సాక్షి , న్యూఢిల్లీ: ఒకప్పుడు అమెరికా, బ్రెజిల్‌లలో ప్రతిరోజూ లక్షలాదిగా కొత్తకేసులు రావడం చూసి... వామ్మో అనుకున్నాం. చిగురుటాకులా వణికిపోయిన అగ్రదేశంపై అయ్యో పాపమని జాలిపడ్డాం. కానీ తాజా పరిణామాలను చూస్తుంటే మనమూ అదే పరిస్థితుల్లోకి వెళుతున్నట్లు స్పష్టమవుతోంది. వారం రోజులుగా కరోనా గణాంకాలు దేశ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. వారం రోజుల్లో దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ప్రపంచంలోనే భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టింది.
ఏప్రిల్ 12 –18వ తేదీల మధ్య, భారత్‌లో 64% వృద్ధి రేటుతో 15.34 లక్షల మంది కరోనా బారినపడగా, 8,590 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలో భారీగా కేసులు వస్తున్న దేశాలతో పోల్చిచూస్తే గతవారం భారత్‌లోనే అత్యధిక కేసులు నమోదయ్యాయి. వారం రోజుల్లో ప్రపంచంలో కొత్తగా కరోనా బారినపడ్డ వారిలో 30% వాటా భారత్‌దే.
అదే సమయంలో అమెరికాలో 2 శాతం వృద్ధిరేటుతో 4.71 లక్షల మంది, బ్రెజిల్‌లో –7% వృద్ధిరేటుతో 4.61 లక్షల మంది, టర్కీలో 17% వృద్ధిరేటుతో 4.19 లక్షలమంది, ఫ్రాన్స్‌లో –10% వృద్ధిరేటుతో 2.30 లక్షల మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు.
19 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు
ప్రపంచంలో అమెరికా తరువాత అత్యధిక యాక్టివ్ కేసులు భారతదేశంలోనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 19,29,329 కు పెరిగాయి. రికవరీ రేటు 86 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో 1,44,178 మంది కరోనాను ఓడించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,29,53,821 కు చేరింది. రోజువారీ కేసులతో పోలిస్తే రికవరీలు సగం ఉండడమనేది ఆందోళనకరంగా మారింది. ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటి‡వరకు 26,78,94,549 శాంపిల్స్‌ను పరీక్షించగా, వాటిలో 13,56,133 శాంపిల్స్‌ను కేవలం ఆదివారం పరీక్షించారు. మరోవైపు దేశంలో ఇప్పటివరకు 12,69,56,032 మందికి టీకాలు వేశారు.
79.25%... 10 రాష్ట్రాల్లోనే
దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 68,631 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 503 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కేసుల సంఖ్య 6,70,388కు చేరుకుంది. దేశంలోని 10 రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్‌లో 3 నెలలు ఉచితరేషన్
కరోనాపై పోరాటానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని 4 పెద్ద నగరాలు భోపాల్, ఇండోర్, గ్వాలియర్, జబల్‌పూర్‌ల్లో 2 వేల పడకల కోవిడ్ హాస్పిటల్స్ ప్రారంభించనుంది. పేదలకు (బీపీఎల్ కార్డు ఉన్నవారికి) 3 నెలల పాటు ఉచిత రేషన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సింగిల్ డే... 2,73,810
సోమవారం విడుదలైన గణాంకాలు ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను బద్దలు కొట్టేశాయి. దేశంలో అత్యధికంగా ఒకే రోజు 2,73,810 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారించారు. వైరస్ సంక్రమణతో 1,619 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.ఎక్కువగా కోవిడ్–19 ప్రభావితమైన రాష్ట్రాల్లో రోగులకు పడకలు, వెంటిలేటర్లు, రెమిడెసివిర్, ఆక్సిజన్ కొరత స్పష్టంగా కనిపిస్తోంది. గత సంవత్సరం కరోనా సంక్రమణ ప్రారంభమైన తరువాత, దేశవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన రోగుల సంఖ్య 1.5 కోట్లు దాటింది. దేశంలోని మొత్తం కరోనా కేసుల సంఖ్య కేవలం 15 రోజుల్లోనే 1.25 కోట్ల నుంచి 1.5 కోట్లకు చేరుకోవడం గమనార్హం. ఇందులో 1 కోటి 29 లక్షల 47 వేల 297 మంది కోలుకున్నారు. అదే సమయంలో గత 24 గంటల్లో కరోనా కారణంగా మరణించిన 1,619 మందితో కలిసి కోవిడ్‌కు బలైన వారి సంఖ్య 1,78,769 కు చేరుకుంది. దేశంలో కోవిడ్ మరణాల శాతం 1.19గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment