‘కాదేదీ పంచభూతాలకతీతం, లేదేదీ పంచభూతాత్మకం కానిది’, ఇది చరకుడు చెప్పిన ఆయుర్వేద తాత్త్వికత. దీని సూత్ర ప్రభావాలు మనిషిపై వాతావరణం చూపించే అనుబంధానికి ఆధారభూతం. ఇందుకు అనుగుణంగా ‘ఋతుచర్య’ని వివరించింది ఆయుర్వేదం. పన్నెండు మాసాలు, ఆరు ఋతువులు అందరికీ తెలిసినవే. సుమారుగా జూలై మాసం నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ‘వర్ష ఋతువు’ ఉంటుంది. ఈ సమయమే శ్రావణ భాద్రపద మాసాలు. జలప్రళయాలకు పెట్టింది పేరు. గ్రీష్మాంతపు తొలకరి జల్లులతో ఆరంభమవుతుంది. ఈ దక్షిణాయన సమయాన్నే ‘విసర్గ’ కాలం అంటారు. అంటే సూర్యుని శక్తి సమస్త ప్రాణులకు లభించే సమయం.
వర్షాకాలంలో మనం ఇంకా నీరసంగానే ఉంటాం. క్రమేపీ ‘బలం’ పుంజుకుంటాం. ఈ ఋతువులో మన జఠరాగ్ని చాలా ‘మందం’గా ఉంటుంది. త్రిదోషాలలో ఒకటైన ‘వాతం’ మనలో ప్రకోపావస్థలో ఉంటుంది. వాతావరణం పృధ్వీ తేజో భూతాల ప్రాబల్యంతో, ఆమ్ల రసాత్మకంగా ఉంటుంది. గ్రీష్మం పూర్తయి వర్షాకాలం ఆరంభమవటం ఒక ‘ఋతుసంధి’ని సూచిస్తుంది. ఇటువంటి భౌతిక రసాయనిక మార్పుల వలన వాతావరణం సూక్ష్మక్రిముల మయం అవుతుంది. అందువల్ల క్రిముల ద్వారా సంక్రమించే రోగాలకు గురవుతాం. పరిసర జల కాలుష్యాల వల్ల దోమల వంటి కీటకాలు పేట్రేగుతాయి. వీటికి తోడు ఆహారవిహారాల్లోని మనం చూపే అశ్రద్ధ కారణంగా మరి కొన్ని రోగాలు తోడవుతాయి. వీటిని ఆయుర్వేద పరిభాషలో ‘ప్రజ్ఞాపరాధం, జనపదోధ్వంశం, క్రిమి, సాంక్రామిక రోగాలు’ గా చెప్పబడ్డాయి. కనుక ఇప్పుడు సంభవించే రోగాలకు, ‘అజీర్ణం, ఆహార కాలుష్యం, వాతావరణ క్రిములు’ ప్రధాన కారణాలని గమనించాలి.
ఏయే రోగాలు సంభవిస్తాయి...
ప్రతిశ్యాయం (జలుబు), కాస (దగ్గు), వమన (వాంతులు), అతిసార (విరేచనాలు), అజీర్ణం, ఆధ్మానం (కడుపు ఉబ్బరం), కామలా (పచ్చ కామెర్లు), మలేరియా, డెంగూ, టైఫాయిడ్, న్యుమోనియా వంటి అనేక రకాల జ్వరాలు వస్తాయి.
నివారణ చర్యలు
వర్షంలో తడవకూడదు ∙శీతల వాయువులకు గురికాకూడదు కనుక మనం ధరించే దుస్తుల విషయంలో జాగ్రత్త వహించాలి ∙ పరిసర ప్రాంతాలు, నీరు కలుషితం కాకుండా మన వంతు బాధ్యత వహించాలిఇంట్లోను, బయట ప్రతిరోజు ‘ధూపన’ కర్మ చేయాలి ఉదా: వేపాకులు ఆవాలు కాల్చి పొగ పెట్టడం, సాంబ్రాణి ధూపం వంటివి. వీటి వల్ల దోమల నుండి, సూక్ష్మక్రిముల నుండి రక్షణ కలుగుతుందివేడినీటితో స్నానం మంచిది, అభ్యంగ స్నానం కూడా మంచిదే ∙మరిగించి చల్లార్చిన నీరు తాగాలి ∙పగటి నిద్ర, వాయామ, శృంగారాలు తగ్గించాలి.
గమనిక: ∙ కేవలం ఇంట్లో తయారు చేసుకునే, తేలికగా జీర్ణమయ్యే వేడివేడి ఆహారాన్ని మితంగా తినాలి ∙ఆకుకూరలలో క్రిముల యొక్క అతి చిన్నని గుడ్లు పొంచి ఉంటాయి కనుక అతి జాగ్రత్తగా వ్యవహరించాలి ∙ఉప్పు కలిపిన గోరు వెచ్చని నీటితో చక్కగా కడిగి, ఆ తరవాత సంపూర్ణంగా ఉడికించి మాత్రమే తినాలి ∙సలాడ్సుగా పచ్చివి తినడం తగ్గించాలి లేదా పచ్చివాటిని కూడా పైన చెప్పినట్లు ప్రక్షాళనం చెయ్యాలి ∙వేపడాలు, డీప్ ఫ్రై భక్ష్యాలు (పూరి, వడ, బజ్జీ మొదలైనవి) మంచిది కాదు. ఒకవేళ నిగ్రహించుకోలేక తింటే ‘హింగ్వాష్టక చూర్ణం’ అనే ఆయుర్వేద మందును ఒక చెంచా ఉదయం, ఒక చెంచా రాత్రి మజ్జిగతో లేదా వేడినీటితో సేవించాలి.
ఆహారం
తినకూడనివి: ఇంటి బయట తయారుచేసిన, బజారులో తినటానికి సిద్ధం చేసి అమ్మే తినుబండారాలు, శీతల పానీయాలు, ఐస్‌క్రీములు, పానీపూరి, చెరకురసం మొదలైనవి.
తినదగిన ఆహారం: ∙ఉడికించిన కూరలలో నిమ్మరసం కలుపుకొని తింటే మంచిది ∙ఉప్పుని అతి తక్కువగా వాడాలి ∙స్నిగ్ధ పదార్థాలు (పాయసాలు), ఆవు నెయ్యి, నువ్వుల నూనె తినటం మంచిదిపంచదారకు బదులు బెల్లం వాడుకోవటం మంచిది ∙ మాంసరసాలు కూడా మంచిదే.
సూప్స్ (యూష): తృణ ధాన్యాలు, శాకములతో చేసిన వాటిలో శొంఠి, మిరియాల పొడి స్వల్పంగా కలిపి సేవించాలి ∙బియ్యం, గోధుమలు, కొర్రలు, బార్లీ మొదలైనవి బాగా పాతబడినవి మంచిది ∙తాజాఫలాలు కూడా మంచిదే ∙శుష్క ఫలాలు (డ్రైఫ్రూట్స్), ఇతర గింజలు (గుమ్మడి, సూర్యకాంతం) కూడా సేవించడం మంచిదే. వర్ష ఋతువున వలదోయి బయటి తిండి‘‘ ఇంట వండిన లఘువైన వంటకముల
వేడివేడిగ తినవలె ప్రీతిమీర‘‘ త్రాగునీటిని మరిగింప ధ్యాస పెట్టు!పసుపుదాల్చీని లశునంబు పదిలరీతిఅల్లమును జేర్చి ఘన కషాయమును కాచిఆరు చెంచాలు ప్రతిరోజునారగింపదరికి రాబోవు రోగముల్ తథ్యమిదియ.
ఔషధాలు
అల్లం (5 గ్రా.), వెల్లుల్లి (5 రేకలు), దాల్చిన చెక్క చూర్ణం (3 గ్రా.), పసుపు (మూడు చిటికెలు), కలిపి పావు లీటరు నీళ్లు పోసి బాగా మరిగించి వడగట్టుకోవాలి. (మూడు వంతుల ద్రవ భాగం ఇగిరిపోవాలి. అంటే 60 మి.లీ. మిగలాలి) ∙ఉదయం 30 మి.లీ. (ఆరు టీ స్పూన్లు), సాయంత్రం 30 మి.లీ. తాగాలి. ఎంతమందికి ఈ కషాయం కావాలో... దానికి అనుగుణంగా ద్రవ్యాల పరిమాణం పెంచుకోవాలి. పరగడుపున కాని ఏదైనా తిన్న తరవాత కాని, ఎప్పుడు తాగినా మంచిదే. వర్షాకాలమంతా తాగితే మరీ మంచిది. కనీసం రోజుకి ఒకసారైనా తాగండి. ఇది జీర్ణకోశ సమస్యలకు, క్రిమిరోగ సమస్యలకు, జ్వరాలకు... అన్నిటికీ మంచిది. జలుబు, దగ్గులకు దివ్యౌషధం.
∙అతిసారానికి: వాము కషాయం తక్షణం పనిచేస్తుంది.
∙జలుబు, దగ్గులకు: తులసి లేదా తమలపాకు రసం + తేనె: రోజూ మూడుపూటలా తీసుకోవాలి.
∙పచ్చ కామెర్లకు: నేల ఉసిరిక (భూమ్యామలకి) రసం ఒక టీ స్పూను (5 మి.లీ.) + తేనె: రెండుపూటలా రెండు వారాలు సేవించాలి ∙గుంటకలగర (భృంగరాజ), తిప్పతీగె (గుడూచి) ఉసిరిక (ఆమలకీ) రసాలు కూడా శ్రేష్ఠమే.
పునుగుల పులుసు
పులుసు కోసం కావలసినవి: పెరుగు – రెండు కప్పులు (చిక్కగా గిలకొట్టాలి); సొరకాయ ముక్కలు – అర కప్పు; మునగకాడ – 1 (ముక్కలు చేయాలి); ఉల్లిపాయలు – 2 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); టొమాటో – 1 (పెద్ద పెద్ద ముక్కలు చేయాలి); పచ్చి మిర్చి – 4 (సన్నగా పొడవుగా కట్ చేయాలి); ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూన్; పసుపు – కొద్దిగా; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా; అల్లం తురుము – ఒక టీ స్పూన్; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూన్; ధనియాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పోపు గింజలు – ఒక టీ స్పూన్; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి);
పునుగుల కోసం కావలసినవి: పచ్చి సెనగ పప్పు – ఒక కప్పు; అల్లం – చిన్న ముక్క; పచ్చిమిర్చి – 3; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా; ఉల్లి తరుగు – అర కప్పు; కొత్తిమీర – కొద్దిగా
పులుసు తయారీ: ∙ముక్కలను ఒక గిన్నెలో వేసి, తగినంత ఉప్పు జత చేసి స్టౌ మీద ఉంచి ఉడికించాలి ∙వేరే పాత్రలో పెరుగు, సెనగ పిండి, పసుపు వేసి గిలకొట్టాలి ∙ఉడుకుతున్న ముక్కలలో ఈ మిశ్రమం పోసి బాగా కలిపి ఉడికించాలి ∙మిక్సీలో అల్లం తురుము, సెనగ పప్పు, జీలకర్ర, ధనియాలు వేసి మెత్తగా చేసి ఉడుకుతున్న పులుసులో వేసి కలపాలి ∙కరివేపాకు, కొత్తిమీర జత చేయాలి ∙బాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి, కాగాక ఆవాలు జీలకర్ర, ఎండు మిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించి, మరుగుతున్న పులుసులో వేసి కలిపి దింపేయాలి.
పునుగుల తయారీ: ∙పచ్చి సెనగ పప్పును సుమారు రెండు గంటలు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ∙మిక్సీలో సెనగ పప్పు, ఉల్లి తరుగు, పచ్చి మిర్చి, కొత్తిమీర, ఉప్పు వేసి కచ్చాపచ్చాగా చేసి, తీసేయాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, పునుగులుగా వేసి వేయించి తీసి, పులుసులో వేసి గంట సేపు నాననివ్వాలి ∙పునుగులు జత కలవడంతో, మారు మాట్లాడకుండా పులుసును జుర్రేస్తారు.
మీ వంటలకు ఆహ్వానం
మీరూ గొప్ప చెఫ్ అయి ఉండొచ్చు. కిచెన్‌లో రుచికరమైన ప్రయోగాలు చేస్తుండవచ్చు. మీ వంట తిన్నవారు ఏదో ఒక సాకుతో మీ ఇంటికి పదేపదే వస్తుండవచ్చు. ఆ రుచిని పాఠకులకు పంచండి. ఒకే రకమైన పదార్థంతో ఆరు రకాల వంటకాలను తయారు చేయండి. మీరు చేసిన వంటల ఫొటోలను, రెసిపీలను మీ ఫొటో జతచేసి మాకు పంపండి. వంటకు స్త్రీ పురుష భేదం లేదు. నాన్నా, బాబాయ్, అబ్బాయ్... ఎవరైనా వంట చేసి లొట్టలేయిం చవచ్చు. మీకిదే ఘుమఘుమల వెల్‌కమ్.
mail: familyvantakalu@ gmail.com లేదా పోస్టు ద్వారా పంపండి.
మా చిరునామా: సాక్షి వంటలు, సాక్షి ఫ్యామిలీ,
సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్,
హైదరాబాద్–34. Monsoon ,food ,Getaways
– డా. వృద్ధుల లక్ష్మీనరసింహ శాస్త్రి
ప్రముఖ ఆయుర్వేద వైద్యులు
Comments
Please login to add a commentAdd a comment