అలర్జీతో ఆయాసం... వ్యాయామం చేయడం ఎలా? | How to exercise fatigue with allergy | Sakshi
Sakshi News home page

అలర్జీతో ఆయాసం... వ్యాయామం చేయడం ఎలా?

Published Mon, Aug 6 2018 12:33 AM | Last Updated on Mon, Aug 6 2018 12:33 AM

 How to exercise fatigue with allergy - Sakshi

పల్మునాలజీ కౌన్సెలింగ్‌

పీరియడ్స్‌  సమయంలో శ్వాస  సరిగా ఆడటం లేదెందుకు?
నా వయసు 36 ఏళ్లు. గృహిణిని. నాకు పీరియడ్స్‌ సమయంలో సరిగా శ్వాస అందడం లేదు. ఆ సమయంలో దగ్గు, పిల్లికూతలు కూడా వస్తుంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏమిటి? – ఎమ్‌. కవిత, విశాఖపట్నం 
రుతుక్రమం వచ్చే సమయం మహిళల్లో  ఒక కీలకమైన దశ. ఆ సమయంలో మహిళల భౌతిక, మానసిక, ప్రవర్తనల్లో ఎన్నో మార్పులు కనిపించవచ్చు. దాంతో కొన్నిసార్లు  అటు శరీరక, ఇటు మానసిక సమస్యలు కనిపించవచ్చు. మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఉన్న సమస్యను కెటామెనియల్‌ ఆస్తమాగా చెప్పవచ్చు. కెటామెనియల్‌ ఆస్తమాను రుతుక్రమం ముందు వచ్చే ఆస్తమా (ప్రీమెనుస్ట్రువల్‌ ఆస్తమా)గా పరిగణించవచ్చు. ఈ సమయంలో మహిళల్లో ఆస్తమా లక్షణాలు తీవ్రమవుతాయి. రుతుక్రమానికి ముందుగా చాలామంది మహిళల్లో ఆస్తమా ఎక్కువ కావడం, ఆసుపత్రిలో చేరాల్సిరావడం వంటి సందర్భాలూ ఉన్నాయి. పీరియడ్స్‌కు ముందు శ్వాస అస్సలు అందకపోవడం వల్ల ఈ పరిణామాలు సంభవిస్తాయి. దీనికి నిర్దిష్టమైన కారణాలు తెలియకపోయినా సాధారణంగా ప్రోజెస్టెరాన్‌ లేదా ప్రోస్టాగ్లాండిన్స్‌ వంటి హార్మోన్లలోని మార్పులు ఇందుకు దారితీస్తాయని కొంతవరకు ఊహించవచ్చు. ఇక అండం రూపుదిద్దుకునే దశలో ప్రోజెస్టెరాన్‌ పాళ్లు క్రమంగా పెరుగుతాయి. ఆ తర్వాత పీరియడ్స్‌కు ముందు ఇవే పాళ్లు గణనీయంగా పడిపోతాయి. మహిళల్లో కండరాలు రిలాక్స్‌ కావడానికి తోడ్పడే స్రావాలు సైతం ఊపిరితిత్తుల్లోని గాలి ప్రయాణించే పైప్‌లనూ ప్రభావితం చేస్తాయి. ప్రోజెస్టెరాన్‌ పెరగడం వల్ల కలిగే మార్పులు శ్వాస అందనివ్వకుండా చేసి, ఆస్తమాను ప్రేరేపిస్తాయి. అలాగే  రుతుక్రమానికి ముందుగా వ్యాధినిరోధకత విషయంలో వచ్చే మార్పులు కూడా ఆస్తమాను ప్రేరేపించవచ్చు. అందుకే... రుతుక్రమం సమయంలో ఆస్తమా కనిపిస్తే  దానికి నిర్దిష్టమైన కారణమేమిటన్నది నిశితంగా నిర్ధారణ చేయడం చాలా అవసరం. ఇక మీకు ఏ అంశం ఆస్తమాను పేరేపిస్తుందో నిశితంగా తెలుసుకొని, దానికి చికిత్స అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు ఒకసారి మీకు దగ్గర్లోని పల్మునాలజిస్ట్‌ను కలవండి.  

నా వయసు 33. నాకు డస్ట్‌ అలర్జీ ఉంది. దుమ్ము అంటే సరిపడదు. దాంతో ఇటీవల నేను వ్యాయామం చేయదలచినప్పుడల్లా ఆయాసం వస్తోంది. ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామం చేయాలనుకున్నా ఇది నాకు ప్రతిబంధకంగా ఉంటోంది. దయచేసి నేను వ్యాయామం చేయడానికి అవసరమైన సలహా ఇవ్వగలరు.  – ఎమ్‌డీ గియాసుద్దిన్, కర్నూలు
వ్యాయామం ఒక్కోసారి ఆస్తమాను ప్రేరేపించి, ఆయాసం వచ్చేలా చేస్తుంటుంది. దీర్ఘకాలిక ఆస్తమాతో బాధపడే చాలామందిలో వ్యాయామం చేసినప్పుడల్లా ఆస్తమా కనిపిస్తుంటుంది. సాధారణంగా మనం శ్వాస తీసుకునే సమయంలో బయటిగాలి కాసేపు ముక్కురంధ్రాలలో ఉండి వెచ్చబడుతుంది, అదే సమయంలో ఆ గాలికి తేమ సమకూరుతుంది. కానీ వ్యాయామం చేసే సమయంలో గాలి ఎక్కువగా తీసుకోవడం కోసం నోటితోనూ గాలిపీలుస్తుంటారు. అంటే వారు తేమలేని పొడిగాలినీ, చల్లగాలినీ పీలుస్తుంటారన్నమాట. దాంతో గాలిని తీసుకెళ్లే మార్గాలు ఈ చల్లగాలి వల్ల ముడుచుకుపోతాయి. ఫలితంగా గాలిని ఊపిరితిత్తుల్లోకి తీసుకెళ్లే మార్గాలన్నీ సన్నబడతాయి. దాంతో కొన్ని లక్షణాలు కనబడతాయి. అవి...  పొడి దగ్గు వస్తుండటం ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం ∙పిల్లికూతలు వినిపించడం ∙వ్యాయామం తర్వాత తీవ్రమైన అలసట (మామూలుగా వ్యాయామం చేసేవారిలో ఇంత అలసట ఉండదు) ∙వ్యాయామ సమయంలో గాలి తీసుకోవడంలో ఇబ్బంది / ఆయాసం. సాధారణంగా వ్యాయామం మొదలుపెట్టిన 5 నుంచి 20 నిమిషాల్లో ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతుంది. లేదా కొద్దిగా వ్యాయామం చేసి ఆపేసినా... 5 – 10 నిమిషాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో డాక్టర్‌ను తప్పక సంప్రదించాలి. 

అయితే వ్యాయామంతో వచ్చే ఆయాసం (ఎక్సర్‌సైజ్‌ ఇండ్యూస్‌డ్‌ ఆస్తమా) వచ్చినప్పుడు అప్పటికి ఆపేసినా... వ్యాయామాన్ని పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను అధిగమించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. వ్యాయామం మొదలుపెట్టడానికి ముందుగా పీల్చే మందులైన బ్రాంకోడయలేటర్స్‌ వాడి, వ్యాయామాన్ని కొనసాగించవచ్చు. ఇక తక్షణం పనిచేసే లెవోసాల్‌బ్యుటమాల్‌ వంటి బీటా–2 ఔషధాలను వ్యాయామానికి 10 నిమిషాల ముందుగా వాడి, వ్యాయామ సమయంలో గాలిగొట్టాలు మూసుకుపోకుండా జాగ్రత్తపడవచ్చు. దీనితో పాటు వ్యాయామానికి ముందర వార్మింగ్‌ అప్, వ్యాయామం తర్వాత కూలింగ్‌ డౌన్‌ ప్రక్రియలను చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. సాధారణంగా వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు గాలిలో పుప్పొడి ఎక్కువగా ఉంటుంది. కొన్నిరకాల ఇన్ఫెక్షన్లు ఉదాహరణకు జలుబు, ఫ్లూ, సైనసైటిస్‌ వంటివి ఆస్తమాను మరింత ప్రేరేపిస్తాయి. ఇలా నలతగా ఉన్న సమయాల్లో వ్యాయామం చేయకూడదు. ఆస్తమా ఉన్నవారు త్వరగా ముగిసే ఆటల్లాంటివి... అంటే వాలీబాల్, బేస్‌బాల్, వాకింగ్‌ వంటివి చేయాలి. అంతేగానీ దీర్ఘకాలం పాటు కొనసాగుతూ, దూరాలు పరుగెత్తాల్సి వచ్చే సాకర్, బాస్కెట్‌బాల్, హాకీ వంటివి ఆడకూడదు. అయితే నీరు వేడిగా ఉన్న సమయాల్లో ఈతను అభ్యసిస్తూ, క్రమంగా వ్యవధిని పెంచుకుంటూ పోతే వ్యాయామానికి వ్యాయామం సమకూరడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుంది. 

అసలు  సిగరెట్‌  మానడానికి ఈ–సిగరెట్‌ మంచిదేనా? 
నా వయసు 46. విపరీతంగా సిగరెట్లు తాగుతాను.  స్మోకింగ్‌ మానడం సాధ్యం కావడం లేదు.  ఎలక్ట్రానిక్‌ సిగరెట్‌ (ఈ–సిగరెట్‌)ను ప్రయత్నించమని స్నేహితులు చెబుతున్నారు. ఈ–సిగరెట్‌ వాడడం సురక్షితమేనా? – ఆర్‌. గౌతమ్, హైదరాబాద్‌ 
ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు (ఈ–సిగరెట్స్‌) అన్నీ ఒకేలా పని చేస్తాయి. అందులో ఒక బ్యాటరీ ఉంటుంది. దాని కాటరిడ్జ్‌ (మందు నింపే బోలు ప్రదేశం)లో నికోటిన్‌ ఉంటుంది. మామూలు సిగరెట్‌కూ, ఈ–సిగరెట్‌కూ తేడా ఒక్కటే. ఈ–సిగరెట్‌లో పొగాకు ఉండదు. అంతే. అయితే కేవలం పొగాకు మాత్రమే గాక... సాధారణ సిగరెట్‌లో ప్రమాదకరమైన రసాయనాలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉండి, అవన్నీ ఆరోగ్యానికి చేటు చేస్తాయని నిరూపితమైంది. ఈ–సిగరెట్‌లో సాధారణ సిగరెట్‌లో ఉండే ప్రమాదకరమైన రసాయనాల్లో కొన్నైనా ఉంటాయి. నికోటిన్‌ అనే పదార్థం రెండింటిలోనూ ఉంటుంది. తనకు బానిస అయ్యేలా చేసుకోవడానికి నికోటిన్‌ ప్రతీతి. మందుల భద్రత విషయంలో ప్రామాణికమైన అమెరికాలోని అత్యున్నత సంస్థ ఎఫ్‌డీఏ విశ్లేషణల ప్రకారం... ఈ–సిగరెట్‌లోనూ గుర్తించగల స్థాయిలో క్యాన్సర్‌ కారకాలూ, విషపూరిత రసాయనాలూ ఉన్నాయి. ఈ–సిగరెట్‌లో కాటరిడ్జ్‌లో డీ–ఇథైల్‌ గ్లైకాల్‌ అనే విషపూరిత పదార్థం, నైట్రోజమైన్స్‌ అనే క్యాన్సర్‌ కారకాలు ఉన్నాయి. పైగా ఎన్నో రకాల కాలుష్యాలు సైతం ఈ–సిగరెట్‌ ద్వారా శరీరంలోకి వెళ్తుంటాయి. ఈ పొగను లోపలికి పీల్చినప్పుడు అది మామూలు సిగరెట్లలాగే గొంతు, ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలిక మంట, ఇన్ఫెక్షన్లను (క్రానిక్‌ ఇన్‌ఫ్లమేషన్‌ను) కలిగిస్తుంది. పొగ పీల్చడం దీర్ఘకాలం పాటు కొనసాగితే అది ఈ–సిగరెట్‌ పొగ అయినా సరే... బ్రాంకైటిస్, ఎంఫసిమా, గుండెజబ్బుల వంటి వ్యాధులకు కారణమవుతుంది. కాబట్టి ఈ–సిగరెట్‌  సురక్షితమేమీ కాదు. పైగా ఏ సిగరెట్‌ అయినప్పటికీ అందులోని పొగ వల్ల సిరలు, ధమనులు చాలా ఎక్కువగా ధ్వంసమవుతాయి. ఈ పరిణామమే ఆ తర్వాత గుండెజబ్బులకు దారితీస్తుంది. ఇక ఈ–సిగరెట్‌లోని పొగలో మామూలు సిగరెట్‌తో పోలిస్తే రసాయనాల సంఖ్య కొంచెం తగ్గుతుండవచ్చు. అంతమాత్రాన అది మామూలు సిగరెట్‌ కంటే సురక్షితం అని చెప్పడానికి ఆస్కారం లేదు. దీర్ఘకాలంలో మామూలు సిగరెట్‌తో వచ్చే అన్ని రకాల దుష్పరిణామాలూ ఈ–సిగరెట్‌తోనూ వస్తాయి. ఈ–సిగరెట్‌లోనూ ఉండేది నికోటినే కాబట్టి దానికి బానిసై మళ్లీ మీరు ఈ–సిగరెట్‌కు అలవాటు పడతారు. మీరు సిగరెట్‌ వదిలేయదలిస్తే... ఒక్కసారిగా వదిలేయడమే మార్గం. మానేయగానే కాస్త చిరాకు, కోపం, నిస్పృహ, అస్థిమితంగా ఉండటం వంటి కొన్ని తాత్కాలిక లక్షణాలు కనిపించినా, దీర్ఘకాలంలో సిగరెట్‌ మానేయడం వల్ల కలిగే ప్రయోజనాల సంఖ్య చాలా ఎక్కువ. 
డాక్టర్‌ రమణ ప్రసాద్‌
కన్సల్టెంట్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ 
 పల్మునాలజిస్ట్‌ కిమ్స్, సికింద్రాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement