యుద్ధ ప్రాతిపదికన ప్లీనరీ ఏర్పాట్లు
► వర్షాలతో ఏర్పాట్లకు అంతరాయం
► సభా ప్రాంగణంలోకి చేరిన వర్షపు నీరు
► గాలులతో కింద పడిన రేకులు
► శరవేగంగా పునరుద్ధరణ పనులు
► పనుల్లో నిమగ్నమైన కమిటీ సభ్యులు
► బుధవారానికి ఏర్పాట్లు పూర్తి చేస్తామని వెల్లడి
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో జరుగనున్న వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఏర్పాట్లలో స్వల్ప అంతరాయం ఏర్పడినప్పటికీ సమస్యలను అధిగమించి నాయకులు పనులు చేయిస్తున్నారు. వర్షంతో ప్లీనరీ సమావేశ మందిరం, భోజనశాల, వంటశాల ప్రాంగణాల్లో చేరిన నీటిని మంగళవారం కార్మికులు బయటకు తోడించారు. బలంగా వీచిన గాలులకు పైకప్పు రేకులు లేవడంతో సిబ్బందిని వాటిని సవరించారు.
ప్లీనరీ ప్రాంగణం ఏర్పాట్ల కమిటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ ప్రోగ్రామ్స్ కో–ఆర్డినేటర్ తలశిల రఘరాం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షణలో కార్మికులు, సిబ్బంది ఏర్పాట్లను పునరుద్ధరిస్తున్నారు. సమావేశ మందిరం పైకప్పు లోపలి భాగంలో తిరిగి పార్టీ జెండా రంగు ఉన్న పతకాలతో అలంకరణ పనులు చేయిస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద కొత్త మ్యాట్లు ఏర్పాటు చేస్తున్నారు. రోలర్లతో సభా ప్రాంగణాన్ని చదును చేయిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా బుధవారం సాయంత్రానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఏర్పాట్ల కమిటీ చైర్మన్ తలశిల రఘురాం తెలిపారు.
ఉత్సాహంగా కార్యకర్తలు..
వైఎస్సార్ సీపీ జాతీయ ప్లీనరీ ఏర్పాట్లలో పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసిన కమిటీలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్నాయి. అలంకరణ కమిటీ చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో తమిళనాడుకు చెందిన నిపుణులు, సేవాదళ్ కార్యకర్తలు రేయింబవళ్లూ పని చేస్తున్నారు. వీరితో పాటు స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పని చేస్తున్నారు. కృష్ణా డెల్టా కమిటీ మాజీ చైర్మన్, పార్టీ నాయకుడు సతీష్‌రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారు.
ప్రత్యేక ఏర్పాట్లు..
ప్లీనరీ ప్రాంగణంలో ప్రస్తుతం నిపుణులు, సిబ్బంది అలంకరణ పనులు చేస్తున్నారు. సమావేశ వేదిక పక్కనే ప్రత్యేక ఫొటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలతో మమేకమైన చిత్రాలను ప్రదర్శించనున్నారు. వీటితో పాటు ప్రధాన వేదికపై 60 అడుగుల ఎత్తుతో భారీ ఎల్‌ఈడీ తెర ఏర్పాటు చేస్తున్నారు. 600 అడుగుల దూరంలో కూర్చున్న వారు కూడా స్పష్టంగా వేదికపై జరుగుతున్న కార్యక్రమాలు చూసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పార్టీ ఎస్సీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్, నాయకులు లావు శ్రీకృష్ణదేవరాయలు, జెడ్పీటీసీ కొలకలూరి కోటేశ్వరరావు, నాయకులు మామిడిరాము, అంగడి శ్రీను తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.