Fatigue
-
క్యాన్సర్ నిస్సత్తువను జయిద్దాం రండి!
క్యాన్సర్ వ్యాధితో పోరు జరపడం రోగికి సవాలే. కానీ అంతకంటే పెద్ద సవాలు మరోటుంది. అదే క్యాన్సర్ వ్యాధి కారణంగానూ, చికిత్సతోనూ వచ్చే తీవ్రమైన నిస్సత్తువ. వ్యాధిగ్రస్తుణ్ణి తీవ్రమైన నీరసం అనుక్షణం కుంగదీస్తూ ఉంటుంది. ఏమాత్రం చురుగ్గా ఉండనివ్వదు. ఈ నీరసం నిస్సత్తువ, అలసటగా అనిపించే భావన రోగిని మందకొడిగా చేసి... కొన్నిసార్లు మరింత కుంగుబాటుకు గురిచేస్తుంది. దాంతో క్యాన్సర్‌పై పోరు కంటే... ఈ నిస్సత్తువతో పోరే మరింత పెద్ద సవాలుగా మారుతుంది. కొంతమంది రోగులు తొలుత కాస్త కుంగిపోయినా... క్రమంగా తమ మానసిక బలాన్ని కోల్పోని వారు క్యాన్సర్ పోరుపై తప్పక విజయం సాధిస్తారు. డిసెంబరు నెలను ‘క్యాన్సర్ ఫెటీగ్ అవేర్నెస్ మాసం’ గా పేర్కొంటారు. ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తుల నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్)పై అవగాహన, వాటిని అధిగమించే తీరుతెన్నులను తెలుసుకుని, వ్యాధిపై విజయం సాధించడం కోసం ఉపయోగపడేందుకే ఈ కథనం. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో నీరసం, నిస్సత్తువ (క్యాన్సర్ ఫెటీగ్) చాలా సాధారణం. కానీ చాలామందికి దీనిపై అవగాహన ఉండదు. దీనివల్ల కలిగిన వ్యాకులత, కుంగుబాటు వల్ల రోగి జీవనశైలిపై తీవ్ర ప్రభావం పడుతుంది. రోగి తన రోజువారీ పనులను చురుగ్గా చేసుకోలేడు. దాంతో జీవితాన్ని ఆస్వాదించలేడు. ఈ నిస్సత్తువకు చాలా కారణాలే ఉంటాయి. నిర్దిష్టంగా ఫలానా అంశమే దీనికి కారణం అని చెప్పడానికి వీలుకాదు. అయితే చాలామంది రోగులు వ్యాధి కారణంగా తాము అనుభవించే షాక్‌లో ఈ అంశాన్ని విస్మరిస్తారు. దీన్ని అధిగమించగలమనే ధ్యాసే వారికి కరవవుతుంది. కానీ కొన్ని పరిమితుల మేరకు దీన్ని అధిగమించడానికి చాలా మార్గాలున్నాయి. ఆ కారణాలనూ, మార్గాలను చూద్దాం. కారణాలు రక్తహీనత (అనీమియా): అనీమియా అనే కండిషన్ క్యాన్సర్ నిస్సత్తువకు ఒక ప్రధాన కారణం. సాధారణంగా క్యాన్సర్ రోగుల్లో (అందునా ప్రధానంగా బ్లడ్ క్యాన్సర్లలో) వారి ఎముక మూలుగ ఎక్కువగా ప్రభావితమై ఎర్రరక్తకణాల సంఖ్య తగ్గుతుంది. ఈ ఎర్రరక్తకణాలే దేహంలోని ప్రతి కణానికీ ఆక్సిజన్‌ను తీసుకెళ్తాయన్న విషయం తెలిసిందే. దాంతో కణాలకు అందే ఆక్సిజన్ తగ్గి నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. శరీరంలో విషాలు తొలగకపోవడం: ఆక్సిజన్ అందించడంతో పాటు ఎర్రరక్తకణాలు దేహంలో తయారైన కార్బన్డయాక్సైడ్, ఇతర విషాల (టాక్సిన్స్)ను బయటకు పంపుతాయి. కానీ ఎర్రరక్తకణాలు తగ్గడంతో కణానికి అందాల్సిన ఆక్సిజన్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు బయటకు విసర్జించాల్సిన విషాలను తీసుకెళ్లే సామర్థ్యమూ తగ్గుతుంది. దేహంలో ఉండిపోయిన ఈ విషాలు జీవక్రియలకు ఆటంకంగా కూడా పరిణమిస్తాయి. ఫలితంగా రోగిలో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. రోగి ఎప్పుడూ అలసట తో ఉన్నట్లుగా ఉంటాడు. బ్లడ్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్లలో తగినంత ఆక్సిజన్ అందక ఈ పరిస్థితి సాధారణం. క్యాన్సర్ చికిత్సల వల్ల : కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ రోగులకు అందించే కీమోథెరపీ, రేడియోథెరపీ చికిత్సల కారణంగానూ, బోన్ మ్యారో క్యాన్సర్లకు అందించే మందుల కారణంగా కూడా రోగుల్లో తీవ్రమైన నీరసం, నిస్సత్తువ కనిపిస్తాయి. ఈ చికిత్సల్లో భాగంగా క్యాన్సర్ కణాల్ని తుదముట్టించడానికి టార్గెట్ చేస్తున్నప్పుడు... ఆరోగ్యవంతమైన కణాలు కూడా అంతో ఇంతో దెబ్బతినడం జరుగుతుంది. ఈ కారణంగా క్యాన్సర్ రోగుల్లో నీరసం, నిస్సత్తువ ఏర్పడతాయి. దీంతో పాటు కొన్ని సందర్భాల్లో చికిత్సలో కలిగే నొప్పి, యాంగై్జటీ/ డిప్రెషన్‌కు గురికావడం, మందకొడిగా ఉండాల్సిరావడం (ఇనాక్టివిటీ), తరచూ నిద్రాభంగం కావడం, నిద్రలో అంతరాయాలు, సరిగా భోజనం తీసుకోకపోవడం వంటివి కూడా నీసరం, నిస్సత్తువకు కారణమవుతాయి. ► అధిగమించడం ఇలా ... నీరసం, నిస్సత్తువ ఉన్నప్పటికీ తొలి దశల్లో మనోబలంతో క్రమంగా మంచి ఆహారానికీ, క్రమబద్ధంగా వ్యాయామానికీ ఉపక్రమించడంతో ‘క్యాన్సర్ ఫెటీగ్’ను అధిగమించవచ్చు. క్రియాశీలంగా ఉండటం (ఇంక్రీజింగ్ యాక్టివిటీ) : రోగులు తమలో ఉన్న నీరసం, నిస్సత్తువలకు లొంగిపోకుండా... ఎంతోకొంత చురుగ్గా ఉండటానికి ప్రయత్నించాలి. అలసట కలిగించని తేలికపాటి వ్యాయామాలు చేయడానికి ఉపక్రమించాలి. దాంతో దేహంలోనూ, మెదడులోనూ చురుకు పుట్టించే ఎండార్ఫిన్స్ అనే రసాయనాలు స్రవిస్తాయి. ఫలితంగా మూడ్స్ కూడా మెరుగుపడతాయి. రోగిలో సంతోషభావనలు కలుగుతాయి. న్యూట్రిషన్ కౌన్సెలింగ్ : క్యాన్సర్ రోగుల్లో చాలామంది తమ బరువు కోల్పోయి... చాలా సన్నబడతారు. రోగులు తమ వ్యాకులత కారణంగా తినకపోవడంతో పాటు... చికిత్సలో భాగంగా కనిపించే ఆకలిలేమి, వికారం, వాంతుల వల్ల కూడా తినలేకపోతారు. దాంతో ఆహారం తీసుకోకపోవడం, ఫలితంగా దేహానికి కావాల్సిన పోషకాలు అందకపోవడం జరుగుతాయి. దేహంలోకి పోషకాలు అందేందుకు, నోటికి రుచిగా ఉండేలా ఎలాంటి ఆహారాలు తీసుకోవచ్చు అనే అంశంపై అవగాహన కలిగించుకునేందుకు ‘న్యూట్రిషన్ కౌన్సెలర్’ను సంప్రదించాలి. అపుడు ఆహార నిపుణులు దేహానికి అవసరమైనన్ని క్యాలరీలూ, ద్రవాహారాలు, ప్రోటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లతో పాటు ఇతర పోషకాలు అందేందుకు అవసరమైన డైట్‌ప్లాన్‌ను సూచిస్తారు. మానసిక బలం కోసం తోడ్పాటు చాలామంది రోగులు తమకు క్యాన్సర్ ఉందని తెలియగానే తీవ్రమైన కుంగుబాటుకు లోనవుతారు. నిజానికి ఈ రోజుల్లో క్యాన్సర్లు దాదాపు 90 శాతానికి పైగా రకాలను పూర్తిగా నయం చేయవచ్చు. మొదటి, రెండో దశలో ఉన్న క్యాన్సర్లన్నింటినీ దాదాపుగా పూర్తిగా నయం చేయవచ్చు. అందుకే రోగులు తమ మానసిక బలాన్ని పెంపొందించుకోడానికి అవసరమైన రిలాక్సేషన్ టెక్నిక్స్, కాగ్నిటివ్, సోషల్ థెరపీల కోసం మానసిక నిపుణుల సహాయం తీసుకోవచ్చు. మానసిక చికిత్సలతో కూడా క్యాన్సర్ ఫెటీగ్‌ను చాలావరకు అధిగమించవచ్చు. విశ్రాంతి : క్రియాశీలంగా ఉండటానికి ప్రయత్నించడంతో పాటు... కొన్ని సందర్భాల్లో తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అవసరం. ఈ విశ్రాంతి మళ్లీ మన శక్తిసామర్థ్యాలను (ఎనర్జీని) ఆదా చేసుకోడానికీ... దాంతో మరింత శక్తి పుంజుకుని మళ్లీ క్రియాశీలం కావడానికి ఉపయోగ పడుతుందని గ్రహించాలి. అందుకే తమ నిస్సత్తువ కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తోందని అనుకోకుండా... అలాంటి విశ్రాంతి సమయాల్లో ఇతరులపై ఆధారపడుతున్నామని సిగ్గుపడకుండా... విశ్రాంతి సమయాన్ని ఎనర్జీని ఆదా చేసుకునే టైమ్‌గా పరిగణించాలి. ఇలా ఈ సానుకూల దృక్పథంతో రోగి మళ్లీ శక్తి పుంజుకుని చురుగ్గా మారగలుగుతాడు. ఇతర విషయాలపైకి దృష్టి మళ్లించడం (డిస్ట్రాక్షన్) ఎప్పుడూ తనకు వచ్చిన వ్యాధి గురించే ఆలోచించకుండా... తమ దృష్టిని ఇతర అంశాలపైకి మళ్లించాలి. మంచి పుస్తకాలు చదవవచ్చు. హాస్యభరితమైన, వినోదాత్మకమైన సినిమాలు చూడవచ్చు. ఫ్రెండ్స్‌తో సంభాషించవచ్చు (ఈ కోవిడ్ సమయంలో వ్యక్తిగతంగా కలవలేకపోయినా... మొబైల్స్‌లో, వాట్సాప్ ద్వారా ఇతరులతో సంభాషణలు చేయవచ్చు. ఇలా రోగులు తమ సరదా సమయాన్ని గడపవచ్చు. ఇలా ఎప్పుడూ సంతోషంగా ఉండటం అంటే వ్యాధిపై సగం విజయాన్ని సాధించడమే. కంటికి తగిన నిద్ర చాలామంది క్యాన్సర్ రోగులకు ఉండే ప్రతికూలత ‘నిద్ర’. రోగుల్లో చాలామందికి తరచూ నిద్రాభంగమవుతుంటుంది. దాంతో రోగి మరింత నిస్సత్తువగా మారిపోతాడు. రోగుల్లో ఫెటీగ్‌కు ‘నిద్ర’ అనే అంశం చాలా ప్రధానమైంది. చిన్న చిన్న టెక్నిక్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా రోగులు తమలోని వ్యాకులతను, కుంగుబాటును అధిగమించడం ద్వారా కంటినిండా నిద్రపోవచ్చు. కాఫీ లేదా కెఫిన్ ఉండే ద్రవాహారాలను కేవలం ఉదయం పూటకు మాత్రమే పరిమితం చేయడం, నిద్రకు ముందు తీసుకోకపోవడం, నిద్ర వచ్చినప్పుడో లేదా మధ్యానం పూటో కాస్తంత చిన్న చిన్న కునుకులు తీయడం, పవర్న్యాప్ను అలవరచుకోవడం, వేళకు పెందలాడే నిద్రించి పెందలాడే లేవడం లాంటి మంచి నిద్ర అలవాట్లను అలవరచుకోవడం లాంటి చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కూడా రోగులు తమ నిద్రాభంగాలనూ, నిద్రలో అంతరాయాల సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు. కంటినిండా నిద్రపోవడం అనే అంశం కూడా రోగిలో వ్యాధి నివారణశక్తిని పెంపొందిస్తుందన్న విషయం తెలిసిందే. ఇది కూడా రోగి త్వరగా కోలుకునేలా చేసే అంశమే. అవసరాన్ని బట్టి మందులు ఒకవేళ రోగిలోని అలసట భావన చాలా ఎక్కువగానూ, తీవ్రమైన నీరసం, నిస్సత్తువ ఉంటే రోగి కారణాలనూ, పరిస్థితిని బట్టి డాక్టర్లు కొన్ని మందులను సూచిస్తారు. రక్తహీనత తక్కువగా ఉన్నవారికి ఐరన్ సప్లిమెంట్లూ, పోషకాహార లోపాలను బట్టి ఇతర మందులు, మానసిక కారణాలున్నవారికి యాంటీ డిప్రెసెంట్లు, సైకో స్టిమ్యులెంట్ల వంటి ఔషధాలను ఇస్తారు. క్యాన్సర్ రోగులెవరైనా క్యాన్సర్ ఫెటీగ్‌తో బాధపడుతుంటే పైన సూచించిన సూచనలను పాటించడం ద్వారా తమకు తామే సమస్యను అధిగమించవచ్చు. ఒకవేళ అప్పటికీ కుదరకపోతే వైద్యనిపుణుల సహాయం తీసుకోవచ్చు. అయితే ఈ సమస్య అధిగమించలేని సమస్యేమీ కాదని గ్రహించడం చాలా ప్రధాన అంశం. దీన్ని గ్రహిస్తే సగం సమస్య పరిష్కారమైనట్లే. సగం వ్యాధి తగ్గినట్లే. డా. అజయ్ చాణక్య కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ -
కరోనా ఎఫెక్ట్.. 40శాతం మంది తిరిగి ఆస్పత్రికి
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. కరోనా నెగిటివ్ వచ్చినప్పటికి గత మూడు నాలుగు రోజులుగా ఆయన అలసట, ఒంటి నొప్పులతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత తిరిగి అనారోగ్యం పాలవుతున్న వారిలో అమిత్ షా మాత్రమే లేరు. సామాన్యులలో కూడా చాలా మంది కరోనా నెగిటివ్ వచ్చినప్పటికి తిరిగి అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వ అధీనంలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ‘పోస్ట్ కోవిడ్ క్లినిక్’ని ప్రారంభించింది. కరోనా నుంచి కోలుకున్న వారిలో తర్వాత తలెత్తే అనారోగ్య సమస్యలకు చికిత్స అందించడంలో ఈ పోస్ట్ కోవిడ్ క్లినిక్ సహాయపడుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ఆస్పత్రి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ బీఎల్ షేర్వాల్ మాట్లాడుతూ.. ‘కరోనా నుంచి కోలుకున్న వారిలో వేర్వేరు అనారోగ్య సమస్యలు వెలికి చూస్తున్నాయి. కొందరు దగ్గుతో బాధపడుతుండగా.. మరి కొందరిలో అలసట, నీరసం వంటి లక్షణాలు వెలుగు చూస్తున్నాయి. వేర్వేరు వయసుల వారిలో.. మహిళలు, పురుషుల్లో ఈ సమస్యలు కనిపిస్తున్నాయి’ అన్నారు. (మళ్లీ ఆస్పత్రిలో చేరిన అమిత్ షా) గత వారం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ‘కరోనా నెగిటివ్ వచ్చి ఇంటికి వెళ్లిన కొందరిలో ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక మీదట డిశ్చార్జ్ అయ్యే వారికి ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్స్ను ఇవ్వాలని నిర్ణయించాం’ అన్నారు. మాజీ మంత్రి కేజే అల్ఫోన్స్ మాట్లాడుతూ.. ‘మా అమ్మకి మే 28న కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత రెండు సార్లు పరీక్షించిన తర్వాత నెగిటివ్ వచ్చింది. డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక జూన్ 11న ఆమె గుండెపోటుతో మరణించింది. కరోనా వచ్చిన వారిలో కొందరికి శరీర వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. మా అమ్మ విషయానికి వస్తే.. ఆమెకు ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయి. గుండెపోటుతో మరణించింది. ఈ వైరస్ శరీరంలోని ముఖ్యమైన అవయవాలను నాశనం చేస్తుంది. దీర్ఘకాలిక ప్రభావాలను చూపిస్తోంది’ అన్నారు. ఇక ముంబైలోని కొన్ని ఆస్పత్రుల్లో కరోనా నుంచి కోలుకున్న వారిలో 40 శాతం మంది ఊపిరితిత్తుల సమస్యలతో తిరిగి ఆస్పత్రులకు వస్తున్నారు. కొందరిలో పొడి దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి’ అన్నారు. (‘ఛేజ్ ది వైరస్ పాలసీ’తో కరోనా కట్టడి!) సైఫీ ఆసుపత్రికి చెందిన డాక్టర్ దీపేశ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్‌తో ఐసీయూలో చికిత్స పొందిన వారు రెండు వారాల్లో తిరిగి ఇతర సమస్యలతో ఆస్పత్రికి వస్తుండగా.. వార్డులో చికిత్స పొందిన వారు నెల రోజుల్లో తిరిగి ఆస్పత్రికి వస్తున్నారు. వీరు అలసట, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలతో బాధపడుతున్నారు’ అని తెలిపారు. -
ఏసీ వల్లనే ఈ సమస్యా?
నా వయసు 36 ఏళ్లు. ఇటీవలే ఆఫీసు మారాను. ఇక్కడ చాలాసేపు ఎయిర్ కండిషన్డ్ గదిలో ఉండాల్సి వస్తోంది. దాంతో నాకు తలనొప్పి వస్తోంది. పైగా తీవ్రమైన అలసటతో కూడా బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. మీరు చెప్పినట్లుగానే ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరికి చాలా సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి అనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... తీవ్రమైన అలసట చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి తీవ్రమైన తలనొప్పి, భరించలేనంత నిస్సత్తువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగిన రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం సుదీర్ఘకాలం పాటు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకుంటూ ఉండటం మంచి పరిష్కారం. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే తక్కువ రక్తపోటు (లో బీపీ), ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేదు. వేసవిలో బయటకు రావడమే వారికి కష్టంగా అనిపిస్తుంది. దాంతో తేలిగ్గా వడదెబ్బకు గురవుతుంటారు. శ్వాస సమస్యలు చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతూ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అదే ఆరోగ్యకరం. ఒత్తిడితోనూ ఒళ్లునొప్పులు వస్తాయా? నా వయసు 52 ఏళ్లు. కొన్ని ఆర్థిక సమస్యలతో ఇటీవల డబుల్‌షిఫ్ట్ డ్యూటీలు చేస్తున్నాను. నా పనిలో భాగంగా అకౌంట్స్ అన్నీ చాలా నిశితంగా చూడాల్సి ఉంటుంది. అందుకోసం చాలా ఏకాగ్రతతో పని చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా రాకూడదు కాబట్టి చాలా తీవ్రమైన ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటాను. ఇటీవల నాకు తీవ్రంగా ఒళ్లునొప్పులు, నడుము నొప్పి వస్తున్నాయి. నిస్సత్తువగా ఉంటోంది. ఇది ఒత్తిడి కారణంగానే అంటారా? దయచేసి నా సమస్యకు సాధారణ పరిష్కారాలు చూపించండి. అదేపనిగా పన్నెండు గంటల కంటే ఎక్కువసేపు (ఒకే స్ట్రెచ్‌లో) పనిచేసేవారికి తీవ్రమైన అలసట మొదలుకొని ఇంకా అనేక సమస్యలు వస్తాయి. మీలా డబుల్ షిఫ్ట్ పనిచేసేవారిలో ఎక్కువ అలసటతో పాటు, తీవ్రమైన ఒత్తిడికి లోనైనట్లు అనిపించడం చాలా సాధారణం. ఇక కండరాల నొప్పులు, నడుమునొప్పితో పాటు చర్మ సమస్యలు, శ్వాసకోశ ఇబ్బందులు, ఇతర వృత్తిసంబంధ సమస్యలు సైతం రావచ్చు. మీలాంటి వారిలో అలసటతో పాటు, వృత్తిసంబంధమైన ఇతర సమస్యలను నివారించేందుకు ఈ సూచనలు పాటించడం మేలు చేస్తుంది. ►పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానేయండి. సిగరెట్ పొగ రక్తకణాల్లోని ఆక్సిజన్‌ను తీసుకెళ్లే సామర్థ్యాన్ని తగ్గించి, వెంటనే అలసిపోయేలా చేస్తుంది. ►చాలాసేపు కూర్చొని పనిచేసేవారైతే, శరీరానికి కదలికలు ఉండేలా తప్పనిసరిగా వ్యాయామం చేయండి. అదేపనిగా కూర్చోవడం వల్ల కూడా అలసిపోతారు. ►కంటి నిండా నిద్ర అవసరం. కనీసం రోజూ ఎనిమిదిగంటల పాటు నిద్రపోవాలి ►కాఫీలు ఎక్కువగా తాగకండి. కెఫిన్ ఉండే ద్రవపదార్థాలను తీసుకునే అలవాటు ఉంటే, రోజూ రెండు కప్పులకు మించి వద్దు. రాత్రి డ్యూటీ ముగించుకొని ఇంటికివెళ్లే సమయంలో కాఫీ అస్సలు తాగవద్దు ►రిలాక్సేషన్ టెక్నిక్స్ పాటించండి. ప్రతిరోజూ ప్రాణాయామం, యోగా, ధ్యానం వంటివి చేస్తూ ఒత్తిడిని అధిగమించండి. ►భోజనవేళలను కచ్చితంగా పాటించండి. భోజనం ఎగ్గొట్టి పనిచేయకండి. ఇలా చేస్తే రక్తంలో చక్కెరపాళ్లు తగ్గిపోయి త్వరగా, తేలిగ్గా అలసిపోతారు. ఎక్కువగా నీళ్లు తాగండి. దీనివల్ల మీరు డీ–హైడ్రేషన్‌కు లోనుకారు. ఫలితంగా అలసిపోకుండా పనిచేయగలుగుతారు. ఈ సూచనలు పాటించాక కూడా మీరు ఇంకా అలసటతోనూ, నడుంనొప్పితోనూ బాధపడుతుంటే డాక్టర్‌ను సంప్రదించండి. వేసవిలో వ్యాయామం ఆపేయాలా? నేను ఫిబ్రవరిలో వ్యాయామం చేయడం మొదలుపెట్టాను. అయితే ఇప్పుడు ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి కాబట్టి వ్యాయామం ఆపేయడం మంచిదని కొందరు స్నేహితులు చెబుతున్నారు. దయచేసి నాకు ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి. వేసవిలో వ్యాయామం చేసేవారు కొన్ని అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. అవేమిటంటే... మన శరీర ఉష్ణోగ్రతను ఎప్పుడూ ఒకేలా ఉంచడానికి శరీరంలోని చర్మం, రక్తనాళాలు పనిచేస్తాయి. మన శారీరక శ్రమ పెరగగానే రక్తనాళాల్లోకి రక్తం ఎక్కువగా ప్రవహించి చర్మాన్ని చేరుతుంది. శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించడానికి చర్మంపైన ఉన్న స్వేదగ్రంథులు చెమటను స్రవిస్తాయి. ఆ చెమట ఆవిరి అయ్యే క్రమంలో శరీరం నుంచి ఉష్ణోగ్రతను తీసుకుంటుంది. అందుకే చర్మంపై చెమట పట్టినప్పుడు ఫ్యాన్ నుంచి గానీ, చెట్ల నుంచి గానీ గాలి సోకితే ఒంటికి హాయిగా అనిపిస్తుంది. అలా శరీరంలో పెరిగిన ఉష్ణోగ్రతను తగ్గించడానికి చెమట తోడ్పడుతుంది. అయితే శారీరక శ్రమ అలాగే కొనసాగి ఈ చెమట పట్టే ప్రక్రియ అదేపనిగా జరుగుతుంటే... మన మేను నీటినీ, దానితోపాటు ఖనిజ లవణాలను కోల్పోతుంది. మరీ ఎక్కువ వేడిమికి ఎక్స్పోజ్ అయినప్పుడు, మనం తగినన్ని నీళ్లు, ద్రవాహారం తీసుకోనప్పుడు మనకు చెమట అతిగా పట్టి శరీర ఉష్ణోగ్రతను ఒకేలా నిర్వహించే వ్యవస్థ దెబ్బతినవచ్చు. అప్పుడు కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాదు... వాతావరణంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు చాలాసేపు కూర్చొని ఉండి, అకస్మాత్తుగా నిలబడినా లేదా అదేపనిగా నిలబడి వ్యాయామం చేసినా అకస్మాత్తుగా కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది. దీన్నే ‘హీట్ సింకోప్ అండ్ ఎక్సర్సైజ్ అసోసియేటెడ్ కొలాప్స్’ అని అంటారు. వాతావరణంలో వేడి పెరుగుతున్న సమయంలో మీరు వ్యాయామం మానేయాల్సిన అవసరం లేదు. కానీ పైన పేర్కొన్న అనర్థాలను నివారించడానికి ఈ కింది జాగ్రత్తలు పాటించండి. ►ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో పగటివేళ ఎండకు ఎక్స్పోజ్ కావద్దు. మీరు మీ వ్యాయామాలను వాతావరణం చల్లగా ఉండే వేకువజామున చేయండి. ►చెమటను పీల్చే కాటన్దుస్తులను ధరించండి. ►బాగా నీళ్లు తాగండి. ఒంట్లో ఖనిజ లవణాలు (ఎలక్రొలైట్స్) భర్తీ అయ్యేలా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. ►మీరు వ్యాయామం చేసే ముందర ఒకసారి వాతావరణం ఎలా ఉందో పరిశీలించండి. మరీ వేడిగా ఉంటే వ్యాయామాన్ని చల్లటి వేళకు వాయిదా వేసుకోండి. ఒకవేళ మీరు వ్యాయామం చేస్తున్న సమయంలో తలనొప్పి, కళ్లుతిరిగినట్లు, వాంతి వచ్చినట్లు అనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపేసి, డాక్టర్‌ను సంప్రదించండి. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
క్రియాటిన్ ఎక్కువగానే ఉన్నా... డయాలసిస్ చేయడం లేదెందుకు?
కిడ్నీ కౌన్సెలింగ్స్ నా వయసు 58 ఏళ్లు. ఈమధ్య బాగా నీరసంగా ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, పరీక్షలు చేయించాను. క్రియాటినిన్ పాళ్లు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాంతో నాకు డయాలసిస్ చేస్తారేమోనని ఆందోళన పడ్డాను. కానీ డయాలసిస్ చేయడం లేదు. మందులే ఇస్తున్నారు. ఎందుకిలా? క్రియాటినిన్ ఎంత ఉంటే డయాలసిస్ చేస్తారు? – డి. రామేశ్వరరావు, విజయవాడ కిడ్నీ రోగికి డయాలసిస్ మొదలుపెట్టడానికి క్రియాటినిన్ కేవలం కౌంట్ మాత్రమే ఆధారం కాదు. ఇంకా చాలా రకాల పరీక్షలు చేసి డయాలసిస్ ఎప్పుడు చేయాలో నిర్ధారణ చేస్తారు. ఇటీవలి నూతన పరిశోధనల ఆధారంగా క్రియాటినిన్ కౌంట్ 6 – 8 మధ్యలో ఉన్న రోగులకు కొందరికి డయాలసిస్ చేశారు. అయితే క్రియాటినిన్ కౌంట్ 10 – 12 మధ్య ఉన్నవారికి డయాలసిస్ ప్రారంభించినప్పుడు ఇచ్చినన్ని సత్ఫలితాలు ఈ 6 – 8 మధ్య ఉన్నవారిలో కనిపించలేదు. దీని వల్ల కేవలం క్రియాటినిన్ మాత్రమే డయాలసిస్ చేయాలనడానికి ఒక నిర్దిష్ట పరీక్ష కాదని స్పష్టంగా తేలిపోయింది. క్రియాటినిన్ ఎక్కువగా ఉండటంతో పాటు మూత్రపిండాల రోగి ఊపిరి తీసుకోలేకపోవడం, సరైన పోషకాహారం తీసుకోక సన్నబడిపోవడం, ఆకలిని కోల్పోవడం, వాంతులు కావడం (ఈ లక్షణాలన్నింటినీ యూరెమిక్ సింప్టమ్స్ అంటారు) వంటివి కనిపించనప్పుడు మాత్రమే డయాలసిస్ చేయాలన్న నిర్ణయం తీసుకుంటారు. మీ విషయానికి వస్తే మీకు ఎప్పుడు డయాలసిస్ ప్రారంభించాలన్న అంశాన్ని మీ నెఫ్రాలజిస్టు నిర్ణయిస్తారు. క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఏమిటి? నా వయసు 52 ఏళ్లు. ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాను. పనిలో భాగంగా తరచూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు తిరుగుతూ ఉంటాను. ఈ కారణంగా నెలలో మూడువారాలు బయటే తింటుంటాను. మద్యపానం అలవాటు కూడా ఉంది. అప్పుడప్పుడూ సిగరెట్లు తాగే అలవాటు కూడా ఉంది. కొద్ది నెలలనుంచి బలహీనంగా అనిపిస్తోంది. వీపు దిగువ భాగాన నొప్పిగా ఉంటోంది. తీవ్రమైన ఆరోగ్య సమస్య ఏదో మొదలయ్యిందని అనిపించి డాక్టర్‌కు చూపించగా కిడ్నీకి సంబంధించిన వ్యాధి సీకేడీ ఉన్నట్లు చెప్పి చికిత్స చేస్తున్నారు. అసలు ఇదేం వ్యాధి? ఎందుకు వస్తుంది? దయచేసి వివరంగా తెలపండి. – జి. గుర్నాధరెడ్డి, కొడంగల్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనే మాటకు సంక్షిప్త రూపమే సీకేడీ. ఇది మూత్రపిండాలకు సంబంధించిన తీవ్రమైన వ్యాధి. ఆహారపు అలవాట్లలో లోటుపాట్ల కారణంగా మనదేశంలో చాలామందికి ఈ వ్యాధి వస్తున్నది. డయాబెటిస్, హైబీపీ వ్యాధిగ్రస్తుల్లో మూత్రపిండాల వ్యాధులు అధికంగా ఉంటున్నాయి. ఆ రెండూ ప్రధాన కారణాలే అయినప్పటిMీ గ్లోమెరులార్ డిసీజ్, వారసత్వ (జన్యు) కారణాల వల్ల కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ వస్తుంది. పదే పదే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్కు గురవుతుండటం, మూత్రపిండాలలో రాళ్లు, మద్యపానం, పొగతాగడం, ఊబకాయం కూడా సీకేడీ ముప్పును మరింత అధికం చేస్తాయి. సీకేడీ నెమ్మదిగా కబళించే వ్యాధి. దీనిలో మూత్రపిండాలకు జరిగే నష్టం తీవ్రమైనదీ, శాశ్వతమైనది. సీకేడీ వల్ల కొద్ది నెలల నుంచి కొద్ది సంవత్సరాల కాలంలో నెఫ్రాన్లకు నెమ్మదిగా నష్టం జరుగుతూ ఉంటుంది. సీకేడీలో అధికరక్తపోటు, ఛాతీలో నొప్పి, తరచూ మూత్రానికి వెళ్లాల్సిరావడం, అకారణంగా కనిపించే అలసట, కడుపులో వికారం, వాంతులు, వీపు దిగువభాగాన నొప్పి, చర్మంపై దురదలు, ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఇవన్నీ కూడా వ్యాధి ముదిరిన దశలో మాత్రమే వ్యక్తమవుతాయి. చాలా సందర్భాలోల వ్యాధిగ్రస్తులను కాపాడటానికి అవకాశం లేని దశలోనే ఇవి వెల్లడి అవుతుంటాయి. నెఫ్రాన్లలో అధిక శాతం పూర్తిగా నష్టం జరిగి, ముదిరిన తర్వాతే వ్యాధి గురించి తెలుస్తుంది కాబట్టి సీకేడీని సైలెంట్ కిల్లర్ అంటున్నారు. దేశంలో ఆరోగ్యంగా కనిపిస్తున్న ప్రతి 5 నుంచి 10 మందిలో ఒకరు ఇంకా బయటపడని సీకేడీ బాధితులే అని అంచనా. ప్రారంభదశలోనే దీఇ్న గుర్తించినట్లయితే వ్యాధి మరింతగా విస్తరించకుండా చర్యలు తీసుకోడానికి వీలవుతుంది. మందులు ఉపయోగించి చికిత్స చేయడంలో భాగంగా మొదట అధికరక్తపోటును అదుపు చేయడం, రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించడానికి మందులు వాడాల్సి ఉంటుంది. ఇక మూత్రపిండాలు పూర్తిగా పనిచేయని స్థితిలో మిగిలిన అవకాశాలు రెండే. మొదటిది డయాలసిస్ చేస్తుండటం. అయితే ఇది మూత్రపిండాల వ్యాధులను నయం చేసే చికిత్స ఎంతమాత్రమూ కాదు. తాత్కాలికంగా మూత్రపిండాల బాధ్యతను స్వీకరించి, శరీరంలో వ్యర్థపదార్థాలు పేరుకుపోకుండా చూసే మార్గమిది. ఇది మరో ప్రత్యామ్నాయం (మూత్రపిండాల మార్పిడి) దొరికే దాక అనుసరించాల్సి మార్గం మాత్రమే. డయాలసిస్ చేయడంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు శాశ్వత పరిష్కారంగా మూత్రపిండాల మార్పిడిని సూచిస్తారు. ఇందుకు రోగి కుటుంబసభ్యులు, దగ్గరి బంధువులెవరైనా తమ మూత్రపిండాలలో ఒకదాన్ని దానం చేయడమో లేక బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి (రాష్ట్రప్రభుత్వ నిర్వహణలోని జీవన్‌దాన్ సంస్థ సాయంతో) సేకరించిన మూత్రపిండాన్ని అమర్చడమో చేస్తారు. డాక్టర్ కె.ఎస్.నాయక్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ -
అలర్జీతో ఆయాసం... వ్యాయామం చేయడం ఎలా?
పల్మునాలజీ కౌన్సెలింగ్ పీరియడ్స్ సమయంలో శ్వాస సరిగా ఆడటం లేదెందుకు? నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు పీరియడ్స్ సమయంలో సరిగా శ్వాస అందడం లేదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? – ఎమ్. కవిత, విశాఖపట్నం రుతుక్రమం వచ్చే సమయం మహిళల్లో ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మహిళల భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. దాంతో కొన్నిసార్లు అటు శరీరక, ఇటు మానసిక సమస్యలు కనిపించవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఉన్న సమస్యను కెటామెనియల్ ఆస్తమాగా చెప్పవచ్చు. కెటామెనియల్ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్ ఆస్తమా)గా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్ లేదా ప్రోస్టాగ్లాండిన్స్ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి. నా వయసు 33. నాకు డస్ట్ అలర్జీ ఉంది. దుమ్ము అంటే సరిపడదు. దాంతో ఇటీవల నేను వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. ఫిట్నెస్ కోసం వ్యాయామం చేయాలనుకున్నా ఇది నాకు ప్రతిబంధకంగా ఉంటోంది. దయచేసి నేను వ్యాయామం చేయడానికి అవసరమైన సలహా ఇవ్వగలరు. – ఎమ్డీ గియాసుద్దిన్, కర్నూలు వ్యాయామం ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడుతుంది, అదే సమయంలో ఆ గాలికి తేమ సమకూరుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి... పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ ఆస్తమా) వచ్చినప్పుడు అప్పటికి ఆపేసినా... వ్యాయామాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్ డౌన్ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే వ్యాయామానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. అసలు సిగరెట్ మానడానికి ఈ–సిగరెట్ మంచిదేనా? నా వయసు 46. విపరీతంగా సిగరెట్లు తాగుతాను. స్మోకింగ్ మానడం సాధ్యం కావడం లేదు. ఎలక్ట్రానిక్ సిగరెట్ (ఈ–సిగరెట్)ను ప్రయత్నించమని స్నేహితులు చెబుతున్నారు. ఈ–సిగరెట్ వాడడం సురక్షితమేనా? – ఆర్. గౌతమ్, హైదరాబాద్ ఎలక్ట్రానిక్ సిగరెట్లు (ఈ–సిగరెట్స్) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాటరిడ్జ్ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ–సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ–సిగరెట్లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. ఈ–సిగరెట్లో సాధారణ సిగరెట్లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్ అనే పదార్థం రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ–సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ–సిగరెట్లో కాటరిడ్జ్లో డీ–ఇథైల్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్ అనే క్యాన్సర్ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ–సిగరెట్ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్ ఇన్ఫ్లమేషన్ను) కలిగిస్తుంది. పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ–సిగరెట్ పొగ అయినా సరే... బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ–సిగరెట్ సురక్షితమేమీ కాదు. పైగా ఏ సిగరెట్ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ–సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్‌తో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్ కంటే సురక్షితం అని చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ–సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ–సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ–సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడమే మార్గం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల సంఖ్య చాలా ఎక్కువ. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్ కిమ్స్, సికింద్రాబాద్ -
వర్షాకాలం ఆహార విహారాలు
‘కాదేదీ పంచభూతాలకతీతం, లేదేదీ పంచభూతాత్మకం కానిది’, ఇది చరకుడు చెప్పిన ఆయుర్వేద తాత్త్వికత. దీని సూత్ర ప్రభావాలు మనిషిపై వాతావరణం చూపించే అనుబంధానికి ఆధారభూతం. ఇందుకు అనుగుణంగా ‘ఋతుచర్య’ని వివరించింది ఆయుర్వేదం. పన్నెండు మాసాలు, ఆరు ఋతువులు అందరికీ తెలిసినవే. సుమారుగా జూలై మాసం నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ‘వర్ష ఋతువు’ ఉంటుంది. ఈ సమయమే శ్రావణ భాద్రపద మాసాలు. జలప్రళయాలకు పెట్టింది పేరు. గ్రీష్మాంతపు తొలకరి జల్లులతో ఆరంభమవుతుంది. ఈ దక్షిణాయన సమయాన్నే ‘విసర్గ’ కాలం అంటారు. అంటే సూర్యుని శక్తి సమస్త ప్రాణులకు లభించే సమయం. వర్షాకాలంలో మనం ఇంకా నీరసంగానే ఉంటాం. క్రమేపీ ‘బలం’ పుంజుకుంటాం. ఈ ఋతువులో మన జఠరాగ్ని చాలా ‘మందం’గా ఉంటుంది. త్రిదోషాలలో ఒకటైన ‘వాతం’ మనలో ప్రకోపావస్థలో ఉంటుంది. వాతావరణం పృధ్వీ తేజో భూతాల ప్రాబల్యంతో, ఆమ్ల రసాత్మకంగా ఉంటుంది. గ్రీష్మం పూర్తయి వర్షాకాలం ఆరంభమవటం ఒక ‘ఋతుసంధి’ని సూచిస్తుంది. ఇటువంటి భౌతిక రసాయనిక మార్పుల వలన వాతావరణం సూక్ష్మక్రిముల మయం అవుతుంది. అందువల్ల క్రిముల ద్వారా సంక్రమించే రోగాలకు గురవుతాం. పరిసర జల కాలుష్యాల వల్ల దోమల వంటి కీటకాలు పేట్రేగుతాయి. వీటికి తోడు ఆహారవిహారాల్లోని మనం చూపే అశ్రద్ధ కారణంగా మరి కొన్ని రోగాలు తోడవుతాయి. వీటిని ఆయుర్వేద పరిభాషలో ‘ప్రజ్ఞాపరాధం, జనపదోధ్వంశం, క్రిమి, సాంక్రామిక రోగాలు’ గా చెప్పబడ్డాయి. కనుక ఇప్పుడు సంభవించే రోగాలకు, ‘అజీర్ణం, ఆహార కాలుష్యం, వాతావరణ క్రిములు’ ప్రధాన కారణాలని గమనించాలి. ఏయే రోగాలు సంభవిస్తాయి... ప్రతిశ్యాయం (జలుబు), కాస (దగ్గు), వమన (వాంతులు), అతిసార (విరేచనాలు), అజీర్ణం, ఆధ్మానం (కడుపు ఉబ్బరం), కామలా (పచ్చ కామెర్లు), మలేరియా, డెంగూ, టైఫాయిడ్, న్యుమోనియా వంటి అనేక రకాల జ్వరాలు వస్తాయి. నివారణ చర్యలు వర్షంలో తడవకూడదు ∙శీతల వాయువులకు గురికాకూడదు కనుక మనం ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి ∙ పరిసర ప్రాంతాలు, నీరు కలుషితం కాకుండా మన వంతు బాధ్యత వహించాలిఇంట్లోను, బయట ప్రతిరోజు ‘ధూపన’ కర్మ చేయాలి ఉదా: వేపాకులు ఆవాలు కాల్చి పొగ పెట్టడం, సాంబ్రాణి ధూపం వంటివి. వీటి వల్ల దోమల నుండి, సూక్ష్మక్రిముల నుండి రక్షణ కలుగుతుందివేడినీటితో స్నానం మంచిది, అభ్యంగ స్నానం కూడా మంచిదే ∙మరిగించి చల్లార్చిన నీరు తాగాలి ∙పగటి నిద్ర, వాయామ, శృంగారాలు తగ్గించాలి. గమనిక: ∙ కేవలం ఇంట్లో తయారు చేసుకునే, తేలికగా జీర్ణమయ్యే వేడివేడి ఆహారాన్ని మితంగా తినాలి ∙ఆకుకూరలలో క్రిముల యొక్క అతి చిన్నని గుడ్లు పొంచి ఉంటాయి కనుక అతి జాగ్రత్తగా వ్యవహరించాలి ∙ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటితో చక్కగా కడిగి, ఆ తరవాత సంపూర్ణంగా ఉడికించి మాత్రమే తినాలి ∙సలాడ్సుగా పచ్చివి తినడం తగ్గించాలి లేదా పచ్చివాటిని కూడా పైన చెప్పినట్లు ప్రక్షాళనం చెయ్యాలి ∙వేపడాలు, డీప్ ఫ్రై భక్ష్యాలు (పూరి, వడ, బజ్జీ మొదలైనవి) మంచిది కాదు. ఒకవేళ నిగ్రహించుకోలేక తింటే ‘హింగ్వాష్టక చూర్ణం’ అనే ఆయుర్వేద మందును ఒక చెంచా ఉదయం, ఒక చెంచా రాత్రి మజ్జిగతో లేదా వేడినీటితో సేవించాలి. ఆహారం తినకూడనివి: ఇంటి బయట తయారుచేసిన, బజారులో తినటానికి సిద్ధం చేసి అమ్మే తినుబండారాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, పానీపూరి, చెరకురసం మొదలైనవి. తినదగిన ఆహారం: ∙ఉడికించిన కూరలలో నిమ్మరసం కలుపుకొని తింటే మంచిది ∙ఉప్పుని అతి తక్కువగా వాడాలి ∙స్నిగ్ధ పదార్థాలు (పాయసాలు), ఆవు నెయ్యి, నువ్వుల నూనె తినటం మంచిదిపంచదారకు బదులు బెల్లం వాడుకోవటం మంచిది ∙ మాంసరసాలు కూడా మంచిదే. సూప్స్ (యూష): తృణ ధాన్యాలు, శాకములతో చేసిన వాటిలో శొంఠి, మిరియాల పొడి స్వల్పంగా కలిపి సేవించాలి ∙బియ్యం, గోధుమలు, కొర్రలు, బార్లీ మొదలైనవి బాగా పాతబడినవి మంచిది ∙తాజాఫలాలు కూడా మంచిదే ∙శుష్క ఫలాలు (డ్రైఫ్రూట్స్), ఇతర గింజలు (గుమ్మడి, సూర్యకాంతం) కూడా సేవించడం మంచిదే. వర్ష ఋతువున వలదోయి బయటి తిండి‘‘ ఇంట వండిన లఘువైన వంటకముల వేడివేడిగ తినవలె ప్రీతిమీర‘‘ త్రాగునీటిని మరిగింప ధ్యాస పెట్టు!పసుపుదాల్చీని లశునంబు పదిలరీతిఅల్లమును జేర్చి ఘన కషాయమును కాచిఆరు చెంచాలు ప్రతిరోజునారగింపదరికి రాబోవు రోగముల్ తథ్యమిదియ. ఔషధాలు అల్లం (5 గ్రా.), వెల్లుల్లి (5 రేకలు), దాల్చిన చెక్క చూర్ణం (3 గ్రా.), పసుపు (మూడు చిటికెలు), కలిపి పావు లీటరు నీళ్లు పోసి బాగా మరిగించి వడగట్టుకోవాలి. (మూడు వంతుల ద్రవ భాగం ఇగిరిపోవాలి. అంటే 60 మి.లీ. మిగలాలి) ∙ఉదయం 30 మి.లీ. (ఆరు టీ స్పూన్లు), సాయంత్రం 30 మి.లీ. తాగాలి. ఎంతమందికి ఈ కషాయం కావాలో... దానికి అనుగుణంగా ద్రవ్యాల పరిమాణం పెంచుకోవాలి. పరగడుపున కాని ఏదైనా తిన్న తరవాత కాని, ఎప్పుడు తాగినా మంచిదే. వర్షాకాలమంతా తాగితే మరీ మంచిది. కనీసం రోజుకి ఒకసారైనా తాగండి. ఇది జీర్ణకోశ సమస్యలకు, క్రిమిరోగ సమస్యలకు, జ్వరాలకు... అన్నిటికీ మంచిది. జలుబు, దగ్గులకు దివ్యౌషధం. ∙అతిసారానికి: వాము కషాయం తక్షణం పనిచేస్తుంది. ∙జలుబు, దగ్గులకు: తులసి లేదా తమలపాకు రసం + తేనె: రోజూ మూడుపూటలా తీసుకోవాలి. ∙పచ్చ కామెర్లకు: నేల ఉసిరిక (భూమ్యామలకి) రసం ఒక టీ స్పూను (5 మి.లీ.) + తేనె: రెండుపూటలా రెండు వారాలు సేవించాలి ∙గుంటకలగర (భృంగరాజ), తిప్పతీగె (గుడూచి) ఉసిరిక (ఆమలకీ) రసాలు కూడా శ్రేష్ఠమే. పునుగుల పులుసు పులుసు కోసం కావలసినవి: పెరుగు – రెండు కప్పులు (చిక్కగా గిలకొట్టాలి); సొరకాయ ముక్కలు – అర కప్పు; మునగకాడ – 1 (ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 2 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); టొమాటో – 1 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా కట్ చేయాలి); ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూన్; పసుపు – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; అల్లం తురుము – ఒక టీ స్పూన్; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూన్; ధనియాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పోపు గింజలు – ఒక టీ స్పూన్; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); పునుగుల కోసం కావలసినవి: పచ్చి సెనగ పప్పు – ఒక కప్పు; అల్లం – చిన్న ముక్క; పచ్చిమిర్చి – 3; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర – కొద్దిగా పులుసు తయారీ: ∙ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙వేరే పాత్రలో పెరుగు, సెనగ పిండి, పసుపు వేసి గిలకొట్టాలి ∙ఉడుకుతున్న ముక్కలలో ఈ మిశ్రమం పోసి బాగా కలిపి ఉడికించాలి ∙మిక్సీలో అల్లం తురుము, సెనగ పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా చేసి ఉడుకుతున్న పులుసులో వేసి కలపాలి ∙కరివేపాకు, కొత్తిమీర జత చేయాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి, కాగాక ఆవాలు జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వేసి కలిపి దింపేయాలి. పునుగుల తయారీ: ∙పచ్చి సెనగ పప్పును సుమారు రెండు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙మిక్సీలో సెనగ పప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా చేసి, తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పునుగులుగా వేసి వేయించి తీసి, పులుసులో వేసి గంట సేపు నాననివ్వాలి ∙పునుగులు జత కలవడంతో, మారు మాట్లాడకుండా పులుసును జుర్రేస్తారు. మీ వంటలకు ఆహ్వానం మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్కమ్. mail: familyvantakalu@ gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి. మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. Monsoon ,food ,Getaways – డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
గ్యాస్ట్రబుల్కూ, గుండెనొప్పికీ తేడా ఏమిటి?
నా వయసు 46 ఏళ్లు. నాకు తరచూ గ్యాస్‌తో ఛాతీమీద మంట వస్తుంటుంది. ప్రతిసారీ ఇది గ్యాస్ నొప్పే కదా అని అనుకుంటూ ఉంటాను. అయితే ఇటీవల నాలో ఒక అనుమానం మొదలైంది. ఒకవేళ నాకు గుండెనొప్పి వస్తే... దాన్ని కూడా ఇలాగే తేలిగ్గా తీసుకుంటానేమోనని సందేహం వచ్చి ఈమధ్య ఆందోళన పడుతున్నాను. గుండెనొప్పికీ, గ్యాస్‌తో వచ్చే ఛాతీనొప్పికి తేడాలు చెప్పండి. – ఎమ్. రాము, కరీంనగర్ ఇటీవల చాలా కేసులను పరిశీలిస్తే... చాలామంది గుండెపోటును గ్యాస్ సమస్యగానో, కడుపులో/ఛాతీలో మంటగానో, వెన్నునొప్పిగానో, మెడనొప్పిగానో తేలిగ్గా తీసుకుంటుంటారు. గ్యాస్‌తో వచ్చిన అసౌకర్యానికీ, గుండెపోటుకూ తేడా గుర్తించడానికి ఒక బండగుర్తు ఉంది. అదేమిటంటే... మీరు అజీర్తి లేదా గ్యాస్ సంబంధిత సమస్యతో బాధపడుతూ... కడుపులోనో లేదా గుండెలోనో మంటగా ఉంటే... ఒక్క యాంటాసిడ్ మాత్రతో తగ్గిపోతాయి. మెడ, వెన్ను లేదా ఆ పరిసరాల్లోని ఇతర ప్రాంతాల్లో నొప్పి ఉంటే పెయిన్‌కిల్లర్ మాత్ర తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇలా జరిగితే పరవాలేదు. కానీ మీరు ఒకటి రెండు టాబ్లెట్లు తీసుకున్న తర్వాత కూడా మీకు ఉపశమనం కలగకపోతే మాత్రం దాన్ని కచ్చితంగా గుండెనొప్పిగా అనుమానించాల్సిందే. గుండెపోటు వచ్చినప్పుడు ఛాతీ మధ్యలో నొప్పితో పాటు తీవ్రమైన అసౌకర్యం ఉన్నట్లుగా అనిపిస్తుంది. కొందరిలో ఛాతీ మెలిపెడుతున్నట్లుగానూ, ఛాతీపైన బరువు పెట్టినట్లుగా, ఒత్తిడి పడ్డట్లుగా ఉంటుంది. నొప్పి ఎక్కడినుంచి వస్తోందో బాధితులు గుర్తించలేరు. ఛాతీమొత్తం వ్యాపించినట్లుగా అనిపిస్తుంది. ఈ నొప్పి చాలాసార్లు కండరాలకు సంబంధించిన నొప్పిలా, జీర్ణసంబంధ నొప్పి కూడా ఇలాగే అనిపిస్తూ తికమకపెడుతుంటుంది. రెండింటికీ తేడా ఏమిటంటే... గుండెనొప్పి ఒకసారి వస్తే అది కొనసాగుతూ ఉంటుంది. అందే కండరాలు లేదా జీర్ణకోశ నొప్పులైతే వస్తూపోతూ ఉంటాయి. అందువల్ల గుండెపోటును గ్యాస్ సమస్యగా తికమకపడకుండా దాని లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి. ఒక్కోసారి నొప్పి ఛాతీలో కాకుండా చంకల నుంచి మెడ, దవడల నుంచి కూడా మొదలుకావచ్చు. అసిడిటీ సమస్యలుండే వారిలో ఛాతీలో మంటగా ఉంటుంది. కానీ మీకు వస్తున్న ఆ నొప్పి అసిడిటీ పెరగడం వల్ల వచ్చిన నొప్పి కాదని తేలితే... దాన్ని గుండెనొప్పిగా అనుమానించాలి. వెంటనే ఆసుపత్రికి వెళ్లేలా ఏర్పాటు చేసుకోవాలి. హార్ట్ ఫెయిల్ అయింది జాగ్రత్తలు చెప్పండి నా వయసు 67 ఏళ్లు. కొద్దిరోజులుగా నడిచినప్పుడు తీవ్రంగా ఆయాసం వస్తోంది. దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, పాదాల వాపు కనిపించాయి. దాంతో దగ్గర్లోని డాక్టర్‌ను కలిశాను. హార్ట్ ఫెయిల్యూర్ అని చెప్పారు. ఆయన నాకు కొన్ని పరీక్షలు చేసి జీవనశైలిలోమార్పులు చేసుకోవడం మంచిదని తెలిపారు. నాలాంటి వారు జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి. – బి. సీతారామారావు, కోదాడ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు ఆహారంలో తీసుకోవాల్సిన మార్పులివి... ఉప్పు: ఒంట్లో నీరు చేరుతూ ఆయాసం వంటి లక్షణాలు కనిబడితే ఉప్పు వాడకాన్ని పూర్తిగా తగ్గించడం మంచిది. రోజుకు 2.5 గ్రాములు (అరచెంచా) కంటే తక్కువే తీసుకోవాలి. ఉప్పు వేయకుండా కూరలు వండుకోవాలి. పచ్చళ్లు, బయట దొరికే చిరుతిండ్లను పూర్తిగా మానేయాలి. ఉప్పు ఉండని – బాదాం, జీడిపప్పు, ఆక్రోటు వంట్ నట్స్, పాలు, పండ్ల వంటివి ఎక్కువగా తీసుకోవచ్చు. అవసరమైతే కూరల్లో రుచి కోసం కొద్దిగా వెనిగర్ వంటివి ఉపయోగించుకోవచ్చు. ద్రవాహారం: ఒంట్లోకి నీరు చేరుతుంటే ద్రవాహారం తగ్గించాలి. ఒంట్లోకి నీరు చేరకపోతే మాత్రం రోజు లీటరున్నర వరకు ద్రవాహారాలు తీసుకోవచ్చు. విశ్రాంతి: గుండెవైఫల్యం వస్తే పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి చాలామంది అనుకుంటారు. కానీ ఇది సరికాదు. వైఫల్యం తీవ్రంగా ఉంటే తప్ప... శరీరం సహకరించినంత వరకు, ఆయాసం రానంతవరకు శారీరక శ్రమ, నడక, మెట్లు ఎక్కడం వంటివి చేయవచ్చు. మానసికంగా ప్రశాంతంగా ఉండాలి: గుండెవైఫల్యం (హార్ట్ ఫెయిల్యూర్), అశక్తతల వల్ల మానసిక ఒత్తిడి, తీవ్ర భావోద్వేగాలు తలెత్తుతుంటాయి. రోగులు ఒత్తిడిని అధిగమించాలి. ఇందుకు యోగా, ధ్యానం వంటివి మేలు చేస్తాయని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. ఈ మందులు వాడకండి: గుండె వైఫల్యం ఉన్నవారు కొన్ని మందులు... ముఖ్యంగా నొప్పులు తగ్గేందుకు వాడుకునే ఇబూప్రొఫేన్, డైక్లోఫెనాక్ వంటి ఎన్ఎస్ఏఐడీ రకం మందులు వేసుకోకూడదు. స్టెరాయిడ్స్‌కు దూరంగా ఉండాలి. ఇవి ఒంట్లోకి నీరు చేరేందుకు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని వాడకూడదు. నాటు మందుల్లో ఏ పదార్థాలు ఉంటాయో, అవి గుండె మీద ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం మంచిది. నొప్పులు ఎక్కువగా ఉంటే... మరీ అవసరమైతే నొప్పులు తగ్గేందుకు పారాసిటమాల్ వంటి సురక్షిత మందులు వాడుకోవచ్చు. వైద్యపరమైన జాగ్రత్తలు: గుండె వైఫల్యానికి వాడే మందులతో కూడా అప్పుడప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తవచ్చు. పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు వాటి మోతాదుల్లో మార్పులు చేసుకోవడం లేదా మందులను మార్చడం అవసరం. అందుకే హార్ట్ ఫెయిల్యూర్ అయినవారు తరచూ వైద్యులను సంప్రదించి, వారి సూచనలు తప్పక పాటించాలి. బైపాస్ అంటే ఏమిటి? చేయించాక జాగ్రత్తలేమిటి? నా వయసు 65 ఏళ్లు. ఒక రోజు ఛాతీనొప్పి వస్తే పరీక్షించిన డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయించాలన్నారు? అంటే ఏమిటి. సర్జరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. – నివేదిత, ఒంగోలు గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే కీలకమైన ధమనుల్లో అడ్డంకులు ఏర్పడినప్పుడు, రక్తసరఫరాకు అంతరాయం కలగకుండా చూసేందుకు బైపాస్ సర్జరీ చేస్తారు. మనం ఇంగ్లిష్‌లో సాధారణంగా బైపాస్ సర్జరీ అని పిలిచే ఈ ఆపరేషన్నే... వైద్యపరిభాషలో కరొనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అని వ్యవహరిస్తారు. దాని సంక్షిప్తరూపమే ఈ సీఏబీజీ ఆపరేషన్. ఇందులో కాళ్లు లేదా చేతులపై ఉన్న రక్తనాళాలను తీసి, గుండెకు అడ్డంకిగా ఏర్పడిన రక్తనాళాలకు ప్రత్యామ్నాయంగా, రక్తాన్ని బైపాస్ మార్గంలో అందించేలా అమర్చుతారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత, భవిష్యత్తులో ఇలా మార్చిన రక్తనాళాల్లోనూ కొవ్వు పేరుకోకుండా హృద్రోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. రక్తనాళాల్లో పేరుకున్న బ్లాక్స్‌ను అధిగమించి, రక్తాన్ని గుండెకు చేరవేసేందుకు వీలుగా బైపాస్ సర్జరీ చేస్తారు. అంతే తప్ప ఇది చేయడం వల్ల అప్పటికే ఉన్న గుండెజబ్బు తొలగిపోయిందని అపోహ పడకూడదు. మళ్లీ ఇదే పరిస్థితి పునరావృతం కాకుండా రోగి కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవే... రోగికి హైబీపీ ఉన్నట్లయితే దాన్ని ఎల్లప్పుడూ అదుపులో ఉంచుకునేలా డాక్టర్ సూచించిన మందులు తీసుకోవాలి. అలాగే రోగికి డయాబెటిస్ ఉంటే, రక్తంలోని చక్కెరపాళ్లు ఎల్లప్పుడూ అదుపులో ఉండేలా మందులు తీసుకుంటూ, కొవ్వులు తక్కువగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. ఇక పొగతాగే అలవాటు ఉంటే దాన్ని తక్షణం పూర్తిగా మానేయాలి. డాక్టర్లు సూచించిన తగిన వ్యాయామాలు చేస్తూ ఉండాలి.డాక్టర్ అనూజ్ కపాడియా, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
ఏసీ వల్లనేనా ఈ సమస్య?
నా వయసు 35. ఈ వేసవిలో ఆఫీసులో ఎక్కువగా ఏసీలోనే ఉంటున్నాను. నేను గమనించినదేమిటంటే... ఇటీవల నేను తీవ్రమైన అలసటతో బాధపడుతున్నాను. నా సమస్య ఏసీ వల్లనేనా? నాకు సరైన పరిష్కారం చెప్పండి. – ప్రణీత, హైదరాబాద్ ఎయిర్ కండిషన్డ్ వాతావరణంలో చాలా ఎక్కువ సేపు గడపడం వల్ల కొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలామందికి మంచి సౌకర్యంగా అనిపించే ఏసీ, మరికొందరి ఆరోగ్యానికి కొన్ని రకాలఅనర్థాలు తెచ్చిపెట్టవచ్చు. ఏసీ వల్ల దాదాపు ఐదు ప్రధానమైన సమస్యలు వస్తాయి. అవి... తీవ్రమైన అలసట : చాలాసేపు ఏసీలో గడపడంతో పాటు ఆ ఏసీ వల్ల చల్లదనం ఎక్కువగా ఉంటే కొందరిలో పనిముగిసే సమయానికి భరించలేని తలనొప్పి, తీవ్రమైన నిస్సత్తువ వంటి లక్షణాలు కనిపిస్తాయి. చల్లటి వాతావరణంలో కండరాలకు తగినంత రక్తప్రసరణ జరగకపోవడం వల్ల అలసటకు గురవుతారు. పొడి చర్మం : చాలాసేపు ఏసీలో గడిపేవారి చర్మంపై తేమ తగ్గుతుంది. దాంతో వారి చర్మం పొడిగా అనిపిస్తుంది. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తమ చర్మంపై మాయిశ్చరైజర్‌ను రాసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులు తీవ్రం కావడం : కొన్ని రకాల దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారిలో... అంటే ఆర్థరైటిస్, న్యూరైటిస్ (నరాల చివరలు మొద్దుబారి స్పర్శ తెలియకపోవడం లేదా కాళ్లు, చేతులు తిమ్మిర్లు పట్టడం) వంటి జబ్బులు ఉన్నవారిలో సమస్యలు తీవ్రమవుతాయి. కొందరిలో ఈ న్యూరైటిస్ కారణంగా నిస్సత్తువ కలిగే అవకాశాలు ఎక్కువ. అలవాటైతే వేడిని తట్టుకోలేకపోవడం : గతంలో వేడి వాతావరణంలో ఉన్నవారైనప్పటికీ నిత్యం ఏసీలో ఉండటం అలవాటైన వారు ఇక ఏమాత్రం వేడిమిని భరించలేరు. వేసవిలో బయటకు రావడమే కష్టంగా అనిపిస్తుంది. శ్వాస సమస్యలు : చాలాసేపు ఏసీ కారులో మూసి ఉన్న డోర్స్, గ్లాసెస్ వల్ల అక్కడి సూక్ష్మజీవులు అక్కడే తిరుగుతుండటం వల్ల తేలిగ్గా శ్వాససంబంధమైన వ్యాధులకు గురవుతుంటారు. అందుకే నిత్యం ఏసీలో ఉండేవారు తప్పనిసరిగా ప్రతి రెండు గంటలకు ఒకసారి కాసేపు బయటకు వచ్చి స్వాభావిక వాతావరణంలో పదినిమిషాల పాటైనా గడిపి వెళ్తుండాలి. అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. డాక్టర్ సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
ఇవే కనుక అలా ఉంటేనా!
మండుటెండ, దానికితోడు చాలా దూరం నుంచి నడిచి వస్తుండటం వల్ల అతనికి అలసటగా అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాం అనుకున్నాడు అతనొక బాటసారి. చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తున్నాడు. దారిలో ఓ పక్కగా అతనికొక గుమ్మడిపాదు కనిపించింది. దాని నిండా ఇంతింతలావు గుమ్మడికాయలున్నాయి. వాటిని చూసి అతను ‘‘దేవుడు ఎంత పిచ్చివాడు? ఇక్కడెక్కడో అనామకంగా... బలహీనంగా పడి ఉన్న ఈ గుమ్మడి పాదుకు ఇంతింత పెద్ద కాయలు ఇచ్చాడు’’ అనుకున్నాడు. తర్వాత ఇంకొంచెం దూరం నడిచాడు. అక్కడ అతనికొక మర్రిచెట్టు కనిపించింది. ఎంతో విశాలంగా, ఊడలు దిగి ఉన్న ఆ చెట్టుకు చిన్న చిన్న కాయలుండటం చూశాడు. ‘‘దేవుడు నిజంగానే ఉట్టి వెర్రివాడు, పైగా మూర్ఖుడు కూడా! లేకపోతే ఇంత పెద్ద చెట్టుకు అంత చిన్న కాయలా?’’ అనుకున్నాడు. మండుటెండ, దానికితోడు చాలా దూరం నుంచి నడిచి వస్తుండటం వల్ల అతనికి అలసటగా అనిపించింది. కాసేపు విశ్రాంతి తీసుకుని వెళదాం అనుకున్నాడు. దగ్గరున్న సంచిలోనుంచి వెంట తెచ్చుకున్న తినుబండారాలను తిన్నాడు. తలకు చుట్టుకుని ఉన్న కండువాను విప్పి, చెట్టుకింద పరిచాడు. నీడలో పడుకున్నాడు. నిద్ర ముంచుకొచ్చింది. హాయిగా పడుకున్నాడు. కాసేపయ్యాక లేచాడు. తన మీద, పక్కన పడి ఉన్న మర్రికాయలను చూశాడు. ‘‘ఇంకా నయం, ఈ కాయలు చిన్నవి కాబట్టి, మీద పడినా నాకేమీ కాలేదు. అదేగనక ఆ గుమ్మడికాయల పరిమాణంలో ఉండి ఉంటే ... అవి గనక నా మీద పడి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో... నిజంగా దేవుడు ఎంత దయామయుడు... ఎంత ఆలోచనాపరుడు!’’అనుకుని, మనసులోనే దేవుడికి వెయ్యి దణ్ణాలు పెట్టుకుని లేచి అక్కyì నుంచి వెళ్లిపోయాడు. పట్టించుకుంటే... పట్టి పట్టి చూస్తే ప్రతిదీ లోపంగానే కనిపిస్తుంది. కాస్త ఆలోచించి, నిదానించి చూస్తే గానీ తెలియదు, మర్మం ఏమిటో. -
ఒత్తిడి తగ్గదు సరికదా... ఎక్స్ట్రా డేంజర్స్
పల్మనాలజీ కౌన్సెలింగ్ నా వయసు 49 ఏళ్లు. చాలా ఒత్తిడి ఉండే వృత్తిలో ఉన్నాను. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నాను. ఆ ఒత్తిడి తగ్గించుకోడానికి రోజూ సిగరెట్లు కాలుస్తుంటాను. రోజూ దాదాపు మూడు నాలుగు పెట్టెల సిగరెట్లు తాగుతుంటాను. ఇటీవల నాకు తీవ్రమైన ఆయాసం, దగ్గు వస్తోంది. సరిగా నిద్రపట్టడం లేదు. మామూలు సమస్యే కదా తగ్గిపోతుంది అనుకున్నాను. దగ్గు ఎడతెరిపి లేకుండా వస్తోంది. మందులు వాడుతున్నా రోజురోజుకూ పెరుగుతోంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. – శామ్యూల్, కరీంనగర్ సిగరెట్ కాల్చడం ఒత్తిడిని తగ్గించకపోగా అనేక రకాల ఆరోగ్య సమస్యలను కలగజేస్తుంది. మొదట్లో సరదాగా ప్రారంభమయ్యే అలవాటు... ఆ తర్వాత వదులుకోలేని వ్యసనంగా మారి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. రోజుకు మూడు పాకెట్ల సిగరెట్లు కాల్చడం అంటే చాలా పెద్ద విషయం. అది ఆరోగ్యంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపుతుంది. ఊపిరితిత్తులు పాడైపోయి శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు పూడుకుపోయి గుండె సంబంధిత సమస్యలు, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ), నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు... చర్మసంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. కాబట్టి మీరు వెంటనే ధూమపానం మానేయండి. వైద్యులను సంప్రదించి వారు సూచించిన పరీక్షలు చేయించుకోండి. పొగతాగడం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదు. సిగరెట్ ఒత్తిడిని తగ్గిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే. మీరు ఎంత త్వరగా పొతతాగడం మానేస్తే... అది మీ ఆరోగ్యానికి అంత మేలు చేస్తుంది. డాక్టర్ పి. నవనీత్ సాగర్‌రెడ్డి,సీనియర్ పల్మునాలజిస్ట్, యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ, హైదరాబాద్ ఐబీఎస్... భయపడాల్సిందేమీలేదు! హోమియో కౌన్సెలింగ్ నా వయసు 38. భోజనం తిన్న వెంటనే టాయిలెట్‌కు వెళ్లాల్సి వస్తోంది. బయటకు ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. కొన్నిసార్లు మలబద్దకం, విరేచనం ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. మలంలో జిగురు కనిపిస్తోంది. కొద్దిగా నొప్పి ఉండి మెలిపెట్టినట్లుగా అనిపిస్తోంది. తేన్పులు, కడుపు ఉబ్బరం వికారం, తలనొప్పి, ఆందోళన ఉన్నాయి. ఆత్మన్యూనతతో బాధపడుతున్నాను. – మహేశ్‌కుమార్, తాడేపల్లిగూడెం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్)తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి వాస్తవమైన కారణాలు స్పష్టంగా తెలియదు. అయితే జీర్ణవ్యవస్థలో తరచూ వచ్చే ఇన్ఫెక్షన్లు ∙దీర్ఘకాల జ్వరాలు ∙మానసిక ఆందోళన ∙కుంగుబాటు ∙ఎక్కువరోజులు యాంటీబయాటిక్స్‌వాడటం జన్యుపరమైన కారణాలు ∙చిన్నపేగుల్లో బ్యాక్టీరియా ఎక్కువ సంఖ్యలో ఉండటం వంటివి ఐబీఎస్‌కు దోహదం చేస్తాయి. సాధారణంగా ఈ వ్యాధి పురుషుల్లో కంటే మహిళల్లో మూడువంతులు ఎక్కువ. మీరు చెప్పిన లక్షణాలతో పాటు కొందరిలో నొప్పి లేకుండా కూడా ఐబీఎస్ వస్తుండవచ్చు. వీళ్లలో చాలా వేగంగా మలవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. నిద్రలేస్తూనే టాయెలెట్‌కు పరుగెత్తాల్సి వస్తుంది. ఐబీఎస్ క్యాన్సర్‌కు దారితీయదు. ప్రాణాంతకమూ కాదు. అయితే చాలా ఇబ్బంది పెడుతుంది. రోగ లక్షణాలను బట్టి, కడుపులో పరాన్నజీవులు ఉన్నాయా, చిన్నపేగుల్లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనే కొన్ని అంశాల ఆధారంగా వ్యాధి నిర్ధారణ చేస్తారు. మలపరీక్ష, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అబ్డామిన్, ఎండోస్కోపీ, హైడ్రోజెన్ బ్రీత్ టెస్ట్ పరీక్షలు నిర్ధారణకు తోడ్పడతాయి. వ్యాధి నివారణ/నియంత్రణకు సూచనలు : పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవాలి ఒత్తిడిని నివారించుకోవాలి ∙పొగతాగడం, మద్యంపానం అలవాట్లను పూర్తిగా మానుకోవాలి ∙రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి. హోమియోలో చికిత్స: ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్‌కు హోమియోలో అత్యంత శక్తిమంతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. కారణం ఏదైనప్పటికీ అంటే... జీర్ణవ్యవస్థలో ఇన్ఫెక్షన్లూ, దీర్ఘకాలంగా మందులు వాడటం వల్ల కలిగే దుష్ప్రభావం వల్ల జీర్ణవ్యవస్థలో వచ్చే మార్పులు, ఒత్తిడి, ఆందోళన వల్ల ఐబీఎస్ వస్తే దాన్ని హోమియో ప్రక్రియలో కాన్స్టిట్యూషనల్ సిమిలియమ్ చికిత్స ద్వారా చాలావరకు శాశ్వతంగా పరిష్కరించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్ డైరక్టర్, పాజిటివ్ హోమియోపతి విజయవాడ, వైజాగ్ -
నిద్ర వస్తున్నట్లు అనిపిస్తోందా..?
మూడు ముచ్చట్లు పెద్దగా పని చేయకపోయినా అలసటగా అనిపిస్తోందా..? రాత్రి తగినంత సేపు నిద్రపోయినా పగటిపూట మగత మగతగా నిద్ర ముంచుకొస్తోందా..? పని మధ్యలో ఆపేసి కాసేపు కునుకుతీసి లేచినా, పరిస్థితి బాగుండటం లేదా..? అయితే, ఓసారి మీ బరువును పరీక్షించుకోండి. స్థూలకాయానికి తోడు డిప్రెషన్‌తో బాధపడేవారిలో ఇలాంటి సమస్యలు మామూలేనంటున్నారు నిపుణులు. హైపర్ సోమ్నియా.. అంటే, అతినిద్రతో బాధపడుతున్న వారు ప్రపంచ జనాభాలో దాదాపు ముప్పయి శాతం వరకు ఉంటారని ఒక అంచనా. హైపర్ సోమ్నియా కారణంగా పనితీరు మందగించడమే కాదు, తరచు యాక్సిడెంట్లకు గురయ్యే ప్రమాదం కూడా ఉందని అమెరికాలోని పెన్ స్టేట్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన నిపుణులు హెచ్చరిస్తు న్నారు. దీని నుంచి బయట పడేందుకు బరువు తగ్గడమే ఉత్తమమార్గమని వారు సూచిస్తున్నారు. -
ఆయాసం వస్తే... వేడి వేడి టీ తాగాలి!
డాక్టర్ సలహా నా వయసు 75 ఏళ్లు. ఉబ్బసంతో బాధపడుతున్నాను. చలికాలం తీవ్రమవుతోంది. అలర్జిక్ కోల్డ్ చాలా బాధపెడుతోంది. ఈ మధ్య తలదిమ్ముగా, భారంగా ఉంటోంది. బి.పి, డయాబెటిస్, అజీర్తి వంటి ఇబ్బందులేమీ లేవు. - ఎస్. ఈశ్వరయ్య, కంకిపాడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు ఉబ్బసరోగం (ఆస్త్మా) ఉంది. దీన్నే ఆయుర్వేదంలో ‘తమకశ్వాస’ అంటారు. శరీరానికి సరిపడని అసాత్మ్య (ఎలర్జిక్) పదార్థాల వల్ల ఈ వ్యాధి లక్షణాలు జనిస్తాయి. ఇది కొందరిలో వారసత్వంగా రావచ్చు. మానసిక ఒత్తిడి కూడా ఒక కారణమే. చల్లటి మేఘాలు, వాతావరణంలో అధిక తేమ, దుమ్ము, ధూళి, కొన్ని రసాయనిక పదార్థాలు మొదలైనవి కూడా కొంతమందికి అసాత్మ్యంగా ఉంటాయి. ఆయాసం ఉన్న సమయంలో విశ్రాంతి తీసుకోవాలి. శ్రమకు గురికాకూడదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వేడి వేడి ‘టీ’ తాగితే మంచిది. శీతల పానీయాలకు, ఫ్రిజ్‌లో ఉంచిన పదార్థాలకు దూరంగా ఉండాలి. మందులు: శ్వాసకుఠార రస (మాత్రలు) ఉదయం ఒకటి- రాత్రి ఒకటి కనకాసవ (ద్రావకం) మూడు చెంచాలకు సమానంగా గోరు వెచ్చని నీళ్లు కలిపి (ఇది ఒక మోతాదు) రోజుకు మూడుసార్లు (ఉదయం, మధ్యాహ్నం, రాత్రి) తీసుకోవాలి. ఆయాసం తగ్గిపోయిన తర్వాత వాడాల్సిన మందులు: శృంగారాభ్రరస (మాత్రలు) ఉదయం ఒకటి- రాత్రి ఒకటి అగస్త్య హరీతకి రసాయనం (లేహ్యం) ఉదయం ఒక చెంచా- రాత్రి ఒక చెంచా చప్పరించి పాలు తాగాలి. వీటిని ఎంత కాలమైనా వాడవచ్చు. ఈ మందుల వల్ల ఊపిరి తిత్తులకు, శ్వాస కోశ అవయవాలకు బలం కలిగి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. కాబట్టి ఉబ్బసం అతి తరచుగా రావడం అనే సమస్య తగ్గిపోతుంది. ఒకవేళ ఉబ్బసం వచ్చినా దాని తీవ్రత స్వల్పంగా ఉంటుంది. కొంతకాలానికి అసాత్మ్యత (ఎలర్జీ)కు గురికావడం తగ్గి క్షమత్వం పెరుగుతుంది. ఆయాసం లేనప్పుడు రెండు పూటలా పది నిమిషాల పాటు ప్రాణాయామం చేస్తే మంచిది. గృహవైద్యం: ఒక చెంచా ఆవనూనెలో ఒక చెంచా తేనె కలిపి తాగితే ఆయాసానికి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దగ్గు, కఫం తగ్గడానికి... ఒక చెంచా తులసిరసంలో ఒక చెంచా తేనె కలిపి మూడు పూటలా సేవిస్తే మూడురోజుల్లో బాధ తగ్గిపోతుంది. - డాక్టర్ విఎల్‌ఎన్ శాస్త్రి, ఆయుర్వేద వైద్య నిపుణులు -
నీరసంతో తల తిరుగుతుంటే...
గృహవైద్యం వయసుతో నిమిత్తం లేకుండా చాలామందికి తరచుగా కానీ అప్పుడప్పుడూ కానీ, తల తిరుగుతుంటుంది. ఇందుకు ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఆహారాన్ని తక్కువసార్లు ఎక్కువ మోతాదులో తీసుకోవడం కంటే తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి. అలా చేసినప్పుడు జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు రోజంతా శక్తి విడుదల అవుతుంటుంది. పుల్లని పండ్లను తీసుకోవాలి. ముఖ్యంగా ప్రయాణాల్లో తల తిరిగినట్లుండే వాళ్లు రోజుకు రెండు బత్తాయి లేదా కమలాపండ్లను తీసుకోవాలి. అలాగే నిమ్మకాయను దగ్గర ఉంచుకుని వాసన పీలుస్తుంటే తల తిరగడం, వాంతి వస్తున్న భావన కలగవు. ఆహారంలో ఐరన్ పుష్కలంగా లభించడానికి ఆకుకూరలు, కాయగూరలు, కోడిగుడ్లు తీసుకోవాలి. అయినప్పటికీ ఐరన్‌లోపంతో బాధపడుతున్నట్లయితే డాక్టర్ సలహాతో ఐరన్ మాత్రలు తీసుకోవాలి. దేహంలో ‘సి’ విటమిన్ లోపిస్తే ఆహారంలో తీసుకున్న ఐరన్ దేహానికి పట్టదు. కాబట్టి ఐరన్ లోపాన్ని పరిష్కరించుకోవడానికి పుల్లటి పండ్లను తినాలి. ఎంతటి పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ ఆహారాన్ని వేళ తప్పించరాదు. ఒకవేళ భోజనం చేయాల్సిన సమయానికి భోం చేయడం కుదరకపోతే ఒక పండు లేదా బలవర్ధకమైన చిరుతిండి అయినా తినాలి. -
ఈ సమయంలో ఎందుకింత నీరసం...?
నేను ఇప్పుడు ఐదోనెల గర్భిణిని. గత కొంతకాలంగా ఏ చిన్న పనిచేసినా తొందరగా అలసిపోతున్నాను. ఎప్పుడూ నీరసంగా ఉంటోంది. కాళ్లవాపులు కూడా కనిపిస్తున్నాయి. గర్భవతిని కాకముందు పీరియడ్స్ సమ యంలో చాలా ఎక్కువగా రక్తస్రావం అయ్యేది. ఇలా ఎందుకు ఉంటోంది? ఈ అలసట తగ్గడానికి ఏం చేయాలి? - జయలక్ష్మి, తాడిపత్రి మీరు చెప్పిన లక్షణాలతో పాటు మీరు గర్భవతి కాక మునుపు రుతుసమయంలో చాలా ఎక్కువ రక్తస్రావం జరిగేదన్న హిస్టరీ ఆధారంగా మీకు రక్తహీనత (అనీమియా) ఉండవచ్చని తెలుస్తోంది. రక్తహీనత అన్నది గర్భవతుల్లో చాలా సాధారణంగా కనిపించే సమస్య. ఇది ప్రధానంగా పోషకాహార లోపం వల్ల మన దేశంలో ఎక్కువగా కనిపిస్తుంది. రక్తహీనత అనే కండిషన్లో రక్తంలోని హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్ తగ్గడం వల్ల కలుగుతుంది. ఈ హిమోగ్లోబిన్ అన్నది రెండు ఆల్ఫా, రెండు బీటా చెయిన్లు గల నిర్మాణంతో ఉంటుంది. ఇది ఐరన్‌ను కలిగి ఉండి, దాని సహాయంతో ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను అన్ని అవయవాలకూ చేరవేస్తుంది. నిజానికి మహిళల్లో ప్రతి డెసీలీటర్‌కు 11 నుంచి 12 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండటాన్ని నార్మల్‌గా పరిగణిస్తారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సిఫార్సులను బట్టి ఒకవేళ ఈ కొలత 10 నుంచి 10.9 వరకు ఉంటే దాన్ని చాలా మైల్డ్ అనీమియా అనీ, 7 నుంచి 10 ఉంటే దాన్ని ఓ మోస్తరు అనీమియా అనీ, 7 కంటే తక్కువ ఉంటే దాన్ని తీవ్రమైన అనీమియా అనీ, ఒకవేళ ఆ విలువ నాలుగు కంటే తక్కువ ఉంటే అతితీవ్రమైన అనీమియా అని పేర్కొనవచ్చు. రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే మీరు చెప్పినట్లుగా తొందరగా అలసిపోవడం, నీరసంగా, నిస్సత్తువగా ఉండటం, తలతిరుగుతున్నట్లు అనిపించడం, ఊపిరి ఆడకపోవడం, కాళ్లవాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పేషెంట్ కళ్లు, నాలుకను డాక్టర్లు పరీక్షిస్తారు. అవి పేలవంగా ఉండటాన్ని బట్టి రక్తహీనతగా అనుమానించి రక్తపరీక్షలు చేయిస్తారు. అయితే చాలామంది రక్తహీనత కోసం హిమోగ్లోబిన్ పాళ్లను మాత్రమే పరీక్షిస్తారు. నిజానికి పూర్తిస్థాయి రక్తపరీక్ష (కంప్లీట్ బ్లడ్ పిక్చర్-సీబీపీ) చేయించాలి. ఎందుకంటే ఈ పరీక్ష ద్వారా రక్తహీనత ఎంత తీవ్రంగా ఉందో తెలియడంతో పాటు అది ఎందువల్ల ఉందో కూడా కొంతమేరకు తెలుస్తుంది. సీబీపీని ఆధారంగా తీసుకుని తదుపరి పరీక్షలను నిర్ణయిస్తారు. ఉదాహరణకు ఈ పరీక్షల్లో ఎమ్‌సీవీ అనే అంశం గనక 80 కంటే తక్కువగా ఉంటే అది వంశపారంపర్యంగా వస్తున్న రక్తహీనత (థలసీమియా) కావచ్చా అన్నది తెలుస్తుంది. ఇక చికిత్స విషయానికి వస్తే రక్తహీనత తీవ్రతను బట్టి, గర్భవతికి ఎన్నో నెల అన్న అంశాన్ని బట్టి... ఆమెకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వడం, ఇంజెక్షన్లను సూచించడం, అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించడం వంటివి చేయాల్సి ఉంటుంది. దాదాపు గర్భవతులందరిలోనూ రక్తం పలుచబారడం అన్నది సాధారణమైన అంశం కాబట్టి సాధారణంగా గర్భవతులందరికీ 16వ వారం ప్రెగ్నెన్సీ నుంచి 60 ఎం.జీ. ఐరన్ టాబ్లెట్లను సూచిస్తుంటాం. వాస్తవానికి వీటిని పరగడుపున తీసుకుంటే బాగా రక్తం పడుతుంది. అయితే చాలామందికి ఇలా తీసుకోవడం వల్ల వికారం, వాంతులు, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే మొదట కాస్త టిఫిన్ తిన్నాక... గంటసేపటి తర్వాత ఐరన్ టాబ్లెట్ తీసుకుని, నిమ్మరసం వంటివి తాగాలని సూచిస్తుంటాం. దీంతో ఒంటికి బాగా రక్తం పడుతుంది. ఇక మీరు చెబుతున్న లక్షణాలను బట్టి డాక్టర్‌ను సంప్రదించి, ఒకసారి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ పరీక్ష చేయించుకుని, రక్తహీనతకు కారణాన్ని తెలుసుకుని, దాన్నిబట్టి తగిన చికిత్స తీసుకోండి. గర్భవతులందరూ రక్తహీనతను నివారించుకోవడం కోసం బలవర్థకమైన ఆహారం అంటే... మాంసాహారం తినేవారైతే మాంసం, కాలేయం, చేపలు... శాకాహారం తినేవారైతే ఆకుకూరలు, ఖర్జూరం, బెల్లంతో చేసిన పదార్థాలు తినడం వల్ల హిమోగ్లోబిన్‌ను సమకూర్చుకోగలుగుతారు. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్