతుల మెరుగుకు రూ.267 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో 20 కోట్ల కోవిషీల్డ్ టీకా డోసుల సరఫరా వచ్చే సెప్టెంబర్‌లో 20 కోట్ల డోసుల కోవిషీల్డ్ టీకాలను సరఫరా చేయనున్నట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) గురువారం కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది. కేంద్ర ప్రభుత్వంతోపాటు దేశంలోని ప్రైవేట్ ఆస్పత్రులకు ఎస్ఐఐ ఆగస్టులో 12 కోట్ల డోసుల కోవిడ్ టీకా అందజేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పెరిగిన ఉత్పత్తి సామర్థ్యంతో సెప్టెంబర్ నెలలో సంస్థ 20 కోట్ల డోసుల టీకాలను సరఫరా చేయగలదని సంస్థ రెగ్యులేటరీ వ్యవహారాల డైరెక్టర్ ప్రకాశ్ కుమార్ సింగ్ తెలిపారు. -
ఆ వేరియంట్ వల్లే భారీగా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో రెండు నెలలుగా భారీగా కోవిడ్ కేసులు పెరగడానికి బి.1.617 వేరియంటే ప్రధాన కారణమని ఇండియన్ సార్స్–కోవ్–2 కన్సార్టియం ఆన్ జెనోమిక్స్(ఇన్సాకాగ్) స్పష్టం చేసింది. ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా భారీగా కేసులు పెరిగిన విషయం తెలిసిందే. మొట్టమొదటిసారిగా యూకేలో బయటపడిన వైరస్ వేరియం ట్ బి.1.1.7 లేదా ఆల్ఫా కేసులు ఇప్పుడు దేశంలో ఒకటిన్నర నెలలుగా తగ్గుముఖం పట్టాయని దేశం లోని 10 జాతీయ స్థాయి ప్రయోగశాలల ఉమ్మడి వేదిక ఇన్సాకాగ్ తెలిపింది. కోవిడ్ వేరియంట్ బి.1.617 కేసులు మొదటిసారిగా మహారాష్ట్రలో బయటపడగా ఇప్పుడు పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణల్లోనూ పెరిగినట్లు తెలిపింది. గడిచిన 2 నెలలుగా కొన్ని రాష్ట్రా ల్లో భారీగా కేసులు పెరగటానికి బి.1.617 వేరియంట్‌కు సంబంధం ఉందని ఇన్సాకాగ్ పే ర్కొంది. ఈ వేరియంట్ ఇప్పుడు బి.1.617.1, బి.1.617.2, బి1.671.3 అనే వేరియంట్లుగా మారినట్లు తెలిపింది. ఇందులోని బి.1.617.2 వేరియంట్ వ్యాప్తి ఎక్కువగా ఉందని గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల దీనికి డెల్టా వేరియంట్‌గా నామకరణం చేసినట్లు గుర్తు చేసింది. వారణాసి ప్రాంతంలో 7 వేరియంట్లు సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి ప్రాంతంలో కనీసం 7 కరోనా వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నట్లు బెనారస్ హిందూ యూనివర్సిటీ, (బీహెచ్‌యూ) సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) సంయుక్త అధ్యయనంలో తేలింది. వారణాసి పరిసర ప్రాంతాల్లోని పలు వేరియంట్ల జన్యుక్రమాలను విశ్లేషించి పరిశీలించినప్పుడు ఈ ఏడు రకాలు ఆ ప్రాంతంలో ఎక్కువ వ్యాప్తిలో ఉన్నట్లు తెలిసిందని సీసీఎంబీ తెలిపింది. దేశంలో రెండో దఫా కోవిడ్ కేసులు పెరిగేందుకు కూడా ఈ వేరియంటే కారణమని బీహెచ్‌యూ శాస్త్రవేత్త ప్రొఫెసర్ సింగ్ తెలిపారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో మాదిరిగానే బి.1.617.2 లేదా డెల్టా వేరియంట్ కూడా ఈ ప్రాంతంలో చాలా సాధారణంగా కనిపించిందని ఆయన వివరించారు. సేకరించిన నమూనాల్లో 36 శాతం ఈ వేరియంట్‌వేనని తెలిపారు. వీటితోపాటు దక్షిణాఫ్రికాలో గుర్తించిన బి.1.351 వేరియంట్‌ను తొలిసారి వారణాసి ప్రాంతంలో గుర్తించామని సీసీఎంబీ గౌరవ సలహాదారు డాక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. చదవండి: ఏడాదిలోపే కోవిడ్ ఆయుధాలు సిద్ధం -
హమ్మయ్య.. దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా ప్రభావం నెమ్మదిగా తగ్గుతోంది. గత నెల 4.14 లక్షల వరకు చేరుకున్న పాజిటివ్ కేసులు ఇప్పుడు 1.32 లక్షలకు చేరుకున్నాయి. అదే సమయంలో గత 5 రోజుల్లో దేశంలో 6,79,550 పాజిటివ్ కేసులు నమోదు కాగా, కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 11,43,335గా నమోదైంది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో 24 గంటల్లో 1,32,364 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 2,85,74,350కు చేరింది. మే 7వ తేదీన నమోదైన అత్యధిక కేసులతో పోల్చుకుంటే ప్రస్తుతం పాజిటివ్ కేసులు 68% వరకు తగ్గుముఖం పట్టాయి. ఒక్కరోజులో 2,07,071 మంది వైరస్ బారి నుంచి కోలుకోవడంతో రికవరీ రేటు 93.08%కి చేరుకుంది. అదే విధంగా, 2,713 మంది కోవిడ్ బాధితులు మరణించడంతో కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 3,40,702కి పెరిగింది. గత 24 గంటల్లో యాక్టివ్ కేసులు 77,420 తగ్గడంతో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య 16,35,993కి చేరుకుంది. గత ఐదు రోజుల్లో సుమారు 4 లక్షల క్షీణత నమోదైంది. మే 30న మొత్తం 20.26 లక్షల యాక్టివ్ కేసులు నమోదుకాగా ఇవి ఇప్పుడు 16.35 లక్షలకు చేరుకున్నాయి. ఇందులో రాష్ట్రాల వారిగా చూస్తే కర్ణాటకలో అత్యధికంగా 2,86,819, తమిళనాడులో 2,80,426 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పరీక్షల్లోనూ పురోగతి కనిపిస్తోంది. గత 24 గంటల్లో 20,75,428 కరోనా టెస్ట్‌లు జరుగగా పాజిటివిటీ రేటు 6.38%గా నమోదైంది. దేశంలోని 377 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5%కంటే తక్కువగా ఉందని కేంద్రం వెల్లడించింది. వ్యాక్సినేషన్ ప్ర క్రియ సైతం వేగం పుంజుకుంది. గత 24 గంటల్లో దేశంలో 28,75,286 డోస్‌ల వ్యాక్సిన్ వేయడంతో మొత్తం సంఖ్య 22.41కోట్లకు చేరుకుంది. వ్యాక్సినేషన్లో అమెరికాను మించి.. దేశంలో కనీసం ఒక్క డోసు కోవిడ్ టీకా తీసుకున్న వారి సంఖ్య అమెరికా కంటే ఎక్కువగా ఉందని కేంద్రం తెలిపింది. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో మరింత వేగవంతం చేస్తామని తెలిపింది. దేశంలో కనీసం ఒక్క డోసైనా కోవిడ్ టీకా తీసుకున్న వారు 17.2 కోట్లు కాగా, అమెరికా ఇది 16.9కోట్లుగా ఉందని పేర్కొంది. దేశంలోని 60 ఏళ్లు పైబడిన వారిలో 43%మంది, 45 ఏళ్లు పైబడిన వారిలో 37% మంది టీకా వేయించుకున్నట్లు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ వెల్లడించారు. రానున్న కొద్ది వారాల్లోనే 50% దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతి 10 లక్షల జనాభాలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య ప్రపంచ సరాసరి 22,181 కాగా, భారత్‌లో అది 20,519గా ఉందని వివరించారు. అదే సమయంలో, ప్రతి 10 లక్షల మంది బాధితుల్లో కోవిడ్ మృతులు భారత్‌లో 245మాత్రమే కాగా, ప్రపంచ సరాసరి 477 అని ఆయన పేర్కొన్నారు. -
మృత్యు ప్రకోపం: ఒక్కరోజే 530 మంది మృతి
సాక్షి, బెంగళూరు: కిల్లర్ కరోనా కేసులు బాగా అదుపులోకి వచ్చాయి. ఈ నెల 10 నుంచి మొదలైన లాక్డౌన్ ఇందుకు దోహదం చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 26,811 మంది కరోనా బారిన పడ్డారు. అంతకుమించి 40,741 మంది కోలుకున్నారు. అయితే మృత్యు ప్రకోపం కొనసాగుతోంది. మరో 530 మంది విగతజీవులయ్యారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,99,784కు పెరిగింది. అందులో 20,62,910 మంది కోలుకున్నారు. ప్రాణనష్టం 26,929కి ఎగబాకింది. ప్రస్తుతం 4,09,924 మంది చికిత్స పొందుతున్నారు. బెంగళూరులో 6,433 కేసులు.. సిలికాన్ సిటీలో కరోనా తీవ్రత బాగా తగ్గింది. కొత్తగా 6,433 కేసులు, 18,342 డిశ్చార్జిలు, 285 మరణాలు సంభవించాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,37,929కు పెరిగింది. అందులో 9,18,423 మంది కోలుకున్నారు. 12,148 మంది మృతిచెందారు. ఇంకా 2,07,357 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1.27 లక్షల మందికి టీకా.. 1,27,317 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు. మొత్తం టీకాలు 1.25 కోట్లను దాటాయి. మరో 1,37,584 కరోనా పరీక్షించగా మొత్తం టెస్టులు 2,90,61,302 కు పెరిగాయి. -
పెరుగుతున్న మరణాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత ఎక్కువగానే కనిపిస్తోంది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 2,67,334 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3 లక్షలలోపు కేసులు రావడం వరసగా ఇది మూడోరోజు. దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,54,96,330కు పెరిగింది. 3,89,851 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,529 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 2,83,248కు పెరిగింది. మరోవైపు దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత 24 గంటల్లో 3,89,851 కరోనా రోగులు కోలుకున్నారు. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,19,86,363కు పెరిగింది. రికవరీ రేటు 86.23 శాతానికి పెరిగింది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 32,26,719కు చేరింది. మొత్తం యాక్టివ్ కేసులో 69.02 శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 32,03,01,177 కరోనా పరీక్షలు నిర్వహించగా గత 24 గంటల్లో 20,08,296 పరీక్షలు చేపట్టారు. ఇది అంతర్జాతీయ రికార్డు. భారత్‌లో ఒకే రోజు ఇంత ఎక్కువ కరోనా టెస్ట్‌లు చేయడం ఇదే తొలిసారి. గత వారంతో పోలిస్తే భారత్‌లో 13 శాతం తక్కువగా కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రోజూ రెండు లక్షలకు మించి కొత్త కేసులతో ప్రపంచంలోనే అత్యధిక కొత్త కేసులు నమోదవుతున్న దేశంగా భారత్ తొలిస్థానంలో ఉందని డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. -
టోక్యో ఒలింపిక్స్ ఆగవు...
ఒకవైపు కరోనా కేసులు పెరిగిపోతున్నా... మరోవైపు జపాన్ ప్రజలు నిరసనలు చేస్తున్నా... టోక్యో ఒలింపిక్స్ క్రీడలు ఆగిపోవని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధికార ప్రతినిధి మార్క్ ఆడమ్స్ స్పష్టం చేశాడు. ‘మీకు మరోసారి స్పష్టంగా చెబుతున్నా. టోక్యో గేమ్స్ ఈ ఏడాది జరిగేలా ఐఓసీ ఇప్పటికే తీర్మానం చేసింది. ఇందులో ఎలాంటి మార్పు ఉండదు’ అని ఆడమ్స్ వ్యాఖ్యానించాడు. -
కరోనా..మరో ప్రపంచ రికార్డు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా భారత్‌లో భారీగా నమోదవుతున్న కేసులు ప్రపంచ రికార్డులను తిరగరాస్తున్నాయి. వరుసగా మూడో రోజు 4 లక్షల మందికిపైగా కరోనా సోకినట్లు నిర్ధారణయింది. శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో 4,14,188 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,14,91,598కి చేరుకుంది. దీంతోపాటు, ఒక్క రోజులో 3,915 మంది కరోనాతో మృతి చెందగా మొత్తం మరణాల సంఖ్య 2,34,083కి పెరిగింది. మహారాష్ట్రలో అత్యధికంగా 853 మంది మరణించారు. పది రోజులుగా రోజుకు మూడు వేలకు పైగా కరోనా బాధితులు మరణిస్తున్నారు. పది రోజుల్లో మొత్తం 36,110 మంది మరణించారు. అంటే ప్రతి గంటకు 150 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో డబ్ల్యూహెచ్‌వో గణాంకాల ప్రకారం అమెరికాలో 10 రోజుల్లో 34,798 మంది, బ్రెజిల్లో 32,692 మంది మృతి చెందారు. దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం యాక్టివ్ కేసులు 36,45,164కు చేరుకున్నాయి. కేవలం 10 నగరాల్లోనే 25% యాక్టివ్ కేసులు ఉన్నాయి. అందులో అత్యధికంగా బెంగళూరు అర్బన్‌లో 9.13%, పుణేలో 3.16%, ఢిల్లీలో 2.49%, అహ్మదాబా§ద్లో 1.82%, చికిత్స పొందుతున్న రోగులున్నారు. గత 24 గంటల్లో 81.95% రికవరీ రేటుతో 3,31,507మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు రికవరీ అయిన వారి సంఖ్య 1,76,12,351కు చేరుకుంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో 24 గంటల్లో 23,70,298 వ్యాక్సిన్ డోస్‌లు వేశారు. దీంతో ఇప్పటివరకు దేశంలో 16,49,73,058 వ్యాక్సిన్ డోస్‌లను ప్రజలకు అందించారు. మరోవైపు కరోనా సంక్రమణను గుర్తించేందుకు గురువారం ఒక్కరోజులోనే 18,26,490 శాంపిల్స్‌ను పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు 17,35,07,770 కోవిడ్ వ్యాక్సిన్ డోస్‌లను ఉచితంగా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. -
Malaysia Open వాయిదా: సైనా, శ్రీకాంత్‌కు షాక్!
కౌలాలంపూర్: మలేసియాలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లలో భాగమైన మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో భారత స్టార్ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి. సింగిల్స్ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్–16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో, శ్రీకాంత్ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో, సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్ నుంచి సాయిప్రణీత్‌కు, సింధుకు ‘టోక్యో’ బెర్త్‌లు ఖరారయినట్టే. మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్ ఓపెన్ (జూన్ 1–6) మిగిలి ఉంది. ‘టోక్యో’ బెర్త్‌లు దక్కించుకోవాలంటే సింగపూర్ ఓపెన్‌లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్ ఓపెన్ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్‌ను భారత బ్యాడ్మింటన్ సంఘం కోరింది. -
5జీ వదంతులపై టెల్కోల ఆందోళన
న్యూఢిల్లీ: కోవిడ్–19 కేసులు పెరగడానికి 5జీ స్పెక్ట్రమ్ ట్రయల్సే కారణమంటూ వస్తున్న వదంతులపై టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవన్నీ తప్పుడు వార్తలని, వాటిని నమ్మరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలతో పాటు కొన్ని ప్రాంతీయ మీడియాలో కూడా కోవిడ్–19 కేసుల ఉధృతికి 5జీ స్పెక్ట్రం ట్రయల్సే కారణమంటూ వార్తలు చక్కర్లు కొడుతుండటం తమ దృష్టికి వచ్చినట్లు సీవోఏఐ శుక్రవారం తెలిపింది. ‘ఈ వదంతులన్నీ పూర్తిగా తప్పులతడకలే. ఇలాంటి నిరాధారమైన, తప్పుడు వార్తలను విశ్వసించరాదని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే పలు ప్రపంచ దేశాలు 5జీ నెట్‌వర్క్‌లను ప్రారంభించాయి. ఆయా దేశాల్లోని ప్రజలు కూడా ఈ సర్వీసులను సురక్షితంగా వినియోగించుకుంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా 5జీ టెక్నాలజీకి, కోవిడ్–19కి సంబంధం లేదని ఇప్పటికే స్పష్టం చేసింది‘ అని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ ఒక ప్రకటనలో తెలిపారు. -
కరోనా ప్రకోపం ఇంకెన్నాళ్లు?
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి సంక్రమణ వేగం రోజు రోజుకి పెరుగుతోంది. గత 9 రోజులుగా ప్రతీరోజు 3 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయంటే కరోనా ఏ విధంగా విలయతాండవం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 24 గంటల్లో 3,86,452 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా, 3,498 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశంలో సంక్రమణ రేటు 21.2 శాతానికి అంటేప్రతీ 100 మందిలో 21 మందికి వైరస్ సోకినట్లు గుర్తిస్తున్నారు. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గణాంకాల్లో పాజిటివ్ కేసులు మహారాష్టలో అత్యధికంగా ఒక్క రోజులోనే 66,159 కేసులు రాగా కేరళలో 38,607, ఉత్తరప్రదేశ్‌లో 35,104 వచ్చాయి. వీటన్నింటితో కలిపి ఇప్పటివరకు ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 1,87,62,976కు పెరిగింది. అదే సమయంలో దేశంలో మరణాల సంఖ్య 2,08,330కు చేరుకున్నాయి. ప్రస్తుతం దేశంలో 31,70,228 యాక్టివ్ కేసులు ఉండగా, 24 గంటల్లో 2,97,540 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 15.22 కోట్లను దాటింది. -
కరోనా ప్రళయం.. భయం గుప్పిట్లో ప్రజలు!
సాక్షి, న్యూఢిల్లీ: ఎటు చూసినా హాహాకారాలు.. భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్న ప్రజలు...ఆసుపత్రుల ముందు చికిత్స కోసం పడిగాపులు.. ప్రాణం పోయిన అనంతరం చితిపైకి చేరేందుకు సైతం పార్థ్ధివ దేహాలతో కుటుంబసభ్యులు ఎదురుచూడాల్సిన దుస్థితి..ఇవీ దేశంలోని ప్రస్తుత పరిస్థితులు..! కరోనా మహమ్మారి సంక్రమణలో దేశం రోజుకో రికార్డును బద్దలుకొడుతోంది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభమైన సమయంలో మన దేశంలోని భారీ జనాభా దృష్ట్యా పరిస్థితులు చేజారవచ్చని భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, లాక్డౌన్ లాంటి కఠిన చర్యలతో పరిస్థితులు ఎలాగోలా అదుపులోకి వచ్చాయి. అయితే, ఈ ఏడాది సెకండ్ వేవ్ మాత్రం దేశంలో భారీ విస్పోటనం సృష్టిస్తోంది. కరోనా వైరస్ ప్రళయ తాండవంతో ప్రపంచ రికార్డులను భారత్ తిరగరాస్తోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో ఒక్కరోజులో అత్యధికంగా 3,14,835 మందికి కరోనా వైరస్ సోకింది. ప్రపంచదేశాల్లో కేవలం ఒక్క రోజులోనే నమోదైన కేసులలో ఇదే అత్యధికం. అంతకుముందు ఈ ఏడాది జనవరి 8న అమెరికాలో అత్యధికంగా 24 గంటల్లో 3.07లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలోని మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ వంటి 10 రాష్ట్రాల్లోనే 75.66% పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు దేశంలో నమోదైన మొత్తం కేసులు 1,59,30,965కు చేరాయి. 1.33 లక్షలు పెరిగిన యాక్టివ్ కేసులు పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ గణనీయ మార్పు వచ్చింది. గత 24 గంటల్లోనే 1.33 లక్షల యాక్టివ్ కేసులు పెరిగి ఆ సంఖ్య 22,91,428కి చేరుకుంది. అదే çసమయంలో వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 2,104తో మొత్తం 1,84,657కు చేరింది. మరణాల రేటు ప్రస్తుతం 1.16% వద్ద నిలకడగా ఉంది. బ్రెజిల్ తరువాత, ప్రపంచంలో ఒకే రోజులో అత్యధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. మిగతా అన్ని దేశాల్లోనూ వెయ్యిలోపే మరణాలు సంభవిస్తున్నాయి. 24 గంటల్లో దేశంలో 1.79 లక్షల మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఒక్క రోజు రికవరీల్లో ఇది ఒక రికార్డు. మరోవైపు, కరోనా ఇన్ఫెక్షన్ను గుర్తించేందుకు బుధవారం దేశవ్యాప్తంగా 16,51,711 శాంపిల్స్‌ను పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ప్రకటించింది. ఇప్పటివరకు మొత్తంగా 27 కోట్ల 27 లక్షల 5 వేల 103 నమూనాలను పరీక్షించారు. దేశవ్యాప్త కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు వేసిన మొత్తం టీకా డోసుల సంఖ్య గురువారానికి 13.23 కోట్లు దాటింది. 24 గంటలలో 22 లక్షలమందికి పైగా కరోనా వ్యాక్సిన్ డోసులు తీసుకున్నారు. దేశవ్యాప్త టీకాల కార్యక్రమం 96వ రోజైన ఏప్రిల్ 21వ తేదీన 22,11,334 వ్యాక్సిన్ డోసులిచ్చారు. అందులో 15,01,704 మంది లబ్ధిదారులు మొదటి డోస్, 7,09,630 మందికి రెండో డోస్ ఇచ్చారు. -
Covid Cases in India: వామ్మో.. గతవారం మనమే
సాక్షి , న్యూఢిల్లీ: ఒకప్పుడు అమెరికా, బ్రెజిల్‌లలో ప్రతిరోజూ లక్షలాదిగా కొత్తకేసులు రావడం చూసి... వామ్మో అనుకున్నాం. చిగురుటాకులా వణికిపోయిన అగ్రదేశంపై అయ్యో పాపమని జాలిపడ్డాం. కానీ తాజా పరిణామాలను చూస్తుంటే మనమూ అదే పరిస్థితుల్లోకి వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. వారం రోజులుగా కరోనా గణాంకాలు దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వారం రోజుల్లో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచంలోనే భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది. ఏప్రిల్ 12 –18వ తేదీల మధ్య, భారత్‌లో 64% వృద్ధి రేటుతో 15.34 లక్షల మంది కరోనా బారినపడగా, 8,590 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో భారీగా కేసులు వస్తున్న దేశాలతో పోల్చిచూస్తే గతవారం భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో ప్రపంచంలో కొత్తగా కరోనా బారినపడ్డ వారిలో 30% వాటా భారత్‌దే. అదే సమయంలో అమెరికాలో 2 శాతం వృద్ధిరేటుతో 4.71 లక్షల మంది, బ్రెజిల్లో –7% వృద్ధిరేటుతో 4.61 లక్షల మంది, టర్కీలో 17% వృద్ధిరేటుతో 4.19 లక్షలమంది, ఫ్రాన్స్‌లో –10% వృద్ధిరేటుతో 2.30 లక్షల మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. 19 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక యాక్టివ్ కేసులు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 19,29,329 కు పెరిగాయి. రికవరీ రేటు 86 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో 1,44,178 మంది కరోనాను ఓడించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,29,53,821 కు చేరింది. రోజువారీ కేసులతో పోలిస్తే రికవరీలు సగం ఉండడమనేది ఆందోళనకరంగా మారింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి‡వరకు 26,78,94,549 శాంపిల్స్‌ను పరీక్షించగా, వాటిలో 13,56,133 శాంపిల్స్‌ను కేవలం ఆదివారం పరీక్షించారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 12,69,56,032 మందికి టీకాలు వేశారు. 79.25%... 10 రాష్ట్రాల్లోనే దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 68,631 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 503 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 6,70,388కు చేరుకుంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. మధ్యప్రదేశ్‌లో 3 నెలలు ఉచితరేషన్ కరోనాపై పోరాటానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 పెద్ద నగరాలు భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్‌ల్లో 2 వేల పడకల కోవిడ్ హాస్పిటల్స్ ప్రారంభించనుంది. పేదలకు (బీపీఎల్ కార్డు ఉన్నవారికి) 3 నెలల పాటు ఉచిత రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సింగిల్ డే... 2,73,810 సోమవారం విడుదలైన గణాంకాలు ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేశాయి. దేశంలో అత్యధికంగా ఒకే రోజు 2,73,810 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. వైరస్ సంక్రమణతో 1,619 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఎక్కువగా కోవిడ్–19 ప్రభావితమైన రాష్ట్రాల్లో రోగులకు పడకలు, వెంటిలేటర్లు, రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గత సంవత్సరం కరోనా సంక్రమణ ప్రారంభమైన తరువాత, దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన రోగుల సంఖ్య 1.5 కోట్లు దాటింది. దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య కేవలం 15 రోజుల్లోనే 1.25 కోట్ల నుంచి 1.5 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇందులో 1 కోటి 29 లక్షల 47 వేల 297 మంది కోలుకున్నారు. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనా కారణంగా మరణించిన 1,619 మందితో కలిసి కోవిడ్‌కు బలైన వారి సంఖ్య 1,78,769 కు చేరుకుంది. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.19గా ఉంది. -
Coronavirus India Highlights: మూడు రెట్లు వేగంగా
సాక్షి, నేషనల్ డెస్క్: దేశాన్ని కరోనా కసిగా కాటేస్తోంది. మొదటి వేవ్ తర్వాత దాని కోరలు పీకామని భావించాం కానీ, అనూహ్యమైన రీతిలో మూడు రెట్ల వేగంతో విషం కక్కుతోంది. రోజు రోజుకీ కరోనా కేసులు, మరణాలు పెరిగిపోతున్నాయి. మొదటి వేవ్‌లో రికార్డులన్నీ ఇప్పుడు తుడిచిపెట్టుకుపోతున్నాయి. కరోనా పడగ నీడలో బిక్కు బిక్కుమంటూ కాలం నెట్టుకొస్తున్నాం. ఫస్ట్ వేవ్ తర్వాత దేశంలో సెకండ్ వేవ్ ఎలా విజృంభిస్తోందో చూద్దాం. కరోనా మొదటి వేవ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎంతో కొంత మేర విస్తరించింది. ప్రతీ రాష్ట్రంలోనూ హాట్‌స్పాట్స్ ఉన్నాయి. కానీ రెండో వేవ్ వచ్చేసరికి కొన్ని రాష్ట్రాల్లోనే వైరస్ లోడు అధికంగా ఉంది. ఇండియా టాస్క్‌ఫోర్స్ సభ్యుల లాన్సెట్ కోవిడ్–19 కమిషన్ ఈ వారంలో విడుదల చేసిన నివేదిక ప్రకారం మొదటి వేవ్‌లో నమోదైన కేసుల్లో 50 శాతం 40 జిల్లాల్లో బయటపడితే, రెండో వేవ్‌లో సగం కేసులు 20 జిల్లాల్లోనే వెలుగు చూశాయి. 2020 ఆగస్టు–సెప్టెంబర్ మధ్య కరోనా మొదటి వేవ్ ఉధృతరూపం దాల్చినపుడు 75 శాతం కేసులు 60–100 జిల్లాలోనేయి. అదే సెకండ్ వేవ్‌లో మార్చి–ఏప్రిల్ నెలలో నమోదైన కేసుల్లో 75 శాతం కేసులు 20–40 జిల్లాల్లోనే బయటకొచ్చాయి. లక్షణాల్లేకుండా చుట్టేస్తోంది గత ఏడాది తొలిసారిగా జనవరిలో కేరళలో తొలికేసు వచ్చింది. చైనా నుంచి దిగుమతి అయిన వైరస్ మాత్రమే అందరికీ సోకింది. కానీ రెండో దశ మొదలైనప్పట్నుంచి వైరస్ జన్యుక్రమం మార్చుకొని విశ్వరూపం చూపిస్తోంది. బ్రిటన్, దక్షిణాఫ్రికా మ్యుటేషన్లతో పాటు రెండుసార్లు జన్యుక్రమం మార్చుకున్న భారత్ వైరస్ సార్స్ కోవ్–2 ద్వారా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. సెకండ్‌వేవ్‌లో అత్యధికుల్లో లక్షణాలు కనపడటం లేదు. దాంతో తెలియకుండానే వీరు ఇతరులకు వైరస్‌ను అంటిస్తున్నారు. అంతేకాదు కొన్ని కేసుల్లో కరోనా నేరుగా ఊపిరితిత్తుల పైనే దాడి చేస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రాణాల మీదకి వస్తోంది. యువతపై ప్రభావం కరోనా మొదటి వేవ్ పెద్దల్ని కాటేస్తే సెకండ్ వేవ్‌లో యువతకి ఎక్కువగా సోకుతోంది. ఢిల్లీలోని కరోనా రోగుల్లో 65 శాతం మంది 45 కంటే తక్కువ వయసు ఉన్న వారేనని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇక మహారాష్ట్ర, కర్ణాటకలో సగం కేసులు 30–40 ఏళ్ల మధ్య వయసున్న వారినే సోకుతున్నాయి. మొదటి వేవ్‌లో కరోనా మరణాల్లో 60 ఏళ్లకు పైబడిన వారే 88శాతం మంది ఉన్నారు. ఇక కేసులు కూడా 60 శాతానికిపైగా 50 ఏళ్ల వయసున్న వారికే సోకింది. మొదటి వేవ్‌లో చిన్నపిల్లలకు కరోనా సోకిన కేసులు అరుదు. కానీ ఈసారి మార్చి నెలలోనే 80 వేల మంది చిన్నారులు కరోనా బారినపడ్డారు. వ్యాక్సినేషన్ సాగుతున్నా తగ్గని జోరు మొదటి దశలో కరోనా వ్యాక్సిన్‌పై ప్రయోగాలు మాత్రమే జరిగాయి. కానీ రెండో వేవ్ వచ్చేసరికి వ్యాక్సినేషన్ మొదలైంది. దేశీయంగా అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్ కొవాగ్జిన్ వ్యాక్సిన్, సీరమ్ సంస్థ తయారు చేస్తున్న ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్ వ్యాక్సిన్లను 45 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ ఇస్తున్నారు. ఇప్పటివరకు 12 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారు. నాడు అవగాహన లేమి.. నేడు నిర్లక్ష్యం కరోనా మొదటి వేవ్‌లో ఈ వైరస్‌పై ఎవరికీ అవగాహన లేదు. లాక్డౌన్, క్వారంటైన్, మాస్కులు పెట్టుకోవడం, శానిటైజర్లు పూసుకోవడం అన్నీ కొత్త. దీంతో గత ఏడాది లాక్డౌన్ ఎత్తేశాక జూలై– సెప్టెంబర్ మధ్య కేసులు తారాస్థాయికి చేరుకున్నాయి. రెండో వేవ్ సమయానికి ప్రజల్లో అవగాహన వచ్చినప్పటికీ వ్యాక్సిన్ వచ్చిందన్న ధీమా, కరోనా నిబంధనల్ని గాలికి వదిలేయడం, ప్రభు త్వం కూడా ఆర్థిక నష్టం జరగకూడదన్న ఉద్దేశం తో అన్ని రకాల కార్యక్రమాలకు అనుమతినివ్వడం, 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో మార్చి నుంచి కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా రెండో వేవ్ అత్యంత ప్రమాదకరంగా మారింది. మొదటి వేవ్‌లో ఒక కరోనా రోగిని కలుసుకున్న వారిలో 30 నుంచి 40% మందికి వైరస్ సోకే అవకాశాలుంటే, రెండో వేవ్‌లో 80 నుంచి 90% మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యే అవకాశాలున్నాయి - డాక్టర్ రణదీప్ గులేరియా, ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ -
ఒక్కరోజులో 2,17,353 కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి విలయతాండవం ఉధృతమవుతోంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 2,17,353 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా ఆనవాళ్లు బయటపడ్డాక ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. వరుసగా రెండో రోజు 2 లక్షలకు పైగా కేసులు రావడం గమనార్హం. ఇప్పటిదాకా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,42,91,917కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా మరో 1,185 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 1,74,308కు చేరింది. క్రియాశీల (యాక్టివ్) కేసుల సంఖ్య వరుసగా 37వ రోజు పెరిగింది. గత 24 గంటల్లో కొత్తగా 97,866 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 15,69,743 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కేసుల్లో వీటి సంఖ్య 10.98 శాతం. మరోవైపు కరోనా రికవరీ రేటు క్రమంగా పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా రికవరీ రేటు 87.80 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 1,25,47,866 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజాగా ఒక్కరోజులో 1,18,302 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.22 శాతానికి పడిపోయింది. భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) గణాంకాల ప్రకారం కరోనా నిర్ధారణ పరీక్షల్లో భాగంగా ఏప్రిల్ 15 వరకు 26,34,76,625 నమూనాలను (శాంపిల్స్) పరీక్షించారు. 80 శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే... దేశంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 79.10 శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని పేర్కొంది. దేశంలోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 65.86 శాతం వాటా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలదే కావడం గమనార్హం. మొత్తం యాక్టివ్ కేసుల్లో 39.60 శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. మొత్తం కరోనా సంబంధిత మరణాల్లో 85.40 శాతం మరణాలు కేవలం 10 రాష్ట్రాల్లో సంభవించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్తాన్, తమిళనాడులో మరణాలు అధికంగా సంభవించాయి. 11.72 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ ఇప్పటివరకు 17.37 లక్షల సెషన్లలో 11,72,23,509 వ్యాక్సిన్ డోసులను లబ్ధిదారులకు అందజేశారు. ఇప్పటివరకు ఇచ్చిన మొత్తం టీకా డోసుల్లో 59.63 శాతం డోసులను మహారాష్ట్ర, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళలో∙ఇచ్చారు. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 27.30 లక్షల డోసులను పంపిణీ చేశారు. కోవాగ్జిన్ ఉత్పత్తి గణనీయంగా పెంపు.. దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచి సెప్టెంబరు కల్లా నెలకు 10 కోట్ల డోసులకు చేరుస్తామని బయోటెక్నాలజీ శాఖ తెలిపింది. ఇందుకోసం మూడు ప్రభుత్వ రంగ సంస్థలను రంగంలోకి దించామని తెలిపింది. అలాగే కోవిడ్ చికిత్సలో వాడే రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకున్నట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డి.వి.సదానంద గౌడ్ వెల్లడించారు. గడిచిన ఐదు రోజుల్లో 6.69 లక్షల డోసులను రాష్ట్రాలకు అందించినట్లు తెలిపారు. నెలకు 28 లక్షల ఉత్పత్తి సామర్థ్యాన్ని 41 లక్షలకు పెంచామన్నారు. యడియూరప్పకు మళ్లీ కరోనా కర్ణాటక సీఎం యడియూరప్ప(78) రెండోసారి కరోనా వైరస్ బారినపడ్డారు. శుక్రవారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చికిత్స కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. యడియూరప్పకు తొలుత గత ఏడాది ఆగస్టు 2న కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పట్లో ఆసుపత్రిలో చేరి, తొమ్మిది రోజులపాటు చికిత్స అనంతరం కోలుకున్నారు. కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ (70) కరోనా బారినపడ్డారు. మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్, కాంగ్రెస్ నేత రణదీప్‌సింగ్ సూర్జేవాలా(53), శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి హర్సిమ్రత్ కౌర్ బాదల్‌లకూ కరోనా సోకింది. -
ఒడిదుడుకులు.. లాభాల ముగింపు
మంబై: దేశంలో కోవిడ్ కేసులు రోజుకో కొత్త గరిష్టాన్ని నమోదు చేస్తున్న తరుణంలోనూ స్టాక్ మార్కెట్ వరుసగా రెండోరోజూ లాభపడింది. ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఆటుపోట్లకు గురైన సూచీలు ఐటీ, ఆర్థిక, ప్రభుత్వరంగ బ్యాంక్స్ షేర్ల అండతో గురువారం లాభాలతో గట్టెక్కాయి. రూపాయి రికవరీ అవడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలు దేశీయ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 260 పాయింట్లు పెరిగి 48,804 వద్ద ముగిసింది. నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 14,581 వద్ద నిలిచింది. ఫార్మా, మెటల్, ప్రైవేట్ రంగ షేర్లు కూడా రాణించాయి. ఆటో, ప్రభుత్వరంగ బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ రంగాల షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 877 పాయింట్ల రేంజ్లో కదలాడగా, నిఫ్టీ 245 పాయింట్ల పరిధిలో ట్రేడైంది. మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాల సందర్భంగా టీసీఎస్‌తో పాటు ఇన్ఫోసిస్ కంపెనీల యాజమాన్యాలు మెరుగైన అవుట్‌లుక్‌ను ప్రకటించడంతో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాతో పాటు చైనా మెరుగైన ఆర్థిక గణాంకాలను ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు మళ్లీ లాభాల బాటపట్టాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.980 కోట్ల విలువైన షేర్లను కొనగా, సంస్థాగత(దేశీయ) ఇన్వెస్టర్లు రూ.580 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఇన్ఫీ.. లాభాల స్వీకరణ... నాలుగో క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోవడంతో విఫలం కావడంతో ఇన్ఫోసిస్ షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. దీంతో ఈ కంపెనీ షేరు 3% నష్టంతో రూ.1361 వద్ద ముగిసింది. ఒకదశలో 6% క్షీణించింది. ‘మహా’ కర్ఫ్యూతో ఆటో షేర్లు రివర్స్... కరోనా కేసుల కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జనతా కర్ఫ్యూ ప్రభావం ఆటో రంగ షేర్లను నష్టాల బాట పట్టించింది. రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుంచి మే 1 వరకు 144 సెక్షన్ అమల్లోకి ఉంటుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో 20%కి పైగా ఆటో ఉపకరణాలు ఈ రాష్ట్రంలోనే ఉత్పత్తి అవుతాయి. లాక్ డౌన్ తరహా ఆంక్షలతో ఆటో మొబైల్స్ ఉత్పత్తి కేంద్రాలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో స్టాక్ మార్కెట్లో ఆటో షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఐషర్, అశోక్ లేలాండ్, భారత్ ఫోర్జ్, మారుతీ షేర్లు 3% నష్టపోయాయి. మదర్‌సుమీ, ఎంఆర్ఎఫ్, భాష్ షేర్లు 2% క్షీణించాయి. -
వచ్చే కొన్ని నెలలు భారత్‌కు కీలకం
న్యూఢిల్లీ: వచ్చే కొన్ని నెలలు భారత్‌కు కీలకమని.. పెరిగిపోతున్న కరోనా కేసులు ఆర్థిక రికవరీకి సవాళ్లను తీసుకురావచ్చని ఆక్స్ఫర్డ్ ఎకనమిక్స్ అంచనా వేసింది. ఇప్పటి వరకు చూస్తే ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తక్కువగానే ఉందంటూ.. అయినప్పటికీ భారత విధాన కర్తలు నిర్లక్ష్యానికి ఏ కొంచెం కూడా అవకాశం ఇవ్వరాదని పేర్కొంది. కఠిన లాక్డౌన్లను విధించే విషయంలో రాష్ట్రాలు పునరాలోచిస్తుండడడంతో ఆర్థిక ప్రభావం గతేడాది ద్వితీయ త్రైమాసికంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే ఉంటుందని అంచనా వేసింది. కరోనా కేసుల కట్టడికి కావాల్సిన స్థాయిలో భారత్‌లో టీకాల కార్యక్రమం నడవడం లేదని అభిప్రాయపడింది. ఆరోగ్య పరిస్థితులు మరింత దారుణంగా మారి, కఠినమైన నియంత్రణలను అమలైతే కనుక 2021 సంవత్సరం మొదటి ఆరు నెలలకు సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థపై తమ అంచనాలు ప్రభావితం కావొచ్చని పేర్కొంది. -
సెన్సెక్స్ నష్టం 155 పాయింట్లు
ముంబై: స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టంతో ముగిసింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యాధి వ్యాప్తి నియంత్రణకు స్థానిక ప్రభుత్వాలు లాక్డౌన్లను విధిస్తున్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి పతనం అయిదోరోజూ కొనసాగింది. ఈ అంశాలన్నీ దేశీయ మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. సెన్సెక్స్ 155 పాయింట్ల నష్టంతో 49,591 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 39 పాయింట్లను కోల్పోయి 14,835 వద్ద నిలిచింది. దీంతో సూచీల మూడురోజుల వరుస లాభాలకు ముగింపు పడింది. ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ విధింపుతో ఆస్తుల నాణ్యత తగ్గవచ్చనే అందోళనలతో ప్రైవేట్ బ్యాంకు షేర్లలో అమ్మకాలు జరిగాయి. కొంతకాలంగా ర్యాలీ చేస్తున్న మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ చోటుచేసుకుంది. అలాగే ఆటో, రియల్టీ షేర్లలో కూడా విక్రయాలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం మరోసారి తెరపైకి రావడంతో పీఎస్‌యూ బ్యాంక్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. రూపాయి పతనంతో ఎగుమతులపై ఆధారపడే ఐటీ, ఫార్మా షేర్లకు కలిసొచ్చింది. ఎఫ్ఎంసీజీ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. దేశీయ, విదేశీ ఇన్వెస్టర్లు ఇరువురూ నికర అమ్మకందారులుగా మారారు. ఎఫ్ఐఐలు రూ.645 కోట్ల షేర్లను, డీఐఐలు రూ.271 కోట్ల షేర్లను విక్రయించారు. ఇక ఈ వారంలో సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 33 పాయింట్లు నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇంట్రాడేలో ఒడిదుడుకుల ట్రేడింగ్... ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్ ఉదయం నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్ 49,743 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14,882 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అయితే ఫార్మా, ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంక్ షేర్లు రాణించడంతో లాభాల్లోకి మళ్లాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ 49,907 వద్ద, నిఫ్టీ 14,918 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్ తర్వాత కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువెత్తడంతో సూచీల లాభాలన్ని మళ్లీ మాయమయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ ఇంట్రాడే గరిష్ట స్థాయి(49,907) నుంచి 446 పాయింట్లు నష్టపోయి 49,461 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ఇంట్రాడే గరిష్టం (14,918) నుంచి 133 పాయింట్లు కోల్పోయి 14,785 స్థాయికి చేరుకుంది. చివర్లో ఎఫ్ఎంసీజీ షేర్లు ఆదుకోవడంతో సెన్సెక్స్ 154 పాయింట్లు, నిఫ్టీ 38 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్‌ను ముగించాయి. -
దేశాన్ని హడలెత్తిస్తోన్న కరోనా సెకండ్ వేవ్
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని హడలెత్తిస్తోంది. ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదవుతోంది. గత 24 గంటల్లో 1,26,789 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.29 కోట్లకు చేరుకుంది. ఒకే రోజు లక్షకు పైగా కేసులు నమోదవడం ఇది మూడో సారి. కరోనాతో 685 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 1,66,862కి చేరుకుంది. క్రియాశీలక కేసుల సంఖ్య 9,10,319కి చేరుకుంది. మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కేవలం ఆ ఒక్క రాష్ట్రంలో ఒకేరోజు 59,907 కేసులు నమోదయ్యాయి. టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని ప్రధాని∙మోదీ కోవిడ్ టీకా రెండో డోసు తీసుకున్నారు. టీకా మొదటి డోసు తీసుకున్న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో రెండో డోసు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పట్టణాలే కరోనా హాట్‌స్పాట్స్ కరోనా సెకండ్ వేవ్‌లో కూడా పట్టణ ప్రాంతాలే వైరస్‌కు హాట్ స్పాట్స్‌గా మారాయి. మార్చిలో వెలుగులోకి వచ్చిన కోవిడ్–19 కేసుల్లో 48% పట్టణ ప్రాంతాల నుంచే వచ్చాయి. దేశ జనాభాలో ఈ ప్రాంతాల్లో 14%మంది నివసిస్తున్నారు. ఇక ఏప్రిల్‌లోని మొదటి నాలుగు రోజుల్లో కూడా అత్యధికంగా 51.9%కేసులు పట్టణ ప్రాంతాల నుంచే వచ్చినట్టుగా ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక నగరాల్లోనూ కరోనా ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. ముంబై, పుణె, నాగపూర్, చెన్నై, బెంగుళూరు ఢిల్లీ వంటి నగరాల నుంచే 42% కేసులు వస్తున్నాయి. కేసులు అధికంగా వస్తున్న ప్రాంతాల్లో వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ► ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సరిహద్దుల్లోని నోయిడా, ఘజియాబాద్‌లలో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించారు. ఈ నెల 17వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌లో నైట్ కర్ఫ్యూ విధించారు. యూపీలో ఒక రోజు 6,023 కేసులు నమోదు కావడంతో అత్యధిక కేసులు వస్తున్న పట్టణాల్లో ఆంక్షల్ని కట్టుదిట్టం చేశారు. ► మధ్యప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో మూడు రోజులు సంపూర్ణంగా లాక్డౌన్ విధిస్తున్నట్టుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఈ లాక్డౌన్ అమల్లో ఉంటుంది. సంక్షోభ నివారణ కమిటీతో చర్చల అనంతరం వీకెండ్లో సమస్తం బంద్ చేయాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో ఒకే రోజు నాలుగు వేలకు పైగా కేసులు నమోదు కావడంతో మూడు రోజుల కఠినమైన లాక్డౌన్ నిబంధనలు విధిస్తున్నట్టుగా చెప్పారు. ► అస్సాంలో విమానాల్లో ప్రయాణించే వారు తప్పనిసరిగా కోవిడ్ నెగిటివ్ రిపోర్టు ఇవ్వాలి. కర్ణాటకలో రేపటి నుంచి రాత్రి కర్ఫ్యూ సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రెండోదఫా కరోనా కేసులు విస్తరిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 8 జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్ 10 నుంచి 20 వరకు రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. బెంగళూరు, మైసూరు, మంగళూరు, కలబురిగి, బీదర్, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, తుమకూరు జిల్లా కేంద్రాల్లో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. కేరళ సీఎం పినరయి విజయన్ కరోనా వైరస్ సోకింది. తమిళనాడులో మినీ లాక్డౌన్ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతుండడంతో ప్రభుత్వం మినీ లాక్డౌన్ విధించింది. కరోనాను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ నెల 10వ తేదీ నుంచి పలు ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలిపింది. గురువారం అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4,276 పాజిటివ్ కేసులు, 19 మరణాలు నమోదయ్యాయి. రాజధాని నగరం చెన్నైలో 1,520 పాజిటివ్ కేసులు, 6 మరణాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ రంజన్ బుధవారం ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. గురువారం ప్రధాని నరేంద్రమోదీతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలు ఆంక్షలతో కూడిన మినీ లాక్డౌన్ ప్రకటించారు. కరోనా వైరస్ ప్రధాన లక్షణమైన జ్వరం బారినపడిన వారిని గుర్తించేందుకు ఇంటింటా పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. కరోనా తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో పూర్తి లాక్డౌన్ ఉంటుంది. -
స్కూళ్ల మూసివేత.. తరగతులు రద్దు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేస్తూ/ తరగతులను రద్దు చేస్తూ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక తరగతులను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, పంజాబ్ ప్రభుత్వాలు వెల్లడించాయి. ఆన్లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకూ విద్యార్థులెవరూ పాఠశాలలకు రావొద్దని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. 9వ తరగతి వరకూ పాఠశాలలను ఏప్రిల్ 5 నుంచి రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం తెలియజేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి వరకు స్కూళ్ల మూసివేత గడువును ఏప్రిల్ 11 దాకా పొడిగించింది. మహారాష్ట్రలో 10, 12వ తరగతుల విద్యార్థులు, పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మాత్రమే క్లాసులకు హాజరు కావొచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 10 దాకా స్కూళ్లను మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. గుజరాత్, రాజస్తాన్‌లోనూ స్కూళ్లు మూతపడ్డాయి. బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కరోనా కారణంగా స్కూళ్లకు తాళాలేయడంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. మహమ్మారి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మూసివేత గడువును ప్రభుత్వాలు ఇంకా పొడిగిస్తున్నాయి. షిర్డీ ఆలయం మూసివేత కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీ సాయి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి నుంచి తిరిగి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసే ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు షిర్డీ ఆలయంతో పాటు ఇతర దేవాల యాలన్నింటిని మూసేస్తున్నట్లు చెప్పింది. షిర్డీ ఆలయం మూసినప్పటికీ, అర్చకుల ఆధ్వర్యంలో నిత్య పూజలు కొనసాగుతూనే ఉంటాయని శ్రీ షిర్డీ సాయిబాబా ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి రవీంధ్ర ఠాక్రే చెప్పారు. -
మహారాష్ట్రలో కరోనా విజృంభణ
సాక్షి ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఒకటి రెండు కాకుండా ఏకంగా 49,447 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య ఇప్పటి వరకు నమోదైన సంఖ్య కంటే అత్యధికంగా ఉంది. మరోవైపు 277 మంది మృతి చెందారు. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు నాలుగు లక్షలు దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,01,172 యాక్టివ్ కేసులున్నాయి. దీంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే శనివారం కరోనా నుంచి 37,821 మందికి నయమవడం కొంత ఊరటనిచ్చే అంశంగా చెప్పవచ్చు. వారం రోజుల్లో మూడు లక్షలు.. రాష్టంలో అత్యం వేగంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి సునామీలా విజృంభిస్తోంది. రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగరాల్లో పరిస్థితి అత్యంత దారుణంగా మారుతోంది. గత వారం రోజుల్లో ఏకంగా మూడు లక్షల మందికిపైగా కరోనా సోకింది. ఆరోగ్య శాఖ అందించిన వివరాల మేరకు గత శనివారం మార్చి 27 నుంచి 3,15,712 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలో తొమ్మిది వేలు.. ముంబైలో శనివారం కరోనా కేసులు 9,108 కేసులు నమోదయ్యాయి. మరోవైపు 27 మంది మృతి చెందారు. అదే విధంగా గత వార ం రోజుల్లో కరోనా రోగుల సంఖ్య 55,684 నమోదు కావడం అత్యంత ఆందోళన కరమైన విషయంగా చెప్పుకోవచ్చు. మరోవైపు పుణేలో మినీ లాక్డౌన్ ప్రకటించారు. శనివారం నుంచి అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ శనివారం పుణే మున్సిపల్ కార్పొరేషన్లో 5,778 కరోనా కేసులు నమోదు కాగా 37 మంది మృతి చెందారు. ఆ విద్యార్థులందరూ పాస్ కరోనాతో చిగురుటాకులా వణికిపోతున్న మహారాష్ట్రలో విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఫైనల్ పరీక్షలు నిర్వహించకుండానే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులందరూ పాస్ అయినట్టుగా ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ సహాయ మంత్రి వర్ష గ్వైక్వాడ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. త్వరలోనే 9, 11 తరగతులపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇక 10, 12వ తరగతి బోర్డు పరీక్షలు మాత్రం యథావిధిగా నిర్వహిస్తారు. -
బంగ్లాదేశ్‌లో 7 రోజుల లాక్డౌన్
ఢాకా: బంగ్లాదేశ్‌లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో 7 రోజుల పాటు లాక్డౌన్ విధించనున్నట్లు బంగ్లాదేశ్ వెల్లడించింది. వైరస్‌ను కట్టడి చేసేందుకు సోమవారం నుంచి ఏడు రోజుల పాటు లాక్డౌన్ విధిస్తున్నట్లు రోడ్లు, రవాణా మంత్రి ఒబైదుల్ ఖాదర్ చెప్పారు. అత్యవసర సర్వీసులు, పరిశ్రమలను లాక్డౌన్ నుంచి మినహాయిస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ పని చేసుకోవచ్చని తెలిపారు. బంగ్లాదేశ్‌లో శుక్రవారం ఏకంగా 6,830 కొత్త కరోనా కేసులు బయట పడ్డాయి. దీంతో పాటు 50 మరణాలు సంభవించడంతో ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించింది. ఇటలీలో మూడు రోజుల లాక్డౌన్ రోమ్: ఈస్టర్ సందర్భంగా కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు ఇటలీ మూడురోజుల కఠిన లాక్‌డౌన్‌ను ప్రకటించింది. సోమవారం వరకు దేశంలోని అన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌గా గుర్తించి లాక్డౌన్ అమలు చేస్తామని ఇటలీ ఆరోగ్యమంత్రి చెప్పారు. దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుతున్నా, పండుగ వేళ ఒక్కమారుగా మహమ్మారి విజృంభించకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలిపారు. లాక్డౌన్లో భాగంగా వ్యక్తిగత ప్రయాణాలపై ఆంక్షలుంటాయి. అత్యవసరాలు కాని షాపులు మూసివేస్తారు. రెస్టారెంట్లు, బార్లు కేవలం టేక్ అవేకు మాత్రమే పరిమితం అవుతాయి. లాక్డౌన్ కఠినంగా అమలు చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. యూరప్‌లో బిట్రన్ తర్వాత ఇటలీలో అధిక మరణాలు కరోనా కారణంగా సంభవించాయి. ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం నడుస్తోంది. -
COVID-19: అక్టోబర్ 11 తర్వాత మళ్లీ...
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: దాదాపు నెల రోజుల నుంచి కరోనా బెంబేలెత్తిస్తోంది. క్రమంగా కేసులు పెరుగుతూ ఉండగా, డబులింగ్ టైమ్ తగ్గుతూ వస్తోంది. దేశంలో గత 24 గంటల్లో ఏకంగా 68,020 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్ 11 తర్వాత.. ఒకరోజు వ్యవధిలో నమోదైన అధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,20,39,644కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 291 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,61,843 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,13,55,993కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.32 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 5,21,808గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 4.33 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.34గా ఉంది. ఇప్పటివరకూ వరకూ 24,18,64,161 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ఆదివారం 9,13,319 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70 శాతం మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది. 8 రాష్ట్రాల్లో.. దేశంలో సోమవారం నమోదైన కేసుల్లో 84.5శాతం కేసులు కేవలం 8 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఇందులో మహారాష్ట్రలో 40,414, కర్ణాటకలో 3,082, పంజాబ్‌లో 2,870, మధ్యప్రదేశ్‌లో 2,276 గుజరాత్లో 2,270, కేరళలో 2,216, తమిళనాడులో 2,194, ఛత్తీస్‌గఢ్‌లో 2,153 కేసులు నమోదయ్యాయి. కేవలం మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, కేరళ రాష్ట్రాల్లోనే 80.17శాతం యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు 10 రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకూ 6.05 కోట్ల కోవిడ్ డోసుల వ్యాక్సినేషన్ జరిగింది. రిషికేశ్ తాజ్ హోటల్లో 76 మందికి కరోనా ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం రిషికేశ్‌లోని తాజ్ హోటల్లో ఏకంగా 76 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. దీంతో మూడు రోజుల పాటు హోటల్‌ను మూసేస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ముందుజాగ్రత్తల్లో భాగంగా హోటల్‌ను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. గతవారంలోనే 16 కేసులు రావడంతో 48 గంటల పాటు హోటల్‌ను మూసేశారు. తాజా కేసులతో మూడు రోజుల పాటు మూసివేశారు. దీంతో పాటు ఇటీవల డెహ్రాడూన్‌లోని నెహ్రూ కాలనీ, రిషికేశ్‌లోని గుమనివాలా ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి పూర్తి స్థాయి నిబంధనలు విధించిన నేపథ్యంలో తాజా కేసులు బయట పడటంతో ఈ ప్రాంతాల్లోని బ్యాంకులు, షాపులు, ఆఫీసులను కూడా మూసేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ఇంట్లోకి అవసరమైన నిత్యావసరాలను కొనేందుకు కూడా కేవలం ఇంటికొకరే బయటకు రావాల్సిందిగా అధికారులు సూచించారు. హరిద్వార్‌లో తాజాగా 73 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. -
మహారాష్ట్రలో మళ్లీ లాక్డౌన్!
ముంబై: మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తూ ఉండడంతో ఆ రాష్ట్రం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోంది. ఆర్థిక రంగంపై పెను భారం పడకుండా లాక్డౌన్ అమలు చేయడానికి పకడ్బందీ ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అధికారుల్ని ఆదేశించినట్టు ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. ముఖ్యమంత్రి ఠాక్రే, ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపె, కోవిడ్–19 టాస్క్‌ఫోర్స్ సిబ్బంది, ఇతర అధికారులు ఆదివారం సమావేశమై రాష్ట్రంలో కరోనా పరిస్థితిని సమీక్షించారు. రోజుకి 40 వేల కేసులు దాఖలయ్యే పరిస్థితులు తరుముకొస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ తప్ప మరో మార్గం లేదని కోవిడ్–19పై ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ అభిప్రాయపడింది. దీంతో ముఖ్యమంత్రి ఆర్థిక రంగాన్ని దెబ్బతీసేలా మార్కెట్లన్నీ మూసేయకుండా కఠినమైన ఆంక్షలు విధించేలా ఒక ప్రణాళికను రూపొందించాలన్నారు. లాక్డౌన్ ప్రకటన చేసినప్పుడు ప్రజల్లో ఎలాంటి గందరగోళం లేకుండా ప్రణాళిక అమలులో స్పష్టత ఉండాలని చెప్పారు. మహారాష్ట్రలో ఆదివారం ఒక్కరోజే అత్యధికంగా 40,414 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,13,875కి చేరుకుంది. దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసుల్లో ప్రతీ రోజూ 60శాతానికిపైగా మహారాష్ట నుంచే వస్తున్నాయి. ఇక ఈ రాష్ట్రంలో వారంలో నమోదైన కేసుల పాజిటివ్ రేటు అ«త్యధికంగా ఉంది. జాతీయ పాజిటివిటీ రేటు 5.04గా ఉంటే మహారాష్ట్రలో ఏకంగా 22.78%గా ఉంది. కేసులు ఉధృతంగా ఉండడంతో ఇప్పటికే మహారాష్ట్రలో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఒకే రోజు 300కిపైగా మరణాలు దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య పెరిగిపోతోంది. గత 24 గంటల్లో 312 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు సంభవించిన మరణాల సంఖ్య 1,61,552కి చేరుకుంది. ఈ ఏడాది ఒకే రోజు మరణాల్లో ఇదే అత్యధికం. ఇక గత 18 రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. కొత్తగా 62,714 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,19,71,624కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,86,310కి చేరుకుంది. మొత్తం కేసుల్లో ఇది 4.06 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఐఐఎంలో ప్రొఫెసర్లు, విద్యార్థులు 45 మందికి కరోనా పాజిటివ్ వస్తే, గాంధీ నగర్ ఐఐటీలో 25 మంది కరోనా బారినపడడం కలకలాన్ని రేపుతోంది. పదేళ్లలోపు పిల్లలకీ కరోనా బెంగళూరులో చిన్నారులకి కూడా కరోనా సోకడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటివరకు పదేళ్ల లోపు వయసున్న పిల్లలు 470 మందికిపైగా కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 244 మంది అబ్బాయిలు ఉంటే, 228 మంది అమ్మాయిలు ఉన్నారు. ప్రతీ రోజూ సగటున తొమ్మిది మంది పిల్లలకి కరోనా పాజిటివ్‌గా తేలుతూ ఉంటే హఠాత్తుగా ఈ నెల 26న ఆ సంఖ్య 46కి చేరుకుంది. పాఠశాలలు ప్రారంభం కావడం, వివాహాలు, వేడుకలకి హాజరుకావడం, తోటి పిల్లలతో కలిసి ఆటలు ఆడడం వంటివాటితో పిల్లలకీ కరోనా సోకుతోంది. భౌతిక దూరం పాటించడం, ఎక్కువ సేపు మాస్కు ఉంచుకోవడం పిల్లలకి కష్టతరం కావడంతో వారికి తొందరగా వైరస్ సోకుతున్నట్టుగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
60 వేల చేరువలో ఒక్కరోజు కేసులు
సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 59,118 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గతేడాది అక్టోబర్ 18 తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,18,46,652కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 257 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,949కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,64,637కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.09 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 4,21,066గా ఉంది. మూడు రాష్ట్రాల్లో.. కొత్త కేసుల్లో 73.64 శాతం కేసులు కేవలం మూడు రాష్ట్రాల్లోనే నమోదు కావడం గమనార్హం. వీటిలో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లు ఉన్నాయి. ఇందులోనూ మహారాష్ట్రలో అత్యధికంగా 35,952 కేసులు నమోదయ్యాయి. దేశంలో 5.5 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ మహారాష్ట్రలో మరోసారి రాత్రిపూట కర్ఫ్యూను ప్రకటించారు. మార్చి 28వ తేదీ ఆదివారం రాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుందని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. అన్ని షాపింగ్‌మాల్స్ రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల వరకు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కరోనా విస్తరణను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న పండుగల్లో జాగ్రత్త: కేంద్రం కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో రానున్న పండుగ రోజుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పలు సూచనలు చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శుక్రవారం ఢిల్లీలో మాట్లాడారు. త్వరలో రానున్న హోలీ, ఈస్టర్, ఈద్–ఉల్–ఫితర్ తదితర పర్వదినాల్లో పౌరులు మరింతగా గుమికూడినపుడు కరోనా వైరస్ మరింతగా వ్యాప్తిచెందకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచించారు. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో దేశం ప్రస్తుతం కీలక దశలోకి చేరుకుందని ఈ దశలో అలసత్వం ప్రదర్శించడం మంచిదికాదన్నారు. స్కూళ్లు, కాలేజీలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, జిమ్‌లు, ఎగ్జిబిషన్లు వంటి వాటికి సంబంధించి ఈ నెల 23న హోంశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసిందని వాటిని అనుసరించాలని సూచించారు. -
క్రాష్ మార్కెట్!
ముంబై: భారత స్టాక్ మార్కెట్లో రెండోరోజూ ‘బేర్’ బాజా కొనసాగింది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదలతో పాటు లాక్డౌన్ విధింపు భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. మార్చి డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ æఓ) కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో అమ్మకాలకు మొగ్గుచూపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. రూపాయి వరుసగా మూడో రోజూ 7 పైసలు క్షీణించడం కూడా ట్రేడింగ్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సెన్సెక్స్ 740 పాయింట్లు నష్టపోయి 48,440 వద్ద ముగిసింది. నిఫ్టీ 225 పాయింట్ల పతనంతో 14,325 వద్ద స్థిరపడింది. మెటల్ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎమ్సీజీ షేర్లు అధికంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మార్కెట్ వరుస పతనంతో రెండు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 1,611 పాయింట్లు, నిఫ్టీ 489 పాయింట్లను కోల్పోయాయి. చిన్న, మధ్య తరహా షేర్లలో విస్తృత స్థాయి విక్రయాలు జరగడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ ఇండెక్స్‌లు 2 శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ సూచీలోని మొత్తం 30 షేర్లలో కేవలం నాలుగు షేర్లు మాత్రమే లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్లు రెండోరోజూ రూ.3,384 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2,268 కోట్ల పెట్టుబడులు పెట్టారు. 49 వేల దిగువకు సెన్సెక్స్... మునుపటి రోజు నష్టాల ముగింపునకు కొనసాగింపుగా మార్కెట్ బలహీనంగా మొదలైంది. సెన్సెక్స్ 49,202 వద్ద, నిఫ్టీ 14,571 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇన్వెస్టర్లు బ్యాంకింగ్ రంగ షేర్లను ఎక్కువగా విక్రయించారు. ఈ క్రమంలో సెన్సెక్స్ 49 వేల స్థాయిని కోల్పోయింది. ఒక దశలో సెన్సెక్స్ 944 పాయింట్లును కోల్పోయి 48,236 వద్ద, నిఫ్టీ 285 పాయింట్లు నష్టపోయి 14,264 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. మిడ్‌సెషన్ తర్వాత కొంత రికవరీ కన్పించినా చివరి గంట అమ్మకాలతో సూచీలు రెండోరోజూ భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ముగించాయి. ‘భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రేటు మళ్లీ పెరిగిపోతోంది. ఈ అంశం ఈక్విటీ మార్కెట్లలో భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. డెరివేటివ్స్ ముగింపు తేది కావడం మరింత ప్రతికూలాంశంగా మారింది. సుదీర్ఘ ర్యాలీ తర్వాత దేశీయ మార్కెట్ దిద్దుబాటుకు గురై స్థిరీకరణ దిశగా సాగుతుంది. ఈ దశలో కోవిడ్ వ్యాప్తి భయాలు మార్కెట్ పతనానికి కారణమవుతున్నాయి’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. రెండు రోజుల్లో రూ.6.9 లక్షల కోట్లు ఆవిరి మార్కెట్ భారీ పతనంతో గురువారం ఇన్వెస్టర్లు రూ. 3.69 లక్షల కోట్లను కోల్పోయారు. అంతకు ముందు ట్రేడింగ్ సెషన్లోనూ రూ.3.27 లక్షల కోట్ల సంపద ఆవిరవడంతో ఈ రెండు రోజుల్లో రూ.6.96 లక్షల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (మార్కెట్ క్యాపిటలైజేషన్) రూ.200 లక్షల కోట్ల దిగువకు చేరుకొని రూ.198.78 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 3వ తేదీన బీఎస్ఈ ఇన్వెస్టర్ల సంపద రూ. 200 లక్షల కోట్ల మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే. -
ఒక్క రోజులోనే 53 వేలు
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి తీవ్రతరమవుతోంది. 24 గంటల్లోనే 53,476 కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఇది ఈ ఏడాదిలోనే అత్యధికం. దీంతోపాటు, గత రెండు రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిపోవడం ఆందోళన కలిగించే అంశం. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసులు 1,17,87,534కు చేరుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం వెల్లడించింది. కొత్తగా నిర్థారణ అయిన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 31,855, పంజాబ్‌లో 2,613, కేరళలో 2,456 ఉన్నాయి. అదేవిధంగా, యాక్టివ్ కేసులు వరుసగా 15వ రోజు కూడా పెరిగి, 3,95,192కు చేరుకుని, మొత్తం కేసుల్లో ఇవి 3.95%గా ఉన్నాయి. రికవరీ రేటు మరింత తగ్గి 95.28%గా ఉందని కేంద్రం తెలిపింది. మహమ్మారితో ఒక్క రోజులోనే మరో 251 మంది మరణించడంతో ఇప్పటి వరకు 1,60,692 మంది చనిపోయినట్లయింది. గత ఏడాది అక్టోబర్ 23వ తేదీన 54,366 కేసులు నమోదైన రికార్డు ఉంది. ఈ వ్యాధి బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 1,12,31,650కి చేరింది. ఆ రాష్ట్రాల్లో ఎక్కువ రోజువారీ కరోనా కేసులు మహారాష్ట్ర, పంజాబ్, కేరళ, కర్ణాటక, చత్తీస్‌గఢ్, గుజరాత్‌లలోనే ఎక్కువగా బయటపడుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. మొత్తం ఇన్ఫెక్షన్లలో ఈ రాష్ట్రాల్లోనే 80.63%వరకు ఉన్నాయని వెల్లడించింది. యాక్టివ్ కేసులు కూడా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్‌లలోనే 74.32%వరకు ఉన్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో 35,952 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26,00,833కు పెరిగింది. -
సెంచరీ పూర్తి చేసుకున్న సెకండ్‌వేవ్
ముంబై: కోవిడ్‌ను సమర్థంగా అరికట్టడం వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని, లాక్డౌన్లతో సాధ్యం కాదని ఓ నివేదిక తెలిపింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ 100 రోజులపాటు కొనసాగే అవకాశాలున్నాయని అంచనావేసింది. గత నెల నుంచి దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ నివేదికలోని అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాక్సినేషన్‌ను భారీగా వేగంగా అమలు చేసి వైరస్ వ్యాప్తిని ఆపొచ్చని ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సౌమ్యకాంతి ఘోష్ ఒక నివేదికలో స్పష్టం చేశారు. ‘గత ఏడాది ఇదే సమయంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సమయంలో కేసుల సంఖ్య 500లోపే. అయితే, లాక్డౌన్లను పొడిగించుకుంటూ పోయిన కొద్దీ కేసుల సంఖ్య పెరుగుతూ పోయింది’అని ఆయన పేర్కొన్నారు. ‘1918–19 సంవత్సరాల్లో సంభవించిన స్పానిష్ ఫ్లూ సమయంలో కూడా ఆయా దేశాల్లో లాక్డౌన్లు విధించి స్కూళ్లు, చర్చిలు, థియేటర్లను మూసివేశారు. కానీ, లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేశాక పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది’ అని విశ్లేషించారు. దేశంలో ప్రధాన రాష్ట్రాల్లోని ఎక్కువగా ఈ వ్యాధి వ్యాప్తి చెందిన జిల్లాల్లో మరణాలు, కేసుల సంఖ్యను తగ్గించడంలో లాక్డౌన్లు విఫలమయ్యాయన్నారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో లాక్డౌన్ల కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమైనట్లు గూగుల్ మొబిలిటీ డేటా చెబుతోంది. కానీ, ఈ రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయన్నారు. దేశంలో కరోనా వ్యాప్తిని టీకా పంపిణీతోనే నిలువరించగలమని ఆయన తెలిపారు. జనవరి నుంచి కొనసాగుతున్న వ్యాక్సినేషన్ కారణంగా సెకండ్ వేవ్‌లో కేసులు 25 లక్షలకు మించకపోవచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం రోజువారీగా నమోదవుతున్న కొత్త కేసుల తీవ్రతను మొదటి వేవ్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటి పరిస్థితితో పోల్చి చూస్తే ఏప్రిల్ రెండో అర్ధభాగంలో కేసులు అత్యధిక స్థాయికి చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయని సౌమ్యకాంతి ఘోష్ అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మొదలైన సెకండ్ వేవ్ దేశంలో 100 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. ఈ తీవ్రతను ఎదుర్కొనేందుకు టీకా పంపిణీ వేగవంతం కావాలన్నారు. ఇప్పటి వరకు రాజస్తాన్, గుజరాత్, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో 60 ఏళ్లుపైబడిన 20% మంది వ్యాక్సినేషన్ పూర్తయిందనీ, అయితే వృద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న పంజాబ్, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ చాలా తక్కువగా అమలైందని తెలిపారు. రెండో వేవ్ తీవ్రంగా ఉన్నా టీకా అందుబాటులోకి వచ్చినందున కేసులు తగ్గే ఛాన్స్ ఉందన్నారు. -
ముంబైలో 5 వేలకు పైగా కేసులు
సాక్షి ముంబై: ముంబైలో కరోనా భారీగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసుల సంఖ్య 5,000దాటింది. ప్రభుత్వ ఆరోగ్యశాఖ ప్రకటించిన వివరాల మేరకు ముంబైలో 5,190 కేసులు నమోదయ్యాయి. ముంబైలో గత కొన్ని రోజులుగా కోవిడ్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ముంబైలో మంగళవారం 3,514 కరోనా కేసులు కాగా బుధవారం ఈ సంఖ్య సుమారు రెండు వేలు పెరిగింది. ముంబైలో లాక్డౌన్ ఉండదు...! కరోనా కేంద్రంగా మారిన ముంబైలో లాక్డౌన్ విధించే అవకాశాలులేవని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పేర్కొంది. ఓ వైపు కరోనా కేసులు అత్యధికంగా పెరుగుతున్నాయి. మరోవైపు బీఎంసీ అదనపు కమిషనర్ సురేష్ కాకాణి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం లాక్డౌన్ విధించాలని భావించడంలేదన్నారు. అయితే కరోనా విస్తరణను అడ్డుకునేందుకు నియమ నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేయనున్నట్టు చెప్పారు. అదేవిదంగా కరోనా పరీక్షలు మరింత పెంచనున్నట్టు తెలిపారు. మహారాష్ట్ర మరోసారి కరోనా మహమ్మారికి కేంద్రంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ మీడియాకు అందించిన వివరాల మేరకు దేశంలో అత్యధికంగా 10 జిల్లాల్లో కరోనా యాక్టివ్ కేసులుండగా వీటిలో తొమ్మిది జిల్లాలు మహారాష్ట్రలోనివి ఉన్నాయి. మరోవైపు గడిచిన బుధవారం మహారాష్ట్రలో 31,855 కరోనా కేసులు నమోదకాగా కేవలం 15,098 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో 95 మంది మృతి చెందారు. దీంతో రాష్టలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,47,299కి పెరిగింది. -
కేసులు పెరిగిపోతున్నాయి బాబోయ్..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణకు బ్రేకులు పడటం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసులూ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 47,262 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,17,34,058కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 275 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,441కు చేరుకుందని తెలిపింది. దాదాపు 83 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో ఒకేరోజు 270కి పైగా మరణాలు సంభవించాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,05,160కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.49 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,68,457గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.14 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.37గా ఉంది. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 88 శాతం మంది 45 ఏళ్ల వయసు దాటినవారేనని కేంద్రం స్పష్టం చేసింది. వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వయసు వారిలో మరణాల శాతం 2.85గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషన్ చెప్పారు. అందువల్లే 45 ఏళ్లు దాటిన వారందరికీ ఏప్రిల్ 1 నుంచి వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. గత 24 గంటల్లో బయట పడిన కేసుల్లో 77.44 శాతం కేవలం అయిదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిలో మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లు ఉన్నాయి. ఆరు రాష్ట్రాల్లో కలిపి 81.65 శాతం కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 31,855 కేసులు బయటపడ్డాయి. -
రెండు రోజుల్లో 90 వేల కేసులు
న్యూఢిల్లీ/మైసూరు/డెహ్రాడూన్: దేశంలో కేవలం రెండు రోజుల్లో బయటపడిన కేసుల సంఖ్య 90 వేలు దాటింది. గత 24 గంటల్లో 46,951 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,16,46,081కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 212 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,967 కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,11,51,468 కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.75 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,34,646గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 2.87 శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.37గా ఉంది. 80% కేసులు ఆ రాష్ట్రాల్లోనే.. దేశంలో సోమవారం నమోదైన మొత్తం కేసుల్లో 80.5 శాతం కేసులు కేవలం అయిదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మహారాష్ట్రలో అత్యధికంగా 30,535 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 1,78,00,438 కరోనా పరీక్షలు చేయగా అందులో 13.93% పాజిటివిటీ రేటు నమోదైంది. కేసుల సంఖ్య పెరుగుతున్న రాష్ట్రాల్లో తర్వాతి స్థానాల్లో వరుసగా పంజాబ్, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్‌లు ఉన్నాయి. మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని చెప్పింది. ఇదిలా ఉండగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య దేశంలో 4.50 కోట్లకు చేరింది. గత 24 గంటల్లో 14 రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కోవిడ్ మరణం కూడా సంభవించలేదని తెలిపింది. లాక్డౌన్ ఆలోచన లేదు..: కర్ణాటకలో లాక్డౌన్ వార్తలపై ఆరోగ్య మంత్రి కె. సుధాకర్ స్పందించా రు. ప్రస్తుతానికి లాక్‌డౌన్‌గానీ, సెమీ–లాక్‌డౌన్‌గానీ విధించే అవకాశం లేదని చెప్పారు. కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో మైసూరులో మినీ లాక్‌డౌన్‌ను విధించాల్సి ఉంటుందని, ప్రజలు నిబంధనల్ని పాటించాలని కలెక్టర్ రోహిణి సింధూరి తెలిపారు. కరోనా నెగిటివ్ రిపోర్ట్ లేకుండా ఇతర రాష్ట్రాలవారు రావద్దన్నారు. 4–8 వారాల మధ్య కోవిషీల్డ్ రెండో డోసు కోవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య విరామాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించింది. మొదటి డోసు తీసుకున్న తర్వాత 4 నుంచి 6 వారాల మధ్య రెండో డోసు తీసుకోవాలని గతంలో సూచించగా, ప్రస్తుతం దాన్ని 4 నుంచి 8 వారాలుగా సవరించింది. అంటే మొదటి డోసు తర్వాత 4–8 వారాల మధ్య ఎప్పుడైనా రెండో డోసు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. కరోనా టీకా ‘కోవిషీల్డ్’ పంపిణీలో రెండు డోసుల మధ్య సవరించిన విరామాన్ని పాటించాలని సూచించారు. ఇలా తీసుకుంటే కరోనా నుంచి రక్షణ మరింత పెరుగుతున్నట్లు శాస్త్రీయమైన ఆధారాలు లభించాయని రాజేష్ భూషణ్ తెలిపారు. సవరించిన విరామం కోవాగ్జిన్ టీకాకు వర్తించదని స్పష్టం చేశారు. -
‘నిర్లక్ష్యం చేస్తే సెకండ్ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరు’
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. గత 11 రోజులుగా భారీగా కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 43,846 కేసులు నమోదైనట్టుగా ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య కోటి 15 లక్షల 99 వేల 130కి చేరుకుంది. యాక్టివ్ కేసుల శాతం 2.66కి పెరిగింది. మొత్తం 3,09,087 యాక్టివ్ కేసులు న్నాయి. కేసులు ఈ స్థాయిలో పెరిగిపోవడానికి గల కారణాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. కోవిడ్–19 నిబంధనలు ప్రజలు సరిగా పాటించకపోతే దేశాన్ని సెకండ్ వేవ్ నుంచి ఎవరూ కాపాడలేరని ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా హెచ్చరించారు. వీలైనంత త్వరగా అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలని హితవు పలికారు. ప్రజలందరూ వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకొస్తే కరోనా భూతాన్ని తరిమి కొట్టవచ్చునని అన్నారు. జన్యు మార్పిడికి లోనైన వివిధ రకాల వైరస్లు భారత్‌లోకి రావడం, భారీగా జనాల గుమిగూడే కార్యక్రమాలు నిర్వహించడం తాజాగా కేసులు పెరిగిపోవడానికి కారణమని ఆయన చెప్పా రు. ‘‘కరోనా నిబంధనల్ని జనాలు గాలికొదిలేశారు. ముప్పు తప్పిందని అందరూ అనుకుంటున్నారు. వ్యాక్సిన్ కూడా రావడంతో ధీమా పెరిగిపోయింది. ఎక్కువ మందితో పెళ్లిళ్లు, వేడుకలు చేస్తున్నారు. ఇలాంటి భారీ కార్యక్రమాలే కరోనా కేసుల్ని పెంచుతున్నాయి’’ అని రణ్‌దీప్ అంచనా వేశారు. కరోనా కట్టడికి అతి ముఖ్య సూత్రమైన టెస్టింగ్, ట్రాకింగ్, ట్రీటింగ్ విధానాన్ని పాటించడంలో ప్రభుత్వాలు కొద్ది కాలంగా నిర్లక్ష్యం చేస్తున్నాయ న్నారు. వివిధ దేశాల కొత్త మ్యుటేషన్ వైరస్లు కూడా కేసుల తీవ్రతకు కారణమని వివరించారు. దీనిని నిలువరించాలంటే కేసులు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యమివ్వాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వి.కె. పాల్ చెప్పారు. అయిదు రాష్ట్రాల నుంచే 83% కేసులు 4 నెలల్లో అత్యధికంగా రోజువారీ కేసులు 43,846 నమోదైతే, అందులో 83% కేసులు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ నుంచే వచ్చాయి. మహారాష్ట్రలో ఏకంగా 30,535 కేసులు నమోదయ్యాయి. మరో 197 మంది కరోనాతో చనిపోగా మృతుల సంఖ్య 1,,59,755కి చేరుకుంది. లోక్‌సభ స్పీకర్‌కు కరోనా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా(58)కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆయన ఎయి మ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు న్నారు. బిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆస్పత్రి వర్గాలు ఆదివారం తెలిపాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో ఆంక్షలు జైపూర్/భోపాల్: రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు ప్రకటించాయి. రాజస్తాన్ ప్రభుత్వం సోమవారం నుంచి 8 నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చే వారు 72 గంటల్లోపు తీసుకున్న కోవిడ్ నెగెటివ్ రిపోర్టును చూపించాలని లేదంటే 15 రోజులపాటు క్వారంటైన్లో గడపాలని తెలిపింది. ఇండోర్‌లో లాక్డౌన్ మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, జబల్పూర్ నగరాల్లో ఆదివారం వీధులు బోసిపోయాయి. ఈ నగరాల్లో ప్రతి శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి భోపాల్, ఇండోర్ జిల్లాల్లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. -
కేసులు పెరుగుతున్నాయి.. తస్మాత్ జాగ్రత్త!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో ఏకంగా 27,126 కొత్త కేసులు బయటపడటంతో, దేశవ్యాప్తంగా ఈ రోజు నమోదైన కొత్త కేసుల సంఖ్య 40 వేలు దాటింది. గత 24 గంటల్లో దేశంలో 40,953 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. గత 111 రోజుల్లో ఒక రోజులో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,15,55,284కు చేరుకుందని కేంద్రఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా 188 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,59,558కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,11,07,332కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 96.12 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2,88,394గా ఉంది. క్రమంగా పెరుగుదల ఇటీవల దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రత్యేకించి 8 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ పెరుగుదల కనిపిస్తోందని తెలిపింది. వాటిలోనూ మహారాష్ట్ర, కేరళ పంజాబ్ రాష్ట్రాల్లోనే 76.22 శాతం యాక్టివ్ కేసులు కేంద్రీకృతమై ఉన్నట్లు వెల్లడించింది. మహారాష్ట్రలోని పుణే, నాగ్‌పూర్, ముంబై, థానే, నాసిక్ జిల్లాల్లో కోవిడ్ ప్రబలం ఎక్కువగా ఉండగా, కేరళలోని ఎర్నాకులం, పథానంతిట్ట, కన్నూర్, పాలక్కడ్, త్రిస్సూర్ జిల్లాల్లో కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉంది. మరోవైపు పంజాబ్‌లోని జలంధర్, ఎస్ఏఎస్ నగర్, పటియాలా, లూధియానా, హొషిర్‌పూర్‌లలో కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న రాష్ట్రాల్లో వీటితో పాటు తమిళనాడు, పంజాబ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, కర్ణాటక, హరియాణాలు ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రేకు కరోనా సోకింది. నాగ్‌పూర్‌లో నిబంధనలు మహారాష్ట్రలో కోవిడ్ విస్తరిస్తున్న వేళ నాగ్‌పూర్ జిల్లాలో లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకూ పొడిగిస్తున్నట్లు మంత్రి నితిన్ రౌత్ చెప్పారు. ఇటీవల మార్చి 15 నుంచి 21 వరకూ కోవిడ్ ఆంక్షలను విధిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. నేటితో ఆ గడువు ముగియనున్న నేపథ్యంలో లాక్‌డౌన పొడిగిస్తున్నట్లు చెప్పారు. అయితే కొద్దిమేర నిబంధనలను సడలిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యవసర వస్తువులను సాయంత్రం 4 గంటల వరకు అమ్ముకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని, సాయంత్రం 7 వరకూ రెస్టారెంట్లను తెరచి ఉంచేలా నిబంధనలు సడలించినట్లు చెప్పారు. రాత్రి 11 వరకూ ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. నాగపూర్ జిల్లాలో శనివారం 3,679 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. (చదవండి: వ్యాక్సిన్ వేయించుకోండి.. వివాహానికి రండి!) -
దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ
ముంబై/చండీగఢ్: దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ ఆంక్షలు తిరిగి అమల్లోకి వస్తున్నాయి. మహారాష్ట్రలోనూ, పంజాబ్‌లోని 11 జిల్లాల్లోనూ కోవిడ్ ఆంక్షలను పెడుతున్నట్లు ఆయా రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు. మార్చి 31 వరకు డ్రామా థియేటర్లు, ఆడిటోరియాలలో కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలంటూ మహారాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. గత 24 గంటల్లో ఏకంగా 25 వేలకు పైగా కేసులు నమోదు కావడంతో ప్రభుత్వం ఈ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. ఆరోగ్యం, అత్యవసర సేవలకు సంబంధించినవి తప్ప మిగిలిన ప్రభుత్వం, సెమీ–గవర్నమెంట్ కార్యాలయాలన్నీ కోవిడ్ నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. ఆడిటోరియాలలో మత, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక సమావేశాలు జరపరాదని స్పష్టం చేసింది. నియమాలను ఉల్లంఘిస్తే ఆయా ప్రదేశాల యజమానులపై పెనాల్టీలు పడతాయని తెలిపింది. తయారీ రంగానికి మాత్రం పూర్తి స్థాయి కార్మికులతో పని చేసుకోవడానికి అనుమతిచ్చింది. లాక్డౌన్ ఐచ్ఛికం మాత్రమేనని, ప్రజలు నిబంధనలు పాటిస్తారని నమ్ముతున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. పంజాబ్‌లో 11 జిల్లాల్లో.. మరణాలు, పెళ్లిళ్లకు 20 మంది మాత్రమే హాజరు కావడం తప్ప మిగిలిన అన్ని రకాల కార్యక్రమాలకు గుంపులుగా హాజరు కావడాన్ని నిషేధిస్తున్నట్లు పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరీందర్æ సింగ్ ప్రకటించారు. కోవిడ్ ప్రభావం అధికంగా ఉన్న 11 జిల్లాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. అన్ని రకాల విద్యా సంస్థలను నెలాఖరు వరకు మూసేస్తున్నట్లు చెప్పారు. -
కేసులు పెరుగుతున్నాయి.. జాగ్రత్త!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్బోధించారు. రెండో వేవ్‌గా పేర్కొంటున్న ఈ పెరుగుదలను అడ్డుకునేందుకు తక్షణమే నిర్ణయాత్మకంగా స్పందించాలని కోరారు. ‘టెస్ట్, ట్రేస్, ట్రీట్’ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలన్నారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు మైక్రో కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ బుధవారం వర్చువల్‌గా సమావేశమై, కరోనా పరిస్థితిని, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు. కరోనా వైరస్‌ను అడ్డుకునే శక్తిమంతమైన ఆయుధం టీకాయేనని, అందువల్ల రాష్ట్రాలు టీకా కేంద్రాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాని సూచించారు. మహారాష్ట్ర, పంజాబ్‌ల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా 70 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 150 శాతానికి పైగా పెరిగిందని ప్రధాని ఆందోళన వెలిబుచ్చారు. దీన్ని అడ్డుకోనట్లయితే, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడే ప్రమాదముందన్నారు. గతంలో కరోనా కేసులు అత్యంత కనిష్టంగా నమోదైన రెండో, మూడో స్థాయి పట్టణాల్లోనూ ప్రస్తుతం కేసుల్లో పెరుగుదల కనిపిస్తోందన్నారు. కరోనా మహమ్మారిని భారత్ విజయవంతంగా ఎదుర్కోవడానికి కారణం, ఆ వైరస్ గ్రామాలకు చేరకపోవడమేనన్న ప్రధాని.. ఇప్పుడు పట్టణాల ద్వారా గ్రామాలకు ఆ వైరస్ వ్యాపించే ప్రమాదముందన్నారు. అలా జరిగితే, వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రస్తుతమున్న యంత్రాంగం సరిపోని పరిస్థితి నెలకొంటుందని హెచ్చరించారు. వైరస్‌ను నిర్ధారించేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్షలనే ఎక్కువగా చేయాలని, మొత్తం పరీక్షల్లో ఆర్టీపీసీఆర్ వాటా 70 శాతానికి పైగా ఉండేలా చూడాలని రాష్ట్రాలను కోరారు. చత్తీస్‌గఢ్, కేరళ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఎక్కువగా యాంటిజెన్ టెస్ట్‌లపై ఆధారపడుతున్నాయని, ఇది సరికాదని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ను సీరియస్‌గా తీసుకోవాలని, అదే సమయంలో టీకాలు వృధా కాకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో 10% వరకు టీకాలు వృధా అవుతున్నాయని, యూపీలోనూ అదే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశాల నుంచి వచ్చినవారిపై, వారిని కలిసిన బంధుమిత్రులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ‘కరోనాను ఎదుర్కోవడంలో దేశం చూపిన ఆత్మవిశ్వాసం అతివిశ్వాసంగా.. వైరస్‌పై సాధించిన విజయం నిర్లక్ష్యంగా మారకుండా చూసుకోవాలి’ అని సూచించారు. దేశంలో చాలా చోట్ల మాస్క్‌లను ధరించడం లేదన్నారు. ‘దవాయి భీ.. కడాయి భీ’(వైద్యంతో పాటు జాగ్రత్త చర్యలు కూడా) మంత్రాన్ని గుర్తు చేస్తూ.. మాస్క్‌లను ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలను ప్రజలు కచ్చితంగా పాటించేలా చూడాలన్నారు. అదే సమయంలో, ప్రజల్లో భయాందోళనలు పెరగకుండా చూసుకోవాలని కోరారు. వైరస్ వేరియంట్లను గుర్తించేందుకు వీలుగా శాంపిల్స్‌ను ల్యాబ్స్‌కు పంపించాలని కోరారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోందని, ఇటీవల ఒకే రోజులో30 లక్షల టీకాలను ఇచ్చారని పేర్కొన్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన జిల్లాల జాబితాను కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితిని ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు. పశ్చిమబెంగాల్, చత్తీస్గఢ్సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేర్వేరు కారణాలతో ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తరువాత ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ కావడం ఇదే ప్రథమం.