న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికి గత మూడు నాలుగు రోజులుగా ఆయన అలసట, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి అనారోగ్యం పాలవుతున్న వారిలో అమిత్ షా మాత్రమే లేరు. సామాన్యులలో కూడా చాలా మంది కరోనా నెగిటివ్ వచ్చినప్పటికి తిరిగి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వ అధీనంలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ‘పోస్ట్ కోవిడ్ క్లినిక్’ని ప్రారంభించింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో తర్వాత తలెత్తే అనారోగ్య సమస్యలకు చికిత్స అందించడంలో ఈ పోస్ట్ కోవిడ్ క్లినిక్ సహాయపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బీఎల్ షేర్వాల్ మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి కోలుకున్న వారిలో వేర్వేరు అనారోగ్య సమస్యలు వెలికి చూస్తున్నాయి. కొందరు దగ్గుతో బాధపడుతుండగా.. మరి కొందరిలో అలసట, నీరసం వంటి లక్షణాలు వెలుగు చూస్తున్నాయి. వేర్వేరు వయసుల వారిలో.. మహిళలు, పురుషుల్లో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి’ అన్నారు. (మళ్లీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా)
గత వారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘కరోనా నెగిటివ్ వచ్చి ఇంటికి వెళ్లిన కొందరిలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక మీదట డిశ్చార్జ్ అయ్యే వారికి ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేషన్స్‌ను ఇవ్వాలని నిర్ణయించాం’ అన్నారు. మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్ మాట్లాడుతూ.. ‘మా అమ్మకి మే 28న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత రెండు సార్లు పరీక్షించిన తర్వాత నెగిటివ్ వచ్చింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక జూన్ 11న ఆమె గుండెపోటుతో మరణించింది. కరోనా వచ్చిన వారిలో కొందరికి శరీర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మా అమ్మ విషయానికి వస్తే.. ఆమెకు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుండెపోటుతో మరణించింది. ఈ వైరస్ శరీరంలోని ముఖ్యమైన అవయవాలను నాశనం చేస్తుంది. దీర్ఘకాలిక ప్రభావాలను చూపిస్తోంది’ అన్నారు. ఇక ముంబైలోని కొన్ని ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకున్న వారిలో 40 శాతం మంది ఊపిరితిత్తుల సమస్యలతో తిరిగి ఆస్పత్రులకు వస్తున్నారు. కొందరిలో పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి’ అన్నారు. (‘ఛేజ్ ది వైరస్ పాలసీ’తో కరోనా కట్టడి!)
సైఫీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ దీపేశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌తో ఐసీయూలో చికిత్స పొందిన వారు రెండు వారాల్లో తిరిగి ఇతర సమస్యలతో ఆస్పత్రికి వస్తుండగా.. వార్డులో చికిత్స పొందిన వారు నెల రోజుల్లో తిరిగి ఆస్పత్రికి వస్తున్నారు. వీరు అలసట, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలతో బాధపడుతున్నారు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment