civil supplies corporation
-
రవాణా కాంట్రాక్టుల్లో ‘మనీ ట్రాన్స్ఫర్’!
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లలో భారీ అవినీతి, అక్రమాలు చోటు చేసుకుంటున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇటీవల టెక్నికల్ బిడ్‌లో క్వాలిఫై అయినట్టు ప్రకటించిన కాంట్రాక్టర్లను మళ్లీ డిస్క్వాలిఫై చేయడం పెను దుమారం రేపింది. ఓ మహిళా మేనేజర్ నేతృత్వంలో ఈ కాంట్రాక్టులను అధికార కూటమి నేతల అనుంగులకు అప్పజెప్పేందుకు నిబంధనలను సైతం తుంగలో తొక్కేస్తున్నారు. పౌర సరఫరాల సంస్థ బఫర్ గోడౌన్ల నుంచి మండల గోడౌన్లకు నిత్యావసరాలు రవాణా చేసేందుకు పిలిచిన ఈ టెండర్లలో పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు సమాచారం. ఈ మేనేజర్, అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు కలిసి టెండర్ ప్రక్రియను పూర్తిగా పక్కదారి పట్టించి, వీలైనన్ని జిల్లాల్లో నిబంధనలకు విరుద్ధంగా సింగిల్ టెండర్‌తోనే అనుకూలమైన వారికి కాంట్రాక్టు అప్పజెప్పేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి, వైఎస్సార్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే తొలుత క్వాలిఫై చేసిన ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీని తర్వాత డిస్క్వాలిఫై చేసినట్లుగా ఉద్యోగులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ కంపెనీ కర్నూలు, నంద్యాల, వైఎస్సార్, అనంతపురంలో స్టేజ్–1 ట్రాన్స్‌పోర్టు టెండర్లు వేసింది. రోజులు గడిచినా టెక్నికల్ బిడ్‌లో ఎటువంటి రిమార్క్ చూపించని అధికారులు ఫైనాన్షియల్ బిడ్‌కు వచ్చేసరికి సంస్థ నిర్వహకులపై పోలీసు కేసులు ఉన్నాయంటూ ఊహాజనిత సాకును చూపించి తొలుత కర్నూలు జిల్లాలో డిస్క్వాలిఫై చేశారు. తర్వాత మిగిలిన జిల్లాల్లోనూ డిస్క్వాలిఫై చేశారు. దీంతో ఆ సంస్థ కోర్టును ఆశ్రయించి, టెండర్లలో పాల్గొనేలా ఆర్డరు తెచ్చుకొంది.రీ టెండర్‌కు ఎందుకు వెళ్లట్లేదు?నిబంధనల ప్రకారం సింగిల్ టెండర్ వస్తే రీ టెండర్‌కు వెళ్లాలి. టెండర్లలో టెక్నికల్ బిడ్‌లో అర్హత సాధించిన సంస్థలు ఫైనాన్షియల్ బిడ్‌కు వెళ్తాయి. సరైన పత్రాలు, అర్హతలు లేని టెండర్లు డిస్క్వాలిఫై అవుతాయి. ఇక్కడే అధికారులు చాకచక్యంగా చాలా జిల్లాల్లో ఫైనాన్షియల్ బిడ్‌కు అర్హత పొందిన టెండర్లు ఒక్కటే (సింగిల్) ఉండేలా చక్రం తిప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో రీటెండర్‌కు వెళ్లకుండా టెక్నికల్ బిడ్‌లో డిస్క్వాలిఫై అయిన టెండర్లను కూడా కలిపి చూపించి, ఎక్కువ టెండర్లు వచ్చినట్టు మాయ చేస్తున్నారు. పోటీ ఉంటే షెడ్యూల్ ఆఫ్ రేట్ల (ఎస్‌వోఆర్) కంటే తక్కువ రేట్లకు కోట్ చేసే అవకాశం ఉంటుంది. ఫైనాన్షియల్ బిడ్‌లో సింగిల్ టెండర్ ఉంటే అసలు పోటీనే ఉండదు. ఫలితంగా కాంట్రాక్టరు అధిక రేట్లను కోట్ చేస్తారు. ఇప్పుడు స్టేజ్–1 టెండర్లలోనూ ఎస్ఓఆర్కు మించి 20 నుంచి 25 శాతం అధికంగా రేట్లు కోట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సింగిల్ టెండర్లు ఖరారైతే పౌరసరఫరాల సంస్థకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీన్ని పట్టించుకోని ఆ మేనేజర్.. సింగిల్ టెండర్లను ఒకే చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఓ మంత్రి, ఎమ్మెల్యే ఒత్తిడితో ట్రాన్స్ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ టెండర్లు దాఖలు చేసిన నాలుగు జిల్లాలతో పాటు కర్నూలు, వైఎస్సార్‌లో జిల్లాల టెండర్లను టీడీపీకి చెందిన ఓ కాంట్రాక్టర్‌కు అప్పజెప్పేందుకు సర్వం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ట్రాన్స్‌పోర్టు సంస్థకు సరైన ఫర్మ్ అంటూ లేదు. అసలు యజమాని పేరుపై ఒక్క వాహనం కూడా లేదు.ఆమెదంతా క్విడ్ ప్రోకోనే..ఈ టెండర్ల ప్రక్రియలో మహిళా మేనేజర్‌తో పాటు ఇటీవల బదిలీపై ప్రధాన కార్యాలయానికి వచ్చిన గ్రేడ్–1 ఉద్యోగి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. ఆ ఉద్యోగికి టెండర్లతో సంబంధం లేకపోయినా, మేనేజర్‌కు సహకరిస్తూ ముడుపులు మూటగడుతున్నట్టు విమర్శలొస్తున్నాయి. ఇలా సింగిల్ టెండర్లను ఖరారు చేయించేందుకు రూ.25 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనికి తోడు ఆ మహిళా మేనేజర్ కోనసీమ జిల్లాకు డీఎంగా వెళ్లాలని అనుకున్నప్పటికీ, అక్కడ ఆమెపై ఏసీబీకి ఫిర్యాదులు ఉండటంతో.. తూర్పుగోదావరి జిల్లాకు డీఎంగా వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లాలో మునుపటి స్టేజ్–1 టెండర్ కాంట్రాక్టర్, తాడేపల్లిగూడేనికి చెందిన కూటమి నాయకుడొకరు సహకరిస్తున్నట్లు తెలిసింది. ఇందుకు ప్రతిగా ఆయనకు తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, నెల్లూరు జిల్లాల్లో సింగిల్ టెండర్ ద్వారా రవాణా కాంట్రాక్టును అప్పజెప్పేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వీటితో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అన్నమయ్య, పార్వతీపురం మన్యం జిల్లాల్లోనూ సింగిల్ టెండర్లనే ఎంపిక చేస్తున్నట్టు తెలిసింది. -
మిల్లర్ల కతలు.. రైతుల వెతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖరీఫ్ ధాన్యాన్ని సీఎంఆర్ కింద మిల్లింగ్ చేసేందుకు రైస్‌మిల్లర్లు ఆసక్తి చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత నెల 29న ప్రకటించిన ఖరీఫ్ ధాన్యం సేకరణ పాలసీ తమను నష్టాల పాలు చేస్తుందని వారు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వస్తున్న ధాన్యాన్ని తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దీనితో రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై ప్రభావం పడింది. కొనుగోలు కేంద్రాల్లోనే భారీగా ధాన్యం పోగుపడుతోంది. అకాల వర్షాలతో ఆ ధాన్యం తడిసిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. ఏం చేయాలో పాలుపోక ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. మిల్లర్ల విజ్ఞప్తులను తోసిపుచ్చడంతో.. రాష్ట్ర ప్రభుత్వం కొత్త సీఎంఆర్ పాలసీ విషయంలో మిల్లర్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలున్నాయి. సన్న ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేయడానికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ‘ఔటర్న్’ను సవరించాలని మిల్లర్లు చేసిన విజ్ఞప్తిని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీనితోపాటు మిల్లులు తమకు కేటాయించే ధాన్యానికి బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో ముడి బియ్యం మిల్లర్లు పోరుబాట పట్టారు. నిజానికి ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం గత నెల మొదటి వారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. పరిశీలన జరిపిన ఉప సంఘం గత నెలాఖరులో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అందులో ధాన్యం సేకరణ, రైతులకు బోనస్, అధికారుల బాధ్యతలను పేర్కొన్న సర్కారు.. మిల్లర్ల డిమాండ్లను పట్టించుకోలేదు. ‘ఔటర్న్’ తగ్గించాలనే డిమాండ్.. ఒక క్వింటాల్ ధాన్యాన్ని మిల్లింగ్ చేసినప్పుడు వచ్చే బియ్యం, నూకల లెక్కను ‘ఔటర్న్’ అని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఔటర్న్ ప్రకారం.. సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) విధానం కింద మిల్లర్లకు చేరే ప్రతి 100 కిలోల ధాన్యానికి 67 కిలోల బియ్యం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, ఇతర అంశాల నేపథ్యంలో.. బియ్యం తక్కువగా వస్తుందని, నూకలు ఎక్కువగా వస్తాయని మిల్లర్లు చెప్తున్నారు. చాలా జిల్లాల్లో ధాన్యాన్ని ముడి బియ్యంగా మిల్లింగ్ చేస్తే.. 58 కిలోల బియ్యం, 9 కిలోల నూకలు కలిపి 67 కిలోలు వస్తాయని వారు ప్రభుత్వంతో చర్చల సందర్భంగా వివరించారు. తమకు నష్టం కలిగించే ఈ ఔటర్న్ లెక్కను సరిదిద్దాలని కోరారు. మధ్యేమార్గంగా 62 కిలోల ఔటర్న్ నిర్ణయిస్తే.. నూకలను విక్రయించి, బియ్యన్నే అదనంగా ఎఫ్‌సీఐకి ఇస్తామని చెప్పారు. కానీ మిల్లర్ల విజ్ఞప్తిని తోసిపుచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర నిబంధనలను పాటించాలని స్పష్టం చేసింది. బ్యాంకు గ్యారంటీలపై విముఖత గతంలో ప్రభుత్వం మిల్లులకు నేరుగా ధాన్యాన్ని కేటాయించి, వారి నుంచి బియ్యాన్ని తీసుకునేది. ధాన్యం ఇచ్చినందుకు ఎలాంటి గ్యారంటీ అడిగేది కాదు. అయితే 2022–23 రబీలో మిల్లర్లు ధాన్యం మిల్లింగ్ చేయలేదంటూ సీఎంఆర్ బియ్యాన్ని పూర్తిగా అప్పగించలేదు. సుమారు రూ.7 వేల కోట్ల విలువైన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లర్ల వద్దే ఉండిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రికవరీ చేసేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు సంస్థలకు టెండర్లు ఇచ్చింది. అయినా 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం లేదా ఆ మేర విలువను మాత్రమే రికవరీ చేయగలిగారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈసారి ధాన్యం కేటాయింపుకోసం మిల్లర్లు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం తప్పనిసరి అని కొత్త పాలసీలో పొందుపరిచింది. ఇందులో కూడా నాలుగు కేటగిరీలను నిర్ణయించింది. గడువులోగా సీఎంఆర్ అప్పగిస్తూ, ఇప్పటివరకు డీఫాల్ట్ కాని మిల్లర్లకు కేటాయించే ధాన్యం విలువలో 10 శాతం బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటారు. అలాంటి మిల్లులు అతి తక్కువని సమాచారం. ఇక డీఫాల్ట్ అయి పెనాల్టీతో సహా సీఎంఆర్ అప్పగించిన మిల్లర్ల నుంచి 20శాతం, పెనాల్టీ పెండింగ్‌లో ఉన్న మిల్లర్ల నుంచి 25శాతం బ్యాంక్ గ్యారంటీలు, సెక్యూరిటీ డిపాజిట్లు తీసుకుంటారు. మిల్లుల్లో ధాన్యం లేని, సీఎంఆర్ ఇవ్వని మిల్లర్లను నాలుగో కేటగిరీగా నిర్ణయించి.. ధాన్యం కేటాయించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నాలుగో కేటగిరీలో సుమారు 300 మంది మిల్లర్లు ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ బ్యాంకు గ్యారంటీ షరతులకు ముడి బియ్యం మిల్లర్లు అంగీకరించడం లేదు. దీనితో అధికారులు ఇప్పటికిప్పుడు కాకపోయినా 15 రోజుల్లో బ్యాంకు గ్యారంటీలు ఇస్తామని మిల్లర్ల నుంచి ‘అండర్ టేకింగ్’ తీసుకుంటూ ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. అండర్ టేకింగ్ ఇచ్చిన మిల్లర్లు తర్వాత తప్పనిసరిగా బ్యాంక్ గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దీనికి మిల్లర్లు ముందుకురావడం లేదని తెలిసింది. ఈ క్రమంలో కొన్ని జిల్లాల్లో అధికారులు రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని గోదాములకు పంపిస్తున్నారు. మిల్లింగ్ చార్జీల పెంపుపైనా అసంతృప్తి.. దేశంలోని చాలా రాష్ట్రాల్లో కస్టమ్ మిల్లింగ్ చార్జీలు క్వింటాల్‌కు రూ.110 నుంచి రూ.200 వరకు ఉన్నాయని.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దొడ్డురకాలకు రూ.40, సన్నరకాలకు రూ.50కి మాత్రమే చార్జీలు పెంచిందని మిల్లర్లు అంటున్నారు. ఈ చార్జీలను కూడా సకాలంలో ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇచ్చిన బియ్యానికి మాత్రమే లెక్కకట్టి ఇస్తామని ప్రభుత్వం చెబుతోందని.. ఇచ్చే అరకొర చార్జీలకు కూడా కోతలు పెట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.రూ.500 బోనస్, రేషన్‌షాపులకు సన్న బియ్యం ఎలా? రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో రైతులు రాష్ట్రంలో భారీ ఎత్తున సన్నరకాల వరి సాగు చేశారని వ్యవసాయ శాఖ ప్రకటించింది. రైతుల సొంత అవసరాలు, బహిరంగ మార్కెట్లో విక్రయించే ధాన్యం పోగా.. కొనుగోలు కేంద్రాలకు ఏకంగా 50 లక్షల టన్నుల సన్నధాన్యం, 30 లక్షల టన్నుల వరకు దొడ్డు ధాన్యం వస్తుందని పౌర సరఫరాల సంస్థ అంచనా వేసింది. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్నధాన్యాన్ని మిల్లింగ్ చేయించి, ఆ సన్న బియ్యాన్ని జనవరి నుంచి రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని నిర్ణయించింది. అలా కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న ధాన్యానికి సంబంధించి క్వింటాల్‌కు రూ.500 చొప్పున రైతులకు నేరుగా జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కూడా. అయితే కొనుగోలు కేంద్రాలకు సన్నధాన్యం రాకపోవడం, మిల్లర్ల లొల్లి నేపథ్యంలో.. రైతులకు బోనస్ అందడం, రేషన్‌షాపుల్లో సన్న బియ్యం సరఫరా పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారాయి.రేపు రైస్ మిల్లర్ల భేటీ ఖరీఫ్ ధాన్యం మిల్లింగ్ సమస్యల విషయంలో చర్చించేందుకు రైస్ మిల్లర్లు మంగళవారం రోజున సమావేశం కానున్నారు. యాదాద్రి జిల్లా ఘట్కేసర్లో నిర్వహించే ఈ భేటీకి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రా, బాయిల్డ్ రైస్‌మిల్లుల నిర్వాహకులు హాజరుకావాలని రా రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు పాడి గణపతిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ముఖ్యమైన అంశాలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని తెలిపారు. నామమాత్రంగానే కొనుగోళ్లు రాష్ట్రవ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నప్పటికీ.. ఇప్పటివరకు జరిగిన కొనుగోళ్లు బాగా తక్కువగా ఉండటం గమనార్హం. ఈ సీజన్లో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని పౌర సరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 20వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయడం గమనార్హం. అంతేకాదు ఇది కూడా దొడ్డురకం ధాన్యమేనని అధికారవర్గాలు చెప్తున్నాయి. సన్నరకాల ధాన్యం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలకు రావడం లేదు. కొనుగోళ్లు సరిగా లేక రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు వానకు తడుస్తూ, ఎండకు ఎండుతున్నాయి. నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులు తమ వంతు ఎప్పుడు వస్తుందో తెలియక పడిగాపులు పడుతున్నారు. ఇటీవలి అకాల వర్షానికి పెద్దపల్లి జిల్లాలో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయింది. -
బాబు సర్కారు ప్రగతి.. 59,000 కోట్లు అప్పు
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల్లో గొప్పలు పోయిన చంద్రబాబు.. ఈ ఐదు నెలల్లో పైసా సృష్టించలేదు. అభివృద్ధి, సూపర్ సిక్స్ హామీలూ అటకెక్కేశాయి. ఉచిత ఇసుక అంటూ జనాన్ని ఎన్ని పిల్లిమొగ్గలు వేయిస్తున్నారో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పల్లెల్లో జ్వరం వచ్చినా మందు బిళ్లలు దొరకవు. చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటీ అంటే.. అప్పులు. ఈ అప్పుల గ్రాఫ్ మాత్రం రాకెట్ స్పీడ్‌తో ఆకాశంలోకి దూసుకుపోతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలేవీ అమలు చేయని ప్రభుత్వం ఈ వేల కోట్ల అప్పుల సొమ్మంతటినీ దేనికి ఖర్చు చేస్తోందోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.59,000 కోట్లు అప్పు చేసింది. బడ్జెట్ పరిధిలో చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 7.17 శాతం వడ్డీతో మరో రూ.3,000 కోట్లు అప్పు చేసింది. దీంతో బడ్జెట్ పరిధిలో చేసిన రుణాలు రూ.51,000 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.8,000 కోట్లు బడ్జెటేతర అప్పు చేశారు. తాజాగా తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఆర్బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 19 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 23 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఈ రుణం తీసుకుంది. నాడు గగ్గోలు..గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎప్పుడైనా అప్పు తెస్తే.. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ ఎల్లో మీడియా కథనాలను అచ్చేశాయి. చంద్రబాబు అండ్ కో కూడా లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించేవారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రజల పరువు ప్రతిష్టలను దిగజార్చడమే లక్ష్యంగా వ్యవహరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం నిబంధనలు, కేంద్ర అనుమతి మేరకు రుణాలు తెచ్చినా అప్పు చేయడం మహాపరాధంగా బాబు అండ్‌కో చిత్రీకరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.ఇప్పుడు చంద్రబాబు మంగళవారాల్లో అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు పెగలడంలేదు. వివిధ కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వ గ్యారెంటీతో చంద్రబాబు సర్కారు మరో రూ.8,000 కోట్ల బడ్జెటేతర అప్పు చేసినా ఎల్లో మీడియా కిమ్మనడంలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల కార్యకలాపాల కోసం అప్పు చేసేందుకు గ్యారెంటీలు ఇవ్వడాన్ని చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా తప్పుపట్టాయి. పైగా ఆ అప్పులను దాచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.2,000 కోట్లు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు ఏపీఐఐసీ ద్వారా రూ.1,000 కోట్లు మొత్తం రూ.8,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనిపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే తప్పు అని గగ్గోలు పెట్టిన వారికి అదే పని చంద్రబాబు సర్కారు చేస్తే ఒప్పవుతుందా అని అంటున్నారు. -
సివిల్ సప్లైస్‌లో కంత్రీ ప్లాన్
సాక్షి, అమరావతి: పౌరసరఫరాల సంస్థలో బదిలీల పర్వం ఉద్యోగుల్లో చిచ్చురేపుతోంది. బదిలీల ప్రక్రియ కోసం సంస్థ నియమించిన ఫోర్ మెన్ కమిటీ నివేదికను తుంగలో తొక్కి.. మంత్రి కార్యాలయం నుంచి వచ్చిన పేర్లకు పట్టం కట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జీవోలను, ఉద్యోగుల వినతులు, మానవీయ కోణాలను పట్టించుకోకుండా ఇష్టానుసారం బదిలీలు చేశారంటూ మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఐదేళ్లు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు చేపట్టింది. వీరితోపాటు రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాల సంస్థ ఉద్యోగుల నుంచి రిక్వెస్ట్ బదిలీలకు దరఖాస్తులు ఆహా్వనించింది. ఇవన్నీ కేవలం ప్రక్రియలో భాగంగా చేపట్టారే తప్ప.. క్షేత్ర స్థాయిలో విస్మరించారు. వాస్తవానికి ఫోర్‌మెన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి 20 మందికి పైగా ఉద్యోగుల బదిలీకి సిఫారసు చేస్తే ఆదివారం మధ్యాహ్నం నాటికి ఆ మేరకు అధికారులు నివేదిక రూపొందించారు. తీరా సాయంత్రానికి మంత్రి కార్యాలయం నుంచి మరో జాబితా వచ్చింది. అందులో పేర్కొన్న వ్యక్తులకు మాత్రమే బదిలీ చేయాలని సాక్షాత్తూ మంత్రి హుకుం జారీ చేయడం.. ఎండీ వారిని బదిలీ చేయడం చకచకా జరిగిపోయాయి. చేతులు మారిన ముడుపులు? పౌరసరఫరాల సంస్థ ప్రధాన కార్యాలయంలో పని చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఇద్దరు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. విచిత్రం ఏమిటంటే.. ఏకంగా తొమ్మిది మందిని ప్రధాన కార్యాలయంలో నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. వీరిలో తప్పనిసరి బదిలీలు లేనివారు, రిక్వెస్టు కూడా పెట్టుకోని వారు ఉండటం గమనార్హం. ఇక్కడే మొత్తం బదిలీల్లో తెనాలి, విజయవాడలోని ప్రముఖ హోటళ్ల వేదికగా భారీ ఎత్తున ముడుపులు చేతులు మారినట్టు ఆరోపణలు వినిస్తున్నాయి. డీఎం పోస్టుకు డిమాండ్ ఉన్నచోట రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు, మిగిలిన జిల్లాల్లో రూ.10 లక్షలకు పైగా రేట్లు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఆరోపణలున్నా పట్టించుకోలేదు విజయనగరం జిల్లా డీఎం తప్పనిసరిగా బదిలీ కావాల్సి రావడంతో ఆమెను ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. అదే ఉద్యోగిని తిరిగి వెనక్కి పంపించే ఉద్దేశంతో అక్కడి పోస్టును వేకెంట్‌గా చూపించి వదిలేసినట్టు తెలుస్తోంది. కర్నూలులో డీఎంగా పనిచేస్తున్న ఉద్యోగిని రిక్వెస్ట్ పెట్టుకోకుండానే ప్రధాన కార్యాలయానికి బదిలీ చేశారు. ఆమెపై హైదరాబాద్‌లో పని చేస్తున్నప్పటి నుంచి వివిధ ఆరోపణలతో చార్జెస్ నమోదయ్యాయి. ఇదే మాదిరిగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో నిధుల దురి్వనియోగంపై ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, రెండేళ్లు ఉద్యోగంలో చెప్పాపెట్టకుండా మాయమైన మరో ఉద్యోగిని సైతం ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయడంపై ఉద్యోగులు భగ్గుమంటున్నారు. దీనిపై పౌరసరఫరాల సంస్థ ఎండీ వీరపాండియన్‌ను వివరణ కోరగా.. ఐదేళ్లు ఒకేచోట పనిచేసిన వారిని తప్పనిసరిగా బదిలీ చేశామన్నారు. బదిలీల్లో ఎవరి సిఫారసులు తావివ్వలేదన్నారు. రొటేషన్ పద్ధతిలో ఫీల్డ్‌లోని ఉద్యోగులను ప్రధాన కార్యాలయానికి, ఇక్కడి ఉద్యోగులను ఫీల్డ్‌కు పంపించామన్నారు. భారీ దోపిడీకి కుట్ర! ఉద్యోగుల బదిలీలను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి కుట్ర పన్నారనే ఆరోపణలు ఉద్యోగుల నుంచి వినిపిస్తున్నాయి. అక్టోబర్ నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ ప్రారంభిస్తుండటం, డిసెంబర్, జనవరిలో పండుగలు ఉండటంతో పౌరసరఫరాల సంస్థలో భారీఎత్తున నిత్యావసర సరుకులకు టెండర్లు పిలిచే అవకాశం ఉంది. ఈ క్రమంలో భారీగా కాంట్రాక్టులు ఉంటాయి. ఈ సందర్భంలో సదరు కాంట్రాక్టర్లను లొంగదీసుకుంటే భారీగా కమీషన్లు కొట్టేయొచ్చనే కుట్రకు బీజం వేశారు. అంటే అకౌంట్స్, ఫైనాన్స్, టెండర్ల వంటి కీలక పోస్టులు మంత్రికి అనుకూలమైన వ్యక్తులు ఉంటే వారి ద్వారా భారీగా కమీషన్లు దండుకునే ప్రణాళికలో భాగంగానే మొత్తం బదిలీల ప్రక్రియ నడిచినట్టు తెలుస్తోంది. అందుకే ప్రధాన కార్యాలయంలో మంత్రి చెప్పిన వారికి కీలక పోస్టింగ్‌లు కట్టబెట్టనున్నారు. వీరి సహాయంతో నెలావారీ వసూళ్లు మంత్రి కార్యాలయానికి నేరుగా చేరిపోయేలా స్కెచ్ వేసినట్టు సమాచారం. అందుకే కొంత మంది ఉద్యోగులపై గతంలో చార్జెస్ నమోదైనప్పటికీ అవి తేలకుండా తిరిగి బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వడంపై దోపిడీ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. -
ఐదు జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోనున్నాయి. గత నెల మూడోవారం నుంచే నల్లగొండ, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల్లో కొనుగోళ్లు ప్రారంభం కాగా, కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల్లో కూడా కోతలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల వారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో పౌరసరఫరాల సంస్థ బిజీగా ఉంది. మార్చి 25వ తేదీ నుంచే అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించింది. ఈ సీజన్లో మొత్తం 7,149 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచి 75.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభించిన 443 కొనుగోలు కేంద్రాల్లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 4,345 మంది రైతుల నుంచి 31,215 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఒకటి రెండు రోజుల తర్వాత కోతలు పెరిగి ..ధాన్యం పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల సంస్థ అంచనా వేస్తోంది. ఐకేపీ, పీఏసీఎస్ వంటి సహకార సంఘాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయిస్తోంది. మిల్లర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేనా..? కొన్నేళ్లుగా ధాన్యం సేకరణ ప్రక్రియలో మిల్లర్ల జోక్యం పెరిగింది. కొనుగోలు కేంద్రాలలోనే తరుగు పేరుతో క్వింటాల్‌కు 5 కిలోలకు పైగా ధాన్యాన్ని రైతుల నుంచి అదనంగా తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. తీరా ధాన్యం మిల్లులకు పంపిన తర్వాత కూడా రంగు మారిందని, తాలు, తేమ అధికంగా ఉందని కారణాలు చెబుతూ మిల్లర్లు నేరుగా రైతులకు ఫోన్లు చేయించి వేధించి తరుగు తీయడం పరిపాటిగా మారింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే ఈసారి ఆ పరిస్థితి ఉండదని అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని మిల్లర్లు దించుకోవడం తప్ప, కొర్రీలు పెడితే సహించేది లేదని పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్.చౌహన్ ఇప్పటికే స్పష్టం చేశారు. మిల్లులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు, హమాలీ పేరుతో కిలోల కొద్దీ ధాన్యం రైతుల నుంచి దోచుకునే విధానానికి స్వస్తి పలకాలని రైతులు కోరుతున్నారు. అందుబాటులో 14 కోట్ల గన్నీ సంచులు రాష్ట్రంలో ఈసారి కొనుగోలు కేంద్రాలకు 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేసినా, ఈసారి దిగుబడి, ధాన్యం విక్రయాల తీరును బట్టి చూస్తే 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులలోపే ధాన్యం సేకరణ జరిగే అవకాశముందని పౌరసరఫరా వర్గాలు చెబుతున్నాయి. ముందస్తు అంచనాలకు అనుగుణంగా ఈసారి వడ్ల సేకరణకు 18.85 కోట్ల గన్నీ సంచులు అవసరమవుతాయని ప్రభుత్వం భావించింది. అందులో ఇప్పటికే 14 కోట్ల గన్నీ సంచులను పౌరసరఫరాల శాఖ అందుబాటులో ఉంచింది. ఈ గన్నీ బ్యాగులు 56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లకు ఇవి సరిపోతాయి. మిగతా గన్నీ బ్యాగులను కూడా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినా, వాటి అవసరం ఉండక పోవచ్చని అధికారులు అంటున్నారు. -
మాయమవుతున్న రూ.కోట్ల విలువైన పీడీఎస్ బియ్యం
సాక్షి, హైదరాబాద్/మెదక్: ‘మెదక్‌లోని పౌరసరఫరాల సంస్థ మండల స్థాయి స్టాక్ (ఎంఎల్ఎస్) పాయింట్‌కు ఎఫ్‌సీఐ నుంచి వచ్చిన బియ్యంలో 362 టన్నుల మేర తేడా వచ్చింది. అంటే రూ.3 కోట్ల విలువైన 18 లారీల బియ్యం లెక్క దొరకడం లేదు. వీటితో పాటు 700 బేల్స్ గన్నీ బ్యాగులు లేవు. 320 టన్నుల ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (ఎఫ్ఆర్కే) చెడిపోయాయి. మొత్తంగా ఈ మెదక్ ఎంఎల్ఎస్ పాయింట్లో జరిగిన అక్రమాల విలువ సుమారు రూ.6 కోట్లు. ఆకస్మిక తనిఖీలో ఈ విషయాలు బహిర్గతమయ్యాయి..’పౌరసరఫరాల సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ సోమవారం రాష్ట్ర స్థాయి అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో స్వయంగా పోస్ట్ చేసిన వివరాలు ఇవి. జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టి ఎంఎల్ఎస్ పాయింట్లలో వ్యక్తిగతంగా తనిఖీలు నిర్వహించి శుక్రవారంలోగా నివేదిక ఇవ్వాలని ఆయన ఆ మెసేజ్‌లో స్పష్టం చేశారు. నిఘా కరువు..రికార్డుల్లేవు రైస్ మిల్లుల నుంచి సీఎంఆర్ కింద బియ్యం ఎఫ్‌సీఐ గోడౌన్లకు చేరతాయి. ఇక్కడి నుంచి ప్రజా పంపిణీ పథకం (పీడీఎస్) కింద ఎంఎల్ఎస్ పాయింట్లకు వెళతాయి. అక్కడి నుంచే జిల్లాల్లోని అన్ని రేషన్ దుకాణాలకు, ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లకు సరఫరా అవుతాయి. అయితే ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద సరైన నిఘా, రికార్డుల వ్యవస్థ ఉండటం లేదు. రాష్ట్రంలో 171 ఎంఎల్ఎస్ పాయింట్లు ఉండగా, చాలాచోట్ల అధికారులు లేరు. ఔట్ సోర్సింగ్ కింద నియామకమైన డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో)ల పర్యవేక్షణలో నడుస్తున్నాయి. సెపె్టంబర్ 8న సంస్థ చైర్మన్ మంచిర్యాల ఎంఎల్ఎస్ పాయింట్‌ను తనిఖీ చేసినప్పుడు రెండేళ్లుగా అక్కడ స్టాక్ పాయింట్ ఇన్చార్జి లేడని, కేవలం డీఈవో ద్వారానే కోట్ల రూపాయల విలువైన బియ్యం పంపిణీ, సరఫరా ప్రక్రియ కొనసాగుతోందని తేలింది. అక్కడున్న 1,520 బ్యాగుల సన్నబియ్యం తినడానికి పనికిరాకుండా పోవడాన్ని కూడా గుర్తించారు. గోదాముల నుంచే మొదలు.. ఎఫ్‌సీఐ గోదాముల నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం వచ్చే సమయంలోనూ భారీగా అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్లతో మిల్లర్లు కుమ్మౖMð్క బియ్యం లోడ్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇప్పటికే పలు సంఘటనల్లో బయటపడింది. గత ఏప్రిల్ మొదటి వారంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని సుద్దాల ఎఫ్‌సీఐ గోదాం నుంచి సుల్తానాబాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు 5 లారీల్లో బియ్యం పంపించారు. కానీ 420 బస్తాల చొప్పున ఉన్న 3 లారీలు మాత్రమే గోదాంకు చేరాయి. మిగతా 2 లారీలు కాట్నపల్లి వద్ద ఉన్న ఓ రైస్ మిల్లులో అన్లోడ్ అయ్యాయి. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పౌరసరఫరాల సంస్థ చైర్మన్ లేఖ ద్వారా తెలియజేశారు. సంస్థ ప్రధాన కార్యాలయానికి సంబంధం లేకుండా పెద్దపల్లిలో సీఎంఆర్‌కు అదనంగా 30 వేల టన్నుల బియ్యం తీసుకున్నట్లు తేలిందని కూడా వివరించారు. ఈ ఘటనపై మరింత లోతైన విచారణ జరపాలని కోరారు. ఇక ఎంఎల్ఎస్ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం పంపించే క్రమంలో కూడా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని స్పష్టమవుతోంది. ఎంఎల్ఎస్ పాయింట్లలో కూడా భారీ మొత్తంలో బియ్యం మాయం అవుతున్నాయి. మెదక్‌తో పాటు రామాయంపేట, తూప్రాన్ ఎంఎల్ఎస్ పాయింట్లలో 10 వేల క్వింటాళ్లకు పైగా పీడీఎస్, సన్న బియ్యం లెక్క తేలకుండా పోయినట్లు విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ స్టాక్ పాయింట్ల ఇన్చార్జిలపై కేసులు కూడా నమోదయ్యాయి. పట్టించుకోని అధికారులు తనిఖీల్లో బయటపడుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులు పెద్దగా దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు విని్పస్తున్నాయి. 171 ఎంఎల్ఎస్ పాయింట్లలో కనీసం 150 చోట్ల అక్రమాలు జరుగుతున్నాయని, జిల్లా స్థాయిల్లోని అధికార యంత్రాంగం అండతో బియ్యం య థేచ్ఛగా గాయబ్ అవుతున్నాయని సంస్థకు చెందినవారే అంగీకరించడం గమనార్హం. -
ధాన్యం విక్రయ టెండర్లు రద్దు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైస్‌మిల్లుల్లో మూలుగుతున్న గత యాసంగి నాటి ధాన్యాన్ని విక్రయించేందుకు పౌరసరఫరాల సంస్థ చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన 10 సంస్థలు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను దక్కించుకున్నాయి. కానీ సగటున క్వింటాల్‌కు రూ.375 నష్టానికి బిడ్లు ఆమోదం పొందడం, ప్రభుత్వానికి వెయ్యి కోట్ల మేర నష్టం వచ్చే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ధాన్యం టెండర్లపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ టెండర్ల వ్యవహారాన్ని లోతుగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసింది. ఈ క్రమంలో సమాలోచనలు జరిపిన ప్రభుత్వ పెద్దలు.. ఈ టెండర్లను రద్దు చేసి, కొత్తగా బిడ్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఈసారి కనీస ధరను కోట్ చేయడం ద్వారా నష్టాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం మద్దతు ధరతో సేకరణ రాష్ట్ర ప్రభుత్వం గత యాసంగి (2022–23)లో పౌర సరఫరాల సంస్థ ద్వారా రూ.2,060 మద్దతు ధరతో 66.85 లక్షల టన్నుల (ఎల్ఎంటీ) ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలు చేసింది. ఆ ధాన్యాన్ని యథావిధిగా మిల్లులకు తరలించింది. దాన్ని సీఎంఆర్ కింద ముడిబియ్యంగా మిల్లింగ్ చేయాలని ప్రభుత్వం కోరినా.. అలా చేస్తే నూకల శాతం ఎక్కువై నష్టం వస్తుందని రైస్‌మిల్లులు తేల్చి చెప్పాయి. దీంతో సుమారు 9 నెలలుగా మిల్లుల్లో మూలుగుతున్న ఈ ధాన్యాన్ని టెండర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్న ధరకన్నా తక్కువకు.. 25 ఎల్ఎంటీ ధాన్యాన్ని 25 లాట్లుగా విభజించి టెండర్లు పిలిస్తే 11 సంస్థలు ముందుకురాగా.. ఫైనాన్షియల్ బిడ్స్ తెరిచిన తరువాత గురునానక్ అనే సంస్థ తిరస్కరణకు గురైంది. మిగతా 10 సంస్థలకు హెచ్–1 ప్రాతిపదికన 25 లాట్లను కేటాయించారు. ఈ పది సంస్థలు 25 లాట్లను క్వింటాల్‌కు కనిష్టంగా రూ.1,618 నుంచి గరిష్టంగా రూ.1,732 ధరతో దక్కించుకున్నాయి. సగటున చూస్తే క్వింటాల్ ధర రూ.1,685 మాత్రమే అవుతోంది. ప్రభుత్వం కొన్నధర రూ.2,060తో పోలిస్తే క్వింటాల్‌కు రూ.375 చొప్పున తక్కువ వస్తుంది. మొత్తంగా రూ.925 కోట్ల నష్టమని అంచనా వేశారు. ఇక సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, గన్నీ బ్యాగులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పన, కమీషన్లు, మిల్లులకు ధాన్యం రవాణా తదితర ఖర్చులన్నీ కలిపితే క్వింటాల్ ధాన్యానికి మరో రూ.100కుపైగా సర్కారు వెచ్చించింది. ఈ ఖర్చునూ కలిపితే.. మొత్తంగా 25 లక్షల టన్నుల ధాన్యం విక్రయంపై రూ.1,200 కోట్లవరకు నష్టం వస్తుందని లెక్కతేలింది. భారీ నష్టం నేపథ్యంలో ప్రస్తుత టెండర్లను రద్దు చేసి కొత్తగా టెండర్లను ఆహ్వానించాలని భావిస్తున్నట్టు తెలిసింది. -
అక్టోబర్ చివరి నుంచి ఖరీఫ్ ధాన్యం సేకరణ
సాక్షి, అమరావతి: మిల్లర్లు, దళారుల ప్రమేయం లేకుండా రైతన్నకు మద్దతు ధర అందించడమే లక్ష్యంగా ఖరీఫ్ ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా వ్యవసాయ క్షేత్రం (ఫామ్ గేట్) నుంచే అత్యంత పారదర్శకంగా ధాన్యం కొనుగోలుకు పౌర సరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. అక్టోబర్ చివరి వారంలో ప్రారంభించి మార్చి నెలాఖరులోగా సేకరణ పూర్తి చేయనుంది. ఇటీవల ప్రభుత్వం ‘ఏ’ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు కనీస మద్దతు ధరను రూ.163 మేర పెంచి రూ.2,203 గా ఖరారు చేసింది. సాధారణ వరి రకానికి రూ.143 పెంచి రూ.2,183గా నిర్ణయించింది. రాష్ట్రంలో వరి సాగైన విస్తీర్ణం, దిగుబడి అంచనా ప్రకారం 40 లక్షల టన్నుల ధాన్యం సేకరించాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఇందులో సుమారు 5 లక్షల టన్నులు బాయిల్డ్ వెరైటీలు కొనుగోలు చేయనుంది. ఈ ఖరీఫ్‌లో 3,500 ఆర్బీకే క్లస్టర్ల ద్వారా 10,500 మంది సిబ్బంది భాగస్వామ్యంతో ధాన్యం సేకరిస్తారు. రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని 1,670 మిల్లుల్లో మర ఆడిస్తారు. ఇందులో 53 బాయిల్డ్, 550 డ్రయర్ సౌకర్యాలున్న మిల్లులు ఉన్నాయి. వర్షాలకు ఎక్కడైనా ధాన్యం తడిస్తే రైతుకు నష్టం కలగకుండా దానిని కూడా కొని డ్రయర్ ఉన్న మిల్లులకు తరలిస్తారు. గోనె సంచులతోపాటు హమాలీలు, రవాణా సౌకర్యాలను కూడా ప్రభుత్వమే అందిస్తుంది. రైతులే గోనె సంచులు ఏర్పాటు చేసుకుంటే వాటికయ్యే ఖర్చును రైతు ఖాతాల్లో జమ చేస్తుంది. ధాన్యం తరలింపునకు 5 వేల ట్రక్కులను సిద్ధం చేస్తున్నారు. అవి నిర్దేశిత మిల్లులకు వెళ్లేలా జీపీఎస్, మొబైల్ ట్రాకర్ల ద్వారా పర్యవేక్షిస్తారు. బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో బయట మార్కెట్లో ధాన్యం కొనుగోళ్లు తగ్గి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఎక్కువ మొత్తంలో ధాన్యం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఇలా లక్ష్యానికి మించి ధాన్యం వచ్చినా కొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్రంకంటే ముందే.. ఈ ఏడాది ఖరీఫ్ నుంచి బయోమెట్రిక్ ఆధారిత కొనుగోళ్లు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020–21 ఖరీఫ్‌లోనే పారదర్శక విధానంలో ధాన్యం కొనుగోళ్లకు శ్రీకారం చుట్టారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా వెబ్‌ల్యాండ్, కౌలు రైతులకు ఇచ్చే పంట సాగు హక్కు పత్రాల (సీసీఆర్సీ కార్డులు) ఆధారంగా చేసిన ఈ క్రాప్ నమోదు ప్రకారమే కొనుగోళ్లు చేపడుతున్నారు. తద్వారా దళారులు, మిల్లర్ల మోసాలను అరికట్టి రైతులకు మద్దతు దక్కేలా చేస్తున్నారు. గతంలో దళారులు రైతుల నుంచి తక్కువ రేటుకు ధాన్యం కొని తిరిగి అదే రైతుల పేరుతో ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధరను కొట్టేసేవారు. ఇటువంటివి జరగకుండా ధాన్యం కొనుగోలు సమయంలో రైతుకు ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ (ఎఫ్టీఓ) సమయంలో ఆధార్‌ను తప్పనిసరి చేశారు. ధాన్యం నగదు చెల్లింపులను సైతం ఆధార్ సీడింగ్ కలిగిన రైతు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. రైతులను మిల్లర్లు ఇబ్బందిపెట్టకుండా చర్యలు ధాన్యం కొనుగోళ్ల సమయంలో మిల్లర్లు రైతులను ఇబ్బంది పెట్టకుండా చర్యలు చేపడుతున్నాం. ఆర్బీకే పరిధి నుంచి ధాన్యాన్ని దూరంగా తీసుకెళ్లాల్సిన పని లేకుండా ఆ మండలంలోని మిల్లులను ట్యాగ్ చేస్తాం. ఇప్పటికే జిల్లాలవారీగా సేకరణ అంచనాలను రూపొందిస్తున్నాం. గోనె సంచుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాం. రైతులకు నగదు చెల్లింపు సమయంలో బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పారు. – వీరపాండియన్, ఎండీ, పౌరసఫరాల సంస్థ కస్టమ్ మిల్లింగ్‌పై పర్యవేక్షణ ఇప్పటికే 1,474 మిల్లుల్లో సీసీ కెమెరాల ద్వారా కస్టమ్ మిల్లింగ్‌ను పర్యవేక్షిస్తున్నాం. మిల్లుల సామర్థ్యం ఆధారంగా సీఎంఆర్ కేటాయిస్తున్నాం. మిల్లుల్లో విద్యుత్ వినియోగం లెక్కలనుబట్టి కస్టమ్ మిల్లింగ్ జరిగిందా లేదా అంచనా వేస్తున్నాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో 49, మార్చిలో 33, ఏప్రిల్‌లో 118, మే – జూన్‌లో 53 మిల్లుల్లో డీవియేషన్‌ను గుర్తించాం. ఇందులో 31 మిల్లులపై చర్యలు తీసుకున్నాం. మిగిలిన వాటిపై విచారణ జరుగుతోంది. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌర సరఫరాల శాఖ దళారులు, మిల్లర్ల అక్రమాలకు చెక్ ధాన్యం సేకరణలో దళారులు, మిల్లర్ల పాత్రను పూర్తిగా తొలగించేలా సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేశాం. గతేడాది ఖరీఫ్‌లో 6.39 లక్షల మంది రైతుల నుంచి రూ.7,222 కోట్లు విలువైన 35.36 లక్షల టన్నుల ధాన్యాన్ని కొన్నాం. ప్రస్తుత ఖరీఫ్‌లో 15.25 లక్షల హెక్టార్లలో వరి సాగవగా 80 లక్షల టన్నుల దిగుబడిని అంచనా వేస్తున్నారు. ఇందులో 40 లక్షల వరకు సేకరణకు ప్రాథమిక లక్ష్యంగా నిర్దేశించారు. దీనిని కస్టమ్ మిల్లింగ్ చేస్తే 28 లక్షల టన్నులకు పైగా బియ్యం వస్తుందని ఆశిస్తున్నాం. రైతులు మద్దతు ధరలో పైసా కూడా నష్టపోకుండా, ఆర్బీకేల్లోనే ధాన్యం విక్రయించేలా పటిష్ట చర్యలు చేపడుతున్నాం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి -
అధికారి ధిక్కారం..టెండర్ ‘అప్రూవ్’ ఆలస్యం
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ అధికారుల్లో అలసత్వం, ధిక్కారం పెరిగిపోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడంలో కూడా కొందరు అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలోని రైస్‌మిల్లుల వద్ద లక్షలాది మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు పేరుకుపోయిన నేపథ్యంలో గ్లోబల్ టెండర్ల ద్వారా బహిరంగ మార్కెట్లో విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని వేలం వేసేందుకు ఈనెల 21న గ్లోబల్ ఈ– టెండర్ ప్రకటన విడుదల చేసింది. 22వ తేదీ నుంచి ఆన్లైన్లో బిడ్స్ ఆహ్వానించారు. సెపె్టంబర్ 5వ తేదీని బిడ్డింగ్‌కు ఆఖరి తేదీగా నిర్ణయించారు. అయితే టెండర్ ప్రకటన విడుదల చేసినప్పటికీ, వేలానికి సంబంధించిన నిబంధనలేవీ ఆన్లైన్లో పెట్టలేదు. ఈఎంఐ, డిపాజిట్లు, అర్హతలు, ఇతర వేలం నిబంధనలేవీ ఆన్లైన్లో పొందుపరచలేదు. దీంతో బుధవారం సాయంత్రంలోగా టెండర్ వివరాలను అప్లోడ్ చేసే ప్రక్రియను పూర్తి చేయాలని సంస్థ ఎండీ అనిల్‌కుమార్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అయితే పౌరసరఫరాల సంస్థలో టెండర్లకు సంబంధించి ఆన్లైన్ డిజిటల్ కీ మార్కెటింగ్ సెక్షన్ జీఎం వద్ద ఒకటి, పీడీఎస్ డీజీఎం వద్ద మరొకటి ఉంటుంది. ఈ మేరకు కమిషనర్ ఇద్దరు అధికారులకు స్వయంగా ఫోన్ చేసి, గ్లోబల్ టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్, అప్రూవ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు మార్కెటింగ్ సెక్షన్ జీఎం తన వద్ద ఉన్న డిజిటల్ కీతో అప్లోడ్ చేశారు. కానీ పీడీఎస్ డీజీఎంగా ఉన్న అధికారి, అప్లోడ్ అయిన వివరాలను తన వద్ద ఉన్న కీతో అప్రూవ్ చేయాల్సి ఉండగా, లాగిన్ కావడానికి కూడా ఒప్పుకోలేదని సమాచారం. స్వయంగా సంస్థ ఎండీ ఫోన్ చేసి డిజిటల్ కీతో టెండర్ ప్రక్రియను అప్రూవ్ చేయాలని ఆదేశించినప్పటికీ, ఆ అధికారి ససేమిరా అన్నట్లు సమాచారం. డిజిటల్ కీ ఇవ్వడానికి కూడా నిరాకరించిన ఆ అధికారి బుధవారం రాత్రి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలిసింది. దాంతో బుధవారం రూ. వేల కోట్ల విలువైన టెండర్లకు సంబంధించిన విధి విధానాలను అప్లోడ్ చేయలేకపోయారు. గురువారం ఈ విషయం తెలుసుకున్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సదరు అధికారిపై చర్యలకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన పౌరసరఫరాల సంస్థ అధికారులు.. పీడీఎస్ డీజీఎం పేరుపై ఉన్న డిజిటల్ కీ స్థానంలో మరో కీని రూపొందించి వివరాలను అప్లోడ్ చేశారు. బదిలీ చేశారనే కోపంతో..? పీడీఎస్ డీజీఎంగా ఉన్న ఆ అధికారిని ఇటీవలే హెడ్ ఆఫీస్ నుంచి వికారాబాద్‌కు బదిలీ చేశారు. అయితే అక్కడ జాయిన్ కాకుండా తిరిగి యథాస్థానంలో కొనసాగేందుకు పైరవీ చేసుకున్నా, ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వేలానికి సంబంధించిన టెండర్ విధి విధానాలను అప్రూవ్ చేసే విషయంలో మొండిగా వ్యవహరించడం సంస్థలో చర్చనీయాంశమైంది. ప్రభుత్వం ఆ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. -
చిరుధాన్యాలకు ‘మద్దతు’
సాక్షి, అమరావతి: చిరు ధాన్యాలు పండించే రైతన్నలకు మద్దతు ధర కల్పిస్తూ ఖరీఫ్ నుంచి ఆర్బీకేల ద్వారా రాగులు, జొన్నలు, కందుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధ్యవర్తులు, దళారుల బెడద లేకుండా ధాన్యం మాదిరిగానే నేరుగా కల్లాల్లో పంట ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి పౌర సరఫరాల సంస్థ మద్దతు ధరకు సేకరించనుంది. పంట వేసిన తర్వాత ఆర్బీకేలో నమోదు చేసే ఈ–క్రాప్ వివరాల ఆధారంగా కొనుగోలు చేయనుంది. క్వింటాల్ కందులకు కనీస మద్దతు ధర రూ.7 వేలు, రాగులకు రూ.3,578, జొన్నలకు రూ.2,970(హైబ్రీడ్), రూ.2,990 (మల్దండి) చొప్పున ప్రకటించింది. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారంలోగా వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.41 లక్షల టన్నుల కందులు, 64,738 టన్నుల రాగులు, 3.63 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తుల దిగుబడులు రావచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు రాగులు, జొన్నలు, కందుల కొనుగోళ్ల వివరాలను పౌర సరఫరాల సంస్థ గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలోనే సేకరణ.. రాయితీపై విత్తనాలు ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ప్రతి నెలా కార్డుకు మూడు కేజీల బియ్యం బదులు రాగులు/జొన్నలను అందిస్తోంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ మద్దతు ధరకు జొన్నల కొనుగోలు చేపట్టగా రాగులను కర్ణాటక నుంచి సేకరిస్తోంది. అయితే మన రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు, కందులను స్థానికంగానే కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించి వాటిని తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వర్షాధార, మెట్ట పంటలైన రాగి, జొన్నల సాగును ప్రోత్సహించేందుకు 50 శాతం రాయితీపై రైతులకు విత్తనాలను అందిస్తోంది. రైతులపై భారం లేకుండా.. పంట ఉత్పత్తులను నేరుగా కల్లాల్లోనే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు రవాణా, హమాలీ ఖర్చుల భారం నుంచి ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తోంది. గోనె సంచులు, లోడింగ్, మిల్లు వద్దకు తరలించేందుకు రవాణా ఖర్చులను కూడా భరిస్తోంది. ఒకవేళ రైతులు వాటిని స్వయంగా సమకూర్చుకుంటే అందుకు అయిన ఖర్చులను తిరిగి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచికి (50 కేజీలు) రూ.3.39, లేబర్ చార్జీ కింద రూ.22 చొప్పున అందచేస్తోంది. పోటీతో రైతులకు లాభసాటి ధర చిరుధాన్యాలు, కందులు పండించే రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. స్థానికంగా పంటలను కొనుగోలు చేసి స్థానికులకే పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బృహత్తర ప్రణాళిక ఇది. తొలుత ఖరీఫ్‌లో ఆర్బీకేల ద్వారా జొన్నలు, రాగులు, కందుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు వీటిని మార్కెట్లో వ్యాపారులే కొనుగోలు చేస్తుండగా ప్రభుత్వం ముందుకు రావడంతో పోటీ పెరగనుంది. తద్వారా రైతుకు మద్దతు ధర మించి లాభసాటి రేటు దక్కుతుంది. రైతులు కచ్చితంగా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
మరో 8 ‘సివిల్’ బంకులు
సాక్షి, హైదరాబాద్: పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా మరో 8 రిటైల్ పెట్రోల్ బంకులు ఏర్పాటు కానున్నాయి. ఇటీవలే 9 పెట్రోల్ బంకుల నిర్వహణకు ఆమోదం లభించడంతో మొత్తంగా 17 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినట్లయింది. ఆదాయం పెంచుకొనే చర్యల్లో భాగంగా జిల్లాకు ఒకటి చొప్పున పెట్రోల్ బంకులను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. దీంతో జిల్లాల్లో అనువైన స్థలాలను గుర్తించి ఆయా ఆయిల్ కంపెనీలకు బంకులు కేటాయించేందుకు సంస్థ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ ఆధ్వర్యంలో ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ తొలివిడతలో 9 జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు సిఫార్సు చేసింది. ఈ మేరకు పెట్రోల్ బంకుల ఏర్పాటు ప్రక్రియ జరుగుతోంది. ఇక రెండో విడతలో వరంగల్, వనపర్తి, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, సిద్దిపేట, హనుమకొండ, జనగామ జిల్లాల్లో పెట్రోల్ బంకుల ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు సంస్థ చైర్మన్ రవీందర్‌సింగ్ తెలిపారు. వీలైనంత త్వరగా వినియోగదారులకు సేవలు అందుబాటులోకి తేవాలని ఐఓసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్ ఆయిల్ కంపెనీలకు సూచించినట్లు చెప్పారు. ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ జీహెచ్ఎంసీ పరిధిలో 3 పెట్రోల్ రిటైల్ బంకులను విజయవంతంగా నిర్వహిస్తోంది. కొత్త బంకులు ఏర్పాటైతే వాటి సంఖ్య 20కి చేరనుంది. -
Fact Check: అసత్యాల్లో నిండా మునిగిన ‘ఈనాడు’
సాక్షి, అమరావతి: నిత్యం విషపు రాతలు రాసే రామోజీకి వాస్తవం ఏదైనా విరోధే. అధికారంలో మనవాడు ఉంటే అప్పు చేసినా అది లోకకల్యాణం కోసమే.. వేరొకరు అధికారంలో ఉండి అప్పు చేస్తే పెను భూతం.. ఇదే రామోజీ పత్రికా ఫిలాసఫీ. అందుకే గురువారం ‘నిండా మునిగిన పౌరసరఫరాల సంస్థ’ శీర్షికతో ఈనాడు పత్రిక పౌర సరఫరాల పైనే పనికిమాలిన ఏడుపు కథనం అచ్చేసింది. అసత్యాల కథనాలు అల్లింది. రాష్ట్ర విభజన తర్వాతి లెక్కతో మొదలెట్టి.. మధ్యలోని టీడీపీ కాలం నాటి లెక్కల ఎక్కాలను ఎగ్గొట్టి.. ప్రస్తుతం అప్పుల భారం పెరిగిందంటూ.. ప్రతి పేద ఇంటికీ నాణ్యమైన రేషన్ అందిస్తున్న సంక్షేమ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేసింది. ‘అప్పుల’ పేరుతో ఈనాడు రాసిన ‘తప్పుడు రాతల’ పురాణంలో వాస్తవాలేమిటో చూద్దాం.. ఆరోపణ: పౌర సరఫరాల సంస్థ రుణ భారం పెరిగిపోతోంది వాస్తవం: 2014–15లో పౌర సరఫరాల సంస్థ అప్పు రూ.6,042 కోట్లు. ప్రస్తుతం అది రూ.31,600. ఇందులో రూ.20 వేల కోట్లు టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ గ్యారెంటీలతో చేసిన అప్పు. అందులో బ్యాంకులకు తిరిగి చెల్లించింది. రూ.300 కోట్లు మాత్రమే. ప్రస్తుతం.. ప్రభుత్వ గ్యారంటీలతో పౌర సరఫరాల సంస్థ నాలుగేళ్లలో రూ.23,950 కోట్లు అప్పు తీసుకుంటే అందులో రూ.11,800 కోట్లు తిరిగి బ్యాంకులకు చెల్లించింది. వీటిల్లో టీడీపీ హయాంలో తీసుకున్న రుణాలకు రూ.2వేల కోట్లు ఈ ప్రభుత్వమే చెల్లించడం విశేషం. ఈనాడు రాతల్లో చేసిన అప్పు కనిపిస్తోంది తప్ప.. తిరిగి తీర్చింది చెప్పట్లేదు. వాస్తవానికి పౌర సరఫరాల సంస్థ రైతుల నుంచి ధాన్యం కొంటుంది. దానిని మరాడించి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎఫ్‌సీఐ ఇస్తుంది. ఇదంతా జరిగి సబ్సిడీ మొత్తం రాష్ట్రానికి వచ్చేసరికి ఆలస్యం అవుతోంది. ఈ సమయంలో రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా ఉండేందుకు బ్యాంకు రుణాలు తీసుకుంటోంది. కేంద్రం నుంచి రావాలి్సన మొత్తం వచ్చిన వెంటనే బ్యాంకులకు తిరిగి చెల్లిస్తోంది. ఆరోపణ: ప్రభుత్వ గ్యారెంటీలు రూ.42 వేల కోట్లకు చేరాయి వాస్తవం: పౌర సరఫరాల సంస్థ ప్రస్తుత రుణం రూ.31,600 కోట్లు. వాస్తవానికి రుణాల సేకరణకు ప్రభుత్వ గ్యారెంటీలు రూ.37 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇక్కడ అనుమతించిన దానికంటే తీసుకున్న రుణం తక్కువగా ఉంది. ఈనాడు మాత్రం రూ.37 వేల కోట్ల రుణ అనుమతులు ఉండగా.. ప్రభుత్వం కొత్తగా మరో రూ.5 వేల కోట్లకు అనుమతులు ఇవ్వడంతో రూ.42 వేల కోట్లకు చేరాయని రాసుకొచ్చింది. ఇక్కడ కార్పొరేషన్ రుణం కోసం ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఏడాదిలో వినియోగించుకోకుంటే గడువు ముగిసిపోతుంది. ఆ తర్వాత పౌర సరఫరాల సంస్థ తనకు రుణం కావాల్సి వస్తే.. ప్రభుత్వం పాత గ్యారెంటీల్లో నుంచే ఆ మొత్తాన్ని తీసుకుంటుంది. తాజాగా పౌరసరఫరాల సంస్థలో ప్రభుత్వం అలానే రూ.5 వేల కోట్ల రుణ అనుమతులను తీసుకుంది. దీనిని వక్రీకరిస్తూ ఈనాడు రూ.42 వేల కోట్లంటూ తప్పుడు లెక్కలు చెప్పింది. ఆరోపణ: ప్రభుత్వం రాయితీ సొమ్ము విడుదల చేయట్లేదు. రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు ఉంటే రూ.900 కోట్లతో సర్దుకోమన్నారు వాస్తవం: ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థకు నాలుగేళ్లలో పంచదార, కందిపప్పు, బియ్యానికి రూ.8,766.83 కోట్ల సబ్సిడీ చెల్లించింది. గత ఆర్థిక సంవత్సరం (2022–23)లో ఒకేసారి రూ.7 వేల కోట్ల వరకు ఇచ్చింది. ఈనాడు మాత్రం 2019–20, 2020–21, 2021–22 లెక్కలను మాత్రమే చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఇదే కాకుండా రాష్ట్ర విభజన తర్వాత ఐదేళ్లు అధికారంలో ఉండి చంద్రబాబు రాబట్టలేని రూ.1,756.57 కోట్లు మొత్తాన్ని తెలంగాణ నుంచి వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం కూడా రూ.31,197 కోట్ల సబ్సిడీని ఏపీకి చెల్లించింది. ఆరోపణ: ధాన్యం బకాయిల కోసం అప్పలు చేస్తోంది. అయినా సమయానికి రైతులకు డబ్బులు చెల్లించట్లేదు వాస్తవం: రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఆర్బీకేల ద్వారా అత్యంత పారదర్శకంగా ధాన్యం సేకరిస్తోంది. ఈ క్రమంలోనే బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో ప్రతి పైసా రైతుకు మద్దతు ధర కల్పించేందుకే ఖర్చు చేస్తోంది. వాస్తవానికి చంద్రబాబు ప్రభుత్వం రూ.10,001.43 కోట్లు పౌర సరఫరాల సంస్థ సొమ్మును వివిధ కార్యక్రమాలకు దారి మళ్లించింది. అందులో 2019 ఎన్నికలకు ముందు రూ.4 వేల కోట్లు పసుపు–కుంకుమ పథకానికి మళ్లించింది. పౌర సరఫరాల సంస్థ లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వానికి అవసరం లేకుండాపోయింది. టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.4,800 కోట్లు బకాయిలు పెట్టిపోయింది. వీటిని కూడా ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతగా తీసుకుని తిరిగి పౌర సరఫరాల సంస్థకు చెల్లించింది. తద్వారా సంస్థ ఆర్థిక పరిపుష్టికి దోహదం చేసింది. ఇవన్నీ ఈనాడుకు కనిపించవా? రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ నాలుగేళ్లలో రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించేందుకు రూ.58,728.77 కోట్లు ఖర్చు చేసింది. 32, 75,790 మంది రైతుల నుంచి 3.10 కోట్ల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ఇదే టీడీపీ హయాంలో చూస్తే కేవలం 18 లక్షల మంది రైతుల నుంచి రూ.43 వేల కోట్ల విలువైన 2.65 కోట్ల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. వాస్తవంగా టీడీపీ ఐదేళ్ల పాలనలో కంటే వైఎస్ జగన్ ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ఎక్కువ మంది ధాన్యం రైతులకు మద్దతు అందించడం విశేషం. మద్దతు ధరతో పాటే ప్రతి ఖరీఫ్ సీజన్లో రూ.400 కోట్లు గోనె సంచులు, రవాణా, హమాలీ ఖర్చుల కింద రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. వీటితో పాటు కరోనా సమయంలో ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన కింద రాష్ట్రంలోని రైస్ కార్డుదారులకు ఏప్రి ల్ 2019 నుంచి సెప్టెంబర్ 2022 వర కు ఉచిత బియ్యం పంపిణీ కోసం ఏకంగా రూ.6,329.20 కోట్లు అదనంగా ఖర్చు చేసి పేదలను ఆదుకుంది. చదవండి: సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ? వీటితో పాటు ప్రతి నెలా నాణ్యమైన బియ్యం ఇంటింటికీ పంపిణీ కోసం రూ.1,146 కోట్లు, బహిరంగ మార్కెట్లో కందిపప్పు, పంచదార ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలోనూ వాటిని సబ్సిడీపై అందించినందుకు రూ.2,727.82 కోట్లు, వంట నూనె పంపిణీకి రూ.126 కోట్లు అదనంగా ఖర్చు చేసింది. సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ సెంటర్లు, పాఠశాలలకు బియ్యాన్ని నేరుగా సరఫరా చేస్తోంది. వీటన్నింటికీ కలిపి సుమారు రూ.10,329.02 కోట్లు అదనపు భారాన్ని మోస్తోంది. ఇంత పెద్ద ఎత్తున రైతులకు, పేదల సంక్షేమానికి పని చేస్తున్న ఏపీ ప్రభుత్వంలోని పౌర సరఫరాల సంస్థ రుణ భారం రూ.31,600 కోట్లు ఉంటే... ఇలాంటి సంస్కరణలు లేని.. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే తెలంగాణలో మాత్రం ఆ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ అప్పు ఏకంగా రూ.49 వేల కోట్లు ఉండటం గమనార్హం. తెలంగాణలోనూ ఈనాడు పత్రికను నడిపిస్తున్న రామోజీ.. అక్కడ నోరెత్తకుండా.. ఏపీలో మాత్రం గుండెలు బాదుకోవడం ఎల్లో ఏడుపునకు నిదర్శనం. -
సీఎంఆర్ ధాన్యం మాయం
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మిల్లర్ల బాగోతం బయటపడింది. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ మిల్లులకు ఇచ్చిన వడ్లను సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కింద మరాడించి ఇవ్వాల్సి ఉండగా, మిల్లర్లు బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు తేలింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణం ఆరెపల్లెలో ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌లో రూ.27.76కోట్ల విలువ చేసే 9,522 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 2021–22 యాసంగిలో 5,989 మెట్రిక్ టన్నులు, 2022–23 వానాకాలంలో 5,437 మెట్రిక్ టన్నులు కలిపి మొత్తం 11,426 మెట్రిక్ టన్నుల (ఎంటీ) ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించారు. ఇప్పటివరకు 1,400 ఎంటీల ధాన్యం మరాడించి ఇవ్వగా ఇంకా 10,026 ఎంటీల ధాన్యం నిల్వ ఉండాలి. ఈ నెల 1న మిల్లులో విజిలెన్స్ దాడులు చేయగా 504 ఎంటీల ధాన్యం మాత్రమే ఉంది. యాసంగి ధాన్యం 4,135 మెట్రిక్ టన్నులు, వానాకాలం 5,387 మెట్రిక్ టన్నుల ధాన్యం మాయమైనట్లు తేల్చారు. పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ హరీశ్ ఫిర్యాదుమేరకు పోలీసులు ఏఆర్ఎం ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని ఆనంద్‌దాస్ రాంమోహన్తోపాటు తిరుమల, అనురాధపై కేసు నమోదు చేశారు. యజమాని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారీలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం అధికారులు డబ్బులను రికవరీ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆ మిల్లు యజమానులు, కుటుంబసభ్యుల మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయో గుర్తించే పనిలో పడ్డారు. జిల్లా వ్యాప్తంగా దాడులు జిల్లా వ్యాప్తంగా రెండు బృందాలు విజిలెన్స్ దాడులు మంగళవారం తనిఖీలు నిర్వహించాయి. మరిన్ని మిల్లుల అక్రమాలు వెలుగులోకి రానున్నట్లు తెలుస్తోంది. 2021–22 యాసంగిలో 3,61,437 మెట్రిక్ టన్నుల ధాన్యం 133 మిల్లులకు కేటాయించారు. 2,44,943 మెట్రిక్ టన్నుల బియ్యం అందించాల్సి ఉండగా, 1,88,151 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే అప్పగించారు. ఇంకా 63 మిల్లుల నుంచి 56,792 మెట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. క్వింటాల్ వడ్లకు రా రైస్ అయితే 67 కేజీలు, బాయిల్డ్ అయితే 68 కేజీలు సీఎంఆర్ చేసి అందించాలి. 2022–23 వానాకాలంలో 3,62,193 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 146 మిల్లులకు అప్పగించారు. సీఎంఆర్ కింద 2,42,669 మెట్రిక్ టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా మిల్లర్లు 8,903 టన్నులు మాత్రమే అప్పగించారు. ఇంకా 2,33,766 మెట్రిక్ టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు తనిఖీలకు రాకముందే రేషన్ బియ్యం కొనుగోలు చేసి తెప్పించేందుకు తంటాలు పడుతున్నట్లు సమాచారం. భారీ మొత్తంలో ధాన్యం మాయమవుతున్నా జిల్లా అధికారులు గుర్తించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తే సహించం
సాక్షి, హైదరాబాద్: ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని, మిల్లర్లతో రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలని పౌర సరఫరాల సంస్థ ఉద్యోగులకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సూచించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఎలాంటి అంశాన్నయినా ఉపేక్షించబోమని, కఠినచర్యలకు వెనుకాడబోమని హెచ్చరించారు. రాష్ట్రం ధాన్యం సేకరణలో దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిందని, 25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ స్థాయి నుంచి కోటి 41 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలోని 33 జిల్లాల పౌర సరఫరాల సంస్థ మేనేజర్లు, ఉద్యోగులతో మంత్రి సోమవారం హైదరాబాద్‌లోని కార్పొరేషన్ భవన్లో సమావేశమయ్యారు. ఉద్యోగుల డైరీని ఆవిష్కరించి, వారికి హెల్త్‌కార్డులు అందజేశారు. -
ధాన్యం రైతులకు రూ.1,611కోట్లు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోళ్లలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు సంపూర్ణ మద్దతు అందిస్తూ అండగా నిలుస్తోంది. పౌరసరఫరాల సంస్థ తాజాగా గురువారం రూ.1,611.27 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. దీంతో ధాన్యం రైతులకు మొత్తం రూ.6,483.97 కోట్లు అంటే సుమారు 96.29 శాతం మేర నిర్ణీత వ్యవధిలోగా చెల్లింపులు చేయడం విశేషం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తూ రవాణా ఖర్చులను కూడా అందిస్తోంది. గోనె సంచులు, హమాలీ, రవాణా చార్జీల కింద రూ.79.68 కోట్లను రైతులకు చెల్లించింది. 2022 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఇప్పటివరకు 6,01,147 మంది రైతుల నుంచి రూ.6,734.02 కోట్ల విలువైన 32,97,735 టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. ఉత్తరాంధ్రలో వారంలోగా.. ధాన్యం సేకరణలో భాగంగా పౌరసరఫరాల సంస్థ జిల్లాల వారీగా తాత్కాలిక అంచనాలు రూపొందించింది. దీని ప్రకారం చాలా జిల్లాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇంకా మిగిలి ఉన్న ధాన్యాన్ని లెక్కించి కొనుగోళ్లకు అనుమతులిస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరో వారంలోగా కొనుగోళ్లు పూర్తి చేయాలని నిర్దేశించారు. కృష్ణా, గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పంట కోతలు, నూర్పిడులు కొద్దిగా ఆలస్యం అవుతాయి. అందువల్ల అక్కడ వచ్చే నెల నుంచి ధాన్యం కొనుగోళ్లు జరగనున్నాయి. -
సివిల్ సప్లైస్ గోదాములపై సోలార్ పలకలు
సాక్షి, హైదరాబాద్: నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి బయటపడటం, అదే సమయంలో ఆదాయాన్ని కూడా పొందడం కోసం పౌర సరఫరాల శాఖ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పౌర సరఫరాల శాఖ గోదా ములపై సోలార్ పలకలను అమర్చి.. విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలని, ఇదే సమయంలో పలుచోట్ల ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పునరుద్ధర ణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో)తో కలసి సివిల్ సప్లైస్ పరిధిలోని గోదాములతోపాటు పెట్రోల్, ఎల్పీజీ ఔట్‌లెట్లలోనూ ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. శుక్రవారం పౌర సరఫరాల భవనంలో రెడ్కో మేనేజింగ్ డైరెక్టర్ జానయ్య, తెలంగాణ సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ గౌడ్, ఇతర అధికారులతో రవీందర్‌సింగ్ సమావేశమై చర్చించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహించడంతోపాటు పౌర సరఫరాల సంస్థకు సంబంధించిన కరెంటు చార్జీలను తగ్గించుకు నేందుకు గోదాముల్లో సోలార్ వ్యవ స్థలను ఏర్పాటు చేయాలని నిర్ణ యించినట్టు రవీందర్‌సింగ్ వెల్లడించారు. తొలిదశలో సంస్థకు చెందిన 19 గోదాములు, రెండు పెట్రోల్ బంకులు, ఐదు ఎల్పీజీ గోదాములు కలిపి మొత్తం 26 చోట్ల ఈవీ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసే ప్రతిపా దనలపై చర్చించామన్నారు. అందులో 24 చోట్ల అనుకూలంగా ఉన్న ట్టుగా అధికారులు ధ్రువీకరించారని తెలిపారు. ఇక తమ పరిధిలోని రైస్‌మిల్లుల్లోనూ సౌర విద్యుత్‌ను వినియోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు వివరించారు. సమావేశం అనంతరం రవీందర్‌సింగ్ సికింద్రాబాద్‌లోని జిల్లా పౌర సరఫరాల కార్యాలయాన్ని పరిశీలించారు. అక్కడ సోలార్ సిస్టమ్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పౌర సరఫరాల సంస్థ గోదాముల్లో సోలార్ వ్యవస్థల ఏర్పాటు నిర్ణయంపై సోలార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. -
Ration Rice: వేలి ముద్ర వెయ్యి.. పైసలు తీసుకో.. కిలో రూ.8 నుంచి 10
రేషన్ డీలర్ నుంచి మిల్లర్ వరకు అక్రమ దందా ప్రతి నెలా వందల కోట్లలో వ్యాపారం వరకు ఇచ్చి కొనుగోలు డీలర్ల వద్ద, గ్రామాల్లో మహిళల నుంచి రూ.10 వరకు ఇచ్చి కొంటున్న దళారులు దళారుల వద్ద కొని పొరుగు రాష్ట్రాల్లో రూ.20 వరకు విక్రయిస్తున్న పెద్ద వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొని రీసైక్లింగ్ చేసి.. కస్టమ్ మిల్లింగ్ రైస్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్న కొందరు మిల్లర్లు మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ఓ గ్రామం రేషన్ దుకాణానికి ఓ మహిళ వచ్చి డీలర్‌కు ఆహార భద్రతా కార్డు ఇచ్చింది. డీలర్: అమ్మా బియ్యం ఇయ్యాల్నా.. పైసలా.. మహిళ: ఒక్కలకు ఎన్ని కిలోల బియ్యం ఇత్తండ్రు డీలర్:10 కిలోలు మహిళ: మా కార్డుల ఐదుగురం ఉన్నం గద. పైసలే ఇయ్యి డీలర్: యేలి ముద్ర ఎయ్యమ్మా... కిలకు ఎనిమిది (రూ.8) లెక్కన నాలుగు వందలిస్త మహిళ: సరేనయ్య.. పైసలియ్యి వచ్చిన మహిళ వేలిముద్ర వేయగానే... సదరు డీలర్ 50 కిలోల బియ్యం తూకం వేసి, ఆ బియ్యాన్ని పక్కకు పెట్టి ఆమెకు రూ.400 ఇచ్చాడు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పేదలకు అందాల్సిన బియ్యం 80 శాతం వరకు పక్కదారి పడుతోంది. రూపాయికి కిలో చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఈ బియ్యాన్ని రూ.8 నుంచి రూ.15 వరకు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ముఠాలు ప్రతి నెలా వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరం మొదలుకొని పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ఈ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. రేషన్ దుకాణం నుంచి మొదలయ్యే ఈ దందా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో ముగుస్తోంది. అక్రమ దందాలో చిన్న చిన్న దళారులు మొదలుకొని పెద్ద వ్యాపారులు, రైస్ మిల్లర్లు కూడా ఉండటం గమనార్హం. పీడీఎస్ బియ్యం జాతీయ రహదారులు, రైలు మార్గాల ద్వారా గమ్య స్థానాలకు నిరాటంకంగా చేరుతున్నా.. పట్టించుకునేవారే లేరు. బియ్యంతో పాటే పోలీస్, రైల్వే పోలీస్, పౌర సరఫరాల సంస్థ అధికారులను ‘కొనుగోలు’చేస్తున్న వ్యాపారులు ప్రభుత్వం కోట్లు వెచ్చించి పేదలకు పంచుతున్న బియ్యాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. తెలంగాణలోని రూపాయి బియ్యం (కరోనా నాటి నుంచి దాదాపుగా ఉచితంగానే సరఫరా) ఇతర రాష్ట్రాల్లో రూ.20కు పైగా పలుకుతుండడం గమనార్హం. కరోనా నాటి నుంచి ఉచితంగానే.. ► సాధారణంగా ఆహార భద్రత కార్డులు ఉన్న కుటుంబాల్లోని ఒక్కొక్కరికి 6 కిలోలు.. కిలో రూపాయి చొప్పున ఇస్తారు. అయితే కరోనా మొదలైన 2020 నుంచి ఒకటి రెండు నెలలు మినహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగానే బియ్యాన్ని సరఫరా చేస్తున్నాయి. ఈ క్రమంలో గత జనవరి నుంచి మే, జూన్ నెలలు మినహా ఒక్కొక్కరికి ప్రతినెల 10 కిలోల చొప్పున ఇస్తున్నారు. ఆగస్టు నెలలో ఏకంగా 15 కిలోల చొప్పున పౌరసరఫరాల సంస్థ బియ్యం పంపిణీ చేసింది. రేషన్ బియ్యంపై చులకన భావం! ► ఆహార భద్రతాకార్డు ఉన్న కుటుంబంలోని సభ్యులు బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్ర వేసి తమ కోటా బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే గ్రామాల్లో పెరిగిన వరిసాగు, రైతు కుటుంబాలు సొంతంగా పండించిన బియ్యం తినే అలవాటు, రేషన్ బియ్యంపై ఉన్న చులకన భావం లాంటి కారణాల వల్ల చాలామంది ఈ బియ్యాన్ని ఆహారంగా వినియోగించడం లేదు. పట్టణాల్లోనూ చాలామంది రేషన్ బియ్యాన్ని ఇడ్లీ, దోశల పిండి, అటుకుల తయారీకి వాడుతున్నారు మినహా రోజువారీ భోజనానికి వినియోగించడం లేదు. అయితే రెండు నెలలకు పైబడి పీడీఎస్ బియ్యం తీసుకోకపోతే రేషన్‌కార్డు రద్దు అవుతుందన్న భయంతో అందరూ తప్పనిసరిగా బియ్యాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకుంటున్న బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు తమ దుకాణాల్లోనే తిరిగి కొంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్, ఖమ్మం నగరాల్లో కిలో బియ్యానికి రూ. 6 నుంచి రూ. 8 వరకు చెల్లిస్తుండగా... గ్రామాలు, ఇతర పట్టణాల్లో కిలోకు రూ. 8 నుంచి రూ.10 వరకు చెల్లిస్తున్నారు. రేషన్ దుకాణాల్లోకి వచ్చే బియ్యంలో 60 శాతం అక్కడే డబ్బులకు రీసేల్ అవుతుండగా, 20 నుంచి 30 శాతం వరకు మాత్రమే పేదలు తీసుకుంటున్నారు. వీరిలో కొందరు దళారులకు విక్రయిస్తున్నారు. మిగతా 10 శాతం వరకు క్లోజింగ్ బ్యాలెన్స్ కింద డీలర్ల వద్ద నిల్వ ఉంటుంది. కాగా కొంటున్న బియ్యాన్ని డీలర్లు రూ.2 లాభం చూసుకొని ట్రాలీల్లో వచ్చే దళారులకు అమ్మేస్తున్నారు. ఇలా డీలర్ల నుంచి, గ్రామాల్లో మహిళల నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సదరు ట్రాలీ దళారులు లారీల్లో వ్యాపారం చేసే వారికి రూపాయి, ఆపైన లాభం చూసుకొని విక్రయిస్తున్నారు. వాటిని కొనుగోలు చేసే పెద్ద వ్యాపారులు పక్క రాష్ట్రాలకు పంపిస్తున్నారు. రెండు మూడు చేతులు మారిన తర్వాత రాష్ట్రాలు దాటే బియ్యం ధర రూ.20 వరకు పలుకుతోంది. తద్వారా కిలో బియ్యానికి కనిష్టంగా రూ.5 చొప్పున లాభం వేసుకొన్నా.. ఇలా టన్నుల్లో విక్రయించే బియ్యానికి కోట్లల్లో లాభం సమకూరుతుందని స్పష్టమవుతోంది. ఈ లాభంతోనే పోలీస్, రెవెన్యూ, విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులను వ్యాపారులు కొనేస్తున్నారని మంచిర్యాలకు చెందిన ఓ దళారి చెప్పాడు. కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు రవాణా ► ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు చెందిన పీడీఎస్ బియ్యం అధికంగా మహారాష్ట్రకు వెళుతోంది. రామగిరి ప్యాసింజర్ రైలు ద్వారా వరంగల్ నుంచి పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల మీదుగా వీరూర్‌కు వెళ్తుంది. లారీల్లో కూడా కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాల నుంచి ఆసిఫాబాద్ గుండా వీరూర్కే చేరుతుంది. కాగజ్‌నగర్ నుంచి, దహేగాం, బెజ్జూరుల నుంచి చింతలమానెపల్లి మీదుగా గడ్చిరోలి జిల్లా అహేరీకి వెళ్లే లారీలు కూడా ఉన్నాయి. భూపాలపల్లి, చెన్నూరు, కాటారం, ములుగు ప్రాంతాల నుంచి సిరోంచకు, ఖమ్మం, కొత్తగూడెం నుంచి ఛత్తీస్‌గఢ్, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కర్ణాటకకు పీడీఎస్ బియ్యంతో కూడిన లారీలు వెళ్తున్నాయి. మిల్లర్లకూ వరం ► పీడీఎస్ బియ్యాన్ని రాష్ట్రంలోని కొందరు మిల్లర్లు రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికి అప్పగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. గ్రామాలు, పట్టణాల నుంచి లారీలు బియ్యం మిల్లులకు వెళుతూపలుచోట్ల పట్టు పడడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. అలాగే ఆయా మిల్లులకు ప్రభుత్వం కేటాయించిన ధాన్యం నిల్వలు అక్కడ లేకపోవడాన్ని బట్టి కూడా.. మిల్లర్లు అసలు బియ్యాన్ని (మిల్లింగ్ చేసిన రైతుల ధాన్యం) అమ్ముకుంటూ, వాటి స్థానంలో పీడీఎస్ బియ్యాన్ని ఇస్తున్నట్టుగా స్పష్టమవుతోందని అంటున్నారు. -
కంప్యూటర్ ఆపరేటర్.. కుంభకోణంలో అన్నీ తానై
సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ కుంభకోణంలో కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ కీలక పాత్రధారిగా వ్యవహరించాడు. నలుగురు మేనేజర్ల హయాంలో అవినీతికి అంతా తానై సూత్రధారిగా నిలిచాడు. అప్పనంగా డబ్బు సంచులు ఇంటికి చేరుతుండడంతో జిల్లా మేనేజర్‌గా విధుల్లో ఉన్న వారు కిమ్మనకుండా భాగస్వామ్యులయ్యారు. మొత్తం విషయం బహిర్గతం కావడంతో తేలు కుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్నారు. తమకేమి తెలియదంటూ ఉన్నతాధికారుల ఎదుట నంగనాచి కబుర్లు చెబుతున్నారు. డీఎం ఓటీపీల ద్వారానే శివకుమార్ నిధులు పక్కదారి పట్టించారు. రూ.40 కోట్లు ప్రజాధనం స్వాహా కేసు దర్యాప్తు చేసేందుకు పోలీసు యంత్రాంగం సీఐడీకి బదలాయించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రభుత్వ లావాదేవీలు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా చెల్లింపులు ఉండాలని ఆర్బీఐ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా నిబంధనలతో నిమిత్తం లేకుండా ఆన్లైన్ బ్యాంకింగ్‌కు ఎస్బీఐ బ్యాంకు అధికారులు అనుమతించారు. బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి తమ ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలు మేనేజర్లు నిర్బయంగా చెప్పడంతో కంప్యూటర్ ఆపరేటర్ ఆన్లైన్ ద్వారా ప్రత్యేక అకౌంట్లకు ప్రభుత్వ నగదు బదలాయించాడు. ఐదేళ్లుగా ప్రజా«ధనాన్ని పక్కదారి పట్టించి కొల్లగొట్టారు. ఈ మొత్తం వ్యవహారంలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులుంటే, మరో 24 మంది ప్రైవేట్ వ్యక్తులు ప్రమేయం ఉండడం విశేషం. నిస్సంకోచంగా దోపిడీ ప్రజాధనం దోపిడీ వ్యవహారం ఎప్పటికైనా బహిర్గతం అవుతుందనే విషయం తెలిసీ కూడా నిస్సంకోచంగా దోపిడీ చేయడంలో డీఎంలు కీలకంగా నిలిచారు. ఈ తరహా అవినీతికి తెర తీసిన కృష్ణారెడ్డి నుంచి కొండయ్య, రోజ్‌మాండ్, పద్మ ఇలా ఒకరి తర్వాత మరొకరు నలుగురు డీఎంలు అవినీతి ఊబిలో కూరుకుపోయారు. ఇంటర్నల్ ఆడిటర్లను మేనేజ్ చేయవచ్చనే ధీమా, రికార్డులు అందుబాటులో లేకుండా చేస్తామనే ధైర్యంతో ఈ దోపిడీకి తెరతీశారు. కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ చెప్పినట్లు నడుచుకోవడంతో అత్యంత సులువుగా స్వాహా సాధ్యమైంది. ఒక వైపు బ్యాంకర్ల సహకారం, మరో వైపు ఇంటర్నల్ ఆడిటర్లు దన్నుగా నిలవడంతో బయటకు దోపిడీకి మార్గం సుగమం అయింది. 12 డ్యాకుమెంట్లు ఫ్రీజ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులు ఫ్రీజ్ చేసినట్లు జాయింట్ కలెక్టర్ రోణింకి కూర్మనాథ్ ప్రకటించారు. వాస్తవంగా 32 మంది ప్రత్యక్ష పాత్రధారులున్నారు. అయితే వీరిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు కాగా, మిగతావారంతా ప్రైవేట్ వ్యక్తులే. ఇందులో చేజర్ల దయాకర్ (9 డాక్యుమెంట్లు), సూర్యపవన్ (3 డాక్యుమెంట్లు) పేరిట ఉన్న 12 డాక్యుమెంట్లు మాత్రమే ఫ్రీజ్ చేశారు. నెల్లూరు, కోవూరు, బుజబుజనెల్లూరు సబ్ రిజిస్ట్రార్ పరిధిలో ఉన్న ఆ ఆస్తుల విలువ మార్కెట్ ప్రకారం రూ.3 కోట్లు మాత్రమే. బహిరంగ మార్కెట్లో రూ.10 కోట్లు విలువైన ఆస్తులుగా పలువురు చెబుతున్నారు. పాత్రధారులుగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను మినహాయిస్తే మిగతా వారి ఆస్తులు కూడా ఫ్రీజ్ చేయాల్సి ఉంది. జల్సాలకు అలవాటు పడి.. కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్ ఏర్పాటు చేసే పార్టీలకు అలవాటు పడడంతోనే ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి ఊబిలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది. మరి కొందరికి వ్యక్తిగత అవసరాలు, బంధువులు శుభకార్యాలకు సైతం డబ్బులు వెచ్చించినట్లు సమాచారం. మరో వైపు బ్యాంకర్లకు కూడా అదే స్థాయిలో ట్రీట్ ఇవ్వడంతో ఎనీటైమ్మనీ (ఏటీఎం) లాగా ఉపయోగపడినట్లు విశ్వసనీయ సమాచారం. వీటితో పాటు ఎవరెవరికి ఎంత మొత్తం, ఎక్కడెక్కడ అందించింది.. ఎవరి అకౌంట్లకు ఎంత మొత్తం బదిలీ చేసిందనే వివరాలు పోలీసులకు విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. సీఐడీకి కేసు బదలాయింపు సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ నిధులు స్వాహా వ్యవహారంలో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ఫిర్యాదు మేరకు అక్టోబర్ 14న క్రైమ్ నంబర్ 527/2022గా ఐసీపీ సెక్షన్లు 120బీ, 409 మేరకు 11 మందిపై కేసు నమోదు చేశారు. తాజా నివేదిక ప్రకారం ఈ వ్యవహారంలో మొత్తం 32 మంది ప్రమేయం ఉందని వెల్లడియ్యింది. వీరిలో కంప్యూటర్ ఆపరేటర్ శివకుమార్, పవన్, రాజాం అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసి, కోర్టుకు హాజరు పరిచారు. నిందితుల్లో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం, దాదాపు రూ.40 కోట్లకుపైగా స్వాహాకు గురైనట్లు గుర్తించడంతో మరింత లోతైన విచారణ చేపట్టి కూలంకషంగా దర్యాప్తు చేసేందుకు సీబీసీఐడీ విభాగాన్ని జిల్లా యంత్రాంగం ఆశ్రయించింది. ఆ మేరకు శుక్రవారం ఎస్పీ విజయారావుతో జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జిల్లాలో నెలకొన్న వ్యవహారాన్ని వివరిస్తూ లేఖ రాస్తూనే, ఎఫ్ఐఆర్తో పాటు, అధికారిక నివేదిక సీబీసీఐడీ ఉన్నతాధికారులకు పంపినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులు లభించిన తర్వాత కేసును బదలాయించనున్నారు. -
‘రూ.40 కోట్ల స్వాహా’ లెక్క తేలింది..!
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో అవినీతి వ్యవహారంలో లెక్క తేలింది. రూ.40 కోట్లను స్వాహా చేశారు. 2017–2022 కాలంలో పనిచేసిన నలుగురు డీఎంలకు ప్రత్యక్షపాత్ర ఉంది. మొత్తం 32 మంది స్వాహా పర్వంలో భాగస్వాములయ్యారు. వారిలో 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు. మిగిలిన వారంతా ఔట్సోర్సింగ్ సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు. ఈ తతంగం మొత్తం బ్యాంకు ఉద్యోగుల సహకారంతోనే సాధ్యమైంది. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారా చెల్లింపు చేయాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టం ఓటీపీ ద్వారా నగదు కాజేశారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో అవినీతి వ్యవహారానికి సంబంధించి మూడువారాలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రజాధనం స్వాహా విషయం ఒక కొల్కికి వచ్చింది. అందుబాటులో ఉన్న రికార్డుల మేరకు 2017–2022 వరకూ రూ.40 కోట్లు దారి మళ్లించారని నిర్ధారణైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు పాత్రధారులు ఒక్కొక్కరుగా వెలుగులోకి వచ్చారు. డీఎం స్థాయి అధికారుల బరితెగింపే అందుకు ప్రధాన కారణంగా నిలిచింది. ప్రభుత్వ చెల్లింపులు నిబంధనలకు విరుద్ధంగా చేపట్టడం విశేషం. జిల్లా మేనేజర్‌గా పనిచేసిన కృష్ణారెడ్డి, కొండయ్య, రోజ్‌మాండ్, పద్మ ప్రమేయం ప్రత్యక్షంగా ఉన్నట్లు స్పష్టమైంది. సరైన సమాచారం ఇవ్వకపోవడంతో.. సెప్టెంబర్‌లో ఇంటర్నల్ ఆడిటర్ అక్రమ చలాన్‌ను గుర్తించారు. దానికి చెందిన రికార్డులు కోరడంతో డీఎం కార్యాలయం సక్రమంగా స్పందించలేదు. ఆడిటర్ అనుమానాల నివృత్తి కోసం ప్రయత్నించారు. ఈక్రమంలో డీఎం కార్యాలయాన్ని విజిట్ కోసం వచ్చిన ఎండీ వీరపాండ్యన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఆయన 2021 సంవత్సరం వరకూ ఆడిట్ చేయాలని ఆదేశించారు. దీంతో మరిన్ని దుర్వినియోగ వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. ఇలా ఒక్కో ఏడాది ఆడిట్ చేసుకుంటూ వెళ్తే రూ.40 కోట్లు స్వాహా జరిగినట్లు గుర్తించారు. అదే కాకుండా మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీ (బీజీ) తీసుకోవాల్సింది ఉంది. అయితే ఆ స్థానంలో రూ.14.91 కోట్లు పోస్టు డేటెడ్ చెక్కులు తీసుకున్నారు. ఆ మొత్తం కూడా స్వాహా చేశారా? ఆ స్థానంలో చెక్కులు మాత్రమే తీసుకున్నారా? అనేది విచారణలో తేలాల్సి ఉంది. ఇదివరకే 11 మందిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కాగా ఈ మొత్తం వ్యవహారంలో 32 మందికి ప్రత్యక్ష సంబంధాలున్నట్లు తేలింది. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు ప్రభుత్వ లావాదేవీలు ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ద్వారానే జరగాలి. పైగా వివిధ లావాదేవీలకు అనుగుణంగా డీఎం బ్యాంకు అకౌంట్లు విడివిడిగా ఉండడం తప్పనిసరి. ఇవేమీ పట్టించుకోకుండా సింగిల్ అకౌంట్ మీద లావాదేవీలు నడిపారు. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీతో నిమిత్తం లేకుండా ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా పక్కదారి పట్టించారు. ఆ సమయంలో పనిచేసిన డీఎం స్థాయి అధికారి, బ్యాంకర్ కుమ్మకై ఓటీపీ ద్వారా నగదును పక్కదారి మళ్లించారు. పెద్దమొత్తంలో చెల్లింపు చేపట్టగా దీనికి బ్యాంకర్లు పక్కాగా సహకరించారు. వారి ప్రమేయం ఎంత ఉందో పోలీసు విచారణలో తేలాల్సి ఉంది. ఇంటర్నల్ ఆడిటర్ల సహకారం డీఎం కార్యాలయంలో ఇంటర్నల్ ఆడిటర్ల సహకారంతో ఐదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా అవినీతి వ్యవహారం నడించింది. డీఎం తన ఖాతాకు వచ్చిన మొత్తం, ఆ ఖాతా నుంచి చేపట్టిన చెల్లింపులకు సంబం«ధించి అందించిన నివేదిక ఆధారంగా ఇంటర్నల్ ఆడిటర్లు సంతకాలు చేసుకుంటూ వెళ్లారు. నిబంధనలు మేరకు చెల్లింపులు చేశారా? ఆ మేరకు ఆక్విడెన్స్లు ఉన్నాయా? అర్హులకే ఆ మొత్తం చేరిందా? ఇవేమీ పరిగణలోకి తీసుకోలేదు. దీనిని బట్టి ఇంటర్నల్ ఆడిటర్ల ప్రమేయం కూడా ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురి అరెస్ట్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి వ్యవహారానికి సంబంధించి పోలీసులు గురువారం రాత్రి సూత్రధారితోపాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసులు గతనెల 14వ తేదీన 11 మందిపై కేసు నమోదు చేశారు. ఎస్పీ సీహెచ్ విజయారావు పర్యవేక్షణలో ఏఎస్పీ, వేదాయపాళెం పోలీసు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పలువురు అధికారులు, సిబ్బంది పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలు వారికోసం గాలించాయి. ప్రధాన సూత్రధారి ఔట్సోర్సింగ్ ఉద్యోగి శివకుమార్‌తోపాటు కేసుతో సంబంధం ఉన్న పవన్, రాజాలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ సమయంలో కీలక సమాచారాన్ని సేకరించారు. ఆ ముగ్గురిని గురువారం అరెస్ట్ చేశారు. సీఐడీ లేదా విజిలెన్స్ విచారణకు సిఫార్సు ‘సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో రూ.40 కోట్లు స్వాహా చేశారు. 2017–2022 వరకూ ఆడిట్ పూర్తి చేసి నివేదిక అందించాం. ఈ మొత్తం వ్యవహారంపై విజిలెన్స్ లేదా సీఐడీ విచారణ చేపట్టాల్సిందిగా కోరాం.’ అని జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. గురువారం ఆయన నెల్లూరులోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ వ్యవహారంలో 32 మందికి ప్రత్యక్ష్య ప్రమేయం ఉందన్నారు. వారిలో నలుగురు డీఎంలతో సహా 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారని, ఇదివరకే 11 మందిపై క్రిమినల్ కేసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి ఆస్తులను ఫ్రీజ్ చేయించామని చెప్పారు. ఎలాంటి క్రయవిక్రయాలు చేపట్టకుండా కట్టడి చేయాలని రిజిస్ట్రేషన్ శాఖకు సిఫార్సు చేశామన్నారు. ఇంత పెద్దఎత్తున గోల్మాల్ వ్యవహారాన్ని గుర్తించుకుండా చూసీచూడనట్లు వ్యవహరించిన, గతంలో ఆడిట్ నిర్వహించిన ఇంటర్నల్ ఆడిటర్లపై చర్యలకు సిఫార్సులు చేశామన్నారు. అందుబాటులో రికార్డుల మేరకు ఇప్పటి వరకూ రూ.40 కోట్ల మేర అవినీతి జరిగిందని బహిర్గతమైందన్నారు. రాష్ట్ర కార్యాలయంలో ఉన్న రికార్డులను పరిశీలించి, ఎంత మొత్తం దేనికి మంజూరైంది, ఎవరికి చెల్లించారు? ఇంకా ఏమైనా నిధులు స్వాహా అయ్యాయా? తదితర విషయాలు బహిర్గతం కావాల్సి ఉందన్నారు. -
రుణ బకాయిలు రూ.33,787 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ (టీఎస్సీఎస్సీఎల్) బ్యాంకులకు చెల్లించాల్సిన రుణ బకాయిలు ఏయేటికాయేడు పెరిగి పోతున్నాయి. ధాన్యం కొనుగోళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారంటీతో బ్యాంకుల నుంచి అప్పులు తెస్తున్న కార్పొరేషన్ పూర్తిస్థాయిలో చెల్లింపులు జరపని కారణంగా అప్పుల భారం పెరిగిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అప్పటికే ఉన్న బకాయిలతో పాటు ప్రతి ఏటా బ్యాంకులకు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతూనే వచ్చింది. ఈ విధంగా 2014 –15 నుంచి 2021–22 వరకు బ్యాంకులకు కార్పొరేషన్ చెల్లించాల్సిన బకాయిలు ఏకంగా రూ.33,787.26 కోట్లకు చేరాయి. రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపులు లేకనే.. రాష్ట్రం ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధరతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, సెంట్రల్ పూల్ కింద కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను ఎఫ్‌సీఐకి అప్పగిస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా కార్పొరేషన్ ఏటా వేల కోట్ల రూపాయల అప్పులు చేసి ధాన్యం కొనుగోలు చేస్తోంది. సీఎంఆర్ తీసుకున్న తరువాత కార్పొరేషన్‌కు ఎఫ్‌సీఐ ఆ మొత్తాన్ని చెల్లిస్తుంది. ఈ విధంగా ఎఫ్‌సీఐ తీసుకున్న సీఎంఆర్‌కు అనుగుణంగా కిలోకు రూ.32 చొప్పున రాష్ట్రానికి క్రమం తప్పకుండా చెల్లిస్తోంది. అయితే సీఎంఆర్ ఆలస్యం అవుతున్న కొద్దీ ఎఫ్‌సీఐ చెల్లింపులు కూడా ఆలస్యంగానే ఉంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వంపై కొంత వడ్డీ భారం పడుతున్నా.. అది కొంతే. కాగా రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి తీసుకున్న బియ్యానికి గాను చెల్లించాల్సిన మొత్తం చెల్లించక పోవడంతో సంస్థపై భారం అధికంగా పడుతోంది. బ్యాంకులకు రుణ బకాయిలు కట్టడం కష్టమవుతోంది. రూ.4,747 కోట్ల నుంచి పెరుగుతూ.. పీడీఎస్ బియ్యం, హాస్టళ్లు, గురుకులాల వంటి రాష్ట్ర అవసరాల కోసం స్టేట్‌పూల్ కింద ప్రభుత్వం పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచే బియ్యాన్ని తీసుకుంటుంది. అలా తీసుకుంటున్న బియ్యానికి కిలో రూ.32 లెక్కన చెల్లించాలి. ఆ సొమ్ము చెల్లించకపోవడంతో బకాయిలు రూ.వేల కోట్లలో పేరుకుపోయాయి. తెలంగాణ ఏర్పాటు అయిన 2014–15, ఉమ్మడి రాష్ట్రం నాటి బకాయిలు కలిపి రూ.4,747 కోట్లు ఉండగా, అవి క్రమంగా పెరుగుతూ వచ్చాయి. 2019–20లో బ్యాంకు రుణ బకాయిలు రూ.15,302.79 కోట్లు ఉండగా, 2021–22 నాటికి రూ. 33,787.26 కోట్లకు పెరిగిపోయాయి. కరోనా కారణంగా రెండేళ్ల పాటు సాగిన ఉచిత బియ్యం పంపిణీ, అదనపు కోటా విడుదల, తదితర కారణాలతో రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ నుంచి పెద్ద ఎత్తున బియ్యం కొనుగోలు చేసి పంపిణీ చేసింది. కానీ డబ్బులు చెల్లించలేదు. వడ్డీలకే వేల కోట్లు పౌర సరఫరాల సంస్థ తీసుకున్న అప్పులకు గాను వడ్డీల కింద ఏటా రూ.వేల కోట్లు చెల్లిస్తోంది. 2021–22 లో పౌరసరఫరాల సంస్థ బ్యాంకుల నుంచి రూ. 29,804 కోట్లు అప్పు తీసుకోగా, ఇందుకు చెల్లించాల్సిన వడ్డీ రూ.1, 568 కోట్లు. కాగా బకాయిలకు సంబంధించిన వడ్డీ కూడా కలుపుకొని చెల్లించిన మొత్తం రూ. 2,100.55 కోట్లు. 2014–15లో రూ.146.80 కోట్లు వడ్డీగా చెల్లించిన పౌరసరఫరాల శాఖ 2015–16 లో రూ.1,012.48 కోట్లు చెల్లించింది. ఇలా పెరుగుతూ వచ్చి 2022–23 నాటికి చెల్లించాల్సిన వడ్డీ రూ. 9,222.50 కోట్లకు చేరింది. కాగా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రూ.360.68 కోట్లు వడ్డీ కింద కార్పొరేషన్ చెల్లించడం గమనార్హం. -
సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడకు చెందిన భాస్కర్‌రెడ్డి.. మూడు దశాబ్దాల పాటు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా పనిచేశారు. రైస్‌మిల్లింగ్ పరిశ్రమపై పూర్తి అవగాహన ఉన్న ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక పదవిని అప్పగించారు. ఈ సందర్భంగా సీఎంకు ద్వారంపూడి భాస్కర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
ఏపీ పౌరసరఫరాల శాఖలో ఖాళీలు.. దరఖాస్తు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ మెంబర్స్ డిస్ట్రిక్ట్ కమిషన్ల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 34 (మెంబర్–17, విమెన్ మెంబర్–17) ► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. పోస్టు గ్రాడ్యుయేషన్/ఉన్నత విద్య చదివిన వారికి ప్రాధాన్యతనిస్తారు. సంబంధిత పనిలో సుదీర్ఘ అనుభవం ఉండాలి. వయసు: 35–65 ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రభుత్వ ఎక్స్–అఫీషియో, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌరసరఫరాల మంత్రిత్వ శాఖ, ఐదో బ్లాక్, మొదటి అంతస్తు, ఏపీ సెక్రటేరియట్, వెలగపూడి, అమరావతి చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 12.04.2021 ► వెబ్సైట్: www.apcivilsupplies.gov.in డీఎంహెచ్ఓ, అనంతపురంలో పీఎంఓఏ ఉద్యోగాలు -
రబీలో రికార్డు
సాక్షి, అమరావతి: ధాన్యం కొనుగోలులో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. రైతులకు మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 2019–20 రబీ సీజన్లో కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 31.14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. గత ఏడాది రబీ సీజన్ కంటే ఈ ఏడాది 3.61 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా అదనంగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసింది. ► దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు మొత్తం 119 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తే, ఇందులో మొదటి రెండు స్థానాలు తెలుగు రాష్ట్రాలు దక్కించుకున్నాయి. ► తెలంగాణ 64 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించి మొదటి స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 31.14 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి రెండో స్థానంలో నిలిచాయి. ► లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో తొలుత ధాన్యం సేకరణ కొంత ఆలస్యమైనా సీఎం జగన్ ఆదేశాల మేరకు ఈ సారి రైతుల కల్లాల వద్దకే వెళ్లి కొనుగోలు చేశారు. దీంతో రైతులకు రవాణా కష్టాలు కూడా తగ్గాయి. ► గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వ చర్యల వల్ల దళారుల మోసాల నుంచి రైతులకు మిముక్తి లభించింది. ► రబీలో 56 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారుల అంచనా. కాగా, 33 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని నిర్ణయం. ► ఇప్పటి వరకు 31.14 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ. ► గ్రేడ్–ఏ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.1,835, సాధారణ రకం ధాన్యానికి రూ.1,815లను మద్దతు ధరగా నిర్ణయించారు. ► ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల ద్వారా రేపటి (జూన్ 20 శనివారం) వరకే కొనుగోలు చేస్తారు. ► మొత్తం 1,434 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ. -
ఆహార భద్రతా కార్డుదారులకు శుభవార్త
సాక్షి, సిటీబ్యూరో : ఆహార భద్రత కార్డుదారులకు శుభవార్త. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వచ్చే(మే) నెలలో ప్రభుత్వ చౌకధరల దుకాణాల ద్వారా ఉచితంగా బియ్యంతోపాటు కంది పప్పు కూడా అందనుంది. తాజాగా పౌరసరఫరాల శాఖ మే నెల రేషన్ సరుకుల కోటా కింద ఉచిత బియ్యం, కందిపప్పుతో పాటు గోధుమలు, చక్కెర కోటాను కేటాయించింది. ప్రతి కార్డుదారుడికి యూనిట్‌కు 12 కిలోల చొప్పున బియ్యం, కిలో కంది పప్పు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.. సబ్సిడీ ధరపై రెండు కిలోల గోధుమలు అందిస్తారు. కోటా కేటాయింపు ఇలా.. గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో కలిపి మొత్తం ఆహార భద్రత కార్డు కలిగిన సుమారు 16 లక్షల 930 కుటుంబాలు ఉన్నాయి. అందులో 55,75,583 లబ్ధిదారుల(యూనిట్)లకు గాను 6,83,06,702 కిలోల బియ్యం కేటాయించారు. అదేవిధంగా 16 లక్షల 930 కిలోల కంది పప్పు, 32 లక్షల 1860 కిలోల గోధుమల కోటా అలాట్ అయింది. అయితే గోధుమలు, చక్కెర కోటాలకు సంబంధించిన రిలీజింగ్ ఆర్డర్ (ఆర్వో)ల కోసం మాత్రమే మీ సేవా ఆన్లైన్ ద్వారా చెల్లింపులు చేయాలని పౌర సరఫరాల శాఖ డీలర్లను ఆదేశించింది. దీంతో ఈసారి ఉచిత బియ్యంతో పాటు కిలో కంది పప్పు కూడా ఉచితంగా పంపిణీ చేసే అవకాశం ఉందని పౌరసరఫరాల అధికారి ఒకరు ‘సాక్షి‘కి తెలిపారు. గోదాముల్లో కోటా సిద్ధం.. మహానగరంలోని పౌరసరఫరాల గోదాముల్లో ఉచిత బియ్యం, కంది పప్పు కోటా సిద్ధంగా ఉంది. కరోనా పై ప్రభుత్వాల హెచ్చరికలతో పేదలంతా పనులకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉంటూ ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వారికి కొంత సాంత్వన చేకూర్చే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గత నెల ప్రతి రేషన్ కార్డులోని యూనిట్‌కు 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేసింది. అదేవిధంగా నిత్యావసర సరుకుల కోసం రూ.1500 బ్యాంకులో జమ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం కంది పప్పుకూడా ఉచితంగా పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికి సాధ్యపడలేదు. ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియను పొడిగించి ఈ నెల 21 వరకు కొనసాగించారు. తాజాగా మే నెల కోటాను కేటాయించి గోదాముల్లో సరుకులను సిద్ధంగా ఉంచింది. -
తేమ, తాలు అంటూ.. తరుగు తీస్తే కఠిన చర్యలు
సాక్షి, హైదరాబాద్: రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ, తాలు పేరుతో ఇష్టానుసారం కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లర్లను పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. కలెక్టర్లు స్వయంగా క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని ఇప్పటికే ఆదేశాలిచ్చామన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ధాన్యాన్ని ఆరబెడితే గ్రామంలో ఉండే రైతు బంధు కోఆర్డినేటర్లు, వ్యవసాయ శాఖ అధికారులు పంట తేమ శాతం నిర్ధారించి టోకెన్లు అందజేస్తారన్నారు. గన్నీ సంచుల సమస్యను అధిగమించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. బిహార్ నుంచి హమాలీలు హమాలీల కొరతతో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి లోడింగ్, అన్ లోడింగ్ కు సమస్యలు ఎదురవుతున్నాయని మారెడ్డి తెలిపారు. ఎక్కువగా బిహార్ నుంచి హమాలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తారని, వారు ఇక్కడికి రావడానికి సంసిద్ధంగా ఉన్నారన్నారు. సీఎం ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ బీహార్ ప్రభుత్వానికి లేఖ రాశారని, వాళ్లు ఇక్కడికి రావడానికి కావాల్సిన చర్యలు చేపడుతున్నామన్నారు.