సమావేశానికి వెళ్తున్న అమిత్ షా, సీఎం కేజ్రీవాల్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ నానాటికీ విజృంభిస్తూ ఉండడంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తదితరులతో ఆదివారం సమావేశమై కరోనాని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు జరిపారు. ఆస్పత్రుల్లో సదుపాయాలు, మృతదేహాల నిర్వహణ వంటి అంశాల్లో సుప్రీం కూడా మొట్టికాయలు వేయడంతో పరిస్థితుల్ని సమీక్షించి కరోనాను ఎదుర్కోవడానికి ఒక కార్యాచరణను రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఈ సమావేశం ఫలప్రదమైందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నామని, రెండు ప్రభుత్వాలు కలిసి కోవిడ్‌ను ఎదుర్కొంటాయని పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాటానికి సంబంధించి అమిత్ షా పలు ట్వీట్లు చేశారు. కరోనా వైరస్‌పై పోరాటంలో కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్రానికి సహకరిస్తుందన్నారు.
నేడు అఖిలపక్ష భేటీ
ఢిల్లీలో వైరస్ వ్యాప్తిని సమీక్షించడానికి సోమవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సమావేశానికి పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ ఈ సమావేశంలో పాల్గొననున్నాయి.
ఇదీ కార్యాచరణ
పరీక్షలు మూడు రెట్లు
► దేశ రాజధానిలో కోవిడ్ పరీక్షలను ఇక మూడు రెట్లు పెంచనున్నారు. వచ్చే రెండు రోజుల్లో రెట్టింపు పరీక్షలు, ఆరు రోజుల్లో మూడు రెట్లు పరీక్షలు నిర్వహించనున్నారు. కొద్ది రోజుల తర్వాత నగరంలో కంటైన్‌మెంట్ జోన్లలో ప్రతీ పోలింగ్ స్టేషన్‌లో కరోనా పరీక్షలు నిర్వహిస్తారు.
కంటైన్‌మెంట్ జోన్లలో ఇంటింటి సర్వేలు
► ఢిల్లీలో ప్రస్తుతం 241 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలో ఇంటింటికీ వెళ్లి కేంద్రం సర్వే నిర్వహిస్తుంది. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నాయా, పరిస్థితులు ఎలా ఉన్నాయని ఆరా తీస్తుంది. ఈ జోన్లలో నివసించే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
500 రైల్వే బోగీలే కరోనా పడకలు
► ఢిల్లీలో కోవిడ్ రోగులకు సరిపడా పడకలు లేకపోవడంతో కేంద్రం 500 రైల్వే కోచ్‌లను తాత్కాలిక ఆస్పత్రులుగా మార్చనుంది. ఈ కోచ్‌లలో 8 వేల మందికి చికిత్స అందించవచ్చు. వైరస్‌పై పోరాడడానికి అన్ని రకాల పరికరాలతో వీటిని ఏర్పాటు చేయనున్నారు.
ప్రైవేటు ఆస్పత్రుల్లో 60% పడకల్లో వైద్యం
► ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా కరోనా రోగులకు చికిత్స అందించనున్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో 60 శాతం పడకల్ని కోవిడ్ రోగులకు కేటాయించనున్నారు. ఇక్కడ తక్కువ ధరకే వైద్యం అందేలా చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం డాక్టర్ పాల్ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎయిమ్స్ వైద్యులతో కమిటీ
► కోవిడ్ రోగులకు చికిత్సనందించే విధానంపై చిన్న చిన్న ఆస్పత్రుల్లో అవగాహన పెంచడానికి ఎయిమ్స్‌లో సీనియర్ వైద్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. వీరంతా అక్కడ వైద్యులకు టెలిఫోన్ ద్వారా సూచనలు అందిస్తారు. అంతేకాదు ఢిల్లీలో కోవిడ్ సన్నద్ధతపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైద్య నిపుణులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ నగరంలో వైద్య సదుపాయాల్ని పర్యవేక్షిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment