నేడు వరల్డ్ హార్ట్ డే
మనుషుల్లో గుండెజబ్బులు సర్వసాధారణమే! నడివయసు దాటాక చాలామంది గుండెజబ్బుల బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యచికిత్స పద్ధతులు మెరుగుపడటంతో గుండెజబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో, ఔషధాల వినియోగంతో ఆయుష్షును పొడిగించుకునే వీలు ఉంటోంది. గుండెజబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతోంది.
ఇదంతా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది గాని, ఇటీవలి కాలంలో గుండెపోటుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతోంది? ఈ పరిస్థితులకు కారణాలేమిటి? నివారణ మార్గాలేమిటి? నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం గుండెజబ్బులే! ముఖ్యంగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల సంభవించే ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతోంది. ‘వరల్డ్ హార్ట్ ఫెడరేషన్’ గత ఏడాది ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.05 కోట్ల మంది గుండెజబ్బులతో మరణిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించినట్లయితే, వీటిలో 80 శాతం మరణాలను నివారించే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది.
గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గుండెజబ్బులను గుర్తించడం, తగిన చికిత్స అందించడం దిశగా వైద్యశాస్త్రం గణనీయమైన పురోగతి సాధించింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న గుండెజబ్బు మరణాల్లో 80 శాతం ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను సంభవిస్తున్నాయి. పాత రికార్డులను చూసుకుంటే, 1990లో 1.21 కోట్ల మంది గుండెజబ్బులతో మరణించారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన వైద్యచికిత్స పద్ధతులు, మెరుగైన పరికరాలు అందుబాటులో ఉన్నా, గుండెజబ్బుల మరణాలు దాదాపు రెట్టింపుగా నమోదవుతుండటం ఆందోళనకర పరిణామం.
గుండెజబ్బులతో అకాల మరణాలు..
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణం. అకస్మాత్తుగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్లనే అత్యధికంగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాల ప్రకారం 30–70 ఏళ్ల లోపు సంభవించే మరణాలను అకాల మరణాలుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో 38 శాతం మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణమని ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతోంది. ఈ అకాల మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, శరీరంలోని జీవక్రియల తీరు, పర్యావరణ కారణాల వల్ల జనాలు గుండెజబ్బుల బారిన పడుతున్నారు.
జీవనశైలి కారణాలు: తగిన శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మితిమీరి మద్యం తాగడం, ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.
జీవక్రియ కారణాలు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, ఎల్‌డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం.
పర్యావరణ కారణాలు: పరిసరాల్లో మితిమీరిన వాయు కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి నిండిన పరిసరాల్లో పనిచేయడం.
ఆకస్మిక గుండెపోటుతో మరణాలు గుండెజబ్బులకు తెలిసిన కారణాలకైతే జాగ్రత్తలు తీసుకుంటాం. మరి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, నిమిషాల్లోనే గుండె ఆగిపోతేనో! అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వల్లనే ఎక్కువమంది చికిత్స అందేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలామంది నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న యువకులు ఉంటున్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలు గుండెజబ్బులతో బాధపడే వృద్ధుల్లో సహజం.
ప్రతి 50 వేల మరణాల్లో ఒక యువ క్రీడాకారుడు ఉంటున్నట్లు ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతుండటం ఆందోళనకరం. శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఆటలాడే వారు కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. ‘కోవిడ్’ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువయ్యాయి. ‘కోవిడ్’కు ముందు ఆకస్మిక గుండెపోటుతో సంభవించే ప్రతి లక్ష మరణాల్లో ఒక యువక్రీడాకారుడు చొప్పున ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు కావడమే ఆందోళనకరం.
ఆకస్మికంగా గుండెపోటుకు కారణాలు..
ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి. గుండె లయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుంచించుకుపోతాయి. ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని ‘వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్’ అంటారు. ఈ పరిస్థితి వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తుంటాయి.
1. గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం. గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది. అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు. గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.
2. గుండెలయలో హెచ్చుతగ్గులకు దారితీసే ‘బ్రుగాడా సిండ్రోమ్’, ‘వూల్ఫ్–పార్కిన్‌సన్–వైట్ సిండ్రోమ్’ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయి. ఇవే కాకుండా, కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి. గుండెనాళాల్లోను, రక్తనాళాల్లోను హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
3. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుంచి ఉంటుంది. ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది. ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల, దీర్ఘకాలికంగా వాడే మందుల దుష్ప్రభావం వల్ల కూడా ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ రావచ్చు. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.
ముందుగా గుర్తించాలంటే?
ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించడం సాధ్యమేనా? అంటే, ఆకస్మికంగా వచ్చే గుండెపోటును నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ముందస్తు పరీక్షల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠిన వ్యాయామాలు చేసే యువకులు, క్రీడారంగంలో కొనసాగే యువకులకు ఈసీజీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించవచ్చునని ఇటాలియన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసీజీ వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో అనువంశిక చరిత్ర సహా ఇతరేతర కారణాల వల్ల గుండెజబ్బులు ఉన్న యువకులు కఠిన వ్యాయామాలకు, క్రీడా పోటీలకు దూరంగా ఉండటమే మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
గుండెజబ్బుల నివారణ.. హెల్దీ లైఫ్‌స్టైల్‌తో సాధ్యమే!
ఈమధ్య గుండెజబ్బులు చాలా చిన్నవయసులోనే వస్తుండటం డాక్టర్లుగా మేము చూస్తున్నాం. యువతరంలో గతంలో ఎప్పుడోగానీ కనిపించని గుండెజబ్బులు, గుండెపోటు కేసులు ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని ఒత్తడిలో పడి హడావుడిగా జంక్‌ఫుడ్ తినడం, వ్యాయామం తగ్గిపోవడం, ఫలితంగా స్థూలకాయులవడం, మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు యువతలో గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు. అందుకే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, రోజుకు
45 నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదురోజులు వ్యాయామం చేయడం వంటి హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తే యువతలో గుండెజబ్బులను చాలావరకు నివారించవచ్చు.
ఎలాంటి హెచ్చరిక ఉండదు..
సాధారణంగా ఆకస్మిక గుండెపోటు సంభవించే ముందు ఎలాంటి హెచ్చరిక ఉండదు. ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. అయితే, కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా మూర్ఛపోవడం జరిగితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. గుండె సమస్యల వల్ల కూడా ఇలా మూర్ఛపోయే పరిస్థితి తలెత్తుతుంది.
ఉబ్బసంలాంటి పరిస్థితి లేకపోయినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే గుండె పనితీరులో లోపాలు ఉన్నట్లే భావించాలి. ఈ పరిస్థితి ఎదురైతే, వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.
కుటుంబ సభ్యులు ఆకస్మిక గుండెపోటు వల్ల మరణించిన చరిత్ర ఉన్నట్లయితే, ముందు జాగ్రత్తగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. జన్యు కారణాల వల్ల గుండెలో లోపాలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో బయటపడతాయి. వాటిని ముందుగానే గుర్తించినట్లయితే, తగిన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది.
ఆకస్మిక గుండెపోటు లక్షణాలు..
ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి:
– హఠాత్తుగా కుప్పకూలిపోవడం
– నాడి అందకపోవడం
– ఊపిరాడకపోవడం
– స్పృహ కోల్పోవడం
ఒక్కోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు ఇంకొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు వస్తుంది.
– ఛాతీలో అసౌకర్యంగా ఉండటం
– ఊపిరి తీసుకోవడం కష్టమవడం
– నిస్సత్తువ
– వేగంగా ఊపిరి తీసుకోవడం
– గుండె లయ తప్పి కొట్టుకోవడం
– స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడం
ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయడం మంచిది. ఎంత వేగంగా చికిత్స అందితే రోగికి అంత మంచిది. ఈ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే ‘కార్డియో పల్మనరీ రిసటేషన్’ (సీపీఆర్) అందించాలి. అలాగే, అందుబాటులో ఉంటే ‘ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫైబ్రిలేటర్’ (ఏఈడీ)తో ప్రాథమిక చికిత్సను అందించాలి. సీపీఆర్ చేసేటప్పుడు ఛాతీపై నిమిషానికి 100–120 సార్లు బలంగా మర్దన చేయాలి. ఆస్పత్రికి చేరేలోగా రోగికి ఈ రకమైన ప్రాథమిక చికిత్స అందిస్తే, చాలావరకు ప్రాణాపాయం తప్పుతుంది.
Comments
Please login to add a commentAdd a comment