దేశంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ XE ముంబైలో తొలి కేసు వెలుగు చూసింది. జెనెటిక్ ఫార్ములా డిటర్మినేషన్‌లో భాగంగా మొత్తం 230 శాంపిల్స్‌ను పరీక్షించగా 228మందికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. ఒక శాంపిల్‌లో కప్పా రకం వైరస్ బయటపడగా.. మరో వ్యక్తికి XE వేరియంట్ సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే మే, జూన్ నెలలో ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు అంచనా వేశారు. మరి XE వేరియంట్ దేశంలో వైరస్ నాలుగో దశ విజృంభణకు కారణమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జనవరి 19న మొదటిసారిగా బ్రిటన్‌లో XE వేరియంట్ వెలుగుచూసింది. ఒమిక్రాన్‌లోని రెండు ఉపరకాల కలయికతో ఈ రకం పుట్టినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఈ మ్యూటెంట్‌కు వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉందని WHO ఇటీవలే హెచ్చరించింది. తాజాగా ముంబైలో XE కేసు నిర్థారణ కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న XE వేరియంట్ లక్షణాలు ఇంకా పూర్తిస్థాయిలో గుర్తించలేదు.
సంబంధిత వార్త: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం
కొత్త వేరియంట్ లక్షణాలు
అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ తరహాలోనే ఈ సబ్ వేరియంట్ సోకిన వారికి జలుబు, ముక్కు కారడం, తుమ్ములు, గొంతునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 600 మంది XE వేరియంట్ బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు పేర్కొన్నాయి. తాజాగా భారత్‌లో XE వేరియంట్ వెలుగుచూడటంతో ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడం వల్ల వైరస్ ఉధృతిని అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే ముంబై బీఎంసీ అధికారులు చెప్పిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసును కేంద్ర వైద్యారోగ్యశాఖ ఇంకా నిర్ధారించలేదు.
Comments
Please login to add a commentAdd a comment