ఢిల్లీలోని ఓ చర్చి వద్ద ప్రజలు గుమికూడకుండా ఏర్పాటు చేసిన బారికేడ్లు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని అధిక కేసులు నమోదవుతున్న 10 రాష్ట్రాలకు కేంద్రం సహాయ బృందాలను పంపింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, మిజోరాం, కర్ణాటక, బిహార్, యూపీ, జార్ఖండ్, పంజాబ్‌ల్లో కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ రేటు తక్కువగా ఉండడంతో నిపుణుల బృందాలను పంపామని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఈ బృందాలు ఆయా రాష్ట్రాల్లో 3–5 రోజులుండి రాష్ట్ర ఆరోగ్య అధికారులతో కలిసి పనిచేస్తాయని తెలిపింది. కాంటాక్ట్ ట్రేసింగ్, కంటైన్మెంట్, తగినన్ని శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడంపై ఈ బృందాలు ప్రత్యేక శ్రద్ధ పెడతాయి.
కోవిడ్ నిబంధనల అమలు, ఆస్పత్రుల్లో పడకల వివరాలు, అంబులెన్సులు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ లభ్యత, టీకా కార్యక్రమంపై సమీక్ష చేస్తాయి. ఆవివరాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతాయి. ఒమిక్రాన్ ఉధృతిని దృష్టిలో ఉంచుకొని నూతన సంవత్సర వేడుకలపై నిషేధం విధిస్తున్నట్లు బీఎంసీ(బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్) ప్రకటించింది. బీఎంసీ పరిధిలోని ఎక్కడా ఉత్సవాలు జరపకూడదని కమిషనర్ ఇక్బాల్ సింగ్ స్పష్టం చేశారు. డిసెంబర్ 25 అర్ధరాత్రి నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఇప్పటికే ముంబైలో రాత్రి పూట ఐదుగురికి మించి గుమికూడడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
భారత్‌లో 400 దాటిన ఒమిక్రాన్ కేసులు
ఇండియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య శనివారానికి 415కు చేరింది. వీరిలో 115మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర(108)లో నమోదయ్యాయి. తర్వాత స్థానాల్లో ఢిల్లీ(79), గుజరాత్(43), తెలంగాణ(38), కేరళ(37), తమిళనాడు(34), కర్ణాటక(31) ఉన్నాయి. దేశంలో గడిచిన 24గంటల్లో 7,189 కరోనా కేసులు, 387 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 58వ రోజు కూడా కొత్త కేసులు 15వేలకు లోపు నమోదు కావడం విశేషం. అదేవిధంగా మొత్తం యాక్టివ్ కేసులు 77,032కు చేరాయి. మొత్తం ఇన్‌ఫెక్షన్లలో ఇది 0.22 శాతానికి సమానం.
Comments
Please login to add a commentAdd a comment