సాక్షి ప్రతినిధి, బాపట్ల: చిరుధాన్యాల సాగు విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం సోమవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తరించడానికి అనుకూలమైన ప్రాంతాలను ఎంపికచేసి వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం విశ్వవిద్యాలయ పరిశోధన విభాగాలు వ్యవసాయ శాఖ సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు.
ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్–2 (ఎస్‌డీజీ–2) 2030 నాటికి ఆహార భద్రతను సాధించడం, ఆకలిని అంతం చేయడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతదేశం మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహిస్తోందని, మిల్లెట్లు శీతోష్ణస్థితికి అనువుగా ఉండటమే కాకుండా పోషకాహారానికి గొప్ప మూలమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ) జాతీయ, ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలనే ప్రధాన నినాదంతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు.
మిల్లెట్ వినియోగం పోషకాహారం, ఆహారభద్రత, రైతుల సంక్షేమాన్ని పెంచుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిశోధన కార్యక్రమాల్లో పోషకాహార భద్రతను ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు మొత్తం స్థూలవిలువ ఆధారిత వాటాలో 35 శాతం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో మన వర్సిటీ 7వ ర్యాంక్ సాధించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణపై మరింత దృష్టి సారించడం ద్వారా అన్ని టాప్ 5 ర్యాంకుల్లోకి చేరుకుంటుందని చెప్పారు.
గ్రాడ్యుయేట్లు, మెడల్ విజేతలు, విశిష్టతలు, అవార్డులు, డిగ్రీ గ్రహీతలు, ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. తొలుత వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్) చైర్మన్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా ముఖ్యఅతిథిగా పాల్గొని వర్సిటీ గౌరవ పురస్కారం అందుకున్నారు.
హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయానికి చెందిన డాక్టర్ ఎబ్రహిమాలి అబూబకర్ సిద్ధిక్, ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ నాగేంద్రకుమార్ సింగ్‌లకు వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారు. రెండు జాతీయ అవార్డుల ఏర్పాటు మొదటిసారిగా విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు పేర్లతో వ్యవసాయ పరిశోధనలో ఎక్సలెన్స్ కోసం రెండు జాతీయ అవార్డులను ఏర్పాటు చేసింది. డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు రెండు మెగా రైస్ బీపీటీ 5204 (సాంబామసూరి), ఎంటీయూ 7029 (స్వర్ణ) రకాలను అభివృద్ధి చేశారు.
(చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. )
Comments
Please login to add a commentAdd a comment