రకం ఏదైనా మెలకువలు పాటించాల్సిందే | Any type of is the administrator techniques | Sakshi
Sakshi News home page

రకం ఏదైనా మెలకువలు పాటించాల్సిందే

Published Mon, Jun 23 2014 12:10 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

రకం ఏదైనా మెలకువలు పాటించాల్సిందే - Sakshi

రకం ఏదైనా మెలకువలు పాటించాల్సిందే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కువ మంది రైతులు బీటీ పత్తి సాగు పైనే ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ప్రతి సంవత్సరం రైతులు వేలంవెర్రిగా కేవలం రెండు మూడు రకాల విత్తనాల కోసమే ఎగబడడం పరిపాటిగా మారుతోంది. వారు గుర్తుంచుకోవాల్సిన విషయమేమంటే వంగడం ఏదైనా తొలి దశ నుంచే సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే మంచి దిగుబడులు, ఆదాయం లభిస్తాయి. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తమ ప్రాంతానికి అనువైన హైబ్రిడ్ రకాన్ని రైతులు ఎంపిక చేసుకోవాలి. నీటి వసతి కింద సాగు చేసే వారు మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలు వేసుకోవాలి. వర్షాధారంగా వేసే వారు త్వరగా పూతకు, కాపుకు వచ్చే స్వల్పకాలిక రకాల్ని ఎంచుకోవాలి. ఈ నేపథ్యంలో పత్తి సాగుపై ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందిస్తున్న సూచనలు...

ఈ నేలలు అనువైనవి

ముంపుకు గురికాని నల్లరేగడి నేలలు, ఆరుతడి సదుపాయం కలిగిన సారవంతమైన ఎర్ర నేలలు పత్తి సాగుకు అనుకూలంగా ఉంటాయి. తేలికపాటి నేలలు, ఇసుక నేలలు, ముంపుకు గురయ్యే నేలలు, వరికి అనువైన మాగాణి భూములు పత్తి పంటకు పనికిరావు.

ఎప్పుడు-ఎలా విత్తాలి?

జూన్-జూలై నెలల్లో 75-100 మిల్లీమీటర్ల వర్షం పడిన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు వేసుకోవాలి. భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడే మొలక శాతం బాగుంటుంది. మంచి దిగుబడులు వస్తాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమంటే బీటీ పత్తితో పాటు బీటీ జన్యువు లేని అదే రకం పత్తిని... అంటే రెఫ్యూజియా (ఎర పంట)ను పొలం చుట్టూ నాలుగైదు వరుసలుగా వేసుకోవాలి. సాధారణ రకం పత్తి మొక్కతో పోలిస్తే బీటీ పత్తి మొక్క ఎదుగుదల తక్కువగా ఉంటుంది. కాబట్టి నేల స్వభావం, నీటి వసతిని బట్టి వరుసలు, మొక్కల మధ్య దూరాన్ని తగ్గించాలి (వరుసల మధ్య 90-120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45-60 సెంటీమీటర్ల దూ రం పాటించాలి). దీనివల్ల చేలో మొక్కల సాం ద్రత పెరుగుతుంది. ఎలుకల బెడదను నివారించాలంటే పదును మీదే విత్తనాలు వేయాలి.

ఎరువుల యాజమాన్యం

పత్తికి పంటకాలంలో ఎకరానికి 54 కిలోల నత్రజని (మూడు బస్తాల యూరియా), 24 కిలోల భాస్వరం (మూడు బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్), 24 కిలోల పొటాష్ (40 కిలోల మ్యురేట్ ఆఫ్ పొటాష్) వేయాలి. భాస్వరం మోతాదు మొత్తాన్నీ చివరి దుక్కిలోనే వేసుకోవాలి. సిఫార్సు చేసిన నత్రజని, పొటాష్ ఎరువుల్ని నీటి వసతి/వర్షపాతాన్ని బట్టి విత్తిన 20, 40, 60, 80 రోజులప్పుడు దఫదఫాలుగా వేయాలి.

కలుపు నివారణ కోసం...

బీటీ పత్తిలో కలుపు నివారణకు విత్తనాలు విత్తిన ఒకటి రెండు రోజులకు ఎకరానికి 200 లీటర్ల నీటిలో 1.3-1.6 లీటర్ల పెండిమిథాలిన్ 30% కలిపి నేలపై పిచికారీ చేయాలి. విత్తిన 25-30, 50-55 రోజులప్పుడు గొర్రు/గుంటకతో అంతరకృషి చేయాలి. వర్షాలు ఎక్కువగా కురుస్తున్నప్పుడు అంతరకృషి సాధ్యంకాదు. అలాంటప్పుడు ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు పారాక్వాట్ 24% కలిపి పైరుపై పడకుండా వరుసల మధ్య కలుపుపై మాత్రమే పడేలా పిచికారీ చేసుకోవాలి.

సమగ్ర చర్యలు తప్పనిసరి

బీటీ పత్తి రకాల మధ్య జన్యు వైవిధ్యం తక్కువగా ఉంటుంది. పంటకాలంలో సరైన యాజమాన్య పద్ధతులు అవలంబించినట్లయితే ఏ వంగడమైనా దిగుబడి, నాణ్యత ఒకే రకంగా ఉంటాయి. రాష్ట్రంలో సాగు చేస్తున్న బీటీ పత్తి రకాలపై గుంటూరు లాం ఫారం గతంలో పరిశోధనలు చేసింది. బీటీ రకాల్ని సాగు చేస్తున్న వ్యవసాయ భూముల్లో విత్తనాలు విత్తిన 120 రోజుల వరకూ ఎటువంటి సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా పంట తీరును పరిశీలించారు. ఏ ఒక్క వంగడం కూడా రసం పీల్చే పురుగుల్ని తట్టుకోలేకపోతోందని ఆ పరిశీలనలో తేలింది. కాబట్టి సమగ్ర యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపడితే ఏ బీటీ రకమైనా మంచి దిగుబడినే అందిస్తుంది.
 
ఈ పురుగులతోనే ప్రమాదం          http://img.sakshi.net/images/cms/2014-06/51403457964_Unknown.jpg
 
పత్తి విత్తనాలు వేసిన 50-60 రోజుల వరకు రసం పీల్చే పేనుబంక, పచ్చదోమ, తామర పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. వీటిలో పేనుబంక, పచ్చదోమ పురుగుల బెడద పంట చివరి వరకు ఉంటోంది. ఇక పైరు పూత మీద ఉన్నప్పుడు పొగాకు లద్దె పురుగులు, గులాబీ రంగు పురుగులు దాడి చేస్తాయి. రసం పీల్చే పురుగుల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలి. ముఖ్యంగా పచ్చ, తెల్ల దోమల్ని తట్టుకునే రకాన్ని ఎంచుకోవడం మంచిది. కిలో విత్తనాలకు 5 గ్రాముల ఇమిడాక్లోప్రిడ్/4 గ్రాముల థయోమిథాక్సామ్‌తో పాటు తగినంత జిగురు కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలు వేసిన 30-40 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బెడద తప్పుతుంది. కిలో విత్తనాలకు 40-50 గ్రాముల కార్బోసల్ఫాన్ పట్టించి, విత్తుకుంటే రసం పీల్చే పురుగుల నుంచి 30 రోజుల వరకు పైరుకు రక్షణ లభిస్తుంది. మోనోక్రొటోఫాస్, నీటిని 1:4 నిష్పత్తిలో కలిపి, ఆ ద్రావణాన్ని బ్రష్‌తో మొక్క లేత కాండానికి పూసినట్లయితే (విత్తిన 20, 40, 60 రోజులప్పుడు) రసం పీల్చే పురుగులు అదుపులో ఉంటాయి. ఈ పద్ధతి వల్ల వాతావరణ కాలుష్యమూ తగ్గుతుంది. చివరిగా అవసరమైతే క్రిమిసంహారక మందులు పిచికారీ చేసుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement