బడ్జెట్ పరిధిలో అప్పు రూ.51,000 కోట్లు
మరో రూ.8,000 కోట్లు బడ్జెటేతర రుణం
మంగళవారం 7.17 శాతం వడ్డీతో రూ.3000 కోట్లు రుణం
సెక్యూరిటీల వేలం ద్వారా ప్రభుత్వానికి ఆర్‌బీఐ సమీకరణ
సంపద సృష్టి అంటే అప్పులు చేయడమే అనేలా బాబు పాలన
ఇంత అప్పు చేసినా సూపర్ సిక్స్ హామీల అమలే లేదు
వైఎస్ జగన్ సర్కారు అప్పు చేస్తే ఎల్లో మీడియాతో పాటు బాబు గగ్గోలు
ఇప్పుడు బాబు అప్పులపై నోరు మెదపని ఎల్లో మీడియా
సాక్షి, అమరావతి: సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల్లో గొప్పలు పోయిన చంద్రబాబు.. ఈ ఐదు నెలల్లో పైసా సృష్టించలేదు. అభివృద్ధి, సూపర్ సిక్స్ హామీలూ అటకెక్కేశాయి. ఉచిత ఇసుక అంటూ జనాన్ని ఎన్ని పిల్లిమొగ్గలు వేయిస్తున్నారో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. పల్లెల్లో జ్వరం వచ్చినా మందు బిళ్లలు దొరకవు. చంద్రబాబు ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏమిటీ అంటే.. అప్పులు. ఈ అప్పుల గ్రాఫ్ మాత్రం రాకెట్ స్పీడ్‌తో ఆకాశంలోకి దూసుకుపోతోంది. ప్రజలకు సంక్షేమ పథకాలేవీ అమలు చేయని ప్రభుత్వం ఈ వేల కోట్ల అప్పుల సొమ్మంతటినీ దేనికి ఖర్చు చేస్తోందోనన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.59,000 కోట్లు అప్పు చేసింది. బడ్జెట్ పరిధిలో చంద్రబాబు ప్రభుత్వం మంగళవారం 7.17 శాతం వడ్డీతో మరో రూ.3,000 కోట్లు అప్పు చేసింది. దీంతో బడ్జెట్ పరిధిలో చేసిన రుణాలు రూ.51,000 కోట్లకు చేరాయి. ఇప్పటివరకు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారెంటీతో మరో రూ.8,000 కోట్లు బడ్జెటేతర అప్పు చేశారు. తాజాగా తీసుకున్న రూ.3 వేల కోట్ల రుణాన్ని ఆర్‌బీఐ రాష్ట్ర ప్రభుత్వం కోసం సెక్యూరిటీల వేలం ద్వారా సమీకరించింది. 15 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 19 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు, 23 సంవత్సరాల వ్యవధిలో రూ.1,000 కోట్లు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం ఈ రుణం తీసుకుంది.
నాడు గగ్గోలు..
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎప్పుడైనా అప్పు తెస్తే.. ప్రతి మంగళవారం అప్పు చేయనిదే గడవదంటూ ఎల్లో మీడియా కథనాలను అచ్చేశాయి. చంద్రబాబు అండ్ కో కూడా లేని అప్పులు ఉన్నట్లుగా తప్పుడు లెక్కలు చూపించేవారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నారంటూ రాష్ట్ర ప్రజల పరువు ప్రతిష్టలను దిగజార్చడమే లక్ష్యంగా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలు, కేంద్ర అనుమతి మేరకు రుణాలు తెచ్చినా అప్పు చేయడం మహాపరాధంగా బాబు అండ్‌కో చిత్రీకరించారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారంటూ గగ్గోలు పెట్టారు.
ఇప్పుడు చంద్రబాబు మంగళవారాల్లో అప్పులు చేస్తున్నా ఎల్లో మీడియాకు నోరు పెగలడంలేదు. వివిధ కార్పొరేషన్ల పేరు మీద ప్రభుత్వ గ్యారెంటీతో చంద్రబాబు సర్కారు మరో రూ.8,000 కోట్ల బడ్జెటేతర అప్పు చేసినా ఎల్లో మీడియా కిమ్మనడంలేదు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల కార్యకలాపాల కోసం అప్పు చేసేందుకు గ్యారెంటీలు ఇవ్వడాన్ని చంద్రబాబుతోపాటు ఎల్లో మీడియా కూడా తప్పుపట్టాయి. పైగా ఆ అప్పులను దాచేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.2,000 కోట్లు మార్క్‌ఫెడ్ ద్వారా రూ.5,000 కోట్లు ఏపీఐఐసీ ద్వారా రూ.1,000 కోట్లు మొత్తం రూ.8,000 కోట్లు అప్పు తెచ్చింది. దీనిపై ఎల్లో మీడియా ఎందుకు స్పందించదని అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తే తప్పు అని గగ్గోలు పెట్టిన వారికి అదే పని చంద్రబాబు సర్కారు చేస్తే ఒప్పవుతుందా అని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment