Acharya NG Ranga Agricultural University
-
సేంద్రియ పద్దతులపై రైతులకు శిక్షణా కార్యక్రమాలు
-
డ్రోన్లతో వెదసాగు సక్సెస్
సాక్షి ప్రతినిధి, గుంటూరు: వరిసాగులో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టడంలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ ముందుకు సాగుతోంది. దేశంలోనే మొదటిసారిగా వ్యవసాయ డ్రోన్ల వినియోగంపై రైతులకు, గ్రామీణ యువతకు అవగాహన కల్పిస్తూ, వ్యవసాయంలో రాష్ట్ర ప్రభుత్వ ముందుచూపును నిజం చేస్తోంది. ఇప్పటివరకు 10 ప్రధాన పంటల్లో డ్రోన్లతో పురుగుమందులు చల్లడానికి ప్రామాణికాలను తయారుచేసి, శిక్షణ ఇచ్చింది. ఇప్పుడు ఏకంగా వెదపద్ధతి(విత్తనాలు వెదజల్లడం)లో విత్తనాలు చల్లే ప్రక్రియకి శ్రీకారం చుట్టింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వర్షాలు సకాలంలో పడకపోవడంతో రైతులు సకాలంలో వరినాట్లు వేయలేకపోతున్నారు. ఖరీఫ్ సాగు ఆలస్యం అవుతోంది. దీంతో రైతులు వెదసాగు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం వరిసాగులో 21 శాతం వరకు వెదపద్ధతిలోనే జరుగుతున్నట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెబుతున్నాయి. వెదపద్ధతిలో గత ఏడాది 100 ఎకరాల్లో వరి, మినుము, పచ్చి రొట్ట సాగుచేశారు. దుక్కి దున్నిన తరువాత నుంచి అన్ని పంటల్లో డ్రోన్లతో అన్ని రకాల పనులు చేసుకోవచ్చని నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతను జోడించి డ్రోన్లతో వరి విత్తనాలను వెదజల్లించాలని వర్సిటీ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సమయం, డబ్బు ఆదా డ్రోన్లతో వెదపద్ధతిలో తక్కువ విత్తనాలు సరిపోతాయి. సమయం, డబ్బు ఆదా అవుతాయి. మొదటి ఏడాది ఫలితాలను విశే్లషించిన తర్వాత వెదపద్ధతిలో విత్తనాలను నాటడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని గుర్తించారు. రెండో సంవత్సరం ఫలితాలు ఆశాజనకంగా వస్తే దుక్కి నుంచి కోత వరకు డ్రోన్లను ఉపయోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ట్రాక్టర్లు, చేతితో చల్లే పద్ధతిలో ఎకరానికి 16 నుంచి 30 కిలోల వరకు విత్తనాలు వినియోగిస్తున్నారు. అదే డ్రోన్ ద్వారా చల్లితే 8 నుంచి 12 కిలోల విత్తనాలు సరిపోతాయి. గత ఏడాదిగా డ్రోన్ల సాయంతో విత్తనాలు చల్లడం, ఎరువులు (యూరియా, డీఏపీ) వేయడం, పురుగుమందుల పిచికారీలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఎకరం పొలంలో మూడు నిమిషాల్లో విత్తనాలు చల్లవచ్చు. 50 కిలోల రసాయనిక ఎరువును ఎనిమిది నిమిషాల్లో చల్లవచ్చు. ఎకరా విత్తనాలు విత్తుకునేందుకు రూ.400 నుంచి రూ.500 ఖర్చవుతుంది. విత్తనాల్లో 25 శాతం ఆదా అవుతాయి. పురుగుమందుల వ్యయం 25 శాతం తగ్గడమేగాక చల్లే ఖర్చులో రూ.400 ఆదా అవుతాయి. గత ఏడాది వెదపద్ధతిలో చేసిన సాగు ఆశాజనకమైన ఫలితాలను ఇవ్వడంతో ఈ విధానంపై పరిశోధనలను ముమ్మరం చేసింది. డీజీసీఏ అనుమతితో శిక్షణ దేశంలో ఎక్కడా లేనివిధంగా డ్రోన్లను వినియోగించడంతోపాటు డీజీసీఏ అనుమతి తీసు కుని వ్యవసాయ డ్రోన్ పైలట్లకు వ్యవసాయ విశ్వవిద్యాలయం శిక్షణ ఇస్తోంది. వర్సిటీలోని శిక్షణ కేంద్రంలో ఇప్పటివరకు 217 మంది రైతులు, గ్రామీణ యువతకు శిక్షణ ఇచ్చి సరి్టఫికెట్లు అందజేసింది. మరో వందమంది వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థులకు కూడా శిక్షణ ఇచ్చింది. తిరుపతి, పులివెందులలో డ్రో¯Œ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. రైతులకు అధునాతన సాంకేతికత ఆధునిక వ్యవసాయ విధానాలను రైతులకు అందించేందుకు దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా వ్యవసాయాన్ని ప్రయోగాత్మంగా చేపట్టి మంచి ఫలితాలను సాధించాం. వెదపద్ధతిలో వరిసాగు, పురుగుమందులు, ఎరువుల పిచికారీలో మంచి ఫలితాలు వచ్చాయి. మరికొంత సాంకేతికతను రైతులకు అందించేందుకు రోబో టెక్నాలజీపై ప్రయోగాలు చేపట్టాం. అధునాతన సాంకేతికతను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాం. – డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి, వీసీ, ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ -
అరవై ఏళ్లు.. 239 రకాలు..
సాక్షి, అమరావతి: దేశంలో ప్రతీ ముగ్గురిలో ఒకరు.. తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ పది మందిలో తొమ్మిది మందికి ఈ విశ్వవిద్యాలయం అన్నం పెడుతోంది. అంటే.. ఆ వర్సిటీ అభివృద్ధి చేసిన రకాలనే దేశంలో మూడోవంతు ప్రజలు ఆహారంగా తీసుకుంటున్నారు. అదే మన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) ప్రత్యేకత. దేశంలోనే పురాతనమైన వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఈ వర్సిటీకి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అరవై ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఈ వర్సిటీ సాధించిన విజయాలెన్నో.. ఎన్నెన్నో. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి.. రెట్టింపు ఆదాయం లక్ష్యంగా ఏటా పదుల సంఖ్యలో కొత్త వరి రకాలను మార్కెట్లోకి తీసుకొస్తోంది. తెగుళ్లు, కీటకాలు, చీడపీడలు, వాతావరణ స్థితిగతులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేయడమే కాదు.. సన్నరకాల సృష్టికర్తగా ఖ్యాతి గడించింది. ఫలితంగా దశాబ్దాలుగా వరి వినియోగంలో వర్సిటీ సృష్టించిన రకాలే ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాయి. దేశంలో సాగయ్యే వరిలో మూడోవంతు.. దేశంలో వరి సాగవుతున్న 46 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో 14 మిలియన్ హెక్టార్లలో ‘ఆంగ్రూ’ రకాలే సాగవుతున్నాయంటే ఏ స్థాయిలో ఈ వర్సిటీ రైతుల మన్ననలు చూరగొందో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. జాతీయ స్థాయి వరి ఉత్పత్తి (131 మిలియన్ టన్నులు)లో 33.15 శాతం (37.76 మిలియన్ టన్నులు) ఈ వర్సిటీ రకాలే కావడం గమనార్హం. సగటు దిగుబడి జాతీయ స్థాయిలో హెక్టార్‌కు 2,832 కిలోలు.. ఏపీలో హెక్టార్‌కు 5,048 కిలోలు ఉంటే, ఈ వర్సిటీ రూపొందించిన రకాలు ఏకంగా హెక్టార్‌కు 5,669 కిలోల దిగుబడినివ్వడమే కాదు జాతీయ స్థాయిలో రూ.62,317 కోట్ల ఆదాయాన్ని ఆర్జించి పెడుతున్నాయి. 60 ఏళ్లలో 239 రకాల సృష్టి.. 1964 జూన్ 12న ఏర్పాటైన ఈ వర్సిటీ.. వ్యవసాయ, అనుబంధ రంగాలలో ఉత్పత్తి, ఉత్పాదకత, లాభదాయకతను పెంచడంలో నిరంతరం కృషిచేస్తోంది. 60 ఏళ్లలో 123 అధిక దిగుబడినిచ్చే వరి రకాలతో పాటు 47 రకాల పప్పు ధాన్యాలు, 29 రకాల నూనె గింజలు, 21 రకాల వాణిజ్య పంటలు, 19 రకాల చిరుధాన్యాలను ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసింది. ఈ స్థాయిలో నూతన వంగడాలను అభివృద్ధి చేసిన వర్సిటీ దేశంలో మరొకటి లేదనే చెప్పాలి. వాతావరణ పరిస్థితులకు తగినట్లుగా, తెగుళ్లు, చీడపీడలు, కీటకాలను ఎదుర్కొనే రకాలను అభివృద్ధి చేయడంలో వర్సిటీ క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. ఈ కోవలో అభివృద్ధి చేసిన ఎంటీయూ 7029 (స్వర్ణ), బీపీటీ 5204 (సాంబా మసూరి) వరి రకాలు జాతీయ స్థాయిలో ప్రజాదరణ పొందాయి. దేశంలోనే మొట్టమొదటి బూజు తెగులు నిరోధక మినుము రకం ఎల్బీజీ 17 (కృష్ణయ్య)తో పాటు ప్రసిద్ధి చెందిన కే6, నారాయణి, లేపాక్షి వంటి వేరుశనగ రకాలు సైతం వర్సిటీ అభివృద్ధి చేసినవే. ఆంగ్రూ రకాలతో రూ.25వేల కోట్ల ఆదాయం.. ♦ ఆంధ్రలో 90.29 శాతం అంటే అక్షరాల 21.78 లక్షల హెక్టార్లలో వర్సిటీ సృష్టించిన వరి రకాలే సాగవుతున్నాయి. ♦ సాగు విస్తీర్ణంలో 72.63 శాతం, ఉత్పత్తిలో 87.27 శాతం వర్సిటీ రకాలే. ♦ పప్పు ధాన్యాల సాగులో 35.63 శాతం, ఉత్పత్తిలో 32.16 శాతం వర్సిటీ రూపొందించినవే.. ♦ వేరుశనగ ఉత్పత్తిలో 94.03 శాతం వర్సిటీ రకాలే. ఒక్క కే6 రకమే 82 శాతం అందిస్తోంది. ♦ నువ్వుల సాగులో కూడా 87.50 శాతం ఆంగ్రూ రకాలదే కావడం విశేషం. ♦ వరి రకాల ద్వారా రూ.20,243 కోట్లు, అపరాల ద్వారా రూ.2,113 కోట్లు, నూనెగింజల ద్వారా రూ.2,862 కోట్లు కలిపి.. మొత్తం రూ.25వేల కోట్లకుపైగా ఆదాయాన్ని రాష్ట్ర రైతులు ఆర్జిస్తున్నారు. ఏటా రూ.8వేల కోట్ల విదేశీ మారకద్రవ్యం.. ఇక ఎగుమతుల్లో బాస్మతేతర బియ్యం రకాలదే సింహభాగం. వీటిలో మూడోవంతు ‘ఆంగ్రూ’ అభివృద్ధి చేసినవే. ఉదా.. దేశం నుంచి 2021–22లో బియ్యం ఎగుమతుల ద్వారా రూ.46,914.28 కోట్ల విదేశీ మారక ద్రవ్యం దేశానికి వచ్చింది. ఈ బియ్యం ఎగుమతుల్లో 33 శాతం (రూ.15,481.71కోట్లు) ఆంగ్రూ అభివృద్ధి చేసిన రకాలకు చెందిన బియ్యమే. అలాగే, మిగతా కాలంలో ఏటా ఆంగ్రూ రకాల బియ్యం ఎగుమతి ద్వారా సగటున రూ.8,073 కోట్ల ఆదాయం సమకూరుతోందంటే ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందో స్పష్టమవుతోంది. 12న మెగా సీడ్ మేళా.. వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 12న గుంటూరు లాంలోని వర్సిటీ ప్రాంగణంలో ‘మన రైతు కోసం మన నాణ్యమైన విత్తనం’ అనే నినాదంతో విత్తన మహోత్సవం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సాగయ్యే, వర్సిటీ అభివృద్ధి చేసిన వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించిన విత్తనాలను ప్రదర్శన, అమ్మకానికి ఉంచుతూ రైతు మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పెట్టుబడికి ఢోకాలేదు ఆంగ్రూ అభివృద్ధి చేసిన వివిధ రకాల సాగుతో పెట్టుబడికి ఢోకాలేదని నిరూపితమైంది. ఇటీవలే ఆంగ్రూ రకాల రాబడి–ఖర్చులను విశ్లేíÙంచాం. ఖరీఫ్ కంటే రబీలో నికర రాబడులు ఎక్కువగా ఉన్నాయి. సాగుకోసం రైతులు ఖర్చుచేసే ప్రతీ రూ.100కు, వరికి రూ.103, మినుముకి రూ.132, కందికి రూ.133, మిరపకి రూ.160, శనగకి రూ.102, వేరుశనగకి రూ. 124ల చొప్పున ఆదాయం వస్తోందని గుర్తించాం. – డాక్టర్ జి. రఘునాథరెడ్డి, ప్రధాన శాస్త్రవేత్త, ప్రాంతీయ పరిశోధనా స్థానం, లాం సీజన్ ఏదైనా మన రకాలదే ఆధిపత్యం.. ప్రధాన పంటలలో అధిక దిగుబడినిచ్చే రకాలను అభివృద్ధి చేసి రాష్ట్ర, జాతీయ స్థాయిలో విడుదల చేయడంలో ‘ఆంగ్రూ’ ముఖ్యపాత్ర పోషిస్తోంది. ‘ఆంగ్రూ’ వరి రకాలు హెక్టారుకు 5,669 కిలోల దిగుబడిని సాధిస్తుండగా, ఇది రాష్ట్ర సగటు దిగుబడి (హెక్టారుకు 5,048 కిలోలు) కంటే ఎక్కువ. వరిలోనే కాదు అపరాలు, నూనె గింజల సాగులో కూడా ఆంగ్రూ రకాలదే సింహభాగం. దాదాపు రెండు సీజన్లలోనూ వర్సిటీ రకాలకున్న డిమాండ్ ఇతర రకాలకు లేదనే చెప్పాలి. – డాక్టర్ ఎల్. ప్రశాంతి, పరిశోధనా సంచాలకులు ఏటా రూ.2,967 కోట్ల లాభాలు.. జాతీయ స్థాయి వరి ఉత్పత్తిలో మూడో వంతు ఆంగ్రూ రకాలదే. అలాగే, జాతీయ స్థాయిలో 40 శాతం మంది రైతులు ఈ రకాలనే సాగు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ప్రతీ రైతు ఈ వర్సిటీ రకాలపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. ఏటా వరితో పాటు ఇతర పంటల్లో కూడా పెద్ద సంఖ్యలో కొత్త వంగడాలను మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. సంప్రదాయ వరి రకాల కంటే ఆంగ్రూ రకాల సాగువలన ఏటా రూ.2,967 కోట్ల లాభాలను రైతులు ఆర్జిస్తున్నారు. – డాక్టర్ ఆదాల విష్ణువర్థన్‌రెడ్డి, వైస్ చాన్సలర్ -
చిరుధాన్యాల సాగు విస్తరించాలి
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చిరుధాన్యాల సాగు విస్తరణకు కార్యాచరణ సిద్ధం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కోరారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవం సోమవారం బాపట్ల వ్యవసాయ కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కొత్త ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగు విస్తరించడానికి అనుకూలమైన ప్రాంతాలను ఎంపికచేసి వాటిని అభివృద్ధి చేయాలని సూచించారు. ఇందుకోసం విశ్వవిద్యాలయ పరిశోధన విభాగాలు వ్యవసాయ శాఖ సహకారంతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. ఐక్యరాజ్యసమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్–2 (ఎస్డీజీ–2) 2030 నాటికి ఆహార భద్రతను సాధించడం, ఆకలిని అంతం చేయడం, పోషకాహారాన్ని మెరుగుపరచడం, స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. భారతదేశం మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని ప్రోత్సహిస్తోందని, మిల్లెట్లు శీతోష్ణస్థితికి అనువుగా ఉండటమే కాకుండా పోషకాహారానికి గొప్ప మూలమని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ చొరవతో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్జీఏ) జాతీయ, ప్రపంచవ్యాప్తంగా చిరుధాన్యాల వినియోగాన్ని పెంచాలనే ప్రధాన నినాదంతో 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు. మిల్లెట్ వినియోగం పోషకాహారం, ఆహారభద్రత, రైతుల సంక్షేమాన్ని పెంచుతుందన్నారు. విశ్వవిద్యాలయం పరిశోధన కార్యక్రమాల్లో పోషకాహార భద్రతను ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటిగా తీసుకోవడం అభినందనీయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, అనుబంధ రంగాలు మొత్తం స్థూలవిలువ ఆధారిత వాటాలో 35 శాతం కలిగి ఉన్నాయని తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాలలో మన వర్సిటీ 7వ ర్యాంక్ సాధించడం ప్రశంసనీయమన్నారు. రాబోయే సంవత్సరాల్లో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణపై మరింత దృష్టి సారించడం ద్వారా అన్ని టాప్ 5 ర్యాంకుల్లోకి చేరుకుంటుందని చెప్పారు. గ్రాడ్యుయేట్లు, మెడల్ విజేతలు, విశిష్టతలు, అవార్డులు, డిగ్రీ గ్రహీతలు, ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీతలను ఆయన అభినందించారు. తొలుత వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి యూనివర్సిటీ వార్షిక నివేదికను సమర్పించారు. ట్రస్ట్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్ (టీఏఏఎస్) చైర్మన్, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్రసింగ్ పరోడా ముఖ్యఅతిథిగా పాల్గొని వర్సిటీ గౌరవ పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయ శంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యా లయానికి చెందిన డాక్టర్ ఎబ్రహిమాలి అబూబకర్ సిద్ధిక్, ఢిల్లీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాంట్ బయోటెక్నాలజీ ప్రొఫెసర్ నాగేంద్రకుమార్ సింగ్‌లకు వ్యవసాయ శాస్త్రాల్లో అత్యుత్తమ పరిశోధనలకు గుర్తింపుగా అవార్డులు అందజేశారు. రెండు జాతీయ అవార్డుల ఏర్పాటు మొదటిసారిగా విశ్వవిద్యాలయం డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు పేర్లతో వ్యవసాయ పరిశోధనలో ఎక్సలెన్స్ కోసం రెండు జాతీయ అవార్డులను ఏర్పాటు చేసింది. డాక్టర్ ఎం.వి.రెడ్డి, వి.రామచంద్రరావు రెండు మెగా రైస్ బీపీటీ 5204 (సాంబామసూరి), ఎంటీయూ 7029 (స్వర్ణ) రకాలను అభివృద్ధి చేశారు. (చదవండి: చారిత్రక విజయానికి నాలుగేళ్లు.. ) -
చక్కని సాగుకు.. చిన్న డ్రోన్లు
వ్యవసాయ రంగంలో 45 కిలోల వరకు బరువు గల ప్రైవేట్ డ్రోన్లు గతంలో సేవలందించేవి. ఆయిల్ ఇంజన్ సహాయంతో నడిచే ఈ డ్రోన్ల వల్ల ఎక్కువ శబ్దంతో పాటు దాని బరువు కారణంగా వినియోగించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ పరిస్థితుల్లో వాటి బరువును 25 కేజీలకు కుదించిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఆధునిక సాంకేతికతను వినియోగించటం ద్వారా తాజాగా ఆ బరువును 250 గ్రాములకు తగ్గించగలిగింది. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయేలా కేవలం 10 గ్రాముల బరువుతో డ్రోన్లను తయారు చేయడంపై దృష్టి సారించింది. ఈ తరహా డ్రోన్ అందుబాటులోకి వస్తే షేడ్ నెట్, గ్రీన్ మ్యాట్ తరహా సాగు విధానంలో సమస్యగా మారిన పరపరాగ సంపర్యాన్ని విజయవంతంగా జరిపించవచ్చు. సాక్షి ప్రతినిధి, గుంటూరు: డ్రోన్ అంటే ఒకప్పుడు పెళ్లిళ్లు, బహిరంగ సభలు, పాదయాత్రల వీడియో, ఫొటోలు తీయడానికి మాత్రమే పరిమితం. అదే డ్రోన్ టెక్నాలజీ ఇప్పుడు అన్ని రంగాల్లో అడుగుపెట్టింది. సైనిక అవసరాలతో పాటు ఫుడ్ డెలివరీకి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీ సర్వేకి కూడా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో అరచేతిలో ఇమిడిపోయే బుల్లి డ్రోన్లు రంగ ప్రవేశం చేయనున్నాయి. ఈ తరహా డ్రోన్లను అభివృద్ధి చేసి వ్యవసాయ రంగంలో వినియోగించేలా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కృషి చేస్తోంది. ఇప్పటికే డ్రోన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో వినియోగించడంతోపాటు రైతులనే డ్రోన్ పైలట్లుగా తీర్చిదిద్దే బాధ్యతను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం భుజాన వేసుకుంది. ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీని ఎరువులు, విత్తనాలను వెదజల్లేందుకు మాత్రమే వ్యవసాయ రంగంలో వినియోగిస్తున్నారు. రానున్న కాలంలో రోజుల్లో ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి రైతులకు అన్ని దశల్లోనూ వ్యవసాయ పనులు చేసి పెట్టేలా డ్రోన్లను రూపొందించేందుకు ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎరువులు, పురుగు మందులు చల్లేందుకే.. వ్యవసాయంలో డ్రోన్లను ప్రస్తుతం పురుగు మందులు పిచికారీ చేసేందుకు వాడుతున్నారు. దీనివల్ల 25 శాతం వరకూ పురుగు మందులు ఆదా కావడంతోపాటు పొలం మొత్తం సమానంగా పిచికారీ చేసే అవకాశం కలిగింది. మరోవైపు ఎరువుల్ని చల్లడం, వెద పద్ధతిలో విత్తనాలు వేయడానికి వినియోగిస్తున్నారు. దీనివల్ల కూలీల ఖర్చు తగ్గుతోంది. మరోవైపు డ్రోన్లను వినియోగించి నేల స్వభావం తెలుసుకోవడం ద్వారా నేలలో ఏయే పోషకాలు అవసరం, ఏ పోషకాలు అధికంగా ఉన్నాయి, ఉప్పు నేలలు, చౌడు, ఉరకెత్తు ప్రాంతాలను గుర్తించి వాటికి అనుగుణంగా యాజమాన్య పద్ధతులు చేపట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. ఇదే సందర్భంలో డ్రోన్లను ఉపయోగించి అడవుల్లో మొక్కల సాంద్రత తెలుసుకుని అవసరమైన ప్రాంతాల్లో విత్తనాలు చల్లుకునే అవకాశం ఉంది. చెరువులు, కుంటలు, నదులు, జలపాతాల్లో నీటి పరిమాణం అంచనా వేయడానికి, నీటిని నిల్వచేయడానికి వాటర్‌షెడ్స్, చెక్‌డ్యామ్‌లు ఎక్కడ ఎలా కట్టుకోవాలనే అంశాన్ని డ్రోన్ టెక్నాలజీతో తెలుసుకోవచ్చు. విప్లవాత్మక మార్పులకు శ్రీకారం డ్రోన్ టెక్నాలజీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. విత్తనాలు చల్లుకోవడం నుంచి ఎరువులు, పురుగు మందులు వేయడం, పంటల అంచనా, పంటలకు అందించాల్సిన పోషకాలు అందించడంతో పాటు పలు అంశాల్లో ఈ టెక్నాలజీ ప్రయోజనకారిగా ఉంటుంది. అంగ్రూ తరపున డ్రోన్ వినియోగంపై శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నాం. రానున్న రోజుల్లో చిన్నపాటి డ్రోన్లను రైతులకు అందుబాటులోకి తెచ్చేలా కృషి జరుగుతోంది. – ఎ.సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, అంగ్రూ ఫోన్ కంటే స్మార్ట్‌గా.. కూలీల కొరత తీవ్రమవటం, ఎరువులు, పురుగు మందు ధరలు పెరిగిపోవటం వల్ల నష్టపోతున్న రైతులకు ఊరట కల్పించడమే కాకుండా యువతరాన్ని రాబోయే కాలంలో వ్యవసాయం వైపు మరల్చడానికి డ్రోన్ టెక్నాలజీ దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్జీ రంగా యూనివర్సిటీ డ్రోన్ బరువును 45 కిలోల నుంచి 25 కిలోలకు తగ్గించింది. తాజాగా కేవలం 250 గ్రాముల బరువైన డ్రోన్లను సైతం రూపొందించింది. కాగా, కొన్ని ప్రైవేటు కంపెనీలు 45 కిలోల బరువున్న డ్రోన్లను ఆయిల్ ఇంజన్ సహాయంతో నడుపుతున్నాయి. వీటి నుంచి ఎక్కువ శబ్దం చేయడంతోపాటు దాని బరువు కారణంగా వినియోగించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షేడ్‌నెట్స్, గ్రీన్‌మ్యాట్ వంటి పద్ధతుల్లో పంటలు పండించే చోట గాలి ఎక్కువగా తగలకపోవడం వల్ల పుప్పొడి ఒక పుష్పం నుంచి మరో పుష్పంపైకి చేరటం లేదు. ఈ కారణంగా మొక్కల్లో పరపరాగ సంపర్కం జరగక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అరచేతిలో ఇమిడిపోయేంత డ్రోన్లను ఆ మొక్కలపై తిప్పితే పరపరాగ సంపర్కం అవుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం అతి చిన్న డ్రోన్లను తయారు చేయడానికి ఎన్జీ రంగా శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా డ్రోన్లు విదేశాల్లో అందుబాటులో ఉన్నాయి. వీటి బరువు కేవలం 10 గ్రాముల వరకూ ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని అందుబాటులోకి తీసుకు రావడం ద్వారా షేడ్ నెట్స్, గ్రీన్ మ్యాట్ సాగులో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. -
సాగులో మార్పులు తేవాలి
సాక్షి, బాపట్ల: వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, రైతుల సమస్యల పరిష్కారానికి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం కృషిచేయాలని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీ చాన్స్‌లర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 54వ స్నాతకోత్సవం గురువారం నిర్వహించారు. వర్చువల్‌గా పాల్గొన్న గవర్నర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక యూనివర్సిటీ శ్రీకారం చుట్టిందని, డ్రోన్ల వినియోగ పరిశోధనలో దేశంలోనే యూని వర్సిటీ ముందుండటం గర్వకారణమన్నారు. తలసరి ఆదాయంలో ఏపీ అగ్రగామి : ప్రొఫెసర్ రమేష్ చంద్ ఈ కార్యక్రమంలో నీతి ఆయోగ్ సభ్యుడు ప్రొఫెసర్ రమేష్ చంద్ మాట్లాడుతూ రాష్ట్ర తలసరి ఆదాయంలో జాతీయ సగటు కంటే ఆంధ్రప్రదేశ్‌లో 38.6 శాతం అధికంగా నమోదైందని, ఇది రాష్ట్ర అరి్థక ప్రగతికి సూచికని చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,07,771 కాగా, దేశ తలసరి ఆదాయం రూ.1,49,848 మాత్రమే అని తెలిపారు. 2011 నుంచి 2021 వరకు జాతీయ స్థూల ఉత్పత్తి పెరుగుదల 5.48 శాతం కాగా, రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరుగుదల 7.08 శాతం ఉందన్నారు. కేవలం వ్యవసాయ అనుబంధ రంగాలు 8 శాతం వృద్ధి నమోదు చేశాయని, ఇది భారతదేశ వృద్ధికి రెండు రెట్లు అధికంగా ఉందని వివరించారు. దేశ వృద్ధి రేటు 3.28 మాత్రమేనని వివరించారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంపై నివేదిక సమర్పించారు. గిరిజన వ్యవసాయ విధానాలపై అత్యుత్తమ పరిశోధనలు చేసిన విజయనగరం వ్యవసాయ పరిశోధన స్థానానికి చెందిన ఫకృద్దీన్ అలీ అహ్మద్‌కు యూనివర్సిటీ పురస్కారం ప్రదానం చేసినట్లు తెలిపారు. 722 మందికి డిగ్రీ, 102 మందికి పీజీ, 40 మందికి పీహెచ్డీ పట్టాలను ప్రదానం చేశారు. -
రైతుల ఆదాయం పెంచేలా కృషి జరగాలి
తిరుపతి (ఎడ్యుకేషన్): దేశానికి వెన్నెముక అయిన రైతుల ఆదాయం పెంచేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 52, 53వ స్నాతకోత్సవ వేడుకలను బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో ఎస్వీ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గవర్నర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విజ్ఞానం అందించాలని సూచించారు. 2019–20లో జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17.8 శాతం నమోదు కాగా, 2021 సంవత్సరానికి 19.9 శాతం సాధించడంలో మన రైతులు చేసిన కృషి అభినందనీయమన్నారు. జాతీయ వరి ఉత్పత్తిలో మూడోవంతు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలు ఉండటం విశ్వవిద్యాలయం సాధించిన పరిశోధన ప్రగతికి లభించిన గౌరవమన్నారు. రాష్ట్రంలో పండించే వేరుశనగలో 95 శాతం వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు ఉండగా.. రాష్ట్ర వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో దీని వాటా 1.06 శాతంగా ఉండటం గర్వకారణమన్నారు. ఆర్బీకేల పనితీరు భేష్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల పనితీరు అమోఘమని గవర్నర్ అభినందించారు. ఆర్బీకేలకు సాంకేతికంగా సహకారం అందిస్తూ గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడం అభినందనీయమన్నారు. యూనివర్సిటీ స్నాతకోత్సవాల సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ను వర్సిటీ ప్రకటించింది. 2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ (వ్యవసాయం) పూర్తి చేసిన 1,544 మందికి, పీజీ పూర్తి చేసిన 328 మందికి, 91 మంది పీహెచ్డీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. డాక్టర్ వి.రామచంద్ర రావు జాతీయ అవార్డును ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్, డాక్టర్ ఎన్వీ రెడ్డి జాతీయ అవార్డును రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణకు అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, వైస్ చాన్సలర్ డాక్టర్ ఏ.విష్ణువర్ధన్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధర్‌కృష్ణ పాల్గొన్నారు. -
AP: రైతు ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు రూరల్: వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో నూతన ఆలోచనలు, ఆవిష్కరణల రూపకర్తలైన అభ్యుదయ రైతులకు ఈ ఏడాది ఉగాది పురస్కారాలను అందించేందుకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. రాష్ట్రం లోని 13 జిల్లాల నుంచి ఆసక్తిగల రైతులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ పి.రాంబాబు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. చదవండి: ప్రభుత్వోద్యోగులకు ఏపీ సర్కార్ మరో తీపికబురు రైతులు తమకు సమీపం లోని వ్యవసాయ పరిశోధనా స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలలో దరఖాస్తులు పొందవచ్చు. భర్తీ చేసిన దరఖాస్తులకు ధ్రువపత్రాలను జత చేసి ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలన్నారు. ప్రతిభ కనబరిచిన రైతులకు పురస్కారంతో పాటుగా, రూ 5,000 నగదు బహుమతి, జ్ఞాపికను అందజేస్తామన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయం వెబ్సైట్ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏఎన్జీఆర్ఏయూ.ఏసీ.ఇన్’ను సంప్రదించాలని సూచించారు. -
పుస్తకమే కాదు పొలము కూడా వారికి పాఠాలు చెబుతుంది!
పాదాలకు అంటుకున్న మట్టి అక్కడ పాఠాలు చెబుతుంది. అరచేతికి పూసుకున్న బురద అక్షరమై వికసిస్తుంది. పుస్తకమే కాదు పొలము, హలము కూడా వారికి చదువు చెబుతుంది. పిల్లలంతా పట్టభద్రులై వ్యవసాయానికి దూరమైపోతున్న కాలంలో.. విద్యార్థి నికార్సయిన రైతుగా మారే అపురూప అవకాశం ఆ కోర్సు కల్పిస్తుంది. మట్టికి మనిషికి ఉన్న బాంధవ్యాన్ని అపూర్వ రీతిలో వివరిస్తుంది. సిలబస్, పరీక్షలతో పాటు పంట, మార్కెటింగ్‌లు కూడా ప్రత్యక్షంగా నేర్పుతుంది. ఆ చదువు ఎలా ‘సాగు’తుందంటే..? శ్రీకాకుళం రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వ్యవసాయ కళాశాల శ్రీకాకుళం జిల్లా నైరాలో విద్యార్థులు అన్నదాతలుగా మారుతున్నారు. పట్టాలు పొందే నాటికి మట్టిపై పూర్తిస్థాయి అవగాహన పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఈఎల్పీ అనే ప్రొగ్రాంను అనుసరిస్తున్నారు. ఈఎల్పీ అంటే ఎక్స్‌పీరియన్సల్ లెర్నింగ్ ప్రొగ్రాం. అనుభవం ద్వారా నైపుణ్యాన్ని పెంచే ఈ కార్యక్రమం ద్వారా ఫైనల్ ఇయర్ విద్యార్థులు పంటలు పండిస్తున్నారు. దీనికి కావాల్సిన పెట్టుబడిని కాలేజీ యాజమాన్యమే అందిస్తుంది. ఇందులో రాబడి తీసుకురాగలిగితే 75 శాతం విద్యార్థులే తీసుకోవచ్చు. మిగిలిన డబ్బు ప్రాజెక్టు, గైడ్‌కు వెళ్తుంది. పంటలే కాదు వర్మీకంపోస్ట్, వర్మీటెక్, విత్తనోత్పత్తి, కూరగాయల పెంపకం, జీవ శిలీంద్రాలు, పుట్టగొడుగుల పెంపకంతో పాటు పూలు, పుచ్చకాయలు యూనిట్లు నెలకొల్పి వాటిని మార్కెటింగ్ కూడా చేస్తున్నారు. ఈ కాలేజీలో పండించిన పంటలను దగ్గరలో గల పరిశోధన కేంద్రాలకు, రైతులకు, క్షేత్రస్థాయిలో వినియోగిస్తున్నారు. ప్రధానంగా వర్మీకంపోస్ట్, వర్మీటెక్ యూనిట్ల ద్వారా జీవన ఎరువులను తయారు చేసి రైతులకు, వినియోగదారులకు తక్కువ ధరకే ఈ కళాశాల నుంచి విక్రయిస్తున్నారు. వర్మీ కంపోస్టు.. ఎండిన ఆకులు, ఎండిన గడ్డి, కూరగాయల చెత్త, పశువుల గెత్తంతో దీన్ని తయారు చేస్తారు. దీన్ని కాలేజీ విద్యార్థులు తయారు చేసి కిలో రూ.12 చొప్పున అమ్ముతున్నారు. ఇందులో రెండో రకం వర్మీ వాస్ కూడా ఉంది. వానపాములు విడుదల చేసే సిలోమిక్ ఫ్లూయిడ్‌ను వర్మీవాస్గా వాడుతుంటారు. లీటర్ బాటిల్ రూ.100 చొప్పున విక్రయిస్తారు. పుట్టగొడుగులు.. పుట్టగొడుగు తయారీ, సంరక్షణ, ఎరువుతో పాటు మార్కెటింగ్‌పై కూడా విద్యార్థులకు క్షణ్ణంగా వివరిస్తున్నారు. ఈ విధానాల ద్వారా విద్యార్థులు సొంతంగా పుట్టగొడుగు సాగు చేసి మార్కెట్‌కు కేజీ రూ.220 చొప్పున అమ్ముతున్నారు. పుచ్చకాయలు.. నైరా కాలేజీలో 60 సెంట్లు విస్తీర్ణంలో పుచ్చకాయలు, 10 సెంట్లు విస్తీర్ణంలో వివిధ రకాల ఆకుకూరలను విద్యార్థులు పండిస్తున్నారు. పంట చేతికి వచ్చినప్పుడు విద్యార్థులు స్వయంగా రోడ్డు మీదకు వచ్చి కూరగాయలు అమ్ముతుంటారు. పుచ్చకాయలకైతే పెట్టుబడి రూ.20వేలు పెడితే లాభం రూ.80వేలకు పైగా వస్తోంది. వీటిని కూడా విద్యార్థులే రోడ్డుకు ఇరువైపులా నించుని విక్రయిస్తున్నారు. విత్తనాలు కూడా.. ఇక్కడి విద్యార్థులు పంటలే కాదు నువ్వులు, పెసలు, ఉలవలు, రాగులు, కందులు, వరి విత్తనాలను తయారు చేస్తున్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. విత్తనాలను కృషి విజ్ఞాన కేంద్రాలకు, రైతు భరోసా కేంద్రాలకు, రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తారు. కిలో రకాన్ని బట్టి రూ.50 నుంచి రూ.200 వరకూ అమ్ముతారు. పెట్టుబడి ఇస్తాం.. రకరకాల పంటలు పండించేందుకు విద్యార్థులకు కళాశాల యాజమాన్యం కేవలం పెట్టుబడి మాత్రమే అందిస్తుంది. పండిన పంటలో 75 శాతం విద్యార్థులే తీసుకుంటారు. ఆఖరి సంవత్సరం విద్యార్థులకు ఆరు నెలలు ఇలా శిక్షణ ఉంటుంది. – సురేష్‌కుమార్, అసోసియేట్ డీన్, నైరా రైతులతో మమేకం అగ్రి బీఎస్సీ నాలుగేళ్ల కోర్సు. ఆఖరి ఏడాది ఆరు నెలల్లో మేము రైతులతో మమేకమవుతాం. పండించిన పంటను అమ్ముతాం కూడా. గ్రామాల్లో తిరిగి రైతులతో మమేకమవుతూ కొత్త పద్ధతులు కూడా నేర్పుతున్నారు. – మహమ్మద్ అబ్దుల్ రఫీ, అగ్రి బీఎస్సీ ఫైనల్ ఇయర్ -
నిరంతరం.. కొత్త రకం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానంలో ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా, ప్రకృతిపై దాడి చేస్తున్న చీడ పీడలను ఎదుర్కొనే విధంగా తక్కువ పెట్టుబడులతో అత్యధిక దిగుబడులు సాధించే సరికొత్త వంగడాలు సృష్టించడంలో ఇక్కడి శాస్త్రవేత్తలు సఫలీకృతం అవుతున్నారు. తరతరాలుగా అనుసరిస్తున్న సంప్రదాయ సేద్యం నుంచి సాంకేతిక సేద్యం వైపు రైతులను చైతన్య వంతులను చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. నెల్లూరు (సెంట్రల్): వరి సాగుకు ప్రసిద్ధిగాంచిన సింహపురి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం సహకారంతో సరికొత్త సీడ్స్‌తో హైస్పీడ్ దిగుబడులు సాధిస్తోంది. పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన ప్రదేశాలతో పాటు కార్తెలు, నక్షత్రాల పేరుతో అత్యంత జన్యుపరమైన సన్న రకాల వరి విత్తనాలు సృష్టించి రాష్ట్రంలోనే సంచలనం సృష్టిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడి శాస్త్రవేత్తలు జిల్లా వాతావరణాన్నే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా మంచి దిగుబడులు సాధించే విధంగా కొత్త రకం విత్తనాలను సృష్టించం ప్రత్యేకత. 28 రకాల వంగడాలు సృష్టి జిల్లాలో ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రస్థానం మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 28 రకాల కొత్త వరి వంగడాలను మార్కెట్లోకి తీసుకు వచ్చారు. ప్రధానంగా 1948 నుంచి కొత్త వంగడాల సృష్టిని శాస్త్రవేత్తలు ప్రారంభించారు. బీసీపీ 1, బీసీపీ 2 అనే రెండు రకాల కొత్త వంగడాలను 1948లో సృష్టించారు. బీసీపీ 3, బీసీపీ 4 రకాలను 1950లో, 1951లో బీసీపీ 5, 1965లో బీసీపీ 6, 1965లో బల్క్‌హెచ్ 9ను తయారు చేశారు. ఆ తర్వాత కొత్త మొలగొలకులు 72 అనే రకాన్ని 1977లో మార్కెట్లోకి తీసుకు వచ్చారు. 74 పేరుతో మరో కొత్త మొలగొలుకులు రకాన్ని 1977లో తీసుకు వచ్చారు. 1987లో పినాకిని ఎన్‌ఎల్‌ఆర్ 9672–96, 1988లో తిక్కన ఎన్‌ఎల్‌ఆర్ 27999, 1991లో సింహపురి ఎన్‌ఎల్‌ఆర్ 28600, శ్రీరంగ ఎన్‌ఎల్‌ఆర్ 28523, స్వర్ణముఖి ఎన్‌ఎల్‌ఆర్ 145 రకాలను, 1996లో భరణి ఎన్‌ఎల్‌ఆర్ 30491, శ్రావణి ఎన్‌ఎల్‌ఆర్ 33359, స్వాతి ఎన్‌ఎల్‌ఆర్ 33057, పెన్నా ఎన్‌ఎల్‌ఆర్ 33365 రకాలను, 1999లో సోమశిల ఎన్‌ఎల్‌ఆర్ 33358, వేదగిరి ఎన్‌ఎల్‌ఆర్ 33641, అపూర్వ ఎన్‌ఎల్‌ఆర్ 33654 రకాలను, 2002లో పర్తివ ఎన్‌ఎల్‌ఆర్ 33892, 2006లో నెల్లూరు మసూరి ఎన్‌ఎల్‌ఆర్ 34449 2009లో, స్వేత ఎన్‌ఎల్‌ఆర్ 40024 2012లో, నెల్లూరు ధాన్యరాశి ఎన్‌ఎల్‌ఆర్ 3354, నెల్లూరు సిరి ఎన్‌ఎల్‌ఆర్ 4001, నెల్లూరు సుగంధ ఎన్‌ఎల్‌ఆర్ 40054లను 2020లో సృష్టించారు. ఈ విధంగా 28 రకాల వరి కొత్త వంగడాలను జిల్లా శాస్త్రవేత్తలు జిల్లా వాసులకు అందించారు. రైతులను చైతన్య పరుస్తూ.. జిల్లాలోని రైతులను ఎప్పకప్పుడు శాస్త్రవేత్తలు చైతన్య పరుస్తూ కొత్త వంగడాలపై అవగాహన కల్పిస్తూ కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరిస్తూ వస్తున్నారు. గ్రామాల్లో పర్యటించడం కాకుండా, పరిశోధనా స్థానంలో రైతులకు అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి రైతుల అభిప్రాయాలను, సూచనలను తీసుకుని ఆ దిశగా శాస్త్రవేత్తలు కొత్త వంగడాలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కొత్త వంగడాలు ఖరీఫ్‌లో, రబీలో ఏ విధంగా వేసుకుంటే పంట సాగు బాగుంటుంది, ఎంత మోతాదులో రసాయనాలు వాడాలి అనే విధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. అన్ని విధాలుగా చేస్తున్నాం జిల్లాలోని రైతులకు అనుగుణంగా, వారికి అవసరమయ్యే విధంగా వంగడాల సృష్టిపై ప్రత్యేక దృష్టి పెట్టుతున్నాం. ఒక వంగడం పూర్తి స్థాయిలో బయటకు రావాలంటే చాలా సమయం పడుతోంది. అప్పటి వరకు అని విధాలుగా శాస్త్రవేత్తలు పరిశీలన చేసి మార్కెట్లోకి తీసుకువస్తారు. – వినీత, ప్రధాన శాస్త్రవేత్త అవగాహన కల్పిస్తున్నారు శాస్త్రవేత్తలు రైతులకు ఎప్పకప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. శాస్త్రవేత్తలు సలహాలు, సూచనలు తీసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు. కొత్త వంగడాలను సృష్టించినప్పుడు రైతులు వెనకడుగు వేస్తారు. కానీ వాటిపై పూర్తి అవగాహన కల్పిస్తే మాత్రం రైతులకు లాభదాయకంగా ఉంటుంది. – జి.చంద్రశేఖర్‌రెడ్డి, చాగణం రైతు,సైదాపురం మండలం సలహాలతో ఎంతో మేలు శాస్త్రవేత్తలు, సలహాలు, సూచనలతో రైతులకు ఎంతో మేలు ఉంటుంది. మాకు తెలిసిన పరిజ్ఞానం కన్నా, శాస్త్రవేత్తల సాంకేతి పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది కాబటి, వారి ప్రకారం నడుచుకుంటే రైతులకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. – ఎస్ సుధాకర్‌రెడ్డి, ఖాన్‌సాహెబ్‌పేట రైతు, మర్రిపాడు మండలం -
చిన్న కమతాలకు పెద్ద అండ యాంత్రీకరణ
సాక్షి, అమరావతి: పవర్ టిల్లర్లు, వీడర్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, కట్టె గానుగలు వంటి అనేక చిన్నా, పెద్ద యంత్రాల ప్రదర్శనకు గుంటూరు సమీపంలోని పుల్లడిగుంట వేదికైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆదివారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు వందలాదిమంది రైతులు హాజరయ్యారు. పరికరాల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చూసి, చేసి తెలుసుకున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల డీన్, అగ్రికల్చర్ ప్రొఫెసర్ జోసఫ్రెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రకృతి, సేంద్రియరంగ సేద్య నిపుణులు రైతులకు యంత్రపరికరాల వినియోగ అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో కమతాలు చిన్నవైనందున వాటికి తగిన యంత్రాలనే ఇక్కడ ప్రదర్శనకు పెట్టామని రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వై.వెంకటేశ్వరరావు చెప్పారు. ఆకట్టుకున్న ప్రదర్శన పత్తి, మిరప వంటి పంటల్లో కలుపు తీసే యంత్రాలు, ట్రాక్టర్ సాయంతో పెద్దఎత్తున పిచికారీ చేసే పరికరాలు, తక్కువ ఖర్చుతో 10, 12 కిలోల కూరగాయలు నిల్వచేసుకునే థర్మోకోల్ రిఫ్రిజిరేటర్లు, అంతరసేద్యం చేసే బుల్లి గొర్రు, చిన్న నాగలి, మనిషి నిల్చొనే గడ్డి పీకేసే పరికరాలు వంటివి అనేకం రైతులను ఆకట్టుకున్నాయి. పలువురు వ్యవసాయ విద్యార్థులు సొంతంగా తయారుచేసిన పరికరాలను రైతులు ఆసక్తిగా పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. ఈ రైతు పేరు పి.సాంబశివరావు. గుంటూరు జిల్లా పసుమర్రు గ్రామం. తన మోపెడ్ వాహనాన్నే సోలార్ పవర్ స్ప్రేయర్‌గా మార్చుకున్నారు. ఎక్కడైనా చేలో మందు చల్లాల్సి వచ్చినప్పుడు మోపెడ్‌కు బిగించిన 20 లీటర్ల క్యాన్‌లో ద్రావణాలను కలిపి సోలార్ పవర్ ఆధారంగా నడిచే చిన్న మోటారు సాయంతో పిచికారీ చేస్తున్నారు. మోపెడ్ మీదనే పొలానికి వెళతారు. చేలో బండి ఆపి మందును పిచికారీ చేస్తారు. మీ పంట చేలో పడిన కోతులను తరమడం పెద్ద బెడదగా మారిందా? అయితే ఇదిగో పరిష్కారం. తక్కువ ఖర్చుతో పెద్ద శబ్దం వచ్చే చిన్నపాటి ప్లాస్టిక్ గన్ను ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. దీన్ని ఎలా వాడాలో రైతులకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదో పవర్ టిల్లర్. ఎద్దులు, దున్నపోతులతో పనిలేకుండా స్వయంగా రైతే పొలాన్ని దున్నుకునే చిన్నపాటి యంత్రం. దీనిసాయంతో ఎకరం, రెండెకరాల పొలాన్ని సునాయాసనంగా దున్నవచ్చు. లీటర్ పెట్రోలు పోసుకుంటే గంటన్నరకుపైగా నడుస్తుంది. తక్కువ ఖర్చుతో అటు సమయాన్ని, ఇటు శ్రమను ఆదా చేసుకోవచ్చు. -
మన విత్తనం దేశంలోనే ఉత్తమం
సాక్షి, అమరావతి : పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ఆహార భద్రతను కల్పించాలంటే ప్రస్తుతం ఉన్న సగటు ఉత్పాదకతను పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ప్రధాన ఆహార పంట వరి. ప్రస్తుత పరిస్థితుల్లో అధిక దిగుబడిని ఇచ్చే వరి వంగడాలను సాగు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో తక్కువ విస్తీర్ణం, నీరు, పెట్టుబడులతో అధిక దిగుబడి సాధించుకోవాలి. ఇందుకు అనువైన వాతావరణంతో పాటు మేలైన విత్తనం అవసరం. ఈ అవసరాన్ని గుర్తించినందునే అధిక దిగుబడి ఇచ్చే వంగడాల రూపకల్పనకు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నడుం బిగించింది. మంచి విత్తనాలు అభివృద్ధి చేయాల్సిందిగా యూనివర్సిటీ పరిధిలోని శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తోంది. తక్కువ వ్యవధిలో ఎక్కువ దిగుబడి ఇచ్చే వంగడాలను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్తలకు అవార్డులు, రివార్డులు ఇవ్వాలని వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ఏ విష్ణువర్ధన్ రెడ్డి నిర్ణయించారు. రెండు నెలలకొకసారి జరిగే యూనివర్సిటీ అసోసియేట్ డీన్స్ సమావేశంలో ఇటీవల ఆయన ఈ విషయాన్ని ప్రతిపాదించినప్పుడు శాస్త్రవేత్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగు ► రాష్ట్రంలో సుమారు 59 లక్షల హెక్టార్ల మొత్తం సాగు విస్తీర్ణంలో దాదాపు 24.08 లక్షల హెక్టార్లలో వరి సాగవుతోంది. వ్యవసాయ రంగంలో వరి రెండంకెల వృద్ధిలో కీలక భూమిక పోషిస్తోంది. అధిక ఆదాయాన్నిస్తోంది. ► 2018–19లో 123.52 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయితే హెక్టార్‌కు సగటు ఉత్పాదకత 5,593 కిలోలుగా ఉంది. సార్వాలో హెక్టార్‌కు 5,593 కిలోల ఉత్పాదకత ఉంటే దాళ్వాలో 6,973 కిలోలుగా ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలో విత్తనాన్ని మార్చి సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. విత్తనోత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి ► రాష్ట్రంలో పెద్దఎత్తున సాగు చేస్తున్న వరి విస్తీర్ణానికి సరిపడే నాణ్యమైన విత్తనాన్ని ఏపీ విత్తనాభివృద్ధి సంస్థ గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంస్థలు గానీ, ప్రైవేటు విత్తన సంస్థలు గానీ సరఫరా చేయడం సాధ్యం కాదు. అందువల్ల రైతులే తమ పొలంలో విత్తనోత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దిశగా యూనివర్సిటీ చర్యలు చేపట్టింది. ► గుర్తించిన ఆర్బీకేల పరిధిలో రైతులకు మూల విత్తనాన్ని ఇచ్చి సొంతంగా విత్తనం తయారు చేసుకునే అవకాశం కల్పించింది. తక్కువ ఖర్చుతో నాణ్యమైన విత్తనాన్ని తయారు చేసుకుంటే తమ అవసరాలను తీర్చుకోవడంతో పాటు ఇతరులకూ విక్రయించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చని వైస్ చాన్సలర్ విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. లక్ష్య సాధనకు అనుగుణంగా చర్యలు ► వరి సాగులో నాణ్యమైన విత్తనం ఎంపిక నుంచి పంట ఇంటికి చేరే వరకు సరైన యాజమాన్య మెళకువలు పాటించేలా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాస్త్రవేత్తలపై ఉందన్న లక్ష్య సాధనకు అనుగుణంగా పని చేస్తామని శాస్త్రవేత్తలు హామీ ఇచ్చారు. ► కొత్తవి కనుగొనేలోగా ఇప్పటికే యూనివర్సిటీ పరిశోధనా కేంద్రాలు రూపొందించిన వంగడాలకు విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించారు. ► రాష్ట్రంలో సుమారు 43 రకాల వంగడాలు సార్వా, దాళ్వాలో సాగవుతున్నాయి. బాపట్ల, మార్టేరులో కనిపెట్టిన వరి వంగడాలైతే జాతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా ఖ్యాతి గాంచాయి. -
రైతుల పాలిట ఆధునిక ఆలయాలు
తెనాలి: ఏ పంట సాగు చేయాలి? ఏ పంట వేస్తే మంచి రేటుకు అమ్ముకోవచ్చు? ఈ విషయం ఎవరిని అడగాలి? విత్తనాలు ఏ విధంగా సమకూర్చుకోవాలి? మందులు, ఎరువుల మాటేమిటి? పంట చేతికొచ్చే దశలో నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బీమా ఎలా చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఊరూరా రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ను ప్రారంభించింది. ప్రస్తుతం రైతులందరికీ చక్కగా విత్తనాలు అందిస్తుండటం వినూత్నం. ప్రతి రైతుకూ తానుంటున్న ఊళ్లోనే ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్బీకేల పనితీరు ఎలా ఉందో ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలోని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె.గురవారెడ్డికి ప్రత్యక్షంగా చూడాలనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి బయలు దేరారు. వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లోని చుండూరు, అంగలకుదురు, పెదరావూరు, వల్లభా పురంలోని రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. ఆయన గమనించిన విషయాలు ఆయన మాటల్లోనే.. ఇంతలో ఎంత మార్పు..! ► పల్లెటూళ్లలో ఒక్కో ఆర్బీకేను చూడగానే అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న కుటీరంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలిగింది. పల్లె వాతావర ణాన్ని తలపించే రంగులతో తీర్చిది ద్దడం ఆహ్లాదంగా అనిపించింది. ► అతి పెద్ద మొబైల్ ఫోన్ లాంటి డిజిటల్ కియోస్క్, స్మార్ట్ ఫోనుతో అనువుగా తీర్చిదిద్దారు. నేను వెళ్లే సరికే పలువురు రైతులు అక్కడున్న వ్యవసాయ సహాయకులతో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. ► కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్ సీజనులో విస్తారంగా సాగుచేసే వరి విత్తనాల గురించి రైతులు చర్చించుకుంటున్నారు. కియోస్క్ పని తీరును స్వయంగా చూశాను. స్మార్ట్ మొబైల్ ఫోన్‌ను వినియోగించే రైతు ఎవరైనా, తానే సొంతంగా కియోస్క్‌లో కావాల్సిన విత్తన రకాన్ని బుక్ చేసుకోవచ్చు. సహాయకుల సహకారంతో కొందరు బుక్ చేసుకున్నారు. మరికొందరు సహాయకులతోనే బుక్ చేయించారు. ► విత్తనం బుక్ చేసిన 48 గంటల్లోపు డెలివరీ తీసుకొనేలా చర్యలు తీసుకున్నారు. విత్తనాలే కాదు, ఎరువులు, పురుగు మందులనూ ఇలాగే తీసుకోవచ్చని తెలిసి ఎంతో ఆనందం వేసింది. ► వ్యవసాయ రంగంలో ఇదొక నూతన అధ్యాయం.. దేశంలోనే వినూత్నమైన ముందడుగు.. ఇంతలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని రైతులు చర్చించుకోవడం కనిపించింది. ఇలా చేస్తే ఇంకా మేలు.. ► దుక్కి దున్నిన రైతులు, భూమి పదును తేలగానే విత్తనం కోసం వెతుకుతాడు. పంట వేశాక, వర్షం కురవగానే ఎరువుల కోసం దౌడుతీస్తాడు. తెగులు కనిపిం చగానే తగిన మందు కొట్టేందుకు ఆరాటపడతాడు. అలాంటి పరిస్థితుల్లో గ్రామ సచివాలయంలో డబ్బు చెల్లించి, చీటీ తీసుకురాగానే తగిన విత్తనం/ ఎరువు/ పురుగుమందు సిద్ధంగా ఉండే లా స్టాకు పాయింట్ ఏర్పాటు చేయాలని కొందరు రైతులు సూచించారు. ► వేర్వేరు చోట్ల స్థిరపడిన వారికి ఊళ్లో గల భూములను అనధికారికంగా కుటుంబ సభ్యులే కౌలు చేస్తుంటారు. ‘యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే’ అనే నిబంధన స్థానంలో ఎక్కడైనా రేషన్ తీసుకున్నట్టుగా ఓటీపీ/లెటర్/ఆధార్ సీడింగ్ ద్వారా సేవలందించగలిగితే ఎంతో మేలు. ఆధునిక పరిజ్ఞానంతో రైతులకు మేలే ► వ్యవసాయాన్నంతటినీ ఆర్బీకే అనే వ్యవస్థలోకి మళ్లించటం, సాంకేతిక పరిజ్ఞానా నికి అధిక ప్రాధా న్యత ఇవ్వటం వల్ల దళారుల ప్రాబల్యం తగ్గుతుం దన్న ఆశాభావాన్ని రైతులే వెలిబుచ్చారు. దీనివల్ల అవినీతికి ఆస్కారం లేకపోవటంతో పాటు రైతులకు మంచి జరుగుతుండటం కళ్లెదుటే కనిపించింది. ► నాడు నాగార్జునసాగర్‌ను ఆధునిక దేవాలయం అన్నారు. నేడు ఊరూరా ఉన్న రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట ఆధునిక దేవాలయాలుగా వర్ధిల్లుతాయన్న భావన కలిగింది. డీలర్ వద్దకు పరుగెత్తాల్సిన పనిలేదిక ► భూసార పరీక్షలకు తగిన సలహాలు, తోడ్పాటు, వరి విత్తే దశ నుంచి నారుమడి పెంపకం, వరి నాట్లు, ఎదిగిన పైరుకు కావాల్సిన ఎరువులు, చీడ పీడలు, దోమల నివారణకు అవసరమైన పురుగు మందు లపై తగిన సలహాలను ఇవ్వడానికి ఉద్యోగు లు సిద్ధంగా ఉండటం చూసి ముచ్చటేసింది. ► ఏదైనా పంటకు తెగులు ఆశించిందని తెలి యగానే ఇన్నాళ్లూ రైతులు పరుగెత్తుకుంటూ పురుగు మందుల డీలర్ దగ్గరకు ఇక వెళ్లాల్సిన అవసరం లేదే లేదనిపించింది. ► ఇన్నాళ్లూ ఆ వ్యాపారి తన పరిజ్ఞానంతో ఏదో ఒక మందు వాడాలని చెప్పడం.. అది సరిగా పని చేయక రైతులు నష్టపోవడం ఏటా చూశాం. ఇక ఈ పరిస్థితి ఉండదు. ఎరువుల విషయంలోనూ అంతే. వల్లభాపురంలో పలువురు రైతులు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు. రైతులకు విస్తృత ప్రయోజనాలు ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం నాది. సొంతూరు వల్లభాపురంలో వ్యవసాయం చేస్తున్నాను. మండల కేంద్రానికి వెళ్లకుండా, అన్నీ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులకు వనరులు, సలహాలు, శిక్షణ లభించటం గొప్ప విషయం. – లంకిరెడ్డి రాజశేఖరరెడ్డి, రైతు, వల్లభాపురం కాన్సెప్ట్ అద్భుతం.. రైతు భరోసా కేంద్రాల కాన్సెప్ట్ అద్భుతం. చక్కని ముందడుగు. ఎంతోకాలంగా కష్టనష్టాలు పడుతూ వ్యవసాయాన్ని వదులుకోలేక, సాగు కొనసాగిస్తున్నాం. ఏవేవో రాయితీలంటూ ఇచ్చినా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు.. రైతుల అన్ని సమస్యలకు పరిష్కారంగా తోస్తోంది. – కాకర్ల వెంకట కృష్ణయ్య, రైతు, అంగలకుదురు -
ఖరీఫ్‌కు ఐదు కొత్త వరి వంగడాలు
సాక్షి, అమరావతి: ఖరీఫ్‌లో సాగు చేసేందుకు ఐదు కొత్త వరి వంగడాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు. రాష్ట్ర పరిశోధనా కేంద్రాల నుంచి ఇటీవల కాలంలో 13 రకాల కొత్త వంగడాలను విడుదల చేసినప్పటికీ.. రాష్ట్రంలో సాగు చేసేందుకు ఆరు రకాలు మాత్రమే పనికొస్తాయని అంచనా వేసినట్టు విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ ఏఎస్ రావు ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో పనికొచ్చేవి ఐదు ► రాష్ట్ర పరిధిలో పండించేందుకు ఐదు వరి వంగడాలతోపాటు ఒకటి జొన్న వంగడం. ► వరికి సంబంధించిన ఐదు రకాల్లో ఎంటీయూ–1224 (మార్టేరు సాంబ), ఎంటీయూ–1262 (మార్టేరు మసూరి), ఎంటీయూ–1210 (సుజాత), బీపీటీ–2595 (తేజ), ఎన్‌ఎల్‌ఆర్–3354 (నెల్లూరు ధాన్యరాశి) ఉన్నాయి. ► జొన్నకు సంబంధించి వీఆర్–988 (సువర్ణ ముఖి) కొత్త వంగడం విడుదలైంది. ► దేశ పరిధిలో విడుదల చేసిన వాటిలో వరికి సంబంధించి ఎంటీయూ–1223 (వర్ష), ఎంటీయూ–1239 (శ్రావణి).. గోగు పంటకు సంబంధించి ఏఎంయూ–8, ఏఎంయూ–9 (ఆదిత్య), జొన్నకు సంబంధించి వీఆర్–929 (వేగవతి), సజ్జకు సంబంధించి ఏబీవీ–04, పత్తికి సంబంధించి ఎల్‌డీహెచ్‌పీ ఉన్నాయి. ► ఈ ఖరీఫ్‌లో కృష్ణా జోన్‌లోని రైతులు ఎంటీయూ–1061 (ఇంద్ర), బీపీటీ–5204, 2270 (భావపురి సన్నాలు), ఎంటీయూ–1075 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224 ఎంటీయూ–1262 కూడా సాగు చేసుకోవచ్చు. ► గోదావరి జోన్‌లోని రైతులు స్వర్ణ, ఇంద్ర, ఎంటీయూ–1064, పీఎల్ఏ–1100, కొత్తగా విడుదలైన ఎంటీయూ–1262, 1224 రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. ► ఉత్తర కోస్తా రైతులు స్వర్ణ, శ్రీకాకుళం సన్నాలు, బీపీటీ–5204, ఎంటీయూ–1075, శ్రీధృతితో పాటు కొత్తగా విడుదలైన ఎంటీయూ–1224, ఎంటీయూ–1210 రకాలను ఎంపిక చేసుకోవచ్చు. ► దక్షిణ మండలంలో (సౌత్ జోన్) ఎన్‌ఎల్‌ఆర్–3354, 33892తో పాటు కొత్తదైన ఎన్‌ఎల్‌ఆర్–4001, ఎంటీయూ–1224 అనువైనవి. ► తక్కువ వర్షపాత ప్రాంతాల్లో బీపీటీ–5204, ఎన్‌డీఎల్‌ఆర్–7, 8తో పాటు కొత్తవైన ఎంటీయూ–1224, బీపీటీ–2782 రకాలను సాగు చేసుకోవచ్చు. ► గిరిజన మండలాలలో స్వల్పకాలిక రకాలైన ఎంటీయూ–1153, 1156 అనువైనవి. ► ముంపు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పీఎల్ఏ–1100, ఎంటీయూ–1064 (అమర), ఎంటీయూ–1140 (భీమ) అనువైనవిగా సిఫార్సు చేశారు. చౌడు ప్రాంతాల్లో ఎంటీయూ–061తో పాటు కొత్తగా విడుదలైన ఎంసీఎం–100 వేసుకోవచ్చు. ► నాణ్యమైన విత్తనం కోసం ప్రభుత్వ లేదా ప్రభుత్వ అధీకృత సంస్థలను సంప్రదించడం మంచిది. ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా నాణ్యమైన విత్తనాన్ని అందిస్తున్నది. ► స్వయంగా రైతులు తయారు చేసుకున్న విత్తనాలను కూడా వాడుకోవచ్చు. ► విత్తనం సంచి లేబుల్ మీద కనీసం 80 శాతం మొలక శాతం వుందో లేదో చూసుకోవాలి. -
ఆచార్య ఎన్జీరంగా వర్సిటీలో కలకలం
సాక్షి, గుంటూరు రూరల్ : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ వి.దామోదర్‌నాయుడు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్టు కావడం ఆదివారం కలకలం సృష్టించింది. ‘తాను చెప్పిందే వేదం. చేసిందే చట్టం. తనకు ఎదురులేదు. అడ్డొస్తే ఎవరైనా సరే బదిలీ, లేదా డెప్యూటేషన్‌పై శంకరగిరి మాన్యాలే’ అన్నంతగా వీసీ వ్యవహారం సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. వైస్ చాన్సలర్ డాక్టర్ వి.దామోదర్‌నాయుడును ఆదివారం సాయంత్రం తుళ్లూరు డీఎస్పీ వి.శ్రీనివాసరెడ్డి అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు. వీసీని అరెస్ట్ చేశారన్న వార్త దావానంలా వ్యాపించి వర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది. వీసీ అక్రమాలకు, అరాచకాలకు బలై డెప్యూటేషన్లు, బదిలీలపై వెళ్లిన, జరిమానాలు చెల్లించిన బాధితుల్లో ఒకింత ఆనందం వ్యక్తమైంది. అంతా ఏకపక్షం వీసీ దామోదర్‌నాయుడు ఒకే సామాజిక వర్గానికి కొమ్ముకాస్తూ, మిగిలిన బడుగు, బలహీన వర్గాలకు చెందిన ఉద్యోగులు లాం ఫాంలోని యూనివర్సిటీ కాంపౌండ్‌లో ఉండటానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసిన ఘటనలు ఉన్నాయని బాధితులు పేర్కొంటున్నారు. తనకు ఎదురు చెప్పిన ఎందరినో ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. ఆరు నెలల క్రితం వర్సిటీ సిబ్బంది 453 మంది వీసీ అరాచకాలకు బలయ్యామంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దేశ చరిత్రలో ఒక వీసీపై ఇంతటి భారీస్థాయిలో సిబ్బంది, ఉద్యోగులు ఫిర్యాదులు చేసిన ఘటనలు ఉండి ఉండకపోవచ్చు. అప్పట్లో టీడీపీ అధికారంలో ఉండటంతో అంతమంది సిబ్బంది ఫిర్యాదులు చేసినా వీసీపై కనీస చర్యలు కరువయ్యాయి. ఓ రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తనకు బాగా తెలుసని, ఆయనదీ, తనదీ ఒకే ఊరని, తనను ఎవరూ ఏమీ చేయలేరని వీసీ బహిరంగంగా వ్యాఖ్యానించారు. తనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయటంతోపాటు బదిలీ చేశారన్న ఫిర్యాదులు అందాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నో అపాయింట్మెంట్ దామోదర్‌నాయుడు వీసీగా పనిచేసిన కాలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన ఉద్యోగులు, సిబ్బందికి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇచ్చేవారు కాదని ఆరోపణలు ఉన్నాయి. వీసీ పీఏ సైతం వచ్చిన వారు ఎవరో తెలుసుకుని ఓ సామాజికవర్గం వారు కాకుంటే అపాయింట్మెంట్ సిద్ధం చేసేవారు కాదని సిబ్బంది, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇతర వర్గాల వారు కలిసేందుకు వస్తే పీఏ కూడా అంగీకరించేవారు కాదన్న అంశం అప్పట్లో చర్చనీయాంశమైంది. పది రోజులకుపైగా విచారణ వీసీపై ఆరోపణలు, ఫిర్యాదుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్ అధికారి ప్రద్యుమ్నతో సింగిల్‌మన్ కమిటీని నియమించి, విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 500 మందికిపైగా వీసీ బాధితులు సుమారు పది రోజులపాటు తమకు జరిగిన అన్యాయాలను ప్రద్యుమ్న ఎదుట ఏకరువుపెట్టారు. ఈ క్రమంలో బాధితులు రాష్ట్ర గవర్నర్‌కు సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే తన ఊరికి చెందిన ఉన్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి అండ ఉండగా, తనను ఎవరూ ఏమీ చేయలేరని పలుమార్లు ఉన్నతాధికారులను వీసీ బెదిరించారని సమాచారం. అంతటా వీసీ అరెస్టుపై చర్చ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధలో ఉన్న కార్యాలయాలు, కళాశాలల్లో వీసీ అరెస్టు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. వీసీ నిరంకుశత్వం, ఏకపక్ష వైఖరి, నిర్లక్ష్య «ధోరణి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైంది. వీసీ కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే కొమ్ముకాస్తూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసేవారని అంతటా చెప్పుకున్నారు. ఉన్నత స్థాయి అధికారులను సైతం మాజీ సీఎం చంద్రబాబు తన క్లాస్మెంట్, కీలక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి తన జిల్లావాసి అంటూ వీసీ బెదిరించేవారని, ఎట్టకేలకు తగిన శాస్తి జరిగిందని పేర్కొంటున్నారు. -
రైతన్నకు అండగా..నంద్యాల బ్రాండ్ ఉండగా
వాతావరణ మార్పులు.. గతి తప్పుతున్న రుతుపవనాలు.. అకాల వర్షాలు.. ఉష్ణోగ్రతలు పెరగడం.. నీటి వనరులు తగ్గడం.. ఇలా ఎన్నో పరిణామాలతో కొన్నేళ్లుగా వ్యవసాయం తిరోగమనం దిశగా పయనిస్తోంది. పంటల సాగులో రైతులకు వరుసగా నష్టాలే. ఈ క్రమంలో వాతావరణ పరిస్థితులను ఎవరూ మార్చలేరు. ఆ పరిస్థితులను అధిగమించే నూతన వంగడాలను సృష్టించడమే వ్యవసాయ శాస్త్రవేత్తల లక్ష్యం. ఈ మేరకు నంద్యాల ( ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం) ఆర్‌ఏఆర్‌ఎస్ శాస్త్రవేత్తలు నూతన వంగడాల ఆవిష్కరణలో ముందంజలో ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా, తెగుళ్ల బారిన పడకుండా.. అధిక దిగుబడి వచ్చేలా నూతన వంగడాలను సృష్టిస్తున్నారు. వ్యవసాయంలో రైతులు రాణించేలా మేలు రకం విత్తనాలు అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నంద్యాల పరిశోధన కేంద్రానికి మంచి గుర్తింపు తెస్తున్నారు. సాక్షి, నంద్యాల : ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం 1906లో నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో 125 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. 25 ఎకరాలలో భవనాలు ఉండగా మరో 100 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తూ పరిశోధనలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పది పంటలపై పరిశోధన కొనసాగుతుంది. దాదాపు 25 మంది శాస్త్రవేత్తలు ఇక్కడ పని చేస్తున్నారు. ఈ పరిశోధన కేంద్రానికి 2017లో గుంటూరు ఆచార్య విశ్వవిద్యాలయం నుంచి బెస్ట్ పరిశోధన సంస్థగా అవార్డు దక్కింది. ఇక్కడ ఆవిష్కరించిన పత్తి, నంద్యాల సోనా వంగడాలకు రాష్ట్ర వ్యాప్తంగా పేరొందాయి. 1950లో పత్తి, 1980లో జొన్న, పొద్దుతిరుగుడు, శనగ, పొగాకు, తదితర పంటలపై పరిశోధనలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక పంటలపై పరిశోధనలు చేయడం, వాటి గురించి రైతులకు అవగాహన కల్పించడం, ఆ మేరకు కొత్త వంగడాలను సృష్టించడంలో ఆర్‌ఏఆర్‌ఎస్‌కు మంచి గుర్తింపు వచ్చింది. పత్తి, పొద్దుతిరుగుడు, చిరుధాన్యాలు, పొగాకు, శనగ, జొన్న, వరిలో అధిక దిగుబడులు వచ్చే నూతన వంగడాలను సృష్టించి అరుదైన ఖ్యాతిని సొంతం చేసుకున్నారు. నంద్యాల శాస్త్రవేత్తలు రామారెడ్డి, విజయలక్ష్మి, గాయత్రి, జాఫర్‌బాషా తదితరులు నూతన వంగడాల ఆవిష్కరణలను వివరించారు. శనగకు నంద్యాల బ్రాండ్.. రాయలసీమలో శనగ పంటను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ పంటకు ఉన్న ప్రాము ఖ్యతను గుర్తించి 2009లో నంద్యాల పరిశోధన స్థానంలో అధిక దిగుబడి వచ్చే మేలైన విత్తనాల ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. 2012లో నంద్యాల శనగ–1, 2015లో నంద్యాల ధీర, 2016న నంద్యాల గ్రామ్–49, 2015లో నంద్యాల గ్రామ్–119 శనగ విత్తనాలను ఆర్‌ఏఆర్‌ఎస్ నుంచి ఉత్పత్తి చేశారు. ఈ విత్తనాలను ఎక్కడ వాడినా నంద్యాల పేరు గుర్తుండాలనే ఉద్దేశంతో పేరుకు ముందుగా నంద్యాలను చేర్చినట్లు తెలుస్తోంది. శనగను ఇంగ్లిష్‌లో బెంగాల్ గ్రామ్ను అంటారు. అందుకే నంద్యాల గ్రామ్–119, నంద్యాల గ్రామ్–49 పెట్టారు. నూతన వంగడాలకు 1, 2 తడులు నీరు పెడితే చాలి. ఈ రకాలు దృఢమైన వేరువ్యవస్థ నీటి బెట్ట, ఎండ తెగులును తట్టుకుంటాయి. శనగ గింజ బరువు 38 నుంచి 40 గ్రాములు ఉంటుంది. వర్షాధారం నేలలు అయితే ఎకరాకు 10 నుంచి 11 క్వింటాళ్లు, మిగిలిన పొలాల్లో ఎకరాకు ఏడెనిమిది క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. వీటి పంట కాలం 90 నుంచి 105 రోజులు. వ్యవసాయ యాంత్రీకరణ.. కొత్త వంగడాలను సృష్టించడంతో పాటు రైతులకు అవసరమైన యంత్రాలను ఆర్‌ఏఆర్‌ఎస్‌లో తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారు చేసిన 16హెచ్‌పీ ట్రాక్టర్‌తో అనుసంధానం చేసే పరికరాలు, రెండు చెక్కల నాగలి, ఆరు చెక్కల కల్టీవేటర్, ఐదు చెక్కల విత్తనం, ఎరువు వేసే పరికరం, పంట నూర్పిడి, క్రిమి సంహారక మందు పిచికారీ యంత్రాలు రైతులకు ఎంతో ఉపయోగపడు తున్నాయి. శిక్షణ.. అవగాహన ఈ కేంద్రంలో పని చేసే శాస్త్రవేత్తలు ప్రతి నెల రైతులకు పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చీడ, పీడల యాజమాన్యంపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేగాకుండా చుట్టుపక్కల రైతులు వేసిన పంట పొలాలను పరిశీలించి వాటికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మట్టి, నీటి నమూనాల పరీక్షలు నిర్వహించి అధిక దిబడులు సాధించేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నారు. పత్తికి పుణ్యక్షేత్రాల పేర్లు జిల్లాలో రైతులు అధిక విస్తీర్ణంలో వరి, శనగ, పత్తి పంటలు సాగు చేస్తారు. ఈ మేరకు పత్తి రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు ఇక్కడ ఎన్నో పరిశోధనలు చేసి నూతన వంగడాలను సృష్టించారు. 2012లో శివనంది, శ్రీరామ 2015–16లో ఉత్పత్తి చేశారు. వీటికి నరసింహ, శివనంది, యాగంటి, అరవింద, శ్రీనంది వంటి పేర్లు పెట్టడానికి ఇక్కడ ప్రసిద్ధి గాంచిన దేవాలయాలు ఉండటం కారణం. అరవింద, శివనంది రకాలకు ఎర్రనేలలు, యాగంటి, నరసింహ, శ్రీరామ రకాలకు నల్లరేగడి నేలలు అనువైనవి. రసం పీల్చే పురుగులు, కాయతొలిచే పురుగులు, గులాబీ రంగు పురుగును ఈ వంగడాలు ఎదుర్కొంటాయి. ఎకరాకు 8 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. శ్రీరామ రకం పంట విత్తనాలు ఏడు రాష్ట్రాలకు ఎగుమతి అయి ఆ రాష్ట్రాల్లో పంటలు పండిస్తున్నారు. సన్నని సోనాలు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం నుంచి 2016లో విడుదలైన నంద్యాల సోనా రాష్ట్ర వ్యాప్తంగా పేరుగాంచింది. నంద్యాల సోనా కాలపరిమితి 130 నుంచి 140 రోజులు ఉంటుంది. గింజ చాలా సన్నగా ఉండి బియ్యం రుచిగా ఉంటుంది. ఈ బియ్యంలో ఇతర బియ్యాన్ని కల్తీ చేయడానికి సాధ్యం కాదు. వీటికి చీడపీడ తెగుళ్లు తక్కువ, అగ్గితెగులు, ముడత తెగులును తట్టుకుంటాయి. ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. కర్నూలు, కడప, గుంటూరు, నిజామాబాద్, రంగారెడ్డి, కర్ణాటక వంటి ప్రాంతాల్లో నంద్యాల సోనా బాగా ప్రాచుర్యం పొందింది. నాణ్యమైన పొగాకు 1992లో తూర్పుగోదావరి జిల్లా వెంకటరామన్న గూడెం నుంచి అఖిత భారత పొగాకు సమన్వయ పథకం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి మార్చారు. నంద్యాల పొగాకు–1 2015లో ఉత్పత్తి చేశారు. మూడు కేజీల విత్తనాలు ఎకరాకు నారువేస్తే 150 నుంచి 200 ఎకరాలకు విత్తనాలు వస్తాయి. అదే విధంగా నాటు పొగాకు, బీడీ పొగాకులు పరిశోధనల సహకారంతో విడుదల చేశారు. ఈ పంటను సెప్టెంబర్, అక్టోబర్ నెలలో 70 సెం.మీ దూరంలో మొక్క నాటుకోవడం వలన అధిక దిగుబడులు వస్తాయి. రసం పీల్చే పురుగు, లద్దెపురుగు వంటి వాటిని ఈ పంట తట్టుకుంటాయి. ఈ పంటలపై అధిక దిగుబడి, నాణ్యతలపై పరిశోధనలు పురోగతిలో ఉన్నాయి. బెస్ట్ పరిశోధన కేంద్రంగా అవార్డులు నంద్యాల వ్యవసాయ పరిశోధన కేంద్రంలో 14 సంవత్సరాలు పని చేశాను. 12 సంవత్సరాలు శాస్త్రవేత్తగా, రెండు సంవత్సరాలు ఏడీఆర్‌గా పని చేశా. నా హయాంలో శనగలు నాలుగు రకాలు, కొర్రలు మూడు రకాలు, జొన్నలు రెండు రకాలు, పొగాకు ఒక రకం వంగడాలను విడుదల చేశాను. నా హయాంలో విడుదల చేసిన నంద్యాల సోనా బియ్యానికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. రాష్ట్రంలో పది పంటలపై పరిశోధనలు చేసి కొత్త వంగడాలను సృష్టిస్తున్న ఒకే ఒక పరిశోధన స్థానం నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రాంతీయ కేంద్రమే. – గోపాల్‌రెడ్డి, రిటైర్డు ఏడీఆర్ -
అగ్రికల్చర్ యూనివర్సిటీలో రోడ్డు ప్రమాదం
రాజేంద్రనగర్: ప్రొఫెసర్జయశంకర్ వ్యవసాయ వర్సిటీ క్యాంపస్‌లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి తీవ్ర గాయాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే.. వర్సిటీలో మొదటి సంవత్సరం చదువుతున్న రాహుల్æ(22) తన సీనియర్‌కు చెందిన రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాన్ని తీసుకోని రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బయటకు వెళ్లేందుకు బయల్దేరాడు. 90 కిలోమీటర్ల వేగంతో దూసుకువచ్చిన ఎన్ ఫీల్డ్ వాహనం మూసి ఉన్న వర్సిటీ ప్రధాన గేట్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో రాహుల్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం పక్కనే ఉన్న ఫుట్‌పాత్‌పై ఎగిరి పడ్డాడు. అదే సమయంలో దారి గుండా వెళ్తున్న యువకులు రక్తపు మడుగులో పడి ఉన్న రాహుల్‌ను గమనించి 108కు సమాచారం అందించారు. రాహుల్ సెల్‌కు వచ్చి న ఫోన్‌ను రిసీవ్ చేసి విషయాన్ని తెలపడంతో విద్యార్థులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. 108 సిబ్బంది గాయపడిన రాహుల్‌కు ప్రథమ చికిత్స నిర్వహించి ఉస్మానియాకు తరలించారు. ప్రమాదంలో ఎన్ఫీల్డ్ ముందుభాగం ధ్వంసం కాగా, గేటు సైతం విరిగిపోయింది. తోటి విద్యార్థులు రాజన్న జిల్లాకు చెందిన రాహుల్ తండ్రి నర్సింలుకు సమాచారం అందించడంతో బుధవారం తెల్లవారుజామున కుటుంబీకులు ఉస్మానియా ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్త# చేస్తున్నారు. -
అన్యాయం.. ఆచార్యా!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వసతి గృహాల నిర్వహణ గందరగోళంగా మారింది. బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనె తదితర వస్తువుల కొనుగోలు, వాటిధరలకు సంబంధించి రికార్డుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హాస్టళ్ల నిర్వహణను నిరసిస్తూ విద్యార్థులు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బాలుర వసతి గృహాల వ్యవహా రాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. వసతి గృహాల నిర్వహణలో మితిమీరిన అవినీతి జరుగుతోందని విద్యార్థులు వరుసగా ఆరోపణలు చేస్తున్నారు. వసతుల కల్పన, అధిక బిల్లులు, వసతి గృహాలకు సంబంధించిన ఆహార పదార్థాల కొనుగోలు, వసతి గృహాల్లో భోజనం చేసే విద్యార్థుల సంఖ్య, వారికి వచ్చే మెస్ బిల్లులు, వీటికి సంబంధించిన రికార్డులు, స్టాక్ రిజిస్టర్ల నమోదు వంటి అంశాలపై స్పష్టత లేదనివిద్యార్థులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే తమకు ఇక్కడ అధికంగా వస్తున్న మెస్ బిల్లులు భారంగా మారాయని విద్యార్థులు వాపోతున్నారు. బాలుర వసతి గృహాల్లో అవినీతిని నిర్మూలించాలని, అధికంగా వస్తున్న మెస్ బిల్లులను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఎన్‌యూ బాలుర వసతి గృహాల విద్యార్థులు సోమవారం వసతి గృహాల్లో ధర్నాకు దిగారు. ఉదయం అల్పాహారాన్ని బహిష్కరించి వసతి గృహాల కామన్ డైనింగ్ హాల్ ఎదుట బైఠాయించారు. కామన్ డైనింగ్ హాల్, వసతి గృహాలకు వెళ్ల ద్వారాల గేట్లకు తాళాలు వేసి ఆందోళనకు దిగారు. అధి కారుల అవినీతిని నిర్మూలించాలని, మెస్ బిల్లులు తగ్గించాలని నినాదాలు చేశారు.న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. కొనుగోళ్లు, మెస్ చార్జీలపై గందరగోళం వసతి గృహాల్లో విద్యార్థులకు వండే భోజన పదార్థాల కోసం బియ్యం, కూరగాయలు, పప్పులు, నూనె తదితర వస్తువుల కొనుగోలు, వాటి ధరలు, నాణ్యత సరిగా ఉండటం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఏ రోజు ఎన్ని కిలోల బియ్యం వండారు? ఎన్ని కిలోల కూరగాయలు వాడారు? ఇతర పదార్థాలు ఎన్ని వాడారు? అసలు ఎంత మంది విద్యార్థులు భోజనం చేశారు? అన్న అంశాలపై స్పష్టత ఉండటం లేదని, సంబంధిత రికార్డుల్లో సరిగా నమోదు చేయడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బిల్లులు వేసే సమయంలో సంబంధిత అధికారులు ఇస్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. వసతి గృహాల్లో లెక్కలు చూపాలని అడిగిన వారిపై చీఫ్ వార్డెన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ బిల్లులు వేసి తగ్గిస్తారంట వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు సంవత్సరానికి రూ.3600 నుంచి రూ.4 వేల వరకు ఎక్కువ వేసి వసూలు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. వసతి గృహాల్లో రెండు వేల మంది వరకు విద్యార్థులు ఉంటున్నారని, వారి నుంచి ఇలా అధికంగా బిల్లులు వసూలు చేయడం పరి పాటిగా మారిందని ఆరోపిస్తున్నారు. ఇతర యూనివర్సిటీల్లో వారానికోసారి మాంసాహారం పెట్టినా బిల్లు నెలకు రూ.1600లకు మించడంలేదని ఇక్కడ శాఖాహార భోజనం పెట్టి నెలకు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. బిల్లులు అధికంగా రావడంతో సందేహం వచ్చిన విద్యార్థులు కొనుగోళ్లు, మెస్ చార్జీల రికార్డులను పరిశీలించగా కొనుగోళ్ల వివరాలు, నెలసరి చార్జీల నమోదులో లోపాలు ఉన్నాయని గుర్తించారు. ఈ లోపాలపై చీఫ్ వార్డెన్ తదితర అధికారులను నిలదీయగా బిల్లులు తగ్గిస్తామని బదులిచ్చారు. అవకతవకలను సరిచేయకుండా బిల్లులు తగ్గిస్తామనడం ఏమిటని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. నిర్వహణ పేరుతో నెలకు ప్రతి విద్యార్థి నుంచి రూ.200 వసూలు చేస్తున్నారని, వాటిని విద్యుత్ దీపాలు, తదితర పరికరాల కొనుగోలుకు వాడుతున్నామంటూ హాస్టల్ అధికారులు చెబుతున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ బల్బులు, ఇతర పరికరాల కొనుగోలుకు యూనివర్సిటీ నుంచి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నారని, తమ నుంచి వసూలు చేసిన మొత్తం కొందరి జేబుల్లోకి వెళ్తోందని ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.36 లక్షల అవినీతి జరిగిందని కూడా విద్యార్థులు విమర్శిస్తున్నారు. వీటిన్నింటిపై అధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చనందునే సమస్య జటిలమవుతోందని వివరిస్తున్నారు. -
డిగ్రీకి క్లస్టర్ పజిల్!
ప్రకాశం, బేస్తవారిపేట: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీసుకుంటున్న నిర్ణయాలతో డిగ్రీ కళాశాలల విద్యార్థులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. ఈ విద్యా సంవత్సరం మధ్యలో 6వ సెమిస్టర్‌కు క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఫైనల్ ఇయర్లో 5, 6 సెమిస్టర్లు విద్యార్థులు రాయాల్సి ఉంది. అయితే విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక.. అక్టోబర్‌లో 6వ సెమిస్టర్లో భాగంగా సీబీసీఎస్ (ఛాయిస్ బేస్డు క్రెడిట్ సిస్టమ్) క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో సర్వత్రా ఆందోళన నెలకొంది. తృతీయ సంవత్సరంలో ఆరు పేపర్లుంటాయి. సైన్స్ (బీఎస్సీ, బీజెడ్సీ) విద్యార్థులు బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లలో ఎదైనా ఒక సబ్జెక్ట్‌లో మూడు పేపర్లను ఎంపిక చేసుకోవాలి, మిగిలిన మూడు పేపర్లు మూడు సబ్జెక్ట్‌ల్లో ఒక్కోటి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. అందుబాటులో లేని పుస్తకాలు ఆన్లైన్లో నవంబర్ నెలలో క్లస్టర్ పేపర్ల వివరాలు, సిలబస్‌ను యూనివర్సిటీ వెబ్సైట్లో పెట్టారు. సిలబస్ పూర్తిగా కొత్తగా, లోతైన టాపిక్లతో ఉంది. దీనిని బోధించేందుకు సరైన పుస్తకాలు లేకపోవడంతో అధ్యాపకులు కూడా తలలు పట్టుకున్నారు. అందుబాటులో ఉన్న టాపిక్‌లను చెప్పి పుస్తకాల కోసం ఎదురుచూస్తున్నారు. అకాడమీ పుస్తకాలు, ప్రైవేట్ పబ్లికేషన్స్ క్లస్టర్ సిలబస్ పుస్తకాలను నేటికీ విడుదల చేయలేదు. యూనివర్సిటీ అనాలోచితన నిర్ణయం ఏడాది ప్రారంభంలో కాని, వచ్చే ఏడాదికాని క్లస్టర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింటే విద్యార్థులకు, అధ్యాపకులకు ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. ఫైనల్ ఇయర్ మధ్యలో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకోవడంతో సిలబస్ చెప్పలేక అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రెండు నెలల వ్యవధి గడిచిపోయింది. ఏ ఒక్క సబ్జెక్ట్‌లో కనీసం సగం సిలబస్ పూర్తి చేసే పరిస్థితి లేదు. విద్యార్థుల పరిస్థితి ఇలా.. యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో చదువుతున్న తృతీయ సంవత్సర విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. మొదటి, రెండో సంవత్సరాల్లో సబ్జెక్ట్‌లు మిగిలినా పెద్ద నష్టం ఉండదు. కానీ ఫైనల్ ఇయర్లో సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయితే పట్టా కోల్పోవాల్సిన వస్తుందని ఆందోళన చెందుతున్నారు. మార్చిలో పరీక్షలు పెడితే తీవ్ర నష్టం ఇప్పటికి కూడా పుస్తకాలు అందుబాటులోకి రాకపోవడంతో మార్చి నెలలో పబ్లిక్ పరీక్షలు పెడితే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. జనవరి నెలలో సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఫిబ్రవరిలో ప్రాక్టిల్స్ ఉంటాయి. ఈనెల చివరికి ప్రైవేట్ పబ్లికేషన్ పుస్తకాలను మార్కెట్లోకి విడుదల చేసిన సిలబస్ పూర్తి చేసేందుకు సరైన సమయంలేదు. హడావుడిగా అధ్యాపకులు సిలబస్‌ను పూర్తిచేసిన విద్యార్థులు చదువుకునేందుకు సమయం ఉండదు. యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని పరీక్షలను మార్చిలో నిర్వహించకుండ వాయిదావేయాలని విద్యార్థులు, అధ్యాపకులు కోరుతున్నారు. -
‘అర్హత లేకున్నా వారసత్వ రాజకీయాలు..’
సాక్షి, నెల్లూరు: ప్రభుత్వం ప్రాజెక్టులపై శ్రద్ధపెట్టడం లేదని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేస్తే ఫలితాలు రైతులకు అందుతాయని ఆయన అన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయం విశ్వవిద్యాలయం 49వ స్నాతకోత్సవంలో బుధవారం మాట్లాడారు. కొందరు రాజకీయ నాయకులు తమ సంతానాన్ని అర్హత లేకున్నా రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని తెలిపారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా లభించటం లేదని చెప్పారు. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉభయ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూడా పాల్గొన్నారు. భారత 13వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ముప్పవరపు వెంకయ్య నాయుడు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పుట్టినవాళ్లలో.. ఉపరాష్ట్రపతి చేపట్టిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు. -
అగ్రిసెట్ ఫలితాలు విడుదల
చింతపల్లి విద్యార్థికి ప్రథమ ర్యాంకు... తెలంగాణ విద్యార్థికి మూడో ర్యాంకు సాక్షి, అమరావతి/గుంటూరు రూరల్: ప్రస్తుత విద్యా సంవత్సరానికి నిర్వహించిన అగ్రిసెట్–2017 పరీక్షా ఫలితాలను ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ వల్లభనేని దామోదర నాయుడు శనివారం గుంటూరుకు సమీపంలోని లాంఫారంలో విడుదల చేశారు. 184 సీట్లకు (112 ప్రభుత్వ, 72 ప్రైవేటు) నిర్వహించిన పరీక్షకు తెలంగాణకు చెందిన 512 మంది సహా 2969 మంది విద్యార్థులు హాజరయ్యారు. వ్యవసాయ, విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అగ్రికల్చరల్ బీఎస్సీలో చేరేందుకు ఎంసెట్‌కు బదులుగా అగ్రిసెట్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 184 సీట్లలో 149 వ్యవసాయ డిప్లొమా విద్యార్థులకు, 35 విత్తన సాంకేతిక పరిజ్ఞాన డిప్లొమా విద్యార్థులకు కేటాయించారు. వ్యవసాయ డిప్లొమా అభ్యర్థుల్లో ప్ర«థమ ర్యాంకు చింతపల్లి వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి కిల్లాడి గిరీశ్ కుమార్, రెండో ర్యాంకు అనకాపల్లికి చెందిన పి.వీరబాల రాజు, తృతీయ ర్యాంకు నంద్యాలకు చెందిన కె.ఉమేశ్ సాధించారు. విత్తన సాంకేతిక పరిజ్ఞానంలో ప్ర«థమ ర్యాంకు జంగమేశ్వరపురం విద్యార్థిని కుమారి ఎం.సంధ్యారాణి, ద్వితీయ ర్యాంకు కె.గోవింద్, తృతీయ ర్యాంకు కె.స్రవంతి (రుద్రూరు, తెలంగాణ) సాధించారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.a nfrau.ac.in లో తెలుసుకోవచ్చు. ఫలితాల ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టీవీ సత్యనారాయణ, అగ్రిసెట్ కన్వీనర్ డాక్టర్ టీసీఎం నాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డెక్కిన అగ్రి విద్యార్థులు
► గుంటూరు జీటీ రోడ్డుపై రాస్తారోకో ► ప్రభుత్వ తీరుపై ధ్వజం కొరిటెపాడు(గుంటూరు): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులు ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం గుంటూరు జీటీ రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. వ్యవసాయ కళాశాలల విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులంతా ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం లేనిపోని జీవోలతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. వ్యవసాయ రంగంపై మక్కువతో బీఎస్సీ ఏజీ కోర్సు పూర్తి చేశామని, రాష్ట్రంలో తగినన్ని సీట్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న యూజీసీ గుర్తింపు ఉన్న విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నామన్నారు. యూజీసీ గుర్తింపు ఉన్న విద్యాసంస్థలకు ఐసీఏఆర్ గుర్తింపు అవసరం లేదన్నారు. కానీ రాష్ట్రంలో ఏ ఉద్యోగానికి హాజరైనా ఐసీఏఆర్ గుర్తింపు లేని కళాశాలలో విద్యనభ్యసించారని అభ్యంతరాలు తెలుపుతున్నారన్నారు. తమను జీఆర్ఎస్, ఎస్ఆర్ఎఫ్, ఏఆర్‌ఎస్బీ, నీట్ వంటి పరీక్షలకు అనుమతించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఎప్పటికీ నిరుద్యోగులుగానే మిగిలిపోవాల్సిన పరస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి జీవో నెం 64పై హైకోర్టు సస్పెన్షన్ ఎత్తివేయించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం నగరపాలెం పోలీసులు రాస్తారోకో వద్దకు వచ్చి వారించడంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అనేక పరిణామాల తర్వాత రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనరేట్ కార్యాలయంలోని డీడీ అడ్మిన్ భగత్‌స్వరూప్‌కు విద్యార్థులు సమస్యలపై వినతిపత్రం అందించారు. -
కురుక్షేత్ర సభపై నిఘా
♦ ఎక్కడికక్కడే ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్టు చేసేందుకు సన్నద్ధం ♦ ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ♦ వివరాలు గోప్యంగా ఉంచుతున్న వైనం ♦ సభా ప్రాంగణాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు ఏఎన్‌యూ పట్నంబజారు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా నేడు తలపెట్టిన మాదిగ కురుక్షేత్ర మహాసభకు అనుమతి లేదని పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో గుంటూరు నగరంతోపాటు అనేక ప్రాంతాల్లో ఎమ్మార్పీఎస్ నేతల కదలికలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. గురువారమే హైదరాబాద్ నుంచి గుంటూరు వచ్చిన జాతీయ కళాకారుల బృందానికి చెందిన ఆరుగురిని గుంటూరు నగరంలోని ఓ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంచినట్లు తెలిసింది. ఎమ్మార్పీఎస్ నేతలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఈ క్రమంలో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ), ఇంటిలిజెన్స్, కౌంటర్ ఇంటిలిజెన్స్, కిక్‌రియాక్షన్ టీమ్ (క్యూఆర్టీ) బృందాలను రంగంలో దింపినట్లు సమాచారం. అయితే అర్ధరాత్రి నుంచి సభా సమయం ముగిసే వరకు ఎమ్మార్పీఎస్ ముఖ్యనేతలను నిలువరించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో సభను నిర్వహించాలనే ఉద్దేశంతో ఎమ్మార్పీఎస్ నాయకులు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణం వద్ద పోలీసు బలగాలు అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఏపీఎస్పీ బెటాలియన్, ఆర్మ్డ్ రిజర్వుడుతోపాటు ఆయా స్టేషన్లకు చెందిన అధికారులు, వెయ్యి మందికిపైగా పోలీసులు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడ ప్రతి వ్యక్తీ కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నారు. సభా ప్రాంగణంలో భద్రత ఏర్పాట్లను గురువారం గుంటూరు రేంజ్ డీఐజీ కే.వీ.వీ.గోపాలరావు, అర్బన్ ఎస్పీ సి.హెచ్.విజయారావు, మంగళగిరి డీఎస్పీ గోగినేని రామాంజనేయులు పర్యవేక్షించారు. రాత్రి సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. పోలీసుల బలగాలకు యూనివర్సిటీతోపాటు, పరిసర ప్రాంతాల్లో వసతి కల్పించారు. -
యుద్ధ ప్రాతిపదికన ప్లీనరీ ఏర్పాట్లు
► వర్షాలతో ఏర్పాట్లకు అంతరాయం ► సభా ప్రాంగణంలోకి చేరిన వర్షపు నీరు ► గాలులతో కింద పడిన రేకులు ► శరవేగంగా పునరుద్ధరణ పనులు ► పనుల్లో నిమగ్నమైన కమిటీ సభ్యులు ► బుధవారానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడి ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో జరుగనున్న వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఏర్పాట్లలో స్వల్ప అంతరాయం ఏర్పడినప్పటికీ సమస్యలను అధిగమించి నాయకులు పనులు చేయిస్తున్నారు. వర్షంతో ప్లీనరీ సమావేశ మందిరం, భోజనశాల, వంటశాల ప్రాంగణాల్లో చేరిన నీటిని మంగళవారం కార్మికులు బయటకు తోడించారు. బలంగా వీచిన గాలులకు పైకప్పు రేకులు లేవడంతో సిబ్బందిని వాటిని సవరించారు. ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘరాం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షణలో కార్మికులు, సిబ్బంది ఏర్పాట్లను పునరుద్ధరిస్తున్నారు. సమావేశ మందిరం పైకప్పు లోపలి భాగంలో తిరిగి పార్టీ జెండా రంగు ఉన్న పతకాలతో అలంకరణ పనులు చేయిస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద కొత్త మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. రోలర్లతో సభా ప్రాంగణాన్ని చదును చేయిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బుధవారం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఏర్పాట్ల కమిటీ చైర్మన్ తలశిల రఘురాం తెలిపారు. ఉత్సాహంగా కార్యకర్తలు.. వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ ఏర్పాట్లలో పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. అలంకరణ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు, సేవాదళ్ కార్యకర్తలు రేయింబవళ్లూ పని చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు. కృష్ణా డెల్టా కమిటీ మాజీ చైర్మన్, పార్టీ నాయకుడు సతీష్‌రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు.. ప్లీనరీ ప్రాంగణంలో ప్రస్తుతం నిపుణులు, సిబ్బంది అలంకరణ పనులు చేస్తున్నారు. సమావేశ వేదిక పక్కనే ప్రత్యేక ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలతో మమేకమైన చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు ప్రధాన వేదికపై 60 అడుగుల ఎత్తుతో భారీ ఎల్ఈడీ తెర ఏర్పాటు చేస్తున్నారు. 600 అడుగుల దూరంలో కూర్చున్న వారు కూడా స్పష్టంగా వేదికపై జరుగుతున్న కార్యక్రమాలు చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, నాయకులు మామిడిరాము, అంగడి శ్రీను తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. -
ముమ్మరంగా ప్లీనరీ ఏర్పాట్లు
► పూర్తయిన హాల్ పనులు ► ఏర్పాట్లను పరిశీలించిన పలువురు నాయకులు ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీకి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్లీనరీ సమావేశాల కోసం రెండు హాల్స్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఒక హాల్ పనులు పూర్తయ్యాయి. హాల్స్‌లో పార్టీ నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు కూర్చొనేందుకు ఏర్పాటు చేస్తున్నారు. భోజనాలకు ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించారు. ప్లీనరీ ప్రాంగణంలో కేటగిరీల వారీగా బారిగేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం విడిగా స్థలాన్ని గుర్తించారు. ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వర్షాల వల్ల ప్లీనరీకి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నాయకులు ప్లీనరీ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆదివా రం పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రారావు, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు, విజయనగరం జిల్లా నాయకుడు చిన్న శ్రీను, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బూదాల శ్రీను, మదిర ప్రభాకర్, తోకల శ్యామ్‌కుమార్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ లాతర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, తనుబుద్ధి చంద్రశేఖర రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెనుమాక రవి ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ సోమవారం ప్రాంగణాన్ని సందర్శిస్తారని రఘురాం తెలిపారు.