సాక్షి, అమరావతి: చిరు ధాన్యాలు పండించే రైతన్నలకు మద్దతు ధర కల్పిస్తూ ఖరీఫ్ నుంచి ఆర్బీకేల ద్వారా రాగులు, జొన్నలు, కందుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధ్యవర్తులు, దళారుల బెడద లేకుండా ధాన్యం మాదిరిగానే నేరుగా కల్లాల్లో పంట ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి పౌర సరఫరాల సంస్థ మద్దతు ధరకు సేకరించనుంది. పంట వేసిన తర్వాత ఆర్బీకేలో నమోదు చేసే ఈ–క్రాప్ వివరాల ఆధారంగా కొనుగోలు చేయనుంది.
క్వింటాల్ కందులకు కనీస మద్దతు ధర రూ.7 వేలు, రాగులకు రూ.3,578, జొన్నలకు రూ.2,970(హైబ్రీడ్), రూ.2,990 (మల్దండి) చొప్పున ప్రకటించింది. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారంలోగా వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.41 లక్షల టన్నుల కందులు, 64,738 టన్నుల రాగులు, 3.63 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తుల దిగుబడులు రావచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు రాగులు, జొన్నలు, కందుల కొనుగోళ్ల వివరాలను పౌర సరఫరాల సంస్థ గురువారం విడుదల చేసింది.
రాష్ట్రంలోనే సేకరణ.. రాయితీపై విత్తనాలు
ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ప్రతి నెలా కార్డుకు మూడు కేజీల బియ్యం బదులు రాగులు/జొన్నలను అందిస్తోంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ మద్దతు ధరకు జొన్నల కొనుగోలు చేపట్టగా రాగులను కర్ణాటక నుంచి సేకరిస్తోంది.
అయితే మన రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు, కందులను స్థానికంగానే కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించి వాటిని తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వర్షాధార, మెట్ట పంటలైన రాగి, జొన్నల సాగును ప్రోత్సహించేందుకు 50 శాతం రాయితీపై రైతులకు విత్తనాలను అందిస్తోంది.
రైతులపై భారం లేకుండా..
పంట ఉత్పత్తులను నేరుగా కల్లాల్లోనే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు రవాణా, హమాలీ ఖర్చుల భారం నుంచి ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తోంది. గోనె సంచులు, లోడింగ్, మిల్లు వద్దకు తరలించేందుకు రవాణా ఖర్చులను కూడా భరిస్తోంది. ఒకవేళ రైతులు వాటిని స్వయంగా సమకూర్చుకుంటే అందుకు అయిన ఖర్చులను తిరిగి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచికి (50 కేజీలు) రూ.3.39, లేబర్ చార్జీ కింద రూ.22 చొప్పున
అందచేస్తోంది.
పోటీతో రైతులకు లాభసాటి ధర
చిరుధాన్యాలు, కందులు పండించే రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. స్థానికంగా పంటలను కొనుగోలు చేసి స్థానికులకే పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బృహత్తర ప్రణాళిక ఇది. తొలుత ఖరీఫ్‌లో ఆర్బీకేల ద్వారా జొన్నలు, రాగులు, కందుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు వీటిని మార్కెట్‌లో వ్యాపారులే కొనుగోలు చేస్తుండగా ప్రభుత్వం ముందుకు రావడంతో పోటీ పెరగనుంది. తద్వారా రైతుకు మద్దతు ధర మించి లాభసాటి రేటు దక్కుతుంది. రైతులు కచ్చితంగా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ
Comments
Please login to add a commentAdd a comment