small grains
-
ఎఫ్ఎంసీజీ.. ఆరోగ్య‘మస్తు’!
తక్కువ కొలెస్ట్రాల్ గల నెయ్యి, వంట నూనెలు.. రోగనిరోధక శక్తిని పెంచే గోధుమ పిండి, బియ్యం.. విటమిన్లతో కూడిన టీ పొడి.. ఐరన్–విటమిన్లు పుష్కలంగా ఉన్న ఉప్పు.. ఇలా ఎఫ్ఎంసీజీ కంపెనీలన్నీ ఇప్పుడు ఆరోగ్య మంత్రం జపిస్తున్నాయి. ఆరోగ్య సమస్యలను నివారించే ప్రీమియం ప్రోడక్టులకు డిమాండ్ పెరుగుతుండటంతో కంపెనీలకు దండిగా అదనపు ఆదాయం సమకూరుతోంది. గజిబిజి నగర జీవితం.. జీవనశైలి ఆరోగ్య సమస్యల ప్రభావంతో ఆరోగ్యంపై మరింతగా శ్రద్ధపెట్టే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ఆర్గానిక్ ప్రోడక్టులు, చిరు ధాన్యాలకు తోడు ఆరోగ్యాన్ని కాపాడే ఉత్పత్తుల పేరుతో ఫంక్షనల్ ఫుడ్స్‌పై ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఫోకస్ చేస్తున్నాయి. తమ ప్రస్తుత ప్రోడక్ట్ జాబితాలో ఈ ప్రీమియం ఉత్పత్తులను చేర్చడం ద్వారా సరికొత్త వ్యూహానికి తెరతీశాయి. ఐటీసీ, అదానీ విల్మర్, టాటా కన్జూమర్, బిగ్‌బాస్కెట్, ఇమామీ ఆగ్రోటెక్ సహా పలు బడా కంపెనీలు ఇందులో ఉన్నాయి. ఇటీవలే ఐటీసీ ‘రైట్ షిఫ్ట్’ అనే కొత్త ఫుడ్ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. 40వ పడిలోకి అడుగుపెట్టిన వారి కోసం ప్రత్యేకంగా మీల్స్, డ్రింక్స్, స్నాక్ ఉత్పత్తులను అందిస్తోంది. దీంతోపాటు తక్కువ కొలె్రస్టాల్ నెయ్యి వంటివి కూడా ఇందులో ఉన్నాయి. సాధారణంగా విక్రయించే ఉత్పత్తుల రేంజ్‌తో పోలిస్తే వీటి రేటు 26 శాతం మేర ఎక్కువ కావడం విశేషం. అయినాసరే, కస్టమర్ల నుంచి డిమాండ్ బాగానే ఉండటం గమనార్హం. ఇక మధుమేహం (డయాబెటిక్) విషయంలో అప్రమత్తంగా ఉండేవారు, ఇమ్యూనిటీ బూస్టర్ కోరుకునే వారిని దృష్టిలో పెట్టుకుని అదానీ విల్మర్ కొత్త వంటనూనెను తీసుకొచి్చంది. సాధారణ సన్‌ఫ్లవర్ నూనె కంటే దీని ధర 22–46 శాతం అధికం! అలాగే డయాబెటిక్ వినియోగదారుల కోసం త్వరలోనే తక్కువ గ్లయిసెమిక్ ఇండెక్స్ బియ్యం, గోధుమ పిండి వంటి ప్రీమియం ప్రోడక్టులను తీసుకొచ్చే సన్నాహాల్లో ఉంది. ఫిట్నెస్.. లైఫ్ స్టయిల్... నగరాల్లో బిజీగా ఉంటూ... లైఫ్ స్టయిల్, ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేసే కన్జూమర్లు ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఆరోగ్యకరమైన అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హేమంత్ మాలిక్ చెబుతున్నారు. ‘ప్రీమియం ఆహారోత్పత్తుల మార్కెట్ భారీగా వృద్ధి చెందుతోంది. దేశంలో ఇటువంటి ప్రత్యేకతను కోరుకునే సంపన్న కన్జూమర్ల సంఖ్య 3 కోట్లకు పైగానే ఉంది. పోషకాహారం, ఆరోగ్య పరిరక్షణ, రుచి, నాణ్యత వంటి ప్రయోజనాలను అందించే విలువ చేకూర్చిన, వినూత్న ఉత్పత్తులకు అధిక రేట్లను చెల్లించేందుకు వారు సిద్ధంగా ఉన్నారు’ అని ఆయన పేర్కొన్నారు. టాటా గ్రూప్ కంపెనీ బిగ్ బాస్కెట్ తక్కువ జీఐ గల బంగాళాదుంపలను 21% ఎక్కువ రేటుతో విక్రయిస్తోంది. ఇక జీఐ తక్కువగా ఉన్న చక్కెర రేటయితే ఏకంగా 120 శాతం అధికం కావడం విశేషం. ఖపాలీ గోధుమ లేదా ఎమ్మర్ గోధుమలో ఫైబర్ మోతాదు కాస్త ఎక్కువగా ఉంటుంది. పలు బ్రాండ్లు ఈ గోధుమ పిండిని కేజీ రూ.150–250 మధ్య విక్రయిస్తున్నాయి. అంటే సాధారణ గోధుమ పిండితో పోలిస్తే 3–5 రెట్లు ఎక్కువ. డిమాండ్ ఫుల్.. సరఫరా డల్కొన్నిసార్లు తగినంత సరఫరా లేకపోవడం వల్ల కూడా రేటు భారీగా పెరిగేందుకు దారితీస్తోందని కంపెనీలు చెబుతున్నాయి. ఉదాహరణకు చాలా తక్కువ మంది రైతులు మాత్రమే తక్కువ జీఐ గల బంగాళాదుంపలను పండిస్తున్నారు. స్టాక్ తక్కువగా ఉండటం వల్ల ప్రీమియం ధరకు అమ్మాల్సి వస్తోందని బిగ్‌బాస్కెట్ చీఫ్ మర్చెండైజింగ్ ఆఫీసర్ శేషు కుమార్ చెప్పారు. మరోపక్క, ఇటువంటి ప్రీమియం ప్రోడక్టుల తయారీ కోసం టెక్నాలజీ వినియోగం వల్ల కూడా ధర పెరుగుతోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక ప్రీమియం బ్రాండ్ల పేరుతో జేబు గుల్ల చేస్తున్న ఉదంతాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఉదాహరణకు, అమూల్ బ్రాండ్ రూ.650కి కేజీ నెయ్యిని విక్రయిస్తుండగా... వేరే బ్రాండ్లు ‘ఏ2 నెయ్యి’ పేరుతో కేజీ రూ.2,500కి పైగా ధరకు విక్రయిస్తుండటం అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అథారిటీ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఇలాంటి ప్రోడక్టులపై ఉక్కుపాదం మోపుతోంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
మిల్లెట్ ఫ్యాక్టరీ.. ఆమెకు ఆర్థిక బలం
‘మిల్లెట్స్‌లో పోషకాలుంటాయి. అందుకే వాటిని పునర్వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తున్నాం’ అంటున్నారు మహిళా రైతులు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి నుంచి పాడేరు వెళ్లే దారిలో మామిడిపాలెంలో మహిళలే నిర్వహిస్తున్న ‘మిల్లెట్ ఫ్యాక్టరీ’ ఇప్పుడు ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తోంది. పాడేరు, అరకు ఏజెన్సీలో పండే చిరుధాన్యాలనుప్రాసెస్ చేసి దేశమంతా మార్కెట్ చేయడమేకాక, చిరుధాన్యాలతో వివిధ రకాల రుచికరమైన వంటకాల కోసం రెస్టారెంట్ కూడా నిర్వహిస్తున్నారు.పంట పండిన వెంటనే కొనడానికి తమను వెదుక్కుంటూ ఎవరూ రారని ముందే గుర్తించారు మామిడిపాలెం మహిళా రైతులు. పంట వేయడానికి ముందే మిల్లెట్స్‌కి మార్కెట్ ఎక్కడ ఉంది అని ఆరా తీశారు. ఆ విషయంలో ఒక ఎన్జీఓ వీరికి సహాయపడింది. మిల్లెట్స్ పండించినంత మాత్రాన ఆదాయం రాదని, వాటిని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చినపుడే డిమాండ్ ఉంటుందని తెలుసుకున్నారు. దానికోసం వారి ఊరి మధ్యనే ‘మన్యం గ్రెయిన్స్ ఫ్యాక్టరీ’ పెట్టి చిరుధాన్యాలతో సేమియా, ఇడ్లీ, దోసె పిండి తయారు చేసి ΄్యాకింగ్ చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా ఆ ఫ్యాక్టరీ సమీపంలో ఒక మిల్లెట్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి, సజ్జల జంతికలు, జొన్నల స్నాక్స్, అరికల అప్పడాల రుచి చూపిస్తున్నారు. ఇపుడు ఇతర రాష్ట్రాల నుండి మార్కెట్ వాళ్లను వెతుక్కుంటూ వస్తుంది! ‘మన్యం గ్రెయిన్స్ ఫ్యాక్టరీ’ వల్ల ఏజెన్సీ రైతుల కష్టానికి తగిన గిట్టుబాటు ధర లభించింది. మామిడిపాలెం చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా చిరుధాన్యాలు పండించుకొని ఇక్కడేప్రాసెస్ చేయించుకొని లాభాలుపొందుతున్నారు. ఈ మిల్లెట్స్ మిల్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా రెండొందలకు పైగా మహిళలకు ఉపాధి దొరికింది. ‘ఒకప్పుడు పశువులను మేపుకునే దానిని. మాకు దగ్గరే ఈ మిల్లెట్ ఫ్యాక్టరీ పెట్టాక ఇక్కడ పని దొరికింది. స్థిరమైన ఆదాయం వస్తోంది. దాంతో పిల్లలను చదివించుకుంటున్నాను’ అన్నారు మామిడిపాలేనికి చెందిన నూకరత్నం. ‘మాకు కొంతపొలం ఉన్నా దాని మీద వచ్చే పంటతో ఏడాదంతా బతకడం కష్టం అయ్యేది. కొన్నిరోజులు కూలి పనులకు వెళ్లేదానిని. అది కూడా అన్నిసార్లూ దొరికేది కాదు. ఈ ఫ్యాక్టరీలో చేరాకే మిల్లెట్స్ గొప్పతనం తెలిసింది. కనీస మద్దతు ధర దొరుకుతోంది’ అని సంతోషంగా చెప్పింది విజయ. వర్షాధార భూముల్లో అరుదైన సంపదను సృష్టించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మార్చారు. సుస్థిర జీవనోపాధిపొంది ఏడాదికి రూ.కోటికి పైగా బిజినెస్ చేస్తున్నారు. అంతకంటే ముఖ్యమైన ఆత్మవిశ్వాసం, నమ్మకం సంపాదించారు. – శ్యాంమోహన్ఫ్యాక్టరీ ప్రత్యేకతలుఈ ఫ్యాక్టరీలో తొమ్మిది రకాల చిరుధాన్యాలుప్రాసెస్ చేస్తారు. బ్రాండెడ్ ΄్యాకింగ్ చేసి దాని మీద ఏ మిల్లెట్లో ఎలాంటి పోషకాలు ఉంటాయో స్పష్టంగా వివరాలిస్తారు ∙చిరు ధాన్యాలపై పోషకాలు ఎక్కువగా ఉండే లేయర్ తొలగించకుండా కేవలం పై పొట్టు మాత్రమే మర పట్టే యంత్రాలు వీరి దగ్గర ఉన్నాయి. అందుకే మార్కెట్లో దొరికే వాటికంటే వీరి మిల్లెట్స్‌లో పోషకాలు ఎక్కువ. అన్నిరకాల మిల్లెట్స్‌ని ఇక్కడప్రాసెస్ చేయడం వల్ల రైతులు కూడా అన్ని రకాలు పండించడం మొదలు పెట్టారు. దీనివల్ల క్రాప్‌డైవర్సిటీ పెరిగింది.ఒక అధ్యయనం తరువాత...పాడేరు, అరకు ఏజెన్సీలో మిల్లెట్స్ ఉత్పత్తి పెరిగింది కానీ మార్కెటింగ్ సదుపాయాలు లేవు.ప్రాసెసింగ్ సదుపాయాలు లేవు. అపుడొక అధ్యయనం చేసింది ‘వాస¯Œ ’ స్వచ్ఛంద సంస్థ. సామలు, సజ్జలను ఇక్కడ చిన్న చిన్న వ్యాపారులు కొని నాసిక్లోనిప్రాసెసింగ్ మిల్స్‌కి పంపుతున్నారు. అక్కడప్రాసెస్ చేసి వాటినే ఇక్కడికి తెచ్చి మన మార్కెట్లోకి అమ్మకానికి పెడుతున్నారు. దీనివల్ల స్థానిక రైతులకు రేటు, తూకం దగ్గర మోసాలు జరుగుతున్నాయి. ఇదంతా గమనించాక సొంతంగాప్రాసెసింగ్ యూనిట్ పెడితే స్థానికంగా రైతులకు మేలు జరుగుతుందని గుర్తించాం. మహిళలతో మిల్లెట్ ఫ్యాక్టరీప్రారంభించాం’ అంటారు మార్కెటింగ్ నిపుణుడు శ్రీనివాస్. ఈయన ముడిధాన్యాలను నాణ్యమైన ధాన్యాలుగా మార్చడంలో మహిళలకు సాంకేతిక సహకారం అందించారు. -
మిల్లెట్ల పిండిపై 5% పన్ను
న్యూఢిల్లీ: త్రుణ ధాన్యాల ఆధారిత పిండిపై 5 శాతం పన్ను విధించాలని జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. లూజుగా విక్రయించే కనీసం 70 శాతం త్రుణధాన్యాల పిండిపై ఎలాంటి పన్ను ఉండదని ఆమె తెలిపారు. అదే ప్యాకేజీ రూపంలో లేబుల్‌తో విక్రయించే పిండిపై మాత్రం 5 శాతం పన్ను ఉంటుందని వివరించారు. జీఎస్టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ)ప్రెసిడెంట్‌కు 70 ఏళ్లు, సభ్యులకైతే 67 ఏళ్ల గరిష్ట వయో పరిమితి విధించాలని కూడా 52వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయించిందన్నారు. గతంలో ఇది వరుసగా 67, 65 ఏళ్లుగా ఉండేదన్నారు. మొలాసెస్‌పై ప్రస్తుతమున్న 28 శాతం జీఎస్టీని, 5 శాతానికి తగ్గించడంతోపాటు మానవ అవసరాల కోసం వినియోగించే డిస్టిల్డ్ ఆల్కహాల్‌కు జీఎస్టీ నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రి చెప్పారు. ఒక కంపెనీ తన అనుబంధ కంపెనీకి కార్పొరేట్ గ్యారెంటీ ఇచ్చినప్పుడు, ఆ విలువను కార్పొరేట్ గ్యారెంటీలో 1 శాతంగా పరిగణిస్తారు. దీనిపై జీఎస్టీ 18 శాతం విధించాలని కూడా కౌన్సిల్ నిర్ణయించిందన్నారు. -
సైనికులకు సిరిధాన్యాల ఆహారం
మైసూరు: దేశ రక్షణ కోసం సరిద్దుల్లో పనిచేస్తున్న సైనికుల ఆరోగ్యాన్ని పెంపొందించేలా సిరిధాన్యాలను వారి ఆహారంలో వినియోగిస్తామని కేంద్ర రక్షణ, పర్యాటక శాఖల సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. శనివారం మైసూరులోని కేంద్ర రక్షణ ఆహార పరిశోధనా ప్రయోగాలయం (డీఎఫ్ఆర్ఎల్)లో ‘మిలిటరీ రేషన్, పౌష్టికాంశాలతో కూడిన సిరిధాన్యాలు’అంశంపై రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. చిరుధాన్యాల నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి కూడా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అత్యంత ఎత్తైన సియాచిన్ లాంటి ప్రాంతాల్లో గస్తీ విధులను నిర్వహిస్తుంటారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సైనికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని అన్నారు. వారు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సిరిధాన్యాలతో కూడిన ఆహారాన్ని అధికంగా ఇస్తామని చెప్పారు. -
G20 Summit: చిరుధాన్యలక్ష్మికళ
కలెక్టర్ పిల్లలు కలెక్టర్, హీరో పిల్లలు హీరో, రాజకీయ నాయకుడు పిల్లలు రాజకీయ నాయకులు కావాలని కోరుకుంటే, ఇక మధ్యతరగతి తల్లిదండ్రులు... తమలా తమ పిల్లలు ఇబ్బందులు పడకూడదని, తిని, తినక ఒక్కోరూపాయి పోగుచేసి, కష్టపడి చదివించి పిల్లలను విదేశాలకు పంపిస్తున్నారు. పంటలు పండించి అందరి ఆకలి తీర్చే రైతన్నలు మాత్రం తమ పిల్లలు తమలా రైతులు కావాలని అస్సలు కోరుకోవడం లేదు. ‘‘పెద్దయ్యాక రైతును అవుతాను’’ అని కూడా ఎవరూ చెప్పరు. ‘‘మేము వ్యవసాయం చేస్తాం, ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాం. ఇప్పుడు ప్రపంచ దేశాధ్యక్షులు సైతం మేము చెప్పబోయేది ఆసక్తిగా వినబోతున్నారు అదీ వ్యవసాయం గొప్పతనం’’ అని చాటిచెబుతున్నారు ఇద్దరు మహిళా రైతులు. అవును గొప్పగొప్ప చదువులు చదివినవారికంటే..తమ పూర్వీకుల నాటి నుంచి ఆచరిస్తోన్న పద్ధతులతో వ్యవసాయం చేస్తూ అందరి దృష్టి తమవైపు తిప్పుకున్న రైతులకు జీ–20 సదస్సుకు ఆహ్వానాలు అందాయి. పెద్దపెద్ద డిగ్రీలు, హోదాలు లేకపోయినప్పటికీ.. కేవలం వ్యవసాయం చేస్తున్నారన్న ఒక్క కారణంతో ... ప్రపంచ దేశాధ్యక్షులు పాల్గొనే ‘జీ–20 సమితి’లో పాల్గొనే అవకాశం ఇద్దరు మహిళా రైతులకు దక్కింది. ఒడిశాకు చెందిన గిరిజన మహిళా రైతులు ౖ‘రెమతి ఘురియా, సుబాసా మోహన్తా’లకు ఈ అరుదైన గౌరవం లభించింది. సంప్రదాయ, గిరిజన చిరుధాన్యాల (మిల్లెట్స్) సాగు పద్ధతులను జీ–20 వేదికపై ఈ ఇద్దరు ప్రపంచ దేశాలకు వివరించనున్నారు. కోరాపుట్ జిల్లాలోని నౌగుడా గ్రామానికి చెందిన రైతే 36 ఏళ్ల రైమతి ఘురియా. భూమియా జాతికి చెందిన రైమతికి ముగ్గురు పిల్లలు. మొదటి నుంచి వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తోంది. ఏళ్లపాటు వరిధాన్యాలు పండించే రైమతి... చిరుధాన్యాల సాగు మెళుకువలు నేర్చుకుని మిల్లెట్స్ సాగు మొదలు పెట్టింది. అధునాతన సాంకేతికతను జోడించి పంటలో అధిక దిగుబడిని సాధిస్తోంది. సాగులోలేని 72 దేశీయ వరి రకాలు, ఆరు చిరుధాన్యాలతో కలిపి మొత్తం 124 రకాల ధాన్యాలను అంతరించిపోకుండా కాపాడుతోంది. మంచి దిగుబడితో సాధిస్తున్న రైతుగానేగాక, తోటి గిరిజన రైతులకు చిరుధాన్యాల సాగులో సాయం చేస్తూ వారికీ జీవనోపాధి కల్పిస్తోంది. సంప్రదాయ పంటలైన వరి, మిల్లెట్ రకాలను పండిస్తూనే తన గిరిజన మహిళలెందరికో ఆదర్శంగా నిలుస్తూ... మిల్లెట్ సాగును ప్రోత్సహిస్తోంది. పంటమార్పిడి, అంతర పంటలు, సేంద్రియ పంటల్లో తెగులు నివారణ మెళకువల గురించి, స్కూలును ఏర్పాటు చేసి ఏకంగా 2500 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది. చిరుధాన్యాల సాగులో రైమతి చేసిన కృషికిగా గుర్తింపుగా అనేక ప్రశంసలు కూడా అందుకుంది. 2012లో జీనోమ్ సేవియర్ కమ్యునిటీ అవార్డు, 2015లో జమ్షెడ్జీ టాటా నేషనల్ వర్చువల్ అకాడమీ ఫెలోషిప్ అవార్డు, టాటా స్టీల్ నుంచి ‘బెస్ట్ ఫార్మర్’ అవార్డులేగాక, ఇతర అవార్డులు అందుకుంది. చిరుధాన్యాల సాగులో అనుసరిస్తోన్న పద్ధతులు, దిగుబడి, తోటి రైతులను ఆదుకునే విధానమే రైమతిని జీ20 సదస్సుకు వెళ్లేలా చేసింది. ఈ సదస్సు లో ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేసే ఎగ్జిబిషన్లో వివిధ రకాల చిరుధాన్యాలు, ఈ ధాన్యాలతో చేసిన విభిన్న వంటకాలు, చిరుధాన్యాలతో వేసిన ముగ్గులను ప్రదర్శించనుంది. చిరుధాన్యాల సాగులో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, అధిక దిగుబడి కోసం అవలంబిస్తోన్న విధానాలు వివరించనుంది. మిల్లెట్ సాగులో అనుసరించాల్సిన అధునాతన సాంకేతికత, దాని ఉపయోగాల గురించి ఎమ్ఎస్ స్వామినాథన్ రిసెర్చ్ సెంటర్ ఇచ్చిన శిక్షణ సంబంధిత అంశాలను ప్రస్తావించనుంది. సుబాసా మొహన్తా మయూర్భంజ్ జిల్లాలోని గోలి గ్రామానికి చెందిన చిరుధాన్యాల రైతే 45 ఏళ్ల సుబాసా మొహన్తా. తన జిల్లాలో ఎవరికీ చిరుధాన్యాల సాగుపై ఆసక్తి ఏమాత్రం లేదు. 2018లో ఒడిశా ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల సాగు చేయమని మిల్లెట్ మిషన్‌ను తీసుకొచ్చింది. కానీ ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి పరిస్థితుల్లో ధైర్యం చేసి ముందుకొచ్చింది సుబాసా. ఏళ్లనాటి గిరిజన సాగుపద్ధతులను ఉపయోగిస్తూ రాగుల సాగును ప్రారంభించింది. అప్పటి నుంచి మిల్లెట్స్‌ను పండిస్తూ అధిక దిగుబడిని సాధిస్తోంది. ఇది చూసిన ఇతర రైతులు సైతం సుబాసాను సాయమడగడంతో వారికి సాగు పద్ధతులు, మెళకువలు నేర్పిస్తూ మిల్లెట్ సాగును విస్తరిస్తోంది. సుబాసాను ఎంతోమంది గిరిజన మహిళలు ఆదర్శంగా తీసుకుని చిరుధాన్యాలు సాగుచేయడం విశేషం. సుబాసా కృషిని గుర్తించిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అవార్డులతో సత్కరించాయి. జీ20 సదస్సుకు హాజరవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. చిరుధాన్యాల సాగు, ఈ ధాన్యాల ప్రాముఖ్యత గురించి అందరికీ చెబుతాను. గిరిజన మహిళగా గిరిజన సాగు పద్ధతులను మరింత విపులంగా అందరికీ పరిచయం చేస్తా్తను. – రైమతి ఘురియా చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో మంచిచేస్తాయి. ఇవి అనేక రకాల వ్యాధులు రాకుండా కాపాడతాయి. ఒకప్పుడు గిరిజనుల ప్రధాన ఆహారం చిరుధాన్యాలు. కానీ ఇప్పుడు పొలాల నుంచి దాదాపు కనుమరుగయ్యాయి. నేను ధాన్యాలు పండించడం మొదలు పెట్టిన తరువాత నన్ను చూసి చాలామంది రైతులు చిరుధాన్యాలు సాగుచేయడం ప్రారంభించారు. ఇతర రైతులకు వచ్చే సందేహాలు నివృత్తిచేస్తూ, సలహాలు ఇస్తూ ప్రోత్సహించాను. వరికంటే చిరుధాన్యాల సాగులో అధిక దిగుబడులు వస్తుండడంతో అంతా ఈ సాగుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. – సుబాసా మోహన్తా -
పీడీఎస్‌లోకి కొర్రలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతోపాటు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రైతులు పండించిన చిరుధాన్యాలు (రాగులు, జొన్నలు) ఉత్పత్తులను మద్దతు ధరకు సేకరించి, తిరిగి వాటిని పీడీఎస్‌లోకి తీసుకొచ్చి లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది. తాజాగా కొర్రలను సైతం కొనుగోలు చేసి పీడీఎస్‌లో పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. ఈ ఖరీఫ్‌లో పౌరసరఫరాల సంస్థ ద్వారా 750 కొనుగోలు కేంద్రాల్లో సుమారు 60వేల టన్నులకు పైగా చిరుధాన్యాల సేకరణకు సమాయత్తం అవుతోంది. ఫలించిన సీఎం జగన్ ప్రయత్నం రాష్ట్రంలోని రైతులను చిరుధాన్యాల సాగువైపు నడిపించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో పండించే చిరుధాన్యాలను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. గత రబీ సీజన్లో పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే కొర్రలకు కూడా మద్దతు ధర ఇవ్వాలంటూ సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం చిరుధాన్యాల్లో రాగులు, జొన్నలు, మొక్కజొన్న, సజ్జలకు మాత్రమే మద్దతు ధర ప్రకటిస్తోంది. కానీ, సీఎం జగన్ విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం తాజాగా ఖరీఫ్ సన్నద్ధతపై జాతీయ స్థాయి పౌరసరఫరాల శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లో రాగులకు ఇచ్చే మద్దతు ధర క్వింటా రూ.3,846కే కొర్రలు కూడా కొనుగోలు చేసుకునేందుకు అనుమతిచ్చింది. ఇక జొన్నలను క్వింటా మద్దతు ధర రూ.3,225గా నిర్ణయించింది. 1.80 లక్షల టన్నుల చిరుధాన్యాలు అవసరం ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీ ప్రారంభించింది. తాజాగా కొర్రలు కూడా అందించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఏపీలో పీడీఎస్ వినియోగానికి ఏడాదికి రూ.1.80 లక్షల టన్నుల చిరుధాన్యాలను సేకరించాల్సి ఉంది. వీటిలో రాగులు అత్యధికంగా ఏడాదికి 89,760 టన్నుల అవసరం కాగా, మిగిలినవి జొన్నలు, కొర్రలు పంపిణీ చేస్తారు. ఏపీలో రాగులు, జొన్నలు, కొర్రలు పంటల విస్తీర్ణం తక్కువగా ఉండటంతో ఖరీఫ్‌లో రైతుల నుంచి సుమారు 60వేల టన్నుల వరకు సేకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మిగిలిన 1.20లక్షల టన్నులను ఎఫ్‌సీఐ నుంచి సేకరించనున్నారు. సెప్టెంబర్ చివరి వారం నుంచి కొర్రలు, అక్టోబర్ చివరి వారం నుంచి రాగులు, జొన్నలు సేకరించనున్నారు. చిరుధాన్యాలకు మద్దతు చిరుధాన్యాల పంపిణీని తొలి దశలో రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రారంభించాం. కార్డుదారుల ఇష్ట్రపకారం ఉచితంగానే బియ్యం బదులు రెండు కిలోల రాగులు, జొన్నలు అందిస్తున్నాం. రాష్ట్రంలో తక్కువ విస్తీర్ణంలోనే ఈ పంటలు సాగవుతున్నాయి. ఫలితంగా తక్కువ ఉత్పత్తులు వస్తున్నాయి. అందుకే వెనుకబడిన జిల్లాలను ప్రాధాన్యంగా ఎంపిక చేసుకున్నాం. ఇక ధాన్యం సేకరణ మాదిరిగానే చిరుధాన్యాలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుంది. వ్యవసాయ క్షేత్రం నుంచి గోడౌన్లకు తరలించే వరకు స్వయంగా ప్రక్రియను చేపడుతోంది. రైతే స్వయంగా తరలిస్తే మద్దతు ధరతోపాటు గోనె సంచులు, హమాలీ, రవాణా ఖర్చులు సైతం చెల్లిస్తోంది. – హెచ్.అరుణ్‌కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
చిరుధాన్యాల ఎగుమతుల్లో ఏడో స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి : చిరుధాన్యాల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా 7వ స్థానంలో ఉంది. మొదటి ఆరు స్థానాల్లో గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ, తమిళనాడు ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చిరుధాన్యాలను ఎగుమతి చేసే మొదటి ఐదు దేశాల్లో భారత్ ఉందని కూడా పేర్కొంది. ఈ నేపథ్యంలో.. దేశం నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1,69,049.22 మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలను ఎక్కువగా ఐదు దేశాలకు ఎగుమతి చేసినట్లు తెలిపింది.ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు 17.8 శాతం, సౌదీ అరబ్‌కు 13.7 శాతం, నేపాల్‌కు 7.4 శాతం, బంగ్లాదేశ్‌కు 4.9 శాతం, జపాన్‌కు 4.4 శాతం ఎగుమతి చేసినట్లు కేంద్రం పేర్కొంది. ఇతర దేశాల్లో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉన్నందున దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంచడంతో పాటు స్థానిక వినియోగం, ఎగుమతులను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలను తీసుకుంటోందని వివరించింది. ఇందులో భాగంగా అగ్రికల్చరల్–ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్టస్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) చిరుధాన్యాల ఎగుమతిని ప్రోత్సహించాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందుకు ఎగుమతుదారులకు సహాయం అందిస్తుందని తెలిపింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం.. ఇక ప్రపంచ మార్కెట్లలో భారతీయ మిల్లెట్లను ప్రోత్సహించడానికి స్టార్టప్‌లు, అకడమిక్–రీసెర్చ్ సంస్థలు, భారతీయ మిషన్లు, ప్రాసెసర్లు, రిటైలర్లు, ఎగుమతిదారులతో భాగస్వామ్యాన్ని పెంచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్లో చిరుధాన్యాలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ఎగుమతి ప్రమోషన్ ఫోరమ్ (ఈపీఎఫ్)ను ఏర్పాటుచేసినట్లు కూడా తెలిపింది. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఏడాది పొడుగునా వీటి ఉత్పత్తితో పాటు వినియోగం పెంచేందుకు వివిధ కార్యక్రమాల నిర్వహణపై దృష్టిసారించాయని పేర్కొంది. ఉత్పత్తి, వినియోగం పెంపు.. అలాగే, స్థానికంగా చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేలా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌తో పాటు అసోం, బిహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడానికి రాష్ట్ర మిల్లెట్ మిషన్లను అమలుచేస్తున్నాయని కేంద్రం తెలిపింది. అంతేకాక.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు భారత రాయబార కార్యాలయాలు చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పలు చర్యలను తీసుకున్నట్లు పేర్కొంది. అలాగే, ప్రభుత్వోద్యోగులు, అధికారుల్లో చిరుధాన్యాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి.. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సమావేశాల్లో మిల్లెట్ స్నాక్స్‌ను, డిపార్ట్మెంటల్ క్యాంటీన్లలో మిల్లెట్ ఆధారిత ఆహార పదార్థాలను చేర్చాలని సూచించినట్లు కేంద్రం పేర్కొంది. -
మిల్లెట్ మెరుపులు..చిరుధాన్యాలు, జొన్నలు దిగుబడిలో ఏపీనే టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి, సిరి ధాన్యాలుగా, రైతులకు లాభసాటి పంటలుగా చేయాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రభుత్వ సహకారంతో చిరుధాన్యాలు సాగు చేస్తున్న రైతులు మరే రాష్ట్రంలో రానంత ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారు. నాబార్డు అధ్యయన నివేదిక వెల్లడించిన వాస్తవమిది. ఆ నివేదిక ప్రకారం.. 2022లో చిరుధాన్యాలు, జొన్నల దిగుబడిలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఒక హెక్టారుకు చిరుధాన్యాలు 2,363 కిలోలు దిగుబడి వచ్చింది. హెక్టారుకు 2,310 కిలోలతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రంలో జొన్నలు హెక్టారుకు 3,166 కిలోల దిగుబడి రాగా, ఆ తరువాతి స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో హెక్టార్‌కు కేవలం 1,941 కిలోలే వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం.. వైఎస్ జగన్ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలోనే చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించింది. ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, రైతులకు లాభసాటి అయిన వీటి సాగును పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. వీటి సాగు విస్తీర్ణాన్ని, ఉత్పత్తిని, వినియోగాన్ని పెంచేందుకు ప్రత్యేకంగా మిల్లెట్ మిషన్‌ను ఏర్పాటు చేసింది. మరే రాష్ట్రంలోనూ లేని విధంగా ఈ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,66,736 హెక్టార్లలో సాగు లక్ష్యంగా నిర్దేశించింది. ఇది గత సంవత్సరానికన్నా 39,365 హెక్టార్లు అదనం. ఈ పంటలను రైతు భరోసా కేంద్రాల ద్వారా పౌరసరఫరాల సంస్థ కనీస మద్దతు ధరకు కొంటోంది. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 160 చిరుధాన్యాల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. వీటికి ప్రోత్సాహకాలు కూడా అందించనుంది. చిరుధాన్యాల మార్కెటింగ్‌కు జిల్లా కేంద్రాలు, నగరాలు, పట్టణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తోంది. మహిళా సంఘాల మహిళా మార్ట్‌లలోనూ చిరుధాన్యాలు, వాటి ఉత్పత్తుల అమ్మకాలను ప్రోత్సహిస్తోంది. ప్రజలు వీటిని వినియోగించేలా మండల, జిల్లా స్థాయిలో పలు కార్యక్రమాల ద్వారా అవగాహన కలి్పస్తోంది. బాలింతలు, గర్భిణులు, పిల్లల్లో పౌష్టికాహార లోపం, రక్తహీనతను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ కింద రాగి పిండిని పంపిణీ చేస్తోంది. చదవండి: బ్యాంకులకు వెనక్కి వస్తున్న రూ.2 వేల నోట్లు.. బడా బాబులవే 60 ఏళ్లుగా తగ్గిపోయిన సాగు, వినియోగం హరిత విప్లవంతో పాటు ఎక్కువ ఆదాయం వచ్చే వరి, గోధుముల సాగుకు రైతులు మళ్లడం, ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోవడంతో 60 ఏళ్లుగా దేశంలో చిరుధాన్యాల సాగు తగ్గిందని తెలిపింది. 1960లో దేశంలో వీటి తలసరి వార్షిక వినియోగం 30.9 కిలోలుండగా 2022కి 3.9 కిలోలకు పడిపోయిందని పేర్కొంది. 1973లో గ్రామీణ ప్రాంతాల్లో సజ్జలు వార్షిక తలసరి వినియోగం 11.4 కేజీలుండగా 2005కి 4.7 కిలోలకు, పట్టణ ప్రాంతాల్లో 4.1 కిలోల నుంచి 1.4 కిలోలకు తగ్గిపోయిందని తెలిపింది. ఇదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో జొన్నలు వార్షిక తలసరి వినియోగం 19.4 కిలోల నుంచి 5.2 కిలోలకు, పట్టణ ప్రాంతాల్లో 8.5 కిలోల నుంచి 2.7 కిలోలకు తగ్గిపోయినట్లు నివేదిక పేర్కొంది. ఇటీవల ఆరోగ్య కారణాలు, పశుగ్రాసం, పరిశ్రమలు, ఇథనాల్, డిస్టిలరీల్లో వాడకానికి చిరుధాన్యాలకు డిమాండ్ పెరుగుతోందని చెప్పింది. గిరిజన రైతులు, మహిళలను ప్రోత్సహించాలి ఇతర పంటలకంటే తక్కువ నీటితో చిరుధాన్యాలు సాగుచేయవచ్చని నాబార్డు తెలిపింది. దేశంలో లభించే నీటిలో 80 శాతం వరి, గోధుమ, చెరకు పంటలకు వినియోగం అవుతోందని, దీనివల్ల మంచి నీటి కొరత ఏర్పడుతోందని పేర్కొంది. అందువల్ల చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, ఇందుకోసం మెరుగైన ఉత్పత్తి, స్థిరమైన వ్యవసాయ, ఆహార వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించింది. తొలుత వర్షాభావ, గిరిజన ప్రాంతాల్లో చిన్న, గిరిజన రైతులు, మహిళా రైతుల ద్వారా వీటి సాగును ప్రోత్సహించాలని సూచించింది. ఆ ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెట్ కల్పించాలని సూచించింది. తద్వారా మంచి పోషకాహారం, ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించడమే కాకుండా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించవచ్చని నివేదిక సూచించింది. చదవండి: ఆ ‘కొండ’లపై ఎందుకు ప్రశ్నించడం లేదు పవన్? ఆరోగ్యాన్నిచ్చే చిరుధాన్యాలు చిరుధాన్యాల వినియోగంపై ప్రజల్లో ఆసక్తి కనిపిస్తోందని ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైనట్లు నివేదిక పేర్కొంది. ఆరోగ్య కారణాల దృష్ట్యా 28 శాతం మంది చిరుధాన్యాలకు మారారని తెలిపింది. బరువు తగ్గేందుకు 15 శాతం మంది వీటిని ఆహారంగా తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఇవీ ఉపయోగాలు ►హృదయనాళాల వ్యాధుల నుంచి విముక్తి ► చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు అనువైన ఆహారం ►చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ►కాల్షియం పుష్కలంగా ఉండటంతో ఎముకల ఆరోగ్యం ►రక్తనాళాలు, కండరాల సంకోచాలకు మంచి మందు ►నరాల పనితీరు పెంచుతాయి ► మెదడు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి ►క్యాన్సర్‌ను నిరోధిస్తాయి -
చిరుధాన్యాలకు ‘మద్దతు’
సాక్షి, అమరావతి: చిరు ధాన్యాలు పండించే రైతన్నలకు మద్దతు ధర కల్పిస్తూ ఖరీఫ్ నుంచి ఆర్బీకేల ద్వారా రాగులు, జొన్నలు, కందుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మధ్యవర్తులు, దళారుల బెడద లేకుండా ధాన్యం మాదిరిగానే నేరుగా కల్లాల్లో పంట ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి పౌర సరఫరాల సంస్థ మద్దతు ధరకు సేకరించనుంది. పంట వేసిన తర్వాత ఆర్బీకేలో నమోదు చేసే ఈ–క్రాప్ వివరాల ఆధారంగా కొనుగోలు చేయనుంది. క్వింటాల్ కందులకు కనీస మద్దతు ధర రూ.7 వేలు, రాగులకు రూ.3,578, జొన్నలకు రూ.2,970(హైబ్రీడ్), రూ.2,990 (మల్దండి) చొప్పున ప్రకటించింది. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారంలోగా వారి ఖాతాల్లో డబ్బులను జమ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 1.41 లక్షల టన్నుల కందులు, 64,738 టన్నుల రాగులు, 3.63 లక్షల టన్నుల జొన్న ఉత్పత్తుల దిగుబడులు రావచ్చని అంచనా వేస్తోంది. ఈమేరకు రాగులు, జొన్నలు, కందుల కొనుగోళ్ల వివరాలను పౌర సరఫరాల సంస్థ గురువారం విడుదల చేసింది. రాష్ట్రంలోనే సేకరణ.. రాయితీపై విత్తనాలు ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించాలన్న సంకల్పంతో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాయలసీమ జిల్లాల్లో రాగులు, జొన్నల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇంటింటికీ రేషన్ పంపిణీ వాహనాల ద్వారా ప్రతి నెలా కార్డుకు మూడు కేజీల బియ్యం బదులు రాగులు/జొన్నలను అందిస్తోంది. ఇప్పటికే రాయలసీమ జిల్లాల్లో పౌరసరఫరాల సంస్థ మద్దతు ధరకు జొన్నల కొనుగోలు చేపట్టగా రాగులను కర్ణాటక నుంచి సేకరిస్తోంది. అయితే మన రాష్ట్రంలో పండే చిరుధాన్యాలు, కందులను స్థానికంగానే కొనుగోలు చేసి రైతులకు సంపూర్ణ మద్దతు ధర అందించి వాటిని తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వర్షాధార, మెట్ట పంటలైన రాగి, జొన్నల సాగును ప్రోత్సహించేందుకు 50 శాతం రాయితీపై రైతులకు విత్తనాలను అందిస్తోంది. రైతులపై భారం లేకుండా.. పంట ఉత్పత్తులను నేరుగా కల్లాల్లోనే కొనుగోలు చేయడం ద్వారా రైతులకు రవాణా, హమాలీ ఖర్చుల భారం నుంచి ప్రభుత్వం ఉపశమనం కలిగిస్తోంది. గోనె సంచులు, లోడింగ్, మిల్లు వద్దకు తరలించేందుకు రవాణా ఖర్చులను కూడా భరిస్తోంది. ఒకవేళ రైతులు వాటిని స్వయంగా సమకూర్చుకుంటే అందుకు అయిన ఖర్చులను తిరిగి చెల్లిస్తోంది. ఒక్కో గోనె సంచికి (50 కేజీలు) రూ.3.39, లేబర్ చార్జీ కింద రూ.22 చొప్పున అందచేస్తోంది. పోటీతో రైతులకు లాభసాటి ధర చిరుధాన్యాలు, కందులు పండించే రైతులకు మద్దతు ధర కల్పిస్తాం. స్థానికంగా పంటలను కొనుగోలు చేసి స్థానికులకే పీడీఎస్ ద్వారా పంపిణీ చేసే బృహత్తర ప్రణాళిక ఇది. తొలుత ఖరీఫ్‌లో ఆర్బీకేల ద్వారా జొన్నలు, రాగులు, కందుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటి వరకు వీటిని మార్కెట్లో వ్యాపారులే కొనుగోలు చేస్తుండగా ప్రభుత్వం ముందుకు రావడంతో పోటీ పెరగనుంది. తద్వారా రైతుకు మద్దతు ధర మించి లాభసాటి రేటు దక్కుతుంది. రైతులు కచ్చితంగా ఈ–క్రాప్‌లో నమోదు చేసుకోవాలి. – హెచ్.అరుణ్ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ -
చిరుధాన్యాల సాగు విస్తరించాలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చిరుధాన్యాల సాగు విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం సోమవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తరించడానికి అనుకూలమైన ప్రాంతాలను ఎంపికచేసి వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం విశ్వవిద్యాలయ పరిశోధన విభాగాలు వ్యవసాయ శాఖ సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్–2 (ఎస్డీజీ–2) 2030 నాటికి ఆహార భద్రతను సాధించడం, ఆకలిని అంతం చేయడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతదేశం మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహిస్తోందని, మిల్లెట్లు శీతోష్ణస్థితికి అనువుగా ఉండటమే కాకుండా పోషకాహారానికి గొప్ప మూలమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) జాతీయ, ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలనే ప్రధాన నినాదంతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు. మిల్లెట్ వినియోగం పోషకాహారం, ఆహారభద్రత, రైతుల సంక్షేమాన్ని పెంచుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిశోధన కార్యక్రమాల్లో పోషకాహార భద్రతను ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు మొత్తం స్థూలవిలువ ఆధారిత వాటాలో 35 శాతం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో మన వర్సిటీ 7వ ర్యాంక్ సాధించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణపై మరింత దృష్టి సారించడం ద్వారా అన్ని టాప్ 5 ర్యాంకుల్లోకి చేరుకుంటుందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, మెడల్ విజేతలు, విశిష్టతలు, అవార్డులు, డిగ్రీ గ్రహీతలు, ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. తొలుత వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్) చైర్మన్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా ముఖ్యఅతిథిగా పాల్గొని వర్సిటీ గౌరవ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయానికి చెందిన డాక్టర్ ఎబ్రహిమాలి అబూబకర్ సిద్ధిక్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ నాగేంద్రకుమార్ సింగ్‌లకు వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారు. రెండు జాతీయ అవార్డుల ఏర్పాటు మొదటిసారిగా విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు పేర్లతో వ్యవసాయ పరిశోధనలో ఎక్సలెన్స్ కోసం రెండు జాతీయ అవార్డులను ఏర్పాటు చేసింది. డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు రెండు మెగా రైస్ బీపీటీ 5204 (సాంబామసూరి), ఎంటీయూ 7029 (స్వర్ణ) రకాలను అభివృద్ధి చేశారు. (చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ) -
జై శ్రీ అన్నా
గతంతో పోల్చితే చిరుధాన్యాల పెద్ద ఉపయోగాల గురించి పల్లె, పట్టణం అనే తేడా లేకుండా విస్తృత అవగాహన పెరిగింది. దీనికి సాక్ష్యంగా నిలిచే వీడియోను ప్రధానమంత్రి నరేంద్రమోదీ షేర్ చేశారు. ‘వైబ్రెంట్ విలేజెస్’ కార్యక్రమంలో భాగంగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఒక గ్రామంలోకి వెళ్లారు. ఆ గ్రామంలోని ఒక మహిళ మంత్రిగారికి చిరుధాన్యాలతో చేసిన సంప్రదాయ వంటల రుచి చూపించడమే కాదు... జొన్నె రొట్టె నుంచి రాగి లడ్డు వరకు చిరుధాన్యాలు చేసే మంచి గురించి మంచిగా మాట్లాడింది. ప్రధాని ప్రశంస అందుకొంది. ‘ప్రతి పల్లెలో ఇలాంటి దృశ్యం కనిపించాలి’... ‘క్షేత్రస్థాయి నుంచి మొదలైన స్పృహ, చైతన్యం వేగంగా విస్తరిస్తుంది’... ‘కనుల విందు చేసే వీడియో’... ఇలాంటి కామెంట్స్ కనిపించాయి. -
వాతావరణ మార్పులపై ప్రజా ఉద్యమం
వాషింగ్టన్: వాతావరణ మార్పుల సమస్యకు అడ్డుకట్ట వేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ అంశంపై ప్రపంచ బ్యాంకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి శనివారం ఆయన వీడియో లింక్ ద్వారా ప్రసంగించారు. ‘‘వాతావరణ మార్పులను అడ్డుకోవడం ప్రభుత్వాల స్థాయిలో జరగాల్సిన పని అని చాలామంది భావిస్తారు. ఇందులో వ్యక్తిగతంగా తామేమీ చేయలేమని అనుకుంటారు. కానీ ఈ విషయంలో మనమంతా ఎంతో చేయగలం. కేవలం సదస్సుల ద్వారా ఏమీ జరగదు. ఈ పోరు చర్చా వేదికల నుంచి ప్రతి ఇంట్లోనూ డిన్నర్ టేబుళ్ల దాకా వెళ్లాలి. అప్పుడే అది ప్రజా ఉద్యమంగా మారుతుంది. ఈ విషయంలో భారత ప్రజలు కొన్నేళ్లుగా ఎంతో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. జల పరిరక్షణ, సహజ సాగు, చిరుధాన్యాల వాడకం, ఆరోగ్యకరమైన జీవన విధానం, లింగ సమానత్వ సాధన, స్వచ్ఛత, సూక్ష్మసేద్యం వంటివాటిని ఓ ఉద్యమంగా చేపట్టి విజయవంతం చేస్తున్నారు. అన్ని దేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించడంలో అంతర్జాతీయ సంస్థలది కీలక పాత్ర’’ అన్నారు. -
ప్రత్యామ్నాయ సాగుకు బ్రాండ్ అంబాసిడర్
పీవీ సతీశ్ 1987లో రిలయన్స్ కప్ మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేసిన దూరదర్శన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. తన మిత్రులతో కలిసి ఒక స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామీణ, నిరక్షరాస్య, దళిత మహిళల చేత కెమెరా పట్టించి క్రికెట్ మ్యాచ్‌లకు ఏమాత్రం తీసిపోని అంతర్జాతీయ పురస్కారాలు పొందే విధంగా తీర్చిదిద్దడం మామూలు విషయం కాదు. చిరు ధాన్యాల గురించి 30 ఏళ్ల ముందు మాట్లాడినప్పుడు అందరూ వెర్రివాడని అనుకున్నా, పట్టుబట్టి వాటిని పండించడమే కాక, ఏకంగా చిరుధాన్యాలతో చేసిన వంటకాలను అందించే హోటల్‌ను ప్రారంభించిన ఆయన ధైర్యాన్ని మెచ్చు కోకుండా ఉండలేము. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రపంచం అంతా జరుపుకొంటున్న ఈ 2023 సంవ త్సరంలోనే సతీశ్ అసువులు బాయడం కాకతాళీయం. వ్యవసాయం, జీవ వైవిధ్యం, సంప్రదాయ పద్ధతులు, విత్తనాలు, మెట్ట వ్యవసాయం – ఇలా ఆయన స్పృశించని అంశమే కనపడదు. 25 ఏళ్ళ ముందు జీవవైవిధ్య జాతరలు మొదలు పెట్టి గ్రామాల్లో వాటి ఆవశ్యకతను అందరికీ తెలి సేలా చేస్తూ, వాటిలో గ్రామస్థుల భాగస్వామ్యం సాధించాడు. ప్రత్యామ్నాయ రేషన్ షాప్ అన్న కలను సాకారం చెయ్యడం కోసం గ్రామాలలో పడావుగా ఉన్న భూములలో జొన్నలను పండించి, గ్రామీణ రైతు కూలీలకు పని కల్పించి, పండిన జొన్నలను సేకరించి, తిరిగి గ్రామాలలోనే పేదవారికి తక్కువ ధరకు అందించడం అనే మహత్తరమైన కార్యక్రమాన్ని దిగ్వి జయంగా నిర్వహించాడు. జహీరాబాద్ ప్రాంతంలో రబీలో కేవలం మంచుకే పండే పంటలను ‘సత్యం’ పంటలుగా ప్రాచుర్యానికి తెచ్చి, వాటి పోషక విలువలను అందరికీ తెలియచేశాడు. అందరూ గడ్డి మొక్కలుగా తీసిపారేసే వాటిని ‘అన్కల్టివేటెడ్ ఫుడ్స్’ (సాగు చేయని ఆహారాలు)గా ప్రాచుర్యంలోకి తెచ్చాడు. ‘ఎకనామిక్స్ ఆఫ్ ఎకొలాజికల్ అగ్రికల్చర్’ అనే ప్రాజెక్టును మొదలుపెట్టి ఎటువంటి రసాయన ఎరువులు, పురుగు మందులు లేని పంటలను పండించే రైతుల అనుభవాలను క్రమబద్ధంగా డాక్యుమెంట్ చెయ్యడం ద్వారా వారికి ఎటువంటి సహాయం అందాలో అక్షరబద్ధం చేశాడు. కమ్యూనిటీ మీడియా ట్రస్టును ఏర్పాటు చేసి గ్రామీణ, దళిత మహిళల చేత వీడియో డాక్యు మెంట్లను తీయించడమేకాక, అంతర్జాతీయ వేదికలలో ఈక్వేటర్ ప్రైజ్ సాధించే స్థాయిలో వారిని నిలబెట్టాడు. దేశంలో మొట్టమొదటి కమ్యూనిటీ రేడియో స్టేషన్‌ను నెల కొల్పడం, కేవలం 10వ తరగతి చదివిన ఇద్దరు అమ్మాయి లతో దాన్ని నడపడం ఆషామాషీ కాదు. విత్తన బ్యాంక్ ద్వారా దాదాపు 75 గ్రామాలలో విత్తనాలను సకాలంలో అందే ఏర్పాటు చేసి మంచి పంటలు పండించుకునేలా చెయ్యడం చిన్న విషయం కాదు. బడి మానేసిన పిల్లల కోసం ‘పచ్చ సాల’ ఏర్పాటు చేసి, దానిలో పదవ తరగతి పూర్తి చేసేలోపు కనీసం ఆరు రకాల లైఫ్ స్కిల్స్‌లో ప్రావీణ్యం సంపాదించేలా వాళ్లకు తర్ఫీదు ఇప్పించి వారి కాళ్ళ మీద వాళ్ళు బతికే ధైర్యం కల్పించడంలో ఆయన పాత్ర కీలకం. పీజీఎస్ (పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టం) వంటి ఒక ప్రత్యామ్నాయ సర్టిఫికేషన్ పద్ధ తిని మన దేశంలో తీసుకువచ్చి అమలు చేయడం, ఆర్గానిక్ ఫార్మింగ్ సొసైటీలో వ్యవస్థాపక పాత్ర అనేవి చిన్న విజ యాలు కాదు. జన్యుమార్పిడి పంటలపై అలుపెరగని పోరాటం చెయ్యడం ఆయన జీవితంలో ఒక ముఖ్య భూమిక పోషించింది. దీనికోసం ప్రత్యేకంగా సౌత్ ఎగైనెస్ట్ జెనెటిక్ ఇంజి నీరింగ్ అనే వేదికను ఏర్పాటు చేసి, చాలా దేశాలలోని స్వచ్ఛంద సంస్థలను ఒకే తాటిమీదకు తెచ్చి, అసత్య ప్రచారం చేస్తున్న కంపెనీల మాయాజాలాన్ని రుజువులతో సహా ఎండ గట్టి కొన్ని రకాలపై నిషేధం విధించే స్థాయి పోరాటం నెరిపాడు. మిల్లెట్స్ నెట్‌వర్క్‌ను మొదలుపెట్టి, దేశంలోని కొన్ని ప్రధాన ప్రాంతాలలో చిరుధాన్యాల మీద చర్చా వేది కలు ఏర్పాటు చేసి వినియోగదారులకు చైతన్యం కలిగించే పనిని నెత్తికెత్తుకుని ప్రపంచం దృష్టిని మిల్లెట్స్ వైపు మరల్చారు.ఇన్ని వైవిధ్యభరితమైన పనులతో నిమిషం తీరిక లేని జీవితం గడిపిన సతీశ్ మన వ్యవసాయ రంగం గురించి కన్న కలలు ఒక్కొక్కటిగా ఇప్పుడిప్పుడే సాకారమవుతున్నాయి. ప్రత్యామ్నాయ వ్యవసాయ పద్ధతులకే ఒక బ్రాండ్‌గా నిలిచారు సతీశ్. ఆయన ప్రస్థానంలో నాకూ భాగం కల్పించిన ఆ ప్రియ మిత్రుడికి అశ్రు నివాళి. సక్ఖరి కిరణ్ వ్యాసకర్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, వికాస స్వచ్ఛంద సంస్థ -
ఆహార సంక్షోభానికి ‘చిరు’ పరిష్కారం
న్యూఢిల్లీ: ప్రపంచ ఆహార సంక్షోభానికి చిరుధాన్యాలు పరిష్కారం కాగలవని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. అంతేగాక తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల వచ్చే రోగాలను కూడా ఇవి దూరం చేస్తాయన్నారు. ‘‘ప్రస్తుతం భారత్‌లో చిరుధాన్యాల వాడకం 5 నుంచి 6 శాతమే ఉంది. దీన్ని ఇతోధికంగా పెంచి, ఆహారంలో చిరుధాన్యాలు తప్పనిసరిగా మారేలా వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలి’’ అని పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ ప్రపంచ చిరుధాన్యాల (శ్రీ అన్న) సదస్సును ఆయన ప్రారంభించారు. అందులో పాల్గొంటున్న దేశ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రపంచం నేడు రెండు రకాల ఆహార సవాళ్లను ఎదుర్కొంటోందని ఈ సందర్భంగా మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘దక్షిణార్ధ గోళంలోని దేశాల్లోనేమో పేదలకు తినడానికి తిండి దొరకని దుస్థితి! ఉత్తరార్ధ గోళంలోనేమో తప్పుడు ఆహారపుటలవాట్ల వల్ల రోగాలు కొనితెచ్చుకుంటున్న పరిస్థితి. ఒకచోట ఆహార సంక్షోభం. మరోచోట అలవాట్ల సమస్య. సాగులో రసాయనాల మితిమీరిన వాడకంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. వీటన్నింటికీ చిరుధాన్యాలు చక్కని పరిష్కారం’’ అని వివరించారు. పలు రాష్ట్రాలు ప్రజా పంపిణీ పథకంలో చిరుధాన్యాలను కూడా చేర్చాయని చెప్పారు. మిగతా రాష్ట్రాలూ దీన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు. పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో కూడా చిరుధాన్యాలకు స్థానం కల్పించాలన్నారు. అలాగే పొలం నుంచి మార్కెట్ దాకా, ఒక దేశం నుంచి మరో దేశం దాకా చిరుధాన్యాలకు పటిష్టమైన సరఫరా వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. చిన్న రైతులకు భాగ్యసిరి చిరుధాన్యాలు గ్రామాలు, పేదలతో ముడిపడి ఉన్నాయని మోదీ అన్నారు. చిన్న, సన్నకారు రైతులకు అవి సిరులు కురిపించగలవని అభిప్రాయపడ్డారు. ‘‘దాదాపు 2.5 కోట్ల మంది రైతులు వీటిని పండిస్తున్నారు. ప్రభుత్వం ఉద్యమ స్ఫూర్తితో చేపట్టిన చిరుధాన్యాల ప్రచారం వారికి ఎంతో మేలు చేయనుంది. వీటిని రసాయనాల అవసరం లేకుండా, తక్కువ నీటితో పండించవచ్చు. తద్వారా వాతావరణ మార్పుల సమస్యకు కొంతవరకు అడ్డుకట్ట వేయవచ్చు. గనుకనే వీటికి శ్రీ అన్న అని నామకరణం చేశాం’’ అని చెప్పారు. చిరుధాన్యాలు దేశమంతటా సమగ్ర ఆహారపుటలవాట్లకు మాధ్యమంగా మారుతున్నాయన్నారు. భారత్ తన వ్యవసాయ పద్ధతులను ప్రపంచ దేశాలతో పంచుకోవడానికి, వారి అనుభవాల నుంచి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు. చిరుధాన్యాలపై 500కు పైగా స్టార్టప్‌లు పుట్టుకొచ్చాయన్నారు. హైదరాబాద్‌లోని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐసీఏఆర్)ను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌గా ప్రకటించారు. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్న నేపథ్యంలో అందుకు గుర్తుగా పోస్టల్ స్టాంపును, 75 రూపాయల నాణాన్ని మోదీ విడుదల చేశారు. -
పాడి, ఉద్యాన రంగాలకు ఊతం
సాక్షి, అమరావతి : ఐక్యరాజ్య సమితి 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో తృణ, చిరుధాన్యాల పంటల సాగును రాష్ట్రంలో బాగా ప్రోత్సహిస్తున్నామని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఉద్యానవన, పశుగణ, మత్స్య రంగాలు రాష్ట్ర వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను నడిపించే వృద్ధి చోదకాలుగా గుర్తించి మద్దతుగా నిలుస్తున్నామని చెప్పారు. తద్వారా ఆయిల్ పామ్, బొప్పాయి, నిమ్మ, కోకో, టమాట, కొబ్బరి, మిరప పంటల ఉత్పాదకతలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. 2023-24 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు మంగళవారం ఆయన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ♦ భారతదేశంలో మామిడి, కమల, పసుపు ఉత్పత్తిలో రాష్టం 2వ స్థానంలో, సూక్ష్మ నీటి పారుదల (డ్రిప్ ఇరిగేషన్) అమలులో 3వ స్థానంలో నిలిచింది. ♦ దేశంలోనే ఏడాదికి గుడ్ల ఉత్పత్తిలో 2,645 కోట్ల గుడ్లతో ప్రథమ స్థానంలో, మాంసం ఉత్పత్తిలో 10.26 లక్షల టన్నులతో రెండవ స్థానంలో, పాల ఉత్పత్తిలో 154.03 లక్షల టన్నులతో 5వ స్థానంలో ఉంది. ♦ పశు ఆరోగ్య రక్షణలో భాగంగా 1962కు ఫోన్ చేయగానే పాడి రైతు వద్దకు వచ్చేలా రూ.252.91 కోట్ల వ్యయంతో 340 వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవా రథాలను ఏర్పాటు చేసింది. ♦ పాల సహకార సంఘాల బలోపేతానికి అమూల్ ప్రాజెక్ట్‌కు ఎన్సీడీసీ ద్వారా పాడి పరిశ్రమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి రుణంగా రూ.1,362 కోట్లు అందించింది. ♦ రూ.1,868.63 కోట్ల వ్యయంతో జగనన్న జీవక్రాంతి పథకం కింద 45-56 సంవత్సరాల మధ్య వయసున్న 2.49 లక్షల మంది మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ♦ జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల్లో రూ.20,020 కోట్లు (35 శాతం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటాగా ఉంది. రాష్ట్రం పచ్చతోరణం రాష్ట్రంలో 26 శాతం ఉన్న హరిత విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలని ప్రభుత్వం పని చేస్తోంది. జగనన్న పచ్చ తోరణం కింద 2022-23లో 3.05 కోట్ల మొక్కలు నాటడం ద్వారా ఐఎస్ఎఫ్ఆర్-2021 (ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్) నివేదిక ప్రకారం అటవీ విస్తీర్ణాన్ని 646.9 చ.కి.మీ మేరకు పెంచడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు 2023-24లో రాష్ట్రంలోని 23 ప్రదేశాలలో నగరవనాలు/దేవాలయ ఎకో పార్కులను అభివృద్ధి చేయనుంది. స్వచ్ఛ భారత్ సంకల్పానికి నిదర్శనం ♦ క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) ప్రాజెక్టులో భాగంగా వ్యర్థాల సేకరణ, నిర్వహణ కోసం 2022-23లో రూ.220.82 కోట్లు ఖర్చు చేసింది. ప్రస్తుతం గ్రామాల్లో 70 శాతం మేర ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతోంది. ఘన వ్యర్థాల నిర్వహణ కోసం రూ.417.76 కోట్లతో ప్రతి మండలంలో ప్లాస్టిక్ వ్యర్థాల నివారణ యూనిట్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. ♦ ప్రభుత్వ చర్యలతో స్వచ్ఛ సర్వేక్షణ్ 2022లో ఏపీ 7వ స్థానంలో నిలిచింది. జాతీయ స్థాయిలో ఒక లక్ష కంటే ఎక్కువ జనాభా కలిగిన నగరాల కేటగిరిలో విశాఖ, విజయవాడ, తిరుపతి మొదటి 10 స్థానాల్లో నిలిచాయి. ♦ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ‘క్లీనెస్ట్ స్టేట్/నేషనల్ క్యాపిటల్’ అవార్డు, 10-40 లక్షల జనాభా కేటగిరిలో విశాఖపట్నం ‘క్లీన్ బిగ్ సిటీ’ అవార్డు, సౌత్ జోన్ (50,000 నుండి ఒక లక్ష జనాభా) కేటగిరీలో పులివెందులకు ‘ఇన్నోవేషన్ - బెస్ట్ ప్రాక్టీసెస్’ కింద అవార్డులు లభించాయి. మిలియన్ ప్లస్ సిటి కేటగిరీలో విశాఖపట్నం ‘టాప్ ఇంపాక్ట్ క్రియేటర్’ సిటీగా నిలిచింది. ఉపాధి నైపుణ్యాల పెంపు ♦ ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే ఉపాధి నైపుణ్యాల పెంపుపై దృష్టి సారిస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలు, ఫ్యాక్టరీలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం ఒక చట్టం చేసింది. నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం 2.13 లక్షల శాశ్వత ఉద్యోగాలు, 45,871 కాంట్రాక్టు, 3.72 లక్షల అవుట్సోర్సింగ్/ఇతర ఉద్యోగాలు కలిపి మొత్తం 6.31 లక్షల ఉద్యోగాలు కల్పించింది. ♦ అవుట్ సోర్సింగ్/ గౌరవ వేతన ఆధారిత ఉద్యోగుల జీతాలు పెంచి, కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమమ్ టైం స్కేల్‌ను అందిస్తోంది. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 దశలలో వైఎస్సార్ బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాల పేరుతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నైపుణ్య విశ్వవిద్యాలయాలు, జిల్లాల్లో నైపుణ్య కేంద్రాలను నెలకొల్పనుంది. నేరుగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ ♦ విద్యుత్ రంగంలో.. విద్యుత్ ఖర్చును తగ్గించి పునరుత్పాదక ఇంధనాన్ని ప్రోత్సహించేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఎస్ఈసీఐతో ఒప్పందం చేసుకుంది. కృష్ణపట్నంలో దామోదరం సంజీవయ్య థర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించి 800 మెగావాట్లు, విజయవాడలోని నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్‌కు సంబంధించి 800 మెగావాట్ల పనులను పూర్తి చేసింది. ♦ రైతులకు స్మార్ట్ మీటర్లు బిగించి పారదర్శకంగా నాణ్యమైన ఉచిత కరెంట్‌ను అందిస్తోంది. డీబీటీ విధానం ద్వారా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. రీ సర్వే అద్భుతం 17,584 గ్రామాల్లో సమగ్ర రీ సర్వేను చేపట్టిన రాష్ట్రాలలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. 2023 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటి వరకు 2000 గ్రామాల్లో 4,38,899 మంది ఆస్తి యజమానులకు ‘శాశ్వత భూ హక్కు పత్రాలు’ పంపిణీ అయ్యాయి. ఈ విషయమై నీతి ఆయోగ్ నుంచి ప్రశంసలు అందుకుంది. రాజకీయ సాధికారతో సామాజిక న్యాయం ♦ మంత్రి మండలిలో మొదటి విడతలో 56 శాతం పదవులను, రెండో విడతలో 70 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కేటాయించాం. ఐదు ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో (80 శాతం) నాలుగు పోస్టులను వెనుకబడిన వర్గాలకే ఇచ్చాం. ♦ 13 జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో తొమ్మిదింటిని (70 శాతం) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కేటాయించాం. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ్ చట్టం చేశాం. ఇందులో భాగంగా 137 వివిధ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులలో (58 శాతం) వీరినే కూర్చోబెట్టాం. ♦ 56 బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ, ఒక ఎస్టీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వెనుబడిన వర్గాలకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు చేపట్టింది. ‘జగజ్జీవన జ్యోతి’ పథకం కింద 15.14 లక్షల ఎస్సీ, 4.5 లక్షల ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నాం. ఇంకా ఎన్నెన్నో.. ♦ వికేంద్రీకరణలో భాగంగా జిల్లాల సంఖ్యను 26కు, రెవెన్యూ డివిజన్లు 76కు, పోలీసు డివిజన్లను 108కి పెంచాం. 1956 తర్వాత తొలిసారి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ♦ ప్రజల ఇబ్బందులను పరిష్కరించడానికి స్పందన కార్యక్రమం అమలు చేస్తున్నాం. దీనికి నీతి ఆయోగ్ ప్రసంశలు లభించాయి. ♦ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రతి ఇంటిని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో సచివాలయ స్థాయిలో పరిష్కరించడానికి రూ.3 వేల కోట్లతో ప్రత్యేక నిధి ఏర్పాటు చేశాం. ♦ 9,260 ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నాం. ♦ నేరాల నియంత్రణలో భాగంగా తీసుకున్న వినూత్న పోలీసింగ్ చర్యలు శాంతియుత వాతావరణానికి దోహదపడ్డాయి. మహిళల భద్రత, రక్షణకు దిశ బిల్లు తెచ్చాం. ♦ రాష్ట్రాన్ని మరింత పటిష్టంగా, శక్తివంతంగా చేయడానికి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి నిరంతరం కృషి చేస్తాం. ♦ రాష్ట్రం ఎగుమతుల్లో 2019-20లో 7వ ర్యాంకులో ఉంది. 2020-21 నాటికి 16.08 బిలియన్ డాలర్లతో నాల్గవ ర్యాంకుకు చేరుకుని మెరుగైన ప్రదర్శన కనబరిచింది. జాతీయ ఎగుమతుల్లో 5.8 శాతం వాటాను అందిస్తోంది. దీనిని 2030 నాటికి 10 శాతానికి పెంచేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ♦ రూ.4,994 కోట్ల అంచనా వ్యయంతో గ్రామీణ రోడ్లు ప్రాజెక్టు చేపట్టాం. గత ఏడాది పీఎంజీఎస్‌వై కింద రూ. 502 కోట్ల వ్యయంతో 992 కిలోమీటర్ల తారు రోడ్లు వేశాం. ఈ ఏడాది 1,236 కిలోమీటర్లు మేర 174 రోడ్లను, 21 వంతెనలను పూర్తి చేయనున్నాం. ♦ రూ.2,173 కోట్ల వ్యయంతో 5,181 కిలోమీటర్ల మేర రోడ్ల పనులు ప్రభుత్వం చేపట్టింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సహాయంతో రూ.3,013 కోట్ల అంచనా వ్యయంతో 1,260 కిలోమీటర్ల రోడ్ల పనులు నడుస్తున్నాయి. ♦ దేశంలో ఎక్కడా లేని విధంగా వందేళ్ల తర్వాత అత్యాధునిక సాంకేతికత సాయంతో గ్రామాల్లో రీసర్వే చేస్తోంది. -
వచ్చేనెల నుంచి చిరుధాన్యాల పంపిణీ
సాక్షి, అమరావతి : బియ్యం కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం చిరుధాన్యాల పంపిణీకి రంగం సిద్ధంచేస్తోంది. తొలిదశలో వచ్చేనెల నుంచి పైలట్ ప్రాజెక్టు కింద రాయలసీమ జిల్లాల్లో అమలుచేయనుంది. లబ్ధిదారులకు ప్రతినెలా ఇచ్చే రేషన్‌లో రెండు కేజీల బియ్యం బదులు రాగులు, జొన్నలు సరఫరా చేస్తుంది. ఇందులో భాగంగా పౌరసరఫరాల సంస్థ తొలిసారిగా చిరుధాన్యాలైన రాగులు, జొన్నలను మద్దతు ధరకు (రాగులు–రూ.3,578.. జొన్నలు రూ.2,970 (హైబ్రిడ్), రూ.2,990 (మల్దండి))కొనుగోలు చేస్తోంది. రైతులను చిరుధాన్యాల సాగువైపు ప్రోత్సహించేందుకు ఉత్పత్తులను కొ నుగోలు చేసిన వెంటనే నగదు చెల్లింపులు చేసే వ్యవస్థను కూడా అందుబాటులోకి తెచ్చింది. కర్ణాటక నుంచి రాగుల సేకరణ రాష్ట్రంలో వచ్చే ఖరీఫ్ నుంచి రాగుల ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ కర్ణాటక ప్రభుత్వం నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) ద్వారా 25 వేల టన్నుల రాగులను సేకరిస్తోంది. మరోవైపు.. రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే జొన్నల కొనుగోలు నిమిత్తం పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలు తెరిచింది. అయితే, మద్దతు ధర కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉండటంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా జొన్నల పంపిణీకి వీలుగా, రైతులకు మరింత మేలు చేసేలా మద్దతు ధరను పెంచాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. లబ్దిదారుల ఆసక్తి మేరకు.. ఇక రాయలసీమ జిల్లాల్లోని బియ్యం కార్డుదారుల ఆసక్తి మేరకు ప్రతినెలా ఒక కేజీ నుంచి రెండు కేజీల వరకు రాగులను అందించనున్నారు. ఇప్పటికే జొన్నలు ప్రైవేటు మార్కెట్‌కు తరలిపోవడంతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సేకరణ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పటివరకు 500 టన్నులే సేకరించింది. దీంతో భవిష్యత్తులో రైతులకు మరింత మేలు చేసేందుకు వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ సంయుక్తంగా చిరుధాన్యాల సాగు ప్రోత్సాహాకానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నాయి. రాష్ట్రంలో డిమాండ్, సప్లైకు అనుగుణంగా సాగు విస్తీర్ణాన్ని పెంచేలా రైతులకు అవగాహన కల్పించనుంది. పేదలకు బలవర్థకమైన ఆహారం రాష్ట్రంలో ప్రజలకు బలవర్థకమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. సీఎం జగన్ సంకల్పానికి అనుగుణంగా వచ్చేనెల నుంచి పేదలకు చిరుధాన్యాలు పంపిణీ చేయనున్నాం. రాష్ట్రంలో రాగుల నిల్వలు అందుబాటులో లేకపోవడంతో కర్ణాటక నుంచి సేకరించి ఇక్కడ పంపిణీ చేస్తాం. ఇప్పటికే జొన్నల సేకరణ చేపట్టాం. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ మంత్రి విస్తీర్ణం పెంచేలా చర్యలు రాష్ట్రంలో రేషన్ కింద రాగులు, జొన్నలు పంపిణీ చేయనున్నాం. బియ్యం కార్డుదారుల అవసరానికి అనుగుణంగా పంట ఉత్పత్తులు పెంచేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. చిరుధాన్యాలకు మార్కెట్లో మంచి రేటు ఉంది. జొన్నలకు పౌల్ట్రీ రంగంలో డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల సంస్థ సేకరణ నెమ్మదిగా ఉంది. అందుకే మద్దతు ధర పెంచాలని కేంద్రానికి లేఖ రాశాం. – హెచ్.అరుణ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ -
మిల్లెట్స్‌తో మెరిసిన చిత్రాలు
విశాఖ (ఏయూ క్యాంపస్): గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురి పారిశ్రామిక దిగ్గజాల ఛాయాచిత్రాలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలవనున్నాయి. ఇవన్నీ చిరుధాన్యాలతో తీర్చిదిద్దినవి కావడమే ఇక్కడ విశేషం. 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాలపై ప్రజల్లో ఆసక్తి, అవగాహన పెంచేందుకు విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్‌కుమార్ విభిన్నంగా ఛాయాచిత్రాలను రూపొందించారు. భారతీయ రైల్వేలో టెక్నీషియన్–1గా విధులు నిర్వర్తిస్తున్న ఆయన చిరుధాన్యాలతో దేశం గర్వించే నాయకులు, దిగ్గజ పారిశ్రామికవేత్తల చిత్రాలను తయారు చేశారు. జీఐఎస్, జీ–20 సదస్సులలో ప్రదర్శించడంతో పాటు ప్రముఖులకు, పారిశ్రామిక దిగ్గజాలకు వాటిని బహూకరించే విధంగా నెలల పాటు శ్రమించారు. జొన్నలు, గంట్లు, అరికలు, రాగులు, నల్ల నువ్వులు వంటి వాటితో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు బిర్లా, అంబానీ, అదానీ, ఆనంద్ మహీంద్రా తదితరుల చిత్రాలను రూపొందించారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ గొలగాని హరి వెంకటకుమారిలకు గురువారం ఈ చిత్రాలను విజయ్‌కుమార్ చూపించారు. జీఐఎస్‌కు విచ్చేసే అతిథులు, ప్రముఖులకు వీటిని బహూకరించాలని కోరారు. వీటిని పరిశీలించిన మంత్రి అమర్నాథ్ చిత్రకారుడు విజయ్‌కుమార్‌ను అభినందించారు. వీటిని శుక్రవారం జరిగే సమ్మిట్‌లో హాజరయ్యే పారిశ్రామికవేత్తలకు బహూకరిస్తామని చెప్పారు. -
రావాల్సిన ‘చిరు’ విప్లవం
ఐక్యరాజ్యసమితి 2023ను చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. కిలో బియ్యం పండించేందుకు 3–5 వేల లీటర్ల నీళ్లు అవసరం కాగా, చిరుధాన్యాలకు 200 లీటర్లు చాలు. వాటి పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. ఆంధ్రప్రదేశ్‌లో ‘టీటీడీ’ ఆధ్వర్యంలో 11 ధార్మిక ప్రాంతాలకు వీటిని అందించేట్టుగా చేసుకున్న ఒప్పందం లాంటిది పంజాబ్ లాంటి రాష్ట్రాలు అనుసరించవచ్చు. చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలు. దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజనంలో వారంలో ఒక పూటైనా చిరుధాన్యాలు అందిస్తే వీటి డిమాండ్ పెరిగి, రైతులను ఆ దిశగా మళ్లేట్టు చేస్తుంది. ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. దీంతో ఈ అద్భుత సిరిధాన్యాలపై మరోసారి అందరి దృష్టి కేంద్రీకృతం కానుంది. 2023 ఏడాది ముగిసేలోపు ఈ చిరుధాన్యాలను తృణప్రాయంగా పక్కనబెట్టే మానసిక స్థితి నుంచి అందరూ బయటపడతారని నేనైతే నమ్మకంగా ఉన్నాను. ప్రతిగా... ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న అదృశ్య ఆకలి ప్రమాదాన్ని భారత్ కూడా సమర్థంగా ఎదుర్కునే అవకాశం లభిస్తుంది. ఒకప్పుడు వీటిని తృణధాన్యాలని పిలిచేవారు. ఇవి ముతకగా ఉండవచ్చునేమో కానీ, ఆరోగ్యానికి హాని చేసేవి కాదు. నిజానికి పోష కాలతో నిండి ఉంటాయి. వాతావరణాన్ని తట్టుకోగల తెలివైన పంటలు కూడా. మెట్ట, వర్షాధారిత ప్రాంతాల్లో ఎంచక్కా పండించు కోవచ్చు. చిరుధాన్యాల జాబితాలోకి సజ్జలు, జొన్న, రాగులతోపాటు ఇతర చిన్న సైజు గింజలుండే ఆరు ధాన్యాలు(కొర్ర, అండుకొర్ర, అరికె, ఊద, సామ, వరిగ) వస్తాయి. చాలాకాలంగా వీటిని ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యం చేశారు. యూరోపియన్ లేదా అమెరికన్ ఆహార శైలుల్లోకి ఇవి ఇమడకపోవడం ఒక కారణం. సంప్రదాయ సాగు నుంచి మళ్లించాలి... అయితే మిల్లెట్స్ నెట్వర్క్ ఆఫ్ ఇండియా తదితర పౌర సమాజ వర్గాలు చిరుధాన్యాల ప్రయోజనాలపై చేసిన విస్తృత స్థాయి ప్రచారం పుణ్యమా అని ఇప్పుడు వీటికి మరోసారి ప్రాధాన్యం ఏర్పడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థలోకి వీటిని చేర్చడం కారణంగా ఇప్పుడు వైవిధ్యభరిత ఆహార, పంటల వ్యవస్థలకు మార్గం సుగమమైంది. చిరుధాన్యాల లాభాల గురించి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఈ ఏడాదిలో వీటి గురించి మరింత వింటాం కూడా. ప్రజల్లో అవగాహన మరింత పెంచడం, దిగుబడుల పెంపు, ఆహార శుద్ధికి అవకాశాలు కల్పించడం, సేకరణ మెరుగుపరచడం వంటి అంశాలపై ఈ ఏడాది చర్చోపచర్చలు జరగనున్నాయి. అయితే చిరుధాన్యాల సాగును మరింతగా పెంచాలంటే, నీటి అవసరాలు ఎక్కువగా ఉండే వరి సాగు నుంచి రైతులను మళ్లించాల్సి ఉంటుంది. ఇందుకోసం చిరుధాన్యాల సాగు రైతులకు లాభదాయకంగా ఉండాలి. అయితే ఇది చెప్పినంత సులువైన పనేమీ కాదు. సంప్రదాయ పంటల సాగు నుంచి రైతును ఇంకో దిశకు మళ్లించడం కోసం గతంలోనూ కొన్ని విఫలయత్నాలు జరిగిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. ఒక కిలో బియ్యం పండించేందుకు ప్రాంతం, వాతావరణాలను బట్టి మూడు నుంచి ఐదు వేల లీటర్ల నీరు అవసరమవుతుంది. కానీ చిరుధాన్యాల విషయంలో నీటి అవసరం కేవలం 200 లీటర్లు మాత్రమే. పైగా వీటి సాగులో రసాయన ఎరువులు, క్రిమి, కీటక నాశినుల వాడకమూ పెద్దగా ఉండదు. పోషకాలూ మెండుగా ఉంటాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ‘కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైజెస్’ (సీఏసీపీ) చిరుధాన్యాల ధరల నిర్ణయానికి కొత్త ఫార్ములాను రూపొందించాలి. పర్యావరణానికి చిరు ధాన్యాలు అందించే తోడ్పాటును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడికి అందే ధరలో రైతుకు దక్కేది కొంతే కాబట్టి ధరలు నిర్ణయించే తీరు మారడం ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. పండించే పంటకు కచ్చితంగా కొంచెం పెద్ద మొత్తంలోనే ధర లభిస్తుందని తెలిస్తే రైతుకూ, సమాజానికీ లాభం. స్ఫూర్తిదాయకమైన ఏపీ మోడల్ చిరుధాన్యాలకు మద్దతుధరలు కొత్తగా నిర్ణయించడంతోపాటు వరి పంటకు పేరెన్నికగన్న పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో చిరుధాన్యాల సాగును పెంచాలి. 1950లో అవిభాజ్య పంజాబ్‌లో సుమారు 11 లక్షల హెక్టార్లలో సజ్జలు సాగవుతూండేవి. ఇప్పుడు ఇది వెయ్యి హెక్టార్ల కనిష్ఠానికి పడిపోయింది. గోధుమ, వరి పంటలను మార్చి మార్చి వేయడమన్న విధానానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల పరిస్థితి ఇంతకు దిగజారింది. పప్పులు, నూనెగింజలతోపాటు చిరుధాన్యాల సాగు మళ్లీ చేపట్టడం మేలైన ముందడుగు అవుతుంది. ఇలా పంటల వైవిధ్యానికి చిరుధాన్యాలు చేర్చడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. పర్యావరణ విధ్వంసానికి కారణమైన హరిత విప్లవ దుష్ప రిణామాలను చక్కదిద్దగలగడం ఒకటైతే... చిరుధాన్యాలకు డిమాండ్ పెంచడం రెండోది. చిరుధాన్యాల సాగు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను పంజాబ్ పరిగణనలోకి తీసుకోవడం మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని 11 ధార్మిక ప్రాంతాల్లో సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ (సీఎస్ఏ), రైతు సాధికార సంస్థ, ఏపీ మార్క్‌ఫెడ్ కలిసికట్టుగా ఒక ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా 12 రకాల పంటలను 15,000 టన్నుల మేరా సహజసేద్య విధానంలో అందించాలి. ఇందులో భాగంగా కనీస మద్దతు ధర కంటే పది శాతం ఎక్కువ ధర రైతుకు లభించనుంది. ఒకవేళ మార్కెట్లో ఆయా పంటకు ఎక్కువ ధర ఉంటే... అదనంగా ఇంకో పదిహేను శాతం చెల్లిస్తారు. కర్ణాటకలోనూ గతంలో రాగుల సాగును ప్రోత్సహించేందుకు కనీస మద్దతు ధర కంటే 40 శాతం ఎక్కువ చెల్లించారు. పంజాబ్‌లోని వేల గురుద్వారాలను దృష్టిలో ఉంచుకుంటే చిరుధాన్యాలకు, అదికూడా సేంద్రీయ ఉత్పత్తలకు మంచి డిమాండే ఉంటుంది. శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ వంటి సంస్థల సాయంతో సేంద్రీయ లంగర్ ఏర్పాటుకు ప్రయత్నించవచ్చు. ఇందులో వడ్డించే ఆహార పదార్థాల్లో చిరుధాన్యాలను చేర్చవచ్చు. ఆ మాటకొస్తే చిరుధాన్యాల హల్వా, పాయసాలు ప్రసాదంగా మంచి ప్రత్యామ్నాయాలవుతాయి. చిరుధాన్యాల సక్రమ నిల్వ, సరఫరాల బాధ్యతను మార్క్‌ఫెడ్ వంటి సంస్థలకు పంజాబ్ అప్పగించవచ్చు. ఖేతీ విరాసత్ మిషన్ వంటి లాభాపేక్ష లేని సంస్థలకు సేంద్రీయ వ్యవసాయ సముదాయాల ఏర్పాటు పనులు అప్పగించవచ్చు. నాణ్యతను నిర్ధారించేందుకు అవసరమైన చర్యలూ సులువుగా చేపట్టవచ్చు. పాఠశాలల డిమాండ్ కూడా చేరితే... పంజాబ్‌లో సుమారు 30 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠ శాలల్లో చదువుతున్నారు. వీరికందించే మధ్యాహ్న భోజన పథకంలో ప్రారంభంలో వారానికి ఒకసారి చిరుధాన్యాలను కూడా చేరిస్తే విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. తద్వారా స్థానికంగానే వీటి సరఫరాకు అవకాశం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో టీటీడీ నిర్ణయించినట్లే చిరుధాన్యాలను పంజాబ్‌లోనూ స్థానిక రైతుల నుంచి మాత్రమే సేకరిస్తామని చెప్పవచ్చు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో సుమారు 110 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీరికి వారంలో ఒకసారి చిరుధాన్యాలను వడ్డిస్తున్నారు. అయితే ఈ డిమాండ్‌ను తట్టుకోవడం కష్టమవుతోంది. పంజాబ్ మొత్తమ్మీద చిరు ధాన్యాలను వడ్డిస్తే పరిస్థితి ఎలా ఉండనుందో ఇట్టే అర్థం చేసు కోవచ్చు. పాఠశాలలు, గురద్వారాలతో ఏర్పడే డిమాండ్‌ను తట్టు కునేందుకు పంజాబ్ ప్రభుత్వం, రైతులు ఏదో ఒక మాయ కచ్చితంగా చేయగలరు. జాతీయ స్థాయిలో చూస్తే సుమారు 12.7 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో 12 కోట్ల మంది చదువుకుంటున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా వీరందరికీ చిరుధాన్యాలు ఏదో ఒక స్థాయిలో అందించడం రైతులను చిరుధాన్యాల సాగుకు మళ్లించేందుకు మేలిమి మార్గం కాగలదు. పాఠశాలలు, ఆసుపత్రులు, ప్రార్థనాలయాల సాయంతో చిరుధాన్యాల సాగు, వినియోగాన్ని పెంచడం సుసాధ్య మవుతుంది. పంజాబ్ ఈ దిశగా అడుగులేసి దేశంలో చిరుధాన్యాల విప్లవాన్ని సృష్టించాలని ఆశిద్దాం! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ రంగ నిపుణులు ఈ–మెయిల్: hunger55@gmail.com -
చిరుధాన్యాలపై అవగాహన
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందున ఏడాది పొడవునా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వ్యవసాయశాఖ స్పెషల్ కమిషనర్ చేవూరు హరికిరణ్ చెప్పారు. అందుకు తగినట్టుగా 100 హెక్టార్లకు ఒకటి చొప్పున పంటల వారీగా క్లస్టర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆయన మంగళవారం జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణనిస్తూ, భవిష్యత్‌లో మంచి ధర లభించేలా కృషిచేయాలన్నారు. వైఎస్సార్ యంత్ర సేవాకేంద్రాల ఏర్పాటు కోసం జిల్లాల్లోని జిల్లా పర్చేజింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ (డీపీఎంసీ) ద్వారా యంత్ర పరికరాల సూచిక ధరలను ఖరారు చేయాలని చెప్పారు. పీఎం కిసాన్ 13వ విడత ఆర్థికసాయాన్ని సాధ్యమైనంత ఎక్కువమందికి అందించేందుకు వీలుగా రైతుల ఈ–కేవైసీని ఈ నెల 15వ తేదీలోగా పూర్తిచేయాలన్నారు. రబీలో సాగుచేసి కోతకు వచ్చే శనగలు, మినుములు, పెసలు, ఇతర పంటల ఈ–క్రాప్ నమోదు, ఈ–కేవైసీ త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఉన్న ప్రకాశం, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఈ నెల 30వ తేదీలోగా, మిగిలిన జిల్లాల్లో 15వ తేదీలోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. -
‘చిరు’ ప్రయత్నం చేయాల్సిందే!
కొన్ని సందర్భాలు ఆగి ఆలోచించుకోవడానికి ఉపకరిస్తాయి. గతాన్ని సింహావలోకనం చేసుకొమ్మం టాయి. భవిష్యత్ కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. ఐరాస ప్రకటించిన ‘అంతర్జాతీయ చిరుధాన్య సంవ త్సరం’ సరిగ్గా అలాంటి సందర్భమే. మన దేశం చొరవతో ఈ ప్రకటన రావడం సంతోషించదగ్గ విషయం. అదే సమయంలో చిరుధాన్యాల ఉత్పత్తి, వినియోగంలో ప్రపంచమే కాదు... ముందుగా మనమెక్కడ ఉన్నామో పర్యాలోచించుకోవాలి. ఆరోగ్య ‘సిరి’గా పేరు తెచ్చుకున్న విలువైన పోషకాహారానికి మనం నిజంగానే ఆచరణలో విలువ ఇస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. గత నాలుగైదు దశాబ్దాల్లో మన దేశంలో ఈ చిరుధాన్యాల ఉత్పత్తి 2.3 – 2.4 కోట్ల టన్నుల నుంచి 1.9– 2 కోట్ల టన్నులకు పడిపోయిందట. ఈ లెక్కలు కొత్త సంవత్సర కర్తవ్యానికి ఓ మేలుకొలుపు. జనవరి 1 నుంచి చిరుధాన్య వత్సరంగా ఉత్సవం జరుపుకొనేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలయ్యాయి. నిజానికి, 2018లోనే భారత సర్కార్ ఆ ఏడాదిని జాతీయ చిరుధాన్య వత్సరంగా తీర్మానించింది. చిరుధాన్యాలను ‘పోషక సంపన్న ఆహారధాన్యాలు’గా అధికారికంగా గుర్తించి, ‘పోషణ్ మిషన్ అభియాన్’లో చేర్చింది. ఆపైన 2023ను అంతర్జాతీయ చిరుధాన్య వత్సరమని ప్రకటించాల్సిందిగా ఐరాసకు ప్రతిపాదన పెట్టింది. మరో 72 దేశాలు మద్దతునిచ్చాయి. అలా ఈ పోషక ధాన్యాలను ప్రోత్సహించాలన్న మన చొరవ అంతర్జాతీయ వేదికపై గుర్తింపు తెచ్చుకుంది. చివరకు 2021 మార్చి 5న ఐరాస సర్వప్రతినిధి సభ చిరుధాన్య వత్సర ప్రకటన చేసింది. ప్రపంచ పటంపై చిరుధాన్యాలను మళ్ళీ తీసుకురావడానికి ఇది భారత్‌కు మంచి అవకాశం. ఈ పోషకధాన్యాల ఉత్పత్తి, మార్కెటింగ్, ఆ ధాన్యాల ఉత్పత్తులకు సమర్థమైన మార్కెటింగ్ వసతులు కల్పించడానికి నడుం కట్టాల్సిన తరుణం. ఈ ‘సిరి’ సాగును ప్రోత్సహించేందుకు వ్యవసాయ శాఖ, భారత జాతీయ వ్యవసాయ సహాయక మార్కెటింగ్ సమాఖ్యలు అక్టోబర్ మొదట్లో అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేశాయి. ప్రధాని మోదీ సైతం ఆ మధ్య తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లోనూ ఈ పోషకధాన్యాల ఉత్పత్తితో రైతులకూ, వినియోగంతో ప్రజలకూ కలిగే లాభాలను ప్రస్తావించారు. ఇవన్నీ వినడానికి బాగున్నాయి. కానీ, ఆచరణలో ఇంకా వెనకబడే ఉన్నాం. దేశంలో దాదాపు 80 శాతం మెట్టభూములైనా, 20 శాతం మాగాణితో వచ్చే వరి, గోదుమల పైనే ఇప్పటికీ అర్థరహితమైన మోజు! అదనులో రెండు వర్షాలు కురిస్తే చాలు... ఆట్టే నీటి వసతి అవసరం లేకుండానే మంచి దిగుబడినిచ్చే చిరుధాన్యాలు నిజానికి మన శీతోష్ణాలకు తగినవి. వీటి లోనే పోషకాలు ఎక్కువ. అయినా చిరుధాన్యాల్లో పెద్ద గింజలైన జొన్న, సజ్జ, రాగులన్నా, చిన్న గింజలుండే కొర్రలు, సామలు, ఊదలు, అరికెలు, వరిగెల లాంటివన్నా అటు రైతులకూ, ఇటు వినియోగదారులకూ చిన్నచూపే. పండుగపూట పరమాన్నంలా వరి వండుకొని తినగలిగిన తాతల కాలం నుంచి ఇవాళ నీటిపారుదల ప్రాజెక్టులతో పుష్కలంగా వరి పండించగలగడం పురోగతే. ఆ మోజులో మన ఒంటికీ, వాతావరణానికీ సరిపోయే జొన్నలు, సజ్జల్ని వదిలేయడమే చేస్తున్న తప్పు. వరి, గోదుమల పంటకాలం 120 – 150 రోజులైతే, సిరి ధాన్యాలు 70–100 రోజుల్లోనే చేతికొ స్తాయి. నీటి వసతి ఆట్టే అవసరం లేని వర్షాధారిత మెట్టభూములు, కొండ ప్రాంతాల్లో ఈ ధాన్యాలను ప్రభుత్వం ప్రోత్సహించాలంటున్నది అందుకే. విదేశాంగ మంత్రి అన్నట్టు ‘కోవిడ్, యుద్ధ వాతావరణం, పర్యావరణ సమస్యలు’ అంతర్జాతీయ ఆహార భద్రతకు సవాలు విసురుతున్న వేళ చిరుధాన్యాల సాగు, వాడకం పట్ల అవగాహన పెంచడం పరిష్కారం. అలా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గండం నుంచి గట్టెక్కించడానికీ ఈ ధాన్యాలే మందు. క్రీ.పూ. 3 వేల నాటి సింధునదీ పరివాహక ప్రజల కాలం నుంచి ఇవే తినేవాళ్ళం. ఇవాళ ప్రపంచంలో అనేక రకాలు ముందు మన దేశంలోవే. ఇప్పుడు మళ్ళీ ఆ పంటలకు ప్రభుత్వం ఆసరానివ్వాలి. ఈసరికే వాటిని పండిస్తున్న పశ్చిమ రాజస్థాన్, దక్షిణ కర్ణాటక, తూర్పు మధ్యప్రదేశ్‌లలో రైతులకు ప్రోత్సాహకాలివ్వాలి. ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఒక నిర్ణీత ధాన్యం సాగుకు కేంద్రంగా మలచడం లాంటివీ చేయవచ్చు. ఆ ప్రాంతీయుల ఆహారంలో ఆ ధాన్యాన్ని అంతర్భాగం చేయగలగాలి. అందుకు ముందుగా ప్రజలకు వీటి వినియోగాన్ని అలవాటు చేయాలి. ఇక, ఫలానా ధాన్యంతో ఫలానా రోగం పోతుందని స్వతంత్ర ఆహార శాస్త్రవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు ప్రయోగపూర్వకంగా ఏళ్ళకొద్దీ చెబుతున్నాయి. పరిశోధన లతో వాటిని నిరూపించే బాధ్యత ప్రభుత్వానిది. భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ లాంటివి ఆ పని తలకెత్తుకోవాలి. దాని సత్ఫలితాలు మరిందరిని సిరిధాన్యాల వైపు మళ్ళిస్తాయి. భూతాపం పెరిగిపోతున్న వేళ ఎండలు మండేకొద్దీ దిగుబడి పడిపోయే వరి కన్నా వేడిని తట్టు కొని దిగుబడినిచ్చే చిరుధాన్యాలకు ఓటేయడం వివేకం. ప్రపంచంలో సగం మంది పోషకాహారలోప పీడితులు గనక వారికీ ఈ ధాన్యాలే శ్రీరామరక్ష. ఈ వ్యావసాయిక జీవవైవిధ్యాన్ని కాపాడేలా కేంద్రం ‘మిల్లెట్ మిషన్’ ప్రకటించింది. కర్ణాటక, ఒరిస్సా లాంటివి అందులో దూసుకుపోతు న్నాయి. రేషన్ షాపుల్లో సిరిధాన్యాలను ఇవ్వడం మొదలు దేశంలోని 15 లక్షల స్కూళ్ళు, 14 లక్షల ప్రీస్కూల్ అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ధాన్యాలను మధ్యాహ్న భోజన పథకంలో భాగం చేయగలిగితే భేష్. ఇలాంటి ప్రాథమిక ఆలోచనల్ని పటిష్ఠంగా అమలు చేస్తే– ఆహార భద్రతలో, పోషకా హార విలువల్లో బలమైన భారతావని సాధ్యం. చిరుధాన్య నామ సంవత్సరాలు సార్థకమయ్యేది అప్పుడే! -
చిరుధాన్యాలతోనే విరుగుడు
సాక్షి, అమరావతి: ప్రజల సంపూర్ణారోగ్యానికి దేశంలో చిరుధాన్యాల వినియోగాన్ని తక్షణం పెంచాల్సిన ఆవశ్యకత ఉందని నాబార్డు అధ్యయన నివేదిక స్పష్టంచేసింది. వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. చిరుధాన్యాలపై ప్రజల్లో ఆదరణ పెరుగుతున్నప్పటికీ ఆ స్థాయిలో వినియోగం పెరగడంలేదని, సరఫరా చేయడం సాధ్యంకావడంలేదని నివేదిక తెలిపింది. ఇటీవల రాయచూర్‌లోని వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం, నాబార్డు సంయుక్తంగా మిల్లెట్ సదస్సును నిర్వహించాయి. ఇందులో మిల్లెట్స్–సవాళ్లు స్టార్టప్‌ల అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాయచూర్ వ్యవసాయ శాస్త్రాల విశ్వవిద్యాలయం చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు కొన్ని సిఫార్సులు చేశాయి. 2023ను అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా జరుపుకోవాలని ప్రపంచమంతా సిద్ధమవుతున్న తరుణంలో భారత్ కూడా వరి, గోధుమలకు ప్రత్యామ్నాయంగా తృణధాన్యాలను ప్రోత్సహించేందుకు సిద్ధపడుతోందని నివేదిక పేర్కొంది. చిరుధాన్యాలతోనే పోషకాహార లోపం నివారణ దేశంలో 59 శాతం మంది మహిళలు, పిల్లలు రక్తహీనతతో సతమతమవుతున్నారని, అలాంటి వారికి చిరుధాన్యాలను ఆహారంగా అందించాల్సి ఉందని నివేదిక తెలిపింది. చిరుధాన్యాల్లో 7–12 శాతం ప్రొటీన్లు, 2–5 శాతం కొవ్వు, 65–75 శాతం కార్బోహైడ్రేట్లు, 15–20 శాతం ఫైబర్, ఐరన్, జింక్, కాల్షియం ఉన్నాయని వివరించింది. ఊబకాయం, మధుమేహం, జీవనశైలి జబ్బులు, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల పరిష్కారానికి చిరుధాన్యాల వినియోగమే పరిష్కారమని తేల్చింది. మరోవైపు.. 1970 నుంచి దేశంలో చిరుధాన్యాల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోందని.. ఇందుకు ప్రధాన కారణం బియ్యం, గోధుమల ఉత్పత్తి, సాగు విస్తీర్ణం పెంచడమేనని నివేదిక స్పష్టం చేసింది. 1962లో చిరుధాన్యాల తలసరి వినియోగం 32.9 కిలోలుండగా ఇప్పుడది 4.2 కిలోలకు తగ్గిపోయిందని నివేదిక వివరించింది. రైతులకు లాభసాటిగా చేయాలి చిరుధాన్యాల సాగుతో రైతులకు పెద్దగా లాభసాటి కావడంలేదని, మరోవైపు.. వరి, గోధుమల సాగుకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయని నివేదిక తెలిపింది. చిరుధాన్యాలకే ఎక్కువ మద్దతు ధర ఉన్నప్పటికీ ఉత్పాదకత, రాబడి తక్కువగా ఉండటంతో రైతులు వరి, గోధుమల సాగుపైనే ఎక్కువ దృష్టిసారించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో.. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రైతులకు నగదు రూపంలో రాయితీలు ఇవ్వడంతో పాటు ఉత్పాదకత పెంచడానికి ప్రభుత్వాలు తగిన చర్యలను తీసుకోవాలని నాబార్డు నివేదిక సూచించింది. విజయనగరంలో మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ ఇక ఆంధ్రప్రదేశ్‌లో మిల్లెట్స్ ఉత్పత్తుల ద్వారా డబ్బు సంపాదించవచ్చునని నిరూపించిన విజయగాథలున్నాయని నివేదిక పేర్కొంది. విజయనగరం జిల్లాలో 35 గ్రామాలకు చెందిన 300 మంది మహిళా సభ్యులు ఆరోగ్య మిల్లెట్స్ ఉత్పత్తి కంపెనీ లిమిటెడ్‌ను 2019–20లో స్థాపించినట్లు తెలిపింది. మహిళా రైతులకు ఆహార భద్రత, పోషకాహారం, జీవవైవిధ్యంతో పాటు భూసారాన్ని పెంపొందించే లక్ష్యంగా ఎఫ్పీఓగా ఏర్పాటై ఆరోగ్య మిల్లెట్స్ అనే బ్రాండ్ పేరుతో చిరుధాన్యాల ఉత్పత్తులను తయారుచేయడంతో పాటు విజయవంతంగా మార్కెటింగ్ చేస్తున్నట్లు నివేదిక తెలిపింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఎఫ్పీఓతో కలిసి మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోందని, రేగా గ్రామంలో రూ.4.1 కోట్లతో యూనిట్ ఏర్పాటుచేయడం ద్వారా 240 మందికి ఉపాధి కల్పించనుందని పేర్కొంది. చిరుధాన్యాల ప్రోత్సాహానికి తీసుకోవాల్సిన చర్యలివే.. ► సెలబ్రిటీలతో పాటు ఇతరుల ద్వారా చిరుధాన్యాల వినియోగంపై అవగాహన ప్రచారాలు కల్పించాలి. ► ప్రతీ సోమవారం తృణధాన్యాల వినియోగం అలవాటు చేయాలి. ► విమానాలతో పాటు రైళ్లల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించాలి. ► అంగన్వాడీ కేంద్రాలు, మధ్యాహ్న భోజన కార్యక్రమాల్లో చిరుధాన్యాలను వినియోగించాలి. ► ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చాలి. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం అమలుచేస్తోంది. ► తయారుచేసి సిద్ధంగా ఉండే చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందుబాటులో ఉంచేందుకు అవసరమైన ప్రాసెసింగ్, విలువ జోడింపు, సాంకేతిక సౌకర్యాలను కల్పించాలి. ► పట్టణ వినియోగదారులే లక్ష్యంగా సోషల్ మీడియాను ఉపయోగించాలి. ► చిరుధాన్యాలను పండించే రైతులకు నగదు ప్రోత్సాహకాలను అందించాలి. ► సాంకేతికత సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేకమైన మిల్లింగ్ పరికరాలను ఏర్పాటుచేయాలి. -
అపరాలు, చిరుధాన్యాలపై గురి
సాక్షి, అమరావతి: రబీలో బోర్లు కింద వరిసాగు చేసే రైతుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని సంకల్పించింది. ఆరుతడి పంటలవైపు వీరిని మళ్లించేందుకు కార్యాచరణ సిద్ధంచేసింది. వాస్తవానికి మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే బోర్ల కింద వరి సాగుకయ్యే ఖర్చు ఎక్కువ. ఫలితంగా పెట్టుబడి పెరిగి, గిట్టుబాటు ధర దక్కక ఆర్థికంగా నష్టపోతుంటారు. దీనిని నివారించేందుకు సర్కారు ఈ ప్రణాళిక రూపొందించింది. సాధారణంగా రబీలో సాగు విస్తీర్ణం 56.19 లక్షల ఎకరాలు. అయితే, గతేడాది 57.27 లక్షల ఎకరాల్లో సాగైంది. 19.72 లక్షల ఎకరాల్లో వరి, 24 లక్షల ఎకరాల్లో అపరాలు, 4.97 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 3.47 లక్షల ఎకరాల్లో నూనెగింజలు, 3.2 లక్షల ఎకరాల్లో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. కానీ, ఈ ఏడాది 58.68 లక్షల ఎకరాల్లో సాగుచేయాలని లక్ష్యంగా నిర్ధేశించారు. ఇందులో ఇప్పటివరకు 2.50 లక్షల ఎకరాల్లో రబీ పంటల సాగుకు వడివడిగా శ్రీకారం చుట్టారు. రూ.25 కోట్లతో కార్యాచరణ రాష్ట్రంలో 12 లక్షల బోర్ల కింద 24.63 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులోని 11.55 లక్షల ఎకరాల్లో సుమారు 10 లక్షల మంది సంప్రదాయంగా వరిసాగు చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రస్తుత రబీ సీజన్లో ప్రయోగాత్మకంగా బోర్ల కింద ప్రత్యామ్నాయ పంటల సాగుకోసం రూ.25 కోట్లతో వ్యవసాయ శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది. ఇందులో భాగంగా బోర్ల కింద 750 క్లస్టర్ల (ఒక క్లస్టర్ కింద 50 ఎకరాలు) పరిధిలోని 37,500 ఎకరాల్లో వరికి బదులుగా అపరాలు, నూనెగింజల సాగును ప్రోత్సహించనున్నారు. ఇలా ఒక్కో క్లస్టర్‌లోని రైతులకు విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, జీవన ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలను 50 శాతం సబ్సిడీపై అందించనున్నారు. అదే విధంగా మిషన్ మిల్లెట్ పాలసీ కింద బోర్ల కింద ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లో కూడా ప్రస్తుత రబీ సీజన్లో కనీసం 50వేల ఎకరాల్లో రాగి, కొర్ర పంటల సాగును ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రైతులకు ప్రోత్సాహకాలు ఇలా.. ఇక ఈ కార్యాచరణలో భాగంగా బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్‌కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు రాష్ట్ర ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. బోర్ల కింద ఆరుతడి పంటలే మేలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు బోర్ల కింద వరికి ప్రత్యామ్నాయంగా అపరాలు, నూనెగింజలు, చిరు«ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు కార్యాచరణ సిద్ధంచేశాం. ఈ ఏడాది బోర్ల కింద 37,500 ఎకరాల్లో నూనెగింజలు, అపరాలతో పాటు 50 వేల ఎకరాల్లో చిరుధాన్యాల సాగుకు రాయితీలు అందించనున్నాం. ఇలా దశల వారీగా రానున్న నాలుగు సీజన్లలో కనీసం 3 లక్షల ఎకరాల్లో పంటల మార్పిడి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. – చేవూరు హరికిరణ్, స్పెషల్ కమిషనర్, వ్యవసాయ శాఖ ప్రోత్సాహకాలు ఇలా.. బోర్ల కింద ఆరుతడి పంటలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్నదాతలకు అనేక ప్రోత్సాహకాలు అందించబోతోంది. బోర్ల కింద అపరాలకు రూ.9వేలు, నూనెగింజలకు రూ.10వేలు, బోర్లతోపాటు మైదాన ప్రాంతాల్లో చిరుధాన్యాలు సాగుచేసే రైతులకు హెక్టార్‌కు రూ.6వేల విలువైన విత్తనాలు, విత్తనశుద్ధి చేసే రసాయనాలు, బయో ఫెర్టిలైజర్స్, పీపీ కెమికల్స్, లింగాకర్షక బుట్టలను ఆర్బీకేల ద్వారా అందించనున్నారు. వీటితో పాటు రూ.1.25 లక్షల రాయితీతో రూ.3 లక్షల విలువైన మినీ ప్రాసెసింగ్ యూనిట్లు 20–25 మందితో ఏర్పాటయ్యే ఫార్మర్ ఇంట్రస్ట్ గ్రూపులకు (ఎఫ్ఐజీ) అందించనుంది. చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు పండించే రైతుల గ్రూపులకు ప్రభుత్వం 150 యూనిట్లు ఇవ్వనుంది. -
రైతుకు సిరులు... ఒంటికి సత్తువ!
ప్రపంచీకరణలో గ్రామీణ ఉపాధులు పోయాయి. ఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. భూగర్భ జల వనరులు పాతాళానికి దిగాయి. పంటలకు నీరుండదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే చిరుధాన్యాల పంటలే రైతుకు మేలు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ (సొద్ద), సామ, అరికె, వరిగె, ఊద, ఓట్లు, బార్లీ వంటివి చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు. 1960ల్లో, మన దేశంలో ఒక మనిషి ఏడాదికి సగటున 32.9 కిలోల చిరుధాన్యాలను తినేవాడు. 2010 నాటికి వీటి వాడకం 4.2 కిలోలకు.... అంటే 87%కి పడి పోయింది. ‘పెరిగిన ఆదాయాలు, పట్టణీకరణ వలన గోదుమ ఉపయోగం పెరిగింది. దీన్ని శ్రేష్ఠమైన తిండి అనుకుంటున్నారు. చిరుధాన్యాల వాడకం తగ్గింది. వీటిని నాసిరకం తిండిగా భావిస్తున్నారు’ అని 2014లో ‘అనువర్తిత ఆర్థిక పరిశోధన జాతీయ మండలి’ తెలిపింది. 1960వ దశకం మధ్యలో ఒక పట్టణవాసి సగటున సంవ త్సరానికి 27 కిలోల గోదుమలు తినేవాడు. ఇది 2010లో రెట్టింపయింది. కొన్ని దశాబ్దాల నుండి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోదుమ, బియ్యానికి రాయితీ లిస్తున్నది. అందువలన ప్రజల్లో ప్రత్యేకించి పట్టణ జనాభాలో వీటి ఉపయోగం పెరిగింది. చిరుధాన్యాల వాడకం తగ్గింది. ‘2013–ఆహార భద్రతా చట్టం’ చేయక ముందు గోదుమలు, బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చింది. ఫలితంగా ముతక ధాన్యాల వినియోగం పడిపోయిందని ప్రభుత్వేతర సంస్థ ‘ధన్’ నాయకుడు మునియప్పన్ కార్తికేయన్ అన్నారు. 1956 నుండి చిరుధాన్యాల పంట విస్తీర్ణం తగ్గింది. సజ్జ 23%, రాగి 49%, జొన్న 64%, ఇతర ధాన్యాల సాగునేల 85% తగ్గింది. ఈ విస్తీర్ణం ఇంకా తగ్గితే దేశం చిరుధాన్య పంటలను కోల్పోతుంది. చిరుధాన్యాలు తక్కువ నీటితో అధిక ఉష్ణోగ్రతలు గల గరుగు, పొడి నేలల్లో, కరువు ప్రదేశాల్లో పండుతాయి. వీటి ఉత్పత్తి ఖర్చు తక్కువ. దిగుబడి ఎక్కువ. విత్తనాల పేటెంటు, బహుళ జాతి సంస్థల గొడవలు లేవు. ముందు ఏడాది గింజలను మరుసటి సంవత్సరం విత్తనాలుగా వాడవచ్చు. మెరుగుపర్చబడిన చిరుధాన్యాల విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఉత్పత్తిని బాగా పెంచాయి. 2013లో ప్రపంచంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో 1,09,10,000 టన్నులతో భారత్ మొదటి స్థానంలో ఉంది. వరికి కావలసిన నీటిలో 28% నీరే వీటికి సరిపోతుంది. ప్రస్తుత కరువుకే కాక పెరగబోయే భవిష్యత్తు కరువులకు కూడా ఇవి పరిష్కారమవుతాయి. ఈ పంటలతో మనకు తిండి గింజలు, పశువులకు మేత లభిస్తాయి. వీటిలో ఆమ్ల శాతం తక్కువ. పీచు శాతం, పోషక విలువలు ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 531%, బియ్యం కంటే 1,033% ఇనుము ఎక్కువ. సజ్జల్లో గోదుమల కంటే 314%, బియ్యం కంటే 611% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 265%, బియ్యం కంటే 516% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 839%, బియ్యం కంటే 3,440% సున్నం ఎక్కువ. బియ్యంలో కంటే సజ్జలు, గోదుమల్లో 4 రెట్ల సున్నం ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 313%, బియ్యం కంటే 783% ఖనిజ లవణాలు ఎక్కువ. కొర్రల్లో గోదుమల కంటే 220%, బియ్యం కంటే 550% ఖనిజ లవణాలు ఎక్కువ. గోదుమలు, బియ్యం కంటే చిరుధాన్యాలలో పోషక పదార్థాలు, నత్రజని అధికం. కేవలం బియ్యం తిన్న ఆడపిల్లల కంటే 60% జొన్నలు, 40% బియ్యం తిన్న ఆడపిల్లల ఎదుగుదల రేటు ఎక్కువని హైదరాబాదు ‘భారతీయ చిరుధాన్యాల పరిశోధక సంస్థ’, ‘జాతీయ పోషకాహార సంస్థ’ 2015 ఏడాది అధ్యయనాల్లో తెలిపాయి. (చదవండి: ఒప్పుకొందామా? తప్పందామా?) ఇతర పంటలతో పోల్చితే చిరుధాన్యాల పంటలు పర్యావరణానికి తక్కువ హానికరం. ఈ పరిస్థితుల్లో ఈ పంటలు ఉపయోగకరం. చిరుధాన్యాల పునరుద్ధరణ పోషకాహార లోపాన్ని పరిష్కరిస్తుంది. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే పలు ప్రయోజనాల చిరు ధాన్యాలను పండిద్దాం. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసుకుందాం. (చదవండి: పడిలేచిన కెరటం... ‘పోలవరం’) - సంగిరెడ్డి హనుమంత రెడ్డి ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి -
కనిష్ట స్థాయిల నుంచి మార్కెట్ రికవరీ...
ముంబై: ట్రేడింగ్ ఆద్యంతం తీవ్ర ఊగిసలాటకు లోనైన సూచీలు రిలయన్స్, హెచ్డీఎఫ్సీ జంట షేర్లు రాణించడంతో శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ రికవరీ కలిసొచ్చింది. ఫలితంగా ఇంట్రాడేలో 722 పాయింట్లు పతనమైన సెనెక్స్ చివరికి 21 పాయింట్ల స్వల్ప లాభంతో 52,344 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 240 పాయింట్ల పతనం నుంచి తేరుకొని ఎనిమిది పాయింట్లు స్వల్ప నష్టంతో 15,683 వద్ద నిలిచింది. అస్థిర పరిస్థితుల్లో రక్షణాత్మక రంగంగా భావించే ఎఫ్ఎంసీజీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. హెచ్డీఎఫ్సీ షేర్ల ద్వయం ర్యాలీతో ప్రైవేట్ బ్యాంక్స్ షేర్లూ కొంత మేర రాణించాయి. ఇక మిగిలిన రంగాల షేర్లన్నీ నష్టాలను చవిచూశాయి. -
బియ్యంతో లాభం లేదు, ‘చిరు’కు జైకొడితేనే బెటర్!
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న వేళ ప్రజలు ఇకనైనా తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని అంతర్జాతీయ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) సూచించింది. పౌష్టికాహారం, రోగ నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కోసం చిరు ధాన్యాల బాట పట్టాలని విజ్ఞప్తి చేసింది. ఆహార, వ్యవసాయ రంగాల అభివృద్ధికి కొత్త దిశా నిర్దేశం చేయాల్సిన తరుణం ఆసన్నమైందని ప్రకటిస్తూ.. నీటి ఆధారిత పంటల్ని, సాగు పద్ధతుల్నీ మార్చాలని కోరింది. ఆధునిక కాలంలో ఆహారపు అలవాట్లు మారడంతో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రజల్లో రోగ నిరోధక శక్తి తగ్గి కరోనా వంటి వైరస్ సంబంధిత వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల వాడకంతో శరీరానికి కావాల్సిన పోషకాలను సమృద్ధిగా సమకూర్చుకోవచ్చు. తద్వారా ఇమ్యూనిటీని పెంపొందించుకోవచ్చని హోంసైన్స్ నిపుణులు సలహా ఇస్తున్నారు. చిరు ధాన్యాలే కదా అని.. చిన్న చూపు కూడదు పూర్వ కాలం నుంచి చిరు ధాన్యాల సాగు ఉన్నప్పటికీ ఇటీవలి కాలంలో మరుగున పడిపోయింది. ఆ స్థానాన్ని వరి ఆక్రమించింది. ఆధునిక జీవన శైలిలో బియ్యం, ప్రత్యేకించి పాలిష్ చేసిన బియ్యం రకాల వాడకం పెరిగింది. పోషకాలు లేని బియ్యం రకాల వినియోగంతో ఫలితం లేదని శాస్త్రవేత్తలు, ఆహార నిపుణులు చాలా కాలం నుంచే చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలని చెబుతున్నారు. దేశంలోని జాతీయ పోషకాహార సంస్థ సైతం చిరు ధాన్యాలను చిన్న చూపు చూడొద్దని హెచ్చరించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో ముందుచూపుతో చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున చిరు ధాన్యాల సాగుకు చర్యలు చేపట్టడమే కాకుండా, చిరు ధాన్యాలకూ మద్దతు ధర ప్రకటించిన తరుణంలోనే.. ఎఫ్ఏవో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించడం గమనార్హం. స్మార్ట్ ఫుడ్‌తో జీవనశైలి వ్యాధులు దూరం జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, సామలు, రాగులు వంటి చిరుధాన్యాల్లో పోషక విలువలు అధికంగా ఉంటాయి. పీచు పదార్థం, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పోషక లోపాలు దరిచేరకుండా ఇవి ఒక కవచంలా పని చేస్తాయి. పోషకాలను అందించడంలో బియ్యం, గోధుమల కంటే చిరుధాన్యాలు మేలైనవి. అందుకే వీటిని స్మార్ట్ ఫుడ్‌గా కూడా అభివర్ణిస్తున్నారు. ఊబకాయం, షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధులను దూరం చేయడంలో చిరుధాన్యాలు ఉపయోగపడుతున్నందున ప్రజలు వీటిని ఎక్కువగా వాడాలి. – టి.గోపీకృష్ణ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త రాష్ట్రంలో చిరుధాన్యాలకు పూర్వవైభవం రాష్ట్రలో చిరుధాన్యాలకు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వీటి సాగును ప్రోత్సహించేందుకు చిరు ధాన్యాల బోర్డుల ఏర్పాటుకు ఉత్తర్వులు ఇచ్చింది. దేశంలోనే తొలిసారిగా కొన్ని రకాల చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర ప్రకటించి రైతుల్ని ప్రోత్సహిస్తోంది. – డాక్టర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్