ముంబైలో కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో నిర్మానుష్యంగా గేట్‌వే ఆఫ్ ఇండియా ప్రాంతం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతుండడంతో ముందు జాగ్రత్తగా పాఠశాలలను మూసివేస్తూ/ తరగతులను రద్దు చేస్తూ కొన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లను నిరవధికంగా మూసివేస్తున్నట్లు గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాలు ప్రకటించాయి. ఇక తరగతులను రద్దు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, పంజాబ్ ప్రభుత్వాలు వెల్లడించాయి. ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు పాఠాలు బోధించాలని పాఠశాలల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశాయి. తదుపరి ఉత్తర్వులు విడుదల చేసే వరకూ విద్యార్థులెవరూ పాఠశాలలకు రావొద్దని ఢిల్లీ సర్కారు స్పష్టం చేసింది. 9వ తరగతి వరకూ పాఠశాలలను ఏప్రిల్ 5 నుంచి రెండు వారాల పాటు మూసివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం తెలియజేసింది.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 8వ తరగతి వరకు స్కూళ్ల మూసివేత గడువును ఏప్రిల్ 11 దాకా పొడిగించింది. మహారాష్ట్రలో 10, 12వ తరగతుల విద్యార్థులు, పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు మాత్రమే క్లాసులకు హాజరు కావొచ్చని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏప్రిల్ 10 దాకా స్కూళ్లను మూసివేస్తున్నట్లు పంజాబ్ ప్రభుత్వం పేర్కొంది. గుజరాత్, రాజస్తాన్‌లోనూ స్కూళ్లు మూతపడ్డాయి. బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరిలో కరోనా కారణంగా స్కూళ్లకు తాళాలేయడంతో చదువులకు ఆటంకం కలుగుతోంది. మహమ్మారి ఇప్పట్లో అదుపులోకి వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో మూసివేత గడువును ప్రభుత్వాలు ఇంకా పొడిగిస్తున్నాయి.
షిర్డీ ఆలయం మూసివేత
కేసులు శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీ సాయి ఆలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం రాత్రి నుంచి తిరిగి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మూసే ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్‌ను కట్టడి చేసేందుకు షిర్డీ ఆలయంతో పాటు ఇతర దేవాల యాలన్నింటిని మూసేస్తున్నట్లు చెప్పింది. షిర్డీ ఆలయం మూసినప్పటికీ, అర్చకుల ఆధ్వర్యంలో నిత్య పూజలు కొనసాగుతూనే ఉంటాయని శ్రీ షిర్డీ సాయిబాబా ట్రస్టు ముఖ్య కార్యనిర్వహణాధికారి రవీంధ్ర ఠాక్రే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment