ఈశాన్యంతో 34 శాతం అధిక వర్షం
● ముగింపు దశకు చేరిన రుతుపవనాల సీజన్ ● ఇకపై చలి.. పులి
సాక్షి, చైన్నె: ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఈ ఏడాది 34 శాతం అదికంగానే వర్షం పడింది. ఈ సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇక చలి పులి దెబ్బకు జనం గజగజ వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వివరాలు.. రాష్ట్రంలో ఏటా ఈశాన్య రుతుపవనాలు ఆశా జనకంగానే ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఏదో ఒక తుఫాన్, వాయుగండం ప్రళయాన్ని రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఈ ఏడాది అక్టోబరులో ఈ పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. వచ్చి రాగానే చైన్నె, శివారు జిల్లాలపై ప్రభావం చూపించాయి. ఆ తదుపరి రాష్ట్రవ్యాప్తంగా పవనాలు విస్తరించారు. ఈ సీజన్‌లో సుమారు తొమ్మిది అల్పపీడనాలు బయలు దేరాయి. ఇందులో నాలుగు తమిళనాడు మీద తీవ్రంగానే దాడి చేశాయి. ఇందులో పెంగల్ తుపాన్ తాండవానికి పొరుగున ఉన్నకేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటూ రాష్ట్రంలోని విల్లుపురం, కడలూరు, కళ్లకురిచ్చి, తిరువణ్ణామలై, కృష్ణగిరి జిల్లాలో వరుణ తాండం అంతాఇంతా కాదు. వరదలు పోటెత్తి గ్రామాలను ముంచేశాయి. ఆ తదుపరి తిరునల్వేలి, తెన్‌కాశి తదితర జిల్లాల మీద తీవ్ర అల్పపీడనం ప్రభావాన్ని చూపించాయి. ప్రధానంగా డెల్టాలోని నాగపట్నం, మైలాడుతురై, తంజావూరు, తిరువారూర్ జిల్లాలో అయితే సాధారణం కంటే రెట్టింపుగా వర్ష పాతం నమోదైంది. ప్రస్తుతం ఈశాన్య సీజన్ ముగింపుదశకు చేరింది. ఈ సీజన్‌లో రాష్ట్రంలో కడలూరు జిల్లాలో అధిక వర్షం పడింది. అతి తక్కువ వర్షం తూత్తుకుడిలో నమోదైంది. తమిళనాడు వ్యాప్తంగా ఈ సీజన్‌లో 47 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా 57 సెం.మీ వర్షం కురిసింది. తిరుపత్తూరులో 25 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా 45 సెం.మీ వర్షం కురిసింది. కృష్ణగిరిలో 27 సెం.మీ వర్షంకు బదలుగా 49 సెం.మీ పడింది. విల్లుపురంలో 50 సెం.మీ కురవాల్సి ఉండగా 88 సెం.మీ వర్షం పడింది. తిరునల్వేలి, కాంచీపురం తదితర జిల్లాల్లోనూ సాధాకరణం కంటే అధికంగానే వర్షం పడింది. చైన్నెలో 47 సెం.మీ వర్షం పడాల్సి ఉండగా అదనంగా 10 సెం.మీ కురిసింది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తగా 34 శాతం అధికంగానే వర్షాన్ని ఈశాన్య రుతు పవనాలు తీసుకొచ్చాయి. ఈ సీజన్ ముగింపు దశకు చేరడంతో ఇక క్రమంగా మంచు దుప్పటితో పాటుూ చలి ప్రభావం రాష్ట్రంలో పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే చలి క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment