నిర్లక్ష్యమే ముంచుతోంది..! | Corona Virus Cases Rises In East Godavari District | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యమే ముంచుతోంది..!

Published Sat, Apr 11 2020 7:17 AM | Last Updated on Sat, Apr 11 2020 7:27 AM

Corona Virus Cases Rises In East Godavari District - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: కొందరి నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలంటే విడివిడిగా కలివిడిగా ఉండాలని అధికారులు, వివిధ వర్గాల మేధావులు చెబుతున్నారు. అయినా అన్నీ తెలిసిన వారే ఉదాసీనంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ముందస్తు చర్యలు ఎన్ని తీసుకున్నా రాజమహేంద్రవరంలో లండన్‌ నుంచి వచ్చిన యువకుడికి తొలి పాజిటివ్‌ కేసుగా నమోదైంది. అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలకు శ్రీకారం చుట్టింది. విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించి స్వీయ నిర్బంధం, క్వారంటైన్, ఐసోలేషన్‌లో పెట్టడం ద్వారా కరోనా కట్టడికి కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణలో వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీసు తదితర శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి.

ఇంతలో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు, వారితో కలిసిన కారణంగా అటు రాజమహేంద్రవరం, ఇటు కాకినాడ నగరాల్లో రెండేసి, కొత్తపేటలో మూడు పాజిటివ్‌ కేసులు పెరగడానికి కారణమయ్యారు. గడచిన నాలుగు రోజులుగా జిల్లాలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాకపోవడంతో ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో కత్తిపూడిలో గురువారం ఒక పాజిటివ్‌ కేసు నమోదయింది. విశాఖపట్నం వాసికి ఇక్కడ పాజిటివ్‌గా నమోదైంది, జిల్లాకు పెద్దగా ప్రమాదమేదీ లేదని అంతా అనుకున్నారు. శుక్రవారం సాయంత్రం అయ్యేసరికి కత్తిపూడి పాజిటివ్‌తో ప్రాథమిక కాంట్రాక్ట్‌ అయిన కుటుంబ సభ్యులు, వారి ద్వారా ఇరుగుపొరుగుతో కలిసి ఐదు పాజిటివ్‌ కేసులు వచ్చాయి. దీంతో జిల్లాలో మొత్తం 17 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

కత్తిపూడి రెడ్‌జోన్‌ ప్రాంతాన్ని సందర్శించిన కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి
అలక్ష్యమే ప్రధాన కారణం 
కరోనాపై ముందస్తు చర్యలు ఎన్ని తీసుకున్నా ఒకరిద్దరి నిర్లక్ష్యంతో ఇంతటి మూల్యం చెల్లించుకోవడం తప్పలేదు. లాక్‌డౌన్‌ అమలులో భాగంగా నిత్యావసర వస్తువుల మార్కెట్‌లు, రైతు బజార్‌ల్లో భైతిక దూరం పాటించేలా అనేక చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో అయినా ప్రజల్లో ఇంకా పూర్తి స్థాయిలో మార్పు రాకపోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ముందస్తు చర్యల కోసం జిల్లా యంత్రాంగం నిరంతర నిఘాతో నిద్రలేని రాత్రులు గడుపుతుంది. ‘భౌతిక దూరం పాటించండి–కరోనా దరి చేరనివ్వకండ’ంటూ బతిమలాడుతున్నా కొంతమందిలో ఉదాసీనత నెలకుంటోంది.  చదవండి: రెండు వారాల్లో కరోనా క్లియర్‌

విజ్ఞప్తులు బుట్టదాఖలు 
జిల్లాలో ఎవరైనా జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లా యంత్రాంగాన్ని సంప్రదించాలని వెళ్లిన ప్రతి చోటా అధికారులు పదేపదే చెబుతూనే ఉన్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు, పెద్దాపురం, పిఠాపురం, కొత్తపేటలలో పాజిటివ్‌ కేసులు నమోదైన సందర్భంలో స్వయంగా జిల్లా కలెక్టర్‌ మీడియా సమావేశం పెట్టి మరీ పై లక్షణాలున్న వారు ధైర్యంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రజల్లో మరింత అవగాహన కల్పించి వారిలో కరోనా పరీక్షలపై నెలకొన్న ఆత్మన్యూనతా భావాన్ని తొలగించి వారికి మనో ధైర్యాన్ని నింపేందుకు స్వయంగా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి సహా ఎంపీ గీత తదితరులు కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 24 వేల పై చిలుకు వలంటీర్లు, ఆశ, అంగన్‌వాడీ వర్కర్లు ఇలా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని తెలుసుకుంటున్నారు. 

పదిమందికీ చెప్పాల్సినవారే ఇలా... 
ఇంత చేస్తున్నా కరోనా పరీక్షలంటే ప్రజలు ముందుకు రావడానికి జంకుతున్నారు. నిరక్షరాస్యులు, సమాజ పోకడలు తెలియని వారంటే సరిపెట్టుకోవచ్చు. కానీ కత్తిపూడిలో గురువారం నమోదైన పాజిటివ్‌ కేసు సమాజానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తయారుచేసే ఉపాధ్యాయుడు కావడం గమనార్హం. అతడు గత నెల 25న ఉగాదికి పాయకరావుపేట మండలం అత్తకోట నుంచి కత్తిపూడి అత్తారింటికి వచ్చారు. రెండు, మూడు రోజుల నుంచి గొంతు నొప్పి, జలుబు, దగ్గుతో బాధపడుతూ ఆర్‌ఎంపీతో వైద్యం, అక్కడే ల్యాబ్‌ టెక్నీషియన్‌తో మలేరియా రక్త పరీక్షలు చేయించుకున్నారే తప్ప కరోనా పాజిటివ్‌ పరీక్షలకు బయటకు రాలేదు. ఈ విషయం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ విస్మయానికి గురయ్యారు.

అన్నీ తెలిసిన ఉపాధ్యాయుడు కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తున్నప్పుడు ఇలా తన ఆరోగ్య పరిస్థితిని దాచిపెడితే  సామాన్యులకు ఎలా అవగాహన కలుగుతుందనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. వలంటీర్లు కత్తిపూడిలో ఇంటింటికీ వెళ్లి అందరి ఆరోగ్యం వాకబు చేసినప్పుడు కూడా అతడు విషయాన్ని దాచిపెట్టి ఉండటమే కొంప ముంచింది. ఆ మహమ్మారి అతనితో ఆగిపోకుండా ఎనిమిదేళ్ల కుమారుడు, అదే ఇంటిలో అద్దెకు ఉంటున్న బ్యాంక్‌ ఉద్యోగి తల్లి, భార్య, కుమార్తె, మరొక మహిళకు కూడా పాజిటివ్‌ అని శుక్రవారం తేలింది. ఆ ఉపాధ్యాయుడు దాచి పెట్టకుండా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుని ఉండిఉంటే అతని ద్వారా మరో ఐదుగురు కరోనా మహమ్మారి వలలో పడే వారే కాదు. కరోనా లక్షణాలుంటే అలక్ష్యం చేయకుండా పరీక్షలకు ముందుకు వచ్చి చికిత్స చేయించుకుంటే ప్రాణహాని ఉండకపోగా, అక్కడితోనే ఆ వైరస్‌ నిలువరించిన వారవుతారని వైద్య వర్గాలు మరోసారి పిలుపునిస్తున్నాయి. 


కత్తిపూడి రెడ్‌జోన్‌ ప్రాంతాన్ని శానిటేషన్‌ చేస్తున్న పంచాయతీ కార్మికులు

రెడ్‌జోన్‌ పరిధిలో కత్తిపూడి
ఏలేశ్వరం/శంఖవరం: కత్తిపూడిలో గురువారం కరోనా పాజిటివ్‌ కేసు బయటపడడం ... శుక్రవారం మరో ఐదుగురికి సోకడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆ ప్రాంతాన్ని రెడ్‌ జోన్‌గా ప్రకటించింది. పాయకరావుపేట నుంచి వచ్చిన ఉపాధ్యాయుడికి గురువారం కరోనా వైరస్‌ నిర్ధారణ కావడంతో అతని కుటుంబ సభ్యులు, సమీప వ్యక్తులను సుమారు 29 మందిని శుక్రవారం హోమ్‌ క్వారంటైన్‌కు తరలించారు. ఇందులో మరో ఐదుగురికి పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాతాన్ని రెడ్‌జోన్‌లో ప్రకటించడంతో 460 కుటుంబాలు ఆ పరిధిలోకి వచ్చాయి.

సందర్శించిన కలెక్టర్‌ 
కలెక్టర్‌ మురళీధర్‌ రెడ్డి కత్తిపూడి హోం క్వారంటైన్‌ ప్రాంతాన్ని సందర్శించి అధికారులను అప్రమత్తం చేశారు.  హోం క్వారంటైన్‌లో ఉన్న వారు భయపడవద్దని ధైర్యం చెప్పారు. కరోనా నిర్ధారణ అయిన బాధితులకు కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. రెడ్‌జోన్‌గా ప్రకటించిన ప్రాంతవాసుల్లో ఆరోగ్య సమస్యలుంటే ఇంటింటి సర్వే చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. ఆ ప్రాంతవాసులు బయటకు రావద్దని, నిత్యావసర వస్తువుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూడా లని అధికారులకు ఆదేశించారు. ఆ ప్రాంతాన్ని పంచాయతీ కార్మికులు శానిటేషన్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్ధార్‌ కె.సుబ్రహ్మణ్యం, ఎంపీడీఓ జె.రాంబాబు, పంచాయతీ కార్యదర్శి బులివీరన్న పాల్గొన్నారు. 

చేతులెత్తి కోరుతున్నా... ముందుకు రండి
ఎంత చెబుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. భౌతిక దూరం పాటించండని నేనూ, జిల్లా అధికారులు పదే పదే చెబుతూనే ఉన్నాం. కరోనా లక్షణాలున్న వారు జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలని కోరుతూ హెల్ప్‌లైన్‌ నంబర్లు కూడా ఇచ్చాం. పరీక్ష చేయించుకుంటే పోయేదేమి లేదని, పాజిటివ్‌ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని చెబుతూనే ఉన్నాం. పరీక్షలు చేయించుకోవడం వల్ల ఎవరికైనా పాజిటివ్‌ వస్తే అతనొక్కడితోనే ఆగిపోతుంది. లేదంటే వారితో పాటు వారి పిల్లలు, తల్లిదండ్రులకు కూడా ఆ మహమ్మారి చుట్టుకుంటుంది. కత్తిపూడి తొలి పాజిటివ్‌ కేసు విషయంలో అదే జరిగింది. అతడు పరీక్ష చేయించుకోకుండా జబ్బును దాచిపెట్టడంతో ఇప్పుడు ప్రాణాపాయంలో పడ్డాడు. కత్తిపూడిలో గురువారం నమోదైన పాజిటివ్‌ కేసు విషయంలో నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అతడు ముందుగానే పరీక్షలు చేయించుకుని ఉంటే ఈ రోజు ఐదు కేసులు నమోదయ్యేవికావు. ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకుని భౌతిక దూరం పాటించి కరోనా లక్షణాలు ఉంటే సంకోచించకుండా పరీక్షలకు రావాలని చేతులెత్తి కోరుతున్నా.
– డి మురళీధర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌  

కరోనా లక్షణాలను దాచిపెట్టకండి
కరోనా పరీక్షలకు దైర్యంగా ముందుకు రండి. అనుమానాలు వద్దు. పరీక్షలు చేయించుకుంటే పోయేదేమీ లేదు. చేయించుకోకుంటేనే అసలు సమస్య. దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వెంటనే వైద్య ఆరోగ్యశాఖకు సమాచారం ఇవ్వండి. ఇందుకోసం హెల్ప్‌లైన్‌ నంబర్‌లు కూడా ఏర్పాటు చేశాం. సర్వేలెన్స్‌దే కీలక బాధ్యతగా ఉంది. విదేశాల నుంచి వచ్చిన వారు, కరోనా అనుమానితులపై నిరంతర నిఘా పెట్టేందుకు మున్సిపాలిటీలు, మండలాల వారీగా గ్రామాల్లో సర్వేలెన్స్‌ టీములు పని చేస్తున్నాయి. వైద్య ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, సచివాల సిబ్బంది సర్వేలెన్స్‌లో విస్తృతంగా పని చేస్తున్నారు. వీరికి ప్రజలు పూర్తిగా సహకరించాలి. 
– డాక్టర్‌ మల్లిక్, కరోనా జిల్లా నోడల్‌ అధికారి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement