న్యూఢిల్లీ: రోజుకో కొత్త రకం వేరియంట్‌తో భారత్‌ను ముప్పతిప్పలు పెట్టిన కరోనా నుంచి భారత్‌కు ఉపశమనం లభించినట్లేనా? సెకండ్ వేవ్‌తో జనజీవనాన్ని ఛిద్రం చేసిన కోవిడ్ మహమ్మారి దేశంలో ఇక తగ్గుముఖం పట్టినట్లేనా? అంటే వైద్య నిపుణులు అవుననే అంటున్నారు. పట్ట పగ్గాల్లేని కరోనా దూకుడుకు ఫుల్‌స్టాప్ పడినట్లేనన్న ఆరోగ్యరంగ నిపుణుల అంచనాలతో దేశ ఆర్థిక రంగం మళ్లీ పట్టాలెక్కనుందనే శుభసూచనలు కనిపిస్తున్నాయి.
దీపావళి పర్వదినం తర్వాత గడచిన మూడు వారాలుగా తగ్గుముఖం పడుతున్న కరోనా కొత్త కేసుల సంఖ్యే ఇందుకు మేలిమి ఉదాహరణ. దసరా, దీపావళి, కాళీపూజ తదితర పండుగల సీజన్ అయిన అక్టోబర్, నవంబర్ కాలంలో వైరస్ విజృంభణతో దేశంలో పరిస్థితి అదుపుతప్పవచ్చని అంతటా భయాందోళనలు పెరిగాయి. అయితే, ఆ గండం నుంచి గట్టేకేశాం. పండుగల సీజన్ ముగిశాక కూడా కొత్త కేసులు అత్యల్ప స్థాయిల్లోనూ నమోద వుతున్నాయి.
సెకండ్ వేవ్ కాలంలోనే దేశ జనాభా లో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అయితే 98.32 శాతం రికవరీ రేటుతో దాదాపు అందరూ కోలుకున్నారు. కోవిడ్‌ను జయించిన వీరందరి లోనూ కరోనా యాంటీబాడీలు పెరిగాయి. మరోవైపు భారత్‌లో కోవిడ్ టీకా కార్యక్రమం జోరందుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 117.63 కోట్ల డోస్‌లను ప్రభుత్వం అందజేసింది. దీంతో కోవిడ్ టీకా తీసుకున్న కోట్లాది మందిలో కరోనా యాంటీబాడీలు పెరిగాయి. ఒక వైపు కోవిడ్‌ను జయించి, మరోవైపు వ్యాక్సినేషన్ ద్వారా రెండు రకాలుగానూ వయోజనుల్లో కరోనా యాంటీబాడీలు అభివృద్ధి చెందాయి.
కరోనా నుంచి కోలుకున్న వారిలో టీకా తీసుకోకమునుపే ‘హైబ్రిడ్ ’ ఇమ్యూనిటీ పెరుగుతుంది. కరోనా రాని వారు టీకా తీసుకుంటే పెంపొందే యాంటీబాడీల కంటే హైబ్రిడ్ ఇమ్యూనిటీ మరెంతో మెరుగ్గా వైరస్‌ను ఎదుర్కోగలదు. ఇలా ‘హైబ్రిడ్’ ఇమ్యూనిటీని సంతరించుకున్న భారత్‌లో కరోనా మూడోవేవ్ పొద్దు పొడవక పోవచ్చని వైద్య నిపుణులు ధీమాగా చెబుతున్నారు. అయితే, కొత్త వేరియంట్ ముప్పు, శీతాకాలంలో దట్టంగా కమ్మేసే చలి వాతావరణం వంటి సవాళ్లు ఎల్లపుడూ సిద్ధంగా ఉంటాయని, సరైన జాగ్రత్తలతో ఆ ప్రమాదాన్ని ముందే నివారించవచ్చని ఆరోగ్యరంగ నిష్ణాతులు హెచ్చరిస్తున్నారు.
వారికి గతంలోనే కరోనా సోకింది
‘దేశంలో డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి పెరిగాక కూడా తక్కువ కేసులు నమోదయ్యాయంటే ..అప్పటికే జనాభాలో ఎక్కువ మందికి కరోనా సోకి, తగ్గిపోయిందని అర్ధం. దేశవ్యాప్తంగా పలు సీరో సర్వేల్లో తేలింది ఇదే’ అని శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి(సీఎస్‌ఐఆర్)– ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్, ఇంటిగ్రేటివ్ బయోలజీ(ఐజీఐబీ) డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ స్పష్టంచేశారు. ప్రస్తుతం భారత ‘పరిస్థితి’ బాగానే ఉందని, భవిష్యత్‌లో వెలుగుచూసే తేలిగ్గా లొంగని వైరస్ వేరియంట్లతో పరిస్థితిలో ‘మార్పు’లు రావచ్చని ఆయన వ్యాఖ్యానించారు. కోవిడ్ నుంచి కోలుకోవడం, వ్యాక్సినేషన్ వల్లే దేశంలో కోవిడ్ తీవ్రత తగ్గుతోందని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ మరో పరిశోధకురాలు వినీతా బాల్ అన్నారు.
డిసెంబర్–ఫిబ్రవరిలో అప్రమత్తత అవసరం
చుట్టేస్తున్న చలి, కొత్త వేరియంట్‌లు ఉద్భవిస్తే డిసెంబర్–ఫిబ్రవరి కాలంలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని, అయితే సెకండ్ వేవ్ నాటి దుర్భర పరిస్థితులు ఉండబోవని సోనిపట్‌లోని అశోకా విశ్వవిద్యాలయ బయోలజీ విభాగం ప్రొఫెసర్ గౌతమ్ మీనన్ విశ్లేషించారు. ‘ వ్యాక్సినేషన్ భారీ ఎత్తున కొనసాగుతున్న ఈ తరుణంలో వైరస్ ప్రభావం తీవ్రస్థాయిలో ఉండబోదు. ఆస్పత్రిలో చేరడం, మరణం సంభవించే స్థాయి ప్రమాదకర పరిస్థితులు ఉండవు. కోవిడ్ నుంచి కోలుకున్నాక టీకా తీసుకున్న వారికి రెండోదఫా కోవిడ్ నుంచి గణనీయమైన రక్షణ లభిస్తుంది’ అని ఆయన అభిప్రాయపడ్డారు. జులైలో ఐసీఎంఆర్ నాలుగో జాతీయ సీరో సర్వే ప్రకారం దేశజనాభాలో 67.6 శాతం మందిలో కోవిడ్ యాంటీబాడీలు ఉన్నాయి. వయోజనుల్లో 82 శాతం మంది తొలి డోస్ తీసుకున్నారు. 43 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయింది
మూడో వేవ్ వచ్చి, వెళ్లింది!
చెన్నైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్సెస్ ప్రొఫెసర్ సితభ్ర సిన్హా వాదన మరోలా ఉంది. ‘ యూరప్‌లోని థర్డ్ వేవ్‌కు భారత్‌లోని రెండో వేవ్‌కు చాలా సారూప్యత ఉంది. నా ఉద్దేశం ప్రకారం భారత్‌లో మూడో వేవ్ సెప్టెంబర్ మధ్యలోనే వచ్చి, అంతర్థానమైంది’ అని ఆయన అంచనావేశారు. కాగా, ముంబై, పుణె, చెన్నై, కోల్‌కతా నగరాల్లో ఆర్–వాల్యూ 1 కంటే ఎక్కువగా ఉంటోందని ఆయన హెచ్చరించారు.
543 రోజుల కనిష్టానికి కేసులు
దేశంలో గత 24 గంటల్లో అత్యల్పంగా 7,579 కరోనా కొత్త కేసులు నమోద య్యాయి. గత 543 రోజుల్లో ఇంత తక్కువ సంఖ్యలో కేసులు రావడం ఇదే ప్రథమమని కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది. కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కేసుల సంఖ్య 3,45,26,480కు పెరిగింది. మరో 236 మంది కోవిడ్‌తో కన్నుమూశారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,66,147కు పెరిగింది. ఇప్పటిదాకా 3,39,46,749 మంది కోవిడ్ కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,13,584కు తగ్గింది. ఇంత తక్కువ యా క్టివ్ కేసులుం డటం గత 536 రోజుల్లో ఇదే తొలిసారి. పాజిటివిటీ రేటు 0.79శాతానికి చేరుకుంది. మరణాల రేటు 1.35 శాతంగా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment