![Rainy season grain is for private traders only](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/grains.jpg.webp?itok=tEuEJMtt)
మిల్లుల నుంచి సేకరించాల్సిన
సీఎంఆర్ 36.15 లక్షల మెట్రిక్ టన్నులు
ఇప్పటి వరకు సేకరించింది 5.42 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ ధాన్యం సేకరణలో పౌరసరఫరాల సంస్థకు నిరాశే మిగిలింది. రికార్డు స్థాయిలో కోటిన్నర మెట్రిక్ టన్నుల మేర ధాన్యం దిగుబడి వచి్చందని ప్రభుత్వం చెబుతున్నా, కొనుగోలు కేంద్రాలకు చేరిన ధాన్యం మాత్రం 53.96 లక్షల మెట్రిక్ టన్నులే. ఇందులో సన్నరకం ధాన్యం 24 లక్షల మెట్రిక్ టన్నులు. కాగా గత సంవత్సరం వానాకాలం సీజన్‌లో కూడా పౌరసరఫరాల సంస్థ 47.34 శాతం ధాన్యాన్ని మాత్రమే సేకరించగలిగింది.
దేశ, విదేశాల్లో బియ్యానికి పెరిగిన డిమాండ్ దృష్ట్యా వానాకాలం సీజన్‌లో పండిన పంటను కల్లాల నుంచే వ్యాపారులు, మిల్లర్లు కొనుగోలు చేసి తీసుకెళ్లారు. క్వింటాల్‌కు మద్దతు ధర కామన్ వెరైటీకి రూ.2,300, గ్రేడ్ ఏ రకానికి రూ.2,320 చొప్పున కొనుగోలు కేంద్రాల్లో రైతులకు లభించింది. అదనంగా ఈ వానాకాలం సీజన్ నుంచి సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ. 500 చొప్పున ప్రభుత్వం బోనస్‌గా ఇస్తామని చెప్పింది.
అయినా వ్యాపారులు, రైస్‌మిల్లర్లు సన్న ధాన్యాన్ని నేరుగా రైతుల పొలాల నుంచే మద్దతు ధర కన్నా అదనంగా ఇచ్చి కొనుగోలు చేసిన పరిస్థితి ఈసారి కనిపించింది. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి, నల్లగొండ, సూర్యాపేట, జగిత్యాల, పెద్దపల్లి వంటి జిల్లాల్లో రైతులే నేరుగా ధాన్యాన్ని బియ్యంగా మిల్లింగ్ చేయించి విక్రయిస్తున్నారు.
రైతులు సొంత అవసరాలకు కూడా బియ్యాన్ని నిల్వ చేసుకోవడం ఈ సీజన్‌లో సాధారణం. దీంతో వానాకాలం సీజన్‌లో కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యం తగ్గుతూ వస్తోంది. గతంతో పోలిస్తే ఈ సీజన్‌లో పండిన పంటకు, సర్కార్ సేకరించిన ధాన్యానికి పొంతన లేకుండాపోయింది.
రేషన్‌కు అవసరమైన సన్న బియ్యం 24 ఎల్‌ఎంటీ
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఉగాది నుంచి రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం సరఫరా చేయాలని యోచిస్తోంది. రేషన్ దుకాణాలు, మధ్యాహ్న భోజనం, గురుకుల పాఠశాలలకు సంవత్సరానికి అవసరమయ్యే బియ్యం 24 లక్షల మెట్రిక్ టన్నులు. ఇందుకోసం 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అవసరమవుతుంది. కానీ ఈ సీజన్‌లో పౌరసరఫరాల సంస్థ సేకరించిన సన్నధాన్యం 24 లక్షల మెట్రిక్ టన్నులే.
ఈ ధాన్యం ద్వారా 16 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే పంపిణీ చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో వచ్చే యాసంగి సీజన్‌లో వచ్చే సన్న బియ్యాన్ని కూడా పంపిణీకి వినియోగించుకునే అవకాశం ఉంది. వచ్చే నవంబర్ వరకు వానాకాలంలో వచ్చిన సన్న బియ్యాన్ని సరఫరా చేసి, మిగతా నాలుగు నెలలకు యాసంగి బియ్యాన్ని వినియోగించుకునే అవకాశం ఉందని పౌరసరఫరాల వర్గాలు తెలిపాయి.
సీఎంఆర్ ఇలా....
వానాకాలం సీజన్‌లో ప్రభుత్వం సేకరించిన 53.96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎప్పటికప్పుడు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం మిల్లులకు పంపించారు. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేసి 36.15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో పౌరసరఫరాల సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది.
ఇందులో ఇప్పటి వరకు కేవలం 5.41 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం (15 శాతం) పౌరసరఫరాల సంస్థకు రాగా, మరో 30.73 లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంది. రైస్‌మిల్లులు అధికంగా ఉన్న పెద్దపల్లి జిల్లా నుంచి 42 శాతం సీఎంఆర్‌ను ఇప్పటికే సేకరించారు. తర్వాతి స్థానాల్లో భద్రాద్రి కొత్తగూడెం (39 శాతం), ఖమ్మం (31 శాతం) జిల్లాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment