న్యూఢిల్లీ: భారత్‌లో ఒక్కరోజే 22,775 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. రోజూవారీ కొత్త కేసులు అత్యధికంగా నమోదు కావడం అక్టోబర్ 6 తర్వాత ఇదే తొలిసారి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా భారత్‌లో కోవిడ్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. మూడురోజులపాటు వరుసగా 9 వేలు, 13 వేలు, 16వేల పైచిలుకు డైలీ కేసులు నమోదు కాగా శుక్రవారం దాదాపు 23 వేల కేసులు నమోదు కావడం గమనార్హం. కొత్త కేసుల్లో ఒమిక్రాన్ కేసులు 161 ఉన్నాయి.
దీంతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల 1,431కి చేరాయని, అదేవిధంగా దేశంలో యాక్టివ్ కేసులు లక్షను దాటాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నూతన కేసుల్లో అత్యధికం మహారాష్ట్రలో అది కూడా ముంబైలో నమోదయ్యాయి. దేశీయ డైలీ పాజిటివిటీ రేటు 2.05 శాతం వద్ద ఉండగా, వీక్లీ రేటు 1.10 శాతం వద్ద ఉంది. 24 గంటల్లో కరోనాతో కొత్తగా 406 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఇంతవరకు 145కోట్ల టీకా డోసులిచ్చారు. మరోవైపు టీనేజర్ల టీకా రిజిస్ట్రేషన్ శనివారంనుంచి కోవిన్ పోర్టల్‌లో మొదలైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ చెప్పారు. అర్హులైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. వీరికి జనవరి 3 నుంచి టీకాలిస్తారు.
10 మంది మంత్రులకు కరోనా
మహారాష్ట్రలో 10మందికి పైగా మంత్రులకు కనీసం 20 మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పారు. అందువల్లే రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు తొందరగా ముగించామని వెల్లడించారు. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా ముంబై, పుణెలో కేసులు వేగంగా పెరుగుతున్నాయని చెప్పారు. కేసులు ఇలాగే పెరిగితే రాష్ట్రంలో కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు. కరోనా సోకిన రాజకీయ ప్రముఖుల్లో ఎంపీ సుప్రియా సూలే, మంత్రులు వర్షా గైక్వాడ్, యోశ్మతీ ఠాకూర్, కేసీ పద్వి, జితేందర్ అవ్హద్, ధనుంజయ్ ముండే, దిలీప్ వాల్సె తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment