Cover Story
-
కుర్రాళ్ల గుండెలకు.. ఏమవుతోంది?
మనుషుల్లో గుండెజబ్బులు సర్వసాధారణమే! నడివయసు దాటాక చాలామంది గుండెజబ్బుల బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యచికిత్స పద్ధతులు మెరుగుపడటంతో గుండెజబ్బులు ఉన్నవారు కూడా తగిన చికిత్సలతో, ఔషధాల వినియోగంతో ఆయుష్షును పొడిగించుకునే వీలు ఉంటోంది. గుండెజబ్బులు గుర్తించిన తర్వాత కూడా తగిన చికిత్స పొందుతూ ఒకటి రెండు దశాబ్దాల కాలం సునాయాసంగా జీవించగలిగే వారి సంఖ్య పెరుగుతోంది.ఇదంతా చూసుకుంటే పరిస్థితి ఆశాజనకంగానే కనిపిస్తోంది గాని, ఇటీవలి కాలంలో గుండెపోటుతో యువకులు మరణిస్తున్న సంఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చినా, ఆరోగ్యంగా కనిపించే యువకుల గుండెలకు రక్షణ ఎందుకు కొరవడుతోంది? ఈ పరిస్థితులకు కారణాలేమిటి? నివారణ మార్గాలేమిటి? నేడు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో అత్యధిక మరణాలకు కారణం గుండెజబ్బులే! ముఖ్యంగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్ల సంభవించే ‘ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్’ వల్ల అత్యధిక మరణాలు సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చెబుతోంది. ‘వరల్డ్ హార్ట్ ఫెడరేషన్’ గత ఏడాది ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏటా 2.05 కోట్ల మంది గుండెజబ్బులతో మరణిస్తున్నారు. సకాలంలో చికిత్స అందించినట్లయితే, వీటిలో 80 శాతం మరణాలను నివారించే అవకాశాలు ఉన్నాయని ఈ నివేదిక చెబుతోంది.గడచిన ఐదు దశాబ్దాల కాలంలో గుండెజబ్బులను గుర్తించడం, తగిన చికిత్స అందించడం దిశగా వైద్యశాస్త్రం గణనీయమైన పురోగతి సాధించింది. అయినా, ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న గుండెజబ్బు మరణాల్లో 80 శాతం ఆర్థికంగా వెనుకబడిన దేశాల్లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోను సంభవిస్తున్నాయి. పాత రికార్డులను చూసుకుంటే, 1990లో 1.21 కోట్ల మంది గుండెజబ్బులతో మరణించారు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అధునాతన వైద్యచికిత్స పద్ధతులు, మెరుగైన పరికరాలు అందుబాటులో ఉన్నా, గుండెజబ్బుల మరణాలు దాదాపు రెట్టింపుగా నమోదవుతుండటం ఆందోళనకర పరిణామం.గుండెజబ్బులతో అకాల మరణాలు..ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాలకు గుండెజబ్బులే ప్రధాన కారణం. అకస్మాత్తుగా గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడం వల్లనే అత్యధికంగా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రమాణాల ప్రకారం 30–70 ఏళ్ల లోపు సంభవించే మరణాలను అకాల మరణాలుగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న అకాల మరణాల్లో 38 శాతం మరణాలకు ఇస్కీమిక్ హార్ట్ డిసీజ్ కారణమని ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతోంది. ఈ అకాల మరణాలకు అనేక కారణాలు ఉన్నాయి. జీవనశైలి, శరీరంలోని జీవక్రియల తీరు, పర్యావరణ కారణాల వల్ల జనాలు గుండెజబ్బుల బారిన పడుతున్నారు.జీవనశైలి కారణాలు: తగిన శారీరక శ్రమ లేకపోవడం, పొగతాగడం, మితిమీరి మద్యం తాగడం, ఉప్పుతో కూడిన పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం.జీవక్రియ కారణాలు: అధిక రక్తపోటు, మధుమేహం, అధిక బరువు, ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం.పర్యావరణ కారణాలు: పరిసరాల్లో మితిమీరిన వాయు కాలుష్యం, పొగ, దుమ్ము, ధూళి నిండిన పరిసరాల్లో పనిచేయడం.ఆకస్మిక గుండెపోటుతో మరణాలు గుండెజబ్బులకు తెలిసిన కారణాలకైతే జాగ్రత్తలు తీసుకుంటాం. మరి అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి, నిమిషాల్లోనే గుండె ఆగిపోతేనో! అకస్మాత్తుగా వచ్చే గుండెపోటు వల్లనే ఎక్కువమంది చికిత్స అందేలోపే ప్రాణాలు కోల్పోతున్నారు. వీరిలో చాలామంది నిన్న మొన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న యువకులు ఉంటున్నారు. ఆకస్మిక గుండెపోటు వల్ల సంభవించే మరణాలు గుండెజబ్బులతో బాధపడే వృద్ధుల్లో సహజం.ప్రతి 50 వేల మరణాల్లో ఒక యువ క్రీడాకారుడు ఉంటున్నట్లు ‘వరల్డ్ హార్ట్ రిపోర్ట్–2023’ చెబుతుండటం ఆందోళనకరం. శారీరక శ్రమతో కూడిన జీవనశైలి, క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారు, ఆటలాడే వారు కూడా ఆకస్మిక గుండెపోటుతో మరణిస్తున్నారు. ‘కోవిడ్’ తర్వాత ఇలాంటి మరణాలు ఎక్కువయ్యాయి. ‘కోవిడ్’కు ముందు ఆకస్మిక గుండెపోటుతో సంభవించే ప్రతి లక్ష మరణాల్లో ఒక యువక్రీడాకారుడు చొప్పున ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెట్టింపు కావడమే ఆందోళనకరం.ఆకస్మికంగా గుండెపోటుకు కారణాలు..ఆకస్మికంగా గుండెపోటు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. గుండెలోని విద్యుత్ సిగ్నలింగ్ వ్యవస్థలో ఆకస్మిక మార్పులు ఆకస్మిక గుండెపోటు కలిగిస్తాయి. గుండె లయ వేగంగా పెరగడం వల్ల గుండె దిగువ భాగంలోని గదులు బాగా కుంచించుకుపోతాయి. ఫలితంగా శరీరానికి కావలసిన రక్తాన్ని అందించడంలో గుండె విఫలమవుతుంది. ప్రాణాంతకమైన ఈ పరిస్థితిని ‘వెంట్రిక్యులర్ ఫైబ్రిలేషన్’ అంటారు. ఈ పరిస్థితి వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలు సంభవిస్తుంటాయి.1. గుండె కండరం దళసరిగా తయారవడం కూడా యువకుల్లో ఆకస్మిక గుండెపోటు మరణాలకు మరో కారణం. గుండె కండరం ఒక్కోసారి దళసరిగా తయారవుతుంది. అలాంటప్పుడు గుండె శరీరానికి కావలసిన రక్తాన్ని సరఫరా చేయలేదు. గుండె కండరం దళసరిగా మారితే గుండె లయలో వేగం పెరుగుతుంది. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటుకు దారితీస్తుంది.2. గుండెలయలో హెచ్చుతగ్గులకు దారితీసే ‘బ్రుగాడా సిండ్రోమ్’, ‘వూల్ఫ్–పార్కిన్సన్–వైట్ సిండ్రోమ్’ వంటి రుగ్మతలు కూడా ఆకస్మిక గుండెపోటు మరణాలకు కారణమవుతాయి. ఇవే కాకుండా, కొందరిలో పుట్టుకతోనే గుండెలో లోపాలు ఉంటాయి. గుండెనాళాల్లోను, రక్తనాళాల్లోను హెచ్చుతగ్గులు ఉంటాయి. అలాంటప్పుడు కూడా ఆకస్మికంగా గుండెపోటుతో మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.3. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ వల్ల కూడా ఆకస్మికంగా గుండెపోటు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితి ఉన్నవారికి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ కొందరిలో జన్యు కారణాల వల్ల పుట్టుక నుంచి ఉంటుంది. ఈసీజీ పరీక్ష చేయించినప్పుడు ఈ పరిస్థితి బయటపడుతుంది. ఒక్కోసారి ఇతరేతర ఆరోగ్య కారణాల వల్ల, దీర్ఘకాలికంగా వాడే మందుల దుష్ప్రభావం వల్ల కూడా ‘లాంగ్ క్యూటీ సిండ్రోమ్’ రావచ్చు. ఈ పరిస్థితి ఒక్కోసారి ఆకస్మిక గుండెపోటు మరణాలకు దారితీసే అవకాశాలు ఎక్కువ.ముందుగా గుర్తించాలంటే?ఎలాంటి ముందస్తు సూచనలు లేకుండా ఆకస్మికంగా వచ్చే గుండెపోటును ముందుగానే గుర్తించడం సాధ్యమేనా? అంటే, ఆకస్మికంగా వచ్చే గుండెపోటును నివారించడం సాధ్యం కాకపోయినా, కొన్ని ముందస్తు పరీక్షల వల్ల ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించగలమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కఠిన వ్యాయామాలు చేసే యువకులు, క్రీడారంగంలో కొనసాగే యువకులకు ఈసీజీ పరీక్షలు తప్పనిసరి చేయడం ద్వారా వారిలో ఆకస్మిక గుండెపోటు మరణాలను తగ్గించవచ్చునని ఇటాలియన్ వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈసీజీ వల్ల పాక్షిక ప్రయోజనం మాత్రమే ఉంటుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నిపుణులు చెబుతున్నారు. కుటుంబంలో అనువంశిక చరిత్ర సహా ఇతరేతర కారణాల వల్ల గుండెజబ్బులు ఉన్న యువకులు కఠిన వ్యాయామాలకు, క్రీడా పోటీలకు దూరంగా ఉండటమే మంచిదని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.గుండెజబ్బుల నివారణ.. హెల్దీ లైఫ్‌స్టైల్‌తో సాధ్యమే!ఈమధ్య గుండెజబ్బులు చాలా చిన్నవయసులోనే వస్తుండటం డాక్టర్లుగా మేము చూస్తున్నాం. యువతరంలో గతంలో ఎప్పుడోగానీ కనిపించని గుండెజబ్బులు, గుండెపోటు కేసులు ఇటీవల చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో పని ఒత్తిడి, పని ఒత్తడిలో పడి హడావుడిగా జంక్‌ఫుడ్ తినడం, వ్యాయామం తగ్గిపోవడం, ఫలితంగా స్థూలకాయులవడం, మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లు యువతలో గుండెజబ్బులు పెరగడానికి ప్రధాన కారణాలు. అందుకే ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవడం, పని ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయడం, రోజుకు 45 నిమిషాల చొప్పున వారంలో కనీసం ఐదురోజులు వ్యాయామం చేయడం వంటి హెల్దీ లైఫ్‌స్టైల్‌ను అనుసరిస్తే యువతలో గుండెజబ్బులను చాలావరకు నివారించవచ్చు.ఎలాంటి హెచ్చరిక ఉండదు..సాధారణంగా ఆకస్మిక గుండెపోటు సంభవించే ముందు ఎలాంటి హెచ్చరిక ఉండదు. ఎలాంటి ముందస్తు లక్షణాలు కనిపించవు. అయితే, కొన్ని లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా గుండె పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.నడుస్తున్నప్పుడు, ఏదైనా పని చేస్తున్నప్పుడు లేదా ఆటలాడుతున్నప్పుడు హఠాత్తుగా మూర్ఛపోవడం జరిగితే, వెంటనే వైద్య నిపుణులను సంప్రదించాలి. గుండె సమస్యల వల్ల కూడా ఇలా మూర్ఛపోయే పరిస్థితి తలెత్తుతుంది.ఉబ్బసంలాంటి పరిస్థితి లేకపోయినా, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడినట్లయితే గుండె పనితీరులో లోపాలు ఉన్నట్లే భావించాలి. ఈ పరిస్థితి ఎదురైతే, వెంటనే వైద్యనిపుణులను సంప్రదించాలి.కుటుంబ సభ్యులు ఆకస్మిక గుండెపోటు వల్ల మరణించిన చరిత్ర ఉన్నట్లయితే, ముందు జాగ్రత్తగా గుండె పరీక్షలు చేయించుకోవాలి. జన్యు కారణాల వల్ల గుండెలో లోపాలు ఉన్నట్లయితే ఆ పరీక్షల్లో బయటపడతాయి. వాటిని ముందుగానే గుర్తించినట్లయితే, తగిన చికిత్స పొందడానికి అవకాశం ఉంటుంది.ఆకస్మిక గుండెపోటు లక్షణాలు..ఆకస్మికంగా గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలు ఇవి:– హఠాత్తుగా కుప్పకూలిపోవడం– నాడి అందకపోవడం– ఊపిరాడకపోవడం– స్పృహ కోల్పోవడంఒక్కోసారి ఆకస్మికంగా గుండెపోటు వచ్చే ముందు ఇంకొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన కొద్ది నిమిషాల్లోనే గుండెపోటు వస్తుంది.– ఛాతీలో అసౌకర్యంగా ఉండటం– ఊపిరి తీసుకోవడం కష్టమవడం– నిస్సత్తువ– వేగంగా ఊపిరి తీసుకోవడం– గుండె లయ తప్పి కొట్టుకోవడం– స్పృహ కోల్పోతున్నట్లుగా అనిపించడంఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే అంబులెన్స్‌కు కాల్ చేయడం మంచిది. ఎంత వేగంగా చికిత్స అందితే రోగికి అంత మంచిది. ఈ పరిస్థితుల్లో ఉన్నవారికి వెంటనే ‘కార్డియో పల్మనరీ రిసటేషన్’ (సీపీఆర్) అందించాలి. అలాగే, అందుబాటులో ఉంటే ‘ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫైబ్రిలేటర్’ (ఏఈడీ)తో ప్రాథమిక చికిత్సను అందించాలి. సీపీఆర్ చేసేటప్పుడు ఛాతీపై నిమిషానికి 100–120 సార్లు బలంగా మర్దన చేయాలి. ఆస్పత్రికి చేరేలోగా రోగికి ఈ రకమైన ప్రాథమిక చికిత్స అందిస్తే, చాలావరకు ప్రాణాపాయం తప్పుతుంది. -
అర్లీ రిటైర్మెంట్.. ఫరెవర్ ఎంజాయ్మెంట్!
ఉన్నది ఒకటే జీవితం! దాన్ని జీతానికి తాకట్టు పెడితే ఆర్జిస్తున్నామనే ఆనందం కూడా మిగలదు! ఉద్యోగం వేతనాన్నే కాదు చేస్తున్న పని పట్ల సంతృప్తినీ ఇవ్వాలి.. ఆస్వాదించే సమయాన్నుంచాలి.. మన జీవితాన్ని మనకు మిగల్చాలి! ఇది జెన్ జెడ్ ఫిలాసఫీ! అందుకే వాళ్లు రెజ్యుమే ప్రిపేర్ చేయట్లేదు. పోర్ట్‌ఫోలియో కోసం తాపత్రయపడుతున్నారు. వర్క్ స్టయిల్ని మార్చేస్తున్నారు. ఆఫీస్ డెకోరమ్ నుంచి ఫ్రేమ్ అవుట్ అవుతున్నారు. ముందుతరాల ఉద్యోగులను ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు. మేనేజ్మెంట్కి ఆప్షన్ లేకుండా చేస్తున్నారు.‘చూసేవాళ్లకు కేర్ఫ్రీగా కనిపిస్తున్నామేమో కానీ చేసే పని పట్ల, మా ఫ్యూచర్ పట్ల క్లారిటీతోనే ఉంటున్నాం. జాబ్ అండ్ జిందగీ, ప్యాకేజ్ అండ్ ఫ్యాషన్ల మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసు మాకు. అందుకే మేము మా స్కిల్‌ని నమ్ముకుంటున్నాం.. లాయల్టీని కాదు’ అంటోంది జెన్ జెడ్ ప్రతినిధి, బిజినెస్ అనలిస్ట్ చిలుకూరు సౌమ్య.నిజమే.. తమకేం కావాలి అన్నదాని పట్ల జెన్ జెడ్‌కి చాలా స్పష్టత ఉంది. వాళ్లు దేన్నీ దేనితో ముడిపెట్టట్లేదు. దేనికోసం దేన్నీ వదులుకోవట్లేదు. నైపుణ్యం కంటే విధేయతకే ప్రాధాన్యమిస్తున్న సంస్థల్లో పని వాతావరణాన్ని మార్చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకున్న నాటి నుంచి రిటైర్మెంట్ వరకు ఒకే సంస్థలో ఉద్యోగాన్నీడ్చే ముందు తరాల మనస్తత్వాన్ని ఔట్ డేటెడ్‌గా చూస్తున్నారు. తక్కువ సర్వీస్‌లో వీలైనన్ని జంప్‌లు, వీలైనంత ఎక్కువ ప్యాకెజ్ అనే ఐడియాను ఇంప్లిమెంట్ చేస్తున్నారు.వాళ్ల రూటే వేరు..సంప్రదాయ జీవన శైలినే కాదు ట్రెడిషనల్ వర్క్ స్టయిల్‌నూ ఇష్టపడట్లేదు జెన్ జెడ్. ‘పదహారు.. పద్దెనిమిదేళ్లు చదువు మీద పెట్టి, తర్వాత లైఫ్ అంతా 9 టు 5 పనిచేస్తూ, కార్పొరేట్ కూలీలుగా ఉండటం మావల్ల కాదు’ అంటున్నారు బెంగళూరుకు చెందిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు. ‘జెన్ జెడ్.. మాలాగా కాదు. వాళ్లు సంస్థ ప్రయోజనాల కోసం చెమటోడ్చట్లేదు. అలాంటి షరతులు, డిమాండ్లకూ తలొగ్గట్లేదు. వాళ్లకు పనికొచ్చే, వాళ్ల సామర్థ్యాన్ని నిరూపించుకునే కంప్యూటర్ ప్రోగ్రామింగ్, రైటింగ్, డిజైన్ లాంటి టాస్క్స్నే తీసుకుంటున్నారు. అంతే నిర్మొహమాటంగా గుర్తింపును, కాంప్లిమెంట్స్నూ కోరుకుంటున్నారు. కొలీగ్స్‌తో మాట్లాడినంత క్యాజువల్‌గా సంస్థ డైరెక్టర్‌తో మాట్లాడేస్తున్నారు. సీనియర్స్, సుపీరియర్స్ని ‘సర్’ అనో, ‘మేడమ్’ అనో పిలవడం వాళ్ల దృష్టిలో ఫ్యూడల్, ఓల్డ్ ఫ్యాషన్డ్. పేరుతో పిలవడాన్ని అప్ డేటెడ్‌గా, ఈక్వల్‌గా ట్రీట్ చేస్తున్నారు’ అని చెబుతున్నారు మిలేనియల్ తరానికి చెందిన కొందరు బాస్‌లు. దీన్నిబట్టి జెన్ జెడ్‌కి ఆఫీస్ మర్యాదల మీదా స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. వాళ్లు యజమాని – ఉద్యోగి సంబంధాన్ని సింపుల్‌గా ‘మీకు అవసరమైన పని చేసిపెడుతున్నాం.. దానికి చార్జ్ చేసిన డబ్బును తీసుకుంటున్నాం’ అన్నట్లుగానే పరిగణిస్తున్నారు తప్ప ఎలాంటి అటాచ్మెంట్లు, సెంటిమెంట్లకు చోటివ్వట్లేదు.40 కల్లా..చేసే ఉద్యోగం, జీతం, పని వేళలు, ఆఫీస్ వాతావరణమే కాదు ఎన్నాళ్లు పనిచేయాలనే విషయంలోనూ జెన్ జెడ్‌కి ఒక అవగాహన ఉంది. తర్వాత ఏం చేయాలనేదాని పట్లా ఆలోచన ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే ‘జీవిక కోసం జీతం.. ప్యాషన్ కోసం జీవితం’ అని నమ్ముతున్నారు వాళ్లు. 35– 40 ఏళ్ల కల్లా రిటైర్మెంట్ అంటూ పెద్దవాళ్లు విస్తుపోయేలా చేస్తున్నారు. ‘మేము 60 ఏళ్లకు రిటైరైన తర్వాత కూడా ఏదో ఒక జాబ్ చేయాలని చూస్తుంటే మా పిల్లలేమో 35 – 40 ఏళ్ల వరకే ఈ ఉద్యోగాలు.. తర్వాత అంతా మాకు నచ్చినట్టు మేం ఉంటామని చెబుతున్నారు. ఆశ్చర్యమేస్తోంది వాళ్ల ధైర్యం, భరోసా, నమ్మకం చూస్తుంటే’ అంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు. 40 ఏళ్ల కల్లా రిటైరైపోయి తమకు నచ్చిన రంగంలో సెకండ్ కెరీర్‌ని మొదలుపెట్టాలనుకుంటున్నారు. దీనికోసం ఉద్యోగంలో చేరిన తొలిరోజు నుంచే అన్నిరకాల ప్రణాళికలు వేసుకుంటున్నారు. పొదుపుతో జాగ్రత్తపడుతున్నారు. సిప్‌లు,షేర్లలో మదుపు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలతో అప్డేట్ అవుతున్నారు. తమ లక్ష్యాలకు సరిపోయే ప్యాకేజ్ని కోట్ చేస్తూ అర్థిక సుస్థిరత కోసం ప్రయత్నిస్తున్నారు.రెజ్యుమే టు పోర్ట్‌ఫోలియో..ఒక వ్యక్తి కొన్నాళ్లు ఓడరేవులో పని చేస్తాడు. అక్కడి నుంచి చెరుకు తోటలకు కూలీగా వెళ్తాడు. ఇంకొన్నాళ్లు బడిలో పాఠాలు చెబుతాడు. ఆ తర్వాత ఎలక్ట్రీషియన్‌గా కనపడతాడు. మరికొన్నాళ్లకు ఇంకో కొలువును చేపడతాడు. ఆఖరికి ఏ సైంటిస్ట్గానో, రాజకీయవేత్తగానో, రచయితగానో తన మజిలీ చేరుకుంటాడు. ఇలాంటివన్నీ సాధారణంగా పాశ్చాత్య నవలలు, ఆటోబయోగ్రఫీలు, సినిమాల్లో కనపడతాయి. కానీ ఈ ధోరణిని ఇప్పుడు జెన్ జెడ్‌లోనూ కనపడుతోంది. 60 ఏళ్లకు రిటైర్మెంట్నే కాదు రిటైర్మెంట్ వరకు ఒకే కొలువు అనే కాన్సెప్ట్‌నూ ఇష్టపడట్లేదు వాళ్లు. కెరీర్లో రెండుమూడు జంప్ల తర్వాత ఆఫీస్‌లో కూర్చొని చేసే జాబ్ కన్నా ఫ్రీలాన్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల ఆదాయం పెరగడమే కాక, మనసుకు నచ్చిన పనిచేసుకునే అవకాశమూ దొరుకుతోంది అంటున్నారు.వివిధ రంగాల్లోని చాలామంది జెన్ జెడ్ ఉద్యోగులు పలు స్టార్టప్స్‌కి పనిచేస్తున్నారు, స్టార్టప్స్ నడుపుతున్నారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కి కంట్రిబ్యూట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. వ్లాగర్స్, యూట్యూబర్స్‌గా కొనసాగుతున్నారు. అడ్వర్టయిజ్మెంట్ కాపీ రైటర్స్‌గా, ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కి క్యురేటర్స్గా సేవలందిస్తున్నారు. యోగా టీచర్స్‌గా, అనువాదకులుగా, కేర్ టేకర్స్‌గా పనిచేస్తున్నారు. వాయిస్ ఓవర్ చెబుతున్నారు. డిస్కవరీ, జాగ్రఫీ, యానిమల్ ప్లానెట్ లాంటి చానళ్ల కోసం పనిచేస్తున్నారు. డాక్యుమెంటరీలకు స్క్రిప్ట్స్ రాస్తున్నారు. ఎడిటింగ్ చేస్తున్నారు. గ్రాఫిక్స్ అందిస్తున్నారు. వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ డిజైన్, మోడలింగ్‌లో ఉన్నారు. ఐడియా బ్యాంక్‌ని నిర్వహిస్తున్నారు. ఇలా ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో.. వైవిధ్యమైన పని అనుభవాలతో రెజ్యుమే ప్లేస్‌లో పోర్ట్‌ఫోలియో సిద్ధం చేసుకుంటున్నారు. డబ్బుతోపాటు జాబ్ శాటిస్ఫాక్షన్ను పొందుతున్నారు.ఫిన్‌ఫ్లుయెన్సర్స్..40 ఏళ్లకే రిటైరై.. సెకండ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన వాళ్లు, రకరకాల ఉద్యోగాలతో ఫ్రీలాన్స్ చేçస్తున్న వాళ్లు ఆర్థిక క్రమశిక్షణలోనూ ఆరితేరుతున్నారు. పలు స్టార్టప్స్‌లో, సేవల రంగంలో పెట్టుబడులు పెడుతూ ఫిన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు.ఈ ధోరణికి కారణం.. ఇంటర్నెట్, ఏఐ లాంటి ఫాస్ట్‌మూవింగ్ టెక్నాలజీ, కరోనా పరిస్థితులు .. కెరీర్, ఆఫీస్ వర్క్‌కి సంబంధించి ఎన్నో మార్పులను తెచ్చాయి. అవి జెన్ జెడ్‌ని ఎంతో ప్రభావితం చేస్తున్నాయి. వారి ఆలోచనా విధానాన్ని మారుస్తున్నాయి. ఈ మధ్య చోటుచేసుకున్న రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, తత్ఫలితంగా ఏర్పడ్డ ఆర్థికమాంద్యం, ఉద్యోగాల కోత వంటి పరిణామాలు కూడా ఆ ధోరణిని కొనసాగేలా చేస్తున్నాయి. దీనికి పేరెంటింగ్నూ మరో కారణంగా చూపుతున్నారు సామాజిక విశ్లేషకులు. ఇంజినీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకో చదువు లేదు, మరో కెరీర్ కెరీర్ కాదనే పెంపకమూ ఫ్రీలాన్సింగ్, అర్లీ రిటైర్మెంట్ ట్రెండ్‌కి ఊతమవుతోందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.జెన్ జెడ్ ఫ్రీలాన్స్ వర్కింగ్ ట్రెండ్ మీద అమెరికా, శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన ‘అప్‌వర్క్ ఆన్లైన్ ఫ్రీలాన్స్ నెట్వర్కింగ్’ అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. అనుగుణమైన పనివేళలు, ఆదాయ భరోసా ఉండటం వల్లే వాళ్లు ఏ రంగంలోనైనా ఫ్రీలాన్స్ చేయడానికి సిద్ధపడుతున్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. ఎక్కువమంది కోవిడ్ చరమాంకం నుంచి ఈ ఫ్రీలాన్స్ వర్క్ కల్చర్‌లో కొనసాగుతున్నారట. వాళ్లంతా వారానికి 40 గంటలు, పలురకాల పనుల్లో ఫ్రీలాన్స్ చేస్తున్నారు. కొందరేమో పనిచోట సీనియర్స్– జూనియర్స్, కుల, మత, జాతి, లింగ వివక్షను భరించలేక, ఆ వాతావరణం నుంచి దూరంగా ఉండటానికి ఫ్రీలాన్స్ని ఎంచుకున్నట్లు చెప్పారు. మరికొందరు వ్యక్తిగత జీవితం తమ చేతుల్లోనే ఉంటుందని, సొంతంగా ఎదిగే వీలుంటుందని ఫ్రీలాన్స్ చేస్తున్నట్లు తెలిపారు. టిక్‌టాక్ నిషేధం తర్వాత చాలామంది క్రియేటర్స్‌కి ఇన్స్టాగ్రామ్ ఓ ప్రత్యామ్నాయ వేదికగా మారడంతో వాళ్లంతా మళ్లీ ఫ్రీలాన్స్కి మళ్లారు. మైక్రోసాఫ్ట్, లింక్డిన్ డేటా ప్రకారం జెన్ జెడ్ ఫ్రీలాన్సర్స్.. సంస్థలు ఇచ్చే శిక్షణ మీద ఆధారపడకుండా సొంతంగా శిక్షణ తీసుకుని ఏఐ వంటి అధునాతన సాంకేతిక సౌకర్యాలను చాలా చక్కగా వాడుకుంటున్నారు. మిలేనియల్స్ మాదిరి జెన్ జెడ్.. లాప్‌టాప్‌ను, కంప్యూటర్ను ఎక్స్ట్రా ఆర్గాన్‌గా మోయట్లేదు. ఆఫీస్‌ను మొదటి ఇల్లుగా చేసుకోవట్లేదు. ఉన్న చోటు నుంచే తమ దగ్గరున్న డివైస్లోంచే పనిచేసుకుంటున్నారు.. ఆడుతూ.. పాడుతూ.. హ్యాపీగా! పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్నీ జెన్ జెడ్‌కి ఫ్రీలాన్సింగ్ ఇచ్చేలా కొందరు బిజినెస్ లీడర్లు ముందుకు వస్తున్నారు. ఆ దిశగా కొన్ని సంస్థలూ ఆలోచిస్తున్నాయి.ఉరుకులు, పరుగులు నచ్చక..చదువైపోయిన వెంటనే అమెజాన్‌లో జాబ్ వచ్చింది. 9 టు 5 వర్క్ వల్ల పర్సనల్‌గా నేను బావుకుంటున్నదేమీ లేదని రియలైజ్ అయ్యాను. అందుకే లాస్టియర్ జాబ్ మానేసి ఫ్రీలాన్సర్‌గా మారాను. దీనివల్ల డబ్బుతో పాటు జాబ్ శాటిస్ఫాక్షన్ కూడా దొరుకుతోంది. అంతేకాదు చుట్టుపక్కలవాళ్లకు తోచిన సాయం చేయగలుగుతున్నాను. నాకు ట్రావెల్, మ్యూజిక్ అంటే ఇష్టం. ఇప్పుడు టైమ్ నా చేతిలో ఉంటోంది కాబట్టి, మ్యూజిక్ షోస్ చేసుకుంటున్నాను. నాకు నచ్చిన చోటికి వెళ్తున్నాను. – కార్తిక్ సిరిమల్ల, హైదరాబాద్డబ్బును కాదు టైమ్‌ని చేజ్ చేస్తోందిజర్మనీలో మాస్టర్స్ చేసి, అక్కడే మంచి జాబ్ కూడా సంపాదించుకున్నాను. అయినా హ్యాపీనెస్ లేదు. ఆఫీస్‌లో అన్నేసి గంటలు చేసిన వర్క్‌కి ఎండ్ ఆఫ్ ద డే అంతే ఔట్పుట్ కనిపించలేదు! అంతే శ్రమ నాకు నచ్చిన దాని మీద పెడితే ఆ శాటిస్ఫాక్షనే వేరు కదా అనిపించింది! అందుకే ఇండియాకు వచ్చేసి, థీమ్ రెస్టరెంట్ పెట్టాను. ఆన్లైన్లో జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తున్నాను. ఫ్యూచర్లో కొంతమంది ఫ్రెండ్స్‌మి కలసి మాకు నచ్చిన ఓ పల్లెలో కొంచెం ల్యాండ్ కొనుక్కొని మినిమలిస్టిక్ లైఫ్‌ని లీడ్ చేయాలనుకుంటున్నాం. మా జెనరేషన్ డబ్బును చేజ్ చేయట్లేదు. టైమ్‌ని చేజ్ చేస్తోంది. – వుల్లి సృజన్, హైదరాబాద్టాక్సిక్ వాతావరణం..యూకేలో ఏంబీఏ చేశాను. కొన్ని రోజులు హెచ్ఆర్ జాబ్‌లో ఉన్నాను. కానీ ఆఫీస్‌లోని టాక్సిక్ వాతావరణం నచ్చక వదిలేశాను. నాకు ముందు నుంచీ ఫ్యాషన్, బ్యూటీ మీద ఇంట్రెస్ట్. అయితే జాబ్ వదిలేయగానే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడ్డం మొదలుపెట్టారు. నాకు బ్యూటీపార్లర్ పెట్టాలనుందని చెప్పాను. పెళ్లి ఖర్చులకు ఎంతనుకున్నారో అందులో సగం నా బిజినెస్‌కి హెల్ప్ చేయమని అడిగాను. ఏడాదిలో పికప్ కాకపోతే పెళ్లికి ఓకే అనాలనే షరతు మీద డబ్బిచ్చారు నాన్న. ఇంకొంత లోన్ తీసుకుని పార్లర్ అండ్ స్పా పెట్టాను. ఏడాదిన్నర అవుతోంది. మంచిగా పికప్ అయింది. – ప్రత్యూష వావిలాల, కరీంనగర్. -
బడిని గుడి చేసిన గురుదేవుళ్లు..
బతకలేక బడిపంతులు అనే నానుడి పోయింది.. బతకనేర్చిన బడిపంతులు అనే అపవాదును మోయాల్సి వచ్చింది.. కానీ ఇప్పుడు.. బతుకు నేర్పుతున్న బడిపంతులుగా ఆ బాధ్యతను సమాజం పూజించే స్థాయికి తీసుకెళ్లారు కొందరు ప్రభుత్వోపాధ్యాయులు!కాన్వెంట్లు, ఇంటర్నేషనల్ కరిక్యులమ్‌తో కార్పొరేట్ స్కూళ్లు.. పల్లెలు, టౌన్లు, సిటీలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా తమ వాటా పెంచుకుంటూ పోతున్నాయి. ఉద్యోగ భద్రత కోసమే సర్కారు బడి, భవిష్యత్తుపై భరోసాకు మాత్రం ప్రైవేట్ స్కూలే సరి అనేది ప్రాక్టిస్లోకొచ్చింది. ప్రోగ్రెస్ రిపోర్ట్‌లో తెలుసుకోవడం కన్నా కంఠస్థమే ఫస్ట్ వస్తోంది. నైతికవిలువల కన్నా ద్రవ్య విలువకే ఇంపార్టెన్స్ అందుతోంది. ఇంత మార్పులో కూడా తన ముద్రను ప్రస్ఫుటంగా చూపించుకుంటోంది ప్రభుత్వ పాఠశాల. గత వైభవాన్ని ప్రేరణగా మలచుకుంటోంది.రామాయణ, భారత, భాగవతాల కథలతో రామకృష్ణులను, కౌరవపాండవ పాత్రలను కళ్లముందు నిలబెట్టే గురువులు, ఇంగ్లిష్ అంటే ఇష్టమున్నా కన్ఫ్యూజ్ చేసే టెన్సెస్తో భయపెట్టే ఆ భాషను సింపుల్‌గా బుర్రకెక్కించి.. అయ్యో ఇది ఎంత వీజీ అనుకునేలా చేసే టీచర్లు, అమ్మో లెక్కలా.. గొట్టు అనుకునే పిల్లల లాజిక్ సెన్స్‌కు రెక్కలు తొడిగి.. లెక్కల మీద మోజును పెంచే మాష్టార్లు, సైన్స్ అంటే పళ్లు తోముకోవడం, సైన్స్ అంటే ఏడ్వడం, నవ్వడం, ఆకలవడం, పరుగెత్తడం, గెంతడం, అలసిపోవడటం, ఉత్సాహపడటం, నిద్రపోవడమే.. ఒక్కమాటలో ‘సైన్స్ అంటే బతుకురా’ అంటూ తేల్చేసి ఆ కొండను పిండి చేయించే సార్లు, ఊరి సర్పంచ్ ఎవరు, వార్డ్ కౌన్సిలర్ ఏం చేస్తాడు?, గాంధీ తాతా చాటిందేంటి?, చాచా నెహ్రూ చెప్పిందేంటి.. ఇట్లా మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడమే సాంఘిక శాస్త్రం అంటూ లౌకిక జ్ఞానం మీద శ్రద్ధ పెంచిన నాటి బోధకులు.. నేటి ప్రభుత్వోపాధ్యాయులకు స్ఫూర్తిప్రదాతలవుతున్నారు. నిజమే! తెలివిడితనాన్నే ప్రోగ్రెస్‌గా పరిగణిస్తున్న గురువులతో ప్రభుత్వ పాఠశాలలు పాఠాలు చెబుతున్నాయి. ఆ జాబితాలో ఇదిగో ఈ టీచర్లున్నారు. వాళ్లు అందుకుంటున్న గౌరవాభిమానాలు తెలుసుకోవాలంటే ఈ ఉదాహరణలను చదవాల్సిందే!సొంత డబ్బుతో ప్రొజెక్టర్‌ను అమర్చిన టీచర్..రామగిరి దిలీప్ కుమార్ సెకండరీ గ్రేడ్ టీచర్. ఆసిఫాబాద్ జిల్లాలోని కోపుగూడ ప్రభుత్వ పాఠశాలలో బోధన వృత్తిని ప్రారంభించారు. తర్వాత మంచిర్యాల జిల్లా, కొమ్ముగూడేనికి బదిలీ అయ్యారు. తర్వాత పదమూడేళ్లు మంచిర్యాల జిల్లా, లక్సెట్టిపేట, క్లబ్ రోడ్‌లోని ప్రాథమిక పాఠశాలలో పనిచేశారు. ప్రతిచోట తనదైన ప్రత్యేకత చాటుకున్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల్లోని విద్యార్థులకు ఆర్థిక సాయం నుంచి స్కూల్లో సౌకర్యాల పెంపునకు కృషి, సొంత డబ్బుతో ప్రొజెక్టర్లను తెచ్చి డిజిటల్ బోధన వరకు చదువు మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంచడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. స్కూల్‌కు ఒక గంట ముందే వెళ్లి, ఒక గంట ఆలస్యంగా వస్తుంటారు.4, 5 తరగతి విద్యార్థులకు ప్రత్యేక క్లాస్‌లు చెబుతూ గురుకుల, నవోదయ ప్రవేశ పరీక్షల్లో సీట్లు వచ్చేలా చేస్తున్నారు. దీంతో ఆ టీచర్‌పై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగింది. ఆ నమ్మకమే అతను ఎక్కడికి బదిలీ అయితే అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగేలా చేస్తోంది. 11 మందే విద్యార్థులున్న స్కూళ్లను 250 మంది విద్యార్థుల స్ట్రెంత్‌కి చేరుస్తోంది. గత జూలైలో ఆయన లక్సెట్టిపేట నుంచి ముల్కల్లగూడకు బదిలీ అయ్యారు. ‘సారు వెంటే మేమ’ంటూ 105 మంది విద్యార్థులు అంతకుముందు స్కూల్లోంచి టీసీ తీసుకుని ముల్కల్లగూడ స్కూల్లో చేరారు. దూరభారాన్ని లెక్కచేయక ఆటోలో వెళ్తున్నారు."ఫీజులు కట్టలేని ఎంతోమంది విద్యార్థులు సర్కారు బడిని ఎంచుకుంటున్నారు. వారికి సరైన బోధన అందిస్తే, బాధ్యతగల పౌరులుగా ఎదుగుతారు. వాళ్లను పట్టించుకోకపోతే దేశానికి భవిష్యత్ లేకుండా చేసినవాళ్లమవుతాం. టీచింగ్ అనేది ఉన్నతమైన వృత్తి. నిబద్ధతతో ఉంటూ నేను చేయగలిగినంత చేయాలనేదే నా తాపత్రయం!" – రామగిరి దిలీప్ కుమార్.బదిలీ రద్దుకై పిల్లలు ధర్నాకు దిగేంత ప్రభావం చూపిన సార్లు.."కాతలే గంగారాం.. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లిలోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆ బడిలో ఆయనది తొమ్మిదేళ్ల సర్వీస్. అంకితభావంతో పనిచేసి పిల్లలు, పెద్దల మనసులను గెలుచుకున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వాళ్లకు ప్రత్యేకంగా మరోసారి క్లాసులు తీసుకుంటారు. ఆ కర్తవ్యదీక్ష పిల్లలకు ఆయన మీద గౌరవాభిమానాలను పెంచింది. అందువల్లేమో మొన్న జూలైలో.. తమ సర్కి బదిలీ అవుతోందని తెలిసి.. ఆ స్కూల్ పిల్లలంతా రోడ్డు మీద ధర్నాకు దిగారు సర్ బదిలీ రద్దు చేయాలని కోరుతూ! ఊరి పెద్దలు, తల్లిదండ్రులు చెప్పినా వినలేదు. అంతెందుకు స్వయానా గంగారాం సర్ వచ్చి చెప్పినా ససేమిరా అన్నారు. దాంతో పోలీసులు కలగజేసుకుని నచ్చజెప్పితే ధర్నా విరమించుకున్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో విషయంలో చురుకుదనాన్ని, ఆసక్తిని, ఉత్సుకతను చూపిస్తూంటారు. ఎవరూ ఎవరికి తీసిపోరు. ఎవరికి ఏ విషయంలో ప్రోత్సాహం అవసరమో గ్రహించి అందించాలి. కోపం, కరుకుదనంతో కాకుండా వాత్సల్యంతో వాళ్లను దారిలో పెట్టాలి. పిల్లలు ఉన్నతంగా ఎదగాలనేది మా ప్రయత్నం!" – కాతలే గంగారాం.మంచిర్యాల జిల్లా, పొనకల్లో ప్రధానోపాధ్యాయుడైన జాజల శ్రీనివాస్ మీద కూడా ఆయన విద్యార్థులకు గౌరవాభిమానాలు మెండు. పొనకల్ స్కూల్‌తో ఆయనది 12 ఏళ్ల అనుబంధం. గత జూ¯Œ లో శ్రీనివాస్ సర్కి అక్కపల్లిగూడకు బదిలీ అయింది. వెంటనే పొనకల్ స్కూల్లోని 141 మంది పిల్లలు అక్కపల్లిగూడ బడిలో చేరిపోయారు. అప్పటి వరకు 11 మందే ఉన్న ఆ స్కూల్లో శ్రీనివాస్ రాకతో విద్యార్థుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపడం, 4, 5వ తరగతి విద్యార్థులకు గురుకుల, నవోదయ ప్రవేశం దొరికేలా బోధించడంతో శ్రీనివాస్ సర్ ఉన్న చోటే చేరాలని పట్టుబట్టి మరీ ఆ స్కూల్లో చేరారు పిల్లలు.వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్ బోర్డ్స్‌తో పాఠాలు చెబుతున్న స్టార్లు..ముద్దాడ బాలరాజు.. నల్లగొండ జిల్లా, వావికొల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు పేద విద్యార్థులకు చేయుత అందించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. పిల్లలకు ఉచితంగా టై, బెల్ట్, షూస్‌ని పంపిణీ చేస్తూ, నాణ్యమైన విద్యను అందించడానికి కావల్సిన సౌకర్యాలను కల్పిస్తూ వావికోల్ గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ మనసుల్లో నిలిచిపోయారు. అందుకే ఆయనకు ఇటీవల కొత్తతండాకు బదిలీ కావడంతో తమ స్కూల్‌ని వదలి వెళ్లద్దంటూ పిల్లలు కన్నీటి పర్యంతమయ్యారు.జీనుగపల్లి సుధాకర్, రామగిరి సందీప్‌లకు వీరబోయనపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలతో పదకొండేళ్ల అనుబంధం. ఆ ఇద్దరూ సొంత డబ్బును వెచ్చించడంతో పాటు దాతల సహకారంతో ఆ స్కూల్లోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విద్యావాలంటీర్లను నియమించారు. డిజిటల్ బోధనాసౌకర్యాలను ఏర్పాటు చేశారు. వీటివల్ల 50 మంది విద్యార్థులతో ఉన్న ఆ బడి 150 మందికి చేరుకుంది. అయితే ఇటీవల ఈ ఇద్దరు కూడా వరుసగా వావికోల్కు, నల్లగొండకు ట్రాన్స్ఫర్ కావడంతో ‘మాష్టార్లూ.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దంటూ’ కన్నీళ్లు పెట్టుకున్నారు పిల్లలు. ఆ ఇద్దరు టీచర్లు అందించిన సేవలను విద్యార్థుల తల్లిదండ్రులే కాదు గ్రామస్థులూ కొనియాడారు.కట్టెబోయిన సైదులు.. శిల్గాపురం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు. ఆకవరపు శివప్రసాద్ కూడా అదే స్కూల్లో టీచర్. సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెట్టక ముందే.. ఆ ఇద్దరూ సొంత ఖర్చులతో ఇంగ్లిష్ పాఠ్యపుస్తకాలు కొని, తమ స్కూల్లో ఇంగ్లిష్‌లో బోధన మొదలుపెట్టారు. దాంతో ఆ స్కూల్లో విద్యార్థుల సంఖ్య పెరగడమే కాక ఆ ఊర్లో ఏ విద్యార్థీ ప్రైవేట్ స్కూల్ మెట్లెక్కని శుభపరిణామం చోటుచేసుకుంది. పేద విద్యార్థులు విద్యకు దూరం కావద్దని కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆ టీచర్లిద్దరూ పూర్వ విద్యార్థుల సహకారంతో వీథుల్లో ఫ్లెక్సీలు, బ్లాక్ బోర్డ్స్‌ను ఏర్పాటు చేసి పాఠాలు చెప్పారు. ఆ గురుద్వయం కృషి వల్ల అయిదేళ్లుగా ఆ స్కూల్ గురుకుల పాఠశాల పోటీ పరీక్షల్లో వంద శాతం ఫలితాలను సాధిస్తోంది. ఈ కీర్తి శిల్గాపురం చుట్టుపక్కల ఊళ్లకూ వ్యాపించి అక్కడి పిల్లలూ ఈ స్కూల్లో చేరుతున్నారు. అయితే ఇటీవల ఈ ఇద్దరికీ వరుసగా పెద్దమునిగల్, రామడుగులకు బదిలీ అయింది. ఊరు ఊరంతా ఆ ఇద్దరికీ కన్నీటి వీడ్కోలు పలికింది. వాయిద్యాలతో సాగనంపి.. ఆ టీచర్ల మీద తమకున్న గౌరవాన్ని చాటుకుంది.గురిజ మహేశ్.. పదమూడేళ్లుగా టీచర్ వృత్తిలో కొనసాగుతున్నారు. ఆయన ఏ బడిలో ఉన్నా దాని మౌలిక వసతుల కల్పనకై శ్రమిస్తారు. అడ్మిషన్లు పెంచడానికి కృషి చేస్తారు. విద్యార్థుల గైర్హాజరుపై ప్రత్యేక దృష్టిపెడ్తారు. పిల్లలు బడి ఎగ్గొట్టి బావులు, పొలాల చుట్టూ తిరుగుతుంటే వెళ్లి వాళ్లను తన బైక్ మీద ఎక్కించుకుని స్కూల్‌కి తీసుకొస్తారు. చదువు ప్రాముఖ్యత గురించి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తారు. ప్రస్తుతం ఆయన దామెర ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. ఈ బడికి ఆయన 2023లో డిప్యుటేషన్‌పై వచ్చారు. ఇటీవల జరిగిన బదీలీల్లోనూ ఆయన అదే బడిలో కొనసాగుతున్నారు. వృత్తిని ప్రేమిస్తూ, దేశ భవిష్యత్‌ను తీర్చిదిద్దుతూ.. బోధన గౌరవాన్ని ఇనుమడింప చేస్తున్న గురువులు అందరికీ వందనాలు! - సాక్షి నెట్వర్క్ -
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య! ప్రశాంతమైన నిద్రపట్టాలంటే..?
నిద్రలేమి ప్రపంచవ్యాప్త సమస్య. ప్రపంచ జనాభాలో దాదాపు పది శాతం మంది దీర్ఘకాలిక నిద్రలేమితో ఇబ్బందులు పడుతున్నారు. ముప్పయి నుంచి అరవై శాతం మంది ప్రజలు తరచు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలిలోని ఒత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు వంటివి చాలామందిని నిద్రకు దూరం చేస్తున్నాయి. ఇవే కాకుండా, కొన్ని రకాల మానసిక సమస్యలతో బాధపడేవారు, కొన్ని రకాల ఔషధాలు వాడేవారు కూడా నిద్రలేమితో బాధపడేవారిలో ఉన్నారు.సాధారణ శారీరక ఆరోగ్యంతో ఉన్నవారు నిద్రలేమితో బాధపడుతున్నారంటే, రకరకాల బయటి ఒత్తిళ్లు అందుకు కారణమవుతాయి. అంతేకాకుండా, ఆహారపు అలవాట్లు కూడా నిద్రను దూరం చేస్తాయి. ప్రశాంతమైన నిద్రపట్టాలంటే, నిద్రపోయే ముందు కొన్ని రకాల ఆహార పానీయాలను తీసుకోకుండా ఉండటమే క్షేమమని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమికి దారితీసే ఇతరేతర కారణాలను విడిచిపెడితే, ఆరోగ్యవంతుల్లో నిద్రలేమికి సర్వసాధారణంగా ఆహార పానీయాలే కారణమవుతుంటాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో రుజువైంది. తాజాగా ఇదే విషయాన్ని శాన్ఫ్రాన్సిస్కోలోని స్టాన్ఫోర్డ్ స్లీప్ మెడిసిన్ సెంటర్‌కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ షెరీ మాహ్ నిద్రలేమికి దారితీసే ఆహార, పానీయాల గురించి పలు అంశాలను విపులంగా వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం...నిద్రను దూరం చేసేవి ఇవే!మద్యం, కెఫీన్‌తో కూడిన కాఫీ, టీ, సాఫ్ట్‌డ్రింక్స్ వంటి పానీయాలు, వేపుడు వంటకాలు, తీపి పదార్థాలు, టమాటోలు, టమాటోలతో తయారు చేసిన పదార్థాలు నిద్రను చెడగొడతాయి. నిద్రపోయే ముందు వీటిని తీసుకుంటే, నిద్రపట్టడం కష్టమవుతుంది. వీటి వల్ల కడుపులో ఆమ్లాలు పెరిగి, కడుపు మంట, ఉబ్బరం ఇబ్బంది పెడతాయి. ఫలితంగా కునుకు పట్టని పరిస్థితి ఎదురవుతుంది. చాలామందికి రాత్రి భోజనం తర్వాత మిఠాయిలు తినడం, ఐస్‌క్రీమ్ తినడం అలవాటు. నిద్ర పట్టకుండా ఉంటే, కొందరు అదే పనిగా పిండిపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే చిరుతిళ్లు తింటూ ఉంటారు. ఇలాంటివి నిద్రను మరింతగా చెడగొడతాయి. రాత్రిపూట ఏం తింటే కడుపు తేలికగా ఉంటుందో, ఎలాంటి పదార్థాలు త్వరగా జీర్ణమవుతాయో జాగ్రత్తగా గమనిస్తూ తినడం అలవాటు చేసుకోవాలి. కడుపులో గడబిడకు దారితీసే పదార్థాలను పడుకునే ముందు తినడం ఏమాత్రం మంచిది కాదు. వాటి వల్ల నిద్రలేమితో పాటు జీర్ణకోశ సమస్యలు కూడా తలెత్తుతాయి. – నిద్రలేమికి దారితీసే పదార్థాల్లో కెఫీన్‌కు మొదటి స్థానం దక్కుతుంది. రాత్రివేళ కాఫీ, టీ, కెఫీన్ ఉండే సాఫ్ట్‌డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం మంచిది కాదు.– రాత్రి భోజనంలో మసాలాలు దట్టించిన ఆహార పదార్థాలు, బాగా పుల్లని ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం కలిగి, నిద్రలేమి తలెత్తుతుంది.– రాత్రిపూట నీటిశాతం అధికంగా ఉండే పుచ్చకాయలు, కీరదోసకాయలు వంటివి ఎక్కువగా తీసుకోకూడదు. వీటివల్ల త్వరగా బ్లాడర్ నిండి, మూత్రవిసర్జన అవసరం వల్ల నిద్రాభంగం అవుతుంది.– రాత్రిపూట తీపిపదార్థాలు తినడం మంచిది కాదు. వీటి వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి, నిద్రను చెడగొడుతుంది. రాత్రిభోజనంలో బఠాణీలు, డ్రైఫ్రూట్స్, కాలీఫ్లవర్, క్యాబేజీ వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ పెరుగుతుంది. ఫలితంగా సరిగా నిద్రపట్టదు.ఆలోచనలకు కళ్లెం వేయాలి..శరీరం ఎంతగా అలసిపోయినా, మనసులో ఆలోచనల పరంపర కొనసాగుతున్నప్పుడు నిద్ర రాదు. ప్రశాంతంగా నిద్రపట్టాలంటే ఆలోచనలకు కళ్లెం వేయాలంటారు డాక్టర్ షెరీ మాహ్. ఆలోచనల వేగానికి కళ్లెం వేయడానికి ఆమె ఏం చెబుతున్నారంటే– నిద్రపోవడానికి పక్క మీదకు చేరినప్పుడు పడక గదిలో మసక వెలుతురుతో వెలిగే బెడ్‌లైట్ తప్ప మరేమీ వెలగకూడదు. పక్క మీదకు చేరిన తర్వాత పది నిమిషాల సేపు మనసులో రేగే ఆలోచనల వేగానికి కళ్లెం వేసే ప్రయత్నం చేయాలి. నెమ్మదిగా కాళ్లు, చేతులను సాగదీయాలి. గాఢంగా ఊపిరి తీసుకుని, నెమ్మదిగా విడిచిపెడుతుండాలి. ఈ చర్యల వల్ల నాడీ వ్యవస్థ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోవడం మొదలై చక్కగా నిద్ర పడుతుంది. అప్పటికీ ఇబ్బందిగా ఉంటే, మనసులోని ఆలోచనలను కాగితంపై రాయడం, చేయవలసిన పనులను జాబితాలా రాయడం వంటి పనులు మనసుకు కొంత ఊరటనిచ్చి, నెమ్మదిగా నిద్రపట్టేలా చేస్తాయి.దీర్ఘకాలిక నిద్రలేమితో అనర్థాలు..ఆధునిక జీవన శైలిలోని ఆర్థిక ఇబ్బందులు, భవిష్యత్తుపై అభద్రత, దీర్ఘకాలిక వ్యాధులు, పొగ తాగడం, మద్యం సేవించడం వంటి దురలవాట్లు నిద్రలేమికి దారితీస్తాయి. తరచు విమానయానాలు చేసేవారిలో జెట్లాగ్ వల్ల కూడా నిద్రలేమి తలెత్తుతుంది. నిద్రలేమి దీర్ఘకాలిక సమస్యగా మారితేనే ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది.– నిద్రలేమి వల్ల చురుకుదనం లోపించి, పనితీరు మందగిస్తుంది.– వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశాలు పెరుగుతాయి.– మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. కుంగుబాటు, ఆందోళన పెరుగుతాయి.– దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల అధిక రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.– రాత్రిపూట నిద్రపట్టక అదేపనిగా చిరుతిళ్లు తినే అలవాటు వల్ల స్థూలకాయం, మధుమేహం వంటి పరిస్థితులు తలెత్తుతాయి.నిద్రలేమిని అరికట్టాలంటే!కొద్దిపాటి జాగ్రత్తలతొ నిద్రలేమిని తేలికగానే అధిగమించవచ్చు. నిద్రపోయే పరిసరాలను పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల ఫలితం ఉంటుంది. దీంతో పాటు మరికొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే, నిద్రలేమిని జయించవచ్చు. · రాత్రి తేలికపాటి భోజనం మాత్రమే చేయాలి. · ప్రతిరోజూ రాత్రిపూట ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి – పడకగదిలో విపరీతమైన వెలుగు, రణగొణ శబ్దాలు లేకుండా చూసుకోవాలి.– పడకగది ఉష్ణోగ్రత సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోవాలి.– ప్రతిరోజూ వ్యాయామం చేయడాన్ని అలవాటుగా చేసుకుంటే చక్కగా నిద్రపడుతుంది.– అలాగని నిద్రపోయే ముందు అతిగా వ్యాయామం చేయడం తగదు.– ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్రపట్టకుంటే, పక్క మీద నుంచి లేచి కాసేపు కూర్చుని మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది. తిరిగి నిద్ర ముంచుకొస్తున్నట్లు అనిపించినప్పుడు పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.మంచి నిద్రకు దోహదపడే పదార్థాలు..– నిద్రపోయే ముందు గోరువెచ్చని పాలు తాగడం మంచిది. పాలలోని ‘ట్రిప్టోఫాన్’ అనే అమినో యాసిడ్ మంచి నిద్రకు దోహదపడుతుందని అంతర్జాతీయ పరిశోధనల్లో రుజువైంది.– చక్కని నిద్ర కోసం అరటిపండ్లు తీసుకోవడం కూడా మంచిదే! అరటిపండ్లలో నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌తో పాటు మెగ్నీషియం, పొటాషియం కూడా పుష్కలంగా ఉంటాయి.– ద్రాక్షలు ‘మెలటోనిన్’ను సహజంగా కలిగి ఉంటాయి. నిద్రపోయే ముందు ద్రాక్షలను తినడం వల్ల కూడా చక్కని నిద్రపడుతుంది.కొన్ని రకాల ఆహార పానీయాలు మంచి నిద్రకు దోహదం చేస్తాయి. నిద్రలేమితో బాధపడేవారు వీటిని రోజువారీగా తీసుకుంటున్నట్లయితే, నిద్రలేమి సమస్య నుంచి సులువుగా బయటపడగలుగుతారు. ప్రశాంతమైన నిద్రకు దోహదపడే పదార్థాలు ఇవి:– నిద్రపోయే ముందు వాల్నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వంటి గింజలు తీసుకోవడం మంచిది. వీటిలో ‘ట్రిప్టోఫాన్’, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.– రాత్రిభోజనంలో పొట్టుతీయని బియ్యం, గోధుమలు, ఇతర చిరుధాన్యాలతో తయారైన పదార్థాలు తినడం మంచిది. ఇవి శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిని మెరుగుపరచడమే కాకుండా, నిద్రకు దోహదపడే ‘ట్రిప్టోఫాన్’ అమినో యాసిడ్‌ను శరీరం పూర్తిగా శోషించుకునేలా చేస్తాయి.– రాత్రిభోజనం తర్వాత ఐస్‌క్రీమ్‌ల బదులు పెరుగు తినడం మంచిది. పెరుగు తిన్నట్లయితే, శరీరంలో నిద్రకు దోహదపడే ‘మెలటోనిన్’ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది.– అలాగే, ‘ట్రిప్టోఫాన్’ పుష్కలంగా ఉండే గుడ్లు, చికెన్ వంటివి రాత్రిభోజనంలో తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. అయితే, వీటిని వండటంలో మసాలాలు ఎక్కువగా వాడినట్లయితే, ప్రయోజనం దెబ్బతింటుంది.మంచి నిద్రకు... మంచి ఆహారం!నిద్రకీ ఆహారానికీ సంబంధం ఉంది. కొన్ని ఆహారాలు నిద్రలేమికి కారణం కావచ్చు. కొన్ని ఆహారాలు తీసుకున్న తర్వాత ఆ మసాలాలలోని స్టిములెంట్స్ రక్తప్రసరణ వేగాన్ని పెంచడం నిద్రలేమికి దారితీయవచ్చు. అందుకే మంచి నిద్రపట్టాలంటే తక్కువ మసాలాలతో, పోషకాలతో కూడిన తేలికపాటి సమతులాహారాన్ని తీసుకోవడం మేలు. ప్రత్యేకంగా చెప్పాలంటే కాఫీ లేదా టీ తీసుకున్న తర్వాత అందులోని హుషారు కల్పించే కెíఫీన్, క్యాటెచిన్ వంటి ఉత్ప్రేరకాలు నిద్రను దూరం చేస్తాయి. గ్రీన్ టీ వంటి వాటిల్లోని ఎపిగ్యాలో క్యాటెచిన్, క్యాటెచిన్ ఎపిగ్యాలేట్ వంటివీ నిద్రకు శత్రువులే. కేవలం కాఫీ టీలలోనే కాకుండా ఎనర్జీ డ్రింక్స్, కోలా డ్రింక్స్‌లోనూ కెఫీన్ ఉంటుంది. మధ్యాహ్న, రాత్రి భోజనాల తర్వాత కెఫీన్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే కెఫీన్లోని హుషారును కలిగించే ప్రభావ సమయం చాలా ఎక్కువ. అందువల్ల అది నిద్రలేమిని కలిగించే అవకాశమూ ఎక్కువే! ఇక పాలలోని ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ స్వాభావికంగానే నిద్రపోయేలా చేస్తుంది. గుడ్లలోని తెల్లసొన, చేపలు, వేరుశనగలు, గుమ్మడి గింజల్లోనూ ట్రిప్టోఫాన్ ఉంటుంది కాబట్టి అవీ కొంతవరకు సహజ నిద్రను అందిస్తాయి. – డాక్టర్ కిషన్ శ్రీకాంత్, స్లీప్ స్పెషలిస్ట్ అండ్ కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మునాలజిస్ట్, స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
రాళ్లూ.. చిగురిస్తాయి..!
రాతి నేలల్లో సిరుల పంటలు పండుతున్నాయి. నాగళ్లకు ఎదురుతిరిగే రాతి నేలలవి. అలాంటి నేలల్లో సాగు చేయడం అంత తేలిక పని కాదు. రాతి నేలలకు పచ్చదనం అద్దిన రైతులు పడినది మామూలు కష్టం కాదు. మూడు తరాల రైతుల అవిరళ కృషి ఫలితంగా ఒకప్పుడు బోసిగా కనిపించిన రాతినేలలు ఇప్పుడు పచ్చగా కళకళలాడుతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా రైతులు కొండ ప్రాంతాల్లోని రాతినేలల్లో వర్షాధార పంటలను సాగు చేస్తున్నారు. రాతినేలల్లో చెమటను, నెత్తుటిని చిందించి మరీ వారు చేస్తున్న ఆదర్శ వ్యవసాయం గురించి తెలుసుకుందాం...విత్తనాలు వేసేటప్పుడు రాళ్లల్లో నడుస్తుంటే, అరికాళ్లకు రాళ్లు గుచ్చుకుంటాయి. రాళ్లల్లో మొలకెత్తిన కలుపు తీస్తుంటే, చేతులు చీరుకుపోయి నెత్తురు చిమ్ముతుంది. అయినా, వారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా సాగు చేస్తారు. తాతల కాలం నుంచి వారు ఇదే పని కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి, లింగంపేట, తాడ్వాయి, జుక్కల్, పెద్దకొడప్గల్, రాజంపేట మండలాల్లోని పలు గ్రామాల్లో ఈ పరిస్థితి కనిపిస్తుంది.ఈ జిల్లాలో 5.26 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉంటే, వాటిలో దాదాపు పదిశాతం రాతినేలలే! వీటినే నమ్ముకుని వేలాది రైతులు మూడు తరాలుగా సాగు చేస్తున్నారు. ఇదివరకటి కాలంలో నాగళ్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. నాగళ్లతో దున్నేటప్పుడు ఎడ్ల కాళ్లకు గాయాలయ్యేవి. ట్రాక్టర్లు అందుబాటులోకి వచ్చాక, పని కొంచెం సులువైనా, ఖర్చులు బాగా పెరిగాయని ఇక్కడి రైతులు చెబుతున్నారు. ఏటా రాళ్లు తీసి కుప్పలుగా పోస్తున్నా, తవ్వే కొద్ది రాళ్లు వస్తూనే ఉంటాయని, రాళ్ల మధ్యనే సేద్యం చేయడం తమకు అలవాటైపోయిందని ఈ రైతులు చెబుతారు.వర్షాధార వ్యవసాయం..ఈ రాతినేలల్లో వేసే పంటలకు వర్షాలే ఆధారం. మంచి వర్షాలు కురిసినప్పుడు అధిక దిగుబడులు వస్తాయి. వర్షాలు సరిగా కురవకపోయినా, అకాల వర్షాలు కురిసినా రైతులకు నష్టాలు తప్పవు. వర్షాధార పరిస్థితుల వల్ల ఇక్కడి రైతులు ఎక్కువగా ఆరుతడి పంటలనే సాగు చేస్తుంటారు. ఈ రాతి నేలల్లో పత్తి, మొక్కజొన్న, సోయా పంటలను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అక్కడక్కడా వరి కూడా సాగు చేస్తున్నారు. ఈ పంటలను అడవి జంతువుల దాడి నుంచి కాపాడుకోవడం రైతులకు పెనుసవాలు.పొలాల్లోకి అడవి జంతువులు చొరబడకుండా ఉండేందుకు కొందరు రైతులు సోలార్ ఫెన్సింగ్‌లు ఏర్పాటు చేసుకుంటే, మరికొందరు పొలాల చుట్టూ ఇనుప తీగెలు కట్టి, రాత్రివేళల్లో పొలాలకు కాపలా ఉంటున్నారు. రాళ్లతో కూడుకున్నవన్నీ నల్లరేగడి నేలలు కావడంతో ఇక్కడ పంటల దిగుబడి ఆశాజనకంగానే ఉంటుంది. రాళ్ల మధ్య తేమ వారం రోజుల వరకు అలాగే ఉంటుంది. వారం రోజుల తర్వాత వర్షం కురిస్తే పంటలకు ఎలాంటి ఢోకా ఉండదని రైతులు చెబుతున్నారు. రాతినేలలు ఉన్న ప్రాంతాలు సాధారణంగా వర్షాలకు అనుకూలంగానే ఉంటాయి. తగిన వానలు కురవకపోవడం వల్ల పంటల దిగుబడులు తగ్గిన సందర్భాలు ఈ ప్రాంతంలో అరుదుగానే ఉంటాయి.మూడు తరాల వాళ్లం కష్టపడ్డాం..మా తాత మందిరానాయక్, మా నాయిన నంగరాజ్, తరువాత నేను మూడు తరాల వాళ్లం రాళ్లను ఏరి చుట్టూ కంచె వేశాం. మూడెకరాల భూమిని రాళ్లు లేని భూమిగా తయారు చేసి, వరి పంట పండిస్తున్నం. వర్షాకాలంలో ఏ ఇబ్బంది లేకుండా బావినీళ్లతో పంట పండుతుంది. ఇక్కడ బోర్లు వేస్తే పడవు. మూడు తరాల కష్టానికి మూడెకరాల వరి పొలం తయారైంది. – దేవిసింగ్, చద్మల్ తండాచేతులు పగిలి మంట పెడుతుంది..కలుపు తీస్తుంటే అరచేతికి, వేళ్లకు రాళ్లు గుచ్చుకుని రక్తం కారుతది. మంట పెడుతున్నా కష్టపడుతున్నం. రాళ్లు ఎంత ఏరినా తగ్గిపోవు. అందుకే ఉన్న రాళ్లల్లోనే పంట వేస్తున్నం. కాలం మంచిగ అయితే పంట దిగుబడి వస్తుంది. ఇప్పటికైతే మా దిక్కు వానలు మంచిగనే పడ్డయి. ముందు ఇట్లనే ఉంటే బాగుంటుంది. – సురేఖ, బూర్గుల్ తండాఅరికాళ్లకు అన్నీ గాయాలే..మాకు నాలుగెకరాల భూమి ఉంది. ట్రాక్టర్‌తో దున్నించి మొక్కజొన్న పంట వేస్తుంటం. విత్తనం వేసినపుడు, కలుపు తీసినపుడు రాళ్లు గుచ్చుకుని అరికాళ్లు నొప్పిగా తయారై ఇబ్బంది పడుతుంటం. వాన పడితే పంట మంచిగనే వస్తది. వానలు కింద మీద అయితే రెక్కల కష్టం పోతది. దేవుని మీద భారం వేసి పంటలు వేస్తున్నం. – పారిబాయి, గుర్జాల్ తండాతాతల కాలం నుంచి ఇదే కష్టం..మాకు 1957లో పట్టాలు వచ్చినయి. అప్పటి నుంచి మా తాతలు, తరువాత మా తండ్రులు, ఇప్పుడు మేం రాళ్లల్లనే పంటలు వేస్తున్నం. మూడు ఎకరాల్లో పత్తి వేసినం. విత్తనం వేసిన నుంచి పంట చేతికి వచ్చేదాకా అవస్థలు పడాల్సిందే! సమయానికి వాన పడితే పంటకు ఇబ్బంది ఉండదు. రోగాలు వచ్చినపుడు మందులు కొడుతుంటం. – ప్రేమ్‌సింగ్, గుర్జాల్ తండాఐదెకరాలూ రాళ్ల భూమే!నేను ఇంజినీరింగ్ చదివి ఇంటి వద్దే వ్యవసాయం చూసుకుంటున్నాను. మాకు ఐదెకరాల భూమి ఉంది. అది కూడా రాళ్ల భూమే! వర్షంపైనే ఆధారపడి సాగు చేస్తున్నాం. పత్తి, సోయా, మొక్కజొన్న పంటలు వేశాం. కొద్దిగా వరి కూడా పండిస్తున్నాం. మా ఊరి శివారే కాదు చుట్టుపక్కల ఊళ్లన్నీ రాళ్లు, రప్పలతో కూడుకున్న భూములే ఉన్నయి. రాళ్ల భూములే అయినా కష్టపడుతున్నం. – ధన్‌రాజ్, గుర్జాల్ తండాఖర్చు ఎక్కువ..రాళ్ల భూములల్ల దున్నడానికి ట్రాక్టర్‌కు ఎక్కువ టైం తీసుకుంటది. అట్లనే కిరాయ కూడా ఎక్కువ అడుగుతరు. గంటలకు రూ.8 వందల నుంచి రూ.9 వందలు తీసుకుంటరు. దున్నడానికి ఎక్కువ సమయం పట్టడంతో ఖర్చు ఎక్కువవుతుంది. కలుపు ఇంటోళ్లమే తీసుకుంటున్నం. రాళ్లు తగిలి కాళ్లకు గాయాలైతున్నా భరిస్తం. – రవి, బూర్గుల్ తండాకాలం కలిసొస్తే మంచి దిగుబడులు..పంటకు అనుకూలంగా మంచి వర్షాలు కురిస్తే చాలు, మంచి దిగుబడులు వస్తాయి. రైతుల రెక్కల కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. కొన్నిచోట్ల ఎకరానికి 40 క్వింటాళ్ల వరకు కూడా దిగుబడులు వస్తాయని రైతులు చెబుతున్నారు. రాతినేలల్లో ఈ స్థాయి దిగుబడులు రావడం విశేషమే! సరైన పంట యాజమాన్య పద్ధతులు పాటించకుంటే, ఎకరానికి 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడులు మాత్రమే వస్తాయి. అయితే, ఈ రాతి నేలలను దున్నడంలో రైతులు సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేలలను దున్నడానికి ట్రాక్టర్ యజమానులు ఆసక్తి చూపరు. సాధారణమైన సాగునేలలను దున్నడానికి గంటకు ఎనిమిది వందల రూపాయలు తీసుకుంటారు.ఈ రాతినేలలను దున్నడానికి వెయ్యి రూపాయల వరకు తీసుకుంటారు. సాధారణ పొలాల్లో ఎకరం దున్నడానికి గంట నుంచి గంటన్నర సమయం సరిపోతుంది. రాతి నేలలు దున్నడానికి రెట్టింపు సమయం పడుతుంది. ఈ పరిస్థితి వల్ల దుక్కి దున్నడానికే రైతులకు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఈ నేలల్లో కలుపు తీయడానికి కూలీలు దొరకరు. ఇక్కడ కలుపు తీస్తే చేతులకు గాయాలు తప్పవు. కూలీల కొరత వల్ల చాలా పొలాల్లో రైతుల కుటుంబ సభ్యులే కలుపు తీస్తుంటారు. ఇంతటి కఠోర శ్రమకు ఓరుస్తూనే ఈ రైతులు అధిక దిగుబడులు సాధిస్తున్నారు. – ఎస్.వేణుగోపాల చారి, సాక్షిప్రతినిధి, కామారెడ్డిఇవి చదవండి: కాలనీలో థ్రిల్ -
రణయంత్రాలు.. 'యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని?'
‘యుద్ధాన్ని మనం ముగించకుంటే యుద్ధం మనల్ని ముగించేస్తుంది’ అన్నాడు ఇంగ్లిష్ రచయిత హెచ్‌జీ వెల్స్. చాలామంది దేశాధినేతలు ఇప్పటికీ ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే కొత్త కొత్త యుద్ధాలను మొదలుపెడుతున్నారు. మానవాళి జీవనసరళిని సులభతరం చేయాల్సిన శాస్త్రసాంకేతిక పరిజ్ఞానాన్ని యుద్ధాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సునాయాసంగా సామూహిక జనహననం చేయగల అధునాతన ఆయుధాలను, యుద్ధ వాహనాలను తయారు చేసుకుంటున్నారు. చివరకు రోబో సైనికులను కూడా రంగంలోకి దించుతున్నారు. ‘యుద్ధం విధ్వంసశాస్త్రం’ అన్నాడు కెనడా మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు జాన్ అబట్. ఈ విధ్వంసశాస్త్ర పురోగతిపై ఒక విహంగ వీక్షణం...యుద్ధాలు ఎందుకు తలెత్తుతాయంటే, కచ్చితమైన కారణాలను చెప్పడం కష్టం. ప్రధానంగా నియంతల నిరంకుశ ధోరణి, జాత్యహంకారం, మతోన్మాదం, రాజ్యవిస్తరణ కాంక్ష వంటివి చరిత్రలో ప్రధాన యుద్ధ కారణాలుగా కనిపిస్తాయి. అయితే, ఇలాంటి పెద్దపెద్ద కారణాల వల్లనే యుద్ధాలు జరుగుతాయనుకుంటే పొరపాటే! చాలా చిల్లరమల్లర కారణాలు కూడా యుద్ధాలకు దారితీసిన సందర్భాలు ఉన్నాయి.చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్ వార్’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్ దీవికి మధ్య శాన్ జువాన్ దీవి ఉంది. లైమాన్ కట్లర్ అనే అమెరికన్ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్ జువాన్ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.రణ పరిణామం..మొదటి ప్రపంచయుద్ధం నాటికి యుద్ధరంగంలోకి తుపాకులు, ఫిరంగులు, యుద్ధట్యాంకులు, బాంబులను జారవిడిచే యుద్ధవిమానాలు, జలమార్గం నుంచి దాడులు చేసే యుద్ధనౌకలతో పాటు ప్రమాదకరమైన రసాయనిక ఆయుధాలు కూడా వచ్చిపడ్డాయి. రెండో ప్రపంచయుద్ధంలో అణుబాంబులు అందుబాటులోకి వచ్చాయి. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికన్ బలగాలు జారవిడిచిన అణుబాంబుల పర్యవసానాలు తెలిసినవే! మొదటి రెండు ప్రపంచయుద్ధాలూ కోట్ల సంఖ్యలో ప్రాణాలను కబళించాయి. ఈ యుద్ధాలు మానవాళికి అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. అలాగని యుద్ధాలు సమసిపోలేదు. రెండు ప్రపంచయుద్ధాల తర్వాత కూడా అనేక యుద్ధాలు జరిగాయి, జరుగుతున్నాయి. కొన్ని అంతర్యుద్ధాలు, ఇంకొన్ని ప్రచ్ఛన్నయుద్ధాలు, మరికొన్ని ప్రత్యక్ష యుద్ధాలు– ఒక్కొక్క యుద్ధంలో సాంకేతిక ఆయుధాలు పదునెక్కుతూ వస్తున్నాయి. ఇప్పటి యుద్ధాల్లో రణయంత్రాలే రణతంత్రాలను నిర్దేశిస్తున్నాయి. కృత్రిమ మేధ యుద్ధాల తీరుతెన్నులనే మార్చేస్తోంది.రోబో సైనికులు..పాతకాలంలో సైనికులు పరస్పరం ఎదురుపడి తలపడేవారు. ఒక్కోసారి ఏ కొండల చాటునో, గుట్టల చాటునో మాటువేసి దొంగదాడులతో శత్రుబలగాల మీద విరుచుకుపడేవారు. ఇప్పుడు రోజులు మారాయి. యుద్ధరంగంలోకి రోబో సైనికులను దించుతున్నారు. వీటిని ఎక్కడో ఉంటూ రిమోట్ ద్వారా నియంత్రిస్తూ, శత్రువులను మట్టుబెట్టగలుగుతున్నారు. అలాగే, శత్రువుల నుంచి ఎదురయ్యే ప్రమాదాలను సమర్థంగా నిరోధించగలుగుతున్నారు. రోబో సైనికులు ఆయుధాలను ప్రయోగించడమే కాకుండా, శత్రువులు అమర్చిన మందుపాతరలను తొలగించడం, బాంబులను ఏరివేయడం వంటి పనులు కూడా చేయగలవు. అమెరికా, చైనా వంటి దేశాలు ఇప్పటికే రోబో సైనికులను రూపొందించుకున్నాయి.వీటిలో కృత్రిమ మేధతో పనిచేసేవి కూడా ఉండటం విశేషం. ఈ రోబోసైనికులు యుద్ధరంగంలో సైనికుల పనిని సులభతరం చేస్తాయి. దాడులకు తెగబడే శత్రుబలగాలను తిప్పికొట్టడం, శత్రువులపై కాల్పులు జరపడం, శత్రు స్థావరాలను ధ్వంసం చేయడం వంటి పనులను సునాయాసంగా చేస్తాయి. దక్షిణ కొరియా సైన్యం కాపలా విధుల కోసం సెంట్రీ రోబోలను ఉపయోగిస్తోంది. అధునాతన తుపాకులను అమర్చిన ఈ సెంట్రీ రోబోలు సైనిక స్థావరాల వద్ద గస్తీ తిరుగుతుంటాయి. శత్రువులను గుర్తించినట్లయితే, కాల్పులు జరుపుతాయి. యుద్ధరంగంలో రోబో సైనికులతో పాటు చాలా దేశాలు వేర్వేరు పనుల కోసం వేర్వేరు రోబోలను కూడా వాడుతున్నాయి.యుద్ధరంగంలో భావి సాంకేతికత..ఇప్పటికే పలు అధునాతన ఆయుధాలు, సైనిక పరికరాలు అగ్రరాజ్యాల అమ్ములపొదిలోకి చేరాయి. ఈ దేశాలు మరిన్ని అధునాతన ఆయుధాలు, వాహనాలు, సైనిక పరికరాల కోసం పరిశోధనలు సాగిస్తున్నాయి. రిస్ట్మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్, హెల్మెట్ మౌంటెడ్ రాడార్ సిస్టమ్ వంటి పరికరాల రూపకల్పన ఇప్పటికే తుదిదశకు చేరుకుంది. వీటి నమూనాలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. రిస్ట్మౌంటెడ్ డిస్ప్లే సిస్టమ్ యుద్ధరంగంలో పనిచేసే సైనికులకు బాగా ఉపయోగపడుతుంది. సౌరశక్తితో పనిచేసే ఈ సిస్టమ్‌లోని మూడున్నర అంగుళాల స్క్రీన్‌పై చుట్టుపక్కల వివిధ దిశల్లో ఏం జరుగుతోందో, శత్రువుల కదలికలు ఎలా ఉన్నాయో ఎప్పటికప్పుడు చూడవచ్చు. హెల్మెట్ మౌంటెడ్ రాడార్ సిస్టమ్ 360 డిగ్రీలలో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు స్క్రీన్‌పై ప్రసారం చేస్తుంది.ఇందులోని మూవింగ్ టార్గెట్ ఇండికేటర్ (ఎంటీఐ) రాడార్ సెన్సర్ దుమ్ము ధూళి పొగ దట్టంగా కమ్ముకున్న చోట కూడా శత్రులక్ష్యాలను 50 మీటర్ల దూరం నుంచి స్పష్టంగా చూపగలుగుతున్నాయి. పలు దేశాలు ఇప్పటికే హైపర్సోనిక్ మిసైల్స్‌ను వినియోగంలోకి తెచ్చాయి. అయితే, ధ్వనివేగానికి ఇరవైరెట్ల వేగంతో దూసుకుపోయే హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అణుబాంబులను మోసుకుపోగలిగే హైపర్సోనిక్ మిసైల్స్ 2040 నాటికి అందుబాటులోకి రాగలవని అంచనా. రష్యా, చైనా, అమెరికా సైన్యాలు ఈ స్థాయి హైపర్సోనిక్ మిసైల్స్ తయారీకి పోటాపోటీగా ప్రయోగాలు సాగిస్తున్నాయి. ఇప్పటికే ఈ దేశాల సైనికబలగాలు హైపర్సోనిక్ యుద్ధవిమానాలను వాడుకలోకి తీసుకొచ్చాయి. సైనిక ప్రయోగాల కోసం, హైటెక్ ఆయుధాల తయారీ కోసం అమెరికా భారీ స్థాయిలో ఖర్చు చేస్తోంది. ఈ కార్యక్రమాల కోసం అమెరికా చేసే ఖర్చు 2040 నాటికి ట్రిలియన్ డాలర్లను (రూ.83.50 లక్షల కోట్లు) అధిగమిస్తుందని అమెరికన్ రక్షణరంగ నిపుణుడు పీటర్సన్ చెబుతున్నారు.రష్యా, చైనాలు కూడా హైపర్సోనిక్ మిసైల్స్ రూపకల్పనలో ప్రయోగాలు సాగిస్తున్నాయి. భారీస్థాయిలో విధ్వంసాలు సృష్టించగల అణుబాంబులను మోసుకుపోయి ఖండాంతర లక్ష్యాలను ఛేదించగల మిసైల్స్ తయారీకి ఈ దేశాలు ముమ్మర యత్నాలు చేస్తున్నాయి. వీటికి తోడు దుందుడుకు అధ్యక్షుడు కిమ్‌జాంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా కూడా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రమాదకర ఆయుధాల తయారీకి ప్రయోగాలను సాగిస్తోంది. వివిధ దేశాలు డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ తయారీకి ప్రయోగాలు సాగిస్తున్నాయి. రైల్ గన్స్ వంటి డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్ ప్రభావవంతంగా పనిచేసే ఆయుధాలే అయినప్పటికీ, విద్యుత్తు సరఫరా ఉంటేనే ఇవి పనిచేయగలవు. యుద్ధక్షేత్రంలో విద్యుత్తు సరఫరా కోసం అత్యధిక సామర్థ్యం గల హైడెన్సిటీ మొబైల్ పవర్స్టోరేజ్ సిస్టమ్స్, మినీ న్యూక్లియర్ రియాక్టర్స్ వంటి వాటి తయారీకి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.కొనసాగుతున్న యుద్ధాలు..ఇప్పటికే ఉక్రెయిన్–రష్యాల మధ్య, ఇజ్రాయెల్– పాలస్తీనా, ఇజ్రాయెల్–లెబనాన్, సూడాన్‌లోని రెండు వర్గాల సైన్యం మధ్య యుద్ధాలు కొనసాగుతున్నాయి. వీటి వల్ల ఇప్పటికే చాలా ప్రాణనష్టం, ఆస్తినష్టం జరిగింది. ఈ యుద్ధాలను నిలువరించేందుకు ఐక్యరాజ్య సమితి సహా అంతర్జాతీయ శక్తులు చేస్తున్న ప్రయత్నాలు సఫలమయ్యే సూచనలు కనిపించడం లేదు. ఇతర దేశాలు బాహాటంగా వీటిలో ఏదో ఒక పక్షం తీసుకున్నట్లయితే, దాని పర్యవసానంగా మూడో ప్రపంచయుద్ధం ముంచుకొచ్చే ప్రమాదం లేకపోలేదు.ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలే కాకుండా, ఇథియోపియా, హైతీ వంటి దేశాల్లోని అలజడులు, ఆసియా–పసిఫిక్ ప్రాంతంపై పట్టు కోసం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న పోరు ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టం. ఈ పరిస్థితులు అదుపు తప్పి మూడో ప్రపంచ యుద్ధమే గనుక జరిగితే, జరగబోయే బీభత్సం ఊహాతీతంగా ఉంటుంది. ‘మూడో ప్రపంచయుద్ధంలో ఏ ఆయుధాలతో పోరు జరుగుతుందో నాకు తెలీదు గాని, నాలుగో ప్రపంచయుద్ధంలో మాత్రం మనుషులు కర్రలు, రాళ్లతోనే కొట్టుకుంటారు’ అని ఐన్‌స్టీన్ ఏనాడో అన్నాడు. మూడో ప్రపంచయుద్ధమే గనుక సంభవిస్తే, దాని దెబ్బకు భూమ్మీద నాగరికత తుడిచిపెట్టుకుపోయే అవకాశాలు ఉన్నాయి. యుద్ధంలో మరణించిన వాళ్లు మరణించగా, అరకొరగా మిగిలిన వాళ్ల మధ్య గొడవలు తలెత్తితే, వాళ్ల పోరాటానికి ఆధునిక ఆయుధాలేవీ మిగిలి ఉండకపోవచ్చు. అప్పుడు ఐన్‌స్టీన్ మాటలే నిజం కూడా కావచ్చు.రోబో వాహనాలు..దేశాల సైనిక బలగాలు రకరకాల రోబో వాహనాలను వాడుతున్నాయి. డ్రైవర్ లేకుండానే ఇవి ప్రయాణించగలవు. రిమోట్ కంట్రోల్‌తో వీటిని సుదూరం నుంచి నియంత్రించవచ్చు. వీటిలో కొన్నింటికి ఆయుధాలను అమర్చి యుద్ధరంగానికి పంపే వెసులుబాటు ఉంది. వీటి ద్వారా శత్రుస్థావరాలను ఇట్టే మట్టుబెట్టవచ్చు. కొన్ని రకాల రోబో వాహనాలను శత్రువులు అమర్చిన మందుపాతరలను, బాంబులను నిర్వీర్యం చేయడానికి కూడా వాడుతున్నారు. రోబో వాహనాల్లో యుద్ధట్యాంకుల స్థాయి వాహనాల నుంచి బాంబులు, మందుపాతరలను గుర్తించి, వాటిని నిర్వీర్యం చేసే ఆటబొమ్మల్లా కనిపించే చిన్న చిన్న రోబో వాహనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, అమెరికన్ బలగాలు ఉపయోగిస్తున్న ‘గార్డ్బో’ అనే రోబో వాహనం చూడటానికి బంతిలా ఉంటుంది. ఇది ఉభయచర వాహనం. నేల మీద, నీటిలోను ఇది సునాయాసంగా ప్రయాణించగలదు.ఇది గస్తీకి, నిఘా పనులకు ఉపయోగపడుతుంది. అమెరికన్ బలగాలు వాడుతున్న ‘మాడ్యులర్ అడ్వాన్స్డ్ ఆర్మ్డ్ రోబోటిక్ సిస్టమ్’ (మార్స్) మనుషులు నడిపే యుద్ధట్యాంకులకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. దీనిని మనుషులు నేరుగా నడపాల్సిన పనిలేదు. రిమోట్ కంట్రోల్‌తో దీనిని సుదూరం నుంచి నియంత్రంవచ్చు. దీనికి అమర్చిన ఫిరంగులతో శత్రుస్థావరాలపై దాడులు జరపవచ్చు. బ్రిటిష్ సైన్యం ఉపయోగించే డ్రాగన్ రన్నర్ చూడటానికి చిన్న పిల్లల ఆటబొమ్మలా ఉన్నా, ఇది చాలా సమర్థమైన రోబో వాహనం. రిమోట్‌తో నడిచే ఈ వాహనం మందుపాతరలను, పేలని బాంబులను ముప్పయి అడుగుల దూరం నుంచి గుర్తించి, అప్రమత్తం చేస్తుంది. చైనా సైన్యం రోబో ఆర్మ్డ్ డాగ్‌ను ఇటీవల రంగంలోకి దించింది. ఇది చూడటానికి ఆటబొమ్మలా కనిపిస్తుంది గాని, దీనికి అమర్చిన ఆటోమేటిక్ గన్ ద్వారా కాల్పులు జరపగలదు. దీనిని రిమోట్ ద్వారా సుదూరం నుంచి ఉపయోగించుకోవచ్చు.మన అమ్ములపొదిలోనూ ఏఐ ఆయుధాలు..- రాజ్యాలకు పోటీగా భారత్ కూడా రోబోటిక్ ఆయుధాలను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది.హైదరాబాద్‌కు చెందిన ‘జెన్ టెక్నాలజీస్’ భారత సైన్యం కోసం ‘ప్రహస్త’ పేరుతో రోబో జాగిలాన్ని, ‘హాక్ ఐ’ పేరుతో పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను సైతం గుర్తించగలిగే యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను, ‘స్థిర్ స్టాబ్–640’ పేరుతో నేలపై తిరిగే యుద్ధ వాహనాలతో పాటు యుద్ధనౌకల నుంచి ఆయుధాలను గురి తప్పకుండా ఉపయోగపడే పరికరాన్ని, ‘బర్బరీక్’ పేరుతో అల్ట్రాలైట్ రిమోట్ కంట్రోల్ కంబాట్ వెపన్ స్టేషన్‌ను రూపొందించింది. వీటన్నింటినీ దూరం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నియంత్రించవచ్చు. శత్రువుల దాడులను తిప్పికొట్టడానికి, చొరబాటుదారులను నిరోధించడానికి ఇవి సమర్థంగా ఉపయోగపడతాయి.చిల్లర కారణంతో జరిగిన యుద్ధానికి ఒక ఉదాహరణ ‘ద పిగ్ వార్’. ఇది ఒక పంది కోసం అమెరికన్లకు, బ్రిటిషర్లకు మధ్య జరిగిన యుద్ధం. ఇదెలా జరిగిందంటే– అమెరికా ప్రధాన భూభాగానికి, వాంకోవర్ దీవికి మధ్య శాన్ జువాన్ దీవి ఉంది. లైమాన్ కట్లర్ అనే అమెరికన్ రైతు తన పొలంలోకి ప్రవేశించిన పందిని తుపాకితో కాల్చి చంపాడు. ఆ పంది బ్రిటిషర్ల అధీనంలోని హడ్సన్స్ బే కంపెనీకి చెందినది. ఈ సాదాసీదా సంఘటన శాన్ జువాన్ దీవిలో స్థిరపడ్డ అమెరికన్లకు, అక్కడ వలస వ్యాపారం సాగించే బ్రిటిషర్లకు మధ్య యుద్ధానికి దారితీసింది. ఈ యుద్ధం 1859లో ప్రారంభమై, 1872 వరకు కొనసాగింది. చరిత్రలో ఇలాంటి యుద్ధాలు మరికొన్ని కూడా జరిగాయి. సామరస్యంగా చర్చలతో పరిష్కరించుకోగలిగే చిన్నా చితకా కారణాల వల్ల తలెత్తిన యుద్ధాలు ప్రాణనష్టానికి, ఆస్తినష్టానికి దారితీశాయి.స్మార్ట్ ఆయుధాలు..‘స్మార్ట్’యుగం. స్మార్ట్ఫోన్లు ప్రపంచవ్యాప్తంగా వాడుకలోకి వచ్చిన తరుణంలోనే వివిధ దేశాల సైనిక బలగాలు తమ ఆయుధాగారాల్లోకి స్మార్ట్ ఆయుధాలను కూడా చేర్చుకుంటున్నాయి. వీటిలో స్మార్ట్ గ్రనేడ్ లాంచర్లు, డిజిటల్ రివాల్వర్లు వంటివి ఉన్నాయి. అమెరికన్ సైన్యం దశాబ్దం కిందటే స్మార్ట్ గ్రనేడ్ లాంచర్‌ను వినియోగంలోకి తెచ్చింది. ‘ఎక్స్ఎం25 కౌంటర్ డిఫిలేడ్ టార్గెట్ ఎంగేజ్మెంట్ సిస్టమ్’ (సీడీటీఈ) గ్రనేడ్ లాంచర్‌ను అఫ్గాన్ యుద్ధంలో ఉపయోగించింది. దీని నుంచి ప్రయోగించిన గ్రనేడ్లు లక్ష్యం వైపుగా దూసుకుపోయి సరిగా లక్ష్యంపైన లేదా లక్ష్యానికి అత్యంత చేరువలో గాల్లోనే పేలుతాయి. ఇవి 150 మీటర్ల నుంచి 700 మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించ గలవు. డిజిటల్ రివాల్వర్లను స్మార్ట్‌వాచ్ ద్వారా లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. ఆటబొమ్మల్లా కనిపించే ఈ డిజిటల్ రివాల్వర్లను పలు దేశాల సైనిక బలగాలు ఇప్పటికే ఉపయోగిస్తున్నాయి. సైన్స్‌ఫిక్షన్ సినిమాల్లో కనిపించేలాంటి చిత్రవిచిత్రమైన ఆయుధాలు కూడా ప్రస్తుతం విరివిగా వాడుకలోకి వస్తున్నాయి. ఉదాహరణకు హాలీవుడ్ సినిమా ‘మైనారిటీ రిపోర్ట్’లో పోలీసు బలగాలు ‘సిక్ స్టిక్స్’ అనే ఆయుధాలు ఉపయోగించిన దృశ్యాలు ఉన్నాయి.‘సిక్ స్టిక్స్’ ఎవరిని తాకినా వారికి వెంటనే వాంతులవుతాయి. ఈ సినిమా 2002లో విడుదలైతే, 2007 నాటికల్లా దాదాపు ఇలాంటి ఆయు«ధాలే ‘వోమిట్ గన్స్’ వాడుకలోకి వచ్చేశాయి. ఇవి ప్రాణాంతకమైన ఆయుధాలు కాకున్నా, అల్లరి మూకలను చెదరగొట్టేందుకు ఉపయోగపడతాయి. వీటి నుంచి వెలువడే రేడియో తరంగాలు లక్ష్యం దిశగా ప్రయాణించి, చెవులు గింగుర్లెత్తి, తలతిరిగేలా చేస్తాయి. వీటి బారి నుంచి క్షణాల్లోనే తప్పించుకోకుంటే, ఇవి వాంతులయ్యేలా చేస్తాయి. అమెరికన్ నావికాదళం కోసం ‘ఇన్వోకాన్’ కంపెనీ ఈ ‘వోమిట్ గన్స్’ను రూపొందించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే టాక్టికల్ డ్రోన్స్, అన్‌మేన్డ్ ఏరియల్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ఎయిర్‌క్రాఫ్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ ప్లేన్స్, అటానమస్ ట్యాంక్స్, అటానమస్ వెపన్స్ వంటివి కూడా స్మార్ట్ ఆయుధాల కోవలోకే వస్తాయి. సంపన్న దేశాలు పోగేసుకుంటున్న ఇలాంటి ఆయుధాలు భారీస్థాయిలో విధ్వంసాలను సృష్టించగలవు. – పన్యాల జగన్నాథదాసు -
ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ..!
మానవ పరిణామంలోని తొలి నాగరిక కళ చేనేత. నాగరికతల ప్రస్థానంలో ఇది పడుగు పేకల పోగుబంధం. ఇది తరతరాల చేనేత కళాకారుల రంగుల కళ. ఆచ్ఛాదనతో అందానికి మెరుగులు దిద్దే అరుదైన కళ. ఇది కాల పరీక్షలను తట్టుకున్న అపురూప కళ. ఒంటికి హత్తుకుపోయే చేనేత వస్త్రాల సుతిమెత్తదనాన్ని ఆస్వాదించాలనుకోవడం ఒక రంగుల కల.నాగరికతకు తొలి గుర్తు వస్త్ర«ధారణ. వస్త్రాలను తయారు చేసే చేనేత తొలి నాగరిక కళ. చేనేత వెనుక సహస్రాబ్దాల చరిత్ర ఉంది. పత్తి నుంచి నూలు వడికి వస్త్రాలను నేయడం క్రీస్తుపూర్వం 3000 నాటికే విరివిగా ఉండేది. ఉన్ని కంటే పత్తితో వస్త్రాలు నేయడం సులువు కావడంతో వివిధ ప్రాచీన నాగరికతల ప్రజలు చేనేత వస్త్రాలవైపే మొగ్గు చూపేవారు. సింధులోయ నాగరికత వర్ధిల్లిన మొహెంజదారో శిథిలాల్లో ప్రాచీన చేనేతకు సంబంధించిన ఆనవాళ్లు, నాణ్యమైన నూలు దారపు పోగులు, అద్దకానికి ఉపయోగించే రంగుల అవశేషాలు ఉన్న కుండలు దొరికాయి.ఇవి మన దేశంలో చేనేత కళ ప్రాచీనతకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పారిశ్రామిక విప్లవం తర్వాత మరమగ్గాల వినియోగం పెరిగినప్పటి నుంచి చేనేత ప్రాభవం కొంత తగ్గుముఖం పట్టిందేగాని, అదృష్టవశాత్తు కొన్ని ఇతర ప్రాచీన కళల మాదిరిగా అంతరించిపోలేదు. చేనేతకు మన దేశంలో ఇప్పటికీ అద్భుతమైన ఆదరణ ఉంది. కొన్ని నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేతకు చిరునామాగా తమ ఉనికి చాటుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడా చేనేతను ప్రోత్సహించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం మీ కోసం...మన దేశంలో వారణాసి, చందేరి, జైపూర్, సూరత్, పానిపట్, లక్నో, భదోహీ, అల్మోరా, బాగేశ్వర్, కోటా, మహేశ్వర్, చెన్నై, కంచి, కన్నూర్, కాసర్గోడ్, మైసూరు, మంగళూరు, భాగల్పూర్, బంకా, ముర్షిదాబాద్, బిష్ణుపూర్, ధనియాఖలి, సంబల్పూర్, బరంపురం వంటి ఎన్నో నగరాలు, పట్టణాలు ఇప్పటికీ చేనేత కళను, సంప్రదాయాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. తమ ప్రత్యేకతను చెక్కుచెదరకుండా నిలుపుకుంటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2019–20లో విడుదల చేసిన లెక్కల ప్రకారం మన దేశవ్యాప్తంగా 35.22 లక్షల మంది చేనేత కార్మికులు పూర్తిగా ఇదే వృత్తిని నమ్ముకుని జీవనోపాధి పొందుతున్నారు. చేనేత రంగంపై ఆధారపడి పరోక్షంగా ఉపాధి పొందుతున్న వారిని కూడా కలుపుకొంటే ఈ సంఖ్య 43 లక్షలకు పైగానే ఉంటుంది. చేనేత రంగంలో నేత, అద్దకం, నేతకు సంబంధించిన ఇతర పనులను చేసే ఈ కార్మికుల్లో దాదాపు 70 శాతం మహిళలే! దేశవ్యాప్తంగా దాదాపు 16 వేల చేనేత సహకార సంఘాలు పనిచేస్తున్నాయి. ఈ సహకార సంఘాల ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తులను మార్కెట్‌కు చేరవేయగలగడమే కాకుండా, తమ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందగలుగుతున్నారు.ఫ్యాషన్లలోనూ చేనేత ముద్ర..యంత్రాల ద్వారా తయారయ్యే వస్త్రాల్లోని యాంత్రికతకు భిన్నంగా ఉండటమే చేనేత వస్త్రాల ప్రత్యేకత. అందుకే, ఎన్ని ఫ్యాషన్లు మారుతున్నా, చేనేత వస్త్రాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటూనే వస్తున్నాయి. చేనేత కార్మికుల కళానైపుణ్యం, ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కే వారి సృజనాత్మకత కారణంగా కూడా ఆధునిక ఫ్యాషన్ల పోటీని చేనేత వస్త్రాలు సమర్థంగా తట్టుకుని నిలబడగలుగుతున్నాయి. రంగులు, డిజైన్లు, అద్దకం పద్ధతుల్లో చేనేత కార్మికులు ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటున్నారు. మన దేశంలో తయారయ్యే చేనేత చీరలు, పంచెలు, తువ్వాళ్లు, దుప్పట్లు, ఇతర వస్త్రాలకు విదేశాల్లో కూడా బాగా గిరాకీ ఉంది.మన దేశం నుంచి అమెరికా, కెనడా, బ్రిటన్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లండ్స్, గ్రీస్, పోర్చుగల్, స్వీడన్, యూఏఈ, మలేసియా, ఇండోనేసియా, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి ఇరవైకి పైగా దేశాలకు చేనేత ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. మన దేశం నుంచి 2023–24 ఆర్థిక సంవత్సరంలో 11.7 బిలియన్ డాలర్లు (రూ. 93,931 కోట్లు) విలువ చేసే చేనేత వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన లెక్కలు చెబుతున్నాయి. ఈ మొత్తం గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల కంటే 6.71 శాతం ఎక్కువ. ఆధునిక ఫ్యాషన్ల హవాలోనూ చేనేత వస్త్రాలకు ఆదరణ ఏమాత్రం తగ్గకపోగా, పెరుగుతూ వస్తోందనడానికి ఈ లెక్కలే నిదర్శనం.తెలుగు రాష్ట్రాల్లో చేనేత చిరునామాలు..మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చేనేతకు చిరునామాలైన ఊళ్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పొందూరు మొదలుకొని వెంకటగిరి వరకు, తెలంగాణలో పోచంపల్లి మొదలుకొని గద్వాల వరకు చేనేత కళలో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు పొందిన ఊళ్లు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా పొందూరు పట్టణం ఖద్దరు చేనేతకు చిరకాలంగా ప్రసిద్ధి పొందింది. పొందూరు ఖద్దరు హోదాకు చిహ్నంగా గుర్తింపు పొందింది. పొందూరు ఖద్దరు పంచెలను అమితంగా ఇష్టపడేవారిలో మహాత్మాగాంధీ సహా ఎందరో స్వాతంత్య్ర సమర యోధులు, అక్కినేని నాగేశ్వరరావు వంటి సినీ ప్రముఖులు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి రాజకీయ ప్రముఖులు ఎందరో ఉన్నారు. పొందూరు ఖద్దరు నాణ్యత చూసి ముచ్చటపడిన గాంధీజీ, ఆ నేత మెలకువలను నేర్చుకునేందుకు తన కొడుకు దేవదాస్ గాంధీని పొందూరుకు పంపారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు పొందూరు చేనేత కళాకారులు బల్ల భద్రయ్య, జల్లేపల్లి కాంతమ్మ గత ఏడాది ఢిల్లీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.కాకినాడ జిల్లా ఉప్పాడ చేనేత కేంద్రంగా ప్రసిద్ధి పొందింది. యు.కొత్తపల్లి, గొల్లప్రోలు మండలాల్లోని ఉప్పాడ పరిసరాలకు చెందిన ఎనిమిది గ్రామాల్లోని చేనేత కార్మికులు సంప్రదాయ జాంధానీ చీరల నేతలో అత్యంత నిష్ణాతులు. ఈ గ్రామాల్లో తయారయ్యే చీరలు ఉప్పాడ జాంధానీ చీరలుగా ప్రసిద్ధి పొందాయి. బంగారు, వెండి జరీ అంచులతో రూపొందించే ఉప్పాడ జాంధానీ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు లభించింది. కర్నూలు జిల్లా కోడుమూరు చేనేత కార్మికులు గద్వాల చీరల నేతకు ప్రసిద్ధి పొందారు. ఇదే జిల్లా ఆదోనిలో చేనేత కార్పెట్లు, యోగా మ్యాట్లు వంటివి తయారు చేస్తున్నారు.అనంతపురం జిల్లా ధర్మవరం చేనేత కార్మికులు ప్రాచీన కాలంలోనే అగ్గిపెట్టెలో పట్టే చీరలను నేసిన ఘనత సాధించారు. ఇక్కడి చీరలకు కూడా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) దక్కింది. బంగారు తాపడం చేసిన జరీతో రూపొందించిన ధర్మవరం చీరలకు దేశ విదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఫ్యాషన్ ప్రపంచంలో శరవేగంగా వస్తున్న మార్పులకు దీటుగా ఇక్కడి చేనేత కళాకారులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త డిజైన్లను రూపొందిస్తూ, తమ ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్నారు. తెలంగాణలోని పోచంపల్లి ఇక్కత్ చీరలకు ప్రసిద్ధి పొందింది. ఇక్కడి ఇక్కత్ చీరలు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు పొందాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య బ్రిగేటే మెక్రాన్‌కు పోచంపల్లి ఇక్కత్ చీరను ప్రత్యేకంగా బహూకరించారు. పోచంపల్లిలో తయారయ్యే పట్టు, నూలు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, దుప్పట్లు, రజాయిలు, స్టోల్స్ స్కార్వ్స్, కర్టెన్లు వంటి వాటికి సూడాన్, ఈజిప్ట్, ఇండోనేసియా, యూఏఈ వంటి దేశాల్లో మంచి గిరాకీ ఉంది. పోచంపల్లి మండలం జలాల్పూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు రాపోలు రామలింగం 2015లో జాతీయ చేనేత దినోత్సవం రోజున ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడకు వచ్చినప్పుడు పోచంపల్లి చేనేత కళాకారులు భోగ బాలయ్య, సరస్వతి దంపతులు తాము స్వయంగా నేసిన భారత చిత్రపటం గల వస్త్రాన్ని బహూకరించారు.నల్లగొండ జిల్లా పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాల తయారీకి ప్రసిద్ధి పొందింది. నేతకు ముందుగా దారాన్ని నువ్వుల నూనెలో నానబెట్టి తయారు చేసే ఈ వస్త్రాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపు కూడా లభించింది. పుట్టపాక గ్రామం తేలియా రుమాల్ వస్త్రాలతో పాటు దుపియన్ చీరలకు కూడా అంతర్జాతీయ ప్రసిద్ధి పొందింది. పుట్టపాక వస్త్రాలు ఎందరో జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల మనసు దోచుకున్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, సోనియా గాంధీ వంటివారు పుట్టపాక వస్త్రాలకు ఫిదా అయిన వారే! ఇక్కడి తేలియా రుమాల్ వస్త్రాలు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లోను, లండన్ మ్యూజియంలోనూ చోటు సంపాదించుకోవడం విశేషం. పుట్టపాక చేనేత కళాకారులు గజం గోవర్ధన్, గజం అంజయ్య ‘పద్మశ్రీ’ అవార్డు పొందారు. ఇక్కడకు సమీపంలోని ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశం ఆసు యంత్రం తయారీకి గుర్తింపుగా ‘పద్మశ్రీ’ పొందారు. ఒకే ప్రాంతానికి చెందిన ముగ్గురు చేనేత కళాకారులు ‘పద్మశ్రీ’ అవార్డు పొందడం దేశంలోనే అరుదైన విశేషం.మన దేశంలో 5000 ఏళ్ల చరిత్ర!మన దేశంలో చేనేతకు ఐదువేల ఏళ్లకు పైబడిన చరిత్ర ఉంది. సింధులోయ నాగరికత కాలం నుంచి ఇక్కడి జనాలు వస్త్రాలను నేసేవారు. ప్రాచీన భారత దేశంలో ప్రతి గ్రామంలోనూ చేనేతకారుల కుటుంబం కనీసం ఒక్కటైనా ఉండేది. పదహారో శతాబ్ది నాటికి చేనేత ఉత్కృష్టమైన కళ స్థాయికి ఎదిగింది. మంచి నైపుణ్యం కలిగిన చేనేత కళాకారులకు రాజాదరణ ఉండేది. ఎందరో రాజులు తమ విజయగాథల చిత్రాలను చేనేత వస్త్రాలపై ప్రత్యేకంగా నేయించుకునేవారు. మొగల్ పరిపాలన కొనసాగినంత కాలం మన దేశంలో చేనేతకు అద్భుతమైన ఆదరణ ఉండేది.బ్రిటిష్ హయాంలో మరమగ్గాలు ప్రవేశించడంతో చేనేతకు గడ్డురోజులు మొదలయ్యాయి. బ్రిటిష్‌వారు ఇక్కడి నుంచి నూలును ఇంగ్లండ్‌కు తరలించి, అక్కడి మిల్లుల్లో తయారయ్యే వస్త్రాన్ని ఇక్కడకు తీసుకువచ్చి అమ్మేవారు. ఈ పరిస్థితి కారణంగానే ఖద్దరు ఉద్యమం, విదేశీ వస్తు బహిష్కరణ ఉద్యమం స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా మారాయి. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ‘స్వదేశీ ఉద్యమం’ 1905 ఆగస్టు 7న కలకత్తాలో మొదలైంది. స్వదేశీ ఉద్యమానికి గుర్తుగా ఆగస్టు 7ను కేంద్ర ప్రభుత్వం 2015లో జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించింది. స్వదేశీ ఉద్యమంలో భాగంగా అప్పట్లో మహాత్మాగాంధీ స్వయంగా రాట్నం నుంచి నూలు వడికేవారు.అప్పట్లో ఊరూరా ఎంతోమంది స్వాతంత్య్ర సమర యోధులు గాంధీజీ పంథాలోనే రాట్నంపై నూలు వడికి, ఆ నూలుతో నేసిన ఖద్దరు వస్త్రాలనే ధరించేవారు. బ్రిటిష్ పాలన అంతమై దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చేనేత పరిశ్రమ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైంది. సంప్రదాయ కుటీర పరిశ్రమగా చేనేత పరిశ్రమ ఈనాటికీ కొనసాగుతోంది. వస్త్రధారణలో వస్తున్న మార్పులను, జనాల అభిరుచుల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, తనను తాను నవీకరించుకుంటూ చేనేత పరిశ్రమ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.దేశవ్యాప్తంగా ఉన్న 16 నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్), 28 చేనేతకారుల సేవా కేంద్రాలు ఏటా జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొంటాయి. పలుచోట్ల చేనేత వస్త్రాల ప్రదర్శనలను నిర్వహిస్తాయి.చేనేతలో మన ఘనత..– చేనేత చీరలు కేవలం చీరలు మాత్రమే కాదు, ఏ చీరకు ఆ చీరను ఒక కళాఖండంగా పరిగణిస్తారు ఫ్యాషన్ నిపుణులు. అంతర్జాతీయ ఫ్యాషన్ నిపుణులు తమ సేకరణలో భారత్ చేనేత చీరలను తప్పకుండా చేర్చుకోవడమే మన చేనేత ఘనతకు నిదర్శనం.– ప్రపంచవ్యాప్తంగా వినిగించే చేనేత వస్త్రాల్లో మన దేశంలో తయారైనవి 95 శాతం వరకు ఉంటాయి. చేనేతలో ఇప్పటికీ మనది తిరుగులేని స్థానం.– చేనేత వస్త్రాల తయారీలో బెనారస్ మొదలుకొని కంచి వరకు ఏ ప్రాంతానికి చెందిన వైవిధ్యం ఆ ప్రాంతానికే సొంతం. చేనేత కళలోని ఈ వైవిధ్యం కారణంగానే వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత వస్త్రాలు ప్రత్యేకంగా జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) గుర్తింపును సాధించగలిగాయి.– చేనేత పరిశ్రమ మన దేశంలోనే అతిపెద్ద కుటీర పరిశ్రమగా కొనసాగుతోంది. వస్త్రాల రూపకల్పన శైలిలో సంప్రదాయ పరంపర, ప్రాంతీయ వైవిధ్యం, సృజనాత్మకత, అసాధారణ నైపుణ్యం ఫలితంగా మన చేనేత కళాకారులు అంతర్జాతీయంగా కూడా మన్ననలు పొందగలుగుతున్నారు.– భారత గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఆర్థిక పరిపుష్టిని కల్పిస్తున్నది చేనేత రంగమే!– మన దేశం నలుమూలలకు చెందిన 65 చేనేత ఉత్పత్తులకు, ఆరు ఉత్పత్తి చిహ్నాలకు జాగ్రఫికల్ ఇండికేషన్ (జీఐ) ఉంది. ఇన్ని ఉత్పత్తులకు జీఐ లభించడం చేనేత పరిశ్రమ వైవిధ్యానికి నిదర్శనం. -
సోషల్ మీడియా షోకేస్‌లో.. బాల్యం!
బాల్యం.. ఎవరికైనా అమూల్యం! ఎక్కడైనా అద్భుతం! పిచ్చుక గూళ్లు, దాగుడుమూతలు, కోతికొమ్మచ్చి ఆటలు పిల్లలందరికీ ప్రియం! పెద్దలు ఆ ఆనందంలోకి తొంగి చూడ్డంలో తప్పు లేదు .. ఆ తుళ్లింతలను కంటినిండా నింపుకోవడం పొరపాటు కాదు! ఆ పసితనాన్ని ఫ్రేమ్ చేసి ఆ మురిపాన్ని పంచుకోవడం నేరం అనిపించుకోదు! కానీ.. ఆ షేరింగ్‌లోనే బాల్యానికి సోషల్ మీడియా బురదంటుతోంది!ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఆన్లైన్ బుల్లీయింగ్‌కి గురవుతున్నారు. యూరప్‌లో 33 శాతం మంది బాలికలు, 20 శాతం మందిబాలురు.. ఆన్లైన్లో వచ్చే కంటెంట్‌తో డిస్టర్బ్ అవుతున్నారు. ఆఫ్రికా, ఆసియాలోని దేశాల్లో 20 శాతం మంది పిల్లలు ఆన్లైన్ అబ్యూజ్ లేదా లైంగిక దోపిడీకి గురవు తున్నారు. ఇవి రెండేళ్ల కిందటి లెక్కలు!ఇదీ ‘రియాలిటీ..తండ్రీకూతుళ్ల వీడియో మీద అబ్యూజివ్ కామెంట్లు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు ఉందంతం ఈ కథనానికి నేపథ్యం. ఇలాంటివారి వల్ల ఎంటర్టైన్మెంట్ కమాడిటీస్గా మారుతున్న పిల్లల గురించి, పసిఛాయలు కోల్పోతున్న బాల్యం గురించి ఆలోచన అవసరం. పిల్లల్లోని ప్రతిభను మాత్రమే వినిపిస్తూ.. ప్రతి గడపలోని బాలలను ఆనందపరుస్తూ.. ప్రేరణనందించిన ∙రేడియో బాలానందం ఆత్మ ఇప్పుడేది? పిల్లలతో డాన్స్ చేయించే రియాలిటీ షోస్ వచ్చాయి. సర్కస్ ఫీట్లు, అసభ్యకరమైన స్టెప్పులతో పాపులర్ అయ్యాయి. క్రీడాస్ఫూర్తిని పెంపొందించాల్సిన ఈ పోటీలు గెలుపోటముల సెంటిమెంట్లను పండించే వేదికలుగా మారాయి. స్క్రిప్ట్ ఇచ్చి పిల్లల చేత డ్రామా చేయిస్తున్నాయి. అవి పెద్దలకు వినోదాన్ని పంచుతూ టీఆర్పీలను పెంచుతున్నాయి. దీనికున్న క్రేజ్ చూసి రియాలిటీ షోస్ కోసం డాన్స్ నేర్పే ఇన్స్టిట్యూట్లూ వెలిశాయి. ఈ డాన్స్ షోల స్క్రీన్ ప్లే వర్కవుట్ కావడంతో భార్యభర్తల పంచాయతీ సీన్లనూ చేర్చారు.. మరో రియాలిటీ షోగా! అందులోనూ పిల్లలు పావులే! కెమెరాల ముందు.. టీవీ జడ్జీల సమక్షంలో అమ్మ, నాన్న అలా తగవులాడుకుంటూంటే.. బెదిరిపోయి.. బిత్తర చూపులు చూస్తున్న ఆ పిల్లల మొహాలను జూమ్ చేసి ఆ పంచాయతీ కార్యక్రమాన్ని రక్తి కట్టించడం కనపడుతూనే ఉంది. ఇక్కడితో ఆగలేదు. కామెడీ షో పేరుతో అశ్లీల హాస్యాన్ని సేల్ చేసుకుంటున్న కార్యక్రమాల్లోనూ పిల్లలను భాగస్వాములు చేస్తున్నారు. ముద్దు ముద్దు మాటల చిన్నారులతో ముదురు, డబుల్ మీనింగ్ డైలాగులు పలికిస్తున్నారు. అంతేకాదు అంతులేకుండా కొనసాగే టీవీ సీరియళ్లలోనూ పిల్లల కోసం పాత్రలు క్రియేట్ అవుతున్నాయి వాళ్ల వయసుకు మించిన మాటలతో!సోషల్ మీడియా.. వైరస్.. వ్యూస్సోషల్ మీడియా ఆ రియాలిటీ షోస్‌ని రీల్స్‌గా, షాట్స్‌గా మార్చేసింది. పురిట్లోని పిల్లల ఏడుపు.. ఫీడింగ్, ఫార్టింగ్, నిద్దట్లోని వాళ్ల హావభావాల వీడియోలు యూట్యూబ్, ఇన్‌స్టాలో కోకొల్లలు. డాన్సింగ్ కాక్టస్‌ను చూసి బెదిరిపోయే పిల్లలు, బొమ్మకు అన్నం తినిపిస్తూ అది తినకపోతే దాన్ని కొట్టి పిల్లలను భయపెట్టి అన్నం తినిపించే పెద్దలు, బుడిబుడి అడుగులతో నీళ్లల్లో జారిపడే పిల్లలు, ఇల్లు పీకి పందిరేసే పనిలో దెబ్బలు తగిలించుకునే పిల్లలు, తోబుట్టువులతో తగవులాడే పిల్లలు, పెంపుడు జంతువులు ముద్దు చేస్తుంటే ఇబ్బంది పడే పిల్లలు.. ఇలా వాళ్లకు సంబంధించి ఏదైనా రీలే.. షాట్సే! ఇవి వేలల్లో కనిపిస్తాయి సోషల్ మీడియా నిండా! దురదృష్టవశాత్తు అవి పెద్దలకు కాలక్షేపమవుతున్నాయి! ఊసుపోక కాదు.. వాటిని చూడ్డమే పనిగా పెట్టుకున్న వ్యూయర్స్ ఉంటారు. పిల్లల టాలెంట్‌ని కాకుండా పెద్దల పైత్యాన్ని ప్రదర్శించేవే అధికం వాటిల్లో! అందుకే పిల్లల మీద మీమ్స్ నుంచి పిల్లలే పాత్ర«లయ్యే రీల్స్, షాట్స్ వరకు అన్నీ సోషల్ మీడియాలో సేలబులే! ఇటీవల వచ్చిన జైలరు సినిమా గుర్తుండే ఉంటుంది. అందులో ‘ఆ.. నువ్వు కావాలయ్య పాట’ సోషల్ మీడియాలో వైరల్! దేశీలు, ఎన్నారైలు ఆ పాట మీద స్టెప్‌లేస్తూ తీసుకున్న వీడియో పోస్ట్‌లతో ఇన్‌స్టా, యూట్యూబ్‌లు ఊగిపోయాయి. అంతటితో ఆగకుండా ఆ పిచ్చి పనిని పిల్లల చేతా చేయించి సోషల్ మీడియాలో ప్రదర్శించి లైక్స్, కామెంట్స్, షేర్స్ లెక్కలు చూసుకున్నారు. పిచ్చిపని అని ఎందుకు జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తోందంటే.. అదొక లైంగిక చర్యను సూచించే స్టెప్. దాన్ని చిన్న పిల్లల చేత వేయించి.. ఇన్‌స్టాలో చూపించి ఆనందపడినందుకు! పిల్లల ముద్దుమురిపాలు, ప్రతిభాపాటవాలను పదిమందికీ చూపించి వాళ్ల దీవెనలు, ప్రశంసలు అందుకోవాలని ఆశపడని అమ్మానాన్నలుండరు.కానీ వాళ్లను ఏ వేదిక మీద నిలబెడుతున్నామనే అవగాహన చాలా అవసరం. ఒకసారి వాళ్ల ఫొటోలో.. వీడియోలో ఆ ప్లాట్ఫామ్లోకి∙వెళ్లాక అవి ఫార్వర్డ్ అవడమే తప్ప ఎట్టి పరిస్థితుల్లోను వాటిని వెనక్కి తీసుకునే అవకాశం లేని వేదికలవి. అలాంటి వాటి మీద పిల్లలను ఆడించడం, పెద్దలే పిల్లల పేరు మీద ఇన్‌స్టా హ్యాండిళ్లు, యూట్యూబ్ చానళ్లు నిర్వహించడం, బూతు డైలాగులు, అసభ్యకరమైన, అమర్యాదకరమైన రీల్స్, షాట్స్ చేయిచండం సామాజిక ఉపద్రవం కాక మరింకేమిటి! ఆ చానళ్లకు లక్షల్లో వ్యూస్, సబ్స్క్రైబర్స్తో ఆదాయం తెచ్చుకుంటున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారుస్తున్నారు.బాల్యం.. వినోద వస్తువుసాంకేతిక ఊసు లేనప్పుడు కూడా వినోదం ఉంది. అందులోనూ పిల్లల భాగస్వామ్యం ఉంది. వాళ్ల మనోవికాసానికే అది ఉపయోగపడింది తప్ప వాళ్లను వినోద వస్తువులుగా మార్చలేదు. వాళ్ల ప్రతిభను మెరుగుపరచింది తప్ప పసితనాన్ని మరుగుపరచలేదు. ఇప్పుడు ఏం చేసైనా వినోదాన్ని పండించి .. డబ్బులు రాబట్టుకునే వేదికలు తయారయ్యాయి. వ్యక్తిగత గుట్టు ఎంత గడప దాటితే అంత ఎంటర్టైన్మెంట్. దానికి పిల్లలు, పెద్దలు అనే తారతమ్యం లేదు. సోషల్ మీడియా పుణ్యాన పురిటి నుంచి టీన్స్ దాకా పిల్లలు ఎంటర్టైన్మెంట్ కమాడిటీస్ అయ్యారు.అమ్మ, నాన్నలతో కలసి ఆడుకుంటున్న వీడియోలు పెట్టినా, అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనురాగాన్ని పోస్ట్ చేసినా.. ఫ్రెండ్స్‌తో ఉన్నా, పిల్లలు కూర్చున్నా.. నిలబడ్డా, నవ్వినా, ఏడ్చినా, వణికినా, ధైర్యంగా కనపించినా, బుంగమూతి పెట్టుకున్నా, చిలిపితనం చిందించినా, చురుకుదనం ఉరకలేసినా.. అంతెందుకు ఏం చేసినా.. చేయకపోయినా వంకర వ్యాఖ్యానాలు, బెదిరింపులు, వేధింపులు, ట్రోలింగ్, రకరకాల పర్వర్షన్స్కి ఈజీ టార్గెట్స్‌గా మారారు. దీన్ని సమాజం నిర్లక్ష్యం చేసింది కనుకే ప్రణీత్ హనుమంతు తనలాంటి నలుగురితో స్క్రీన్ షేర్ చేసుకుంటూ నాన్న, కూతురి వీడియో పోస్ట్‌ని అంత రోస్ట్ చేయగలిగాడు.పిల్లల హక్కులకు చట్టాలున్నాయి..!రియాలిటీ షోల పేరుతో పిల్లలను వినోద పరిశ్రమలో కార్మికులుగా చేసే దశ నుంచి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పిల్లలను వినోద వస్తువులుగా మార్చే దశ వరకు.. ఎక్కడా.. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల మీద మనకెలాంటి హక్కు లేదు. సమాజానికే కాదు కన్న తల్లిదండ్రులకూ లేదు! పరిణతి చెందిన ్రçపపంచం పెద్దల హక్కులే పిల్లల హక్కులని గుర్తించింది. అందుకే దాదాపు అన్ని దేశాల్లో పిల్లల హక్కులను పరిరక్షించేందుకు ప్రత్యేక చట్టాలున్నాయి. ఇంటర్నెట్ వచ్చాక పిల్లల భద్రత గురించే మొదట ఆలోచించాయి.అందుకే దాదాపు ప్రపంచ దేశాలన్నీ పిల్లల వ్యక్తిగత సమాచార గోప్యత పాటించాల్సిందేనని చట్టాల ద్వారా కట్టుదిట్టం చేశాయి. సొంత తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు చెందిన ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టొద్దు. పౌరసత్వ ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం దగ్గర తప్ప ఇంకెక్కడా బహిర్గతపరచాల్సిన అవసరంలేదు. ప్రభుత్వం కూడా ఆ వివరాలను తన ఏజెన్సీలు సహా ఇంకే ఇతర ప్రైవేట్ సంస్థలకు ఇవ్వకూడదు.మన దగ్గరా పిల్లల హక్కులు, రక్షణ, భద్రత, గోప్యతకు సంబంధించి ప్రత్యేక చట్టాలున్నాయి. డిజిటల్ డేటాకు సంబంధించీ చట్టం ఉంది. ఇదేం చెబుతోందంటేæ.. పిల్లలను వాళ్ల వయసుకు తగని సన్నివేశాల్లో చూపించకూడదు. దీని కిందకు కుటుంబ తగాదాలు, స్త్రీ, పురుష సంబంధాల అంశాలు, భయం, భీతిగొలిపేవంటివన్నీ వస్తాయి. అలాగే మైనర్లను అసభ్యంగా, అశ్లీలంగా చూపించకూడదు. వారిని అవమానించేలా, కించపరచేలా, వేధించేలా ఉన్న ఫొటోలు, వీడియోలు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టకూడదు.హింసాత్మకమైన, ప్రమాదకరమైన, హానికరమైన చర్యల్లో పిల్లలు పాలుపంచుకునేలా ఉన్న కంటెంట్, ఫొటోలు, వీడియోలు, వారిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం, వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగించే దృశ్యాలను చూపించడం వంటివన్నీ నిషేధం. బాల్యాన్ని పదిలంగా ఉంచుదాం!‘ఎవరి పిల్లలైనా వాళ్లు పిల్లలు! బాల్యం పదిలంగా ఉంటేనే భవిష్యత్తు బంగారమవుతుంది. పిల్లలకు మనం ఏదిస్తే అదే తీసుకుంటారు. మనం ఏం చూపిస్తే అదే గ్రహిస్తారు. మనం ఏం చేస్తే దాన్నే అనుకరిస్తారు, అనుసరిస్తారు. అందుకే మనం జాగ్రత్త పడాలి’ అంటున్నారు చైల్డ్ సైకాలజిస్ట్‌లు. సాంకేతికత ముంచెత్తుతున్న సమాచారాన్ని ఫిల్టర్ చేయలేం. సముద్రాన్ని మధించి అమృతాన్ని అందివ్వలేం! అలాగని ఆ డిజిటల్ స్కూల్‌కి దూరంగా ఉంచి పిల్లలను డిజిటల్లీ చాలెంజ్డ్ చేయలేం!ఈ పేరెంటింగ్‌ని ఒక్క తల్లిదండ్రుల నెత్తినే వేయకుండా సమష్టిగా పంచుకుందాం! తొలి అడుగు పేరెంట్స్ నుంచి రావాలి. పిల్లలు డిజిటల్ మీడియంలో ఎంతవరకు ఎక్స్పోజ్ కావాలి అనే విచక్షణతో మెదలాలి. ఆ ప్లాట్ఫామ్లో పిల్లలను ఎంటర్టైన్మెంట్ టూల్స్‌గా మలచకుండా పిల్లల మనోవికాసానికి దాన్నో టూల్‌గా మార్చుకోవడానికి ప్రయత్నించాలి.కరోనా ఎఫెక్ట్‌గా ఆన్లైన్ పాఠాలు అనివార్యమై పిల్లలకు ఇంటర్నెట్తో మరింత ఫ్రెండ్షిప్ పెరిగింది. ఆ స్నేహంలో వాళ్లకున్న పరిమితులు, వాళ్లుండాల్సిన పరిధిని చూపించడం, ఆ మేర జాగ్రత్తపడటం టీచర్ల పని. ఏ ప్లాట్ఫామ్లో అయినా పైన చెప్పిన రీతిలో పిల్లలు కనిపిస్తే వెంటనే దాన్ని రిపోర్ట్ చేసి.. సదరు పోస్ట్‌లకు లైఫ్ లేకుండా.. అర్కైవ్స్‌లో దాక్కోకుండా చూడాల్సిన బాధ్యత మనది.. డిజిటల్ సొసైటీలో భాగమైన మనందరిది. ఈ ప్రయాణంలో మద్దతివ్వడానికి చట్టాలున్నాయి. స్పందించడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. దీని మీద అవగాహన కల్పించే కార్యక్రమాలను చూడాల్సింది ప్రభుత్వం. పిల్లలను వినోద వస్తువులుగా చూస్తూన్నాం! ఈ నేరం మనందరిదీ! ఆ తప్పును పేరెంటింగ్‌తో సరిదిద్దుకోవాలి. సమాజమంతా ఆ బాధ్యతను తీసుకోవాలి!జాగ్రత్తగా ఉండాలిపిల్లల ఫొటోలు పోస్ట్ చేయకండి అని భయపెట్టను. కానీ ఆ సమాచారం అంతటా వ్యాపించే చాన్స్ ఉంది కాబట్టి పిల్లల ఫొటోలు, వీడియోలు సహా ఎలాంటి వివరాలనైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పోస్ట్ చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఎందులో ఏం పోస్ట్ చేసినా మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోండి.ఆ వివరాలు ఫార్వర్డ్ అవడమే తప్ప డిలీట్ అయ్యే చాన్స్ ఉండదు. కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాచింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ శిక్షార్హమైన నేరం. పిల్లల మీద అబ్యూజివ్ కామెంట్స్ అనేవి జీరో టాలరెన్స్ నేరం. ఇలాంటివేవైనా ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే 100కి గానీ 1930కి గానీ డయల్ చేయండి. ఇంకో విషయం.. ఇలాంటి అబ్యూజివ్ కామెంట్స్‌ని ట్వీట్, పోస్ట్ చేయడమే కాదు వాటిని రీ ట్వీట్, ఫార్వర్డ్ చేసినా నేరమే. – శిఖా గోయల్, ఏడీజీపీ సీఐడీ, డైరెక్టర్ తెలంగాణ సైబర్ సెక్యురిటీ బ్యూరో, డైరెక్టర్ టీఎస్ ఎఫ్ఎస్సెల్, ఏడీజీపీ విమెన్ సేఫ్టీ వింగ్ఆలోచించాలి.. చిన్నపిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయకుండా ఉండటం మంచిది. ఒకవేళ మీ స్నేహితులతో పంచుకోవాలి అనుకుంటే నిజ జీవితంలో మీకు పరిచయమైన వారిని మాత్రమే మీ సామాజిక మాధ్యమాలలో ఫ్రెండ్ లిస్ట్‌లో చేర్చుకోండి. అలా చేసినప్పటికీ ఫొటోలు, వీడియోల్లో వ్యక్తిగత సమాచారం, పిల్లల స్కూల్, స్పోర్ట్స్ లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తెలిసే వీల్లేకుండా చూసుకుంటే కొంతవరకు సేఫ్. స్కూల్ బస్, మీ కారు, బైక్ నంబర్లు, ఇంటి పరిసరాల ఆనవాళ్లు మొదలైనవీ సోషల్ మీడియాలో తెలియనివ్వకుండా జాగ్రత్త పడితే మంచిది.అంతేకాదు పిల్లలకు ఏం నేర్పిస్తున్నామనే స్పృహ కూడా ఉండాలి. పిల్లలతో వయసుకు మించిన చేష్టలు, మాటలు, పాటలతో రీల్స్, షాట్స్ చేయించడం పెద్దలకు సరదాగా ఉండొచ్చు. కానీ అవి పిల్లలపై చూపించే ప్రభావం గురించి ఆలోచించాలి. ఇలాంటివాటితో ఎన్నో తప్పులను నార్మలైజ్ చేస్తున్నారు. ‘మా పిల్లలు మా ఇష్టం’ అంటూ బాల్యాన్ని పాడుచేస్తున్న తల్లిదండ్రులూ లేకపోలేదు. ఇంతకుముందున్న చట్టాలు, ప్రస్తుతం వచ్చిన చట్టాల ప్రకారం కూడా పిల్లల గోప్యతకు భంగం వాటిల్లేలా ముఖ్యంగా ఇంటర్నెట్లో అలాంటి పనులకు పాల్పడినవారికి కఠిన శిక్షలున్నాయి. – శ్రీకాంత్ చింతల, హైకోర్ట్ అడ్వకేట్వీటినీ దృష్టిలో పెట్టుకోవాలి..పోక్సో, జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం.. పిల్లలు సురక్షితమైన వాతావరణంలో లేరని తెలిస్తే తల్లిదండ్రుల వద్దనుంచైనా సరే పిల్లలను తీసుకొని సేఫ్ హౌస్‌లో ఉంచవచ్చు. ద డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ , 2023లోని సెక్షన్ 9 ప్రకారం.. చిన్న పిల్లలకు సంబంధించిన వివరాల సేకరణ, గోప్యతపై మూడురకాల నిబంధనలున్నాయి. అవేంటంటే..– పిల్లల సమాచారానికి సంబంధించి తల్లిదండ్రుల ధ్రువీకరణ, సమ్మతిని పొందడం– పిల్లల శ్రేయస్సుకనుగుణంగా వారి డేటాను ప్రాసెస్ చేయడం– పిల్లలను ట్రాకింగ్ లేదా వాళ్ల ప్రవర్తనపై పర్యవేక్షణ, పిల్లలను లక్ష్యంగా చేసుకున్న ప్రకటనలపై నిషేధం.పిల్లల సమాచారం లేదా ఐడెంటిటీని తెలియపరచేవిధంగా ఆన్లైన్లో సమాచారాన్ని ఉంచే వారెవరికైనా వాళ్లు తల్లిదండ్రులైనా సరే పై నిబంధనలు వర్తిస్తాయి. వాటిని ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు, భారీ జరిమానాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ చట్టం కింద రూల్స్‌ని రూపొందించే ప్రక్రియలో ప్రభుత్వం ఉంది.ఆన్లైన్లో పిల్లల రక్షణ, పిల్లలందరికీ డిజిటల్ లెర్నింగ్‌ని అందుబాటులోకి తేవడం.. యూనిసెఫ్ ప్రధాన లక్ష్యాలు . ఈ విషయమై అది అన్ని దేశాల్లో దృష్టిపెడుతోంది. 2022, అక్టోబర్‌లో బ్రసెల్స్‌లో పలు దేశాల పాలసీ మేకర్స్, పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు,పేరెంట్స్, యువతతో కలసి ‘సేఫర్ ఇంటర్నెట్ ఫోరమ్’ పేరుతో ఒక సదస్సునూ నిర్వహించింది.యురోపియన్ యూనియన్ తమ దేశాల్లో.. ఆన్లైన్లో మైనర్స్ భద్రత కోసం ‘డిజిటల్ సర్వీస్ యాక్ట్’ని రూపొందించింది. ఇది పిల్లలను టార్గెట్ చేసే ప్రకటనలు, ఆల్గరిథమ్స్ని నిషేధించి పిల్లలకు సురక్షితమైన డిజిటల్ స్పేస్‌ని క్రియేట్ చేసేందుకు తోడ్పడుతోంది. అంతేకాదు యూరోపియన్ యూనియన్ ‘స్ట్రాటజీ ఆన్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్’కి డిజిటల్ వింగ్ అయిన ‘బెటర్ ఇంటర్నెట్ ఫర్ కిడ్స్ స్ట్రాటజీ’ తమ దేశాల్లోని ప్రతి చిన్నారి ఆన్లైన్లో భద్రంగా, గౌరవప్రదంగా సాధికారత సాధించేందుకు యూరప్ అంతటా సేఫ్ ఇంటర్నెట్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసింది. ఈ స్ట్రాటజీ కిందే యురోపియన్ కమిషన్ .. పిల్లల వయసుకు అనుగుణంగా డిజిటల్ సేవలు, వాటి ఉత్పత్తుల రూపకల్పనకు కోడ్ ఆఫ్ కండక్ట్‌ని తయారుచేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో పిల్లలనూ భాగస్వాములను చేయనుంది. ఆన్లైన్లో పిల్లల భద్రత కోసం మిగిలిన దేశాలూ ఈ బాటలో నడవాలని యూనిసెఫ్ అభిప్రాయపడుతోంది.మానసిక రుగ్మతలుగానే చూడాలి..సామాజిక మాధ్యమాలలో చూస్తున్న వింతపోకడల వెనుక దిగ్భ్రాంతి కలిగించే మానసిక రుగ్మతులు దాగున్నాయి. పిల్లల సేఫ్టీ సైతం కాంప్రమైజ్ అయ్యేలా పిల్లలపై నేరపూరిత చర్యలకు, వ్యాఖ్యలకు పాల్పడటం అలాంటి రుగ్మతల్లో ఒకటి. మితిమీరిన స్వార్థం, చట్టం పట్ల గౌరవలేమి, ‘వాళ్లు వీడియోలు చేస్తే తప్పులేదు కాని మేము స్పందిస్తే తప్పొచ్చిందా’ అనే మతిలేని వాదనలతో వారిని వారు సమర్థించుకోవడం వంటివీ రుగ్మతలుగానే చూడాలి. వీళ్లిలా తయారవడానికి కారణం కుటుంబ వ్యవస్థలోని లోపాలతోపాటు సమాజంలోని లోపాలు, ప్రిజుడీస్ కూడా! దీన్ని సరిదిద్దుకునే బాధ్యతను తమ తమ స్థాయిల్లో అందరూ తీసుకోవాలి!వీళ్లు సినిమా నుంచి వైరలైన పోస్ట్ దాకా పిల్లలు, పెద్దలు తేడా లేకుండా, లింగభేదం చూపకుండా ఎవరినైనా కామెడీ, డార్క్ కామెడీ పేరుతో రివ్యూ చేస్తారు. ఏ మర్యాదా లేకుండా రోస్ట్ చేస్తారు.– పిల్లలకు సంబంధించి ఏటా ఫిబ్రవరిని సురక్షితమైన, సానుకూలమైన ఇంటర్నెట్ అడ్వొకసీ నెలగా గుర్తిస్తున్నారు. – 2023లో ఛిౌఝp్చటజ్టీ్ఛఛిజి ఆన్లైన్లో పిల్లల డేటా భద్రతా చట్టాలకు సంబంధించి 50 దేశాల్లో సర్వే నిర్వహించింది.– పిల్లల భద్రత, ప్రైవసీకి కట్టుదిట్టమైన చట్టాలున్న దేశాల్లో మొదటి స్థానంలో ఫ్రాన్స్, 2వ స్థానంలో స్వీడెన్, 3వ స్థానంలో ఫిన్లండ్, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, బెల్జియం, ఆస్ట్రియా, జర్మనీ, యూకే, 4వ స్థానంలో సౌది అరేబియా, 5వ స్థానంలో భారత్, 6,7,8,9,10 స్థానాల్లో బ్రెజిల్, చైనా, ఇండోనేషియా, ఈజిప్ట్, హాంకాంగ్ కనిపిస్తాయి. -
వసుధైక క్రీడోత్సవం: మరింత వేగంగా.. మరింత ఎత్తుకు.. మరింత బలంగా..
పారిస్ నగరం పగలు పెర్ఫ్యూమ్ బాటిల్లా, రాత్రి షాంపేన్ బాటిల్లా కనిపిస్తుందంటారు. ఇప్పుడు మాత్రం పగలు, రాత్రి తేడా లేకుండా ఒలింపిక్మయంగా మారిపోతోంది. ఫ్రెంచ్ వైన్‌ను మించిన స్పోర్ట్స్ మత్తులో నగరం మునిగిపోతోంది. 100 ఏళ్ల తర్వాత తమ ఇంట్లో జరగబోతున్న పండగతో సీన్ నదీ తీరమంతా క్రీడా సందడికి కేరాఫ్‌గా నిలుస్తోంది.రాబోయే కొన్ని రోజుల పాటు అక్కడ కలలు రెక్కలు విప్పుకుంటాయి. ఆశలు, అంచనాలు ఈఫిల్ టవర్‌ను తాకుతాయి. ఫ్యాషన్ స్ట్రీట్‌లో కూడా పతకాలు, పతాకాల గురించే చర్చ సాగుతుంది. గెలిచే మెడల్‌కు ఫ్రెంచ్ ముద్దుతోనే మురిపెం. ఒక్కసారి ఆడితే చాలు అదృష్టంగా భావించేవారు, ఒక్క పతకం గెలిస్తే చాలనుకునేవారు, కనకం కొడితే జన్మ ధన్యమైనట్లుగా సంబరపడేవారు, మళ్లీ మళ్లీ గెలిచి సగర్వంగా శిఖరాన నిలిచేవారు, అందరూ ఇక్కడే కలసిపోతారు. సంబరాలు, కన్నీళ్లు, ఆనందబాష్పాలు, భావోద్వేగాలు అన్నీ ఒక్కచోటే కనిపిస్తాయి.జాతీయ జెండా ఎగురుతున్నప్పుడు, జాతీయ గీతం వినిపిస్తున్నప్పుడు క్రీడాకారుల గుండె లోతుల్లో పొంగే భావనను లెక్కకట్టేందుకు ఎలాంటి కొలమానాలు సరిపోవు. ఔను! సమస్త క్రీడా జాతిని ఏకం చేసే మెగా ఈవెంట్‌కు సమయం వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆటగాళ్లకే కాదు, అభిమానులకు కూడా ఆనందానుభూతి పంచేందుకు విశ్వ క్రీడా సంబరం వచ్చేసింది. ప్రఖ్యాత పారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్‌కు ఈనెల 26న తెర లేవనుంది.5 నగరాల నుంచి..2024 ఒలింపిక్స్ నిర్వహణ కోసం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) వేర్వేరు నగరాల నుంచి 2015 సెప్టెంబర్‌లోనే బిడ్లను ఆహ్వానించింది. ఒలింపిక్స్ ప్రణాళికలు, భిన్నమైన రీతిలో నిర్వహణ, వ్యూహాలు, ప్రభుత్వ పనితీరు, వేదికకు కావాల్సిన ఆర్థిక పుష్టి, గతానుభవం, ఆ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న గుర్తింపు తదితర అంశాలను దృష్టిలోకి తీసుకుంటూ బిడ్లను కోరారు. పారిస్ (ఫ్రాన్స్), లాస్ ఏంజెలిస్ (అమెరికా), బుడాపెస్ట్ (హంగరీ), హాంబర్గ్ (జర్మనీ), రోమ్ (ఇటలీ) నగరాలు తుది జాబితాలో నిలిచాయి. అయితే ఆర్థిక కారణాలతో మూడు నగరాలు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. రోమ్, హాంబర్గ్ నగరాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగగా, ఎక్కువమంది ఒలింపిక్స్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ చేశారు. బుడాపెస్ట్‌లో అయితే ఒలింపిక్స్ జరిగితే ఆర్థికంగా చితికిపోతామంటూ అన్ని ప్రతిపక్ష పార్టీలు ‘నో ఒలింపిక్స్’ పేరుతో ఉద్యమమే నడిపించాయి. దాంతో చివరకు పారిస్, లాస్ ఏంజెలిస్ మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో ఐఏసీ 2024కే కాకుండా 2028 కోసం కూడా బిడ్‌ను ఖాయం చేసేందుకు సిద్ధమైంది. దాంతో లాస్ ఏంజెలిస్ వెనక్కి తగ్గి తాము 2028లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తామంటూ స్పష్టం చేయడంతో 2017 జూలైలో పారిస్‌కు గేమ్స్ ఖాయమయ్యాయి.రూ. 40 వేల కోట్లతో...పారిస్ నగరం ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడం ఇది మూడోసారి. గతంలో 1900 (రెండో ఒలింపిక్స్), 1924 (ఎనిమిదో ఒలింపిక్స్) కూడా ఇక్కడే జరిగాయి. ఒలింపిక్స్‌కు రెండుసార్లు నిర్వహించిన తొలి నగరంగా పారిస్ గుర్తింపు పొందింది. 2024 క్రీడల కోసం అక్షరాలా 4.38 బిలియన్ యూరోలు (సుమారు రూ. 40 వేల కోట్లు) కేటాయించారు. ఇదంతా 100 శాతం ప్రైవేట్ ఫండింగ్ కావడం విశేషం. ఇందులో టీవీ రైట్స్, టికెట్ల అమ్మకం, హాస్పిటాలిటీ, లైసెన్సింగ్, ఇతర భాగస్వామ్యపు ఒప్పందాలు కలసి ఉన్నాయి.ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఎలాంటి సహకారం లేకుండా ఈ ఒలింపిక్స్ జరగనున్నాయి. అయితే సహజంగానే ఒలింపిక్స్ నిర్వహణ అంటే భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడం, క్రీడల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు, స్టేడియాలు ఆ తర్వాత పనికి రాకుండా పోయి వృథాగా పడి ఉండటం గత కొన్ని ఒలింపిక్స్లుగా చూస్తూనే ఉన్నాం. దాంతో ఆర్థిక భారం అంశంపై ఈసారి బాగా చర్చ జరిగింది. అయితే పారిస్‌లో ఈసారి ఒలింపిక్స్ నిర్వహణ నష్టదాయకం కాదని, ఆర్థిక సమస్యలను తట్టుకోగలిగే శక్తి ఉందని పలు తాజా నివేదికలు వెల్లడించాయి.ముఖ్యంగా ఒలింపిక్స్ జరిగే సమయంలో పారిస్‌కు చాలా పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకుల కారణంగా నగరానికి మంచి ఆదాయం రానుందనేది అంచనా. పారిస్ ప్రాంతానికి కనీసం 6.7 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 56 వేల కోట్లు) వరకు ఆర్థిక ప్రయోజనాలు కలగవచ్చని చెబుతున్నారు. కాబట్టి ఎలా చూసినా ఒలింపిక్స్ నిర్వహణ లాభదాయకమే తప్ప నష్టం లేదని నిర్వహణా కమిటీ ఘంటాపథంగా చెబుతోంది.టార్చ్‌తో మొదలు..క్రీడల్లో ఒలింపిక్ జ్యోతికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఒలింపిక్ ఉద్యమానికి ఇది సూచిక. ప్రాచీన గ్రీకురాజ్యంలో ఉన్న సంప్రదాయాన్ని కొనసాగిస్తూ దీనిని ఒలింపిక్స్ వరకు తీసుకొచ్చారు. ఏథెన్స్ సమీపంలోని ఒలింపియాలో సూర్యకిరణాల ద్వారా ఒలింపిక్ జ్యోతిని వెలిగించడం ప్రతి ఒలింపిక్స్‌కు కొన్ని నెలల ముందు జరిగే ప్రక్రియ. అక్కడ వెలిగిన జ్యోతితో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ద్వారా టార్చ్ రిలే కొనసాగుతుంది. శాంతి, స్నేహ సంబంధాల సందేశం ఇవ్వడం ఈ ఒలింపిక్ టార్చ్ ప్రధాన ఉద్దేశం.1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో మొదటిసారి దీనిని వాడారు. తర్వాతి రోజుల్లో ఆతిథ్య దేశం ఆలోచనలు, వారి సంస్కృతికి అనుగుణంగా టార్చ్ల నమూనాలను రూపొందించడం సంప్రదాయంగా మారింది. క్రీడలు జరిగినన్ని రోజులు ఒలింపిక్ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. మెగా ఈవెంట్ ముగిసిన తర్వాత దానిని ఆర్పేస్తారు. సాధారణంగా ఆయా దేశపు ప్రముఖ లేదా మాజీ క్రీడాకారులు ఒలింపిక్ టార్చ్ అందుకొని రిలేలో పాల్గొంటారు. పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించి 10 వేల మంది టార్చ్ బేరర్లతో 400 నగరాల గుండా ఈ జ్యోతి ప్రయాణించింది.మస్కట్, లోగో..పారిస్ ఒలింపిక్స్ కోసం ‘ఫ్రీ జీ’ పేరుతో అధికారిక మస్కట్‌ను విడుదల చేశారు. ప్రాచీన ఫ్రెంచ్ సంప్రదాయ టోపీని ‘ఫ్రీజీ’గా వ్యవహరిస్తారు. ఆ దేశపు చరిత్ర ప్రకారం దీనిని ఒక టోపీగా మాత్రమే చూడరు. ఆ దేశపు స్వేచ్ఛకు సంకేతంగా భావిస్తారు. దీనికి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం సమయంలో విప్లవకారులంతా ఇలాంటి టోపీలనే ధరించారు.ఫ్రాన్స్ దేశపు రోజువారీ వ్యవహారాల్లో ఈ ‘ఫ్రీజీ’ టోపీ కనిపిస్తూ ఉంటుంది. ఫ్రాన్స్ జాతీయ పతాకంలోని రంగులైన ఎరుపు, నీలం, తెలుపు ఇందులో కనిపిస్తాయి. ఒలింపిక్స్‌కు సంబంధించిన డిజైనింగ్ టీమ్ దీనిని రూపొందించింది. ఒలింపిక్ జ్యోతిని బంగారపు రంగులో ప్రదర్శిస్తూ పారిస్ 2024 లోగోను తయారుచేశారు. ‘విడిగా మనం వేగంగా వెళ్లవచ్చు. కానీ కలసికట్టుగా మరింత ముందుకు పోవచ్చు’ అనేది ఈ ఒలింపిక్స్ మోటోగా నిర్ణయించారు.కొత్తగా ఆడుదాం..ఒలింపిక్స్‌లో కొత్త క్రీడాంశాలను ప్రోత్సహించడం సంప్రదాయంగా వస్తోంది. అప్పటికే బాగా గుర్తింపు పొందిన ఆటలతో పాటు ఇలాంటి కొత్త క్రీడలు కొత్త తరం క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పనికొస్తాయని ఐఓసీ ఉద్దేశం. మెగా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే దేశాలకు కొత్త క్రీడల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో కొత్తగా ఒక క్రీడాంశాన్ని ప్రవేశపెట్టారు.బ్రేకింగ్: 1970ల నుంచి అమెరికా సంస్కృతిలో భాగంగా ఉన్న డాన్స్‌లలో ఒక భాగం ఇది. సరిగ్గా చెప్పాలంటే మన దగ్గర సినిమాల ద్వారా బాగా పాపులర్ అయిన బ్రేక్ డాన్స్ రూపమిది. శారీరక కదలికలు, ఫుట్‌వర్క్‌లో స్టయిల్ తదితర అంశాలతో పాయింట్లు కేటాయిస్తారు. 1990 నుంచి ఇందులో పోటీలు జరుగుతున్నా ఒలింపిక్స్‌కు చేరేందుకు ఇంత సమయం పట్టింది. 2018 యూత్ ఒలింపిక్స్‌లో దీనికి మంచి స్పందన లభించడంతో ఇప్పుడు ఒలింపిక్స్‌లో చేర్చారు.అమెరికాదే హవా... దీటుగా చైనా..1061 స్వర్ణాలు, 830 రజత పతకాలు, 738 కాంస్యాలు... మొత్తం 2629 పతకాలు... ఒలింపిక్స్ చరిత్రలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) అసాధారణ ఘనత ఇది. 1896లో తొలి ఒలింపిక్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన అమెరికా నాటి నుంచి ఇప్పటి వరకు తమ హవా కొనసాగిస్తూనే ఉంది. ఎన్నెన్నో అద్భుత ప్రదర్శనలు, ప్రపంచ రికార్డు ప్రదర్శనలు అన్నీ అలవోకగా అమెరికా ఆటగాళ్ల నుంచి వచ్చాయి.ముఖ్యంగా అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, స్విమ్మింగ్ వంటి క్రీడల్లోనైతే ఇతర దేశాల ఆటగాళ్లు రెండో స్థానం కోసం పోటీ పడేందుకే బరిలోకి దిగాల్సిన పరిస్థితి. ఇతర జట్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పూర్తి స్థాయిలో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడం అగ్ర రాజ్యానికే చెల్లింది. ఒలింపిక్స్‌లో నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థి జట్లను ఒక ఆటాడుకోవడం అమెరికా ఆటగాళ్లకు అలవాటైన విద్య.ఎప్పుడో పుష్కరానికోసారి ఒక చిన్న సంచలనం, కాస్త ఏమరుపాటుతో కొన్నిసార్లు వెనుకబడినా ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి మొత్తంగా అమెరికన్లకు తిరుగులేదు. అన్ని రకాలుగా క్రీడలకు ప్రోత్సాహం, సరైన వ్యవస్థ, ప్రొఫెషనల్ దృక్పథం, అభిమానుల మొదలు కార్పొరేట్ల వరకు అన్ని ఆటలకు అండగా నిలిచే తత్వం, సుదీర్ఘ కాలంగా క్రీడలు అక్కడి జీవితంలో ఒక భాగంగా మారిపోవడంవంటివి అమెరికా ముందంజకు ప్రధాన కారణాలు.మరోవైపు చైనా కూడా అమెరికాకు దాదాపు సమఉజ్జీగా నిలుస్తోంది. పతకాల్లో పోటీ పడుతూ రెండో స్థానంలో నిలుస్తూ వస్తోంది. ఇన్నేళ్ల ఒలింపిక్స్ ఓవరాల్ జాబితాలో 263 స్వర్ణాలు సహా 636 పతకాలతో చైనా ఐదో స్థానంలో కనిపిస్తోంది. అయితే 2004 ఒలింపిక్స్ వరకు చైనా ఖాతాలో పెద్దగా పతకాలు లేకపోవడమే ఐదో స్థానానికి కారణం.2008లో చైనా సొంతగడ్డ బీజింగ్‌లో ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన నాటి నుంచి ఆ దేశపు క్రీడా ముఖచిత్రమే మారిపోయింది. 2008–2020 మధ్య జరిగిన నాలుగు ఒలింపిక్ క్రీడల్లో చైనా 3 సార్లు రెండో స్థానంలో నిలిచి, ఒకసారి మూడో స్థానంతో ముగించింది. ఇది క్రీడా ప్రపంచంలో వచ్చిన మార్పునకు సంకేతం. కొత్త తరహా శిక్షణ, ప్రణాళికలతో 2008 కోసం ప్రత్యేక వ్యూహాలతో ఒలింపిక్స్‌కు సిద్ధమైన చైనా ఆ తర్వాత తమ జోరును కొనసాగిస్తూ వచ్చింది. భిన్న క్రీడాంశాల్లో అమెరికాతో సై అంటే సై అంటూ పోటీ పడుతోంది.ఆధునిక ఒలింపిక్స్‌లో జేమ్స్ బ్రెండన్ బెనిట్ కొనలీ తొలి విజేతగా నిలిచాడు. అతడు ట్రిపుల్ జంప్‌లో ఈ విజయం సాధించాడు. హార్వర్డ్ విద్యార్థి అయిన కొనలీ సెలవు తీసుకుని ఒలింపిక్స్‌లో పాల్గొన్నాడు. అయితే, అనుమతి లేకుండా క్రీడా పోటీల్లో పాల్గొన్నందుకు హార్వర్డ్ వర్సిటీ అతడికి ఉద్వాసన పలికింది.తొలిసారిగా 1900లో జరిగిన ఒలింపిక్ క్రీడల పోటీల్లో మహిళలకు అవకాశం లభించింది. ఆ ఒలింపిక్స్‌లో 22 మంది మహిళలు పాల్గొన్నారు. అప్పటికి ఇంకా అమెరికాలో మహిళలకు ఓటు హక్కు కూడా రాలేదు. నానా పోరాటాల తర్వాత అమెరికాలో మహిళలకు 1920లో ఓటు హక్కు దక్కింది.ఆధునిక ఒలింపిక్స్‌లో 1896, 1900 సంవత్సరాల్లో పోటీల్లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు రజత, కాంస్య పతకాలను మాత్రమే బహూకరించేవారు. అప్పట్లో మూడో బహుమతి ఉండేది కాదు. అయితే, 1904 నుంచి ప్రతి పోటీలోనూ ముగ్గురు విజేతలకు స్వర్ణ, రజత, కాంస్య పతకాలను బహూకరించే ఆనవాయితీ మొదలైంది.ఒలింపిక్స్ సహా సమస్త క్రీడా కార్యక్రమాలను ఇప్పుడు టీవీల్లో చూడగలుగుతున్నాం. రోమ్‌లో 1960లో జరిగిన ఒలింపిక్స్ తొలిసారిగా టీవీలో ప్రసారమయ్యాయి. అప్పటి వరకు ఒలింపిక్స్ విశేషాలను తెలుసుకోవడానికి పత్రికలే ఆధారంగా ఉండేవి.ఈఫిల్ టవర్ ఇనుముతో...ఒలింపిక్స్‌లో అన్నింటికంటే ఉద్వేగభరిత క్షణం విజేతలకు పతక ప్రదానం. ఏళ్ల శ్రమకు గుర్తింపుగా దక్కే స్వర్ణ, రజత, కాంస్య పతకాల్లో నిర్వాహకులు ప్రతిసారీ తమదైన ప్రత్యేకతను, భిన్నత్వాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా స్వర్ణపతకంలో బంగారం చాలా చాలా తక్కువ. ఇందులో 92.5 శాతం వెండిని వాడతారు. కేవలం 1.34 శాతమే బంగారం ఉంటుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల ప్రకారం కనీసం 6 గ్రాముల బంగారం ఇందులో ఉండాలి. రజత పతకంలో దాదాపు అంతా వెండి ఉంటుండగా, కంచు పతకంలో 95 శాతం రాగిని వాడతారు. ఈసారి పారిస్ ఒలింపిక్స్‌లో విజేతలకు ఇచ్చే పతకాలకు ఒక ప్రత్యేకత ఉంది. తమ దేశంలో జరిగే ఒలింపిక్స్ పతకాలను భిన్నంగా రూపొందించాలనే ఆలోచనతో నిర్వాహకులు కొత్తగా ఆలోచించారు.ప్రఖ్యాత ఈఫిల్ టవర్ నిర్మాణంలో ఉపయోగించిన అసలైన ఇనుమును పతకాల్లో చేర్చాలని నిర్ణయించారు. ఇన్నేళ్లలో ఈఫిల్ టవర్‌ను ఎన్నోసార్లు ఆధునికీకరించారు. ఈ క్రమంలో కొంత ఇనుమును పక్కన పెడుతూ వచ్చారు. ఇప్పుడు అందులోనుంచే చిన్న చిన్న ముక్కలను తాజా పతకాలలో చేర్చారు. గుండ్రటి పతకం మధ్య భాగంలో ఈ ఇనుమును పారిస్ 2024 లోగోతో కలిపి షడ్భుజాకారంలో ఉంచారు. ఎప్పటిలాగే వెనుక భాగంలో గ్రీకు విజయదేవత ఏథెనా నైకీ, ఆక్రోపొలిస్ భవనంతో పాటు మరో చివర ఈఫిల్ టవర్ కనిపిస్తుంది.10+9+16=35 ఒలింపిక్స్‌లో భారత పతకాల రికార్డు..1900లో జరిగిన రెండో ఒలింపిక్స్ (పారిస్)లో భారత్ తొలిసారి బరిలోకి దిగింది. వ్యక్తిగత విభాగంలో ఏకైక అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. వేర్వేరు కారణాలతో తర్వాతి మూడు ఒలింపిక్స్‌కు భారత్ దూరంగా ఉండగా, 1920లో ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లు పాల్గొన్నారు. అథ్లెటిక్స్, రెజ్లింగ్‌లలో కలిపి ఐదుగురు క్రీడాకారులు బరిలోకి దిగగా, వ్యాపారవేత్త దొరాబ్జీ టాటా తదితరులు ఆర్థిక సహాయం అందించారు. అప్పటి నుంచి మన దేశం వరుసగా ప్రతీ ఒలింపిక్స్‌లో పాల్గొంటూ వచ్చింది.ఒలింపిక్స్‌లో భారత్‌కు హాకీ అత్యధిక పతకాలు తెచ్చి పెట్టింది. జట్టు ఏకంగా 8 స్వర్ణాలు గెలిచింది. మన స్వర్ణయుగంగా సాగిన కాలంలో 1928–1956 మధ్య వరుసగా ఆరు స్వర్ణాలు సాధించిన టీమ్ 1960లో రజతం; 1968, 1972, 2020లలో కాంస్యం గెలుచుకుంది.1900 ఒలింపిక్స్‌లో నార్మన్ ప్రిచర్డ్ పురుషుల 200 మీటర్లు, 200 మీటర్ల హర్డిల్స్‌లో 2 రజతాలు సాధించాడు. ప్రిచర్డ్ జాతీయతపై కాస్త వివాదం ఉండటంతో అతను గెలుచుకున్న పతకాలు భారత్ ఖాతాలో వస్తాయా రావా అనేదానిపై చర్చ జరిగింది. అతను పాత బ్రిటిష్ కుటుంబానికి చెందిన వాడు కాబట్టి తమవాడే అనేది బ్రిటన్ చరిత్రకారుల వాదన.1900 ఒలింపిక్స్‌కు ముందు లండన్‌లో జరిగిన ఏఏఏ చాంపియన్‌షిప్స్‌లో ప్రదర్శన ఆధారంగానే ఎంపికయ్యాడు కాబట్టి అతను ఇంగ్లిష్‌వాడే అనేది వారు చెప్పే మాట. అయితే ప్రిచర్డ్ కోల్‌కతాలో పుట్టడంతో పాటు సుదీర్ఘ కాలం భారత్‌లోనే గడిపాడు కాబట్టి భారతీయుడే అనేది మరో వాదన. అయితే 1900 క్రీడల్లో గ్రేట్ బ్రిటన్ టీమ్ కూడా బరిలోకి దిగింది. వారి తరఫున కాకుండా భారత్ తరఫున ఆడాడు కాబట్టి భారతీయుడే! చివరకు ఐఓసీ తమ పతకాల జాబితాలో ప్రిచర్డ్ రెండు రజతాలు భారత్ ఖాతాలోనే వేసి అధికారికంగా ఆమోద ముద్ర వేసింది.స్వతంత్ర భారతంలో తొలి పతకం 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో ఖాషాబా దాదాసాహెబ్ జాదవ్ (రెజ్లింగ్) గెలుచుకున్నాడు. హాకీ కాకుండా వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం.ఒలింపిక్స్‌లో భారత పతక వీరులు...హాకీ 12..8 స్వర్ణాలు (1928 ఆమ్స్టర్డామ్, 1932 లాస్ ఏంజెలిస్, 1936 బెర్లిన్; 1948 లండన్; 1952 హెల్సింకీ, 1956 మెల్బోర్న్; 1964 టోక్యో, 1980 మాస్కో)1 రజతం (1960 రోమ్)3 కాంస్యాలు (1968 మెక్సికో, 1972 మ్యూనిక్, 2020 టోక్యో)షూటింగ్ 4..1 స్వర్ణం (అభినవ్ బింద్రా; 2008 బీజింగ్)2 రజతాలు (రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్; 2004 ఏథెన్స్... విజయ్‌కుమార్; 2012 లండన్), 1 కాంస్యం (గగన్ నారంగ్; 2012 లండన్)అథ్లెటిక్స్3..1 స్వర్ణం (నీరజ్ చోప్రా; 2020 టోక్యో)2 రజతాలు (నార్మన్ ప్రిచర్డ్; 1900 పారిస్)రెజ్లింగ్ 7..2 రజతాలు (సుశీల్ కుమార్; 2012 లండన్... రవి కుమార్ దహియా; 2020 టోక్యో)5 కాంస్యాలు (ఖాషాబా జాదవ్; 1952 హెల్సింకీ... సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్; 2012 లండన్... సాక్షి మలిక్; 2016 రియో... బజరంగ్ పూనియా; 2020 టోక్యో)బాక్సింగ్ 3..3 కాంస్యాలు (విజేందర్; 2008 బీజింగ్... మేరీ కోమ్; 2012 లండన్... లవ్లీనా బొర్గోహైన్; 2020 టోక్యో)బ్యాడ్మింటన్ 3..1 రజతం (పీవీ సింధు; 2016 రియో)2 కాంస్యాలు (సైనా నెహ్వాల్; 2012 లండన్, సింధు; 2020 టోక్యో)వెయిట్ లిఫ్టింగ్ 2..1 రజతం (మీరాబాయి చాను; 2020 టోక్యో)1 కాంస్యం (కరణం మల్లీశ్వరి; 2000 సిడ్నీ)టెన్నిస్ 1..1 కాంస్యం (లియాండర్ పేస్; 1996 అట్లాంటా)మనం ఎక్కడున్నాం?71, 71, 65, 50, 55, 67, 48... అట్లాంటాలో జరిగిన 1996 ఒలింపిక్స్ నుంచి టోక్యోలో జరిగిన 2020 ఒలింపిక్స్ వరకు పతకాల పట్టికలో భారత్ స్థానమిది. గత పోటీల్లోనైతే నీరజ్ చోప్రా ప్రదర్శనతో ఒక స్వర్ణపతకం చేరిన తర్వాత కూడా మనం 48వ స్థానానికే పరిమితమయ్యాం. అగ్రరాజ్యాల సంగతి సరే; చెక్ రిపబ్లిక్, క్రొయేషియా, స్లొవేనియా, ఉజ్బెకిస్తాన్, జార్జియా, ఉగాండా, ఈక్వెడార్, బహామాస్, కొసవో, బెలారస్ దేశాలు కూడా పతకాల పట్టికలో మనకంటే ముందు నిలిచాయి. ఈ ప్రదర్శన చూసి నిరాశ చెందాలో, లేక 1996కు ముందు వరుసగా మూడు ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కూడా లేకుండా సున్నా చుట్టి అసలు ఏ స్థానమూ సాధించని స్థితి నుంచి మెరుగయ్యామో అర్థం కాని పరిస్థితి.వ్యక్తిగత క్రీడాంశంలోనైతే 1956 నుంచి 1992 వరకు భారత్‌కు ఒక్క పతకమూ రాలేదంటే ఆటల్లో మన సత్తా ఏపాటిదో అర్థమవుతుంది. క్రికెట్లో విశ్వ విజేతలుగా నిలుస్తున్నా, ఇతర క్రీడాంశాలకు వచేసరికి భారత్ వెనుకబడిపోతూనే ఉంది. ఇక ఒలింపిక్స్ వచ్చే సమయానికి కాస్త హడావిడి పెరిగినా, చాలామంది క్రీడాకారులకు అది పాల్గొనాల్సిన లాంఛనమే తప్ప కచ్చితంగా పతకాలతో తిరిగి రాగలరనే నమ్మకం ఉండటం లేదు.అభిమానుల కోణంలో చూసినా సరే మెగా పోటీలు మొదలైన తొలిరోజు నుంచి పతకాల జాబితాలో మన వంతు ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం అలవాటుగా మారిపోయింది. 1900 ఒలింపిక్స్‌లో ఒకే వ్యక్తిని పంపడం మినహాయిస్తే, 1920 నుంచి రెగ్యులర్‌గా మన ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు. అంటే 2020 టోక్యో ఒలింపిక్స్‌తో భారత్ వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ వందేళ్లలో 10 స్వర్ణాలు, 9 రజతాలు, 16 కాంస్యాలతో భారత్ మొత్తం 35 పతకాలు గెలుచుకోగలిగింది. ఓవరాల్‌గా ఒలింపిక్స్ చరిత్రలో పతకాలు గెలిచిన జట్ల జాబితాను చూస్తే భారత్ 56వ స్థానంలో ఉంది.ఒలింపిక్స్ సమయంలో మినహా...‘నా దృష్టిలో ఇది 1000 స్వర్ణాలతో సమానం. ఇంకా చెప్పాలంటే అది కూడా తక్కువే!’– 2016 రియో ఒలింపిక్స్‌లో రెజ్లర్ సాక్షి మలిక్ కాంస్యం గెలిచినప్పుడు భారత స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఇది. నిజానికి ఇది ఆ ప్లేయర్‌ను అభినందించినట్లుగా ఉంది. కానీ దేశమంతా అభిమానించే ఒక నటుడు ఈ విజయాన్ని అంత గొప్పగా చెబుతున్నాడంటే మనం ఎంత అల్పసంతోషులమో చూపిస్తోంది. భారత ఆటగాళ్లు అప్పుడప్పుడూ సాధించే ఘనతలకు ఆకాశమంత గుర్తింపు దక్కుతుంది.ఆ సమయంలో సాగే హంగామా చూస్తే భారత్ ప్రపంచ క్రీడా వేదికపై అద్భుతాలు చేసినట్లు అనిపిస్తుంది. కానీ ఒలింపిక్స్ సమయంలో మినహా మిగతా రోజుల్లో ఆయా క్రీడలపై చాలా మందికి కనీస ఆసక్తి కూడా ఉండదు. ఇలాంటి వాతావరణమే క్రికెటేతర క్రీడల్లో భారత్ ఎదుగుదలకు అడ్డంకిగా నిలుస్తోంది. ఇటీవల భారత్ టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు మహారాష్ట్రకు చెందిన నలుగురు ఆటగాళ్లకు అక్కడి ప్రభుత్వం భారీ మొత్తంలో నగదు పురస్కారాన్ని అందించింది. కానీ అంతర్జాతీయ వేదికపై ఎన్నో విజయాలు సాధిస్తున్న తనను కనీసం పట్టించుకోలేదని భారత బ్యాడ్మింటన్ ఆటగాడు చిరాగ్ శెట్టి బహిరంగంగానే విమర్శించడం చూస్తే ప్రభుత్వాల ప్రాధాన్యం ఏమిటో స్పష్టమవుతుంది.క్రీడా సంస్కృతి లేకపోవడం వల్లే...ఆటల్లోనూ అగ్రరాజ్యంగా నిలిచే అమెరికాలో క్రీడా మంత్రిత్వశాఖ అనేదే లేదు. క్రీడలకు ఒక మంత్రి కూడా లేడు. ఆశ్చర్యం అనిపించే వాస్తవమిది. క్రీడాకారులను తయారు చేయడంలో అక్కడి ప్రభుత్వానికి ఎలాంటి బాధ్యత లేదు. మరి ఇంత గొప్ప అథ్లెట్లు ఎక్కడి నుంచి, ఎలా పుట్టుకొస్తున్నారని పరిశీలిస్తే ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తాయి.స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, కొందరు పెద్ద పారిశ్రామికవేత్తలు ఆటలను ప్రోత్సహించేందుకు అండగా నిలుస్తున్నారు. వారికి కొన్ని పన్ను రాయితీలు ఇవ్వడం మాత్రమే ప్రభుత్వం చేస్తుంది. అక్కడ స్కూల్స్, కాలేజీలు, స్థానిక పార్కుల్లోనే ఆటగాళ్లు తయారవుతారు. ఒలింపిక్స్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహించేవారిలో 80 శాతం మంది తమ నేషనల్ కాలేజియేట్ అథ్లెటిక్ అసోసియేషన్ (ఎన్సీఏఏ) నుంచే వస్తారంటూ ఆ సంస్థ సగర్వంగా ప్రకటించింది.అమెరికాలో ప్రతి పార్కుకూ అనుబంధంగా తప్పనిసరిగా అథ్లెటిక్ ఫీల్డ్‌లు ఉంటాయి. మన దగ్గర అసలు ఇలాంటివి ఊహించగలమా? ఎక్కడో దూరం వరకు ఎందుకు, స్థానికంగా మన పాఠశాలల్లో చూస్తేనే పరిస్థితి అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో స్కూళ్లలో కనీసం గ్రౌండ్లు కూడా లేని పరిస్థితి ఉంది.భవిష్యత్తుపై నమ్మకం లేక...ఒలింపిక్స్‌లో సత్తా చాటి భారత్ తరఫున పతకం సాధించిన గుప్పెడు మందిని చూస్తే వారందరి విషయంలో ఒకే సారూప్యత కనిపిస్తుంది. దాదాపు అందరూ ఎన్నో ప్రతికూలతలను దాటి సొంతంగా పైకి ఎదిగినవారే! కెరీర్ ఆరంభంలో, వేర్వేరు వయో విభాగాలకు ఆడే దశల్లో ఎలాంటి సహకారం లభించలేకపోయినా, మొండిగా తమ ఆటను నమ్ముకొని వ్యక్తిగత ప్రతిభతో దూసుకొచ్చినవారే!వ్యవస్థ తయారు చేసిన క్రీడాకారుడు అంటూ ఒక్కరి గురించి కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే మన దగ్గర అలాంటి అవకాశమే లేదు. గెలిచాక అభినందనలు, పోటీగా బహుమతులు, కనకవర్షం కురిపించడం సాధారణమే అయినా, అసలు సమయంలో అవసరం ఉన్నప్పుడు ఎవరూ వారిని పట్టించుకోలేదు. ఏ కార్పొరేట్ కంపెనీ కూడా స్పాన్సర్షిప్ ఇచ్చి ఆదుకోలేదు. సరిగ్గా ఇదే అంశం తమ పిల్లలను క్రీడాకారులుగా మార్చడంలో సగటు భారతీయులను వెనక్కి నెడుతుంది.క్రీడల్లో సఫలమై ఏ స్థాయి వరకు చేరతారనే దానిపై ఎలాంటి గ్యారంటీ లేదు. కోచింగ్, ప్రాక్టీస్, ఎక్విప్మెంట్– ఇలా చాలా అంశాలు భారీ ఖర్చుతో ముడిపడి ఉంటాయి. ఎంత కష్టపడినా ఫలితాలు దక్కకపోవచ్చు కూడా. ఈ అనిశ్చితి వల్ల క్రీడలను కెరీర్‌గా చూడటం కష్టంగా మారిపోయింది. అందుకే దాదాపు అందరూ తమ పిల్లలు బాగా చదువుకుంటే చాలనే ఆలోచనతో దానిపైనే దృష్టి పెడుతున్నారు. మనవాళ్ల ప్రాధాన్యాల జాబితాలో క్రీడలు ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉంటాయి. ఎదుటివారి విజయాలకు చప్పట్లు కొట్టి అభినందించడమే తప్ప తమ పిల్లలను క్రీడల్లోకి పంపే సాహసం చేయడం లేదు. ఆటలు ఆడితే లాభం లేదనే సంస్కృతి మన జీవితాల్లో ‘ఖేలోగే కూదోగే తో హోంగే ఖరాబ్. పఢోగే లిఖోగే తో బనోగే నవాబ్’లాంటి మాటలతో నిండిపోయింది.సౌకర్యాలు కల్పించకుండా...‘మేం ఒలింపిక్స్‌లో ఒక్క పతకం కోసం ఎంత ఖర్చు చేశామో తెలుసా? అక్షరాలా 45 లక్షల పౌండ్లు’ 2012 లండన్ ఒలింపిక్స్ తర్వాత బ్రిటిష్ అధికారి ఒకరు చేసిన వ్యాఖ్య ఇది. అంటే భారత కరెన్సీలో అప్పట్లోనే ఇది దాదాపు రూ. 38 కోట్లు. పతకమే లక్ష్యంగా ఆటగాళ్లకు కల్పించిన సౌకర్యాలు, అభివృద్ధి చేసిన క్రీడా సదుపాయాలు, డైట్, ఫిట్నెస్ వంటి అన్ని అంశాలూ ఇందులో కలసి ఉన్నాయి. అలా చూస్తే మన దేశంలో ఇలాంటిది సాధ్యమా? మన వద్ద గెలిచి వచ్చిన తర్వాత ఇంత మొత్తం ఆటగాళ్లకు ఇస్తారేమో గాని, గెలిచేందుకు కావాల్సిన వాతావరణాన్ని అందించే ప్రయత్నం మాత్రం చేయరు. భారతదేశ జనాభా దాదాపు 141.72 కోట్లు. ప్రపంచంలో మొదటి స్థానం.టోక్యో 2020 ఒలింపిక్స్‌లో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య 7 మాత్రమే. దేశ జనాభా, గెలుచుకున్న పతకాలను లెక్క గట్టి సగటు చూస్తే అన్ని దేశాల్లోకి అత్యంత చెత్త ప్రదర్శన మనదే! నిజానికి జనాభాను బట్టి పతకాలు గెలుచుకోవాలనే లెక్క ఏమీ లేదు గాని, సహజంగానే ఇది చర్చనీయాంశం. చాలా తక్కువ మంది మాత్రమే ఆటల వైపు వెళ్లుతున్నారనేది వాస్తవం. వీరిలో అన్ని దశలను దాటి ఒలింపిక్స్ వరకు వెళ్లగలిగేవారు చాలా తక్కువ మంది మాత్రమే! 2020 టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి మొత్తం 126 మంది అథ్లెట్లు మాత్రమే పాల్గొన్నారు. మనం గెలుచుకున్న 7 పతకాలే ఇన్నేళ్లలో మన అత్యుత్తమ ప్రదర్శన. అమెరికా తరహాలో కార్పొరేట్లు పెద్ద ఎత్తున అండగా నిలవడం ఇక్కడ సాధ్యం కావడం లేదు కాబట్టి ప్రభుత్వం వైపు నుంచే క్రీడల అభివృద్ధికి తొలి అడుగు పడాలనేది వాస్తవం.మన పేలవ ప్రదర్శనకు కారణాలను ఎంచడం చూస్తే వాటికి పరిమితి ఉండదు. ఒలింపిక్స్ స్థాయికి తగిన స్టేడియాలు, కనీస సౌకర్యాలు లేకపోవడం, బడ్జెట్లో క్రీడలకు అతి తక్కువ నిధులు కేటాయించడం, ప్రాథమిక స్థాయిలో ఆటలపై అసలు దృష్టి పెట్టకపోవడం, పరిపాలనా వ్యవస్థలోని లోటుపాట్లు క్రీడలకు అడ్డంకులుగా మారుతున్నాయి. ఇలాంటి స్థితిలో ఏదోలా అక్కడక్కడా పైకి దూసుకొచ్చినవారిపైనే ఒలింపిక్స్‌లో మన ఆశలన్నీ ఉంటున్నాయి. ఇప్పటికీ ఫలానా క్రీడాంశంలో మనం పూర్తి ఆధిక్యం కనబరుస్తాం అని నమ్మకంగా చెప్పలేని పరిస్థితిలోనే మనం ఉన్నాం. అందుకే ఒకటీ, రెండు, మూడు అంటూ వేళ్లపై లెక్కించగలిగే పతకాలు వస్తున్న ప్రతిసారీ మనం వాటికి పెద్ద ఎత్తున పండగ చేసుకుంటున్నాం.ఈసారి రాత మారేనా?ఒలింపిక్స్‌లో భారత్ పెద్ద సంఖ్యలో పతకాలు సాధించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేదంటూ సుదీర్ఘకాలంగా విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం కొత్త ఆలోచనలతో ముందుకు వచ్చింది. వెంటనే ఫలితాలు రాకపోయినా భవిష్యత్తులో ఎక్కువ మందిని ఆటల వైపు ప్రోత్సహించేందుకు ఇది ఉపకరిస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా భావించింది. ఈ క్రమంలో టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్) పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014లో మొదటిసారి దీనిని తీసుకొచ్చినా, స్వల్ప మార్పులతో 2018లో ‘టాప్స్’ను అదనపు అంశాలు జోడించి రూపొందించారు.ప్రభుత్వం దీని కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించింది. అయితే దీనిని పూర్తి స్థాయిలో వ్యవస్థాగతంగా సౌకర్యాల కల్పన, మైదానాల ఏర్పాటువంటివాటితో చూడలేం. కానీ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే ఆటగాళ్లకు వ్యక్తిగతంగా ఆర్థికంగా వెసులుబాటు ఇచ్చేందుకు ఇది పనికొస్తోంది. సన్నద్ధతలో భాగంగా ఆయా క్రీడాంశాలకు సంబంధించి స్థానికంగా శిక్షణ, అవసరమైతే విదేశాల్లో కోచింగ్, ఎక్విప్మెంట్, విదేశాల్లో పోటీలకు హాజరయ్యేందుకు అవసరమయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుంది. వీటితో పాటు ఉద్యోగం లేని ప్లేయర్లకు ఊరటగా నెలకు రూ.50 వేల స్టైపెండ్ కూడా లభిస్తుంది.దీని వల్ల ప్లేయర్లు ఆర్థిక సమస్యల గురించి ఆలోచించకుండా, ఏకాగ్రత చెదరకుండా పూర్తి స్థాయిలో తమ ఆటపైనే దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల సమూలంగా మార్పులు రాకపోయినా...గతంతో పోలిస్తే పరిస్థితి కొంత మెరుపు పడినట్లే. ప్రస్తుతం టాప్స్ స్కీమ్ కోర్ గ్రూప్‌లో మొత్తం 172 మంది ఆటగాళ్లు ఉన్నారు. నిజానికి టోక్యో ఒలింపిక్స్‌కు ముందే కొందరు ఆటగాళ్లు టాప్స్ ద్వారా శిక్షణ పొందారు. కానీ అప్పటికి తగినంత సమయం లేకపోవడంతో ఆశించిన ఫలితాలు రాలేదు. కానీ ఇప్పుడు పారిస్ లక్ష్యంగా క్రీడాకారులు సన్నద్ధమయ్యారు. మరి ఈసారి మన పతకాల సంఖ్య పెరిగి రెండంకెలకు చేరుతుందా అనేది చూడాలి.రెండో ప్రపంచయుద్ధం వల్ల 1940, 1944 సంవత్సరాల్లో జరగాల్సిన ఒలింపిక్స్ రద్దయ్యాయి. నిజానికి 1940 ఒలింపిక్స్ టోక్యోలో జరగాల్సి ఉన్నా, జపాన్‌లో యుద్ధబీభత్సం కారణంగా ఆ ఏడాది ఒలింపిక్ వేదిక ఫిన్లండ్‌కు మారింది. అయినా, తర్వాత అది కూడా రద్దయింది. – మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ -
స్క్రీన్ మారలేదు, సీనే మారింది!
కథ చదవడం, వినడం పాత ప్రక్రియ! చూడటం వన్నె తగ్గని వెండితెర పంచే వింత వినోదం! కథను ఆడించే ఆ వెండితెర ఇంద్రజాలం నేర్చుకుంటే? మెదడు ఊహించని లోకాలకు తీసుకెళ్తుంది, నిజమే నమ్మలేని దృశ్యాలను చూపిస్తుంది. అదొక నయనానందం, అదొక మనోల్లాసం! మొత్తంగా మనిషిని మునివేళ్ల మీద నిలబట్టే సరికొత్త ప్రక్రియ! స్క్రీన్ మారలేదు, సీనే మారింది! బిహైండ్ ద స్క్రీన్ టోటల్‌గా చేంజ్ అయింది!కెమెరా కంటే ఎఫెక్ట్స్ ఎక్కువగా పనిచేస్తున్నాయి. ఔట్ డోర్ కంటే గ్రీన్ మ్యాట్, బ్లూ మ్యాట్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. ఎడిట్ సూట్స్ కంటే వీఎఫ్ఎక్స్ పవర్ ప్రదర్శిస్తున్నాయి. అవే మొన్న బాహుబలిని ప్రెజెంట్ చేశాయి. ఈరోజు కల్కిని క్రియేట్ చేశాయి. టాక్ ఆఫ్ ద కంట్రీ అయ్యాయి. ఆ ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్ను కంపాక్ట్‌గా చూద్దాం..అనాథ అయిన హీరో– అంతరిక్షం నుంచి భూమ్మీదకు పడే వస్తువులను అమ్ముకుంటూ జీవిస్తుంటాడు. ఒక రోజు విజిటింగ్ వీసా మీద వేరే గ్రహం నుంచి వచ్చిన హీరోయిన్ను చూసి ఇష్టపడతాడు. ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలని సుదూరంలో ఉన్న ఆమె గ్రహానికి వెళ్తాడు. అక్కడ ఆమె తండ్రి మొదట వాళ్ల ప్రేమను కాదంటాడు. అక్కడికి కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండే బ్లాక్ హోల్ దగ్గర ఉన్న తమ వారసత్వ సంపద టెక్నాలజీని తెస్తే పెళ్లికి ఒప్పుకుంటానని కండిషన్ పెడతాడు. దీంతో హీరో స్పేస్‌లో సాహసాలు చేయాల్సి వస్తుంది.ఆ ప్రయత్నంలో తన తల్లిదండ్రులు మరో గ్రహంపై బందీలుగా ఉన్నారనే షాకింగ్ విషయం హీరోకి తెలుస్తుంది. వెంటనే అక్కడకు చేరుకుని విలన్ల భరతం పడతాడు. వాళ్లను విడిపించుకుని, చాలెంజ్‌లో నెగ్గి హీరోయిన్ను దక్కించుకోవడంతో కథ సుఖాంతం అవుతుంది. ప్రేమ, ప్రతీకారం, లోక కల్యాణం కోసం విలన్‌ను హీరో అంతం చేయడం అనాదిగా తెలుగు సినిమాలో వస్తున్న స్టోరీ లైన్. కాకపోతే మారింది సినిమా పరిధి. నాటి ‘పాతాళ భైరవి’ నుంచి నేటి ‘కల్కి’ దాకా సినిమా అంటే కళ్లు చెదిరేలా ఉండాల్సిందే!ఎక్కడి మహాభారతం? ఎక్కడి 2898 సంవత్సరం? ఇతిహాసాన్ని ఆరువేల సంవత్సరాల భవిష్యత్తుకు ముడిపెట్టి తీసిన కల్పితగాథ ‘కల్కి’కి ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కుతోంది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం మార్వెలస్‌గా ఉందని, మరో ప్రపంచంలో విహరింపజేశాడంటూ దర్శకుడిని పొగుడుతున్నారు. ఇక్కడ కథ కంటే భవిష్యత్తులో దర్శకుడి ఊహకు, అందులోని యాక్షన్ సన్నివేశాలకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.నాటి కేవీరెడ్డి ‘మాయాబజార్’ నుంచి నేటి నాగ అశ్విన్ ‘కల్కి’ దాకా సినిమాలో కథ ఉంటుంది. కానీ, కథ కంటే దాని బ్యాక్‌గ్రౌండ్‌కి ఎక్కువ ప్రాధాన్యం దక్కుతోంది. దానికి కారణం గ్రాఫిక్స్ మాయాజాలం. ఒక హీరో క్లైమాక్స్‌లో విలన్ తో భూమ్మీదే ఎందుకు పోరాడాలి? ఆ పోరాటం వినీలాకాశంలోనో, సాగర గర్భాంలోనో ఉంటే ఎలా ఉంటుందనే ప్రేక్షకుడి ఊహకు కూడా అందని ఆలోచన ఇప్పుడు తెర మీదకు వస్తోంది. మొత్తంగా ఒక సినిమా ద్వారా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లాలనే ప్రేక్షకుడి కోరికను దర్శకులు తీర్చేస్తున్నారు.కథ కొంచెం.. గ్రాఫిక్స్ ఘనం..సినిమాలో కథ ఉంటుంది. కథకు తగ్గట్లు పాత్రలు కదులుతుంటాయి. కానీ, తెర వెనుక జరిగేదంతా వేరే ఉంటుంది. మొత్తం కంప్యూటర్ మీదనే మాయచేస్తారు నిపుణులు. సీన్లను నార్మల్‌గా తీసి దానికి కంప్యూటర్లో మెరుగులు అద్ది నిజంగా ఫలానా చోట తీశారా అనే భ్రమను కలిగిస్తారు. అలా కథ కంటే గ్రాఫిక్స్ ఘనంగా మారిపోతున్నాయిప్పుడు. గ్రీన్ మ్యాట్ మీద తీసిన సీన్లకు సినిమాలో చూసిన సీన్లకు తేడా గమనిస్తే ఎవరైనా ముక్కున వేలేసుకుంటారు.పాత్రధారి లేకున్నా..తెరపై కనిపించకున్నా, నటీనటులు తమ గొంతుతో సినిమాను నడిపించిన దాఖలాలు చాలానే ఉన్నాయి. అయితే టెక్నాలజీకి ముడిపెట్టి వాయిస్ ఓవర్‌తో మ్యాజిక్ చేయడం ఇప్పుడు చూస్తున్నాం. అమెజాన్, అలెక్సా, యాపిల్ సిరి, గూగుల్ నౌలను ఎలా ఉపయోగించుకుంటున్నామో అలాగన్నమాట! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సతో ఆలోచించే అడ్వాన్్సడ్ వెహికిల్‌గా ‘బుజ్జి’ కల్కి చిత్రంలో అదనపు ఆకర్షణ. నటి కీర్తి సురేష్ ఆ ఆకర్షణకు వాయిస్ ఓవర్ ఇచ్చింది. తెరపై కనిపించకున్నా, ఈ సినిమా సక్సెస్‌లో తన వంతు పాత్రను పోషించింది.అయితే 2013లోనే ఆ తరహా ప్రయోగం ఒకటి జరిగింది. హాకిన్ ఫీనిక్స్ లీడ్ రోల్లో ‘హర్’ అనే చిత్రం వచ్చింది. అందులో సమాంత అనే వాయిస్ టెక్నాలజీతో భావోద్వేగమైన బంధంలో మునిగిపోతాడు హీరో! నటి స్కార్లెట్ జాన్సన్ ఆ టెక్ వాయిస్ ఇవ్వడం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. విశేషం ఏమిటంటే ఏఐ అనే ప్రస్తావన లేకుండా సాగుతుందీ పాత్ర. ఇలా తెర మీద కనిపించకున్నా, ఆర్టిస్టులు ప్రభావం చూపిస్తున్నారు.కేరాఫ్ హాలీవుడ్..ఎలాంటి సాంకేతికతనైనా త్వరగా అందిపుచ్చుకోవడంలో హాలీవుడ్ ఎప్పుడూ ముందుంటుంది. గ్రాఫిక్స్ మాయాజాలానికి పుట్టినిల్లు అది. మన సినిమాల్లో టెక్నాలజీ వాడకం కొంత మేర ఉంటే, వాళ్లు పూర్తిగా సినిమానే దాంతో నింపేస్తున్నారు. ప్రారంభం నుంచి చివరి దాకా పూర్తిగా గ్రాఫిక్స్ మాయాజాలంతో బోలెడు సినిమాలు వచ్చాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి.అవతార్, మ్యాట్రిక్స్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్, జురాసిక్ పార్క్, 2012, కింగ్ కాంగ్, ది అవెంజర్స్, గ్రావిటీ, ది డార్క్ నైట్, పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్, ఇన్సెప్షన్, ఏలియన్, టెర్మినేటర్, మమ్మీ, గాడ్జిల్లా, అనకొండ, ది జంగిల్ బుక్, లయన్ కింగ్– చెబుతూ పోతే కోకొల్లలు. అందుకే మన దర్శకులు అక్కడి టెక్నీషియన్ల సపోర్ట్ తీసుకుంటుంటారు. అయితే, వాటికి పనిచేసే టెక్నీషియన్లలో ఎక్కువ మంది అక్కడున్న భారతీయులే. అయితే ఇప్పుడిప్పుడే ఇక్కడి గ్రాఫిక్స్ సంస్థలనూ నిర్మాతలు సంప్రదిస్తుండడంతో ఇక్కడి మనవాళ్లకూ తమ ప్రతిభను చూపించుకునే అవకాశాలు లభిస్తున్నాయి.కంప్యూటర్ గ్రాఫిక్స్ మొదలు..చలనచిత్ర రంగంలో గ్రాఫిక్స్ పాత్ర క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట్లో సెట్టింగుల కోసం, లొకేషన్ల కోసం హ్యాండ్ ప్రింటెడ్ బ్యాక్ డ్రాప్స్ మీద ఆధారపడాల్సి వచ్చేది. ఆ తర్వాత ఆప్టికల్ ఎఫెక్ట్స్ వచ్చాయి. 80, 90వ దశకంలో కంప్యూటర్ గ్రాఫిక్స్, 2000లో వీఎఫ్ఎక్స్.. వాటికి సంబంధించి స్టూడియోలే ఏర్పడటం మొదలైంది. సీజీఐ, విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) భూమిక ప్రధానమవుతోంది. భారీ బడ్జెట్ సినిమాలంటే ఇప్పుడు కచ్చితంగా వీఎఫ్ఎక్స్ ఉండాల్సిందే! ఇప్పుడు విజువల్స్ అంటే దృశ్య విన్యాసమే కాదు, కథలో అంతర్భాగం కూడా.ఇలా వచ్చిన రోబో, బాహుబలి చిత్రాలు భారతీయ చిత్రాల సత్తాను అంతర్జాతీయంగా చాటాయి. అయితే సాంకేతికంగా ఇంత అడ్వాన్స్మెంట్ లేని కాలంలో కూడా కేవి రెడ్డి, సింగీతం శ్రీనివాస్, శంకర్ షణ్ముగంలాంటి సినీ ఉద్దండులు ఈ తరహా ప్రయోగాలకు ఏడు దశాబ్దాల కిందటే క్లాప్ కొట్టారు ‘మాయాజబార్’తో! తర్వాత కాలంలో వచ్చిన ‘ఆదిత్య 369’, ‘భైరవ ద్వీపం’, ‘జీన్ ్స’, అమ్మోరు’, ‘దేవీపుత్రుడు’, ‘అంజి’, ‘దేవి’, ‘ఇండియన్’ మొదలు ‘రోబో’, నిన్నటి ‘బాహుబలి’, నేటి ‘కల్కి 2898 ఏడీ’ వరకు అలాంటి ఎన్నో సినిమాలకు స్ఫూర్తిగా నిలిచారు. అలా టెక్నాలజీ ఏదోరకంగా తన విజువల్ గ్రాండ్యూర్‌తో దేశీ వెండితెర మీద సందడి చేస్తూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఈ తరహా చిత్రాలే ప్రేక్షకులకు వినోదం పంచుతున్నాయి.సజీవంగా లేకున్నా..సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారతీయ చలనచిత్ర పరిశ్రమ ముఖ్యంగా దక్షిణాది హాలీవుడ్‌తో పోటీపడుతోంది. ఏఐని విరివిగా వినియోగిస్తోంది. ఏఐ సాయంతో దివంగత గాయనీ గాయకుల గాత్రాలను వినిపిస్తోంది. నటీనటుల అభినయాన్ని చూపిస్తోంది. గత ఏడాది నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’లో ఓ సీన్ కోసం ఫారిన్ లేడీ వాయిస్‌ను ఏఐ ద్వారానే క్రియేట్ చేశారు. ‘లాల్ సలామ్’ మూవీ కోసం మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడా అలాంటి ప్రయోగమే చేశారు.2022లో వచ్చిన ‘టాప్ గన్: మావెరిక్’ సినిమాలో లెఫ్టినెంట్ టామ్ ఐస్ మ్యాన్ కజన్ స్కై పాత్రధారి వల్ కిల్మర్ కోసం ఏఐ వాయిస్‌ను సృష్టించారు. 2014లో గొంతు కేన్సర్ బారినపడి మాట పడిపోయింది ఆయనకు. అయితే ఏఐ సాయంతో అచ్చం ఆయన గొంతునే క్రియేట్ చేశారు. అలా దివంగత నటులనూ తెరపై చూపిస్తోంది ఏఐ. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ తను నటిస్తున్న ‘జేమ్స్’ సినిమా సెట్స్ మీద ఉండగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన నటించాల్సిన మిగిలిన సన్నివేశాలను గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసి చిత్రాన్ని పూర్తిచేశారు.మాయల బజార్..ఏఐతో అప్డేట్ అయిన సినిమాల యుగంలో కూడా మరువకుండా మరీ మరీ ప్రస్తావించుకోవాల్సిన మూవీ ‘మాయాబజార్.’ తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని విజువల్ వండర్స్ వచ్చినా.. ఆ చిత్ర సాంకేతికత గురించి ఇప్పటికీ చర్చించుకూంటూనే ఉంటారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఊహే లేని .. అంతెందుకు కంప్యూటర్ ఉనికే లేని కాలంలో లాప్టాప్ని పోలిన ప్రియదర్శిని అనే పేటికను, స్కైప్ కాల్ని తలపించేలా అభిమన్యుడు–శశిరేఖల వీడియో కాలింగ్‌ని ఎవరైనా ఊహించగలరా? కానీ దర్శకుడు కేవీ రెడ్డి ఆ ఊహకు వెండితెర రూపమిచ్చారు.అందమైన చందమామను చూస్తూ.. లాహిరి లాహిరిలో అంటూ సాగే అందులోని పాటను వాస్తవానికి ఓ ఎర్రటి ఎండలో తీశారంటే నమ్మగలమా? ఘటోత్కచుడి పాత్రలో ఎస్వీఆర్ మాయా విన్యాసాలను ఇమాజిన్ చేయగలమా? ఆశ్చర్యం! రెట్రో రీల్, ఆంగ్లో–ఇండియన్ కెమెరామన్ మార్కస్ బార్టే› కెమెరా అద్భుతం అది! వివాహ భోజనంబు పాటనైతేతే నాలుగు రోజులపాటు శ్రమించి.. కెమెరా టెక్నిక్స్, స్టాప్ మోషన్ యానిమేషన్ టెక్నాలజీతో దాన్ని చిత్రీకరించారట.ఎంత ఎక్కువ టైమ్ తీసుకుంటే.. విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానాంశంగా ఇప్పుడు దాదాపు అన్ని భారతీయ భాషల్లో సినిమాలు వస్తున్నాయి. అయితే భారీ బడ్జెట్.. విజువల్స్ బేస్ చేసుకుని సినిమా తీస్తున్నప్పుడు దానికి తగినంత సమయం ఇవ్వకపోతే ఆశించినంత రిజల్ట్ రాదు. గత ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఒక మైథలాజికల్ పాన్ ఇండియా మూవీ విషయంలో ఇదే జరిగింది. ప్రీ–ప్రొడక్షన్ కి సరైన సమయం ఇవ్వకుండా మేకర్స్ చాలా తొందరపడ్డారు.ఫలితంగా ఆ చిత్రం విజువల్స్ నాసిరకంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. అలాగే టైమ్ తీసుకున్న చిత్రాలు మంచి అవుట్ ఫుట్‌ను ఇచ్చాయి. కాబట్టే ఆ సినిమాల కంటెంట్‌కి, విజువల్స్‌కి మ్యాచ్ అయింది. ఆడియెన్స్‌ని ఎంటర్టైన్ చేసి బాక్సాఫీస్ సక్సెస్‌నూ సాధించాయి. ఫిల్మ్ మేకింగ్ అనేది క్రియేటివ్ ప్రాసెస్. అలాగని వీఎఫ్ఎక్స్తో ప్రయోగాలు చేసినా.. తొందర పెట్టినా.. బడ్జెట్ అంతకంతకూ పెరగడంతో పాటు అవుట్ ఫుట్ కూడా దెబ్బ తింటుంది. – పి. లక్ష్మీనారాయణ, వీఎఫ్ఎక్స్ నిపుణుడుఇదీ చిత్రమే..‘అపూర్వ సహోదరులు’లో మరుగుజ్జుగా కమల్ హాసన్ నటన ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. కమల్‌ను అలా ఎలా చూపించారనే ఆసక్తికరమైన చర్చ నడిచింది అప్పట్లో. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ కోసం తొలిసారి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించారు. ఇది.. విజువల్ ఎఫెక్ట్ డిజైనర్ ఎస్టీ వెంకీకి తొలి చిత్రం.అందులోని పాటలు, సర్కస్ పోర్షన్‌కి ఈ టెక్నాలజీని వాడారు. అయితే పొట్టి కమల్ హాసన్ కోసం ప్రత్యేకించి గ్రాఫిక్స్ ఉపయోగించకపోవడం గమనార్హం. డిఫరెంట్ టెక్నిక్స్.. డిఫరెంట్ కెమెరా యాంగిల్స్‌లో చిత్రీకరించారు. ఇందుకోసం మోకాళ్లకు ప్రత్యేకంగా తయారు చేసిన షూ వాడడం, స్టడీ షాట్లో గుంతలు తీసి మోకాళ్ల దాకా కమల్ హాసన్‌ను అందులో పాతిపెట్టడం వంటివి చేశారట.డీ–ఏజ్ క్లిక్కు.. లుక్కుతో కిక్కు..మేకప్ విషయానికి వస్తే.. స్క్రీన్ ప్రెజెన్స్ కోసం మేకప్ అనే మాట ఏనాడో పాతదైపోయింది. ప్రోస్తటిక్, త్రీడీ మేకప్‌లతో అది కథలో భాగమైంది. ఇదింత మేకప్ అయి వచ్చినా టెక్నాలజీ ఎఫెక్ట్‌కి ఫేడ్కాక తప్పట్లేదు. దాన్నలా ఫేడ్ అవుట్ చేస్తోంది డీ–ఏజింగ్ డిజిటల్ మేకప్. ఇది సిల్వర్ స్క్రీన్ ౖపై చేస్తున్న మాయాజాలం అంతా ఇంతా కాదు. వయసు పైబడిన హీరో, హీరోయిన్లను యంగ్‌గా చూపించేందుకు విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్టులు ‘డీ–ఏజింగ్’ టెక్నిక్‌ను వాడుతున్నారు. దీనిద్వారా ఆర్టిస్ట్ ముఖంతో పాటు బాడీ షేపుల్లోనూ మార్పులు చేసుకునే వీలుంటుంది.2006లో ‘ఎక్స్‌మెన్ : ది లాస్ట్ స్టాండ్’లో ప్యాట్రిక్ స్టీవార్ట్, ఇయాన్ మెకెల్లెన్ ల కోసం ‘డీ–ఏజింగ్’ టెక్నిక్‌ని ఫస్ట్ టైమ్ పక్కాగా వాడారు. హెచ్‌బీవో నిర్మించిన ‘ది రైటస్ జెమ్‌స్టోన్ ్స’ టీవీ సిరీస్‌లో నటుడు జాన్ గుడ్మన్ కోసం ఒక ఎపిసోడ్ మొత్తం డిజిటల్లీ డీ–ఏజ్డ్ టెక్నాలజీనే ఉపయోగించారు. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’లో క్రియేటర్ సాన్లీ గెస్ట్ అపియరెన్ ్స కోసం రెండు వందల షాట్స్‌తో ఒక సీన్ రూపొందించారు.‘టెర్మినేటర్: డార్క్ ఫేట్, ఇట్– చాప్టర్2’లో ఈ టెక్నిక్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ‘కెప్టెన్ మార్వెల్’, ‘జెమినీ మ్యాన్ ’, ‘ది ఐరిష్‌మ్యాన్ ’– ఈ మూడు సినిమాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యాయి. ‘కెప్టెన్ మార్వెల్’లో నిక్ ఫ్యూరీ క్యారెక్టర్ కోసం శామ్యూల్ జాక్సన్ ని కొద్దిసేపు యంగ్‌స్టర్‌గా చూపించారు. ‘జెమినీ మ్యాన్ ’ కోసం విల్ స్మిత్‌ను ఏకంగా ఇరవై మూడేళ్ల యువకుడిగా చూపించారు. మార్టిన్ స్కార్సిస్.. నెట్‌ఫ్లిక్స్ నిర్మాణంలో ‘ది ఐరిష్ మ్యాన్ ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే.ఇందులో డెబ్బైతొమ్మిదేళ్ల రాబర్ట్ డి నీరో.. నలభై తొమ్మిదేళ్ల క్యారెక్టర్లో కనిపిస్తాడు. ఈ మూడు సినిమాలూ ఆస్కార్ 2020 బరిలో విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఎంపికయ్యాయి. ఇంతకాలం హాలీవుడ్‌కే పరిమితం అనుకున్న ఈ టెక్నాలజీని ఇప్పుడు మన చిత్రాల కోసం కూడా వినియోగిస్తున్నారు. మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’లో ఐశ్వర్య రాయ్‌ని అలాగే తీర్చిదిద్దారు. అందులో ఆమె గుండ్రటి మొహం కాస్త కోలగా మారి ఆ సినిమాలో ఆమె వయసు తగ్గినట్టు కనిపిస్తుంది.ధైర్యంగా ముందుకు..కథాంశాన్ని బట్టి బడ్జెట్ మారుతుంది. కానీ, భారీ హంగులే ప్రధానాంశమైతే సినిమా బడ్జెట్ బరువు పెరుగుతుంది. ఒకప్పుడు స్టార్ యాక్టర్స్, భారీ సెట్లు, ఫారిన్ లొకేషన్ల కోసం బడ్జెట్ భారీగా మారేది. ఇప్పుడు ఆ జాబితాలో తారాగణం పారితోషికాలను మినహాయిస్తే మిగిలిన వాటి స్థానాలను ఒక్క గ్రాఫిక్సే భర్తీ చేస్తున్నాయి భారీగా. దీనివల్ల ఒక సినిమాకు ఐదారుగురు నిర్మాతలనే హాలీవుడ్ తీరూ మనకూ అనివార్యమైంది. ఇప్పుడు మన సినిమాలకు ఒకరి కన్నా ఎక్కువ మంది నిర్మాతలు ఉండటం, అంతర్జాతీయ సంస్థలూ భాగస్వాములుగా చేరుతుండటం సాధారణమైంది.దీనివల్ల విజువల్ వండర్స్ క్రియేట్ అవుతున్నాయి కదా అంటాయి సినీ వర్గాలు. కావచ్చు. ఈ బడ్జెట్‌తోనే వీఎఫ్ఎక్స్ సామాజిక అంశాలతో పాటు చరిత్ర, పురాణేతిహాసాలు, టైమ్ ట్రావెల్, కృష్ణ బిలాలు, సాపేక్ష సిద్ధాంతం లాంటి సంక్లిష్టమైన విషయాలను కూడా సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో కన్నులకు కడుతోంది. అందుకే కథను బట్టి గ్రాఫిక్స్ కాదు, గ్రాఫిక్స్‌ని బట్టే కథను రాసుకుంటున్నారు దర్శకులు. దాన్ని భరించే నిర్మాతలను వెదుక్కుంటున్నారు. దాంతో వీఎఫ్ఎక్స్ సినిమాకు కమర్షియల్ ఎలిమెంట్‌గా మారింది. దీనికి భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా లెవెల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా గిరాకీ పెరిగింది.గంటల నుంచి నెలలు..సాధారణంగా విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్)కు అయ్యే ఖర్చు ఎంతమంది నిపుణులు పని చేస్తారు, వాళ్ల అనుభవం, ఎన్ని వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను ఉపయోగిస్తారు, వాటి నిడివి, అలాగే వాళ్లు ఉపయోగించే సాఫ్ట్వేర్లను బట్టి ఉంటుంది. ఆ అవసరాలకు తగ్గట్లు బడ్జెట్ కేటాయిస్తుంటారు నిర్మాతలు. కంపెనీ ప్రతినిధులను గంటల లెక్క నుంచి రోజులు, నెలల లెక్కన కేటాయిస్తాయి అవసరాలన్ని బట్టి. కేవలం కంపెనీలు మాత్రమే కాదు, ఫ్రీలాన్ ్సగా పని చేసే నిపుణులూ ఉన్నారు.మన దేశంలో వీఎఫ్ఎక్స్ నాణ్యత, నిడివి ప్రాతిపదికన నిమిషానికి రూ.500 నుంచి రూ. 2000 దాకా తీసుకునే వీడియో ఎడిటర్లు ఉన్నారు. వీఎఫ్ఎక్స్లో షాట్స్‌ను బట్టి పని లెక్క ఉంటుంది. పది కంటే తక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటే దాన్ని మినిమమ్ వర్క్‌గా భావిస్తారు. 10–50, 50–100, వంద కంటే ఎక్కువ వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను అవసరానికనుగుణంగా వినియోగిస్తుంటారు.అయితే ఒక నిమిషం నిడివి ఉన్న వీఎఫ్ఎక్స్ వీడియో తీయాలంటే రూ. 80 వేల నుంచి లక్షన్నర రూపాయల దాకా ఖర్చు అవుతుంది. ఇందులో.. ఇంటర్మీడియట్, అడ్వాన్ ్సడ్, హైలీ కాంప్లెక్స్ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ స్థాయిలు ఉంటాయి. ఒక్కొ లెవెల్ ముందుకు వెళ్లేకొద్దీ.. అంతకు మించే(రెట్టింపు) ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడయ్యాక ఇది మరింత ఖరీదుతో కూడిన వ్యవహారంగా మారింది. కానీ, ఇందులోనూ రకాలున్నాయి. తేలికగా అయ్యే వీఎఫ్ఎక్స్ కోసం ఖర్చు తక్కువగా ఉంటుంది. అదే షార్ట్ ఫిల్మ్, యానిమేషన్, షూటింగ్ లైవ్ యాక్షన్ లార్జ్ స్కేల్ వీఎఫ్ఎక్స్– ఇలా ఒక్కో కేటగరీలో ముందుకు వెళ్లే కొద్దీ ఖర్చు పెరుగుతూ పోతుంది.ఉదాహరణకు ‘అవతార్ ది వే ఆఫ్ వాటర్’ చిత్రం కోసం 4 వేల వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను క్రియేట్ చేశారట! కానీ, అందులో 3,289 వీఎఫ్ఎక్స్ షాట్స్‌ను మాత్రమే తీసుకున్నాడట దర్శకుడు జేమ్స్ కామెరూన్ . ఆ ఒక్కో వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 62,500 డాలర్ల ఖర్చు అయ్యింది. ఆ సినిమా మొత్తం బడ్జెట్లో వీఎఫ్ఎక్స్ షాట్స్ కోసమే 250 మిలియన్ డాలర్లను ఖర్చుపెట్టారట! అయితే సినీ చరిత్రలో ఇప్పటి దాకా సీజీఐ కోసం అత్యధికంగా ఖర్చు పెట్టింది మాత్రం ‘ది అవెంజర్స్–ఎండ్‌గేమ్.’ వీటికోసం 356 మిలియన్ల డాలర్లను కుమ్మరించారంటే అతిశయోక్తికాదు. అలాగే, విజువల్స్ కోసం అత్యధికంగా బడ్జెట్ కేటాయించిన టాప్ 3 చిత్రాలు కూడా మార్వెల్ సినిమాలే కావడం మరో విశేషం! ఇదీ స్క్రీన్ మీద ఎఫెక్ట్స్, ఇంపాక్ట్స్, వీఎఫ్ఎక్స్లు క్రియేట్ చేసే సీన్! – భాస్కర్ శ్రీపతి -
కాలానికి కళ్లెం!
‘ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థాయికి చేరేందుకు ఎవరైనా, ఎంతటివారైనా సమయాన్ని నమ్ముకోవాల్సిందే. అందుకే దేనికోసం దేనిని విడిచి పెట్టాలో, ఏ కాలంలో ఏ పని చేయాలో తెలిసి మెలగడం ఉత్తమం’ అంటారు పెద్దలు. మరి ఉరుకుల పరుగుల జీవితంలో సమయాన్ని ఎలా ఒడిసిపట్టుకోవాలి? ఎలా సద్వినియోగం చేసుకోవాలి?‘గడచిపోయినట్టి క్షణము తిరిగిరాదు, కాలమూరకెపుడు గడపబోకు, దీపమున్నయపుడే దిద్దుకోవలెనిల్లు’ అన్నారు ప్రముఖ రచయిత నార్ల చిరంజీవి. ‘కాలః పచతి భూతాని, కాలం సంహరతే ప్రజాః , కాలః సుప్తేషు జాగర్తి, కాలోహి దురతిక్రమః’ అన్నాడు చాణక్యుడు. ‘కాలం అనేది భగవత్స్వరూపం. ప్రాణుల్ని, జగత్తునూ నడిపించేది, హరించేది కూడా కాలమే! సృష్టి, స్థితి, వినాశాలు చేయగలిగేది కాలం. బలవత్తరమైన కాల ప్రభావాన్ని ఎవరూ అతిక్రమించలేరు. ఏ భౌతిక సాధనాలూ, ఏ ఆధ్యాత్మిక శక్తియుక్తులూ కాలాన్ని బంధించలేవు. పారే నదిలో ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో.. అదే విధంగా గడిచిపోయిన సమయాన్ని ఆపలేం. పట్టుకోలేం. అందుకే కాలమహిమను గ్రహించి నడుచుకోవాలి’ అనేదే చాణక్యుడి మాటల్లోని పరమార్థం.ఈ భూమి మీద ప్రతి జీవికి రోజులో 24 గంటలే ఉంటాయి. దానిలో ఏ మార్పు లేదు. అయితే వాటిని వాడుకోవడంలోనే విజయం, అపజయం దాగి ఉంటుంది. అందుకే మనం సమయాన్ని ఎప్పుడు? దేనికి? కేటాయిస్తున్నాం అనేది ముఖ్యం. నిద్రపోవాల్సిన సమయంలో సెల్‌ఫోన్ వాడితే.. ఆరోగ్యం పాడవుతుంది. చదువుకోవాల్సిన సమయాన్ని జల్సాలకు వాడితే జీవితమే నాశనమవుతుంది. ఇలా అవసరాన్ని, అనవసరాన్ని గుర్తించకపోతే.. కోల్పోయిన వాటిని కొలమానాలతో కొలవడానికి తప్ప మరో సమయం మిగలదు.కాలచక్రంలో పరుగులు తీసే మనిషికి.. కాలాన్ని అంచనా వెయ్యడం.. కాలానికి తగ్గట్టుగా నడుచుకోవడం తెలిసుండాలి. మనం ప్రతిదానికి ‘సమయం రావాలి’ అంటుంటాం. వాదనకో, మాటవరసకో ‘నాకూ టైమ్ వస్తుంది’ అని కూడా ఇతరులతో చెబుతుంటాం. ప్రతి కార్యానికి సమయంతో ప్రణాళిక వేస్తూ శుభకార్యాలను నిర్వహిస్తుంటాం. అంతటి ముఖ్యమైన సమయాన్ని.. ముందుగానే కేటాయించుకుని.. పనులు పూర్తిచేసుకోవడం మరింత ముఖ్యం. చేసే ఏ పని అయినా విజయం సాధించాలంటే తప్పనిసరిగా సమయపాలన, క్రమశిక్షణ అవసరం. సమయం వృథా కాకూడదంటే.. ఏ పని ముందు చేయాలి, ఏ పని తర్వాత చేయాలి? అనేది ముందే ఆలోచించుకోవాలి. చేసే పని పాజిటివ్ కోణంలో చేస్తే తిరిగి ఆ పని చేయాల్సిన అవసరం రాదు. అప్పుడే ఆ పనికి.. ఆ సమయానికి సరైన ఫలితం దక్కుతుంది.అనుకున్న పని ఎంత టైమ్‌లో పూర్తి అవుతుందో ముందే ఓ అంచనా ఉండాలి. ఆ టైమ్ అనుకున్న పనికి అనుకూలంగా ఉంటుందో లేదో కూడా గమనించుకోవాలి. ఆ తరువాతే మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాలి. ఇలాంటి ప్రణాళికతో కూడిన ఆలోచన వల్ల సమయం వృథా కాకుండా ఉంటుంది. రోజువారీ పనుల్లో కూడా సమయ నిర్వహణ అవసరం. అలాగే ముందు వెనుక అనే ప్రాధాన్యం కూడా ముఖ్యమే. అలా సమయాన్ని పనులవారీగా.. రోజుల వారీగా లెక్కేసుకుని చేసుకుంటే.. ప్రాధాన్యాన్ని బట్టి.. అనుకున్న సమయం కంటే తక్కువ సమయంలోనే ఆ పనులు పూర్తి అవుతాయి. ముందుగా ముఖ్యమైన పనులను గడువులోగా పూర్తి చేసుకునేలా ప్రణాళిక రచించుకోవాలి. ఇలా చేయడంతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ప్రశాంతంగా మిగిలిన పనులనూ అనుకున్న సమయంలో పూర్తి చేయగలుగుతాం.సమయపాలనకై గురుబోధన..ఒక రోజు ఒక గురువు తన శిష్యులకు సమయాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పాలనుకుంటాడు. అందుకే శిష్యులకు ఓ పరీక్ష పెడతాడు. ‘శిష్యులారా! నేను మీకో పరీక్ష పెట్టబోతున్నాను.. నా దగ్గర ఒక ప్రత్యేకమైన బొక్కెన (బకెట్ లాంటిది) ఉంది. అందులో నీళ్లు పోస్తే అది దానికదే ఓ చిన్న రంధ్రాన్ని సృష్టించుకుంటుంది. దానివల్ల కొంత నీరు అందులోంచి బయటికి వెళ్లిపోతుంది. మీరు ఒకవేళ ఆ రంధ్రాన్ని మూయాలని ప్రయత్నిస్తే.. అది మరిన్ని రంధ్రాలను దానికదే సృష్టించుకుంటుంది. అప్పుడు నీళ్లన్నీ వృథాగా పోతాయి. కాబట్టి దాన్ని అలాగే ఉపయోగించుకోవడం మంచిది. ఈ బొక్కెన సామర్థ్యం 10 సేర్లు. నాకు ఏడు సేర్ల నీళ్లు కావాలి. అక్కడో బావి ఉంది. ఈ ప్రత్యేకమైన బొక్కెన తీసుకుని వెళ్లి.. మూడు నిమిషాల్లో.. ఏడు సేర్ల నీళ్లు తీసుకురండి.మూడు నిమిషాల్లోపు ఎవరైతే తెస్తారో.. వాళ్లకు నేను మంచి బహుమతి ఇస్తాను’ అంటాడు గురువు. వెంటనే మొదటి శిష్యుడు బొక్కెన తీసుకుని బావి దగ్గరకు వేగంగా వెళ్తాడు. తొందర తొందరగా ఆ బావిలోంచి నీళ్లు తోడి.. ఆ బొక్కెనలో పోస్తాడు. సుమారు ఎనిమిది సేర్లు నిండగానే ఆ బొక్కెనతో పరుగెత్తుకుని వస్తాడు. కాకపోతే పరుగుపెట్టడంతో అందులో మూడు సేర్లు మాత్రమే మిగులుతాయి. మిగిలిన నాలుగు సేర్ల కోసం మళ్లీ వెళ్తాడు. చివరిగా ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి అతడికి ఆరు నిమిషాల సమయం పడుతుంది. రెండో శిష్యుడు.. గురువు చెప్పిన మాటలు లెక్క చేయకుండా.. ఆ బొక్కెనకి ఉన్న చిన్న రంధ్రాన్ని మట్టితో మూస్తాడు. అప్పుడు గురువు చెప్పినట్లుగానే ఆ బొక్కెనకి మరిన్ని రంధ్రాలు ఏర్పడి.. ఎక్కువ నీరు వృథా అయిపోతుంది. దాంతో అతడు ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి పది నిమిషాల సమయం పడుతుంది.అనంతరం మూడో శిష్యుడు బొక్కెన పట్టుకుని బావి దగ్గరకు వెళ్లి.. నీళ్లు నింపి.. బయలుదేరతాడు. అయితే మార్గం మధ్యలో సమయం ఉందిలే అని అలసత్వం వహించి.. ఓ చెట్టు దగ్గర కూర్చుంటాడు. కాసేపు విశ్రాంతి తీసుకుని.. నిదానంగా బయలుదేరతాడు. దాంతో ఇతడికి ఏడు సేర్ల నీళ్లు తీసుకుని రావడానికి తొమ్మిది నిమిషాలు పడుతుంది. చివరిగా నాలుగో శిష్యుడు.. పరుగెత్తకుండా చాలా మామూలుగా ఆ బావి దగ్గరకు వెళ్లి.. బొక్కెన నిండా నీళ్లు నింపుతాడు. ఆ రంధ్రాన్ని మూసే ప్రయత్నం చెయ్యకుండా.. మధ్యలో ఎక్కడా ఆగకుండా.. ఏడు సేర్ల నీళ్లు.. కేవలం రెండు నిమిషాల ఏడు సెకన్లలో తెచ్చేస్తాడు. దాంతో అంతా ఆశ్చర్యపోతారు.మాటిచ్చినట్లుగానే గురువు అతడికి బహుమతిచ్చి మెచ్చుకుంటాడు. గెలిచిన వ్యక్తిని ఉదహరిస్తూ.. మిగిలిన శిష్యులతో గురువు ఇలా అంటాడు. ‘మొదటి వాడు.. తొందరపాటుకు ప్రతీక. నీళ్లు తేవడానికి తొందరగా పరుగుతీశాడు. నిండా నింపకుండా తప్పుగా అంచనా వేశాడు. ఆ తొందరపాటు వల్ల నీళ్లన్నీ బయటపడి.. అతడి పని రెండింతలు పెరిగింది. అందుకే విఫలమయ్యాడు. రెండవ వాడు తెలివి తక్కువ తనానికి ప్రతిరూపం. అనుభవంతో నేను ముందే హెచ్చరించినా పట్టనట్లుగా.. ఆ చిన్న రంధ్రాన్ని మూసేశాడు. సొంత ప్రయత్నాలు చేసి చివరికి విఫలమయ్యాడు. ఇక మూడవ వాడు సోమరితనానికి ప్రతిబింబం.సమయం ఉందనే అలసత్వాన్ని ప్రదర్శించి.. బద్ధకంతో మధ్యలో కాసేపు ఆగిపోయాడు. దాంతో రంధ్రంలోంచి నీళ్లు మరింత ఎక్కువగా కారిపోయాయి. అతడి సోమరితనమే అతడి పనిని రెట్టింపు చేసింది. చివరిగా నాలుగవ శిష్యుడు.. సమయపాలనకు సరైన ఉదాహరణ. సమాయాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసిన వ్యక్తి. ముందుచూపుతో పాటు నిదానం, తెలుసుకున్న దాన్ని గుర్తుంచుకుని పాటించడం లాంటివన్నీ తెలిసిన మనిషి. అందుకే ఈ పరీక్షలో నెగ్గాడు’ అంటూ వివరించాడు.సోమరితనం, తొందరపాటుతనం, అనుభవజ్ఞుల మాటను పెడచెవిన పెట్టడం మంచివి కాదని చెప్పడంతో పాటు సమయపాలనపై సరైన అవగాహన కలిగుండాలనేది ఈ కథ నీతి!బ్రేక్స్ పడాల్సిందే..‘నిజానికి గత కొన్నేళ్లుగా ఫోన్ వాడకం పెరిగాకే సమయం విలువ తెలియకుండా పోతోంది’ అనేది కాదనలేని నిజం. నెట్టింట సోషల్ మీడియాలో రీల్స్, షార్ట్స్, మీమ్స్, ట్రోల్స్ అంటూ.. నిత్యం ఫోన్ లోనే ఉండిపోవడంతో బయటి ప్రపంచంలోని సమయం తెలియకుండానే గడచిపోతోంది. అందుకే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించుకోవాలి. అలాగే అçనవసరమైన బాతాఖానీలకు కాస్త దూరంగా ఉండాలి. ఏ విషయంలో ఏ కారణంగా సమయం వృథా అవుతుంది? అనేది ఎప్పటికప్పుడు గుర్తించుకోవాలి. ఆ విషయం మీద కూడా దృష్టి పెట్టాలి.అలవాటు చేసుకుందాం..సమయ నిర్వహణ అనేది మరింత ఉత్సాహంగా పని చెయ్యడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి, లక్ష్యాలను సమర్థవంతంగా చేరుకోవడానికి సహాయపడే కీలక నైపుణ్యం. అందుకే రోజూ లేవగానే 10 లేదా 15 నిమిషాలు.. ఆ రోజు చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక వేసుకోవాలి. రోజులో పూర్తి చేయాల్సిన పనులు.. తిరగాల్సిన ప్రాంతాలు ఇలా అన్నింటినీ ఒక జాబితాగా చేసుకోవడంతో పాటు.. ఏ పనికి ఎంత సమయం కేటాయించొచ్చో.. కేటాయించాలో రాసుకోవాలి. దాంతో చేయాల్సిన వాటిపై ఓ క్లారిటీ వస్తుంది. అయితే రాసుకునే పాయింట్స్‌లో కేవలం వృత్తిపరమైన పనుల గురించి మాత్రమే కాకుండా వ్యక్తిగత పనుల గురించి కూడా నోట్ చేసుకోవాలి.వాటికీ వీటికీ తేడా తెలియడం కోసం రంగు స్కెచ్‌లు లేదా పెన్నులు వాడుతుండాలి. లేదంటే అండర్ లైన్ చేసి.. హైలైట్ చేసుకోవాలి. దాంతో మనం వేసుకున్న ప్రణాళికలో ముఖ్యమైన పనులను గుర్తించడం ఈజీ అవుతుంది. ఇప్పుడు నోట్స్‌లో రాసుకోవడం కంటే.. స్మార్ట్‌ఫోన్ యాప్స్‌లో నోట్ చేసుకునే పద్ధతి పెరిగింది కాబట్టి.. అలా నోట్ చేసుకున్న యాప్‌ని ఫోన్ ఓపెన్ చెయ్యగానే కనిపించేలా పెట్టుకోవాలి. ఒకవేళ పుస్తకంలో పెన్ తో రాసుకుంటే.. దాన్ని వీలైనంత అందుబాటులోనే ఉంచుకోవాలి. అన్నింటికంటే ముఖ్యమైన విషయం.. మనం ప్రణాళికలో రాసుకున్న అంశం పూర్తిచేసిన తర్వాత.. పూర్తి అయినట్లుగా టిక్ చేసుకోవాలి.అలా చేయడం వల్ల మనసులో ‘సాధించాం’ అన్న ఆనందం కలుగుతుంది. ఇక మిగిలిన వాటిని పూర్తి చేయాలన్న ఉత్సాహమూ పెరుగుతుంది. అందుకే ప్రణాళికను సిద్ధం చేసుకోవడమే కాక ఆ ప్రణాళికల్లో రాసుకున్న పాయింట్స్ పూర్తికాగానే.. అయిపోయింది అన్నట్లుగా టిక్ చేయడమూ అలవాటు చేసుకోవాలి. దానివల్ల బాధ్యత కూడా పెరుగుతుంది. ఇదే మనకు క్రమశిక్షణ నేర్పిస్తుంది.నో చెప్పు లేదా తప్పించుకో..నిజానికి మనకు ఇష్టంలేని కూరో, చారో తినాల్సి వచ్చినప్పుడు వెంటనే నో అంటాం.. ఏ మాత్రం మొహమాటపడకుండా! అదే సమయం వృథా అయ్యే పని విషయంలో మాత్రం మొహమాటంతో నో అనలేం. కానీ నో చెప్పడం నేర్చుకోవాలి. అనవసరమైన పార్టీలకు.. అనవసరమైన సమావేశాలకు ఆహ్వానించినప్పుడు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అది రాకుంటే.. ఏదొక కారణం చెప్పి.. తప్పించుకునేందుకు ట్రై చెయ్యాలి. ఆ సమయం మిగిలితే రిలాక్స్డ్గా ఉండటానికి ప్రయత్నించాలి. దాంతో మానసిక ఒత్తిడి, అలజడి తగ్గుతాయి.స్విస్ టైమ్ బ్యాంక్ – కాలానికి తూకంస్విస్ బ్యాంక్‌లో ప్రపంచ కుబేరులంతా డబ్బు దాచుకుంటారని తెలుసు. కానీ స్విస్ టైమ్ బ్యాంక్ గురించి తెలుసా? ‘టైమ్ దాచుకోవడం ఏంటీ కొత్తగా? సమయాన్ని కూడా డబ్బు దాచుకున్నట్లుగా దాచుకోవచ్చా?’అనే సందేహాలు వచ్చేశాయి కదా! అవును.. డబ్బును డిపాజిట్ చేసుకున్నట్టే స్విస్ టైమ్ బ్యాంక్‌లో టైమ్‌నీ డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే యవ్వనంలోని మన శక్తిని, ఓపికను వృద్ధాప్యం నాటికి దాచుకోవడం అన్నమాట. స్విట్జర్లండ్లో ఈ టైమ్ బ్యాంక్ ఓ ప్రభుత్వ స్కీమ్. ప్రపంచం మొత్తం తలతిప్పి చూసే ఆలోచన ఇది. ఈ స్కీమ్ అక్కడి వృద్ధాప్యానికి.. నిస్సహాయతకు చేయూత. అక్కడ ప్రజలు ఈ స్కీమ్‌లో స్వచ్ఛందంగా చేరొచ్చు. ఓపిక, సహనం, స్నేహభావం ఉంటే చాలు ఎవరైనా ఈ స్కీమ్‌కి అర్హులే.ఒంటరిగా ఉండే వృద్ధులకు.. ప్రమాదాలకు గురైన వ్యక్తులకు సేవ చేసి.. ఆ సేవ చేసిన సమయాన్ని బ్యాంక్‌లో నమోదు చేసుకుంటే.. వారికి అలాంటి సేవలు అవసరమైనప్పుడు.. మరొకరితో ఆ సేవలను అందిస్తూ ఆసరాగా నిలుస్తుంది ప్రభుత్వం. అక్కడివారు చాలా మంది ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటూనే.. ఈ స్కీమ్‌లో చేరి.. తమ వృద్ధాప్యానికి పెన్షన్ మాదిరి.. సమయాన్ని సేవ్ చేసుంటున్నారు. సెలవు దినాల్లో, ఖాళీ సమయాల్లో టైమ్ వేస్ట్ చేసుకోకుండా.. ఈ స్కీమ్ మెంబర్‌గా.. అవసరం ఉన్న వారి ఇంటికి వెళ్లి వారికి సేవ చేస్తున్నారు.దాంతో వృద్ధులు, ఒంటిరి జీవితంతో బాధపడేవారు.. కాస్త ఊరట పొందుతున్నారు. అలాగే సేవ చేసేవారికి కూడా రేపటి రోజు మీద ఓ భరోసా ఏర్పడుతోంది. అనుకోకుండా ఏ ప్రమాదానికి గురైనా, అనారోగ్యం బారిన పడినా.. ఈ స్కీమ్‌లో భాగంగా.. ముందే ఇందులో సమయాన్ని ఇన్వెస్ట్ చేసుకుంటే.. మరొక స్కీమ్ మెంబర్ సాయం పొందొచ్చు. ఈ స్కీమ్‌లో చేరినవారి అకౌంట్, కార్డ్ వివరాలన్నీ లెక్కపత్రాలతో స్పష్టంగా ఉంటాయి. ఎంత సమయం సేవ చేశారు? తిరిగి ఎంత సమయం వాడుకున్నారు? లాంటి అన్ని వివరాలు నమోదై ఉంటాయి. మనం ఎంత ఎక్కువ సమయం ఇతరులకు సేవ చేస్తామో.. తిరిగి మనం అంత సేవను పొందొచ్చన్నమాట. భలే ఉంది కదా..! దీని వల్ల సేవాభావం పెరుగుతుంది.రేపటి రోజు పై ధీమా ఏర్పాడుతుంది. వృద్ధాప్యంలో ఎవరి మీదా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. నిర్లక్ష్యానికి గురయ్యే ప్రమాదమూ ఉండదు. ఇలాంటి స్కీమ్స్ మన భారత్ లాంటి దేశాలకు చాలా అవసరం. ఇది భవిష్యత్ మీద ఓ భద్రతనిస్తుంది. టైమ్ వేస్ట్ చేయడం తగ్గుతుంది. ఎవరికి వారు తమ వృద్ధాప్యానికి సరిపడా సమయాన్ని దాచుకునే పనిలోపడతారు. పనికిమాలిన వాదనలు, వాగ్వాదాలు.. అహంభావాలు.. అన్నీ తగ్గుతాయి. ప్రేమగుణం అలవడుతుంది. సమయం అనేది తిరిగి రాకపోయినా.. సమయాన్ని దాచుకునే అవకాశం దొరికినట్లు అవుతుంది. మానవసంబంధాలు మరింత బలపడతాయి. దీనిపై మన ప్రభుత్వాలూ శ్రద్ధ పెడతాయని ఆశిద్దాం! -
అనగనగా ఒక ఊరు..
మన మూలం చెప్పేది ఊరే! అందుకే మన పరిచయం ఊరి నుంచే మొదలవుతుంది! ఒక్కో ఊరుది ఒక్కో స్వభావం! సంస్కృతీసంప్రదాయాల నుంచి అభివృద్ధిబాట దాకా! ఆ భిన్నత్వాన్నే చెబుతోందీ ‘అనగనగా ఒక ఊరు’!అన్యులను అంటుకోని మలాణా (హిమాచల్ ప్రదేశ్)మన దేశంలోని అతి పురాతన గ్రామం ఇది. కులు, పార్వతి లోయల మధ్యలో సముద్రమట్టానికి 2,652 మీటర్ల (8,701 అడుగుల) ఎత్తులో.. మలాణా నది ఒడ్డున కొలుౖవై ఉంది. ప్రకృతి అందాలకు ఆలవాలం. బయటి ప్రపంచంతో సంబంధం లేనట్టుగా ఉంటుంది. మలాణీయులకు భారతీయ పోలికలకన్నా మెడిటరేనియన్ పోలికలే ఎక్కువ. బహుశా ఇక్కడి వాతావరణ పరిస్థితుల వల్ల కావచ్చు! స్థానిక భాష కనాశీ. ఆధునిక ఛాయలకు దూరంగా ప్రాచీన సంస్కృతీ సంప్రదాయలకు నిలయంగా ఉంటుంది.జమదగ్నిని వీళ్లు జమ్లు దేవతగా కొలుస్తారు. ఆయననే తమ గ్రామ రక్షకుడిగా భావిస్తారు. జమదగ్నికి ఇక్కడ గుడి ఉంటుంది. మలాణీయులది ఫ్రెండ్లీ నేచరే కానీ మలాణీయేతరులెవరైనా వీళ్లకు అస్పృశ్యులే! వీరి అనుమతి లేకుండా పరాయి వాళ్లెవరూ వీరిని అంటుకోకూడదు. దూరం నుంచే మాట్లాడాలి. నడిచేప్పుడు వాళ్ల ఇంటి గోడలను కూడా తాకకూడదు. ఇక్కడి కొట్లలో పర్యాటకులు ఏమైనా కొనుక్కుంటే ఆ వస్తువులను చేతికివ్వరు కౌంటర్ మీద పెడతారు. అలాగే పర్యాటకులూ డబ్బును కౌంటర్ మీదే పెట్టాలి.పొరపాటున తాకితే వెంటనే స్నానం చేయడానికి పరుగెడ్తారు. ఈ ఊరిలో పోలీసులకు ప్రవేశం లేదు. మన రాజ్యాంగంతో సంబంధం లేకుండా ఈ ఊరికి ప్రత్యేకమైన న్యాయవ్యవస్థ ఉంది. ప్రాచీన ప్రజాస్వామ్యం గల ఊరు అని దీనికి పేరు. వీరి ప్రజాస్వామ్యం ప్రాచీన గ్రీకు ప్రజాస్వామ్యాన్ని పోలి ఉంటుందట! వీళ్ల ప్రధాన ఆర్థిక వనరు గంజాయి. ఎక్కడపడితే అక్కడ గంజాయి వనాలు కనిపిస్తుంటాయి. బ్యాన్ అయినప్పటికీ ‘మలాణా క్రీమ్’ పేరుతో ఇక్కడి గంజాయి దేశంలో ప్రసిద్ధి. ఉత్పత్తిలో మహిళలే అగ్రగణ్యులు. వంట పని నుంచి సాగు, మార్కెటింగ్ దాకా అన్ని బాధ్యతలూ మహిళలవే. మగవాళ్లు గంజాయి మత్తులో నిద్రపోతుంటారని మలాణా సందర్శకుల పరిశీలన. ఇక్కడ వెహికిల్స్ వెళ్లేంత రోడ్లు ఉండవు. వీళ్ల రోజువారీ రవాణాకు కేబుల్ కార్లే మార్గం.లక్షాధికారుల హివ్రే బాజార్ (మహారాష్ట్ర)తన తలరాతను తానే తిరగరాసుకుని అత్యధిక మిలయనీర్లున్న విలేజ్‌గా వాసికెక్కిందీ ఊరు. మరాఠ్వాడా ప్రాంతం, అహ్మద్‌నగర్ జిల్లాలోని హివ్రే బాజార్ ఒకప్పుడు దట్టమైన అడవి, పంటపొలాలతో అలరారిన గ్రామం. అడవిలోని చెట్లు వేటుకు గురై, వర్షాభావ స్థితులు ఏర్పడి.. చెరువులు కూడుకుపోయి.. భూగర్భ జలాలు అడుగంటి.. బావులు ఎండిపోయి.. కరవు కాటకాలకు నిలయమైంది. తాగుడు, క్రైమ్‌కు బానిసైంది. ఒకానొక దశలో సారా కాయడం, నేరాలే హివ్రే బాజార్‌కు ఉపాధిగా మారాయన్నా విస్తుపోవాల్సిన పనిలేదు. 90 శాతం కుటుంబాలు దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయి, ఇక ఆ ఊరికి ఉనికిలేదనే పరిస్థితికి చేరిపోయింది. ప్రభుత్వోద్యోగులకైతే పనిష్మంట్ బదిలీ కేంద్రంగా మారింది.వలస వెళ్లిన వాళ్లు పోనూ.. మిగిలిన జనం తమ ఊరు అలా అయిపోవడానికి కారణాలు వెదుక్కున్నారు. ఆ అన్వేషణలోనే పరిష్కారమూ తట్టింది గ్రామ పెద్దలకు. కేంద్రప్రభుత్వం అందిస్తున్న ‘ఉపాధి హామీ’ పథకంతో అడవిని, చెరువులను పునరుద్ధరించుకోవచ్చనీ, వాన నీటిని సంరక్షించుకోవచ్చనీ అనుకున్నారు. తమ ఊరికే ప్రత్యేకమైన పంచవర్ష ప్రణాళికను వేసుకున్నారు. దాని ప్రకారం జనాలు నడుం కట్టారు. తొలకరికల్లా అడవుల సంరక్షణ, ప్లాంటేషన్, చెరువులు, బావుల పూడికతీత, వాటర్ షెడ్ల నిర్మాణం పూర్తిచేశారు.పడిన ప్రతి వానబొట్టునూ ఒడిసి పట్టుకున్నారు. అయిదేళ్లూ కష్టాన్ని పంటికింద బిగబట్టారు. శ్రమ ఫలించసాగింది. నాటిన మొక్కలు ఎదిగాయి. అడవి పచ్చగా కళకళలాడింది. భూగర్భజల స్థాయి పెరిగింది. చెరువులు, బావుల్లోకి నీరు చేరింది. పంటలు లాభాలు పండించలేకపోయినా తిండిగింజలకు కొదువ లేకుండా చేశాయి. రోజులు గడుస్తున్నా కొద్దీ ఊరి వాతావరణం మారసాగింది. వర్షపాతం పెరిగింది. నీళ్లొస్తే జీవకళ వచ్చినట్టే కదా! ప్రకృతిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టారు హివ్రే బాజార్ వాసులు. వలస వెళ్లిన వాళ్లంతా మళ్లీ సొంతూరుకి చేరిపోయారు. మద్యాన్ని మరచిపోయారు. ఆదాయం తద్వారా జీవన ప్రమాణం పెరిగాయి.మూత బడిన బడులు తెరుచుకున్నాయి. 30 శాతానికి పడిపోయిన అక్షరాస్యత క్రమంగా 69 శాతానికి పెరిగింది. యువతలోంచి టీచర్లు, ఇంజినీర్లు వస్తున్నారు. ఇప్పుడక్కడ రైతు నెలసరి సగటు ఆదాయం 30 వేలు. 235 కుటుంబాల్లోకి 60 మంది రైతులు (ఫిబ్రవరి, 2024 నాటికి) లక్షాధికారులు. అలా దారిద్య్రం నుంచి అభివృద్ధి పథంలోకి నడిచిన ఈ ఊరు దేశానికే స్ఫూర్తిగా నిలుస్తోంది.శుచీశుభ్రతల చిరునామా మావల్యాన్నాంగ్ (మేఘాలయా)స్వచ్ఛభారత్ కంటే ముందే 2003లోనే ఆరువందల జనాభా గల ఈ చిన్న ఊరు ఆసియాలోకెల్లా క్లీనెస్ట్ విలేజ్‌గా కీర్తి గడించింది. ఇక్కడ అయిదేళ్ల పిల్లాడి నుంచి పళ్లూడిపోయిన వృద్ధుల వరకు అందరూ సామాజిక బాధ్యతతో మెలగుతారు. మావల్యాన్నాంగ్ పిల్లలంతా ఉదయం ఆరున్నరకల్లా లేచి చీపుర్లు పట్టుకుని వీథుల్లోకి వచ్చేస్తారు. వీథులన్నీ శుభ్రం చేస్తారు. డస్ట్బిన్స్లోంచి ఆర్గానిక్ చెత్తను వేరుచేసి మట్టి గుంతలో వేసి కప్పెట్టి, మిగిలిన చెత్తను కాల్చేస్తారు. తర్వాత ఇళ్లకు వెళ్లి రెడీ అయ్యి స్కూల్ బాటపడతారు.ఇది వారి రోజువారీ కార్యక్రమం. ఆ ఊరి బాటల వెంట పూల మొక్కలను పెంచడం, పచ్చదనాన్ని సంరక్షించడం పెద్దల పని. ఇక్కడ ప్రతి ఇంటికీ టాయ్‌లెట్ ఉంటుంది. ప్రతి ఇల్లూ అద్దంలా మెరుస్తూంటుంది. రోజూ చేసే ఈ పనులే కాకుండా ప్రతి శనివారం చిన్నాపెద్దా అందరూ సోషల్ రెస్పాన్స్బిలిటీకి సంబంధించిన స్పెషల్ అసైన్మెంట్స్నూ చేస్తుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్లాస్టిక్ అనేది పెద్ద సమస్యగా మారిందని వాళ్ల బాధ. తాము ప్లాస్టిక్‌ని నివారించినా.. పర్యాటకుల వల్ల ఆ సమస్య ఏర్పడుతోందని వాళ్ల ఫిర్యాదు. ‘రీసైకిల్ చేయగలిగిన వాటితో ఇబ్బంది లేదు.. చేయలేని ప్లాస్టికే పెద్ద ప్రాబ్లం అవుతోంది.వాటిని కాల్చలేం.. పూడ్చలేం. పర్యాటకులు కూడా పర్యావరణ స్పృహతో ఉంటే బాగుంటుంది’ అని మావల్యాన్నాంగ్ వాసుల సూచన. మీ ఊరికి ఇంత శుభ్రత ఎప్పటి నుంచి అలవడిందని అడిగితే ‘130 ఏళ్ల కంటే ముందు.. కలరా ప్రబలినప్పటి నుంచి అని మా పెద్దవాళ్లు చెబుతుంటే విన్నాం’ అంటారు. శుభ్రత ముందు పుట్టి తర్వాత మావల్యాన్నాంగ్ పుట్టిందనడం సబబేమో ఈ ఊరి విషయంలో!పొదుపు, మదుపుల మాధాపార్ (గుజరాత్)కచ్ జిల్లాలోని ఈ ఊరిలో మొత్తం 7, 600 (2021 నాటి లెక్కల ప్రకారం) ఇళ్లు ఉన్నాయి. వీళ్లలో యూకే, అమెరికా, కెనడాల్లో నివాసముంటున్నవారే ఎక్కువ. మాధాపార్‌లో మొత్తం 17 బ్యాంకులున్నాయి. విదేశాల్లో ఉంటున్న మాధాపార్ వాసులు ఈ బ్యాంకుల్లోనే తమ డబ్బును డిపాజిట్ చేస్తున్నారు. అలా వాళ్లు డిపాజిట్ చేసిన మొత్తం రూపాయలు (2021 లెక్కల ప్రకారం) అయిదువేలకోట్లు. దీంతో మాధాపార్ దేశంలోకెల్లా ధనికగ్రామంగా పేరొందింది. ఈ ఎన్ఆర్ఐలు 1968లోనే లండన్‌లో ‘మాధాపార్ విలేజ్ అసోసియేన్’ను స్థాపించుకున్నారు. దీని ఆఫీస్‌ను మాధాపార్లోనూ ప్రారంభించి ఊరి అవసరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఊరి అభివృద్ధికి పాటుపడుతూ వస్తున్నారు. వ్యవసాయపరంగానూ మాధాపార్ ముందు వరుసలోనే ఉంది. వీరి వ్యవసాయోత్పత్తులు ముంబైకి ఎగుమతి అవుతుంటాయి. ఇక్కడ ఆటస్థలాలు, మంచి విద్యాలయాలు, ఆరోగ్యకేంద్రాలు, చెరువులు, చెక్ డ్యామ్‌లకు కొదువలేదు.మోడర్న్ విలేజ్ పున్సరీ (గుజరాత్)మామూలుగా ఊరు అనగానే .. మట్టి ఇళ్లు, మంచి నీటి కొరత, కరెంట్ కోత, మురికి గుంతలు, ఇరుకు సందుల ఇమేజే మెదులుతుంది మదిలో! కానీ సబర్‌కాంతా జిల్లా.. అహ్మదాబాద్‌కి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని పున్సరీ మాత్రం ఆ ఇమేజ్‌కి భిన్నం! ఇక్కడ 24 గంటల మంచినీటి, కరెంట్ వసతి ఉంటుంది. టాయ్‌లెట్ లేని ఇల్లుండదు. రెండు ప్రైమరీ స్కూళ్లు, ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్, స్ట్రీట్ లైట్స్, డ్రైనేజీ సిస్టం.. మాత్రమే కాదు ఊరంతటికీ వైఫై, ప్రధాన కూడళ్లలో సీసీటీవీ కెమెరాలు, 140 లౌడ్ స్పీకర్లతో దేశానికే మోడల్ విలేజ్‌గా విరాజిల్లుతోంది. అంతేకాదు ఇది స్కూల్ డ్రాపౌట్స్ లేని గ్రామం కూడా. దీని అభివృద్ధి కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీ నిరంతరం శ్రమిస్తోంది. అందులో అయిదుగురు మహిళలున్నారు. ఈ గ్రామాభివృద్ధిని అధ్యయనం చేయడానికి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 300కు పైగా అధికారులు ఈ ఊరును సందర్శించారు.మత్తూర్ (కర్ణాటక) సంస్కృతిసంస్కృతం పండిత భాషగానే బతికి కనుమరుగైపోయింది. కానీ షిమోగా జిల్లాలోని మత్తూర్‌లో ఆ భాష నేటికీ వినపడుతుంది. పండితుల నోటెంటే కాదు అక్కడి ఇంటింటా! ఆ గ్రామవాసులు తమ మూలాలను, సంస్కృతీసంప్రదాయాలనూ పరిరక్షించు కోవాలనే దృఢనిశ్చయంతో ఆ భాష ఉనికిని కాపాడుకుంటున్నారు. అందుకే మత్తూర్‌లో సంస్కృతాన్ని వ్యావహారిక భాషగా మార్చేసుకున్నారు.పెళ్లి పీటలెక్కని బర్వాకలా (బిహార్) కైమూర్ హిల్స్‌లోని ఈ ఊరు.. గుజరాత్ బెస్ట్ విలేజ్ పున్సరీకి భిన్నం. కనీస వసతులకు కడు దూరం. ఇక్కడ తాగునీటి సరాఫరా లేదు. కరెంట్ కనపడదు. టాయ్లెట్లు, డ్రైనేజ్ల గురించి అడగనే వద్దు. రోడ్లూ ఉండవు. ఈ స్థితి వల్ల ఈ ఊరు వార్తల్లోకి ఎక్కలేదు. ఈ స్థితి వల్ల ఇక్కడి అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం లేదు. సుమారు 50 ఏళ్లుగా ఈ ఊళ్లో మంగళ వాయిద్యాల మోగడం లేదు. కనీస అవసరాలు లేని ఆ ఊరికి మా అమ్మాయిని ఎలా ఇస్తామని ఆడపిల్లల తల్లిదండ్రులంతా తమ మాట్రిమోనీ లిస్ట్‌లోంచి బర్వాకాలాను డిలీట్ చేసేశారు. కనాకష్టంగా 2017లో ఒక్కసారి మాత్రం ఇక్కడ పెళ్లి హడావిడి కనిపించింది. ఎందుకూ.. ఊరి ప్రజలంతా కష్టపడి రోడ్డు వేసుకోవడం వల్ల! ఇంకేం ఆ పెళ్లితో ఊరి కళ మారి తమకూ కల్యాణ ఘడియలు వచ్చేస్తాయని అక్కడి బ్రహ్మచారులంతా సంబరపడ్డారట. అది అత్యాశే అయింది. కథ మళ్లీ మొదటికొచ్చింది. ఇదిగో ఈ నేపథ్యం వల్లే ఆ ఊరు పేరు వైరల్ అయింది.ద్వారాలు కనపడని శని శింగణాపూర్ (మహారాష్ట్ర)శిరిడీని దర్శించిన చాలామందికి శనైశ్చరుడి ఊరు శని శింగణాపూర్ సుపరిచితమే. శనైశ్చరుడి ఆలయం ఒక్కటే దీని ప్రత్యేకత కాదు. ఈ ఊళ్లో ఇళ్లకు తలుపులు, తాళాలు ఉండవు. చెప్పుకోవాల్సిన ప్రత్యేకత అదే. ఇక్కడుండే ఆఫీస్ బిల్డింగ్స్, రిసార్ట్స్ వంటి వాటికి, ఆఖరకు పోలీస్ స్టేషన్‌కి కూడా తలుపులు ఉండవు. కొన్నిళ్లల్లో మాత్రం ట్రాన్స్పరెంట్ కర్టెన్స్ కనపడ్తాయి తలుపుల స్థానంలో. దాదాపు 150 ఏళ్లకు పైగా చరిత్ర గల ఈ ఊరు అప్పటి నుంచీ ఇంతే అట!పాములను పెంచుకునే శెట్పాల్ (మహారాష్ట్ర)ఈమధ్య.. హైదరాబాద్, మణికొండ ప్రాంతంలోని నివాసాల మధ్య నాగుపాము కనపడిందని సోషల్ మీడియాలో ఒకటే గోల. అలాంటిది శెట్పాల్ గ్రామమే నాగుపాముల మయమని తెలిస్తే వీడియోల కోసం ఆ ఊరికి క్యూ కడతారో.. భయంతో బిగుసుకుపోతారో! శెట్పాల్లో ఈ ఇల్లు.. ఆ ఇల్లు అనే భేదం లేకుండా ఏ ఇంటినైనా చుట్టొస్తాయట నాగుపాములు. వాటిని చూసి అక్కడివాళ్లు ఆవగింజంతైనా భయపడకపోగా కుక్క, పిల్లి లాంటి పెంపుడు జంతువులను ముద్దు చేసినట్టుగా ముద్దు చేస్తారట. ఆ పాములూ అంతే.. శెట్పాల్ వాసులను సొంతవాళ్లలాగే భావిస్తాయిట. ఈ ఊరు పుట్టినప్పటి నుంచి ఈ పాములు విసుగుతోనో.. కోపంతోనో.. చిరాకేసో.. ఏ ఒక్కరినీ కాటేసిన సందర్భం ఒక్కటీ లేదని స్థానికుల మాట. అందుకేనేమో శెట్పాల్æ జనాలు ఈ పాములను తమ ఇలవేల్పుగా కొలుస్తారు!కవలల్ని కనే కొడిన్హీ (కేరళ)మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురుంటారు అంటారు. కానీ ఒకే ఊళ్లో డజన్లకొద్దీ కనిపిస్తే! అవునా.. నిజమా.. అని హాశ్చర్యపోయే పనిలేదు. నిజమే! ఆ దృశ్యం కొడిన్హీలో కనిపిస్తుంది. ఈ ఊళ్లో దాదాపు రెండువేల కుటుంబాలు ఉంటాయి. దాదాపు అయిదు వందల కవల జంటలు కనిపిస్తాయి. ఈ విశేషంతో అత్యధిక కవలల రేటు నమోదైన ఊళ్ల సరసన కూడా చేరింది కొడిన్హీ. ఇక్కడ ఇంతమంది కవలలు పుట్టడానికి కారణమేం ఉండొచ్చని పలు అధ్యయనాలూ జరిగాయి. ప్చ్.. ఏమీ తేలలేదు!రెండు పౌరసత్వాల లోంగ్వా (నాగాలాండ్)మోన్ జిల్లాలోని ఈ ఊర్లో కొన్యాక్ నాగా జాతి ప్రజలు ఉంటారు. ఆ జిల్లాలోని పెద్ద గ్రామాల్లో ఇదీ ఒకటి. ఆ ఊరి వాసులకు రెండు దేశాల పౌరసత్వం ఉంటుంది. దానికి కారణం ఆ ఊరి పెద్ద నివాసమే. అతని ఇంటిని మన దేశంతో పాటు మయన్మార్ కూడా పంచుకుంటుంది. అంటే అతనిల్లు సరిగ్గా ఈ రెండు దేశాల సరిహద్దు మీద ఉంటుంది. డీటేయిల్‌గా చెప్పాలంటే ఆ ఇంటి పడకగది ఇండియాలో ఉంటే వంటగది మయన్మార్‌లో ఉంటుంది. దీనివల్ల ఆ ఊరు ఈ రెండు దేశాల హద్దులోకి వస్తుందని ఇటు భారత ప్రభుత్వం పౌరసత్వం ఇస్తుంది.. అటు మయన్మార్ కూడా లోంగ్వా వాసులకు తమ సిటిజ¯Œ షిప్‌ని మంజూరు చేస్తుంది. మన దేశంలో రెండు పౌరసత్వాలు కలిగి ఉండటంలో ఈ ఊరి ప్రజలకు మాత్రమే మినహాయింపు ఉంది.చెప్పులొదిలి వెళ్లాల్సిన వెళ్లగవి (తమిళనాడు)కొడైకెనాల్ దగ్గర్లోని చిన్న తండా ఇది. వంద కుటుంబాలుంటాయి. మూడు వందల ఏళ్ల నాటి ఈ తండాకు రోడ్డు లేదు. ట్రెక్కింగ్ ఒక్కటే మార్గం. ఇక్కడ చెప్పుల జాడలు కనిపించవు. ఊరి పొలిమేరల్లో బోర్డ్ కూడా ఉంటుంది.. ‘దయచేసి మీ పాదరక్షలను ఇక్కడే వదిలేయండి’ అని! ఎందుకంటే ఇక్కడ ఇళ్లకన్నా గుళ్లు ఎక్కువ. లెక్కకు మించిన గుడులైతే ఉన్నాయి కానీ ఒక్క బడీ లేదు. అంతెందుకు ఒక్క ప్రాథమిక కేంద్రం కూడా లేదు. ఒక టీ కొట్టు, చిన్న కిరాణా కొట్టు తప్ప ఇంకే కనీస సౌకర్యాలూ వెళ్లగవిని చేరలేదు. రోజువారీ అవసరాలకు ఈ తండా వాసులు కొడైకెనాల్ దాకా నడిచివెళ్తారు.దయ్యాల కొంప కుల్ధారా (రాజస్థాన్)జైసల్మేర్ జిల్లాలోని ఈ ఊరు 13వ శతాబ్దం నాటిది. ఇప్పుడు మొండి గోడలతో.. నిర్మానుష్యంగా కనిపించే కుల్ధారా ఒకప్పుడు పాలీవాల్ బ్రాహ్మణులకు నిలయం. ఒక మంత్రగాడి శాపంతో రాత్రికి రాత్రే ఆ ఊరు మాయమైందని ఒక కథ, భూస్వాముల దాష్టీకాలను తట్టుకోలేక ఆ బ్రాహ్మణులంతా కుల్ధారా వదిలి వెళ్లిపోయారని ఇంకో కథ ప్రచారంలో ఉంది. కారణం ఏదైనా మనుషుల ఆనవాళ్లు లేక ఇది ఘోస్ట్ విలేజ్‌గా పేరు తెచ్చుకుంది. పాలీవాల్ బ్రాహ్మణుల ఆత్మలు నేటికీ ఆ ఊరిలో తిరిగుతుంటాయనే ప్రచారమూ ఉంది. రాజస్థాన్ ప్రభుత్వం కుల్ధారాను పర్యాటక కేంద్రంగా మలచాలనే ప్రయత్నాలు మొదలుపెట్టింది.పోర్చ్‌గీస్ జాడ.. కోర్లాయీ (మహారాష్ట్ర)అలీబాగ్‌కి గంట దూరంలో ఉన్న ఈ ఊరిని పోర్చ్‌గీస్ వాళ్లు నిర్మించారు. అందుకే ఒకప్పుడు దీన్ని పోర్చ్‌గీస్‌లో ‘మరో డి చాల్’ అనేవారట. అంటే ‘గుండ్రని చిన్న కొండ’ అని అర్థం. ప్రస్తుతం ఇక్కడి వాళ్లు పోర్చ్‌గీస్ క్రీయోల్ (యాస) ‘క్రిస్టీ’లో మాట్లాడుతారు. అంతేకాదు ఇక్కడ పేర్లన్నీ పోర్చుగీస్వే ఉంటాయి. పోర్చ్‌గీస్ ఫుడ్డే తింటారు. క్రీయోల్ అనే పదమే రూపాంతరం చెంది కోర్లాయీగా స్థిరపడింది.ఆఫ్రికన్ విలేజ్ ఆఫ్ గుజరాత్ జాంబుర్గిర్కి సమీపంలో ఉన్న ఈ ఊరును ‘ఆఫ్రికన్ విలేజ్ ఆఫ్ గుజరాత్’ అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ గుజరాతీ భాషను మాట్లాడుతూ, గుజరాతీ పద్ధతులను పాటించే ఆఫ్రికన్స్ ఉంటారు కాబట్టి. ఆఫ్రో– అరబ్ వారసులైన వీళ్లను సిద్దీస్ అంటారు. బానిసలుగా అరబ్ షేక్‌ల ద్వారా ఇక్కడికి వచ్చారు. దాదాపు 200 ఏళ్ల నుంచి వాళ్లు ఈ ఊరిలోనే జీవిస్తున్నారు.సోలార్ తొలి వెలుగు ధర్నాయీ (బిహార్)జహానాబాద్ జిల్లాలో, బో«ద్ గయాకు దగ్గర్లో ఉంటుందీ ఊరు. దీని జనాభా 2,400. ఒకప్పుడు విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో మగ్గింది. కానీ కొన్నేళ్ల కిందట. ఆ ఊరి ప్రజలే పూనుకొని సోలార్ పవర్ ప్లాంట్‌ని ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇది 450 ఇళ్లకు, 50 వాణిజ్య సముదాయాలకు ఎలాంటి కోతల్లేని కరెంట్‌ని అందిస్తోంది. ధర్నాయీ వాసుల ఈ సాహసం ఆ ఊరిని.. దేశంలో పూర్తిగా సోలార్ విద్యుత్‌నే వాడుతున్న తొలి గ్రామంగా నిలబెట్టింది. ఇప్పడు ఆ ఊర్లో ఇప్పుడు పిల్లలు చదువును కేవలం పగటి పూటకే పరిమితం చేసుకోవడం లేదు. స్త్రీలు రాత్రివేళల్లో గడపదాటడానికి భయపడటమూ లేదు.ఇవేకాక ఫస్ట్ విలేజ్ మానా, బ్యూటిఫుల్ విలేజ్ చిరాపూంజీ, వలస పక్షుల ఆత్మహత్యలకు కేంద్రం జతింగా, ఎకో ఫ్రెండ్లీ టూరిస్ట్ ప్లేస్ కుంబలంగీ, బార్టర్ సిస్టమ్ అమల్లో ఉన్న జూన్ బేల్ మేల (అసోం) లాంటి ఎన్నో ప్రత్యేకతలున్న ఊర్ల జాబితా చాంతాడంత పెద్దది. సమయం చిక్కినప్పుడల్లా వాటి గురించి తెలుసుకుంటూ.. డబ్బు వెసులుబాటైనప్పుడల్లా చుట్టిరావడమే! ప్రస్తుతం ఈ వివరాలతో వెరీ నెక్స్›్ట వెకేషన్‌కి డిస్టినేషన్ని టిక్ చేసేసుకోండి మరి! -
తను.. గూంగీ గుడియా కాదు.. ఉక్కు మహిళ!
బొట్టు, గాజులు, పువ్వులు.. భారతీయ స్త్రీకి అలంకారంగానే చూస్తున్నారు! వాటి చుట్టూ ఆర్థిక, సామాజిక భద్రత చట్రాన్ని బిగించి మహిళను బందీ చేశారు! అయితే స్వాతంత్య్రానికి పూర్వమే బుద్ధిజీవులు ఆ కుట్రను పసిగట్టారు. అలంకారం స్త్రీ హక్కు.. అది ఆత్మవిశ్వాసానికి ప్రతీక.. ఆ ఆత్మవిశ్వాసమే ఆమె ఆర్థిక, సామాజిక సాధికారతకు పునాది అని నినదించారు! వితంతు చదువు, కొలువు, పునర్వివాహం కోసం పోరాడారు. సమాజాన్ని చైతన్యపరచడానికి చాలానే ప్రయత్నించారు. అయినా .. వితంతువుల జీవితాలేం మారలేదు.. సంఘసంస్కర్తల పోరు చిన్న కదలికగానే మిగిలిపోయింది! పురోగమిస్తున్న.. పురోగమించిన సమాజాల్లో ఎన్నో అంశాల మీద చర్చలు జరుగుతున్నాయి.. చట్టాలు వస్తున్నాయి!కానీ ఆల్రెడీ చట్టాల తయారీ వరకు వెళ్లిన విడో సమస్యల మీద మాత్రం ఆ సమాజాల్లో కనీస అవగాహన కొరవడుతోంది! చర్చలు అటుంచి ఆ పేరు ఎత్తితేనే అపశకునంగా భావించే దుస్థితి కనపడుతోంది! అందుకే యూఎన్ఓ ‘ఇంటర్నేషనల్ విడోస్ డే’ను నిర్వహించడం మొదలుపెట్టింది.. ఏటా జూన్ 23న. ఆ రకంగానైనా ప్రపంచ దేశాలు విడో సమస్యలను పట్టించుకుని వాళ్ల రక్షణ, సంరక్షణ బాధ్యతను సీరియస్‌గా తీసుకుంటాయని.. ప్రజలూ వాళ్లను సమదృష్టితో చూసే పెద్దమనసును అలవరచుకుంటారని! ఆ సందర్భాన్నే ఈ వారం కవర్ స్టోరీగా మలిచాం!మోదీ 3.0 కేబినేట్లో అతి చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి పొందిన వ్యక్తిగా రక్షా ఖడ్సే రికార్డులోకి ఎక్కారు. ఆ ఘనత ఆమెకు గాలివాటంగా రాలేదు. దాని వెనుక పెద్ద కథే ఉంది. ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన రక్షా భర్త, ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అనివార్యంగా రక్షా ఖడ్సే రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వరుసగా మూడుసార్లు మహరాష్ట్రలోని రావేర్ స్థానం నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. భర్త తరఫు కుటుంబం నుంచి సహకారం అందడంతో ఆమె రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. అయితే అందరికీ రక్షా ఖడ్సేలా çకుటుంబం నుంచి, సమాజం నుంచి సహాయ సహకారాలు అందడం లేదనడానికి ఒక ఉదాహరణ మన తెలుగు రాష్ట్రాల్లోనే ఇటీవల కనిపించింది.తెలుగు రాష్ట్రాల్లోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంచాయతీ ముదిరింది. ఒత్తిడి తట్టుకోలేక ఆ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో మృతుడి తరఫు బంధువులు ఆస్తి పంపకం విషయంలో మృతుడి భార్య తరఫువారు వెనక్కి తగ్గితేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. ఈ ప్రతిపాదనకు అవతలి వారు ఒప్పుకోలేదు. ఫలితంగా మూడు రోజులైనా దహన సంస్కారాలు జరగలేదు. చివరకు మృతుడి కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడంతో మూడు రోజుల తర్వాత అంత్యక్రియల ప్రక్రియ ముందుకు సాగింది. ఓవైపు భర్తను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ మహిళ అదే సమయంలో తన పిల్లల భవిష్యత్తు కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. లేదంటే తనకు, తన పిల్లలకు ఈ సమాజం నుంచి ఎంతమేరకు మద్దతు లభిస్తుందనేది ప్రశ్నార్థకమే! ఆనాటి నుంచి ఈనాటి వరకు భర్తను కోల్పోయి ఒంటరైన మహిళలకు ఎదురవుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కార మార్గాలపై జరగాల్సినంత చర్చ జరగడం లేదు.మధ్యయుగాల్లో..భర్త చనిపోతే అతని చితిపైనే బతికున్న భార్యకు కూడా నిప్పంటించే సతీ సహగమనం అనే అమానవీయ ఆచారాలను రూపుమాపే ప్రయత్నాలు బ్రిటిష్ జమానాలోనే మొదలయ్యాయి. భర్త చనిపోయిన స్త్రీలకు గుండు చేసి, తెల్ల చీరలు కట్టించి, ఇంటి పట్టునే ఉంచే దురాచారాన్ని పోగొట్టేందుకు రాజా రామమోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు వంటి వారు అలుపెరగని పోరాటం చేశారు. వీరి కృషి ఫలితంగా ఈరోజు సతీసహగమనం కనుమరుగైంది. తెల్లచీర, శిరోముండన పద్ధతులూ దాదాపుగా కనుమరుగయ్యాయి. అంతగా కాకపోయినా పునర్వివాహాల ఉనికీ కనపడుతోంది. అయితే ఇంతటితో భర్తను కోల్పోయిన మహిళల జీవితాల్లో వెలుగు వచ్చేసిందా? వారి కష్టాలన్నీ తీరిపోయాయా? అని ప్రశ్నించుకుంటే కాదనే సమాధానమే స్ఫురిస్తుంది. భర్తపోయిన స్త్రీలకు కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు మన దగ్గరే కాదు చాలా దేశాల్లో కనిపిస్తున్నాయి.ప్రస్తుత ప్రపంచ జనాభాను దాదాపు ఎనిమిది వందల కోట్లకు అటూ ఇటూగా పరిగణిస్తే అందులో వితంతువుల సంఖ్య 25 కోట్లకు పైమాటే! సమాజంలో అందరికంటే అత్యంత నిరాదరణ, అవమానాలు, కనీస మద్దతు వంటివీ కరువైనవారిలో వితంతువులే ముందు వరుసలో ఉన్నారు. జాతి, మతం, కులం, వర్గంతో సంబంధం లేకుండా భర్తను కోల్పోయిన స్త్రీకి సమాజం నుంచి కనీస నైతిక మద్దతు కూడా లభించకపోగా అవమానాలు, అవాంతరాలు ఎదురవుతున్నాయి. సమాజం పుట్టుక నుంచి ఈ సమస్య ఉన్నప్పటికీ జాతి వివక్ష, లింగ వివక్ష, కుల వివక్ష, ఆర్థిక అంతరాల మీద జరుగుతున్నంత చర్చ వితంతు సమస్యల మీద జరగడం లేదు. విపత్తులు, యుద్ధాలు, మహమ్మారులు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నప్పుడు ఈ సమస్య పెరుగుతోంది. కరోనా, రష్యా– ఉక్రెయిన్, ఇజ్రాయేల్– పాలస్తీనా యుద్ధాల నేపథ్యంలోనూ వితంతువుల సమస్యలను ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది.గూంగీ గుడియా..మన దేశ తొలి మహిళా ప్రధాని, ఉక్కు మహిళగా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులరాలైన ఇందిరా గాంధీ తన 43వ ఏట భర్త (ఫిరోజ్ గాంధీ)ను కోల్పోయారు. ఆ తర్వాత రెండేళ్లకు తండ్రి జవహర్ మరణంతో ఆమె రాజకీయ ప్రవేశం అనివార్యమైంది. ఇందిరా రాజకీయ జీవితం తొలినాళ్లలో సోషలిస్ట్ నేత రామ్మనోహర్ లోహియా ఆమెను గూంగీ గుడియా (మూగ బొమ్మ)గా అభివర్ణించేవారు. తర్వాత ఆమె తీసుకున్న బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు వంటి నిర్ణయాలు, చేపట్టిన ప్రజాదరణ పథకాలు, గరీబీ హఠావో వంటి నినాదాలతో పాటు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి నాంది పలకడం వంటి సాహసాలతో ఆమె గూంగీ గుడియా కాదు ఐరన్ లేడీ అనే ప్రతిష్ఠను సాధించింది. అప్పటిదాకా వితంతువు దేశానికి అపశకునం అని నిందించిన నోళ్లే ఆమె రాజకీయ చతురతను చూసి దుర్గాదేవిగా కీర్తించటం మొదలుపెట్టాయి. ఆ తరానికి చెందిన ఎంతోమంది తమ పిల్లలకు ఇందిరా ప్రియదర్శిని అనే పేరు పెట్టుకునేలా ప్రేరణను పంచారు ఆమె. ఆఖరికి ఇందిరా సమాధిని శక్తిస్థల్గా పిలిచే స్ఫూర్తిని చాటారు.కరోనాతో మరోసారి..రెండు ప్రపంచ యుద్ధాల సందర్భంగా ఈ ప్రపంచం గతంలో ఎన్నడూ చూడనంతగా వితంతు సమస్యను ఎదుర్కొంది. ఆ గాయాల నుంచి బయటపడే సందర్భంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదం పెచ్చరిల్లింది. మరోవైపు సామ్రాజ్యవాదం నాటిన విషబీజాల కారణంగా ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న దేశాల్లో అంతర్యుద్ధాలు గడిచిన రెండు దశాబ్దాల్లో పెరిగాయి. వెరసి ఆయుధాల నుంచి తూటాలు దూసుకువస్తున్నాయి. ఆకాశం నుంచి జారిపడే బాంబుల గర్జన పెరిగింది. ఫలితంగా ఎందరో మృత్యువాత పడుతున్నారు. వీటి వల్ల అనూహ్యంగా వితంతువుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం వీరి సంఖ్య .. ఇరాక్, అఫ్గానిస్తాన్, పాలస్తీనా వంటి ఆసియా దేశాలతో పాటు ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాల్లోనూ అధికంగా ఉంది. యుద్ధాలు, అంతర్యుద్ధాలకు తోడు కరోనా వైరస్ ఒకటి. అది సృష్టించిన భయోత్పాతానికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోయాయి. రోజుల తరబడి స్తంభించిపోయాయి. 2020, 2021లలో లక్షలాది మంది జనం కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మనదేశంలో అధికారిక లెక్కల ప్రకారమే నాలుగున్న లక్షల మంది కరోనాతో చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరో పది రెట్లు ఎక్కువగా ఉండవచ్చని అంచనా. కరోనా చేసిన గాయాల కారణంగా మనదేశంలోనూ వితంతువుల సంఖ్య పెరిగింది.మరిన్ని రూపాల్లో.. యుద్ధాలు, విపత్తులు, మహమ్మారుల రూపంలోనే కాకుండా ఆర్థిక ఇబ్బందులు, వ్యసనాలు, రైతుల ఆత్మహత్యలు వంటివీ మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వితంతువుల సంఖ్య పెరగడానికి కారణాలవుతున్నాయి. కష్టనష్టాలకు ఓర్చి సాగు చేసిన రైతులు అప్పుల పాలవుతున్నారు. మార్కెట్ స్థితిగతులపై అవగాహన లేకపోవడం, కరువు, అధిక వడ్డీలు, ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం వంటి కారణాల వల్ల ఏ ఏటికి ఆ ఏడు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. చివరకు అర్ధాంతరంగా తనువులు చాలిస్తున్నారు. అప్పటికే అప్పుల పాలైన సదరు రైతు కుటుంబం, ఆ రైతు జీవిత భాగస్వామి అలవికాని కష్టాల్లో మునిగిపోయుంటోంది. మరోవైపు వెనుకబడిన ప్రాంతాల్లో మద్యం ప్రాణాలను కబళిస్తోంది. తాగుడు అలవాటైన వ్యక్తులు అందులోనే జోగుతూ కుటుంబాలను అప్పుల్లోకి నెడుతూ అనారోగ్యంపాలై చనిపోతున్నారు. ఆఖరికి ఆ కుటుంబం చిక్కుల్లో పడుతోంది. అందులో అత్యంత వేదనను భరిస్తోంది సదరు మృతుడి జీవిత భాగస్వామే!అత్యంత సంపన్న మహిళ..33.50 బిలియన్ డాలర్ల సంపదతో దేశంలోనే అత్యంత సంపన్న మహిళాగా గుర్తింపు పొందిన సావిత్రి జిందాల్ కూడా ఒంటరి మహిళే! తన ¿¶ ర్త.. జిందాల్ గ్రూప్ ఫౌండరైన ఓంప్రకాశ్ జిందాల్ మరణం తర్వాత.. స్టీల్, పవర్, సిమెంటుకు చెందిన జిందాల్ గ్రూప్ వ్యాపార సంస్థలకు చైర్పర్సన్ గా ఆ గ్రూప్ వ్యాపార బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు.సమస్యల వలయం..హఠాత్తుగా భర్తను కోల్పోవడం స్త్రీ జీవితంలో అతి పెద్ద కుదుపు. అప్పటి వరకు తనతో జీవితాన్ని పంచుకున్న వ్యక్తితో ఉండే అనుబంధం, ప్రేమ, ఆప్యాయతలు ఒక్కసారిగా దూరం అవుతాయి. దీంతో మానసిక తోడును ఒక్కసారిగా కోల్పోతారు. ఆ స్థితిని అర్థం చేసుకుని మానసికంగా తమను తాము కూడగట్టుకోక ముందే ఆచారాలు, సంప్రదాయాలు ఆ స్త్రీ పై తమ దాడిని మొదలెడతాయి. ఆ వెంటనే ఆస్తి పంపకాలు, బాధ్యతల విభజన విషయంలో భర్త తరఫు కుటుంబ సభ్యుల ఒత్తిడి మొదలవుతుంది. కాస్త చదువు, అదిచ్చిన ధైర్యం ఉన్న స్త్రీ అయితే స్వయంగా నిర్ణయం తీసుకుని తనకు, తన పిల్లలకు సురక్షితంగా ఉన్న దారిని ఎంచుకుంటుంది. ఆ రెండూ లేని వితంతువులు భర్త తరఫు కుటుంబం లేదా పుట్టింటి వారి దయాదాక్షిణ్యాలకు తల ఒగ్గుతారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఆ రెండు ఇళ్లలో ఏదో ఒక ఇంటికి స్వచ్ఛంద వెట్టి చాకిరికి కుదిరిపోతారు వారి తుది శ్వాస వరకు. కాలం మారినా ఈ దృశ్యాలు మాత్రం మారలేదు. పై చదువులు, కొలువుల కోసం అమ్మాయిలు ఒంటరిగా విదేశాలకు వెళ్లే పురోగతి ఎంతగా కనిపిస్తోందో.. దేశానికి ఇంకోవైపు భర్తపోయిన ఒంటరి స్త్రీల దయనీయ జీవితపు అధోగతీ అంతే సమంగా దర్శనమిస్తోంది.కుటుంబాల మద్దతు లేకపోయినా, మెరుగైన జీవితం కోసం ధైర్యంగా అడుగు ముందుకు వేసి జీవన పోరాటం మొదలుపెట్టినా.. పొద్దునే ఆమె ఎదురొస్తే సణుక్కుంటూ మొహం తిప్పుకుని వెళ్లడం, శుభకార్యాలకు ఆమెను దూరంగా పెట్టడం, నోములు వ్రతాలకు ఆమెను బహిష్కరించడం, అంతెందుకు దేవుడి గుడిలోనూ అలాంటి అవమానాన్నే పంటి బిగువున భరించాల్సి వస్తోంది ఆమె! వీటన్నిటినీ జయించే శక్తిని కూడదీసుకున్నా, భర్త పోయిన ఆడవాళ్లకు ఇంటా, బయటా ఎదురయ్యే లైంగిక వేధింపుల చిట్టా మరొక కథ. ఇలా విడో అన్నిటికీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిన తీరు అభివృద్ధి చెందుతున్న, చెందిన సమాజాల్లోనూ కామన్ సీన్‌గా ఉందంటే లేశమాత్రం కూడా అతిశయోక్తి లేదు. మరోవైపు వారికి అందాల్సిన ఆర్థిక మద్దతు కరువైన కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఆఖరికి యాచకుల్లో కూడా విడోలకు ఆదరణ ఉండదనేది చేదు వాస్తవం. యాచనకు దిగిన వితంతువులను అపశకునంగా భావించి దానం చేసేందుకు నిరాకరించే జనాలు కోకొల్లలు. ఇలా నిరాశ్రయులైన వారికి స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తోన్న శరణాలయాలు ప్రధాన దిక్కుగా ఉంటున్నాయి. ఇక్కడ కూడా మానవత్వం లోపించిన వారి నుంచి వితంతువులకు ఇక్కట్లు తప్పడం లేదు.వరల్డ్ విడోస్ డే..ప్రపంచవ్యాప్తంగా వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని, వాటి పట్ల అవగాహన కల్పిస్తూ వారికి మద్దతుగా నిలవడానికి ఐక్యరాజ్య సమితి ‘వరల్డ్ విడోస్ డే’ను నిర్వహించాలని 2011లో నిర్ణయించింది. అందుకు జూన్ 23వ తేదీని ఎంచుకుంది. నాటి నుంచి ‘వరల్డ్ విడోస్ డే’ ద్వారా భర్తపోయిన స్త్రీల రక్షణ, సంరక్షణల కోసం ప్రపంచ దేశాలు తమ పరిధిలో చట్టాలను తీసుకురావడానికి కృషి చేస్తోంది. దీంతో పాటు వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సమాజంలోని అన్ని వర్గాల వారికి అవగాహన కల్పించడం, ఆచారాలు, సంప్రదాయాల పేరిట వారిపై జరుగుతున్న మానసిక, శారీరక దాడుల నుంచి విముక్తి కల్పించడం వంటివి ఐరాస ముఖ్య ఉద్దేశాల్లో కొన్నిగా ఉన్నాయి.మెహినీ గిరి..మన దేశంలో స్వాతంత్య్రానికి పూర్వం నుంచే వింతతు సమస్య తీవ్రంగా ఉంది. దీనికి ముఖ్య కారణాలు ఆడపిల్లలకు చదువు లేకపోవడం, మూఢవిశ్వాసాలు, కన్యాశుల్కం. ఈ సమస్యను స్వాతంత్య్రానికి పూర్వమే గ్రహించారు రాజా రామమోహన్ రాయ్, జ్యోతిబా పూలే, కందుకూరి విరేశలింగం వంటి సంఘసంస్కర్తలు. అందుకే ఆడపిల్లలు, బాల వితంతువులకు చదువు, స్వావలంబన, వితంతు వివాహాల కోసమూ అంతే పోరాటం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అంబేడ్కర్ సైతం ఈ అంశంపై దృష్టి సారించారు. అయితే వితంతువుల జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమించిన వారిలో మోహినీ గిరికి ప్రత్యేకమైన స్థానం ఉంది. తన జీవితంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో ఈ సమస్యపై చర్చను సమాజంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఆమె పాటుపడ్డారు. ఆమె చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2007లో ఆమెకు పద్మభూషణ్ సత్కారాన్ని అందజేసింది.వార్ విడోస్ అసోసియేషన్..స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లక్నో యూనివర్సిటీలో సైన్ ్స డిపార్ట్మెంట్ను ప్రారంభించడంలో మోహిరీ గిరి తండ్రి కీలకమైన పాత్ర పోషించారు. దీంతో యూనివర్సిటీలో మోహినీ గిరి తండ్రికి ఒక పెద్ద బంగ్లాను కేటాయించడంతో పాటు విశేషమైన గౌరవ మర్యాదలనూ ఆ కుటుంబానికి ఇచ్చేవారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే అంటే మోహినీ పదేళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయాడు. దీంతో ఆ యూనివర్సిటీలో ఆమె కుటుంబ పరిస్థితి తారుమారైంది. అప్పటికే ఆమె తల్లికి సంగీతంలో డాక్టరేట్ పట్టా ఉన్నా, యూనివర్సిటీ నుంచి సరైన రీతిలో ప్రోత్సాహం లభించలేదు. పిల్లల పెంపకం కష్టం కావడంతో ఆమె యూనివర్సిటీని వదిలి బయటకు వచ్చారు. ఒంటరి తల్లిగా ఆమెకు ఎదురైన కష్టాలు, తమను పెంచి పెద్ద చేయడంలో ఆమె పడ్డ ఇబ్బందులను మోహినీ దగ్గరగా చూశారు. ఆ తర్వాత ఆమె మాజీ రాష్ట్రపతి వరహాగిరి వెంకటగిరి ఇంటికి కోడలిగా వెళ్లారు. ఆ సమయంలోనే అంటే 1971లో ఇండో–పాక్ యుద్ధం జరిగి బంగ్లాదేశ్‌కు విముక్తి లభించింది. అయితే ఆ పోరులో ఎందరో జవాన్లు అమరులయ్యారు. వారి భార్యలు తమ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒంటరయ్యారు. దీంతో ఆమె 1972లో దేశంలోనే తొలిసారిగా ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ను ప్రారంభించారు.దాడులు..ఆ రోజుల్లో (ఇప్పటికీ చాలా చోట్ల) వితంతువులు బయటి పనులకు వెళ్లడాన్ని అనాచారంగా భావించే వారు. అంతేకాదు రంగురంగుల దుస్తులు ధరించడంపైనా ఆంక్షలు ఉండేవి. జీవితాన్ని మెరుగుపరచుకునేందుకు ప్రత్యేక నైపుణ్యాలను నేర్చుకునే అవకాశాలు అందుబాటులో ఉండేవి కావు. అలాంటి పరిస్థితుల్లో వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ‘వార్ విడోస్ అసోసియేషన్ ’ ఆధ్వర్యంలో మోహినీ గిరి.. వారణాసి, బృందావన్, పూరి, తిరుపతి వంటి ప్రాంతాల్లో వితంతు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. అక్కడ వారికి ఆశ్రయం కల్పించి ఆ కేంద్రాలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. వారి పిల్లలకు చదువులు చెప్పించారు. వీవీ గిరి ప్రభుత్వపరంగా పెద్ద పోస్టుల్లో ఉన్నంత వరకు మోహినీ గిరి చేపట్టిన కార్యక్రమాలన్నింటికీ సహకారం అందించిన సమాజం.. ఆయన పదవుల్లోంచి దిగిపోయిన వెంటనే తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మోహినీ గిరి.. వితంతువులకు రంగురంగుల దుస్తులు వేసుకోమని ప్రోత్సహిస్తోందంటూ మన తిరుపతిలోనే ఆమె ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. కోడిగుడ్లు, టొమాటోలు విసిరారు. ఆ దాడులకు ఆమె వెరవలేదు. తన ప్రయాణాన్ని ఆపలేదు. నేటికీ ఆ స్ఫూర్తి కొనసాగుతోంది. ఎందరో బుద్ధిజీవులు మోహినీ గిరి అడుగుజాడల్లో నడుస్తూ వితంతు జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు.వితంతు రక్షణ చట్టాలు..వితంతువులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించేందుకు కేంద్రంతో పాటు దేశంలో అనేక రాష్ట్రాలు పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఇవి కనిష్ఠంగా నెలకు రూ. 300ల నుంచి రూ.3,000ల వరకు ఆయా ప్రభుత్వాల వారీగా అందుతున్నాయి. పెన్షన్ తో పాటుగా వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందిం చేందుకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలనూ పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ 1954 నుంచి ఇప్పటి వరకు వితంవులు రక్షణ, భద్రత కోసం అనేక చట్టాలను రూపొందించినా, సామాజిక రుగ్మతల కారణంగా చాలా సందర్భాల్లో అవి నిస్తేజమవుతున్నాయి. చట్టాల రూపకల్పన, ప్రత్యేక పథకాల అమలుతో పాటు వివక్ష, సాంఘిక దురాచారాలు, మూఢ నమ్మకాలు వంటివాటిని దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది. అప్పుడే వితంతువుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఒకరిపై ఆధారపడే స్థితి నుంచి అద్భుతాలు సాధించే దశకు చేరుకుంటారు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
వానా.. వానా.. వల్లప్పా!
వేసవిలోని మండుటెండలు మనుషులను మలమలలాడించిన తర్వాత కురిసే వాన చినుకులు ఇచ్చే ఊరట చెప్పనలవి కాదు. ఈసారి వేసవిలో ఎండలు ఇదివరకు ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో మండిపడ్డాయి. ఉష్ణోగ్రతలు ఊహాతీతంగా పెరిగినా, మొత్తానికి ఈసారి రుతుపవనాలు సకాలంలోనే మన దేశంలోకి అడుగుపెట్టాయి. గత మే చివరివారంలో అండమాన్‌ను తాకిన రుతుపవనాలు అవరోధాలేవీ లేకుండా సజావుగా తెలుగు రాష్ట్రాల్లోకి చేరుకున్నాయి.ఈసారి రెండు రోజుల ముందుగానే– జూన్ 2 నాటికే రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకాయి. జూన్ 4 నాటికి తెలంగాణలో ప్రవేశించాయి. భారత్ వంటి వ్యవసాయాధారిత దేశాలకు వానల రాకడ ఒక వేడుక. సజావుగా వానలు కురిస్తేనే పంటలు సుభిక్షంగా పండుతాయి. వానాకాలం ప్రకృతిలో జీవం నింపుతుంది. నెర్రెలు వారిన నేలలో పచ్చదనాన్ని నింపుతుంది. జీవరాశి మనుగడకు ఊతమిస్తుంది. ఇప్పటికే వానాకాలం మొదలైన తరుణంలో కొన్ని వానాకాలం ముచ్చట్లు చెప్పుకుందాం.ప్రపంచంలోని ఉష్ణమండల దేశాలన్నింటికీ వానాకాలం ఉంటుంది. ఉత్తరార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలన్నింటిలోనూ కొద్దిరోజులు అటు ఇటుగా జూన్, జూలై నెలల్లో వానాకాలం మొదలవుతుంది. ఇక్కడ వానలు మొదలైన ఆరునెలలకు దక్షిణార్ధ గోళంలోని ఉష్ణమండల దేశాలకు వానాకాలం మొదలవుతుంది. రుతుపవనాల ప్రభావంతో ఈ దేశాల్లో ఏటా వానాకాలం వస్తుంది. నైరుతి రుతుపవనాల రాకతో మన దేశంలో మాత్రమే కాకుండా శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయాన్మార్ తదితర దేశాల్లో వర్షాకాలం వస్తుంది.ఈ దేశాల్లో వర్షాకాలం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. దాదాపు ఇదేకాలంలో రుతుపవనాల ప్రభావంతో ఉత్తర, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లోను; పశ్చిమ, ఆగ్నేయ, దక్షిణాఫ్రికా దేశాల్లోను; తూర్పు, ఆగ్నేయాసియా దేశాల్లోను వానాకాలం మొదలవుతుంది. మన దేశంలో వానాకాలం సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది. అయితే, కొన్నిచోట్ల వానాకాలం ఏప్రిల్ నుంచి మొదలై నవంబర్ వరకు సుదీర్ఘంగా కొనసాగుతుంది.గొడుగులకు పని మొదలు..వానాకాలం వచ్చిందంటే గొడుగులకు పని మొదలవుతుంది. గొడుగులతో పాటు రెయిన్ కోట్లు, గమ్ బూట్లు వంటివి అవసరమవుతాయి. వానాకాలంలో వానలు కురవడం సహజమే గాని, ఏ రోజు ఎప్పుడు ఏ స్థాయిలో వాన కురుస్తుందో చెప్పలేం. అందువల్ల బయటకు వెళ్లేటప్పుడు గొడుగులను, రెయిన్ కోట్లను వెంట తీసుకుపోవడం మంచిది. కార్లలో షికార్లు చేసేవారికి వీటితో పెద్దగా పని ఉండకపోవచ్చు గాని, పాదచారులకు గొడుగులు, ద్విచక్ర వాహనాల మీద ప్రయాణించేవారికి రెయిన్కోట్లు వానాకాలంలో కనీస అవసరాలు.గొడుగులు, రెయిన్ కోట్లలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫ్యాషన్లు వస్తున్నాయి. వింత వింత గొడుగులు, రెయిన్ కోట్లు అందుబాటులోకి వస్తున్నాయి. చిన్న చిన్న చిరుజల్లుల నుంచి గొడుగులు కాపాడగలవు గాని, భారీ వర్షాల్లో బయటకు వెళ్లాల్సి వస్తే మాత్రం రెయిన్ కోట్లు వేసుకోక తప్పదు. ఈసారి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షపాతం సాధారణ స్థాయి కంటే కాసింత ఎక్కువగానే నమోదు కావచ్చని భారత వాతావరణ శాఖ అంచనాను ప్రకటించడంతో గొడుగులు, రెయిన్కోట్లు వంటి వానాకాలం వస్తువుల తయారీదారులు, అమ్మకందారులు తమ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయనే ఆశాభావంతో ఉన్నారు.ప్రపంచవ్యాప్తంగా గొడుగులు, రెయిన్ కోట్లు తదితర వానాకాలం వస్తువుల మార్కెట్ 2022 నాటికి 3.80 బిలియన్ డాలర్ల (రూ.31,731 కోట్లు) మేరకు ఉంది. ఈ మార్కెట్లో సగటున 5.4 శాతం వార్షిక వృద్ధి నమోదవుతోంది. ఆ లెక్కన 2032 నాటికి వానాకాలం వస్తువుల మార్కెట్ 6.40 బిలియన్ డాలర్లకు (రూ.53,442 కోట్లు) చేరుకోగలదని అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషణ సంస్థ ‘బ్రెయినీ ఇన్సైట్స్’ అంచనా.వానలతో లాభాలు..వానాకాలం తగిన వానలు కురిస్తేనే వ్యవసాయం బాగుంటుంది. పంటల దిగుబడులు బాగుంటాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. వ్యవసాయంపైనే ఆధారపడి మనుగడ సాగించే రైతులు, వ్యవసాయ కార్మికులకు జీవనాధారం ఉంటుంది. వర్షాలు పుష్కలంగా కురిస్తేనే జలాశయాలు నీటితో నిండుగా ఉంటాయి. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ఉంటాయి. ప్రజలకు నీటిఎద్దడి బాధ తప్పుతుంది. వానాకాలంలో తగినంత కురిసే వానలు ఆర్థిక రంగానికి ఊతమిస్తాయి.మన దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపైన, వ్యవసాయాధారిత రంగాలపైన ఆధారపడి జీవనోపాధి పొందుతున్నారు. మన స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిలో వ్యవసాయానిది కీలక పాత్ర. భారతీయ స్టేట్‌బ్యాంకు పరిశోధన నివేదిక ప్రకారం మన జీడీపీలో 2018–19 నాటికి 14.2 శాతంగా ఉన్న వ్యవసాయం వాటా 2022–23 నాటికి 18.8 శాతానికి పెరిగింది. ఈసారి వానాకాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాను ప్రకటించిన నేపథ్యంలో మన జీడీపీలో వ్యవసాయం వాటా మరో 3 శాతం వరకు పెరగవచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.వరి, గోధుమలు, మొక్కజొన్న, చెరకు వంటి ఆహార పంటలకు, పత్తి వంటి వాణిజ్య పంటలకు పుష్కలమైన వానలే కీలకం. వానాకాలంలో మంచి వానలు కురిస్తే విద్యుత్తు కోతల బెడద కూడా తగ్గుతుంది. మన దేశం ఎక్కువగా జలవిద్యుత్తుపైనే ఆధారపడుతోంది. బొగ్గుతో పనిచేసే థర్మల్ విద్యుత్ కేంద్రాలు లేని ప్రాంతాల్లో జలవిద్యుత్తు ద్వారానే విద్యుత్ సరఫరా ఉంటోంది. తగిన వానలు కురవని ఏడాదుల్లో ఈ ప్రాంతాలకు విద్యుత్ సరఫరాకు ఇబ్బందులు తప్పవు.వాతావరణ మార్పులూ, వర్షాలూ..ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు, ముఖ్యంగా భూతాపోన్నతి వర్షాకాలంపై కూడా ప్రభావం చూపుతోంది. దీనివల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేసవిలో వడగాల్పులు, అకాల వర్షాలు, వరదలు, తుఫానులు, కరవు కాటకాల వంటివన్నీ వాతావరణంలో చోటు చేసుకుంటున్న ప్రతికూల మార్పుల ఫలితమేనని ‘ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్’ (ఐపీసీసీ) నిపుణులు చెబుతున్నారు.వాతావరణంలోని ప్రతికూల మార్పుల ప్రభావం ఇప్పటికే మన దేశం అంతటా కనిపిస్తోంది. ఈ ప్రభావం కారణంగానే ఇటీవలి వేసవిలో పలుచోట్ల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ మార్పుల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలుచోట్ల అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు తలెత్తడం, పంటనష్టాలు, కరవు కాటకాలు, విద్యుత్ సరఫరాకు అంతరాయాలు వంటి విపత్తులు తరచుగా తలెత్తుతున్నాయి. సకాలంలో తగిన వానలు కురిస్తేనే పలు దేశాల్లోని పరిస్థితులు చక్కబడతాయి.వాతావరణ పరిస్థితులు మరింతగా దిగజారకుండా ఉండటానికి ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కర్బన ఉద్గారాలను కట్టడి చేయడం, పునర్వినియోగ ఇంధనాలను ప్రజలకు అందుబాటులోకి తేవడం, అడవుల నరికివేతను అరికట్టడంతో పాటు విరివిగా మొక్కలు నాటడం వంటి చర్యలను చేపట్టాల్సి ఉంది.వానాకాలం కాలక్షేపాలు..వాతావరణం పొడిగా ఉన్నప్పుడు బయట తిరిగినంత సులువుగా వాన కురుస్తున్నప్పుడు తిరగలేం. తప్పనిసరి పనుల మీద బయటకు వెళ్లాల్సి వస్తే తప్ప వానల్లో ఎవరూ బయటకు రారు. చిరుజల్లులు కురిసేటప్పుడు సరదాగా తడవడానికి కొందరు ఇష్టపడతారు గాని, రోజంతా తెరిపిలేని వాన కురుస్తుంటే మాత్రం ఇల్లు విడిచి బయటకు అడుగుపెట్టడానికి వెనుకాడుతారు.వాన కురుస్తున్నప్పుడు ఇంటి అరుగు మీద కూర్చుని, వీథిలో ప్రవహించే వాన నీటిలో కాగితపు పడవలను విడిచిపెట్టడం చిన్న పిల్లలకు సరదా కాలక్షేపం.. కొందరు ఉత్సాహవంతులు వానాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్లి ట్రెకింగ్, పచ్చని అడవులు, చక్కని సముద్ర తీరాల్లో నేచర్ వాకింగ్ వంటివి చేస్తుంటారు. ఇంకొందరు వాన కురుస్తున్నప్పుడు నదుల్లో సరదాగా బోటు షికార్లకు వెళుతుంటారు. వాన కురుస్తున్నప్పుడు చెరువులు, కాలువల ఒడ్డున చేరి చేపలను వేటాడటం కొందరికి సరదా.అందమైన వాన దృశ్యాలను, వానాకాలంలో ఆకాశంలో కనిపించే హరివిల్లు అందాలను కెమెరాలో బంధించడం కొందరికి ఇష్టమైన కాలక్షేపం. వానాకాలంలో జలపాతాలు ఉద్ధృతంగా ఉరకలేస్తుంటాయి. వాన కురిసేటప్పుడు జలపాతాలను చూడటానికి చాలామంది ఇష్టపడతారు. వాన కురుస్తున్న సమయంలో ఎక్కువ మంది వేడివేడి పకోడీలు, కాల్చిన మొక్కజొన్న కండెలు వంటి చిరుతిళ్లు తినడానికి ఇష్టపడతారు. తెరిపి లేని వానలు కురిసేటప్పుడు రోజుల తరబడి కదలకుండా ఇంట్లోనే కూర్చుని గడిపే కంటే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుని, ఇలాంటి సరదా కాలక్షేపాలతో వానాకాలాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు.రెయిన్‌కోట్ ఫ్యాషన్లు..ఆధునిక రెయిన్కోట్లు పంతొమ్మిదో శతాబ్దంలో అందుబాటులోకి వచ్చాయి. స్కాటిష్ రసాయనిక శాస్త్రవేత్త చాల్స్ మాకింటోష్ తొలిసారిగా 1824లో పూర్తిస్థాయి వాటర్‌ప్రూఫ్ రెయిన్‌కోటును రూపొందించాడు. రెండు పొరల వస్త్రాల మధ్య నాఫ్తాతో శుద్ధిచేసిన రబ్బరును కూర్చి తొలి రెయిన్‌కోటును తయారు చేశాడు. తర్వాత నీటిని పీల్చుకోని విధంగా ఉన్నిని రసాయనాలతో శుద్ధిచేసి రూపొందించిన వస్త్రంతో రెయిన్కోట్లు తయారు చేయడం 1853 నుంచి మొదలైంది.ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో సెలోఫెన్, పీవీసీ వంటి ప్లాస్టిక్ పదార్థాలతో రెయిన్కోట్ల తయారీ ప్రారంభమైంది. వానలో శరీరం తడవకుండా కాపాడటానికే రెయిన్కోట్లను రూపొందించినా అనతికాలంలోనే వీటిలోనూ ఫ్యాషన్లు మొదలయ్యాయి. అమెరికా, చైనా తదితర దేశాల్లో రెయిన్కోట్లు ఫ్యాషన్ మార్కెట్లో తమదైన ముద్ర వేస్తున్నప్పటికీ, భారత్‌లో మాత్రం రెయిన్కోట్లలో ఫ్యాషన్ ధోరణి కొంత తక్కువే! వానలో తల, ఒళ్లు తడవకుండా ఉంటే చాలు అనే ధోరణిలోనే మన ప్రజలు రెయిన్కోట్లను కొనుగోలు చేస్తారు.మన దేశంలో తరచుగా వానలు కురిసేది కూడా మూడు నాలుగు నెలలు మాత్రమే! అందుకే మన ఫ్యాషన్ డిజైనర్లు కూడా రెయిన్కోట్ల డిజైనింగ్‌ను పెద్దగా పట్టించుకోవడం లేదు. ముంబై, కోల్‌కతా, ఢిల్లీ వంటి నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లో మాత్రం విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఫ్యాషన్ రెయిన్కోట్లు దొరుకుతాయి.వానాకాలం కష్టాలు..వానాకాలంలో వీథులన్నీ బురదమయంగా మారుతాయి. రోడ్లు సరిగా లేని చోట్ల గోతుల్లో నీరు నిలిచిపోయి ఉంటుంది. మ్యాన్‌హోల్ మూతలు ఊడిపోయి, డ్రైనేజీ నీరు రోడ్ల మీద ప్రవహిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో రోడ్ల మీద నడవడం, వాహనాలు నడపడం కష్టంగా మారుతుంది. మురుగునీటి ప్రవాహాలకు పక్కనే పానీపూరీలు, పకోడీలు, మొక్కజొన్న కండెలు అమ్మే బడ్డీలు ఉంటాయి. పగలు ఈగల బెడద, రాత్రి దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల రోగాల బెడద పెరుగుతుంది.వానాకాలంలో జలుబు, దగ్గు, జ్వరాలు సర్వసాధారణం. ఇవి కాకుండా ఎక్కువగా కలరా, డయేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, చికున్ గున్యా, మలేరియా సహా పలు రకాల వైరల్ జ్వరాలు, కళ్ల ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాపిస్తాయి. వానాకాలంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు.వేడి వేడి చిరుతిళ్ల మీద ఎంత మోజు ఉన్నా, వానాకాలంలో ఆరుబయట తినకపోవడమే మంచిది. రోడ్డు పక్కన మురికినీటి ప్రవాహాలకు దగ్గరగా బళ్లల్లో అమ్మే బజ్జీలు, పకోడీలు, పానీపూరీలు, చాట్లు వంటి చిరుతిళ్లు తింటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే!వానాకాలంలో నీటి కాలుష్యం ఎక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. చిట్లిన మంచినీటి పైపుల్లోకి డ్రైనేజీ నీరు చేరి, ఇళ్లల్లోని కొళాయిల ద్వారా కలుషితమైన నీరు వస్తుంది. నీటిని వడగట్టి, కాచి చల్లార్చి తాగడం మంచిది. తాగునీటి విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ కాలంలో వచ్చే చాలా ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.వానాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇంట్లో దుమ్ము, ధూళి, బూజులు పేరుకోకుండా చూసుకోవాలి. వానజల్లు ఇంట్లోకి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇల్లు అపరిశుభ్రంగా, తడి తడిగా ఉన్నట్లయితే ఈగలు, దోమలు సహా క్రిమికీటకాల బెడద పెరిగి, ఇంటిల్లిపాది రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే, ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వానాకాలాన్ని ఆస్వాదించవచ్చు. -
పిల్లలూ గుర్తుందా!? వేసవి సెలవులు అయిపోవచ్చాయి..!
వేసవి సెలవులు అయిపోవచ్చాయి. స్కూళ్లు ప్రారంభమవుతున్నాయి. మళ్లీ తరగతి గదులు, ట్యూషన్లు, హోమ్ వర్కులు ఇలా పిల్లల్లో హంగామా మొదలైపోయింది. యూనిఫామ్, టెక్స్›్టబుక్స్ ఇలా అన్నీ మారుతుంటాయి. ఇదంతా పిల్లల తల్లిదండ్రులకు కూడా పరీక్షే! కొత్త స్కూల్ బ్యాగ్ కొనడం దగ్గర నుంచి కొత్త పుస్తకాలకు అట్టలు వేయడం వరకూ ప్రతి పనీ పేరెంట్స్‌కి హైరానా కలిగిస్తుంది. అయితే పిల్లల్లో పాత ఫ్రెండ్స్‌ని కలుసుకుంటున్నామని, కొత్త ఉపాధ్యాయులు రాబోతున్నారని, క్లాస్ రూమ్ మారబోతుందని, కొత్త పాఠాలు నేర్చుకోబోతున్నామని ఇలా మిశ్రమ భావోద్వేగాలు తొంగి చూస్తుంటాయి.అయితే పిల్లలు తిరిగి స్కూల్ వాతావరణానికి అలవాటు పడాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పవు. పిల్లలు స్కూల్లో ఏది బాగా తింటారు? బాక్సుల్లో ఏం పెట్టాలి? వీటి గురించి కూడా దృష్టి పెట్టాలి. మొదటిసారి స్కూల్‌కి వెళ్తున్న పిల్లల విషయంలో ఎలాంటి చిట్కాలు పాటించాలి? ఆల్రెడీ స్కూల్ అలవాటున్న పిల్లలను హాలిడేస్ మూడ్ నుంచి ఎలా బయటికి తీసుకురావాలి? అవన్నీ ఇప్పుడు చూద్దాం.మొదటిసారి స్కూల్‌కి పంపుతున్నారా..?ప్రీస్కూల్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీల్లో పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు వారిని పేరెంట్స్ చాలా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ మార్పును ఆనందంగా అంగీకరిస్తారు. కానీ మరికొందరికి అలవాటు పడటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యిందంటే తల్లిదండ్రులకు టెన్షన్ ్స మొదలైపోయినట్లే! మరి దానిని సులభం చేయడానికి ఈ చిట్కాలను పాటిస్తే మంచిది.చిన్నచిన్న పిల్లలకు స్కూల్ ఎలా ఉంటుందో చూపించడానికి ’టాయ్ స్కూల్’ని తయారు చెయ్యాలి. బొమ్మలతో చిన్న నమూనా పాఠశాలను ఏర్పాటు చెయ్యాలి. మామూలుగా పాఠశాల రోజున ఏమి జరుగుతుందనే దాని గురించి చిన్నగా మాట్లాడుతూనే వారితో కలిసి ఆడుకోవాలి.పాఠశాల ప్రారంభానికి ముందు పిల్లలకు వీలయినన్ని ఎక్కువ పుస్తకాలను చదివి వినిపించాలి. లేదా వారితో చదివించాలి. పిల్లలు వారి కొత్త పాఠశాలలో చేయగలిగే సంగతులు గురించి చర్చించాలి. వారు కలుసుకోబోయే స్నేహితులు, అక్కడుండే వినోదం గురించి మాట్లాడుతూ ఉండాలి.క్లాస్ రూముల్లో పిల్లలు స్వయంగా చెయ్యగలిగే పనులను ఇంట్లో ఉన్నప్పటి నుంచే చక్కగా ప్రాక్టీస్ చేయించాలి. లంచ్ బాక్స్, జ్యూస్ లేదా వాటర్ బాటిల్ మూతలు తెరవడం, తిరిగి మూతలు పెట్టడం.. తమంతట తామే షూస్ తియ్యడం, తిరిగి తొడుక్కోవడం, స్పూన్‌తో అన్నం తినడం ఇలాంటి సాధారణ పనులను నేర్పించాలి.స్కూల్లో ఏదైనా విషయం గురించి పిల్లలు ఇబ్బంది పడితే ఆ విషయం గురించి టీచర్‌కి ఎలా చెప్పాలి? ఎలా పర్మిషన్ అడగాలి? వంటివి కూడా అలవాటు చెయ్యాలి.స్కూల్ ప్రారంభమయ్యే ముందురోజుల్లో పిల్లలను తీసుకుని షాపింగ్ వెళ్తే మంచిది. ఆ షాపింగ్‌లో వాళ్లకు నచ్చిన స్కూల్ బ్యాగ్, పెన్సిల్ కేస్, యూనిఫాం, లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ ఇలా అన్నీ కొనిస్తే వారిలో ఉత్సాహం పెరుగుతుంది.ఇక చిన్నారులను స్కూల్‌కి పంపించే నాటికి స్వయంగా టాయిలెట్‌కి వెళ్లగలరా లేదా నిర్ధారించుకోవాలి. లేదంటే కనీసం టాయిలెట్ వస్తుందని టీచర్‌కి చెప్పడం అయినా నేర్పించాలి.చిన్న పిల్లలకు షేరింగ్ కూడా అలవాటు చెయ్యాలి. స్కూల్లో ఇతర పిల్లల దగ్గర లాక్కోకుండా ఉండటంతో పాటు పక్కపిల్లలకు తమ దగ్గరున్నది షేర్ చేసే విధానం నేర్పాలి. స్కూల్లో ఏదైనా పంచిపెడుతున్నప్పుడు తమ వంతు వచ్చే వరకూ వేచి చూడటం గురించి వివరించాలి. దాని వల్ల పిల్లలకు స్నేహితులు పెరుగుతారు.ఇక స్కూల్లో జాయిన్ అయిన తర్వాత కూడా పిల్లలతో కలిసి పేరెంట్స్ పాఠశాలకు వెళ్లడం, స్కూల్ దగ్గర ఆగి ప్లే గ్రౌండ్‌ని పరిశీలించడం, వారి క్లాస్ టీచర్‌తో, ఇతర విద్యార్థులతో మాట్లాడటం మంచిది. ఆ సమయంలోనే పిల్లలకు వారి తరగతి గదిలో ఏది బాగా నచ్చుతుందో తెలుసుకోవచ్చు.పాఠశాలలో మొదటి రోజు ఒత్తిడి లేకుండా పిల్లలను సిద్ధం చేయడానికి స్కూల్ తెరిచే ముందే మీ పిల్లల తరగతిలో జాయిన్ కాబోతున్న ఇతర పిల్లలకు మీ పిల్లలను పరిచయం చెయ్యాలి. అవసరం అయితే ఆ విద్యార్థి కుటుంబాన్ని కలుసుకోవాలి. దాని వల్ల స్కూల్లో జాయిన్ అయిన రోజు క్లాసులో మీ పిల్లలకు తెలిసి వ్యక్తి ఒకరైనా ఉంటారు. దాంతో ఆ స్కూల్ తమకు తెలియని చోటు అనే బెరుకు తగ్గుతుంది.కొద్ది సమయం పాటు మీ నుంచి దూరంగా ఉండేలా వారికి ముందే అలవాటు చెయ్యాలి. కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు లేదా మీరు విశ్వసించే పెద్దవారితో మీరు లేకపోయినా మీ పిల్లలు కలిసి ఉండేలా చూసుకోవాలి.పై తరగతులకు వెళ్లే పిల్లల కోసం..చదువులో కాస్త డల్‌గా ఉండి టీచర్స్‌కి భయపడే పిల్లలకు స్కూల్స్ ప్రారంభం అంటే కాస్త బెరుకు ఉంటుంది. అలాంటి పిల్లలతో పేరెంట్స్ మనసు విప్పి మాట్లాడాలి. వారిలో మానసిక ధైర్యాన్ని కలిగించాలి.పిల్లలు మొదటిరోజు కోసం ఎదురుచూడటంలో సానుకూల అంశాల గురించి పేరెంట్స్ చర్చించాలి. వారి పాత ఫ్రెండ్స్‌ని గుర్తు చేస్తూ, కొత్త ఫ్రెండ్స్ వస్తే ఎలా కలుస్తారో తెలుసుకుంటూ స్నేహపూర్వకంగా మాట్లాడాలి.పిల్లలు స్కూల్‌కి నడిచి వెళ్తున్నా, బస్సు లేదా ఆటోలో ప్రయాణిస్తున్నా వారితో పాటు ఉండే వారి స్నేహితుల్ని పరిచయం చేసుకోవడం మంచిది. మొదటిరోజు మాత్రం వీలైతే స్వయంగా స్కూల్లో డ్రాప్ చేసి పికప్ చేసుకోవడం మంచిది. వారిలోని ఒత్తిడికి దూరం చేసినట్లు అవుతుంది.కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు నుంచే స్కూల్ షెడ్యూల్‌ని బట్టి వారి నిద్ర వేళలను నిర్ణయించి, అలానే నిద్రపోయేలా చెయ్యాలి. సరైన నిద్ర అందకపోతే స్కూల్లో వారు యాక్టివ్‌గా ఉండలేరు. అలాగే వారికి స్నానం చేయించడం, స్కూల్‌కి రెడీ చేయించడం, స్కూల్ నుంచి రాగానే స్కూల్లో సంగతులు అడిగి తెలుసుకోవడం, అవసరం అయితే వారి ఆలోచనలను సరిచేయడం, హోమ్ వర్క్ చేయించడం వంటి పనుల్లో వారి కోసం సమయాన్ని కేటాయించాలి. అలాగే పిల్లలు నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇంటిని వీలైనంత నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి.పిల్లలు స్కూల్‌కి వెళ్లే దారిల్లో ఏ షాపులు ఎక్కడ ఉన్నాయి? ఎటు వెళ్తే స్కూల్ వస్తుంది? అలాగే స్కూల్ నుంచి ఇంటికి ఏయే దారుల్లో రావచ్చు.. అవన్నీ ప్రాక్టీస్ చేయించాలి. వారితో కూడా వెళ్తున్నప్పుడు వారినే దారి చెప్పమని అడగటం, లేదంటే ఇంట్లో కూర్చోబెట్టి ఆ దారి గురించి చర్చించడం లాంటివి చెయ్యాలి. అలా చేయడం వల్ల వారు ప్రమాదంలో పడినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినా క్షేమంగా ఇంటికి చేరుకోగలరు.బస్సులు లేదా ఆటోలు ఎక్కుతున్నప్పుడు ఆగి దిగాలని, నిదానంగా ఎక్కాలని పిల్లలకు సూచించాలి. అలాగే పిల్లల్ని తీసుకెళ్లే డ్రైవర్‌తో కూడా పిల్లలను ఓ కంట కనిపెట్టమని చెబుతుండాలి. మీ పిల్లలు ఎక్కడ కూర్చుంటారు? ఎలా కూర్చుంటారు? అన్నీ డ్రైవర్ని ఆరా తియ్యాలి.అలాగే స్కూల్‌కి వెళ్తున్న పిల్లలకు రోడ్డు దాటే సమయాల్లో ఇరువైపులా చూసుకోవడం నేర్పించాలి. ఏవైనా వాహనాలు వస్తుంటే పక్కకు ఆగి, అవి వెళ్లిన తర్వాతే నడవడం గురించి చెప్పాలి. ఇవన్నీ దగ్గరుండి ప్రాక్టీస్ చెయ్యించాలి.ఏది తిన్నా రోడ్డు మీద ఆరుబయట తినొద్దని, ఇంటికి తెచ్చుకునైనా, లేదా స్కూల్లోనైనా తినాలని చెప్పాలి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాతే తినడం అలవాటు చెయ్యాలి. లేదంటే అలర్జీలు, జలుబులు వస్తుంటాయని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే దాని గురించి ముందుగానే ఆ స్కూల్ టీచర్స్‌తో, ఆయాలతో వివరంగా చెప్పి అత్యవసర పరిస్థితిల్లో సమాచారం ఇవ్వమనాలి.ఇక స్కూల్‌కి సైకిల్ మీద వెళ్లే పిల్లల(టీనేజ్ వారు) విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం. రద్దీప్రదేశాల్లో వెళ్తుంటే హెల్మెట్ తప్పసరి ధరించేలా చూడాలి.అపరిచితులు ఇచ్చిన ఆహారం తినొద్దని పిల్లలకు చెప్పడంతో పాటు తింటే దాని వల్ల కలిగే ప్రమాదాల గురించి చెప్పాలి. అవసరమైతే కొన్ని ఉదాహరణలను వివరించాలి. అపరిచితులు పిల్లలను కిడ్నాప్ చేస్తారని.. తిరిగి ఇంటికి రాకుండా తీసుకునిపోతారని డైరెక్ట్‌గా చెప్పకుండా.. కొన్ని పేర్లు ఊహించి చెబుతూ.. ఓ కథ రూపంలో వారికి చెబుతుండాలి. అలా చేస్తే వారి మనసుల్లో నాటుకునిపోతుంది.పిల్లలు స్కూల్లో లేదా బయట లేదా బస్సుల్లో ఏవైనా బెదిరింపులకు లోనవుతున్నా, ఏదైనా సమస్యల్లో ఇరుక్కున్నా, అలాంటి విషయాలను ఎప్పటికప్పుడు గమనించు కుంటూ ఉండాలి. మరీ ముఖ్యంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ఆడపిల్లలతో పాటు మగ పిల్లలకు కూడా చెప్పాల్సిందే. సమస్యను మీదకు తెచ్చుకోకుండా ఎలా ఉండాలో చెప్పడంతో పాటు సమస్య వస్తే దాని నుంచి ఎలా బయటపడాలో కూడా నేర్పించాలి. ఒకవేళ ఇతర పిల్లలకు మీ పిల్లల వల్లే సమస్య ఏర్పడుతుంటే దాన్ని కూడా సున్నితంగానే తీసుకోవాలి. పిల్లల దూకుడు ప్రవర్తనకు కొన్ని పరిమితులు విధించి వారిని నెమ్మదిగా మార్చాలి.హోమ్‌వర్క్ సమయంలో టీవీ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటినీ ఆపెయ్యాలి. పెద్దవారు అవుతున్న పిల్లల విషయంలో ఇంటర్నెట్ వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి.పిల్లల్లో కళ్లు, మెడ, తల అలసటకు గురవుతుంటే దాన్ని గుర్తించి, చదువుతున్నప్పుడు వారికి కాసేపు విరామం ఇస్తుండాలి. కనీసం ఒక పది నిమిషాలు వారికి నచ్చినట్లుగా ఉండనివ్వాలి.పిల్లలు ఇష్టంగా తినే ఈజీ రెసిపీలు..పిల్లలు ఆకలికి ఎక్కువగా ఆగలేరు. పైగా బయట చూసిన తినుబండారాలను చూస్తే అసలు ఆగరు. అందుకే వారికి కావాల్సిన భోజనంతో పాటు స్నాక్స్ కూడా సిద్ధం చేసి బాక్సుల్లో పెట్టడం మంచిది. ఒకవేళ మధ్యాహ్నం భోజనాన్ని స్కూల్లో ఉచితంగా అందిస్తున్నా, ఇలాంటి స్నాక్స్ బాక్స్‌ల్లో పెడితే పిల్లలు దృఢంగా పెరుగుతారు. ఈజీగా సిద్ధమయ్యే కొన్ని రెసిపీస్ ఇప్పుడు చూద్దాం.రాగి కుకీలు..కావాల్సినవి..రాగి పిండి– ఒకటిన్నర కప్పులుఏలకుల పొడి– అర టేబుల్ స్పూన్గుడ్డు– 1ఉప్పు– తగినంతఅల్లం పొడి– కొద్దిగాకొబ్బరి పాలు, రైస్ బ్రాన్ ఆయిల్ – పావు కప్పు చొప్పునతయారీ..ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక పాన్ లో రాగి పిండి, ఏలకుల పొడి వేసుకుని దోరగా వేయించాలి. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసి.. దానిలో గుడ్డు, అల్లం పొడి, రైస్ బ్రాన్ ఆయిల్, కొబ్బరి పాలు వేసుకుని మిక్సీ పట్టాలి. దాని వల్ల ఆ మిశ్రమం మొత్తం ముద్దలా మారిపోతుంది. అనంతరం కుకీస్‌లా చేసుకుని.. ఓవెన్ లో 180 డిగ్రీలసెల్సియస్‌లో.. 8 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది.ఓట్స్ ఇడ్లీ..కావాల్సినవి..ఓట్స్– 2 కప్పులు (దోరగా వేయించి, మిక్సీ పట్టుకోవాలి)నూనె– అర టేబుల్ స్పూన్మినప పొడి– 1 టేబుల్ స్పూన్శనగపిండి– అర టేబుల్ స్పూన్పెరుగు– 2 కప్పులుపసుపు, కారం– కొద్దికొద్దిగాతయారీ..ముందుగా ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, నూనె, మినప పొడి, శనగపిండి, పెరుగు వేసుకుని బాగా కలిపి.. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకుని, ఇడ్లీ రేకుల్లో కొద్దికొద్దిగా వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. అభిరుచిని బట్టి ఇడ్లీ పిండిలో క్యారెట్ తురుము, కొత్తిమీర తురుము కూడా కలుపుకోవచ్చు.ఖర్జూరం– జీడిపప్పు లడ్డూ..కావాల్సినవి..ఖర్జూరాలు, జీడిపప్పు– 1 కప్పు,కొబ్బరి తురుము– అర కప్పు,ఉప్పు– తగినంత,నూనె– 1 టేబుల్ స్పూన్‌తయారీ..ముందు ఖర్జూరాలను ఒక గంట నీటిలో నానబెట్టి, గింజ తీసి.. ఆరబెట్టాలి. అనంతరం ఒక మిక్సీ బౌల్లో ఖర్జూరాలు, జీడిపప్పు, కొబ్బరి కోరు, తగినంత ఉప్పు, నూనె వేసుకుని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, నేయి రాసుకున్న చేతులతో చిన్న చిన్న ఉండల్లా చేసుకోవచ్చు.హెర్బ్డ్ పొటాటోస్..కావాల్సినవి..బంగాళదుంపలు– 2 పెద్దవి(తొక్క తీసి.. కడగాలి, వాటిని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి),ఆలివ్ నూనె– 1 టేబుల్ స్పూన్,వెల్లుల్లి తురుము– కొద్దిగాతులసి ఆకుల తురుము – కొద్దిగా(అభిరుచిని బట్టి),చిల్లీ ఫ్లేక్స్– అర టేబుల్ స్పూన్ఒరేగానో తురుము– 1 టేబుల్ స్పూన్ (మార్కెట్లో దొరుకుతుంది)తేనె– 2 టేబుల్ స్పూన్లుఉప్పు– తగినంతతయారీ..ఒక బౌల్లో బంగాళాదుంప ముక్కలు వేసుకుని చిల్లీ ఫ్లేక్, ఆలివ్ నూనె, వెల్లుల్లి తురుము, తులసి ఆకుల తురుము, తేనె, ఒరేగానో తురుము ఇలా అన్నీ కలిపి గిన్నెను బాగా కుదపాలి. అనంతర వాటిని బేకింగ్ ట్రేలో పెట్టి.. 200 డిగ్రీల సెల్సియస్‌లో 10–15 నిమిషాలు బేక్ చేస్తే సరిపోతుంది.స్టీమ్డ్ ధోక్లా..కావాల్సినవి..శనగపిండి – 1 కప్పు,ఓట్స్, జొన్నపిండి – పావు కప్పు చొప్పున,పంచదార – 1 టేబుల్ స్పూన్,పసుపు– 1 టీస్పూన్,నిమ్మరసం– 1 టేబుల్ స్పూన్,ఉప్పు– తగినంత,బేకింగ్ పౌడర్– 1 టేబుల్ స్పూన్నీళ్లు– సరిపడా,నూనె– 1 టీ స్పూన్‌తయారీ..శనగపిండి, ఓట్స్, జొన్నపిండి, పంచదార, పసుపు, నిమ్మరసం, బేకింగ్ పౌడర్, నూనె వేసుకుని బాగా కలిపి.. కొద్దిగా ఉప్పు తగినంత నీళ్లు పోసుకుని బాగా మిక్స్ చెయ్యాలి. అనంతరం ఒక బౌల్ తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేసుకుని ఆవిరిపై ఉడికించాలి. ఆవాలు, కొత్తిమీర తాళింపు వేసుకుని.. కొత్తి మీర చట్నీతో కలిపి బాక్స్‌లో పెడితే సరిపోతుంది.మొత్తానికి పిల్లలకు నచ్చేవిధంగా, వారు మెచ్చే విధంగా స్కూల్‌కి పంపించగలిగితే వారి వ్యక్తిత్వ వికాసం బాగుంటుంది. వారిలో కొత్త ఉత్సాహం పొంగుకొస్తుంది. దాంతో వారు పెద్దల మాటను వినడంలో, శ్రద్ధగా చదవడంలో, వినయ విధేయలతో పెరగడంలో నంబర్ వన్ అవుతారు. -
క్రికెట్ పండగొచ్చింది.. 'టీ' కప్ లో పరుగుల సునామీ!
ధనాధన్ సిక్సర్లు.. ఫటాఫట్ ఫోర్లు.. ప్రపంచ క్రికెట్ అభిమానుల కోసం ట్వంటీ20 పండగ సిద్ధమైంది.. ఐపీఎల్ ముగిసి వారం రోజులే కాలేదు.. అప్పుడే మరో 20–20 సమరానికి అంతా రెడీ.. మీరు హైదరాబాద్ అభిమానులైనా, రాజస్థాన్ ఫ్యాన్స్ అయినా.. బెంగళూరును ఇష్టపడినా... కోల్‌కతాను ప్రేమించినా.. ఇప్పుడు మాత్రం అంతా భారత జట్టు వీరాభిమానులే..ఫ్రాంచైజీ క్రికెట్ ఎలాంటి వినోదాన్ని అందించినా ఆటలో అసలు కిక్కు మాత్రం మన దేశం, మన జట్టు అనడంలోనే ఉంది! కాబట్టే టి20 వరల్డ్‌కప్ అంటే అంత క్రేజ్! అందుకే పదహారేళ్ల వ్యవధిలో ఎనిమిది మెగా టోర్నీలు వంద శాతం ఆనందాన్ని పంచాయి. ఈసారీ ఆ సంబరంలో ఎలాంటి లోటు రానివ్వనన్నట్లుగా మరో వరల్డ్‌కప్ మన ముంగిటకు వచ్చేసింది. అందమైన కరీబియన్ సముద్ర తీరాన కలిప్సో సంగీతంతో సాగే టి20 మ్యాచ్‌లకు ఈసారి అగ్రరాజ్యం అమెరికా కూడా జత కట్టడం కొత్త ఆకర్షణ. ఇన్నేళ్లుగా క్రికెట్ అంటేనే మైళ్ల దూరంలో ఉన్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్ఏ) ఇప్పుడు ఆతిథ్య జట్టుగా తమ దేశంలో కామన్వెల్త్ దేశాల ఆటకు స్వాగతం పలుకుతోంది. బరిలోకి దిగనున్న జట్ల సంఖ్య తొలిసారి 20కి చేరడం ఈసారి మరో ప్రత్యేకత. సంప్రదాయాలు, ప్రారంభోత్సవాల తంతు ముగిస్తే ఇక జట్లు మైదానంలో తలపడటమే మిగిలింది. ఇకపై నెల రోజుల పాటు ట్రవిస్ హెడ్ మనవాడు కాదు, కమిన్స్‌పై అభిమానం అస్సలు కనిపించదు, క్లాసెన్ తొందరగా అవుట్ కావాలనే మనం కోరుకోవాలి.గతంలో రెండుసార్లు చాంపియన్‌గా నిలవడంతో పాటు ఇప్పుడు ఆతిథ్యం కూడా ఇస్తూ వెస్టిండీస్ మరో కప్‌పై కన్నేసింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ తమ మూడో టైటిల్ వేటలో జట్టునంతా హిట్టర్లతో నింపేయగా.. మాజీ విజేత ఆస్ట్రేలియా తమ స్థాయిని మళ్లీ ప్రదర్శించేందుకు ‘సై’ అంటోంది.ఒకసారి చాంపియన్లుగా నిలిచి రెండో టైటిల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్న పాకిస్తాన్, శ్రీలంక తమ అస్త్రాలతో సిద్ధమయ్యాయి. దక్షిణాఫ్రికా, న్యూజీలండ్లు ఇన్నేళ్లుగా పోరాడుతున్నా ట్రోఫీ మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే ఉంది. ఈ సారైనా ఆ జట్ల రాత మారుతుందా అనేది చూడాలి. లెక్కల్లో భాగంగా ఉన్నా డజను టీమ్‌లు టైటిల్ గెలిచే అంచనాల్లో లేవు. అయితే తమ స్థాయికి మించిన ప్రదర్శనతో సంచలనానికి అవి ఎప్పుడూ రెడీనే.ఇక చివరగా.. మన రోహిత్ శర్మ బృందం ఏ స్థాయి ప్రదర్శనతో భారత అభిమానుల కోరిక తీరుస్తుందనేది ఆసక్తికరం. ఎప్పుడో 2007లో తొలి టి20 వరల్డ్ కప్‌ను గెలుచుకున్న తర్వాత ఏడు ప్రయత్నాల్లోనూ మనకు నిరాశే ఎదురైంది. ఈసారి విండీస్ దీవుల్లో విజయీభవ అంటూ అందరం దీవించేద్దాం!జట్ల సంఖ్యను పెంచి...టి20 వరల్డ్‌కప్ చరిత్రలో ఇప్పటి వరకు 8 టోర్నీలు జరిగాయి. 2007 నుంచి 2022 మధ్య వీటిని నిర్వహించారు. ప్రస్తుతం జరగబోయేది 9వ టోర్నీ. గత నాలుగు వరల్డ్ కప్‌లలో 16 జట్లు పాల్గొనగా ఈసారి ఆ సంఖ్యను మరింత పెంచి క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించాలని ఐసీసీ నిర్ణయించింది. అందుకే ఈసారి 20 జట్లకు అవకాశం కల్పించింది. 2022 టోర్నీలో టాప్–8లో నిలిచిన ఎనిమిది జట్లు ముందుగా అర్హత సాధించాయి. రెండు ఆతిథ్య జట్లతో పాటు ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ ప్రకారం మరో రెండు టీమ్‌లను ఎంపిక చేశారు. రీజినల్ క్వాలిఫయింగ్ టోర్నీల ద్వారా వేర్వేరు ఖండాల నుంచి మరో 8 జట్లు అర్హత సాధించాయి. కెనడా, ఉగాండా తొలిసారి టి20 ప్రపంచకప్‌లో ఆడనుండగా... ఆతిథ్య హోదాలో అమెరికా కూడా మొదటిసారి ఈ విశ్వ సమరంలో బరిలోకి దిగుతోంది.నవంబర్ 16, 2001... అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2024లో జరిగే టి20 ప్రపంచకప్ నిర్వహణ హక్కుల ప్రకటన వెలువరించింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా క్రికెట్ బోర్డు, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కలసి సంయుక్తంగా ఈ అవకాశం కోసం బిడ్ వేశాయి. అమెరికాలో కొత్తగా క్రికెట్‌ను అభివృద్ధి చేసేందుకు వచ్చిన అవకాశం... కరీబియన్ దీవుల్లో కొత్త తరంలో క్రికెట్‌పై తగ్గిపోతున్న ఆసక్తిని పెంచేందుకు ఈ రెండు దేశాల బోర్డులు కలసి ముందుకు వెళ్లాలని 2019లోనే నిర్ణయం తీసుకున్న తర్వాత సంయుక్త బిడ్‌కు సిద్ధమయ్యాయి. అమెరికాలాంటి అగ్రరాజ్యంలో క్రికెట్‌కు ఇప్పటి వరకు ఉన్న ఆదరణ అంతంత మాత్రమే. దేశంలోని వివిధ జట్లలో కూడా దక్షిణాసియా దేశాల నుంచి వచ్చినవారే సభ్యులుగా ఉంటున్నారు. అయితే వాణిజ్యపరంగా ఆ దేశంలో మంచి అవకాశాలు ఉండటం కూడా అమెరికాను ఐసీసీ ప్రోత్సహించేందుకు మరో కారణం. పైగా 2028లో లాస్ ఏంజెలిస్‌లో జరిగే ఒలింపిక్స్ క్రీడల్లో కూడా టి20 క్రికెట్‌ను చేర్చడంతో దానికి ఒక ట్రయిలర్‌గా ఈ వరల్డ్‌కప్ ఉండనుంది. మరోవైపు విండీస్ గడ్డపై క్రికెట్‌కు క్రేజ్ తగ్గుతుండటంతో స్టేడియాల నిర్వహణ సరిగా లేక ఆ జట్టు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో వరల్డ్‌కప్‌తో కాస్త కళ పెంచే అవకాశం ఉండటంతో విండీస్ ముందుకు వచ్చింది. ఏర్పాట్ల కోసం కనీసం రెండేళ్ల సమయం తీసుకునేలా ఐసీసీ ఈ రెండు బోర్డులకు అవకాశం కల్పిస్తూ హక్కులను కేటాయించింది.మొత్తం 9 వేదికలు..వరల్డ్‌కప్ మ్యాచ్‌ల ఎంపిక కోసం అమెరికా–వెస్టిండీస్‌లకు హక్కులు ఇచ్చినా మ్యాచ్‌లు జరిగే వేదికల విషయంలో ఐసీసీ చిక్కులు ఎదుర్కొంది. ముందుగా అమెరికాలో నాలుగు స్టేడియాలను ఎంపిక చేశారు. వీటిలో న్యూయార్క్ శివార్లలో ఉన్న బ్రాంక్స్ స్టేడియానికి సంబంధించి జనం నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సుదీర్ఘ సమయంపాటు పార్క్ స్థానికులకు అందుబాటులో లేకపోవడంతోపాటు పర్యావరణ సమస్యలూ తలెత్తుతాయని వాదించడంతో దానిని పక్కన పెట్టాల్సి వచ్చింది. వేర్వేరు దేశాల సమాహారమైన వెస్టిండీస్ నుంచి కూడా ఏడు వేదికలను వరల్డ్‌కప్ కోసం ఐసీసీ ఎంపిక చేసింది. అయితే గ్రెనడా, జమైకా, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ ఆర్థిక సమస్యల కారణంగా మ్యాచ్‌ల నిర్వహణ కోసం బిడ్ వేయకుండా వెనక్కి తగ్గాయి. మైదానం సిద్ధం చేసేందుకు తమ వద్ద తగినంత సమయం లేదని డొమినికా కూడా తప్పుకుంది. చివరకు వాటి స్థానంలో కొత్త వేదికలను చేర్చి మొత్తంగా ఆరింటిని ఖరారు చేశారు.ఏ జట్టులో ఎవరున్నారంటే...భారత్..రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రిషభ్ పంత్, సంజూ సామ్సన్, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చహల్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, బుమ్రా.ఇంగ్లండ్..జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, డకెట్, మొయిన్ అలీ, విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, స్యామ్ కరన్, బెయిర్‌స్టో, ఫిల్ సాల్ట్, జోఫ్రా ఆర్చర్, టామ్ హార్ట్లే, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, రీస్ టాప్లీ, మార్క్ వుడ్.దక్షిణాఫ్రికా..మార్క్రమ్ (కెప్టెన్), హెండ్రిక్స్, మిల్లర్, మార్కో జాన్సెన్, డికాక్, క్లాసెన్, రికెల్టన్, స్టబ్స్, బార్ట్‌మన్, కొయెట్జీ, జాన్ ఫార్చూన్, కేశవ్ మహరాజ్, నోర్జే, రబడ, షమ్సీ.ఆస్ట్రేలియా..మిచెల్ మార్ష్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, హెడ్, వార్నర్, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టొయినిస్, అగర్, ఇంగ్లిస్, వేడ్, కమిన్స్, ఎలిస్, హాజల్‌వుడ్, స్టార్క్, జంపా.న్యూజీలండ్..విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, బ్రేస్‌వెల్, మిచెల్, నీషమ్, రచిన్ రవీంద్ర, సాన్‌ట్నర్, డెవాన్ కాన్వే, బౌల్ట్, ఫెర్గూసన్, హెన్రీ, ఇష్ సోధి, సౌతీ.పాకిస్తాన్..బాబర్ ఆజమ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, సయీమ్ ఆయూబ్, ఇఫ్తికార్ అహ్మద్, ఆఘా సల్మాన్, ఇమాద్ వసీమ్, ఇర్ఫాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ రిజ్వాన్, హారిస్ రవూఫ్, ఆమిర్, నసీమ్ షా, షాహిన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఆజమ్ ఖాన్.శ్రీలంక..హసరంగ (కెప్టెన్), నిసాంక, అసలంక, ధనంజయ డిసిల్వా, ఏంజెలో మాథ్యూస్, కామిందు మెండిస్, షనక, వెల్లలాగె, కుశాల్ మెండిస్, సమరవిక్రమ, చమీర, మధుషంక, పతిరణ, తీక్షణ, నువాన్ తుషారా.వెస్టిండీస్..రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), హెట్‌మైర్, బ్రాండన్ కింగ్, రూథర్‌ఫర్డ్, రోస్టన్ ఛేజ్, రసెల్, హోల్డర్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్, అల్జారి జోసెఫ్, షమర్ జోసెఫ్, రొమారియో ఫెఫర్డ్, అకీల్ హొసెన్, గుడకేశ్ మోతీ.బంగ్లాదేశ్..నజ్ముల్ హొస్సేన్ (కెప్టెన్), షకీబ్ అల్ హసన్, సౌమ్య సర్కార్, తన్జిద్, తౌహిద్ హృదయ్, మహ్ముదుల్లా, మెహదీ హసన్, లిటన్ దాస్, జకీర్ అలీ, తస్కిన్ అహ్మద్, తన్వీర్ అస్లాం, రిషాద్ హొస్సేన్, ముస్తఫిజుర్, షోరిఫుల్ ఇస్లాం, తన్జిమ్.నేదర్లండ్స్..స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), మాక్స్ ఒడౌడ్, తేజ నిడమనూరు, విక్రమ్‌జిత్ సింగ్, సైబ్రాండ్, లెవిట్, బస్ డి లీడి, టిమ్ ప్రింగిల్, వెస్లీ బరెసి, లొగాన్ వాన్ బీక్, ఆర్యన్ దత్, ఫ్రెడ్ క్లాసెన్, డేనియల్ డోరమ్, మికెరెన్, వివియన్ కింగ్మా.ఐర్లండ్..పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రోస్ అడెర్, బల్బీర్నీ, టెక్టర్, డెలానీ, కాంఫర్, డాక్రెల్, నీల్ రాక్, టకర్, మార్క్ అడెర్, హ్యూమ్, జాషువా లిటిల్, మెకార్తీ, క్రెయిగ్ యంగ్, బెంజమిన్ వైట్.కెనడా..సాద్ బిన్ జఫర్ (కెప్టెన్), నవ్‌నీత్ ధలీవాల్, ఆరన్ జాన్సన్, మొవ్వ శ్రేయస్, రవీందర్‌పాల్ సింగ్, కన్వర్పాల్, దిల్‌ప్రీత్ బాజ్వా, పర్గత్ సింగ్, రయాన్ పఠాన్, హర్ష్ ఠాకెర్, జెరెమి జోర్డాన్, డిలాన్ హెలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్దిఖి, నికోలస్ కీర్టన్.నమీబియా..గెరార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), డావిన్, జేన్ గ్రీన్, కోట్జీ, మలాన్ క్రుగెర్, లీచెర్, స్మిట్, ఫ్రయ్‌లింక్, లింజెన్, డేవిడ్ వీస్, బ్లిగ్నాట్, జేక్ బ్రాసెల్, లుంగామెని, షాల్ట్జ్, షికోంగో, ట్రంపెల్మన్.అఫ్గానిస్తాన్..రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీమ్ జద్రాన్, నజీబుల్లా జద్రాన్, నాంగ్యాల్ ఖరోటి, అజ్మతుల్లా ఒమర్జాయ్, నబీ, గుల్బదిన్, కరీమ్ జనత్, రహ్మానుల్లా గుర్బాజ్, ఇషాక్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీనుల్ హక్, ఫజల్హక్ ఫారూఖి, ఫరీద్ అహ్మద్ మాలిక్, నూర్ అహ్మద్.నేపాల్..రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, దీపేంద్ర సింగ్, కుశాల్ భుర్తెల్, సందీప్ జోరా, కరణ్, కుశాల్ మల్లా, ప్రాతిస్, అనిల్ సాహ్, సోంపాల్ కామి, అభినాష్ బొహరా, గుల్షన్ జా, లలిత్ రాజ్‌బన్షీ, కమాల్ ఐరీ, సాగర్ ఢకాల్.ఒమన్..అకీబ్ ఇలియాస్ (కెప్టెన్), ప్రతీక్ అథవాలె, ఖాలిద్, మెహ్రాన్ ఖాన్, నసీమ్, కశ్యప్ ప్రజాపతి, షోయబ్ ఖాన్, జీషాన్ మక్సూద్, అయాన్ ఖాన్, నదీమ్, బిలాల్ ఖాన్, ఫయాజ్, కలీముల్లా, షకీల్ అహ్మద్, రఫీయుల్లా.పపువా న్యూ గినీ..అసద్ వాలా (కెప్టెన్), సెసె బావు, కిప్లిన్, హిరి హిరి, లెగా సియాక, టోనీ ఉరా, చార్లెస్ అమిని, సెమో కమెయి, జాన్ కరికో, కబువా, అలె నావో, చాద్ సోఫెర్, నార్మన్ వనువా, జేక్ గార్డెనర్, హిలా వరె.స్కాట్లండ్..రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, మైకేల్ జోన్స్, జార్జి మున్సే, లీస్క్, మెక్‌ములెన్, గ్రెవెస్, జార్విస్, షరీఫ్, క్రిస్ సోల్, మార్క్ వాట్, బ్రాడ్ వీల్, ఒలీ కార్టర్, బ్రాడ్లీ కరీ, చార్లీ టియర్.ఉగాండా..బ్రియాన్ మసాబా (కెప్టెన్), ఫ్రెడ్ అచెలమ్, దినేవ్ నక్రాని, అల్పేష్ రాంజానీ, కెన్నెత్ వైస్వా, బిలాల్ హసన్, కాస్మస్, రియాజత్ అలీషా, జుమా మయాగి, రోజర్ ముకాసా, ఫ్రాంక్ నుసుబుగా, రాబిన్సన్ ఒబుయా, రోనక్ పటేల్, హెన్రీ సెన్యోండో, సిమోన్ సెసాజి.అమెరికా..మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, నితీశ్ కుమార్, షాయన్ జహంగీర్, స్టీవెన్ టేలర్, కోరె అండర్సన్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, షాడ్లీ, హసన్ అలీఖాన్, జెస్సీ సింగ్, నోస్తుష్ కెంజిగె, సౌరభ్ నేత్రావల్కర్.వందల్లో ‘ఒక్కడు’... ప్లేయర్ ఆఫ్ ద సిరీస్...బరిలో డజను కంటే ఎక్కువ జట్లు.. 200 మంది కంటే ఎక్కువ ప్లేయర్లు.. చివరకు ఒక జట్టే విజేత.. టోర్నీ ఆసాంతం నిలకడగా రాణిస్తూ తమ జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించే వారుంటారు.. కొన్నిసార్లు వీరి ప్రదర్శన ఆయా జట్లను అందలాన్ని ఎక్కిస్తుంది.. లేదంటే టైటిల్‌కు చేరువ చేస్తుంది.. తుది ఫలితాలతో సంబంధం లేకుండా ఒకే ఒక్కడికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ రూపంలో పురస్కారం వరిస్తుంది. ఇప్పటి వరకు 8 సార్లు టి20 ప్రపంచకప్ జరగ్గా.. మూడుసార్లు మాత్రమే విజేత జట్టు నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం అందుకున్నవారున్నారు. వారి వివరాలు క్లుప్తంగా..2007షాహిద్ అఫ్రిది (పాకిస్తాన్)దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన తొలి టి20 ప్రపంచకప్ టోర్నీలో పాకిస్తాన్ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదికి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో అఫ్రిది 91 పరుగులు సాధించడంతోపాటు 12 వికెట్లు పడగొట్టాడు.2010కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్)ఏడాది తిరగకుండానే మూడో టి20 ప్రపంచకప్ జరిగింది. వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చింది. ఇంగ్లండ్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఇంగ్లండ్ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. మొత్తం ఆరు మ్యాచ్‌లు ఆడిన పీటర్సన్ 243 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.2009 తిలకరత్నే దిల్షాన్ (శ్రీలంక)ఇంగ్లండ్‌లో జరిగిన రెండో ప్రపంచకప్‌లో శ్రీలంక బ్యాటర్ తిలకరత్నే దిల్షాన్ నిలకడగా రాణించాడు. టోర్నీ మొత్తంలో ఏడు మ్యాచ్‌లు ఆడిన దిల్షాన్ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 317 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ పురస్కారం గెల్చుకున్నాడు. ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో ఓడిపోయి శ్రీలంక రన్నరప్‌గా నిలిచింది.2012షేన్ వాట్సన్ (ఆస్టేలియా)శ్రీలంకలో జరిగిన నాలుగో టి20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. ఫైనల్లో ఆతిథ్య శ్రీలంక జట్టును వెస్టిండీస్ ఓడించింది. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఈ టోర్నీలో వాట్సన్ 249 పరుగులు చేయడంతోపాటు 11 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్ చేరేందుకు దోహదపడ్డాడు. సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది.2014 విరాట్ కోహ్లీ (భారత్)వరుసగా రెండోమారు టి20 ప్రపంచకప్ ఆసియాలోనే జరిగింది. బంగ్లాదేశ్ ఈ మెగా టోర్నీకి తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో భారత జట్టును ఓడించి శ్రీలంక జట్టు తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సంపాదించాడు. ఆరు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 319 పరుగులు సాధించి ‘టాప్ స్కోరర్’గా నిలిచాడు.2016 విరాట్ కోహ్లీ (భారత్)వరుసగా మూడోమారు టి20 ప్రపంచకప్ ఆసియాలోనే జరిగింది. ఆరో టి20 ప్రపంచకప్‌కు తొలిసారి భారత్ వేదికయింది. వెస్టిండీస్ జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. సెమీఫైనల్లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓడిపోయింది. విరాట్ కోహ్లీ వరుసగా రెండో ప్రపంచకప్‌లోనూ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కైవసం చేసుకున్నాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ మూడు అర్ధ సెంచరీల సహాయంతో మొత్తం 273 పరుగులు సాధించాడు.2021డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)రెండేళ్లకోసారి జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీకి ఈసారి ఐదేళ్ల విరామం వచ్చింది. 2020లో భారత్ వేదికగా ఏడో టి20 ప్రపంచకప్ జరగాల్సింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ టోర్నీ ఒక ఏడాది వాయిదా పడింది. 2021లో ఒమన్–యూఏఈ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చాయి. ఫైనల్లో న్యూజీలండ్ను ఓడించి ఆస్ట్రేలియా తొలిసారి టి20 విశ్వవిజేతగా నిలిచింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఏడు మ్యాచ్‌లు ఆడి మూడు అర్ధ సెంచరీలతో కలిపి మొత్తం 289 పరుగులు సాధించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు గెల్చుకున్నాడు.2022స్యామ్ కరన్ (ఇంగ్లండ్)ఏడాది తిరిగేలోపు ఎనిమిదో టి20 ప్రపంచకప్ టోర్నీకి ఆస్ట్రేలియా తొలిసారి ఆతిథ్యమిచ్చింది. ఫైనల్లో పాకిస్తాన్‌ను ఓడించి ఇంగ్లండ్ జట్టు రెండోసారి చాంపియన్‌గా నిలిచింది. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ స్యామ్ కరన్ బంతితో మెరిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు. స్యామ్ కరన్ ఆరు మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు.టోర్నీ ఫార్మాట్..మొత్తం 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఐదు జట్లు ఉన్నాయి. ప్రతిజట్టూ తమ గ్రూప్‌లో ఉన్న మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. పాయింట్లపరంగా ప్రతిగ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు (మొత్తం 8) తర్వాత దశ సూపర్ ఎయిట్‌కు అర్హత సాధిస్తాయి. ఇక్కడ టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ప్రతిటీమ్ తన గ్రూప్‌లో ఉన్న మిగతా 3 జట్లతో తలపడుతుంది. టాప్–2 టీమ్స్ సెమీఫైనల్‌కు చేరతాయి. సెమీఫైనల్లో గెలిచిన రెండు జట్లు టైటిల్ కోసం ఫైనల్లో తలపడతాయి.గ్రూప్‌ల వివరాలు..గ్రూప్-ఎభారత్, పాకిస్తాన్, ఐర్లండ్, కెనడా, అమెరికా.గ్రూప్-బిఆస్ట్రేలియా, ఇంగ్లండ్, స్కాట్లండ్, ఒమన్, నమీబియా.గ్రూప్-సివెస్టిండీస్, న్యూజీలండ్, అఫ్గనిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినీ.గ్రూప్-డిశ్రీలంక, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, నేదర్లండ్స్, నేపాల్.టి20 వరల్డ్‌కప్ షెడ్యూల్ బ్రిడ్జ్‌టౌన్ గ్రౌండ్ ఫైనల్ మ్యాచ్ వేదిక..– మొహమ్మద్ అబ్దుల్ హాది, కరణం నారాయణ -
అదొక.. 'AI పొలిటికల్ అవతార్'!
ఈ సంవత్సరమే జరిగిన పాకిస్తాన్ సాధారణ ఎన్నికల్లో.. అవినీతి ఆరోపణల కింద ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యాడు. అతని పార్టీ పీటీఐ (పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్) తరఫున అతను పోటీ చేయడానికే కాదు.. ప్రచారం చేయడానికీ వీల్లేదని ఆ దేశపు సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రంగా బరిలోకి దిగారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ వేదికలుగా ఇమ్రాన్ ప్రచారం చేసిపెట్టాడు. ప్రసంగాలిచ్చాడు. అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. ఇమ్రాన్ ఖాన్ కోర్టు తీర్పును ధిక్కరించాడా? అయ్యో అస్సలు కాదు. జైల్లోనే ఉన్నాడు. మరి? ప్రచారం, ప్రసంగాలు చేసింది ఇమ్రాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అవతార్!ఒక్క పాకిస్తాన్‌లోనే కాదు ప్రపంచ రాజకీయాల్లో తన చిప్‌ని దూర్చేసింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్! దాదాపు 50కి పైగా దేశాలకు ఇది ఎన్నికల సంవత్సరం. సుమారు రెండు బిలియన్ల (రెండువందల కోట్లు) మంది ఓటును వినియోగించుకుంటున్నారు. అమెరికా టు ఆఫ్రికా, ఆసియా టు ఐరోపాలోని దేశాల్లో జరిగే ఈ ఎన్నికల్లో పాలసీ మ్యాటర్స్, ప్రచారం .. పాజిటివ్, నెగటివ్ రెండు కోణాల్లో ఏఐదే ప్రధాన పాత్ర! అందుకే 2024, గ్లోబల్ ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సంవత్సరాన్ని ఏఐ ఎలక్షన్స్ ఇయర్ అంటున్నారు. ఈ సందర్భంగా.. మన దగ్గర స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సాంకేతికత అందిపుచ్చుకుంటున్న ఈ క్షణం దాకా ఎన్నికల ప్రచారాల్లో వస్తున్న మార్పుల వెంట సరదాగా నడిచొద్దాం..దేశానికి స్వాతంత్య్రం వచ్చిన కొన్ని దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారమంటే అగ్రనేతలు నిర్వహించే బహిరంగ సభలే! ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికలకి వస్తే.. ఖాదీ వస్త్రధారణ, పవర్ఫుల్ స్లోగన్సే ప్రచారస్త్రాలుగా ఉండేవి. 1965లో లాల్‌బహదూర్ శాస్త్రి ‘జైజవాన్ జై కిసాన్’తో మొదలైందీ ఎన్నికల నినాద యాత్ర. ఉత్తరప్రదేశ్, ప్రయాగ్‌రాజ్‌లోని ఉరువా బహిరంగ సభలో ఆ నినాదాన్నిచ్చారు ఆయన. చైనా, పాకిస్తాన్లను దృష్టిలో పెట్టుకుని.. సరిహద్దు గట్టి రక్షణకు సైనికుల బలాన్ని, వ్యవసాయాధారిత మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక రైతులే కాబట్టి వాళ్ల సంక్షేమాన్ని కాంక్షిస్తూ.. ఆ రెండు వర్గాలకు తమ సర్కారు అండగా ఉంటుందనే భరోసాను కల్పించడానికి శాస్త్రి ఆ స్లోగన్ని అందుకున్నారు. అది వైరలై నేటికీ లైవ్‌గానే ఉంది.1971లో ఇందిరాగాంధీ ఇచ్చిన ‘గరీబీ హటావో (పేదరిక నిర్మూలన)’ నినాదం కాంగ్రెస్‌కి ల్యాండ్‌స్లైడ్ విక్టరీని తెచ్చిపెట్టింది. అయితే ఆ నినాదానికి యాంటీగా ప్రతిపక్షాలు.. ‘గరీబీ కాదు గరీబోంకో హటారహే (పేదరికాన్ని కాదు పేదలను నిర్మూలిస్తోంది)’ అంటూ ఆమెను ట్రోల్ చేశాయి. 1975 ఎమర్జెన్సీ తర్వాత 1977 ఎన్నికలప్పుడు జనతా పార్టీ ‘ఇందిరా హటావో దేశ్ బచావో’ స్లోగన్‌తో విజయం సాధించింది. ఇందిరా హత్య తర్వాత 1984 ఎన్నికల్లో ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా.. ఇందిరా తేరా నామ్ రహేగా (సూర్యచంద్రులు ఉన్నంతవరకు ఇందిరా నీ పేరుంటుంది)’ నినాదంతో కాంగ్రెస్ గెలుపొందింది.1989లో వీపీ సింగ్ ‘రాజా నహీ ఫకీర్ హై.. దేశ్ కీ తక్దీర్ హై (రాజు కాదు పేద.. ఆయనే ఈ దేశపు భాగ్యప్రదాత)’ స్లోగన్‌తో ఎన్నికలను జయించి ప్రధాని అయ్యాడు.1996 స్లోగన్ ‘బారీ బారీ అబ్ కీ బారీ అటల్ బిహారీ’ ఎంత పాపులరో వేరేగా చెప్పక్కర్లేదు. ఆ తర్వాత వరుసగా ‘ఇండియా ఈజ్ షైనింగ్’, ‘కాంగ్రెస్ కే హాత్ ఆమ్ ఆద్మీ కే సాథ్ (కాంగ్రెస్ హస్తం.. సామాన్యుడికి ఆపన్న హస్తం)’ నినాదాలు ఆయా పార్టీల ఐడెంటిటీలుగా మారాయి. అయితే నినాదాల పవర్ సోషల్ మీడియా ఇరాలోనూ కొనసాగుతోంది. ‘అచ్ఛే దిన్ ఆలే వాలే హై (మంచి రోజులు రానున్నాయి)’, ‘హాత్ బద్లేగా హాలాత్ (హస్తం మార్పును తెస్తుంది), ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’, ‘అబ్ కీ బార్ చార్సౌ పార్’ వంటి నినాదాలే అందుకు నిదర్శనం.స్వాతంత్య్రం వచ్చిన ఓ రెండుమూడు దశాబ్దాల వరకు ఎన్నికల ప్రచారంలో రేడియో కూడా ప్రధాన పాత్ర పోషించింది. దశాబ్దం కిందటి వరకు పత్రికలు, టీవీల్లో అడ్వర్టైజ్మెంట్స్ ఆ రోల్‌ని తీసుకున్నాయి. వీటితోపాటు గోడ పత్రికలు, పాంప్లెట్స్, వాల్ రైటింగ్స్ కూడా తమ ఉనికిని చాటాయి. ప్రైవేట్ చానళ్ల పర్వం మొదలయ్యాక అవీ తమ ఇన్‌ఫ్లుయెన్స్‌ని చూపించాయి. నేతల ప్రచార యాత్రలూ ఆయా పార్టీల జయాపజయాలను ప్రభావితం చేశాయి. వాటిల్లో ఆడ్వాణీ రథ యాత్ర ఒకటి. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచినప్పటికీ రైట్ వింగ్ ఐడియాలజీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఫలితంగా ఆ తర్వాత ఐదేళ్లలోనే కేంద్రంలో ఆ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకునేలా చేసింది.రిగ్గింగ్ చేస్తున్నట్టు..స్లొవేకియాలో నిరుడు జరిగిన ఎన్నికల్లో.. ప్రధాన పార్టీల తరఫున నిలబడిన వ్యక్తి ఆడియో టేప్ సంచలనంగా మారింది. ఆ టేప్‌లో.. తాను ఎలా రిగ్గింగ్ చేయబోతున్నాడో మరొకరికి విపులంగా వివరిస్తున్నాడు. ఆ ఆడియో బయటకు వచ్చాక సదరు నేత ఎన్నికల్లో ఓడిపోయాడు. అతనికి అమెరికా, నాటో దేశాలను సమర్థించే వ్యక్తిగా పేరుంది. అందుకే అతన్ని ఎన్నికల్లో ఓడించేందుకు ఏఐ సాయంతో రష్యన్ ఏజెన్సీలు డీప్‌ఫేక్ ఆడియోను çసృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశాయి అమెరికా అనుకూల అభ్యర్థి ఓటమికి దారులు వేసి, రష్యన్ అనుకూల వ్యక్తిని గెలిపించుకున్నాయి. ఎన్నికల అనంతరం యూఎస్ చేపట్టిన సమగ్ర విచారణలో ఈ అంశం వెలుగు చూసింది.జంతువులతో పోల్చినట్టు..ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండోనేషియా ఎన్నికలపైనా ఏఐ ఎఫెక్ట్ పడింది. ప్రభుత్వాధినేత ప్రభోవో సుబియాంటో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఉపాధ్యక్షుడు గిబ్రాన్ రకాబుమ్మింగ్ తీవ్రంగా విమర్శిస్తున్న వీడియో అక్కడ సంచలనమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుకునే వ్యక్తులను ఉపాధ్యక్షుడు ‘జూ’లోని జంతువులతో పోల్చినట్టుగా ఉందీ వీడియోలో. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం ఈ వీడియోపై విచారణ జరిపించింది. గిబ్రాన్ పాత వీడియోకు ఏఐ జనరేటెడ్ వాయిస్‌ను జోడించి ఫేక్ వీడియో క్రియేట్ చేసినట్టుగా తేలింది.తప్పుకుంటున్నట్టు..ఈ సంవత్సరం మొదట్లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో అబ్దుల్లా నహీద్.. స్వతంత్ర అభ్యర్థిగా గాయ్బంధా నుంచి బరిలోకి దిగారు. ఎన్నికల పోరులో గెలుపు కోసం అతను శ్రమిస్తుండగా.. హఠాత్తుగా ఓ వీడియో బయటకు వచ్చింది. అతను పోటీ నుంచి తప్పుకుని ప్రత్యర్థికి మద్దతు ఇస్తున్నట్టుగా! దీంతో అప్పటి వరకు నహీద్‌కు వచ్చిన ప్రచార ఊపంతా గంగపాలైంది. చివరకు ఆ వీడియో డీప్ ఫేక్‌గా నిర్ధారణైంది.సోషల్ మీడియా..తొంభైయ్యవ దశకంలో ఎన్నికల ప్రచారం పేరుతో అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం మొదలైంది. సామాన్యులు పోటీలో నిలబడి తమ సిద్ధాంతాలను ప్రచారం చేసుకునే పరిస్థితి లేకుండా పోయింది. దాంతో రాజకీయ ప్రచారంపై ఎన్నికల కమిషన్ నజర్ పెట్టింది. కొత్త నియమ నిబంధనలను తీసుకొచ్చింది. అలా రాజకీయ ప్రచారానికి హద్దులు నిర్దేశమవుతున్న తరుణంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ఎన్నికల ప్రచారంలో భాగం పంచుకున్నాయి. ఆ తర్వాత కొద్ది కాలానికే ఇంటర్నెట్ విప్లవం వచ్చి పడింది. సోషల్ మీడియాను మోసుకొచ్చింది. అంతే ఈమెయిల్స్, వాట్సాప్ మొదలు యూట్యూబ్, ఫేస్బుక్, టెలిగ్రామ్, ఎక్స్, ఇన్‌స్టా లాంటి సోషల్ మీడియా పాపులర్ ప్లాట్‌ఫామ్స్ జనాలకు చేరువయ్యాయి. ఆదిలోనే వాటి ఇంపాక్ట్‌ని గ్రహించి.. సమర్థవంతంగా వాడుకున్న పార్టీగా బీజేపీకి పేరుంది. గుజరాత్లో మొదలైన మోదీ వేవ్ 2014లో సోషల్ మీడియా వేదికగా దేశమంతటా విస్తరించడానికి కారణమైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంట్రీ..సోషల్ మీడియా ప్రచారాన్ని రాకెట్లోకి ఎక్కించి ఆకాశం అందుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స(ఏఐ) ఎంట్రీ ఇచ్చింది. 2013 నుంచే ఏఐ వాడకం మొదలైనా అది శైశవ దశ. ఇప్పుడు ఏఐ యవ్వన దశకు చేరుకుంది. సరదాగా మొదలైన ఏఐ వాడకం ప్రొఫెషన్స్సకి ఉపకరణంలా మారింది. ఇప్పుడు మరింతగా ముదిరి ఎన్నికల ప్రక్రియలో భాగమైంది. దేశ భవిష్యత్తును నిర్దేశించే ఓటును వినియోగించుకునేందుకు అందుబాటులో ఉన్న సమాచారం ఎంతో కీలకం. తమకు తెలిసిన, తమ దగ్గరకు వస్తున్న సమాచారం ఆధారంగానే ఓటరు నిర్ణయం ప్రభావితం అవుతుంది. కానీ ఇప్పుడు గెలుపే పరమావధిగా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐని తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయడానికి వినియోగిస్తున్నారు. ఇలా చేస్తున్న వారిలో రాజకీయాల్లోని వ్యక్తులతో పాటు ఆకతాయిలూ ఉంటున్నారు. ఫలితంగా అగ్రరాజ్యమైన అమెరికా నుంచి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ వరకు అంతటా ఎన్నికల ప్రక్రియ కుదుపునకు లోనయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏఐ వాడి, వేడికి అమెరికా, యూరప్‌లలో ఫెయిర్ ఎలక్షన్స్స కోరుకునే ప్రజాస్వామ్యవాదులకు దడ మొదలైంది.ఆర్థిక, ఆయుధ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రపంచంపై అమెరికా ఆధిపత్యం తెలియంది కాదు. అమెరికా తన దగ్గరున్న టెక్నాలజీ సాయంతో ఇండియాలో మన చేతికి ఉన్న వాచిలో టైమ్ ఎంతో చూడగలదని చెబుతుంటారు. అంతటి అమెరికా అధ్యక్షుడికే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్స చుక్కలు చూపిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో! డెమొక్రాట్ల తరఫున బైడెన్, రిపబ్లికన్ ల తరఫున డోనాల్డ్ ట్రంప్‌లు ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. ఏఐ ద్వారా వచ్చే సమస్యలను ఎదుర్కోవడం వారికీ సవాలుగా మారిందనడంలో సందేహం లేదు.ఇమ్రాన్ ఖాన్ ప్రసంగిస్తున్న వీడియోఇద్దరినీ..తైవాన్ ఎన్నికల సందర్భంగా ఆ దేశ అధ్యక్షుడు సైయింగ్ వెన్ లక్ష్యంగా అనేక ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిల్లో ఆ దేశానికి చెందిన ప్రముఖ న్యూస్ యాంకర్‡దేశాధ్యక్షుడిని ఇంటర్వ్యూ చేసినట్టుగా ఉన్ని వీడియో ఒకటి. అందులో చైనా – తైవాన్ సంబంధాలపై దేశ అధ్యక్షుడి ప్రతిష్ఠకు భంగం కలిగేలా సమాచారం వ్యాప్తి చేశారు. ఈ డీప్‌ఫేక్ వీడియోలో అధ్యక్షుడి వాయిస్‌నే కాదు న్యూస్ యాంకర్‌నూ ఏఐ ద్వారా సృష్టించారు.ఘాటైన వ్యాఖ్యలు!బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల వారణాసి వెళ్లారు. అక్కడ జరిగిన అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడారు. అయితే కొద్ది రోజులకే ఏఐ సాయంతో రణ్‌వీర్‌సింగ్ వాయిస్‌ను క్లోన్ చేసి అదే వీడియోను సోషల్ మీడియాలో వదిలారు. అందులో.. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, మోడీ అసంబద్ధ విధానాలపై రణ్‌వీర్‌సింగ్ ఘాటైన వ్యాఖ్యలు చేసినట్టుగా ఉంది. అంతేకాదు దేశ భవిష్యత్తు కోసం రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు ఓటేయాలని కోరినట్టుగా ఉంది. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయింది. వెంటనే తేరుకున్న రణ్వీర్ సింగ్ కుటుంబం సదరు తప్పుడు సమాచారాన్ని షేర్ చేసిన వారిపై కేసు పెట్టింది. మరో హీరో ఆమిర్‌ఖాన్ కూ ఇలాంటి అనుభమే ఎదురైంది.ఇమ్రాన్ .. నీకు నేనున్నాను!ఈ మార్చి మొదట్లో ట్రంప్ మాట్లాడుతున్న వీడియో ఒకటి అమెరికాలో వైరల్ అయింది. అందులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ును ఉద్దేశిస్తూ ట్రంప్ చెప్పిన మాటలు అమెరికాలో సంచలనం కలిగించాయి. త్వరలో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను విజయం సాధిస్తే, ప్రస్తుతం జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను విడిపిస్తానని, అమెరికా– పాకిస్తాన్ ల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తానని ట్రంప్ మాట్లాడినట్టుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై నలువైపులా విమర్శలు చుట్టుముట్టాయి. చివరకు టెక్నోక్రాట్స్, అమెరికన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు రంగంలోకి దిగి దర్యాప్తు జరిపితే.. అది ఏఐ యాప్ ద్వారా తయారైన డీప్ ఫేక్ వీడియో అని తేలింది. ట్రంప్ మాట్లాడుతున్న పాత వీడియోలు, ట్రంప్‌ను పోలిన ఏఐ వాయిస్ సాయంతో కొత్త వీడియోను తయారుచేసి వదిలారు. అది నిజామా.. కాదా? అని తెలుసుకునేలోపు ఆ వీడియో సగం అమెరికాను చుట్టొచ్చింది.అంతేకాదు న్యూహాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికలప్పుడు.. అక్కడి ఓటర్లకు ఫోన్ కాల్స్ వచ్చాయి. అందులో బైడెన్ స్వయంగా.. ప్రైమరీ ఎన్నికల్లో ఓటు వేయద్దంటూ ఆ ఓటర్లను కోరారు. ఈ ఎన్నికల్లో సేవ్ చేసిన ఓటును త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు కోసం ఉపయోగించాలంటూ విజ్ఞప్తి చేశారు. గతంలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్, ట్రంప్‌ల మధ్య విజయం దోబూచులాడింది. ఓట్ల లెక్కింపు అంశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ నేపథ్యంలో బైడెన్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ నిజమేనేమోనని సగటు అమెరికన్ ఓటరు నమ్మే పరిస్థితి నెలకొంది. కానీ విచారణలో ఏఐ సాయంతో బైడెన్ వాయిస్‌ను సృష్టించి ఆ కాల్స్ చేసినట్టు తేలింది. ఇలా అసలు జరగని విషయాన్ని కచ్చితంగా జరిగిందన్నట్టుగా మన పంచేద్రియాలను నమ్మించడం సులువైపోయింది.మన దగ్గర..అమెరికన్ ర్యాపర్ లిల్ యాచీ నడక ఆధారంగా.. ప్రధాని నరేంద్ర మోదీని డిక్టేటర్‌గా పేర్కొంటూ రూపొందిన ఏఐ మీమ్.. ఎక్స్‌లో పోస్ట్ అయిన క్షణాల్లోనే వైరల్ అయింది. ఆ వెంటనే దేశంలో అనేక మంది రాజకీయ నాయకుల ఏఐ మీమ్స్, ఏఐ అవతార్లు స్క్రీన్ మీదకు వచ్చాయి. ఆఖరికి ఈ ఏఐ మీమ్స్ ట్రెండ్‌పై సాక్షాత్తు ప్రధాని ‘నా మీద చేసిన మీమ్ చాలా క్రియేటివ్‌గా ఉంది. ఎన్నికల ఒత్తిడితో సతమతమవుతున్న నేను దీన్ని చూసి భలే రిలాక్స్ అయ్యాను’ అని స్పందించారు. భారతీయ జనతా పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారానికి ఏఐని వాడుకుంటోంది. ప్రధాని మోదీ హిందీ సంభాషణను ఏఐ సాయంతో ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి మార్చింది.నేరుగా దేశ ప్రధానే తమ సొంత భాషలో తమతో మాట్లాడారు అని ప్రజలు మురిసిపోయారు. సాంకేతికతను ఒడిసిపట్టుకున్నామని బీజేపీ ఆనందంతో గంతులేసింది. అదే విధంగా గడిచిన పదేళ్లలో భారత్ ఎలా అభివృద్ధి చెందిందనే అంశాలపైనా ఏఐ సాయంతో వీడియో రూపొందించి జనాల్లోకి వదిలింది. ప్రచారంలో దూసుకుపోయింది. ఏఐని మంచికి వాడుకుంటే తప్పులేదు. ప్రజలను భ్రమల్లోకి నెట్టాలనుకుంటేనే ప్రమాదం. ప్రపంచంలోనే ఏ దేశానికి లేనంత యువ జనాభా మన సొంతం. ఈ యువ భారతానికి స్పీడెక్కువ.సోషల్ మీడియా అధికంగా ఉపయోగించేది వీళ్లే. ఈ ఉడుకు రక్తానికి సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారా.. నిజాన్ని తలదన్నేలా ఏఐ తయారుచేస్తున్న తప్పుడు సమాచారం అందితే? దాని ఆధారంగా వారి ప్రయాణం సాగితే? వ్యక్తులుగా వారికి, వ్యవస్థగా దేశానికి తీరని నష్టం. రెచ్చగొట్టే సభలు, సమావేశాలు, తప్పుడు ప్రకటనలనైతే అడ్డుకోవచ్చు. కానీ చేతిలో ఇమిడిపోయే ఫోన్లను టాయిలెట్లకు సైతం తీసుకుపోతున్న కాలంలో.. నియంత్రణ లేకుండా కనురెప్ప పాటులో సోషల్ మీడియా ద్వారా బట్వాడా అవుతున్న అబ్ధాలను అడ్డుకోవడమెలా?మరణించిన వ్యక్తి ప్రచారం..2019లో.. తమిళనాడు, కన్యాకుమారి నుంచి వసంత్ కుమార్ ఎంపీగా ఎన్నికయ్యారు. అయితే 2020లో ఆయన మరణించారు. మొన్నటి ఏప్రిల్ 19న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కొడుకు విజయ్‌కుమార్ పోటీ చేశారు. అయితే పోలింగ్‌కు కొన్ని రోజుల ముందు తన కొడుకు విజయ్ను గెలిపించాలంటూ వసంత్‌కుమార్ కోరుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది. 2020లో చనిపోయిన వసంత్ 2024లో ఎలా ప్రచారం చేశాడా అని జనాలు అవాక్కయ్యారు. అయితే అది డీప్‌ఫేక్ సాయంతో రూపొందించిన వీడియోగా తేలింది.ఫ్యాక్ట్ చెక్ ఉన్నా..సాంకేతికంగా రోజుకో కొత్త ఆవిష్కరణ పుట్టుకొస్తున్న ఆధునిక యుగంలో ప్రతి చెడును చట్టాలతో అరికట్టడం ఒకింత కష్టమే! అనుమానం ఉన్న కంటెంట్‌ను పట్టుకుని, దానికి ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి నిజానిజాలు తేల్చడం ఖర్చు, కాలంతో కూడుకున్న పని. ఫ్యాక్ట్ చెక్, ట్రూత్ ఫైండర్, ఫేక్‌న్యూస్ తదితర పద్ధతుల్లో అసలు ఏదో నకిలీ ఏదో తెలుసుకోవడం సంక్లిష్టంగా మారింది. డిజిటల్ లిటరేట్సే కానీ డిజిటల్ ఎడ్యుకేట్స్ లేదా డిజిటల్లీ చాలెంజ్డ్ జనాభా ఉన్న దేశాల్లో.. అందుబాటులో ఉన్న సమాచారాన్ని పలురకాలుగా వడబోస్తే తప్ప అసలైన విషయం బటయకు రాదు. కానీ అసలు నిజం వెలుగు చూసేలోగా అబద్ధం ప్రపంచాన్ని చుట్టి వస్తోంది.ముల్లును ముల్లుతోనే..ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా టెక్నాలజీ ఆధారంగా జరుగుతున్న తప్పుడు సమాచార ప్రచారానికి చెక్ పెట్టాలంటే తిరిగి టెక్నాలజీనే ఆయుధంగా మలచుకోవాలి. సాంకెతిక నైపుణ్యంతో సృష్టిస్తున్న అభూత కల్పనలను ఇట్టే పసిగట్టి హెచ్చరించి, నిరోధించే ప్రత్యామ్నాయ యాప్‌లను డెవలప్ చేయడంపై భావి ఆవిష్కర్తలు దృష్టి సారించాలి. లేదంటే నీడే నిజమనే భ్రాంతిలో బతకాల్సి వస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా, ఎక్స్, ఓపెన్ ఏఐ, టిక్‌టాక్‌లు తమ ఫ్లాట్‌ఫామ్స్‌పై డీప్‌ఫేక్ ద్వారా జరిగే ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటామని హామీ ఇచ్చాయి. ఈ మేరకు ఫేక్ను గుర్తించే వ్యవస్థలను మరింత సమర్థంగా రూపొందిస్తామని వెల్లడించాయి.ఎన్నికల వ్యవస్థలోకి ఏఐని జొప్పించి చేస్తున్న విష ప్రచారంపై పాశ్చాత్య ప్రపంచం మేల్కొంది. ఏఐని ఎలా ఎదుర్కొవాలనే అంశంపై చర్చలను నిర్వహిస్తోంది. మారిన పరిస్థితులకు తగ్గట్టుగా చట్టాలను రూపొందించాలని ప్రపంచ దేశాలకు సూచనలు చేస్తోంది. ఏఐని అరికట్టేందుకు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల సహకారంతో అంతర్జాతీయ స్థాయి చట్టాల రూపకల్పనకు సమయం ఆసన్నమైందని పోరుతోంది.యంత్రమా.. హృదయ స్పందనా..వందమంది చేసే పనిని ఒక్క యంత్రమే చేయగలదు. మనిషి కంటే ఎన్నో రెట్లు శక్తి సామర్థ్యాలు యంత్రాల సొంతం. ఇప్పుడా యంత్రాలకు మరింత మెరుగ్గా ఆలోచించే శక్తిని ఏఐ అందిస్తోంది. అయితే ఎన్ని శక్తియుక్తులు ఉన్నా మనిషి స్పృహ, హృదయ స్పందన ముందు అవన్నీ దిగదుడుపే.ముగింపు..సంప్రదాయం, సాంకేతికతకు ఎప్పుడూ ముడిపడదు. ఆ పోరులో టెక్నాలజే ఓ మెట్టు పైన ఉంటుంది. కాలానికి తగ్గట్టు మారాల్సిందే. తప్పదు.. తప్పు లేదు. అయితే మంచిచెడులను బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలి. మొదటి, రెండో ప్రపంచ యుద్ధాల పర్యవసానాలు అనుభవించిన తర్వాత ప్రపంచ దేశాలు అణ్వాయుధాల తయారీ మీద స్వీయ నియంత్రణను పాటిస్తున్నాయి. జీవాయుధాల తయారీ, సాగులో బయోటెక్నాలజీ వినియోగం తదితర అంశాల మీద ఓ కన్నేసి ఉంచాయి. కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఏఐ వాడకం వంటి వాటి నియంత్రణ మీదే ఇంకా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ప్రపంచ దేశాలన్నీ ఐక్యం కావాల్సిన సందర్భం వచ్చింది అంటున్నారు సామాజిక, రాజకీయ విశ్లేషకులు. – తాండ్ర కృష్ణ గోవింద్ -
తల్లీ.. నిన్ను దలంచి! దేశదేశాన మాతృవందనం!
ప్రేమ.. త్యాగం.. భరోసా.. భద్రత.. అని ఏ భాషలో గూగుల్ చేసినా వాటన్నిటికీ, అన్ని భాషల్లో ‘అమ్మ’ అన్న ఒకే మాటను చూపిస్తుందేమో గూగుల్! అలాగే బంధాలు, అనుబంధాల్లో టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అయిందే అమ్మే! ఇంట్లో వాళ్ల గారాం.. మారాం.. అలక.. కోపం.. విసుగు.. చిరాకు– పరాకు.. ఆనందం.. అసహనం.. అలక్ష్యం.. అవమానం.. అవహేళన.. మోసం.. కుట్ర.. కుతంత్రం.. వంటి అన్ని భావోద్వేగాలుచ లక్షణాలకు బలయ్యేది అమ్మే! శక్తిసామర్థ్యాలు, ఓర్పు, ఔదార్యల్లో అమ్మను మించిన వారుండరేమో! అయినా ఆత్మగౌరవ విషయంలో అమ్మదెప్పుడూ లోప్రొఫైలే! అమ్మ లేకపోతే ఇంటికి ఆత్మ లేదు! అది హోమ్ కాదు గోడలు, చూరున్న ఒట్టి హౌస్ మాత్రమే!అందుకే తెలంగాణలో ఒక సామెత ఉంది.. ఏనుగంటి తండ్రి వెనుకపడ్డా.. ఎలుకంత తల్లి ముందుండాలి అని! తన సుఖదుఃఖాలు, సాధకబాధకాలతో సంబంధం లేకుండా.. ఇంటిల్లిపాది సంక్షేమం కోసం పాటుపడుతుంది. పిల్లల వృద్ధికి దారి చూపే మైలు రాయిలా నిలబడుతుంది! అందుకే అమ్మ సెంటిమెంట్ కాదు.. ఆలోచనాపరురాలు! తన సంతానంలోని హెచ్చుతగ్గులను బలమైన పిడికిలిగా మలచే నాయకురాలు! అమ్మకు ఆ సహనం ఉంది కాబట్టే కుటుంబం ఇంకా ఉనికిలో ఉంది! ఆమె నీడన సేదతీరుతోంది! అందుకే అమ్మ నిత్యపూజనీయురాలు! ఆమె పట్ల మనసులోనే దాచుకున్న ఆ ప్రేమను.. గౌరవాన్ని ఏడాదికి ఒక్కరోజైనా ప్రదర్శిద్దాం.. మాతృదినోత్సవంగా!ఆధునిక ప్రపంచంలో ‘మదర్స్ డే’కి అమెరికా నాంది పలికినా.. ఏనాటి నుంచో అమ్మ గొప్పదనాన్ని కొనియాడుతూ వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయ రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్న దేశాలున్నాయి. ప్రాచిన గ్రీస్‌లో గాయియా(భూమాత), రియా(సంతాన దేవత)లకు ఏడాదికి ఒకసారి భారీ ఎత్తున పూజలందించేవారట. దీన్నే తొలి ‘మదర్స్ డే’ వేడుకగా భావిస్తారు గ్రీకు దేశస్తులు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని ‘మదరింగ్ సండే’ కూడా ‘మదర్స్ డే’ లాంటిదే.అయితే వీటన్నిటికీ భిన్నమైంది మే రెండో ఆదివారం జరుపుకుంటున్న మోడర్న్ మదర్స్ డే కాన్సెప్ట్! అమెరికా, వర్జీనియాకు చెందిన ఏన్ రీవ్స్ జర్విస్ అనే సామాజిక కార్యకర్త.. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తల్లులకు పిల్లల సంరక్షణ గురించి శిక్షణనిచ్చేది. పరిసరాల పరిశుభ్రతను బోధించేది. పోషకాహార లోపం, క్షయ వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళా కార్మికుల కోసం విరాళాలు సేకరించి వారికి కావలసిన మందులు, పోషకాహారాన్ని సమకూర్చేది. ఆమె ఈ సేవకు స్థానిక వైద్యులు తమ వంతు సాయం అందించేవారు.ఇది క్రమంగా చుట్టుపక్కల పట్టణాలకూ విస్తరించింది. సివిల్ వార్ టైమ్‌లో ఈ క్లబ్బులు ఇరువర్గాల బాధితులకు ఆహారం, దుస్తులను అందించాయి. హింస ప్రజ్వరిల్లుతున్న ఆ సమయంలో శాంతి నెలకొల్పడానికి ఏన్ జర్వీస్ చాలా కృషి చేసింది. రాజకీయ సిద్ధాంతాలు, అభిప్రాయాలకు అతీతంగా తన చుట్టుపక్కల ప్రాంతాల తల్లులందరి మధ్య స్నేహసంబంధాలను నెలకొల్పడానికి ‘మదర్స్ ఫ్రెండ్షిప్ డే’ పేరుతో సభను ఏర్పాటు చేసింది. పెద్ద ఎత్తున హాజరైన తల్లులతో ఆ సభ విజయవంతమైంది. ఏటా అదొక ఈవెంట్‌లా కొన్నేళ్లపాటు కొనసాగింది. తర్వాత ఏన్ ఫిలడెల్ఫియాలోని తన కొడుకు, కూతుళ్ల దగ్గరకు వెళ్లిపోయి.. 1905, మే 9న కన్ను మూసింది.జీవితాన్ని సేవకే అంకితం చేసిన ఏన్ జర్విస్ సంస్మరణార్థం ఆమె కూతురు అనా జర్విస్ 1907, మే 12 న ఒక సభను ఏర్పాటు చేసింది. ‘మదర్స్ డే క్లబ్స్’ పేరుతో తన తల్లి అందించిన సేవలకు గుర్తుగా ‘మదర్స్ డే’కి జాతీయ గుర్తింపు రావాలని, ఆ రోజున తల్లులందరికీ సెలవు ఇవ్వాలనే క్యాంపెయిన్ స్టార్ట్ చేసింది. ఇది ఆరేళ్లపాటు కొనసాగింది. ఆమె పట్టుదల ఫలితంగా నాటి అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్.. ప్రతి మే రెండో ఆదివారాన్ని ‘మదర్స్ డే’గా.. జాతీయ సెలవుదినంగా ప్రకటించాడు. తర్వాత అనా ‘మదర్స్ డే ఇంటర్నేషనల్ అసోసియేషన్’ నూ స్థాపించింది. ఉన్నత∙ఆశయంతో మొదలైన ‘మదర్స్ డే’ 1920 కల్లా వ్యాపారానికి అనువైన వేడుకగా మారిపోయింది.ఆ రోజున గ్రీటింగ్ కార్డ్స్, పూలు, రకరకాల కానుకలను అమ్ముతూ క్యాష్ చేసుకోసాగాయి సదరు కంపెనీలు! అమ్మలకు గ్రీటింగ్ కార్డ్స్, పువ్వులు, కానుకలు ఇవ్వడమే ‘మదర్స్ డే’ సంప్రదాయమైంది. అంతేకాదు అనా జర్విస్ వాళ్లమ్మకు ఇష్టమైన పువ్వులంటూ కార్నేషన్ ఫ్లవర్స్ ప్రసిద్ధికెక్కాయి. ఈ ధోరణికి కంగారు పడిపోయింది అనా జర్విస్. ‘మదర్స్ డే’ అనేది ఓ సెంటిమెంట్‌గా ఉండి ఆ సెలవు అమ్మలకు కలసి వస్తుంది అనుకుంటే అదేదో మార్కెట్ ప్రాఫిట్ డేగా మారుతోందని కలత చెందింది. అందుకే తన శేష జీవితమంతా ఈ రకరమైన మార్కెట్ సెలబ్రేషన్స్‌ని వ్యతిరేకిస్తూ మళ్లీ ఓ క్యాంపెయిన్ నడిపింది అనా. అది ఫలించకపొగా గ్లోబలైజేషన్ తర్వాత మే రెండో ఆదివారం వచ్చే ‘మదర్స్ డే’ గ్లోబల్ ఈవెంట్ అయింది. ఈ కథనానికి సందర్భమూ అదే అనుకోండి!అయితే మొదట్లో ప్రస్తావించినట్టు చాలా దేశాలు తమ తమ సంస్కృతీ సంప్రదాయల నేపథ్యంలో భిన్న మాసాలు.. భిన్న తేదీల్లో విభిన్న రీతుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. మే రెండో ఆదివారం మదర్స్ డే చేసుకునే దేశాలతోపాటు ఆ విభిన్న రీతులేంటో కూడా చూద్దాం!ప్రతి సంవత్సరం.. ‘మదర్స్ డే’ నాడు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల ఫోన్ కాల్స్ రికార్డ్ అవుతాయట.క్రిస్మస్, ఏnuజుజ్చుజి తర్వాత పూలు, మొక్కలు అత్యంతగా అమ్ముడుపోయే మూడో అతి పెద్ద వేడుక.. మదర్స్ డే!ఏడాది మొత్తంలో అమ్ముడు పోయే పూలల్లో నాలుగింట ఒక వంతు పూలు మదర్స్ డే రోజునే అమ్ముడుపోతాయి.ప్రపంచంలోని చాలా రెస్టారెంట్స్‌కి మదర్స్ డే బిజీయెస్ట్ డే.మదర్స్ డే సంప్రదాయ కానుక.. సింగిల్ కార్నేషన్.ప్రపంచంలోని చాలా భాషల్లో ‘అమ్మ’ అనే పదం ఎమ్తోనే మొదలవుతుందట.ఇటలీలో మదర్స్ డే రోజున రోజువారీ పనుల నుంచి అమ్మకు సెలవు దొరుకుతుంది. ఆ రోజు ఆమెను మహారాణిలా ట్రీల్ చేస్తారట కుటుంబ సభ్యులంతా!ఒంటరి తల్లులకు అండగా.. ఆస్ట్రేలియాలో 1924 నుంచి మే రెండవ ఆదివారం నాడు మాతృదినోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రారంభమైంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చాలా మంది అమ్మలు తమ భర్తలను, కొడుకులను కోల్పోయారు. ఆ మాతృమూర్తుల విషాదాన్ని పంచుకుంటూ.. ఆ ఒంటరి తల్లులకు అండగా నిలబడింది జానెట్ హేడెన్ అనే మహిళ. ప్రతి మే నెల రెండో ఆదివారం నాడు జానెట్ ఆ అమ్మల దగ్గరకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెబుతూ తనకు తోచిన కానుకలను అందించసాగింది. జానెట్‌ను చూసి స్ఫూర్తిపొందిన చాలా మంది ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. అలా ఏ ఏటికి ఆ ఏడు ఫాలోవర్స్ పెరిగి అదొక సంప్రదాయంగా స్థిరపడిపోయింది. అయితే ఆస్ట్రేలియాలో మే చలికాలం కాబట్టి ఆ సమయంలో అక్కడ విరగబూసే చేమంతులే మదర్స్ డే సంప్రదాయ పువ్వులుగా అమ్మల సిగల్లోకి చేరుతున్నాయి.పబ్లిక్ హాలీడే కాదు.. పోలండ్‌లో ‘మదర్స్ డే’ను మే 26న జరుపుకుంటారు. అయితే అదక్కడ పబ్లిక్ హాలీడే కాదు. సంప్రదాయ వేడుకలు, కానుకలు కామనే. ముఖ్యంగా పిల్లలు తాము స్వయంగా తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్, పేపర్ ఫ్లవర్స్‌ని తమ తల్లులకు కానుకగా ఇస్తారు.బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్!మెక్సికోలో మే 10న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. అక్కడిది అతి పెద్ద వేడుక. ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులంతా ఒక్కచోటికి చేరి తల్లితో గడుపుతారు. పువ్వులు, ఫుడ్‌తో సెలబ్రేట్ చేస్తారు. అమ్మ గుణగణాలను పాటలుగా రాసి బాజాభజంత్రీల మధ్య ఆలపిస్తారు. ఆ పాటలతోనే అమ్మను నిద్రలేపుతారు. కొంతమంది రకరకాల వంటకాలతో ఇంట్లోనే అమ్మకు పార్టీ ఇస్తారు. కొంతమంది రెస్టారెంట్స్‌కి తీసుకెళ్తారు. మదర్స్ డే.. మెక్సికోలోని రెస్టారెంట్స్ అన్నిటికీ బిజీయెస్ట్ డే ఆఫ్ ది ఇయర్ అని చెబుతారు స్థానికులు.మదర్ ఫిగర్స్ అందరికీ..నికరాగువాలో మే 30న ‘మదర్స్ డే’ జరుపుకుంటారు. కుటుంబమంతా కలసి గడపడానికి ఆ రోజున బడులకు, ఆఫీస్‌లకు సెలవు ఇస్తారు. ఒక్క అమ్మకే కాదు.. అమ్మమ్మ, నానమ్మ, పిన్ని, అత్త ఇలా వాళ్ల జీవితాల్లోని మదర్ ఫిగర్స్ అందరినీ ఆ రోజున కానుకలతో ముంచెత్తుతారు. వేడుకలతో అలరిస్తారు.రాణి పుట్టిన రోజు..థాయ్లండ్లో ఆ దేశపు రాణి.. క్వీన్ సిరికిట్ బర్త్ డే.. ఆగస్ట్ 12ను ‘మదర్స్ డే’గా పరిగణిస్తారు. ఇది వాళ్లకు జాతీయ సెలవు దినం. ఆమె ఆ దేశ ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకుందని, దేశాన్ని ఓ తల్లిలా కాపాడిందని ఆమె బర్త్ డేని ‘మదర్స్ డే’గా సెలబ్రేట్ చేసుకుంటారు. అక్కడ ఈ ఆచారం 1976 నుంచి మొదలైంది. అదొక స్వచ్ఛంద సేవా దినంగా ఉంటుంది. పిల్లలంతా మహిళా బౌద్ధ సన్యాసులకు అవసరమైన వస్తువులను తెచ్చిస్తారు. విరాళాలిస్తారు. సైనిక వందనం ఉంటుంది. బాణాసంచా కాలుస్తారు. దేశమంతటా జాతీయ జెండాలు రెపరెపలాడతాయి. క్వీన్ సిరికిట్ ఫొటోలు కొలువుదీరుతాయి. అంతేకాదు ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు.. స్వచ్ఛతకు చిహ్నమైన మల్లెపూలను కానుకగా ఇస్తారు.మూడు రోజుల వేడుక!ఇథియోపియాలో వర్షకాలపు చివరి రోజుల్లో మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. వీళ్లకిది మూడు రోజుల వేడుక. ఈ మూడు రోజులూ మగవాళ్లు పాటలు పాడుతూ.. డాన్సులు చేస్తూ.. అమ్మతోపాటు భూదేవికీ గౌరవ వందనం సమర్పిస్తారు. ఈ దేశపు సంప్రదాయ వంటకాలైన ‘హష్’, ‘పంచ్’లను ఆరగిస్తారు. హష్ అంటే ఇథియోపియన్ మసాలాలు, చీజ్‌తో వండిన మటన్ లేదా బీఫ్. ఈ వంటకానికి కావల్సిన కూరగాయలు, చీజ్‌ని కూతుళ్లు, మాంసాన్ని కొడుకులు తెచ్చి, ఇద్దరూ కలసి దీన్ని వండటం వీళ్ల ఆచారం. పంచేమో నిమ్మకాయ, పైనాపిల్, రోజ్బెరీ, బత్తాయి, తెల్ల ద్రాక్షారసాల మిశ్రమం.కుటుంబ పండగబ్రెజిల్లో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ . దీన్ని ఇక్కడ అతిపెద్ద కమర్షియల్ హాలీడేగా వ్యవహరిస్తారు. చదువులు, కొలువుల రీత్యా ఎక్కడెక్కడో ఉన్న పిల్లలంతా ఆ రోజున తమ తల్లి దగ్గరకు వచ్చి ఆమెతో కలసి ఈ వేడుకను జరుపుకుంటారు. ఇదొక కుటుంబ పండగలా ఉంటుంది. బార్బెక్యూ వంటకాలతో విందు ఆరగిస్తారు. అన్నం, బీన్స్‌తో కలిపి వడ్డించే ఛిజిuటట్చటఛిౌ అనే గ్రిల్డ్ మీట్ ‘మదర్స్ డే’ స్పెషల్ డిష్ ఇక్కడ.వారం రోజులు..పెరూలోనూ మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. వీళ్లకిది వారం రోజల పండగ. వైవిధ్యంగా జరుపుకుంటారు. తమ కుటుంబంలో.. కీర్తిశేషులైన తల్లులకు ఇష్టమైన పువ్వులను సమాధుల మీదుంచి వాళ్లకిష్టమైన వంటకాలు, డ్రింక్స్‌ను నైవేద్యంగా పెడతారు. వాళ్ల ప్రేమానురాగాలు, త్యాగాలను స్తుతిస్తారు. తర్వాత బతికున్న తల్లులకు కానుకలు, పుష్పగుచ్ఛాలు ఇస్తారు. ఆ రోజున అమ్మలందరూ తమకు నచ్చినట్టు గడుపుతారు.రూరల్ విమెన్స్ డే కూడా..మలావీలో అక్టోబర్ 15న మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది వీళ్లకు నేషనల్ హాలీడే. అక్టోబర్ 15 ‘రూరల్ విమెన్స్ డే’ కూడా కావడంతో దేశా«ధ్యక్షుడు అమ్మల ఔదార్యం, ప్రాధాన్యం గురించి బహిరంగ ప్రసంగం చేస్తాడు.రెడ్ కార్నేషన్తో.. జపాన్‌లో మొదట్లో.. వాళ్ల సామ్రాజ్ఞి కోజన్ పుట్టిన రోజు.. మార్చి 6ను ‘మాతృదినోత్సం’ కింద పరిగణించేవారు! అయితే 1949 నుంచి మే రెండో ఆదివారమే మదర్స్ డే జరుపుకోవడం మొదలుపెట్టారు. ఆ రోజున పిల్లలు రెడ్ కార్నేషన్ ఫ్లవర్‌తో తమ తల్లుల పట్ల తమకున్న ప్రేమానురాగాలు, గౌరవమర్యాదలను చాటుకుంటారు.రెండుసార్లు.. రష్యాలో మార్చి 8న, మే రెండో ఆదివారం రోజున.. రెండుసార్లు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. మే రెండో ఆదివారం రోజున తల్లులకు సంబంధించిన ముఖ్యమైన సమస్యల మీద దృష్టి పెట్టి.. వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. అమ్మ బాగుంటే కుటుంబం.. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుందనే ఉద్దేశంతో మాతృదినోత్సవం రోజున వేడుకల కంటే అమ్మలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే మొగ్గు చూపుతారు.ఆఖరి ఆదివారంఫ్రాన్స్లో మే ఆఖరి ఆదివారమే ‘మదర్స్ డే’. ఆ రోజున పిల్లలంతా తమ తల్లులకు గిఫ్ట్స్, ట్రీట్స్ ఇస్తారు. ఇది ఒక కుటుంబ వేడుకగా జరుగుతుంది.స్వయంగా చేసి.. స్పెయిన్‌లో డిసెంబర్ 8న ‘మదర్స్ డే’ను సెలబ్రేట్ చేస్తారు. దీన్ని మదర్ మేరీకి సంబంధించిన పండగగా భావిస్తారు. పిల్లలంతా తమ తల్లులకు ఇష్టమైనవాటిని తామే స్వయంగా చేసి బహూకరిస్తారు. ఈ రోజున గీట్రింగ్ కార్డ్స్, చాక్లేట్స్, పువ్వుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయట!జపాన్‌లో అమ్మకు రెడ్ కార్నేషన్ ఇస్తూ..తల్లులకు ఆసరాగా.. స్వీడన్లో మే ఆఖరి ఆదివారం ‘మదర్స్ డే’. ఈ రోజున స్వీడిష్ రెడ్ క్రాస్.. చిన్న చిన్న ప్లాస్టిక్ పూలను విక్రయిస్తుంది. వచ్చిన ఆదాయంతో పేద తల్లులను ఆదుకుంటుంది.ఎంత మంది పిల్లలు అనే లెక్కనజర్మనీలో మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’. ఫ్లవర్స్, కార్డ్స్, గిఫ్ట్లతోనే అమ్మలను గౌరవిస్తారు. అయితే రెండో ప్రపంచం యుద్ధంలో ఈ సీన్ వేరుగా ఉండేది. తల్లులను పితృభూమి కోసం పిల్లలను కనిచ్చే యంత్రాలుగా చూసేవారు. ఎంత మంది పిల్లల్ని కన్నారు అనే లెక్కన వాళ్లను మెడల్స్‌తో సత్కరించేవారట.రెండూ ఒకే రోజుఫిలిప్పీన్స్లో మే రెండో ఆదివారం నాడే మదర్స్ డే’ జరుపుకుంటారు. అయితే 1980లో అప్పటి అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కస్ డిసెంబర్ మొదటి సోమవారాన్ని మాతృ, పితృదినోత్సవం’గా ప్రకటించాడు. కానీ తర్వాత అధ్యక్షుడు కోరీ అక్వినో ఎప్పటిలాగే మే రెండో ఆదివారాన్ని ‘మాతృదినోత్సవం’గా, జూన్ మూడో ఆదివారాన్ని ‘పితృదినోత్సవం’గా ప్రకటించాడు. అయితే అయన తర్వాత వచ్చిన ప్రెసిడెంట్ జోసెఫ్ ఎస్ట్రాడా 1998లో మళ్లీ ఈ రెండిటినీ డిసెంబర్‌కే మార్చేశాడు. ఇదేలా ఉన్నా ఫిలిప్పినీస్ తమ తల్లిని ఇంటికి దీపంగా భావిస్తారు. ‘మదర్స్ డే’ రోజున ఫ్లవర్స్, చాక్లేట్స్, గిఫ్ట్‌లతో అమ్మ మీది ప్రేమను ప్రకటిస్తారు.స్కౌట్ మూవ్మెంట్ మద్దతుఆస్ట్రియాలో మదర్స్ డేని మొదటిసారిగా 1924లో జరుపుకున్నారు. ఆస్ట్రియన్ విమెన్స్ మూవ్మెంట్ వ్యవస్థాపకురాలు మరియాన్ హెయినిష్ ‘మదర్స్‌డే’ జరిపేందుకు చొరవ తీసుకుంది. దీనికి ఆమెకు స్కౌట్ మూవ్మెంట్ మద్దతు చ్చింది. ఇక్కడా మే రెండో ఆదివారమే ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకుంటారు.పెరూలో కీర్తిశేషులైన తల్లులకు పువ్వులు అర్పిస్తూ..అమ్మను చూసే రోజు..నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి (్చunటజీ) అనే పండగ రోజున ఇక్కడి మాతా త్రితా కోనేరు దగ్గరకు వచ్చి.. కీర్తిశేషులైన మాతృమూర్తులకు తర్పణం వదిలి వాళ్ల పట్ల ఉన్న తమ ప్రేమాభిమానాలను చాటుకుంటారు. దీన్ని ‘ఆమా కో ముఖ్ హెర్నే దిన్ (అంటే అమ్మను చూసే రోజు)’గానూ వ్యవహరిస్తారట. దీన్నే ‘మదర్స్ డే’ అనుకోవచ్చు అంటారు నేపాలీలు. అయితే ఆరోజున.. కీర్తిశేషులైన వాళ్లను తలచుకోవడంతో పాటు బతికున్న అమ్మలకు పాద పూజ చేస్తారు.ముస్తఫా అమిన్ వల్ల..ఈజిప్ట్, ఇరాక్, జోర్డాన్, లిబియా, లెబనాన్, కతార్, సిరియా కువైట్, మారిటేనియా, ఒమాన్, పాలెస్తీనా, సౌది అరేబియా, సొమాలియా, సుడాన్, యూఏఈ, యెమెన్ వంటి దేశాల్లో మార్చ్ 21న ‘మాతృదినోత్సవాన్ని’ జరుపుకుంటారు. ఈజిప్ట్ ఈ వేడుకను 1956లో జర్నలిస్ట్ ముస్తఫా అమిన్ పరిచయం చేశాడు. అప్పటి నుంచి చాలా అరబ్ దేశాలు ఈ వేడుకను జరుపుకుంటున్నాయి.నేపాల్‌లో మాతా త్రితా ఆన్సి పండగ..పిల్లల్ని రక్షించినందుకు..ఇజ్రాయెల్‌లో ‘మాతృదినోత్సవం’ క్రమంగా కుటుంబ దినోత్సవంగా మారింది. ఇది జ్యూయిష్ క్యాలెండర్ ప్రకారం షెవత్ 30న అంటే జనవరి 30 నుంచి మార్చి 1 మధ్యలో వస్తుంది. హెనుయెటా జోల్డ్ నాయకత్వం లోని యూత్ ఆలియా ఆర్గనైజేషన్.. నాజీల చెర నుంచి యూదు పిల్లలను రక్షించిన సాహసానికి గుర్తుగా దీన్ని జరుపుకుంటారు.ఇంకా ఈ దేశాల్లో.. నార్వేలో ఫిబ్రవరి రెండో ఆదివారం, అల్బేనియా, అర్మేనియా, అజర్బైజాన్, బెలారస్, బల్గేరియా, కజకిస్తాన్, మాల్డోవా, సైబీరియా, వియత్నాంలలో మార్చి 8, గర్నెసీ, ఐర్లాండ్, నైజీరియాల్లో ఫోర్త్ సండే ఆఫ్ లెంట్, ఎల్ సాల్వడార్, గ్వాటెమాలాల్లో మార్చి 10, అల్జీరియా, కేమరూన్, డొమినికన్ రిపబ్లిక్, హైతీ, మడగాస్కర్, మాలి, మారిషస్, మొరాకో, నిగర్, సెనెగల్, ట్యునీషియా దేశాల్లో మే ఆఖరి ఆదివారం నాడు మాతృదినోత్సవాన్ని జరుపుకుంటారు. -
రేటే 'బంగార'మాయెనే..!
1990లో 1 కేజీ బంగారం = మారుతీ 800 కారు2000లో 1 కేజీ బంగారం = మారుతీ ఎస్టీమ్2005లో 1 కేజీ బంగారం = టయోటా ఇన్నోవా2010లో 1కేజీ బంగారం = టయోటా ఫార్చూనర్2016లో 1 కేజీ బంగారం = బీఎండబ్ల్యూ ఎక్స్12019లో 1 కేజీ బంగారం = వోల్వో ఎస్602024లో 1 కేజీ బంగారం = ఆడి క్యూ52030 వరకు దాచిపెట్టుకుంటే... ఏకంగా ప్రైవేట్ జెట్‌నే కొనేయొచ్చేమో!అతిశయోక్తిగా ఉంది కదూ! ఆకాశమే హద్దుగా.. రోజు రోజుకు కొత్త రికార్డులతో దూసుకెళ్తున్న పుత్తడి దూకుడు చూస్తే ఏమో.. పసిడి పెరగావచ్చు అనిపించక మానదు!! ఏడాది క్రితం 10 గ్రాములు రూ.60,000 స్థాయిలో ఉన్న బంగారం రేటు తాజాగా రూ. 75,000 స్థాయికి చేరి ధర‘ధగ’లాడిపోతోంది. అసలే రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో అట్టుడుకుతుంటే... పులిమీద పుట్రలా పశ్చిమాసియాలో ఇరాన్–ఇజ్రాయెల్ మిసైళ్ల మోతతో ప్రపంచానికి ముచ్చెమటలు పడుతున్నాయి.అధిక ధరలతో అతలాకుతలం అవుతున్న ఆర్థిక వ్యవస్థలను ఈ యుద్ధభయాలు వెంటాడుతుండటంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు సురక్షిత సాధనమైన బంగారం వైపు పరుగులు తీస్తున్నారు. దీనికితోడు అమెరికా డాలర్ ప్రాభవానికి గండిపడటంతో ప్రభుత్వాలు కూడా కనకాన్నే నమ్ముకుని, ఎగబడి కొంటున్నాయి. మరోపక్క, రేటెంతైనా తగ్గేదేలే అంటూ జనాలు సైతం పసిడి వెంటపడుతున్నారు.ఇలా అన్నివైపుల నుంచి డిమాండ్ పోటెత్తి రేటు ’మిసైల్’లా దూసుకెళ్తోంది. అసలు ఈ స్వర్ణకాంతులకు కారణమేంటి? ప్రపంచవ్యాప్తంగా పసిడి నిల్వల సంగతేంటి? ఈ గోల్డ్ రష్.. పుత్తడిని ఇంకెన్ని కొత్త శిఖరాలకు చేరుస్తుంది? పసిడిలో పెట్టుబడికి ఏ రూటు బెటర్? ఇవన్నీ తెలుసుకోవాలంటే బంగారు‘గని’ అలా తవ్వొద్దాం పదండి!!యుగాలుగా ప్రపంచమంతా కాంతులీనుతున్న లోహం ఏదైనా ఉందంటే నిస్సందేహంగా బంగారమే! అందుకే వేల సంవత్సరాల నుంచి, ఏ నాగరికత చూసినా పసిడి వేట కొనసాగుతూనే ఉంది. అయితే, ప్రస్తుతం భూమ్మీద ఉన్న బంగారం మొత్తంలో దాదాపు 86 శాతం గడచిన 200 ఏళ్లలోనే తవ్వి తీసినట్లు చరిత్రకారులు, జియాలజిస్టులు చెబుతున్నారు. అధునాతన మైనింగ్ టెక్నిక్‌లు అందుబాటులోకి రావడంతో 18వ శతాబ్దం ఆరంభంలో పెద్దయెత్తున పసిడి ఉత్పత్తి ప్రారంభమైంది.కాలిఫోర్నియా గోల్డ్ రష్ అన్నింటిలోకెల్లా ప్రాచుర్యం పొందింది. 1848 నుంచి 1855 నాటికి ఇక్కడ 2 బిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని వెలికి తీయడం విశేషం. ఇక 1890 వరకు అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా టాప్–3 పుత్తడి ఉత్పత్తి దేశాలుగా ఉండేవి. అయితే, 1886లో దక్షిణాఫ్రికాలోని విట్వాటర్స్రాండ్ బేసిన్లో కనుగొన్న నిక్షేపాలు ఆ దేశ ముఖచిత్రంతో పాటు ప్రపంచ పసిడి మార్కెట్‌ను సైతం సమూలంగా మార్చేశాయి. అతిపెద్ద బంగారు క్షేత్రాల్లో ఒకటిగా ఇది చరిత్ర సృష్టించింది.శతాబ్దం పాటు ఉత్పత్తిలో రారాజుగా స్వర్ణకాంతులతో మెరిసిపోయింది. 1970లో దక్షిణాఫ్రికా పసిడి ఉత్పత్తి 1,002 టన్నుల గరిష్ఠ స్థాయిని అందుకుంది. ఇప్పటిదాకా ఏ దేశం కూడా ఒకే ఏడాదిలో ఇంత బంగారాన్ని ఉత్పత్తి చేయలేదు. 1980 నుంచి పసిడి ధరలు అంతకంతకూ పెరగడంతో ప్రపంచంలో చాలా చోట్ల స్వర్ణం కోసం వేట జోరందుకుంది. 2007 నాటికి చైనా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఆవిర్భవించడం విశేషం. ప్రస్తుతం 40కి పైగా దేశాల్లో పుత్తడి మైనింగ్ జోరుగా సాగుతోంది.ఉత్పత్తి మందగమనం...వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా 3,655 టన్నుల బంగారం గనుల నుంచి ఉత్పత్తయింది. ఇదే ఇప్పటిదాకా ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయి. అక్కడి నుంచి తగ్గుముఖం పట్టి, గత మూడేళ్లుగా ఉత్పత్తి ఎదుగూబొదుగూ లేకుండా 3,600 టన్నులకే పరిమితమవుతోంది. ఒకప్పుడు ప్రపంచ బంగారు గనిగా పేరొందిన దక్షిణాఫ్రికా ఇప్పుడు వెలవెలబోతోంది. చైనా 2023లో 370 టన్నులను ఉత్పత్తి చేసి ‘టాప్’లేపింది. తర్వాత టాప్–10లో రష్యా (310 టన్నులు), ఆస్ట్రేలియా (310), కెనడా (200), అమెరికా (170), కజక్‌స్థాన్ (130), మెక్సికో (120), ఇండోనేషియా (110) దక్షిణాఫ్రికా (100), ఉజ్బెకిస్థాన్ (110), పెరూ (90) ఉన్నాయి. రికార్డు ధరల నేపథ్యంలో పాత బంగారం రీసైక్లింగ్ కూడా పుంజుకుంటోంది. 2023లో 9 శాతం పెరిగి 1,237 టన్నులకు చేరింది. ప్రస్తుత ప్రపంచ పసిడి ఉత్పత్తిలో 32 శాతం వాటా చైనా, రష్యా, ఆస్ట్రేలియాలదే కావడం గమనార్హం.తవ్విందెంత.. తవ్వాల్సిందెంత?ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా భూమి నుంచి వెలికితీసిన బంగారం మొత్తం 2,01,296 టన్నులుగా అంచనా. ఇందులో ఆభరణాల రూపంలోనే దాదాపు సగం, అంటే 93,253 టన్నులు ఉంది. దీని విలువ 7.2 ట్రిలియన్ డాలర్లు. ప్రైవేటు పెట్టుబడుల రూపంలో 3.4 ట్రిలియన్ డాలర్ల విలువైన 44.384 టన్నుల (22%) స్వర్ణం వాల్టుల్లో భద్రంగా ఉంది. వివిధ దేశాల (సెంట్రల్ బ్యాంకులు) వద్ద నిల్వలు 34,211 టన్నులు (17%). వీటి విలువ 2.7 ట్రిలియన్ డాలర్లు. పారిశ్రామిక అవసరాల కోసం వినియోగంలో ఉన్నది 29,448 టన్నులు (15%). 2.3 ట్రిలియన్ డాలర్లు. ప్రస్తుత ధర ప్రకారం ఈ బంగారం మొత్తం విలువ 15.6 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 1,303 లక్షల కోట్లు. ఇక భూమిలో ఇంకా నిక్షిప్తమై ఉన్న బంగారం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా మైనింగ్ కంపెనీలు కనుగొన్న కచ్చితమైన నిల్వలు 53,000 టన్నులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుత వార్షిక ఉత్పత్తి (3,600 టన్నులు) ప్రకారం చూస్తే, మరో 15 ఏళ్లలో ఈ నిల్వలన్నీ అయిపోతాయి. ఈలోగా కొత్త నిక్షేపాలను కనిపెట్టాలి. లేదంటే ఉత్పత్తి అడుగంటి, రీసైక్లింగ్‌పై ఆధారపడాల్సిందే!రేటెందుకు పరుగులు పెడుతోంది?ఏ వస్తువు (కమోడిటీ) ధరకైనా గీటురాయి డిమాండ్, సరఫరానే. గత కొన్నేళ్లుగా గనుల నుంచి పసిడి ఉత్పత్తి మందగించింది, భూమిలో మిగిలున్న నిల్వలు అడుగంటుతున్నాయి. 2021 నుంచి భారీ నిక్షేపాలేవీ దొరకడం లేదు. దీంతో భవిష్యత్తులో స్వర్ణం మరింత అరుదైన లోహంగా మారనుంది. మరోపక్క ఆభరణాల డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. వన్నె తగ్గని సురక్షిత పెట్టుబడి, ద్రవ్యోల్బణానికి విరుగుడుగా ఇన్వెస్టర్లు ఈటీఎఫ్‌ల వంటి సాధనాల ద్వారా పుత్తడిలో మదుపు చేసేందుకు ఎగబడుతున్నారు. ప్రపంచ దేశాలు డాలర్లలో వాణిజ్యానికి క్రమంగా చెల్లు చెప్పడంతో పాటు తమ విదేశీ కరెన్సీ నిల్వల్లో డాలర్ నిధులను తగ్గించుకుంటున్నాయి.ఫలితంగా డీ–డాలరైజేషన్ జోరందుకుంది. ఆంక్షల భయాలకు తోడు కరెన్సీ క్షీణతకు విరుగుడుగా బంగారం నిల్వలను సెంట్రల్ బ్యాంకులు పెంచుకుంటూ పోతున్నాయి. గత పదేళ్లలో సగటున ఏటా 800 టన్నులు కొన్నాయి. ఇటీవల కొనుగోళ్ల జోరు పెంచిన మన ఆర్బీఐ వద్ద 817 టన్నుల బంగారం ఉంది. ఇక పారిశ్రామిక అవసరాలు (ఎలక్ట్రానిక్స్, డెంటిస్ట్రీ, అంతరిక్ష రంగం) ఎగబాకుతున్నాయి. ఇలా సరఫరా మందగించి.. డిమాండ్ పెరిగిపోవడమే బంగారం పరుగుకు ప్రధాన కారణం. ఇక రష్యా–ఉక్రెయిన్ యుద్ధానికి తోడు, ఇరాన్–ఇజ్రాయెల్ దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది.ఈ భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలతో ద్రవ్యోల్బణం ఎగసి జేబుకు చిల్లుపెడుతోంది. దీంతో ఇన్వెస్టర్లు అనిశ్చితుల్లో ఆదుకునే సురక్షిత సాధనాల్లోకి, ముఖ్యంగా బంగారంలోకి తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. ఫిబ్రవరిలో 2,000 డాలర్లకు అటూఇటుగా ఉన్న ఔన్స్ బంగారం ధర ఇరాన్–ఇజ్రాయెల్ ఘర్షణలతో భగ్గుమంది. తాజాగా 2,449 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠాన్ని తాకింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కొండెక్కి కూర్చున్న వడ్డీరేట్లు ఇకపై దిగొచ్చే అవకాశాలున్నాయి. ఇది పసిడికి మరింత డిమాండ్‌ను పెంచడంతో పాటు ధరలు ఎగిసేందుకు దారితీసే అంశం.స్టోర్ ఆఫ్ వాల్యూలో టాప్..ప్రపంచంలో ఏ అసెట్ (ఆస్తి)కీ లేనంత స్టోర్ ఆఫ్ వాల్యూ బంగారం సొంతం. స్టోర్ ఆఫ్ వాల్యూ అంటే మన దగ్గర ఏదైనా అసెట్ (కరెన్సీ, బంగారం, భూమి, ఇళ్లు, షేర్లు ఇతరత్రా) ఉంటే, ఎన్నాళ్లయినా దాని విలువ పెరగడమే కానీ ఆవిరైపోకుండా ఉండటం అన్నమాట. ఉదాహరణకు లక్ష రూపాయలు పెట్టి బంగారం కొని, అదే సమయంలో లక్ష రూపాయలను దాచామనుకోండి. కొన్నేళ్ల తర్వాత పసిడి విలువ కచ్చితంగా పెరుగుతుందే తప్ప దిగజారదు. కానీ నగదు విలువ మాత్రం పడిపోతుంది. రెండేళ్ల కిందట కేజీ బియ్యం ధర రూ.40 స్థాయిలో ఉంటే ఇప్పుడు 70కి చేరింది. అంటే కరెన్సీకి ఉన్న కొనుగోలు విలువ అంతకంతకూ ఆవిరైపోతోందని అర్థం. స్టోర్ ఆఫ్ వాల్యూ కలిగిన అతి కొద్ది అసెట్లలో భూమి కూడా ఉన్నప్పటికీ, పుత్తడిలా వెంటనే సొమ్ము చేసుకోవడం (లిక్విడిటీ) కష్టం. కాబట్టి అసలుకు మోసం రాకుండా... లిక్విడిటీలోనూ పసిడిని మించింది లేదు. మన పెద్దలు ‘పొలం పుట్రా.. నగా నట్రా’ వెనకేసుకోమన్నది అందుకే!ఎలా కొన్నా.. బంగారమే!ప్రపంచవ్యాప్తంగా ఉన్న బంగారంలో దాదాపు సగం ఆభరణాల రూపంలోనే ఉంది. మగువలకు బంగారమంటే ఎంత మక్కువో చెప్పేందుకు ఇదే నిదర్శనం. రేటు ఎగబాకుతుండటంతో అందకుండా పోతుందేమోనన్న ఆతృత అందరిలోనూ పెరిగిపోతోంది. అందుకే పసిడి పెట్టుబడులూ జోరందుకున్నాయి. మరి ఏ రూపంలో కొంటే మంచిది అనేది చాలా మందికి వచ్చే డౌటు. నిజానికి పెట్టుబడికి కూడా మన దేశంలో ఇప్పటికీ ఆభరణాల రూపంలో కొనేవారే ఎక్కువ. ఎందుకంటే నచ్చినప్పుడు ధరించి, ఆనందించవచ్చనేది వారి అభిప్రాయం.దీనివల్ల తరుగు, మజూరీ పేరుతో కొంత నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి, ధరించేందుకు అవసరమైనంత ఆభరణాలను పక్కనబెడితే, పెట్టుబడికి మాత్రం కాయిన్లు, బార్ల రూపంలో 24 క్యారెట్ల బంగారాన్ని కొనడం బెటర్. అయితే, ఇందులో కూడా అదనపు చార్జీల భారం ఉంటుంది. అంతేకాకుండా భౌతిక రూపంలో బంగారాన్ని కొన్నా, అమ్మినా 3 శాతం వస్తుసేవల పన్ను (జీఎస్టీ) బాదుడు తప్పదు. ఆభరణాలు, నాణేలు, కడ్డీల రూపంలో కొని దాచుకోవడం రిస్కు కూడా. పోనీ లాకర్లలో దాచుకోవాలంటే ఫీజులు కట్టాల్సి ఉంటుంది. వీటన్నింటికీ మెరుగైన ప్రత్యామ్నాయం సార్వభౌమ గోల్డ్ బాండ్లు (ఎస్‌జీబీలు), గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు) తదితర రూపాల్లో లభించే డిజిటల్ గోల్డ్.అయితే, వీటిని కొనాలంటే డీమ్యాట్ ఖాతా ఉండాలి. బంగారం మార్కెట్ ధరకు అనుగుణంగా షేర్ల మాదిరిగానే ఇవి కూడా ట్రేడవుతాయి. నచ్చినప్పుడు విక్రయించుకొని సొమ్ము చేసుకోవచ్చు. ఈటీఎఫ్‌లలో నామమాత్రంగా చార్జీలు ఉంటాయి. కానీ, ఎస్జీబీలకు ఎలాంటి చార్జీలూ లేవు. అంతేకాదు, వార్షికంగా 2.5 శాతం వడ్డీ కూడా లభిస్తుంది. అయితే, ఏ రూపంలో కొన్నాసరే ఇన్వెస్టర్లు తమ తమ పెట్టుబడి మొత్తంలో కనీసం 10–15 శాతాన్ని బంగారానికి కేటాయించడం ఉత్తమమని, క్రమానుగత పెట్టుబడి(సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేయాలనేది ఆర్థిక నిపుణుల ‘బంగారు’ మాట!బంగారు భారత్!ఆర్బీఐ దగ్గరున్న 817 టన్నుల బంగారాన్ని పక్కనబెడితే, అనధికారిక లెక్కల ప్రకారం భారతీయుల వద్ద ఆభరణాలు, ఇతరత్రా రూపాల్లో ఉన్న బంగారం మొత్తం 25,000 టన్నులకు పైగానే ఉంటుందని అంచనా. భూమ్మీద ఉన్న మొత్తం బంగారంలో ఇది 13 శాతం. అంటే దాదాపు 1.93 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో రూ. 161 లక్షల కోట్లు. భారత స్థూల దేశీయోత్త్పత్తి (3.7 ట్రిలియన్ డాలర్లు)లో సగానికి సమానమన్నమాట!తులం... రూ. లక్ష!కనకం.. పూనకాలు లోడింగ్ అంటూ నాన్‌స్టాప్ ర్యాలీ చేస్తోంది. ఫిబ్రవరి నుంచి మొదలైన దూకుడుతో ఏకంగా 20 శాతం పైగా ఎగబాకింది. ఇప్పుడు కొనొచ్చా.. తగ్గేదాకా వేచి చూడాలా? ఇంకా పెరిగితే ఏంటి పరిస్థితి? అందరిలోనూ ఇవే సందేహాలు. అయితే, పుత్తడిని ఏ రేటులో కొన్నా దీర్ఘకాలంలో లాభాలే కానీ, నష్టపోయే పరిస్థితైతే ఉండదనేందుకు దాని ‘ధర’ చరిత్రే సాక్ష్యం! ఈ ఏడాదిలోనే అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఔన్స్‌కు 2,700 డాలర్లను తాకొచ్చని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే, దేశీయంగా 10 గ్రాముల మేలిమి బంగారం రేటు రూ. 85,000కు చేరే అవకాశం ఉంది. అంటే తులం (11.6 గ్రాములు) బంగారం కొనాలంటే రూ. లక్ష పెట్టాల్సిందే. అయితే, పశ్చిమాసియా, ఉక్రెయిన్ వివాదాలు శాంతించడం, అమెరికాలో వడ్డీరేట్లు మరింత పెరగడం, లేదంటే యథాతథంగా కొనసాగించడంతో పాటు సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లకు బ్రేక్ పడితే పసిడి ధరలకు కళ్లెం పడుతుందని గోల్డ్‌మన్ శాక్స్ అంటోంది.రూపాయి వాత.. సుంకం మోత!మన దేశంలో మగువలే కాదు పురుషులూ పసిడి ప్రియులే. అయితే, పుత్తడి రేటు విషయంలో మన జేబుకు అటు ప్రభుత్వం, ఇటు ‘రూపాయి’ బాగానే చిల్లుపెడుతున్నాయి. పసిడి దిగుమతులపై ప్రభుత్వం 15 శాతం సుంకం విధిస్తోంది. మరోపక్క, రూపాయి విలువ కూడా అంతకంతకూ బక్కచిక్కుతూ పసిడి ధరకు ఆజ్యం పోస్తోంది. అది ఎలాగంటే, వాస్తవానికి ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ (31.1 గ్రాములు) పసిడి ధర 2,400 స్థాయిలో ఉంది. ప్రస్తుత రూపాయి విలువ ప్రకారం 10 గ్రాముల మేలిమి బంగారం రేటు దాదాపు రూ.65,000. కానీ రేటు రూ.75,000 స్థాయిని తాకింది. అంటే 15 శాతం సుంకం లెక్కన ప్రభుత్వానికి రూ.10,000 చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక రూపాయి పతనం విషయానికొస్తే, 2022లో డాలరుతో రూపాయి మారకం విలువ 80 వద్ద ఉండేది. ఇప్పుడు 83.5కు పడిపోయింది. రూపాయి 80 స్థాయిలోనే ఉంటే ప్రస్తుత పసిడి ధర రూ.62,400. దీనికి 15 శాతం సుంకం కలిపితే, 71,720 కింద లెక్క!సెంట్రల్ బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు ఎందుకు...ఏ దేశానికైనా ఎగుమతి–దిగుమతులు సజావుగా జరిగేందుకు విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు ఎంత అవసరమో, అందులో బంగారం నిల్వలను తగినంతగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే, ఏదైనా అనుకోని ఆర్థిక విపత్తులు తలెత్తినప్పుడు, అంటే ఫారెక్స్ నిధులు అడుగంటి పోవడం వంటి సందర్భాల్లో ప్రభుత్వాలకు దన్నుగా నిలిచేది పుత్తడే! 1991లో దేశంలో ఫారెక్స్ నిల్వలు (డాలర్లు) నిండుకున్నాయి.దిగుమతులకు చెల్లించేందుకు, విదేశీ రుణాలపై వడ్డీ కట్టేందుకు డాలర్లు లేక చెల్లింపుల సంక్షోభం తలెత్తింది. దీంతో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ) వద్దనున్న బంగారాన్ని కుదువపెట్టి విదేశీ రుణాలను సమీకరించారు. దేశం దివాలా తీయకుండా కాపాడారు. అంటే, అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బంగారం చేతిలో ఉంటే మనకు ఇట్టే అప్పు ఎలా పుడుతుందో.. ప్రభుత్వాలకు సైతం ఆపదలో ఆదుకునే ఆపన్న హస్తం స్వర్ణమే!మరికొన్ని ‘బంగారు’ ముచ్చట్లు...ప్రపంచంలో ఇప్పటిదాకా వెలికితీసిన బంగారం అంతటినీ కరిగించి ముద్దగా చేస్తే ఎటు చూసినా 21.8 మీటర్లుండే క్యూబ్‌లో పట్టేస్తుంది.అత్యధిక సాంద్రత, సాగే గుణం కారణంగా ఔన్సు (31.1 గ్రాములు) బంగారాన్ని 187 చదరపు అడుగుల పలుచని గోల్డ్ లీఫ్‌గా సాగదీయొచ్చట.ప్రతి యాపిల్ ఐఫోన్లో 0.034 గ్రాముల పసిడి ఉంటుందని అంచనా.దక్షిణాఫ్రికాలో కనుగొన్న ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని (విట్వాటర్స్రాండ్ గోల్డ్ఫీల్డ్) కార్మికుల కోసం 1900 శతాబ్ది ఆరంభంలో నెలకొల్పిన జొహానస్బర్గ్ సెటిల్మెంట్.. ఇప్పుడు ఆ దేశంలో అతిపెద్ద నగరం.ప్రస్తుతం సాధారణ గ్రేడ్ టన్ను క్వార్ట్›్జ ముడి ఖనిజం నుంచి ఓపెన్ పిట్ గనిలో సగటున 1.4 గ్రాములు, భూగర్భ గనిలో 5–8 గ్రాములు మాత్రమే బంగారం లభిస్తోంది.నేరుగా ముద్దల రూపం (నేటివ్ స్టేట్)లో కూడా దొరికే అతి విలువైన లోహం కూడా బంగారమే. ప్రపంచంలో అతిపెద్ద బంగారం ముద్ద ఆస్ట్రేలియాలోని విక్టోరియా గోల్డ్ ఫీల్డ్స్‌లో 1869లో దొరికింది. ‘వెల్కమ్ స్ట్రేంజర్’గా పేరు పెట్టిన దాని బరువు ఏకంగా 72 కేజీలు! మన కోలార్ గనుల్లోనూ బొప్పాయి, గణేషుడి రూపాల్లో ఇలా పసిడి ముద్దలు లభించాయట.అతిపెద్ద పసిడి భాండాగారాన్ని (వాల్ట్) న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నిర్వహిస్తోంది. మాన్‌హటన్‌లోని బ్యాంక్ బేస్మెంట్లో ఉన్న భూగర్భ వాల్ట్‌లో ప్రస్తుతం వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు, ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు చెందిన 7,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా.లండన్ బులియన్ మార్కెట్ పసిడి ట్రేడింగ్‌లో నంబర్ వన్‌గా నిలుస్తోంది. ప్రపంచంలో ట్రేడయ్యే మొత్తం గోల్డ్‌లో 70 శాతం వాటా దీనిదే.భారత్‌లోని మొత్తం బంగారంలో 3,000–4,000 టన్నులు దేవాలయాలకు చెందినవేనని అంచనా. కేరళ పద్మనాభస్వామి గుడిలోని నేలమాళిగల్లో దాదాపు 1,300 టన్నుల బంగారం నిక్షిప్తమై ఉందట. ఇక తిరుపతి వెంకటేశ్వరస్వామి తరఫున టీటీడీ ఇప్పటిదాకా బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన బంగారం 11,329 కేజీలు (11.32 టన్నులు). ఒక్క 2023–24లోనే 1,031 కేజీల బంగారాన్ని డిపాజిట్ చేసింది.కేజీఎఫ్.. మన బంగారు కొండ!భారత్‌లో క్రీస్తు పూర్వం 1వ సహస్రాబ్ది నుంచి దక్కన్ ప్రాంతంలో పసిడి వేట జరుగుతోందని చరిత్ర చెబుతోంది. కర్ణాటకలోని కోలార్ ప్రాంతంలో క్రీస్తు శకం 2–3 శతాబ్దాలకు పూర్వమే బంగారాన్ని వెలికితీశారు. ఆ తర్వాత గుప్తులు, చోళుల కాలంలో ఇక్కడ పుత్తడి మైనింగ్ కార్యకలాపాలు విస్తరించాయి. విజయనగర సామ్రాజ్యంలో, ఆపై టిప్పు సుల్తాన్ హయాంలో పసిడి ఉత్పత్తి జోరందుకుంది. అయితే, బ్రిటిష్ పాలనలో కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) దశ తిరిగిపోయింది. జాన్ టేలర్ అండ్ కంపెనీకి బ్రిటిషర్లు దీన్ని అప్పజెప్పారు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ‘లిటిల్ ఇంగ్లండ్’గా పిలిచేవారు.1884–1904 మధ్య చాలా తక్కువ లోతులోనే బంగారం దొరికేది. మొదట్లో ఒక టన్ను క్వార్ట్›్జ ముడి ఖనిజం నుంచి 45 గ్రాముల పసిడి వచ్చేదట. దీంతో ప్రపంచంలో అత్యంత శ్రేçష్ఠమైన పసిడి నిల్వలున్న గోల్డ్ ఫీల్డ్‌గా చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత అమెరికాలోని నెవాడాలో కనుగొన్న ఫైర్ క్రీక్ భూగర్భ బంగారు గనిలో టన్ను ఖనిజం నుంచి గరిష్టంగా 44.1 గ్రాములు లభించింది. కానీ, మన కేజీఎఫ్ ‘గోల్డెన్’ రికార్డును మాత్రం బ్రేక్ చేయలేకపోయింది. కేజీఎఫ్ 120 ఏళ్ల జీవిత కాలంలో సగటున టన్ను ఖనిజాన్ని శుద్ధి చేస్తే 15 గ్రాముల బంగారం లభ్యమైంది.దక్షిణాఫ్రికాలో అతిపెద్ద గోల్డ్ మైన్ విట్ఫాటర్స్రాండ్ బేసిన్లో సగటు ఉత్పత్తి 9 గ్రాములే. 1956లో ప్రభుత్వం కేజీఎఫ్‌ను జాతీయం చేసింది. అప్పటిదాకా జాన్ టేలర్ కంపెనీ చేతిలోనే ఉండేది. కేజీఎఫ్ చరిత్రలో దాదాపు 1,000 టన్నుల బంగారం ఉత్పత్తి అయినట్లు అంచనా. ఇందులో చాలావరకు బ్రిటిషర్లే తన్నుకుపోయారు. అయితే, తలకు మించిన ఉత్పాదక వ్యయం, పర్యావరణ సమస్యలతో కేజీఎఫ్ 2021లో పూర్తిగా మూతబడింది. అప్పటికి ‘చాంపియన్’ రీఫ్ మైన్ భూగర్భంలో 3.2 కిలోమీటర్ల లోతు వరకు మైనింగ్ జరిగింది. ప్రపంచంలోని అత్యంత లోతైన బంగారు గనుల్లో ఒకటిగా చరిత్రి సృష్టించింది.భూగర్భంలో 1,400 కిలోమీటర్ల పొడవైన సొరంగాలు కేజీఎఫ్ కింద విస్తరించి ఉన్నాయట. అప్పుడప్పుడూ అవి కుంగడం వల్ల ఇప్పటికీ కోలార్‌లో భూమి కంపిస్తుంది. ఇక ప్రస్తుతం భారత్‌లో ఉత్పత్తి జరుగుతున్న ఏకైక గోల్డ్ మైన్ హట్టి. ఇదీ కర్ణాటకలోనే (రాయచూరు) ఉంది. ఇప్పటిదాకా 84 టన్నుల బంగాన్ని వెలికితీశారు. టన్ను ఖనిజానికి 3 గ్రాముల బంగారమే లభ్యమవుతోంది. ఏటా 1.5 టన్నుల పసిడి ఇక్కడ లభిస్తోంది. కాగా, దేశంలో కనుగొన్న పసిడి నిల్వల్లో 88 శాతం కర్ణాటకలోనే ఉన్నాయి.వినియోగంలో భారత్, చైనాలే టాప్..2023లో ప్రపంచ బంగారు ఆభరణాల డిమాండ్‌లో 50 శాతం భారత్, చైనాల్లోనే నమోదవుతోంది. దీనికి తోడు పసిడి పెట్టుబడులు కూడా క్రమంగా ఎగబాకుతున్నాయి. 2023లో గనుల నుంచి 3,600 టన్నుల బంగారం వెలికితీయగా అందులో భారత్ దాదాపు 800 టన్నులు, చైనా 824 టన్నులు దిగుమతి చేసుకున్నాయి. తద్వారా వినియోగంలో భారత్‌ను అధిగమించింది చైనా. అయితే, భారత్ పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతుండగా. చైనా బంగారు ఉత్పత్తిలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండటం విశేషం.ద్రవ్యోల్బణానికి విరుగుడు... పెట్టుబడికి నిశ్చింత! ధరల పెరుగుదలకు సరైన విరుగుడు బంగారం. ఎందుకంటే ధరలు పెరిగే కొద్దీ.. కరెన్సీ విలువలు పడిపోతూనే ఉంటాయి. రాబడికి కూడా చిల్లు పడుతుంది. ఉదాహరణకు 5 ఏళ్ల వ్యవధికి ఓ లక్ష రూపాయలు బ్యాంకులో (ఫిక్స్డ్ డిపాజిట్) దాచుకుంటే సగటున 7 శాతం వార్షిక వడ్డీ రేటు ప్రకారం వచ్చే మొత్తం సుమారు రూ.1,41,500. అయితే, ద్రవ్యోల్బణం 7 శాతం గనుక ఉంటే, వచ్చే రాబడి సున్నా. పెట్టుబడి మాత్రమే మిగులుతుంది.ద్రవ్యోల్బణం మరింత పెరిగితే పెట్టుబడికీ చిల్లే! షేర్లు, బాండ్లు, క్రిప్టో కరెన్సీ, చివరికి బంగారం... ఇలా ఏ పెట్టుబడిలోనైనా ద్రవ్యోల్బణ ప్రభావం ఉంటుంది. అయితే, పసిడి పెట్టుబడులు మాత్రం దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణానికి మించిన రాబడులే (రెండంకెల స్థాయిలో) అందిస్తున్నాయి. దానికితోడు ఏమాత్రం రిస్కులేని వ్యవహారం. పసిడి ధర ఐదేళ్లలో రెట్టింపునకు పైగా పెరిగింది. పదేళ్లలో నాలుగు రెట్లు ఎగబాకింది.స్టాక్ మార్కెట్లో (షేర్లలో) ఇంతకుమించి లాభాలొచ్చే వీలున్నా, అనుకోని పరిస్థితుల్లో మనం షేర్లు కొన్న కంపెనీ మూతబడితే అసలుకే మోసం రావచ్చు. నూటికి నూరు శాతం రిస్కుతో కూడుకున్నవి. ఇక భూమి, ఇళ్లు ఇతరత్రా స్థిరాస్తులు కూడా బంగారంలాగే రిస్కులేనివే! అయితే, పసిడి మాదిరిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకుని సొమ్ము చేసుకునే అవకాశం వాటికి తక్కువ. అంతేకాదు, అతితక్కువ వడ్డీకే, బంగారంపై ఇట్టే రుణం కూడా పొందొచ్చు. అందుకే బంగారం అంటే భరోసా. పెట్టుబడికి ఢోకా లేకుండా, కష్టకాలంలో ఆదుకోవడంలో బంగారాన్ని మించింది మరొకటి లేదు!‘కంచు మోగినట్లు.. కనకంబు మోగునా’ అన్నట్లు.. ఎన్ని రకాల పెట్టుబడి సాధనాలున్నా పసిడికున్న విలువ, వన్నెకు సాటిరావు. అందుకే బంగారం ఎప్పటికీ బంగారమే! – శివరామకృష్ణ మిర్తిపాటి -
Cover Story: 'స్వేదవేదం'! చెమటచుక్కకు దక్కుతున్నదెంత?
ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, ఆ దేశంలోని కర్షకులు, కార్మికుల పాత్ర కీలకం. కార్మికశక్తిని సద్వినియోగం చేసుకుంటున్న దేశాలు, కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న దేశాలు అభివృద్ధిపథంలో దూసుకుపోతుంటే, కార్మిక సంక్షేమాన్ని మాటలకు మాత్రమే పరిమితం చేసిన దేశాలు దిగజారుతున్నాయి. కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకోని దేశాలు ఆర్థిక, సామాజిక అసమానతలతో కొట్టుమిట్టాడుతూ తరచు అలజడులకు, అశాంతికి ఆలవాలంగా ఉంటున్నాయి. ప్రపంచంలో చాలా కొద్ది దేశాలు మాత్రమే కార్మిక సంక్షేమాన్ని చిత్తశుద్ధితో పట్టించుకుంటున్నాయి. కార్మికులకు మెరుగైన పరిస్థితులు కల్పిస్తున్నాయి. చట్టబద్ధంగా మెరుగైన వేతనాలు అందేలా చూస్తున్నాయి. భారత్ సహా చాలా దేశాలు కార్మిక సంక్షేమాన్ని తగిన స్థాయిలో పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఆయా దేశాల్లో కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కే పరిస్థితులు కనిపించడం లేదు.అంతర్జాతీయ కార్మిక ఉద్యమానికి గుర్తుగా ఏటా మే 1న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకొంటున్నా, కార్మికుల స్థితిగతులు ఆశించిన స్థాయిలో మెరుగుపడిన దాఖలాలు లేకపోవడం విచారకరం. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా దేశ దేశాల్లోని కార్మికుల స్థితి గతులు, కార్మిక సంక్షేమంలో వివిధ దేశాలు సాధించిన సాఫల్య వైఫల్యాలపై ఒక పరిశీలన. కార్మికుల హక్కులకు పూర్తిస్థాయిలో భరోసా కల్పిస్తున్న దేశాలలో, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లిస్తున్న దేశాలలో అతిపెద్ద ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న అమెరికా, చైనా, జర్మనీ, జపాన్, భారత్ వంటి దేశాలు లేకపోవడం విడ్డూరం.కార్మికుల హక్కులకు భరోసా కల్పించడంలోను, కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడంలోనూ యూరోపియన్ దేశాలు ముందంజలో నిలుస్తున్నాయి. వీటితో పోల్చుకుంటే, అతిపెద్ద ఆర్థిక శక్తులుగా ప్రపంచ విపణిలో జబ్బలు చరుచుకుంటున్న దేశాల్లో కార్మికుల పరిస్థితులు అంత గొప్పగా లేవు. చాలా దేశాల్లో కార్మికుల పని పరిస్థితులు దారుణంగా ఉంటున్నాయి. కార్మికుల శ్రమకు తగిన ప్రతిఫలం దక్కడం గగనంగా ఉంటోంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ఏటా విడుదల చేసే కార్మిక హక్కుల సూచిని (లేబర్ రైట్స్ ఇండెక్స్) పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఐఎల్ఓ గత ఏడాది విడుదల చేసిన లేబర్ రైట్స్ ఇండెక్స్–2022 జాబితా ప్రకారం...వారంలో పనిగంటలు, వార్షిక కనీస వేతనాలు మాత్రమే కాకుండా, కార్మికుల సగటు వార్షిక వేతనాలు, సమానమైన విలువ కలిగిన పనికి సమానమైన వేతనాల చెల్లింపు, మహిళా కార్మికులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, ఏడాదిలో కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు, ప్రభుత్వ సెలవు దినాలు, కార్మికుల హక్కుల ఉల్లంఘన సంఘటనల సంఖ్య, కార్మికులు పనిచేసే చోట పని పరిస్థితులు, పని ప్రదేశంలో ప్రమాద నివారణ ఏర్పాట్లు, కార్మికుల ఆరోగ్య భద్రత, కార్మికులకు వైద్య సౌకర్యాలు, కార్మికులకు సంఘటితమయ్యే అవకాశాలు, సామాజిక భద్రత వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని ఐఎల్ఓ ఏటా లేబర్ రైట్స్ ఇండెక్స్‌ను రూపొందిస్తుంది.ఈ జాబితాలోని మొదటి పది దేశాల్లో ఆర్థిక శక్తులుగా వెలుగుతున్న దేశాలేవీ లేవు. ఇక అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాలలోనైతే కార్మికుల పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంటోంది. సాంకేతికత అభివృద్ధి చెంది రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటివి అందుబాటులోకి వచ్చినా, మురుగు కాలువలు శుభ్రం చేయడం వంటి పనులు ఇంకా మనుషులే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.‘కోవిడ్’ దెబ్బకు పెరిగిన నిరుద్యోగం..‘కోవిడ్’ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కార్మికులపై విపరీతంగా ప్రభావం చూపింది. దీని ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ‘కోవిడ్’ కారణంగా నిరుద్యోగం బాగా పెరిగింది. ఉపాధి కోసం తగిన అవకాశాలు లేక కార్మికులు అసంఘటిత రంగంలోకి చేరుతున్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రత, కనీస వేతనాలు వంటివి దక్కే పరిస్థితులు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉపాధి పొందుతున్న కార్మికుల్లో 58 శాతం– అంటే, దాదాపు 200 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వీరికి పనిచేసే చోట ఎలాంటి ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత లేవు.సంఘటిత రంగంలో అవకాశాలు దక్కకపోవడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే కార్మికులు అసంఘటిత రంగం వైపు మళ్లుతున్నారని, విపరీతమైన శ్రమదోపిడీకి గురవుతున్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గత ఏడాది విడుదల చేసిన నివేదికలో తెలిపింది. పలు ఆఫ్రికా దేశాలు, భారత్ సహా దక్షిణాసియా దేశాలలో అసంఘటిత కార్మికులు 75 శాతానికి పైగానే ఉన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. భారత్‌లోని మొత్తం కార్మికుల్లో అసంఘటిత రంగంలో పనిచేసేవారు 83 శాతంగా ఉన్నారు. ‘కోవిడ్’కు ముందు ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ యువత 22.2 శాతం ఉంటే, ‘కోవిడ్’ తర్వాత 23.5 శాతానికి పెరిగారు.వీరెవరూ చదువు కొనసాగించడమో, నైపుణ్యం పెంచుకోవడానికి శిక్షణ పొందడమో చేయడం లేదు. చిన్నా చితకా పనులు కూడా చేయడం లేదు. ఇలా పూర్తిగా ఖాళీగా ఉన్న యువత సంఖ్య ‘కోవిడ్’ తర్వాత 28.90 కోట్లకు చేరుకుంది. పనిచేసే వయసులో ఉన్న యువత ఇలా ఖాళీగా ఉండటం వల్ల ప్రపంచ ఆర్థికరంగానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ‘కోవిడ్’కు ముందు మన దేశంలో 7.22 శాతం ఉన్న నిరుద్యోగం, లాక్డౌన్ ప్రకటించిన నెల్లాళ్లకే 23.52 శాతానికి చేరుకుంది. ‘కోవిడ్’ పరిస్థితులు చక్కబడటంతో లాక్డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులు తిరిగి యథావిధిగా పనులు ప్రారంభించడంతో గత ఏడాది చివరి నాటికి దేశంలో నిరుద్యోగం 8.7 శాతంగా నమోదైంది.కనీస వేతనాలకూ కరవు..ఏ పని దొరికితే ఆ పని చేసుకుని బతికే సాధారణ కార్మికులకు కనీస వేతనాలు దక్కే పరిస్థితులు కూడా మన దేశంలో లేవు. అట్టడుగు స్థాయి సాధారణ కార్మికులకు రోజుకు చెల్లించాల్సిన కనీస వేతనాన్ని ప్రభుత్వం 2022లో రూ.178గా నిర్ణయించింది. కనీసావసరాల ధరలు పెరిగినా, 2023లోను, 2024లోను కూడా ఈ మొత్తంలో మార్పు చేయలేదు. కనీస వేతనాల మొత్తాన్ని రోజుకు రూ.375కు పెంచాలనే ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా, ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. స్వయంఉపాధి కార్మికులు, సంఘటిత కార్మికుల పరిస్థితులు సాధారణ కార్మికుల కంటే బాగున్నా, వారి వేతనాల్లో కూడా గడచిన రెండేళ్లల్లో పెద్దగా పెరుగుదల లేదు.‘కోవిడ్’ ముందు రోజులతో పోల్చుకుంటే, ఈ కార్మికుల ఆదాయం స్వల్పంగా తగ్గడం శోచనీయం. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక ప్రకారం స్వయంఉపాధి కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ.12,988గా ఉంటే, 2021–22 నాటికి ఆదాయం రూ.12,089కి పడిపోయింది. సంఘటిత కార్మికులకు 2018–19 నాటికి నెలసరి ఆదాయం రూ19,690గా ఉంటే, 2021–22 నాటికి 19,456కు పడిపోయింది. సాధారణ కార్మికుల్లో దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు ఉపాధి అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని కూడా ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక పేర్కొంది.ఇదిలా ఉంటే, సంఘటిత రంగంలో పనిచేసే వారికి సామాజిక భద్రత తగ్గినట్లు ‘పిరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే’–2023 నివేదిక వెల్లడించింది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, పెన్షన్, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి ప్రయోజనాలు వంటి వాటికి అర్హతలేని సంఘటిత కార్మికులు 2017–18లో 49.6 శాతం ఉంటే, వీరి సంఖ్య 2022–23 నాటికి 53.8 శాతానికి పెరిగింది. స్వయంఉపాధి పొందుతున్న మహిళల ఆదాయం కూడా తగ్గింది. స్వయం ఉపాధి మహిళల ఆదాయం 2017–18లో నెలకు 5,995గా ఉంటే, 2022–23లో 5,337గా ఉంది. అయితే, 2017–18లో స్వయం ఉపాధి పొందే గ్రామీణ మహిళలు 55.9 శాతం ఉంటే, 2022–23 నాటికి వీరి సంఖ్య 70.1 శాతానికి పెరిగింది.ఇదేకాలంలో స్వయం ఉపాధి పొందే పట్టణ మహిళల సంఖ్య 45 శాతం నుంచి 53 శాతానికి పెరిగింది. వీరిలో ఎక్కువమంది కుటుంబమంతా కలసి చేసే స్వయంఉపాధి వృత్తి వ్యాపారాల్లో ఎలాంటి ప్రతిఫలం తీసుకోకుండా సహాయకులుగా పనిచేస్తున్నవారేనని ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా’–2023 నివేదిక తేల్చింది. కార్మికుల ఉత్పాదకత 1982–2017 మధ్యకాలంలో ఆరురెట్లు పెరిగితే, వారికి వచ్చే వాస్తవ ఆదాయం ఒకటిన్నర రెట్లు మాత్రమే పెరిగిందని, అంటే, కార్మికులు తమ శ్రమకు తగిన న్యాయమైన వాటాను పొందలేకపోతున్నారని ఈ నివేదిక తెలిపింది.పేదరికం నిర్మూలనకు ప్రతిపాదనలు..కార్మికుల్లో పేదరికాన్ని నిర్మూలించడానికి కనీస వేతన (మినిమం వేజెస్) విధానం స్థానంలో జీవన వేతన (లివింగ్ వేజెస్) విధానాన్ని వచ్చే ఏడాదిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్పును అమలులోకి తేవడానికి తగిన సాంకేతిక సహకారాన్ని అందించాల్సిందిగా ప్రభుత్వం అంతర్జాతీయ కార్మిక సంస్థను (ఐఎల్ఓ) కోరింది. ప్రస్తుతం ఉన్న కనీస వేతన విధానం ప్రకారం కార్మికులకు కేంద్ర ప్రభుత్వం రోజుకు రూ.178గా కనీస వేతనాన్ని నిర్ణయించింది. వివిధ రాష్ట్రాలు తమ తమ పరిధిలో కనీస వేతనాలను నిర్ణయించుకున్నాయి.ఉదాహరణకు బిహార్‌లో కనీస వేతనం రోజుకు రూ.160గా ఉంటే, ఢిల్లీలో రోజుకు రూ.423గా ఉంది. దేశంలోని దాదాపు 50 కోట్లకు పైగా ఉన్న కార్మికుల్లో 90 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్నవారే కావడంతో, వారి పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం జీవన వేతన విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. కనీస వేతనం అంటే, చట్టం నిర్దేశించిన అతి తక్కువ మొత్తం వేతనం. అలా కాకుండా, దేశ కాల పరిస్థితులను బట్టి సాధారణ పనిగంటల్లో పనిచేసే కార్మికులు, వారి కుటుంబాలు గౌరవప్రదమైన జీవితాన్ని కొనసాగించడానికి తగినట్లుగా చెల్లించే వేతనాన్ని ఐఎల్ఓ జీవన వేతనంగా నిర్వచించింది.జీవన వేతనం కార్మికులు, వారి కుటుంబాల ఆహారం, దుస్తులు, నివాసం, ఆరోగ్యం సహా ఇతర అవసరాలకు తగినట్లుగా లెక్కించడం జరుగుతుంది. జీవన వేతన విధానం అమలులోకి వచ్చినట్లయితే, కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. జీవన వేతన విధానాన్ని జాతీయస్థాయిలో అమలులోకి తెస్తే, కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదని, వాటిని అధిగమించుకుంటూ ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కనీస వేతన విధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తీసుకొస్తే, ఇది చిన్న మధ్య తరహా వ్యాపార, పారిశ్రామిక సంస్థలకు భారం కాగలదని, ఫలితంగా వాటి ఆదాయం తగ్గడమే కాకుండా, కొన్ని సంస్థలు నష్టాల్లో పడే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.అలాగే, వివిధ రాష్ట్రాలు, నగరాల్లో జీవన వ్యయంలో వ్యత్యాసాలు ఉన్నాయని, కొత్త విధానాన్ని అమలులోకి తెచ్చేటప్పుడు ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచిస్తున్నారు. అయితే, ప్రభుత్వం 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కట్టుబడిన నేపథ్యంలో 2025లోనే కనీస వేతన వి«ధానం స్థానంలో జీవన వేతన విధానాన్ని అమలులోకి తేవాలనుకుంటోంది. ప్రస్తుతం దేశ ఆర్థిక వృద్ధి రేటు 8.4 శాతం ఉండటంతో కార్మికులకు మెరుగైన వేతనాలు చెల్లించడం పెద్ద సమస్య కాబోదని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కొత్త విధానం కార్మికుల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరచగలదని ఆశించవచ్చు.విద్యావంతుల్లోనే ఎక్కువ నిరుద్యోగం..ఉపాధికి సంబంధించి చాలా దేశాల్లో లేని విచిత్రమైన పరిస్థితి మన దేశంలో ఉంది. చదువులేని వారు, నామమాత్రపు చదువులు ఉన్నవారితో పోల్చుకుంటే, మన దేశంలో ఉన్నత విద్యావంతుల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉంటున్నారు. నిరక్షరాస్యులు మొదలుకొని ప్రాథమిక స్థాయితోనే చదువులు ఆపేసిన వారిలో నిరుద్యోగం 1.13 శాతం వరకు ఉంటే, గ్రాడ్యుయేషన్, ఆపై స్థాయి చదువుకున్న వారిలో నిరుద్యోగం 14.70 శాతం వరకు ఉన్నట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), లక్నో, బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ సహకారంతో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.విద్యావంతులకు తగిన ఉపాధి అవకాశాలను కల్పించడంలో మన దేశం విఫలమవుతోంది. నిరుద్యోగ సమస్య తీవ్రతను తగ్గించడానికి మన దేశం కార్మికుల కొరత ఎదుర్కొంటున్న తైవాన్, ఇజ్రాయెల్ వంటి దేశాలతో కార్మిక ఒప్పందాలు కూడా కుదుర్చుకుంది. నైపుణ్యాలు లేని కార్మికులను, అరకొర నైపుణ్యాలు ఉన్న కార్మికులను ఆ దేశాలకు తరలించడానికి కుదుర్చుకున్న ఈ ఒప్పందాలపై కొన్ని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా పాలస్తీనాతో యుద్ధం సాగిస్తున్న ఇజ్రాయెల్‌కు మన దేశం నుంచి కార్మికులను తరలించడమంటే, వారి జీవితాలను కోరి మరీ ప్రమాదంలోకి నెడుతున్నట్లేనని, ఉపాధి కల్పనలో వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్రప్రభుత్వం కార్మికుల ప్రాణాలనే పణంగా పెడుతోందని కొందరు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.గత ఏడాది మే నెలలో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మన దేశం 42 వేల మంది భవన నిర్మాణ కార్మికులను, నర్సింగ్ నిపుణులను ఇజ్రాయెల్‌కు పంపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తైవాన్‌తో కూడా మన ప్రభుత్వం ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలోనే తైవాన్ కార్మిక మంత్రి భారత్ నుంచి వచ్చేవారిలో ఈశాన్య రాష్ట్రాలకు చెందిన కార్మికులకు ప్రాధాన్యమివ్వాలంటూ చేసిన వివక్షాపూరితమైన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. ఈ వ్యాఖ్యలపై మీడియా దుమ్మెత్తిపోయడంతో తైవాన్ కార్మిక మంత్రి వెనక్కు తగ్గి, భారత్ నుంచి వచ్చే ఏ కార్మికులనైనా ఒకే రీతిలో చూస్తామని చెప్పారు. -
హిమగిరుల సొగసరి కిర్గిజ్స్తాన్.. వైద్య విద్యకు కేరాఫ్!..అందులోనూ..
అమ్మాయిలు బయటకు వెళ్తుంటే బాడీగార్డ్స్‌లా అబ్బాయిలను తోడిచ్చి పంపే సీన్‌కి రివర్స్‌లో అబ్బాయిలు బయటకు వెళ్తూ తోడురమ్మని అమ్మాయిలను బతిమాలుకోవడం కనిపిస్తే.. పురుషులతో సమానంగా మహిళలకూ హక్కులుంటే.. ఇంటా, బయటా అన్నింటా అమ్మాయిలకు గౌరవం అందుతుంటే.. సలాం.. ప్రివేత్.. ఈ కిర్గిజ్ అండ్ రష్యన్ పదాలకు అర్థం వందనం! పై దృశ్యాలు కనిపించేదీ కిర్గిజ్స్తాన్లోనే! ఈ దేశం ఒకప్పటి యూఎస్సెస్సార్ (యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్స్)లో భాగం అవడం వలన ఇప్పటికీ అక్కడ రష్యన్ అఫీషియల్ లాంగ్వేజ్‌గా కొనసాగుతోంది కిర్గిజ్తోపాటు. అందుకే ప్రివేత్ కూడా! మొన్న మార్చ్‌లో కిర్గిజ్స్తాన్కి టేకాఫ్ అయ్యే చాన్స్ దొరికింది. ప్రయాణాలు కామనైపోయి.. అంతకంటే ముందే అంతర్జాలంలో సమస్త సమాచారమూ విస్తృతమై పర్సనల్ ఎక్స్పీరియెన్సెస్ని పట్టించుకునే లీజర్ ఉంటుందా అనే డౌటనుమానంతోనే స్టార్ట్ అయింది ఈ స్టోరీ ఆఫ్ జర్నీ! అయినా కిర్గిజ్స్తాన్లో నేను చూసినవి.. పరిశీలించినవి.. అర్థం చేసుకున్నవి మీ ముందుంచుతున్నాను! ఢిల్లీ నుంచి కిర్గిజ్స్తాన్ రాజధాని బిష్కేక్కి మూడున్నర గంటలు. అందులో దాదాపు రెండున్నర గంటలు టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మీంచే ఉంటుంది ఆకాశయానం. విండోలోంచి చూస్తే కొండల మీద వెండి రేకులు పరచుకున్నట్టు కనిపిస్తుంది దృశ్యం. మంచుకొండలు.. మబ్బులు అలాయ్ బలాయ్ ఇచ్చుకుంటున్నట్టు.. భుజాల మీద చేతులేసుకుని కబుర్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇదొక అద్భుతమైతే.. బిష్కేక్.. మనాస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ఫ్లయిట్ దిగగానే కురిసే మంచుతో స్వాగతం మరో అద్భుతం! సిమ్లాలో హిమ వర్షాన్ని ఆస్వాదించినప్పటికీ బిష్కేక్లో మంచు కురిసే వేళలు గమ్మత్తయిన అనుభూతి. మేం వెళ్లిందే మంచు పడే లాస్ట్ డేస్. ఇంకా చెప్పాలంటే తర్వాతి రోజు నుంచి మంచు పడటం ఆగిపోయి.. కరగడం మొదలైంది. వర్షం వెలిసిన తర్వాత ఉండే కంటే కూడా రొచ్చుగా ఉంటుంది కరుగుతున్న మంచు. ఎండ చిటచిటలాడించినా.. మంచు కొండల మీద నుంచి వీచే గాలులు వేళ్లు కొంకర్లు పోయేంత చలిని పుట్టించాయి. అందుకే ఉన్న వారం రోజులూ షూ, థర్మల్స్, గ్లోవ్స్, క్యాప్ తప్పకుండా ధరించాల్సి వచ్చింది. ఇంకోమాట.. అక్కడి వాతావరణ పరిస్థితులకో ఏమో మరి.. షూ లేకుంటే అక్కడి జనాలు చిత్రంగా చూస్తారు. గోలలు.. గడబిడలకు నియత్.. బిష్కేక్ని కేంద్రంగా చేసుకునే అల అర్చా, ఇసిక్ కుల్ ఇంకా బిష్కేక్ చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించాం. కాబట్టి వారం రోజులు బిష్కేక్తో మా అనుబంధం కొనసాగింది. సిటీ సెంటర్లోని హోటల్లో మా బస. అక్కడికి వెళ్లగానే అబ్జర్వ్ చేసిన విషయం.. కిర్గిజ్ ప్రజలు చాలా నెమ్మదస్తులని! గట్టిగట్టిగా మాట్లాడటాలు.. అరుపులు.. కేకలు, గడబిడ వాతావరణం వారికి నచ్చవు. పక్కనవాళ్లు ఏ కొంచెం గట్టిగా మాట్లాడినా చిరాగ్గా మొహం పెడ్తారు. నిర్మొహమాటంగా చెప్పేస్తారు గొంతు తగ్గించి మాట్లాడమని. ఇక్కడ మెజారిటీ రష్యనే మాట్లాడ్తారు. ‘నియత్’ అంటే ‘నో’ అని అర్థం. సైన్‌బోర్డ్స్, నేమ్‌ప్లేట్స్ కిర్గిజ్ అండ్ రష్యన్లో ఉంటాయి. ఇది సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్నప్పుడు మామూలు వ్యవహారాలూ రష్యన్‌లోనే నడచి.. కిర్గిజ్ భాషా పదకోశం కుంచించుకుపోయిందట. స్వతంత్ర దేశమయ్యాక కిర్గిజ్ భాషా వికాసం మీద బాగానే దృష్టిపెట్టారని స్థానికులు చెప్పిన మాట. సర్కారు విద్యాబోధన అంతా కిర్గిజ్ మీడియంలోనే సాగుతుంది. వెస్ట్రనైజ్డ్గా కనిపించే పట్టణ ప్రాంతమే మొత్తం దేశాన్ని డామినేట్ చేస్తుంది. "ఈ దేశం విద్యుత్ అవసరాలను హైడల్ ప్రాజెక్ట్‌లు, బొగ్గే తీరుస్తున్నాయి. అయితే పట్టణాల్లోని సెంట్రలైజ్డ్ హీటింగ్, ఎయిర్ కండిషనింగ్‌కి బొగ్గునే వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని అక్కడి పర్యావరణవేత్తల ఆవేదన. కాలుష్యంలో బిష్కేక్ది ఢిల్లీ తర్వాత స్థానం." లోకల్ మార్కెట్లదే హవా.. ఇక్కడ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అంతగా లేదనే చెప్పొచ్చు. ప్రైవేట్ బ్యాంకులు మొదలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వేళ్ల మీద లెక్కపెట్టేన్ని కూడా లేవు. స్థానికులను అడిగితే.. కమ్యూనిజం ప్రభావం వల్లేమో ప్రైవేట్ బ్యాంకుల మీద పూర్తిస్థాయి నమ్మకం ఇంకా కుదరలేదని చెప్పారు. అఫర్డబులిటీ, బేరసారాలకు వీలుడంటం వల్లేమో లోకల్ మార్కెట్సే కళకళలాడుతుంటాయి. ఇక్కడ ఓష్ బజార్, దొర్దోయి, అక్ ఎమిర్ లోకల్ మార్కెట్లు చాలా పాపులర్. మేం ఓష్ బజార్‌కి వెళ్లాం. రెండు రోజులు మార్కెట్ అంతా కలియతిరిగాం. సిల్వర్ జ్యూలరీ దగ్గర్నుంచి హ్యాండ్ అండ్ లగేజ్ బ్యాగ్స్, బట్టలు, వంట పాత్రలు, వెచ్చాలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, నట్స్ వరకు సమస్త సరకులకూ నిలయమిది. ఏ వస్తువులకు ఆ వస్తువుల సపరేట్ మార్కెట్ల సముదాయంగా కనిపిస్తుంది. బేరం చేయకుండా చూడాలంటేనే రోజంతా పడుతుంది. అన్నట్లు కిర్గిజ్‌లో సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చాలా ఫేమస్. ఓష్ బజార్లో ఒక్క సిల్వర్, సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ జ్యూలరీయే ఉంటుంది. ఈ దేశం లెదర్ గూడ్స్కీ ప్రసిద్ధే! లోకల్ ఫ్యాషన్‌ని చూడాలంటే ఇక్కడి బట్టల మార్కెట్‌ని సందర్శించొచ్చు. ఓష్ బజార్ ఈ మార్కెట్లో ఇంకో అట్రాక్షన్.. కిర్గిజ్స్తాన్ హ్యాండీక్రాఫ్ట్స్ షాప్స్. వీళ్ల సంప్రదాయ వేషధారణలోని కల్పక్ (సూఫీలు ధరించే టోపీని పోలి ఉంటుంది) దగ్గర్నుంచి వీళ్ల సాంస్కృతిక చిహ్నమైన యర్త్ హోమ్, సంప్రదాయ సంగీత వాద్యం కోముజ్ (వాళ్ల నేషనల్ మ్యూజిక్ సింబల్)ల కళాకృతులు, ఎంబ్రాయిడరీ.. ఊలు అల్లికల వరకు కిర్గిజ్ హస్తకళల నైపుణ్యానికి ప్రతీకలైన వస్తువులన్నీ ఈ షాపుల్లో దొరుకుతాయి. అయితే ఏది కొనాలన్నా చాలా బేరం ఆడాలి. కొన్ని చోట్ల వర్కవుట్ అవుతుంది. కొన్ని చోట్ల కాదు ఈ మార్కెట్లో అన్నిరకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్లూ ఉంటాయి. అయితే మేం వెళ్లింది అక్కడి వింటర్లో కాబట్టి పెద్దగా కనిపించలేదు. చలికాలాలు మైనస్ డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది కావున పంటలన్నీ వేసవిలోనే. యాపిల్స్, కమలా పళ్లు బాగా కనిపించాయి. ఇక్కడి కమలాలు భలే బాగున్నాయి రుచిలో. నిమ్మకాయ కన్నా కాస్త పెద్ద సైజులో ఉండే ఈ పండ్లే మా బ్రేక్ఫస్ట్ అక్కడున్నన్ని రోజులూ! కిర్గిజ్స్తాన్లో మరో ముఖ్యమైన కాపు వాల్నట్స్. ఇవి ఓష్బజార్లో రాశులు రాశులుగా కనిపిస్తాయి. బ్రౌన్ షెల్స్వే కాకుండా నాటుకోడి గుడ్డు పరిమాణంలో వైట్ షెల్స్‌తో కూడా ఉంటాయి. వీటిని చాక్లెట్లో రోస్ట్ చేసి అమ్ముతారు. ఒలుచుకోవడానికి ఒక హుక్లాంటిదీ ఇస్తారు. వీటితోపాటు ఇంకెన్నో రకాల నట్స్, డ్రైఫ్రూట్స్ ఈ మార్కెట్లో లభ్యం. కానీ మన దగ్గరకన్నా వాల్నట్సే చాలా చవక. మంచి క్వాలిటీవి కూడా సగానికి సగం తక్కువ ధరకు దొరుకుతాయి. రష్యన్ బ్రెడ్‌ని ఇష్టపడేవాళ్లు ఇక్కడ దాన్ని ట్రై చేయొచ్చు. చాక్లెట్స్ కూడా ఫేమస్. వాటికీ ప్రత్యేక దుకాణ సముదాయముంది. ఇంకో విషయం.. ఇక్కడ సూపర్ మార్కెట్లలో లిక్కర్కీ ఒక సెక్షన్ ఉంటుంది. రకరకాల కిర్గిజ్, రష్యన్ వోడ్కా బ్రాండ్స్ కనిపిస్తుంటాయి. "జవహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలు ప్రధానులుగా వాళ్ల వాళ్ల కాలాల్లో కిర్గిజ్స్తాన్ను సందర్శించారు. ఆయా సమయాల్లో అక్కడ పుట్టిన ఆడపిల్లలందరికీ ఇందిర అని పేరు పెట్టుకున్నారట. వాళ్లలో ఒకరు.. హయ్యర్ మెడికల్ డిగ్రీస్ పొందిన కిర్గిజ్స్తాన్ తొలి మహిళ.. డాక్టర్ ఖుదైబెర్జెనోవా ఇందిరా ఒరొజ్బేవ్నా. కిర్గిజ్స్తాన్ స్టేట్ మెడికల్ అకాడమీలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఆ దేశాధ్యక్షుడి తర్వాత అన్ని అధికార లాంచనాలు అందుకునే రెండో వ్యక్తి ఆమే! ఇంకో విషయం ఇక్కడున్న మన ఎంబసీ వీథి పేరు మహాత్మా గాంధీ స్ట్రీట్". మీడియా.. "ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో ఇక్కడ ప్రింట్ మీడియా అంతగా కనిపించదు. అందుకే ఎలక్ట్రానిక్ మీడియానే పాపులర్. ప్రభుత్వ చానెల్స్‌తోపాటు డజన్‌కి పైగా ప్రైవేట్వీ ఉన్నాయి. రష్యన్ చానెల్స్కే ఆడియన్స్ ఎక్కువ. ప్రైవేట్ ఎఫ్ఎమ్ రేడియో స్టేషన్లూ ఎక్కువే". కిర్గిజ్స్తాన్.. "ఈ ముస్లిం నొమాడిక్ ల్యాండ్‌కి సెంట్రల్ ఆసియా స్విట్జర్లండ్గా పేరు. యూఎస్సెస్సార్ విచ్ఛిన్నం తర్వాత 1991లో స్వతంత్ర దేశంగా మారింది. టీయెన్ షాన్ పర్వత శ్రేణుల మధ్య ఒదిగి.. కజకిస్తాన్, చైనా, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దుల్ని పంచుకుంటుంది. ఎన్నో నాగరికతలకు కూడలిగా ఉన్న సిల్క్‌రూట్‌లో భాగం. సెక్యులర్ కంట్రీ. అధ్యక్ష్య తరహా ప్రజాస్వామ్యం. వ్యవసాయమే ప్రధానం. కెనాళ్లు, చెరువులు సాగుకు ఆధారం. పత్తి, మొక్కజొన్న, గోధుమలు, తృణధాన్యాలు ప్రధాన పంటలు. తేనెటీగలు, మల్బరీ తోటల పెంపకమూ కనిపిస్తుంది. వ్యవసాయం యంత్రాల సాయంతోనే! చిన్న కమతాల రైతులు మాత్రం గాడిదలు, గుర్రాలను ఉపయోగిస్తారు. బొగ్గు, బంగారం, కాటుకరాయి, పాదరసం గనులున్నాయి. కొంత మొత్తంలో పెట్రోలియం, నేచురల్ గ్యాస్ నిల్వలూ ఉన్నాయి. మాంసం, పాల ఉత్పత్తులు, ఉన్ని ప్రధాన ఎగుమతులు. కరెన్సీ. సోమ్. జనాభా.. దాదాపు 67 లక్షలు. పురుషుల కన్నా మహిళలే అధికం". 14 క్యారెట్ గోల్డ్ జ్యూలరీ చూద్దామనే ఉత్సుకతతో ఒక రోజు ఆ షాపింగ్‌కీ వెళ్లాం. అదిరిపోయే డిజైన్స్ ఉన్నాయి కానీ చాలా కాస్టీ›్ల. అంత ధరపెట్టి 14 క్యారెట్ కొనేబదులు అదే ధరలో ఎంతొస్తే అంత 22 క్యారెట్ గోల్డే బెటర్ కదా అనే భారతీయ మనస్తత్వంతో కళ్లతోనే వాటిని ఆస్వాదించి వెనక్కి తిరిగొచ్చేశాం. సెకండ్స్ ఎక్కువ.. ఇక్కడ సెకండ్ హ్యాండ్ మార్కెట్ చాలా పెద్దది. ఫోర్ వీలర్స్ అన్ని సెకండ్సే. అందుకే ప్రపంచంలోని అన్ని బ్రాండ్స్.. అన్నీ మోడల్స్ ఇక్కడ కనిపిస్తాయి. వీటి కోసం బిష్కేక్కి దగ్గర్లోనే దాదాపు 20 ఎకరాల్లో ఒక మార్కెట్ ఉంటుంది. లెఫ్ట్ అండ్ రైట్ స్టీరింగ్.. రెండూ ఉంటాయి. పర్వత ప్రాంతమవడం వల్లేమో రైల్వే కంటే రోడ్డు రవాణాయే ఎక్కువ. మన దగ్గర కనిపించే స్వరాజ్ మజ్దాలాంటి వాహనాన్ని మార్ష్రూత్కా అంటారిక్కడ. ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌కి దాన్నే ఎక్కువగా వాడతారు. మనకు ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఉన్నట్టుగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులుంటాయి. వాటిని ట్రామ్స్ అంటారు. వీటికి రోడ్డు మీద పట్టాలేం ఉండవు. పైన కరెంట్ తీగతో పవర్ జనరేట్ అవుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఏం కాదు కానీ ధర చాలా చాలా తక్కువ. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ధర కాస్త ఎక్కువే. ట్రాఫిక్ చాలానే ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. అయినా ట్రాఫిక్ ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అత్యంత అవసరమైతే తప్ప హాంకింగ్ చేయకూడదు. ఫోన్లు కూడా సెకండ్ హ్యాండ్సే అధికం.. బ్రాండ్ న్యూ ఫోన్లు ఉన్నా! ఐఫోన్ వాడకం ఎక్కువ. బ్రాండ్ న్యూ హై ఎండ్ ఫోన్లు డ్యూటీ ఫ్రీతో మన దేశంలో కన్నా గణనీయమైన తక్కువ ధరకు లభిస్తాయి. నాడీ పట్టుకున్నారు.. "కిర్గిజ్స్తాన్లోని బిష్కేక్, ఇసిక్ కుల్ లాంటి చోట్ల భారతీయవిద్యార్థులు అందులో తెలుగు వాళ్లు వేల సంఖ్యలో ఉన్నారు. కారణం.. మెడిసిన్. అవును ఈ దేశం వైద్యవిద్యకు హబ్‌గా మారింది. ఇది ప్రైవేట్ రంగాలకిస్తున్న ప్రోత్సాహాన్ని గ్రహించి.. రష్యాలో మెడిసిన్ చదివిన కొత్తగూడెం వాసి డాక్టర్ పి. ఫణిభూషణ్ 20 ఏళ్ల కిందటే ఇక్కడ ఐఎస్హెచ్ఎమ్ (ఇంటర్నేషనల్ హయ్యర్ స్కూల్ ఆఫ్ మెడిసిన్)ను స్థాపించాడు. ఈ ప్రైవేట్ యూనివర్సిటీకొస్తున్న రెస్పాన్స్ చూసి ఇక్కడి ఐకే అకున్బేవ్ కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కేఎస్ఎమ్ఏ) ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఈ సంస్థకు తమ యూనివర్సిటీలో అఫిలియేషన్ ఇచ్చింది. ఐఎస్ఎమ్ ఎడ్యుటెక్ అనే కన్సల్టెన్సీ ద్వారా మన తెలుగు స్టూడెంట్స్ ఎందరికో కేఎస్ఎమ్ఏలో అడ్మిషన్స్ ఇప్పించి.. వాళ్ల వైద్యవిద్య కలను సాకారం చేస్తున్నారు డాక్టర్ ఫణిభూషణ్. ఈ రెండు యూనివర్సిటీల్లో దాదపు రెండువేలకు పైగా తెలుగు స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్లలో అమ్మాయిలే ఎక్కువ. ఎందుకంటే ఇది అమ్మాయిలకు సురక్షిత దేశం కాబట్టి. ఇక్కడా మెడిసిన్ అయిదున్నరేళ్లే! ఇంగ్లిష్‌లోనే బోధన సాగుతుంది. చక్కటి ఫ్యాకల్టీ, హాస్టల్ సదుపాయాలున్నాయి. ఆసియాలోనే అతి పెద్ద అనాటమీ ల్యాబ్స్‌లలో ఒకటి కేఎస్ఎమ్ఏలో ఉంది. కమ్యూనికేషన్‌కి ఫారిన్ స్టూడెంట్స్ ఇబ్బందిపడకూడదని కిర్గిజ్, రష్యన్ భాషలనూ నేర్పిస్తారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ కోసం పీఈటీ కూడా ఉంటుంది. ఇది అకడమిక్స్‌లో భాగం. వారానికి రెండుసార్లు ఇండియన్ ఫ్యాకల్టీతోనూ క్లాస్‌లుంటాయి. ఫారిన్లో మెడిసిన్ పూర్తిచేసుకున్న స్టూడెంట్స్‌కి ఇండియాలో పెట్టే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్ (ఎఫ్ఎమ్జీఈ) కోసమూ ఇక్కడ ప్రత్యేక శిక్షణనిస్తారు. అయితే కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదవడానికి మన నీట్ ఎగ్జామ్ క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ‘ఇండియాలో మెడికల్ సీట్లు తక్కువ. కాంపీటిషన్ చాలా ఎక్కువ. ఎంత కష్టపడ్డా మంచి కాలేజ్‌లో సీట్ దొరకదు. ‘బీ’ కేటగరీ సీట్‌కి కనీసం కోటి రూపాయలుండాలి. అంతే ఫెసిలిటీస్.. అంతే మంచి ఫ్యాకల్టీతో ఇక్కడ 35 లక్షల్లో మెడిసిన్ అయిపోతుంది. అదీగాక మంచి ఎక్స్పోజర్ వస్తోంది’ అని చెబుతున్నారు అక్కడి మన తెలుగు విద్యార్థులు. ‘పిల్లల్ని మెడిసిన్ చదివించడానికి ఆస్తులు తాకట్టుపెట్టిన పేరెంట్స్‌ని చూశాను. డెడికేషన్ ఉన్న స్టూడెంట్స్‌కి మెడిసిన్ అందని ద్రాక్ష కాకూడదని, తక్కువ ఖర్చుతో క్వాలిటీ మెడికల్ ఎడ్యుకేషన్‌ని అందించాలనే సంకల్పంతో ఈ సంస్థను స్టార్ట్ చేశాం. అంతేకాదు యాక్టర్ సోనూ సూద్ సహకారంతో ఫీజులు కట్టలేని నీట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్‌ని మా కాలేజెస్లో ఫ్రీగా చదివిస్తున్నాం’ అని చెప్పారు డాక్టర్ ఫణిభూషణ్". - డాక్టర్ ఫణిభూషణ్ విద్య, వైద్యం ఫ్రీ.. ఇందాకే ప్రస్తావించుకున్నట్టు మౌలిక సదుపాయాల విషయంలో ఈ దేశం ఇంకా కమ్యూనిజం విలువలనే పాటిస్తోంది.. విద్య, వైద్యాన్ని ఉచితంగా అందిస్తూ! ప్రైవేట్ బడులు, ఆసుపత్రులు లేవని కాదు.. చాలా చాలా తక్కువ. చదువు విషయంలో ఇంగ్లిష్ మీడియం కావాలనుకునే వాళ్లే ప్రైవేట్ బడులకు వెళ్తారు. అయితే ఈ బడుల్లో కూడా కిర్గిజ్, రష్యన్ నేర్పిస్తారు. ఆటలంటే ప్రాణం పెడతారు. ప్రతి విద్యార్థి ఆటల్లో పాల్గొనాల్సిందే! పాఠశాల విద్య నుంచి ప్రొఫెషనల్ కోర్స్ మెడిసిన్ దాకా ఆటలనూ అకడమిక్స్గానే పరిగణిస్తారు. పాఠ్యాంశాలతోపాటు పీఈటీకీ మార్కులుంటాయి. అథ్లెటిక్స్, వాలీబాల్ ఎక్కువ. బిష్కేక్లోని పార్క్స్, గ్రౌండ్స్‌లో అథ్లెట్స్ ప్రాక్టిస్ చేస్తూ కనపడ్తారు. లెవెంత్ క్లాస్ తర్వాత ప్రతి విద్యార్థి సైన్యంలో శిక్షణ తీసుకోవాలి. ప్రతి శని, ఆదివారాలు స్కూల్ పిల్లలు నగర వీథులను శుభ్రం చేయాలి. మొక్కలు నాటాలి. నీళ్లు పోయాలి. ప్రభుత్వాసుపత్రులైతే ఆధునిక సదుపాయాలతో ప్రైవేట్ ఆసుపత్రులను తలదన్నేలా ఉంటాయి. జీరో క్రైమ్.. నో డొమెస్టిక్ వయొలెన్స్! బిష్కేక్లో మేం తిరిగిన ప్రాంతాల్లో ఎక్కడా మాకు పోలీస్ స్టేషన్లు కనించలేదు. ఆశ్చర్యపోతూ మేం తిరిగిన మార్ష్రూత్కా డ్రైవర్లను అడిగితే.. నవ్వుతూ ‘ఉంటాయి కానీ మా దగ్గర క్రైమ్ చాలా తక్కువ. దాదాపు జీరో అని చెప్పుకోవచ్చు’ అన్నారు. డొమెస్టిక్ట్ వయొలెన్స్కీ తావులేదు. ఇక్కడ ఇంటికి యజమానురాలు మహిళే. ఆర్థిక వ్యవహారాల దగ్గర్నుంచి అన్నిటినీ ఆమే చూసుకుంటుంది. లీడ్‌లోనే చెప్పుకున్నట్టు మహిళలను గౌరవించే దేశం. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్.. అన్నిట్లో మహిళలే ఎక్కువ. ట్రక్‌ని డ్రైవ్ చేస్తూ.. సంస్థల్లో ఫ్రంట్ ఆఫీస్ నుంచి మేనేజర్లు.. ఆంట్రప్రన్యూర్స్ దాకా.. లాయర్లుగా.. డాక్టర్లుగా.. ఇలా ప్రతిచోటా మహిళలే ఎక్కువగా కనిపిస్తారు. అల అర్చా నేషనల్ పార్క్ విమెన్స్ డే జాతీయ పండగే.. కిర్గిజ్ ప్రజలు మహిళలకు ఎంత విలువిస్తారో చెప్పడానికి ఇక్కడ జరిగే విమెన్స్ డే సెలబ్రేషనే ప్రత్యక్ష్య ఉదాహరణ. దాన్నో జాతీయ పండగలా నిర్వహిస్తారు. ఆ రోజు మగవాళ్లందరూ గిఫ్ట్స్‌తో తమ ఇంట్లో.. తమ జీవితంలోని స్త్రీలకు గ్రీటింగ్స్ చెప్తారు. తమ మనసుల్లో వాళ్లకున్న చోటు గురించి కవితలల్లి వినిపిస్తారు. మేం వెళ్లింది విమెన్స్ డే అయిన వారానికే కాబట్టి బిష్కేక్లో ఇంకా ఆ సంబరం కనిపించింది.. సిల్వర్, 14 క్యారెట్ గోల్డ్ మార్కెట్లలో విమెన్స్ డే స్పెషల్ కలెక్షన్స్‌తో! దీని ప్రభావం కిర్గిజ్స్తాన్లో మెడిసిన్ చదువుకుంటున్న మన తెలుగు విద్యార్థుల మీదా కనిపించింది.. వాళ్లు చదువుకుంటున్న కిర్గిజ్ స్టేట్ మెడికల్ అకాడమీ (కిర్గిస్తాన్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయం)కి వెళ్లినప్పుడు! వాళ్ల క్లాస్ రూమ్స్ కారిడార్ వాల్స్ మీద రకరకాల గ్రీటింగ్ కార్డ్స్ అతికించి ఉన్నాయి. ఆ కాలేజ్‌లోని ప్రతి అబ్బాయి వాళ్లమ్మ .. అమ్మమ్మ.. నానమ్మ.. అత్త.. పిన్ని.. అక్క.. చెల్లి.. టీచర్.. ఫ్రెండ్.. ఇలా వాళ్లకు సంబంధించిన .. వాళ్లకు పరిచయమున్న మహిళలు.. అమ్మాయిల గురించి ఆ గ్రీటింగ్ కార్డ్స్ మీద రాసి తమకు వాళ్ల పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. అమ్మాయిలను తమకు ఈక్వల్‌గా ట్రీట్ చేయాలని కిర్గిజ్స్తాన్ కల్చర్‌ని చూసి నేర్చుకుంటున్నామని చెప్పారు భారతీయ విద్యార్థులు. యర్త్ హోమ్స్ సిటీ ఆఫ్ గార్డెన్స్.. బిష్కేక్లో ఎటుచూసినా విశాలమైన గార్డెన్లు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. మేం వెళ్లినప్పుడు స్ప్రింగ్ సీజన్‌కి ముస్తాబవుతున్నాయి. వింటర్ అయిపోయే సమయంలో మట్టి తవ్వి.. కొత్త మట్టి వేసి.. కొత్త మొక్కల్ని నాటుతారట. మాకు ఆ దృశ్యాలే కనిపించాయి. స్ప్రింగ్ టైమ్‌లో ఈ కొత్త మొక్కలన్నీ రకరకాల పూలతో వసంత శోభను సంతరించుకుంటాయి. అసలు కిర్గిజ్స్తాన్ని స్ప్రింగ్ సీజన్లోనే చూడాలని స్థానికుల మాట. తోటల్లోనే కాదు.. కొండలు .. లోయల్లో కూడా మంచంతా కరిగి.. మొక్కలు మొలిచి.. రకారకాల ఆకులు.. పూలతో కొత్త అందం పరచుకుంటుంది. అందుకే ఆ టైమ్‌లోనే పర్యాటకుల సందడెక్కువ. సిటీ స్క్వేర్.. ఒక పూటంతా బిష్కేక్ సిటీ స్క్వేర్‌లో గడిపాం. మార్చి 21.. కిర్గిజ్స్తా¯Œ కొత్త సంవత్సరం నూరోజ్ పండగ. మేం అక్కడికి వెళ్లేప్పటికి ఆ వేడుక కోసం పిల్లలంతా జానపద నృత్యాలు.. పాటలతో రిహార్సల్స్ చేసుకుంటూ కనిపించారు.. కిర్గిజ్స్తాన్ ఎపిక్ హీరో మనాస్ విగ్రహం ముందు. పదిలక్షలకు పైగా పద్యాలతో ఉన్న ఈ మనాస్ కావ్యం కిర్గిజ్ ప్రజల చరిత్ర, సంస్కృతి, ఫిలాసఫీని అభివర్ణిస్తుంది. ఇది ప్రపంచంలోకెల్లా అతి పెద్ద కావ్యంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ కింద దీని సంరక్షణ బాధ్యతను యునెస్కో తీసుకుంది. అంతటి ప్రాశస్త్యమున్న మనాస్ విగ్రహానికి పక్కనే కొంచెం దూరంలో ఆ దేశ పార్లమెంట్ ఉంటుంది. విశాలమైన రోడ్లు.. వాటికి ఆనుకుని గార్డెన్లు.. పాత్వేలతో ఎక్కడో యూరప్‌లోని దేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది. నూరోజ్ కోసం బిష్కేక్ ప్రత్యేకంగా ముస్తాబవుతుందట. యర్త్ హోమ్‌లు.. హస్తకళల ఎగ్జిబిషన్స్ జరుగుతాయి. ఆ సన్నాహాలు కనిపించాయి. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ వేడుకలు ఇసిక్ కుల్ సాల్ట్ లేక్.. ఒకరోజు బిష్కేక్కి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల అర్చా వెళ్లాం. అ ్చ అటఛిజ్చి అంటే రంగురంగుల జూనపర్ చెట్లు అని అర్థం. రకరకాల పక్షులు, అడవి మేకలు, జింకలు, కొమ్ముల మేకలు, తోడేళ్లకు నిలయం ఈ ప్రాంతం. ఇక్కడున్న నేషనల్ పార్క్ చూడదగ్గది. మంచు కొండల మీద ట్రెకింగ్, పైన్ చెట్లు.. వాటర్ ఫాల్స్, టీయెన్ షాన్ శ్రేణుల నుంచి పారే నదులు.. నిజంగానే స్విట్జర్లండ్లో ఉన్నామేమో అనే భ్రమను కల్పిస్తుంది. అన్నిటికీ మించి ఇక్కడి స్వచ్ఛమైన గాలి.. ఓహ్.. అనుకుంటాం గానీ పాడు చలి చంపేస్తుంది. పార్క్ ఎంట్రెన్స్ నుంచి మంచులో దాదాపు మూడు గంటలకు పైగా నడిస్తే గానీ నదీ తీరానికి వెళ్లలేం. ఆ తీరం వెంట ఇంకాస్త ముందుకు వెళితే వాటర్‌ఫాల్స్. అలాగే మరికాస్త వెళితే అక్ సై హిమానీ నదం. ఇది అద్భుతమని చెబుతుంటారు స్థానికులు. అక్కడ నైట్ క్యాంప్ వేసుకోవచ్చట. ఇసిక్ కూల్ లేక్ కానీ మైనస్ డిగ్రీల టెంపరేచర్లో మాకు అర కిలోమీటర్ నడిచేసరికే కాళ్లు, చేతులు కొంకర్లు పోయి.. ముక్కు, పెదవులు పగిలి.. మాట మొద్దు బారిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాం. అలాగని అక్కడే ఉండి పక్షుల కిలకిలారావాలు.. పైన్ చెట్ల తోపులను ఆస్వాదించలేకపోయాం ఇది ప్రొఫెషనల్ ట్రెకర్స్కే సాధ్యమని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటూ తిరిగొచ్చి మార్ష్రూత్కాలో కూలబడ్డాం. అందులోని హీటర్‌కి చలికాచుకున్నాం. మా చలివణుకు చూసి డ్రైవర్లు ఒకటే నవ్వులు. ఇంకోరోజు ఇసిక్ కుల్కి ప్రయాణమయ్యాం. బిష్కేక్ నుంచి ఇది దాదాపు 260 కిలోమీటర్లు. సూర్యోదయానికి ముందే స్టార్ట్ అయ్యాం. దార్లో సిల్క్‌రూట్ టచ్ అవుతుంది కిర్గిజ్స్తాన్ – కజకిస్తాన్ బార్డర్లో. మసక చీకటి.. మంచు.. మార్ష్రూత్కా విండో గ్లాసెస్ మీది ఫాగ్ తుడుచుకుని.. కళ్లు చిట్లించుకున్నా బయటి దృశ్యం స్పష్టంగా లేదు. వెహికిల్ ఆపడానికి లేదు. వచ్చేప్పుడు చూడొచ్చులే అనుకున్నాం. వచ్చేప్పుడూ సేమ్ సీన్. రాత్రి.. చీకటి.. మంచు అయితే ఇసిక్ కుల్ సాల్ట్ లేక్ ఆ నిరాశను కాస్త మరిపించింది. కాస్పియన్సీ తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సరస్సుగా.. టిటీకాకా తర్వాత రెండవ అతిపెద్ద మౌంటెన్ లేక్ సరస్సుగా పేరుగాంచిందీ భూతల స్వర్గం. ఆకాశాన్ని అంటుతున్నట్టు కనిపించే మంచు పర్వతాల ఒడిలో నింగి నీలంతో.. చల్లదనంలో ఆ హిమ గిరులతో పోటీ పడుతూ నా ఊహల్లోని మానస సరోవరానికి కవలగా కనపడింది. మైనస్‌లోకి పడిపోయే టెంపరేచర్‌లోనూ ఇది గడ్డకట్టదు. ఈ లేక్‌లో బోటింగ్ కూడా ఉంటుంది. దీనికి విశాలమైన ఇసుక బీచ్ ఉంటుంది. ప్రతి సెప్టెంబర్‌లో ఇక్కడ వరల్డ్ నొమాడిక్ గేమ్స్ జరుగుతాయి. దీన్ని 2014లో కిర్గిజ్స్తానే ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంచార ప్రజల సంస్కృతీసంప్రదాయల పునరుద్ధరణ, సంరక్షణతోపాటు.. ఈ గేమ్స్‌లో పాల్గొంటున్న దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో! మొదటి సంవత్సరం ఇందులో 19 దేశాలు పాల్గొంటే 2018 కల్లా 66 దేశాల నుంచి 1500 మంది పాల్గొన్నారు. ఇవి ఒక్క క్రీడాకారులనే కాదు పలురంగాల్లోని కళాకారులందరినీ ఏకం చేస్తోంది. ఈ సంబరాల్లో ఒక్క ఆటలే కాదు.. కిర్గిజ్స్తాన్ కల్చర్, ఫుడ్, ఆర్ట్స్, షాప్స్ అన్నీ తరలి వస్తాయి. వందల సంఖ్యలో యర్త్ హోమ్స్ వెలసి.. ప్రపంచ అతిథులకు ఆతిథ్యాన్నిస్తాయి. ఆ సమయంలో ఇసిక్ కుల్లో ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారట. ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవకూడని ఈవెంట్ ఇదని స్థానికులు అంటారు. ఇసిక్ కుల్ నుంచి వచ్చాక ఒకరోజు బిష్కేక్ పొలిమేరలో పౌల్ట్రీ, డెయిరీ ఫామ్ నడిపిస్తున్న ఓ రష్యన్ ఫ్యామిలీ దగ్గరకు వెళ్లాం. అతని పేరు దినేశ్. అరే.. ఇండియన్ నేమ్ అని మేం ఆశ్చర్యపోతుంటే.. అతను నవ్వి.. యూఎస్సెస్సార్లో బాలీవుడ్‌కి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది ఆ ప్రభావంతోనేమో తనకు దినేశ్ అనే పేరుపెట్టారని చెప్పాడు. నిజమే అక్కడ మాకు కుమార్ అనే పేరూ కామన్‌గా వినిపించింది. బిష్కేక్లో మెడికల్ కాలేజ్ అనుబంధ హాస్టల్స్‌లో ఉండి చదువుతున్న భారతీయ వైద్యవిద్యార్థుల కోసం పాలు, చికెన్, కూరగాయలను సప్లయ్ చేయడం కోసమే తను ప్రత్యేకంగా డెయిరీ, పౌల్ట్రీ ఫామ్‌లను నడుపుతున్నాని, కూరగాయలను సాగు చేస్తున్నాని చెప్పాడు దినేశ్. వరల్డ్ నొమాడిక్ గేమ్స్ మిస్సింగ్.. ఉన్న వారంలో చలి.. ఎండ.. వాన మూడు కాలాలనూ చూపించింది కిర్గిజ్స్తాన్. ఎండ, వాన ఉన్నా చలి కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ వెదర్.. చిన్నపిల్లలమైపోయి మంచులో ఆటలు.. స్కీయింగ్, రోప్ వే సాహసాలు.. కిర్గిజ్, రష్యన్ మాటల్ని నేర్చుకోవడం.. వాళ్ల క్రమశిక్షణకు అబ్బురపడటం.. ఆ ప్రశాంతతను ఆస్వాదించడం.. ఉన్నదాంట్లో తృప్తిపడుతున్న వాళ్ల నైజానికి ఇన్స్పైర్ అవడం.. అక్కడి ఆడవాళ్ల సాధికారతకు గర్వడటం.. మొత్తంగా కిర్గిజ్స్తాన్ మీద బోలెడంత గౌరవంతో తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యాం! కానీ ఒక్క అసంతృప్తి మిగిలిపోయింది. జమీల్యా, తొలి ఉపాధ్యాయుడు వంటి ఎన్నో పుస్తకాలతో ఎప్పుడో కిర్గిజ్స్తాన్ని పరిచయం చేసిన చెంఘిజ్ ఐత్మతోవ్ని కలిపే ఆయన మ్యూజియాన్ని చూడలేపోయామని! బిష్కేక్లో ఉందా మ్యూజియం. దాంతోపాటు కిర్గిజ్స్తాన్ హిస్టరీ అండ్ ఆర్ట్స్‌కి సంబంధించిన మ్యూజియమూ ఉంది. ఇదీ చూడలేదు.. సమయాభావం వల్ల! ఐత్మతోవ్ పుట్టిన నేల మీద నడయాడమన్న కాస్త ఊరటతో కిర్గిజ్స్తాన్కి సలామత్ బొలుప్ జక్ష్య (ఇప్పటికి వీడ్కోలు)! ఎప్పుడైనా స్ప్రింగ్‌లో ఒకసారి కిర్గిజ్స్తాన్ను చూసి.. ఐత్మతోవ్ని పలకరించాలని ఆశ! రహమత్ .. స్పసీబా.. థాంక్యూ! — శరాది ఇవి చదవండి: 'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త! -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
Cover Story: ఆ ఖాళీ సమాధి యేసు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యం!
‘‘యేసు సమాధిలో పరుండియుండి వాసిగ మూడవనాడు లేచెన్.. లేచెన్ సమాధి నుండి మృత్యువుపై విజయమొంది.. మృత్యుబంధంబులన్ నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్.. జయం జయం’’ అంటూ రాబర్ట్ లౌరీ వ్రాసిన పాటను గొంతెత్తి పాడే సమయం ఈస్టర్ పండుగ. ప్రపంచవ్యాప్తంగా విస్తరించియున్న క్రైస్తవులు ఈస్టర్ పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. మరణపు మెడలు వంచి మరణభయం నుంచి మానవుని విడిపించడానికి యేసు పునరుత్థానుడయ్యాడు. ప్రస్తుతం ఝెరూషలేములోని యేసు ఖాళీ సమాధి క్రీస్తు పునరుత్థానానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది. మహిమాన్వితమైన ఆ చారిత్రక సంఘటన మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ‘‘ఆ కాలంలో యేసు అనే ఒక మనుష్యుడుండేవాడు. అతడిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. ఎందుకంటే అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి మంచి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు మొదట ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుండి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు’’ ఈ మాటలను చరిత్రకారుడు ఫ్లావియస్ జోసఫస్ తన పుస్తకంలో వ్రాశాడు. ఆయన రాసిన సంగతులు నేటికీ చరిత్రకు ఆధారంగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జన్మను, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ధ్రువీకరించాడు. ‘‘యేసుక్రీస్తు నిజంగా జీవించి, మరణించి, మృతులలో నుండి లేచాడన్న తమ దృఢ విశ్వాసము కొరకు వారు శ్రమపడి మరణించారు’’ అని సుటోనియస్ అనే చరిత్రకారుడు వ్రాశాడు. ఇతడు రోమా చరిత్రకారుడు. హేడ్రియన్ అనే రాజు వద్ద అధికారిగా పనిచేసేవాడు. చరిత్రకు సంబంధించిన విషయాలను స్పష్టంగా తన వ్రాతలలో పొందుపరచాడు. రోమన్ చక్రవర్తులైన జూలియస్ సీజర్ నుండి డొమీషియన్ వరకు గల 12 మంది చక్రవర్తుల జీవిత చరిత్రలను వ్రాశాడు. రోమా సామ్రాజ్యంలోని రాజకీయాల గూర్చి, కవులను గూర్చి, సామాన్య ప్రజలను గూర్చి చాలా విషయాలు వ్రాసి భద్రపరచాడు. మొదటి శతాబ్దంలో రగిలిన ఉజ్జీవాన్ని, సంఘం పొందిన శ్రమలను, ధైర్య విశ్వాసాలతో పరిస్థితులను ఎదుర్కొన్న దేవుని ప్రజల పరిస్థితిని సుటోనియస్ వివరించుట ద్వారా యేసుక్రీస్తు ఒక కల్పిత పాత్ర కాదని, ఆయన మనుష్యులందరి కొరకు ప్రాణం పెట్టి మూడవ రోజున తిరిగిలేచిన సజీవుడని ప్రతి ఒక్కరూ గుర్తించడానికి దోహదమయ్యింది. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. ఒక వ్యక్తి గెలుపుబాటలో అప్రతిహతంగా దూసుకుపోవాలన్నా, పరీక్షా ఘట్టాలను, గడ్డు సవాళ్లను అధిగమించి కీర్తి కిరీటం దక్కించుకోవాలన్నా పరమాత్ముని బాటలో నడవాలని క్రీస్తు బోధించాడు. సి.ఎస్.లూయీ అనే సుప్రసిద్థ సువార్తికుడు, వేదాంతవేత్త ఇలా అంటాడు. ‘‘యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే అని చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధీకుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతి స్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ట బోధలు చేసియుండేవారు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు.’’ తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని, అయన ప్రేమతత్త్వాన్ని తాను రచించిన ఎనిమిది వేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ట బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది. సమాధి ఆయనను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్ళు విడచుట మానండి ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’’ ఈ మాటలను తన హృదయాంతరాళాల్లోంచి వ్రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువు చేసింది క్రాస్బీ. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గురించిన ప్రవచనాలు ఉన్నాయి. ‘‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్ళుపట్టనియ్యవు’’– (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. ఝెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం ఝెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో అనేకసార్లు తన శిష్యులకు ఇలా చెప్పాడు. ‘‘మనుష్యకుమారుని గూర్చి ప్రవక్తలచేత వ్రాయబడిన మాటలన్నియు నెరవేర్చబడును. ఆయన అన్యజనులకు అప్పగించబడును. వారు ఆయనను అపహసించి, అవమానపరచి, ఆయన మీద ఉమ్మివేసి, ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు. మూడవ దినమున ఆయన మరల లేచునని చెప్పెను’’– (లూకా 18:3133). క్రీస్తు తనకు సంభవింపబోవు వాటిని ముందుగానే తన శిష్యులకు తెలియచేశాడు. వాస్తవానికి యేసుక్రీస్తుకు పొంతి పిలాతు అనే రోమన్ గవర్నర్ ద్వారా అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తిని తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈ నాటికి ఝెరూషలేమునకు వెళ్ళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గములో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫనిషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ యొక్క బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. యేసు సిలువను మోసుకొంటూ గొల్గొతా అనే ప్రాంతాన్ని చేరుకోగానే ఆయనను సిలువపై ఉంచి చేతులలోను కాళ్ళలోను మేకులు కొట్టి వేలాడదీశారు. శుభ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు యేసును సిలువవేశారు. సుమారు ఆరు గంటలు యేసు సిలువపై వ్రేలాడి ఏడు మాటలు పలికారు. నేటికి అనేకమంది సిలువలో క్రీస్తు పలికిన యేడు మాటలను ధ్యానం చేస్తుంటారు. పలుకబడిన ఒక్కోమాటలో ప్రపంచానికి కావల్సిన అద్భుతమైన సందేశం ఉందని క్రైస్తవులు విశ్వసిస్తారు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను అంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. అంతవరకు తనలో గూడుకట్టుకున్న భయాన్ని వదిలి పిలాతు దగ్గరకు వెళ్ళి తన ప్రభువును పాతిపెట్టడానికి అనుమతి కోరాడు. సిలువ వేయబడిన ఒక వ్యక్తికోసం మహాసభ సభ్యుడైన అతడు బహిరంగంగా తీసుకొన్న తన నిర్ణయం వలన పిలాతుకు కలిగిన ఆశ్చర్యం, యూదులకు కలిగిన అసహనం ఊహించవచ్చు. యోసేపు తనకోసం తొలిపించుకున్న రాతి సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ‘‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’’ అని సమాధానమిచ్చాడు. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గురించి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ, మరణపు ముల్లును విరిచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. నిత్య జీవితంలో ప్రతి ఒక్కరూ ఆశించేది గెలుపు. ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని ఇచ్చేది. భూమ్మీద బతికే అందరికి ముఖ్యమైనది కూడా. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం వల్ల దక్కిన సంతృప్తితో కాలం గడపాలని కోరకుంటాడు. ఓటమి అంగీకరించడం చేదైన విషయమే! మింగుడు పడని వ్యవహారమే! ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో.. ఇంకా మరెన్నో! ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే ఇంత సంతోషంగా మానవుడుంటే, ప్రతి మనిషికి ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే?! మృత్యువునే గెలిస్తే?! ఇంకెంత ఆనందం, ఇంకెంత ఉత్సాహం! సరిగ్గా రెండు వేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణం మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరినీ తన గుప్పిట్లో బంధించిన మరణం మరణించింది. అసలు ఈ పుట్టుకకు, మరణానికి, దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికి అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. గొప్పవ్యక్తులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బాబిలోను రాజైన నెబూకద్నెజర్ మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికి అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోమ్‌లో జూలియస్ సీజర్ సమాధి మూయబడియుంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదని ఋజువు చేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్లతరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యల మీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తర్వాత ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలను బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి, ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోనికి తీసుకొచ్చారు గాని, వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు.. స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలను ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా! సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని, చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షంలోనే యేసుకు మేకులు కొట్టబడ్డాయి. ముళ్ళకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియ అంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ‘ఆ నీతిమంతుని జోలికి పోవద్దు’ అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుని, ఇలా అడిగింది ‘‘సిలువలో మరణించిన క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి? ఆ మహనీయుని గురించి ఏమనుకుంటున్నావు?’’ ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది‘‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్టమధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పై నుండి కిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరతాడు. ఈసారి ఆయనను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’’ అని బదులిచ్చాడు. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మనిషికి సమాధానం, ధైర్యం, నిరీక్షణ అనుగ్రహించబడ్డాయి. సమాధానం.. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి శిష్యులకు ఆదివారం సాయంత్రం పునరుత్థానుడైన యేసు ప్రత్యక్షమయ్యాడని అపొస్తలుడైన యోహాను తన సువార్తలో వ్రాశాడు. శిష్యులంతా ఇంటి తలుపులు మూసికొనియుండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి ‘మీకు సమాధానం కలుగునుగాక’ అని వారితో చెప్పెను. మూడున్నర సంవత్సరాలు తనతో ఉండి గెత్సేమనే తోటలో తనను పట్టుకుంటున్నప్పుడు విడిచి పారిపోయిన వారిని బహుశా ఎవరైనా చీవాట్లు పెడతారేమో గాని ప్రేమపూర్ణుడైన ప్రభువు వారి స్థితిని సంపూర్ణంగా తెలుసుకున్నవాడై వారికి శాంతి సమాధానాలను ప్రసాదించాడు. సమాధానకర్తయైన ప్రభువును హృదయాల్లోనికి ఆహ్వానించడమే ఆశీర్వాదకరం. ఈనాడు అనేకులు తమ పరిస్థితులను బట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్యహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా భయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే! నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలిసిపోయిన ప్రజలను చూసి ఇలా అన్నాడు. ‘‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’’ ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమను విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతన ఉత్తేజంతో, ఉత్సాహంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. గెలుపుబాటలో దూసుకుపోయారు. భయపడకుడి.. ఆదివారం ఉదయం తెల్లవారకముందే కొంతమంది స్త్రీలు క్రీస్తు సమాధిని చూడడానికి వచ్చారు. వారక్కడికి వచ్చినప్పటికే ఒక గొప్ప భూకంపం వచ్చింది. ప్రభువు దూత పరలోకం నుండి దిగివచ్చి సమాధిరాయి పొర్లించి దానిమీద కూర్చుండెను. అక్కడ ఉన్న రోమా కావలివారు వణికి చచ్చినవారివలె ఉన్నారు. వారు భయపడాల్సింది ఏదీలేదనే వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. లోకమంతా ఎన్నో భయాలతో నిండింది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యాలు, ఇంకా ఎన్నో సమస్యలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. భయం మనిషిని ముందుకు వెళ్ళనివ్వదు. గమ్యంవైపు సాగనివ్వదు. భయం గుప్పిట్లో జీవిస్తున్న మనిషికి నిజమైన ధైర్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడన్నది లేఖన సత్యం. నిరీక్షణ.. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయన పట్ల విశ్వాసాన్ని కొనసాగించువారికి నిత్యజీవాన్ని అనుగ్రహించుటకు రాబోతున్నారు. ఆయన పునరుత్థానుడై ఉండకని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురు చూసేవారు ఎన్నడూ సిగ్గుపడరు. ప్రభువునందు మనకున్న నిరీక్షణ ఎన్నడూ అవమానకరము కాదు. ‘‘విజయంబు విజయంబు మా యేసు నిజమె మృత్యువును గెలిచి నేడు వేంచెసె యజమానుడెల్ల ప్రయాసములు ఎడబాప స్వజనులను రక్షింప సమసె సిలువమీద... విజయంబు మానవుల పాపము నివృత్తిని విభుడొనరింపన్ కుజనులచే అతడు క్రూర మరణము నొంది విజిత మృత్యువునుండి విజయుండై వేంచేసె’’ అంటూ కీర్తనలు పాడుచూ క్రీస్తు పునరుత్థానమును ఆధ్యాత్మిక ఆనందంతో, నిండు హృదయంతో దేవుని ప్రజలంతా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను. (సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు). — డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి ఇవి చదవండి: Funday Story: 'ఋతధ్వజుడు మదాలసల గాథ' -
నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'!
నిజాలతో నిమిత్తం లేకుండా అబద్ధాలను అడ్డగోలుగా వండి వడ్డించడానికి వార్తాపత్రికలు, టీవీ చానళ్లు అలవాటుపడిపోయాయి. వీటికి తోడుగా సోషల్ మీడియా కూడా తయారైంది. సంచలనం రేకెత్తించే అంశం ఏదైనా ఉంటే చాలు, అబద్ధాలు వేడి వేడి పకోడీల కన్నా వేగంగా అమ్ముడుపోతాయి. వస్తువులైనా, సేవలైనా విపణిలో అమ్ముడుపోతేనే విక్రేతలకు సొమ్ములొస్తాయి. వార్తలు కూడా విపణి వస్తువులే! పోటీదారుల కన్నా త్వరగా, ఎక్కువగా వార్తలను అమ్ముకోవడానికి మీడియా సంస్థలు, సోషల్ మీడియా వేదికలు నిస్సిగ్గుగా విలువలను విడిచిపెట్టి, అబద్ధాలను అట్టహాసంగా ప్రచారంలో పెడుతున్నాయి.అలాగని తప్పుడు వార్తల తాషా మార్పా ఇప్పటి పరిణామమేమీ కాదు. వార్తాపత్రికలు ప్రాచుర్యాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టిన తొలిరోజుల నుంచే తప్పుడు వార్తల ప్రచారం కూడా మొదలైంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక తప్పుడు కథనాల ప్రచారం తారస్థాయికి చేరుకుంది.పత్రికలు సర్క్యులేషన్ పెంచుకోవడానికి, టీవీ చానళ్లు టీఆర్పీ రేటింగులు పెంచుకోవడానికి, సోషల్ మీడియా వేదికలు వీక్షకుల సంఖ్యను పెంచుకోవడానికి ఎంతటి అబద్ధాలనైనా అలవోకగా ప్రచారం చేస్తున్నాయి. వదంతులను సృష్టించడం, ప్రత్యర్థులపై బురద చల్లడం నిత్యకృత్యంగా సాగిస్తున్నాయి. మూకుమ్మడిగా ఇవి సాగిస్తున్న అబద్ధాల అట్టహాసానికి వాస్తవాలు అట్టడుగున మరుగునపడిపోయే పరిస్థితులు దాపురిస్తున్నాయి.‘సత్యమేవ జయతే’ అనే మాటను జాతీయ ఆదర్శంగా చెప్పుకున్న మన దేశం అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల ప్రచారంలో ప్రపంచ దేశాలన్నింటినీ తలదన్ని అగ్రస్థానంలో నిలవడమే వర్తమాన విషాదం. అబద్ధపు వార్తలు, తప్పుడు కథనాల సృష్టిని, వ్యాప్తిని అరికట్టడం ప్రపంచవ్యాప్తంగా వ్యవస్థలకు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక తప్పుడు వార్తల ప్రచారం మరింత ఉద్ధృతంగా మారింది. అనామకమైన వెబ్సైట్లు తప్పుడు వార్తలను పుంఖాను పుంఖాలుగా గుప్పిస్తున్నాయి. వీటి మూలాలను గుర్తించడం కూడా ప్రభుత్వ, చట్టపరిరక్షణ వ్యవస్థలకు సవాలుగా మారుతోంది.అబద్ధాల అట్టహాసాన్ని అరికట్టడానికి పలు దేశాలు చట్టాలను రూపొందించినా, అనామకమైన వెబ్సైట్లలో తప్పుడు కథనాల సృష్టికర్తలు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో నిందితులపై చర్యలు తీసుకునే అవకాశాలు దాదాపు గగనంగా ఉంటున్నాయి. అబద్ధాలు నిండిన తప్పుడు కథనాల వల్ల జనాల్లో గందరగోళం, విద్వేషపూరిత వాతావరణం ఏర్పడటమే కాకుండా, ఆర్థిక వ్యవస్థ కూడా కుదుపులకు లోనవుతోంది.కొన్ని తప్పుడు కథనాల కథా కమామిషు..► గత ఏడాది రంజాన్ మాసానికి కొద్దిరోజుల ముందు మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు, వార్తా సంస్థలు ఒక వార్తను ప్రచారంలోకి తెచ్చాయి. రంజాన్ మాసంలో సౌదీ అరేబియా ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై నిషేధం విధించిందంటూ ఊదరగొట్టాయి. నిజానికి జరిగిందేమిటంటే, సౌదీ ప్రభుత్వం మసీదుల్లో లౌడ్ స్పీకర్లపై పరిమితి విధించింది. ప్రతి మసీదులోనూ లౌడ్‌స్పీకర్ల సంఖ్య నాలుగుకు మించరాదని ఆదేశాలు జారీచేసింది. దీనిని వక్రీకరించిన మన జాతీయ మీడియా సంస్థలు సౌదీని చూసి భారత్‌లోని ముస్లింలు నేర్చుకోవాలంటూ నీతిచంద్రికలు కూడా బోధించాయి.► ఇటీవలి కాలంలో పలు తప్పుడు కథనాలు దేశవ్యాప్తంగా జనాల్లో గందరగోళం సృష్టించాయి. వాటికి ఉదాహరణగా కొన్నింటిని చెప్పుకుందాం. ‘కోవిడ్–19’ మహమ్మారి ప్రపంచమంతటా వ్యాపించిన రోజుల్లో పలు పత్రికలు, టీవీ చానళ్లు తప్పుడు కథనాలతో హోరెత్తించాయి. ‘కోవిడ్–19’కు కారణమైన కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తిపై అనేక కుట్ర సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. పలు వార్తాపత్రికలు, టీవీ చానళ్లు ఈ కుట్ర సిద్ధాంతాలనే నిజమనిపించేలా పుంఖాను పుంఖాలుగా కథనాలను వండి వార్చాయి.‘కోవిడ్’ రోజుల్లో ఒక మరాఠీ పత్రిక ఈ అంశంపై ప్రచారంలో ఉన్న కుట్రసిద్ధాంతాన్నే వార్తాకథనంగా ప్రచురించింది. చైనా రూపొందించిన జైవ ఆయుధమే కరోనా వైరస్ అని, చైనా ఇంటెలిజెన్స్ అధికారి దీనిని లీక్ చేశాడనేది ఆ కథనం సారాంశం. కరోనా వైరస్‌పై మన పత్రికలు ఇంతకంటే దారుణమైన కథనాలను కూడా ప్రచురించాయి. విశ్వసనీయతకు మారుపేరుగా పేరుగాంచిన ఒక ఇంగ్లిష్ పత్రిక 2019లో ఫిలోవైరస్పై జరిగిన అధ్యయనాన్ని కరోనా వైరస్‌కు ముడిపెడుతూ కథనాన్ని ప్రచురించింది.ఒక టీవీ చానల్ అయితే, టమాటాల్లో తెగులుకు కారణమైన ఒక గుర్తుతెలియని వైరస్‌ను కరోనా వైరస్‌కు ముడిపెడుతూ కథనాన్ని ప్రసారం చేసింది. కరోనా రోగులను తప్పనిసరిగా క్వారంటైన్లో ఉంచే రోజుల్లో దేశవ్యాప్తంగా అత్యంత జనాదరణ గల ఇంగ్లిష్ దినపత్రిక బెంగళూరుకు చెందిన గూగుల్ ఉద్యోగి భార్యకు ‘కోవిడ్’ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని, ఆమె చికిత్సకు నిరాకరించడమే కాకుండా, క్వారంటైన్ నుంచి తప్పించుకుని ఆగ్రాకు పారిపోయిందని ఒక నిరాధారమైన కథనాన్ని ప్రచురించింది. ‘కోవిడ్’ రోజుల్లో ఇలాంటి కథనాలు జనాల్లో భయభ్రాంతులను సృష్టించాయి.► కేరళలోని మలప్పురం జిల్లా అటవీ ప్రాంతంలో నాలుగేళ్ల కిందట ఒక ఏనుగు టపాసులు నింపిన అనాసపండు తినడం వల్ల మరణించింది. మరణించిన నాటికి ఆ ఏనుగు గర్భం దాల్చి ఉంది. ఈ సంఘటన జరిగిన వెంటనే పలు జాతీయ చానళ్లు, పత్రికలు సైతం నిజా నిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టానుసారం కథనాలను ప్రచారంలోకి తెచ్చాయి. కొందరు స్థానికులు ఉద్దేశపూర్వకంగా టపాసులు నింపిన అనాసపండును తినిపించడం వల్లనే ఆ ఏనుగు మరణించిందంటూ చిలవలు పలవలుగా అల్లిన కథనాలతో ఊదరగొట్టాయి.ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే మలప్పురం జిల్లాలో ఈ కథనాల కారణంగా ముస్లింలపై విద్వేషపూరిత దాడులు జరిగాయి. నిజానికి ఈ ప్రాంతంలో అడవి పందుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల వాటికి ఎరగా అటవీశాఖ అధికారులు అనాసపండులో టపాసులు నింపి ఉంచారు. ఆకలితో ఉన్న ఏనుగు దానిని తినడం వల్ల మృత్యువాత పడింది. ఈ సంగతిని అటవీశాఖ అధికారులు స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ సంఘటనపై కథనాలను ప్రచురించే ముందు లేదా ప్రసారం చేసే ముందు వాటిని ప్రచారంలోకి తెచ్చిన వార్తాసంస్థల ప్రతినిధులెవరూ అటవీశాఖ అధికారులను సంప్రదించిన పాపాన పోలేదు.► ప్రధాని నరేంద్ర మోదీ నోబెల్ శాంతి బహుమతి రేసులో ఉన్నారని, ‘నోబెల్’ పరిశీలనలో ఉన్న అభ్యర్థుల్లో మోదీనే అత్యంత బలమైన అభ్యర్థి అని గత ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు మన దేశంలోని పలు జాతీయ టీవీ చానళ్లు, వార్తా పత్రికలు తప్పుడు కథనాలను ప్రచారం చేశాయి. నోబెల్ శాంతి బహుమతి కోసం మోదీ పేరు పరిశీలనలో ఉందని నార్వేజియన్ నోబెల్ కమిటీ డిప్యూటీ డైరెక్టర్ ఆస్లే తోజే చెప్పినట్లు అవి తమ కథనాల్లో నమ్మబలికాయి.నిజానికి ఆస్లే తోజే ఒక సందర్భంలో మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ నాలుగు మాటలు చెప్పారు. అంతే! దీన్నే మన మీడియా సంస్థలు చిలవలు పలవలుగా కథనాలను అల్లి ప్రచారం చేశాయి. చివరకు నోబెల్ కమిటీ డైరెక్టర్ ఓలావ్ ఎన్జోస్తాద్ ఈ కథనాలను ఖండించారు.► పాకిస్తాన్లో కొందరు దుండగులు మహిళల శవాలను కూడా వదలకుండా వాటిపై అఘాయిత్యాలకు తెగబడుతున్నారని, అందుకే అక్కడి తల్లిదండ్రులు తమ కుమార్తెల సమాధులకు ఇనుప తలుపులు ఏర్పాటు చేసుకుని, తాళాలు బిగిస్తున్నారని గత ఏడాది మన జాతీయ పత్రికలు, టీవీ చానళ్లు ఒక దారుణమైన తప్పుడు కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ కథనాన్ని నమ్మించేందుకు తాళాలు బిగించి ఉన్న ఒక సమాధి ఫొటోను కూడా వాడుకున్నాయి. ఫొటోతో పాటు ఈ కథనాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.నిజానికి ఈ తాళాలు బిగించిన సమాధి ఫొటోకు గాని, పాకిస్తాన్‌కు గాని ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫొటో మన హైదరాబాద్‌లోని సంతోష్ నగర్ దరాబ్‌జంగ్ కాలనీ మస్జిద్ ఏ సలార్ ముల్క్కు అనుబంధంగా ఉన్న శ్మశాన వాటికలోనిది. ఒకరు సమాధి నిర్మించిన చోట శవాన్ని పూడ్చిపెట్టడానికి మరొకరు తవ్వకుండా ఉండేందుకు ఇలా సమాధులకు తాళాలు వేసుకోవడం ఇక్కడ మామూలే! శవాలపై అఘాయిత్యాలకు, సమాధుల తాళాలకు ఎలాంటి సంబంధం లేదు.► నాలుగేళ్ల కిందట చైనా సరిహద్దుల్లో భారత్ బలగాలకు, చైనా బలగాలకు మధ్య ఘర్షణ జరిగింది. ఉభయ పక్షాల్లోనూ కొందరు సైనికులు మరణించారు. ఉభయ పక్షాలూ పరస్పరం ప్రత్యర్థి సైనికులను బందీలుగా పట్టుకుని, కొద్ది రోజుల తర్వాత విడిచిపెట్టినట్లు కథనాలు వచ్చాయి. ఇటు భారత్, అటు చైనా ఈ కథనాలను కొట్టిపారేశాయి. ఈ సంఘటన సందర్భంగా మన దేశంలోని కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు అత్యుత్సాహాన్ని ప్రదర్శించాయి.ఒక హిందీ చానల్, ఒక ఇంగ్లిష్ చానల్ 1962 నాటి భారత్–చైనా యుద్ధంలో మరణించిన సైనికుల సమాధులు ఉన్న వీడియోను ప్రసారం చేసి, అవి ‘గాల్వన్’ ఘర్షణలో మన సైనికుల చేతిలో మరణించిన చైనా సైనికులవేనంటూ కథనాన్ని వడ్డించాయి. ఈ కథనాలను నిజమేనని నమ్మిన కొందరు ఇదంతా ప్రధాని మోదీ హయాంలో మన సైనికులు సాధించిన ఘనత అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకున్నారు.ఇది జరిగిన మూడు నెలల్లోనే ఒక హిందీ చానల్, రెండు ఇంగ్లిష్ చానళ్లు తైవాన్ సైన్యం చైనా విమానాన్ని కూల్చేసినట్లు మరో నిరాధాక కథనాన్ని ప్రసారం చేశాయి. తైవాన్ ప్రభుత్వం ఈ కథనాన్ని వెంటనే ఖండించింది. ఇలాంటి కథనాలు మన మీడియా పరువును అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చినా, పలు మీడియా సంస్థలు తమ ధోరణిని ఏమాత్రం మార్చుకోకుండా ఎప్పటికప్పుడు తప్పుడు కథనాలను తాజాగా వండి వడ్డిస్తూనే ఉన్నాయి.► పాకిస్తాన్ పార్లమెంటు 2020 అక్టోబర్ 26న సమావేశమైంది. విపక్ష నేత ఖ్వాజా ఆసిఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై ఓటింగు జరిపించాలని కోరుతూ సభలోని విపక్ష సభ్యులందరూ ముక్తకంఠంతో ‘ఓటింగ్.. ఓటింగ్’ అని నినాదాలు చేశారు. దేశభక్తి కిక్కిరిసిన మన టీవీ చానెళ్లు కొన్ని ఆ దృశ్యాలను ప్రసారం చేస్తూ, పాక్ విపక్ష సభ్యులు ‘మోడీ.. మోడీ’ అంటూ నినాదాలు చేసినట్లు వార్తల్లో హోరెత్తించాయి.అంతేకాదు, అధికారపక్ష సభ్యులు ‘ఓటింగ్ సబ్ కుఛ్ హోగా, సబ్ కుఛ్ హోగా, సబర్ రఖియే ఆప్’ (ఓటింగ్ అంతా జరుగుతుంది. అంతా జరుగుతుంది. మీరు ఓపిక పట్టండి) అంటూ విపక్షాన్ని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి మన చానళ్లు చెప్పిన డబ్బింగ్ ఏమిటంటే ‘మోదీ కా జో యార్ హై, గద్దార్ హై, గద్దార్ హై’ (మోదీకి మిత్రులైన వారెవరైనా వారు ద్రోహులు). పాక్ సభలో ఆనాడు నిజానికి మోదీకి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని ఎవరూ ఎలాంటి నినాదాలు చేయలేదు. కనీసం ఆయన పేరును ప్రస్తావించలేదు. అయినా మన అత్యుత్సాహ దేశభక్త చానళ్లు ఈ వార్తను వండి వార్చాయి.పత్రికల ‘పచ్చ’కామెర్లు► నిజా నిజాలతో నిమిత్తంలేని విషయాలను సంచలనాత్మకంగా మలచి కథనాలను వండి వడ్డించే ప్రక్రియ పంతొమ్మిదో శతాబ్ది ద్వితీయార్ధంలోనే మొదలైంది. అప్పటి నుంచే ‘ఫేక్ న్యూస్’, ‘యెల్లో జర్నలిజం’ అనే మాటలు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో కొందరు మర్యాదస్తులు ‘ఫేక్ న్యూస్’– తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనే మాటను వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.అబద్ధాలతో నిండిన కథనాలను తప్పుడు వార్తలు, నకిలీ వార్తలు అనకుండా ‘ఇన్ఫర్మేషన్ డిజార్డర్’– సమాచార జాడ్యం, ‘మాల్ ఇన్ఫర్మేషన్’– లోపభూయిష్ట సమాచారం అనడం కొంతవరకు తటస్థంగా ఉంటుందని వారి సూచన. సంచలనం రేకెత్తించే శీర్షికలతో నిజమని నమ్మించేలాంటి అభూత కల్పనలతో కూడిన కథనాలను ప్రచురించే ధోరణి అమెరికా, యూరోప్ దేశాలలో పంతొమ్మిదో శతాబ్ది చివరినాటికి విపరీతంగా ఉండేది. ఈ ధోరణినే ‘యెల్లో జర్నలిజం’ అనేవారు.అప్పట్లో అమెరికాలో విలియమ్ రాండాల్ఫ్ హర్ట్స్ నడిపే ‘న్యూయార్క్ జర్నల్’లో రిచర్డ్ ఔట్‌కాల్ట్ ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ వేసేవాడు. ‘న్యూయార్క్ జర్నల్’లో వచ్చేవన్నీ దాదాపుగా సత్యంతో సంబంధంలేని సంచలనాత్మక కథనాలే! ఈ కథనాలపై వ్యాఖ్యలతో మొదటి పేజీలో ‘యెల్లో కిడ్’ కార్టూన్ స్ట్రిప్ ప్రచురించడంతో అవాస్తవాలతో కూడిన సంచలన కథనాలను రాసే ధోరణికి ‘యెల్లో జర్నలిజం’ అనే పేరు వచ్చింది. డిజిటల్ మీడియా, సోషల్ మీడియా విజృంభించిన ఈ రోజుల్లో అసత్య కథనాలకు ఆకాశమే హద్దుగా ఉంటోంది. సత్యం వెలుగులోకి వచ్చేలోగానే అసత్య కథనాలు సమస్త ప్రపంచాన్నీ చుట్టుముట్టి కలకలం రేపుతున్నాయి.ఎన్నికల సమయంలో మరింత ఉద్ధృతి► గత సార్వత్రిక ఎన్నికలకు ముందు నుంచి మన దేశంలో ఇదివరకు ఎన్నడూ లేనంత స్థాయిలో తప్పుడు వార్తలు, అబద్ధపు కథనాల ఉద్ధృతి విపరీతంగా పెరిగింది. ఈ కథనాలను నిశితంగా పరిశీలిస్తే, ఏ ప్రయోజనాలను ఆశించి వీటిని ప్రచారంలోకి తెస్తున్నారో, వీటి వెనుక ఉన్న శక్తులేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే!ఎన్నికల కమిషన్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయక ముందే కొన్ని పత్రికలు, చానళ్లు ఎన్నికల షెడ్యూల్ ఇదేనంటూ కొన్ని తేదీలను వెల్లడిస్తూ ఒక కథనాన్ని ప్రచారంలోకి తెచ్చాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణించి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు సాగించేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. గత సార్వత్రిక ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నుంచి పత్రికలు, చానళ్లలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తప్పుడు కథనాలు విపరీతంగా ప్రచారమయ్యాయి.గత ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ‘వాట్సాప్’ను ప్రధాన ప్రచార ఆయుధంగా యథాశక్తి ఉపయోగించుకున్నాయి. ఈ పరిస్థితి వల్లనే గత ఎన్నికలు భారత్‌లోని ‘తొలి వాట్సాప్ ఎన్నికలు’గా పేరుమోశాయి. ‘వాట్సాప్’ మాత్రమే కాకుండా ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సాధనాలను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకుంటున్నాయి. తమకు అనుకూలంగా, ప్రత్యర్థులకు వ్యతిరేకంగా పుంఖాను పుంఖాలుగా తప్పుడు కథనాలను గుప్పిస్తున్నాయి.వీటిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో తప్పుడు కథనాలను తొలగించడానికి సోషల్ మీడియా సంస్థలు నానా తంటాలు పడుతున్నాయి. ఎన్నికలకు ముందు తప్పుడు కథనాలను ప్రచారం చేసే యూజర్లను గుర్తించి, వారి అకౌంట్లను ఫేస్బుక్ తొలగిస్తోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు రోజుకు దాదాపు పదిలక్షల వరకు అకౌంట్లను తొలగించింది.ఎన్నికల సమయంలో తప్పుడు కథనాల ప్రచారానికి సోషల్ మీడియాను సాధనంగా చేసుకోవడం అమెరికాలో మొదలైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు 2016లో జరిగినప్పుడు ‘ఫేస్బుక్’లో విపరీతంగా తప్పుడు కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. వీటిని పెద్దసంఖ్యలో జనాలు చూశారు. ‘ప్యూ ఇంటర్నేషనల్’ సర్వే ప్రకారం అమెరికాలో 60 శాతం మంది ప్రధాన స్రవంతి మీడియా కంటే సోషల్ మీడియా కథనాలనే ఎక్కువగా అనుసరిస్తున్నట్లు తేలింది.ఇవి చదవండి: ఇది ఒక సైకాలం..! ఆన్లైన్ రాక్షసులు..!! -
థింక్ ట్యూన్ అప్
‘ఆలోచనను బట్టే ఆచరణ, ఆచరణను బట్టే కర్మఫలం’ ప్రతిదానికీ ఆలోచనే మూలం. అందుకే ఒక మనిషి మనుగడకు ప్రాణవాయువు, అన్నపానీయాలు ఎంత అవసరమో ఆలోచించడం కూడా అంతే అవసరం. నిజానికి మనిషిని సమస్తజీవకోటి నుంచి వేరు చేసిందే ఆలోచన. మానవాళి మనుగడకు మార్గం వేసేదే ఆలోచన. మరి అలాంటి ఆలోచనలు సక్రమంగా ఉండాలంటే ఏం చెయ్యాలి? ‘మంచి ఆలోచనకు మించిన మనుగడ లేదు, చెడ్డ ఆలోచనకు పోలిన చావు లేదు’ అంటారు పెద్దలు. అవసరాన్ని బట్టి బుద్ధికుశలతను ఉపయోగించడం, పరిస్థితిని బట్టి వివేకంగా వ్యవహరించడం, సందర్భానుసారంగా విచక్షణతో నడుచుకోవడం, క్లిష్టమైన సమయాల్లో కూడా జ్ఞానాన్ని ప్రదర్శించడం.. ఇవన్నీ ఆలోచన పరిధికి గుణకారాలే! అయితే అందుకు సాధన ఎంతో అవసరం. థింక్ ట్యూన్ అప్ ట్యూన్ అప్ అంటే స్వరాన్ని పెంచడం.. లేదా అడ్జస్ట్ చేసుకోవడం. సాధారణంగా రేడియోకో.. ఇయర్ ఫోన్ కో, బ్లూటూత్కో ఉండే ట్యూన్ బటన్ ని మనకు తగ్గట్టుగా.. మనకు కావాల్సినట్లుగా సెట్ చేసుకుంటాం. మరి మది ఆలోచల్ని ఎలా ట్యూన్ అప్ చేసుకోవాలి? మనసు స్వరాల్లో మంచి స్వరాన్ని ఎలా ఎంచుకోవాలి? ఎలా పెంచుకోవాలి? ‘ఒక సీసా నిండా గాలి ఉన్నప్పుడు అందులోని గాలిని బయటకు పంపాలంటే, ఆ సీసాలో నీళ్లు నింపడమే మార్గం. అలాగే మనసులోని ప్రతికూల భావాలు ఆవిరైపోవాలంటే, మనసు నిండా సానుకూల ఆలోచనలను పెంచుకోవాలి. పాజిటివ్ థింకింగ్, నెగటివ్ థింకింగ్.. ఈ రెండింటికీ ప్రభావవంతమైన శక్తులు ఉంటాయని, మనం దేన్ని నమ్ముతామో అదే జరుగుతుందని చెబుతారు సానుకూలపరులు. ‘సే సమ్‌థింగ్ పాజిటివ్ అండ్ యు విల్ సీ సమ్‌థింగ్ పాజిటివ్’... ‘మంచి గురించి మాట్లాడితే, మంచే కనిపిస్తుంది’ అని దీని అర్థం. అంటే మాట మంత్రంలా పని చేస్తుంది. ఆ వైబ్రేషన్స్ వైర్‌లెస్‌గా పనిచేస్తాయి. ఇక్కడే ఆధ్యాత్మికతకు.. శాస్త్రీయతకు పొంతన కుదురుతుంది. మనస్సుకు ఆహారం శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, మనసు ఆరోగ్యంగా ఉండడానికి మంచి ఆలోచనలు కూడా అంతే అవసరం. ఉన్నతమైన ఆలోచనలు, ఆదర్శాల కోసం మంచి పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి. మంచివాళ్ళతో స్నేహాన్ని పెంచుకోవాలి. ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచిని మాత్రమే కోరుకోవాలి. అందుకే ‘మంచి ఆలోచనలే మనసుకు మంచి ఆహారం’ అంటారు మానసిక నిపుణులు. ఒక మంచి విషయాన్ని మనం బలంగా నమ్మితే, ప్రపంచం మొత్తం ఆ కోరికను నిజం చేయడానికి కుట్ర చేస్తుందట. అంటే ప్రకృతి ఆజ్ఞతో.. తెలియకుండానే చుట్టూ ఉండే పరిస్థితులు, మనుషులు మనకు సహకరిస్తారు. ఆలోచనలు సానుకూలంగా ఉంటే, జీవితం సాఫీగా సాగుతుంది. మనసులో తలెత్తే అపోహలు, భయాలు, ప్రతికూల భావాలకు వ్యతిరేకంగా, మంచి సంకల్పాలను మనంతట మనమే సృష్టించుకోవాలి. ఉదయం లేవగానే.. ‘ఈ రోజు నాకు మంచి జరుగుతుంది. ఈ రోజు చాలా బాగుంటుంది’ అని మనసును ఉత్తేజపరచేలా ప్రకృతికి చెప్పడం నేర్చుకోవాలి. ‘ఎందుకొచ్చిన జీవితంరా సామీ?’ అంటూ ఏడుస్తూ నిద్రలేస్తే ఆ రోజు మొత్తం అంతే అసంతృప్తిగా ముగుస్తుందట. ఆలోచనలతో ఆరోగ్య ప్రయోజనాలు సానుకూల ఆలోచనలతో.. ప్రమాదకరమైన జబ్బుల్ని కూడా తగ్గించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఆశావాద దృక్పథం ఉంటే.. అది తీవ్ర అనారోగ్యాలను సైతం అరికడుతుందట. రొమ్ము క్యాన్సర్, కొలోరెక్టల్ క్యాన్సర్, ఇన్ఫెక్షన్, గుండె సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, స్ట్రోక్, మానసిక రుగ్మతలు ఇలా ఎన్నో ప్రాణాంతక వ్యాధులను సమూలంగా తగ్గించే గుణం.. కేవలం సానుకూల ఆలోచనలకే ఉందట. ‘నాకేం కాదు’ అనే సంకల్పంతోనే బతికి బయటపడుతున్నారట. అందుకే ‘పాజిటివ్ థింకింగ్.. మెరుగైన రోగనిరోధక శక్తి’ అంటున్నారు నిపుణులు. పాజిటివ్ థింకింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి? 1. ప్రతిక్షణం ఆలోచనలను గమనించుకోవాలి. ఎప్పుడైనా ప్రతికూల ఆలోచనలు వెంబడిస్తుంటే, అందుకు రివర్స్‌లో.. ‘అలా జరగదు.. ఇలా జరుగుతుంది.. అలా కాదు.. ఇలా అవుతుంది’ అని మనసులోనే మాటలు అల్లుకోవడం నేర్చుకోవాలి. ప్రతికూలమైన ఊహలు కలిగినప్పుడు.. నిట్టూర్పులను పక్కన పెట్టి.. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా తీసుకుని.. మళ్లీ మనసుకు అనుకూలమైన ఊహలను రీఫ్రేమ్ చేసుకోవాలి. ఎలాగంటే.. మనకు బాగా ఇష్టమైన మనిషికి ప్రమాదం జరిగి ఉంటుందేమో? అని మనసు భయపడుతుంటే, దానికి వ్యతిరేకంగా ఆలోచించాలి. ఆ మనిషి తిరిగి మీ కళ్ల ముందుకు వచ్చినట్లుగా, తనతో మీరు చెప్పాలనుకున్న కొన్ని మాటలుచెబుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ వైబ్రేషన్సే నిజంగా జరగబోయే ప్రమాదం నుంచి సైతం ఆ మనిషిని కాపాడే అవకాశం ఉంటుంది. 2. కృతజ్ఞతతో కూడిన ఆలోచనలు కూడా మనిషిని సానుకూలంగా మారుస్తాయి. మనసులోని క్రూరత్వాన్ని, అహంకారాన్ని పక్కకు నెడతాయి. ఇప్పటి దాకా సాఫీగా సాగుతున్న జీవితానికి కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోవాలి. మీతో పాటు పని చేసే ల్యాప్‌టాప్‌కి మీరెప్పుడైనా థాంక్స్ చెప్పారా? మిమ్మల్ని గమ్యానికి చేర్చే వాహనాన్ని మీరెప్పుడైనా కృతజ్ఞతా భావంతో చూశారా? వింతగా అనిపించినా ఇది నిజం. ప్రయత్నించి చూస్తే ఫలితం అందుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు. ప్రపంచంలోని చాలా మతాలు చలనం లేని వస్తువుకు కూడా ప్రాణం ఉంటుందని నమ్ముతాయి. హిందూమతంలో యంత్రపూజ కూడా ఆ కోవకే వస్తుంది. నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఒక ఎనర్జీ అక్కడుందని భావించి, బలంగా నమ్మితే.. దాని కిరణాలు మీ మదిని తాకుతాయి. అదే ‘యద్భావం తద్భవతి’ అనే నానుడిలోని సారాంశం. 3. ఊహించని సమస్యలు ఎదురైనప్పుడు మనసును ప్రతికూలమైన ఆలోచనలే చుట్టుముడతాయి. అప్పుడు సానుకూలమైన ఆలోచనలను ప్రేరేపించడానికి మనసులోనే చర్చ జరగాలి. ఒక మనిషితో ఎలా మాట్లాడతామో, మనసుతో కూడా అలానే మాట్లాడుకోగలగాలి. ఆ చర్చ, ఆ ఆలోచన పరిష్కారం దిశగా ఉండాలి. అలాంటి చర్చ మదిలో జరిగితే.. ఒత్తిడి మాయమవుతుందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. 4. ప్రతిక్షణం క్షమాగుణంతోనే ఆలోచించాలి. శత్రువు కారణంగానే మన విజయం ముడిపడి ఉందనే నిజాన్ని గ్రహించుకోవాలి. చాలాసార్లు అవమానాలు, అవహేళనలు మనలో పట్టుదలను పెంచి, మనల్ని లక్ష్యం దిశగా నడిపిస్తాయి. అందుకే శత్రువుకు కూడా కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకోమంటారు కొందరు జ్ఞానబోధకులు. మంచి మార్గం ఉదయాన్నే నిద్ర లేవడం, వ్యాయామాలు, ధ్యానం, యోగాలాంటి ఆరోగ్యకరమైన అలవాట్లు నేర్చుకోవడంతో పాటు.. పాజిటివ్ సంకల్పాలు స్వయంగా రాసుకుని, చదువుకోవడం అలవరచుకోవాలి. దాని వల్ల కూడా సానుకూల ఆలోచనలు పెరుగుతాయి. అలాంటి సంకల్పాలతో పాజిటివిటీని అందిపుచ్చుకునే ఎన్నో మార్గాలు నెట్టింట దొరుకుతూనే ఉన్నాయి. వాటిల్లోంచి అనుకూలమైన మార్గాన్ని ఎన్నుకుని అనుసరించొచ్చు. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈయన మనిషి ఆలోచనా విధానాన్ని మూడు రకాలుగా విభజించాడు. ఇడ్, ఇగో, సూపర్ ఇగో అనే పేర్లతో ఆలోచనా తీరును వివరించాడు. ఇడ్: ఈ ఆలోచన మనిషి మనసులో అచేతనావస్థలో ఉంటుంది. ఇది నైతిక విలువలను పాటించదు. నియమాలు, తప్పొప్పులు దానికి తెలియవు. మనసులో కలిగే కోరికలను తీర్చుకోవడానికి ఎక్కువగా మనిషిని తొందరపెడుతుంది. ఎక్కువ స్వార్థ చింతనతో ఉంటుంది. ఇగో: ఈ ఆలోచన చేతనావస్థలో ఉంటుంది. ఇది వాస్తవిక సూత్రాన్ని పాటిస్తుంది. అనైతిక ఆలోచనలను కట్టడి చేస్తుంది. వాస్తవాలను గ్రహించి.. సమయానుకూలంగా, తెలివిగా నిర్ణయాలు తీసుకుంటుంది. సూపర్ ఇగో: ఇదే మనిషి అంతరాత్మ. నైతిక, సామాజిక విలువలను కచ్చితంగా పాటిస్తుంది. ఇగోకు మంచి చెడులను గుర్తు చేసి.. సాంఘిక ఆచారాలను పాటించేట్లు చేస్తుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న మనుషుల ప్రభావానికి ఇది మరింత పరిణతి పొందుతుంది. ఇది ఎక్కువగా నైతిక సూత్రాలపై ఆధారపడి అడుగులు వేస్తుంది. ఉదాహరణకు.. ‘దొంగతనంగా సినిమాకు వెళ్దాం’ అని ఇడ్ ప్రోత్సహిస్తే.. ‘దొంగతనంగా ఎలా వెళ్లొచ్చో?’ ఆలోచిస్తుంది ఇగో. కానీ ‘దొంగతనంగా వెళ్లడం సరికాదు, తప్పు, ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది, దాని వల్ల మన ఆత్మగౌరవం దెబ్బతింటుంది’ అని హెచ్చిరిస్తూనే నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది సూపర్ ఇగో. ఇలా మనిషి ఆలోచన సరళిని విశ్లేషించాడు సిగ్మండ్ ఫ్రాయిడ్. బానిసత్వాన్ని వ్యతిరేకించిన స్వాతంత్య్ర సమరయోధులు, కట్టుబాట్లపై, మూఢత్వాలపై తిరుగుబాటు చేసిన సంఘసంస్కర్తలు.. వీళ్లంతా ఉన్నతమైన ఆలోచనాపరులే. గొప్ప ఆలోచనల నుంచి ఉద్భవించిన కొన్ని సూక్తులు ధైర్యం అంటే దేనికి భయపడకూడదో తెలుసుకోవడమే. దయతో జీవించండి, ఎవరినీ ఎప్పుడూ నిరుత్సాహపరచకండి. ఎవరు ఎంత తక్కువగా కనిపించినా.. ఏదో ఒకరోజు పురోగతిని సాధిస్తారు. -ప్లేటో చెడు ఆలోచనలే సగం సమస్యలకు కారణం -రవీంద్రనాథ్ టాగోర్ ప్రేమ, స్నేహం, ఆగ్రహం, కరుణలతో ఇతరుల జీవితానికి విలువను ఆపాదించినంత కాలం.. మీకు కూడా విలువ ఉంటుంది -సిమోన్ ది బూవా మొదట అర్థం చేసుకోలేకపోతే.. దేన్నీ ప్రేమించలేరు, దేన్నీ ద్వేషించలేరు. ∙ఇబ్బందుల్లో కూడా నవ్వగల వారిని నేను ప్రేమిస్తున్నాను, నేర్చుకోవడానికి మనసు ఎప్పటికీ అలసిపోదు. -లియోనార్డో డా విన్సీ ‘చెయ్యాల్సిన పని పట్ల అవగాహన లేకపోతే.. భయపడటం పరిష్కారం కాదు.. నేర్చుకోవడమే మార్గం’ -ఐన్ రాండ్ మేధస్సుకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. -అల్బర్ట్ ఐన్ స్టీన్ సమానత్వంలోనే ధర్మం వర్ధిల్లుతుంది. స్త్రీ హక్కులను పంచుకోనివ్వండి. ఆమె పురుషుల ధర్మాలను కూడా అనుకరిస్తుంది. ఎందుకంటే విముక్తి పొందినప్పుడు ఆమె మరింత పరిపూర్ణంగా ఎదగాలి. -మేరీ వోల్స్టోన్ క్రాఫ్ట్ శత్రువును రెచ్చగొడితే అది మనకే నష్టం. అందరినీ ప్రేమించండి, కొందరిని నమ్మండి, ఎవరికీ నష్టం చేయకండి -షేక్స్పియర్ ప్రపంచంలో ప్రభావవంతమైన ఆలోచనాపరులు ఈ మానవాళిలో ఎందరో ఆలోచనపరులు.. తమ కోసం కాకుండా ప్రపంచం కోసం ఆలోచించారు. అందుకే నేటికీ ఆదర్శంగా నిలిచారు. ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు కాళోజీ. కానీ తమ ఒక్క ఆలోచనతో కోట్లాది ప్రజలను కదల్చగలిగారు ఎందరో విశ్లేషకులు. అరిస్టాటిల్, ప్లేటో, సోక్రటీస్ వంటి గ్రీకు తత్వవేత్తలతో పాటు.. డార్విన్ , కార్ల్ మార్క్స్, సిగ్మండ్ ఫ్రాయిడ్ వంటి వారు తమ ఆలోచనలతో చరిత్ర గమనాన్ని మార్చారు. డార్విన్ మనుషుల్లోని మూఢనమ్మకాలను చెదరగొడితే.. కార్ల్ మార్క్స్.. మనిషి బతకడం ఎలానో నేర్పించారు. చార్లెస్ డార్విన్ ఈయన ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం భూమి మీది జీవుల పరిణామ క్రమాన్ని తెలియజేస్తుంది. ఆధునిక జీవ శాస్త్రంలో డార్వినిజం చాలా మార్పులను తెచ్చింది. మూఢ నమ్మకాలను విభేదించడంలో కూడా డార్విన్ సిద్ధాంతం కీలక పాత్ర పోషించింది. కార్ల్ మార్క్స్ ఈయన ఆలోచనలను, సిద్ధాంతాలను కలిపి సమష్టిగా.. ఈ ప్రపంచం ‘మార్క్సిజం’ అని పిలుస్తోంది. ప్రతి అంశంలోనూ న్యాయమైన వాదన వినిపించిన ఆలోచనాపరుడు కార్ల్ మార్క్స్. పిల్లలు పనికి పోకూడదని, బడికి వెళ్లాలని వాదిస్తూ భావితరాల గళం అయ్యాడు. ‘ఎంతసేపు ఉద్యోగమే కాదు.. మనిషికి వ్యక్తిగత జీవితం కూడా ఉండాలి. మనకూ ఇష్టాయిష్టాలు ఉండాలి. జీవితంలో ఏం కావాలో మనమే నిర్ణయించుకోవాలి’ అనే కాంక్షను బలపరచింది మార్క్సిజం. మనిషి ఉన్నతమైన జీవితానికి ఉద్యోగ సంతృప్తి చాలా అవసరమని చెప్పింది ఈయనే. మార్పుకి ప్రజలే ప్రతినిధులు అనే మార్క్స్ రాతలతోనే.. ప్రపంచరూపురేఖలు మారిపోయాయి. ప్రభుత్వాలపైన, మీడియాపైన ఓ కన్ను వేస్తూ ఉండాలని ప్రజలకు తెలిపింది మార్క్సిజం. ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? న్యాయాన్యాయాల మధ్య నిలిచే అశాంతి నేటి ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేస్తుంది. మనిషి ఆలోచనాశక్తిని కుంగదీస్తోంది. బలవంతుడు అన్యాయం చేసి గెలిస్తే, బలహీనుడు మరో నలుగురు బలహీనుల సాయం తీసుకుని వాడిపై గెలవగలడట. మనం ఎంతటి బలవంతులమైనా ఆలోచనలో సవరణలు, సడలింపులు లేకపోతే పతనం వెన్నంటే ఉంటుంది. ‘బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె’ అన్న సుమతీ శతకం చెప్పే నీతి అదే! ఆవు–పులి కథ ఒకనాడు మేత కోసం అడవికి వెళ్ళిన ఓ ఆవు పెద్దపులి కంటపడుతుంది. వెంటపడిన ఆ పులి తనని తినబోతుంటే.. ‘నీ చేతిలో చనిపోవడం నాకు ఇష్టమే కాని, నాకు కొంత సమయం కావాలి’ అని వేడుకుంటుంది ఆవు. ఆవు కన్నీళ్లు చూసి కరిగిన పులి.. ‘సమయం దేనికి?’ అని అడుగుతుంది. ‘ఇంటి దగ్గర పాలకు ఏడ్చే నా బిడ్డ ఉంది. దానికి కడుపు నిండా పాలిచ్చి, మంచి చెడు చెప్పి వస్తాను’ అంటుంది ఆవు. మొదట అనుమానించిన పులి చివరికి ఒప్పుకుని పంపిస్తుంది. ఆవు అన్న మాట ప్రకారం చెప్పిన సమయానికి వచ్చి.. ‘ఇక నన్ను తిను’ అంటుంది. ఆవు నిజాయితీకి మెచ్చిన పులి జాలితో ఆవును విడిచిపెట్టేస్తుంది. చిన్నప్పుడు ఈ ‘ఆవు–పులి’ కథ వినే ఉంటారు. ఈ కథలో ఆవు మంచిది. మాట మీద నిలబడింది. ఆవులో కన్నతల్లి ప్రేమ, ఇచ్చిన మాటకోసం ప్రాణాలను త్యాగం చేసేంత ఔదార్యం, కష్టాన్ని మొరపెట్టుకోగలిగేంత వినయం.. ఇలా మనిషి నేర్చుకోదగ్గ ఎన్నో గొప్ప సత్యాలు ఉన్నాయి. కానీ, కథలో ఉన్న నీతి అక్కడి వరకే అనుకుంటే పొరబాటు. కథలో నిజమైన హీరో పులి. పులి స్వతహాగా బలమైన ప్రాణి. దానికి ఆవు మాట వినాల్సిన అవసరమే లేదు. కానీ.. ఆవుకి దాని ఆవేదన చెప్పుకునే సమయాన్నిచ్చింది. ఆకలితో ఉన్న తన బిడ్డ దగ్గరకు ఆవు వెళ్తానంటే నమ్మి.. పంపించింది. తిరిగి వస్తే.. ఆ నిజాయితీని మెచ్చి జాలితో విడిచిపెట్టింది పులి. ఈ రోజు ప్రతి బలవంతుడు నేర్చుకోవాల్సిన నీతి ఇది. ఆలోచించాల్సిన తర్కమిది. పులికి పంజా విసరగలిగే సత్తా ఉంది. అంతకు మించి.. అవకాశం ఉంది, బలంతో కూడిన అధికారం ఉంది, తినాలనేంత ఆకలుంది, ఏం చేసినా ప్రశ్నించలేని నిస్సçహాయత ఆవు రూపంలో ఎదురుగా ఉంది. అయినా పులి ఆలోచించింది. అదే నైతికతంటే. ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది. అయితే ఆ మార్పు ఎలా ఉండాలో మన చేత్లులోనే ఉంది. కాదు కాదు మన ఆలోచనల్లోనే ఉంది. స్వచ్ఛమైన మనసులో చెలరేగే ఊహలను ఈ విశ్వం చెవులారా వింటుందట. మరింకెందుకు ఆలస్యం? సానుకూలమైన ఆలోచనలను శాంతి పావురాల్లా ఎగరనివ్వండి -సంహిత నిమ్మన -
ప్రయాణంతో చలి కాచుకుందాం!
'One must travel to learn' అంటాడు మార్క్ ట్వయిన్. 'To travel is to evolve' అంటాడు పియర్ బెర్నార్డో. ఎప్పటికప్పుడు కొత్త పరిసరాలు తద్వారా కొత్త విషయాలు తెలుస్తుంటేనే బుద్ధి వికసిస్తుంది. దీనికి ప్రయాణాన్ని మించిన గురువు లేడు. భ్రమణ కాంక్షను మించిన సిలబస్ లేదు. వారం, వర్జ్యం, సౌకర్యం చూసుకోకుండా బ్యాక్ ప్యాక్‌తో ట్రావెల్‌ని ప్లాన్ చేసుకునేళ్లను మించిన అదృష్టవంతుల్లేరు. ఆర్ట్ మూవీ ప్లాట్‌కి ఆ లీడ్ లైన్స్ పక్కాగా సూట్ అవుతాయేమో కానీ.. స్కూల్స్, ఆఫీసెస్, టార్గెట్స్, అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ వంటి ప్రాక్టికల్ ఫ్రేమ్స్‌లో స్కెడ్యూల్ అయిన లైఫ్‌లో అస్సలు సాధ్యపడవు! కదా..! అందుకేగా వెకేషన్స్ ఉన్నాయి! ఆ అకేషన్ బహానాతో పిల్లలు, పెద్దలు అందరూ వాళ్ల వాళ్ల అభిరుచికి అనుగుణంగా ట్రావెల్‌కి ట్రాన్స్పోర్ట్ వెదుక్కోవడమే! ‘అమ్మో చలిలోనా..’ అంటూ ముడుచుకోకండి. తేమ తుంపరలతో రొమాంటిక్ టచ్‌ని.. హేమంత తుషారాలతో చిలిపిదనాన్ని.. పొగమంచుతో దాగుడు మూతల అల్లరిని.. వణుకుతో ఆకతాయితనాన్ని తలపిస్తూ .. ఎంత గమ్మత్తుగా ఉంటుందని! ప్రయాణానికి ఇంతకు మించిన వాతావరణం ఉంటుందా? పైగా మన దేశంలో ట్రావెల్‌కి అనుకూలమైన సమయం (సెప్టెంబర్ నుంచి ఎప్రిల్ అంటారు) కూడా ఇదే! వీపున బ్యాక్ ప్యాక్ చేర్చి .. తలను క్యాప్‌తో కవర్ చేసి .. చేతులను జర్కిన్‌లో దూర్చి.. పాదాలను షూతో కప్పి చక్కగా దొరికిన కమ్యూట్‌తో కమ్యూనికేట్ అయ్యి కోరుకున్న ప్లేస్‌కు చేరుకోవచ్చు! ప్లేసెస్ ఏంటీ అంటారా? బ్యాగ్ నిండేన్ని! లిస్ట్ చూసుకుని.. సేవింగ్స్ అకౌంట్‌తో మ్యాచ్ అయ్యేలా కస్టమైజ్ చేసుకుని స్టార్ట్ అవడమే! సెలవులంతా కాకుండా.. సంక్రాంతి పండగకల్లా మళ్లీ ఇల్లు చేరాలి అనుకుంటే.. ఆ లిమిటిడెట్ హాలిడేస్కి తెలంగాణ వాళ్లకు ఆంధ్రప్రదేశ్.. ఆంధ్రులకు తెలంగాణ పర్ఫెక్ట్ ప్లేసెస్. తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కనున్న అనంతగిరి, ఆమ్రబాద్, నాగార్జునసాగర్ నుంచి వరంగల్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన రామప్ప, ఆదిలాబాద్ కవ్వాల్ ఫారెస్ట్, కాళేశ్వరం, జోడే ఘాట్ వంటివెన్నో చూడొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి నుంచి కోనసీమ, వైజాగ్, బొర్రా కేవ్స్, అరకులోయ, లంబసింగి, రాయలసీమ మహానంది, లేపాక్షి, యాగంటి, బెలూం కేవ్స్, గండికోట, హార్సిలీ హిల్స్ లాంటి పర్యాటక ప్రాంతాలెన్నో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్క రాష్ట్రాల్లో అయితే బోలెడున్నాయి. ముందు మహారాష్ట్రకి వెళితే.. వెస్టర్న్ ఘాట్స్ అందాలకు ముగ్ధులవొచ్చు. ఈ పశ్చిమ కనుమల ఒళ్లోని స్ట్రాబెరీ తోటల పంచ్గని, పూల వనం కాస్ ప్లాటూ, కృష్ణా నది జన్మస్థానం మహాబలేశ్వర్, లోనావాలా, పుణె, ముంబై, సముద్ర తీరాలు.. రాజ కోటల నిలయం అలీబాగ్.. జనవరిలో అక్కడ జరిగే నారియల్ పానీ మ్యూజిక్ ఫెస్టివల్, ద్రాక్ష తోటలతో.. వైన్ లవర్స్‌కి భూతల స్వర్గమైన నాసిక్, ఔరంగాబాద్, దౌలతాబాద్ రంగుల కళ అజంతా, శిల్పాల ఎర ఎల్లోరా ఎట్సెట్రా అన్నీ పర్యటించాల్సిన ప్రాంతాలే. పుదుచ్చేరికి.. ఫ్రెంచ్ వీథులు, ఫ్రెంచ్ భవనాలు, ఫ్రెంచ్ సంస్కృతి, అరబిందో ఆశ్రమం, అందమైన బీచ్‌లతోపాటు పర్యాటకులను ప్రేమలో పడేసే మరెన్నో రొమాంటిక్ స్పాట్స్ ఉన్నాయిక్కడ. అంతేకాదు ఫ్రెంచ్ ఫుడ్.. వాటర్ స్పోర్ట్స్ మీ టైమ్‌ని క్వాలిటీగా మారుస్తాయి కచ్చితంగా! స్థానిక, వలస పక్షులకు నిలయమైన ఔస్టరీ (Ousteri Lake) లేక్‌ని అస్సలు మిస్ అవకూడదు. గోవాకు మళ్లితే.. సెలబ్రేషన్స్ కాపిటల్ ఆఫ్ ఇండియా ఇది. వార్మ్ వింటర్స్‌కి పర్ఫెక్ట్ అడ్రస్. అందుకే యూరప్ అంతా ఇక్కడే ఉన్నట్టుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణం.. ప్రశాంతమైన బీచులు.. సందడి చేసే నైట్‌క్లబ్‌లు.. పగళ్లను తలపించే రాత్రుళ్లతో నిత్యం ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉంటుంది. లైఫ్‌ని ఒక సెలబ్రేషన్‌గా భావించేవాళ్లకు నచ్చకుండా ఉంటుందా గోవా! చలికాలమైతే అక్కడ పండగలే పండగలు.. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నుంచి క్రిస్మస్ దాటి హోలీ దాకా! ఈ ఎంజాయ్మెంట్ కావాలనుకుంటే వింటర్లో గోవాను కచ్చితంగా విజిట్ చేయాల్సిందే! అక్కడున్న ఏ బీచ్‌లో అయినా సన్‌రైజ్.. సన్‌సెట్‌ని మిస్ అవకూడదు! కర్ణాటక చేరితే.. చారిత్రక కట్టడాలకు.. అలనాటి వైభోగాల జ్ఞాపకాలకు నిలయంగా ఉంటుందీ రాష్ట్రం. పశ్చిమ కనుమల సోయాగాలు, సముద్ర తీరాలు అదనపు ఆకర్షణలు. ఇదీ వింటర్ డెస్టినేషనే. గోకర్ణ బీచులు, జోగ్ జలపాతాలు, దైనందిన జీవితంలోని ఒత్తిడిని దూరం చేసి మంచు తెరల మధ్య ప్రశాంత వాతావరణంతో సేదతీర్చి.. కాఫీ తోటలతో ఆర్గానిక్ ఆహ్లాదాన్ని పంచే కూర్గ్.. అక్కడి నాగర్హోల్ నేషనల్ పార్క్‌ను చూడకుండా రావొద్దు. ఈ రాష్ట్రంలో.. యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందిన హంపీ మిస్ అవకూడని ప్రాంతం. దీన్ని చూడ్డానికి అనువైన సమయం డిసెంబర్, జనవరి నెలలు. ఏటా జనవరిలో హంపీ మహోత్సవ్ జరుగుతుంది. తోలు బొమ్మలాట.. నాట్య, సంగీత ప్రదర్శనలు.. క్రీడల సమ్మేళనమే ఈ ఉత్సవం. ఇక్కడి విరూపాక్ష గుడి, మాతంగా హిల్, విఠ్ఠల మందిరం, హజారా రామ గుళ్లను తప్పక దర్శించాలి. ఆ ఆనందంలో మైసూర్‌ని మరవొద్దు. నిజానికి దీన్ని దసరా సమయంలో చూడాలి. కానీ అప్పటి రద్దీని దృష్టిలో పెట్టుకుని వెళ్లని.. వెళ్లలేని వాళ్లు ఇప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. దేశంలోని రాయల్ సిటీస్‌లో ఇదొకటి. మైసూర్ ప్యాలెస్, కళాత్మకమైన పెయింటింగ్స్, మైసూర్ జూ, చాముండేశ్వరీ ఆలయం, జగన్మోహన్ ప్యాలెస్ నుంచి చవులూరించే మైసూర్ పాక్ దాకా దేన్నీ వదిలిపెట్టడానికి వీల్లేదిక్కడ. బెంగళూరు నుంచి మంగళూరు దాకా విస్టడోమ్ ట్రైన్లో జర్నీ ఆస్వాదించి తీరాల్సిందే! తమిళనాడుకు వస్తే.. ఉక్కపోత, వేడికి పుట్టిల్లుగా ఉన్న తమిళనాడు చలికాలంలో పర్యాటకులకు వార్మ్ వెల్కమ్ చెబుతుంది. ఇండియా మొత్తానికి దీన్ని వింటర్ డెస్టినేషన్‌గా పేర్కొనొచ్చు. పశ్చిమ కనుమల్లో భాగమైన నీలగిరి కొండల్లోని మంచు ఛాయలు.. మధుమలై అడవులు.. ఏళ్లుగా కోలీవుడ్‌కే కాదు టాలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్‌తోపాటు బాలీవుడ్‌కీ సౌకర్యవంతమైన ఔట్‌డోర్ షూటింగ్ స్పాట్‌గా ఉంటూ.. సర్కారు బడుల నుంచి కార్పొరేట్ స్కూల్స్ వరకు అన్నిటికీ ఎక్స్కర్షన్లో భాగమైన ఊటీ.. అక్కడి బ్రిటిష్ కాలం నాటి సెయింట్ స్టీఫెన్స్ చర్చ్, కాఫీ తోటలు, పల్లవుల రాజధాని మహాబలిపురం.. అక్కడి శిల్పాలు, గుహలు, బీచ్‌లు, మొసళ్ల ఫామ్, చోళ దేవాలయా తంజావూరు, సముద్రంలో పంబన్ బ్రిడ్జి మీంచి రామేశ్వరానికి రైలు ప్రయాణం, దక్షిణ భారతంలో ఆఖరి ఊరు ధనుష్కోడి, కన్యాకుమారి.. ఎన్నని! పంబన్ బ్రిడ్జి మీంచి రైలు ప్రయాణం ఎంత ముఖ్యమో ఊటీకి టాయ్ ట్రైన్ జర్నీ అంతే ముఖ్యం.. మరువద్దు! గాడ్స్ ఓన్ కంట్రీ కేరళలో.. .. ప్రతి ప్రాంతం ఒక మనోహర దృశ్యమే. చిరాకు తెప్పించే ఉక్కపోత కాకుండా.. ఎముకలు కొరికే చలీ లేకుండా ఈ సీజన్లో ఆహ్లాదంగా ఉంటాయి ఇక్కడి పర్యాటక కేంద్రాలు. బ్యాక్ వాటర్స్‌లో హౌస్ బోట్ షికార్లు.. వెంబనాడ్ లేక్, మారారి బీచ్.. అలెప్పుళ బీచ్‌ల తీరం.. ఆయుర్వేదిక్ స్పాల కేంద్రం అలెప్పీ (నవంబర్‌లో అయితే ఇక్కడ స్నేక్ బోట్ పోటీలను చూడొచ్చు), కళ్లు తిప్పుకోనివ్వని సీనరీ.. టీ తోటలు.. జలజలపారే జలపాతాలతో కశ్మీర్ ఆఫ్ ద సౌత్‌గా పేరున్న మున్నార్.. అక్కడి ఎకో పాయింట్, అనాముడి పీక్, టాటీ టీ మ్యూజియంలో వైవిధ్యమైన తేనీటి రుచులు, హోమ్ మేడ్ చాకొలేట్స్ పర్యాటకులను ఊరిస్తాయి. వాయనాడ్ ఏమన్నా తక్కువా? పశ్చిమ కనుమల్లోని డ్రీమ్ డెస్టినేషన్ ఇది. రెప్పవేయనివ్వని ప్రకృతి, ట్రెకింగ్, వాయనాడ్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీ, ఎడక్కల్ కేవ్స్, వాయనాడ్ ఘనమైన చరిత్ర, అద్భుతమైన సంస్కృతి, డిలీషియస్ ఫుడ్ పర్యటనను ఎక్సైటింగ్‌గా మారుస్తాయి. కుమారకోమ్ గురించీ చెప్పాలి. బ్యాక్ వాటర్స్ ప్రత్యేకత చూడాలంటే కుమార్‌కోమ్ వెళ్లాల్సిందే అంటారు పర్యాటకప్రియులు. చలికాలం వలస పక్షులకు నిలయం ఇది. ఇక్కడి కృష్ణపురం ప్యాలెస్, చంపకుళంలోని బెసిలికా ఆఫ్ సెయింట్ మేరీ మిస్ అవకూడదు. ఇవన్నీ బాగా ప్రాముఖ్యంలో ఉన్న మచ్చుకు కొన్ని పర్యాటక స్థలాలు మాత్రమే. కాస్త ఎక్కువ రోజులు.. ఇంకాస్త ఎక్కువ దూరాలు.. మరికాస్త ఎక్కువ బడ్జెట్‌ను భరించొచ్చు అనుకుంటే ఉత్తరాదిలోని ఈ ప్రాంతాలకూ వెళ్లొచ్చు. ఒక్కసారి లుక్కేసి తర్వాత ఐటినరీ ప్రిపేర్ చేసుకోండి! నిజానికి చలికాలం నార్త్ ఇండియా అంతటినీ వణికిస్తుంది. కానీ రాజస్థాన్ వెచ్చగా ఉంటుంది. ఇక్కడికి వెళ్లడానికి చలికాలమే కరెక్ట్ కాలం. ఏమేం చూడొచ్చంటే.. జైపూర్ రాజస్థాన్ రాజధాని.. పింక్ సిటీగా పేరు. ఈ టైమ్‌లో ఇక్కడ లిటరేచర్ .. కైట్ ఫెస్టివల్స్ ఉంటాయి. హవా మహల్, ఆమేర్ ఫోర్ట్, జల్ మహల్, సిటీ ప్యాలెస్, జంతర్ మంతర్ వంటివి ఇక్కడి దర్శనీయ స్థలాలు. ఉదయ్‌పూర్ వెనీస్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు దీన్ని. లేక్ ప్యాలెస్, ఫతేహ్ సాగర్ లేక్, జగ్ మందిర్, లేక్ పిఛోలా వంటివన్నీ ఉదయ్‌పూర్‌కి ప్రత్యేక శోభనిస్తూ ప్రపంచవ్యాప్త టూరిస్ట్‌లను ఆకర్షిస్తుంటాయి. ఇక్కడి లేక్స్, ఆరావలి పర్వతాలు.. ఉదయపూర్ వాతావరణాన్ని వెచ్చగా ఉంచి దీని పర్యటనకు చలికాలాన్ని పర్ఫెక్ట్గా మారుస్తున్నాయి. ఏటా చలికాలం ఇక్కడ ఆర్ట్స్, క్రాఫ్ట్స్‌కి సంబంధించిన ఉత్సవం జరుగుతుంది. ఆ టైమ్‌లో కళాప్రియులు ఈ ట్రిప్‌కి ప్లాన్ చేసుకోవచ్చు. రనక్పూర్ జైన్స్కి ముఖ్యమైన ప్రాంతం ఇది. ప్రశాతంతకు నిలయం ఈ పట్టణం. ప్రసిద్ధ చౌముఖ ఆలయం నెలవైందిక్కడే. దీని నిర్మాణ కళ అమోఘం. ఏడాది పొడుగునా భక్తుల రాకతో కళకళలాడుతూంటుంది. ఉదయ్‌పూర్‌కి దగ్గర్లో ఉంటుంది. కాబట్టి ఉదయ్‌పూర్‌కి వెళ్లినప్పుడు ఈ ఊరిదాకా ప్రయాణాన్ని పొడిగించుకోవచ్చు. జైసల్మేర్ ఈ డెజర్ట్ సిటీని చూడ్డానికి డిసెంబర్, జనవరి నెలలే బెస్ట్. ఇప్పుడెలాగూ సంక్రాంతి సెలవులే కాబట్టి చక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. డెజర్ట్ క్యాంపింగ్, క్యామెల్ రైడ్స్, క్వాడ్ బైకింగ్, డ్యూన్ బాషింగ్, పారాసైలింగ్ .. ఇలా బోలెడు యాక్టివిటీస్‌తో జైసల్మేర్‌లో ఎంజాయ్ చేయొచ్చు. అడ్వెంచరస్ యాక్టివిటీస్‌కి దూరంగా ఉండేవాళ్లు.. డెజర్ట్ ఫెస్టివల్, నెరాసీ (Nerasi) మ్యూజిక్ స్కూల్, కుల్ధారా విలేజ్, సోనార్ ఖిలా వంటి కల్చరల్ రైడ్‌ను ఆస్వాదించొచ్చు. ఫేమస్ లాంగేవాలా పోస్ట్‌కి డ్రైవ్‌ను మిస్ కావద్దు. జోధ్‌పూర్ దీనికి బ్లూ సిటీ ఆఫ్ రాజస్థాన్‌గా పేరు. 7 నుంచి 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్‌తో ఆహ్లాదంగా ఉంటుంది. మెహరంగఢ్ ఫోర్ట్, ఉమైద్ భవన్ ప్యాలెస్, మహామందిర్ టెంపుల్ వంటి జోధ్పూర్ల్యాండ్మార్క్స్ని చక్కగా దర్శించొచ్చు. అక్టోబర్‌లో అయితే ఇక్కడ ఇంటర్నేషనల్ ఫోక్ ఫెస్టివల్ జరుగుతుంది. వచ్చే ఏడాదికి ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఇసుక ఎడారి సరే ఉప్పు ఎడారీ చూడాలనుకుంటే గుజరాత్‌లోని రణ్ ఆఫ్ కచ్‌కి టికెట్స్ బుక్ చేసుకోవాలి. నల్లటి ఆకాశంలో తెల్లగా మిలమిల మెరుస్తున్న చుక్కల కింద.. చల్లటి వాతావరణంలో తెల్లటి ఉప్పు తివాచీ మీద కూర్చుని.. క్యాంప్ ఫైర్‌తో చలి కాచుకుంటూ .. గుజరాత్ సంప్రదాయ ఫుడ్‌ను ఆస్వాదిస్తుంటే ఊహల్లోని స్వర్గం ఇదేనేమో అనిపిస్తుంది! అంతేకాదు పీక్ వింటర్ రెండు నెలలు ఇక్కడ కల్చరల్ ఫెస్టివల్ జరుగుతుంది.. రణ్ ఉత్సవ్ పేరుతో. దీన్నే కచ్ ఫెస్టివల్ అనీ పిలుస్తారు. అద్భుతమైన గుజరాతీ సంప్రదాయ ఫుడ్‌తోపాటు స్థానిక హ్యాండీక్రాఫ్ట్స్, డెజర్ట్ సఫారీలు మనసును దోచుకుంటాయి. ఈ వేడుకను వీక్షించడానికి ప్రపంచ నలుమూల నుంచీ లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. అందుకే ముందస్తుగా బుక్ చేసుకుంటే మంచిది. ధోర్డో గ్రామంలో క్యాంపింగ్ మరచిపోయేది కాదు. కురిసే మంచును ఆస్వాదించాలనుకుంటే హిమాలయాల ఓడిలో మంచు ముసుగేసుకున్న ప్రాంతాలకు ప్రయాణమవాల్సిందే. థర్మల్స్, గ్లోవ్స్, షూస్.. కోల్డ్ క్రీమ్స్ మస్ట్! ఆ ప్రాంతాల్లో కొన్ని.. బిన్సర్ ఇది ఉత్తరాఖండ్‌లోని చిన్న హిల్ స్టేషన్. వింటర్లో తప్పక చూడాల్సిన జాబితాలో ఫస్ట్ పెట్టాల్సిన ప్లేస్. మబ్బులను ముద్దాడే కేదార్నాథ్, త్రిశూల్, నందా దేవి శిఖరాలు కళ్లు తిప్పుకోనివ్వవు. ఫొటోగ్రాఫర్స్కైతే ఇంచ్ ఇంచ్ అద్భుతమైన ఫ్రేమే! ఇక్కడి బిన్సర్ వైల్డ్‌లైఫ్ శాంక్చురీని పిల్లలకు చూపించాల్సిందే. ఇందులో అరుదైన పక్షి, జంతు జాతులను చూడొచ్చు. ఔలీ ఇదీ ఉత్తరాఖండ్‌లోని ప్రాంతమే. దీనికి స్కైయింగ్ డెస్టినేషన్ ఆఫ్ ఇండియాగా పేరు. అద్భుతమైన నందా దేవి, నీలకంఠ, మన పర్వత శిఖరాల మీదుగా స్కైయింగ్ చేస్తూ హిమాలయ అందాలను వీక్షించొచ్చు. చలికాలం వైవిధ్యమైన కళను సంతరించుకుంటుంది. మందంగా పరచుకున్న మంచు మీద స్కైయింగ్ చేయడానికి సాహసవంతులు ఉవ్విళ్లూరుతుంటారు. డల్హౌసీ హిమాచల్ ప్రదేశ్‌లోని డిఫరెంట్ హిల్ స్టేషన్. ఇక్కడి ఇళ్లు.. రోడ్లు.. కూడళ్లలో బ్రిటన్ ఆనవాళ్లు కనపడుతూంటాయి. కురుస్తున్న మంచులో ట్రెకింగ్ చేయాలనుకునే ఉత్సాహవంతులకు ఇది సరైన సమయమూ.. ప్రాంతమూ! నేషనల్ హిమాలయన్ వింటర్ ట్రెకింగ్ ఎక్సెపెడిషన్ని హోస్ట్ చేసేది డల్హౌసీనే! ఈ జాబితాలో సిమ్లా, కులు, మనాలి, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాలైన సిక్కిం, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్ వంటివాటినీ చేర్చుకోవచ్చు. గమనిక: పర్యటనకు కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకోగలరు. -
ఆ ప్రభుండు పుట్టెను.. బేత్లెహేమునందున!
‘రక్షకుండు ఉదయించినాడట... మనకొరకు పరమ రక్షకుండు ఉదయించినాడట. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి... శిశువును కనుగొందురని శీఘ్రముగను దూత తెల్పె’ అంటూ ఎముకలు కొరికే చలిలో రక్షకుని ఆగమన వార్తను పాడుకుంటూ, అనేకుల హృదయాలలో క్రిస్మస్ ఉల్లాసాన్ని నింపి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ మీటింగ్ నుంచి ఇంటికి బయలుదేరారు పాస్టర్ సైలస్. ఆయన దగ్గరకు ఓ ఖరీదైన కారు వచ్చి ఆగింది. దానిలో నుంచి ఒక ఘనమైన స్త్రీ దిగి పరుగు పరుగున పాస్టర్గారి దగ్గరకు వచ్చి ‘అన్నయ్యా బాగున్నారా!’ అంటూ ఆప్యాయంగా పలకరించింది. ఆమె చుట్టూ కొంతమంది అంగరక్షకులు కూడా ఉన్నారు. సామాన్య జనులంతా చాలా వింతగా చూస్తున్నారు. ఆమెను చూచి ‘బాగున్నానమ్మా! మీరెవరో గుర్తుకురావడం లేదు, కొంచెం పరిచయం చేసుకుంటారా?’ అడిగాడు. ‘నేనెవరో తెలుసుకోవాలనుకుంటే మీరొక పదేళ్లు వెనక్కు వెళ్ళాలి. యేసును నా సొంత రక్షకునిగా అంగీకరించిన ఆ మధుర రాత్రిని నేనెన్నడు మరువలేను. గురి, దరి లేని నా జీవితాన్ని మలుపుతిప్పి జ్యోతిర్మయుడైన ప్రభువు గొప్పదనాన్ని చాటి చెప్పడానికే ఈరోజు మీ ముందుకొచ్చాను. ఒకప్పుడు రోగిగా, అనాథగా, మోసపోయిన వనితగా, మృత్యువు ఒడిలో చేరిన అబలగా మీ దరికి చేరిన నన్ను– ఊహించలేని పరలోకపు ప్రేమతో ఆదరించి నన్ను తన కుమార్తెగా స్వీకరించి పరలోకపు ఔన్నత్యమును అనుగ్రహించాడు నా ప్రభువు. నాడు అభాగ్యురాలిగా నిలిచిన నన్ను ఉన్నత ఉద్యోగిగా, అర్హతలేని నన్ను ఎన్నో కృపలకు అర్హురాలుగా హెచ్చించాడు. నిజమైన క్రిస్మస్కు గుర్తుగా, సాక్షిగా నేను నేడు మీముందున్నాను’ అంటూ ఆనందబాష్పాలతో తనను తాను పరిచయం చేసుకుందామె. ‘ఆరోజు అర్ధరాత్రి మీ ఇంటి దగ్గర ఒక శవంలా పడి ఉండగా మీరే నన్ను క్రీస్తు ప్రేమద్వారా బతికించారు’ అని ఆమె వివరిస్తుండగా సైలస్గారు కాస్త ఉద్వేగానికి గురై ‘ఆ!... గుర్తొచ్చావమ్మా! కవితా, నువ్వా!’ అంటూ గతాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దైవ సేవకుడు పాస్టర్ సైలస్ వివాహం జరిగిన తరువాత తన భార్యతో కలిసి ఊరవతల ఒక చిన్న ఇంట్లో ఉంటూ సేవ ప్రారంభించాడు. భార్యాభర్తలిద్దరూ ఒక క్రిస్మస్ కూడికను ముగించుకొని ఆ అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నారు. కడుపు ఆకలితో అలమటిస్తున్నా, హృదయమంతా ప్రభువు నామస్మరణ ఉల్లాసంతో ఉరకలు వేస్తుంటే ఆ రోజు ఆ పశువుల పాకలో దూతలు పాడినట్లు ‘క్రీస్తు జన్మించాడు, రక్షకుడు ఉదయించినాడు’ అంటూ పాట పాడుకుంటూ గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టారు. ఒక స్త్రీ తమ ఇంటి ముందు పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. అర్ధరాత్రి సమయంలో ఈ స్త్రీ ఇక్కడకు రావడమేంటి? సైలస్ గారి మదిలో చాలా ప్రశ్నలు.. అసలు ఎవరీమె? ఏమైంది? ఈమె బాధేమిటో, కథేమిటో? ఏమీ అర్థంకావట్లేదు. ఏ స్థితి లోనైనా మనం అడగగానే ప్రార్థించగానే జవాబిచ్చే పరమతండ్రి మనకు తోడున్నాడు కదా! ‘నాకు మొఱపెట్టుము నీకుత్తరమిచ్చెదను’ అని బైబిల్లో రాయబడిన మాట ఆ భార్యాభర్తలకు గుర్తుకొచ్చింది. ప్రేమ నిండిన హృదయంతో మెల్లగా ఆ స్త్రీ వద్దకు వచ్చి ఆమె మీద నీళ్ళు జల్లగానే ఆమె తేరుకుంది. భార్యాభర్తలిద్దరూ ఆమె చేయి పట్టుకొని పైకి లేవనెత్తి ఇంటిలోకి తీసుకెళ్ళారు. తీవ్రమైన జ్వరంతో ఆమె ఒళ్ళు కాలిపోతోంది. చలితో వణకిపోతున్న ఆమెకు వెచ్చని రగ్గు కప్పి తాము సిద్ధపరచుకున్న కొద్దిపాటి ఆహారం ఆమెకు ఇచ్చారు. గ్లాసుడు పాలు తాగించి, రాత్రంతా ఆమెకు పరిచర్య చేస్తూ ఆమె కోసం ప్రార్థించసాగారు. కవిత ఆ రాత్రి ఆ ఘనమైన దైవజనుల నీడలో స్వస్థత, సాంత్వన పొందింది. సూర్యుని లేలేత కిరణాలు మీద పడగా నిశీధి రాత్రి భీకర ఛాయలన్నీ మరచి ఉదయ కాంతులను ఆస్వాదిస్తూ నిద్రలేచింది. మెల్లగా పాస్టర్ సైలస్ గొంతు సవరించుకొని ‘ఏమీ భయపడకు. నీకొచ్చిన కష్టమేంటో మాతో పంచుకో! చేతనైనంత సహాయం నీకందిస్తాము’ అని ప్రభువు ప్రేమతో కవితను ఆదరించారు ఆ ఆదర్శ దంపతులు. ఆ మాటలు విన్న కవిత కృతజ్ఞతతో భోరున ఏడ్వసాగింది. ‘ముక్కూ మొహం తెలియని నన్ను, అభాగ్యురాలనై, రోగంతో, ఆకలితో బాధపడుతున్న నన్ను క్రీస్తు ప్రేమతో ఆదరించి ఆశ్రయించి అక్కున చేర్చుకొని క్రిస్మస్కు శ్రేష్ఠమైన అర్థాన్ని చెప్పారు. నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క గారాలపట్టిగా ఉన్న నేను యౌవనాశలకు లొంగిపోయి ఒక కిరాతకుని ఉచ్చులోపడి, నమ్మి మోహించి వాడి చెంతకు చేరాను. వాడు నా బలహీనతను ఆధారంగా చేసుకొని దొడ్డిదారిన నన్ను ఒక వేశ్యాగృహానికి తాకట్టుపెట్టబోయాడు. విశ్వప్రయత్నాలు చేసి వాడి చెర నుంచి బయటపడ్డాను. గత ఐదు రోజుల నుంచి ఆ రైలు ఈ రైలు ఎక్కి ఈ పట్టణంలో ప్రవేశించాను. నా అన్నవారు లేక ఈ రోడ్డుమీద తిరుగుతూ ఎంగిలి విస్తరాకులు నాకుతూ డ్రైనేజీ నీళ్ళను కూడా తాగడానికి వెనుకాడక అత్యంత హీన, దీనస్థితికి దిగజారిపోయాను. ఈ బతుకుని బతకలేక విషం తాగి శవంగా మారిపోవాలని ఓపిక తెచ్చుకొని పయనమౌతుండగా గత రాత్రి క్రిస్మస్ కార్యక్రమంలో మీరు అందించిన క్రీస్తు ప్రభువు మాటలు దూరంగా నిలబడి విన్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం అని మీరు చెబుతుంటే కన్నీటితో నా స్థితిని దేవునితో చెప్పుకున్నాను. క్రిస్మస్ కాంతులన్నీ నా జీవితంలో విరజిమ్మాయి. నాకోసం ఒక రక్షకుడు జన్మించాడన్న వార్త నాకు ఎంతో బలాన్నిచ్చింది. రక్తం కక్కుతూ అత్యంత భయానకంగా ఉన్న నా పరిస్థితి ఒక్కసారిగా చక్కదిద్దబడింది. నా హృదయంలో యేసయ్య చేరిన మరుక్షణం నా పాపాంధకార ఛాయలు మటుమాయమైపోయాయి. నా పాపఫలితమే ఇదంతా అని గుర్తించగలిగాను. నా ప్రతీ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. నా మనస్సులో గొప్ప ఆనందం, ఆదరణ, సమాధానం కలిగాయి. మీచెంతకు చేరి నా బాధంతా వెళ్ళబుచ్చుకొని తిరిగి నా తల్లిదండ్రుల వద్దకు చేరాలనే ఆశతో అతికష్టం మీద మీ అడ్రస్ సంపాదించి మిమ్ము చేరుకోగలిగాను. మీకెంతో బాధ కలిగించాను, ఇబ్బందిపెట్టాను. కానీ మీరే నాకు ఆ సమయంలో దిక్కనిపించారు. మీ వద్ద నుంచి వెళ్ళిన తదుపరి జీవంగల దేవుడు నా జీవితంలో అద్భుతాలు చేయడం ప్రారంభించాడు. దేవుని మాటలు హృదయంలో ఉంచుకొని నా తల్లిదండ్రులను చేరుకున్నాను. నన్ను నా బంధువులు ఏరికోరి వారి కోడలుగా చేసుకున్నారు. నా భర్త ఒక గొప్ప ప్రభుత్వ అధికారి. ఆయన నన్ను ప్రోత్సహించి బాగా చదివించి ఒక డాక్టరుగా చేయగలిగారు. ఆ రాత్రి మీరు ఏర్పాటు చేసిన క్రిస్మస్కు దేవుని సన్నిధికి రాకుండా ఉండుంటే, ఆ మాటలు వినకుండా వుండుంటే ఆ రాత్రే నేను దిక్కులేని చావుతో శవమైపోయేదాన్ని లేదా చిరిగిన విస్తరిలా నా జీవితం మారిపోయేది. క్రిస్మస్ మాధుర్యాన్ని నాకు కనపరిచి నవ్యకాంతులమయమైన జీవితంగా నన్ను చేసినందుకు మీకేమిచ్చినా ఋణం తీర్చుకోలేను’ అంటూ ఉండగా పరవశంలో నిండిపోయాడు దైవజనుడు సైలస్. క్రిస్మస్ అసంఖ్యాక జీవితాల్లో నిర్మలమైన వెలుగులు నింపింది. క్రీస్తు జన్మించినప్పుడు బేత్లెహేము పొలాల్లో తమ మందను కాచుకొనుచుండగా దేవుని దూత వారిని దర్శించింది. ఓ గొప్ప వెలుగు వారిని ఆవరించింది. ‘రక్షకుడు పుట్టియున్నాడు’ అనే వార్తను వారు విని యేసు దర్శించి పునీతులయ్యారు. క్రిస్మస్ అనుమాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థము. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది కుల మతాలకు అతీతంగా క్రిస్మస్ను ఒక పండుగగా ఆచరిస్తున్నారు. రక్షకుడైన యేసుక్రీస్తు సర్వమానవాళిని రక్షించడానికి భువిపై అరుదెంచిన శుభదినము క్రిస్మస్.యేసుక్రీస్తు శరీరధారిగా రెండువేల సంవత్సరాల క్రితం బేత్లెహేము గ్రామంలో జన్మించాడు. యేసుక్రీస్తు చరిత్రలో కనిపిస్తారా అనే సందేహం కొంతమందిలో ఉండవచ్చు. యేసుక్రీస్తు ఉనికిని ప్రశ్నించిన పంతొమ్మిదో శతాబ్దానికి చెందిన బ్రూనో బార్ అనే జర్మన్ చరిత్రకారుడు ఇలా అంటాడు. ‘యేసు గ్రీకోరోమన్ తత్వజ్ఞానం ద్వారా ప్రభావితం చెందిన మొదటి శతాబ్దపు ప్రజల యొక్క మానసిక ఆవిష్కరణే గాని వాస్తవం కాదు. కొత్తనిబంధన ఒక పురాణమే గాని వాస్తవిక ఆధారాలతో లిఖించబడినది కాదు.’ దీనికి సమాధానంగా ప్రపంచప్రఖ్యాత చరిత్రకారుడు ఇ.ఎఫ్. హ్యారిసన్ ఇలా అంటాడు: ‘ప్రపంచంలోని చాలా విషయాలకు చారిత్రక ఆధారాలు లేవు. అవి వాస్తవ సంఘటనలపై కాకుండా కేవలం మనుషుల ఆలోచనలపై ఆధారపడి ఉన్నవి. క్రైస్తవ్యం అటువంటిది కాదు.’ క్రీస్తు రక్షకుడు, దేవుడు అని మొదటి, రెండవ శతాబ్ద కాలపు చరిత్రకారులు ఒప్పుకోక తప్పలేదు. అందులో అత్యంత ప్రధానమైనవాడు ఫ్లావియస్ జోసెఫస్. ఇతడు ఒక యూదా యాజక కుటుంబానికి చెందినవాడు, రోమీయులకు వ్యతిరేకంగా జరిగిన మొదటి యూదా తిరుగుబాటులో గలిలయలోని దళమును నడిపిన వ్యక్తి. అతడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రెండు గ్రంథాలు– ‘ద జ్యూయిష్ వార్స్’, ‘జ్యూయిష్ యాంటిక్విటీస్’ రచించాడు. ఫ్లావియస్ అనే పేరు రోమా పేరు కాగా జోసఫస్ అనే పేరు తన యూదు పేరు. అతడు ఇలా అంటాడు: ‘దాదాపు అపుడు అదే కాలంలో యేసు అనే ఒక మనుష్యుడు ఉండేవాడు. అతనిని మనుష్యుడు అని పిలవవచ్చునో లేదో తెలియదు. అతడు అద్భుతమైన కార్యములు చేయువాడై ఉండి సత్యమును సహృదయంతో అంగీకరించువారికి బోధకునిగా ఉన్నాడు. తనవైపు అనేకమంది యూదులను అనేకమంది అన్యులను ఆకర్షించుకున్నాడు. ఆయనే క్రీస్తు. మనలోని ప్రముఖుల సూచనల మేరకు పిలాతు అతనికి సిలువ శిక్ష విధించినప్పుడు ఆయనను మొదట ప్రేమించినవారు ఆయనను విడిచిపెట్టలేదు. ఎందుకనగా ఆయన వారికి చనిపోయి మూడవ దినమున సజీవముగా అగుపడినాడు. ఆయన నుంచి పేరు సంతరించుకున్న క్రైస్తవులనే తెగ నేటికి అంతరించలేదు.’ ఫ్లావియస్ జోసఫస్ రాసిన సంగతులు నేటికినీ చరిత్రకు ఆధారముగా ఉన్నవి. అలాంటి గొప్ప చరిత్రకారుడు యేసుక్రీస్తు జననాన్ని, మరణాన్ని, పునురుత్థాన్ని కూడా ఒప్పుకున్నాడు. నూతన నిబంధనలో యేసుక్రీస్తు జనన, మరణ, పునరుత్థానముల గురించి సవివరంగా ఉంది. ఆ సువార్తికులు ఎవరనగా... మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఇంగ్లండు దేశానికి చెందిన బైబిల్ పండితుడు జాన్ రాబిన్సన్ సువార్తలపై విస్తృత పరిశోధన చేశాడు. ‘యేసుక్రీస్తు దైవత్వాన్ని, మానవత్వాన్ని ప్రచురపరచే సువార్తలన్నీ క్రీస్తుశకం 70వ సంవత్సరం లోపే వ్రాయబడ్డాయి. అనగా యేసుక్రీస్తు ప్రభువు మరణించి, పునరుత్థానుడైన 40 సంవత్సరాల లోపే సువార్తలు, నూతన నిబంధనలోని చాలా పత్రికలు వ్రాయబడ్డాయి. ప్రపంచంలో దైవ గ్రంథము అని పిలువబడుతున్న ఏ గ్రంథము ఇంత తక్కువ వ్యవధిలో వ్రాయబడలేదు. మత్తయి ఒక సుంకపు గుత్తదారుడు. మార్కు పరిస్థితులన్నీ అవగాహన చేసుకొన్న ఒక మంచి యవ్వనస్థుడు. లూకా ప్రసిద్ధిగాంచిన ఒక వైద్యుడు. యోహాను యేసుక్రీస్తు ప్రియ శిష్యుడు. వీరందరూ క్రీస్తు జీవిత చరిత్రను వ్రాసారు. వాస్తవ సంగతుల ఆధారాలతో సువార్తలు వ్రాయబడ్డాయి గనుక ఎక్కడా కూడా భావ విరుద్ధమైనవి బైబిల్లో కనిపించవు’ అని జాన్ రాబిన్సన్ రాశాడు. యేసు శిష్యుడైన యోహాను నిర్ద్వంద్వంగా ఈ సత్యాన్ని వెల్లడిచేశాడు. ‘జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది యుండెనో మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియచేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను’– (1 యోహాను 1:1,2). క్రీస్తుకు పూర్వం ఏడు వందల సంవత్సరాలకు ముందు యెషయా అనే ప్రవక్త ఇలా ప్రవచించాడు. ‘కన్యక గర్భవతియై కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు’. ఇమ్మానుయేలు అనుమాటకు దేవుడు మనకు తోడు అని అర్థము. క్రీస్తు గురించి ప్రవక్తలు చెప్పిన ప్రవచనాలన్ని చరిత్రలో నెరవేర్చబడ్డాయి. మీకా అనే మరొక ప్రవక్త యేసు ‘బేత్లెహేము’లో జన్మిస్తాడని చెప్పాడు. ఆ మాట చెప్పబడిన కొన్ని వందల సంవత్సరాల తరువాత యేసు సరిగ్గా అదే గ్రామంలో జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం కనబడుతుందని, జ్ఞానులు ఆయన్ను వెదుకుతూ వస్తారని, క్రీస్తు ఆగమనాన్ని జీర్ణించుకోలేని హేరోదు రోదనధ్వనికి కారణమౌతాడని ఎన్నో విషయాలు ముందుగానే చెప్పబడ్డాయి. ఈ ప్రవచన నెరవేర్పు ప్రపంచానికి నేర్పించే పాఠము ‘క్రీస్తు ఒక ప్రవక్త కాదుగాని, ప్రవక్తలు ఎవరిగూర్చి ప్రవచించారో ఆ ప్రవచనాల సారము.’ బైబిల్లోని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తే ‘రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు’ అనే మాట యేసుప్రభువు పుట్టిన తర్వాత జ్ఞానులు ఆయనను దర్శిస్తారు అనడానికి నిదర్శనంగా కనబడుతుంది. యేసు పుట్టిన తర్వాత గొఱ్టెల కాపరులు, జ్ఞానులు ఆయనను దర్శించడానికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు సర్వలోకాన్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన అందరికీ కావలసినవాడు అనే విషయాన్ని ఈ సంఘటన ద్వారా మనము గ్రహించగలము. జ్ఞానులు యేసుప్రభువును వెదుక్కుంటూ వచ్చి బంగారమును, బోళమును, సాంబ్రాణిని అర్పించారు. వారు బాలుడైన యేసుక్రీస్తు ప్రభువుముందు మోకరిల్లి, సాగిలపడి పూజించారు. జ్ఞానులు వివిధ దేశాల నుంచి, వివిధ సంప్రదాయాలను అనుసరిస్తున్న వారిలో నుంచి యేసుప్రభువును వెతుక్కుంటూ మొదటిగా యెరూషలేముకు వచ్చారు. ఆ తర్వాత బేత్లెహేముకు వెళ్ళి యేసుప్రభువును దర్శించారు. జ్ఞానులు నక్షత్రం ద్వారా నడిపంచబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జన్మించారని, రక్షకుడు ఉదయించాడు అనే సత్యం వారు ఆకాశంలో వెలసిన నక్షత్రం ద్వారా తెలుసుకోగలిగారు. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ‘రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బేత్లెహేమునందు యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పుదేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదులరాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పుదిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చితిమని చెప్పిరి’– (మత్తయి 2:12). తూర్పుదిక్కున నక్షత్రపు దిశను చూసి, నక్షత్ర పయనాన్ని చూసి వారు సుదూర ప్రాంతాలు ప్రయాణం చేసుకుంటూ యెరూషలేము వచ్చారంటే వారికి ఖగోళశాస్త్రం మీద పట్టువుంది అని ఇట్టే మనకు అర్థమవుతుంది. అయితే జ్ఞానులను నడిపించిన ఈ నక్షత్ర మర్మమేమిటి? శాస్త్రవేత్తలలో కొన్ని అభిప్రాయాలు వెల్లడించబడ్డాయి. యేసు పుట్టిన మొదటి శతాబ్దం నుంచి ఈ బేత్లెహేము తారను గూర్చి జ్ఞానులకు అగుపడిన నక్షత్రమును గురించి పండిత వర్గాలలో విపరీతమైన చర్చ జరిగింది. అయితే కొందరు కొన్ని రకాలైన అభిప్రాయాలను వెల్లడిచేశారు. మొదటిగా సూపర్నోవా. ఈ నక్షత్రం తెల్లటి కాంతితో మిరుమిట్లు గొలుపుతూ పేలిపోతూ ఉంటుంది. నక్షత్రాలు అప్పుడప్పుడు విస్ఫోటం చెందుతూ ఉంటాయి. ఈ విస్ఫోటం వలన ఆ నక్షత్రం కాంతి నేల నుంచి లక్షల రెట్లు పెరుగుతూ ఉంటుంది. అకస్మాత్తుగా ఆకాశంలో నక్షత్రం కనబడుతుంది. గొప్ప వెలుగు ఆకాశంలో కనబడుతుంది. అయితే వాస్తవాన్ని పరిశీలన చేస్తే ఈ సూపర్నోవా విస్ఫోటం చెందినప్పుడు ఎక్కువకాలం కనిపించే అవకాశాలు ఉండవు. దీన్నిబట్టి యేసుప్రభువు పుట్టినప్పుడు నక్షత్ర విస్ఫోటం జరగలేదు. రెండవ అభిప్రాయం– హేలీ తోకచుక్క కనబడిందని కొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. క్రీస్తు పూర్వము 5వ సంవత్సరంలో మార్చి, ఏప్రిల్ నెలలో కొత్త నక్షత్రం ఒకటి కనబడినట్లుగా చైనా దేశం వారు తమ చరిత్రలో రాసుకున్నారు. అయితే ఆ నక్షత్రం తోకచుక్కా లేదా సూపర్నోవా అనే విషయాన్ని వారు గుర్తించలేకపోయారు. వాస్తవానికి తోకచుక్కల గురించి మనకందరికీ విదితమే! తోకచుక్కలు ప్రతి నిర్ణీత కాలానికోసారి ఆకాశంలో కనబడుతుంటాయి. ఉదాహరణకు హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతూ ఉంటుంది. అయితే శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం హేలీ తోకచుక్క క్రీస్తు పూర్వము 12 సంవత్సరంలో కనబడింది గనుక హేలీ తోకచుక్క కనబడిందనేది గూడా ఒక అవాస్తవంగా మనం గ్రహించాలి. మూడవది శాస్త్రవిజ్ఞాన రంగంలో యేసుప్రభువు పుట్టినప్పుడు ఆకాశంలో నక్షత్రం పుట్టింది అని బైబిల్ చెప్పినప్పుడు దానికి చాలా దగ్గరగా ఉన్న వ్యాఖ్యానం– గ్రహకూటమి. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త జోహనెస్ కెప్లెర్ 1607వ సంవత్సరంలో యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఉదయించిన నక్షత్రం గురించి పరిశోధన చేశాడు. ‘యేసుప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. బృహస్పతి, శని మరియు అంగారకుడు– ఈ మూడు గ్రహాలు కూడా ఒకే కక్ష్యలోనికి వచ్చి ఒక బ్రహ్మాండమైన వెలుగును విడుదల చేశాయి. ఈ మూడు గ్రహాలు కూడా ఒక కక్ష్యలోనికి రావడం ద్వారా గొప్ప వెలుగు పుట్టి అది జ్ఞానులను నడిపించింది’ అని జోహనెస్ కెప్లెర్ వివరణనిచ్చాడు. ఆకాశంలో నక్షత్రం పుట్టినదానికి శాస్త్రయుక్తమైన వివరణ కావాలంటే జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ అత్యంత దగ్గరగా ఉంది. అయితే ఆకాశంలో నక్షత్రం పుట్టడమనేది అసాధారణ కార్యమే. అయితే దేవునికి అసాధ్యమైనదేదీ లేదు గనుక ఆయన ఒక అద్భుతాన్ని ఆకాశంలో జరిగించి జ్ఞానులను నడిపించాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. అయితే ఈ రోజుల్లో శాస్త్రం దేనికైనా ఋజువులడుగుతుంది, వివరణలడుగుతుంది గనుక జోహనెస్ కెప్లెర్ ఇచ్చిన వివరణ శాస్త్రయుక్తంగా యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో పుట్టినప్పుడు వెలసిన నక్షత్రానికి దగ్గరగా ఉంది.అయితే విచిత్రమేమిటి అంటే నక్షత్రం జ్ఞానులను యేసుప్రభు వున్నచోటికి నడిపించింది. వారు చదువుకున్న చదువు వారు సంపాదించిన జ్ఞానం వారిని ప్రభువు దగ్గరికి నడిపించడానికి ఉపయోగపడింది. వారు నక్షత్రం ద్వారా నడిపించబడి యెరూషలేముకు వచ్చి ఆకాలంలో యూదులను పరిపాలిస్తున్న హేరోదు రాజు వద్దకు వచ్చి తామెందుకు వచ్చారో వివరించారు. వారి రాకకు గల కారణాన్ని విని హేరోదు, అతనితో పాటు యెరూషలేము నివాసులు కలవరపడ్డారు. ‘హేరోదు జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రం కనబడిన కాలము వారిచేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే నేనునూ వచ్చి ఆయనను పూజించునట్లు నాకు వర్తమానము తెండి అని చెప్పి వారిని బేత్లెహేముకు పంపెను’– (మత్తయి 2:68). ఇక్కడ హేరోదు రాజులో ఉన్న దుర్భుద్ధి కనబడుతుంది. హేరోదు దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో లేడు. అయితే పైకి కనిపించడం మాత్రం ప్రజలందరికీ నేను కూడా పూజిస్తాను, నేను కూడా ఆరాధిస్తాను అని చెబుతున్నాడు కానీ అతని మనసులో భయంకరమైన స్వభావం దాగియుంది. కలవరపడినవాడు దేవుడిని చంపాలనే చూశాడు తప్ప ఆయనను రక్షించాలని, పూజించాలనే ఉద్దేశం అతనిలో లేదు. హేరోదు భయంకరమైన వేషధారిగా కనబడుతున్నాడు. పైకి ఒకలా మాట్లాడటం, లోపల మరొక తత్వాన్ని కలిగియుండటం. పైకి మనుషులను ఒప్పించేలా మాట్లాడటం, లోపల ఆ దేవుడిని సమూల నాశనం చేయాలనే తలంపును కలిగి ఉన్నాడు. ఇది భయంకరమైన వేషధారణ. అందునుబట్టే వేషధారులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. జ్ఞానులు తమ పెట్టెలు విప్పి యేసుకు కానుకలు అర్పించారు. బంగారము, సాంబ్రాణి, బోళమును సమర్పించారు. వారు అర్పించిన కానుకలలో గొప్ప ఆధ్యాత్మిక విషయాలు దాగి ఉన్నాయి. బంగారము దైవత్వానికి, సాంబ్రాణి ఆరాధనకు, బోళము స్వస్థతకు సంకేతాలు. ఆ తదుపరి వారు దేవుని చేత బోధించబడినవారై వారి దేశమునకు ఒక నూతన మార్గములో తిరిగి వెళ్ళారు. దేవుని చేత బోధించబడటం మానవ జీవితానికి చాలా ఆశీర్వాదకరం. మాకన్నీ తెలుసులే, మేము కూడా జ్ఞానం కలిగినవారం, నక్షత్ర పయనాన్ని చూసే మేము దేవుడిని కనుగొనటానికి వచ్చాము గనుక ఇకపై మా జ్ఞానం, మా తెలివి, మా వివేచన ద్వారా నడుస్తాము; మా అంతటి జ్ఞానవంతులు మరొకరు లేరు, మేము ఎవరి మాట వినక్కర్లేదు అని జ్ఞానులు అనుకోలేదు గాని దేవునిచేత బోధించబడినవారై ఆ బోధకు అనుకూలంగా వారు స్పందించారు. ఆ బోధనను అనుసరించి వారు మరొక మార్గానికి తిరిగి వెళ్ళారు. మాకన్నీ తెలుసులే మాకు తెలిసిందే మేం చేస్తాం, దేవుని స్వరాన్ని మేము వినాల్సిన అవసరం మాకు లేదు అని గనుక వారు హేరోదు దగ్గరకు వెళ్ళి ఉంటే పరిస్థితులు వేరేగా ఉండేవేమో గాని, దేవుని మాటకు వారు లోబడటం ద్వారా మనకందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఆనాటి ఖగోళ శాస్త్రజ్ఞులు యేసుక్రీస్తు ప్రభువును ఏవిధంగా ఆరాధించారో, అటువంటి ఓ అద్బుత ఘటన మానవ చరిత్రలో 20వ శతాబ్దంలో చోటు చేసుకుంది. సువిశాల ప్రపంచంలో ప్రతిరోజూ ఎన్నో అపూర్వ సంఘటనలు చోటు చేసుకుంటాయి. వాటిలో ఓ అరుదైన ఘట్టం ఇది. 1969 జూలై 20న అపోలో– 11 అనే రాకెట్ మీద అక్షరాల 2లక్షల 20వేల మైళ్ళు ప్రయాణం చేసి అమెరికా దేశపు శాస్త్రవేత్తలు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కొలిన్స్ మొట్టమొదటిగా చంద్రునిపై కాలుమోపారు. ఖగోళ శాస్త్రంలో ఓ నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఈ శాస్త్రవేత్తలు చంద్రుని మీద అడుగుపెట్టి దేవుని అద్భుత సృష్టి గొప్పతనాన్ని చూసి మనసారా మహనీయుడైన దేవుని స్తుతించారు. అక్కడకు వెళ్ళి బైబిల్లోని 121వ కీర్తనను జ్ఞాపకం చేసుకున్నారని చెబుతారు. దానిలో ‘నిన్ను కాపాడువాడు’ అనే మాట ఆరుసార్లు వ్రాయబడింది. ఒక మైక్రో బైబిల్‌ను చంద్రునిపై ఉంచి తిరిగి వచ్చారు. చంద్రుని నుంచి తిరుగు ప్రయాణం చేసి భూమి మీదకు వచ్చిన తరువాత నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే శాస్త్రవేత్త తన ఉద్యోగానికి రాజీనామా చేసి, తన మరణ పర్యంతం దేవుని సేవలో కొనసాగి ప్రభువు రాజ్యానికి వెళ్ళిపోయాడు. దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే దేవాదిదేవుడు ఇంకెంత అద్భుతమైనవాడో కదా! నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చాలామంది చంద్రుని మీదకు వెళ్ళివచ్చారు. అదే ప్రక్రియలో 1971వ సంవత్సరంలో జేమ్స్ బి. ఇర్విన్ అనే శాస్త్రవేత్త కూడా చంద్రుని మీదకు వెళ్ళి కొన్ని పరిశోధనలు చేసివచ్చారు. వచ్చేటప్పుడు అక్కడి నుంచి మట్టి, కొన్ని రాళ్ళు తీసుకు వచ్చారు. జేమ్స్ బి ఇర్విన్ కూడా తన జీవితాన్ని ప్రభువు సేవకు అంకితమిచ్చి ప్రపంచమంతా తిరిగి దేవుని సువార్తను ప్రకటించాడు. ఈ లోకంలో దేవుని సేవను మించిన పని మరొక్కటి లేదని నిరూపించాడు. అతను ఎక్కడికి వెళ్ళినా గొప్ప సన్మానాలు లభిస్తున్నాయి. ప్రజలందరూ పోటీలు పడి కరచాలనం చేస్తున్నారు. రెడ్ కార్పెట్లు పరుస్తున్నారు. అటువంటి గొప్ప శాస్త్రవేత్త భారతదేశాన్ని సందర్శించి చాలా ప్రాంతాలు పర్యటించారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలు సందర్శించి సువార్త ప్రకటించి దేవుని నామమును మహిమపరచాడు. ప్రతి సభలో ఆయన ప్రకటించిన సత్యం... ‘నేను చంద్రునిపై కాలుపెట్టి వచ్చానని నన్ను ఇంతగా మీరు అభిమానిస్తున్నారే, వాస్తవానికి మానవుడు చంద్రునిపై అడుగుపెట్టడం గొప్పకాదు. సృష్టికర్తయైన దేవుడు మానవుడిగా ఈ భూమిపై అడుగుపెట్టాడు. అదీ గొప్ప విషయం’. క్రిస్మస్ లోకానికి రక్షణ వర్తమానాన్ని తెచ్చింది. ‘దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీకొరకు పుట్టియున్నాడు’ అని దూత రాత్రివేళ పొలములో గొర్రెలను కాచుకుంటున్న కాపరులకు ఉన్నతమైన శుభవార్తను తెలియచేసింది. ఈ రక్షకుడు లోకరక్షణార్థమై జన్మించాడు. యేసు అను మాటకు రక్షకుడు అని అర్థం. ‘తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు’ అని దూత మరియకు ప్రధానం చేయబడిన యోసేపు అనే వ్యక్తికి తెలిపింది. ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ అనే పదాన్ని నిత్యజీవితంలో అనేకసార్లు వింటుంటాం. నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తికి కావలసినది రక్షణ. ఆ సమయంలో తాను కాపాడబడడం గాక మరిదేని గురించి అతడు ఆలోచించడు. కాలిపోతున్న ఇంటిలో చిక్కుకున్న వ్యక్తికి రక్షణ కావాలి. ఆపదలలో ఉన్నవారికి సహాయ సహకారాలు అందించి వారిని ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి రక్షిస్తారు కాబట్టే పోలీసు వారిని రక్షకభటులు అని పిలుస్తారు. అయితే దేవుడు అనుగ్రహించే రక్షణ ఎటువంటిది? మనిషి పాపముల నుండి అపరాధముల నుండి నిత్యశిక్ష నుంచి రక్షణ పొందడానికి ప్రయాసపడుతున్నాడు. అయితే సర్వశక్తుడైన దేవుని మాటకు అవిధేయత చూపించుట ద్వారా పాపం లోకంలోనికి ప్రవేశించింది. ‘ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవుచున్నారు అనేది లేఖన సత్యం’– (రోమా 2:23). పాపము దేవున్ని మనిషిని దూరం చేసింది. అత్యున్నతుడైన దేవుని సమీపించకుండా మనిషి పాప క్రియలు అడ్డుకున్నాయి. పాపములో నశించిపోతున్న మానవాళిని తన దివ్య ఆగమనం ద్వారా రక్షించాలనే యేసు ఈ లోకానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చానన్న ఆయన మాటలు మనిషి విజయానికి బాటలు వేశాయి. పాప బానిసత్వంలో నలిగిపోతున్న మానవునికి విముక్తి ప్రసాదించి తన ఔన్నత్యాన్ని వెల్లడి చేశాడు. గతి తప్పిన మనిషి జీవితాన్ని తన ప్రేమ ద్వారా ఉద్ధరించాలని దేవుడు సంకల్పించాడు. ఒక చర్చిలో పాత వస్తువులను వేలం పాటలో అమ్మేస్తున్నారు. వాటి ద్వారా వచ్చే ధనంతో చర్చిని మరింత కొత్తగా తీర్చిదిద్దాలని నాయకుల ఆలోచన. పాత బల్లలు, తివాచీలు, వస్తువులన్నీ వేలానికి సిద్ధపరచారు. ఏవో సంపాదించుకుందామన్న ఆలోచనతో కొందరు వేలం పాటలో పాల్గొనడానికి చర్చి ప్రాంగణానికి చేరుకున్నారు. అన్ని వస్తువులను వేలం వేయగా కొద్దో గొప్పో వెలను చెల్లించి వాటిని సొంతం చేసుకున్నారు. చివరకు ఒక పాత పగిలిన వయోలిన్ ఉండిపోయింది. ఎంతసేపు గడిచినా దానిని కొనుక్కోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. కాసేపటికి ఒక ముసలాయన ముందుకు వచ్చి సంఘ సేవకుణ్ణి ఆ వయోలిన్ తనకిమ్మని అడుగుతాడు. ఎంతోకాలంగా ఒక పక్కకు నెట్టివేయబడిన వయోలిన్‌ను అతడు అత్యద్భుతంగా ట్యూన్ చేసి దానిమీద ఒక క్రిస్మస్ పాటను ఇంపుగా వాయిస్తాడు. శ్రావ్యమైన స్వరాలను ఆ వయోలిన్ పలికించినప్పుడు దానిని కొనుక్కోవడానికి చాలామంది ముందుకు వచ్చారు. శ్రుతిలేని జీవితాలను శ్రుతి చేయడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. పాడైపోయిన మనిషిని బాగుచేసి సమసమాజ నిర్మాణంలో వాడుకోవాలన్న ఆకాంక్ష దేవుడు కలిగియున్నాడు. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. యేసును హృదయాల్లో ప్రతిష్ఠించుకున్న జనులందరికీ అవగతమయిన సత్యమది! క్రిస్మస్ తెచ్చిన ఆనందం, క్రీస్తులోని ఆనందం వర్ణనాతీతం, అది అనుభూతికి అందని అనుభవైకవేద్యం. అనుభవించే కొద్ది అది ద్విగుణీకృతం. ఆస్వాదించే వారికి అమోఘం, అద్వితీయం. లోకంలో ఎన్నో ఆకర్షణలు ఆనందాలు, కానీ క్రిస్మస్ అందించిన ఆనందం శాశ్వతమైనది. మొదలేకానీ ముగింపులేనిది. లోక రక్షకుడు పుట్టాడన్న వార్తను నక్షత్ర కదలిక ద్వారా తెలుసుకున్న ముగ్గురు జ్ఞానులు క్రీస్తును దర్శించాలన్న ఆశతో ప్రయాణం ప్రారంభించారు. ఓపికతో శ్రమపడితే కచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటామని నిరూపించారు. ‘ఆకాశంలో కనువిందు చేసిన నక్షత్రం వారిని సృష్టికర్తయైన దేవుని దగ్గరకు నడిపించింది. ఆ సందర్భంలో వారు అమితానందభరితులయ్యారు’ అని మత్తయి తన సువార్తలో వ్రాశాడు. దైవజ్ఞానపు తీరు అవగతమయిన సమయాన మనిషికి కలిగే ఆనందం వర్ణనాతీతం.ప్రపంచం ఎన్నడు మరువలేని హాస్యకళాకారుడు చార్లీ చాప్లిన్. డైలాగులు కూడా లేకుండా అతడు నటించిన ఎన్నో సినిమాలు అతనికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. చాప్లిన్ లెక్కపెట్టలేనంత ధనాన్ని కూడా ఆర్జించాడు. ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాగిపోయిన అతని జీవిత చరమాంకంలో ఎవరో అడిగారు ‘నీ జీవితాన్ని ఒక్క ముక్కలో చెప్పగలవా?’ అని. ఆ ప్రశ్నకు అతడిచ్చిన సమాధానం ‘నా జీవితం ఓ ప్రయోగాత్మకమైన జోక్’. ఆ సమాధానాన్ని చాలామంది జీర్ణించుకోలేకపోయారు. వాస్తవాన్ని పరిశీలిస్తే నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువైన ఆనందాన్ని సొంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ‘నాకు వద్దు అనుకుంటే వస్తుంది డబ్బు, కావాలనుకుంటే రావట్లేదు శాంతి సంతోషాలు’ అని ఒక కుబేరుడు మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యపరచింది. భౌతిక అవసరాలు తీరితే చాలు ఎంతో సంతోషంతో ఆనందంతో జీవించవచ్చు అని చాలా అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఆనంద సంతోషాలు అనేవి భౌతిక విషయాలపై ఆధారపడి ఉండవు. అవి దేవుని సహవాసంలో మాత్రమే లభించే అమూల్య బహుమానాలు. తమ అంతరంగాలపై, వదనాలపై ప్రభువులోని దీనత్వాన్ని, పవిత్రతను కలిగియుండే వారిలో అనిర్వచనీయమైన ఆనందం కదలాడుతూ ఉంటుంది. ఒకప్పుడు వారిలో రాజ్యమేలిన అహంకారం, అసూయ, స్వార్థం, సంకుచిత స్వభావం నశించిపోయి వారిలో నూతనత్వం విరాజిల్లుతుంది. సమూయేలు అనే భక్తుడు రాసిన పాటను క్రైస్తవ ప్రపంచం ఎన్నడూ మరచిపోదు. క్రీస్తు జన్మ విశిçష్ఠతను, ఆయన జీవితాన్ని, మరణ పునరుత్థానములను అద్భుతంగా వివరించే పాట అది. ‘పాపికాశ్రయుడవు నీవే. ఉన్నతలోకము విడిచిన నీవే... కన్నియ గర్భమున బుట్టిన నీవే, యేసు నీవే. చెదరిన పాపుల వెదకెడు నీవే... చెదరిన గొర్రెల కాపరివి నీవే. రోగులకు స్వస్థప్రదుడవు నీవే... మ్రోగునార్తుల యొక్క మొఱ విను నీవే. శాత్రవాంతరమున మృతుడవు నీవే... మైత్రిజూపగ మృత్యుద్ధతుడవు నీవే!’ సాక్షి పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ, ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
యాప్‌లతో సేఫ్టీకి భరోసా!
అడ్వాన్స్డ్ ఎరాలో ఉన్నాం.. మీట నొక్కే వేగంలో పనులు అయిపోతున్నాయి.. అయినా స్త్రీకి సంబంధించిన విషయంలో సమాజపు ఆలోచనలే ఇంకా ప్రగతి పంథా పట్టలేదు! అందుకే ఇప్పటికీ ఆమెకు భద్రత లేదు! ఆమె సేఫ్టీకి సాంకేతికత యాప్‌ల ద్వారా ఇస్తున్న భరోసా మనసావాచాకర్మణా సమాజం ఇవ్వడం లేదు! ఆ స్పృహను సాధించే వరకు.. మహిళ ఆ సేఫ్టీ యాప్‌లనే నమ్ముకోక తప్పదు!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం.. యూఎన్ఓ ఈ ఏడాది ప్రకటించిన థీమ్.. డిజిటాల్: ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ (DigtALL: Innovation and technology for gender equality). . అవును ఏ ఆవిష్కరణ అయినా.. సాంకేతికతైనా స్త్రీ, పురుష సమానత్వాన్నే చాటాలి. ఈ సమానత్వ పోరు నేటిది కాదు.. దాదాపు 115 ఏళ్ల నాటిది. నాడు అమెరికాలో గార్మెంట్ ఇండస్ట్రీలో ప్రమాదరకమైన పని పరిస్థితులు.. స్త్రీల పట్ల వివక్ష.. అసమాన వేతనాలు వంటి విషయాల్లో మార్పు కోసం మహిళల సమ్మెతో మొదలైన పోరాటం.. అన్ని రంగాల్లో.. అన్ని విషయాల్లో జెండర్ ఈక్వాలిటీ దిశగా ఇంకా కొనసాగుతూనే ఉంది. శతాబ్దం మారింది.. అయినా సమానత్వ సాధన కోసం ఇంకా థీమ్స్‌ను సెట్ చేసుకునే దశ, దిశలోనే ఉన్నాం. ‘కాలం మారింది.. ఇప్పుడు అన్ని రంగాల్లో స్త్రీలు కనపడుతున్నారు.. వినపడుతున్నారు కదా!’ అని మనకు అనిపించినప్పుడల్లా.. ఒక్కసారి స్త్రీల మీద జరుగుతున్న క్రైమ్ రికార్డ్స్‌ను ముందేసుకుందాం! అన్ని రంగాల్లో స్త్రీలు ఉన్నారు కదా అని ఎత్తుకున్న తల దించేసుకుంటుంది. స్వేచ్ఛ ఉంటేనే సమానత్వం సిద్ధిస్తుంది. భద్రత ఉంటేనే ఆ స్వేచ్ఛకు అర్థం ఉంటుంది. ఇంట్లో హింస.. బయట హింస.. ఆఖరకు ఆడపిల్ల తల్లి గర్భంలో ఉన్నా హింసే. ఈ వాక్యాలు రొడ్డకొట్టుడులా అనిపిస్తున్నాయి. అంటే పరిస్థితిలో ఇంకా మార్పు రాలేదనే కదా! అందుకే ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ సాధించాలంటే ముందు ఆడపిల్ల సురక్షితంగా ఉండాలి. ఇంటా.. బయటా బేఫికర్‌గా మసలగలగాలి! పోలీసులు, చట్టాలు ఉన్నాయి కదా అని తట్టొచ్చు! ‘నాకు సేఫ్టీ లేదు.. భయంగా ఉంది’ అని అమ్మాయి చెబితేనే కదా.. పోలీసులు స్పందించేది. ఆ అభద్రతను రిజిస్టర్ చేస్తేనే కదా.. రక్షణ చట్టాలు వచ్చేవి. ఇదంతా జరగాలంటే సమాజంలో అవగాహన రావాలి. అమ్మాయిలను చూసే తీరు.. వాళ్లతో ప్రవర్తించే పద్ధతులు మారాలి. వాళ్ల పట్ల మర్యాద పెరగాలి. వీటన్నిటికీ మగపిల్లలకు జెండర్ సెన్సిటివిటీ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో.. తనున్న పరిస్థితి పట్ల ఎరుక.. దాన్నుంచి బయటపడే చొరవ అమ్మాయిలకూ అంతే అవసరం. ముందు తన చుట్టూ ఉన్న ప్రమాదాన్ని గుర్తించే ధైర్యం.. తెగువ చేయాలి. అందుకు ఇప్పుడు సాంకేతికత బోలెడంత సాయాన్ని అందిస్తోంది. యాప్‌ల రూపంలో! అలా ఫోన్లో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోవాల్సిన విమెన్ సెక్యూరిటీ యాప్‌లు కొన్ని ఇక్కడ.. దిశ ఇది ఆంధ్రప్రదేశ్ పోలీస్ కమ్యూనికేషన్ వింగ్ రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో యాప్‌ను ఓపెన్‌చేసి.. మూడుసార్లు షేక్ చేయగానే ఫోన్లోని జీపీఎస్ యాక్టివేట్ అయ్యి.. దగ్గర్లో ఉన్న పోలీస్ స్టేషన్లు, డ్యూటీలో ఉన్న పోలీసులను అలర్ట్ చేస్తుంది లొకేషన్‌ను పంపించి. ఒకవేళ ఫోన్ షేక్ చేయకుండా యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను నొక్కినా.. మీ సమాచారం మీరున్న ప్రాంతానికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్లు, ఆన్ డ్యూటీ పోలీసులకు చేరుతుంది. వెంటనే సహాయ సిబ్బంది మీ దగ్గరకు చేరుకుంటారు. ఈ యాప్ సహాయంతో 100 నంబర్, లేదా ఈ యాప్‌లో ఉన్న ఇతర హెల్ప్ లైన్ నంబర్స్కూ కాల్ చేయవచ్చు. ఈ యాప్ ప్రమాదస్థలికి దగ్గర్లోని పోలీస్ స్టేషన్ల వివరాలనే కాక.. ఇతర సేఫ్టీ ప్లేసెస్, ఆసుపత్రులు, ఇతర హెల్ప్‌లైన్ నంబర్లనూ అందిస్తోంది. విమెన్ సేఫ్టీ (Women Safety) ఈ యాప్‌లోని బటన్‌ను ఒక్కసారి తడితే చాలు.. మీరు ప్రమాదంలో చిక్కుకున్న సంగతి.. లొకేషన్ గూగుల్ మ్యాప్ లింక్ సహా మీ ఫోన్లో మీరు ఫీడ్ చేసుకున్న ఎమర్జెన్సీ నంబర్లకు చేరిపోతుంది. ఇందులోని బటన్లు మూడు రంగుల్లో ఉంటాయి. అంటే మీరున్న పరిస్థితి తీవ్రతను బట్టి ఆయా రంగుల్లో ఉన్న బటన్స్‌ను నొక్కాలి. షీ టీమ్స్ మహిళల భద్రత కోసం తెలంగాణ రాష్ట్రం షీ టీమ్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ వింగ్ 2014లో ప్రారంభమైంది. తొలుత హైదరాబాద్‌లోని సైబరాబాద్ పరిధికే వీరి సేవలు పరిమితమైనా.. తర్వాత ఏడాదికి అంటే 2015కల్లా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ షీ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ అంతటా 331 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. 112 యాప్ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆల్ ఇన్ వన్ యాప్ ఇది. ఉపయోగించడం చాలా తేలిక. ప్రమాదంలో ఉన్నప్పుడు.. ఈ యాప్‌ను సింగిల్ ట్యాప్ చేస్తే చాలు.. మీరున్న డేంజర్ సిచ్యుయేషన్‌కు సంబంధించి అలారమ్ మోగుతుంది. తక్షణమే సహాయక చర్యల సిబ్బందీ స్పందిస్తారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్ రెండు ఫోన్లకూ సెట్ అవుతుంది. ఈ 112 యాప్ మొత్తం 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పనిచేస్తుంది. కీ ఫీచర్స్ ఏంటంటే.. ఎమర్జెన్సీ అలారమ్‌ను పంపించేందుకు ఇందులో ఆడియో/విజువల్ మీడియా ఉంటుంది. 24 గంటలూ ఈ యాప్ ద్వారా భద్రతా సేవలు పొందవచ్చు. అదనంగా.. సంఘటనల విచారణలోనూ తనవంతు సాయం అందిస్తుంది. మై సేఫ్టీపిన్ (My SafetyPin) డేటా మాపింగ్ టెక్నిక్స్ సాయంతో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సేఫ్‌గా ఫీలయ్యేందుకు సాయపడుతుందీ అప్లికేషన్. వెలుతురు, వైశాల్యం, సెక్యూరిటీ గార్డ్స్, కాలిబాట, ప్రజా రవాణా వ్యవస్థ, జెండర్ యూసేజ్, భావోద్వేగాలు.. మొదలైన తొమ్మిది అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ యాప్‌ను రూపొందించారు. ఒకవేళ మీరు రాంగ్రూట్ని ఎంచుకున్నా ఇది వెంటనే మీ కుటుంబ సభ్యులను అలర్ట్ చేస్తుంది. భద్రమైన దారిని ఎంచుకునేందుకు మీకు తోడ్పడుతుంది. మీరు తప్పిదారి అంత భద్రతలేని ప్రాంతంలోకి వెళ్లినా.. ఆ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. సెర్చింగ్‌లో మీ చుట్టుపక్కల ఉన్న ఆసుపత్రులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు.. ఇతర సౌకర్యాల గురించీ మీకు సమాచారం ఇస్తుంది. దేశంలోని నగరాలను సురక్షిత నగరాలుగా మార్చడమే ‘మై సేఫ్టీపిన్’ లక్ష్యం. షీరోస్ ఇప్పుడున్న లీడింగ్ విమెన్ యాప్స్‌లో యూనిక్ యాప్ ఇది. మహిళల భద్రతకు సంబంధించే కాదు కెరీర్ గైడెన్స్, ఫ్రీ హెల్ప్ లైన్, రెసిపీలు మొదలు బ్యూటీ టిప్స్, ఇంట్లో ఉండే పనిచేసుకునే ఉపాధి అవకాశాల నుంచి కొత్త కొత్త పరిచయాలు, ఉచిత న్యాయ సలహాల వరకు మహిళలకు అవసరమైన చాలా అంశాల్లో ఈ యాప్ సహాయమందిస్తుంది. మీ నెలసరినీ ట్రాక్ చేస్తూ సూచనలిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యమైనది దీని గోప్యత, భద్రత. మీ ఫొటోలు, వీడియోలు మొదలు మీ వ్యక్తిగత సమాచారాన్నంత గోప్యంగా.. భద్రంగా ఉంచుతుంది. దీని సేవలను ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్.. రెండు ఫోన్లలోనూ పొందవచ్చు. స్మార్ట్ 24 గీ సెవెన్ ( స్మార్ట్ 24 X7) దీనితో ఇరవైనాలుగు గంటల కస్టమర్ సర్వీస్ సెంటర్‌తో సపోర్ట్ పొందవచ్చు. ఇది ఇటు యాపిల్ అటు ఆండ్రాయిడ్ ఫోన్లలో సెట్ అవుతుంది. ఆపదలో ఉన్న మహిళలు తమ దీని ద్వారా ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను కుటుంబ సభ్యులు, స్నేహితులతోపాటు చుట్టుపక్కలనున్న ఫైర్ స్టేషన్, పోలీస్ స్టేషన్, అంబులెన్స్ సర్వీసెస్‌కూ పంపిచవచ్చు. వాటి సహాయం పొందవచ్చు.ఆపదలో ఉన్న వాళ్లు బటన్ నొక్కగానే ఆ ఫోన్లోని కాంటాక్ట్ లిస్ట్‌లో వాళ్లు సేవ్ చేసుకున్న అయిదు ఎమర్జెన్సీ నంబర్లకు క్షణాల్లో సమాచారం వెళ్తుంది. ఒకవేళ జీపీఆర్ఎస్ అందుబాటులో లేకపోతే.. ఎస్మ్మెస్లు వెళ్తాయి. స్మార్ట్ 24 ఇంటూ సెవెన్ కస్టమర్ కేర్ సెంటర్ వాళ్లూ వెంటనే కాల్ చేస్తారు. బీసేఫ్ (bSafe) మహిళల మీద జరుగుతున్న హింస, లైంగిక వేధింపులు, లైంగిక దాడులను నివారించడమే కాక దురదృష్టవశాత్తు ఇలాంటి నేరాలు జరిగితే.. సంబంధించిన సాక్ష్యాధారాలనూ అందిస్తుంది. వాయిస్ యాక్టివేషన్, లైవ్ స్ట్రీమింగ్, ఆడియో, వీడియో రికార్డింగ్, ఫాల్స్ కాల్, ఫాలో మీ, లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్స్‌తో మహిళల భద్రతకు భరోసానిస్తోంది. బటన్‌ను ఒక్కసారి నొక్కితే చాలు.. ఎస్ఓఎస్ సిగ్నల్‌ను సెండ్ చేసేస్తుంది. దీని ద్వారా.. అత్యవసర వేళల్లో ఫొటోలు తీసుకుని.. వాటిని పోస్ట్ చేయొచ్చు. మీరున్న చోటును మీ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది. దీన్ని ఇటు ఆండ్రాయిడ్, అటు ఐఓఎస్ రెండు ఫోన్లలోనూ డౌన్లోడ్ చేçసుకోవచ్చు. నిర్భయ ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్. ఫోన్లో డౌన్లోడ్ అయ్యాక.. ఒక్కసారి బటన్‌ను ప్రెస్ చేయగానే యాక్టివేట్ అవుతుంది. ఒకవేళ బటన్ నొక్కడం వీలు పడకపోతే ఫోన్ షేకింగ్ ద్వారా, ఎస్సెమ్మెస్‌ల ద్వారా.. ఫోన్ కాల్ ద్వారా కూడా మన పరిస్థితిని తెలియజేయవచ్చు. అయితే వీటికి డేటా ప్లాన్, జీపీఎస్ అవసరం ఉంటాయి. ఆపదలో ఉన్నవారి లొకేషన్‌ను ఇది ప్రతి రెండు గంటలు.. లేదా ప్రతి మూడువందల మీటర్లకు మారినప్పుడల్లా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు పంపిస్తూంటుంది. ఎస్ఓఎస్ – స్టే సేఫ్ ఇది ఆండ్రాయిడ్ యాప్. ఫోన్లో ఈ యాప్ యాక్టివేట్ అయితే చాలు.. ఫోన్ లాక్ మోడ్‌లో ఉన్నా ఈ యాప్‌ను ఉపయోగించుకోవచ్చు. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్‌ను అన్‌లాక్ చేసుకునేంత టైమ్ ఉండదు. వెంటనే స్పందించాలి. అందుకే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం మంచిది. ఆపదలో ఉన్నామని తెలియగానే ఫోన్‌ను రెండుమూడు సార్లు షేక్ చేయాలి.. అంతే.. మనకు సంబంధించిన సమాచారం.. మనమున్న లొకేషన్ సహా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి వెళ్లిపోతాయి. ఒకవేళ షేక్ చేయడం తికమక వ్యవహారంలా అనిపిస్తే ఈ యాప్ హోమ్ బటన్‌ను ప్రెస్ చేసినా చాలు.. మన సమాచారం, లొకేషన్ సహా మప ఫోన్ బ్యాటరీ ఏ స్థితిలో ఉందో కూడా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌కి చెప్పేస్తుంది. అంతేకాదు ఆడియో రికార్డింగ్‌నూ పంపుతుంది. రక్ష (Raksha) భద్రతతో కూడిన స్వావలంబన.. ఈ యాప్ లక్ష్యం. అందుకే అహర్నిశలూ అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించడమూ తేలికే. మీరు ఆపదలో చిక్కుకున్నారని మీకు అనిపించిన వెంటనే యాప్‌లో సూచించిన బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు.. మీరున్న లొకేషన్ సహా మీకు సంబంధించిన అలర్ట్స్ అన్నీ మీ కుటుంబ సభ్యులకు చేరుతాయి మీ వాళ్ల ఫోన్ నంబర్ల ద్వారా. నెట్వర్క్ లేకపోయినా.. ఈ యాప్ స్పందిస్తుంది. వాల్యూమ్ కీని మూడు సెకండ్ల పాటు ప్రెస్ చేస్తే చాలు.. మీ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు అందజేస్తుంది. ఇందులో ఎస్ఓఎస్ కూడా ఉన్నందున.. ఇంటర్నెట్ లేని ఏరియాల్లో .. ఎస్సెమ్మెస్ ద్వారా మీకు సంబంధించిన సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు చేరవేస్తుంది. ఐయామ్ శక్తి (Iam Shakthi) ఇదీ యూజర్ ఫ్రెండ్లీనే. ఫోన్లోని పవర్ బటన్‌ను రెండు సెకండ్ల వ్యవధిలో అయిదుసార్లు నొక్కితే చాలు.. ఫోన్లో ముందుగా సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు లొకేషన్ సహా సమాచారం వెళుతుంది. బటన్ నొక్కిన వెంటనే లొకేషన్‌ను ట్రేస్ చేయలేకపోతే.. ట్రేస్ అయిన వెంటనే మళ్లీ అలర్ట్ మెసేజెస్ను పంపిస్తుంది. విత్యు (WithYou) ఇది కూడా ‘స్పాట్ఎన్సేవ్’ లాంటిదే. ఆపదలో ఉన్నప్పుడు ఫోన్లోని పవర్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే .. మనకు సంబంధించిన సమాచారమంతా లొకేషన్ సహా.. అంతకుముందే సెట్ చేసిపెట్టుకున్న ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు వెళుతుంది.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి. స్పాట్ఎన్సేవ్ ఫీల్ సెక్యూర్ ఇప్పుడున్న అన్ని సేఫ్టీ యాప్లోకెల్లా అడ్వాన్స్డ్ యాప్ ఇది. దీన్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాచీలా మణికట్టుకు ధరిస్తే చాలు. అవును రిస్ట్ బ్యాండ్‌లా! డేంజర్ సిచ్యుయేషన్‌లో ఉన్నప్పుడు మీ ఫోన్ పవర్ బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేయాలి అంతే.. రిస్ట్బ్యాండ్లోని యాప్ యాక్టివేట్ అయ్యి మీరు ముందే సెట్ చేసి పెట్టుకున్న మీ ఎమర్జెన్సీ ఫోన్ నంబర్స్‌కి.. ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి.. మీరున్న లొకేషన్ సహా వివరాలను అందిస్తూంటుంది. ఒకవేళ మీరు ఫోన్‌ను ఉపయోగించే స్థితిలో లేకపోతే రిస్ట్బ్యాండ్కున్న బటన్‌ను రెండుసార్లు ప్రెస్ చేసినా చాలు బ్లూటూత్ సాయంతో యాప్ పనిచేయడం మొదలుపెడుతుంది. ఇటు చూడండీ.. ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో)–2021 నివేదిక ప్రకారం.. దేశంలో మహిళల మీద జరుగుతున్న హింస 2020 సంవత్సరం కన్నా 2021లో 15.3 శాతం పెరిగింది. 2020లో 3,71,503 కేసులు నమోదైతే 2021లో 4,28,278 కేసులు నమోదయ్యాయి. ప్రతి లక్ష జనాభాకు ఈ హింసాత్మక సంఘటనల రేటు 64.5 శాతంగా నమోదైంది. 2020లో ఇది 56.5 శాతం. వీటిల్లో 31.8 శాతం గృహహింస కేసులే. మిగతావన్నీ వేధింపులు, కిడ్నాప్‌లు, లైంగికదాడుల కేసులు. మహిళల మీద జరుగుతున్న హింసలో అసోం రాష్ట్రం మొదటి స్థానపు అప్రతిష్ఠను మూటగట్టుకుంది. తర్వాత స్థానాల్లో ఒడిశా, హరియాణా, తెలంగాణ, రాజస్థాన్‌లు నిలిచి ఆ అవమానపు భారాన్ని మోస్తున్నాయి. షాకింగ్ ఏంటంటే.. గతంలో కన్నా తెలంగాణలో మహిళల మీద హింస పెరిగినట్టు చూపిస్తోంది ఎన్సీఆర్బీ. అత్యంత తక్కువ కేసులతో నాగాలాండ్ కాస్త మెరుగైన రాష్ట్రంగా కనిపిస్తోంది. మూడేళ్లుగా ఇది ఈ రికార్డ్‌నే మెయిన్టైన్ చేస్తోంది. హింస పెట్రేగుతున్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లు నిలిచి తలవంచుకుంటున్నాయి. 2021 సంవత్సరం CEOWORLD మ్యాగజీన్ ప్రచురించిన నివేదిక ప్రకారం.. మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోకెల్లా తొలి స్థానంలో నిలిచిన దేశం నెదర్లాండ్స్. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్వీడన్లు ఉన్నాయి. డెన్మార్క్ నాలుగో స్థానాన్ని పొందింది. చిత్రమేంటంటే.. అందరికీ పెద్దన్నలా వ్యవహరించే అమెరికా మొదటి పది స్థానాల్లో ఎక్కడా లేదు. 20వ స్థానంలో ఉంది! యునైటెడ్ కింగ్‌డమ్‌ది పదిహేడో స్థానం. మన గురించీ చెప్పుకోవాలి కదా.. మహిళల భద్రత విషయంలో మన పరువుకు దక్కిన ప్లేస్.. నలభై తొమ్మిది! -
తుర్కియే- సిరియా భూకంపాలు: కదిలే భూమిని కనిపెట్టలేమా!
మనిషి చూపులు అంతరిక్షం అంచులను తాకుతున్నాయి! కోటానుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఏముందో? ఏం జరుగుతుందో.. దుర్భిణుల సాయంతో ఇట్టే పసిగట్టగలుగుతున్నాం! కానీ.. మన కాళ్లకింద నేల లోపలి రహాస్యాలు మాత్రం.. ఇప్పటికీ చేతికి చిక్కకుండానే ఉన్నాయి! తుర్కియే- సిరియాల్లో ఇటీవలి భూకంపాలు రెండూ.. ఇందుకు తాజా నిదర్శనం! వాన రాకడ.. ప్రాణం పోకడలను కొంచెం అటు ఇటుగానైనా గుర్తించగల మానవ మేధ..భూకంపాల విషయానికి వచ్చేసరికి ఎందుకు విఫలమవుతోంది? ఫిబ్రవరి ఆరు.. 2023.. తెలతెలవారుతుండగానే తుర్కియే ఆగ్నేయ ప్రాంతాన్ని మహా భూకంపం కుదిపేసింది. ప్రజలింకా నిద్రలో ఉండగానే.. భవనాలు పేకమేడల్లా కుప్పకూలిపోయాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా ముంచుకొచ్చిన ఈ విలయం తాకిడికి వేలమంది ప్రాణాలు కోల్పోయారు. ఎలక్ట్రానిక్ పరికరాలపై 7.8 తీవ్రతతో నమోదైన భూకంపం గురించి ప్రపంచానికి తెలిసింది కూడా ప్రకంపనల ద్వారానే అంటేనే ఈ భూకంపాలు ఎంత నిశ్శబ్దంగా మనిషిని కబళించగలవో ఇట్టే అర్థమైపోతుంది. తుర్కియేలో తొలి భూకంపం సంభవించిన కొన్ని గంటల తరువాత సిరియా ఉత్తర ప్రాంతంలో సుమారు 7.5 తీవ్రతతో రెండో భూకంపం సంభవించింది. రెండు భూకంపాల కేంద్రాలూ భూమికి అతితక్కువ లోతులోనే పుట్టాయి. దీంతో కదలికల తీవ్రత ఎక్కువగా ఉండింది. ప్రధాన భూకంపం తరువాత వచ్చిన ప్రకంపనలూ ఎక్కువ కాలం కొనసాగాయి. రక్షణ చర్యలకు విఘాతం కలిగించే స్థాయిలో ఇవి ఉండటం గమనార్హం. సహాయక పనుల కోసం అక్కడికి చేరుకున్న వారు కూడా.. నేల కుప్పకూలిపోవడం, గ్రౌండ్ లిక్విఫికేష¯Œ వంటి ప్రమాదాల్లో చిక్కుకునే రిస్క్ ఉందని అమెరికా జియలాజికల్ సర్వే హెచ్చరించింది కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ శిథిలాల మధ్య చిక్కుకున్న వారిని రక్షించడం వీలైంది. 228 గంటల తరువాత కూడా కొంతమంది ప్రాణాలతో బయటపడటం అందరికీ ఊరటనిచ్చింది కానీ.. అప్పటి నుంచి ఇప్పటివరకూ అందరి మనసులను.. ఈ భూకంపాలను ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయామన్న ప్రశ్న మాత్రం వేధిస్తూనే ఉంది. తుర్కియే, సిరియాల్లో సంభవించిన భూకంపాలతో సుమారు 41 వేల మంది మరణించినట్లు లెక్కలు చెబుతున్నాయి. గాజియాన్‌టెప్ పట్టణం సమీపంలో తొలి భూకంపం తరువాత కూడా పలుమార్లు భూమి కంపించింది. ఈ ఆఫ్టర్‌షాక్స్ మధ్యలోనే ఇంకో భూకంపమూ సంభవించింది. తొలి భూకంపం తీవ్రత 7.8. ఆ లెక్కల ప్రకారం ఇది చాలా పెద్ద భూకంపం. భూమి లోపల వంద కిలోమీటర్ల పొడవైన ఫాల్ట్‌లైన్ లో రావడంతో పరిసరాల్లోని భవనాలకు తీవ్ర నష్టం జరిగింది. ఏటా సంభవించే అత్యంత ప్రమాదకరమైన భూకంపాలను పరిగణనలోకి తీసుకుంటే గత పదేళ్లలో కేవలం రెండు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం, అంతకుముందు పదేళ్లలోనూ నాలుగు మాత్రమే ఈ స్థాయిలో ఉండటం గమనార్హం. అలాగని కేవలం ప్రకంపనల ఫలితంగానే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని కూడా చెప్పలేం. ఎందుకంటే ప్రజలు ఇళ్లల్లో నిద్రలో ఉన్న సమయంలోనే ప్రమాదం జరగడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇంకో కారణం.. ఆ ప్రాంతాల్లోని భవనాల దృఢత్వం! తుర్కియే, సిరియా.. రెండింటిలోనూ భూకంపాలను తట్టుకోగల భవనాలు దాదాపుగా లేవని నిపుణులు గుర్తు చేస్తున్నారు. 200 ఏళ్లుగా భూకంపాల్లేవు.. తుర్కియే, సిరియాల్లో గత 200 ఏళ్లుగా చెప్పుకోదగ్గ తీవ్రతతో భూకంపాలు లేవు. పోనీ చిన్నస్థాయిలోనైనా ప్రకంపనలేవైనా నమోదయ్యాయా? అంటే అదీ లేదు. దీంతో ఆ ప్రాంతంలో భూకంపాల సన్నద్ధత కూడా తక్కువగానే ఉండింది. 1970 నుంచి ఈ ప్రాంతంలో ఆరు కంటే ఎక్కువ తీవ్రత కలిగిన భూకంపాలు మూడే మూడు నమోదయ్యాయి. ఇంతకీ భూకంపాలు ఎందుకొస్తాయి? ఎలా వస్తాయన్న అనుమానం కలుగుతోందా? సమాధానాలు తెలుసుకుందాం! కాకపోతే ఇందుకోసం భూమి నిర్మాణాన్ని కొంచెం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఉల్లిపాయ మాదిరిగానే భూమి కూడా పొరలు పొరలుగా ఉంటుందని మనం చదువుకుని ఉంటాం. ఈ పొరల్లో అన్నింటికంటే పైన ఉన్నదాన్ని క్రస్ట్ అంటారు. మన కాళ్ల కింద మొదలై కొన్ని కిలోమీటర్ల లోతు వరకూ ఉంటుంది ఈ పొర. దాని దిగువన మాంటెల్, అంతకంటే దిగువన కోర్ అని పేర్లున్న పొరలు ఉంటాయి. ఇప్పుడు పై పొర క్రస్ట్ గురించి కొంచెం వివరంగా.. భూమి మొత్తం ఇది ఒకే ఒక్కటిగా ఉండదు. ముక్కలు ముక్కలుగా ఉంటుంది. ఒక్కో ముక్కను టెక్టానిక్ ప్లేట్ అని అంటారు. ఈ ప్లేట్లు స్థిరంగా కాకుండా.. కదులుతూ ఉంటాయి. టెక్టానిక్ ప్లేట్లు కదిలే క్రమంలో ఘర్షణ పుడుతూంటుంది. రెండు ప్లేట్లు ఢీకొనడం.. లేదా ఒకదాని కిందకు ఒకటి చేరడం.. లేదా ఒకదానికి ఒకటి దూరంగా జరగడం వంటి నాలుగు రకాల కదలికల కారణంగా ఆయా ప్రాంతాల్లో ఘర్షణ జరగుతూ ఉంటుంది. అత్యధిక పీడనం నిల్వ అవుతూ వస్తుంది. ఈ పీడనం కారణంగా ఒక్కోసారి ఒక ప్లేట్ అకస్మాత్తుగా ఇంకోదానిపై జరగడం వల్ల అప్పటివరకూ అక్కడ నిల్వ ఉన్న పీడనం భూకంపం రూపంలో విడుదల అవుతుంది. తుర్కియే, సిరియాల్లో భూకంపాలు సంభవించిన ప్రాంతం మూడు టెక్టానిక్ ప్లేట్ల సంగమ స్థలం. అనటోలియా, అరేబియన్ , ఆఫ్రికా ప్లేట్లు కలిసే చోటనే భూకంపాలు సంభవించాయి. అరేబియా ప్లేట్ ఉత్తరం వైపు కదులుతూ అనటోలియన్ ప్లేట్‌పై ఒత్తిడి తెచ్చిన కారణంగా భూకంపం సంభవించింది. 1822 ఆగస్టు 13న ఈ ప్రాంతంలోనే 7.4 తీవ్రతతో ఒక భూకంపం సంభవించింది. ఆ తరువాత ఆ స్థాయి భూకంపం వచ్చింది ఈ ఏడాదే. 1822 నాటి భూకంపంలోనూ ఈ ప్రాంతంలో ప్రాణనష్టం, విధ్వంసం ఎక్కువగానే నమోదైంది. ఒక్క అలెప్పో నగరంలోనే 7000 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏడాది పాటు కొనసాగిన ప్రకంపనలు మరింత విధ్వంసం సృష్టించాయి. తాజాగానూ ప్రకంపనలు మరికొంత కాలం కొనసాగుతాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ముందుగానే ఎందుకు గుర్తించలేకపోయాం? వాస్తవానికి భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు ఇప్పటివరకూ ఎలాంటి టెక్నాలజీ లేదు. చాలా చాలా కష్టమైన వ్యవహారమీ భూకంపాలు. భూకంపం జరిగిన తరువాత కూడా కేవలం ఒకట్రెండు నిమిషాలు మాత్రమే దాని సంకేతాలు మనకు తెలుస్తూంటాయి. అందుకే భూకంపాల గురించి తెలిసే ఈ అతికొద్ది సమాచారం ఆధారంగా వాటిని ముందుగానే గుర్తించడం పెను సవాలుగా మారింది. నిజానికి 1960ల నుంచే భూకంపాలను ముందుగా గుర్తించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. టెక్టానిక్ ప్లేట్ల అమరిక, లోటుపాట్లు (ఫాల్ట్‌లైన్స్) అత్యంత సంక్లిష్టంగా ఉన్న కారణంగా ఇప్పటివరకూ సాధించింది కొంతే. ప్రపంచం మొత్తం వ్యాపించిన ఫాల్ట్లైన్లకు తోడు భూమి లోపలి నుంచి పలు రకాల శబ్దాలు, సంకేతాలు వెలువడుతూండటం కూడా పరిస్థితిని మరింత జటిలం చేశాయి. భూకంపం ఎక్కడ వస్తుంది? ఎప్పుడు వస్తుంది? తీవ్రత ఎంత? అన్న మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పగల పద్ధతిని ఆవిష్కరించగలిగితే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది. కానీ ఇప్పటివరకూ ఈ ప్రశ్నలకు సమాధానం లభించలేదు. జంతువుల ప్రవర్తన నుంచి అయనోస్ఫియర్ వరకూ.. భూకంపాలను ముందుగానే గుర్తించేందుకు శాస్త్రవేత్తలు ఇప్పటివరకూ అనేక ప్రయత్నాలు చేశారు. భూకంపం వచ్చే ముందు జంతువులు ప్రవర్తించే తీరుతో మొదలుపెట్టి భూ వాతావరణపు పైపొర అయనోస్ఫియర్‌లోని కణాల పరిశీలన వరకూ అనేక రకాలుగా యత్నిస్తున్నారు. తాజాగా మనుషులు గుర్తించలేరేమో అని.. సూక్ష్మమైన సంకేతాలను గుర్తించేందుకు కృత్రిమ మేధను వాడే ప్రయత్నమూ జరుగుతోంది. భూమి మాదిరిగానే ఉండే మోడల్‌ను ఉపయోగించి మెషిన్ లెర్నింగ్ సాయంతో ఇటలీలోని సేపియేంజా యూనివర్సిటీ అధ్యాపకుడు క్రిస్ మరోన్ ప్రయత్నిస్తున్నారు. అయితే పరిశోధనశాలలో తాము భూకంపాలను బాగానే గుర్తించగలగుతున్నామని, వాస్తవ పరిస్థితుల్లో మాత్రం విఫలమవుతున్నామని మరోన్ తెలిపారు. చైనాలో శాస్త్రవేత్తలు అయనోస్ఫియర్‌లో విద్యుదావేశంతో కూడిన కణాలు భూకంపాల వల్ల ఏవైనా కంపనలు సృష్టించాయా? వాటి ద్వారా ముందస్తు గుర్తింపు వీలవుతుందా? అన్నది పరిశీలిస్తున్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎర్త్ క్వేక్ ఫోర్క్యాస్టింగ్కు చెందిన జింగ్ లియూ అంచనా ప్రకారం భూకంపానికి ముందు రోజుల్లో అయనోస్ఫియర్‌లో మార్పులు జరుగుతాయి. ఫాల్ట్ జోన్ల ప్రాంతం పైన భూ అయస్కాంత క్షేత్రంలో మార్పులు రావడం వల్ల విద్యుదావేశ కణాలు కంపనలు సృష్టిస్తాయి. 2010 ఏప్రిల్‌లో కాలిఫోర్నియాలోని బాజా ప్రాంతంలో భూకంపం వచ్చింది. దానికి పది రోజుల ముందే అయనోస్ఫియర్‌లో మార్పులను గమనించామని ఆయన చెబుతున్నారు. చైనా ఇంకో అడుగు ముందుకేసి అయనోస్ఫియర్‌లో జరిగే ఎలక్ట్రికల్ తేడాలను గుర్తించేందుకు 2018లో ‘చైనా సెసిమో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ శాటిలైట్’ను ప్రయోగించింది కూడా. గత ఏడాది చైనా ఎర్త్‌క్వేక్ నెట్వర్క్ సెంటర్ శాస్త్రవేత్తలు ఒక ప్రకటన చేస్తూ భూకంపానికి 15 రోజుల ముందు అయనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్ల సాంద్రత గణనీయంగా తగ్గిందని తెలిపారు. 2021 మే, 2022 జనవరి నెలల్లో చైనాలో వచ్చిన భూకంపాలకు ముందు ఈ పరిశీలనలు జరిగాయి. ఇజ్రాయెల్‌లోని ఏరియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తాము భూకంపాలను 48 గంటల ముందే 83 శాతం కచ్చితత్వంతో గుర్తించగలమని ఇటీవలే ప్రకటించారు. గత 20 ఏళ్లలో అయనోస్ఫియర్‌లోని ఎలక్ట్రాన్ కంటెంట్‌లో వచ్చిన మార్పులకు కృత్రిమ మేధను జోడించడం ద్వారా ఇది సాధ్యమైందని వారు చెబుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే.. జపాన్‌లో కొంతమంది కొన్ని విచిత్రమైన సూచనలు చేస్తున్నారు. భూకంపాలు వచ్చే అవకాశమున్న ప్రాంతాల్లో నీటి ఆవిరి ఆధారంగా భూకంపాలను ముందుగానే గుర్తించవచ్చునని, అది కూడా 70 శాతం కచ్చితత్వంతో చేయవచ్చునని చెబుతూండటం విశేషం. కాకపోతే ఈ పద్ధతిలో నెల రోజులు ముందు మాత్రమే భూకంపాన్ని గుర్తించ వచ్చు. మరికొందరు భూ గురుత్వాకర్షణ శక్తిలో వచ్చే మార్పుల ఆధారంగా భూకంపాలను గుర్తించవచ్చునని చెబుతున్నారు. మొత్తమ్మీద చూస్తే.. శాస్త్రవేత్తలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఇప్పటికీ భూకంపాలను అవి సంభవించేందుకు ముందుగానే కచ్చితంగా గుర్తించడం సాధ్యంకావడం లేదనేది నిష్ఠుర సత్యం!! మీకు తెలుసా..? ► యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే లెక్కల ప్రకారం భూమి ఏటా కొన్ని లక్షల సార్లు కంపిస్తూంటుంది. వీటిల్లో చాలావాటిని మనం అస్సలు గుర్తించం. తీవ్రత తక్కువగా ఉండటం, లేదా జనావాసాలకు దూరంగా సంభవించడం దీనికి కారణం. అయితే ఏటా సంభవించే భూకంపాల్లో ఏడు లేదా అంతకంటే ఎక్కువ తీవ్రత కలిగినవని దాదాపు 17 వరకూ ఉంటాయి. ఎనిమిది స్థాయి తీవ్రత ఉన్నది ఒక్కటైనా ఉంటుంది. ► టెక్టానిక్ ప్లేట్ల కదలికల కారణంగా హిమాలయాల ఎత్తు పెరుగుతోందని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. అలాగే అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం మొత్తం లాస్ ఏంజిలెస్ వైపు కదులుతోంది. మన గోళ్లు పెరిగినంత వేగంగా అంటే ఏడాదికి రెండు అంగుళాల చొప్పున ఈ కదలిక ఉన్నట్లు అంచనా. సా¯Œ ఆండ్రియాస్ ఫాల్ట్ రెండు వైపులు ఒకదాని కింద ఒకటి జారిపోతూండటం వల్ల ఇలా జరుగుతోంది. అయితే ఈ రెండు నగరాలు కలిసిపోయేందుకు ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల సమయం ఉందిలెండి! ► 2011 మార్చి 11న జపాన్ తీరంలో 8.9 తీవ్రతతో వచ్చిన భూకంపం మన రోజు లెక్కను మార్చేసింది. భూమిలోపలి పదార్థం పంపిణీ అయిన తీరులో భూకంపం మార్పు తేవడంతో భూమి కొంచెం వేగంగా ► భూకంపం తరువాత ఆ ప్రాంతాల్లోని కాలువలు, చెరువుల్లోని నీరు కొంచెం కంపు కొడతాయి. అడుగున ఉన్న టెక్టానిక్ ప్లేట్లు కదిలినప్పుడు అక్కడ చిక్కుకుపోయి ఉన్న వాయువులు పైకి రావడం దీనికి కారణం. ► 2010 ఫిబ్రవరి 27న సంభవించిన 8.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా చిలీలోని కోన్ సెప్కియాన్ నగరం పశ్చిమం దిక్కుగా సుమారు పది అడుగులు జరిగింది! మొత్తం భూకంపాల్లో 90 శాతం పసిఫిక్ మహా సముద్రంలోని రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి వస్తూంటాయి. ► 2015లో నేపాల్‌లో వచ్చిన 7.8 స్థాయి తీవ్రమైన భూకంపం కారణంగా పలు హిమాలయ పర్వతాలు కుంగిపోయాయి. ఇందులో ఎవరెస్టు కూడా ఉంది. కనీసం ఒక్క అంగుళం మేర దీని ఎత్తు తగ్గినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
జ్ఞాపకాల అంగడి
వీటిలో ఎన్నిటిని గుర్తుపట్టారు? ఓ మై గుడ్నెస్ అన్నిటినా? అయితే మీరు పలు బ్రాండ్లకు మంచి బిజినెస్ ఇస్తున్నట్టే! వాట్ ఆర్ యూ టాకింగ్? ఇవి నా చిన్నప్పటి.. లేదా నా యూత్ మెమొరీస్.. వాటిని బ్రాండ్స్ ఏం చేసుకుంటాయి? బిజినెస్ చేసుకుంటాయి! ఎస్.. ఇప్పుడు వినియోగదారుల చిన్ననాటి.. టీనేజ్ జ్ఞాపకాలే పలు వ్యాపార సంస్థలకు పెద్ద బిజినెస్‌ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ జ్ఞాపకాలే కొత్త బిజినెస్‌కు ఆలోచన పడేలా చేస్తున్నాయి.. నోస్టాల్జియాకున్న పవర్ అది! అందుకే దీన్ని నోస్టాల్జియా మార్కెట్ అంటున్నారు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్ తిరుగుతోంది ఈ ఇరుసు మీదే! ఇంట్లో.. బయటా.. ఎక్కడ ఏ వస్తువు కనపడినా.. ఏ పరిసరంలో తిరుగాడినా.. ఏ మాటలు.. పాటలు విన్నా.. అవన్నీ ఏదోరకంగా జ్ఞాపకాలతో ముడిపడి ఉన్నవే అయ్యుంటాయి! లేదంటే గతంలోని ఏదో ఒక సందర్భాన్ని.. అపూర్వ క్షణాలను.. వ్యక్తులను గుర్తుచేసేవే ఉంటాయి! గమ్మత్తయిన ఓ వర్ణం.. అమ్మకు తను కట్టుకున్న తొలి చీరను గుర్తుచేయొచ్చు. మనవరాలో.. మనవడో.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుని మరీ కొనుక్కున్న ఓ స్టీల్ గిన్నె.. నానమ్మకు తన కాపురాన్ని జ్ఞాపకంలోకి తేవచ్చు. స్పాటిఫైలో పాట.. నాన్నకు తన బాల్యంలోని సినిమా థియేటర్ని అతని కళ్లముందు ఉంచొచ్చు. పఫ్‌తో హెయిర్ స్టయిల్ అత్తను తన యవ్వనపు రోజుల్లోకి తీసుకెళ్లొచ్చు. ఓటీటీ సిరీస్‌లోని ఓ సన్నివేశంతో తన చిన్నప్పుడు దొంగతనంగా కాల్చిన సిగరెట్ దమ్ము.. తాతయ్య మది అట్టడుగు పొరల్లోంచి బయటకు రావచ్చు! ఇలా జ్ఞాపకల్లేని జీవితం ఉంటుందా? పైగా పాతవన్నీ మధురాలే! అందుకే కదా అన్నారు ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని! ఈ మాటనే వ్యాపార మంత్రంగా పట్టేసుకున్నాయి పలు వ్యాపార సంస్థలు. ఎలాగంటే.. ‘ఆరోజుల్లో... ’ అని మొదలుపెట్టే సంభాషణతో చుట్టూ ఉన్న వాళ్లు చిరాకు పడుతుండొచ్చు. విసుగు చెందుతుండొచ్చు. కానీ.. వ్యాపార సంస్థలు మాత్రం ఆ మాటల ప్రవాహాన్ని పట్టుకుని అందులో ఈది.. ఆ జ్ఞాపకాల్లో తమ బ్రాండ్స్‌ను దొరకబుచ్చుకుని పాత కొత్తల కలయికతో రీమేక్ చేసి యాడ్స్‌ను రిలీజ్ చేస్తున్నాయి. ఈ ‘యాది’ అనే టెక్నిక్‌ను బిజినెస్ ట్రిక్‌గా మలచుకుంటున్నాయి. ఈ స్క్రిప్ట్‌కి లీడ్ అందింది ఎప్పుడు? ఇంకెప్పుడూ.. కరోనా టైమ్‌లోనే! భలేవారే.. అన్నిటికీ కరోనాతో ముడిపెడితే ఎలా? అంటే పెట్టాల్సిందే మరి! కరోనాతో కరెంట్ ఎరా.. కరోనాకు ముందు.. తర్వాత అని చీలిపోతుందని లాక్డౌన్లో జోస్యం చెప్పుకున్నాం! నెమ్మదిగా అదిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మార్కెట్లో లాభాలు సృష్టిస్తోంది. అంటే కాలం ఆ విభజనను స్పష్టం చేసిందన్నట్టే కదా! లాక్డౌన్లో చాలా మంది.. నాటి దూరదర్శన్ సీరియళ్లు, పాత సినిమాలు, పాటలతోనే కాలక్షేపం చేశారుట. ఆ కాలక్షేపంలో పల్లీ బఠాణీలు, పాప్‌కార్న్‌ని కాకుండా ఆ సీరియళ్లతో సమానంగా ఆస్వాదించిన నాటి ప్రకటనలను.. ప్రొడక్ట్స్‌ను.. వాటి తాలూకు తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారని పలు అధ్యయనాల సారాంశం. ఆ సారాన్ని పట్టుకునే వ్యాపార సంస్థలు నోస్టాల్జియాలో మార్కెట్‌ను వెదుక్కున్నాయి. మిలెనీయల్స్కీ.. జెన్జెడ్కీ.. ఆ తరపు మెమోరీస్‌ని కొత్త ర్యాపర్లో చుట్టి ప్రకటనల గిఫ్ట్స్‌ని అందిస్తున్నాయి. ఈ జాబితాలో క్రెడ్, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ నుంచి క్యాడ్బరీ దాకా పలు ప్రముఖ బ్రాండ్స్ చాలానే ఉన్నాయి. ఇవి ఇలా కొత్త ర్యాపర్లో పాత యాడ్స్‌ను చుట్టి స్క్రీన్ మీద పరుస్తున్నాయి. ఆ మధురాలు పాత తరపు వినియోగదారుల భావోద్వేగాలతో కనెక్ట్ అయ్యి నాటి ఆనందానుభూతులను తాజా చేసి ఆ బ్రాండ్స్ పట్ల వాళ్ల లాయల్టీని పెంచుతున్నాయి. ఈ తరమేమో ఆ గిమ్మిక్కి పడిపోయి.. ఆ బ్రాండ్స్‌కి కొత్త కన్జూమర్స్గా రిజిస్టర్ అవుతోంది. ఇలా ఒకే ఇంట్లో ఆబాలగోపాలన్ని అలరించి.. మెప్పించి తమ ఖాతాను స్థిరపరచుకుంటున్నాయి. ఇదే కాక క్రెడ్ ఓజీ (OG) పేరుతో రాహుల్ ద్రవిడ్, వెంకటేశ్ ప్రసాద్, జావగల్ శ్రీనాథ్, మనీందర్ సింగ్, సబా కరీమ్ లాంటి నాటి మేటి క్రికెటర్స్తోనూ యాడ్స్ రూపొందించింది. ఇలా రిలీజ్ అయిన వెంటనే అలా వైరల్ అయ్యాయి ఆ ప్రకటనలు. ఆ యాడ్స్‌లో కొన్ని.. క్యాడ్బరీ.. కుఛ్∙ఖాస్ హై 90ల్లో.. ఒక క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటాడు.. సెంచరీకి చివరి బంతి అన్నమాట. బంతి గాల్లో లేచి.. క్యాచ్ అవుతుందా అన్న ఉత్కంఠలో క్యాచ్ మిస్ అయ్యి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ చాక్లెట్ తింటూ టెన్షన్ పడ్డ అతని గర్ల్‌ఫ్రెండ్ ఆనందానికి అవధులుండవు. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేస్తూ స్టేడియంలోకి వస్తుంది.. సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! ఇప్పుడు క్రికెట్ స్టేడియం.. లేడీ క్రికెటర్ బ్యాటింగ్ చేస్తుంటుంది. సెంచరీకి ఒక రన్ తక్కువగా ఉంటుంది ఆమె స్కోర్. ఓ షాట్ కొడుతుంది. అది గాల్లో లేచి.. బౌండరీ దగ్గరున్న ఫీల్డర్ దోసిట్లో పడబోయి.. మిస్ అయి బౌండరీ దాటుతుంది. అంతే గ్యాలరీలో క్యాడ్బరీ తింటూ టెన్షన్ పడిన ఆ క్రికెటర్ బాయ్‌ఫ్రెండ్ సంతోషానికి ఆకాశమే హద్దవుతుంది. అలాగే చాక్లెట్ తింటూ డాన్స్ చేసుకుంటూ స్టేడియంలోకి వస్తాడు సెక్యూరిటీ వారిస్తున్నా తప్పించుకుని! స్విగ్గీ ఇన్‌స్టామార్ట్.. ఫైవ్స్టార్తో కలసి అప్పుడు.. ఫైవ్‌స్టార్ ఇద్దరు యువకులు.. ఓ ప్యాంట్‌ను దర్జీకిస్తూ ‘నాన్నగారి ప్యాంట్.. ఒక అంగుళం పొడవు తగ్గించాలి’ అని చెప్పి వాళ్ల వాళ్ల షర్ట్ జేబుల్లోంచి ఫైవ్ స్టార్ చాక్లెట్స్ తీసి ఓ బైట్ తిని .. ఆ ఇద్దరూ మొహాలు చూసుకుని అప్పుడే ఒకరినొకరు గుర్తుపట్టినట్టు.. ‘రమేశ్.. సురేశ్’ అని పిలుచుకుంటారు. ఇలా చాక్లెట్ తింటూ.. మైమరిచిపోయి.. దర్జీకి పదేపదే ఆ ప్యాంట్‌ను అంగుళం చిన్నది చేయమని పురమాయిస్తూంటారు. ఈలోపు ఆ ప్యాంట్ కాస్త నిక్కర్ అయిపోతుంది. ఇప్పుడు.. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఇందులోనూ రమేశ్, సురేశ్ ఇద్దరూ ఓ ప్యాంట్ తీసుకుని దర్జీ దగ్గరకు వస్తారు. ఆ ప్యాంట్ పొడవు తగ్గించాలని పురమాయించి.. ఫైవ్‌స్టార్ కోసం జేబులు వెదుక్కుంటూంటారు.. ఖాళీ అయిపోయిన ర్యాపర్స్ తప్ప చాక్లెట్స్ దొరకవు. అప్పుడు వాయిస్ ఓవర్ వినిపిస్తుంటుంది.. ‘ఇప్పటికిప్పుడు చాక్లెట్స్ కావాలా? స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఆర్డర్ చేయండి.. నిమిషాల్లో చాక్లెట్స్ మీ ముందుంటాయి’ అంటూ! అప్పుడు రమేశ్.. సురేశ్ పక్కకు చూడగానే చాక్లెట్స్ పట్టుకుని నిలబడ్డ స్విగ్గీ ఇన్స్టామర్ట్ డెవలరీ పర్సన్ కనపడుతుంది. క్రెడ్.. (క్రెడిట్ కార్డ్స్ పేమెంట్ యాప్) నాడు.. దీపికాజీ (నిర్మా వాషింగ్ బార్) దీపికా చిఖలియా (నాటి టీవీ రామాయణంలో సీత పాత్రధారి) కిరాణా షాప్‌లోకి వెళ్లి.. నిర్మా బట్టల సబ్బు ఇవ్వమని షాప్ అతన్ని అడుగుతుంది. ‘దీపికాజీ.. మీరెప్పుడూ సాధారణ సబ్బే కదా తీసుకునేది.. మరిప్పుడూ?’ అంటూ ఆగిపోతాడు. ‘సాధారణ సబ్బు ధరకే నిర్మా బార్ వస్తుంటే ఎందుకు కాదనుకుంటాను’ అంటుంది దీపికా. నేడు .. కరిష్మాజీ (క్రెడ్ పేమెంట్ యాప్ కోసం) షాప్‌లోకి వెళ్తుంది కరిష్మా కపూర్ సెల్‌ఫోన్ చార్జర్ కోసం. సాధారణమైన చార్జర్ కాక స్టాండర్డ్ చార్జర్ అడుగుతుంది. ‘కారిష్మాజీ.. మీరు సాధారణంగా మామూలు చార్జరే అడుగుతారు కదా.. మరిప్పుడు?’ అని ఆగుతాడు. సాధారణ చార్జర్ ధరకే క్రెడ్ బౌంటీ స్టాండర్డ్ చార్జర్ ఇస్తుండగా ఎందుకు కాదంటాను!’ అంటుంది. పార్లే జీ.. భారత్ కా అప్ నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్ ) నిరుటి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లే జీ ‘ భారత్ కా అప్నా బిస్కట్ (ఈ దేశపు సొంత బిస్కట్)’ పేరుతో నోస్టాల్జియా క్యాంపెయిన్ యాడ్‌ను విడుదల చేసింది. ‘స్వాతంత్య్ర సమర ప్రయాణంలో మేమూ కలసి నడిచాం! చాయ్ తీపిని.. స్వాతంత్య్ర సాధన సంతోషాన్నీ రెట్టింపు చేశాం! దేశం సాధించిన ప్రతి విజయంలో భాగస్వాములమయ్యాం..’ అంటూ స్వాతంత్య్ర పోరాటం నుంచి నేటి వరకు దేశం సాధించిన ప్రగతిని చూపిస్తూ.. అప్పటి నుంచీ ఉన్న తన ఉనికినీ ప్రస్తావిస్తూ .. నాటి జ్ఞాపకాల వరుసలో తనను ముందు నెలబెట్టుకుని.. ఇప్పటికీ అంతే తాజాగా ఉన్నానని చెబుతూ తన ప్రొడక్ట్ అయిన బిస్కట్స్‌ను మిలెనీయల్స్ చేతుల్లో ఉన్న చాయ్ కప్పుల్లో.. పాల గ్లాసుల్లోనూ డిప్ చేసింది. టాటా సాల్ట్ కూడా బాక్సర్ మేరీ కోమ్‌ను పెట్టి.. ‘దేశ్ కా నమక్’ పేరుతో నోస్టాల్జియా, సెంటిమెంట్‌ను కలిపి కొట్టి కమర్షియల్ యాడ్‌ను రూపొందించింది. అది వర్కవుట్ అయింది. మదర్స్ రెసిపీ కూడా తన పచ్చళ్ల వ్యాపార ప్రమోషన్‌కు జ్ఞాపకాల ఊటనే వాడుకుంది. దిన పత్రికలూ నోస్టాల్జియా ప్రకటనలనే నమ్ముకున్నాయి. అందుకు టైమ్స్ ఆఫ్ ఇండియా ‘హ్యాకీ చాంపియన్’ యాడే ఉదాహరణ. ఇవేకాక పేపర్ బోట్, గూగుల్ వంటి న్యూజనరేషన్ కంపెనీలూ నోస్టాల్జియాను ప్లే చేశాయి. రీలాంచ్ కూడా నోస్టాల్జియాతో ప్రొడక్ట్ ప్రకటలనే కాదు ప్రొడక్షన్ ఆగిపోయిన వస్తువులనూ తిరిగి ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని సంస్థలు. వాటిల్లో పార్లే వాళ్ల రోలా కోలా ఒకటి. 80లు, 90ల్లో పిల్లలకు ఈ క్యాండీ సుపరిచితం. పదమూడేళ్లుగా ఇది ఆగిపోయింది. కానీ దీనితో ముడిపడున్న తీపి జ్ఞాపకాలు మాత్రం 80, 90ల్లోని పిల్లలతో పాటే పెరిగి స్థిరపడ్డాయి. అందుకే నాలుగేళ్ల కిందట.. కేరళకు చెందిన 29 ఏళ్ల సిద్ధార్థ్ సాయి గోపినాథ్ అనే యువకుడు రోలా కోలా ఫొటో పెట్టి.. దాన్ని పార్లేకి ట్యాగ్ చేస్తూ ఇది మళ్లీ మార్కెట్లోకి రావాలంటే ఎన్ని రీట్వీట్స్ కావాలంటూ ట్వీట్ చేశాడు. అతని ట్వీట్‌కి పార్లే స్పందించింది. కనీసం పదివేల రీట్వీట్స్ కావాలని బదులిచ్చింది. అయిదారు నెలలకు సిద్ధార్థ కోరిక నెరవేరింది. ‘మంచి ఫలితానికి నిరీక్షణ తప్పదు.. కానీ నిరీక్షణ ఫలితమెప్పుడూ తీయగానే ఉంటుంది.. రోలా కోలా ఈజ్ కమింగ్ బ్యాక్’ అంటూ పార్లే ప్రకటించింది. సిద్ధార్థ్ ఈ రోలా కోలా కోసం ట్యాగ్ చేయని సెలబ్రిటీల్లేరు.. మెగా బ్రాండ్స్ లేవు. ఆఖరకు నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఏవియేషన్ కంపెనీలనూ వదల్లేదు. కాంపా కోలా.. 1970, 80ల్లో తన టేస్ట్‌తో మార్కెట్‌ను రిఫ్రెష్ చేసిన సాఫ్ట్‌డ్రింక్ ఇది. గ్లోబలైజేషన్‌తో మన అంగట్లోకి వచ్చిన పెప్సీ, రీ ఎంటర్ అయిన కోకా కోలా థండర్ వేవ్స్‌కి తట్టుకోలేక దేశీ సాఫ్ట్‌డ్రింక్ కాంపా కోలా కనుమరుగైపోయింది. దీన్నిప్పుడు రిలయెన్స్ కొనుగోలు చేసింది.. దేశీ డ్రింక్‌గా నాటి జ్ఞాపకాల చల్లదనంతో వినియోగదారులను సేదతీర్చడానికి సిద్ధమైంది. మ్యాగీ ఏమైనా తక్కువ తిందా? నిర్ధారిత పరిమాణం కన్నా సీసం పాళ్లు ఎక్కువున్నాయన్న కంప్లయింట్‌తో నెస్లే ప్రొడక్ట్ మ్యాగీ మన వంటింటి కప్‌బోర్డులను ఖాళీ చేసి వెళ్లిపోయింది. వెళ్లింది వెళ్లినట్టు ఊరుకుందా? లేదు! పిల్లల ఆకలి తీర్చిన ఇన్స్టంట్ ఫుడ్ జ్ఞాపకాలను రెచ్చగొట్టింది.. మిస్ యూ.. కబ్ వాపస్ ఆయేగా యార్ (తిరిగి ఎప్పుడొస్తున్నావ్) అంటూ! ప్రకటనలు, నలుమూలలా హోర్డింగ్‌లతో హోరెత్తించింది. ఈ ఉత్సాహం, స్ఫూర్తితో చాలా కంపెనీలు.. షటర్ మూసుకున్న తమ ప్రొడక్ట్స్‌ని కొత్తగా ముస్తాబు చేసి తిరిగి మార్కెట్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయట. కొత్తేం కాదు.. నోస్టాల్జియాతో మార్కెట్‌ను ఏలడం కొత్త అనుకుంటున్నాం కానీ.. కాదు. ఫ్యాషన్ ప్రపంచం ఫాలో అయ్యేది ఈ సూత్రాన్నే! బ్లాక్ అండ్ వైట్, ఈస్ట్‌మన్ కలర్ కాలం నాటి ట్రెండ్స్‌ని రెట్రో స్టయిల్ పేరుతో ఎప్పటికప్పుడు మార్కెట్ చేయట్లేదూ..! అలా బెల్‌బాటమ్, త్రీ ఫోర్ హ్యాండ్స్ బ్లౌజెస్, పోల్కా డాట్స్ డిజైన్స్, ఫ్రెంచ్ కట్ బియర్డ్స్, పఫ్ కొప్పులు ఎట్సెట్రా లేటెస్ట్ ఫ్యాషన్‌గా ఎన్ని యూత్‌ని ఆకట్టుకోవడం లేదు! ఆధునిక సాంకేతికతకు కవల జంటలైన ‘ఈ’ జెనరేషన్కూ త్రోబ్యాక్ సుపరిచితమే సోషల్ మీడియా సాక్షిగా. నిజానికి ప్రస్తుతం పలు బ్రాండ్స్ చేస్తున్న ఈ నోస్టాల్జియా మార్కెట్‌కి ప్రేరణ సోషల్ మీడియా త్రోబ్యాక్ థర్స్డేతోపాటు అది పోస్ట్ అయిన పాస్ట్ ఈవెంట్స్.. ఇన్సిడెంట్స్లను తడవ తడవకు గుర్తుచేసే తీరే అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఈ స్ట్రాటెజీ వల్ల పలు బ్రాండ్ల అమ్మకాలూ పెరిగాయనీ చెప్తున్నారు. ‘జ్ఞాపకాలనేవి భలే గిరాకీ బేరం. నాటి సంగతులను మంచి ఫీల్‌తో జత చేసుకుని వస్తాయి. ఎన్నటికీ ఇంకిపోని భావోద్వేగాల తడిని కలిగుంటాయి. కాబట్టే అవి మార్కెట్లో సేల్ అవుతున్నాయి’ అంటున్నారు ‘22ఫీట్ ట్రైబల్ వరల్డ్‌వైడ్’ నేషనల్ క్రియేటివ్ డైరెక్టర్ దేబాశీష్ ఘోష్. ‘టీబీడబ్ల్యూఏ ఇండియా’ సీసీఓ పరీక్షిత్ భట్టాచార్యేమో ‘నోస్టాల్జియా అనేది టైమ్ మెషిన్ లాంటిది. నడుస్తున్న కాలానికి అందులో యాక్సెస్ ఉండదు. మళ్లీ మళ్లీ అనుభూతి చెందాలనుకున్న క్షణాల్లోకి అది మనల్ని తీసుకెళ్తుంది.. మళ్లీ జీవించేలా చేస్తుంది. ఆ బలహీనతనే కంపెనీలు ఎన్‌క్యాష్ చేసుకుంటున్నాయి’ అంటున్నారు. అయితే ఈ ప్రహసనంలో కొన్ని బ్రాండ్స్.. పాత ప్రకటన లేదా జ్ఞాపకానికి సమకాలీనతను జోడించే ప్రయత్నంలో వాటికున్న ఎసెన్స్‌ను కాపాడుతూ ఆధునికతను అద్దడంలో విఫలమవు తున్నాయి. పాత యాడ్స్.. ఆ కాలంలో అద్భుతంగా ఉండి ఉండొచ్చు. అంతే అద్భుతమైన ఫలితాలనూ రాబట్టి ఉండొచ్చు. కాని వాటి విలువ సామాజికంగా కానీ.. కల్చర్ పరంగా కానీ ప్రాసంగికతను కలిగి ఉందా? దాన్ని నేటి తరం గ్రహించగలుగుతున్నదా? ఆ ప్రకటనల సారం నేటికీ సరిపోలనున్నదా అన్నదాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అప్పటి కొన్ని యాడ్స్‌ను ఇప్పుడు చూస్తే అంటే పరిణతి చెందిన ఆలోచనాతీరుతో.. ఇప్పుడు నెలకొని ఉన్న సున్నిత వాతావరణంలో పరికిస్తే అవి వివాదాస్పదంగా కనిపించవచ్చు. పురుషాధిపత్య ధోరణినీ చూపిస్తూండవచ్చు. కాబట్టి.. ఇలాంటివన్నీ పరిగణనలోకి తీసుకుని పాత ప్రకటనలకు ఆ సెన్స్‌ను జోడించాకే నోస్టాల్జియా స్ట్రాటెజీని మార్కెట్ చేసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. -
వింత వింతల ఊళ్లు
దేశంలోని ఊళ్లన్నీ కాస్త హెచ్చుతగ్గులుగా దాదాపు ఒకేలా ఉంటాయి. ఇళ్లూ వాకిళ్లూ పొలాలూ పశువులూ, అరకొర సౌకర్యాలు, ఇక్కట్లతో ఈదులాడే జనాలు దాదాపు అన్ని ఊళ్లలోనూ ఉంటారు. అరుదుగా కొన్ని ఊళ్లు మాత్రం మిగిలిన ఊళ్లకు భిన్నంగా ఉంటాయి. కొన్ని ఊళ్లు వాటి వింతలు విడ్డూరాలతో మిగిలిన వాటి కంటే భిన్నంగా ఉంటాయి. ఇంకొన్ని ఊళ్లు పట్టణాలను తలదన్నే అభివృద్ధి సాధించి, అందరినీ అవాక్కయ్యేలా చేస్తాయి. ఏదో ఒక రీతిలో ప్రత్యేకత నిలుపుకొనే ఇలాంటి ఊళ్లే వార్తలకెక్కి, విస్తృత ప్రచారం పొందుతాయి. ఇలాంటి ఊళ్లు ప్రపంచంలోని అక్కడక్కడా ఉన్నాయి. అలాగే మన దేశంలోనూ కొన్ని వింత వింతల ఊళ్లు ఉన్నాయి. మన దేశంలో ఉన్న కొన్ని వింత వింతల ఊళ్ల కథా కమామిషూ తెలుసుకుందాం... ప్రాచీన జీవనశైలి కాలంతో పాటే లోకం ముందుకు పోతుంది. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వచ్చిన ఆధునిక వసతులను అందిపుచ్చుకుంటుంది. కాల గమనంలో ఇది సహజ పరిణామం. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొత్త కొత్త ఆవిష్కరణలను మానవాళికి అందిస్తూనే ఉంటుంది. శాస్త్ర సాంకేతిక పురోగతి ఫలితంగా కొత్త కొత్త ఆవిష్కరణలు అందుబాటులోకి వచ్చాక, పాతవాటి వినియోగం క్రమంగా కనుమరుగవుతుంది. కాలంతో కలసి ముందుకు పయనించడమే మానవ స్వభావం. అందుకు భిన్నంగా వెనుకటి కాలానికి వెళ్లి ఎవరైనా జీవించాలనుకుంటే, అది కచ్చితంగా విడ్డూరమే! అలాంటి విడ్డూరం కారణంగానే శ్రీకాకుళం జిల్లాలోని కూర్మ గ్రామం ఇటీవల విస్తృతంగా వార్తలకెక్కింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ గ్రామం గురించి, అక్కడి జనాలు స్వచ్ఛందంగా అనుసరిస్తున్న ప్రాచీన జీవనశైలి గురించి విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం ఫలితంగా దేశ విదేశాలకు చెందిన కొందరు సంపన్నులు కూర్మ గ్రామంలో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎగబడుతున్నారు. కూర్మ గ్రామంలో ఇళ్ల నిర్మాణం కూడా ప్రాచీన పద్ధతిలోనే ఉంటుంది. ఈ ఇళ్ల నిర్మాణానికి సిమెంటు, కాంక్రీటు వాడరు. ఇక్కడివన్నీ సున్నం, బెల్లం, మినుములు, మెంతులు, కరక్కాయలు, గుగ్గిలం మిశ్రమంతో నిర్మించుకున్న మట్టి ఇళ్లే! ఈ గ్రామంలో విద్యుత్తు ఉండదు. విద్యుత్తుతో పనిచేసే ఏ వస్తువూ ఇక్కడ కనిపించదు. ‘ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్’ (ఇస్కాన్) ఆధ్వర్యంలో దాదాపు ఐదేళ్ల కిందట ఇక్కడ గ్రామాన్ని నెలకొల్పుకున్నారు. వేకువ జామున నాలుగు గంటలకే నిద్రలేవడం, ‘హరేకృష్ణ’ నామ కీర్తన సాగిస్తూ ఊరంతా పదహారుసార్లు తిరగడం, ఆధ్యాత్మిక సాధన, వేదాధ్యయనం చేయడం, పాత పద్ధతుల్లోనే వ్యవసాయం ద్వారా గ్రామానికి అవసరమైన పంటలు పండించు కోవడం వంటి జీవనశైలి ఈ గ్రామాన్ని వార్తల్లో నిలిపింది. ఇక్కడ పన్నెండు కుటుంబాలు ఉంటున్నాయి. ఇక్కడ నడిపే గురుకులంలో పదహారుమంది విద్యార్థులు వేదాభ్యాసం చేస్తున్నారు. మరో ఆరుగురు బ్రహ్మచారులను కలుపు కొని ఈ గ్రామ జనాభా యాభైఆరు మంది. వీరంతా తమ ఇళ్లను తామే స్వయంగా నిర్మించుకుంటారు. తమ దుస్తులను తామే నేసుకుంటారు. ఈ గ్రామాన్ని తిలకించడానికి విదేశీయులు కూడా వస్తుంటారు. జీవితాలను యాంత్రికంగా మార్చేసిన అధునాతన సాంకేతికత కంటే, ఇక్కడి ప్రాచీనమైన గ్రామీణ జీవనశైలి ఎంతో హాయిగా ఉంటుందని పలువురు చెబుతుండటం విశేషం. సంస్కృతమే వారి భాష ప్రాచీన భాష అయిన సంస్కృతం మృతభాషగా మారిందని ఆధునికులు చాలామంది తీసిపారేస్తున్నా, ఆ గ్రామ ప్రజలు మాత్రం సంస్కృతాన్ని ఇప్పటికీ సజీవంగా బతికించుకుంటున్నారు. దేశంలోనే ఏకైక సంస్కృత గ్రామంగా పేరుపొందిన మత్తూరు గ్రామం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఉంది. ఇక్కడి ప్రజలు సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకుని, ఇప్పటికీ దాన్ని కాపాడుకుంటున్నారు. పిల్లలూ పెద్దలూ అందరూ ఇక్కడ సంస్కృతంలోనే మాట్లాడుకుంటారు. మత్తూరు సంస్కృత గ్రామంగా మారడానికి వెనుక నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. ‘సంస్కృత భారతి’ సంస్థ ఈ గ్రామంలో 1981లో సంస్కృత శిక్షణ శిబిరం నిర్వహించింది. దీనికి హాజరైన ఉడిపి పెజావర మఠాధిపతి సంస్కృతం పట్ల గ్రామస్థుల ఆసక్తిని గమనించి, ఈ గ్రామాన్ని సంస్కృత గ్రామంగా తీర్చిదిద్దితే బాగుంటుందని చెప్పడంతో గ్రామస్థులు ఆ ఆలోచనను స్వాగతించారు. నాటి నుంచి సంస్కృతాన్ని తమ మాతృభాషగా మార్చుకున్నారు. సంస్కృతాన్ని మాతృభాషగా చేసుకున్నప్పటికీ ఈ గ్రామస్థులు ఆధునికతకేమీ దూరం కాలేదు. ఇక్కడి నుంచి ఉన్నత చదువులు చదువుకుని దేశ విదేశాల్లో ఉన్నతోద్యోగాల్లో స్థిరపడినవారూ ఉన్నారు. సంస్కృతంపై ఆసక్తిగల వారెవరికైనా ఆ భాషను నేర్పడానికి వీరు నిత్యం సంసిద్ధంగా ఉంటారు. పక్షులే నేస్తాలు ఆ ఊరి ప్రజలకు పక్షులే నేస్తాలు. ఏటా నవంబర్ నుంచి జూలై మధ్య కాలంలో ఆ ఊళ్లో పక్షుల సందడి కనిపిస్తుంది. దేశ దేశాలు దాటి వచ్చే పక్షులు చనువుగా మనుషుల భుజాల మీద వాలే దృశ్యాలు కనిపిస్తాయి. ఆ ఊరు కొక్కరెబెళ్లూరు. కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉంది. ఇక్కడ ప్రభుత్వం పక్షుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేసింది. వలసపక్షుల సీజన్లో ఇక్కడకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. శతాబ్దాలుగా ఇక్కడకు వలస పక్షులు వస్తున్నా, ఇక్కడి మనుషులు వాటిని పెద్దగా పట్టించుకునేవారు కాదు. సీజన్లో వచ్చే వలస పక్షులు యథేచ్ఛగా చెట్లపై గూళ్లు పెట్టుకునేవి. ఒక్కోసారి వేగంగా గాలులు వీచేటప్పుడు గూళ్లు నేల రాలేవి. వాటిలో పక్షులు పెట్టుకున్న గుడ్లు పగిలిపోయేవి. ఇంకా రెక్కలురాని పక్షిపిల్లలు పిల్లులకు, కుక్కలకు ఆహారంగా మారేవి. ‘మైసూర్ అమెచ్యూర్ నేచురలిస్ట్స్’ వ్యవస్థాపకుడు మను 1994లో ఇక్కడకు వచ్చినప్పుడు ఈ దయనీయమైన పరిస్థితిని గమనించారు. పక్షుల రక్షణ కోసం గ్రామస్థులు చొరవ తీసుకుంటే బాగుంటుందనుకుని, వారితో చర్చించారు. గ్రామంలో ‘హెజ్జర్లె బళిగె’ (కొంగలతో నేస్తం) కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామస్థులంతా ఇందులో భాగస్వాములయ్యారు. అప్పటి నుంచి ఈ గ్రామస్థులకు ఇక్కడకు వచ్చే వలసపక్షులతో స్నేహం మొదలైంది. అవి ఇక్కడ పెట్టుకునే గూళ్లు, వాటిలోని గుడ్లు, పక్షిపిల్లలు సురక్షితంగా ఉండేందుకు అన్ని సేవలూ చేస్తారు. అందుకే వలసపక్షులు ఈ గ్రామస్థులతో చాలా చనువుగా ఉంటాయి. -
సిరినామ సంవత్సరం
నేను చిన్న గింజనే.. కానీ చాలా గట్టిదాన్ని. ఇతర పంటలు మనలేని చోట్ల నేను పెరుగుతాను. ప్రతికూల వాతావరణాన్ని, కరువునూ తట్టుకుంటాను. ఏ పంటలూ చేతికి రాని కష్టకాలంలోనూ మీ కడుపు నింపుతాను. భూమిని, పర్యావరణ వ్యవస్థలను, జీవవైవిధ్యాన్ని పరిరక్షిస్తాను. నాలో ఎన్నెన్నో పోషకాలున్నాయి. విభిన్న రంగులు, రుచులున్నాయి. ఎన్నో రూపాల్లో దొరుకుతాను.. ప్రాచీన సంస్కృతులు, సంప్రదాయాలను బాగా ఎరిగిన ప్రత్యక్ష సాక్షిని నేను. ఆవిష్కరణలకు నేనొక సుసంపన్న చెలిమను. నా సుగుణాలను ప్రజలందరితోపాటు భూగోళానికి కూడా పంచి పెట్టాలన్నది నా ఆశ. కానీ, ఆ పనిని నేనొక్కదాన్నే చెయ్యలేను. అందుకే, మీ సాయం కోరుతున్నాను.. నన్ను మళ్లీ మీ భోజనాల్లోకి తెచ్చుకోమంటున్నాను. ‘వారసత్వ సుసంపన్నత.. సంపూర్ణ సామర్థ్యం’ ఇవీ నా భుజకీర్తులు. నేనేనండీ.. మీ చిరుధాన్యాన్ని! ఆహార భద్రత నుంచి పౌష్టికాహార భద్రత దిశగా అంతర్జాతీయ సమాజం అడుగులు వేస్తున్న సందర్భం ఇది.æముతక ధాన్యాలని, తృణధాన్యాలని ఛీత్కారాలతో చిరుధాన్యాలను దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశాం. భూతాపం, జీవన శైలి జబ్బుల విజృంభణతో తెలివి తెచ్చుకొని ‘పోషక ధాన్యాల’ (న్యూట్రి–సీరియల్స్) ఆవశ్యకతను గుర్తించాం. 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటున్నాం. చిరుధాన్యాలకు సుసంపన్న వారసత్వం ఉంది. సంపూర్ణ పౌష్టికాహార, ఆరోగ్య రక్షణ ఇవ్వగల సామర్థ్యం ఉంది. వరికి ఇచ్చిన స్థాయిలో సాగు, క్షేత్రస్థాయి ప్రాసెసింగ్ నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ వరకు చిరుధాన్యాల ప్రోత్సాహక వ్యవస్థను నిర్మించటంపై ప్రభుత్వాలు భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన తరుణం ఇది. చిరుధాన్యాలు.. సిరిధాన్యాలు.. చిన్న చిన్న విత్తనాలతో కూడిన గడ్డి జాతి పంటల సమూహానికి చెందిన పంటలే ఈ చిరుధాన్యాలు. మనుషుల ఆహార అవసరాలతో పాటు పశువులు, చిన్న జీవాలకు మేత కోసం వీటిని ప్రపంచం అంతటా పండిస్తారు. ఇవి చాలా ప్రాచీనమైన పంటలు. మన పూర్వీకులు మొట్టమొదటిగా సాగు చేసిన పంటలు చిరుధాన్యాలే. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కొద్దిపాటి వర్షాలకే పండే పంటలివి. వీటిని మొట్టమొదటగా భారత్‌లో సాగైన అనేక రకాల చిరుధాన్యాలు తదనంతరం పశ్చిమ ఆఫ్రికాతోపాటు చైనా, జపాన్ తదితర 130 దేశాలకు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక నాగరికతల్లో ఆహార ధాన్యపు పంటలుగా విస్తరించాయి. ప్రాచీన సాహిత్యంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. మన దేశంలో చిరుధాన్యాల వినియోగం కాంస్య యుగం కన్నా ముందు నుంచే ఉన్నదని చరిత్ర చెబుతోంది. 50 ఏళ్ల క్రితం వరకు వ్యవసాయంలో చిరుధాన్యాలే ప్రధాన పంటలుగా ఉండేవి. స్థానిక ఆహార సంస్కృతిలో ఇవి అంతర్భాగమై కనబడేవి. పట్టణ ప్రాంతాల వినియోగదారులు ఎక్కువగా రిఫైన్డ్ ధాన్యాలపైనే ఆసక్తి చూపడంతో, రాను రాను చిరుధాన్యాల ప్రాధాన్యం తగ్గింది. ఆహారానికి వైవిధ్యాన్ని అందించే చిరుధాన్యాల స్థానంలో వరి, గోధుమల వినియోగం బాగా పెరిగింది. చిరుధాన్యాలు వర్షాధార, మెట్ట ప్రాంతాలకు అనువైన పంటలు. వీటిలో పోషక విలువలు ఎక్కువ. పండించడానికి ప్రకృతి/ఆర్థిక వనరుల ఖర్చు చాలా తక్కువ. అందుకే వీటిని అత్యంత మక్కువతో ‘సిరిధాన్యాలు’, ‘అద్భుత ధాన్యాలు’ లేదా ‘భవిష్య పంటలు’ అంటూ అక్కున చేర్చుకుంటున్నాం. ఈ చైతన్యాన్ని జనబాహుళ్యంలోకి విస్తృతంగా తీసుకెళ్లటం పాలకులు, పర్యావరణ ప్రేమికులు, ఆరోగ్యాభిలాషులందరి కర్తవ్యం. అంతర్జాతీయ చిరు సంవత్సరం 2023.. ఇది అంతర్జాతీయ చిరుధాన్యాల పండుగ సంవత్సరం. భారత్ ప్రతిపాదన మేరకు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ రెండేళ్ల క్రితం నిర్ణయించింది. 72 దేశాల మద్దతుతో ఈ అంతర్జాతీయ చిరుధాన్యాల పండుగ అమల్లోకి వచ్చింది. ఆరోగ్యపరమైన ప్రయోజనాలకు తోడుగా పర్యావరణ పరిరక్షణ పరంగా కూడా ఇవి మేలైన పంటలు. ఈ ఏడాదంతా చిరుధాన్యాలపై అవగాహన పెంచడం, ఆరోగ్య, పోషకాహార ప్రయోజనాల దృష్ట్యా, వీటి వినియోగం పెంచడానికి, సాగును విస్తృతం చేయడానికి అనువైన విధానాలు రూపొందించటంపైన మాత్రమే కాకుండా, ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే రీతిలో మార్కెట్ అవకాశాలు పెంపొందించడంపైన కూడా దృష్టి సారించాల్సిన సమయమిది. మేజర్.. మైనర్ మిల్లెట్స్ పోషకాల గనులైన చిరుధాన్యాలను ప్రాథమికంగా రెండు విధాలుగా విభజించ వచ్చు. జొన్నలు, సజ్జలు, రాగులు.. గింజలపై పొట్టు తియ్యాల్సిన అవసరం లేని పెద్ద గింజల పంటలు. మేజర్ మిల్లెట్స్. కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, ఒరిగలు, అండుకొర్రలు.. గింజలపై నుంచి పొట్టు తీసి వాడుకోవాల్సిన చిన్న గింజల పంటలు. మైనర్ మిల్లెట్స్. పొట్టు తీసి బియ్యం తయారు చేసుకోవాల్సి రావటం వల్ల మైనర్ మిల్లెట్స్ ప్రాసెసింగ్ క్లిష్టతరమైన పనిగా మారింది. అందువల్లనే ఇవి కాలక్రమంలో చాలా వరకు మరుగున పడిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అధికంగా సాగవుతున్న పంట జొన్న. మొత్తం చిరుధాన్యాల్లో దీని వాటా 55.8 శాతం. 2010 నాటికి 4.22 కోట్ల హెక్టార్లలో జొన్న సాగు చేయగా 6.02 కోట్ల టన్నుల దిగుబడి వచ్చింది. 2019 నాటికి జొన్న సాగు విస్తీర్ణం 4.02 కోట్ల హెక్టార్లకు, దిగుబడి 5.79 కోట్ల టన్నులకు స్వల్పంగా తగ్గింది. భారత్‌లో 1.38 కోట్ల హెక్టార్లలో చిరుధాన్యాలు సాగవుతున్నాయి. హెక్టారుకు సగటున 1,248 కిలోల చొప్పున 1.72 కోట్ల టన్నుల దిగుబడి వస్తోంది. మన దేశంలో వరి, గోధుమ, మొక్కజొన్న తర్వాత నాలుగో ముఖ్యమైన పంట జొన్న. 40.9 లక్షల హెక్టార్లలో 34.7 లక్షల టన్నుల జొన్నలు పండుతున్నాయి. అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, అర్టెంటీనా, నైజీరియా, సూడాన్‌లో జొన్న విస్తారంగా సాగవుతోంది. భారత్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో సజ్జలు బాగా పండుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పరిశీలిస్తే.. 99.9% ఊదలు, 53.3% రాగులు, 44.5% సజ్జలు మన దేశంలోనే పండుతున్నాయి. అరికెలు, సామలైతే మన దేశంలో తప్ప మరెక్కడా పండించటం లేదని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ (ఐఐఎంఆర్) తెలిపింది. చిరుధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగంగా మార్చుకొని పౌష్టికాహార భద్రత పొందాలని ఐఐఎంఆర్ సూచిస్తోంది. 14 రాష్ట్రాలు.. 212 జిల్లాలు.. భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి దేశాన్ని చిరుధాన్యాల అంతర్జాతీయ కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. ఆహార భద్రతా మిషన్ కింద 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో చిరుధాన్యాల ఉత్పత్తి పెంపుదలకు కృషి ప్రారంభమైంది. 2022–23లో 205 లక్షల టన్నుల చిరుధాన్యాల దిగుబడి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఐఐఎంఆర్ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధన కేంద్రాలు, ఆధునిక ఆహారోత్పత్తులను వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసే కంపెనీలు, స్టార్టప్‌లకు నాలెడ్జ్ పార్టనర్‌గా చేదోడుగా నిలుస్తోంది. చిరుధాన్యాలతో 67 రకాల సంప్రదాయ వంటకాలతో పాటు ఆధునిక చిరుతిళ్లను వ్యాప్తిలోకి తెస్తోంది. కేంద్ర ఆహార శుద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా అనేక చోట్ల రెండు రోజుల మిల్లెట్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. దేశంలో రెండో మిల్లెట్ మహోత్సవం ఇటీవలే విజయనగరంలో జరిగింది. చిరుధాన్యాలు సాగు చేసే రైతులు, స్వయం సహాయక మహిళా బృందాలకు, స్వచ్ఛంద సంస్థలకు, స్టార్టప్‌లకు ఈ మహోత్సవాలు మార్కెటింగ్ అవకాశాలను పెంపొందిస్తూ కొత్త ఊపునిస్తున్నాయి. మిల్లెట్ ఉత్పత్తుల మార్కెటింగ్‌ను ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ముందుకొచ్చింది. బెంగళూరులో ప్రతి ఏటా జనవరిలో జరిగే అంతర్జాతీయ మిల్లెట్స్, ఆర్గానిక్ ట్రేడ్‌ఫెయిర్ సేంద్రియ చిరుధాన్యాల సాగు, వినియోగం వ్యాప్తికి దోహదం చేస్తోంది. మిల్లెట్ మిషన్ ద్వారా ఒడిశా ప్రభుత్వం చిరుధాన్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరుధాన్యాల సాగుకు, వినియోగానికి పెద్ద పీట వేస్తోంది. మిల్లెట్ బోర్డును ఏర్పాటు చేసింది. పంటల వారీగా మిల్లెట్ క్లస్టర్లను ఏర్పాటు చేయటం ద్వారా ఈ ఏడాది 4.87 లక్షల టన్నులకు చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో చర్యలు చేపట్టింది. డయాబెటిస్, బీపీలకు చెక్ ప్రొటీన్లు, ఎసెన్షియల్ అమినో ఆమ్లాలు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చిరుధాన్యాలు పోషక సంపన్న ఆహారంగా గుర్తింపు పొందాయి. వరి, గోధుమలతో పోల్చితే డైటరీ ఫైబర్, ప్రొటీన్లు అధికంగా ఉండటం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులతో బాధపడే వారికి చిరుధాన్యాలు అనువైనవి. ఆరోగ్యాన్ని పెంపొందించే ఫెనోలిక్ కాంపౌండ్స్‌తో కూడి ఉన్నందున అనేక జీవన శైలి సంబంధమైన వ్యాధులను ఎదుర్కోవడానికి మిల్లెట్స్‌కు మించిన ఆహారం లేదంటే అతిశయోక్తి కాదు. మైనర్ మిల్లెట్స్‌ను రోజువారీ ప్రధాన ఆహారంగా తినగలిగితే ఏ జబ్బయినా కొద్ది కాలంలో తగ్గిపోతుందని ప్రముఖ స్వతంత్ర శాస్త్రవేత్త, ఆహార–ఆరోగ్య నిపుణులు డా. ఖాదర్ వలి చెబుతున్నారు. ఊరూరా తిరిగి సభలు పెట్టి మరీ ప్రజలకు ‘సిరిధాన్యాలతో ఆహార వైద్యం’ చేస్తున్నారు. జబ్బులు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలన్నా, జబ్బుల్ని సమూలంగా పారదోలాలన్నా సిరిధాన్యాలు, గానుగ నూనెలు, తాటి/ఈత బెల్లం వంటి దేశీయ ఆహారాన్ని రోజువారీ ఆహారంగా తీసుకోవటమే మార్గమని చెబుతూవస్తున్నారు. డా. ఖాదర్ చెబుతున్న విషయాలన్నీ ‘సాక్షి’ చొరవ, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల కృషితో ఉచిత పుస్తకాలు, యూట్యూబ్ వీడియోల రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సబ్సిడీ ఇవ్వాల్సింది పోయి జీఎస్టీ పెంపా?! పౌష్టికాహార లోపం ఎక్కువగా ఎదుర్కొంటున్న పేద ప్రజల ఆహారంలోకి చిరుధాన్యాలను తిరిగి తేవాలంటే.. వరితో సమానంగా చిరుధాన్యాలపై కూడా ప్రభుత్వం పెట్టుబడి పెట్టాలి. అంతర్జాతీయ సంవత్సరం పేరుతో కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించటం, మీటింగ్‌లు, రోడ్‌షోలు పెట్టడంతో సరిపెడుతోంది. స్టార్టప్‌లు చిరుతిళ్లను అమ్మినంత మాత్రాన, ఎగుమతి చేసినంత మాత్రాన చిరుధాన్యాలు తిరిగి పళ్లాల్లోకి రావు. ఈ పని జరగాలంటే తగిన విధాన నిర్ణయాలు జరగాలి. చిరుధాన్య రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలి. ఎమ్మెస్పీ ప్రకటించినా ప్రభుత్వ సేకరణ లేదు. సామలు, అండుకొర్రలు తప్ప తక్కువ ధరకే రైతులు అమ్ముకుంటున్నారు. రెండు, మూడు పంచాయతీలకు ఒక చోటైనా స్మాల్ మిల్లెట్స్ ప్రాసెసింగ్ సదుపాయం ఏర్పాటు చేయాలి. గోదాముల్లో నిల్వ చేయడానికి (రాగులు, కొర్రలకు తప్ప) ప్రమాణాలను నిర్ణయించలేదు. వరి బియ్యం స్థానంలో 25% చిరుధాన్యాలను ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఇవ్వగలిగితేనే ప్రజల పళ్లాల్లోకి చిరుధాన్యాలు వస్తాయి. కానీ, కేంద్రం ఈ ఏడాదే చిరుధాన్యాల ఉత్పత్తులపై, ప్రాసెసింగ్ యంత్రాలపై జీఎస్టీని 5 నుంచి 18%కి పెంచింది. ప్రజాపంపిణీ వ్యవస్థలోను, అంగన్వాడీలకు సబ్సిడీపై చిరుధాన్యాలు ఇవ్వాలి. ఈ దిశగా ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. – ఎ. రవీంద్ర, డైరెక్టర్, వాసన్, స్వచ్ఛంద సంస్థ ఆరోగ్యదాయకమైన చిరుధాన్యాల సాగును, వినియోగాన్ని దేశంలో విస్తృతం చేయడానికి కృషి చేస్తున్నాం. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పనిచేస్తూ చిరుధాన్యాల సాగు, వినియోగంపై విజ్ఞానాన్ని పంచుతున్నాం. మేలైన చిరుధాన్య వంగడాలను రూపొందించి, విత్తనాలను రైతులకు అందిస్తున్నాం. కొత్తగా చిరుధాన్యాలను తినటం ప్రారంభించే వారు తొలుత ఉదయం/రాత్రి దోసెలు, ఇడ్లీలు వంటి టిఫిన్లతో మొదలు పెట్టటం మంచిది. కొంత అలవాటైన తర్వాత అన్నంగా తీసుకోవచ్చు. మిల్లెట్ అటుకుల ఉప్మా చాలా బావుంటుంది. ఓట్స్‌కు బదులుగా వాడొచ్చు. వరి, గోధుమల్లో కన్నా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఒకేసారి మూడుపూటలా కేవలం చిరుధాన్యాలనే తీసుకుంటే విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది. చిరుధాన్యాలను రోజుకు మూడు పూటలా అన్ని రకాల ఆహారాల్లోనూ నిక్షేపంగా తీసుకోవచ్చు. చిరుధాన్యాలతో 67 రకాల ఆహారోత్పత్తులను తయారు చేసే ఆధునిక సాంకేతికతలను ‘న్యూట్రిహబ్’ ద్వారా అభివృద్ధి చేశాం. ఆహారోత్పత్తుల కంపెనీలకు, స్టార్టప్ సంస్థలకు అందిస్తున్నాం. ప్రతి నెలా 3వ శనివారం మా కార్యాలయంలో గృహిణులకు చిరుధాన్య వంటకాలపై నామమాత్రపు ఫీజుతో శిక్షణ ఇస్తున్నాం. వివరాలకు మా వెబ్సైట్ చూడవచ్చు. – డా. సి.వి. రత్నావతి, సంచాలకులు ఆయన చెప్పినట్లు కషాయాలు తాగి, సిరిధాన్యాలు తిని అనంతపురం జిల్లాలో ఓ గ్రామంలో 30 మంది డయాబెటిస్, బీపీల నుంచి బయటపడ్డారు. రెడ్స్, ఆర్డిటి స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో ఉచిత కామన్ కిచెన్‌ను నిర్వహిస్తూ, వైద్య పరీక్షల ద్వారా శాస్త్రీయంగా అన్ని వివరాలనూ నమోదు చేయటం విశేషం. ఇటువంటి అద్భుత ప్రయత్నాలు అన్ని చోట్లా జరగాలి. భారతీయ వైద్య పరిశోధనా మండలి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఇటువంటి క్షేత్రస్థాయి ప్రయోగాలపై పరిశోధనలు చేపట్టాలి. ఆరోగ్య భారతాన్ని నిర్మించడటం ద్వారా ప్రపంచానికి సిరిధాన్యాల సత్తా చాటాలి. మిల్లెట్ మిక్సీలు చిరుధాన్యాలపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తున్నది ఇటీవలి సంవత్సరాల్లోనే. కానీ, కొన్ని దశాబ్దాలుగా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న విశేష కృషిని మరువరాదు. తెలుగు రాష్ట్రాల్లో డెక్కన్ డవలప్మెంట్ సొసైటీ, టింబక్టు, సహజాహారం, వాసన్, ఎర్త్ 360, సంజీవని, మన్యదీపిక, సహజ సమృద్ధ వంటి స్వచ్ఛంద సంస్థలు చిరుధాన్యాల సాగును పెంపొందిం చడంతో పాటు వాటిని తిరిగి ప్రజల ఆహారంలోకి తేవడానికి ఉద్యమ స్థాయిలో విశేష కృషి చేస్తుండటం మంచి సంగతి. సహజ సమృద్ధ ఆధ్వర్యంలో ప్రచురితమైన ‘మిల్లెట్ క్యాలెండర్’ ఎంతో ప్రయోజనకరంగా ఉంది. ఈ సంస్థల అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టాలి. కొర్రలు, సామలు వంటి స్మాల్ మిల్లెట్స్ ధాన్యం పైన పొట్టు తీసి బియ్యం తయారు చేయడానికి సాధారణ మిక్సీలకు స్వల్ప మార్పులు చేస్తే చాలు. డా. ఖాదర్ వలితో పాటు వాసన్ స్వచ్ఛంద సంస్థ మిల్లెట్ మిక్సీలను రైతులకు, ప్రజలకు పరిచయం చేశారు. గ్రామ స్థాయిలో స్మాల్ మిల్లెట్స్ వినియోగంతో పాటు రైతుల ఆదాయం పెరగడానికి ఇది దోహదపడుతుంది. స్వావలంబనను సాధించే ఇటువంటి విజయాలను ప్రభుత్వాలు ప్రోత్సహించాలి. ప్రజల ఆహార అలవాట్లలో చిరుధాన్యాలను మళ్లీ భాగం చేయడానికి ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక కార్యకర్తలకు అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఓ మంచి అవకాశం. మన దేశంలో చిరుధాన్యాల సాగు విస్తీర్ణం, ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. పంచాయతీ స్థాయిలో ప్రాసెసింగ్, వినియోగ అవకాశాలను, పోషకాహార భద్రతను మెరుగుపరచడానికి ప్రభుత్వాలు పెట్టుబడి పెట్టాలి. నిర్మాణాత్మక కృషి చెయ్యాలి. ఆహారం సరైనదైతే ఔషధం అక్కరలేదు. ఆహారం సరిగ్గా లేకపోతే ఏ ఔషధమూ పని చేయదు’. ఆరోగ్యమే మహాభాగ్యమని చాటే మన సంప్రదాయ చిరుధాన్యాల ఆహారం తిరిగి మన వంట గదుల్లోకి, పళ్లాల్లోకి ఎంత ఎక్కువగా తెచ్చుకోగలిగితే పుడమికి, మనకు అంత మేలు. చిరుధాన్యాల పునరుజ్జీవానికి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం ఒక ఊతంగా మారి ప్రజా ఉద్యమంగా రూపుతీసుకుంటుందని ఆశిద్దాం - పంతంగి రాంబాబు -
Funday Cover Story: ఆర్.. ఆర్.. ఆర్
చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు కానీ ఇది కలియుగం! భూమికి మనమందరం కలిసి చేస్తున్న ద్రోహం ఎంత చెప్పుకున్నా తీరేది కానేకాదు. గాలి, నీరు.. భూమి.. ఖనిజాలు.. ఇలా భూమ్మీది వనరులన్నింటినీ... విచ్చలవిడిగా వాడేసిన ఫలితంగా ముంచుకొస్తున్న.... భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ముప్పును ఎదుర్కోవాలంటే... ఒట్టిమాటలు కట్టిపెట్టి గట్టి మేలు తలపెట్టాల్సిందే! మానవాళి మొత్తం... మన మనుగడ కోసమే చేస్తున్న ఈ యుద్ధంలో.. అందరి తారక మంత్రం ఒకటే కావాలి. అదేమిటంటారా.... వాతావరణ మార్పుల గురించి కానీ... పెరిగిపోతున్న భూమి సగటు ఉష్ణోగ్రతల గురించి కానీ ఈ రోజు కొత్తగా చెప్పుకోవాల్సిందేమీలేదు. కనీసం రెండు దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్య సమితి నియమించిన ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఫర్ క్లైమేట్ చేంజ్ తరచూ అధ్యయన పూర్వకంగా విడుదల చేసిన నివేదికల్లో హెచ్చరిస్తూనే ఉంది. భూమి సగటు ఉష్ణోగ్రతలను ఈ శతాబ్దం అంతానికి 1.5 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ పెరిగితే పెనుముప్పు తప్పదని, సముద్ర తీర నగరాలన్నీ మునిగిపోవడం మొదలుకొని అకాల, తీవ్ర ప్రకృతి వైపరీత్యాలతో భూమిపై మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతుందని ఇప్పటివరకూ వెలువడిన ఆరు ఐపీసీసీ నివేదికలు స్పష్టం చేశాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. విపత్తు ముంచుకొస్తోందని తెలిసినా.. జంతుజాతి వినాశనం అంచున కొట్టుమిట్టాడుతోందన్నా ప్రపంచదేశాలు ఇప్పటికీ వీటిని ఎదుర్కొనేందుకు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగకపోవడం!! బాధ్యులెవరు? ఖర్చులు ఎవరు భరించాలన్న అంశంపై మల్లగుల్లాలు పడుతూనే ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు నెపం ఇంకొకరిపైకి నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కానీ ఇది మరెంతో కాలం కొనసాగే సూచనలు లేవు. నిరుడు యూరప్ మొత్తం కరవు చుట్టుముట్టింది. అలాగే ఎన్నడూ లేనంత తీవ్రమైన వరదలు పాకిస్థాన్‌ను పలకరించాయి. ఈ ఏడాది మొదట్లోనూ వందేళ్లలో కనీవినీ ఎరుగని రీతిలో అమెరికా మంచులో కూరుకుపోయింది. ఈ వైపరీత్యాలన్నీ వాతావరణ మార్పుల ప్రభావమేనని స్పష్టమైతేనైనా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించేందుకు ప్రపంచదేశాలు ముందుకు కదులుతాయి. ఈ అంశం అలా పక్కనుంచితే... వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చిరకాలంగా సూచిస్తున్న తారక మంత్రం రెడ్యూస్.. రీసైకిల్.. రీ యూజ్! క్లుప్తంగా ఆర్ఆర్ఆర్ అని పిలుచుకుందాం. వ్యక్తుల స్థాయిలో... ప్రభుత్వాలూ చేపట్టగల ఈ మూడు పద్ధతులను అమలు చేయగలిగితే.. ఒకవైపు వనరుల సమర్థ వినియోగం సాధ్యమవడమే కాకుండా... భూమి పది కాలాల పాటు పచ్చగా ఉండేందుకు అవకాశం ఎక్కువ అవుతుంది. ఎలా మొదలైంది? ఆర్ ఆర్ ఆర్ గురించి దశాబ్దాలుగా మనం వింటున్నాం. కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు తమదైన ప్రయత్నాలు చేస్తున్నాయి. చెత్తను తగ్గించుకునేందుకు, వనరులను ఆదా చేసుకునేందుకు, ఒక వస్తువు లేదా పదార్థాన్ని ఇంకో రూపంలోకి మార్చి మళ్లీ మళ్లీ వాడేందుకు తమదైన రీతుల్లో ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు అవసరమైన టెక్నాలజీ, పరికరాల రూపకల్పన సరేసరే. అంతా బాగుంది కానీ.. ప్రపంచమంతా ఒక ఉద్యమంలా సాగుతున్న ఈ ఆర్ ఆర్ ఆర్ ఎలా మొదలైంది? ఊహూ.. స్పష్టంగా ఎవరికీ తెలియదు. అయితే ఏటా ఏప్రిల్ 22న నిర్వహించే ఎర్త్ డేకు ఈ ఆర్ ఆర్ ఆర్కూ కొంత సంబంధం ఉందని చాలామంది అంగీకరిస్తారు. 1970లో అమెరికాలోని విస్కాన్సిన్ సెనేటర్ గేలార్డ్ నెల్సన్ ఈ ఎర్త్ డేను ప్రారంభించినప్పుడు ఆ దేశంలో సుమారు రెండు కోట్ల మంది వేర్వేరు ప్రాంతాల్లో పాల్గొన్నారు. జాతరలు, ప్రదర్శనలు, ఊరేగింపుల్లాంటివి నిర్వహించారు. తద్వారా పర్యావరణ పరంగా భూమికి జరుగుతున్న నష్టాన్ని, ప్రమాద నివారణకు వ్యక్తిగత స్థాయిలో చేయగల పనులను ఈ సందర్భంగా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించే సమయానికి అమెరికా మొత్తమ్మీద వాడి పారేసే వస్తువులతో పెద్ద సమస్యగా ఉండేదట. 1950లలో ఆర్థికంగా బాగా వృద్ధి చెందడంతో మొదలైన ఈ సమస్య 1970ల నాటికి పతాక స్థాయికి చేరుకుందన్నమాట. కుప్పల్లోనూ చెత్త పేరుకుపోయి ఉండేది. ఎర్త్ డే సందర్భంగా చెత్త సమస్యపై ప్రజల దృష్టి పడటంతో ప్రభుత్వం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను సిద్ధం చేసింది. ఈ చట్టం కారణంగా వస్తువులను రీసైకిల్ చేయాల్సిన అవసరాన్ని తెలియజెప్పే రిసోర్స్ రికవరీ యాక్ట్ కూడా సిద్ధమైంది. ఈ సందర్భంలోనే అమెరికాలో ఈ రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ అనే పదం ప్రజల నోళ్లల్లో నానడం మొదలైంది. క్రమేపీ ఒక ఉద్యమంలా మారిందని అంటారు. ఆర్ ఆర్ ఆర్...ఇంతకీ వీటి పరమార్థం? ఆర్ ఆర్ ఆర్ పరమార్థం ఒక్క ముక్కలో చెప్పాలంటే దేన్నైనా అవసరమైనంత మేరకు మాత్రమే వాడుకోమ్మని. పిసినారిగా ఉండమని చెప్పినా తప్పేమీ కాదు. దీనివల్ల ఆర్థికంగా మనకు కొంచెం లాభం చేకూరడమే కాకుండా... భూమి మొత్తాన్ని కాపాడేందుకు మన వంతు సాయం చేసినట్టూ ఉంటుంది. అయితే ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. భూమ్మీద ఉన్న వారందరూ చేయిచేయి కలిపినా రాగల ప్రమాదాన్ని పూర్తిగా నివారించలేము. తీవ్రత కొంచెం తగ్గవచ్చు అంతే. ప్రజలతోపాటు ప్రభుత్వాలు తగు విధానాలు సిద్ధం చేసి, తగినన్ని నిధులు, టెక్నాలజీలను సమకూర్చి కార్యాచరణకు దిగితేనే ప్రయోజనం. ఈ దిశగా ప్రభుత్వాలు ఇప్పటికే కొన్ని ప్రయత్నాలైతే చేస్తున్నాయి. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్లలో మొదటిదైన రెడ్యూస్ విషయాన్ని పరిశీలిద్దాం. చెత్తకుప్పల్లోకి చేరే వ్యర్థాలను తగ్గించుకోవడం దీని ప్రధాన ఉద్దేశం. ఇలా చెత్త తగ్గాలంటే మనం వాడే వనరులను కూడా మితంగా అవసరమైనంత మేరకే వాడుకోవాలి. అది కరెంటు కావచ్చు.. నీళ్లు కావచ్చు. ఇంకేదైనా వనరు, పదార్థం కావచ్చు. మితంలోనే పరమార్థమన్నమాట. వ్యక్తులుగా దీన్ని సాధించేందుకు కొన్ని చిట్కాలున్నాయి. మీలో కొందరు ఇప్పటికే వీటిని పాటిస్తూండవచ్చు కూడా. అవేమిటంటే... ఇంటికి కావాల్సిన వస్తువులను చిన్న చిన్న మొత్తాల్లో కాకుండా... నెలకు లేదా కొన్ని నెలలకు సరిపడా ఒకేసారి కొనేయడం. దీనివల్ల ప్యాకేజింగ్ కోసం వాడే ప్లాస్టిక్ గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువ మోతాదుల్లో కొంటే ఖర్చులూ కలిసివస్తాయి. మళ్లీమళ్లీ వాడుకోగల సంచులను దగ్గరుంచుకుంటే మరికొంత ప్లాస్టిక్‌ను చెత్తకుప్పలోకి చేరకుండా నిలువరించవచ్చు. వాడి పారేసే వస్తువుల కంటే మళ్లీమళ్లీ వాడుకోగలవాటికే ప్రాధాన్యమివ్వండి. ఇంట్లో అవసరమైనప్పుడు.. అవసరమైన చోట మాత్రమే ఫ్యాన్లు, లైట్లు వాడటం ద్వారా విద్యుత్తును తక్కువగా వాడవచ్చు. కుళాయిల్లో, బాత్రూమ్ సింక్‌లలో లీకేజీలు లేకుంటే బోలెడంత నీళ్లు మిగుల్చుకోవచ్చు. వారంలో ఒక్క రోజు మాంసాహారం మానేసినా పాడి పశువుల పెంపకానికయ్యే వనరులు తగ్గి భూమికి మేలు జరుగుతుందంటారు నిపుణులు. విమాన ప్రయాణాలను తగ్గించుకోవడం, వీలైనప్పుడల్లా కాళ్లకు పనిచెప్పడం లేదా సైకిళ్లను ఉపయోగించడమూ రెడ్యూస్ కిందకే వస్తుంది. కర్బన ఉద్గారాలు మరింత ఎక్కువ కాకుండా ముందుగానే అడ్డుకోవడం అన్నమాట. ► 98 %: వాడిపారేసే ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో (క్యారీబ్యాగుల్లాంటివి) చమురులాంటి శిలాజ ఇంధనాలతో తయారయ్యేవి. ► 7.5 – 19.9 కోట్ల టన్నులు: సముద్రాల్లోకి చేరి కాలుష్యం సృష్టిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల పరిమాణం. ► 450 ఏళ్లు: ప్లాస్టిక్ బాటిళ్లు నశించేందుకు పట్టే సమయం. ► 2800 కోట్లు: ఏటా చెత్తకుప్పల్లోకి చేరుతున్న గాజు బాటిళ్ల సంఖ్య. వీటిల్లో మూడొంతులు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయి. ► 2021లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు కోట్ల టన్నుల కాగితాన్ని రీసైకిల్ చేశారు. చెత్తకుప్పల్లోకి చేరిన కాగితాల్లో ఇది 68 శాతం మాత్రమే. ఈ ఏడాది తయారైన కార్డ్‌బోర్డులో 91.4 శాతం రీసైకిల్ చేసిన కాగితం. ఒకే ఒక్క శాతం చెత్తకుప్పల్లోకి చేరే చెత్తలో అల్యూమినియం మోతాదు ఇది. అలసిపోయేంతవరకూ రీసైకిల్ చేసుకోగలగడం ఈ లోహపు ప్రత్యేకత కూడా. కానీ.. ఏటా దాదాపు 70 లక్షల టన్నుల అల్యూమినియం రీసైకిల్ కావడం లేదు. వాడి వాడి.. మళ్లీ వాడి... పర్యావరణ పరిరక్షణ తారక మంత్రం ఆర్ ఆర్ ఆర్‌లో రెండోది రీ యూజ్. పేరులో ఉన్న మాదిరిగానే వస్తువులను వీలైనంత ఎక్కువగా వాడటమే ఇది. నిజానికి ఈ విషయం భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదేమో. చిరిగిన చీరలిక్కడే బొంతలవుతాయి.. అలాగే వాడేసిన తువ్వాలు తుండుగుడ్డ అయిపోతుంది. ప్లాస్టిక్ డబ్బాలు... పచారీ సామాను నిల్వకు వాడేదీ ఇక్కడే మరి!! మోజు తీరిన దుస్తులు అనా«థ శరణాలయాలకు చేరడమూ మనం చూస్తూంటాం. రీ యూజ్ వల్ల కలిగే అతిపెద్ద లాభం వాడదగ్గ వస్తువులు చెత్తగా కుప్పల్లోకి చేరకుండా నిలువరించడం. ఉన్నవాటినే ఎక్కువ కాలం వాడటం వల్ల కొత్తవి కొనే అవసరం తప్పుతుంది. తద్వారా డబ్బు ఆదాతోపాటు భూమికీ మేలు జరుగుతుంది. టెక్నాలజీ పుణ్యమా అని ఇప్పుడు సెకెండ్ హ్యాండ్ వస్తువులు కూడా విస్తృతంగా అందుబాటులో ఉంటున్నాయి. అవసరానికి తగ్గట్టు కొత్త ఉత్పత్తులను కాకుండా.. సెకెండ్ హ్యాండ్‌వి కొనగలిగితే వనరులను మిగుల్చుకోగలం. ప్రపంచమంతా.... ఆర్ ఆర్ ఆర్లలో ఇది చాలా పాపులర్. తరచూ అందరికీ వినిపించే రీసైక్లింగ్. వాడేసిన వస్తువుల రూపం, తీరుతెన్నులు మార్చి ఇంకో అవసరానికి వాడుకోవడాన్ని రీసైక్లింగ్ అనవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే వ్యర్థానికి కొత్త అర్థం చెప్పడమన్నమాట. ఈ రీసైక్లింగ్ జాబితాలోకి రాని వస్తువు అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ప్లాస్టిక్, కాగితం, కాంక్రీట్, మానవ, జంతు, పశు, పక్షి వ్యర్థాలు ఇలా దేనైన్నా రీసైకిల్ చేసి వాటి నుంచి ప్రయోజనం పొందవచ్చు. ప్లాస్టిక్ లాంటి పదార్థాలను రీసైకిల్ చేయడం వల్ల గాలి, నేల, నీటి కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. కొన్ని రకాల ప్లాస్టిక్ పదార్థాలు నశించిపోయేందుకు కొన్ని వందల సంవత్సరాల సమయం పడుతుందన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ రీసైక్లింగ్, ప్రత్యామ్నాయాల కోసం విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. రీసైక్లింగ్ విభాగంలోకి ఇటీవలే వచ్చి చేరిన కొత్త రకం వ్యర్థం ఈ–వేస్ట్. యూఎస్బీ డ్రైవ్‌లు మొదలుకొని, ఎయిర్‌పాడ్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్టాప్స్, డెస్క్‌టాప్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తమ జీవితకాలం తరువాత వృథా అయిపోతూండటం వల్ల ప్లాటినమ్ వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగిపోతోంది. ఇక సేంద్రీయ వ్యర్థాల విషయానికి వస్తే... పొలాల్లోని వ్యవసాయ వ్యర్థాలు మొదలుకొని ఇళ్లలో మిగిలిపోయిన ఆహారం వరకూ చాలావాటిని కుళ్లబెట్టి సహజసిద్ధమైన ఎరువులు లేదా వంటగ్యాస్‌లను తయారు చేసుకోవచ్చు. గ్యారీ ఆండర్సన్ సృష్టి.. ఈ లోగో! ఆర్ ఆర్ ఆర్లు మూడు వేర్వేరు అంశాలు కావచ్చు కానీ.. వీటిని సూచించేందుకు వాడే గుర్తు లేదా సింబల్ మాత్రం ఒక్కటే. మూడు ఆరో గుర్తులతో ఒక వృత్తంలా ఉండే ఈ గుర్తును దాదాపు ప్రతి ప్యాకేజ్‌పైనా చూడవచ్చు. ఆసక్తికరమైన అంశం ఈ లోగోను రూపొందించింది ఎవరన్న విషయం. ఒక ప్రైవేట్ సంస్థ కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా పెట్టిన డిజైన్ పోటీల్లో పాల్గొన్న యూఎస్సీ గ్రాడ్యుయేట్ విద్యార్థి గ్యారీ అండర్సన్ దీన్ని డిజైన్ చేశారు. అప్పట్లో సీసీఏ రీసైక్లింగ్ పనిలోనూ ఉండటం వల్ల దాన్ని సూచించేందుకు లోగోను రూపొందించాలని పోటీ పెట్టారు. పోటీలో నెగ్గిన తరువాత ఆ లోగోతోపాటు గ్యారీ కూడా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు. ఎందరో మహానుభావులు... ఎనెన్నో ప్రయత్నాలు! భూతాపోన్నతి, వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు, వ్యక్తులు, సంస్థల స్థాయిల్లో పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషతుల్యమైన కాలుష్యాలను వాతావరణం నుంచి తొలగించేందుకు, వాడకాన్ని తగ్గించేందుకు కొత్త టెక్నాలజీలూ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిల్లో మచ్చుకు కొన్నింటి గురించి స్థూలంగా చూస్తే... ఓషన్ క్లీనప్ ప్రాజెక్టు... చెత్తకుప్పల్లోంచి నదుల్లోకి.. అటు నుంచి సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి కొత్త రూపంలో ఆ వ్యర్థాలను వాడుకునేందుకు బోయన్ స్లాట్ అనే యువ ఔత్సాహిక శాస్త్రవేత్త చేపట్టిన ప్రాజెక్టు ఇది. సముద్రాల్లోని ప్లాస్టిక్‌లో అధికభాగం జల ప్రవాహాల ఫలితంగా పసిఫిక్ మహా సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ ఎత్తున పోగుపడ్డాయి. ‘ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్’ అని పిలిచే ఈ చెత్తకుప్ప సైజు ఎంత ఉందో తెలుసా? ఫ్రాన్స్ దేశ వైశాల్యానికి మూడు రెట్లు... లేదా టెక్సస్ వైశాల్యానికి రెండు రెట్లు ఎక్కువ. అంకెల్లో చెప్పాలంటే కొంచెం అటు ఇటుగా 16 లక్షల చదరపు కిలోమీటర్లు! 2017 నాటి లెక్కల ప్రకారమే ఇక్కడ పోగుపడ్డ ప్లాస్టిక్ బరువు సుమారు 29.7 కోట్ల టన్నులని అంచనా. ఈ నేపథ్యంలో సముద్ర జీవులకు పెను ప్రమాదంగా పరిణమించిన ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌ను తొలగించేందుకు 2013లో బోయన్ స్లాట్ అనే నెదర్లాండ్ కుర్రాడు ఓ వినూత్న ప్రయత్నం మొదలుపెట్టాడు. సముద్రపు అలల సాయంతోనే చెత్తను పోగుచేసి బయటకు తరలించేందుకు అవసరమైన టెక్నాలజీలను సిద్ధం చేశాడు. బోయన్స్లాట్ స్థాపించిన ఓషన్ క్లీనప్ సంస్థ ఐదేళ్ల కాలంలో ద గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ ప్యాచ్‌లో సగాన్నైనా ఖాళీ చేయాలని సంకల్పిస్తోంది. గత 30 రోజుల్లో ఓషన్ క్లీనప్ సంస్థ ఎనిమిది ఇంటర్సెప్టర్ల సాయంతో 1,11,804 కిలోల ప్లాస్టిక్ చెత్తను తొలగించింది. ఇప్పటివరకూ తొలగించిన చెత్త 20,68,237 కిలోలు. సముద్రాల్లో మాత్రమే కాకుండా... నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్‌ను కూడా అక్కడికక్కడే ఒడిసిపట్టేందుకు బోయన్ స్లాట్ ప్రయత్నిస్తున్నాడు. డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్... భూతాపోన్నతికి ప్రధాన కారణం? గాల్లో కార్బన్‌డైయాక్సైడ్ వంటి విష వాయువుల మోతాదు ఎక్కువ కావడం. అందుకేనేమో కొందరు ఈ సమస్యను నేరుగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే... గాల్లోని కార్బన్ డైయాక్సైడ్‌ను నేరుగా తొలగించేందుకు డైరెక్ట్ కార్బన్ క్యాప్చర్ పేరుతో పలు ప్రాజెక్టులు చేపట్టారు. పెద్ద పెద్ద ఫ్యాన్లు పెట్టి గాలిని పోగు చేయడం.. అందులోని కార్బన్ డైయాక్సైడ్‌ను రసాయనాల సాయంతో తొలగించి వేరు చేయడం స్వచ్ఛమైన గాలిని మళ్లీ వాతావరణంలోకి వదిలేయడం ఈ ప్రాజెక్టుల పరమోద్దేశం. వేరు చేసిన కార్బన్ డైయాక్సైడ్‌ను భూమి అట్టడుగు పొరల్లో భద్రపరచడం లేదా కొన్ని ఇతర టెక్నాలజీ సాయంతో విలువైన ఇంధనం, ఇతర పదార్థాలుగా మార్చి వాడుకోవడం చెప్పుకోవాల్సిన అంశం. చిన్నా చితక కంపెనీలను వదిలేస్తే డైరెక్ట్ క్యాప్చర్ టెక్నాలజీలో చెప్పుకోవాల్సిన కంపెనీలు క్లైమ్‌వర్క్స్ ఒకటి. దీంతోపాటు కార్బన్ ఇంజినీరింగ్, గ్లోబల్ థెర్మోస్టాట్లు అనే రెండు కంపెనీలు కలిపి మొత్తం 18 చోట్ల ఫ్యాక్టరీలను స్థాపించి గాల్లోని కార్బన్ డైయాక్సైడ్‌ను వేరు చేస్తున్నాయి. ఈ ఫ్యాక్టరీల్లో ఏడాది ఒక టన్ను నుంచి నాలుగు వేల టన్నుల సామర్థ్యమున్నవి ఉన్నాయి. అత్యధిక సామర్థ్యమున్న కంపెనీ ఏడాదికి ఎనిమిది వేల టన్నుల కార్బన్ డైయాక్సైడ్‌ను వాతావరణం నుంచి తొలగిస్తోంది. అమెరికాలో ఇప్పుడు ఏడాదికి పది లక్షల టన్నుల సామర్థ్యమున్న ఫ్యాక్టరీ ఒకటి వచ్చే ఏడాదికల్లా ప్రారంభం కానుంది. ఇదిలా ఉండగా... మరికొన్ని సంస్థలు కూడా గాల్లోని కార్బన్ డైయారక్సైడ్ను సమర్థంగా పునర్వినియోగించుకునేందుకు కొన్ని టెక్నాలజీలను సిద్ధం చేశాయి. వీటిల్లో రెండు మన దేశంలోనే ఉండటం విశేషం. ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న చక్ర ఇన్నొవేషన్స్ సంస్థ డీజిల్ జనరేటర్లు, బస్సుల పొగ గొట్టాల నుంచి వెలువడే కాలుష్యం నుంచి కర్బనాన్ని వేరు చేసి ప్రింటింగ్ ఇంక్గా మారుస్తూంటే... పుణె కేంద్రంగా పనిచేస్తున్న ఇంకో కంపెనీ కార్బన్ క్రాఫ్టస్ డిజైన్ వాటితో భవన నిర్మాణాల్లో వాడే టైల్స్గా మారుస్తోంది. రీసైకిల్‌కు బోలెడన్ని ఉదాహరణలు ఉన్నాయి. కానీ.. రీయూజ్, రెడ్యూస్లకు సంబంధించినవి తక్కువే. అలాగని ప్రయత్నాలు జరగడం లేదని కాదు. ముంబైలో ఓ యువకుడు చెత్తకుప్పల్లోకి చేరిన తెల్లటి క్యారీబ్యాగులను సేకరించి వాటితో సరికొత్త కాలిజోళ్లు సిద్ధం చేస్తూండటం రీయూజ్‌కు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అలాగే.. టెట్రాప్యాకులను చిన్న చిన్న ముక్కలు చేసి వాటితో కుర్చీలు, బల్లలు తయారు చేసి ప్రభుత్వ పాఠశాలలకు ఇస్తోంది ముంబైలోని ఓ స్వచ్ఛంద సంస్థ. ఇలా ప్రతి దేశంలో, ప్రతి సమాజంలోనూ వ్యక్తులు, సంస్థలు కూడా ఉడతాభక్తి చందంగా ఈ భూమిని రక్షించుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి!! -గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
Christmas 2022: క్రీస్తు జననం.. విశ్వానికి పర్వదినం
క్రైస్తవ ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన దైవజనులలో ఇంగ్లాండు దేశానికి చెందిన చార్లెస్ వెస్లీ ఒకరు. తన అన్న జాన్‌వెస్లీ అద్భుత ప్రసంగీకుడైతే చార్లెస్ వెస్లీ అద్భుతమైన పాటల రచయిత. తన జీవిత కాలంలో దాదాపుగా తొమ్మిదివేల పాటలను రచించి దేవుని నామమును మహిమపరచాడు. అతడు రాసిన పాటల్లో చాలా ప్రాచుర్యం పొందిన పాట ‘దూత పాట పాడుడీ’. ఆ పాటలోని ప్రతి అక్షరంలో అనిర్వచనీయమైన భక్తి పారవశ్యం కనిపిస్తుంది. ఈ పాట అనేకమందికి క్రిస్మస్ గొప్పతనాన్ని చాటుతుంది. ప్రపంచంలోని క్రైస్తవులంతా అత్యంత భక్తిశ్రద్ధలతో పారవశ్యంతో జరుపుకొనే పండుగ క్రిస్మస్. సత్య వాక్యమైయున్న దేవుడు రక్తమాంసాలతో జన్మించి పుడమిని పులకింపచేసిన సమయం. ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు’ అని దూతలు ప్రకటించిన సువార్త నేడు కూడా అనేక హృదయాలలో మారుమ్రోగుతుంది. ‘యేసుక్రీస్తు ప్రభువు సమస్త మానవాళిని రక్షించుటకు మానవ ఆకారంలో ఈ లోకానికి ఏతెంచారు’– కేంబ్రిడ్జ్‌లో విద్యనభ్యసించి ఆ తదుపరి దేవుని సేవకు తన జీవితాన్ని అంకితం చేసుకొని శ్రేష్ఠమైన గ్రంథాలెన్నింటినో రచించిన థామస్ వాట్సన్ కలం నుంచి జాలువారిన మాటలివి. క్రిస్మస్ అనే మాటకు క్రీస్తును ఆరాధించుట అని అర్థం. ఆ ఆరాధన హృదయాంతరాళాల నుంచి పెల్లుబకాలి. జగతి పరమార్థాన్ని గ్రహించి బతకాలన్నా, నిజమైన ఆనందాన్ని మదిలో నింపుకోవాలన్నా ఘనుడైన దేవుని ఆరాధించాలి. సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, ఆదిసంభూతుడు, అత్యున్నతుడు, ఆరాధనకు యోగ్యుడూ క్రీస్తే! ‘కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీయందు పుట్టి మనము స్వీకృత పుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడియున్నవారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయెను’ అని అపొస్తలుడైన పౌలు ధన్యసత్యాన్ని గలతీ సంఘానికి తన పత్రిక రాస్తూ తెలియచేశాడు. పాపపంకిలమైన లోకంలో బతుకుచున్న మనలందరిని తన బిడ్డలుగా చేసుకోవాలన్నదే దేవుని నిత్య సంకల్పం. ఆ సంకల్పం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మించినప్పుడు ఓ అద్భుత సంఘటన జరిగింది. తూర్పు దేశపు జ్ఞానులు సుదూర ప్రయాణం చేసుకొంటూ మొదల యెరూషలేముకు ఆ తదుపరి దానికి దగ్గరలోనే ఉన్న బేత్లేహేముకు వెళ్ళారు. వాళ్ళు నక్షత్ర పయనాన్ని అంచనా వేయగల సామర్థ్యం గలవారు. ఆధ్యాత్మిక చింతన పరిపుష్టిగా ఉంది. ఎన్నో ఏండ్ల నుంచి రక్షకుని ఆగమనం కోసం కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్న వారిలో వీరు కూడా ఉన్నారు. వారి ప్రాంతాలను, కుటుంబాలను, పనిపాటలను కొంతకాలం పక్కనపెట్టి దేవుణ్ణి చూడడానికి ప్రయాణం కట్టారు. అది అంత సులువైన ప్రయాణం కాకపోయినా మొక్కవోని దీక్షతో, పట్టుదలతో ప్రయాణం చేసి ఆఖరుకు చేరాల్సిన స్థానానికి చేరారు. మనసులు పులకించిపోయాయి. దైవదర్శనాన్ని పొందిన ఆ నేత్రాలు పావనమయ్యాయి. ధారలుగా కారుతున్న ఆనందబాష్పాలు అందుకు నిలువెత్తు నిదర్శనం. పాలబుగ్గల పసివాడు తల్లిఒడిలో పరవశించినట్లు ఆ జ్ఞానులు పరవశించిపోయారు. పసిబాలుడైన క్రీస్తును తదేకంగా చూస్తూ ఆయన పాదాలమీద పడి మనస్ఫూర్తిగా ఆరాధించారు. ఆ దివ్యమైన అనుభూతులను కళ్ళకు కట్టినట్లు వర్ణించిన సువార్తికుడైన మత్తయి ఇలా అంటాడు. ‘వారు ఇంటిలోనికి వచ్చి తల్లియైన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి’ (మత్తయి 2:10, 11). యేసుక్రీస్తు ఇశ్రాయేలు దేశంలోని బేత్లెహేములోనే ఎందుకు జన్మించాడు అని కొందరు అడుగుతుంటారు. ఆ ప్రశ్నకు అద్భుతమైన సమాధానాలున్నాయి. ఈనాటి ప్రపంచంలో సుమారుగా 4400 పట్టణాలున్నాయి. ఎంతో చరిత్ర కలిగిన పట్టణాలు కొన్నయితే, మనస్సును ఆహ్లాదపరచే ప్రకృతి రమణీయతను కలిగిన పట్టణాలు మరికొన్ని. అయితే వీటిలో దేనికీలేని ప్రాధాన్యం, ప్రాచుర్యం బేత్లెహేము అనే పట్టణానికి ఎందుకుంది? వాస్తవానికి బైబిల్ గ్రంథం రెండు భాగాలుగా విభజించబడింది. ఒకటి పాత నిబంధన, రెండవది కొత్తనిబంధన. పాతనిబంధన చరిత్ర క్రీస్తుకు ముందు జరిగిన చరిత్ర. కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన చరిత్ర, ఆయన తరువాత సంఘం ద్వారా దేవుడు చేసిన కార్యాలు రాయబడ్డాయి. అయితే పాత నిబంధన గ్రంథంలో రక్షకుని గురించిన ప్రవచనాలు చాలా స్పష్టంగా వివరించబడినవి. రక్షకుని ఆగమనం ఆకస్మికంగా జరిగినది కాదు. ప్రవక్తలు సామాన్య ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూశారు. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన ప్రతి విషయానికి పాతనిబంధన గ్రంథంలో ప్రవచనాలున్నాయి. యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మిస్తాడనేది వాటిలో ఒక ప్రముఖమైన ప్రవచనం. మొదటిగా యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించుట అనేది ప్రవచన నెరవేర్పు. మోరెషెత్గతు అను కుగ్రామానికి చెందిన మీకా అనే ప్రవక్త దేవుని ఉద్దేశాలను బయలు పరచడానికి దేవుని ద్వారా ప్రేరేపించబడ్డాడు. ఇతడు ప్రవక్తయైన యెషయా సమకాలీకుడు. యెషయా యెరూషలేములో ప్రవక్తగా ఉండి అక్కడ పరిపాలించుచున్న రాజులను గురించి పరిస్థితులను గురించి తన గ్రంథంలో రాశాడు. అయితే మీకా గ్రామీణ ప్రాంతానికి చెందినవాడు కావడంతో యూదయ ప్రాంతంలో ఉన్న అబద్ధ ప్రవక్తలను భక్తిహీనులైన యాజకులను, లంచగొండులైన నాయకులను ఖండించాడు. అన్నిటికన్న ప్రాముఖ్యంగా రాబోయే మెస్సీయను గురించి ఆయన యొక్క నీతి పాలన గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన బేత్లెహేములో జన్మిస్తాడని మీకా ప్రవచించాడు. ‘బేత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును. పురాతన కాలం మొదలుకుని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్షమగుచుండును’ (మీకా 5:2). ఏడు వందల సంవత్సరాల తరువాత రక్షకుడు భూమి మీద ఉద్భవించిన తరువాత యూదయను పాలిస్తున్న హేరోదు రాజు మెస్సీయ పుట్టుక స్థలమును గురించి యాజకులను, శాస్త్రులను ప్రశ్నించినప్పుడు వారు మీకా గ్రంథమునందలి ఈ ప్రవచనమును జవాబుగా తెలిపారు. ‘దేవుడు తన ప్రవక్తల ద్వారా వెల్లడిచేసిన ఏ ప్రవచనమును నిరర్థకం చేయలేదు. ఎందుకంటే ప్రవచనము మనష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు. కానీ మనుష్యులు దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వాటిని పలికిరి’ (2పేతురు 1:21). ప్రవక్తయైన మీకా ద్వారా బేత్లెహేమును గురించిన ప్రవచనం మాత్రమే గాక ఆయన గురించి మరికొన్ని ప్రవచనాలు కూడా పలికిరి. మెస్సీయ స్థాపించే రాజ్యము సమాధాన ముతో ఉంటుందని ప్రవచించారు. ‘ఆయన సమాధానమునకు కారకుడగును’ (మీకా 5:5). యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి తనయందు విశ్వాసముంచిన వారిని దేవునితో సమాధానపరుస్తారు అనే విషయాన్ని ఆత్మ నడిపింపు ద్వారా మీకా ప్రవక్త తెలిపాడు. మొదటి శతాబ్దంలో అపొ. పౌలు ఎఫెసీ సంçఘానికి రాసిన పత్రికలో ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ‘ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్ట మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తనయందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన సిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఈలాగు చేసెను. గనుక ఆయనయే మనకు సమాధానకారకుడైయున్నాడు’ (ఎఫెసీ2:14, 16). దేవుడు అనుగ్రహించే సమాధానము విశిష్ఠమైనది. ‘ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్తజనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహింతును’ అని ప్రభువు సెలవిచ్చారు. ఆయన పాదాల చెంతకు వచ్చిన అనేకులను తన దివ్యశక్తితో, శాంతితో నింపి వారిని బలపరిచాడు. ప్రస్తుతకాలంలో మానవుడు శాంతి సంతోషాలను అనుభవించాలన్న ఆశతో అశాశ్వతమైన ఆనందాలకోసం వెంపర్లాడుతూ, మనుషులు లోకంలోని బురదను, మురికిని అంటించుకొంటున్నారు దానిని వదిలించుకోలేక, విడిపించుకోలేక, కడుక్కోలేక సతమతమౌతున్నారు. రక్షించే నాథుడు ఎవరా? కాపాడే కరుణామయుడు ఉన్నారా? అని అలమటిస్తూ నిజమైన ఆనందం కోసం, సమాధానం కోసం వెదుకుతున్నారు. నేటి కాలంలో యువత మత్తు పదార్థాలకు, వింత పోకడలకు బానిసలౌతున్నారు. వాటి వెనుకనున్న కారణాలు విశ్లేషిస్తే, ‘ఒత్తిడి అధిగమించాలని కొందరు, కిక్ కోసం కొందరు, ఫ్రెండ్సు కోసం కొందరు, మానసిక ఉల్లాసం కోసం మరికొందరు చెడు అలవాట్లకు చేరువౌతున్నారు. ప్రభుత్వాలకు, పోలీసులకు పెనుసవాళ్ళను మిగుల్చుతున్న డ్రగ్స్ మహమ్మారి సృష్టిస్తున్న బీభత్సం అంతాఇంతా కాదు. ఏదో సొంతం చేసుకోవాలన్న తపనతో ఉన్నవికూడా కోల్పోతూ ఆఖరుకు తీవ్ర నిరుత్సాహానికి గురై ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం రస్సెల్ అనే సంగీత కళాకారుడు ఒక ప్రాంతంలో కచేరీ నిర్వహించాడు. వందల డాలర్లు వెచ్చించి అతడు వాయించే సంగీత సమ్మేళనాన్ని ఆస్వాదించడానికి సంగీత ప్రియులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆ రాత్రి అతడు వాయించిన సంగీతం అనేకమందిని ఉర్రూతలూగించింది. ఆ సంగీత విభావరిలో అతడు ఒక పాటను ఆలపించాడు. ‘విచారం వలన ఒరిగేదేమిటి? దుఃఖం వలన వచ్చే ప్రయోజనమేమిటి? విచారాన్ని దుఃఖాన్ని సమాధి చేసి ఆనందంగా బతికేయి’ అనేది ఆ పాట సారాంశం. అర్ధరాత్రివరకూ కొనసాగిన ఆ సంగీత విభావరి ముగిశాక అందరూ ఇళ్ళకు చేరుకున్నారు. మరుసటి ఉదయం వార్తాపత్రికలలో మొదటి పేజీలో ముద్రితమైన ఓ చేదువార్త అనేకులను ఆశ్చర్యపరచింది. గతరాత్రంతా తన సంగీతంతో ప్రజలను ఉర్రూతలూగించిన రస్సెల్ ఆత్మహత్మ చేసుకున్నారు. దుఃఖాన్ని సమాధి చేయండి అని పిలుపిచ్చిన వ్యక్తి తానెందుకు ఆ పని చేయలేకపోయాడు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలోనూ మెదిలింది. నిజమైన ఆనందం డబ్బులో లేదు. పేరు ప్రఖ్యాతులు సంపాదించండంలో ఉండదు. భౌతిక సంబంధమైన భోగభాగ్యాలలో ఆనందం ఆనవాళ్ళు లభించవు కాని పరమాత్మునికి మనసులో చోటివ్వడం ద్వారా స్వచ్ఛమైన ఆనందాన్ని అనుభవించగలము. కనులు తెరిచి నిజమైన కాంతి కోసం అన్వేషిస్తే, హృదయాన్ని నిజమైన దేవునికి అర్పించి విలువై ఆనందాన్ని స్వంతం చేసుకుంటే అంతకన్నా పరమార్థం వేరే వుండదు. ఆ జన్మ ధన్యం, పుట్టుక సఫలం. క్రిస్మస్ అవధులు లేని ఆనందాన్నిచ్చింది. నిత్యనూతనమైన జీవాన్ని అందులో నింపింది. సర్వకాల సర్వావస్థలలోనూ తొణికిసలాడే సంతోషాన్ని నిండుగా నింపింది. ఓ మంచి ఉద్యోగం, చుట్టూ ఇరవై మంది స్నేహితులు, రోజుకు రెండు సినిమాలు షికార్లతో బిజీబిజీగా ఉంటూ జీవితాన్నంతా ఆనందమయం చేసుకోవాలనుకున్న ఓ యువకుడు విజయవాడలో ఉండేవాడు. జీవితాన్నంతా పరిపూర్ణంగా ఆస్వాదించాలన్న లక్ష్యంతో ఏది చేయాడానికైనా సిద్ధపడ్డాడు. ప్రతి రాత్రి రెండు దాటాకా ఇంటికి వెళ్ళడం, మానసిక ప్రశాంతత కోసం తనకు తోచినవన్నీ చేసెయ్యడం. ఎందులో వెదకినా ఏదో వెలితి, ఇంకా ఏదో కావాలన్న తపన, నేనేదో మిస్సవుతున్నానన్న భావన తనను కృంగదీయడం ప్రారంభించాయి. మానసిక ఉల్లాసం కోసం తప్పుడు మార్గాల్లో తిరిగి జీవితం మీద నిరాసక్తిని పెంచుకొని ఒకరోజు ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి నదిలోనికి దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఇదే చివరిరోజు అని నిర్ణయించుకొని ఒక సాయంకాలం చావును ఎదుర్కోవడానికి వడివడిగా వెళ్తున్నప్పుడు యేసుక్రీస్తుకు సంబంధించిన శుభవార్త ఆయనకు అందింది. ‘ప్రయాసపడి భారం మోసుకొనుచున్న జనులారా! నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగచేతును’ అని క్రీస్తు ప్రభువు చెప్పిన మాటను కలిగియున్న పత్రిక అందింది. ఆ ఒక్కమాట తన జీవితాన్ని మార్చింది. ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం, ఎక్కడా దొరకని సంతృప్తి దేవునిలో దొరికింది. అదే అఖరిరోజుగా చేసుకోవాలనుకున్న ఆయన గతించిన నాలుగు దశాబ్దాలుగా దేవుని సేవలో కొనసాగుతున్నారు. ఆయనే మా తండ్రిగారైన విజయకుమార్‌గారు. ప్రపంచఖ్యాతిని ఆర్జించిన వర్జీనియా ఊల్ఫ్ గురించి తెలియని వారు లేరు. ఆమె రచనలు ఇప్పటికీ అనేకులను ప్రభావితం చేస్తూనే ఉంటాయి. బాల్యదినాల్లోనే అనేక సమస్యలు ఆమెను చుట్టుముట్టాయి. వర్జీనియా ఊల్ఫ్ ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. ఆరేళ్ళ వయస్సులో ఉన్న ఆమెను సవతి సోదరుడు అత్యాచారం చేశాడు. యవ్వనంలోనికి వచ్చేంతవరకు అది కొనసాగుతూనే ఉంది. పదమూడేళ్ళ వయస్సులో తల్లిని కోల్పోయింది. సమస్యల వలయంలో చిక్కుకొని ఏడుస్తూ ఉండేది. కొంతకాలానికి తండ్రిని కూడా కోల్పోయింది. మనుషులంటే విపరీతమైన భయం పుట్టుకొచ్చింది. తన మదిలో ఉన్న భయాలను పోగొట్టుకోవడానికి, మానసిక సంక్షోభం నుండి బయటపడడానికి రాయడం ప్రారంభించింది. ఆమె రచనలు విప్లవాత్మకంగా ఉండేవి. కొందరు వాటిని అంగీకరించకపోయినా తాను రాసే అలవాటును మానుకోలేదు. మానసిక వ్యధను తగ్గించుకొనేందుకు 1917వ సంవత్సరములో హోగార్త్ ప్రెస్‌ను ప్రారంభించింది. ‘ది వోయేజ్ ఔట్, నైట్ అండ్ డే, మండే ఆర్ ట్యూస్డే, మిసెస్ డాలోవె’లాంటి రచనలు చేసింది. అయితే ఇవేవీ ఆమెకు సాయపడలేదు. తన మనోవ్యధను తగ్గించలేదు. విజయవంతమైన ఆమె రచనలు, వాటి ద్వారా ఆమె సంపాదించిన కీర్తి ఏమీ ఆమెకు ఇసుమంతైనా సహాయం చేయలేదు. నిరంతరం తనను వెంటాడుతున్న తన వ్యథను, అశాంతిని జయించలేక తనను ప్రేమించి తన కష్టసుఖాలను పంచుకున్న భర్తకు ఓ చిన్న లేఖ రాసి తన ఇంటి సమీపంలో ఉన్న నదివద్దకు వెళ్ళి తన జేబుల నిండా రాళ్ళు నింపుకొని ఆ నదిలోనికి మెల్లగా నడిచివెళ్ళి మునిగిపోయి తన జీవితాన్ని ముగించుకుంది. ఇలాంటి విషాదాలు ఎన్ని లేవు చరిత్రలో! ఎందుకు మనిషి తన మరణాన్ని తానే శాసించుకుంటున్నాడు? బలవన్మరణానికి పాల్పడుతున్నాడు? కారణం శాంతి సమాధానాలు లేక. దేవుడు శాంతికర్త. తన శరణుజొచ్చినవారికి శాంతి సమాధానాలను ఉచితంగా అనుగ్రహించగలిగే సమర్థుడు. ‘హాయి లోకమా! ప్రభువచ్చెన్ అంగీకరించుమీ. పాపాత్ములెల్ల యేసునున్ కీర్తించి పాడుడీ. హాయి రక్షకుండు ఏలును. సాతాను రాజ్యమున్ నశింపచేసి మా యేసే జయంబు నొందును’ అంటూ ఓ అద్భుతమైన పాటను రచించాడు ఐజక్ వాట్స్ అనే దేవుని సేవకుడు. యేసుక్రీస్తు ప్రభువు తన చెంతకు చేరినవారికి అనుగ్రహించే ఆశీర్వాదాలను చాలా చక్కగా పాటలో వర్ణించాడు. ‘పాప దుఃఖంబులెల్లను నివృత్తిచేయును. రక్షణ సుఖ క్షేమముల్ సదా వ్యాపించును’. అవును మనిషి చేస్తున్న పాపమే మనిషిని దుఃఖసాగరంలో ముంచుతుంది. ఆజ్ఞాతిక్రమణమే పాపమని బైబిల్ సెలవిస్తుంది. సర్వశక్తుడైన దేవుడు సకల చరాచర సృష్టిని తన సంకల్పంతో కలుగచేశాడు గనుక ప్రతి మానవుడు ఎలా జీవించాలన్నది కూడా దేవుడే సంకల్పించాడు. ఆ చిత్తానికి, ఆ సంకల్పానికి ఎదురొడ్డి నిలబడడమే పాపమంటే. పాపానికి బానిసైన మానవుడు దేవున్ని చూడలేకపోతున్నాడు, చేరలేకపోతున్నాడు. దేవుడు పరమ పవిత్రుడు. పరిశుద్ధమైన తన రాజ్యంలోనికి పాపముతో నింపబడిన మానవుడు ప్రవేశించడం అసాధ్యం. పాపం మనిషిని దేవునికి దూరం చేయుటయే గాక అశాంతి కూపంలోనికి నెట్టివేసింది. భయంకరమైన పాప జీవితం నుంచి మానవుడు విడుదల పొందినప్పుడే దేవుని ప్రసన్నతను అనుభవించగలడు, అనిర్వచనీయమైన శాంతి సమాధానాలను పొందుకొనగలడు. పవిత్రుడు నిర్దోషి నిష్కల్మషుడైన దేవుడు మనుష్యాకారంలో ఈ లోకానికి దిగివచ్చి తన పవిత్రమైన రక్తాన్ని చిందించుట ద్వారా సర్వలోకానికి రక్షణ ప్రసాదించాడు. ఎవరైతే విశ్వాసంతో ఈ సత్యాన్ని హృదయంలో విశ్వసించి యేసు రక్షకుడని ఒప్పుకుంటారో వారందరూ రక్షింపబడతారు. పాపక్షమాపణ ఉచితంగా పొందుకుంటారు. పాపం ఎప్పుడైతే క్షమించబడిందో అప్పుడు శాంతి సమాధానాలు మనిషి వశమౌతాయి. యేసుక్రీస్తు కాపరిగా వ్యవహరిస్తాడని మీకా ప్రవచించాడు. ‘ఆయన నిలిచి, తన మందను మేపును’ (మీకా 5:4). యేసుక్రీస్తు ఒక కాపరి తన గొర్రెలను ఎలా సంరక్షిస్తాడో అలాగో తన ప్రజలను సంరక్షిస్తాడని తన ప్రవచనాలలో తెలిపాడు. యేసుక్రీస్తు ప్రభువు తాను ఎందుకీ లోకానికి వచ్చారో యోహాను సువార్త 10వ అధ్యాయంలో చాలా స్పష్టంగా వివరించాడు. ‘నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. తప్పిపోయి నశించిన వారిని వెదకి రక్షించడానికి ప్రభువు ఈ లోకానికి ఏతెంచాడు. ప్రవక్తయైన మీకా ద్వారా ఆత్మ పలికిన మాటలన్నీ చరిత్రలో నెరవేర్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు బేత్లెహేములో జన్మించినది ప్రవచన నెరువేర్పు కొరకు.’ రెండవదిగా క్రీస్తు బేత్లెహేములో జన్మించింది వాగ్దాన నెరవేర్పు కొరకు. ప్రభువు దావీదునకు గొప్ప వాగ్దానం అనుగ్రహించాడు. ‘నేను ఏర్పరచుకునిన వానితో నిబంధన చేసియున్నాను. నిత్యము నీ సంతానము స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనము స్థాపించెదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసియున్నాను’ (కీర్త 89:3,4). దావీదుకు చేయబడిన వాగ్దానమిది. దావీదు ఇశ్రాయేలు దేశాన్ని పాలించిన తరువాత సొలొమోను అతని బదులుగా రాజైనాడు. నలభై సంవత్సరాలు సొలొమోను పాలన తర్వాత రాజ్యము రెండుగా విడిపోయింది. యూదా రాజ్యమును రెహబాము, ఇశ్రాయేలు రాజ్యమునకు యరొబాడు రాజులైనారు. కొంతకాలానికి ఇశ్రాయేలు రాజ్యము అష్షూరు చెరలోకి వెళ్ళిపోయింది. మరికొంతకాలానికి యూదా రాజ్యము బబులోను చెరలోకి వెళ్ళిపోయింది. దావీదుకు చేయబడిన వాగ్దానం సంగతి ఏది? వాగ్దానం చేసిన దేవుడు ఆ వాగ్దానాన్ని మరచిపోతాడా? వాగ్దానాన్ని నిరర్థకం చేశాడా? అని కొందరు అనుకొని ఉండవచ్చు. కాని తగిన సమయంలో దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు వాగ్దానాలను నెరవేర్చువాడు. దేవుని వాగ్దానాలన్నీ యేసుక్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నాయి. దావీదు సింహాసనమును స్థిరపరుస్తానని దేవుడు ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చడానికి యేసుక్రీస్తు దావీదు వంశములో దావీదు పట్టణంలో జన్మించాడు. ఎంత గొప్ప ప్రేమ! ఆకాశం, భూమి గతించినను దేవుని మాటలు ఎన్నడూ గతించవు. యోసేపు దావీదు వంశములోను, గోత్రములోను పుట్టినవాడు గనుక ‘తనకు భార్యగా ప్రధానం చేయబడి, గర్భవతై యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదాలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను’ (లూకా2:4,5). ‘దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టియున్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు’ (లూకా 2:11). ‘యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున దేవుని కుమారునిగాను ప్రభావంతో నిరూపించబడెను’ (రోమా 1:27). మనుష్యులు చాలామంది చాలా రకాలైన వాగ్దానాలు చేస్తారు. కాని వాటిని నిలబెట్టుకొనే సమయానికి తప్పించుకొని తిరుగుతుంటారు. కొందరు రాజకీయవేత్తలు అధికారం కోసం వాగ్దానాలు చేస్తారు. తర్వాతి కాలంలో వాటిని నెరవేర్చకుండానే గతించిపోతారు. దేవుడు అలాంటివాడు కాడు. తన ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చాడు. కల్దీయ దేశాన్ని విడచి నేను చూపించు దేశానికి వెళ్తే అబ్రహామును దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ‘నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు’ అని ప్రభువు పలికాడు. ఏ లోటు లేకుండా దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. నూరేళ్ళ ప్రాయంలో వాగ్దాన పుత్రుని అనుగ్రహించి తన వాగ్దానాన్ని నెరవేర్చాడు. మూడవదిగా మనుష్యులందరికి అందుబాటులో ఉండులాగున యేసుక్రీస్తు బేత్లెహేములో జన్మించారు. భూ ఉపరితల రూపాలు, లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని టోపోగ్రఫీ అంటారు. టోపోగ్రఫీ ప్రకారం ఈ భూమ్మీద మానవుడు నివసిస్తున్న దేశాలు, స్థలాకృతిని అధ్యయనం చేసినప్పుడు యేసుక్రీస్తు జన్మించి, సంచరించి, మరణించి మరియు పునరుత్థానుడై లేచిన ఇశ్రాయేలు దేశం భూమికి మధ్య ప్రాంతంగా గుర్తించారు. ఆయన భారతదేశంలోనో లేక మరే ఇతర పెద్ద దేశంలోనో జన్మిస్తే బాగుంటుందని అనేకులకు అనిపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన స్థలం ఈ ప్రపంచానికి మధ్య ప్రాంతం. ఆయన అందరివాడు గనుక భూమికి మధ్య ప్రాంతంలో పుట్టాడనడంలో అతిశయోక్తి లేదు. ఒక దీపం అందరికీ వెలుగునిచ్చేలా పెట్టాలంటే అది అందరికీ మధ్యలో ఉంచాలి. అప్పుడే ఆ వెలుగు అన్నివైపులా సమానంగా ప్రసరిస్తుంది. ‘వెలుగైయున్న దేవుడు ప్రతిఒక్కరికీ అందుబాటులో ఉండులాగున ఆయన ఈ భూమికి మధ్యస్థానంలో జన్మించారు’. ఈ విషయాన్ని యెషయా గ్రంథంలో కూడా రాయబడడం గమనార్హం. ‘ఆ దినమున ప్రజలకు ధ్వజముగా నిలుచుచుండు యెషయి వేరు చిగురునొద్ద జనములు విచారణ చేయును’ (యెషయా 11:10). ‘జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలువబెట్టును. భ్రష్టులైపోయిన ఇశ్రాయేలీయులను పోగుచేయుము. భూమి నాలుగు దిగంతముల నుండి చెదరిపోయిన యూదావారిని సమకూర్చుము’ (యెషయా 11:12). ప్రవచనాలు క్షుణ్ణంగా పరిశీలిస్తే యెష్షయి వేరు చిగురు అనగా యేసుక్రీస్తు. ఆయననే ధ్వజముగా వర్ణించాడు. ఆ ధ్వజము నలుదిక్కుల నుండి ప్రజలను ఆకర్షిస్తుంది. ప్రపంచంలోని ప్రతి జాతి, ప్రతి ప్రాంతం యేసుక్రీస్తుకు పాదాక్రాంతమై విరాజిల్లుతుంది. బేత్లెహేము అనగా రొట్టెల గృహమని అర్థం. జీవపు రొట్టె అయిన ప్రభువు ఆ ప్రాంతమును ఎన్నుకోవడం అర్థరహితం కాదుకదా? ప్రభువు జన్మించినప్పుడు ఆయన్ను మొదటిగా దర్శించుకున్నది ఎవరు? దానికి సమాధానం గొర్రెల కాపరులు. అతి సామాన్యమైన ప్రజలు. అటువంటివారికి రక్షకుని ఆగమన వార్త మొదట తెలిసింది. దేవుని ప్రేమ అభాగ్యుల పట్ల, దీన దరిద్రుల పట్ల ఎంత అధికంగా ఉంటుందో తెలుసుకోవడానికి ఆ సంఘటన ఓ నిదర్శనం. బేత్లెహేము పొలాల్లో వారు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు భయపడ్డారు. అయితే ఆ దూత ‘భయపడకుడి. ఇదిగో ప్రజలందరికి కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నా’నని చెప్పి రక్షకుని ఆగమనాన్ని గూర్చి ప్రకటించింది. సువార్తికుడును వైద్యుడైన లూకా తెలిపిన ప్రకారం గొర్రెల కాపరులు చీకటిలో ఉన్నారు. భయంతో జీవిస్తున్నారు. అటువంటి దుర్భర పరిస్థితులలో ఉన్నవారిని లోకంలో ఉన్నవారెవరూ పట్టించుకోరు. కాని సృష్టికర్తయైన దేవుడు వారికి తన సందేశాన్ని పంపాడు. ఇకపై వారు దేనికి భయపడనక్కరలేదని చెప్పాడు. వారి కోసం రక్షకుడొచ్చాడు గనుక వారు ధైర్యంగా బ్రతకొచ్చు. వారికొక ఆనవాలు ఇయ్యబడింది. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియుండుట మీరు చూచెదరు. లోకరక్షకుడు పశువుల తొట్టెలో పుట్టడం ఆశ్చర్యమే. అవును అది నిజంగా అబ్బురమే. పశుల తొట్టెలో పరుండియున్న క్రీస్తు ప్రభువును గొర్రెల కాపరులే మొదట దర్శించుకున్నారు. హేరోదు అంతఃపురంలోనో మరో సంపన్న స్థలంలోనే క్రీస్తు ప్రభువు జన్మించియుంటే వారికి ఆ దర్శన భాగ్యం దొరికేది కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. దీనులను ఆయన రక్షణతో అలంకరిస్తాడు. ఆయన్ను చూడాలనే ఆశ ఉంటే చాలు తన్ను తాను ప్రత్యక్షపరచుకొనుటకు దేవుడు ఎప్పుడూ సంసిద్ధుడే! ప్రస్తుతకాలంలో బేత్లెహేము వెళ్తే యేసు పుట్టిన ప్రాంతంలో ఒక దేవాలయం ఉంది. దానిని చర్చ్ ఆఫ్ నేటివిటీ అంటారు. ప్రతి యేటా కోట్లాదిమంది ఆ దేవాలయాన్ని దర్శించి దానిలోపల క్రీస్తు పుట్టిన స్థలాన్ని చూసి ఆనంద పరవశంతో నిండిపోతారు. కాన్స్టాంటైన్ ద గ్రేట్ తల్లియైన సెయింట్ హెలెనా క్రీస్తు శకం 325లో యెరూషలేమును, బేత్లెహేమును దర్శించింది. ఆమె వెళ్లిన తరువాత బేత్లెహేములో చర్చి నిర్మాణ పనులు ప్రారంభించబడ్డాయి. ఆ తదుపరి 339వ సంవత్సరం మే 31న దేవాలయం ప్రజల సందర్శనార్థం అందుబాటులోనికి వచ్చింది. ఆ తర్వాత సమరయుల తిరుగుబాటు సమయంలో చర్చి అగ్నిప్రమాదంలో పాక్షికంగా ధ్వంసమైంది. బహుశా క్రీస్తు శకం 529లో బైజాంటైన్ చక్రవర్తి జస్టినియన్ ద్వారా మరలా నిర్మించబడింది. ఈ దేవాలయానికి గొప్ప చరిత్ర ఉంది. విశాలమైన స్థలంలో నిర్మించబడిన ఈ గొప్ప దేవాలయానికి ఒకే ఒక ప్రవేశ ద్వారం ఉంటుంది. సుమారుగా ఇరవైఐదు అడుగుల పొడవున్న ఈ చర్చికి కేవలం నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ప్రవేశ ద్వారం ఉంది. ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే ‘ఎవ్వరైనా క్రీస్తు ప్రభువు పుట్టిన స్థలాన్ని దర్శించాలనుకుంటే తలవంచి అహంకారాన్ని విడిచి నమస్కరించుకొంటూ లోపలికి ప్రవేశించాలి. దేవునిముందు నిలబడడానికి అహంకారం ఉపయోగపడదు దీనత్వం మాత్రమే ఉపకరిస్తుంది. నాలుగవదిగా బేత్లెహేములో రిక్తునిగా యేసుక్రీస్తు జన్మించుట ద్వారా తన ప్రేమను వ్యక్తీకరించాడు. దేవుని ప్రేమ వర్ణనకు అందనిది. ‘దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచువాడు నశింపక నిత్యజీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను’ (యోహాను 3:16). నిత్యజీవితంలో ప్రతి మనిషిలోనూ కొన్నివందల రకాల భావోద్వేగాలు ఉంటాయి. వాటిని సంతోషం, ప్రేమ, ఆశ్చర్యం, ఆవేశం, దుఃఖం, భయం, అసహ్యం మొదలైనవిగా విభజించవచ్చు. చిరాకు, కోపం, నిరాకరణ ఇవన్నీ ఆవేశాన్ని ప్రతిబింబించే చర్యలైతే విశ్రాంతి, సంతృప్తి, ఆనందం అనేవి సంతోషానికి సంబంధించినవి. అయితే వీటన్నింటిలో మనకు ఎక్కువగా వినిపించేది, అనిపించేది ప్రేమ. పవిత్రమైన ఈ పదం ఈ రోజులలో చాలా ప్రమాదకరంగా మారిపోయింది. నేటి యువతకు ప్రేమ అనే మాటకు సరైన అర్థం తెలియడం లేదు. సినిమాలలో, సీరియల్స్లలో చూపిస్తున్న కొన్ని కథలను ప్రేమ అనుకోవడం సహజం అయిపోయింది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆకర్షణను, వ్యామోహాన్నే ప్రేమగా చిత్రీకరిస్తున్నారు. ప్రేమ పేరిట అనేక మోసాలు, వంచనలు, నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే ప్రేమకు నిర్వచనం ఏమిటి? ఎవరు దానిని నిర్వచించారు? అని మానవుడు ఆలోచించగలిగితే పరమార్థాన్ని చేరుకుంటాడు. ప్రేమకు నిర్వచనాలు ఎవరెన్ని విధాలుగా చెప్పినా ఒకటి మాత్రం ఆలోచించదగినది. ఆచరణీయమైనది కూడా. ప్రేమ అంటే ఇతరులను బలి తీసుకోవడం కాదు, ఇతరుల కోసం బలైపోవడం అని నిరూపించాడు యేసుక్రీస్తు. ఈ అద్భుత సత్యాన్ని ఎవరైతే తమ జీవితంలో హృదయపూర్వకంగా గ్రహిస్తారో వారి జీవితం ఆనందమయం అవుతుంది. ఆదర్శప్రాయమవుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రేమను గూర్చి అనేక మాటలు రాయబడ్డాయి. ‘దేవుడు ప్రేమాస్వరూపి! దేవుడు తన ప్రేమను వెల్లడిపరచాడు. తానే మొదట మనలను ప్రేమించాడు’లాంటి మాటలన్నీ దేవుని ప్రేమ ఔన్నత్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించేవే. ప్రేమిస్తున్నానని చెప్పుట మాత్రమే గాక ప్రేమను ఋజువు చేసిన ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. క్రిస్మస్ ఆచరించడమంటే ఎవరికి వారు ఆనందించడం కాదు. అనేకులకు ఆనందం పంచడం. కష్టాల్లో ఇబ్బందుల్లో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించి, వారికి మనస్ఫూర్తిగా సహాయపడడం. త్యాగాన్ని ప్రేమను వేరువేరుగా మనం చూడలేము. నిరాశ, నిస్పృహలో ఉన్నవారిని భుజంతట్టి ప్రోత్సహించడం చేయగలిగితే క్రిస్మస్కు నిజమైన అర్థం ఉంటుంది. సుప్రసిద్ధ క్రైస్తవ పాటల రచయిత చెట్టి భానుమూర్తి రాసిన అద్భుతమైన క్రిస్మస్ పాట దేవుని ప్రజల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ‘రారే చూతము రాజసుతుడీ రేయి జననమాయెను. రాజులకు రారాజు మెస్సీయా రాజితంబగు తేజమదిగో. దూత గణములన్ దేరి చూడరే దైవవాక్కులన్ దెల్పగా. దేవుడే మన దీనరూపున ధరణి కరిగెనీ దినమున’ ‘సాక్షి’ పాఠకులకు క్రిస్మస్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. -డా.జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
Winter: వేడినీటి బుగ్గల్లో స్నానాలు.. ముల్లంగి, తామరతూళ్లు తింటే..!
Funday Cover Story- Worldwide Winter Festivals: శీతకాలం చిరుచలితో మొదలై, గజగజ వణికించే స్థాయికి చేరుతుంది. చలిపంజా దెబ్బకు జనాలు రాత్రివేళ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టేందుకే వెనుకాడుతారు. శీతకాలం రాగానే, అప్పటివరకు అలమరాల అట్టడుగున పడివున్న చలిదుస్తులు ఒంటిమీదకు వస్తాయి. వీథుల్లో చలిమంటల సందడి మొదలవుతుంది. చలితీవ్రత పెరిగే కొద్ది, మనుషులకు వణుకూ పెరుగుతుంది. చలిలో ఆరుబయటకు వచ్చేవాళ్లు ఒద్దికగా చేతులు కట్టుకుని చలిని కాచుకుంటారు. చలికాలంలో కొన్నిచోట్ల తెరిపిలేని హిమపాతంతో నేలంతా మంచుతో నిండిపోతుంది. శీతకాలం మొదలయ్యే వేళ దీపావళి, శీతకాలం తారస్థాయిలో ఉండేటప్పుడు మకరసంక్రాంతి వేడుకలను మనం జరుపుకొంటాం. శీతకాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రజలు వారి వారి సంప్రదాయ వేడుకలను జరుపుకొంటారు. వ్యవసాయ పనులు ముగిసి, కాస్త తీరిక దొరికే కాలం కావడంతో సంబరాలు చేసుకుంటారు. కాలానికి తగినట్లుగా ప్రత్యేకమైన వంటకాలను ఆగరిస్తారు. ఆరుబయటకు చేరి ఆట పాటలతో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వివిధ దేశాల్లో జరుపుకొనే శీతకాల సంబరాలను, వాటి విశేషాలను తెలుసుకుందాం... షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్ స్కాట్లాండ్లోని షెట్లాండ్ ప్రాంతంలో క్రిస్మస్ వేడుకలు ముగిసినప్పటి నుంచి మూడునెలల వరకు సుదీర్ఘంగా కొనసాగే చలిమంటల వేడుక ‘షెట్లాండ్ వైకింగ్ ఫెస్టివల్’. స్థానికంగా ఈ వేడుకలను ‘అప్ హెలీ ఆ’ అంటారు. షెట్లాండ్ రాజధాని లెర్విక్లో ఈ వేడుకల్లో భాగంగా జనవరి మూడో మంగళవారం రోజున జనాల ఆట పాటలతో వాద్యాల హోరుతో భారీ ఊరేగింపు జరుగుతుంది. వైకింగ్‌ల పొడవాటి పడవలను అనుకరిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులు ధరించి, మేళతాళాలతో ఈ ఊరేగింపులో పాల్గొంటారు. తొలినాళ్లలో తారుపీపాలకు నిప్పుపెట్టి స్లెడ్జిబళ్ల మీద మంచునిండిన వీథుల్లోకి లాక్కొచ్చేవారు. ఇటీవలికాలంలో తారుపీపాలకు నిప్పుపెట్టడం వంటి పనులు మానేసి, ఎక్కడికక్కడ చలిమంటలు వేసుకుని, వేడుకలు జరుపుకొంటున్నారు. వెనిస్ కార్నివాల్ ఇటలీలోని వెనిస్ నగరంలో శీతకాలం ముగుస్తూ ఉండే సమయంలో జరిగే ఉత్సవం ఇది. క్రైస్తవుల ఉపవాస దినాలైన ‘లెంట్’ రోజుల్లోని ‘యాష్ వెన్స్డే’ నుంచి మొదలయ్యే వెనిస్ కార్నివాల్ ‘ష్రోవ్ ట్యూస్డే’ వరకు మూడువారాల పాటు జరిగే ఈ వేడుకల్లో భారీ ఎత్తున జనాలు పాల్గొంటారు. దేశ విదేశాల నుంచి సుమారు ముప్పయి లక్షలకు పైగా జనాలు వెనిస్ వీథుల్లో జరిగే ఊరేగింపుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో రకరకాల మాస్కులు ధరించి తిరుగుతూ సందడి చేస్తారు. ఈ వేడుకల్లో భాగంగా వెనిస్ కూడళ్లలో ఏర్పాటు చేసే బహిరంగ వేదికలపై సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు నిర్వహిస్తారు. ముఖాలకు మాస్కులు ధరించడాన్ని రోమన్ చక్రవర్తి 1797లో నిషేధించడంతో చాలాకాలం ఈ వేడుకలు కనుమరుగయ్యాయి. ఇటలీ ప్రభుత్వం సాంస్కృతిక పునరుద్ధరణలో భాగంగా 1979 నుంచి పునఃప్రారంభించడంతో వెనిస్ కార్నివాల్ అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది. లా ఫాలాస్ వాలెన్షియా స్పెయిన్‌లోని వాలెన్షియా నగరంలోను, చుట్టుపక్కల పట్టణాలు, గ్రామాల్లోను ఈ వేడుకలు ఏటా మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. ఈ వేడుకల్లో మార్చి 15 నుంచి 19 వరకు ఐదురోజుల పాటు సెయింట్ జోసెఫ్ స్మారకార్థం ప్రత్యేక ప్రార్థన కార్యక్రమాలను నిర్వహిస్తారు. వీథుల్లో చలిమంటలను వెలిగించి ఆటపాటలతో జనాలు కాలక్షేపం చేస్తారు. మార్చిలో శీతకాల సంబరాలేమిటా అనుకోకండి. అక్కడ మార్చిలోనూ మంచు కురుస్తూనే ఉంటుంది. చలిమంటల ముందు సేదదీరుతూ విందు వినోదాలు, గానా భజానాలతో జనం ఉల్లాసంగా గడుపుతారు. ఈ రోజుల్లో ప్రత్యేకంగా తయారు చేసే బిర్యానీ మాదిరి ‘ప్యేలా’ అనే వంటకాన్ని సామూహిక విందుల్లో వడ్డిస్తారు. దీని తయారీలో బియ్యం, మేక, గొర్రె, కుందేలు, కోడి, చేపలు, ప్రత్యేక సుగంధ ద్రవ్యాలను ఉపయోగిస్తారు. లా ఫాలెస్ వాలెన్షియాను ‘యునెస్కో’ వారసత్వ వేడుకగా గుర్తించింది. నయాగరా వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ నయాగరా జలపాతం మామూలుగా చూస్తేనే కళ్లకు మిరుమిట్లు గొలుపుతుంది. ఇక శీతకాలంలో రాత్రివేళ ఈ జలపాతం వద్ద ఆరుబయట చేసే విద్యుద్దీపాలంకరణలు చూస్తే, రంగు రంగుల నక్షత్రాలు కళ్లముందే కదలాడినట్లుంటుంది. నయాగరా జలపాతం వద్ద కెనడాలో ఏటా శీతకాలం పొడవునా ‘వింటర్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్’ వేడుకలను దేదీప్యమానంగా నిర్వహిస్తారు. ఈసారి నవంబర్ 12న మొదలైన ఈ వేడుకలు ఫిబ్రవరి 20 వరకు కొనసాగనున్నాయి. విద్యుద్దీప కాంతుల వెలుగులో ధగధగలాడే నయాగరా అందాన్ని తిలకించేందుకు పెద్దసంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పలు వినోద కార్యక్రమాలు, బాణసంచా ప్రదర్శనలు కూడా జరుగుతాయి. హార్బిన్ ఐస్ అండ్ స్నో స్కల్ప్చర్ ఫెస్టివల్ చైనాలో ఏటా శీతకాలంలో జరిగే అంతర్జాతీయ హిమశిల్పకళా వేడుకలు ఇవి. హీలోంగ్జియాంగ్ ప్రావిన్స్‌లోని హార్బిన్ నగరంలో జరిగే ఈ వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి దాదాపు రెండుకోట్ల మంది వరకు వస్తారు. ప్రపంచంలోనే అత్యంత భారీ హిమశిల్పాలు ఈ ఉత్సవాల్లో కొలువుదీరుతాయి. హార్బిన్ నగరంలోని కూడళ్లలోను, నగరం మీదుగా ప్రవహించే సోంఘువా నదీ తీరంలోను భారీ ఎత్తున హిమశిల్పాలను ఏర్పాటు చేస్తారు. సైబీరియా మీదుగా వీచే చలిగాలుల వల్ల సోంఘువా నదిలోని నీళ్లు గడ్డకట్టిపోతాయి. నదిలో నుంచి వెలికితీసిన భారీ మంచుదిమ్మలతోనే స్థానిక కళాకారులు శిల్పాలను చెక్కి, ప్రదర్శనకు ఉంచుతారు. చైనాలో ఈ వేడుకలు 1963 నుంచి జరుగుతూ వస్తున్నాయి. ఏటా డిసెంబర్ చివరి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగే ఈ వేడుకల ద్వారా చైనా ప్రభుత్వానికి పర్యాటక ఆదాయం దండిగానే లభిస్తుంది. టోజి మత్సురి జపాన్‌లో జరుపుకొనే శీతకాల వేడుకలు ‘టోజి మత్సురి’. ఈ వేడుకలనే ‘టోజిసాయి’ అని కూడా అంటారు. మంచు కురిసే ప్రాంతాల్లో ఆరుబయట గుడారాలు వేసుకుని, వాటి ముందు చలిమంటలు వేసుకుని, ఆటపాటలతో గడుపుతారు. ‘ఓన్సెన్’ అనే వేడినీటి బుగ్గల్లో స్నానాలు చేస్తారు. నిజానికి ఈ వేడినీటి బుగ్గల్లో ఏడాది పొడవునా స్నానాలు చేస్తుంటారు గాని, శీతకాలం తప్పనిసరిగా వీటిలో స్నానం చేయడం ఆరోగ్యకరమని జపానీయులు నమ్ముతారు. గతించిన పెద్దలను తలచుకుంటూ చెరువుల్లో దీపాలను విడిచిపెడతారు. శీతకాలంలో గుమ్మడి, క్యారెట్, ముల్లంగి, తామరతూళ్లు తినడం శుభప్రదమనే నమ్ముతారు. ముఖ్యంగా తామరతూళ్లతో తయారుచేసే రెన్కాన్ చిప్స్‌ను చిన్నాపెద్దా ఇష్టంగా తింటారు. రేక్జావిక్ వింటర్ లైట్స్ ఫెస్టివల్ ఐస్లాండ్లోని రేక్జావిక్ నగరంలో ఏటా శీతకాలంలో వింటర్ లైట్స్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. నగరంలోని చారిత్రిక కట్టడాలు, మ్యూజియమ్లు, పార్కులు, ఈతకొలనులు, మైదానాలు వంటివాటిని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నగరంలోని వేడినీటి బుగ్గలలో జనాలు ఈతలు కొడతారు. వేడుకలు జరిగేంత కాలం రాత్రివేళల్లో మ్యూజియమ్లన్నీ సందర్శకుల కోసం తెరిచే ఉంచుతారు. కూడళ్లలో ఏర్పాటు చేసే తాత్కాలిక వేదికలపైనా, నగరంలోని రంగస్థలాలపైన సంగీత, నృత్య, వినోద కార్యక్రమాలు కోలాహలంగా సాగుతాయి. హ్వాషియోన్ సాన్షియోనియో ఐస్ ఫెస్టివల్ దక్షిణ కొరియాలోని గాంగ్వన్ డో ప్రావిన్స్‌లో ఏటా శీతకాలంలో ఐస్ ఫెస్టివల్ వేడుకలు జరుగుతాయి. హ్వాషియోన్ నగరంలో గడ్డకట్టిన నదిపై రకరకాల క్రీడలు, వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. నది ఎగువ ప్రాంతంలోని సాన్షియోనియో వద్ద మంచుదిమ్మల మీద ఏర్పడిన రంధ్రాల గుండా చేపలను పట్టే పోటీలను నిర్వహిస్తారు. భారీస్థాయి మంచుశిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు కొరియన్ ప్రభుత్వం ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఏటా జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే ఈ వేడుకలు తిలకించేందుకు దేశ విదేశాల నుంచి 15 లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు. డ్రాగన్ కార్నివాల్ స్లోవేనియా రాజధాని ల్యూబ్లీయానలో ఏటా శీతకాలంలో జరిగే సంప్రదాయ వేడుక డ్రాగన్ కార్నివాల్. పురాతన పేగన్ సంస్కృతికి ఆనవాలుగా కొనసాగే ఈ వేడుకల్లో భారీ ఊరేగింపులు నిర్వహిస్తారు. వేలాది మంది చిత్రవిచిత్రమైన మాస్కులు, రంగు రంగుల దుస్తులు ధరించి పాల్గొంటారు. భారీసైజులోని ఆకుపచ్చని డ్రాగన్ బొమ్మను మోసుకుంటూ ఊరేగిస్తారు. సంప్రదాయ వాద్యపరికరాలను మోగిస్తూ, నాట్యం చేస్తూ నగర వీథుల్లో సందడి చేస్తారు. పదమూడో శతాబ్దిలో పేగన్, క్రైస్తవ సంస్కృతులు పరస్పరం కలగలసిపోయిన నాటి నుంచి డ్రాగన్ కార్నివాల్ జరుగుతూ వస్తోందని చెబుతారు. నలభైరోజుల లెంట్ ఉపవాస దినాలకు ముందుగా, జనవరి చివరి వారంలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సంబరాన్ని నిర్వహిస్తారు. కలోన్ వింటర్ కార్నివాల్ జర్మనీలోని కలోన్ నగరంలో ఏటా వింటర్ కార్నివాల్ వేడుకలు భారీ స్థాయిలో జరుగుతాయి. పదకొండో నెల పదకొండో తేదీన– అంటే, ఏటా నవంబర్ 11న ఉదయం 11.11 గంటల నుంచి ‘కార్నివాల్’ సీజన్ మొదలవుతుంది. వీథుల్లో చిత్రవిచిత్ర వేషధారణలతో నిర్వహించే ఊరేగింపులతో ఈ వేడుకలు జనవరి 6 వరకు కొనసాగుతాయి. ఈ రోజుల్లో ‘ఫ్యాట్ థర్స్డే’ నుంచి ‘యాష్ వెన్స్డే’ వరకు వారం రోజులను ‘క్రేజీ డేస్’ అంటారు. ఈ వారం రోజుల్లోనూ మరింత భారీ స్థాయిలో వేడుకలు జరుగుతాయి. పిల్లలూ పెద్దలూ వీథుల్లోకి చేరి, ఆటపాటలతో కాలక్షేపం చేస్తారు. వివిధ దేశాల నుంచి వచ్చే బ్యాండ్ బృందాలు, నృత్యబృందాలు ఊరేగింపుల్లో పాల్గొంటాయి. కలోన్ కార్నివాల్లో పాల్గొనేందుకు ముఖ్యంగా యూరోప్ నలుమూలల నుంచి జనాలు పెద్దసంఖ్యలో వస్తారు. సప్పోరో స్నో ఫెస్టివల్ జపాన్‌లోని సప్పోరో నగరంలో ఏటా ఫిబ్రవరిలో జరిగే వేడుక ఇది. మంచుగడ్డ కట్టే పరిస్థితుల్లో మంచుతో శిల్పాలను తీర్చిదిద్ది ప్రదర్శిస్తారు. ఈసారి 2023 ఫిబ్రవరి 4 నుంచి 11 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. సప్పోరో నగరంలోని ఓడోరి పార్క్, సుసుకినో, సుడోమ్ సహా పలు ప్రదేశాలు ఈ వేడుకల్లో హిమశిల్ప ప్రదర్శనలకు వేదికలుగా నిలుస్తాయి. ఓడోరి పార్క్‌లో హిమశిల్పాల పోటీలు కూడా జరుగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలలకు చెందిన కళాకారులు వందలాదిగా ఇక్కడకు వస్తుంటారు. సప్పోరో స్నో ఫెస్టివల్ 1950లో తొలిసారిగా ఒకరోజు కార్యక్రమంగా మొదలైంది. అప్పట్లో ఆరుగురు హైస్కూల్ విద్యార్థులు ఓడోరి పార్క్‌లో చేరి, మంచుతో శిల్పాలు మలచి సందర్శకులను ఆకట్టుకున్నారు. జపాన్ సైనిక దళాలు కూడా 1955 నుంచి ఈ వేడుకల్లో పాల్గొనడం ప్రారంభించడంతో ఇవి వారంరోజుల వేడుకలుగా మారాయి. అనతికాలంలోనే ఈ వేడుకలు అంతర్జాతీయ ప్రాచుర్యం పొందాయి. ఇక్కడి హిమశిల్పాలను తిలకించడానికి దేశవిదేశాల నుంచి ఏటా దాదాపు పాతిక లక్షల మంది వరకు పర్యాటకులు వస్తుంటారు. సెయింట్ పాల్ వింటర్ కార్నివాల్ అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్ర రాజధాని సెయింట్ పాల్లో ఏటా శీతకాలంలో భారీ కార్నివాల్ జరుగుతుంది. ఈ కార్నివాల్ వెనుక ఒక కథ ఉంది. న్యూయార్క్‌కు చెందిన ఒక పాత్రికేయుడు సెయింట్ పాల్‌ను ‘మరో సైబీరియా’గా పోలుస్తూ కథనం రాశాడు. శీతకాలంలో ఇక్కడ మనుషులు బతకలేరని అతను రాశాడు. ఈ కథనం స్థానికులకు కోపం తెప్పించింది. శీతకాలంలో కూడా సెయింట్ పాల్లో మనుషులు బతుకుతారని, అంతేకాదు, ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలూ జరుపుకొంటారని రుజువు చేసేందుకు 1885లో మాంట్రియల్ సరిహద్దుల్లో ఒక మంచుసౌధాన్ని నిర్మించి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు 1937 వరకు ఒక క్రమం లేకుండా జరుగుతూ వచ్చాయి. తిరిగి 1946 నుంచి ఏటా క్రమపద్ధతిలో నిర్వహించడం ప్రారంభమైంది. ఈ వేడుకల కోసం భారీ హిమసౌధాన్ని సిద్ధం చేస్తారు. వీథుల్లో పరేడ్లు, రాత్రివేళల్లో కాగడాల ఊరేగింపులు, సంగీత నృత్య కార్యక్రమాలు, హిమశిల్పాల తయారీ పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్యూబెక్ వింటర్ కార్నివాల్ కెనడాలోని క్యూబెక్ నగరంలో ఏటా ఫిబ్రవరిలో పదిరోజుల పాటు వింటర్ కార్నివాల్ జరుగుతుంది. ఈసారి ఫిబ్రవరి 3 నుంచి 12 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. క్యూబెక్‌లో 1893 నుంచి జరుగుతూ వస్తున్న ఈ కార్నివాల్లో పాల్గొనేందుకు కెనడా, అమెరికా, యూరోప్‌ల నుంచి పెద్దసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలో పగలూ రాత్రీ కూడా కోలాహలంగా ఊరేగింపులు జరుగుతాయి. వాద్యపరికరాలను మోగిస్తూ, విచిత్రవేషధారణలతో వేలాది మంది ఈ ఊరేగింపుల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మంచుశిల్పాల ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. Funday Cover Story: అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా? -
మనుషులకే కష్టాలు.. మానులకు కాదు! ఈ నాలుగు ప్రాక్టీస్ చేయండి చాలు!
Sakshi Funday Cover Story: కష్టాలు మనుషులకు కాకుండా.. మానులకొస్తాయా! ఓదార్పు కోసం పెద్దవాళ్లు చెప్పే సాధారణమైన మాటిది. నిజమే కానీ.. సమాజంలో ఒకరిద్దరికి కష్టాలొస్తే ఇలాంటి ఓదార్పు మాటలు ఉపయోగపడతాయి! కానీ.. వందలో 42 మందికి తాము కష్టాల్లోనే బతుకీడుస్తున్నట్లు అనిపిస్తే? ఆ దుఃఖంలోనే వారు కుంగి కృశించి పోతూంటే.. అప్పుడు ఆ కష్టాలకు పెట్టుకోవాల్సిన పేరు.. ఒత్తిడి. ఇంగ్లిష్‌లో చెప్పుకుంటే స్ట్రెస్! ప్రపంచ దేశాలన్నింటిలోనూ అతిసామన్యమైపోతున్న ఈ మానసిక సమస్య గురించి భారత్‌లో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. చాలామంది... పైన చెప్పుకున్నట్లు ఓదార్పు మాటలతోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే.. ఆందోళనకరమైన ఈ సమస్య ఆనుపానులు సులువుగా... సచిత్రంగా!!! సాధనం-1: గ్రౌండింగ్ గ్రౌండింగ్ అంటే మీతో మీరు కనెక్ట్ కావడం. అంటే.. మీ శరీరం, ఆలోచనలు, భావాలు, పరిసరాలతో కనెక్ట్ కావడం. మీరు భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోతున్నప్పుడు నెమ్మదిగా మీ పాదాలను నేలకు ఆనించండి. భూమితో కనెక్ట్ అవ్వండి. తర్వాత మీ దృష్టిని శ్వాసపై నిలపండి. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం వాసన, రుచి చూడగలరనే విషయాన్ని శ్రద్ధగా గమనించండి. అంటే మీరు మీ ఆలోచనల నుంచి దూరంగా జరిగి.. మీతో, మీ చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకం అవండి. గ్రౌండింగ్ అంటే సింపుల్‌గా ఇంతే. గ్రౌండింగ్‌ను ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేక సమయం అవసరంలేదు. ఒకటి రెండు నిమిషాలు చాలు. ప్రతిరోజూ మీరు తినడం, వంట చేయడం లేదా నిద్ర పోవడం వంటి పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆలోచనల నుంచి బయటపడి, ఒత్తిడికి దూరంగా ఆనందంగా మారడాన్ని గమనించవచ్చు. మొదట చిన్న చిన్న పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో గ్రౌండింగ్ ఉపయోగించడం సులభం అవుతుంది. సాధనం-2: అన్ హుకింగ్ అన్ హుకింగ్ అంటే మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచనల గాలం నుంచి తప్పించుకోవడం. మూడు దశల్లో ఆ పని చేయవచ్చు. మొదట మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచన లేదా ఫీలింగ్‌ను గుర్తించండి. తర్వాత దాన్ని ఉత్సుకతతో గమనించండి. ఆ తర్వాత ఆ ఆలోచనకు లేదా అనుభూతికి ఓ పేరు పెట్టండి. ఇలా ఆలోచనలను, అనుభూతులను దూరంగా ఉండి గమనించడం, వాటికో పేరు పెట్టడం వల్ల.. మీరు, మీ ఆలోచనలు ఒకటి కాదనే స్పృహæ కలుగుతుంది. అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరంగా పెడుతుంది. ఆ తర్వాత మీతో ఎవరున్నారో, మీరేం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి. సాధనం-3: విలువలపై స్పందించడం ప్రతి మనిషికీ కొన్ని విలువలుంటారు. మీకు అత్యంత ముఖ్యమైన విలువలేమిటో ఎంచుకోండి. ఉదాహరణకు ప్రేమ, పని, ధైర్యం, దయ, కష్టపడి పనిచేయడం.. ఇలా చాలా! వీటికి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా మీరు ముఖ్యమైన నాలుగైదు విలువలేమిటో నిర్ణయించుకోండి. వచ్చే వారమంతా మీ విలువలకు అనుగుణంగా పనిచేసే ఒక చిన్న మార్గాన్ని ఎంచుకోండి. మీ విలువలకు అనుగుణంగా జీవించండి. మీరు పాటించలేని విలువల గురించి ఒత్తిడికి గురికాకుండా, మార్చగలిగే వాటిని మార్చండి. మార్చలేని వాటిని వదిలేసి ముందుకు సాగండి. సాధనం-4: ప్రేమతో నింపుకోండి మీరు మీ పట్ల ప్రేమతో, దయతో ఉంటే ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఆ ప్రేమ, దయ ఆకాశం నుంచి ఊడిపడవు. మీరే ఊహించుకోవాలి, సృష్టించుకోవాలి. మీ మెదడుకు ఊహకు, వాస్తవానికీ ఉన్న తేడా తెలియదు. కాబట్టి మీరు జస్ట్ ఊహించుకున్నా చాలు దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అందుకే మీ దోసిటి నిండా ప్రేమ లేదా దయ ఉన్నట్లు ఊహించండి. దాన్ని ఏ ఆకారంలో ఊహించుకుంటారనేది మీ ఇష్టం. తర్వాత, మీ శరీరంలో బాధ అనిపించే చోట చేతులుంచండి. మీ చేతుల నుంచి శరీరంలోకి ప్రవహించే ప్రేమను, దాని వెచ్చదనాన్ని అనుభవించండి. ఆ ప్రేమ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. -
అత్యధిక దూరం వలసపోయే పక్షి ఏదో తెలుసా?
నీలాకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పిట్టలకు ఎల్లలుండవు. ఆకాశమే వాటి హద్దు. రెక్కల సత్తువకొద్ది ఎక్కడికంటే అక్కడకు హాయిగా ఎగిరిపోవడమే వాటికి తెలుసు. దారుల్లో తారసిల్లే తరులు గిరులు సాగరులను దాటి కోరుకున్న చోటుకు అవి రివ్వున చేరుకోగలవు. అప్పటి వరకు ఉంటున్న వాతావరణంలో కాస్త మార్పు కనిపించగానే, అనుకూల వాతావరణం ఉండే చోటును వెదుక్కుంటూ ఎంతదూరమైనా ఎగురుతూ పోవడమే వాటికి తెలుసు. వేల మైళ్లు ఎగురుతూ ప్రయాణిస్తూ, అనువైన చోటు దొరకగానే అక్కడ వెంటనే వాలిపోయి, కిలకిల రావాలతో సందడి చేస్తాయి. అక్కడ ఉండే జనాలకు కనువిందు చేస్తాయి. వలస వాటి జీవనశైలి. శీతాకాలం మొదలయ్యే తరుణంలో ఏటా ఠంచనుగా గుంపులు గుంపులుగా ఇక్కడకు వలస వస్తాయి. వేసవి మొదలవుతూనే తిరిగి తమ తమ నెలవులకు ఎగిరిపోతాయి. మన దేశానికి ఏటా వచ్చే వలస పక్షుల గురించి ఒక విహంగ వీక్షణం... మన దేశంలో వలస పక్షుల సీజన్ ఏటా సెప్టెంబర్ నెలాఖరు లేదా అక్టోబర్ మొదటి వారం నాటికి మొదలవుతుంది. సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరోప్ వంటి అత్యంత సుదూర ప్రాంతాలు సహా ఇరవై తొమ్మిది దేశాల నుంచి ఈ పక్షులు వేలాది కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి, ఇక్కడకు అతిథుల్లా వచ్చి వాలతాయి. వీటి రాకపోకల్లో ఏనాడూ క్రమం తప్పదు. మన దేశానికి 1,349 జాతులకు చెందిన లక్షలాది పక్షులు వస్తాయి. వీటిలో 212 పక్షిజాతులు ప్రమాదం అంచున ఉన్నట్లు పర్యావరణవేత్తలు ఇప్పటికే గుర్తించారు. వీటిని కాపాడుకోకుంటే, ఇవి త్వరలోనే అంతరించిపోయే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ఏటా మన దేశానికి వచ్చే పక్షులు ఇక్కడి సరోవర తీరాలను, తడి నేలలు గల ప్రదేశాలను తమ ఆవాసాలుగా ఎంచుకున్నాయి. ఇవి స్వయంగా ఎంపిక చేసుకున్న ప్రదేశాల్లో తప్ప మరెక్కడా వీటి సందడి కనిపించదు. అందుకే వలస పక్షులు చేరే ప్రదేశాల్లో ఏటా సీజన్లో పర్యాటకుల సందడి కూడా కనిపిస్తుంది. వలస పక్షుల ఆవాసాలలో వాటి రక్షణ కోసం ప్రభుత్వం అభయారణ్యాలను ఏర్పాటు చేసింది. వలసపక్షుల విడిది కేంద్రాలు మన దేశంలో ఏటా వలసపక్షులు విడిది చేసే ప్రదేశాలు చిన్నా చితకా కలుపుకొని దాదాపు ఇరవైకి పైగానే ఉన్నాయి. దేశంలోనే అతిపెద్ద పక్షుల అభయారణ్యం గుజరాత్లో ఉంది. అది నల సరోవర్ అభయారణ్యం. అహ్మదాబాద్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని నల సరోవర తీరంతో పాటు, చుట్టుపక్కల 120 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన తడినేలల్లోని చెట్టూ చేమలన్నీ ఈ సీజన్లో వలసపక్షుల రాకతో సందడిని సంతరించుకుంటాయి. గుజరాత్‌లోనే కచ్ ప్రాంతంలో ఉన్న గ్రేట్ ఇండియన్ బర్డ్ సాంక్చుయరీకి కూడా పెద్దసంఖ్యలో వలసపక్షులు వస్తుంటాయి. మన దేశంలో వలసపక్షులు చాలా విరివిగా కనిపించే ప్రదేశాల్లో ఒడిశాలోని చిలికా సరస్సు ముఖ్యమైనది. ఆసియాలోనే అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన చిలికా సరస్సు 1100 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. ఈ సరస్సు, దీనిలోని రెండు దీవులు, సరస్సు పరిసరాల్లోని తడినేలల్లో ఉండే చెట్టు చేమలన్నీ ఈ సీజన్లో వలస పక్షులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. గత ఏడాది దాదాపు పన్నెండు లక్షలకుపైగా వలస పక్షులు చిలికా తీరానికి చేరుకున్నాయి. ఒడిశాలోని కేంద్రపడా జిల్లా భితరకనికా జాతీయ అభయారణ్యానికి కూడా వలస పక్షులు పెద్దసంఖ్యలోనే వస్తుంటాయి. ఇక దేశంలోని రెండో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు అయిన పులికాట్ కూడా వలస పక్షులకు విడిది కేంద్రంగా ఉంటోంది. ఆంధ్రప్రదేశ్–తమిళనాడులలో విస్తరించిన ఈ సరస్సు విస్తీర్ణం 250–450 కిలోమీటర్ల వరకు ఉంటుంది. పులికాట్ సరస్సు, పరిసర ప్రాంతాలతో కలుపుకొని పులికాట్ సరస్సు పక్షుల అభయారణ్యం 759 చదరపు కిలోమీటర్లలో విస్తరించి, సీజన్లో వలస పక్షులతో కళకళలాడుతూ కనువిందు చేస్తుంది. దేశంలో వలస పక్షులు పెద్దసంఖ్యలో చేరుకునే ముఖ్యమైన విడిది కేంద్రాల్లో రాజస్థాన్‌లోని భరత్పూర్ పక్షుల అభయారణ్యం ఒకటి. ఇక్కడ సీజన్లో వలసపక్షులతో పాటు ఏడాది పొడవునా స్థానికంగా ఈ అభయారణ్యంలో సంచరించే కుందేళ్లు, జింకలు, కృష్ణజింకలు, దుప్పులు, ఎలుగుబంట్లు, పులులు, చిరుతపులులు, మనుబోతులు వంటి వన్యజంతువులు కూడా కనిపిస్తాయి. హర్యానాలోని సుల్తాన్పూర్ పక్షుల అభయారణ్యం, గోవాలోని సలీం అలీ పక్షుల అభయారణ్యం, కేరళలోని కుమారకోం పక్షుల అభయారణ్యం, తమిళనాడులోని వేదాంతంగళ్ పక్షుల అభయారణ్యం, ఆంధ్రప్రదేశ్‌లోని హార్స్లీ హిల్స్ సమీపంలోని కౌండిన్య పక్షుల అభయారణ్యం, కొల్లేరు సరస్సు వద్ద ఉప్పలపాడు పక్షుల అభయారణ్యం.. మహారాష్ట్రలోని వడుజ్ పట్టణం వద్ద మాయానీ పక్షుల అభయారణ్యం, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ ప్రాంతంలోని చంద్రశేఖర్ ఆజాద్ పక్షుల అభయారణ్యం, రాయ్‌బరేలీ సమీపంలో సమస్పూర్ పక్షుల అభయారణ్యం, కేరళలోని తట్టెకడ్ పక్షుల అభయారణ్యం, కర్ణాటకలోని మాండ్య జిల్లాలో రంగతిట్టు అభయారణ్యం, పశ్చిమబెంగాల్లో కోల్‌కతా శివార్లలోని చింతామణి కర్ పక్షుల అభయారణ్యం తదితర ప్రాంతాల్లో ఏటా అక్టోబర్–మార్చి మధ్య కాలంలో వలస పక్షుల సందడి కనిపిస్తుంది. రంగు రంగుల్లో కనిపించే అరుదైన పక్షులను తిలకించడానికి దేశాల విదేశాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో ఈ అభయారణ్యాలకు వస్తుంటారు. ఇవే కాకుండా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా తేలుకుంచి, తేలినీలాపురం గ్రామాల పరిసర ప్రాంతాలకు కూడా వందలాదిగా వలసపక్షులు వస్తుంటాయి. రకరకాల పక్షులు... రంగురంగుల పక్షులు... సుదూర తీరాల నుంచి ఎగురుతూ మన దేశంలో విడిది చేయడానికి వచ్చే రకరకాల పక్షులు, రంగు రంగుల్లో కనిపిస్తూ కనువిందు చేస్తాయి. వీటిలో కొన్ని పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి. మరికొన్ని గుప్పిట్లో పట్టేంత చిన్నగా కూడా ఉంటాయి. వేలాది మైళ్లు దాటి అవి ఇక్కడకు చేరుకోవడమే ఒక ప్రకృతి విచిత్రం. వాటి స్వస్థలాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కట్టే పరిస్థితులు ఉండటం వల్ల అక్కడ అవి ఆ కాలంలో మనుగడ సాగించలేవు. అందుకే సమశీతల వాతావరణాన్ని వెదుక్కుంటూ అవి ఇక్కడకు చేరుకుంటాయి. మన దేశంలో వేసవి తీవ్రత ఎక్కువ కావడంతో వేసవి మొదలవుతూనే, ఇవి స్వస్థలాలకు తిరుగుముఖం పడతాయి. ఇక్కడ ఉన్నంతకాలం అనువైన చోట్ల గూళ్లు కట్టుకుంటాయి. గుడ్లు పెడతాయి. వాటిని పొదిగి పిల్లలను చేస్తాయి. పిల్లలకు రెక్కలొచ్చే నాటికి వాటి తిరుగుప్రయాణ కాలం మొదలవుతుంది. వలస పక్షుల రాకపోకలు సజావుగా సాగుతున్నాయంటే, ప్రకృతి సమతుల్యత బాగున్నట్లే! వీటిలో కొన్ని జాతుల పక్షుల మనుగడ ప్రమాదం అంచుకు చేరుకుంటూ ఉండటమే కొంత ఆందోళన కలిగించే అంశం. ‘ఎక్కువగా సరోవర తీరాలకు చేరుకునే వలస పక్షులకు, సరోవరాల పరిసరాల్లోని చిత్తడి నేలలే ప్రధాన ఆవాసాలు. చిత్తడి నేలల్లో ఎలాంటి మార్పులు వచ్చినా, ఇక్కడకు వచ్చే వలస పక్షులకు ఇబ్బందే! రకరకాల జాతులకు చెందిన కొంగలు, రకరకాల జాతులకు చెందిన బాతులు, రంగురంగుల రామచిలుకలు, గిజిగాళ్లు, మైనాలు, విదేశీ పావురాలు, రకరకాల గద్దలు, డేగలు, రాబందులు, ఎన్నో చిత్ర విచిత్రమైన చిన్నిచిన్ని పిట్టలు ఇక్కడకు సీజన్లో వలస వస్తుంటాయి. వాటిలో గేటర్ ఫ్లమింగో, లెస్సర్ ఫ్లమింగో, గ్రేట్ వైట్ పెలికాన్, కాస్పియన్ టెర్న్, యురేషియన్ బిట్టెర్న్, యురేషియన్ స్పూన్‌బిల్, బ్లాక్ క్రెస్టెడ్ బుల్బుల్, బ్లాక్ నేపెడ్ మోనార్క్, ఈజిప్షియన్ వల్చర్, ఎమరాల్డ్ డవ్, లాఫింగ్ డవ్, రాక్ డవ్, టఫ్టెడ్ డక్, ఇండియన్ స్పాట్ బిల్డ్ డక్.. లిటిల్ స్విఫ్ట్, వాటర్కాక్, ఆసియన్ ఓపెన్‌బిల్, గ్రేట్ ఎగ్రెట్, ఇంటర్మీడియట్ ఎగ్రెట్, కెంటిష్ ప్లవర్, గ్రేటర్ సాండ్ప్లవర్, రివర్ లాప్వింగ్, బ్రాడ్బిల్డ్ సాండ్‌పైపర్, గ్రేటర్ క్రెస్టెడ్ టెర్న్, లెస్సర్ క్రెస్టెడ్ టెర్న్, బ్లాక్వింగ్డ్ కైట్, బూటెడ్ ఈగిల్, అలెగ్జాండ్రిన్ పారాకీట్, రెడ్ రింగ్డ్ పారాకీట్, స్కార్లెట్ మినివెట్, మలార్డ్, గ్రీన్ బీ ఈటర్, హిమాలయన్ స్విఫ్ట్‌లెట్, పెయింటెడ్ స్టాక్, ప్లమ్హెడెడ్ పారాకీట్, పర్పుల్ హెరాన్, పర్పుల్స్వాంప్హెన్, రెడ్ క్రెస్టెడ్ పోచడ్ వంటి అరుదైన పక్షులు కూడా మన దేశంలోని వలసపక్షుల విడిది కేంద్రాల్లో ఈ సీజన్లో కనిపిస్తాయి. వీటిని ఫొటోలు తీసేందుకు, వీడియోలు తీసేందుకు దేశ విదేశాలకు చెందిన వన్యప్రాణి ఫొటోగ్రాఫర్లు, అరుదైన పక్షుల తీరుతెన్నులను, వాటి అలవాట్లను నిశితంగా అధ్యయనం చేసే విహంగ శాస్త్రవేత్తలు (ఆర్నిథాలజిస్టులు) కూడా ఈ ప్రాంతాలకు వస్తుంటారు. అడుగడుగునా ప్రమాదాలే... వలస పక్షులకు అడుగడుగునా ప్రమాదాలు ఎదురవుతుంటాయి. గుంపులు గుంపులుగా అవి వలస ప్రయాణంలో ఉన్నప్పుడు మార్గమధ్యంలో తలెత్తే తుపానుల వంటి ప్రకృతి వైపరీత్యాలు, వేటగాళ్ల ఉచ్చులు, విద్యుదుత్పాదన కోసం ఎత్తయిన ప్రదేశాల్లో అమర్చే గాలిమరలు, సముద్ర తీరాల్లోని ఆయిల్ రిగ్స్, అలవాటైన ఆవాసాలలో తడినేలల తరుగుదల వంటివి వలసపక్షులకు ప్రమాదకరంగా మారుతున్నాయి. వేటగాళ్లు వలలు, ఉచ్చులు మాత్రమే కాకుండా, వలసపక్షులు వాలే చెట్ట కొమ్మల మీద జిగురుపూసి, వాటిని కదలకుండా చేసి బంధించే పద్ధతులు కూడా అవలంబిస్తున్నారు. కొన్ని సంపన్న దేశాల్లో అడవిపక్షుల మాంసానికి గిరాకీ ఉండటంతో ఇక్కడ పట్టుకున్న పక్షులను విదేశాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాతావరణ మార్పులు ఒకవైపు, వేటగాళ్ల దారుణాలు మరోవైపు వలసపక్షుల మనుగడకు పెనుముప్పు కలిగిస్తున్నాయి. వలసపక్షుల ఆవాసాలలోని పొలాలు, తోటల్లో వాడే పురుగుమందులు, రసాయనాలు కూడా వాటి ప్రాణాలను హరిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా డీడీటీ వినియోగం విపరీతంగా ఉండేది. డీడీటీ దెబ్బకు కోట్లాదిగా పక్షులు మరణించాయి. మన దేశంలో 1972లో డీడీటీ వినియోగాన్ని నిషేధించారు. డీడీటీని నిషేధించినా, మరికొన్ని రకాల పురుగుమందుల వినియోగం నేటికీ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే, నొప్పినివారణకు వాడే ‘డైక్లోఫెనాక్’ కూడా పక్షులకు ముప్పుగా మారుతోంది. మనుషులతో పాటు పశువైద్యంలోనూ ‘డైక్లోఫెనాక్’ ఇప్పటికీ వాడుతున్నారు. డైక్లోఫెనాక్ ఔషధానికి అలవాటుపడిన జంతువు మరణించాక, వాటి కళేబరాలను తినే రకరకాల రాబందులు, డేగలు, గద్దలు పెద్దసంఖ్యలో మరణిస్తున్నాయి. డైక్లోఫెనాక్ ఎక్కువగా వాడటం వల్ల జంతువులు కిడ్నీలు విఫలమై మరణిస్తున్నాయని, వాటి కళేబరాలు తినడం వల్ల రాబందులు, డేగలు వంటి పెద్ద పక్షులు మరణిస్తున్నాయని ముఖ్యంగా యూరోప్ నుంచి ఆగ్నేయాసియా ప్రాంతానికి వలసపోయే పెద్దపక్షులు దీనివల్ల ఎక్కువగా మరణిస్తున్నాయని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (ఈఎంఏ) దాదాపు దశాబ్దం కిందటే వెల్లడించింది. పట్టణీకరణ పెరగడంతో రాత్రిపగలు తేడా లేకుండా వీథుల్లో వెలిగే విద్యుద్దీపాల వెలుగులు కూడా వలసపక్షులకు ముప్పుగా మారుతున్నాయి. దీపాల కాంతి వల్ల ఈ పక్షులు గందరగోళంలో పడి, తమ ఆవాసాలవైపు వెళ్లలేక, దారీతెన్నూ లేక ఎగురుతూ అలసి సొలసి నేలకు రాలిపోతున్న ఉదంతాలు పెరుగుతున్నాయి. ఆకాశహర్మ్యాలలో అద్దాల గోడల వెనుక వెలిగే దీపాల ఆకర్షణలో చిక్కుకుని, అద్దాల గోడలను ఢీకొని నేలరాలిపోతున్న ఉదంతాలూ ఉంటున్నాయి. వాతావరణ మార్పులతోనూ సవాళ్లు ప్రపంచవ్యాప్తంగా తలెత్తుతున్న వాతావరణ మార్పులతోనూ వలసపక్షుల మనుగడకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. భూతాపం పెరుగుదల వల్ల రుతువుల రాకపోకల్లో తలెత్తే మార్పులను అంచనా వేయలేక వలసపక్షులు మనుగడను సాగించడంలో సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అంతర్జాతీయ విహంగ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పారిశ్రామిక విప్లవం మొదలైన నాటి నుంచి నేటి వరకు చూసుకుంటే ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతల్లో 1 డిగ్రీ సెల్సియస్ పెరుగుదల నమోదవుతోంది. ఇప్పటికైనా భూతాపాన్ని అదుపుచేసే చర్యలు చేపట్టకుంటే, రానున్న దశాబ్దకాలంలోనే సగటు ఉష్ణోగ్రతల్లో మరో 2 డిగ్రీల సెల్సియస్ పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సహా వివిధ అంతర్జాతీయ సంస్థలకు చెందిన పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల వలసపక్షుల ఆహార విహారాల్లోను, పునరుత్పత్తి క్రమంలోనూ మార్పులు వస్తున్నాయని, మార్పులను తట్టుకోలేని కొన్ని పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని వారు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికీకరణ, పట్టణీకరణతో పాటు అడవుల నరికివేత కూడా వాతావరణ మార్పులకు దారితీస్తోంది. అడవుల నరికివేత వల్ల వలసపక్షులకు మరో సమస్య కూడా ఎదురవుతోంది. అవి గూళ్లు పెట్టుకోవడానికి అనువైన చెట్లు, చిత్తడి నేలల విస్తీర్ణం తగ్గిపోయి వాటికి అనువైన ఆవాసాలు తగినంతగా దొరకని పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి పరిస్థితుల కారణంగా మనదేశానికి వలస వచ్చే పక్షుల సంఖ్య ఏడాదికేడాది క్రమంగా తగ్గిపోతోందని పర్యావరణవేత్త విజయ్‌కుమార్ బాఘేల్ ఆందోళన వ్యక్తం చేశారు. సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే (సీఏఎఫ్) మీదుగా మన దేశానికి వచ్చే 279 పక్షిజాతుల్లో 29 పక్షిజాతులు పూర్తిగా ప్రమాదం అంచుల్లో ఉన్నాయని, ఇప్పటికైనా వాటిని కాపాడుకునేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మన దేశానికి వలస వచ్చే మొత్తం 1349 పక్షిజాతుల్లో 146 పక్షిజాతుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోందని, గడచిన ఐదేళ్ల వ్యవధిలోనే ఈ జాతులకు చెందిన పక్షుల సంఖ్య 80 శాతం మేరకు తగ్గిపోయిందని, అలాగే మరో 319 జాతులకు చెందిన పక్షుల సంఖ్య 50 మేరకు తగ్గిపోయిందని ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్’ నివేదిక ఈ ఏడాది ప్రారంభంలోనే వెల్లడించింది. పక్షుల రాకపోకలను, వాటి కదలికలను, తీరుతెన్నులను ఎప్పటికప్పుడు గమనించే విహంగ శాస్త్రవేత్తల పరిశీలనల్లో తేలిన అంశాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ముఖ్యంగా సరస్సులు, ఇతర జలాశయాల వద్ద ఉండే చిత్తడినేలలకు వచ్చే పక్షిజాతుల్లో ఈ తగ్గుదల ఎక్కువగా నమోదవుతున్నట్లు ‘ది స్టేట్ ఆఫ్ ఇండియాస్ బర్డ్స్’ నివేదిక వెల్లడించింది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాలంటే, వలస పక్షులను కాపాడుకోవలసిన అవసరం ఉందని, వీటి పరిరక్షణ కోసం ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకోవాలని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ సహా పలు అంతర్జాతీయ సంస్థలు పిలుపునిస్తున్నాయి. సవాళ్లతో కూడుకున్న పని ప్రభుత్వాలు ఎన్ని అభయారణ్యాలను ఏర్పాటు చేసినా, పక్షుల రక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, వేటగాళ్లు అతిథుల్లా వచ్చే వలసపక్షులనూ విడిచిపెట్టడం లేదు. వేటగాళ్ల ధాటికి ఇప్పటికే సైబీరియన్ క్రేన్ జాతి పూర్తిగా కనుమరుగైంది. వలస పక్షులు విడిది చేసే ప్రాంతాల్లో సమీప జనావాసాలకు చెందిన ప్రజలు కూడా వీటి రక్షణలో పాలు పంచుకుంటేనే వీటి భద్రతకు భరోసా ఉంటుంది. ఏయే జాతుల పక్షులు కచ్చితంగా ఎక్కడెక్కడ విడిది చేస్తున్నాయో గుర్తించడం, అక్కడి పరిసరాల పరిస్థితులు విహంగాలకు సానుకూలంగా ఉండేలా కాపాడుకోవడం సవాళ్లతో కూడుకున్న పని. పక్షుల పరిరక్షణకు ప్రభుత్వాల చర్యలతో పాటు సమీప జనావాసాల్లోని ప్రజలు అవగాహన కలిగి ఉండటం కూడా ముఖ్యం. – అర్పిత్ దేవ్మురారి, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ టెక్నాలజీ లీడ్, డబ్ల్యూడబ్యూఎఫ్– ఇండియా పక్షులలో వలస పక్షులే వేరు... భూమ్మీద దాదాపు పదకొండువేలకు పైగా పక్షి జాతులు ఉన్నాయి. వాటిలో దాదాపు నాలుగువేల పక్షిజాతులు రుతువుల్లో మార్పులు వచ్చినప్పుడు తమకు అనువైన ప్రదేశాలను వెదుక్కుంటూ వలసలు వెళుతుంటాయి. వీటిలో సుమారు 1800 జాతుల పక్షులు తమ తమ నెలవుల నుంచి అత్యంత సుదూర ప్రాంతాలకు సైతం వలస వెళుతుంటాయి. వీటిలో రోజుకు ఏకబిగిన వెయ్యి కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తూ, దాదాపు 20వేల కిలోమీటర్లకు పైగా దూరాలను అధిగమించేవి కూడా ఉంటాయి. వలస పక్షుల జాతుల్లో దాదాపు 683 జాతులకు చెందిన పక్షులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ ఇటీవల వెల్లడించింది. పక్షుల వలస విశేషాలు వలస పక్షులకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అత్యధిక దూరాన్ని ఏకధాటిగా అతి తక్కువకాలంలో అధిగమించేవి కొన్ని, వేలాది కిలోమీటర్లు ప్రయాణించే గుప్పెడంత పిట్టలు కొన్ని... ఈ పక్షుల వలస విశేషాల్లో అరుదైనవి కొన్ని... ►అత్యధిక దూరం వలసపోయే పక్షి ఆర్కిటిక్ టెర్న్. ఇది ఏకంగా 12,200 కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఎనిమిదిన్నర రోజుల్లోనే అధిగమించి, అలాస్కా నుంచి న్యూజిలాండ్‌కు చేరుకుంటుంది. ►సరస్సులు, ఇతర జలాశయాలు ఉండే చోటుకు వలసవచ్చే పక్షుల్లో మొదటగా బాతుజాతులకు చెందిన పక్షులు చేరుకుంటాయి. మిగిలిన వలసపక్షుల కంటే ఇవి దాదాపు నెల్లాళ్ల ముందే–అంటే సెప్టెంబర్‌లోనే మన దేశానికి చేరుకుంటాయి. ►చాలా ఎత్తున ఎగిరే వలసపక్షి బాతుజాతికి చెందిన బార్‌హెడెడ్ గీస్. ఇది సముద్ర మట్టానికి దాదాపు 8.8 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతుంది. ఈ జాతికి చెందిన పక్షులు హిమాలయాల నుంచి ప్రయాణం ప్రారంభించి, భారత భూభాగంలోని చిలికా, పులికాట్ తదితర సరస్సుల తీరాలకు చేరుకుంటాయి. ►అత్యధిక వేగంతో ప్రయాణించే వలసపక్షి గ్రేట్ స్నైప్. ఈ పక్షి గంటకు 96.5 కిలోమీటర్ల వేగంతో దాదాపు 6,500కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ►నిర్విరామంగా అత్యధిక దూరం ప్రయాణించే పక్షి బార్ టెయిల్డ్ గాడ్విట్. ఈ పక్షి ఎక్కడా ఆగకుండా 11 వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. -
ప్రపంచమొక ఫుట్‌బాల్.. జగమంతా ఆడే ఆట
క్రిస్టియానో రొనాల్డో కోసం రాత్రంతా జాగారం చేయడానికి సిద్ధం... లయెనెల్ మెస్సీ మ్యాజిక్ గురించి గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇచ్చేందుకు ఇప్పుడు ఎవరైనా రెడీ... ఏ దేశం వాడైనా ఫర్వాలేదు... వేల్స్ వాడైనా, ట్యునీషియాకు చెందిన స్టార్ అయినా మనకు చుట్టమే. సెనెగల్వాడితో, మొరాకో ప్లేయర్‌తో కొత్తగా బాదరాయణ సంబంధం కలుపుకుందాం... బైసైకిల్ కిక్ చూపించిన వాడే మనకు బాస్... బంతిని మెరుపుకంటే వేగంగా తీసుకెళ్లి గోల్ చేయించేవాడే మన దృష్టిలో మొనగాడు.. 29 రోజుల పాటు ఆ దేశం, ఈ దేశం అని లేకుండా మనందరం ఫుట్‌బాల్ పక్షమే. బరిలోకి దిగే 11 మందిలో సగం పేర్లు తెలియకపోయినా పర్లేదు... బంతి ఎటు వెళితే మన కళ్లు అటు వైపు... ఎవరూ చెప్పకుండానే కాళ్లలో కదలికలు సాగుతుంటాయి... అలా అలా నడుస్తూ బంతి లేని చోట కూడా సరదాగా అలా కిక్ కొట్టేసిన ఫీలింగ్ వచ్చేస్తుంటుంది. కోట్లలో ఒకడిగా మనమూ ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌గా మారిపోదాం... వరల్డ్ కప్ వినోదాన్ని ఆస్వాదిద్దాం...! కాలక్రమంలో మరో నాలుగేళ్లు గడిచిపోయాయి. ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీ రూపంలో మరో విశ్వ క్రీడా సంరంభం మొదలుకానుంది. 2018లో రష్యా వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా 32 జట్లు టైటిల్ బరిలో నిలిచాయి. ఎప్పటిలాగే యూరోప్ జట్లు ఫేవరెట్స్‌గా కనిపిస్తున్నాయి. యూరోప్ దేశాలకు దక్షిణ అమెరికా దేశాలైన అర్జెంటీనా, బ్రెజిల్ నుంచి మళ్లీ పోటీ వస్తుందనడంలో సందేహం లేదు. తొలిసారి ప్రపంచకప్‌లో ఆడుతున్న ఖతర్ తొలి రౌండ్ దాటగలిగితే అదే గొప్ప ఫలితంలా భావించాలి. 1966లో ఒకేఒక్కసారి ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్ ఆ తర్వాత ఒక్కసారీ ఫైనల్ చేరలేకపోయింది. గతంలో మూడుసార్లు ఫైనల్ చేరి మూడుసార్లూ ఓడిపోయిన నెదర్లాండ్స్ తొలిసారి ట్రోఫీని అందుకుంటుందో లేదో వేచి చూడాలి. ఫుట్‌బాల్ అనేది టీమ్ గేమ్. ప్రైవేట్ లీగ్‌ల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఎంతో మంది స్టార్ ఆటగాళ్లు ప్రపంచకప్ వచ్చేసరికి తమ జాతీయ జట్టును గెలిపించలేకపోతున్నారు. జట్టులో ఒకరిద్దరు కాకుండా జట్టు మొత్తం రాణిస్తేనే ఆశించిన ఫలితం లభిస్తుంది. - కరణం నారాయణ వారి కల ఫలించేనా... లయెనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో... ఆధునిక ఫుట్‌బాల్‌లో సూపర్ స్టార్లు. చాంపియన్స్ లీగ్‌తో పాటు ఇతర క్లబ్ టోర్నీలలో తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటారు. సాధించిన రికార్డులు, కీర్తి కనకాదులకు లెక్కే లేదు. కానీ వీరిద్దరి కెరీర్లో ఒకే ఒక లోటు తమ జాతీయ జట్టు తరపున ప్రపంచ కప్ గెలవలేకపోవడం. పోర్చుగల్ తరపున రొనాల్డో, అర్జెంటీనా తరపున మెస్సీ ఒక్క వరల్డ్ కప్ విజయంలోనూ భాగం కాలేకపోయారు. 2014లో ఫైనల్ వరకు వచ్చిన మెస్సీ జట్టుకు ఆఖరి మెట్టుపై అదృష్టం కలసి రాకపోగా... రొనాల్డో అంత చేరువగా కూడా ఎప్పుడూ రాలేకపోయాడు. వీరిద్దరూ ఆఖరిసారిగా ప్రపంచ కప్ బరిలోకి దిగబోతున్నారు. ఈ సారైనా వీరు తమ జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషిస్తారా లేక ఎప్పుడూ కప్ గెలవలేకపోయిన దిగ్గజాల జాబితాలో చోటుతో ఆటను ముగిస్తారా చూడాలి. జగమంతా ఆడే ఆట ... గత 92 ఏళ్లలో ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు ఆదరణ ఆకాశమంత ఎత్తుకు పెరిగిపోయింది. ప్రస్తుతం ‘ఫిఫా’ పరిధిలో 211 సభ్య దేశాలు ఉన్నాయి. వీటిలో 80 దేశాలు వరల్డ్ కప్‌కు కనీసం ఒక్కసారైనా అర్హత సాధించాయి. 13 దేశాలు ఫైనల్ వరకు చేరగా, ఎనిమిది మాత్రమే విజేతలుగా నిలిచాయి. ప్రపంచకప్ టోర్నీ ముగిసిన ఏడాది తర్వాతే వచ్చే ప్రపంచకప్ కోసం క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు మొదలు అవుతాయి. దాదాపు మూడేళ్లపాటు ఈ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. 1978 వరకు 16 జట్లు... 1982 నుంచి 2002 వరకు 24 జట్లు పోటీపడ్డాయి. 2006 నుంచి తాజా ప్రపంచకప్ వరకు 32 జట్లు ప్రధాన టోర్నీలో బరిలో ఉన్నాయి. ప్రపంచకప్‌లో పాల్గొనే దేశాల సంఖ్యపై ఖండాలవారీగా ‘ఫిఫా’ స్లాట్లు కేటాయిస్తుంది. ప్రస్తుతం ఆసియా నుంచి 5... ఆఫ్రికా నుంచి 5... యూరోప్ నుంచి 13... ఉత్తర, మధ్య అమెరికా, కరీబియన్ దీవుల నుంచి 4... దక్షిణ అమెరికా నుంచి 4 స్లాట్లు ఉన్నాయి. ఆతిథ్య దేశం ఖతర్ ఆసియా నుంచి కావడంతో ఈసారి ఆసియా స్లాట్ల సంఖ్య ఆరు అయింది. 2026 ప్రపంచకప్‌ను 48 జట్లతో నిర్వహించాలని ‘ఫిఫా’ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ స్లాట్లలో మార్పు చేర్పులు ఉంటాయి. ఆసియా, ఆఫ్రికా జట్లు అంతంతే... ప్రపంచకప్‌కు ఆదరణ పెంచేందుకు ‘ఫిఫా’ ఆసియా దేశాల్లో ఆటను ప్రోత్సహించే ప్రయత్నం చేసింది. 1938లో ఇండోనేసియా.. వరల్డ్ కప్ ఆడిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. మొత్తం 12 ఆసియా జట్లు ఇప్పటి వరకు టోర్నీలో పాల్గొన్నాయి. 2002లో దక్షిణ కొరియా అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచిన ఆసియా జట్టుగా నిలిచింది. మరోవైపు 13 ఆఫ్రికా దేశాలు కూడా ఈ మెగా టోర్నీలో భాగంకాగా... కామెరూన్, సెనెగల్, ఘనా మాత్రమే క్వార్టర్ ఫైనల్‌కు చేరడం అత్యుత్తమ ప్రదర్శన. ఏ ఆఫ్రికా జట్టూ ఒక్కసారి కూడా సెమీఫైనల్ చేరలేదిప్పటి వరకు. కప్ వెనుక కథ... 1930లో మొదలైన ఫుట్‌బాల్ ప్రపంచకప్.. చాంపియన్స్‌కు ఇచ్చే ట్రోఫీ ఒకసారి మారింది. 1930 నుంచి 1970 వరకు ఒకే రకమైన ట్రోఫీని ఇచ్చారు. మొదట్లో దీనిని ‘విక్టరీ’ పేరుతో పిలిచేవారు. ఆ తర్వాత ఈ ట్రోఫీకి ‘ఫిఫా’ మాజీ అధ్యక్షుడు ‘జూల్స్ రిమెట్’ పేరు పెట్టారు. 3.8 కిలోల బరువు, 35 సెంటీమీటర్ల ఎత్తు ఉండే ఈ ట్రోఫీని వెండితో తయారు చేసి బంగారు పూత పూశారు. టోర్నీ విజేతలకు దీని ‘రెప్లికా’ను మాత్రమే ఇచ్చేవారు. అయితే 1970లో బ్రెజిల్ మూడోసారి టైటిల్ గెలిచిన తర్వాత నిబంధనల ప్రకారం ‘ఒరిజినల్ ట్రోఫీ’ని బ్రెజిల్‌కు ఇవ్వాల్సి వచ్చింది. దాంతో 1974లో ‘ఫిఫా’ కొత్త ట్రోఫీని రూపొందించింది. రెండు చేతులు గ్లోబ్‌ను మోస్తున్నట్లుగా ఉండే చిత్రంతో ఇది తయారైంది. దీని ఎత్తు 36.5 సెంటీమీటర్లు. బరువు 5 కిలోలు. దీనిని 18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దిగువ భాగంలో విజేతల జాబితా ఉంటుంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఈ ట్రోఫీని ఎవరికీ శాశ్వతంగా ఇవ్వరు. విజేతకు అదే తరహాలో ఉండే కంచు ట్రోఫీని మాత్రం అందజేస్తారు. ఆరుసార్లు ఆతిథ్య జట్టుకు అందలం... ఇప్పటివరకు 21 సార్లు ప్రపంచకప్ టోర్నీ జరిగింది. ఆరుసార్లు ఆతిథ్య జట్టు (1930లో ఉరుగ్వే; 1934లో ఇటలీ; 1966లో ఇంగ్లండ్; 1974లో పశ్చిమ జర్మనీ; 1978లో అర్జెంటీనా; 1998లో ఫ్రాన్స్) విశ్వవిజేతగా అవతరించింది. ‘ఫైవ్ స్టార్’ బ్రెజిల్... ఇప్పటి వరకు 13 దేశాలు మాత్రమే ఫైనల్‌కు చేరుకోగా... అందులో ఎనిమిది దేశాలు ప్రపంచ చాంపియన్స్‌గా నిలిచాయి. అత్యధికంగా బ్రెజిల్ జట్టు ఐదుసార్లు (1958, 1962, 1970, 1994, 2002) విజేతగా నిలిచింది. జర్మనీ (1954, 1974, 1990, 2014), ఇటలీ (1934, 1938, 1982, 2006) దేశాలు నాలుగుసార్లు ట్రోఫీని సాధించాయి. అర్జెంటీనా (1978, 1986), ఫ్రాన్స్ (1998, 2018), ఉరుగ్వే (1930, 1950) రెండుసార్లు విశ్వవిజేతగా నిలిచాయి. ఇంగ్లండ్ (1966), స్పెయిన్ (2010) ఒక్కోసారి ప్రపంచ చాంపియన్ అయ్యాయి. పాపం... నెదర్లాండ్స్ ప్రపంచకప్ చరిత్రలో దురదృష్ట జట్టు ఏదంటే నెదర్లాండ్స్ అని చెప్పవచ్చు. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ కీలక పోరులో తడబడటం నెదర్లాండ్స్‌కు అలవాటుగా మారింది. దాంతో ఇప్పటివరకు 10 సార్లు ప్రపంచకప్‌లో పాల్గొని మూడుసార్లు (1974, 1978, 2010) ఫైనల్ చేరినా ఈ జట్టు ఒక్కసారీ ట్రోఫీని ముద్దాడలేకపోయింది. హంగేరి (1938, 1954), చెక్ రిపబ్లిక్ (1934, 1962) రెండుసార్లు... స్వీడన్ (1958), క్రొయేషియా (2018) ఒక్కోసారి ఫైనల్‌కు చేరి ఓడిపోయి రన్నరప్‌తో సరిపెట్టుకున్నాయి. ప్రతిభకు పట్టం.. ప్రపంచకప్ మొత్తం నిలకడగా రాణించిన క్రీడాకారులకు పురస్కారాలు అందజేస్తారు. అందులో ముఖ్యమైనవి... గోల్డెన్ బాల్: టోర్నీలో ఉత్తమ ప్లేయర్‌కు అందించే అవార్డు. రెండో ఉత్తమ ప్లేయర్‌కు ‘సిల్వర్ బాల్’... మూడో ఉత్తమ ప్లేయర్‌కు ‘బ్రాంజ్ బాల్’ అందజేస్తారు. గోల్డెన్ బూట్: టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన ప్లేయర్‌కు అందజేస్తారు. రెండో స్థానంలో నిలిచిన వారికి ‘సిల్వర్ బూట్’.. మూడో స్థానంలో నిలిచిన వారికి ‘బ్రాంజ్ బూట్’ ఇస్తారు. గోల్డెన్ గ్లవ్: టోర్నీలో ఉత్తమ గోల్‌కీపర్‌కు అందించే పురస్కారం. ఏ గ్రూప్‌లో ఎవరంటే... గ్రూప్ ‘ఎ’: ఖతర్, ఈక్వెడార్, సెనెగల్, నెదర్లాండ్స్. గ్రూప్ ‘బి’: ఇంగ్లండ్, ఇరాన్, అమెరికా, వేల్స్. గ్రూప్ ‘సి’: అర్జెంటీనా, మెక్సికో, పోలాండ్, సౌదీ అరేబియా. గ్రూప్ ‘డి’: ఫ్రాన్స్, డెన్మార్క్, ఆస్ట్రేలియా, ట్యునీషియా. గ్రూప్ ‘ఇ’: జర్మనీ, స్పెయిన్, జపాన్, కోస్టారికా. గ్రూప్ ‘ఎఫ్’: బెల్జియం, క్రొయేషియా, కెనడా, మొరాకో. గ్రూప్ ‘జి’: బ్రెజిల్, సెర్బియా, కామెరూన్, స్విట్జర్లాండ్. గ్రూప్ ‘హెచ్’: పోర్చుగల్, ఘనా, ఉరుగ్వే, దక్షిణ కొరియా. వీరే విజేతలు 1930 ఉరుగ్వే 1934 ఇటలీ 1938 ఇటలీ 1950 ఉరుగ్వే 1954 పశ్చిమ జర్మనీ 1958 బ్రెజిల్ 1962 బ్రెజిల్ 1966 ఇంగ్లండ్ 1970 బ్రెజిల్ 1974 పశ్చిమ జర్మనీ 1978 అర్జెంటీనా 1982 ఇటలీ 1986 అర్జెంటీనా 1990 పశ్చిమ జర్మనీ 1994 బ్రెజిల్ 1998 ఫ్రాన్స్ 2002 బ్రెజిల్ 2006 ఇటలీ 2010 స్పెయిన్ 2014 జర్మనీ 2018 ఫ్రాన్స్ అత్యధిక గోల్స్ చేసిన టాప్–10 జట్లు జట్టు గోల్స్ బ్రెజిల్ 229 జర్మనీ 226 అర్జెంటీనా 137 ఇటలీ 128 ఫ్రాన్స్ 120 స్పెయిన్ 99 ఇంగ్లండ్ 91 ఉరుగ్వే 87 హంగేరి 87 నెదర్లాండ్స్ 86 ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా... లక్షల్లో జనాభా ఉన్న చిన్నచిన్న దేశాలు కూడా ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి అర్హత సాధించి తమ ప్రత్యేకతను చాటుకుంటుంటే.. 130 కోట్ల జనాభా ఉన్న భారత్ మాత్రం ఏనాడూ ఈ మెగా టోర్నీకి అర్హత సాధించలేకపోయింది. ప్రస్తుత ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ 106వ స్థానంలో ఉంది. క్రికెట్ ఆదరణ పెరిగాక మన దేశంలో ప్రాభవం కోల్పోయిన ఎన్నో ఆటల్లో ఫుట్‌బాల్ కూడా ఒకటి. ప్రతి నాలుగేళ్లకు ప్రపంచకప్‌లో ఒక్క కొత్త జట్టయినా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంటే భారత ఫుట్‌బాల్‌లో మాత్రం కదలిక కనిపించదు. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఇండియన్ సూపర్ లీగ్, ఐ–లీగ్ తదితర టోర్నీలతో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తున్నా ఆశించిన ఫలితం మాత్రం కనిపించడంలేదు. 1950, 60వ దశకాల్లో భారత జట్టు ఆసియాలోని అత్యుత్తమ ఫుట్‌బాల్ టీమ్‌లలో ఒకటిగా నిలిచింది. 1951, 1962 ఆసియా క్రీడ్లలో స్వర్ణాలు సాధించిన మన జట్టు 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం మన అత్యుత్తమ ఘనత. అయితే 1970 నుంచి మన తిరోగమనం వేగంగా సాగింది. అప్పుడప్పుడు దక్షిణాసియా (శాఫ్) దేశాల పోటీల్లో మెరుపులు మినహా మిగతాదంతా శూన్యమే. బైచుంగ్ భూటియా, సునీల్ ఛెత్రి తదితర స్టార్లు మాత్రమే వ్యక్తిగత ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. మస్కట్, అధికారిక బంతి, పాటలు... టోర్నమెంట్ అధికారిక మస్కట్ ‘లాయిబ్’. ఇది అరబిక్ పదం... ‘నిష్ణాతుడైన ఆటగాడు’ అని అర్థం. ఈ ఏప్రిల్ 1న మస్కట్‌ను ఆవిష్కరించిన అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) వెబ్సైట్లో లాయిబ్ గురించి ఇలా రాసింది.. ‘లాయిబ్ యువతలో స్ఫూర్తి నింపుతుంది. అదెక్కడుంటే అక్కడ హుషారు, ఆత్మవిశ్వాసం అంతకంతకూ పెరుగుతాయి’ అని! సృజన, ఆలోచనలతోనే వ్యక్తుల సంకల్పం పెరుగుతుందని తెలిపింది. అధికారిక బంతి ‘అల్ రిహ్లా’ మస్కట్ కంటే ముందు మార్చి 30న టోర్నీలో వాడే అధికారిక బంతి ‘అల్ రిహ్లా’ని ఆవిష్కరించింది. అరబిక్‌లో ‘అల్ రిహ్లా’ అంటే ప్రయాణం. ఖతర్ సంస్కృతి, నిర్మాణశైలి, పడవలు, పతాకం నుంచి ప్రేరణ పొందాలనే ఉద్దేశంతో ఆ పేరును ఖరారు చేశారు. మన్నికకే ప్రాధాన్యమిచ్చి ప్రత్యేకమైన జిగురు, సిరాలతో రూపొందించిన తొలి అధికారిక బంతి ఇది. ఆట పాట గతంలో ప్రతి ప్రపంచకప్‌కు ప్రత్యేక గీతాన్ని స్వరపరిచేవారు. మెగా టోర్నీకి ముందే అది సాకర్ ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేది. కానీ ఈసారి ఒక పాటతో సరిపెట్టకుండా పాటల ట్రాక్‌ను విడుదల చేశారు. హయ్యా... హయ్యా (కలిసుంటే కలదు సుఖం) పాటతో ఈ ట్రాక్ మొదలవుతుంది. దీన్ని ట్రినిడాడ్, కార్డొన, డేవిడో, ఐషా బృందం ఆలపించింది. ‘అర్హ్బో’, ‘లైట్ ద స్కై’ అనే ఇంకో రెండు పాటలు ఈ ప్రపంచకప్ గానా బజానాలో భాగమయ్యాయి. -
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి వచ్చి, భూలోక వైకుంఠమైన వేంకటాద్రిపై కొలువుదీరాడు. కన్యామాసం (చాంద్రమానం ప్రకారం ఆశ్వీయుజ మాసం) శ్రవణ నక్షత్రం రోజున శ్రీవేంకటేశ్వరస్వామిగా అర్చారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలశాడు. శ్రీవేంకటేశ్వరుడు ఉత్సవ ప్రియుడు, అలంకార ప్రియుడు, నైవేద్య ప్రియుడు, భక్తజన వల్లభుడు. కోరినవారి కొంగుబంగారమై కోరికలను ఈడేర్చే శ్రీవేంకటేశ్వరుని వైభోగం న భూతో న భవిష్యతి! వేంకటాచల క్షేత్రం పై వెలసిన శ్రీనివాసుడు బ్రహ్మదేవుని పిలిచి, లోక కళ్యాణం కోసం తనకు ఉత్సవాలు నిర్వహించాలని ఆజ్ఞాపించాడట. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మదేవుడు శ్రవణా నక్షత్రం నాటికి ముగిసేలా తొమ్మిదిరోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాడట. తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలను నిర్వహించడం వల్ల బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయని ప్రతీతి. దసరా నవరాత్రులు జరిగే కన్యామాసంలో శ్రీవేంకటేశ్వరుడు అర్చామూర్తిగా ఆవిర్భవించిన శ్రవణ నక్షత్ర శుభ ముహూర్తాన చక్రస్నానం నాటికి తొమ్మిదిరోజుల ముందు నవరాత్రి బ్రహ్మోత్సవాలను ప్రారంభించడం అనాదిగా వస్తున్న ఆచారం. సూర్యచంద్ర మాసాల్లో ఏర్పడే వ్యత్యాసం వల్ల ప్రతి మూడేళ్లకొకసారి అధిక మాసం వస్తుంది. ఇందులో భాగంగా కన్యామాసం (అధిక భాద్రపదం)లో వార్షిక బ్రహ్మోత్సవం, దసరా నవరాత్రులలో (ఆశ్వయుజం)లో నవరాత్రి బ్రహ్మోత్సవం నిర్వహించటం కూడా ఆనవాయితీగా కొనసాగుతోంది. వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం, వైదిక ఉపచారాల ప్రకారం ధ్వజస్తంభంపై గరుడ ధ్వజపటాన్ని ఎగురవేస్తారు. ధ్వజారోహణం, బలి ఆచారాలు, మహారథోత్సవం, శ్రవణానక్షత్రంలో చక్రస్నానం, ధ్వజావరోహణం వంటివి ఈ ఉత్సవాల్లోనే నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాలు మాత్రం వైదిక ఆచారాలు (ధ్వజారోహణం, ధ్వజావరోహణం) లేకుండా ఆగమోక్తంగా అలంకార ప్రాయంగా నిర్వహిస్తారు. ఎనిమిదో రోజున మహారథం (చెక్కరథం) బదులు ఇదివరకు వెండిరథాన్ని ఊరేగించేవారు. 1996వ సంవత్సరం నుంచి టీటీడీ తయారు చేయించిన స్వర్ణరథంపై స్వామివారి ఊరేగింపు జరుగుతూ వస్తోంది. 2012లో పాత స్వర్ణరథం స్థానంలో కొత్త స్వర్ణరథం అందుబాటులోకి వచ్చింది. అంకురార్పణతో ఆరంభం శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమవుతాయి. శ్రీవారి సర్వసేనాధిపతి విష్వక్సేనుడు వసంత మండపానికి బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందురోజు రాత్రి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత దేశంలో భూదేవి ఆకారంలోని లలాట, బాహు, స్తన ప్రదేశాల నుంచి మట్టిని తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే ‘మృత్సంగ్రహణం’ అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన తొమ్మిది పాలికలలో శాలి, ప్రహి, యవ, ముద్గ, మాష, ప్రియంగు మొదలగు నవ ధాన్యాలను పోసి ఆ మట్టిలో మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు (చంద్రుడు) అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవ ధాన్యాలు సైతం దినదినాభివృద్ధి చెందేలా ప్రార్థిస్తారు. నిత్యం నీరుపోసి అవి పచ్చగా మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింప చేసే కార్యక్రమం కాబట్టి దీనినే అంకురార్పణ అంటారు. ధ్వజారోహణం న భూతో న భవిష్యతి అనేలా అంగరంగ వైభవోపేతంగా నిర్వహించే బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి, ఒక కొత్తవస్త్రం మీద గరుడుని బొమ్మ చిత్రీకరిస్తారు. దీన్ని ‘గరుడ ధ్వజపటం’ అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కొడితాడును సిద్ధం చేస్తారు. ఉత్సవ మూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవిల సమక్షంలో గోధూళి లగ్నమైన మీన లగ్నంలో కొడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వాన పత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వగణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజులు కొండమీదే కొలువుదీరి ఉత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి. పెద్ద శేషవాహనం ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయం పరిధిలోని నాలుగు మాడవీథుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి. ధరించేది శేషవస్త్రం. ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యమిస్తూ తొలిరోజు ఆ వాహనం మీద ఊరేగుతారు. చిన్నశేషవాహనం రెండోరోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలసి ఐదు శిరస్సుల చిన్న శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. పెద్ద శేషవాహనం ఆదిశేషుడైతే, చిన్నశేషవాహనం వాసుకి. హంసవాహనం రెండోరోజు రాత్రి స్వామివారు విద్యాప్రదాయని అయిన శారదామాత రూపంలో హంసవాహనంపై ఊరేగుతారు. పాలు, నీళ్లను వేరు చేసినట్లే గుణావగుణ విచక్షణా జ్ఞానానికి సంకేతంగా శ్రీనివాసుడు హంసవాహనం అధిరోహించి భక్తులకు దర్శనమిస్తాడు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగుతూ దర్శనమివ్వడం భక్తులకు నేత్రపర్వం. సింహవాహనం బ్రహ్మోత్సవాలలో మూడో రోజు ఉదయం సింహవాహనం అధిరోహించి శ్రీవేంకటనాథుడు భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులలో మృగరాజైన సింహాన్ని తానేనంటూ మనుషులలో జంతు ప్రవృత్తిని నియంత్రించుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు. శ్రీవేంకటేశ్వరుడు తనలోని పరాక్రమాన్ని ప్రపంచానికి చాటడానికి సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారని ముత్యాలపందిరి వాహనం మూడో రోజు రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామివారికి జరిగే సుకుమారసేవగా ముత్యాలపందిరి వాహనాన్ని చెప్పవచ్చు. ముక్తి సాధనకు ముత్యంలాంటి స్వచ్ఛమైన మనసు కావాలని లోకానికి ఈ వాహనం ద్వారా స్వామివారు చాటి చెబుతారు. కల్పవృక్ష వాహనం కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలు ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే దేవదేవుడు శ్రీవేంకటాద్రివాసుడు. కల్పవృక్షం– అన్నవస్త్రాదుల వంటి ఇహలోక సంబంధితమైన కోరికలను మాత్రమే తీర్చగలదు. కానీ స్వామివారు శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించే కారుణ్యమూర్తి. నాలుగోరోజు ఉదయం సువర్ణకాంతులీనే కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు. సర్వభూపాల వాహనం లోకంలోని భూపాలకులందరికీ భూపాలుడు తానేనని లోకానికి చాటుతూ శ్రీవేంకటేశ్వరుడు నాలుగోరోజు రాత్రి సర్వభూపాల వాహనం మీద కొలువుదీరుతారు. సర్వభూపాల వాహన సేవ జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలాన్ని ఇస్తుంది. మోహినీ అవతారం బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది ఐదోరోజు. ఆ రోజు ఉదయం మోహినీ అవతారంలో స్వామివారు భక్త జనావళికి కనువిందు చేస్తారు. అన్ని వాహనసేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే, మోహినీ అవతారం మాత్రం నేరుగా శ్రీవారి ఆలయం లోపలి నుంచే పల్లకిపై ప్రారంభం అవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహన పరచి, క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారమిది. మంచి పనులు చేయడం ద్వారా దైవానుగ్రహం ఎలా పొందవచ్చో లోకానికి చాటడానికే శ్రీవారు జగన్మోహిని రూపంలో తిరువీథుల్లో విహరిస్తారు. గరుడవాహనం ఐదోరోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద స్వామివారు ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంఠి, లక్ష్మీహారం, సహస్రనామమాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. శ్రీవేంకటేశ్వరుడిని తన కీర్తనలతో నానా విధాలుగా కొనియాడిన గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన ఛత్రాలను గరుడ వాహనంలో అలంకరిస్తారు. ఈ వాహనంలో ఊరేగే స్వామివారి వైభోగాన్ని చూసి తరించడానికి లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలివస్తారు. గరుడుడితో స్వామికి గల అనుబంధాన్ని కూడా ఈ సేవ చాటి చెబుతుంది. హనుమంత వాహనం ఆరోరోజు ఉదయం స్వామివారు హనుమద్వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. త్రేతాయుగంలో తనను సేవించుకున్న భక్త శిఖామణి హనుమంతుడిపై స్వామివారు తిరువీథుల్లో ఊరేగింపుగా వెళతారు. హనుమంతుని భక్తి తత్పరతను లోకులకు తెలిసేలా, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు చాటి చెబుతారు. గజవాహనం గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే, శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరోరోజు రాత్రి గజవాహనంపై ఊరేగుతారు. గజవాహనంపై ఊరేగుతుండగా స్వామిని దర్శించుకుంటే, పెనుసమస్యలన్నీ ఇట్టే తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనం బ్రహ్మోత్సవాలలో ఏడోరోజు ఉదయం సప్తాశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామివారు సూర్యప్రభ వాహనం మీద ఊరేగుతారు. ప్రపంచానికి వెలుగులు ప్రసాదించే సూర్య భగవానుడు తన ప్రతిరూపమేనని చాటిచెబుతారు. చంద్రప్రభ వాహనం ఏడోరోజు రాత్రి ధవళ వస్త్రాలు, తెల్లని పూలమాలలు ధరించి స్వామివారు చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశలేనని తెలియజేస్తారు. మనఃకారుకుడైన చంద్రుడి లక్షణం తనలోనూ ఉందని, తాను కూడా భక్తుల మనస్సుపై ప్రభావం చూపిస్తానని చాటి చెబుతారు. రథోత్సవం గుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే కళ్లెంతో అదుపు చేసే విధంగానే, రథం వంటి శరీరాన్ని రథికుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్త్వజ్ఞానాన్ని స్వామివారు ఎనిమిదో రోజు ఉదయం తన రథోత్సవం ద్వారా తెలియ జేస్తారు. స్వామివారి రథ సేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అశ్వవాహనం ఎనిమిదోరోజు రాత్రి స్వామివారు అశ్వవాహనారూఢుడై ఊరేగుతారు. చతురంగ బలాలలో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం. చక్రస్నానం ఎనిమిది రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్రత్తాళ్వారును వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రత్తాళ్వార్ స్నాన మాచరించే సమయంలో కోనేరులో స్నానం చేస్తే సకల పాపాలు నశించి, కష్టాలు తీరుతాయని ప్రతీతి. ధ్వజావరోహణం చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్స వాలను ముగిస్తారు. డాలర్ లేని బ్రహ్మోత్సవం... ఈ ఏట తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు డాలర్ శేషాద్రి సందడి లేకుండానే జరగనున్నాయి. శ్రీవారి ఆలయంలో ఓఎస్డీగా పనిచేస్తున్న డాలర్ శేషాద్రి ఉరఫ్ పాల శేషాద్రి గత ఏడాది నవంబర్ 29వ తేదీన కన్ను మూయడంతో ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలు డాలర్ లేకుండానే జరగనున్నాయి. 1978వ సంవత్సరంలో టీటీడీ లో విధుల్లో చేరిన శేషాద్రి అప్పటినుంచి గత ఏడాది వరకు జరిగిన శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటూ వచ్చారు. మధ్యలో 2009వ సంవత్సరంలో కోర్టు తీర్పు కారణంగా బ్రహ్మోత్సవాల విధులకు దూరమైన శేషాద్రి అటు తరువాత 2014వ సంవత్సరంలో ఉత్సవాలు జరుగుతున్న సమయంలోనే గుండెపోటుకి గురై కొన్ని వాహనసేవలకు దూరమయ్యారు. ఈ రెండుసార్లు మినహాయిస్తే దాదాపు 44 సంవత్సరాల పాటు శ్రీవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొని ఉత్సవాల నిర్వహణలో పాలుపంచుకొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఉత్సవాల సమయంలో స్వామి వారి ఆలంకరణలను ఏవిధంగా చేయాలన్న దాని పై అర్చకులకు సహకరిస్తూ ఏ సమయంలో ఏ కైంకర్యం నిర్వహించాలో తెలుపుతూ సమయానికి అన్నీ సక్రమంగా జరిగేలా చూసుకునే వారు. ఆలయ మాడవీథుల్లో వాహన ఊరేగింపు జరుగుతున్నంత సేపు కూడా వాహనంతో పాటే ఉంటూ అన్నీ తానై వ్యవహరిస్తూ వాహన సేవ విజయవంతంగా సాగేలా సహకరించి అటు అధికారులతోపాటు ఇటు టీటీడీ పాలకమండలి మన్ననలను పొందేవారు. మరోవైపు ఉత్సవాలలో వాహన ఊరేగింపు ముందు సందడి చేస్తూ భక్తుల్లో భక్తిభావాన్ని నింపేవారు. ఇలా బ్రహ్మోత్సవాలలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచే డాలర్ శేషాద్రి లేకుండానే ఈ ఏట శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 26.09.2022 అంకురార్పణ 27.09.2022 ధ్వజారోహణం పెద్ద శేషవాహనం 28.09.2022 చిన్నశేషవాహనం హంసవాహనం 29.09.2022 సింహవాహనం ముత్యపుపందిరి వాహనం 30.09.2022 కల్పవృక్షవాహనం సర్వభూపాల వాహనం 01.10.2022 మోహినీ అవతారం గరుడ వాహనం 02.10.2022 హనుమంతæవాహనం గజవాహనం 03.10.2022 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం 04.10.2022 రథోత్సవం అశ్వ వాహనం 05.10.2022 చక్రస్నానం ధ్వజావరోహణం -
రాలని చినుకు చెప్పే చిత్రమైన కథలు! నన్ను చూస్తుంటే... ఏడవండి!!!
అమెరికా, యూకే, యూరప్‌లకు చినుకు కరవొచ్చింది...అట్లాంటి ఇట్లాంటిది కాదండోయ్! 500 ఏళ్లలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిది! డ్యాములు అడుగంటిపోయాయి.. నదులూ ఇంకిపోయాయి! వడగాడ్పులతో జనమూ బెంబేలెత్తిపోయారు! అయితే ఏంటి? అంటున్నారా? నిజమే కానీ.. కరువు, వర్షాభావం అనేవి...ఆ ప్రాంతాలకు దూరపుచుట్టాలు కూడా కాదు. అందుకే 2022 నాటి ఈ వాతావరణ దృగ్విషయానికి ప్రాధాన్యమేర్పడింది... అంతేకాదు.. రాలని చినుకుపుణ్యమా అని గతానికి చెందిన కథలెన్నో ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి! ఏమా కథలు.. వాటి విశేషాలంటే...!!!! స్విట్జర్లాండ్ పేరు చెబితే మంచు పర్వతాలు.. లండన్ పేరు విన్న వెంటనే అంచనాలకు అందని వాతావరణం గుర్తుకు వస్తాయి. ఈ రెండు ప్రాంతాలే కాదు.. యూరప్‌లోని చాలా దేశాలన్నీ పచ్చగా.. లేదంటే మంచుతో కప్పబడి ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితులు పూర్తిగా భిన్నం. ఐదు వందల ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రస్థాయిలో వర్షాభావం.. తత్ఫలితంగా కరవు.. యూరప్‌తో పాటు అమెరికాలోనూ కనిపిస్తోంది. ఏడాది పొడవునా వేసవిని తలపించే ఎండలు.. తరచూ పలుకరించిన వడగాడ్పులతో పాశ్చాత్యదేశాలు అల్లాడిపోతున్నాయి. ఈ క్రమంలోనే పలు దేశాల్లోని నదులు, డ్యామ్‌లు, రిజర్వాయర్లు అడుగంటిపోయాయి. బోసిపోయిన ఈ జలవనరులు ఇప్పుడు గత చరిత్ర ఆనవాళ్లను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి. రెండో ప్రపంచ యుద్ధంనాటి బాంబు మొదలుకొని జర్మన్లు వాడిన యుద్ధ నౌక.. కోట్ల ఏళ్ల క్రితం తిరుగాడిన రాక్షసబల్లుల ఆనవాళ్లు... మధ్యయుగాల నాటి కరవు పరిస్థితులను సూచించే గుర్తులు బయటపడ్డాయి. ప్రాజెక్టుల కోసం సేకరించిన భూమిలో భాగమైన పలు నగరాలు.. చారిత్రక అవశేషాలు కూడా ఈ ఏడాది కరవు పుణ్యమా అని ఇంకోసారి ప్రజలకు గతాన్ని గుర్తు చేస్తున్నాయి!! ఆఫ్రికా కొమ్ము నుంచి.... 2022లో పాశ్చాత్యదేశాలు అనేకం కరవులో చిక్కుకున్నట్లు శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు. ఆఫ్రికా ఖండంలోని పైభాగం (హార్న్ ఆఫ్ ఆఫ్రికా) మొదలుకొని ఇంగ్లాండ్, ఇటలీ, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లలో విపరీత పరిస్థితులు ఏర్పడినట్లు తెలుస్తోంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికాలో భాగమైన ఇథియోపియా, సొమాలియా, కెన్యాల్లో నాలుగేళ్లుగా సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఆకలి కేకలు తీవ్రం కాగా.. ఫ్రాన్స్‌లో కోతకొచ్చిన మొక్కజొన్న పంట మొత్తం నశించిపోయింది. ఈ దేశంలో పరిస్థితి ఎంత అధ్వాన్నంగా ఉందీ అంటే.. ఎండలు పెరిగిపోయి.. ఉప్పునీరు ఎక్కువ ఆవిరవుతూండటం వల్ల దేశంలో ఉప్పు ఉత్పత్తి రెట్టింపు అవుతోంది!! వర్షాభావం వల్ల జర్మనీలోని రైన్ ఓడరేవులో నీరు కాస్తా అడుగంటిపోయి రవాణాకు అంతరాయం ఏర్పడుతోంది. దీనివల్ల సరుకుల రవాణా ఆలస్యం అవడం మాత్రమే కాకుండా ధరలు కూడా పెరిగిపోతున్నాయి. జర్మనీలోని పారిశ్రామిక ప్రాంతం గుండా ప్రవహించే రైన్ నదిలో నౌకల ద్వారా తిండిగింజలు మొదలుకొని రసాయనాలు, బొగ్గు వంటి అనేక సరుకులు దేశం ఒక మూల నుంచి ఇంకోమూలకు చేరుతూంటాయి. నీళ్లు తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు పడవల సామర్థ్యంలో 30 –40 శాతాన్ని మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఇబ్బంది.. జర్మనీ స్థూల జాతీయోత్పత్తిలో 0.5 శాతాన్ని తగ్గిస్తుందని అంచనా. విద్యుదుత్పత్తికీ అంతరాయం... యూరప్ వర్షాభావం, కరువు పరిస్థితులు విద్యుత్తు సరఫరాపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టిస్తున్నాయి. స్పెయిన్‌లో జల విద్యుదుత్పత్తి 44 శాతం వరకూ తగ్గిపోగా, అణువిద్యుత్ కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి. వేడెక్కిన ఇంధనాన్ని చల్లబరచేందుకు తగినన్ని నీళ్లు లేక ఫ్రాన్స్‌లో కొన్ని అణువిద్యుత్ కేంద్రాల ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించారు కూడా. ఇటలీలో బయటపడ్డ బాంబు... ఇటలీలోని ప్రధాన నది ‘పో’ ఈ ఏటి వర్షాభావం పుణ్యమా అని దాదాపుగా ఎండిపోయింది. దీంతో మాన్టువా ప్రాంతంలో నది అడుగు భాగంలోంచి రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి బాంబు ఒకటి బయటపడింది. పేలని ఈ బాంబును సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు గాను స్థానికులు సుమారు 3000 మందిని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయించారు. నదిలో నౌకల రవాణా, పరిసరాల్లోని ట్రాఫిక్‌ను కూడా నిలిపివేసి సుమారు 500 కిలోల బరువున్న బాంబును ఇంకో ప్రాంతానికి తరలించారు. అంతేకాదు.. ఈ ‘పో’ నదిలోనే 1943లో జర్మనీ వాళ్లు వాడిన భారీ సరుకు రవాణా నౌక ఒకటి కూడా బయటపడింది. కొన్ని నెలల ముందే దీని ఆనవాళ్లు నదిలో కనిపించినప్పటికీ వర్షాభావం కొనసాగడంతో ప్రస్తుతం అది నీటిలోంచి బయటపడినట్లుగా పూర్తిగా కనిపిస్తోంది. ఇక ఇటలీలోని రోమ్ నగరానికి వస్తే.. టైబర్ నది అడుగంటిన కారణంగా ఎప్పుడో రోమన్ల కాలంలో నీరో చక్రవర్తి కట్టినట్టుగా భావిస్తున్న వంతెన ఒకటి అందరికీ దర్శనమిచ్చింది. ఈ వంతెన క్రీస్తు శకం 50వ సంవత్సరం ప్రాంతంలో కట్టి ఉంటారని అంచనా. చర్చీలు, చారిత్రక అవశేషాలు... యూరోపియన్ దేశం స్పెయిన్‌లో వర్షాభావం.. క్రీస్తు పూర్వం ఐదువేల సంవత్సరాల నాటి అవశేషాలను మరోసారి చూసే అవకాశాన్ని కల్పించింది. యూకేలోని నిలువురాళ్లు స్టోన్ హెంజ్ గురించి మీరు వినే ఉంటారు. వృత్తాకారంలో ఉండే ఈ భారీ సైజు రాళ్లను ఎవరు? ఎందుకు? ఏర్పాటు చేశారో ఇప్పటికీ మిస్టరీనే. ఈ స్టోన్ హెంజ్ తరహా రాళ్లు స్పెయిన్ లోనూ ఉన్నాయి. కాకపోతే వాల్డెకానాస్ రిజర్వాయర్‌లో ఉంటాయి ఇవి. కాసెరెస్ ప్రాంతంలోని ఈ రిజర్వాయర్ ఇప్పుడు దాదాపు అడుగంటింది. డోల్మెన్ ఆఫ్ గులాడాల్ పెరాల్ అని పిలిచే ఈ రాతి నిర్మాణాలను జర్మనీ పురాతత్వ శాస్త్రవేత్త హూగో ఓబెర్మెయిర్ 1926లో గుర్తించారు. అయితే ఫ్రాన్సిస్కో ఫ్రాంకో నియంతృత్వ రాజ్యంలో 1963లో ఈ ప్రాంతంలో రిజర్వాయర్ కట్టడంతో డజన్ల కొద్దీ భారీ రాళ్లున్న స్టోన్ హెంజ్ కాస్తా మునిగిపోయింది. స్పెయిన్ , పోర్చుగల్ సరిహద్దుల్లోనూ ఓ రిజర్వాయర్ పూర్తిగా ఎండిపోవడంతో అసెరెడో పేరున్న గ్రామం ఒకటి బయటపడింది. రిజర్వాయర్ నిర్మాణం కారణంగా ఈ గ్రామం 1992లో మునిగిపోగా 30 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడు చూడగలుగుతున్నారు. అలాగే స్పెయిన్ , బార్సిలోనాలోని బ్యుయెన్ డియా రిజర్వాయర్‌లో నీళ్లు ఇంకిపోవడంతో తొమ్మిదవ శతాబ్దం నాటి చర్చి ఒకటి వెలుగు చూసింది. ఇన్నేళ్లుగా నీళ్లలో మునిగి ఉన్నా ఈ చర్చి చెక్కు చెదరకుండా ఉండటం గమనార్హం. నన్ను చూస్తుంటే... ఏడవండి!!! నన్ను చూసి ఎడ్వకురా అన్న నానుడి మీరు వాహనాల వెనుక భాగంలో చూసి ఉండవచ్చు కానీ.. యూరప్‌లో ఈ ఏడాది వర్షాభావం కారణంగా ‘‘నన్ను చూస్తున్నారంటే... ఇక మీకు ఏడుపే మిగిలింది’’ అని రాసున్న రాళ్లు బయటపడ్డాయి. నదుల వెంబడి ఉండే ఈ రాళ్లపైని ఈ రాతలు గతకాలపు కరవు చిహ్నాలన్నమాట. రాతలు కనిపించే స్థాయికి నీటి మట్టం పడిపోయిందంటే.. ముందుంది కరవు కాలం అని హెచ్చరికన్నమాట. మధ్య యూరప్ లోని పలు ప్రాంతాల్లో ఇవి కనిపిస్తున్నాయి. వీటిని ‘‘హంగర్ స్టోన్స్’’ లేదా కరవు రాళ్లని పిలుస్తారు. చెకస్లోవేకియా పర్వత ప్రాంతం నుంచి జర్మనీ మీదుగా నార్త్ సీలోకి ప్రవహించే ఎల్బే నదిలో ఈ ఏడాది ఈ హంగర్ స్టోన్స్ బయటపడ్డాయి. ఎప్పుడో 1616 తరువాత ఇవి మొదటి సారి మళ్లీ బయటపడ్డాయని స్థానికులు చెబుతున్నారు. పదిహేనవ శతాబ్దం నాటి ఈ రాయిపై ‘‘వెన్ డూ మిచ్ సైన్స్ ్ డాన్ వైన్ ’’ అని ఈ రాళ్లపై రాసుంది. దీనిర్థమే ‘‘నన్ను చూస్తూంటే.. ఏడవండి’’ అని. 2013లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం.. ఏళ్ల కరవు కాటకాలను అనుభవించిన తరువాతే రాళ్లపై ఈ రాతలు ప్రత్యక్షమై ఉంటాయని తెలిపింది. 17వ శతాబ్దపు ఉద్యానవనాలు... యునైటెడ్ కింగ్‌డమ్‌లోనూ వర్షాభావం గత చరిత్ర ఆనవాళ్లను కళ్లెదుటకు తెస్తోంది. డెర్బిషైర్లో లేడీబౌవర్ రిజర్వాయర్ నీళ్లు అడుగంటిపోవడంతో 1940 ప్రాంతంలో ఈ రిజర్వాయర్ నిర్మాణం కారణంగా జలసమాధి అయిన డెర్వెంట్ గ్రామమూ అందులోని చర్చి ఇప్పుడు మళ్లీ అందరికీ దర్శనమిస్తున్నాయి. అలాగే కొలిఫోర్డ్ లేక్ రిజర్వాయర్‌లో వందల ఏళ్ల క్రితం నాటి వృక్షాల అవశేషాలు బయటపడగా ఇంగ్లాండ్ ఆగ్నేయ ప్రాంతంలోని స్వీడన్ లో పాతకాలపు ఉద్యానవన అవశేషాలు కనిపిస్తున్నాయి. 17వ శతాబ్దానికి చెందినదిగా భావిస్తున్న లైడయార్డ్ పార్క్‌లో ఎండ తాకిడికి గడ్డి మాడిపోవడంతో కిందనున్న నేల స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పార్కు ఏర్పాటుకు ముందు కొంచెం పక్కగా వేసిన మొక్కల తాలూకూ గుర్తులిప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. లాంగ్లీట్ ప్రాంతంలోనూ ఇలాంటి ఉద్యానవన ఆనవాలు ఒకటి బయటపడినట్లు సమాచారం. యునైటెడ్ కింగ్డమ్లో ఈ ఏడాది కరవు పరిస్థితి ఎంత భీకరంగా ఉందీ అంటే.. ఇంగ్లాండ్ మొత్తానికి ఆధారమైన... లండన్ మధ్యలో ప్రవహించే థేమ్స్‌కు నీరిచ్చే ప్రాంతాల్లో చుక్క నీరు లేదంటే అతిశయోక్తి కాదేమో!!! ఈ ఏడాది వేసవిధాటికి స్పెయిన్‌లోని లిమా నదిపై నిర్మించిన రిజర్వాయర్ అడుగంటిపోవడంతో బయటపడిన పురాతన రోమన్ గ్రామం. రెండువేల ఏళ్ల కిందటి ఈ గ్రామం రోమన్ సామ్రాజ్యకాలంలో సైనిక స్థావరంగా ఉపయోగపడేదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆనాటి కట్టడాలు, సైనిక స్థావరాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అగ్రరాజ్యం అమెరికాలోనూ... అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది వర్షాభావం తీవ్రంగా ఉంది. కాలిఫోర్నియాలో రాలని చినుకు కారణంగా లేక్‌మీడ్ దాదాపుగా అడుగంటిపోయింది. అలాగే టెక్సస్ రాష్ట్రంలోని దాదాపు 60 శాతం ప్రాంతం వర్షాభావాన్ని ఎదుర్కొంటోంది. నీళ్లు లేక ఎండిపోయిన జల వనరుల్లో సుమారు 11.3 కోట్ల ఏళ్ల క్రితం నాటి రాక్షసబల్లుల కాలిముద్రలు బయటపడ్డాయి. టెక్సస్‌లోని డైనోసార్ వ్యాలీ స్టేట్పార్క్లో బయటపడ్డ ఈ పాదముద్రలు అక్రోకాన్ థోసారస్ అనే రకం రాక్షసబల్లికి చెందిందని స్టేట్పార్క్ ఒక ప్రకటనలో తెలిపింది. బతికి ఉండగా ఇది సుమారు 15 అడుగుల ఎత్తు ఉండేదని బరువు ఏడు టన్నుల వరకూ ఉండి ఉండవచ్చునని తెలిపింది. అలాగే ఈ ప్రాంతంలోనే సారోపొసైడన్ రకం రాక్షసబల్లి ఆనవాళ్లూ గ్లెన్ రోజ్లో బయటపడింది. ఇది బతికుండగా 60 అడుగుల ఎత్తు, 44 టన్నుల బరువు ఉండి ఉండేదని అంచనా. సాధారణ పరిస్థితుల్లో ఈ రాక్షసబల్లుల పాదముద్రలు నీటిలో మునిగి ఉండేవని, పైగా మట్టితో నిండిపోయి అస్సలు కనిపించేవి కావని స్థానికులు తెలిపారు. వర్షం పడితే.. మళ్లీ ఈ పాదముద్రలు నీటిలో మునిగిపోతాయి. అయితే వీటిని వీలైనంత వరకూ జాగ్రత్తగా కాపాడేందుకు తాము అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు డైనోసార్ వ్యాలీ స్టేట్ పార్క్ అధికారులు చెబుతున్నారు. లేక్మీడ్లోనూ యుద్ధ నౌక... అమెరికాలోని లాస్‌వేగస్‌కు కొంత దూరంలో ఉండే లేక్ మీడ్‌కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ నిర్మిత సరస్సుల్లో లేక్‌మీడ్ ఒకటి. ఈ సరస్సుపైనే ప్రఖ్యాత హూవర్ డ్యామ్ నిర్మాణం జరిగింది. వర్షాభావం కారణంగా ఈ ఏడాది లేక్‌మీడ్ సరస్సు సామర్థ్యంలో కేవలం 27 శాతం మాత్రమే నీళ్లు ఉన్నాయి. 2000 సంవత్సరంతో పోలిస్తే 175 అడుగుల దిగువన లేక్‌మీడ్ జలమట్టం ఉండటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో హూవర్ డ్యామ్ ద్వారా జల విద్యుదుత్పత్తిని తగ్గించుకోవడంతోపాటు అరిజోనా, నెవెడా, మెక్సికో ప్రాంతాల్లో నీటి వినియోగాన్ని కూడా గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతాల్లో నీటి వినియోగంపై ఆంక్షలు పెట్టడం ఇది వరసుగా రెండో ఏడాది కావడం గమనార్హం. లేక్మీడ్కు నీటిని అందించే కొలరాడో నదీ పరీవాహక ప్రాంతంలో కొన్నేళ్లు వర్షాభావ పరిస్థితులు కొనసాగుతున్నాయి. - గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
ఆచార్య దేవో భవ..!
ఒక వ్యక్తి జీవితం మీద ఉపాధ్యాయుని ప్రభావం ఈ బిందువు దగ్గర అంతమైందని ప్రకటించడం దాదాపు అసాధ్యం. మనిషి జీవితాన్ని శాసించేవి, మార్చేవి, ఉత్థానపతనాలకు దోహదపడేవి విద్య, విజ్ఞానం. నేటితరం బాలలకి విద్యలోని శక్తిని పరిచయం చేసేవారే ఉపాధ్యాయులు. అలా వ్యక్తుల జీవితాలనీ, తద్వారా రేపటి సమాజాన్నీ తేజోమయం చేస్తారు గురువులు. లేలేత మనసుల పాలిట నైరూప్యచిత్రాల్లా ఉండే పాఠ్యాంశాలను క్రమంగా సుందరచిత్రాల్లా దర్శించే విధంగా వారిని తీర్చిదిద్దుతారు. నేర్చుకోవడం, అభ్యసించడం అనేవి జీవితంలో ప్రధానంగా గురుముఖంగానే జరుగుతాయి. నాగరికత ఆరంభం నుంచి ఉన్న గురువుల వ్యవస్థ ఎప్పటికీ ఉంటుంది. దానికి ప్రత్యామ్నాయం లేదు. అందుకే నాగరికత అనే జ్యోతి ఆరిపోకుండా తన చేతులొడ్డి రక్షించేవారే గురువులు అంటారు ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ. - డా. గోపరాజు నారాయణరావు మారుతున్న కాలాన్ని బట్టి, అవసరాల మేరకు విద్య కొత్త పుంతలు పడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయులు కూడా కాలంతో పరుగులు పెట్టాలి. ఇప్పుడు ఉపాధ్యాయుడు అంటే తరగతిలో పాఠం చెప్పి, హోవ్వర్క్ ఇచ్చి ఇంటికి పంపేవారే కాదు, ఇంటి దగ్గర కూడా విద్యార్థి మెదడు పనిచేసే విధంగా చేయగలిగినవారే. ఇప్పుడు డిజిటల్ టీచర్ ఇవాళ్టి తరగతి గది అంటే రేపటి భారతదేశం. ఆ తరగతి గదికి నాయకుడు ఉపాధ్యాయుడు. విద్యార్థి స్వశక్తి ఏమిటో, అతడిలోని తృష్ణ ఎంతటిదో గుర్తించడం దగ్గర ఉపాధ్యాయుడు విఫలమైతే విద్యార్థి అతడి జీవితంలోనే విఫలమైపోతాడు. ఇలా ఎన్నయినా సంప్రదాయ చింతనతో చెప్పుకోవచ్చు. అలా అని అవి భ్రమలు కూడా కాదు. కానీ ఉపాధ్యాయుడి స్థానంలో వచ్చిన అతి పెద్ద మార్పు 21వ శతాబ్దంలో ఆయన డిజిటల్ టీచర్‌గా మారడమే. ఈ నేపథ్యంతో డిజిటల్ యుగంలో మారిన ఉపాధ్యాయుని బాధ్యతను ఒక్కసారి పరిశీలించాలి. 21వ శతాబ్దం పెనుమార్పుల వేదిక. నిన్నటి విద్యార్థికీ నేటి విద్యార్థికీ ఎంతో వైరుధ్యం ఉంది. ఇవాళ్టి విద్యార్థి నిన్నటి విద్యార్థి కంటే చాలా పరిణతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రపంచ పరిస్థితులు, శాస్త్రసాంకేతిక రంగాలలో సంభవించిన విస్ఫోటం వీళ్లకి ఆ అవకాశాలని దోసిళ్ల నిండుగా అందించాయి. ఈ కాలాన్ని శాసిస్తున్నదే సాంకేతిక పరిజ్ఞానం. ఆ క్రమంలోనే ఉపాధ్యాయుడు అన్న వ్యవస్థ కొత్త అర్థాలను సంతరించుకునే పనిలో నిమగ్నమయింది. కేవలం రెండు దశాబ్దాల క్రితం ఉపాధ్యాయుని స్థానం నేటి ఉపాధ్యాయుని స్థానం ఒక్కటి కానే కావు. ఆ ఉద్యోగం పరిధి, దానికి ఉండవలసిన దృష్టి అంచనాకు అందనంత మార్పుకు లోనయ్యాయి. ఆలోచించే నైపుణ్యం, జీవించే నైపుణ్యాల మీద ఆధారపడి 21వ శతాబ్దంలో విద్య నిర్మితమవుతున్నది. తరగతి గది నుంచి బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన విద్యార్థి, బయటి వ్యవస్థల అవసరాలకు ఆసరా కాగల తీరులోనే ఇవాళ్టి చదువు ఉండాలని చెబుతున్నారు. తరగతిలో నేర్చుకున్నది బయటి ప్రపంచంలో విద్యార్థి బతకడానికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత అన్న దృష్టి ఈ పరిణామం నిండా కనిపిస్తుంది. కేవలం బోధకుడు కాదు ఇవాళ్టి ఉపాధ్యాయుడు కేవలం బోధకుడు కాదు. ఉద్యోగితా నైపుణ్యాలను పెంచే బాధ్యతతో పాటు విద్యార్థుల మేధావికాసం, విశ్లేషణాత్మకంగా ఆలోచించేటట్టు చేయడం, సృజనాత్మక దృష్టిని పెంపొందించడం, జీవితాంతం గుర్తుండే విద్యను అందించడం కూడా వారు నిర్వర్తించవలసిన గురుతర బాధ్యతలుగానే మారాయి. గ్లోబల్ యుగంలో డిజిటల్ ఆధారిత ఉద్యోగితా నైపుణ్యాల సాధనలో విద్యార్థికి నిర్దేశకులుగా ఉండవలసింది ఉపాధ్యాయులే. విద్యార్థుల నైపుణ్యాలు పెంచడానికి తమ నైపుణ్యాలను అవిశ్రాంతంగా పెంపొందించుకోవలసిన యుగంలో ఉపాధ్యాయులు ఉన్నారు. లేకపోతే ఎదురయ్యే ప్రమాదం తక్కువేమీ కాదు. ఇప్పుడు ఉపాధ్యాయునితో సమంగా విద్యార్థి కూడా పరిజ్ఞానం సంతరించుకో గలుగుతున్నాడు. కారణం ఇంటర్నెట్తో సాహచర్యం. తన నైపుణ్యానికి సృజనను కలిపి ఉపాధ్యాయుడు విద్యార్థికి జ్ఞానాన్ని అందించాలి. లేకపోతే డిజిటల్ యుగంలోను విద్యాధికులైన నిరుద్యోగులు పెరిగిపోతారు. ఇదే అసలు ప్రమాదం. కోటి మంది ఉపాధ్యాయులు ఎన్సీఈఆర్టీ ఏడో సర్వే, కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం (2011–12) దేశంలో 10,31,000 పాఠశాలలు (గుర్తింపు కలిగినవి) ఉన్నాయి. 2019లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం 900 విశ్వవిద్యాలయాలు, 40,000 కళాశాలలు ఉన్నాయి. ‘నో టీచర్ నో క్లాస్ భారత్‌లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ప్రకారం ప్రస్తుతం దేశంలో 97 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు (ఈ నివేదిక ప్రకారం మరొక పది లక్షల మంది ఉపాధ్యాయులు అవసరం). టాటా ట్రస్ట్‌లలోని ది టీచర్స్ ఎడ్యుకేషన్ ఇనీషియేటివ్ (టీఈఐ) ఉపాధ్యాయుల బోధన నైపుణ్యాలను నిలబెడుతూ, ఆధునీకరించడానికి ప్రయత్నిస్తున్న సంస్థ. వీటి ఆధ్వర్యంలో 2018లో స్థాపించిన సంస్థ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ టీచర్ ఎడ్యుకేషన్. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ కేంద్రంగా ఇది పనిచేస్తున్నది. చిరకాలంగా నిర్లక్ష్యానికి గురైన ఉపాధ్యాయ ప్రతిభను మెరుగుపరచే పనిని ఈ సంస్థ యునెస్కో సహకారంతో చేపట్టింది. ‘నో టీచర్ నో క్లాస్ భారత్‌లో విద్య పరిస్థితిపై నివేదిక 2021’ ఇది ఇచ్చినదే. మంచి చెడు రెండింటి గురించి బేరీజు వేసుకుని ఈ సంస్థ తన పని సాగిస్తున్నది. 50 శాతం మహిళలతో ఉపాధ్యాయ వృత్తి స్త్రీపురుష నిష్పత్తిని సమంగా నిలబెట్టుకుంటున్నది. గ్రామీణ ప్రాంతం నుంచి యువత, స్త్రీలు ప్రధానంగా ఈ వృత్తిని ఇష్టపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో సామాజిక గౌరవం సాధారణంగానే ఉంది. దేశంలో ఎక్కువ పాఠశాలలు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలు ఉపాధ్యాయుడే కేంద్రకంగా పనిచేస్తున్నాయి. వారి నమ్మకాలే బోధనను నిర్దేశిస్తున్నాయని ఆ నివేదిక తేల్చింది. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశం పట్ల ఎక్కువ మంది ఉపాధ్యాయులు సానుకూలంగానే ఉన్నారని ఆ నివేదిక చెప్పడం శుభవార్తే! వీరిలో 25 శాతం విధుల విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనీ, 30 శాతం ఈ వృత్తి నుంచి తప్పించదగినవారే ఉన్నారనీ వెల్లడించడం ఆందోళన కలిగిస్తుంది. ఇందుకు కారణం ఇప్పటి వరకు ఉపాధ్యాయుల ప్రతిభకు పదును పెట్టే ప్రత్యేక ప్రయత్నమేదీ జరగలేదు. ప్రపంచ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న భారత్ ఈ అంశం మీద ఇక దృష్టి పెట్టక తప్పదు. ప్రోత్సాహమే సగం విద్య విద్యార్థి మరొక యుగానికి చెంది ఉంటాడు. కాబట్టి అతడి మీద మీ యుగపు పరిజ్ఞానం మేరకు పరిధులు విధించవద్దు అంటారు రవీంద్రనాథ్ టాగోర్. నిజమే, విద్యార్థులను ప్రభావితం చేసే శక్తి ఉన్న ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని ఇచ్చే వనరుల మీద పరిమితులు విధించరు. ఆ దిశగా ప్రోత్సహిస్తారు కూడా. విద్యార్థిని ప్రభావితం చేయడానికి జ్ఞానాన్ని, కొత్త పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా అభ్యసించే అవకాశం కల్పిస్తారు. అందుకే ఈ తరం ఉపాధ్యాయుని డిజిటల్ లీడర్‌గా కూడా చూస్తున్నారు. చేస్తున్న పనిని ఆస్వాదించడం, ఆస్వాదించే తీరులో పనిని తీర్చిదిద్దడం కూడా ఆయనకు తెలుసు. జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుంది. దీనితో విద్యార్థులు అలాంటి ఉపాధ్యాయులను మరింత గౌరవిస్తారు. నిజంగా విద్య అంటే పదింట తొమ్మిది వంతులు ప్రోత్సాహమే. నాలుగు ‘సి’లు ఇప్పుడు పోటీతత్వం మరింత పెరిగింది. అదే సమయంలో ఉద్యోగ జీవితానికి సంబంధించి ఎంపికలకు కూడా విద్యార్థులకు ఎన్నో కొత్తదారులు ఏర్పడ్డాయి. విద్యార్థి మనస్తత్వాన్ని బట్టి ఆ దారులకు మళ్లించే బాధ్యత ఉపాధ్యాయునిదే. భవిష్యత్తులో నాలుగు ‘సి’ల మీద విద్యార్థి భవితవ్యం ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.. క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రియేటివిటీ. ఈ పదాలు, వాటి భావనలతో విద్యార్థిని మమేకం చేయవలసిన బాధ్యత కూడా ఉపాధ్యాయునిదే. వాటి గురించి నిజమైన అవగాహన ఏర్పడితే కాలానికి తగినట్టు పోటీ ప్రపంచంలో నెగ్గడానికి విద్యార్థిలో సంసిద్ధత వస్తుంది. డిజిటల్ యుగంలో అందుబాటులో ఉన్న పెద్ద జ్ఞానసాగరం ఇంటర్నెట్. యూట్యూబ్, ట్యుటోరియల్, ఈబుక్ , ముద్రిత పత్రాలు ఇప్పుడు అందుబాటు ఉన్నాయి. నేటి ఉపాధ్యాయుని కర్తవ్యం విద్యార్థి అభిరుచిని బట్టి ఆ నైపుణ్యాలకు వారిని చేరువ చేయాలి. ఉపాధ్యాయుల సామర్థ్యానికి కూడా పరిధులు ఉన్నా, ఆ నైపుణ్యాల దిశగా విద్యార్థిని మళ్లించే వెసులుబాటూ ఉంది. నేర్చుకోవడానికి తగిన వాతావరణంలోకి వారిని తీసుకువెళ్లే నైపుణ్యం ఈ తరం ఉపాధ్యాయులలో ఉండాలి. భావి భారతాన్ని నిర్మించే బాధ్యత ఉన్నవారు మొదట తమను తాము నిర్మించుకోవాలి. ప్రాథమిక పాఠశాల కావచ్చు, ప్రాథమికోన్నత పాఠశాల కావచ్చు, కళాశాల లేదా విశ్వవిద్యాలయం కావచ్చు. ఉపాధ్యాయుడు ఎక్కడ బోధిస్తున్నా ఆయన ఒక విద్యార్థిని తయారు చేసే బాధ్యతను నిర్వర్తిస్తున్నట్టే. నూతన విద్యావిధానం 2020: ఉపాధ్యాయుడు మారుతున్న విద్య, ఉపాధ్యాయ వ్యవస్థలు సమాజంలో పాక్షికంగానే అమలు కావడం సరికాదనే ‘నూతన విద్యావిధానం 2020’ భావిస్తున్నట్టు కనిపిస్తుంది. అంగన్వాడీలలో చదువుకునే బాలలు సహా మన దేశ విద్యార్థి జనాభా 40 కోట్లనీ, వీరందరికీ బోధిస్తున్న 1.5 కోట్ల మంది ఉపాధ్యాయులనీ దృష్టిలో ఉంచుకుని ‘నూతన విద్యావిధానం 2020’ ఆవిర్భవించిందని నివేదిక రూపకల్పనలో భాగస్వామి, ఆర్ఎస్ఎస్ అనుబంధ విద్యాభారతి జాతీయ అధ్యక్షుడు దూసి రామకృష్ణ చెప్పారు. రెండు కోట్లు డ్రాపౌట్స్ ఉన్నా, 38 కోట్లు ఎప్పుడూ తరగతులలో ఉంటారు. ప్రభుత్వం ఎంత ఆధునిక, విస్తృత విద్యా వ్యవస్థను ప్రవేశపెట్టినా దానిని అమలు చేయవలసింది ఉపాధ్యాయుడే. వచ్చే దశాబ్దం ఉపాధ్యాయ దశాబ్దం కావాలని ఈ నివేదిక లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రపంచంలో బహుశా ఏ దేశంలోను కనిపించనంత భారతీయ అధ్యాపకశక్తిని సశాస్త్రీయంగా ఉపయోగించుకుంటే ఎంతో మార్పు తేవచ్చునన్న ఆలోచనతో విద్యా విధానం సూచనలు చేసింది. సమగ్ర బోధకుడు అనే భావనను ముందుకు తెచ్చిన ఆ నివేదిక ఉపాధ్యాయులకు నాలుగేళ్ల శిక్షణను సూచించింది. అంతేకాదు, వృత్తి నైపుణ్యం వృద్ధి చేసే ఒక నిరంతర శిక్షణను కూడా కొత్త విద్యా విధానం ముందుకు తెచ్చింది. ఉపాధ్యాయుడిగా జీవించాలి అన్న కోరిక ఉన్నవారే ఆ వృత్తిలోకి రావడం గురించి విద్యా విధానం చర్యలు తీసుకుంది. నేర్చుకుంటూనే నేర్పించాలి. ఇవాళ్టి మరొక పరిణామం కూడా ఉపాధ్యాయుల దృష్టిలో ఉంది. సాంకేతిక పరిజ్ఞానం గురించి ప్రస్తావన, వినియోగం లేకుండా ఇవాళ విద్యార్థి నేర్చుకోవడానికి సిద్ధం కాలేడు. మొదట ఉపాధ్యాయునికి ఈ పరిజ్ఞానం ఉండాలి. ఇంటర్నెట్ మీద, దానిని అన్వేషించడం మీద ఉపాధ్యాయుని పరిచయం లేకుంటే ఆయన విద్యార్థులకు చెప్పలేరు. విద్యార్థులను సదా ప్రభావితం చేయగలిన ఉపాధ్యాయుడంటే జీవిత కాలం నేర్చుకునే లక్షణం కలిగి ఉంటారు. తాము బోధించే పాఠ్యాంశంలో వచ్చిన మార్పులు, చేర్పుల పట్ల స్పృహ కలిగి ఉంటారు. అంటే వచ్చే దశాబ్దంలో ఎలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయో వారు చెప్పగలిగి ఉంటారు. విషయ సేకరణ ఆధారంగా చేసే విద్యార్జన ప్రాధాన్యం తెలిసి ఉండడం 21వ శతాబ్దం ఉపాధ్యాయుడి ముఖ్య లక్షణాలలో ఒకటి. ఇప్పుడు నిపుణులు చెబుతున్న అద్భుతమైన ఒక సూత్రం గురించి ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి. 21వ శతాబ్దంలో నిరక్షరాస్యుడని ఎవరిని చెప్పవచ్చునంటే చదవడం రాయడం చేతకాని వారిని కాదు. నేర్చుకోలేనివారిని, నేర్చుకొనే సంసిద్ధత లేనివారిని, మళ్లీ మళ్లీ నేర్చుకుంటూనే ఉండాలన్న స్పృహ లేనివారినే. నేర్పించడం అనే కళ, శాస్త్రీయతలను మిళితం చేసే బోధనా పద్ధతులను ఇవాళ ఎక్కువ మంది ఉపాధ్యాయులు అలవరచుకుంటున్నారు. ఉపాధ్యాయుడు నేర్పించడాన్ని ప్రేమించాలి. నేర్చుకునేవాళ్లను ప్రేమించాలి. ఈ రెండింటినీ సమన్వయం చేయడానికి ఇంకా ఇష్టపడాలి. వివిధ సాంస్కృతిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులతో నిండి ఉండే తరగతిలో బోధించే విధానానికి వారు అలవాటు పడాలి. ప్రతి విద్యార్థికి సంబంధించి విద్యావసరాలు, సామర్థ్యాలు, అభిరుచులపైన ఉపాధ్యాయులు దృష్టి పెడుతున్నారు. విద్యార్థుల ఐచ్ఛిక విద్యాభిరుచిని గమనించి సమాజంలో ఉత్పాదకతకు ఉపయోగపడే భాగస్వామిగా మలచడం ఇవాళ ఉపాధ్యాయుల ముందు ఉన్న ప్రథమ కర్తవ్యంగా అవతరించింది. స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీతో తరగతిలో మరింత చురుకుగా ఉండేటట్టు చేయడం, విద్యా సంబంధ కార్యకలాపాలలో చేయూత నివ్వడం ఉపాధ్యాయులు ఇవాళ ఒక సవాలుగా తీసుకుంటున్నారు. ఎలా నేర్చుకోవాలో చెప్పగలిగితే పిల్లలు మరింత కష్టపడతారు. ఎడ్యుకేటర్ లేదా ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత ఏదీ అంటే సమాజం ఎదుర్కొంటున్న వాస్తవిక సమస్యలు పరిష్కరించడానికి ఉపకరించే విద్యా విధాన పద్ధతులను అన్వేషించాలి. మోతాదు మించుతున్నదా? ఇంతకీ విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం మోతాదుకు మించుతున్నదా? ఈ ప్రశ్న వేసుకోక తప్పదు. భారత సామాజిక నేపథ్యంలో ఈ ప్రశ్న మరింత అవసరం.అందుకు సంబంధించిన భయాలు ఇప్పుడు మొదలయినాయి కూడా. 2030 సంవత్సరానికి, అంటే కేవలం ఎనిమిదేళ్లలోనే గురువు అనే స్థానానికి సాంకేతిక పరిజ్ఞానం పంగనామం పెట్టబోతున్నదన్న భయాలు అవి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్‌చైన్ తరగతి గదిని శాసిస్తాయన్న అంచనాలు ఉన్నాయి. ఈ భయాల వెనుక విపరీతంగా ప్రవేశిస్తున్న శాస్త్రసాంకేతిక రంగాలు ఒక్కటే కారణం కాదు. సాంకేతికతకు మోకరిల్లుతున్న నేటి తరాలు కూడా కారణమే. పాలకులు, నేతలు, రాజకీయ సంస్థలు దేశం పురోగమించడం గురించి, ప్రపంచపటంలో దివ్యమైన స్థానం గురించి తమకున్న కల్పనలో విద్య స్థానం ఎక్కడో ఇప్పటికీ చెప్పడం లేదు. దేశాభివృద్ధికి పునాదులు తరగతి గదులలో పడతాయన్న వాస్తవం గుర్తించడానికి వారికి ఇంకెంత కాలం పడుతుందో తెలియడం లేదు. ఇవన్నీ ఉన్నా కొన్ని వాస్తవాలను అంగీకరించాలి. ఉపాధ్యాయుడికి పరిమితులు ఉన్న మాట నిజం. కానీ ఆయన తరగతిలో బోధించినట్టు, ఆయన కంటే ఎంతో ఎక్కువ ‘డేటా’ కలిగి ఉండే రోబో ఆయనకు ఏనాటికీ ప్రత్యామ్నాయం కాదు, కాలేదు. కాబట్టి 22వ శతాబ్దంలోకి ప్రవేశించినా పాఠ్యాంశాలు మారవచ్చు. పాఠశాలలు, అందులోని తరగతుల రూపురేఖలు అసాధారణంగా ఉండవచ్చు. బోధనా పద్ధతులు మారిపోవచ్చు. బాలలు మరింత చురుకుగా ఉండవచ్చు. కానీ అక్కడ ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. అప్పుడే విద్యార్థికి మార్గదర్శనం లభిస్తుంది. గురుస్థానం శాశ్వతం కావాలి. విద్య, విలువలు, ఉపాధ్యాయుడు పిల్లల మేధను విద్యతో ప్రకాశింపచేసే క్రమంలో వాళ్ల హృదయాలను కూడా విద్యతో గుబాళింపచేయడం మరవరాదని దలైలామా అంటారు. ఈ పని కుటుంబంలో జరగాలి. ఆపై ఆ బాధ్యత ఉపాధ్యాయులు స్వీకరించాలి. పురోగమిస్తున్న సమాజంలో విలువలకు స్థానం లేకుంటే విపరీతాలకు దారి తీస్తుంది. ఒక భావిపౌరుడి ప్రవర్తన అతడికి ఉన్న విలువలను బట్టే నిర్మితమవుతుంది. నీతి నిజాయతీలు, విచక్షణ, సామాజిక సేవ పట్ల అనురక్తి, జాతీయ సమైక్యత పట్ల గౌరవం, సామాజిక న్యాయం పట్ల అవగాహన ఇవన్నీ కూడా విలువల నుంచి సంక్రమించేవే. యువత కౌమారమంతా తరగతి గదిలోనే గడుస్తుంది కాబట్టి ఉపాధ్యాయులు ఈ విషయంలో ఎక్కువ బాధ్యత స్వీకరించాలి. విలువలంటే మానసిక ఆరోగ్యాన్ని కాపాడేవే. వీటన్నిటికీ మించినది క్రమశిక్షణ. అది విద్యార్థి జీవితం నుంచి మొదలు కావాలి. అదొక విలువ. గురుశిష్య బంధానికి అడ్డుకట్ట? గురుశిష్య బంధం అనివార్యం. కానీ ఈ బంధం తెగిపోతున్నదా అని ప్రశ్నించుకునే వాతావరణం ప్రస్తుతం కనిపించడం విషాదమే. చాలా కళాశాలలు, కొన్నిచోట్ల పాఠశాలలు కూడా మత్తు మందులకు చేరువ కావడం గురుశిష్య సంబంధం బలహీన పడుతున్నదని చెప్పడానికి ఉపకరించేదే! విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కావడం సామాజిక ఉల్లంఘన. శిష్యులను అలాంటి వాటి జోలికి వెళ్లకుండా నిరోధించలేకపోవడం గురువుల సామాజిక ఉల్లంఘన. ఎన్ని చట్టాలు వచ్చినా ర్యాగింగ్ భూతం లొంగకపోవడం విద్యార్థి, ఉపాధ్యాయుడు ఇద్దరూ కూడా సామాజిక బాధ్యతను మరచిపోయిన ఫలితమే. అదుపు చేయాలని ఉపాధ్యాయులకు, ఒదిగి ఉండాలని విద్యార్థులకు లేకపోతే విపరీత పరిణామాలు తప్పవు. సాంకేతికత ప్రత్యామ్నాయం కాలేదు వెనువెంటనే కాకున్నా, సమీప భవిష్యత్తులో భారత్‌లో కూడా తరగతి గదిని సాంకేతికత శాసిస్తుంది. కరోనా ఈ అవసరాన్ని కాస్త ముందుకు తెచ్చింది కూడా. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సాంకేతికతను ప్రవేశ పెట్టడం గురించి వస్తున్న ఒత్తిడి కూడా తక్కువగా లేదు. ఎల్కేజీ దగ్గర నుంచి పలకా బలపాలు మాయమవుతున్నాయి. అయితే ఒక ప్రశ్న. సాంకేతికత ఉపాధ్యాయునికి నిజంగానే ప్రత్యామ్నాయం కాగలదా? డిజిటల్ వ్యవస్థ ఎంత విస్తరించినా, బలపడినా అది ఉపాధ్యాయునికి ప్రత్యామ్నాయం కాలేదు. నేపథ్యాన్ని బట్టి భారతీయ సమాజంలో విద్యార్థులంతా ఒకే విద్యా ప్రమాణాలు ప్రదర్శించే పరిస్థితిలో లేరు. విద్యార్థులందరి అభిరుచిని ఉపాధ్యాయుడు మాత్రమే గమనించగలడు. గురుశిష్య సంబంధం పాతబడేది కాదు. జీవితానుభవాన్ని, సృజనాత్మక శక్తిని మేళవించి పాఠ్యాంశాలను చెప్పగలిగేది గురువు మాత్రమే. ఉపాధ్యాయుడు తేగలిన మార్పు సాంకేతికతతో సాధ్యంకాదని ఇప్పటికే కొన్ని పరిశోధనలు తేల్చాయి. ఎందుకంటే విద్య అంటే కేవలం కొన్ని వాస్తవాలు, ఇంకొన్ని సమీకరణల సమ్మేళనం కాదు. అభ్యాసానికి అనుగుణమైన వాతావరణం గురుశిష్య సంబంధం నుంచి జనిస్తుంది. అది యంత్రం ద్వారానో, కంప్యూటర్ తెరతోనో సాధ్యం కాదు. విద్యార్థిని స్వతంత్రంగా ఆలోచింప చేసేదే విద్య. ఆ పని ఉపాధ్యాయుని ద్వారా జరుగుతుంది. భావి తరాలను విశ్వమానవులుగా తీర్చిదిద్దే విధంగా ఉపాధ్యాయులు తయారు కావడం అవసరమే. ఆ క్రమంలో కొన్ని భ్రమలలో ఎవరూ కొట్టుకుపోరాదు. డిజిటల్ యుగంలో మనదైన చరిత్ర, మనదైన సాహిత్యం, కళ, సాంస్కృతిక వారసత్వం చిన్నబోయే పరిస్థితి ఏర్పడడం సరికాదు. మన ప్రాంతీయ భాషలకు గ్రహణం పట్టకూడదు. ఆధునిక విద్య, ఆధునిక విద్యారీతులు మత్తులో మళ్లీ వేరొక వ్యవస్థకు మన యుతరం బోయీలు కారాదు. విద్యావిధానం ఆధునికం కావాలి. అదే సమయంలో అందులో మట్టివాసన ఉండాలి. కంప్యూటర్‌కే, ప్రయోగశాలకే విద్యార్థిని పరిమితం చేయడమూ సరికాదు. విద్యావిధానంలో ఆధునికత సృజనాత్మకతకు, క్రీడాప్రతిభకు ఆస్కారం కల్పించాలి. డిజిటల్ విద్యావిధానానికి ఉపాధి కల్పన పునాదిగా ఉన్నప్పటికి, సామాజిక బాధ్యత పట్ల యువతకు నిరంతర స్పృహ అవసరమన్న విషయమూ గుర్తించాలి. కొత్త విద్యావిధానం విద్యార్థికీ, సమాజానికీ మధ్య అడ్డుగోడ కట్టేది కారాదు. ఎందుకంటే పాఠశాల అనేది సమాజానికి సుదూరంగా ఉండే వ్యవస్థ కాదు. కొత్తయుగంలో కొత్త తప్పిదాలకు చోటు లేకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులు తీసుకోగలరు. ఎందుకంటే పాఠ్యప్రణాళిక రూపకల్పనలో వారి పాత్ర వాస్తవం. డిజిటల్ యుగం పాత సమస్యలను గమనించకుండా సాగితే అది వైఫల్యానికే దారి తీస్తుంది. భారతదేశానికి సంబంధించినంత వరకు అంతరాలు ఒక వాస్తవం. డిజిటల్, శాస్త్రసాంకేతిక వినియోగం అందరికీ సమంగా అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను అందుకు తగినట్టు రూపొందించాలి. డిజిటల్ లీడర్లు ఇటు వైపు చూడకపోతే సమాజంలో పెద్ద అగాధం ఏర్పడుతుంది. విద్యారంగంలో అంతరాలు నిరోధించడానికి కొన్ని దశాబ్దాల పాటు జరిగిన ప్రయత్నాలు నీరుకారాయన్న విమర్శ ఇప్పటికే ఉంది. ఒకప్పుడు అన్ని వర్గాల వారు ప్రభుత్వ పాఠశాలలకే వెళ్లి చదువుకునేవారు. సమాన అవకాశాలు అన్న సూత్రాన్ని వమ్ము చేసే విధంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు చతికిలపడ్డాయి. చదువు ‘కొనడం’ అన్న మాట కూడా ఇప్పుడు వినవలసి వస్తున్నది. చదువు ప్రాథమిక హక్కుగా అవతరించిన తరువాత కూడా అక్షరం గగన కుసుమం కావడం పురోగతికి దోహదం చేసే పరిణామం కాదు. ఉపాధ్యాయులు తాము నేర్చుకుంటూనే విద్యార్థులకు నేర్పుతారు. ఆ క్రమంలో సరైన నడత నేర్చుకోమని ఉపాధ్యాయునికి ఎవరో చెప్పే పరిస్థితి రావడం విషాదమే. ఇటీవల వస్తున్న వార్తలు కొందరు ఉపాధ్యాయుల పట్ల అసహనాన్ని పెంచేవిగా ఉన్నాయి. మద్యం సేవించి పర్యవేక్షకునిగా పరీక్ష హాలుకు వచ్చిన వారు, చిన్నారుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి అరెస్టయినవారు ఇంకా తీవ్రమైన అసాంఘిక చర్యలకు ఉపాధ్యాయులు పాల్పడుతున్న సంగతులు బయటపడుతున్నాయి. ఇక విద్యార్థులను తీవ్రంగా దండిస్తున్న సంఘటనలకు అంతేలేదు. బయటి సమాజంలోని బలహీనతలు, ప్రలోభాలకు ఉపాధ్యాయులు లోను కాకుండా చేయడానికి నూతన విద్యా విధానం 2020లో ప్రతిపాదించిన నాలుగేళ్ల ఉపాధ్యాయ శిక్షణతో సాధ్యం కాగలదని విశ్వసిద్దాం. మారుతున్న కాలంలో ఉపాధ్యాయ వృత్తి మీద పెరుగుతున్న ఒత్తిడికి విరుగుడుగా ఈ విధానం సాధికారత కల్పించడం ఒక వెసులుబాటు. -
మిషన్.. స్వదేశీ
భారత స్వాతంత్య్ర పోరాటం జోరందుకుంటున్న తరుణమది. తెల్లదొరలు అడ్డగోలుగా చేసిన బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ 1905లో విదేశీ వస్తు బహిష్కరణ.. స్వదేశీ ఉద్యమం పెల్లుబికింది. దేశీయ ఉత్పత్తుల వినియోగానికి ప్రజలు ముందుకొచ్చారు. తదనంతరం జాతిపిత మహాత్మాగాంధీ చేపట్టిన సత్యాగ్రహ, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా వంటి ఉద్యమాలకు స్వదేశీ నినాదమే పట్టుగొమ్మగా నిలిచింది. ఈ ఉద్యమాలు అప్పటి ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో స్వదేశాగ్నిని రగిలించడంతో.. దేశంలో ఎన్నో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు పురుడుపోసుకున్నాయి. ‘మేడిన్ ఇండియా’ బ్రాండ్లు బోలెడన్ని పుట్టుకొచ్చాయి. వాటిలో కొన్ని భారతీయుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుని పురోభివృద్ధి సాధిస్తున్నాయి. మరికొన్ని కాలానుగుణంగా కొత్త మార్పులను సంతరించుకుని, ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ పిలుపునిచ్చిన స్వావలంబన భారత్‌కు చేదోడుగా నిలుస్తున్నాయి. శతాబ్ది స్వాతంత్య్ర వేడుకల నాటికి ‘స్వదేశ్ 2.0’తో దేశం అన్ని రంగాల్లోనూ స్వయం సమృద్ధి సాధించేలా చేయాలన్నది ‘మేకిన్ ఇండియా’ లక్ష్యం. దీని సాకారానికి ‘ఆత్మనిర్భర్‘తో సమాయత్తమవుతున్న వేళ... 1947కు పూర్వం మొగ్గతొడిగిన మన స్వదేశీ వ్యాపారామృతాల్లో కొన్నింటి గురించి ఈ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నెమరువేసుకుందాం. బ్యాంకింగ్‌లో ‘పంజా’బ్! స్వదేశీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్.. దేశానికి ఆర్థిక స్వాతంత్య్రం కూడా రావాలంటే స్వదేశీ సంస్థల ఏర్పాటుతోనే సాధ్యమని భావించారు. మన దేశ సంపదను బ్రిటిష్ బ్యాంకులు, కంపెనీలు కొల్లగొడుతున్నాయని, దీనికి అడ్డుకట్టవేయాలంటే.. మనకంటూ ఒక భారతీయ బ్యాంక్ ఉండాలనుకున్నారు. అలా ఆవిర్భవించిందే మొట్టమొదటి స్వదేశీ బ్యాంక్.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). 1895 ఏప్రిల్ 12న అవిభాజ్య భారతదేశంలోని లాహోర్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మొదటి బ్రాంచ్‌లో మొదటి బ్యాంక్ అకౌంట్‌ను తెరిచిన వ్యక్తి లాలా లజపతి రాయ్. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ వంటి స్వరాజ్య సారథులు సైతం ఈ బ్యాంకు ఖాతాదారులుగా మారారు. భారత్‌లో టెల్లర్ సిస్టమ్‌ను ప్రవేశపెట్టిన తొలి బ్యాంక్ (1944లో) కూడా ఇదే. దేశ విభజనను ముందే పసిగట్టిన అప్పటి పీఎన్బీ సారథి లాలా యోద్ రాజ్.. బ్యాంక్ రిజిస్టర్డ్ ఆఫీసును లాహోర్ నుంచి ఢిల్లీకి తరలించారు. విభజన తర్వాత పశ్చిమ పాకిస్థాన్‌లోని 92 బ్రాంచ్‌లను పీఎన్బీ మూసేసింది. 1969లో ఇందిరా గాంధీ బ్యాంకులను జాతీయం చేయడంతో పీఎన్బీ ప్రభుత్వ రంగ బ్యాంకుగా మారింది. సంక్షోభాలు, కుంభకోణాలు ఇలా ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఇప్పటికీ దేశంలో రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా తన స్వదేశీ ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. ఇంట్లో బీరువా.. ఇంటికి తాళంకప్ప.. ఒంటికి సబ్బు! స్వదేశీ ఉద్యమ నినాదం మార్మోగుతున్న వేళ పారిశ్రామికవేత్త అర్దేశిర్ గోద్రెజ్.. సబ్బుల తయారీలో ‘స్వదేశీ‘ సత్తా ఏంటో చాటుతామని ప్రతినబూనారు. 1918లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వెజిటబుల్ ఆయిల్‌తో స్నానపు సబ్బు ‘చావీ’ని తయారు చేసి రికార్డు సృష్టించారు. తొలుత నం. 2, తర్వాత నం.1 పేర్లతో ఈ బ్రాండ్‌లో సబ్బులు ప్రవేశపెట్టారు. ఈ స్వదేశీ సబ్బులకు రాజగోపాలాచారి, రవీంద్రనాథ్ టాగోర్ వంటి దిగ్గజాలు ప్రచారం చేయడం విశేషం. ఇక 1920 చివర్లో వచ్చింది గోద్రెజ్ ‘వత్నీ’! దీనికి అర్థం ‘వతన్ సే’.. అంటే ‘మాతృభూమి నుంచి’ అన్నమాట! వందేళ్ల తర్వాత కూడా నం.1 బ్రాండ్ ఉండటమే కాకుండా, ఏటా 38 కోట్లకు పైగా సబ్బులు అమ్ముడవుతున్నాయి. 1897లో సోదరుడితో కలసి గోద్రెజ్ అండ్ బోయ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్‌ను స్థాపించారు అర్దేశిర్. మొదట్లో తాళాలు, సేఫ్‌లు, సెక్యూరిటీ పరికరాలను తయారు చేసేవారు. అంతేకాదు 1951లో జరిగిన తొలి భారత సార్వత్రిక ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులను తయారు చేసిందీ గోద్రెజే కావడం విశేషం. అప్పట్లో ఇంట్లో గోద్రెజ్ బీరువా, ఇంటికి గోద్రెజ్ తాళంకప్ప.. ఈ ఉత్పత్తులకు పర్యాయపదాలుగా మారాయి. ఫర్నిచర్ నుంచి కన్స్ట్రక్షన్, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్, గృహోపకరణాలు, ఇన్ఫోటెక్, ఏరోస్పేస్.. ఇలా 15 రంగాలకు పైగా విస్తరించి ఆత్మనిర్భర్ భారత్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది గోద్రెజ్. షర్బత్ అంటే.. రూహ్ అఫ్జా! స్వాతంత్య్రోద్యమ కాలంలో పక్కా మేడిన్ ఇండియా బ్రాండ్‌గా ఆవిర్భవించింది ‘హమ్దర్ద్’. 1906లో హకీమ్ హఫీజ్ అబ్దుల్ ఢిల్లీలో ఈ యునానీ ఫార్మాస్యూటికల్ కంపెనీని నెలకొల్పారు. ఆ తర్వాత అది తన విలక్షణ ఉత్పత్తులతో దేశవ్యాప్తంగా ఇంటిల్లిపాదికీ చిరపరిచితంగా మారిపోయింది. షర్బత్ అంటే ‘రూహ్ అఫ్జా’ అనేంతగా ప్రాచుర్యం సంపాదించింది. అనేక యునానీ ఔషధాలనూ ఇది విక్రయిస్తోంది. హఫీజ్ మరణానంతరం కుమారుడు హకీమ్ అబ్దుల్ హమీద్‌తో కలసి భార్య రబియా బేగమ్ ఈ వ్యాపారాన్ని ఏమాత్రం రుచి తగ్గకుండా కొనసాగిస్తూ.. భారతీయుల మదిలో సుస్థిర స్వదేశీ బ్రాండ్‌గా నిలబెట్టారు. ఉద్యమానికి స్ట్రాంగ్ ‘చాయ్!’ స్వాతంత్య్రానికి పూర్వం దేశంలో చాలా టీ ఎస్టేట్లు ఉన్నా.. వాటిని బ్రిటిషర్లు తమ చెప్పుచేతల్లో ఉంచుకొని ఆదాయాన్ని కొల్లగొట్టేవారు. సత్యాగ్రహ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న పీసీ ఛటర్జీ.. ఈ దుస్థితిని గమనించి.. తన వ్యాపారానికి సరికొత్త స్వదేశీ ‘రుచి’ని అందించాలని నిర్ణయించారు. ఆ విధంగా కోల్‌కతా కేంద్రంగా 1912లో లక్ష్మీ టీ కంపెనీ ఆవిర్భవించింది. కింగ్ ఆఫ్ పంజాబ్ – రాజా సింగ్ బ్లెండ్ నుంచి.. క్వీన్ ఎలిజబెత్ బ్లెండ్ వరకూ లక్ష్మీ టీ తన ప్రతి ఉత్పత్తిలోనూ చరిత్రను పెనవేసుకునేలా చేసింది. విఖ్యాత డార్జిలింగ్ టీతో సహా ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ఎస్టేట్లు లక్ష్మీ గ్రూప్ సొంతం. ప్రపంచ వ్యాప్తంగా టీ ఎగుమతులు చేయడంతో పాటు అనేక అంతర్జాతీయ టీ బ్రాండ్లకు తేయాకు సరఫరా చేసేది ఇదే. ఏటా 3 కోట్ల కేజీల టీ ఉత్పత్తి చేస్తూ.. స్వదేశీ ఘుమఘుమలను ప్రపంచవ్యాప్తంగా వెదజల్లుతోంది. మన ‘చెప్పు’చేతల్లో...! మెట్రో షూస్.. ముంబైలోని ఒక చెప్పుల షాపులో సేల్స్‌మన్‌గా పనిచేసిన మాలిక్ తేజానీ.. దేశ విభజనలో ఆ షాపు యజమానులు పాకిస్థాన్ వెళ్లిపోవడంతో 1947లో తెలిసినవాళ్ల దగ్గర అప్పు చేసి దాన్ని కొన్నారట. అప్పటి బొంబాయి నగరంలో పేరొందిన మెట్రో సినిమా దగ్గర్లో ఉండటంతో దానికి మెట్రో షూస్‌గా పేరు పెట్టారు. ఆయన తదనంతరం 16 ఏళ్ల వయసులో కంపెనీ పగ్గాలు చేపట్టిన ఆయన తనయుడు రఫీక్ తేజానీ.. అంచెలంచెలుగా దాన్ని దేశ ప్రజలకు ప్రియమైన పాదరక్షల బ్రాండ్‌గా మార్చేశారు. ఇప్పుడీ కంపెనీకి సీఈఓగా ఉన్న మాలిక్ మనుమరాలు ఫరా మాలిక్ భాంజీ దీన్ని మెట్రో బ్రాండ్స్ పేరుతో స్టాక్ మార్కెట్లో కూడా లిస్టింగ్ చేసి, తనదైన నడకలు నేర్పుతూ ముందడుగు వేస్తున్నారు. డెనిమ్ కింగ్.. అరవింద్ దేశంలో 1897లోనే లాల్‌భాయ్ దల్పత్ భాయ్ సారస్పూర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ పేరుతో అహ్మదాబాద్‌లో టెక్స్టైల్ మిల్లును స్థాపించారు. అయితే, ఆ తర్వాత ఆయన కుమారుడు లాల్‌భాయ్.. కుటుంబ సభ్యులు కస్తూర్భాయ్, నరోత్తమ్భాయ్, చిమన్‌భాయ్ 1931లో మహాత్మాగాంధీ స్వదేశీ ఉద్యమం పిలుపుతో.. అరవింద్ మిల్స్‌ను అధునాతన సాంకేతికతతో నెలకొల్పారు. స్వాతంత్య్రానంతరం స్పీడు పెంచిన ఈ కంపెనీ.. 1980లో యువతకు భారతదేశపు తొలి డెనిమ్ (జీన్స్ క్లాత్) వస్త్ర బ్రాండ్ ఫ్లయింగ్ మెషిన్‌ను పరిచయం చేసింది. ఇప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద డెనిమ్ ఫ్యాబ్రిక్ తయారీదారుగా నిలుస్తోంది. అంతేకాదు, 2015లో తొలిసారిగా ఖాదీ డెనిమ్‌ను తీసుకొచ్చి స్వదేశీ వారసత్వాన్ని నిలబెట్టింది. ప్రస్తుతం అరవింద్.. టెక్స్‌టైల్స్‌తో పాటు రియల్టీ, రిటైల్ తదితర రంగాల్లోకీ విస్తరించింది. అరవింద్ తయారు చేసిన ఫ్యాబ్రిక్‌తో భూమిని 6 సార్లు చుట్టేసి రావచ్చట!! చెదపట్టని ‘ఎస్ చంద్!’ దేశంలో విదేశీ పుస్తకాలకు బదులు.. భారతీయ రచయితలు, విద్యావేత్తలు రాసిన అచ్చమైన స్వదేశీ పుస్తకాలను ప్రచురించి, ప్రజలకు అందుబాటు ధరలో తీసుకురావాలన్న లక్ష్యంతో ఆవిర్భవించినదే.. ఎస్ చంద్. 1939లో శ్యామ్‌లాల్ గుప్తా ఈ పబ్లిషింగ్ సంస్థను ప్రారంభించారు. ప్రొషెసర్ బహల్ అండ్ తులి రాసిన ‘టెక్ట్స్‌బుక్ ఆఫ్ ఫిజికల్ కెమిస్ట్రీ’ అనేది ఎస్ చంద్ పబ్లిష్ చేసిన తొలి టెక్ట్స్‌బుక్. దేశంలోని బోర్డు స్కూళ్లు, కాలేజీ, యూనివర్సిటీ పరీక్షల్లో కోట్లాది విద్యార్థులకు ఎస్ చంద్ పుస్తకాలు చిరపరిచితమే. విద్యా రంగంలో పుస్తకాలకు ఎస్ చంద్ పెట్టింది పేరుగా నిలిచిపోయింది. ఏటా 5 కోట్ల టెక్ట్స్పుస్తకాలను విక్రయిస్తున్న ఈ 80 ఏళ్ల మేడిన్ ఇండియా బ్రాండ్.. పుస్తక ప్రపంచంలో ఇప్పటికీ తన స్థానానికి చెద పట్టనివ్వకుండా రెపరెపలాడుతోంది. వాహ్ తాజ్! దేశ ఆర్థిక రాజధాని ముంబై పేరు చెబితే పర్యాటకులకు టక్కున గుర్తొచ్చేది తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్! అయితే, దీని వెనుక పెద్ద కథే ఉంది. స్వాతంత్య్రానికి పూర్వం అప్పట్లో ముంబైలో ప్రసిద్ధి చెందిన వాట్సన్ లగ్జరీ హోటల్లోకి (దీని మొదటి యజమాని బ్రిటిషర్ జాన్ వాట్సన్) అడుగుపెట్టే భారతీయులను చాలా చిన్న చూపు చూసేవారట. దీంతో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జంషెడ్జీ టాటా ఎలాగైనా మనకు కూడా యూరోపియన్ ప్రమాణాలకు దీటుగా ఒక లగ్జరీ హోటల్ ఉండాలనుకున్నారు. ఆ స్వదేశీ కాంక్షతోనే 1902లో ఇండియన్ హోటల్స్ కంపెనీని స్థాపించి, 1903లో తాజ్ మహల్ ప్యాలెస్ హోటల్ కట్టారు. తాజ్ హోటల్ దెబ్బకు ప్రభ కోల్పోయిన వాట్సన్‌ను 1944లో ఇండియన్ హోటల్స్ కొనుగోలు చేయడం విశేషం (తర్వాత 1980లలో దీన్ని అమ్మేసింది). 1984లో లండన్‌లోని సెయింట్ జేమ్స్ కోర్ట్ హోటల్‌ను చేజిక్కించుకుని బ్రిటిష్ కోటలో పాగా వేసింది. ఇండియన్ హోటల్స్ నేడు ప్రపంచవ్యాప్తంగా 80 నగరాల్లో 196కు పైగా హోటళ్లను నిర్వహిస్తోంది. అది ‘అరబిక్ కడలందం’గా నిలుస్తూ వాహ్ తాజ్ అనిపిస్తోంది!! టాటాల ‘ఉప్పు’ తింటున్నాం..! 1868లో 29 ఏళ్ల జంషెడ్జీ నుసర్వాన్జీ టాటా రూ.21,000 పెట్టుబడితో ఒక ట్రేడింగ్ కంపెనీగా ప్రారంభించిన టాటా గ్రూప్.. నేడు ఆకాశమే హద్దుగా భారత్‌కు వ్యాపార జగత్తులో ఖండాతర ఖ్యాతిని తీసుకొచ్చింది. 1907లో జంషెడ్‌పూర్‌లో ఆసియాలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్లలో ఒకటిగా టాటా స్టీల్‌ను నెలకొల్పి జంషెడ్జీ టాటా కలలను సాకారం చేశారు ఆయన తనయుడు సర్ దొరాబ్జీ టాటా. కోల్‌కతాలోని హౌరాబ్రిడ్జి, భాక్రానంగల్, దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ వంటి బహుళార్థసాధక నీటిపారుదల ప్రాజెక్టులు, కాండ్లా పోర్టు, చండీగఢ్ నగర నిర్మాణాలకు ‘స్టీలెత్తిన’ కంపెనీగా చరిత్ర పుటల్లో నిలిచింది. ప్రపంచ టాప్–10 స్టీల్ కంపెనీల్లో ఒకటిగా నిలుస్తున్న టాటా స్టీల్.. 2006లో అంగ్లో–డచ్ కంపెనీ కోరస్‌ను ఏకంగా 8.1 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసి బ్రిటిషర్లకు స్వదేశీ ‘ఉక్కు’ సంకల్పం అంటే ఏంటో చాటిచెప్పింది. 1910లో టాటా హైడ్రోఎలక్ట్రిక్ పవర్ సప్లై కంపెనీగా ఆవిర్భవించిన టాటా పవర్ నేడు దేశానికి విద్యుత్ వెలుగులు అందిస్తోంది. 1929లో టాటా ఎయిర్‌లైన్స్‌ను నెలకొల్పి భారతీయుల ఆర్థిక స్వేచ్ఛా కలను వినువీధిలో విహరింపజేశారు జహంగీర్ రతన్జీ దాదాభాయ్ (జేఆర్డీ) టాటా. 1946లో ఎయిర్ఇండియాగా పేరుమార్చుకుని, స్వాతంత్య్రానంతరం ప్రభుత్వం చెంతకు చేరినా.. తాజాగా మళ్లీ టాటాల గూటికే వచ్చి వాలింది ఈ లోహ విహంగం! ఇక హమామ్ బ్రాండ్ సబ్బు 1931లో టాటాలు తీసుకొచ్చిందే. ‘దేశ్ కా నమక్’గా పేరొందిన టాటా సాల్ట్ తయారీ సంస్థ టాటా కెమికల్స్ 1939లో ఆవిర్భవించింది. దేశంలో మొట్టమొదటిసారిగా ప్యాకేజ్డ్ ఐయొడైజ్డ్ ఉప్పును ప్రవేశపెట్టింది. 1945లో టాటా ఇంజినీరింగ్ అండ్ లోకోమోటివ్ కంపెనీ (టెల్కో)గా ఆరంభమైన టాటా మోటార్స్.. 2008లో బ్రిటిష్ ఐకానిక్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్రోవర్ను చేజక్కించుకుని మన సత్తాను చాటింది. ఐటీ రంగంలో దేశానికి మణిమకుటంగా వెలుగొందుతోంది టీసీఎస్. 150 ఏళ్ల చరిత్రతో ఉప్పు.. పప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు 30కి పైగా కంపెనీలతో మిషన్ స్వదేశీకి మూలస్తంభంగా నిలుస్తోంది టాటా. టీవీ‘ఎస్!’ 1911లో టీవీ సుందరం అయ్యంగార్ స్థాపించిన టీవీఎస్ గ్రూప్.. మొదట సదరన్ రోడ్‌వేస్ పేరుతో బస్సులు, ట్రక్కుల ట్రాన్స్పోర్ట్ కంపెనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. దేశంలో మొట్టమొదటి 2 సీట్ల మోపెడ్ (టీవీఎస్ 50)ను తయారు చేసి సంచలనం సృష్టించింది. ఇక ఆ తర్వాత వివిధ విదేశీ ఆటోమొబైల్ కంపెనీల భాగస్వామ్యంతో ద్వి, త్రిచక్ర వాహన రంగంలో టాప్‌గేర్‌లో దూసుకెళ్లింది. ఇప్పుడిది ఆటోమొబైల్, ఏవియేషన్, విద్య, ఎలక్ట్రానిక్స్, ఇంధనం, ఫైనాన్స్ వంటి రంగాల్లో అనేక కంపెనీలతో స్వదేశీ బహుళజాతి కంపెనీగా ఎదిగింది. టీవీఎస్ ఎక్స్ఎల్ పేరుతో మోపెడ్ రంగంలో ఇప్పటికీ ఈ కంపెనీ.. ఒకే ఒక్కడుగా చక్రం తిప్పుతోంది. స్వరాజ్య చరిత్రను లిఖించిన మన ‘రత్నం!’ స్వాత్రంత్య్ర సంగ్రామంలో ఎందరో మహనీయులు రక్తాన్ని చిందిస్తే.. ఆ చరిత్రను లిఖించేందుకు తన సిరాను చిందించి.. అసలు సిసలు స్వదేశీ ‘రత్నం’గా నిలిచింది మన పెన్ను! 100% స్వదేశీ సిరా పెన్ను తయారు చేయాలన్న గాంధీజీ పిలుపుతో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన కోసూరి వెంకట రత్నం 1932లో ‘రత్నం పెన్స్’ సంస్థను స్థాపించారు. 1935లో మహాత్మా గాంధీ రాజమండ్రి రైల్వే స్టేషన్లో ఆగినప్పుడు స్వయంగా తమ సంస్థలో తయారైన పెన్నును ఆయనకు బహూకరించారట. ఈ ఫౌంటెన్ పెన్నులతో దాదాపు 31 వేల ఉత్తరాలను గాంధీజీ రాశారని ఆయన వారసులు చెబుతారు. అంతేకాదు, స్వదేశీ ఉద్యమానికి తన కలం ద్వారా ఇంకు నింపినందుకు రత్నంను అభినందిస్తూ ఆ పెన్నుతో గాంధీజీ స్వయంగా రాసిన లేఖ ఇప్పటికీ కేవీ రత్నం కుటుంబీకుల వద్ద భద్రంగా ఉంది. తొలి ప్రధాని నెహ్రూ, రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ నుంచి లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ.. వంటి మహామహులందరూ రత్నం పెన్నులకు అభిమానులే. అంతేకాదు, కొన్నేళ్ల క్రితం జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ భారత్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోదీ సైతం రత్నం సన్స్ తయారు చేసిన పెన్నును బహూకరించి, స్వదేశీ భారత్‌కు చెక్కుచెదరని బ్రాండ్‌గా దీని గొప్పతనాన్ని వివరించడం విశేషం. ఒక్కొక్కటి ఒక్కో మాస్టర్ పీస్‌లా ఉండే ఈ పెన్నుల రేట్లు రూ. 300 నుంచి రూ. 35,000 స్థాయి వరకూ (స్టీల్ పాళీ నుంచి 22 క్యారెట్ల బంగారంతో తయారైన పాళీ దాకా) ఉంటాయి. ఏకంగా రూ. 2 లక్షల పైగా విలువైన ప్రత్యేకమైన గోల్డ్ పెన్ కూడా ఉంది. ఎలాంటి మార్కెటింగ్ గానీ, వెబ్సైట్ గానీ లేకుండానే కేవలం నోటిమాటే ప్రచారంగా.. ఈ పోటీ ప్రపంచంలో దాదాపు 90 ఏళ్లుగా సిసలైన రత్నంగా నిలుస్తోంది! ‘అమృతాంజనం! నొప్పొస్తే.. ‘అమ్మా కాదు.. అమృతాంజనం’ అనేంతలా జనాల్లోకి చొచ్చుకుపోయిన బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదేమో! 129 ఏళ్ల క్రితం 1893లో వ్యాపారవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, పాత్రికేయుడు ఇలా ఒకటేంటి.. బహుముఖ ప్రజ్ఞశాలి అయిన కాశీనాథుని నాగశ్వరరావు రూపొందించిన ఈ నొప్పి నివారణ ఔషధం.. అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. ఎంతంటే, తలనొప్పి–అమృతాంజనం అనేంతలా! కుటుంబ సంస్థగా మొదలై.. 1936లో అమృతాంజన్ లిమిటెడ్ పేరుతో పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఈ కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంతోనే నాగేశ్వరరావు ఆంధ్రపత్రికను కూడా ప్రారంభించి.. పత్రికా ప్రపంచంలో చరిత్ర సృష్టించడం విశేషం. స్వాతంత్య్రానంతరం అమృతాంజనానికి పోటీగా ఎన్ని రకాల ఔషధాలు వచ్చినా.. నేటికీ దీని స్థానం చెక్కుచెదరలేదు. అమృతాంజన్ హెల్త్‌కేర్‌గా పేరు మార్చుకుని, నాగేశ్వరరావు మనుమడు శంభు ప్రసాద్ సారథ్యంలో నేడు అమృంతాంజన్ సంస్థ ఫుడ్, సాఫ్ట్వేర్ రంగాల్లోకి కూడా విస్తరించింది. స్టాక్ మార్కెట్లో సైతం లిస్టయ్యి.. రూ. 2,400 కోట్ల మార్కెట్ విలువతో స్వదేశీ ‘బ్రాండ్’బాజా మోగిస్తోంది!! -శివరామకృష్ణ మిర్తిపాటి -
అనగనగా ఒక రుపాయి..
రూపాయ్! రూపాయ్! ఎందుకు పడ్డావ్ అంటే.. దిగుమతులు గుదిబండగా మారాయని చెప్పింది. దిగుమతులూ! దిగుమతులూ! గుదిబండగా ఎందుకు మారారంటే... డాలర్ అంతకంతకూ బలపడుతోందని అంటాయి.lడాలర్! డాలర్! ఎందుకు బలపడుతున్నావంటే... అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని అంటుంది. వడ్డీ రేటు! వడ్డీ రేటు! ఎందుకు పెరుగుతున్నావంటే.. ధరలు భారీగా పెరగడం వల్లంటుంది. ధరా! ధరా! ఎందుకు పెరిగావనడిగితే.. క్రూడాయిల్ రేట్లు మండిపోతున్నాయంటుంది. క్రూడాయిల్! క్రూడాయిల్! ఎందుకు మండుతున్నావంటే.. రష్యా ఉక్రెయిన్‌పై దండెత్తిందని చెబుతుంది. రష్యా! రష్యా! ఎందుకు దండెత్తావంటే... అమెరికా నా బంగారు దేశానికి ముప్పు తలపెడితే ఊరుకుంటానా అంటుంది. ఇదీ... ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా తయారైంది మన రూపాయి పరిస్థితి! ఎక్కడో ఉక్రెయిన్‌లో జరుగుతున్న వార్.. కరెన్సీలనే కాదు ఎకానమీలనూ కకావికలం చేస్తోంది. 1947లో దాదాపు 3 రూపాయలిస్తే ఒక డాలరు వచ్చేది. మరిప్పుడో... 80 రూపాయలు వదిలించుకోవాల్సిందే. అంతకంతకూ చిక్కి శల్యమవుతున్న రూపాయి తాజాగా చరిత్రాత్మక కనిష్ఠ స్థాయికి (80.05) జారిపోయింది. అంటే, బ్రిటిష్ వాళ్లను తరిమికొట్టిన తర్వాత 75 ఏళ్లలో ఏకంగా 75 రెట్లకు పైగా విలువ కోల్పోయిందన్నమాట! అసలు రూపాయికి డాలరుతో ఉన్న లింకేంటి? మన దేశ కరెన్సీ విలువ ఇలా బక్కచిక్కడానికి కారణాలేంటి? రూపాయి పతనం వల్ల ఎవరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది? రూపాయి విలువ ఎందుకు పెరుగుతుంది.. ఎందుకు తగ్గుతుంది? ఇలాంటి సందేహాలన్నీ తీరాలంటే... ఈ కథ చదివేయండి మరి!! - శివరామకృష్ణ మిర్తిపాటి మనకు స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశీ కరెన్సీ బ్రిటిష్ పౌండ్తో ముడిపడి ఉండేది. విదేశీ లావాదేవీలన్నింటికీ పౌండ్లలో చెల్లింపులు జరిగేవి. అప్పట్లో ఒక బ్రిటిష్ పౌండ్ విలువను 13.33 రూపాయలుగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. అప్పుడు పౌండ్ విలువ 4 డాలర్లు. దీని ప్రకారం డాలరుతో మన రూపాయి మారకం విలువ దాదాపు 3.3 కింద లెక్క. 1951లో మొదలుపెట్టిన పంచవర్ష ప్రణాళికల అమలు కోసం విదేశీ రుణాలను భారీగా సమీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ప్రభుత్వం స్థిర కరెన్సీ మారకం విలువను అమలు చేయడం వల్ల 1947 నుంచి 1966 మధ్య డాలరుతో రూపాయి విలువ 4–5 స్థాయిలోనే కొనసాగింది. ఇక 1962లో చైనాతో యుద్ధం, పాకిస్థాన్‌తో 1965లో జరిగిన పోరుతో భారత బడ్జెట్లో భారీ లోటు ఏర్పడింది. 1965–66లో వచ్చిన కరువుతో దేశంలో ధరలు ఆకాశాన్నంటాయి. దీనికితోడు ఇతర దేశాలనుంచి దిగుమతులు పోటెత్తడంతో వాణిజ్యలోటు దూసుకెళ్లింది. ఆ సమయంలో డాలరుకు రూపాయి మారకం రేటును 7.57గా నిర్ణయించారు. పెద్దన్న కబంధ హస్తాల్లో... 1971లో బ్రిటిష్ పౌండ్తో భారత్ కరెన్సీకి పూర్తిగా బంధం తెగిపోయింది. అగ్రరాజ్యం అమెరికా కరెన్సీ కబంధ హస్తాల్లో రూపాయి చిక్కుకుంది. ఇక అప్పటినుంచి మన విదేశీ రుణ చెల్లింపులు, ఎగుమతులు– దిగుమతులు ఇతరత్రా లావాదేవీలన్నీ నేరుగా అమెరికా డాలరుతోనే ముడిపడ్డాయి. 1975లో డాలరుతో రూపాయి మారకం విలువ 8.39 డాలర్లకు తగ్గింది. 1985 నాటికి 12కు పడిపోయింది. ప్రధానంగా వాణిజ్యలోటు (ఎగుమతులు తగ్గిపోయి.. దిగుమతులు భారీగా ఎగబాకడం) పెరిగిపోవడంతో డాలరుతో రూపాయి మారకం విలువ 1990 నాటికి 17.5కు క్షీణించింది. చెల్లింపుల సంక్షోభంతో నియంత్రణకు చెల్లు... 1991లో భారత ఆర్థిక పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దేశంలో విదేశీ కరెన్సీ(ఫారెక్స్) నిల్వలు దాదాపు అడుగంటిపోయాయి. దీంతో ఇతర దేశాలనుంచి చేసుకున్న దిగుమతులకు చెల్లింపులు జరపలేని స్థితి వచ్చేసింది. కేవలం మూడు వారాలకు సరిపడా చెల్లింపులకు మాత్రమే ఫారెక్స్ నిల్వలు (డాలర్లు) భారత్‌వద్ద మిగలాయి. తీవ్రమైన చెల్లింపుల సంక్షోభం తలెత్తడంతో బంగారాన్ని తాకట్టు పెట్టి డాలర్లను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనం ధరల మంటతో అల్లాడుతున్నారు. ఈ సమయంలోనే భారత్‌లో ఆర్థిక సంస్కరణలు, దేశంలోకి విదేశీ పెట్టుబడులు తరలి వచ్చేలా కీలకమైన సరళీకరణలకు ప్రభుత్వం తెరతీసింది. అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గనుక సంస్కరణలతో చికిత్స చేసి ఉండకపోతే మన దేశం పరిస్థితి కూడా ఇప్పటి శ్రీలంకలా మారిపోయేదన్న మాట! ఇక 1993లో దేశ కరెన్సీ చరిత్రలో కీలక సంఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వం కరెన్సీపై నియంత్రణను పూర్తిగా ఎత్తివేసింది. ఆర్బీఐ కనుసన్నల్లో మార్కెట్ వర్గాలు (ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్ ఆధారంగా) రూపాయి మారకం విలువను నిర్దేశించేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ పరిణామాలతో 1995 నాటికి డాలరుతో రూపాయి మారకం విలువ 32.42కు పడిపోయింది. 2000 సంవత్సరం నాటికి ఒక అమెరికా డాలరు కోసం 44.94 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. 2008 ఆర్థిక సంక్షోభంతో కుదేలు... మన్మోహన్ సింగ్.. 2004లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆర్థిక వ్యవస్థ వృద్ధి పతాక స్థాయికి చేరింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలి రావడం, ప్రైవేటు రంగం పుంజుకోవడం, సరళీకరణల ఫలాలతో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏకంగా 9 శాతాన్ని తాకింది. అయితే, 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం మన దేశాన్ని కూడా కకావికలం చేసింది. దీనికితోడు ధరల మంట కరెన్సీని కుదేలు చేసింది. 2009లో తొలిసారిగా రూపాయి 50ని దాటి పడిపోయింది. ఇక అప్పటి నుంచీ అంతకంతకూ బక్కచిక్కుతూనే ఉంది. 2016 నవంబర్‌లో 68.86 కనిష్ఠానికి దిగజారింది. 2018 వరకూ 66–68 స్థాయిలో కదలాడిన రూపాయి మళ్లీ అంతర్జాతీయ ఆర్థిక ప్రతికూలతలతో కట్టలు తెంచుకుంది. ట్రంప్ ముంపు... కరోనా పంజా! ట్రంప్ అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కిన తర్వాత ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేశారు. ఇతర దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలను ఎడాపెడా పెంచి వాణిజ్య యుద్ధానికి తెరతీయడంతో అంతర్జాతీయ వాణిజ్య రంగం అతలాకుతలమైంది. దీంతో వర్ధమాన దేశాల కరెన్సీలు మరింతగా కుప్పకూలాయి. ఇవన్నీ ఒకెత్తయితే, 2020 సంవత్సరంలో ప్రపంచం నెత్తిన ‘కరోనా’ పిడుగు పడింది. వ్యాపార వాణిజ్యాలు స్తంభించడంతో ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఈ దెబ్బకు డాలరుతో రూపాయి విలువ 76.70 స్థాయికి క్షీణించింది. ఇప్పుడు నెలకొన్న భౌగోళిక రాజకీయ ప్రభావాలకు తోడు ఇతరత్రా అంతర్జాతీయ ప్రతికూలతలతో తాజాగా రూపాయి 80.05ను తాకి చరిత్రాత్మక కనిష్టానికి జారిపోయింది. తాజా పతనానికి కారణాలేంటి...కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు... రూపాయి తాజా పతనానికీ అనేక అంశాలు ఆజ్యం పోస్తున్నాయి. వడ్డీరేట్ల పెంపు గుబులు..: 2020లో వచ్చిన కరోనా దెబ్బకు ఎకానమీ కకావికలం కావడంతో అమెరికా మళ్లీ డాలర్లను ఎడపెడా ముద్రించి, వడ్డీరేట్లను సున్నా స్థాయికి తెచ్చింది. అయితే, ధరల మంట కారణంగా (2022 జూన్‌లో ద్రవ్యోల్బణం 9.1%.. 4 దశాబ్దాల గరిష్ఠం) తాజాగా ఈ ప్యాకేజీల ఉపసంహరణను స్టార్ట్ చేయడంతో పాటు వడ్డీరేట్లను శరవేగంగా పెంచుతూ పోతోంది. అధిక ద్రవ్యోల్బణం ప్రపంచ దేశాలన్నింటినీ కుదిపేస్తుండటంతో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం వడ్డీరేట్లను తీవ్రంగా పెంచుతున్నాయి. దీంతో స్టాక్ మార్కెట్ల నుంచి ఇన్వెస్టర్లు నిధులను వెనక్కి తీసుకుంటూ... కష్టకాలంలో సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే డాలరు వైపు దృష్టిసారిస్తున్నారు. దీనివల్ల కూడా ఇతర దేశాల కరెన్సీలు దిగజారుతున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో ముడిపడిన డాలరు ఇండెక్స్ విలువ ఏకంగా 20 ఏళ్ల గరిష్ఠానికి ఎగసి 109 స్థాయికి దూసుకెళ్లింది అందుకే. అయితే, మిగతా చాలా కరెన్సీలతో పోలిస్తే ఈ ఏడాది రూపాయి కాస్త తక్కువగానే పతనం కావడం విశేషం. రష్యా–ఉక్రెయిన్ వార్.. క్రూడ్ సెగలు: మూలిగేనక్కపై తాటిపండు పడ్డట్లు...ప్రపంచ ఎకానమీకి ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ఊహించని షాకిచ్చింది. రష్యా క్రూడ్, గ్యాస్ ఇతరత్రా కమోడిటీల ఎగుమతులపై అమెరికా, యూరప్ దేశాలు విధించిన ఆంక్షల దెబ్బకు ముడి చమురు ధర భగ్గుమంది. ఫిబ్రవరిలో యుద్ధం మొదలవడానికి ముందు బ్యారెల్‌కు 90 స్థాయిలో ఉన్న క్రూడ్ ఒక్కసారిగా 140 డాలర్లకు ఎగబాకింది. ప్రస్తుతం 100–105 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఈ ప్రభావంతో అనేక దేశాల్లో ధరలు ఆకాశాన్నంటడంతో.. వడ్డీరేట్లను భారీగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఇది రూపాయితో సహా అనేక దేశాల కరెన్సీ విలువలకు చిల్లు పెడుతోంది. దిగుమతుల బండ: అత్యధికంగా దిగుమతులపై ఆధారపడిన దేశం మనది. క్రూడ్ ధర పెరిగిపోయిన కారణంగా ముడిచమురు దిగుమతుల బిల్లు అంతకంతకూ తడిసిమోపెడవుతోంది. ఎందుకంటే మన క్రూడ్ అవసరాల్లో 85% వాటా దిగుమతులదే. గతేడాది (2021–22)లో దేశ ఎగుమతులు రికార్డు స్థాయిలో 418 బిలియన్ డాలర్లను (28% వృద్ధి) తాకాయి. అయితే, దిగుమతులు ఏకంగా 55% ఎగబాకి... 610 బిలియన్ డాలర్లకు దూసుకెళ్లాయి. ఇందులో ప్రధానంగా క్రూడ్, బంగారం దిగుమతులదే ప్రధాన వాటా కావడం గమనార్హం. దీంతో వాణిజ్య లోటు 88% ఎగసి 192 బిలియన్ డాలర్లుగా నమోదైంది. రిఫైనర్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరిగిపోతుండటంతో రూపాయిని బక్కచిక్కిపోయేలా చేస్తోంది. మరోపక్క, భారీ వాణిజ్య లోటు కారణంగా కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్ – మూలధన పెట్టుబడులు మినహా.. దేశంలోకి వచ్చి, పోయే విదేశీ మారక ద్రవ్యం మధ్య వ్యత్యాసం) తీవ్రమవుతోంది. గత ఆర్థిక సంవత్సరం 50 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్న క్యాడ్ (జీడీపీతో పోలిస్తే 1.8%)... ఈ ఏడాది ఏకంగా 105 బిలియన్ డాలర్లకు (జీడీపీలో 3%) పెరిగిపోవచ్చనేది బ్యాంక్ ఆఫ్ అమెరికా తాజా అంచనా. విదేశీ పెట్టుబడులు రివర్స్‌గేర్: అమెరికా వడ్డీరేట్ల భారీ పెంపునకు తోడు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మాంద్యం భయాలు వెంటాడుతుండటంతో... విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలకు తెగబడుతున్నారు. దీంతో స్టాక్ మార్కెట్లు కూడా భారీగా పడుతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు భారతీయ స్టాక్, బాండ్ మార్కెట్ నుంచి 39 బిలియన్ డాలర్లను వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటితో పోలిస్తే, ఇది ఏకంగా 3 రెట్లు అధికం కావడం ఇన్వెస్టర్లలో నెలకొన్న ఆందోళనలకు నిదర్శనం. ఆర్థిక వ్యవస్థ బలహీనతలు..: 2021–22లో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు 8.7 శాతంగా నమోదైంది (అయితే, కరోనా కారణంగా 2020–21లో జీడీపీ 6.6% క్షీణించిన నేపథ్యంలో దీంతో పోల్చడానికి లేదు). ఈ ఏడాది (2022–23) వృద్ధి రేటు 7 శాతం లోపే ఉండొచ్చని అంచనా. రూపాయికి ఆర్థిక బలహీనత సెగ కూడా తగులుతోంది. మనలాంటి వర్ధమాన దేశాల్లో, ముఖ్యంగా భారత్ వంటి దిగుమతులపై అధికంగా ఆధారపడిన దేశంలో కరెన్సీ బలహీనత అనేది సహజమేనని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ మూలాలు బలంగా ఉన్నంత వరకూ పెద్దగా ఆందోళనlచెందక్కర్లేదనేది వారి అభిప్రాయం. అయితే, ప్రస్తుత కరెన్సీ కల్లోలానికి దేశీ అంశాలకంటే అంతర్జాతీయ ప్రతికూలతలే ప్రధాన కారణం కావడంతో రూపాయి పతనానికి ఎక్కడ అడ్డుకట్టపడుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నే!! రూపాయి బలహీనత వల్ల ఏం జరుగుతుంది... కంపెనీల లాభాలు ఆవిరి: మనదేశంలో చాలా కంపెనీలు దిగుమతులపైనే ఆధారపడటంతో అధిక మొత్తంలో ఖర్చుచేయాల్సి వస్తుంది. అంటే 100 డాలర్ల విలువైన కమోడిటీ లేదా విడిభాగాన్ని దిగుమతి చేసుకోవడానికి గతంలో రూ.7,400 వెచ్చించాల్సివస్తే... ఇప్పుడు రూపాయి క్షీణతతో రూ.8,000 ఖర్చుపెట్టాల్సి వస్తుందన్నమాట. దీంతో లాభాలు కూడా కరిగిపోతాయి. విదేశీ రుణాలు తడిసిమోపెడు: రూపాయి క్షీణతతో విదేశీ రుణాలు కూడా భారంగా మారతాయి. గతంలో కంపెనీలు, ప్రభుత్వం డాలరు రూపంలో తీసుకున్న రుణాలకు ఇప్పుడు చెల్లింపులు, వడ్డీ తడిసిమోపడవుతుంది. పెట్రో మంట.. ధరల మోత: అధిక కమోడిటీ రేట్లకు తోడు రూపాయి పడిపోవటం వల్ల దిగుమతి చేసుకునే వస్తువులకు అధికంగా చెల్లించాల్సి వస్తుంది. పెట్రోలు నుంచి వంటనూనెల వరకూ అన్నీ ఆకాశాన్నంటి వంటింటి సంక్షోభానికి కారణమవుతోంది. బొగ్గు దిగుమతి భారం కూడా పెరిగి, కరెంటు చార్జీలు షాకిస్తున్నాయి. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, గృహోపకరణాలు మొదలైన ఉత్పత్తుల తయారీ సంస్థలు ముడి వస్తువుల ధరల సెగతో రేట్లను పెంచేస్తున్నాయి. దీంతో రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పటికే 7 శాతానికి ఎగబాకడం తెలిసిందే. విదేశీ ప్రయాణాలకూ సెగ..: రూపాయి దెబ్బకు విదేశీ ప్రయాణాల వ్యయం కూడా పెరిగిపోతోంది. విమాన టికెట్లకు, హోటల్స్ అద్దెకు, షాపింగ్‌కు మరింత వెచ్చించాల్సి వస్తోంది. ఉదాహరణకు 100 డాలర్ల అద్దె ఉన్న హోటల్ రూమ్‌కు ఆర్నెల్ల క్రితం రూపాయి మారకంలో రూ. 7,400 కడితే.. ఇప్పుడు.. రూ. 8,000 కట్టాల్సి వస్తుంది. ఉద్యోగాల్లో కోత..: రూపాయి పతన ంతో దిగుమతులకు కంపెనీలు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఫలితంగా రేట్లు పెంచాలి. రేట్లు భారీగా పెరిగితే కొనేవాళ్లుండరు. కొనేవాళ్లు లేక ఉత్పత్తి తగ్గించుకోవాల్సి వస్తుంది. దానికి తగ్గట్లే ఉద్యోగాల్లోనూ కోతలు తప్పవు. విదేశీ విద్య భారం: రూపాయి పతనం వల్ల విదేశాల్లో చదివే భారతీయ విద్యార్థులు ఫీజులు, రోజువారీ ఖర్చుల కోసం మరింత సొమ్ము వదిలించుకోవాల్సిన పరిస్థితి. ఉదాహరణకు, ఆర్నెల్ల క్రితం సెమిస్టర్లో 2000 డాలర్ల ఫీజుకు అప్పటి రూపాయి విలువ ప్రకారం రూ.1.48 లక్షలు ఖర్చయిందనుకుందాం. అదే ఇప్పుడు మళ్లీ సెమిస్టర్ ఫీజు 2,000 డాలర్లే ఉన్నప్పటికీ రూ.1.60 లక్షలు చెల్లించాల్సి వస్తుందన్నమాట. కొందరికే ఊరట! రూపాయి పడటం వల్ల కొన్ని వర్గాలకు మాత్రం ఊరట లభిస్తుంది. డాలర్లలో ఆదాయం ఆర్జిస్తూ ఇక్కyì తమ కుటుంబాలకు సొమ్ము పంపేవారికి మరిన్ని ఎక్కువ రూపాయలు లభిస్తాయి. అలాగే, ఎన్ఆర్ఐ డిపాజిట్లపై బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడమూ వారికి ప్రయోజనకరమే. ఇక సాధారణంగా రూపాయి బలహీనపడితే ఎగుమతి రంగ కంపెనీలకు పండగే. ఉదాహరణకు ఎగుమతుల ద్వారా ఆర్నెల్ల క్రితం రూ. కోటి ఆదాయం వచ్చుంటే.. రూపాయి క్షీణత వల్ల ప్రస్తుతం అదనంగా దాదాపు రూ. 6 లక్షలు ఆర్జించగలుగుతారు. మరోవైపు, డాలర్లలో ఆదాయం పొందే మన ఐటీ కంపెనీలకు కూడా రూపాయి పతనం సానుకూలంశమే. ఆర్బీఐ ఏం చేస్తోంది... చిక్కిపోతున్న రూపాయికి చికిత్స చేసేందుకు ఆర్బీఐ పరోక్షంగా పలు చర్యలు తీసుకుంటోంది. దేశంలోకి డాలర్ నిధులను పెంచేలా మరిన్ని ఎన్ఆర్ఐ డిపాజిట్లకు ఓకే చెప్పింది. వడ్డీరేట్లను పెంచుకునే వెసులుబాటునూ బ్యాంకులకు ఇచ్చింది. ఇక విదేశీ వాణిజ్య లావాదేవీలను రూపాయల్లో సెటిల్ చేసేందుకు (డాలర్లకు డిమాండ్ తగ్గించడం) తాజాగా అనుమతించింది. అలాగే, మన బ్యాంకులు, కార్పొరేట్ కంపెనీలు విదేశాల నుంచి మరింతగా రుణాలను సమీకరించుకునే అవకాశాన్ని, పరిమితులను కూడా ఆర్బీఐ పెంచింది. కాగా, రూపాయి పతనంతో మన విదేశీ మారక (ఫారెక్స్) నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో 632 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు తాజాగా 580 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇవి 9 నెలల పాటు దిగుమతులకు సరిపోతాయని అంచనా. రూపాయి పైకి.. కిందికి ఎందుకు? వివిధ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలు, రాజకీయ స్థితిగతులు కరెన్సీపై ప్రభావం చూపుతుంటాయి. ఉదాహరణకు, అమెరికా వెళ్లినప్పుడు అక్కడ మన రూపాయలు చెల్లవు కాబట్టి.. వాటిని ఇచ్చి డాలర్లు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే, వాళ్లు మన దగ్గరకొస్తే డాలర్లు ఇచ్చి రూపాయలు తీసుకోవాల్సి వస్తుంది. ఇలా మార్కెట్లో సంబంధిత కరెన్సీ లభ్యత, డిమాండును బట్టి ఇతర కరెన్సీలతో పోలిస్తే దాని విలువ మారుతూ ఉంటుంది. డాలర్‌కు డిమాండ్ పెరిగినప్పుడు రూపాయి బలహీనపడుతుంది. అలాగే రూపాయలకు డిమాండ్ పెరిగినప్పుడు బలపడుతుంది. రూపాయి హెచ్చుతగ్గులకు లోనవడానికి అనేక ఆర్థికాంశాలు కారణమవుతుంటాయి. ఉదాహరణకు ఎగుమతులు పెరిగినప్పుడు ఆయా కంపెనీలకు ఆదాయం కింద ఎక్కువ డాలర్లు వస్తాయి. సహజంగానే వీటిని దేశీయంగా రూపాయల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భంలో డాలర్ల లభ్యత ఎక్కువై.. రూపాయల కొరత ఏర్పడుతుంది. ఫలితంగా రూపాయికి డిమాండ్ పెరిగి బలపడుతుంది. మరోవైపు, దేశీ కంపెనీలు దిగుమతి చేసుకున్నప్పుడు వాటికి డాలర్లలో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. కనుక దిగుమతులు ఎక్కువైనప్పుడు డాలర్లకు ఆటోమేటిక్‌గా డిమాండ్ పెరిగి అది బలపడుతుంది. అలాగే, విదేశీ పెట్టుబడుల అంశం కూడా. విదేశీ కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టినప్పుడు రూపాయలు కావాల్సి ఉంటుంది కనుక.. డాలర్ల విలువ తగ్గి రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. అదే.. ఆ కంపెనీలు ఇండియాలో తమ పెట్టుబడులు అమ్మేసినప్పుడు వాటికి డాలర్లలో చెల్లించాల్సి ఉంటుంది కనుక డాలర్లకు డిమాండ్ పెరుగుతుంది. ఇలా తరచు డాలర్లు, రూపాయల డిమాండ్‌లో మార్పుల వల్ల ఒకదానితో పోలిస్తే మరొక దాని విలువ కూడా మారుతుంటుంది. ద్రవ్యోల్బణం, జీడీపీ వృద్ధి, వడ్డీ రేట్లూ కూడా కరెన్సీపై ప్రభావం చూపుతాయి. -
పెట్రోడాలర్‌కు రష్యా చెక్..!
రష్యా–ఉక్రెయిన్ వార్... భూగోళంపై మరోసారి అణు యుద్ధ మేఘాలు కమ్ముకునేలా చేస్తోంది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నంతో ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధానికి అమెరికా, యూరప్ దేశాలు మళ్లీ తెరతీయడం... తన పక్కలో బల్లెంలా విస్తరిస్తున్న నాటో కూటమి... రష్యాను ఉక్రెయిన్‌పై ఉసిగొల్పేలా చేశాయి. రేపన్నదే లేదన్నట్లు, రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు... మిగతా ప్రపంచ దేశాలను మేల్కొలుపుతున్నాయి. ఈ ఉక్రెయిన్ వార్... ప్రపంచ భౌగోళిక రాజకీయాలను కొత్త మలుపు తిప్పడం ఖాయమని విశ్లేషకులు కుండబద్దలు కొడుతున్నారు. ప్రపంచ పోలీసుగా, డాలర్ ఆధిపత్యంతో ఇన్నాళ్లూ శాసించిన అమెరికాకు రష్యా ఇచ్చిన కరెన్సీ షాక్ దిమ్మదిరిగిపోయేలా చేసింది. యుద్ధ భూమిలోనే కాదు ఆర్థిక చదరంగంలోనూ పావులు కదపడంలో తమ సత్తా ఏంటో రష్యా అధినేత పుతిన్ పశ్చిమ దేశాలకు రుచి చూపిస్తున్నారు. పెట్రోడాలర్ పెత్తనానికి గండి పడటంతో పాటు ఆంక్షలు తిరిగి అమెరికా కూటమి మెడకే చుట్టుకుంటున్నాయి. అయితే, ఈ పరిణామం ప్రపంచ దేశాలను మరోసారి మాంద్యం కోరల్లోకి నెట్టేస్తోంది. అసలు పెట్రోడాలర్ సంగతేంటి? దీనికి రష్యా ఎలా చెక్ చెబుతోంది? ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా కరెన్సీ వార్‌గా ఎలా మారుస్తోంది? పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతం చేయడానికి బ్రిక్స్ కూటమి వ్యూహాలు ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడానికి అలా కదన రంగంలోకి వెళ్లొద్దాం రండి!! ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దాదాపు దశాబ్దం క్రితమే బీజం పడింది. ఉక్రెయిన్‌లో గత ప్రభుత్వానికి అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పొగపెట్టి, తమ కీలుబొమ్మ లాంటి జెలెన్స్కీకి పట్టం కట్టిబెట్టాయి. తద్వారా నాటో దళాలను రష్యా గుమ్మం ముందు నిలబెట్టాలనేది పశ్చిమ దేశాల వ్యూహం. అంతేకాదు, ఉక్రెయిన్‌లోని రష్యా జాతీయులపై జెలెన్స్కీ సర్కారు చేస్తున్న అకృత్యాలు కూడా పుతిన్ కన్నెర్రకు కారణమే. దీనికితోడు ఉక్రెయిన్‌తో రష్యా గతంలో కుదుర్చుకున్న మిన్స్క్ ఒప్పందాన్ని జెలెన్స్కీ సర్కారు తుంగలో తొక్కింది. ఏ కూటమిలోనూ చేరకుండా తటస్థంగా ఉంటామన్న హామీకి తూట్లు పొడుస్తూ... యూరోపియన్ యూనియన్, నాటో కూటమిలో చేరేందుకు తహతహలాడింది. ఉక్రెయిన్ నాటో చేరిక యత్నాలను విరమించుకోవాలన్న పుతిన్ సూచనలను పెడచెవిన పెట్టడంతో... ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్‌పై దండెత్తింది. మొదట్లో ఎడాపెడా దాడులతో విరుచుకుపడిన రష్యా... నెమ్మదిగా ఒక ప్రణాళిక ప్రకారం తూర్పు ఉక్రెయిన్‌లోని డోన్బాస్ను పూర్తిగా చేజిక్కించుకోవడంపై దృష్టిపెట్టింది. ఉక్రెయిన్‌కు నల్లసముద్రంతో పూర్తిగా తెగతెంపులు చేసి, భూ సరిహద్దులకే పరిమితం చేసేలా చకచకా ముందుకెళ్తోంది. ఇప్పటికే సుమారు 25% ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలోకి వచ్చినట్లు అంచనా. కాగా, పశ్చిమ దేశాల కూటమి బిలియన్ల డాలర్ల కొద్దీ ఆర్థిక సహాయాన్ని, అత్యాధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌కు పంపిస్తూ... రష్యాపై పరోక్ష యుద్ధం చేస్తోంది. మరోపక్క, నాటో దేశాలు గనుక నేరుగా ఉక్రెయిన్ కదన రంగంలోకి అడుగుపెడితే, దాన్ని రష్యాతో యుద్ధంగా పరిగణిస్తామని, అణు యుద్ధం తప్పదంటూ పుతిన్ ఇప్పటికే తీవ్రంగా హెచ్చరించారు. ఏ క్షణంలోనైనా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు సిద్ధంగా ఉండాలంటూ తమ దళాలను సమాయత్తం చేశారు కూడా. మొత్తంమీద ఈ పరిణామాలు... ప్రపంచ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆంక్షల అస్త్రం... రష్యా దాడి నేపథ్యంలో అమెరికా మిత్ర దేశాలన్నీ రష్యాపై ఆంక్షలతో విరుచుకుపడ్డాయి. రష్యాపై నేరుగా యుద్ధం చేసే పరిస్థితి లేక ఆర్థిక యుద్ధానికి తెరతీశాయి. వందల బిలియన్ల కొద్దీ రష్యా ప్రభుత్వ ఆస్తులు, ఆ దేశానికి చెందిన కుబేరుల ఆస్తులను సీజ్ చేశాయి. రష్యా ఎకానమీకి కీలకంగా నిలిచే క్రూడ్, గ్యాస్ ఎగుమతులపై నిషేధం విధించాయి. రష్యాను ఆర్థికంగా, రాజకీయంగా, భౌగోళికంగా ఏకాకిని చేయడమే లక్ష్యంగా బెదిరింపులకు దిగాయి. రష్యా సెంట్రల్ బ్యాంకుకు చెందిన 600 బిలియన్ డాలర్ల మేర విదేశీ మారక నిల్వల్లో దాదాపు 300 బిలియన్ డాలర్లను అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. తద్వారా రష్యాను ఆర్థికంగా దివాలా తీయించాలనేది వారి వ్యూహం. రూబుల్ ‘రబుల్’ కాదు.. డబుల్! ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మొదలుపెట్టడంతోనే.. రష్యా ఆర్థిక కుంభస్థలాన్ని ఆంక్షల పంజాతో చీల్చి చెండాడేస్తామంటూ అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, జపాన్ ఇలా పెద్దన్న కూటమి మొత్తం గొంతుచించుకుంది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ అయితే, తమ ఆంక్షల దెబ్బకు రష్యా కరెన్సీ రూబుల్.. రబుల్ (పనికిరాని చెత్త)గా మారుతుందని డాలరు మారకంలో ఏకంగా 200కు పడిపోతుందంటూ సంచలన ప్రకటనలు కూడా చేశారు. వార్ మొదలయ్యేటప్పుడు దాదాపు 60 స్థాయిలో ఉన్న రూబుల్.. క్రూడ్, గ్యాస్ ఇతరత్రా ఎగుమతులపై నిషేధంతో ఒక్కసారిగా 140 స్థాయికి కుప్పకూలింది. దీంతో బైడెన్, పశ్చిమ దేశాలు ఇక రష్యా పనైపోయిందంటూ జబ్బలు చరుచుకున్నాయి. ఇక్కడే అసలు కథ మొదలైంది. అగ్రరాజ్యం ఆడుతున్న ఆర్థిక చదరంగంలో పుతిన్lఅదిరిపోయే పావును కదపడంతో పశ్చిమ దేశాల గొంతులో మిసైల్ పడింది. రష్యా క్రూడ్, గ్యాస్‌కు డాలర్లలో చెల్లింపులను అంగీకరించబోమని, తమకు రూబుల్లో మాత్రమే చెల్లించాలంటూ పుతిన్ ఆదేశించారు. ఎందుకంటే రష్యా బ్యాంకులను అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ (స్విఫ్ట్) నుంచి తొలగించడంతో రష్యాకు వచ్చే డాలర్లను ఉపయోగించుకోవడానికి వీల్లేకుండా పోయింది. రష్యా ఇచ్చిన షాక్‌తో యూరోపియన్ దేశాలకు దిమ్మదిరిగిపోయింది. పుతిన్ ‘నో రూబుల్.. నో క్రూడ్–గ్యాస్’ అని కరాఖండిగా చెప్పేయడంతో ఇక చేసేది లేక రూబుల్ పేమెంట్‌కు చచ్చీచెడీ అంగీకరించాయి. ఈ దెబ్బకు డాలరుతో రూబుల్ విలువ అమాంతం పుంజుకోవడం మొదలైంది. 140 స్థాయి నుంచి మూడున్నర నెలల్లోనే∙దాదాపు 51 స్థాయికి బలపడింది. అంటే యుద్ధం ప్రారంభానికి ఉన్న స్థాయిని మించి రూబుల్ బలోపేతం అయింది. రష్యా ఆర్థిక పైఎత్తుకు అగ్రరాజ్య కూటమి చిత్తయింది. పెట్రోడాలర్ వ్యవస్థను అంతం చేయడమే లక్ష్యంగా పుతిన్ విసిరిన ‘రూబుల్’ పాచిక బాగానే పారిందని ఆర్థిక విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. అంతేకాదు, తమ విదేశీ రుణాల (డాలర్, యూరో)కు సంబంధించి చెల్లింపులను రూబుల్స్‌లో మాత్రమే చేస్తామని కూడా రష్యా ప్రకటించింది. ఇకపై గోధుమలు, ఎరువులు ఇతరత్రా ఉత్పత్తుల ఎగుమతులకు రూబుల్లో మాత్రమే పేమెంట్ చేయాల్సి ఉంటుందని కూడా తాజాగా పుతిన్ తేల్చిచెప్పడం గమనార్హం. తద్వారా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీల్లో డాలర్ అధిపత్యానికి గండిగొట్టాలనేది రష్యా అధినేత వ్యూహం. పెట్రోడాలర్ సంగతేంటంటే! 1970వ దశకంలో ప్రపంచం క్రూడ్ సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పట్లాగానే ధరలు ఆకాశాన్నంటడంతో అమెరికా నుంచి జపాన్ దాకా పెట్రో ఉత్పత్తుల రేట్లు ఆల్‌టైమ్ గరిష్ఠాలను (అమెరికాలో గ్యాలన్ పెట్రోలు ధర 4 డాలర్లు) తాకాయి. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియాతో అమెరికా కీలక ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంతో జరిపే చమురు క్రయవిక్రయాలకైనా అమెరికా డాలర్ల రూపంలోనే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక పేమెంట్ వ్యవస్థనే ‘పెట్రోడాలర్’గా వ్యవహరిస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే, క్రూడ్‌ను ఉత్పత్తి చేసే దేశాలేవైనా డాలర్లు ఇస్తేనే క్రూడ్ అమ్ముతాయి. గడిచిన 50 ఏళ్లుగా ఈ పెట్రోడాలర్ సిస్టమ్ ఎదురులేకుండా కొనసాగుతోంది. అంతర్జాతీయ వాణిజ్యం కోసం ఏ దేశమైనా సరే డాలర్లను కొనాల్సి రావడంతో రిజర్వ్ కరెన్సీగా ‘డాలర్’ ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్రపంచంలో అత్యధికంగా వాణిజ్యం జరిగేది క్రూడాయిల్లోనే కాబట్టే అరేబియా గల్ఫ్‌లో అమెరికా అన్ని యుద్ధాలు చేసింది. లిబియా, ఇరాక్, సిరియా సైతం పెట్రోడాలర్ పెత్తనానికి వ్యతిరేకంగా గొంతెత్తడం వల్లే అమెరికా వాటిని నామరూపాల్లేకుండా బాంబులతో నేలమట్టం చేసింది. అయితే, ఇప్పటిదాకా పుతిన్లాంటోడు అమెరికాకు తగలకపోవడంతో దాని ఆటలు బాగానే సాగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పుడు పుతిన్ పశ్చిమ దేశాలపై కరెన్సీ వార్‌కు సైతం తెరలేపారు. అంతర్జాతీయంగా బ్యాంకుల మధ్య లావాదేవీల కోసం ఉపయోగించే పేమెంట్ వ్యవస్థ ‘స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్‌బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్)’ నుంచి వెలేస్తారని పుతిన్‌కు ముందే తెలుసు. దీనివల్ల రష్యా బ్యాంకులు స్విఫ్ట్ ద్వారా లావాదేవీలు జరపలేవు. రష్యా కంపెనీలకు తమ ఎగుమతులకు రావాల్సిన డబ్బులు రావు. దీంతో రష్యా రూబుల్ అస్త్రాన్ని ప్రయోగించింది. తమ క్రూడ్ గ్యాస్ ఉత్పత్తులకు రూబుల్ లేదంటే డాలర్ యేతర అసెట్లలో చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. దీంతో క్రూడ్ మార్కెట్లు షేక్ అయ్యాయి. రష్యా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తిదారు కావడమే దీనంతటికీ కారణం. ‘స్విఫ్ట్’కు షాక్... అమెరికా, యూరప్ ఆధిపత్యంలో ఉన్న స్విఫ్ట్ పేమెంట్ వ్యవస్థ నుంచి ప్రత్యామ్నాయం కోసం రష్యా, చైనా చాన్నాళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టాయి. స్విఫ్ట్ వ్యవస్థ అనేది డాలర్‌ను, అంతిమంగా అమెరికాను మాత్రమే బలోపేతం చేయడానికి పనిచేస్తోందనేది రష్యా, చైనాల వాదన. ఇప్పుడు ఉక్రెయిన్ వార్తో రష్యా పూర్తిగా స్విఫ్ట్ నుంచి వైదొలగడంతో.. తన క్రూడ్, గ్యాస్, ఇతరత్రా ఎగుమతుల కోసం రూబుల్–చైనా యువాన్, రూబుల్–ఇండియన్ రూపీ తదితర కరెన్సీల్లో చెల్లింపులకు రష్యా తెరతీసింది. అంటే రష్యా నుంచి దిగుమతుల కోసం జరిపే చెల్లింపులకు ఏ దేశమైనా తమ కరెన్సీలను డాలర్లలోకి మార్చాల్సిన పని లేకుండా నేరుగా రూబుల్స్‌లోకి మార్చుకుంటే సరిపోతుందన్న మాట. ఇప్పటికే రష్యా, చైనా తమ వాణిజ్యాన్ని రూబుల్–యువాన్ కరెన్సీలో చేసుకుంటున్నాయి. భారత్ కూడా రూపాయి–రూబుల్ పేమెంట్‌కు సిద్ధమవుతోంది. ఇరాన్, యూఏఈ, సౌదీ వంటి పలు దేశాలు కూడా తమ సొంత కరెన్సీల్లో లావాదేవీలకు ఓకే అంటున్నాయి. రష్యా, చైనా ఇప్పుడు స్విఫ్ట్ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్ (సిస్టమ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫైనాన్షియల్ మెసేజెస్)ను అమల్లోకి తెచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దీన్ని రష్యా సెంట్రల్ బ్యాంక్ రూపొందించింది. ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను చైనాకు చెందిన క్రాస్–బోర్డర్ ఇంటర్‌బ్యాంక్ పేమెంట్ సిస్టమ్ (సీఐపీఎస్)తో అనుసంధానించేందుకు రష్యా ప్రయత్నిస్తోంది. అంతేకాదు, ఎస్పీఐఎఫ్ను బ్రిక్స్ కూటమి (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నీ వాడుకునేలా కూడా తాజా బ్రిక్స్ సదస్సులో రష్యా ప్రతిపాదించింది. అలాగే, బ్రిక్స్ దేశాలకు కమోడిటీల ఆధారిత ప్రత్యేక రిజర్వ్ కరెన్సీని తీసుకురావడంపై తమ కూటమి కసరత్తు చేస్తోందని కూడా పుతిన్ ప్రకటించడం గమనార్హం. మరోపక్క, స్విప్ట్ నుంచి రష్యాను వెలేయడం అనేది యూరప్, అమెరికా ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఎందుకంటే స్విఫ్ట్ లావాదేవీల్లో అత్యధికంగా అమెరికా డాలర్‌లోనే సెటిల్ అవుతాయి. ఇప్పుడు రష్యా, చైనా గనుక స్విఫ్ట్ స్థానంలో ఎస్‌పీఎఫ్‌ఎస్‌ను తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు.. అంతిమంగా డాలర్ పెత్తనానికి గండి పడినట్లే. ఎందుకంటే రష్యా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఇంధన ఎగుమతిదారు కాగా, చైనా ప్రపంచంలో నంబర్ వన్ తయారీ వస్తువుల ఎగుమతిదారు. బ్రిక్స్‌తో సహా తమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా మిత్ర దేశాలను సైతం రష్యా ఈ కొత్త పేమెంట్ సిస్టమ్‌లోకి తీసుకొస్తే, పెట్రోడాలర్‌కు చెల్లుచీటీ తప్పదని పరిశీలకులు పేర్కొంటున్నారు. పశ్చిమ దేశాల పెత్తనానానికి చెల్లు! రష్యా–ఉక్రెయిన్ యుద్ధంతో భౌగోళిక రాజకీయాలు కూడా కొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రపంచంలో 195 దేశాల్లో రష్యాపై ఆంక్షలు విధించిన అంతర్జాతీయ కమ్యూనిటీలో పట్టుమని 40 దేశాలు కూడా లేవు. అమెరికా, యూరప్ తదితర పశ్చిమ దేశాలు, కొన్ని అమెరికా మిత్ర దేశాలు మాత్రమే వీటిలో ఉన్నాయి. మిగతా ప్రపంచమంతా ఆంక్షలకు నో చెప్పింది. జీ7 అగ్ర దేశాల మొత్తం జనాభా 77.7 కోట్లు కాగా, బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) జనాభా ఏకంగా 320 కోట్లు (ప్రపంచ జాభాలో 41%) కావడం విశేషం. 2030 నాటికి బ్రిక్స్ దేశాల జీడీపీ ప్రపంచ మొత్తం జీడీపీలో 50 శాతానికి చేరుతుందని అంచనా. బ్రిక్స్‌తో పాటు ఆఫ్రికా మొత్తం కనీసం ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఖండించలేదు కూడా. గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా యూఏఈ రష్యాకు అండగా నిలుస్తోంది. మిత్రదేశం సౌదీ కూడా అమెరికాకు ముఖం చాటేసింది. అంతేకాదు, యూఏఈ, భారత్ సహా పలు దేశాలు ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించి ఐక్యారాజ్యసమితిలో ఓటింగ్‌కు దూరంగా ఉండటం మరో విశేషం. అంటే అమెరికా కూటమి చెబుతున్న అంతర్జాతీయ కమ్యూనిటీకి అర్థమేంటి? ‘‘కొంతమంది పశ్చిమ దేశాల రాజకీయ విశ్లేషకులు చేసే ఘోరమైన తప్పేంటంటే... వారి శత్రువులను మనందరికీ శత్రువులుగా ఉంచాలనుకోవడం’’ అని నెల్సన్ మండేలా చేసిన వ్యాఖ్యలు పశ్చిమ దేశాల కుటిల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం. అమెరికా ఇప్పుడు ఆడిస్తున్న ఈ భయంకరమైన సామ్రాజ్యవాద యుద్ధ చదరంగంలో రష్యన్లు కొన్ని పావులను కోల్పోతుండవచ్చు, అది వారికీ తెలుసు... అయితే అంతిమంగా వాళ్లు కోరుకుంటున్న ‘క్వీన్’ను మాత్రం చేజిక్కించుకోవడం ఖాయం. శరవేగంగా మారిపోతున్న తాజా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సమీకరణాలే ఇందుకు బలమైన నిదర్శనం అనేది విశ్లేషకుల మాట!! ధరదడ.. మాంద్యం భయం! ఇప్పటికే ధరలు మండిపోతున్న నేపథ్యంలో, రష్యా ఎగుమతులపై ఆంక్షలతో ప్రపంచ దేశాల పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లయింది. రష్యా క్రూడ్, గ్యాస్‌పై నిషేధంతో ఉక్రెయిన్ యుద్ధానికి ముందు దాదాపు 80 డాలర్ల స్థాయిలో ఉన్న ముడిచమురు ధర ఒక్కసారిగా 140 డాలర్ల స్థాయికి భగ్గుమంది. దీంతో అనేక దేశాల్లో పెట్రోలు బంకుల్లో హాహాకారాలు మొదలయ్యాయి. అమెరికా, యూరప్ ఇలా ఒకటేంటి.. ప్రపంచ వ్యాప్తంగా పెట్రో ధరలు ఆల్‌టైమ్ గరిష్ఠాలను తాకాయి. ఉక్రెయిన్, రష్యాల నుంచి గోధుమలు, ఎరువులు, నూనెగింజలు వంటి కీలక ఉత్పత్తుల ఎగుమతులు నిలిచిపోవడంతో వాటి ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. వెరసి, అగ్రరాజ్య కూటమి ఆడుతున్న ఆంక్షల గేమ్‌కు ప్రపంచ దేశాలు బలవుతున్నాయి. వీటన్నింటికీ తోడు దూసుకెళ్తున్న ద్రవ్యోల్బణానికి అడ్డుకట్టవేయడం కోసం అనేక దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను భారీగా పెంచుతుందటంతో ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి జారిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు కుండబద్దలు కొడుతున్నారు. ఒకపక్క, ధరాఘాతం, మరోపక్క, మాంద్యం భయాలతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతూ.. ఇన్వెస్టర్లకు తీరని నష్టాన్ని మిగులుస్తున్నాయి. యూరప్ గజగజ..! అమెరికా రెచ్చగొట్టడంతో రష్యా క్రూడ్, గ్యాస్‌పై ఆంక్షలు విధించిన యూరప్ దేశాలు.. తమ గొయ్యి తామే తవ్వుకున్నాయి. వాస్తవానికి యూరప్ మొత్తం క్రూడ్, గ్యాస్ దిగుమతుల్లో రష్యా వాటా 40 శాతం పైనే. జర్మనీ తదితర కొన్ని దేశాలైతే ఏకంగా 60–80 శాతం క్రూడ్–గ్యాస్ అవసరాలకు రష్యాపైనే ఆధారపడ్డాయి. అంతేకాదు రష్యా నుంచి నేరుగా పైపు లైన్ల (నార్డ్‌స్ట్రీమ్) ద్వారా యూరప్ మొత్తానికి సరఫరా వ్యవస్థ ఉండటంతో అత్యంత చౌకగా కూడా లభించేది. అయితే, రష్యాపై ఆంక్షలతో ఈ చౌక క్రూడ్, గ్యాస్‌కు చాలా దేశాలు నో చెప్పాయి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి కొన్ని దేశాలు ప్రత్యామ్నాయం లేక రష్యా రూబుల్స్‌లోనే చెల్లించి దిగుమతులు చేసుకుంటున్నాయి. అయితే, నార్డ్‌స్ట్రీమ్ పైప్‌లైన్ నిర్వహణ, రిపేర్ల పేరుతో రష్యా గ్యాస్ ఎగుమతుల్లో దాదాపు సగానికిపైగా కోత పెట్టడంతో ఇప్పుడు యూరోపియన్ దేశాలు.. ముఖ్యంగా జర్మనీ గజగజలాడుతోంది. ఎందుకంటే యూరప్‌లో చలికాలం మొత్తం ఇళ్లలో వెచ్చదనం కోసం గ్యాస్ హీటర్లనే ఉపయోగిస్తారు. అంతేకాదు, యూరప్‌లో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీలో చాలా కంపెనీలు నడిచేది గ్యాస్‌తోనే. వీటికి గనుక గ్యాస్ సరఫరాలు తగ్గితే, మూతబడే పరిస్థితి నెలకొంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద కెమికల్ కంపెనీ అయిన బీఏఎస్ఎఫ్.. తమకు గ్యాస్ గనుక కోత పెడితే ప్లాంట్‌ను మూసేయాల్సి వస్తుందని ఇప్పటికే సంకేతాలిచ్చింది. రష్యా చౌక గ్యాస్‌ను కాదని, అమెరికా నుంచి భారీ ధరకు యూరప్ చేశాలు దిగుమతి చేసుకుంటుండటం మరో విచిత్రం. ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటున్న అమెరికా... యూరప్ దేశాలనూ ఆర్థికంగా కకావికలం చేస్తోందని అక్కడి ఆర్థికవేత్తలు మొత్తుకుంటున్నారు. ‘‘అమెరికాకు శత్రువుగా ఉండటం ప్రమాదకరం. కానీ మిత్రుడిగా ఉండటం ప్రాణాంతకం’’ అంటూ అమెరికా రాజనీతిజ్ఞుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత హెన్రీ ఎ. కిసింజర్ చేసిన వ్యాఖ్యలను వారు గుర్తు చేస్తున్నారు. మొత్తంమీద రష్యాపై ఎడాపెడా విధిస్తున్న ఆంక్షలు.. బ్యాక్‌ఫైర్ కావడంతో పశ్చిమ దేశాలు గిలగిలాకొట్టుకుంటున్నాయి. చైనా, భారత్‌కు ‘రష్యా క్రూడ్’ పంట! ఇదంతా ఒకెత్తయితే, ప్రపంచ క్రూడ్ వినియోగదారుల్లో రెండు, మూడు స్థానాల్లో ఉన్న చైనా, భారత్‌కు రష్యా–ఉక్రెయిన్ వార్ కాసులు కురిపిస్తోంది. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షల కారణంగా నిలిచిపోయిన వాణిజ్యాన్ని రష్యా.. బ్రిక్స్ దేశాలు, ఇతరత్రా మిత్ర దేశాలకు మళ్లిస్తోంది. భారత్, చైనా వంటి దేశాలకు 30 శాతం మేర డిస్కౌంట్ రేటుకు క్రూడ్ ఇస్తుండటం విశేషం. ఉక్రెయిన్‌తో వార్ మొదలయ్యాక మూడు నెలల్లో రష్యా నుంచి చైనా రెట్టింపు స్థాయిలో 18.9 బిలియన్ డాలర్ల విలువైన ముడిచమురు, గ్యాస్, బొగ్గు కొనుగోలు చేసినట్లు అంచనా. ఇక భారత్ అయితే దాదాపు ఐదు రెట్లు అధికంగా 5.1 బిలియన్ డాలర్ల విలువైన క్రూడ్, బొగ్గు, ఇతర కమోడిటీలను రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. వార్ మొదలయ్యాక తొలి 100 రోజుల్లో క్రూడ్, గ్యాస్ ఎగుమతుల ద్వారా రష్యా ఆర్జించిన మొత్తం 98 బిలియన్ డాలర్లు. ఇందులో 61 శాతం అంటే దాదాపు 58 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులను యూరప్ దేశాలే చేసుకోవడం విశేషం. ఆంక్షలు ఎంతలా విఫలమయ్యాయో చెప్పేందుకు ఈ లెక్కలు చాలు! - శివరామకృష్ణ మిర్తిపాటి -
గుంపులో గోవిందకు కాలం చెల్లింది.. అంతా క్రేజీ క్రియేటివ్స్ మాయ
నలుగురితో నారాయణ.. గుంపులో గోవింద.. ఇప్పుడు వర్కవుట్ అయ్యే కాన్సెప్ట్ కాదు! సాంకేతిక, సమాచార విప్లవం వచ్చాక.. కొత్తదనమనేది పాతబడి.. అర్థం మార్చుకున్నాక..కొంచెం క్రేజీ ఆలోచనే సృజనగా పబ్లిక్ డొమైన్లో గుర్తింపు పొందాక.. నలుగురితో నారాయణలకు గుంపులో గోవిందులకు కాలం చెల్లిపోయింది! క్రియేటివిటీ ఎంత హద్దులు దాటితే అంత యూనిక్‌గా మన్ననలందుకుంటోంది! ఈ ధోరణి పబ్లిసిటీ రంగంలో పోస్టరేసినట్టు కనపడుతోంది.. అలాంటి కొన్ని ప్రచారాలు.. ప్రకటనలు మీ ‘ఫన్’డే కోసం పులిరాజా గుర్తున్నాడా? ‘పులిరాజాకు ఏమైంది?’ అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో వెలసిన హోర్డింగ్స్ గుర్తుకొచ్చాయా? దాదాపు రెండు దశాబ్దాల కిందటి విషయం. ఈ ఏకవాక్య ప్రకటన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలందరిలో ఎక్కడలేని కుతూహలాన్ని కలిగించింది. ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏంటి.. దేశవ్యాప్తంగానే (ఆయా భాషల్లో) సంచలనం సృష్టించింది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా మరో ప్రకటన వచ్చింది.. ‘పులిరాజాకు ఎయిడ్స్ వస్తుందా?’ అంటూ. ఇదీ అంతే ఆసక్తిని.. సెన్సేషన్‌ను రేకెత్తించింది. ఎయిడ్స్ ఉనికిలోకి వచ్చిన కొత్తలో దాని మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నమే ఆ ప్రచారం. ప్రధానంగా లైంగిక (అపరిచిత వ్యక్తులు, అసురక్షిత ) సంపర్కం ద్వారా సంక్రమించే ఈ వ్యాధి గురించి ఎంత చర్చిస్తే అంత అవగాహన పెరుగుతుంది.. గుట్టుగా ఉంటే వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది అనే చైతన్యాన్ని పెంపొందిచండం కోసం ఈ ప్రకటనను అలా డిజైన్ చేశారు. అందుకే ‘ఎయిడ్స్ గురించి మాట్లాండి.. నిశ్శబ్దాన్ని ఛేదించండి’ అనే ట్యాగ్‌లైన్‌నూ జోడించారు. ఆ ఉద్దేశం నెరవేరింది. దీని మీద పెద్ద చర్చే జరిగింది. ఎలాగోలా ఎయిడ్స్ అనే మాట జనాల మస్తిష్కాల్లో ముద్రపడిపోయింది. అది స్పృహను పెంచింది. ఎయిడ్స్‌పై అప్పటి వరకు చేసిన ప్రచారమంతా ఒకెత్తు పులిరాజా ఒక్కడు ఒకెత్తు అనేట్టుగా నిలిచిపోయింది. ఇలాంటి ప్రకటనలు చాలానే ప్రజల మెదళ్లను వశపరచుకున్నాయి. ఆ జాబితాలో కరపత్రాల నుంచి కమర్షియల్ యాడ్స్ దాకా చాలానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే కళలూ అందులో చేరాయి. దానికి ఉదాహరణ పాప్ లెజెండ్ మైకేల్ జాక్సన్. నిజానికి ఇలాంటి చిత్రమైన స్టంట్‌తోనే పాప్ అభిమాన ప్రపంచం ఒక్కసారిగా ఆయన వైపు తలతిప్పింది. మైకేల్ జాక్సన్ ‘థ్రిల్లర్’ ఆల్బమ్ తెలుసు కదా! లవ్, మ్యూజిక్, డ్యాన్స్ అనే ఎవర్గ్రీన్ ఫార్ములాకు మనిషిని పీక్కుతినే జాంబీని జోడించి శ్మశానంలో చిత్రీకరించిన పాట. అప్పటి వరకు అతని ఏ పాటకు, డాన్స్‌కు రాని స్పందన, అభిమాన వెల్లువ థ్రిల్లర్‌తో వచ్చింది. అతనికంటూ ఓ ఫ్యాన్ బేస్‌ను ఏర్పాటు చేసింది. ఆ టైమ్‌లో ఎవరి ఊహకూ అందని ప్రయోగం అది. ఆ విజయం మైకేల్‌ను మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోనివ్వలేదు. ఇలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మంది దృష్టిని ఆకట్టుకోవాలంటే అందరూ నడిచే దారిలో నడిస్తే కుదరదు. ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. ఎవ్వరూ చేయనిది చేయాలి. బడా స్టార్ల పరిమితుల్లో లేనిది, బిగ్‌షాట్స్‌కు సాధ్యం కానిది, కార్పొరేట్స్‌కు చిక్కని మ్యాజిక్ ఒకటి క్రియేట్ చేయాలి. అది నలుగురి నోళ్లల్లో నానుతుంది. ఆ ప్రచారమే వ్యాపారాన్నయినా.. సినిమానైనా లాభాల్లో నడిపిస్తుంది. అందుకే పబ్లిసిటీ కొత్త పద్ధతుల్లో కనిపిస్తోంది. చెరిగిపోదులే.. ఈ సమ్‌థింగ్ డిఫరెంట్ ధ్యాసలోని కొన్ని ఆలోచనలు.. ప్రగతిపథాన్ని స్పీడ్ బ్రేకర్లలా స్లో చేస్తున్నాయి అప్పుడప్పుడు. ముఖ్యంగా మహిళలకు సంబంధించి. ఉదాహరణకు కెమ్లిన్ మార్కర్ పెన్ యాడ్. ఇందులో భార్యకు సిందూరం బదులు మార్కర్ పెన్నుతో బొట్టు పెడతాడు భర్త. అనారోగ్యంతో మంచాన పడి అతను చనిపోతాడు. ఆమె బొట్టును చెరిపేందుకు ప్రయత్నిస్తుంటారు ఇతర స్త్రీలు. మార్కర్‌తో భర్త దిద్దిన ఆ బొట్టు చెరిగిపోదు. దీంతో ఆ భర్త ప్రాణాలతో లేచి కూర్చుంటాడు. ఇంచుమించు ఇది సతీ సావిత్రి కాన్సెప్ట్‌ను తలపిస్తుంది. అయినా ఆ యాడ్‌లో ఉన్న యూనిక్‌నెస్‌తో అది సక్సెస్ అయింది. లైటర్వీన్లో సుతిమెత్తగా కాస్త హాస్యరస ప్రధానంగా తీశారు కాబట్టి కొంచెం లోతుగా చూస్తే తప్ప దీని వెనుకున్న ముత్తయిదువ సెంటిమెంట్ అర్థంకాదు. క్రియెటివిటీకి పరాకాష్టగా కనిపించే ఇంకో యాడ్ హాథీ సిమెంట్స్ యాడ్. ఆత్మలు కూడా దూరలేనంత దృఢంగా తమ సిమెంట్‌తో కట్టిన నిర్మాణాలుంటాయని శ్మశానం, దెయ్యాలు, ఆత్మలు నేపథ్యంగా రూపొందించిన ఆ యాడ్ ద్వారా తన ప్రోడక్ట్‌ను ప్రమోట్ చేసుకుందీ కంపెనీ. ఛోటేమియా బడేమియా ఈ కామర్స్ బూమ్ మొదలైన కొత్తలో అది వ్యాపార ప్రకటనలకు ప్లాట్‌ఫామ్‌గా మారింది. కానీ ఆ ప్రకటనలు ఇలా స్టార్ట్కాగానే అలా రిమోట్ నొక్కేవాళ్లు లేదా స్కిప్ బటన్ మీదకు కర్సర్‌ను తీసుకెళ్లేవాళ్లు. అలాంటిది ఆ రిమోట్‌నే స్కిప్ చేశాయి ఫ్లిప్‌కార్ట్ యాడ్స్. చిన్న పిల్లలను పెద్ద వాళ్ల గెటప్‌లో చూపిస్తూ రొటీన్‌కు భిన్నంగా ఫ్లిప్‌కార్ట్ చేసిన ప్రయత్నం ఫ్లాష్సేల్లా సక్సెస్ అయ్యింది. అమెజాన్ దెబ్బకు అప్పటి వరకు ఉన్న ఈ కామర్స్ సైట్స్ చతికిలబడుతున్న సమయంలో ఈ యాడ్స్ .. మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ నిలదొక్కుకునేందుకు సాయపడ్డాయి. చూడక తప్పదు విలక్షణమైన ప్రకటనల ఫ్రేమ్‌లో సినిమా పబ్లిసిటీ, ట్రైలర్స్ కూడా ఇముడుతాయి. సినిమా అంటేనే లార్జర్ దాన్ లైఫ్ కలలకి దృశ్యరూపం. సినిమాకే కాదు వాటి ట్రైలర్లకూ లార్జెర్ దాన్ లైఫ్ ఉంటుందని నిరూపించి బాక్సాఫీస్‌ను ఫుల్ చేసుకుంది లక్ష్మీ గణపతి ఫిల్మ్స్. హాలీవుడ్ సినిమాలను తెలుగులోకి డబ్ చేసేది ఈ సంస్థ. పెక్యూలియర్.. హై పిచ్ వాయిస్‌తో ‘లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ ‘సముద్రపుత్రుడు’.., ‘దెయ్యాల కోట’.., ‘వింత ప్రపంచం’ అంటూ టీవీ, రేడియో ప్రకటనల్లో చెబుతుంటే.. వినే వాళ్లకు ఈ సినిమా చూడకపోతే తమ కళ్లు దండగ అనే భావన కలిగేది. జూ జూ.. వైవిధ్యమైన ప్రకటనల ట్రెండ్‌లో టెలికమ్ సేవల కంపెనీలూ తమ ఐడియాలను నమోదు చేసుకున్నాయి. వీటిల్లో వొడాఫోన్ క్రియేట్ చేసిన జూ జూలది చెప్పుకోదగ్గ పాత్ర. వీటితో పండించిన ప్రకటనలే ఆ కంపెనీ బిజినెస్‌కు కాసుల సిగ్నల్స్ అందించాయి. అంతేనా ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)ను ఐఎఫ్ఎఫ్(ఇండియన్ ఫ్యామిలీస్ ఫేవరెట్)గా మార్చలేదూ! నిజానికి వోడాఫోన్ జూ జూలు దేశంలోకి ఎంట్రీ ఇచ్చింది కూడా ఐపీఎల్ ద్వారానే. ఈ మ్యాచ్‌ల మధ్యలోనే కదా వీటిని పెట్టి వోడాఫోన్ తన ప్రచార ప్రకటనలను ప్రసారం చేసింది. క్రికెట్ అభిమానులు ఐపీఎల్ కోసం టీవీ ముందు కూర్చుంటే వాళ్ల కుటుంబ సభ్యులు ఈ జూ జూల యాడ్స్ కోసం టీవీ ముందు ఆసీనులయ్యేవారు. అలా వారూ ఐపీఎల్‌కు అడిక్ట్ అయ్యారు. ఏలియన్స్ రూపంలో మాటల్లేకుండా జూజూలు చేసే అల్లరి వోడాఫోన్‌కు ఎంతటి పబ్లిసిటీనిచ్చిందో ఐపీఎల్‌కూ అంతటి క్రేజ్‌ను తెచ్చింది. అయితే ఇంచుమించు ఓ దశాబ్దం కిందట మిరిండా కూల్ డ్రింక్ కూడా ఇలాగే మాటల్లేని జూ జూలను పోలిన గుండు క్యారెక్టర్లతో మార్కెట్లోకి వచ్చింది. డ్రింక్ సంగతేమో కానీ ప్రచారంతో మాత్రం జనాల్ని చిల్ చేసింది. స్మార్ట్ కాకి ఇది హార్డ్ వర్క్ కాలం కాదు.. స్మార్ట్ వర్క్ కాలం. అందుకే నాటి కథల్లోని క్యారెక్టర్స్ కూడా నేటి కాలానికి అప్ డేట్ అవుతున్నాయి. మనందరి చిన్నప్పటి కాకి కథలోని కాకి కూడా. విపరీతంగా దాహమేసిన ఆ కాకి కూజాలో ఉన్న కాసిన్ని నీళ్లల్లో రాళ్లు వేసి.. ఆ నీళ్లను పైకి తెప్పించి దాహం తీర్చుకుని ఎంచక్కా ఎగిరిపోతుంది. కాలం మారినా దాహం మారదు కదా. అందుకే అప్డేటెడ్ నేటి కాకికీ దాహం వేస్తుంది. ఆ పక్కనే నాటి చాదస్తపు కాకీ ఉంటుంది తన ముక్కు దూరని చిన్న పాత్రలో ఉన్న కొంచెం నీళ్లల్లో రాళ్లు వేస్తూ. అప్డేటెడ్ కాకి దాన్ని వింతగా చూసి తన ముందున్న స్ప్రైట్ బాటిల్‌ను ముక్కుతో పొడిచి.. పౌంటెన్గా చిమ్మిన స్ప్రైట్‌తో దాహం తీర్చుకుని కులాసాగా ఫ్లై అవుతుంది. ఇది స్ప్రైట్ యాడ్ క్రియేటివిటీ. వావ్.. వాటేన్ ఐడియా అనిపించక మానదు.. స్ప్రైట్‌ను కొనిపించక మానదు. ఈ వరుసలోకే చేరుతుంది ఫెవికాల్ ప్రకటన కూడా. ఫాంటసీతో వీక్షకుడిని కట్టిపడేయడంలో దానిది ప్రత్యేక శైలి. ఫెవికాల్ నుంచి ఏదైనా యాడ్ వస్తే చూసి వదిలేయకుండా దాని మీద మిత్రబృందంతో చర్చపెట్టేలా చేస్తుంది. చేపలు పట్టడం మొదలు కలలో హీరోయిన్ యాడ్ వరకు థీమ్ ఒక్కటే అయినా దేనికదే భిన్నంగా కనువిందు చేసి జనాలను ఆ బ్రాండ్‌కి అతుక్కుపోయేలా చేస్తుంది. పోస్టర్సే స్టార్స్‌గా యాడ్ ఫిల్మ్ మేకర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రవిబాబు సినిమా డైరెక్టర్‌గా మారాక తనదైన శైలిని విడిచి పెట్టలేదు. పెద్ద పెద్ద స్టార్ కాస్ట్ లేకుండా కొత్తవాళ్లతో సినిమాలు తీసే రవిబాబు.. తన సినిమాలపై ప్రేక్షకుల అటెన్షన్‌ను సాధించేందుకు డిఫరెంట్‌గా పోస్టర్స్‌ను డిజైన్ చేస్తాడు. కేవలం వెరైటీ పోస్టర్ పబ్లిసిటీ ద్వారానే ప్రేక్షకులను థియేటర్‌కు రప్పిస్తాడు. ‘అల్లరి’ మొదలు ‘నచ్చావులే’, ‘మనసారా’, ‘అవును’.. ఇలా తన ప్రతి సినిమాకు రవిబాబు క్రియేట్ చేసిన పోస్టర్లు సినిమా లవర్స్‌నే కాదు సాధారణ ప్రజలనూ ఆకట్టుకున్నాయి. అంతకు ముందు తరంలో వంశీ సినిమా పోస్టర్లు సైతం ఆయనదైన సిగ్నేచర్‌తో ఇట్టే జనాల్లోకి వెళ్లేవి. ...తిని చూడు న్యూవేవ్ పబ్లిసిటీ మెథడ్స్‌లో హోటల్ బిజినెస్ టాప్‌లో ఉంది. తమ ఫుడ్ సెంటర్లకు సమాపక, అసమాపక క్రియలనే నామాలుగా పెట్టి ఈ రకమైన ప్రచారానికి తాలింపేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో స్ట్రీట్ ఫుడ్ కల్చర్ ఊపందుకున్నాక.. అప్పటి వరకు ఉన్న టిఫిన్ సెంటర్లు కాస్తా ఫుడ్కోర్ట్, దోసా ఆన్ వీల్స్ ఎట్సెట్రాగా మారాయి. ఈ కొత్త ట్రెండ్ కొత్త పేర్లను తీసుకొచ్చింది. ఇంగ్లిష్ పేర్ల స్థానంలో ‘రా.. తిని పో’,‘రా బావ తిని చూడు’, ‘భలేబావుంది’, ‘ఉప్పు కారం’, ‘దిబ్బరొట్టె’, ‘అద్భుతః’, ‘కోడికూర చిట్టిగారె’, ‘దా తిను’ వంటి పేర్లు వచ్చి చేరాయి. ఈ ఐడియా బాగా వర్కవుట్ అవడంతో కర్రీ పాయింట్లు, హోటళ్లు కూడా తమ సెంటర్లకు పునః నామకరణం చేసి ఈ కొత్త ఒరవడిలోకి ఎంటర్ అయ్యాయి. ‘సెకండ్ వైఫ్ రెస్టారెంట్’, ‘తిను బకాసుర’, ‘పొట్ట పెంచుదాం’, వంటి పేర్లతో, ‘మాయాబజార్’, ‘వివాహ భోజనంబు’ వంటి ఎవర్గ్రీన్ హిట్ సినిమాల పేర్లతోనూ రెంస్టారెంట్లు తెరచుకున్నాయి. ఫుడీలకే కాదు మీమర్లకూ ఫీడ్ అందించాయి. షాకింగ్? సర్ప్రైజ్?! కాన్యే వెస్ట్.. అమెరికన్ సింగర్. అక్కడి యూత్‌కి ఫ్యాషన్ ఐకాన్. రెండేళ్ల కిందట అతను ఇచ్చిన ఓ సర్ప్రైజ్ను ప్రపంచం ఈనాటికీ మరిచిపోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలబడుతున్నానని, అదీ ట్రంప్‌తో ఉన్న మంచి స్నేహాన్ని చెడగొట్టుకుని మరీ అంటూ ప్రకటించడంతో అంతా షాక్ తిన్నారు. తమ ఫేవరెట్ సెలబ్రిటీ అధ్యక్ష ఎన్నికల్లోనా? అంటూ ఆశ్చర్యానికిలోనైంది అక్కడి యువత. కట్ చేస్తే.. తన కొత్త ఆల్బమ్ కోసం అతను చేసిన పబ్లిసిటీ స్టంట్ అని తేలడంతో.. తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కాన్యే వెస్ట్‌ను. అయ్యో వద్దమ్మా.. ఓ వర్షపు వేళ.. సిగ్నల్ పడి ట్రాఫిక్ ఆగిపోతుంది. ఒక కారు వెనుక సీట్ దగ్గరకు ఓ ట్రాన్స్ జెండర్ వచ్చి కారు అద్దాన్ని తడుతుంది మునివేళ్లతో. ఆ ట్రాన్స్‌జెండర్ డబ్బుల కోసం వచ్చిందేమో అనుకుని కార్లో ఉన్న పెద్దావిడ అద్దాలు దించి డబ్బులివ్వబోతుంది. ‘అయ్యో వద్దమ్మ టీ ఇవ్వడానికి వచ్చాను’ అంటూ తన చేతిలో ఉన్న టీ గ్లాస్‌ను ఆమెకు అందిస్తుంది. టీ తీసుకుని నిండు మనసుతో ఆ ట్రాన్స్‌జెండర్‌ను ఆశీర్వదిస్తుంది ఆ పెద్దావిడ. పేరున్న ఓ టీ బ్రాండ్ యాడ్ ఇది. ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ యాడ్ చాలా పాపులర్ అయింది. ఈ యాడ్ పాపులారిటీని మన పోలీసులూ వాడుకున్నారు.. ‘అమ్మో వద్దమ్మా’ అంటూ ట్రాఫిక్ మీద ప్రజలకు అవగాహన కల్పించేందుకు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు.. ఆ యాడ్ చూపిన ప్రభావం ఎంతటిదో! ఇలా సామాన్యులను ప్రభావితం చేసిన ఎన్నో ప్రకటనలు మీమ్స్‌గా.. రీల్స్‌గా నెట్టింట వెల్లువెత్తుతున్నాయి. డాక్టర్లు..స్టాక్ మార్కెట్ ట్రేడర్లు.. వ్యాపార ప్రమోషన్లకే కాదు ఆఖరికి వెడ్డింగ్ కార్డుల్లోనూ వెరైటీకి పెద్ద పీట వేస్తున్నాయి క్రియేటివ్ మైండ్స్. ఇటీవలి కాలంలో తెలంగాణ యాసలో వెడ్డింగ్ కార్డ్స్ ప్రింట్ చేయడం ఫ్యాషన్‌గా మారింది. దీనికి అదనంగా డాక్టర్లయితే వారి టెర్మినాలజీలో, స్టాక్ మార్కెట్ ట్రేడర్లయితే ఐపీవో, పబ్లిక్ ఇష్యూ, ప్రమోటర్ వంటి పదాలు వాడుతూ శుభలేఖలకు కొత్త శోభను అద్దుతున్నారు. రియల్ లైఫ్ సరే.. రీల్ లైఫ్ పబ్లిసిటీకి సంబంధించి ఇక్కడొక సంగతి చెప్పుకోవాలి. ప్రకటనలతో తన ప్రోడక్ట్‌పై నమ్మకాన్ని.. ఆసక్తిని పెంచేలా చేయడంలో ఒకప్పుడు దేశంలోనే ఎవరూ చేయని సాహసం చేశాడు. కన్నడ దర్శక హీరో ఉపేంద్ర. కథకు.. సినిమాలో పాత్రలకు ఏ సంబంధం లేకుండా సినిమాకు టైటిల్ పెట్టే కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేశాడు. ‘ష్’, ‘ఓం, ‘ఏ’ వంటి ఒకే అక్షరంతో కూడిన టైటిల్స్ కన్నడనాటే కాకుండా తెలుగులో కూడా సెన్సేషన్ అయ్యాయి. సినిమా టైటిల్స్ వేయడంలో దివంగత దర్శకుడు ఈవీవీది సపరేట్ స్టయిల్. ముఖ్యంగా టెక్నీషియన్స్ టైటిల్ కార్డ్స్ విషయంలో ఆయన పద్ధతే వేరప్పా! ఎడిటర్‌కి కత్తెరేసినోడు అని, కొరియోగ్రఫీకి చిందులేయించింది అని, సంగీతానికి వాయించింది అని.. వాడుక పదాలను వాడేవాడు. దీన్నీ సినిమా ప్రమోషన్లో న్యూ వేగా భావించవచ్చు. ఇలా చెప్పకుంటూ పోతే కిరాణా కొట్టు నుంచి కాస్మిక్ ఎనర్జీ దాకా.. ఆయా రంగాలకు చెందిన ప్రోడక్ట్స్ ప్రమోషన్స్ అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా పోటీ పడుతున్నాయి క్రియేటివిటీలో. ఆ సృజన కొనుగోళ్లను పెంచుతుందో లేదో తెలియదు కానీ కొనుగోలుదారుల మనసును మాత్రం గెలుచుకుంటోంది. అందుకే మార్కెట్లో గూడ్స్ కన్నా సృజనాత్మకమైన ఐడియాలకు మాత్రం పోటీ పెరిగింది. ఆ తిక్క ఉన్నవాళ్లదే గెలుపు మరి! ∙టి. కృష్ణ గోవింద్ -
Happy Mothers Day: హ్యాపీ 'అమ్మ'
‘పెళ్లి కాకుండా పిల్లలేంటి? ఊర్లో మేం తలెత్తుకుని తిరగాలా? వద్దా? నువ్వు చేసిన పనికి మీ నాన్న కుంగిపోతున్నాడు. బతికుండగానే మమ్మల్ని చంపేస్తావా?’ ఓ తల్లి బాధ.. పెళ్లి కాకుండా డోనర్ ద్వారా గర్భవతి అయిన కూతురు గురించి. ఇది ‘గిల్టీ మైండ్స్’ అనే వెబ్‌సిరీస్‌లో ఓ దృశ్యం. సినిమాలు, సీరియళ్ల కథాంశాలకు జీవితాలు.. ధోరణులు.. ఒరవడులే ప్రేరణ. అంటే పెళ్లి కాకుండానే తల్లి కావాలనుకోవడం నిజ జీవితాల్లో కనిపిస్తోందా? అని రెట్టించి అడిగితే సమాధానం అవుననే.. సాఫ్ట్వేర్ ఉద్యోగినుల నుంచి సెలబ్రిటీల దాకా! మహాభారతకాలం నాడు కుంతి కూడా పెళ్లి కాకుండానే కర్ణుడిని కన్నది. సమాజానికి భయపడి బిడ్డను బుట్టలో పెట్టి నదిలో వదిలేసింది. నేటి సమాజపు స్థితిగతులూ అవే. కాకపోతే స్త్రీలే ధైర్యంగా నిలబడుతున్నారు. ఏటికి ఎదురీదుతున్నామని తెలిసే తాము తీసుకున్న నిర్ణయం పట్ల స్థిరంగా ఉంటున్నారు. పెళ్లి ఊసు లేకుండానే పిల్లల్ని కనడానికి ఇష్టపడుతున్నారు. కంటున్నారు.. చక్కగా పెంచుకుంటున్నారు కూడా! ఈ అంశం మీద తప్పొప్పుల చర్చో.. మంచిచెడుల తీర్పో కాదు ఈ వ్యాసం. మాతృత్వానికి సంబంధించి ఈ తరం చేస్తున్న ఆలోచనలు.. దాన్ని ఆస్వాదించడంలో వాళ్లు తీసుకుంటున్న చొరవ.. చూపిస్తున్న తెగువ గురించి మాత్రమే ఈ నాలుగు మాటలు .. అదీ మదర్స్ డే సందర్భం కాబట్టి! 1980ల దశకం చివర్లో .. బాలీవుడ్ నటి నీనా గుప్తా పెళ్లి చేసుకోకుండానే వెస్ట్ ఇండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్‌తో బిడ్డను కన్నది. సమాజం ఉలిక్కిపడింది. ఆ చర్యను సంచలనంగా చూసింది. నీనా చలించలేదు. వివియన్ రిచర్డ్స్ మీదున్న ప్రేమను కూతురు రూపంలో పదిలపరచుకోవాలనుకుంది. ఆ ప్రేమ పెళ్లిదాకా వెళ్లదని తెలిసే ఆ రోజు ఆమె ఆ నిర్ణయం తీసుకుంది. మసాబాకు జన్మనిచ్చింది. అయితే ఈ దేశంలో ఒంటరి తల్లిగా ఆ బిడ్డను పెంచడం ఆమెకేమీ నల్లేరు మీద నడక కాలేదు. రోలర్ కోస్టర్ రైడే సాగింది. ఆమె ఊహించుకున్నదాని కంటే ఎక్కువ సమస్యలనే ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకోకూడదని ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా చాలా ఇంటర్వ్యూల్లో చెప్పింది. శతాబ్దం మారి ఇరవై ఏళ్లవుతోంది. నాటితో పోల్చుకుంటే నేడు మహిళల చదువు పెరిగింది. ఆర్థిక వెసులుబాటూ హెచ్చింది. అవి హక్కుల స్పృహను కల్పించాయి.. నిర్ణయాధికారాన్నిచ్చాయి. సాంకేతిక విప్లవం.. అదిచ్చిన ఉద్యోగావకాశాలు వాటికి దోహదపడ్డాయి. కెరీర్ ఒత్తిళ్లు.. ఉపాధి అవకాశాలు స్త్రీ, పురుషుల మధ్య పోటీనీ పెంచాయి. అది మహిళల మీద చాలా ప్రభావం చూపిస్తోంది. ఎంతలా అంటే జీవితంలో ఘట్టాలైన పెళ్లి, పిల్లలు వంటి వాటినీ మరచిపోయేంత.. మరిపించేంత లేదా వాయిదా వేసుకునేంతలా! ఆ పోటీ, వేగం ఉద్యోగ అభద్రతను కల్పించాయి... కల్పిస్తున్నాయి. పెళ్లి చేసుకున్నాక పిల్లల్ని కనే క్రమంలో సెలవులు అవసరమవడం.. సెలవుల మీద వెళ్లిన గర్భిణీలను ఉద్యోగంలోంచి తీసేయడం.. మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు గగనమవడం.. ఈ ఇన్సెక్యూరిటి వల్లే పెళ్లిని వాయిదా వేసుకోవడం.. పిల్లలనూ కనకుండా ఫ్యామిలీ ప్లానింగ్ పాటించడం వంటి కఠిన నిర్ణయాలకూ వచ్చిన ఉద్యోగినులున్నారు. తర్వాతర్వాత మెటర్నిటీ లీవులను తమ హక్కుగా సాధించినా.. పెళ్లి విషయంలో ఆధునిక మహిళల నిర్ణయాలను అదంతగా ప్రభావితం చేయలేకపోయింది. అంటే కెరీర్లో పడిపోయి పెళ్లికి అంత ప్రాధాన్యానివ్వని స్త్రీలు చాలామందే కనిపిస్తున్నారు. పురుషులతో సమంగా పెద్ద పెద్ద హోదాలు నిర్వహించడం.. ఆ అనుభవాలు ప్రాపంచిక జ్ఞానాన్ని అందివ్వడం.. ఇవన్నీ ఆడవాళ్లు.. ఆర్థికంగా, వ్యవహారికంగా పురుషుల మీద ఆధారపడే చాన్స్‌లను గణనీయంగా తగ్గించేశాయి. దాంతో వైవాహిక బంధంలో ప్రధానంగా కనిపించే ఈ పరస్పర ఆధారిత అంశం పలచబడుతోంది. అది సహజంగానే జీవిత భాగస్వామి అవసరాన్ని తగ్గించేస్తోంది. కానీ మహిళలోని మాతృత్వపు ఆలోచనను.. ఆ ఆశను మాత్రం పదిలంగానే ఉంచుతోంది. ఆ అభిలాషే పెళ్లి బంధానికావల తల్లి కావాలనే ధైర్యాన్నిస్తోంది. ఇవీ కారణాలు కావచ్చు.. సాంకేతిక వృద్ధి.. పెళ్లితో దొరికే తోడు, తల్లి కావడానికి ఉండే ఈడుతో పనిలేకుండా మాతృత్వాన్ని పొందే అవకాశాలను సృష్టించింది. అండాశయాలను, వీర్యకణాలను భద్రపరచుకునే బ్యాంక్‌లను ఏర్పాటు చేసి. ఈ సౌకర్యం ఉద్యోగినులను పెళ్లి లేకుండానే బిడ్డలను కనాలనే ఆలోచనవైపు ఆకర్షిస్తుండొచ్చు. కెరీర్‌కు సంబంధం లేకుండా ఈ ధోరణిని పరికిస్తే.. అన్ని విధాలా తనకు సరితూగే మిస్టర్ రైట్ దొరక్కపోవడం, వరకట్నాల డిమాండ్, గృహ హింస, కుటుంబ హింస, పరస్పర గౌరవమర్యాదల్లేని వైవాహిక అనుబంధాలు, వివాహ వెఫల్యాలు, మగవాళ్ల వ్యసనాలు, చైల్డ్ అబ్యూజ్ వంటి చేదు అనుభవాలూ వివాహం పట్ల ఈ తరం అమ్మాయిలు విముఖత చూపడానికి, పెంచుకోవడానికి కారణమవుతున్నాయని ఓ పరిశీలిన, పరిశోధన. ఇవీగాక శారీరకంగా తలెత్తే సమస్యలూ ఉంటున్నాయి. మారిన జీవన శైలి వల్ల వస్తున్న స్థూలకాయం, థైరాయిడ్, ఇన్ఫెర్టిలిటీ వంటివీ పెళ్లంటే అనాసక్తతను పెంచుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో.. పెళ్లిని వద్దనుకుంటున్నా.. సంతానాన్ని వద్దనుకోవడంలేదు. మాతృత్వపు మాధుర్యాన్ని చవిచూడాలనుకోవడమే కాదు.. దాని తాలూకు బాధ్యతనూ ఒంటరిగా మోయడానికి సిద్ధపడ్తున్నారు ఆ మహిళలు. అంతేకాదు పెళ్లి లేకపోయినా.. తనకంటూ ఓ కుటుంబం ఉండాలని.. దాన్ని ఏర్పర్చే పిల్లల తోడుగా జీవితాన్ని కొనసాగించాలని బలంగా కోరుకుంటున్నారు. ఇందుకు సహజీవనం, స్పెర్మ్ డోనర్స్ అనే మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇవేవీ కుదరని పక్షంలో సరొగసికీ సిద్ధపడుతున్నారు. ఇదీ సఫలం కాకపోతే దత్తత తీసుకోవడానికీ వెనకాడ్డం లేదు. సమస్యలూ ఉన్నాయి.. విడాకులతో భర్త నుంచి వేరై.. సింగిల్ పేరెంట్‌గా పిల్లల బాధ్యతను మోస్తున్న తల్లికే సామాజిక మద్దతు కొరవడుతున్న పరిస్థితి. అలాంటిది వివాహ వ్యవస్థను కాదని పిల్లలను కని, పెంచుతున్న ఒంటరి తల్లులను సమాజం ఆదరిస్తుందా? మద్దతు ప్రకటిస్తుందా? గౌరవిస్తుందా? ఆర్థికంగా సర్వస్వతంత్రంగా ఆ తల్లులు సమాజం విసిరే సవాళ్లను ఎదర్కోవడం కష్టమే. అది పిల్లల మీదా ప్రభావం చూపి వారిని అభద్రతలోకి నెట్టే ప్రమాదాలూ ఉన్నాయి. కాబట్టి వెడ్లాక్కి అతీతంగా తల్లి కావాలని ఎంత దృఢచిత్తం చేసుకున్నా.. గర్భం దాల్చే కంటే ముందు తదనంతర పరిణామాలు, సామాజిక ప్రతికూల స్పందనలు వగైరాల మీద కౌన్సెలింగ్ తీసుకోవాలి. అన్నిటికీ తమను తాము సిద్ధపరచుకోవాలి అని సలహా, సూచనలిస్తున్నారు మానసిక విశ్లేషకులు. పిల్లల పెంపకం విషయంలోనూ ఆ కౌన్సెలింగ్ తప్పనిసరి అని చెబుతున్నారు. స్కూళ్లు, వేడుకలు వంటి ప్రదేశాలు, సమూహాల్లో పిల్లలకు ఎదురయ్యే బుల్లీయింగ్ పట్ల అవివాహిత ఒంటరి తల్లులకు ఓ అవగాహన ఉండాలి. వాటిని పిల్లలు అధిగమించే మార్గాలూ తెలుసుండాలి. పిల్లలకు మానసిక స్థయిర్యం ఇచ్చే సహనం, ఓర్పు అత్యవసరం... మిగతా తల్లులకన్నా. ఎందుకంటే వివాహిత ఒంటరి తల్లుల పట్ల కనీసం కుటుంబాల్లోనైనా సహానుభూతి అందుతుంది. కానీ అవివాహిత తల్లుల విషయంలో అదీ కరవే. అందుకే మరింత సహనంతో వాళ్లు వ్యవహరించాల్సి ఉంటుంది. పసి మనసులు గాయపడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. నైతిక మద్దతు.. తాము కోరుకున్న ఈ కొత్త కుటుంబ భవిష్యత్‌కు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలే కాదు.. సామాజిక ప్రతికూల పరిస్థితులను తట్టుకుని పిల్లలు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా పెరిగేలా వేసుకునే ప్రణాళికలూ అవసరమే! అందుకు ఒంటరి తల్లులకు సంబంధించిన అసోసియేషన్స్, సోషల్ మీడియా గ్రూప్స్ వంటివేమైనా ఉంటే అందులో చేరడం, వారి అనుభవాలను పాఠాలుగా తెలుసుకోవడం, నైతిక స్థయిర్యాన్ని పొందుతూ ఓ మద్దతు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తల్లీ, తండ్రీ రెండు పాత్రలు పోషించాలి కాబట్టి ఓర్పు చాలా అవసరం. ఇంట్లో స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాలి. పిల్లల ముందు బేలగా ఉండడం, బెంబేలెత్తడం, తమకు ఎవరూ లేరనే స్పృహను కల్పించడం అసలు చేయకూడదని మానసిక విశ్లేషకుల మాట. దాని బదులు ఇతర కుటుంబాల కన్నా తామెందుకు భిన్నమో.. ఆ బిడ్డ తనకెంత ముఖ్యమో.. సందర్భం వచ్చినప్పుడు సంభాషణల్లోనే చెప్పడం.. ఆ ప్రాధాన్యాన్ని చూపించడం చేయాలనీ సూచిస్తున్నారు మానసిక విశ్లేషకులు. చట్టం ఒప్పుకోవట్లేదు.. కానీ న్యాయస్థానాలు గుర్తిస్తున్నాయి.. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారం.. పిల్లలను దత్తత తీసుకునే వీలు ఉంది. కానీ పిల్లల పెంపకంలో, వాళ్ల చదువుల విషయంలో సింగిల్ మదర్స్‌కు ఎదురయ్యే ప్రశ్న.. సంరక్షకులు ఎవరని. అసలు సింగిల్ మదర్స్‌కు గార్డియన్‌గా ఉండే అర్హత ఉందా? మన దేశంలోని చట్టాల ప్రకారమైతే లేదు. కేవలం తండ్రికి మాత్రమే సంరక్షకులు అనే హోదా ఉంది. ప్రభుత్వ రికార్డులు సైతం తండ్రినే గుర్తిస్తుంటాయి. తల్లి సహజంగానే సంరక్షకురాలు అనే గుర్తింపు ఉన్నా.. తండ్రి తర్వాతే ఆమె స్థానం. అందుకే ‘సింగిల్ మదర్స్’ హక్కులకు రక్షణ కావాలనే డిమాండ్ తలెత్తింది. ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తోంది జాతీయ మహిళా సంఘం (ఎన్సీడబ్ల్యూ). గార్డియన్షిప్ చట్టాలకు సంబంధించి కొన్ని సవరణలు అవసరమనే ప్రతిపాదనలను కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖకు పంపించింది కూడా. ఆ సవరణలు ఇంకా జరగలేదు. మన దేశంలో వారసత్వానికి సంబంధించి రెండు ప్రధాన చట్టాలు ఉన్నాయి. హిందూ మైనార్టీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956 (హెచ్ఎంజీఏ), గార్డియన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890.. ప్రకారం తల్లి, తండ్రి లేదంటే ఇతరులు గార్డియన్షిప్ హక్కులను కలిగి ఉంటారు. హెచ్ఎంజీఏ సెక్షన్ 6 ప్రకారం.. ఒక బిడ్డకు తండ్రే సంరక్షకుడు. ఆయన తదనంతరం తల్లికి ఆ హక్కు సంక్రమిస్తుంది. అయితే వివాహ బంధంతో సంబంధం లేని సందర్భాల్లో బిడ్డ పరిస్థితి ఏంటి? అందుకే రాజ్యాంగ బద్ధంగా కల్పించిన హక్కులకు సెక్షన్ 6 (14, 15 ఆర్టికల్స్)కు విఘాతం అని వాదిస్తుంది జాతీయ మహిళా సంఘం. అలాగే సెక్షన్ 6(బీ) ప్రకారం.. వివాహేతర సంతానం అనే పదాన్నీ తొలగించాలని కోరుతోంది. ఈ రెండు సెక్షన్లు.. సింగిల్ మదర్స్‌తో పాటు భర్తలకు దూరమైన తల్లులు, పిల్లల్ని కనే లైగింకదాడి బాధితురాలి హక్కులకూ భంగం కలిస్తున్నాయని జాతీయ మహిళా సంఘం వాదిస్తోంది. అయితే..చట్టంలో సింగిల్ మదర్స్ హక్కులకు భద్రత కరువైనా న్యాయస్థానాలు మాత్రం అందుకు అనుకూలమైన తీర్పులే ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సింగిల్ మదర్స్‌కు బిడ్డను కనే హక్కు మాత్రమే కాదు.. వాళ్లను పెంచే హక్కులు కూడా ఉంటాయని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. కేరళలో ప్రముఖ న్యాయవాది అరుణ.ఎ. వాదించిన ఓ కేసులో ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన ఒక సింగల్ మదర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఇక 2015లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఓ తీర్పు ల్యాండ్ మార్క్‌గా నిలిచింది. ఏబీసీ వర్సెస్ స్టేట్ (ఎన్సీటీ ఆఫ్ ఢిల్లీ).. కేసులో అత్యున్నత న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పెళ్లి కాని తల్లులు.. బిడ్డ తండ్రి పేరు, గుర్తింపును బయటపెట్టాల్సిన అవసరం లేదని, తల్లే ఆ బిడ్డకు ఏకైక సంరక్షకురాలని స్పష్టం చేసింది. ‘ఎవరి మీద ఆధారపడకుండా బిడ్డలను పెంచుతున్న తల్లుల సంఖ్య పెరిగిపోతున్న సమాజం ఇది. అలాంటప్పుడు తండ్రే సంరక్షకుడు అంటూ సింగిల్ మదర్స్‌ను ఇబ్బంది పెట్టడం, తండ్రి పేరు చెప్పాలంటూ ఆమె(సింగిల్మదర్) ప్రైవసీకి భంగం కలిగించడం సరికాదు. అలాగే ఆ బిడ్డకు తండ్రి పేరు తెలుసుకునే హక్కు ఉంటుంద’ ని వ్యాఖ్యలు చేసింది సుప్రీం కోర్టు. ఈ తీర్పును చాలా హైకోర్టులు సమర్థించాయి కూడా. కానీ చట్టంలో ప్రత్యేక సవరణలు జరగనంత కాలం.. సింగిల్ మదర్స్‌కు వారసత్వ విషయంలో ఇలా కోర్టుల మీద ఆధారపడాల్సిన పరిస్థితే ఉంటుంది. ముగింపు.. సంప్రదాయ పునాదుల మీద.. వివాహం, కుటుంబ వ్యవస్థలే రెండు కళ్లుగా కొనసాగుతున్న సమాజం మనది. సాంకేతిక పురోభివృద్ధి మోసుకొచ్చే ఆధునిక సౌకర్యాలన్నింటినీ మనఃపూర్వకంగా అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. వాటి కూడా వచ్చే, ప్రభావం చూపే పరాయి సంస్కృతీసంప్రదాయాలూ ఉంటాయి. ఇది వరకైతే అవి మనల్ని చేరడానికి ఏళ్ల సమయం పట్టేది. కానీ సమాచార విప్లవంతో గంటలు మహా అయితే రోజుల తేడాతో బదిలీ అవుతున్నాయి. అది అనివార్యం. ఏ ధోరణికైనా.. ఒరవడికైనా! -భాస్కర్ శ్రీపతి -
అది కాళరాత్రి: జెలెన్స్కీ.. ఆయనపై ‘టైమ్’ కవర్ స్టోరీ
యుద్ధం మొదలైన రోజే కుటుంబంతో సహా తనను బంధించేందుకు, హతమార్చేందుకు రష్యా ప్రయత్నించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ‘‘నన్ను, నా కుటుంబాన్ని లక్ష్యం చేసుకుని రష్యా దళాలు కీవ్‌లో దిగాయి. మా ఆవిడ, నేను పిల్లలను లేపి విషయం చెప్పాం. అప్పటికే బాంబుల వర్షం మొదలైంది’’ అన్నారు. టైమ్ మేగజైన్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. టైమ్ తాజా సంచికలో ఆయనపై కవర్‌స్టోరీ కథనం ప్రచురించింది. -
రష్యా బలగాలు మా దాకా వచ్చాయి: జెలెన్స్కీ
ఉక్రెయిన్ యుద్ధంలో ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీను పాశ్చాత్య దేశాలు హీరోగా అభివర్ణిస్తే.. కొన్ని దేశాల నుంచి మాత్రం విమర్శలతో ముంచెత్తాయి. అగ్రరాజ్యం అండ చూసుకుని.. అనవసరంగా ఉక్రెయిన్ను యుద్ధ ఊబిలోకి దించాడంటూ తిట్టిపోశారు కొందరు. అయినా జెలెన్స్కీ మాత్రం ఆ విమర్శలను పట్టించుకోవడం లేదు. పోరాటం వెనుక ప్రమేయాలు లేవని, దేశం నుంచి ఇంచు భూమి కూడా వదులుకోబోమని, కడదాకా పోరాడతామని అంటున్నాడు. తాజాగా ఆయన ముఖచిత్రంతో టైమ్ మ్యాగజైన్ ‘హౌ జెలెన్స్కీ లీడ్స్’ పేరుతో ఓ కవర్‌స్టోరీ ప్రచురించింది. రిపోర్టర్ సైమన్ షూస్టర్, అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ, ఆయన భార్య ఒలెనా జెలెన్స్కా, ఉక్రెయిన్ కీలక అధికారులను ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా.. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఎదుర్కొంటున్న అనుభవాల్ని, మానసిక సంఘర్షణలను వివరించాడాయన. ‘‘ఆ ఉదయం నాకు బాగా గుర్తుంది. రష్యా బలగాల దుశ్చర్యతో.. పొద్దుపొద్దునే బాంబుల మోత మోగింది. నేను, నా భార్య ఒలెనా, 17 ఏళ్ల కూతురు, తొమ్మిదేళ్ల కొడుకు నిద్ర లేచాం. మా ఇద్దరు పిల్లలకు బాంబుల దాడి మొదలైందని చెప్పాం. TIME's new cover: Over two weeks in April @shustry went inside Volodymyr Zelensky's compound for a look at how the Ukrainian President and his top advisers are experiencing the war https://t.co/9bmZXfvy8e pic.twitter.com/4PAxf97eNM — TIME (@TIME) April 28, 2022 వెంటనే కొంతమంది అధికారులు మా దగ్గరికి వచ్చారు. కుటుంబంతో సహా సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని చెప్పారు. రష్యా బలగాలు ఏ క్షణమైనా కీవ్‌లో అడుగుపెట్టొచ్చని, కుటుంబంతో సహా తనను చంపే అవకాశాలు ఉన్నాయని వాళ్లు మమ్మల్ని హెచ్చరించారు. అధ్యక్ష భవనం నుంచి బయటకు చూస్తే.. విధ్వంసం, బాంబుల మోతే. సినిమాల్లో తప్ప అలాంటి దృశ్యాలేనాడూ చూడలేదు. అధ్యక్ష భవనం గేటు ముందు భారీగా సిబ్బంది మోహరించారు. ఆ రాత్రంతా ఉక్రెయిన్ అధ్యక్ష భవనం ప్రాంగణంలో లైట్లు ఆర్పేశారు. నాకు, నా సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించమని ఇచ్చారు. ఏ క్షణం ఏ జరుగుతుందో అనే ఆందోళనతో అంతా ఉన్నారు. కానీ, ధైర్యం చెప్పా వాళ్లకు. రష్యా బలగాలు దాదాపుగా మా దగ్గరికి వచ్చేశాయి. కానీ, మా దళాలు గట్టిగానే ప్రతిఘటించాయి. అని జెలెన్స్కీ గుర్తు చేసుకున్నాడు. ఇక యుద్ధం తొలినాటి పరిస్థితులపై ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ సర్వీస్ అనుభవజ్ఞుడైన ఒలెక్సీ అరెస్టోవిచ్ స్పందించాడు. ఆరోజు దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. జెలెన్స్కీ, ఆయన భార్యాపిల్లలు లోపల ఉండగానే రష్యన్ దళాలు రెండుసార్లు అధ్యక్ష భవనం ప్రాంగణంపై దాడి చేయడానికి ప్రయత్నించాయని పేర్కొన్నాడు. చదవండి: తూర్పున దాడి ఉధృతం -
బండ కింద బతుకులు..
తెలంగాణ అధికశాతం జీవితం ప్రత్యక్షంగా కానీ.. పరోక్షంగా కానీ ముడిపడి ఉండేది రెండేరెండిటితో! ఒకటి దుబాయి.. రెండు బొగ్గు బాయి! గల్ఫ్ వలస జిందగీ తెలిసినంత వివరంగా బొగ్గుబాయి జీవనాలు తెలియవు. మసిబారిపోయిన ఆ కష్టాలు, కన్నీళ్లు ఒక్కసారిగా అందరి మనసులను కదిలించాయి.. ఈ మధ్య మంచిర్యాల జిల్లాలోని ఎస్ఆర్పీ 3 బొగ్గు గనిలో పైకప్పు కూలి నలుగురు కార్మికులు మరణించారనే వారత్తో! బయటకు విద్యుత్ కాంతులు పంచుతూ అగాథంలో చీకటిని అనుభవిస్తున్న గనికి మల్లే దాన్ని తవ్విపోసే కార్మికుల బతుకులూ అంతే. బండ కిందకు వెళ్లిన వాళ్లు బయటకు వచ్చేదాకా ఒడ్డునున్న వారికి దడే. ప్రమాదాలతో సహవాసం చేస్తూ నల్లవజ్రాలను వెలికి తీస్తున్న ఆ జీవితాల మీద ఓ కథనం ఇది... గనిలో పనిచేసే కార్మికుల రోజు.. ఉదయం 7 గంటలకు మొదలవుతుంది తొలి షిఫ్ట్‌తో. ముందు అంతా మస్టర్ (హాజరు) వేయించుకుంటారు. తర్వాత తన పర్సనల్ బాక్సులో ఉండే టోపీ, బూట్లు, డ్రెస్సు ధరిస్తారు. అనంతరం గనిలోకి దిగాల్సిన కార్మికులు ల్యాంప్ రూములోకి వెళ్లి ల్యాంప్ తీసుకుంటారు. పనిని విభజించే డిస్ట్రిబ్యూషన్ పాయింట్ వద్దకు వెళ్తారు. అక్కడ కార్మికులంతా రక్షణ ప్రతిజ్ఞ చేస్తారు. అక్కడ ఓవర్‌మెన్ ఎవరెవరు ఏ పనికి వెళ్లాలో విధులు కేటాయిస్తారు. కేటాయించిన పనుల ఆధారంగా పనిముట్లు తీసుకెళ్తారు. పిట్ (గని) స్టోర్ రూములో గునపం, చెమ్మాస్, సుత్తి, రాడ్లు తీసుకుంటారు. మైసమ్మ తల్లికి మొక్కి లైట్ ఆన్ చేసుకుని మ్యాన్‌రైడింగ్ సిస్టమ్ ద్వారా గనిలోకి వెళతారు. దాదాపు కిలోమీటరు నుంచి కిలోమీటరున్నర దూరం ప్రయాణించాక దిగుతారు.అక్కడ కొద్దిదూరం నడవాలి. దీని వెనుక శాస్త్రీయ కారణం.. ఉపరితలం నుంచి ఆకస్మికంగా భూగర్భంలోకి వెళ్లినపుడు శ్వాస సరిగా ఆడదు. అందుకే అలా కొద్ది దూరం నడుస్తారు. మ్యాన్ రైడింగ్ సిస్టమ్ నుంచి దిగిన తరువాత కొద్దిదూరం చైర్లిఫ్ట్ ద్వారా అర కిలోమీటరు నుంచి కిలోమీటరు పైగా వెళ్తారు. పని ఆధారంగా వివిధ లెవెల్స్ వద్ద దిగి, వివిధ సీమ్స్లోకి కాలినడకన వెళతారు. తలవంచుకునే ఉండాలి.. గనిలో పనిచేయడం అంత సులభం కాదు. గనిని తొలుస్తూ పోయే క్రమంలో చాలాచోట్ల టన్నెల్ ఎత్తు 2 నుంచి 2.7 మీటర్లు మాత్రమే ఉంటుంది. మనవాళ్ల సగటు ఎత్తు 5.5 నుంచి 6 అడుగులు. దీంతో దాదాపుగా అందరూ తల వంచుకునే వెళ్లాలి. బరువైన పనిముట్లను భుజాన వేసుకుని వంగి అలా అరకిలోమీటరు నుంచి కిలోమీటరు వరకు నడుస్తూ వెళ్లాలి. లోపల తలపై ఏ రాళ్లు కూలినా టోపీ రక్షిస్తుంది. ఇక వీరికోసమే ప్రత్యేకమైన బూట్లు ఇస్తారు. అవి దాదాపుగా ఒక్కోటి కిలోపైనే బరువు ఉంటాయి. అంతటి బరువైన షూలు వేసుకుని తలవంచుకుని ముందుకు కదలాలి. తక్కువ ఎత్తులో బొగ్గును తవ్వి ఎత్తి పోయాలి. చాలాచోట్ల మెట్లు ఎక్కి దిగాలి. లోపల గ్రీజు, బురద, దుమ్ము – ధూళి రేగుతుంటాయి. తాగునీటికి ఏర్పాట్లు ఉంటాయి. లైట్ చాలా ఇంపార్టెంట్ ప్రపంచంలో ఏ బొగ్గుగుని కార్మికుడికైనా లైట్ చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే పని చేయలేరు. ప్రధాన టన్నెల్ వెంబడి , పని ప్రదేశాల్లో విద్యుత్ లైట్లు ఉంటాయి. మిగిలిన ఉత్పత్తి జరిగే ప్రాంతాల్లో చిమ్మచీకటే. తలపై ఉన్న లైట్ లేకపోతే ఎదురుగా ఎవరు ఉన్నారో గుర్తించలేరు. అంత చిమ్మచీకటిలో తలకు ఉన్న లైట్ వీరికి తొలిగుర్తింపు. అది బ్యాటరీ లైట్. పదేళ్ల కిందటి వరకు యాసిడ్ బ్యాటరీలు ఉండేవి. అది దాదాపు 600 గ్రాముల కంటే ఎక్కువ బరువు ఉండేది. దాని నిండా యాసిడ్ ఉండేది. లైట్ వెలుగుతున్నంత సేపు నడుముకు వేడి తగిలేది. ప్రతిరోజూ చర్మం కమిలిపోయేది. ఒక్కోసారి వేసుకున్న దుస్తులు, చర్మం కాలిపోయేవి. ఆ విషయం కార్మికులు బయటికి వచ్చేవరకు గుర్తించేవారు కాదు. బొగ్గు ఇలా బయటికి తీస్తారు.. మనం చూసే బొగ్గు లోపల మరోలా ఉంటుంది. భారీ నల్లరాతి శిలలను బ్లాస్టింగ్ ద్వారా పేలుస్తారు. అందుకు, ప్రత్యేక శిక్షణ పొందిన కార్మికులు పనిచేస్తారు. మరికొన్నిచోట్ల ప్రత్యేక యంత్రాలతో ఈ బొగ్గు పొరలను తవ్వుతారు. ఆ తర్వాత ఈ బొగ్గును ఎస్డీఎల్, ఎల్‌హెచ్‌డీ యంత్రాల ద్వారా చిన్నరైలు టబ్బులు లేదా కన్వేయర్ బెల్టుపైకి ఎత్తిపోస్తారు. అలా ఆ బొగ్గు వెలుపలికి పంపుతారు. గనుల్లో ఉత్పత్తి డిమాండ్ అధికంగా ఉన్న చోట కన్వేయర్ బెల్ట్ విధానం, తక్కువగా ఉన్న చోట రైలు టబ్స్‌ను వినియోగిస్తారు. కన్వేయర్ బెల్టు అయినా, టబ్స్ విధానమైనా బొగ్గు నేరుగా వెళ్లి కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)కి చేరుతుంది. అక్కడ నుంచి రైలు వ్యాగన్లను పవర్ స్టేషన్‌కు పంపుతారు విద్యుదుత్పత్తి కోసం. శిలలు కూలడంతోనే సమస్య.. మనం ఇసుకలో పిచ్చుకగూళ్లు కడతాం కదా.. కాస్త తడి ఆరగానే అవి కూలిపోతాయి. అలాగే భూగర్భ గనుల్లోనూ పైకప్పులు కూలిపోతుంటాయి. భూమి పొరలు తొలుస్తూ లోపలికి దాదాపు 5 కిలోమీటర్ల లోతున ఏటవాలుగా ప్రధాన సొరంగం, దానికి ఉపసొరంగాలు ఉంటాయి. కిలోమీటర్ల కొద్దీ తవ్వడంతో అప్పుడప్పుడు లోపలిపొరలు.. సర్దుబాటులో భాగంగా సహజంగానే కదిలి కూలుతుంటాయి. ఆ సమయంలో కార్మికులు కింద ఉంటే సమాధి అవడమే. ఇటీవల శ్రీరాంపూర్ గనిలో జరిగింది అదే. అందుకే, రక్షణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. సొరంగం తవ్విన తర్వాత వాటికి రూఫ్బోల్టులు బిగిస్తారు. ఇవి కనీసం పదిహేను టన్నుల వరకు బరువును మోయగలుగుతాయి. అంతకు మించితే విరిగిపోతాయి. అంటే పైకప్పుపై భారం పెరిగి కూలే ప్రమాదముందని సంకేతమన్న మాట. అందుకే ప్రతిరోజూ వీటి సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. ‘టెల్‌టేల్’ అనే యంత్రాన్ని జంక్షన్ల వద్ద బిగిస్తారు. ఇది పైకప్పు బలహీనంగా మారిన వెంటనే ఎర్రరంగు సూచిస్తుంది. వీటిని ముందుగా సేఫ్టీ ఆఫీసర్ తనిఖీ చేస్తారు. ఆయన అంతా బాగుందని అన్నాకే కార్మికులు గనిలోకి దిగుతారు. వందల టన్నుల శిలలు.. ఒక్కోసారి ఉదయం పూట తనిఖీ చేసినా.. అకస్మాత్తుగా కూడా పైకప్పులు కూలుతుంటాయి. వందల టన్నుల బరువు ఉన్న భారీ రాతి పెచ్చుల కింద కార్మికులు పడిపోతారు. కేవలం 60 నుంచి 80 కిలోల బరువున్న మానవశరీరం వందల టన్నుల బరువున్న రాతిపెచ్చు కింద పడ్డాక బతికే అవకాశాలు చాలా స్వల్పం. ఇక్కడే సింగరేణి రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగుతుంది. వీలైనంత మేరకు వీరు కార్మికులను కాపాడతారు. ఫస్ట్‌ఎయిడ్ సెంటర్... లోపల పని చేసేక్రమంలో కార్మికులు గాయపడుతుంటారు. గుండెపోటు, బీపీ, కళ్లు తిరగడం, స్పృహతప్పి పడిపోవడం తదితర అనారోగ్య సమస్యలు వెలుగుచూస్తాయి. అందుకే, గనిలో మ్యాన్ రైడింగ్ సిస్టం సమీపంలోనే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ వీరికి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం మ్యాన్‌రైడింగ్ సిస్టమ్ ద్వారా పైకి పంపిస్తారు. అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలిస్తారు. రెస్క్యూ కీలకం.. గనిలో జరిగే రెస్క్యూనే కీలకంగా వ్యవహరిస్తారు. ఇందుకోసం ఫిట్నెస్ ఉన్న గని కార్మికులను ఎంపిక చేసుకుని వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు. గనిలో నీటి ప్రమాదం జరిగినా, పైకప్పు కూలినా నిమిషాల్లో.. వీరు వచ్చి గంటల్లోనే శిథిలాలను తొలగించి కార్మికులను కాపాడతారు. వీరి పనితీరుకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. పదేళ్ల కిందటి వరకు అంతగా యాంత్రీకరణ లేని సమయంలో గనిలో ప్రమాదాలు నిత్యకృత్యంగా ఉండేవి. కానీ ఇప్పుడు యాంత్రీకరణ, ఆధునిక టెక్నాలజీ ఉపయోగం వల్ల ప్రమాదాలు, ప్రాణనష్టం తగ్గుముఖం పట్టాయి. సింగరేణి రెస్క్యూ టీం సింగరేణికి మాత్రమే పరిమితం కాదు దేశంలో ఎక్కడ విపత్తులు వచ్చినా వీరు ముందుంటారు. 2004లో జీడీకే –8ఏ గనిలో ప్రమాదం జరిగినప్పుడు సింగరేణి రెస్క్యూ అందించిన సహకారం మాటల్లో చెప్పలేనిది. గనిపైకప్పు కూలి కార్మికులు అందులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది పడిన కష్టం అంతా ఇంతా కాదు. కేవలం ఐదు మీటర్ల ఎత్తులోనే ఉన్న గనిపైకప్పు కూలిపోవడంతో కూలిన బండను లేపేందుకు ఎలాంటి యంత్రాలు వినియోగించే అవకాశం ఉండదు. ఈక్రమంలో బండకింద నలిగిన కార్మికులను బయటకు తీయడం పెద్ద సాహసమే. సింగరేణి యాజమాన్యం కొత్తగా సమకూర్చుకున్న టూల్స్‌ను వినియోగించుకుంటూ కూలిన బండకింద ఉన్న బొగ్గును సొరంగంలా తవ్వి.. దాన్ని తొలగించి శవాలను బయటకు తీయాల్సి వచ్చింది. సింగరేణి రెస్క్యూ ఆవశ్యకతను గుర్తించిన యాజమాన్యం గోదావరిఖనిలోని ౖయెటింక్లయిన్‌కాలనీలో సింగరేణి మెయిన్‌రెస్క్యూ స్టేషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో 40 మంది బ్రిగేడియర్లు, నితంతర రెస్క్యూ శిక్షణ, ప్రత్యేకంగా జీఎం, సూపరింటెండెంట్‌తో పాటు రెస్క్యూ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. హైడ్రాలిక్టూల్స్, కట్టర్లు, స్పెడ్డర్లు, హైడ్రాలిక్ జాక్స్, అగ్నిప్రమాదాల నుంచి రక్షించేందుకు ఫైర్‌ఫైటింగ్ టూల్స్ కూడా ఈ స్టేషన్లో నిరంతరం అందుబాటులో ఉంటాయి. రక్షణే ప్రథమం.. రక్షణే చివరికి.. సింగరేణిలో రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బొగ్గు ఉత్పత్తి, రక్షణ.. సంస్థకు రెండు కళ్లలాంటివి. వీటిని సమాంతరంగా చూసుకుంటూ బొగ్గు ఉత్పత్తిపై దృష్టిసారిస్తున్నాం. ఇటీవల శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన ప్రమాదంతో మరింత అప్రమత్తం అయ్యాం. గనుల వారీగా రక్షణ సమావేశాలు నిర్వహిస్తూ అప్రమత్తం చేస్తున్నాం. రక్షణ కోసం గని స్థాయి నుంచి కార్పొరేట్ స్థాయివరకు ప్రత్యేక సేఫ్టీ విభాగం పనిచేస్తోంది. నిరంతం శిక్షణ, రక్షణపై సమీక్షలను ఈ విభాగం చూసుకుంటుంది. సేఫ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్‌ను ఫాలో అవుతూ బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారిస్తున్నాం. – కె.నారాయణ, ఆర్జీ–1 జీఎం ప్రమాదాలు ప్రతికూల వాతావరణం.. భూమి కంటే లోపల వాతావరణం భిన్నంగా ఉంటుంది. లోపలికి వెళ్లిన కొద్దీ ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతూ ఉంటుంది. అందుకే, ప్రతి గనికి రెండు నుంచి మూడు భారీ ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారు. వీటివల్ల లోపలికి– బయటికి నిరంతరంగా.. ధారళంగా గాలి ప్రసరిస్తుంది. అయినప్పటికీ, పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గడం సహజమే. అందుకే, ఆక్సిజన్‌తో వెలిగే ల్యాంపులను తీసుకెళ్తారు. ఈ దీపం తక్కువగా వెలిగినా, ఆరినా అక్కడ ఆక్సిజన్ స్థాయి పడిపోయిందని అర్థం. వెంటనే విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తారు. భూమిలో కిలోమీటర్ల లోపలి ప్రాంతం కనుక ఇక్కడ సెల్ఫోన్లు పనిచేయవు. కమ్యూనికేషన్ కోసం ఇంటర్నల్ ల్యాండ్‌లైన్ టెలిఫోన్ సిస్టమ్, కొన్నిచోట్ల వాకీటాకీలు వాడుతారు. ఎండ తగలదు కాబట్టి ఉష్ణోగ్రత 20 డిగ్రీల లోపు ఉంటుంది. భూప్రకంపనలు, పొరల సర్దుబాటు, అకస్మాత్తుగా వచ్చే ఊట పైకప్పుకు ప్రమాదకరంగా మారుతుంటుంది. ఒక్కోసారి ఊట.. పక్క లెవెల్లో నిండిపోయి ఉంటుంది. గోడలు బలహీనమైనప్పుడు బద్దలు కొట్టుకుని వస్తుంది. 2003లో గోదావరిఖనిలోని 7ఎల్ఈపీ గనిలో జరిగిన ప్రమాదం ఇలాంటిదే. భారీ ఊట కారణంగా 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏడాది తిరగకుండానే (2004లో) గని పై కప్పు కూలి జీడీకే–8ఏ గనిలో 10మంది కార్మికులు మృతి చెందారు. గడిచిన ఐదేళ్లలో సింగరేణి వ్యాప్తంగా జరిగిన ప్రమాదాలు 2016 2017 2018 2019 2020 2021 మృతిచెందిన కార్మికులు 12 12 07 08 12 06 తీవ్రంగా గాయపడ్డవారు 218 219 191 138 102 102 గాయపడ్డ కార్మికులు 429 357 347 217 108 87 మైనింగ్ అంటే... భూమిలోపలి ఖనిజ నిల్వలను పెద్ద ఎత్తున తవ్వి తీయడమే మైనింగ్. ఇది సాధారణంగా రెండు రకాలు. 1. ఉపరితల మైనింగ్ (ఓసీపీ), 2. భూగర్భ మైనింగ్ (అండర్‌గ్రౌండ్), గ్రానైట్, ఐరన్, తదితర ఖనిజాలను ఉపరితల మైనింగ్ ద్వారా తీస్తారు. రాగి, బంగారం, బొగ్గు తదితర ఖనిజాలను భూగర్భ గనుల నుంచి వెలికి తీస్తుంటారు. ఇప్పుడు సింగరేణిలోనూ ఉపరితల మైనింగ్ (ఓపెన్‌కాస్ట్ విధానం) అమలవుతోంది. ఇప్పటి వరకు సింగరేణి ప్రాంతంలో ఇంక్లైన్ మైనింగ్ విధానం అధికం. అంటే ఏటవాలుగా భూమి పైభాగం మూడు నుంచి అయిదు కిలోమీటర్ల లోతువరకు తవ్వుతారు. అంతకు ముందు కిలోమీటర్ల వరకు బోరు వేస్తారు. బోర్‌వెల్స్ ద్వారా బొగ్గు నిల్వలను గుర్తిస్తారు. ఆ శాంపిల్స్ ఆధారంగా భూమిలోపల ఎంత లోతులో, ఎంత పరిమాణంలో బొగ్గు, రాతి ఇసుక విస్తరించి ఉన్నాయో గుర్తిస్తారు. వాటిని చేరుకునేందుకు ఏటవాలుగా భూగర్భ గనిని తవ్వుతారు. గరిష్ఠంగా 2.7 మీటర్ల ఎత్తులో ఓ భారీ సొరంగాన్ని భూమి పొరలను బొగ్గు నిక్షేపాలు విస్తరించిన ప్రాంతానికి చివరి వరకు సమాంతరంగా తవ్వుతారు. ఇది గనికి ప్రధాన రహదారిలా ఉంటుంది. దీనికి పైనా.. కిందా అంతస్తుల్లా విభాగాలు ఉంటాయి. వాటిని సీమ్–1, సీమ్–2, సీమ్–3, గరిష్ఠంగా సీమ్–4గా విభజిస్తారు. సీమ్‌లో మళ్లీ లెవెల్స్ ఉంటాయి. మొదటిది రెయిజింగ్ అంటే గనిలో ఎగువ ప్రాంతాన్ని , డీప్ అంటే దిగువ ప్రాంతాన్ని సూచిస్తాయి. ఇవి భూగర్భగనిలోని ఒక ప్రాంతానికి పోస్టల్ చిరునామాలాంటివి అన్న మాట. ఈ లెవెల్స్‌లో బొగ్గు నిల్వలను బ్లాకులుగా విభజించి లక్ష్యం ప్రకారం తవ్వి.. బొగ్గు నిల్వలు అయిపోయాక ఆ బ్లాకును ఇసుకతో మూసేస్తారు. లక్షల ఏళ్ల క్రితం గోదావరి లోయలో భారీ భూకంపాలకు ఇక్కడ ఉన్న దండకారణ్యంలోని వృక్షాలు, చెట్లు భూమిలో కలిసిపోయాయి. భూగర్భంలోని వేడికి రసాయనిక చర్యకు గురై బొగ్గుగా రూపాంతరం చెందాయి. ఇది పలుమార్లు జరగడం వల్ల ఒకే చోట పేరుకుపోకుండా రాతి శిలలు, బొగ్గుపొరలు దొంతరల మాదిరిగా ఏర్పడ్డాయి. అందుకే ఈ సీమ్స్ను ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సింగరేణి యాజమాన్యం ఓపెన్‌కాస్ట్‌లకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విధానంలో పర్యావరణపరంగా నష్టాలు అధికంగా ఉన్నప్పటికీ.. ఎక్కువ యాంత్రీకరణ, అధిక ఉత్పత్తి, తక్కువ కార్మికులు అవసరమవుతారు. అనుక్షణం అప్రమత్తంగా.. సింగరేణిలో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరిగినా క్షణాల్లో అక్కడకు చేరేలా రెస్క్యూ బ్రిగేడియర్లు అప్రమత్తంగా ఉంటారు. రెస్క్యూ స్టేషన్లో అన్ని ఎక్విప్మెంట్స్తో పాటు రెస్క్యూ బ్రిగేడియర్లకు నిరంతర కఠోర సాధన ఉంటుంది. ఎలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉండి ఆపదలో ఉన్న ఉద్యోగులను రక్షించడమే ధ్యేయంగా ముందు కెళ్తాం. సింగరేణి వ్యాప్తంగా మూడు రెస్క్యూ రిప్రెషర్ ట్రైనింగ్ సెంటర్లు, ఒక రెస్క్యూ స్టేషన్ ఉన్నాయి. 42 మంది రెస్క్యూ బ్రిగేడియర్లు, ఆరుగురు అధికారులు, 500 రెస్క్యూ ట్రైయినీ పర్సన్లు ఉన్నారు. ఆపదకాలంలో రక్షించేందుకు సుమారు రూ.20కోట్లతో ప్రత్యేక రెస్క్యూ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. – బి.మాధవరావు, రెస్క్యూ సూపరింటెండెంట్ -భాషబోయిన అనిల్‌కుమార్ ఫొటోలు: సతీశ్‌రెడ్డి -
సైకిల్‌వాలా జిందాబాద్.. సైకిల్ తలరాత మార్చిన ‘కరోనా’
నగరాల్లోను, పట్టణాల్లోను ఒకప్పుడు సైకిళ్ల జోరు విరివిగా కనిపించేది. మోటారు వాహనాలు పెరగడంతో నగరాల్లో సైకిళ్లు చాలా అరుదైపోయాయి. పెట్రో ఇంధనాలతో నడిచే మోటారు వాహనాల నుంచి వెలువడే కాలుష్యం తెచ్చిపెట్టే దుష్ప్రభావాలు అర్థం కావడంతో ఇప్పుడిప్పుడే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సైకిళ్లకు అనుకూలంగా చర్యలు చేపట్టేందుకు ఉపక్రమిస్తున్నాయి. నగరాల్లో సైకిళ్లు నడపడానికి వీలుగా ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయడం వంటి చర్యలతో సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని సంకల్పిస్తున్నాయి. సైకిళ్ల వినియోగం ఎంతగా పెరిగితే మోటారు వాహనాల వినియోగం అంతగా తగ్గి, కాలుష్యం తగ్గుముఖం పట్టడమే కాదు, ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం నగరాల్లో సైకిళ్లను ప్రోత్సహించాలని సంకల్పించింది. ఈ సందర్భంగా సైకిల్ గురించి కొన్ని విశేషాలు... ఒకప్పుడు సైకిలెక్కడమంటే కుర్రకారుకి గుర్రమెక్కినంత సంబరంగా ఉండేది. సైకిలెక్కి వీథుల్లో చక్కర్లు కొట్టడం పిల్లలకు ఒక ఆటవిడుపు. నిక్కర్ల వయసులో పడుతూ లేస్తూ మోకాళ్లు డోక్కుపోయినా సరే, సైకిల్ సీటుపైకెక్కి బ్యాలెన్స్ చేస్తూ నడపగలిగితే చాలు, ఒక గొప్పవిద్య ఏదో పట్టుబడినంత ఆనందం. ఒకప్పుడు సైకిల్ ఒక స్టేటస్ సింబల్. పెళ్లి సమయంలో వరుడికి తప్పనిసరిగా చదివించుకోవలసిన లాంఛనం. సైకిల్ కోసం అలకపాన్పులెక్కే పెళ్లికొడుకులు ఉండేవారంటే ఇప్పటితరం కుర్రాళ్లు నవ్విపోతారు గాని, అప్పట్లో సైకిల్ ప్రాభవం అలా ఉండేది మరి! మోపెడ్లు, స్కూటర్లు, మోటారుబైకులు రోడ్ల మీదకు యంత్రాశ్వాల్లా దూసుకురావడం మొదలయ్యాక మన దేశంలో సైకిళ్ల ప్రాభవం మసకబారింది. మోటారు వాహనాలతో కిక్కిరిసి కనిపించే నగరాల్లో రోడ్ల మీదకు సైకిల్ తీసుకురావాలంటేనే భయపడే పరిస్థితులు సైకిళ్లను మరింతగా వెనక్కు నెట్టేశాయి. మోటారు వాహనాలు తెచ్చిపెట్టే కాలుష్య తీవ్రత అర్థమయ్యాక సైకిళ్ల మీద మళ్లీ దృష్టిసారిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇదొక మంచి పరిణామం. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ నగరాలను సైకిళ్లకు అనుకూలంగా మలచేందుకు తెలంగాణ ప్రభుత్వం చొరవతీసుకుంటోంది. దేశంలోని అన్ని నగరాలనూ సైకిళ్లకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ చర్యలు చేపడితే సైకిళ్లకు మళ్లీ మంచిరోజులు త్వరలోనే రాకపోవు. అప్పుడిక ‘సైకిల్‌వాలా జిందాబాద్’ అనే కేరింతలు వినిపించకపోవు. ప్రపంచంలో సైకిల్ నగరాలు అంతర్జాతీయంగా చూసుకుంటే ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్‌కు సానుకూలమైన నగరాలు తక్కువనే చెప్పాలి. ప్రపంచంలోనే సైక్లింగ్‌కు అత్యంత సానుకూల నగరం డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగెన్. ఎన్ని అధునాతనమైన మోటారు వాహనాలు అందుబాటులోకి వచ్చినా, ఇప్పటికీ ఈ నగరంలో సైకిల్ జోరు ఏమాత్రం తగ్గలేదు. కోపెన్‌హాగెన్‌లో తొంభైశాతం జనాభా సైక్లిస్టులే! ఐదు కిలోమీటర్ల దూరం పరిధిలో రాకపోకలకు వారు తప్పనిసరిగా సైకిల్‌నే ఉపయోగిస్తారు. సైకిళ్లు నడపడానికి ప్రత్యేకమైన రహదారులు, రాజధాని నుంచి చుట్టుపక్కల పాతిక పట్టణాలను కలుపుతూ సాగే సైకిల్ సూపర్ హైవేలు డెన్మార్క్ ప్రత్యేకత. సైక్లింగ్‌కు సానుకూల నగరాల్లో కోపెన్‌హాగెన్ తర్వాతి స్థానాల్లో పోర్ట్లాండ్ (అమెరికా), మ్యూనిక్ (జర్మనీ), మాంట్రియల్ (కెనడా), పెర్త్ (ఆస్ట్రేలియా), ఆమ్స్టర్డామ్ (నెదర్లాండ్స్), సీటెల్ (అమెరికా), పారిస్ (ఫ్రాన్స్), మిన్నీపోలిస్ (అమెరికా), బొగోటా (కొలంబియా) నిలుస్తాయి. ప్రపంచంలో సైక్లింగ్‌కు అనుకూలమైన తొలి పది నగరాల్లో మన దేశానికి చెందిన నగరమేదీ లేదు. అధిక జనాభా, ఇరుకిరుకు రోడ్లు, నగరాల్లోని ప్రధాన రహదారుల్లో మోటారు వాహనాల జోరు వల్ల మన దేశంలో కొన్ని దశాబ్దాలుగా సైకిళ్ల వినియోగం చాలావరకు తగ్గింది. మన నగరాల్లో సైకిల్ పరిస్థితులు ప్రస్తుతం మన దేశంలో సైక్లింగ్‌కు సానుకూల పరిస్థితులు ఉన్న మొదటి పది నగరాలను తీసుకుంటే, కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసిన జాబితా ప్రకారం బెంగళూరు మొదటి స్థానంలో నిలుస్తోంది. ఆ తర్వాతి స్థానాల్లో భువనేశ్వర్, చండీగఢ్, నాగపూర్, సూరత్, వదోదరా, రాజ్‌కోట్, కోహిమా, న్యూటౌన్ కోల్‌కతా, వరంగల్ నగరాలు నిలుస్తున్నాయి. సైకిళ్లు నడపడానికి ఈ నగరాల్లో చాలావరకు సురక్షితమైన పరిస్థితులు ఇప్పటికే ఉన్నాయి. వీటిని మరింతగా మెరుగుపరచడానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మరోవైపు కేంద్ర గృహనిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ డెవలప్మెంట్ పాలసీ (ఐటీడీపీ) కింద చేపట్టిన ‘స్మార్ట్ సిటీస్ మిషన్’లో భాగంగా దేశంలోని నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు ‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద దేశంలోని 107 నగరాలు తమను తాము నమోదు చేసుకున్నాయి. ఈ నగరాల్లో సైకిళ్ల వినియోగాన్ని పెంచేందుకు, సైక్లింగ్‌కు అనుకూలమైన పరిస్థితులు కల్పించేందుకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చర్యలు చేపడుతోంది. ‘సైకిల్స్ ఫర్ చేంజ్ చాలెంజ్’ కింద ప్రభుత్వాలు నగరాల్లో సైకిళ్లు నడపడానికి ప్రత్యేక రహదారులు, సురక్షితమైన ట్రాఫిక్ పరిస్థితులు కల్పించడం వంటి చర్యలను చేపట్టినట్లయితే సైకిళ్లకు మళ్లీ మంచిరోజులొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సైకిల్‌తో ఆర్థిక లాభాలు సైకిల్‌తో ఎన్నో లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక ఆరోగ్య లాభాలు. సైకిల్‌కి ఎలాంటి ఇంధనం అక్కర్లేదు. కాబట్టి దీనివల్ల ఎలాంటి ఇం‘ధన’ వ్యయం ఉండదు. సైకిల్ తొక్కడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఫలితంగా తరచు ఆస్పత్రుల చుట్టూ తిరిగి, అక్కడిచ్చే బిల్లులు చూసి కళ్లుతిరిగే పరిస్థితులు ఎంతమాత్రమూ తలెత్తవు. కొద్ది దశాబ్దాలుగా మోటారు ద్విచక్రవాహనాల జోరు బాగా పెరిగినా, జనాలు కూడా ఇప్పుడిప్పుడే సైకిల్ ప్రయోజనాలను గుర్తిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోలు ధర ‘సెంచరీ’ కొట్టిన తర్వాత జనాలకు సైకిళ్ల మీద శ్రద్ధ మొదలైంది. ఇటు జనాల్లోనూ, అటు ప్రభుత్వ వర్గాల్లోనూ దాదాపు ఏకకాలంలోనే సైకిళ్ల వినియోగం పెంచాలనే విషయమై ఆలోచన మొదలవడం ఎంతైనా ఒక శుభపరిణామం. సైకిల్ గొప్పదనం గురించి చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి ఒక అవధానంలో ఈ పద్యం చెప్పారు: ‘‘నీరుం గోరదు గడ్డినడ్గ దొక కొన్నే నుల్వలన్ వేడ దే వారే నెక్కిన గ్రింద దోయ దొకడుం బజ్జన్ భటుండుంట చే కూరంగా వల దౌర! బైస్కిలునకున్ గోప మ్మొకింతేని లే దౌరా! వాజికి దుల్యమైన యిది విశ్వామిత్ర సృష్టంబొకో?’’ జట్కాబళ్లు, ఎడ్లబళ్లు మాత్రమే ప్రధాన రవాణా సాధనాలుగా ఉన్న రోజుల్లో మన దేశంలోని వీథుల్లోకి ప్రవేశించిన సైకిల్ అప్పటి మనుషులకు చాలా అబ్బురంగా ఉండేది. అందుకే చెళ్లపిళ్లవారు సైకిల్ ప్రయోజనాలను చెబుతూనే, గుర్రానికి సాటివచ్చే సైకిల్ విశ్వామిత్ర సృష్టి కాబోలని చమత్కరించారు. అప్పటి కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా మోటారు వాహనాలతో పోల్చుకుంటే సైకిలే ఎంతో మెరుగైనది. మోటారు వాహనాలకు నిరంతర ఇంధన వ్యయంతో పాటు, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువే. సైకిల్‌కు నిర్వహణ వ్యయం నామమాత్రం. అప్పుడప్పుడు టైర్లలో గాలి కొడుతుంటే చాలు. ఎప్పుడో అరుదుగా చైన్ జారిపోవడం, పెడల్ ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. సైకిల్ మరీ పాతబడితే తలెత్తే ఈ సమస్యల పరిష్కారం కోసం మరమ్మతు ఖర్చులు కూడా చాలా తక్కువే. మోటారు వాహనాల ధరలతో పోల్చుకుంటే సైకిల్ ధరలు కూడా తక్కువే. ఆర్థిక కోణంలో చూసుకుంటే సైకిల్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. సైకిల్ తొక్కిన ప్రముఖులు ఇప్పుడంటే ప్రముఖులెవరూ సైకిళ్లపై వీథుల్లోకి రావడం లేదు గాని, ఒకప్పుడు సైకిళ్లు తొక్కే ప్రముఖులు విరివిగానే ఉండేవారు. మన దేశానికి సంబంధించి మహాత్మాగాంధీ మొదలుకొని ఎందరో నాయకులకు అభిమాన వాహనం సైకిల్. గాంధీజీ దక్షిణాఫ్రికాలో ఉన్నకాలంలోనే సైకిల్ నేర్చుకున్నారు. భారత్ వచ్చేశాక ఆయన సైకిల్‌ను వదిలేయలేదు. సబర్మతి ఆశ్రమం నుంచి అహ్మదాబాద్‌లోని గుజరాత్ విద్యాపీఠం వరకు ఆయన రోజూ సైకిల్‌పైనే రాకపోకలు సాగించేవారు. స్వాతంత్య్రం వచ్చాక మన తెలుగువాడైన కమ్యూనిస్టు నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య పార్లమెంటుకు సైకిల్‌పైనే వెళ్లేవారు. ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ అసెంబ్లీకి సైకిల్‌పై వెళ్లేవారు. అంతేకాదు, తీరికవేళల్లో ఆయన భువనేశ్వర్ వీథుల్లో సైకిల్‌పై షికారుగా తిరిగేవారు. విదేశీ ప్రముఖుల్లో చెప్పుకోవాలంటే, బ్రిటిష్‌రాణి ఎలిజబెత్ తన చిన్నప్పుడు సోదరి మార్గరెట్‌తో కలసి సైకిల్‌పై తరచు షికారు చేసేవారు. ప్రముఖ రష్యన్ రచయిత లియో టాల్‌స్టాయ్ సైకిల్‌పైనే రాకపోకలు సాగించేవారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్ తన ఆటవిడుపు సమయాల్లో సైకిల్ తొక్కేందుకు ఇష్టపడేవారు. ఇలా సైకిల్‌ను ఇష్టపడే ప్రముఖులు చాలామందే ఉన్నారు. సైకిల్ పరిణామం సైకిల్ వంటి వాహనం తయారీ కోసం పదహారో శతాబ్ది నుంచే ప్రయత్నాలు మొదలయ్యాయని కొన్ని స్కెచ్‌ల ఆధారంగా పరిశోధకులు చెబుతున్నారు. జర్మన్ ఉన్నతాధికారి కార్ల్ వాన్ డ్రాయిస్ 1817లో తొలిసారిగా కొయ్యతో రెండు చక్రాల వాహనానికి రూపకల్పన చేశాడు. దీనికి ఆయన ‘లౌఫ్మెషిన్’ (పరుగెత్తే యంత్రం) అని పేరు పెట్టాడు. అయితే, డ్రాయిస్ పేరిట ఇది ‘డ్రాయిసిన్’గానే పేరుపొందింది. దీనికి చైన్, పెడల్స్ వంటివేమీ లేకపోవడంతో సీటుపై కూర్చున్న వ్యక్తి కాళ్లతో నెడుతూ దీనిని ముందుకు నడపాల్సి వచ్చేది. మొత్తానికి దీనిని నడపడం ఒక విన్యాసంలా ఉండేది. దీంతో అప్పటి జనాలు ఈ విచిత్రవాహనాన్ని ‘డ్యాండీ హార్స్’ (కొయ్యగుర్రం) అంటూ వెటకరించేవారు. తర్వాత కొద్ది దశాబ్దాల పాటు ఇలాంటి చిత్రవిచిత్ర ప్రయోగాలు జరిగినా, అవేవీ పెద్దగా విజయవంతం కాలేదు. ఆధునిక సైకిల్‌కు తొలి రూపమైన పెడల్స్‌తో కూడిన సైకిల్‌ను ఔత్సాహిక జర్మన్ ఆవిష్కర్త ఫిలిప్ మోరిట్జ్ ఫిషర్ 1853లో రూపొందించాడు. చిన్నప్పుడు ‘డ్రాయిసిన్’పై ఇంటి నుంచి బడికి రాకపోకలు జరిపిన ఫిషర్, మరింత మెరుగైన వాహనాన్ని తయారు చేయాలనే సంకల్పంతో పెడల్స్‌తో కూడిన తొలి సైకిల్ నమూనాకు రూపకల్పన చేశాడు. ఫిషర్ రూపొందించిన ఈ సైకిల్ జర్మనీలోని ష్వీన్ఫర్ట్ మునిసిపల్ మ్యూజియంలో భద్రంగా ఉంది. పెడల్స్ ఏర్పాటు చేసినా, దీనికి చైన్, ఫ్రీవీల్ వంటివి లేకపోవడంతో దీనిని తొక్కడం చాలా శ్రమగా ఉండేది. తర్వాత 1870లలో హైవీల్ బైసైకిల్ వచ్చింది. పెద్దచక్రానికి సీటు, హ్యాండిల్, వెనుక వైపు బాగా చిన్నచక్రం ఉండే ఈ సైకిల్ నడపడమంటే దాదాపు సర్కస్ విన్యాసం చేయడమే! ఇది కూడా పెద్దగా జనాల్లోకి వెళ్లలేకపోయింది. ఆ తర్వాత 1880–90 కాలంలో ‘సేఫ్టీ బైసైకిల్స్’ రూపుదిద్దుకున్నాయి. వెనుక చక్రానికి అనుసంధానమైన చెయిన్, ఫ్రీవీల్, హ్యాండిల్, బ్రేకులు వంటి సౌకర్యాలతో రూపుదిద్దుకున్న ‘సేఫ్టీ బైసైకిల్స్’ అనతికాలంలోనే జనబాహుళ్యానికి చేరువయ్యాయి. ముఖ్యంగా యూరోప్, అమెరికా ప్రాంతాల్లో సామాన్యులకు సైకిళ్లే ప్రధాన రవాణా సాధనాలుగా మారాయి. వలస పాలకుల కారణంగా సైకిళ్లు ఆసియా, ఆఫ్రికా దేశాలకూ పాకాయి. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలోనే భారత్‌లో కూడా సైకిళ్ల వినియోగం మొదలైంది. దాదాపు రెండు శతాబ్దాల ‘సైకిల్’ ప్రస్థానంలో చాలా మార్పులే చోటు చేసుకున్నాయి. నడిపే వారికి మరింత సౌకర్యవంతమైన మోడల్స్ తయారయ్యాయి. చదునైన రోడ్లపైనే కాకుండా ఎగుడు దిగుడు కొండ దారుల్లో ప్రయాణాలకు అనువైన ‘మౌంటెన్ బైక్స్’ అందుబాటులోకి వచ్చాయి. తొక్కేవారికి శ్రమ తగ్గించేరీతిలో గేర్లతో కూడిన సైకిళ్లు వాడుకలోకి వచ్చాయి. ఇటీవలి కాలంలో తాజాగా రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేసే ‘ఈ–సైకిళ్ల’కు దేశదేశాల్లో క్రమంగా ఆదరణ పెరుగుతోంది. సైకిల్ తలరాత మార్చిన ‘కరోనా’ ప్రపంచాన్ని ఇప్పటికీ అల్లాడిస్తున్న ‘కరోనా’ మహమ్మారి మన దేశంలో సైకిల్ తలరాతను మార్చేసింది. ‘కరోనా’ తొలివిడత లాక్డౌన్ కాలంలో నగరాల నుంచి లక్షలాది మంది వలస కార్మికులు వందలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. వారిలో పలువురు కాలినడకన సాగిపోతే, చాలామంది తమవద్దనున్న సైకిళ్లతో స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. గత ఏడాది లాక్డౌన్ కాలంలో ఇలా సైకిళ్లపై స్వస్థలాలకు చేరుకున్న వారిలో బిహార్‌లోని దర్భంగా జిల్లాకు చెందిన జ్యోతికుమారి అనే పదిహేనేళ్ల బాలిక ఉదంతం అంతర్జాతీయంగా వార్తలకెక్కింది. ఢిల్లీలో ఈ–రిక్షా డ్రైవర్ అయిన ఆమె తండ్రి అనారోగ్యం పాలవడంతో, అతణ్ణి సైకిల్ వెనుక కూర్చోబెట్టి ఆమె స్వస్థలానికి ప్రయాణమైంది. దాదాపు 1200 కిలోమీటర్లకు పైగా ప్రయాణం సాగించి, స్వగ్రామానికి చేరుకుంది. ఈ సాహసం ఆమెకు ప్రధానమంత్రి జాతీయ బాల పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. ఆమె ‘బయోపిక్’ తీసేందుకు బాలీవుడ్ వర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు కూడా కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, ఆమె తండ్రి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూయడం ఒక విషాదం. తొలివిడత ‘లాక్డౌన్’ కాలంలో స్వస్థలాలకు ప్రయాణమైన వలస కార్మికులు కొందరి జీవితాల్లో ఇలాంటి చాలా విషాదాలే చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే, ‘లాక్డౌన్’ అనుభవంతో చాలామంది సైకిళ్లవైపు మొగ్గు చూపడం మొదలైంది. ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ స్తంభించిపోవడంతో జనసామాన్యం ఇళ్లల్లో మూలపడి ఉన్న సైకిళ్లను బయటకు తీశారు. సైకిళ్లు లేనివారు లాక్డౌన్ సడలింపులు మొదలవగానే, రోజులెప్పుడెలా ఉంటాయోననే భయంతో సైకిళ్ల కొనుగోళ్లు ప్రారంభించారు. ప్రజా రవాణాకు అవరోధం కలిగితే, సైకిల్ గొప్ప భరోసా ఇస్తుందని ప్రజలు బాగానే గ్రహించారు. గత ఏడాది తొలి లాక్డౌన్ సడలింపుల కాలం నుంచి ఇప్పటి వరకు– అంటే గడచిన ఏడాది కాలంలో దేశంలోని సైకిళ్ల అమ్మకాల్లో ఏకంగా 20 శాతం పెరుగుదల నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. గడచిన దశాబ్దిలో సైకిళ్ల అమ్మకాల్లో ఈ పెరుగుదలే అత్యధికం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోని నగరాల్లో సైకిళ్ల వినియోగం పెంచేందుకు చర్యలు చేపడుతుండటంతో రానున్నకాలంలో సైకిళ్ల అమ్మకాల్లో నిలకడగా పెరుగుదల నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు ఆశాభావంతో ఉన్నాయి. సైకిల్‌తో ఆరోగ్య లాభాలు ఇక ఆరోగ్య లాభాలను చూసుకుంటే, సైకిల్‌కు ఇంధనం అక్కర్లేదు కాబట్టి, దీని నుంచి పొగ వెలువడటం, తద్వారా కాలుష్యం పెరిగి ప్రజారోగ్య సమస్యలు తలెత్తడం వంటి విపత్తులేవీ ఉండవు. ప్రజారోగ్య సమస్యలు తగ్గితే, ప్రభుత్వ ఖజానాపై కూడా భారం తగ్గుతుంది. మోటారు వాహనాలతో పోల్చుకుంటే, నడిపేటప్పుడు సైకిల్‌ను అదుపు చేయడం చాలా తేలిక. అందువల్ల మోటారు వాహనాలను నడిపేవారితో పోల్చుకుంటే, సైకిల్ నడిపేవారికి ఎదురయ్యే ప్రమాదాలు తక్కువే. ఒకవేళ అనుకోని ప్రమాదాలు ఎదురైనా, వాటిలో ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితులు దాదాపు ఉండవు. ఇక వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం సైక్లింగ్ వల్ల కలిగే లాభాలను తెలుసుకుందాం. ► కాళ్లతో పెడల్ తొక్కుతూ సైకిల్ నడపడం వల్ల ప్రయాణానికి ప్రయాణం, వ్యాయామానికి వ్యాయామం ఏకకాలంలో జరగడమే కాదు, కాళ్లు, నడుము దృఢంగా తయారవుతాయి. చేతులకు పట్టు పెరుగుతుంది. ► సైకిల్ తొక్కడం వల్ల ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు, సైక్లింగ్ వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగి, బరువు అదుపులో ఉంటుంది. శరీరాకృతి చక్కని తీరులోకి మారుతుంది. ► అధిక బరువు వల్ల తలెత్తే గుండెజబ్బులు, బీపీ, సుగర్ వంటి సమస్యలు దరిచేరవు. ఒకవేళ బీపీ, సుగర్ వంటివి అనువంశిక కారణాల వల్ల వచ్చినా, సైక్లింగ్‌తో అవి అదుపులో ఉంటాయి. సైక్లింగ్ వల్ల గుండెజబ్బులే కాదు, కేన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. ► రోజూ సైక్లింగ్ చేసే అలవాటు ఉన్నవారిలో నిద్రలేమి సమస్య దాదాపుగా ఉండదు. సైక్లింగ్ వల్ల శరీరానికి తగిన వ్యాయామం, అలసట లభించి చక్కగా నిద్రపడుతుందని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. ► సైక్లింగ్ వల్ల కేవలం శరీరానికి మాత్రమే కాదు, మెదడుకూ లాభం ఉందంటున్నారు ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సైక్లింగ్ వల్ల మెదడుకు రక్తప్రసరణ గణనీయంగా మెరుగుపడుతుందని, దీనివల్ల మెదడు చురుకుదేరి, వయసుమళ్లిన దశకు చేరుకున్నా అల్జీమర్స్, డెమెన్షియా వంటి సమస్యలు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. సైకిల్ విచిత్రాలూ విశేషాలూ ► ఒకటికి మించిన సీట్లు, సీట్లకు సరిసమానమైన సంఖ్యలో చైన్లు, పెడల్స్ జతలు ఉండే పొడవాటి సైకిళ్లను ‘టాండెమ్ బైసైకిల్స్’ అంటారు. ఇలాంటి వాటిలో 35 సీట్లు కలిగిన టాండెమ్ బైసైకిల్ ఏకకాలంలోనే అత్యధిక సంఖ్యలో సైక్లిస్టులు తొక్కగలిగే సైకిల్‌గా రికార్డులకెక్కింది. దీని పొడవు 67 అడుగులు. అయితే, ఇరవై సీట్లు కలిగిన టాండెమ్ సైకిల్ అత్యంత పొడవైనదిగా రికార్డులకెక్కింది. దీని పొడవు ఏకంగా 137 అడుగులు. ► సైకిల్ ప్రధానంగా సామాన్యుల వాహనం. సైకిల్ ధరలు దాదాపుగా అందుబాటులోనే ఉంటాయి. మన దేశంలో సుమారు మూడువేల రూపాయల నుంచి సైకిల్ ధరలు మొదలవుతాయి. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సైకిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా ఐదులక్షల డాలర్లు– అంటే, సుమారు రూ.3.71 కోట్లు. బ్రిటిష్ ఆర్టిస్ట్ డామీన్ హిర్ట్స్ ‘బటర్‌ఫ్లై బైక్’ పేరిట రూపొందించిన ఈ సైకిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డులకెక్కింది. ► ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సైకిళ్లు వాడుకలో ఉన్న దేశం చైనా. దాదాపు యాభై కోట్ల సైకిళ్లు చైనాలో ఉన్నాయి. ► ప్రపంచంలో ప్రస్తుతం వాడుకలో ఉన్న సైకిళ్ల కారణంగా ఏడాదికి దాదాపు 90 కోట్ల లీటర్ల వరకు ఇంధనం ఆదా అవుతోందని అంతర్జాతీయ నిపుణుల అంచనా. ఆ మేరకు కాలుష్యం కూడా తగ్గుతున్నట్లే కదా: ► విమానాన్ని రూపొందించిన రైట్ బ్రదర్స్ సైకిళ్ల వ్యాపారం చేసేవారు. ఓహాయో రాష్ట్రంలోని ఐదు చోట్ల వారికి సైకిల్ దుకాణాలు ఉండేవి. సైకిల్ తయారీ, మరమ్మతుల్లో నైపుణ్యం సాధించిన ఆ సోదరులిద్దరూ, సైకిల్ తయారీ కర్మాగారం లోనే విమానం తయారీ ప్రయత్నాలు ప్రారంభించారు. ► ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన సైకిల్ రేసులకు ఫ్రాన్స్ వేదికగా నిలుస్తోంది. అక్కడ ‘టూర్ డి ఫ్రాన్స్’ పేరిట 1903 నుంచి ఏడాదికోసారి మూడువారాల పాటు జరిగే సైకిల్ రేసుల్లో ప్రపంచం నలుమూలలకు చెందిన సైక్లిస్టులు పాల్గొంటారు. -
Coronavirus: మూడో వేవ్? ఎదుర్కొందాం ఇలా..!
అల తర్వాత అల... ఆటు తర్వాత పోటు... సముద్రంలో మామూలే. కానీ ఇప్పుడు కరోనా సంక్షోభమూ ఓ కడలిలాగే అంతూపొంతూ లేకుండా కనిపిస్తోంది. కొత్త కొత్త వేరియెంట్లూ, స్ట్రెయిన్లూ అంటూ అలల్లా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు నడుస్తున్న రెండో వేవ్ తర్వాత మూడో వేవ్ కూడా వస్తుందా? అది మరింత శక్తిమంతంగా పెద్దలతో పాటు పిల్లలనూ ప్రమాదంలో ముంచెత్తుతుందా అన్నది చాలామంది ముందు ఉన్న ప్రశ్న. ఒకవేళ అది అంత పెద్ద అలే అయితే... దాన్ని ఎలా ఎదుర్కోవాలన్నది మన ముందు ఉన్న ప్రశ్న. అలల్లో కొట్టుకుపోవడం అందరికీ మామూలే. కానీ కొందరు సర్ఫర్లు మాత్రం పెద్ద పెద్ద అలలకు బెంబేలెత్తరు.... బెదిరిపోరు. వచ్చే అల ఉంటే ఎలాగూ వస్తుంది... వద్దని మనం అనుకున్నా ఆగదు. అయితే... ఒకవేళ అలాంటి రాకాసి అల వచ్చినప్పటికీ... మన ముందస్తు తయారీతో సర్ఫర్ల స్వారీలా దాన్ని నేర్పుగా అధిగమించే మార్గాలను తెలుసుకుందాం. కరోనా మూడో దశను కలిసికట్టుగా ఎదుర్కొందాం. అసలు కరోనా దశల వారీగా ఎందుకు వస్తుంటుందో చూద్దాం? కరోనా ఒక్కటే కాదు.. ఆ మాటకొస్తే చాలారకాల వైరల్ ఇన్ఫెక్షన్లు దశలవారీగా సంభవిస్తుంటాయి. ఇలా జరగడానికి కారణం ఉంది. ప్రపంచంలోని ప్రతి జీవీ తన పరిణామ దశలో అంతకంతకూ తనను తాను మెరుగుపరచుకుంటూ ఉంటుంది. మనుగడ కోసం కృషి చేస్తుంటుంది. కరోనా వైరస్ సైతం ఇందుకు మినహాయింపు కాదు. ఒకసారి ఒక స్ట్రెయిన్‌తో ఇది వచ్చాక.. ఆ స్ట్రెయిన్‌కు చాలామందిలో ఇమ్యూనిటీ వచ్చేస్తుంది. దాంతో ఆ ఇమ్యునిటీ ఉన్నవారిలో తాను మనుగడ సాగించలేదు. కాబట్టి మరింతగా మెరుగుపరచుకుని మరో కొత్త స్ట్రెయిన్ రూపంలో మరిన్ని (తన మనుగడ కోసం కావాల్సిన అనుకూల) మార్పులతో అది తనను తాను మళ్లీ మళ్లీ ఆవిష్కరించుకుంటూ ఉంటుంది. ఇలా తనను తాను కొత్త స్ట్రెయిన్లు సృష్టించుకుంటుంది కాబట్టి దశలు దశలుగా (ఫస్ట్, సెంకడ్, థర్డ్ ఇలా వేవ్స్) వస్తుంటుంది. అలా ప్రతి దశ అధిక సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి కారణమవుతుంది. వైరస్ ఇలా అనేక స్ట్రెయిన్లుగా, వేరియెంట్లుగా ఎందుకు మారుతుందో తెలుసుకుని, దాన్ని ఎదుర్కోవడం ఎలాగో తెలుసుకునే ముందుగా అసలు వైరస్ గురించి కాస్తంత అవగాహన పెంచుకుందాం. దాంతో మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న అంశం చాలా తేలికవుతుంది. ప్రతిజీవిలోనూ ఎన్నో రకాల కణాలుంటాయి. ఉదాహరణకు గుండె కండర కణం, మెదడు కణం, ఊపిరితిత్తుల కణం.. ఇలా ఎన్నెన్నో. ప్రతి కణంలోనూ ఓ కేంద్రకం, అందులో క్రోమోజోములు ఉంటాయి. అవన్నీ డీఎన్ఏ, ఆర్ఎన్ఏలాంటి మూల పదార్థాలతో నిర్మితమై ఉంటాయి. వైరస్ అనేది కూడా కణంలోని మూల పదార్థమైన ఒక ఆర్ఎన్ఏ లేదా కొన్నిసార్లు డీఎన్ఏ మాత్రమే నిర్మితమై ఉండే చాలా చిన్న జీవాంశం. మనకు ఏదైనా పరాన్నజీవి సోకిందనుకోండి. అప్పుడు అది బ్యాక్టీరియానో, ఫంగసో లేదా ఏకకణజీవో అయితే.. మందులు వాడి దాన్ని ఒకింత తేలిగ్గానే చంపవచ్చు. కానీ వైరస్ అలా కాదు. అది ఆర్ఎన్ఏ కావడం వల్ల మన కణంలోకి చొరబడి మన ఆర్ఎన్ఏలతో కలిసిపోయి తన ప్రత్యుత్పత్తి నిర్వహించుకుంటూ ఉంటుంది. ఇలా ఒక కణంలోకి చొరబడిన ఓ వైరస్.. మూడొందలు మొదలుకొని 1000కి పైగా వైరస్‌లుగా పెరిగి ఆ కణాన్ని నాశనం చేసి, బయటకు వచ్చేస్తుంది. కొత్తగా పుట్టిన అవి మళ్లీ తమ ప్రత్యుత్పత్తిని కొనసాగిస్తాయి. అలా వైరస్లలో హానికరమైనవి వ్యాపించినప్పుడు మనం వాటి దుష్ఫలితాలను చూస్తాం. ఈ వైరస్లు ఎంత చిన్నవంటే.. ఒక సూది మొన మీద కోట్లాది వైరస్లు ఉంటాయి. దాదాపు ప్రపంచవ్యాప్తంగా (ఈ కథనం రాస్తున్ననాటికి అంటే.. 26వ తేదీ సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బారిన పడిన వారు 18,12,57,890 మంది రోగులు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క కట్టింది). ఉజ్జాయింపుగా ఇప్పటికి 20 కోట్ల మంది కోవిడ్ బారిన పడ్డట్లు అంచనా వేసి... ఈ అందరిలోనూ ఉన్న ఈ బిలియన్లూ, ట్రిలియన్లలో ఉన్న వైరస్‌లను సేకరించి... ఓ టీ–కప్పు లో వేశామనుకుందాం.. ఇంకా ఆ టీకప్పు నిండకుండా.. కాస్తంత వెలితిగానే ఉంటుంది. అంత చిన్నవన్నమాట ఈ వైరస్లు. కరోనా ఏమిటీ... వాటి కొత్త స్ట్రెయిన్ కథ ఏమిటి? ఈ లోకంలో కోటాను కోట్ల రకాల వైరస్లు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అందులో కేవలం మనకు జలుబు తెచ్చిపెట్టేవే దాదాపు 200 రకాల పైనే ఉంటాయి. వాటినీ వాటి సమలక్షణాల ఆధారంగా గ్రూపులుగా చేస్తే జలుబు తెచ్చే వైరస్లు ఆరు ప్రధాన రకాలు అవి.. 1) ఇన్ఫ్లుయెంజా, 2) పారా ఇన్ఫ్లుయెంజా, 3) రైనో వైరస్, 4) ఎడినో వైరస్, 5) హ్యూమన్ రెస్పిరేటరీ సిన్సీషియల్ వైరస్ (ఆర్ఎస్వీ) 6) కరోనా. ఇలా చూసినప్పుడు కరోనా అన్నది ఈ ప్రపంచానికి కొత్తదేమీ కాదు. ఎప్పట్నుంచో ఉన్నదే. ఈ కరోనాలోనూ మళ్లీ ప్రధానమైనవి ఏడు రకాల వైరస్లు ఉన్నాయి. ఇవన్నీ ఒక మనిషి నుంచి ఇంకొకరికి వ్యాపించేవే. ఇందులో నాలుగు రకాలు మాత్రం చాలా తేలికపాటి జలుబును తెచ్చి, ఓ వారం రోజుల్లో తగ్గిపోయేలా మాయమవుతాయి. కానీ మరో మూడు మాత్రమే ఒకింత ప్రమాదకరమైనవి. ఆ మూడింటినీ నిర్దిష్టంగా చెప్పాలంటే 1) సార్స్ (సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)ను తెచ్చే వైరస్, 2) మధ్యప్రాచ్య దేశాల్లో వచ్చిన వేరియెంట్ అయిన మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్)తో పాటు తాజాగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న ‘కోవిడ్–19’ వైరస్. అంతెందుకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న కొత్తల్లోనూ పరిశోధకులు దాదాపు 103 రకాల శాంపుళ్లను పరిశీలించినప్పుడు అందులో కొన్ని ‘ఎల్’ అనే రకానికీ, మరికొన్ని ‘ఎస్’ అనే రకానికి చెందనవి ఉన్నట్లు గుర్తించారు. వీటిల్లోనూ తొలుత ‘ఎస్’ వచ్చిందనీ.. అయితే అది కొందరికి మాత్రమే పరిమితం కాగా.. ఆ తర్వాత కనిపించిన ‘ఎల్’ రకం చాలామందిలో కనిపించినట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రముఖమైన కొన్ని కొత్త వేరియెంట్లు ఇవే... ► ఆల్ఫా (బి.1.1.7.): గత ఏడాది చివర్లో ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో కనిపించిన వేరియెంట్ ఇది. ఇది కరోనా వైరస్ల మీద ఉన్న కొమ్ములాంటి దానిపై (స్పైక్ ప్రోటీన్‌లో) వచ్చిన మార్పు కారణంగా ఉనికిలోకి వచ్చిన వేరియెంట్. ఇది అంతకుముందున్న వేరియెంట్ల కంటే 70% వేగంగా వ్యాపిస్తోందని ప్రతీతి పొందింది. ► బీటా (బి.1.351): మిగతా అన్ని దేశాలతో పాటు ప్రత్యేకంగా ఇది సౌత్ ఆఫ్రికా, నైజీరియాలలో ఎక్కువగా వ్యాపించింది. సౌత్ ఆఫ్రికన్ వేరియెంట్ మిగతావాటికంటే ఒకింత ప్రమాదకారిగా పేరు పొందింది. ►గామా (పీ.1): ఈ ఏడాది మొదట్లో అంటే.. జనవరి 2021లో ఇది బ్రెజిల్ నుంచి జపాన్‌కు ప్రయాణం చేసిన వ్యక్తుల వల్ల జపాన్‌లో ఎక్కువగా కనిపించిందని నిపుణులు పేర్కొన్నారు. జనవరి చివరినాటికి అమెరికా అంతటా వ్యాపించింది. అయితే మిగతా అన్ని వేరియెంట్ల కంటే ఇది చాలా వేగంగా అంటుకుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇక అప్పటికే ఒకసారి కోవిడ్–19 వచ్చిన వారికీ రెండోసారి రావడానికి ఇదే కారణమని వారు తెలిపారు. ఈ సంగతి బ్రెజిల్‌లోని 29 ఏళ్ల మహిళకు చేసిన పరీక్షల్లో పరిశోధనల్లో నిర్ధారణ కూడా అయ్యింది. గతంలో ఆమెలో పుట్టిన యాంటీబాడీలను తట్టుకుని కూడా పెరిగేలా ఈ వేరియెంట్ మార్పులు చెందిందని తెలిసింది. ► డెల్టా (బి.1.617.2): ఈ వేరియెంట్నే మన దేశపు వేరియెంట్‌గా పిలుస్తున్నారు. నిజానికి ఇది గత ఏడాది చివర్లో అంటే డిసెంబరులోనే మన దేశంలో కనుగొన్నా.. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి దేశమంతటా విజృంభించి, విలయతాండవంతో వేలాది మరణాలకు కారణమైందని చెబుతున్నారు. మన దేశంతో పాటు దీన్ని యూఎస్, యూకే, సింగపూర్ వంటి మరో 43 దేశాల్లోనూ చూశారు. ►డెల్టా ప్లస్ (ఏవై.1): కరోనా డెల్టా వేరియెంట్ (బి.1.617.2) అనేది మార్పులకు గురై డెల్టా ప్లస్ (ఏవై.1)గా మారినట్లు నిపుణులు చెబుతున్నారు. ఈ మార్పు కారణంగా కరోనా వైరస్‌లో ఉండే స్పైక్‌లలో మార్పు వచ్చి... అవి మరింతగా కణంలోకి చొచ్చుకుపోయేలా మార్పులు జరిగిందని నిపుణుల మాట. ఈ మార్పులను ‘కే417ఎన్’గా చెబుతున్నారు. ఇప్పటివరకు రూపొందిన వ్యాక్సిన్లన్నీ గతంలోని వేరియెంట్లనూ, మామూలుగా ఉన్న స్పైక్లనూ సమర్థంగా ఎదుర్కొంటున్నవని తేలినప్పటికీ... ఇవి ఈ కొత్త మార్పులతో రూపొందిన వైరస్ వేరియెంట్లను ఎదుర్కోగలవా అన్నది నిపుణుల ముందు ఉన్న సందేహం. అందువల్లనే దీనిపై అన్ని వర్గాల ప్రజల్లోనూ భయాందోళలను పెరుగుతున్నాయి. ఇది ఇప్పటికే మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి కొన్ని రాష్ట్రాలలో మూడో వేవ్‌ని తెచ్చినట్లుగా మరికొందరి అనుమానం. కాగా... ఇదే మూడో వేవ్‌కు కారణమవుతుందేమోనన్నది చాలామందిలో ఉన్న సంశయం. మూడో వేవ్ తప్పదా? ఇప్పుడు ముఖ్యంగా మూడో వేవ్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటివరకూ దాదాపు 7 నుంచి 8 వేల వరకు మ్యూటేషన్స్ జరిగాయంటూ మనం ఈ కథనంలోనే చెప్పుకున్నాం. కానీ ఈ ఏడెనిమిది వేలలో కేవలం అల్ఫా, బీటా, గామా, డెల్టాల గురించి ఎందుకు ప్రస్తావించాం? ఎందుకంటే... కేవలం ఆర్ఎన్ఏ మాత్రమే ఉండే కరోనా వైరస్‌లో దాదాపు పదివేల మార్పులు వచ్చి... పదివేల వేరియెంట్లుగా మారినప్పటికీ ఓ నాలుగైదు మాత్రమే ప్రమాదకారులుగా ఉండటం మనం చూశాం. అంటే... ఇప్పుడూ మళ్లీ మరో మూడు నాలుగు వేల మార్పులు జరిగినప్పటికీ వాటిల్లో ఏదైనా ఘోర ప్రమాదకారి అవుతుందేమో! అలా అయితే ఏం చేయాలి అనేదే సమస్యగాని... తప్పక మూడో వేవ్ వచ్చి తీరుతుందనీ... అది ప్రమాదకారిగా మారి విలయం సృష్టిస్తుందనీ కాదు. మనకు తెలుసు మనుగడ కోసం ప్రతి జీవీ మరింత ఎక్కువ మెరుగ్గా మారుతుందని. జీవుల్లో ఓ వైరస్‌కు యాంటీబాడీస్ వల్ల నిరోధకత పెరుగుతున్న కొద్దీ... వాటిని అధిమించడానికి అది ఆ యాంటీబాడీస్‌ను తప్పించుకుని మరింత శక్తిమంతం అయ్యేలా రూపొందడానికి ప్రయత్నిస్తుంటుంది. దీన్నే ‘యాంటీబాడీ ఎస్కేప్ వేరియెంట్’ అని కూడా అంటుంటారు. (పెద్దగా ఫలితం లేకపోవడంతో పాటు ప్రమాదకరమైన కొత్త వేరియెంట్లకు కారణమవుతుందనే అంశాల వల్లనే ప్లాస్మాథెరపీని చికిత్స ప్రోటోకాల్ నుంచి తొలగించిన సంగతి మనకు తెలిసిందే). పై అంశాలన్నింటినీ పరిశీలించినప్పుడు ఈ ఏడాది చివరినాటికి 10,000 సార్లు మ్యూటేషన్ జరిగి కొత్త కొత్త వేరియెంట్లు వస్తే... అందులో ఏదైనా ఇప్పటి చికిత్సలకు లొంగనంత బలంగా కొత్త స్ట్రెయిన్ వస్తే... దాని వల్ల మూడో వేవ్ రావచ్చన్నది నిపుణుల అంచనా. అంతేతప్ప అది తప్పక వస్తుందనీ కాదు... రాదనే గ్యారంటీలేదు. కాకపోతే వస్తే ఏమిటి, ఎదుర్కోవడం ఎలా అన్న సన్నద్ధత మాత్రం తప్పక ఉండాల్సిందే. పిల్లలపైన తప్పక ప్రభావం చూపుతుందా? ఈసారి వచ్చే వేరియెంట్ ఈసారి పిల్లలపై ప్రభావం చూపుతుందనే వదంతులు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఉంది... మొదటి వేవ్ వచ్చినప్పుడు ఎక్కువగా వయోవృద్ధులు, బాగా వయసు పైబడినవారు ప్రభావితం అయ్యారనీ, రెండో వేవ్‌లో యువకులు మొదలు మధ్యవయస్కులు ఈ వైరస్ బారిన పడ్డారనీ... అందువల్ల మూడోవేవ్ వస్తేగిస్తే అది తప్పక పిల్లల మీద ప్రభావ చూపుతుందనేది చాలామంది చెబుతున్న మాట. కానీ గణాంకాల మాట వేరేగా ఉంది. ఉదాహరణకు ఏడాది నుంచి పదేళ్ల పిల్లల విషయంలో చూస్తే మొదటి వేవ్‌లో 3.28% చిన్నారులు దీనిబారిన పడగా రెండో వేవ్‌లో వారి శాతం 3.05% మాత్రమే. అంటే ఇంకా చెప్పాలంటే పిల్లల శాతం తగ్గింది. ఇక 11 ఏళ్ల నుంచి 20 ఏళ్ల మధ్యవారిని చూస్తే.. మొదటి ఏడాదిలో వారి శాతం 8.03% కాగా రెండో వేవ్‌లో అది 8.57 శాతానికి పెరిగింది. అంటే పెరుగుదల కేవలం 0.54% మాత్రమే. అంటే.. కరోనాతో ప్రభావితమయ్యే పిల్లల శాతం మొదటి నుంచీ దాదాపుగా (అటు ఇటుగా) మూడు శాతానికి దగ్గరగానే ఉంది. వాళ్లలోనూ ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్లిన వారు చాలా చాలా తక్కువ. కాబట్టి గణాంకాల పరంగా చూసినా పిల్లలు ప్రభావితమవుతారనేందుకు ఎలాంటి దాఖలాలూ లేవు. ఇక మొదట్లో వయోవృద్ధులూ రెండో వేవ్‌లో మధ్య వయస్కులూ ప్రభావితమయ్యారని చెప్పడానికీ పెద్దగా ఆస్కారం లేదు. ఉదాహరణకు మొదటి వేవ్‌లో 21 – 30 ఏళ్ల వారు 21.21% అయితే రెండోవేవ్ నాటికి ఈ సంఖ్య 22.49% మాత్రమే. అంటే పెరుగుదల 1.28% మాత్రమే. అలాగే 31–40 ఏళ్ల వారూ మొదటివేవ్లో 21.23% ఉండగా రెండోవేవ్‌లో వారి శాతం 22.70%. అంటే పెరుగుదల కేవలం శాతం 1.47% మాత్రమే. ఇలా చూసినప్పుడు మధ్యవయస్కులోనూ జబ్బుపడ్డవారి సంఖ్య పెరుగుదల గణనీయంగా ఏమీ లేదు. అయితే మొదటివేవ్లో వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యారనీ, రెండోవేవ్‌లో వారి శాతం అంతగా లేదని చెప్పడం ఒక రకంగా వాస్తవమే అయినా.. మొదటివేవ్‌తో పోల్చినప్పుడు ఆ ఏజ్ గ్రూపులపై కుటుంబ సభ్యుల శ్రద్ధ పెరగడం.. కరోనా వైరస్ అందుబాటులోకి రాగానే మొదట మనం టీకాలు వేసింది. 65 ఏళ్లకు పైబడినవారికి మాత్రమేనని గుర్తుపెట్టుకుంటే అందుకు కారణాలు మనకే తేలిగ్గా అర్థమవుతాయి. ఇదే టీకా కార్యక్రమం విస్తరించి అన్ని వయసుల వారికీ విస్తృతంగా వ్యాక్సిన్ అందేలా చేసినప్పుడు మూడో వేవ్ ప్రభావం అసలు పెద్దగా ఉండకపోవచ్చు. ఉన్నా నామమాత్రం కావచ్చు కూడా. అందుకే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడితే మూడో వేవ్ అంత ప్రమాదకారి కాబోదనే మన ముందున్న గణాంకాలూ, అంచనాలు చెబుతున్నాయి. అంటే.. మూడోవేవ్ ప్రభావాన్ని తగ్గించేది టీకా అన్న విషయాన్ని అందరూ గుర్తెరిగితే చాలు. ఇక మరో విషయం ఏమిటంటే.. వైరస్ పిల్లల శరీరంలోకి చేరడానికి, పెద్దల్లోలాగా వాళ్లలో రిసెప్టార్లు అంతగా అభివృద్ధి చెంది ఉండవు. దాంతో పిల్లలు ఇప్పటివరకూ చాలా తక్కువ సంఖ్యలోనే వ్యాధి బారినపడ్డారు. ఇదే సానుకూలమైన అంశం మూడోవేవ్‌లోనూ కనిపించవచ్చు. అందుకే మూవోవేవ్లో పిల్లలు తప్పకుండా పడతారన్నది ఒక ఆధారం లేని అంచనాయే తప్ప అదే వాస్తవం కాదు. కోవిడ్ ఇన్ఫెక్షన్ పిల్లలో తీవ్రంగా ఉంటుందా? పెద్దలతో పోలిస్తే పిల్లల్లో కోవిడ్ న్యుమోనియా ఒకింత తక్కువే అయినా మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎమ్ఐఎస్–సి) వంటి కోవిడ్–19 అనంతర దుష్ప్రభావాలు పిల్లల్లో ఎక్కువగా కనిపించేందుకు అవకాశం ఉంది. అలాగే ఈ ఎమ్ఐఎస్–సిలోనూ కొన్ని సందర్భాలో లక్షణాలు ఏమీ లేకుండా లేదా కొన్ని చాలా స్వల్ప లక్షణాలతో కరోనా సోకిన 2 – 6 వారాల తర్వాత కూడా కొందరిలో ‘ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్’ ఉండవచ్చునని కొందరి ఆందోళన. ‘ఇమ్యూన్ డిస్‌రెగ్యులేషన్’ అంటే పిల్లల్లో ఉండే వ్యాధినిరోధకత తీవ్రంగా ప్రభావితమై వారు ఇతరత్రా ఇన్ఫెక్షన్లకు గురికావడం. అయితే ఇలా జరగడానికి ఉన్న ఆస్కారం తక్కువ. ఒక పరిశీలన మేరకు ప్రస్తుతం లక్షమంది పిల్లల్లో కేవలం పన్నెండు కంటే తక్కువ కేసుల్లోనే ఇలాంటి పరిస్థితిని నిపుణులు చూశారు. త్వరగా గమనిస్తే ఇలాంటి కేసులకూ సమర్థమైన చికిత్స అందించవచ్చు. పైగా ఒకవేళ పిల్లల్లో ‘ఎమ్ఐఎస్–సి’ వచ్చినా.. ఆ చిన్నారుల నుంచి ఈ సమస్య ఇతరులకు వ్యాపించడం లేదు. కాబట్టి ఎలా చూసినా పిల్లల్లో థర్డ్ వేవ్ ప్రభావం ఉంటుందనే వాదనలకు సరైన ఆధారాలు లేవు. అంతమాత్రాన నిర్లక్ష్యం కూడదు... అయితే తార్కాణాలేవీ కనిపించనప్పటికీ పిల్లల విషయంలో అప్రమత్తత మాత్రం అవసరం. ఎందుకంటే ఇప్పటికి మనం టీకా వేస్తున్నది కేవలం 18 ఏళ్లకు పైబడినవారికి మాత్రమే. వాళ్లందరికీ ఇమ్యూనిటీ వచ్చాక... అలాంటి రక్షణ వలయం లేనివారు పిల్లలే అవుతారు. కాబట్టి వారి విషయంలో చాలా చాలా అప్రమత్తంగా ఉండి తీరాల్సిందే. ఎలాంటి పిల్లలపై కరోనా ప్రభావం తీవ్రంగా ఉండవచ్చు? ►పెద్దల్లోలాగే దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న పిల్లలపై కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. మరీ ముఖ్యంగా ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయ సంబంధిత సమస్యలు, థలసీమియా వ్యాధిగ్రస్తులైన పిల్లలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. కాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, కీమోథెరపీ / రేడియేషన్ థెరపీ వంటివి తీసుకుంటున్న పిల్లల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి పిల్లలకు ప్రాధాన్యక్రమంలో వ్యాక్సిన్ ముందుగా ఇచ్చే ఏర్పాట్లూ చేయాలి. ∙ఊబకాయం ఉన్న పిల్లల విషయంలో సాధారణ పిల్లల కంటే ఒకింత ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ∙పోషకాహారలోపం ఉన్న పిల్లలూ, రోగనిరోధక వ్యవస్థలో లోపం ఉన్న పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో హోమ్ ఐసోలేషన్ ఎలా? ► వైరస్ సోకిన పిల్లలు తల్లిదండ్రులతో ఉండవచ్చు. ఆ సమయంలో పెద్దల సపోర్ట్ పిల్లలకు చాలా అవసరం కాబట్టి వారి వెంట ఉండాల్సిందే. అయితే పేరెంట్స్ కోవిడ్ నిబంధలైన మాస్క్ ధరించడం, చేతులను మాటిమాటికీ కడుక్కోవడం వంటి జాగ్రత్తలను తప్పక పాటిస్తూ ఉండాలి. ► కరోనా వైరస్‌కు గురైన పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాతలూ, నానమ్మ, అమ్మమ్మలూ, మామ్మలతో పాటు ఇంట్లో పెద్దవయసు వారి దగ్గర వదలకూడదు. మైల్డ్ నుంచి ఓ మోస్తరుగా లక్షణాలు కనిపించిన పిల్లలను 10రోజులు, తీవ్రమైన లక్షణాలు కనిపించినవారిని 20 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉంచాలి. అందరికీ వ్యాక్సిన్ వేశాక కరోనా కథ ముగిసిపోతుందా? ఈ విషయం ఇంకా స్పష్టంగా తెలియదు. అందరికీ వ్యాక్సిన్ అందాక మనందరిలోనూ కరోనా వైరస్‌కు ఇమ్యూనిటీ వస్తే మున్ముందు అది మరిన్ని వేరియెంట్లుగా మారే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. దాంతో జలుబు తెచ్చిపెట్టే అనేకానేక వైరస్లలో ఇదీ ఒకటిగానో లేదా ఫ్లూలా ప్రతి ఏడాదీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన ఓ ప్రమాదరహితమైన (అంటే ఏ కొద్దిమందికో తప్ప మిగతా ప్రజలందరికీ ప్రమాదం చేకూర్చని) ఇన్ఫెక్షన్లా మిగిలిపోవచ్చు. గతంలోనూ ఎన్నో పాండమిక్‌లను ప్రపంచం చూసినట్లుగానే దీన్నీ సమర్థంగా ఎదుర్కొని మానవాళి ఎప్పటిలాగే తన మనుగడ కొనసాగించవచ్చు. వేరియెంట్లు లేదా కొత్త స్ట్రెయిన్లు ఎలా పుడతాయంటే... వైరస్లు తొలుత హైజాక్ చేసినట్లుగా తాము ప్రవేశించిన కణంలోకి దూరిపోతాయి కదా. అక్కడ తమను వృద్ధి చేసుకోవడం మొదలుపెడతాయి. తమను తాము వృద్ధి చేసుకునే ప్రక్రియలో తమ ‘కాపీ’ వైరస్‌ను సృష్టిస్తాయి. ఈ ప్రక్రియనే ‘కాపీయింగ్’ అంటారు. ఒక వైరస్ వేలాది వైరస్‌లను కాపీ చేసుకుంటుంది. ఇవన్నీ మళ్లీ అన్నన్ని కణాలను హైజాక్ చేసి.. మళ్లీ వేలాదిగా, లక్షలాదిగా పెరుగుతూ పోతాయి. ఇలా వేల కొద్దీ పుట్టే సమయంలో వాటి ఆర్ఎన్ఏలో ఏదైనా చిన్న పొరబాటు జరిగి.. ఆ ఆర్‌ఎన్‌ఏలోని పదార్థాల్లో కొత్త మార్పులు జరిగితే.. అది కొత్త స్ట్రెయిన్‌గా, కొత్త వేరియెంట్‌గా మారే అవకాశం ఉంది. కోటాను కోట్లుగా కాపియింగ్ జరిగే ప్రక్రియలో ఇలా కొత్త స్ట్రెయిన్లు, కొత్త వేరియెంట్లుగా మారే అవకాశాలు ఎక్కువ. పిల్లల విషయంలో మన సన్నద్ధత ఎలా ఉండాలంటే... ► పిల్లలైనా పెద్దలైనా మొదట కనిపించే లక్షణం కేవలం జ్వరం మాత్రమే. కాబట్టి ఈ లక్షణాన్ని తేలిగ్గా ఎదుర్కొనేలా పారాసిటమాల్‌తో పాటు వారికి అవసరమైన మాత్రలను సంసిద్ధంగా ఉంచుకోవాలి. ► పిల్లలకు అవసరమైన ఇన్‌పేషెంట్ వసతులతో హాస్పిటల్స్‌ను సైతం సిద్ధం చేయాలి. ఆసుపత్రి సిబ్బంది అందరినీ అప్రమత్తం చేయాలి. ► పిల్లలకు వచ్చేందుకు అవకాశం ఉన్న మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (ఎమ్ఎస్ఐఎస్)కి అవసరమైన ఔషధాలు, చికిత్స సదుపాయాలను ముందునుంచే తయారుగా పెట్టుకునేలా హాస్పిటళ్లను సంసిద్ధం చేయాలి. ► పిల్లల కోసమే ప్రత్యేకంగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)తో కూడిన కోవిడ్ వార్డుల ఏర్పాటు జరగాలి. ► పిల్లలు కూడా పెద్దలు తీసుకుంటున్న జాగ్రత్తలను తప్పక పాటించాలి. అంటే... మాస్క్ ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం. భౌతిక దూరం వంటివి పాటించాలి. పిల్లలు ఈ మార్గదర్శకాలను పాటించేలా పెద్దలు వారికి అవగాహన కల్పించాలి. అలా చేయడానికి వారికి తోడ్పడాలి. ► చివరగా... అమెరికాలాంటి దేశాల్లో ఇప్పటికే ఫైజర్ వంటి వ్యాక్సిన్లు పిల్లలకు సురక్షితమని తేలింది. ఇక మన దేశంలోనూ పిల్లలపై కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్ల ట్రయల్స్ జరుగుతున్నాయి. వీటి ఫలితాలు వస్తే... మొదట్లో వయోవృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రాధాన్యక్రమంలో తొలుత 65 ఏళ్ల పైబడిన వారికి ఇచ్చినట్లే... మన ట్రయల్స్‌లోనూ పిల్లలకు వ్యాక్సిన్ సురక్షితమని తేలాక... ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తూ పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా చూడాలి. పిల్లలతో మన అనుబంధం బలమైన భావోద్వేగపూరితమైన బంధం. వాళ్లు మన కంటి వెలుగులు. అందుకే గతంలో వ్యాక్సిన్ కొరత వంటి సంభవించిన అంశాలతో పాఠాలు నేర్చుకుని పిల్లల విషయంలో అలాంటి తప్పిదాలు జరగకకుండా... పిల్లలందరికీ వ్యాక్సిన్ అందేలా చూస్తే మూడో వేవ్ ప్రభావం వారి మీద లేకుండా జాగ్రత్తపడవచ్చు. పెద్దలూ... ఈ జాగ్రత్తలు తీసుకోండి... పిల్లల విషయంలో పెద్దలూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అతి తీవ్రమైన జ్వరం వచ్చినా, గొంతునొప్పి, దగ్గు, నీరసం, నిస్సత్తువ, బలహీనత, ఒళ్లునొప్పులూ, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, వాసన తెలియకపోవడం, తిండి సయించకపోవడం, చనుబాలు తాగే పిల్లలు పాలు తాగకపోవడం, ఒళ్ళంతా ఎర్రబడడం, కళ్లు, నాలుక ఎర్రబారడం, మగతగా ఉండటం, ఫిట్స్ రావడం, ఆయాసం రావడం, ఒళ్లు నీలంగా మారడం, అపస్మారక స్థితి, ఆక్సిజన్ లెవెల్ తగ్గడం వంటి తీవ్ర లక్షణాలను పిల్లల్లో గమనిస్తే తక్షణమే వారిని హాస్పిటల్‌కు తరలించాలి. -యాసీన్ -
Fathers Day: లవ్ యూ నాన్న..
నాన్నా.. ‘మీరు’ అనే పెద్దరికంతో దూరంగానే ఉండిపోయారు.. ‘నువ్వు’ అనే ఆలింగనంతో దగ్గరవలేదు! ఆ పిలుపు భయాన్ని పెంచింది తప్ప ప్రేమను చూపించలేకపోయింది! అందుకే మీతో మాట్లాడాల్సిన ప్రతిసారీ అమ్మను మధ్యవర్తిగా పెట్టాల్సి వచ్చింది! మీ చెప్పుల్లో కాళ్లు పెట్టి నడిచాం.. మీ కళ్లజోడును తగిలించుకుని గంభీరాలు పోయాం మీ చొక్కాలో చేతులు దూర్చి.. మీ స్వరాన్ని అనుకరించి సరదా పడ్డాం! కానీ మీతో ఆడుకునే భాగ్యానికి నోచుకోలేకపోయాం! మీ మీసాలెప్పుడూ తెచ్చిపెట్టుకున్న కోపాన్ని ప్రదర్శించాయి.. వస్తున్న నవ్వును ఆపేశాయి ఎందుకు నాన్నా? ఎప్పుడూ భావోద్వేగాల ఫ్రూఫ్ జాకెట్‌లోనే కనిపించారు ? బాధ్యతనే మోశారు... ఆత్మీయతను ఎందుకు దాచుకున్నారు! మాకు గమనించే వయసొచ్చిందని బీరువా వెనకగూట్లో సిగరెట్లను దాచడం మానేశారు! ఫ్రెండ్స్‌తో పార్టీలూ తగ్గించారు.. స్టయిల్‌గా ఉండే క్రాఫ్‌ను సాదాసీదాగా మార్చుకున్నారు! పెరుగుతున్న ఖర్చులను భరించడానికి పార్ట్‌టైమ్ ఉద్యోగాలూ మొదలుపెట్టారు! అయినా హిట్లర్‌గానే మిగిలిపోయారు! లవ్ యూ నాన్నా.. హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా!! ఒక్కోసారి ఒక మాట చెప్పలేనిది .. అక్షరం చెపుతుంది.... జీవన ప్రయాణంలో జన్మనిచ్చినవాళ్లు .. దూరంగా ఉన్నా ఉత్తరాలు ఆ బంధాన్ని పట్టి ఉంచుతాయి.. బాధ్యతను గుర్తుచేస్తాయి.. స్వాతంత్య్రోద్యమమైనా, సార్వత్రిక ఎన్నికలైనా, కూతురి పెళ్లి అయినా.. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న రోజైనా.. గెలుపు, ఓటముల ప్రసక్తి అయినా.. ఆశనిరాశల ఆరాటమైనా.. ఏ సందర్భం అయినా తమ పితృ వాత్సల్యాన్ని భట్వాడా చేశారు కొందరు తండ్రులు. ఆ అక్షరాల్లోని వాళ్ల మనసు.. పెంపకంలో వాళ్లు వదిలిన జాడలు ఈ ఫాదర్స్‌డే సందర్భంగా... టు ఇందిరా ఫ్రమ్ జవహర్లాల్ నెహ్రూ (అలహాబాద్ నైని సెంట్రల్ జైల్ నుంచి) సందర్భం: ఇందిర 13వ పుట్టిన రోజు డియర్ ఇందిరా.. ఏది సరైంది.. ఏది కాదు, ఏం చేయాలి.. ఏం చేయకూడదు అనేవి ఉపన్యాసాలతో తెలుసుకోలేం. చర్చించడం ద్వారా తెలుసుకుంటాం. నీతో నేనెప్పుడూ చర్చించడాన్నే ఇష్టపడ్తాను. ఇప్పటికే మనం చాలా అంశాలను చర్చించుకున్నాం. కానీ ఈ ప్రపంచం చాలా విశాలమైంది. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్పిస్తూనే ఉంటుంది. అన్నీ తెలుసనే భావనను దరిచేరనీయకు. నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి. జీవితంతో పాటు అది కొనసాగాలి. సూర్యుడితో స్నేహం చేద్దాం. అంటే ఎప్పుడూ మెలకువగా ఉందాం. డబ్బు ఎప్పుడూ మంచిది కాదు. అది వస్తువులను పొందడానికి మాత్రమే సహాయపడుతుంది. నువ్వెలా ఉండాలంటే ఈ దేశ సేవలో ఒక యోధురాలిలా! - మీ నాన్న జవహర్లాల్ నెహ్రూ టు అక్షిత ఫ్రమ్ నారాయణమూర్తి (ఇన్ఫోసిస్) సందర్భం: పెళ్లై అక్షిత అత్తగారింటికి వెళ్లే ముందు... డియర్ అక్షితా మీరు పుట్టినప్పటి నుంచి ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయడం మెదలుపెట్టా. ఫలానా టైమ్‌లో నాన్న తప్పు చేశాడని మీకు అనిపించే పరిస్థితి రాకూడదని. ఆర్థికంగా కాస్త వెసులుబాటు కలగగానే మిమ్మల్ని కారులో స్కూల్‌కు పంపే విషయమై మీ అమ్మతో మాట్లాడిన సందర్భం నాకింకా గుర్తు. కానీ మీ అమ్మ సమ్మతించలేదు. ఎప్పటిలాగే మిమ్మల్ని ఆటోరిక్షాలోనే పంపాలని పట్టుబట్టింది. దాని వల్ల మీ ఫ్రెండ్స్‌తో మీకున్న స్నేహం స్థిరపడింది. చిన్న చిన్న ఆనందాలు జీవితాన్ని ఎంత ఉత్తేజపరుస్తాయో తెలుసుకున్నారు. అన్నిటికన్నా సింప్లిసిటీలో ఉన్న గొప్పదనాన్ని అర్థంచేసుకున్నారు. సంతోషంగా ఉండడానికి డబ్బు వెచ్చించాల్సిన అవసరం లేదనీ గ్రహించారు. బయట చాలా మంది అడుగుతుంటారు నన్ను ‘మీ పిల్లలకు మీరు నేర్పిన విలువల గురించి చెప్పండ’ని. ఆ క్రెడిట్ మీ అమ్మకే ఇస్తాను. నేను సాధారణమైన తండ్రిని. ఎంత నార్మల్ అంటే.. నీ జీవిత భాగస్వామిని ఎంచుకున్న విషయాన్ని నువ్వు నాతో చెప్పినప్పుడు అసూయపడేంత. నా కూతురి ప్రేమను పరాయి వ్యక్తెవరో పంచుకోబోతున్నాడనే నిజం మింగుడుపడనంత. కానీ రిషీని కలిశాక ఆ అభిప్రాయాలన్నీ పటాపంచలైపోయాయి. రిషీ తెలివి, నిజాయితీ నిన్ను ఇంప్రెస్ చేసినట్టుగానే నన్నూ ఇంప్రెస్ చేశాయి. నీ నిర్ణయం పట్ల గర్వపడ్డాను కూడా. కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టావ్. మా నుంచి పొందినదాని కన్నా మరింతి గొప్ప స్థితిలోకి వెళ్లాలి. జీవితంలో సంయమనం చాలా ముఖ్యమని మరిచిపోవద్దు. జాగ్రత్త తల్లీ - మీ అప్పా టు మాలియా, సాషా.. ఫ్రమ్ బరాక్ ఒబామా సందర్భం: అమెరికాకు 44వ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు. డియర్ మాలియా, సాషా.. ఈ రెండేళ్లు నా ప్రచార కార్యక్రమాల్లో పడి మిమ్మల్ని ఎంత మిస్ అయ్యానో నాకే తెలుసు. ఈ రోజు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నా జీవితంలోకి రాకముందు నాకు నేనే లోకం. నేను కోరుకున్నది పొందడమే లక్ష్యం. ఎప్పుడైతే మీరు వచ్చారో అప్పటి నుంచి నా జీవనగమనం మారిపోయింది. మీతోడిదే నా లోకమైంది. మీ నవ్వులు, కేరింతలు, అల్లర్లతో మనసు నిండిపోని రోజు లేదు. నాకు నేను ముఖ్యమనే ఆలోచనే పోయింది. నాకోసం నేను పెట్టుకున్న ఆశయాలు మీముందు చిన్నవయ్యాయి. మీ కళ్లల్లో కనపడే ఆంనదాన్ని మించిన గొప్ప లక్ష్యం లేదనిపించసాగింది. మిమ్మల్ని సంతోషంగా ఉంచే బాధ్యతను మించిన పరమార్థం లేదు నా జీవితానికనిపించింది. మీకే కాదు ఈ దేశంలోని పిల్లలందరికీ సంతోషంగా బతికే హక్కు ఉంది. మీతోపాటు వాళ్లంతా ఆ హక్కును పొందేలా చూడ్డానికే అధ్యక్ష్య పదవికి పోటీ చేశా. వైట్‌హౌజ్‌లోని కొత్తజీవితానికి సహనం, సంయమనాన్ని ఫ్రెండ్స్‌గా తోడు తెచ్చుకుంటారని భావిస్తున్నా. విత్ లవ్ .. - యువర్స్ డాడ్ బరాక్ ఒబామా టు మేఘన ఫ్రమ్ గుల్జార్ సందర్భం: మేఘన గ్రాడ్యుయేషన్ పూర్తయినప్పుడు మేఘనా.. నీ చదువు పూర్తయ్యింది. అవకాశాల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నావు. నీ ఆసక్తిని బట్టే అవకాశాన్ని ఎంచుకో. దానివల్ల నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నమూ మొదలవుతుంది. మనల్ని మనం తెలుసుకోలేని జీవన ప్రయాణం వ్యర్థం. నీకు ఆ శక్తి ఉంది. నువ్వు అనుకున్నది సాధించగల సమర్థురాలివనీ తెలుసు. డిగ్రీతో అకడమిక్ క్వాలిఫికేషన్ తెచ్చుకున్నావు. ఇంకొంచెం ఎఫర్ట్‌తో జీవన పాఠాలన్నీ ఆకళింపు చేసుకో. సరైన నిర్ణయం తీసుకో. ఆల్ ది బెస్ట్ బేటా..! - తుమ్హారే పాపా టు దీపిక పడుకోణ్ ఫ్రమ్ ప్రకాశ్ పడుకోణ్ మై డియర్ దీపిక... జీవితంలో ప్రతిసారీ గెలవలేం. కావల్సినవన్నీ మన దారికి రావు. మనం కోరుకున్నట్టుగా పరిస్థితులు ఉండవు. మారవు. కొన్ని గెలవాలంటే కొన్ని కోల్పోవాలి. జీవితంలో కొన్ని సార్లు తగ్గడమే నెగ్గడం. అది నేర్చుకో. అయితే పూర్తిగా వదిలేయకూడదు. నా కెరీర్ అంతా కూడా నేను చేసింది అదే. మొదటి ఆట నుంచి రిటైర్మెంట్ వరకు ప్రయత్నాన్ని వీడలేదు. ఎంతటి క్లిష్ట సమయాల్లోనైనా సరే వల్లకాదు వదిలేయాలన్న ఆలోచనకు తావివ్వలేదు. నా శక్తిపైనే దృష్టిపెట్టాను. నీ నుంచీ అదే కోరుకుంటున్నా బేటా! గెలవడమంటే నిలబడడమే! - విత్ లాట్స్ ఆఫ్ లవ్, డాడీ టు సర్వజిత్, అచిన్త్య .. ఫ్రమ్ వివిఎస్ లక్ష్మణ్ సర్వజిత్, అచిన్త్య.. తాత్వికంగా చెప్పడం కాదు కానీ ఊహించని వాటిలోనే జీవన సౌందర్యం దాగుంది. అందుకు ఉదాహరణ నా జీవితమే. ఎప్పటికప్పుడు భిన్నమైన అంచనాలతోనే సాగింది నా జీవితం. ఆస్వాదించే స్వభావం అలవడింది. దేన్నయినా ఎదుర్కొనే సమర్థత వచ్చింది. అదృష్టవశాత్తు అత్యున్నత స్థాయిలో క్రికెట్ ఆడే అవకాశం దక్కింది. ఈ దేశం తరపున ప్రాతినిథ్యం వహించే చాన్స్ దొరికింది. ఈ ఆట నాకు చాలా విషయాలు నేర్పింది. క్రమశిక్షణ, లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దాని ప్రాముఖ్యత, కృషి విలువను అనుభవంలోకి తెచ్చింది. ముఖ్యంగా గెలుపు, ఓటములను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో తెలుసుకున్నాను. అవి నాణానికి రెండు వైపులు అని అర్థంచేసుకున్నాను. మీరూ వీటిని దృష్టిలో పెట్టుకొని మీ జీవితానికి బలమైన పునాది వేసుకోవాలి. - ఇట్లు ,మీ నాన్న -
కవర్ స్టోరీ: ఏడాది@ ఇల్లేనా!
‘నాన్నా... ఈ బిల్డింగ్‌ని ఎక్కడో చూసినట్టుంది.. దీని ముందు నుంచి వెళ్తుంటే ఏవేవో గుర్తొస్తున్నాయి’ అంటాడు ఓ పిల్లాడు. ‘ఒరేయ్.. అది నీ స్కూల్ రా.. ’ అని చెప్తాడు తండ్రి.ఇదొక జోక్‌గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ అదో విషాదం. పిల్లలకు శాపం. కారణం కరోనా అని ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. దాని ప్రభావం ఈ విద్యా సంవత్సరాన్ని గైర్హాజర్ చేసింది.. థర్డ్ వేవ్ హెచ్చరికలతో వచ్చే విద్యా సంవత్సరానికీ సిక్ లీవ్ మంజూరు చేసే ప్రమాదాన్ని చూపిస్తోంది. మరి బడులు? ఆ ప్రాంగణంలో వికసించే బాల్యం? పాఠశాల అంటే నల్లబల్ల – సుద్దముక్క, బెంచీలు – టేబుళ్లు, టీచర్లు – పాఠాలే కాదుకదా! ఆట.. పాట.. అల్లరి..సరదా.. సంతోషం.. స్నేహం.. వైరం.. పోటీ.. ప్రయత్నం.. గెలుపు.. ఓటమి..ఫిర్యాదు – ప్రశంస.. వాదన – రాజీ.. సమ్మతి – వ్యతిరేకతలను నేర్పిస్తుంది కదా! చూడబోయే ప్రపంచానికి కిటికీ.. సాధించబోయే పరిణతికి పలకా, బలపం అవుతుంది. కొత్త విషయాలను దిద్దిస్తుంది.. చేసిన తప్పులను చెరిపేయిస్తుంది...పుస్తకాల్లో ఉన్నదాంతో పరీక్షలకు సిద్ధం చేయిస్తే.. ఆవరణలో ఉన్న అంశాలతో జీవితానికి సంసిద్ధం చేయిస్తుంది!నేననే స్వార్థం.. నువ్వనే భేదం.. మనమనే ఐకమత్యం బోధపడేదక్కడే! ఆలోచన మొలకెత్తెదీ.. అభిప్రాయం విరిసేదీ ఆ తోటలోనే.. రహస్యాలను పొదగడం.. ఛేదించడం ఆరంభమయ్యేదీ ఆ ప్రహరీలోనే.. నమ్మకాలు పెంచుకునేది.. నమ్మకంగా నడిపించుకునేదీ ఆ వేదిక నుంచే మొదలు.. కలివిడితనం.. కలహించే ధైర్యం.. నిలబడే నాయకత్వం అలవడేది అక్కడే.. కలలను పరిచయం చేసి.. లక్ష్యాలను ఏర్పర్చుకునే సత్తానిచ్చేదీ అదేబతుకుసాగరంలో వేటకు లౌక్యపు నావ.. ఇంత తత్వం.. జీవన శాస్త్రం ఒంటబట్టించే బడిని.. ఆరోగ్యకరంగా పెరిగే అవకాశాన్నీ శాసిస్తోంది కరోనా! లాక్‌డౌన్‌తో విద్యా వ్యవస్థ మొత్తం గందరగోళంలో పడి పిల్లల మానసికస్థితి రోజురోజుకూ దిగజారుతోందని అనేక సర్వేలు చెబుతున్నాయి. మొదటిసారి బడిలో ప్రవేశం పొందాల్సిన పిల్లల దగ్గర నుంచి పరీక్షలు రాయకుండానే పాస్ అయిపోయిన విద్యార్థుల వరకు అందరి పరిస్థితి ఒకటే. మన దేశంతోపాటు 188 పైనే దేశాలు బళ్లు మూసివేసి.. డిజిటల్, రేడియో వంటి పలు మాధ్యమాలతో విద్యను అందిస్తున్నాయి. ఈ సమయంలో ఇంటికే పరిమితమవుతున్న పిల్లలు చాలా ఒత్తిళ్లకు లోనవుతున్నారు. కరోనా కన్నా దాని ప్రభావిత బాధితుల్లో అధిక స్థానం పిల్లలదే అంటున్నారు మానసిక నిపుణులు. లాక్డౌన్లో వేధింపులు, వారి బాగోగులను పట్టించుకోని కారణంగా ఎంతోమంది చిన్నారులను మానసిక సమస్యలు వెంటాడుతున్నాయని చెప్తున్నారు. మరింత శ్రద్ధ తప్పదు తోటివిద్యార్థుల సాంగత్యం లేకపోవడంతో పిల్లలు తెలియకుండానే చిన్న చిన్న ఆనందాలను కోల్పోతున్నారు. డిజిటల్ పాఠాల విషయానికి వస్తే.. ఆన్ లైన్ క్లాసులకు, సాధారణ క్లాసులకు చాలా వ్యత్యాసం ఉంటుంది. ప్రత్యక్ష తరగతి బోధనలో టీచర్ చెప్పే విషయాన్ని విద్యార్థి ఫాలో అవుతున్నాడో లేదో మనం గమనించి తర్పీదు ఇవ్వడానికి వీలు కలుగుతుంది. ఆన్లైన్లో అలా కుదరదు. అది కూడా 50% విద్యార్థులు మాత్రమే వీటిని వినగలుగుతున్నారు. పైగా ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల వారు కావడంతో నెట్ వర్క్ సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఏం చేస్తాం? ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తప్ప మరో మార్గం లేదు. విద్యార్థుల విషయంలో ఉపాధ్యాయులతో పాటు పేరెంట్స్ కూడా శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. ఎప్పుడూ చదువు గురించే కాకుండా వాళ్లతో కాస్త సరదాగా గడపడం అవసరం. పి. వి. రామరాజు, శ్రీ బాలాజీ కాన్వెంట్ హెడ్ మాస్టర్, ముమ్మిడివరం, తూర్పు గోదావరి అన్ని కోణాల్లో చూడాలి సాధారణంగా పిల్లలు హాలీడేస్ కోరుకుంటారు కాబట్టి లాక్ డౌన్ వాళ్లకు అసలు సమస్యే కాదు అనుకుంటాం. మొదట్లో సెలవు దినాల్లో ఉండే వినోదంతో పాటు.. అనువుగా ఉండే చదువు విధానాన్ని పిల్లలు ఆనందంగానే స్వీకరించారు. నెలలు గడుస్తున్న కొద్దీ క్రమంగా వాళ్లకి తెలియకుండానే అవాస్తవిక ప్రపంచంలోకి వెళ్లిపోయారు. దాంతో లెర్నింగ్ మెకానిజం అంతా వర్చువల్ అయిపోయింది. నేర్చుకోవడం ఎలాగో తప్పుదు.. దానికి తోడు పెరుగుతున్న ఒత్తిడి, బయటికి వెళ్లేందుకు అవకాశం లేకపోవడం ఇదంతా కలిసి పిల్లల్లో డిప్రెషన్, ఫ్రస్ట్రేషన్ కలిగిస్తున్నాయి. ఇదివరకూ ఈ ఫ్రస్ట్రేషన్, ఈ డిప్రెషన్ కాస్తోకూస్తో ఉన్నా ఫ్రెండ్స్, ఆటపాటలు వంటి వాటితో సేద తీరేవారు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. పిల్లల్లో విపరీతమైన కోపం, చిరాకు, చదువు మీద ఆసక్తి తగ్గడం, మూడీగా ఉండటం, ఎదురు సమాధానాలు చెప్పడం, వద్దన్న పని చెయ్యడం, బిగ్గరగా అరవడం, చిన్నదానికే ఏడవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. పిల్లల ఈ తీరును ‘ఈ మధ్య అల్లరి ఎక్కువైంది’ అని చాలా సింపుల్‌గా తీసుకుంటున్నాం. కానీ ఇదొక సమస్య. దీన్ని అడ్జెస్ట్మెంట్ డిజార్డర్ అంటారు. అంటే సానుకూలంగా అనిపించని ఒక పరిస్థితికి అడ్జెస్ట్ అవ్వడం. పిల్లలకు ఇబ్బందికరంగా మారినప్పుడు వారి మాటల్లో కంటే చేతల్లోనే ఎక్కువ మార్పు కనిపిస్తుంది. ఈ గందరగోళ పరిస్థితుల్లో ‘ఎంతకాలం మేము ఈ నాలుగు గోడల మధ్యనే ఉండాలి?’ అనే ప్రశ్న పిల్లల్ని డిప్రెషన్ కి గురి చేస్తోంది. ఏవరేజ్, అబౌ ఏవరేజ్ పిల్లలతో పోలిస్తే బిలో ఏవరేజ్ పిల్లలకు.. ఆన్ లైన్ క్లాసుల సారాంశం 10 – 15 శాతం కూడా మైండ్‌కి ఎక్కదు. దాంతో వాళ్లకి, వీళ్లకి మధ్య మానసికమైన చాలెంజ్‌తో పాటు అకడమిక్ ఇయర్ ల్యాగ్ అనేది ఏర్పడిపోతుంది. ఆ గ్యాప్‌ని కవర్ చేయడానికి ప్రత్యేకమైన క్లాసులు, ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. అయితే ఇప్పటి దాకా మనం తెలుసుకున్నది అడ్జెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్. భవిష్యత్‌లో రి–అడ్జెస్ట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా తలెత్తుతాయి. అంటే ఇంత దీర్ఘకాలికంగా ఇంటిపట్టునే ఉండిపోతున్న ఈ పిల్లలు మళ్లీ రియల్ టైమ్ స్కూల్స్‌కి వెళ్లి, ఆ వాతావరణానికి అడ్జెస్ట్ అయ్యి, ఆ టీచర్స్, తోటివారిని చూస్తూ.. క్లాసులో కంటిన్యూగా కదలకుండా కూర్చోవడం కష్టమవుతుంది. ఇంట్లో ఉండి పాఠం వినేదానికి స్కూల్లో కూర్చునేదానికి తేడా ఉంటుంది. అప్పుడు కూడా పిల్లలు అంత పద్ధతిగా ఉండగలరా? అంటే కష్టమే. మళ్లీ దారిలో పడటానికి దగ్గరదగ్గరగా ఆరు నెలలు టైమ్ పడుతుంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. మనం ఎంత ఒత్తిడిలో ఉన్నా వాటిని పక్కనపెట్టి.. వాళ్లతో కూర్చుని కబుర్లు చెబుతుండాలి. వాళ్లు చేసిన పనిని వెంటనే తప్పుబట్టకుండా, మిగతా పిల్లలతో పోల్చకుండా రిలాక్స్డ్గా, బ్యాలెన్స్డ్గా నవ్వుతూ పిల్లలతో మెలిగితే వారి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అల్లరీ తగ్గుతుంది. వినే ఓపిక పెరుగుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే పిల్లల సైకాలజీ.. పేరెంట్స్ సైకాలజీ, ప్రవర్తనలపై ఆధారపడి ఉంటుంది. -డా. కళ్యాణ్ చక్రవర్తి కన్సల్టెంట్ చైల్డ్ అండ్ అడల్ట్ సైకియాట్రిస్ట్ ఫ్రెండ్స్‌కి దూరమయ్యా.. ఈ ఏడాదే నాది టెన్త్ పూర్తి అయ్యింది. ఢిల్లీలోని హోలీ ఏంజెల్స్ సీనియర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నాను. లాక్ డౌన్ వల్ల లాస్ట్ ఇయర్ అంతా ఆన్ లైన్ క్లాసులతోనే ముగిసింది. ఇదే చివరి ఏడాది కావడంతో అన్నేళ్ల పాటు కలిసి చదువుకున్న నా ఫ్రెండ్స్ అందరినీ కలుసుకోకుండా, కనీసం సెండాఫ్ కూడా తీసుకోకుండానే మా ఊరికి వచ్చేయాల్సి వచ్చింది. వాళ్లంతా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారు. ఆ రోజుల్ని చాలా మిస్ అవుతున్నా. ఫేవరెట్ టీచర్, ఫేవరెట్ క్లాస్ ప్రతీది మిస్ అయ్యా. నేను టెన్త్‌కి రాగానే.. కాలేజ్ లైఫ్ గురించి చాలా ఊహించుకునేవాడ్ని. కొత్త వాతావరణం, కొత్త ఫ్రెండ్స్, ఫ్యూచర్ గోల్స్.. ఇలా చాలానే అనుకున్నాను. ఇప్పట్లో తీరేలా లేవు. – బుద్దుల సాయి గణేష్, స్టూడెంట్, ఖాజురు (శ్రీకాకుళం) ఆ ఆనందం సాటి రాదు కదా.. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో ఫస్ట్ రోల్ పాఠశాలదే. టీచర్ చెప్పే పాఠాలతో పాటు తోటి పిల్లలను కలుసుకోవడం, వారితో స్నేహం చెయ్యడం, కలిసి తినడం, ఆడుకోవడం, చదువుకోవడం అదంతా పిల్లల మానసిక ఉల్లాసాన్ని రెట్టింపు చేస్తుంది. స్కూల్స్ మూతపడటంతో మా అబ్బాయి ఇప్పుడు అవన్నీ మిస్ అవుతున్నాడు. ఆన్లైన్ క్లాసులు తరగతి గది పాఠాల లోటును పూరించినా, తమ ఈడు పిల్లలతో ఆడుతూ, పాడుతూ పొందే ఉత్సాహాన్ని మాత్రం ఇవ్వలేకపోతున్నాయి. పెద్ద వాళ్లం పిల్లలుగా మారి వాళ్లతో ఎన్ని కబుర్లు చెప్పినా.. ఎంత ఆడించినా తోటి పిల్లలతో పొందే ఆనందం సాటి రాదు కదా అది! – మాకిరెడ్డి వర ప్రసాద్ (పేరెంట్), నర్సీపట్నం, విశాఖపట్నం పిల్లలకు నచ్చేలా.. వాళ్లు మెచ్చేలా.. ఈ సంక్షోభం వల్ల మనం అవలంబిస్తున్న ఆన్లైన్ క్లాసులు పిల్లల మీద తీవ్ర ప్రభావాన్నే చూపిస్తున్నాయి. పిల్లల్లో నేర్చుకోవాలనే తపన, తాపత్రయం దెబ్బతినే ప్రమాదం కనపడుతోంది. బడిలో చెప్పే పాఠాలే పిల్లలకు మంచిది. క్లాసులో టీచర్ పిల్లలను గమనిస్తూ పాఠం చెప్పటం వల్ల వాళ్ల మానసిక స్థితిని అంచనా వేయగలం. పాఠం అర్థం చేసుకోలేక పోతుంటే మరింత వివరంగా చెప్పే వీలవుతుంది. అయితే లాక్ డౌన్లో వర్చువల్ క్లాసులు తప్పవు కాబట్టి.. పిల్లలకు నచ్చేలా.. వాళ్లు మెచ్చేలా ఆన్లైన్ క్లాసులు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. క్లాసులు జరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. మొబైల్, ల్యాప్ టాప్లలో క్లాసులు శ్రద్ధగా వింటున్నారా లేక వేరే స్క్రీన్స్ ఆన్ చేసి కాలక్షేపం చేస్తున్నారా అన్నది తప్పక పరిశీలించుకోవాలి. బాధ్యతగా పిల్లల కోసం సమయాన్ని కేటాయించాలి. – వై రమాదేవి, వైస్ ప్రిన్సిపాల్, M.SC, M.Phil, B.Ed, శ్రీ విద్యారణ్య ఇంటర్నేషనల్ స్కూల్ (స్విస్), హైదరాబాద్ స్టూడెంట్.. టీచర్.. ఫ్రెండ్స్‌గానూ.. పిల్లల టైమ్ టేబుల్‌ను కరోనా కంటే ముందు తర్వాత అని చూడాల్సి వస్తోంది. స్కూల్‌కి వెళ్లి రావడం, ఫ్రెషప్ అయ్యి హోమ్ వర్క్ చేసు కోవడం.. తర్వాత పక్కింటి పిల్లలతో ఆడుకోవడం.. ఇలా వాళ్లకంటూ కొంత సరదా, సంతోషం ఉండేది. కానీ ఇప్పుడు వాళ్లను ఇల్లు దాటిపోనివ్వట్లేదు. చదువులేమో ఆన్లైన్ అయిపోయే. వాళ్లతో ఆడేవారు, పాడేవారు లేక ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ల మీద మరింత శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. పైగా ఈ ఆన్ లైన్ క్లాసులతో పేరెంట్స్ ఇటు స్టూడెంట్స్‌గా, అటు టీచర్స్గానూ మారాల్సి వస్తోంది. మిగిలిన సమయంలో వాళ్లతో ఆడుతూ పాడుతూ వాళ్లకు ఫ్రెండ్స్‌గానూ ఉండాల్సి వస్తోంది. ఇలా పిల్లల మీద కరోనా ప్రభావం లేకుండా వాళ్లను నార్మల్‌గా ఉంచేందుకు పేరెంట్స్ చాలానే కష్టపడాల్సి వస్తోంది. నిజంగానే స్కూల్ విలువ తెలిసి వస్తోంది. – బొద్దుల స్వర్ణలత (పేరెంట్) గోకుల్ నగర్, మల్లాపూర్, హైదరాబాద్ స్కూల్ మిస్సవుతున్నాం స్కూల్ ఉంటే ఫ్రెండ్స్‌ని కలవటం, రెగ్యులర్‌గా క్లాసులకు వెళ్లటం జరిగేది. స్పోర్ట్స్ పీరియడ్లు, కల్చరల్ యాక్టివిటీస్ ఉండేవి. నాకు ఆన్ లైన్ క్లాసులు మొదట్లో ఇబ్బందిగా అనిపించేవి. కానీ ఇప్పుడు అలవాటు అయ్యాయి. ఆన్ లైన్ పరీక్షలు కూడా రాయగలుగు తున్నా. ఆన్ లైన్లో క్విజ్లు, సర్వేలు బాగుంటున్నాయి. ఇది భవిష్యత్‌లో ఆన్ లైన్ పరీక్షలు రాసేందుకు ఉపయోగపడొచ్చు. కానీ స్కూల్నైతే రీప్లేస్ చేయలేవు. మా స్కూల్‌ని చాలా మిస్ అవుతున్నా. త్వరగా అంతా మామూలుగా అయిపోతే బాగుండు! – కావ్యశ్రీ రత్న, టెన్త్ క్లాస్ స్టూడెంట్ (హైదరాబాద్) ముందు జాగ్రత్తలు అవసరం లాక్ డౌన్ ప్రభావంతో చాలా మంది పిల్లలు సమాచారం మొత్తం మొబైల్లోనే ఉంటుందన్న ఆలోచనలతో ఇమేజినరీ వరల్డ్‌కి వెళ్తున్నారు. ముఖ్యంగా 13–18 సంవత్సరాల పిల్లలపై ఈ చెడు ప్రభావం ఎక్కువగా ఉంది. నాలెడ్జ్‌కి, ఇన్ఫర్మేషన్కి మధ్య తేడాను గుర్తించే శక్తి టీనేజ్‌లో ఉండదు. బాహ్య ప్రపంచం నుంచి పొందే జ్ఞానం తగ్గిపోతుంది. మొబైల్ వాడకం ఎక్కువ కావడం వల్ల మొబైల్ అడిక్షన్ ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంది. దీన్ని నోమో ఫోబియా అంటారు. వీటికి పరిష్కారమార్గాలు.. ఇంట్లో ఒక టైం టేబుల్ వేసుకుని దాన్ని ఫస్ట్ పేరెంట్స్ పాటించాలి. ఉదాహరణకు ఆన్ లైన్ క్లాస్ ఓ 30 నిమిషాలు ఉంటే.. ఆ టైంలో తప్ప మిగిలిన టైంలో మొబైల్ యూజ్ చేయకుండా చూడాలి. మంచి అభిరుచి ఉన్న పుస్తకాలను చదివేటట్టు చేయాలి. థర్డ్ వేవ్ గురించి పిల్లల్లో ఉన్న భయాలను పొగొట్టాలి. ఫిజికల్‌గా, మెంటల్‌గా ప్రిపేర్ చేయడానికి ధ్యానం, ప్రాణాయామం లాంటివి చేయించాలి. ఐదు నుంచి పది నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయించాలి. పిల్లల రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులదే కాబట్టి వాళ్లతో వీలైనంత ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేయాలి. – డా. గంగం సిద్ధా రెడ్డి, డిస్ట్రిక్ట్ సైకియాట్రిస్ట్ (DMHP), దావణగెరే (జిల్లా), కర్ణాటక విరక్తి పుడుతోంది.. ‘ఒంటరితనంతో బాధపడుతున్నా. విరక్తి పుడుతోంది’ అంటూ.. పదహారేళ్ల ఓ బాలుడి నుంచి ఒక హెల్ప్‌లైన్‌కు వచ్చిన ఫోన్ కాల్ అది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి చెప్పుకున్నాడు. ఇలాంటి కాల్స్ తమకు చాలానే వస్తున్నాయని ‘నేషనల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రుయాల్టీ టు చిల్డ్రన్’ అనే చైల్డ్ హెల్ప్ లైన్ సంస్థ వెల్లడించింది. ‘మనం స్కూళ్లను మూసేసి, పిల్లల జీవితాలనే మూసేశాం’ అని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ ’ అనే సంస్థ ప్రెసిడెంట్, ప్రొఫెసర్ రస్సెల్ వినర్ అభిప్రాయపడ్డారు. దీన్ని బట్టి అర్థమవుతోంది కదా పిల్లల మానసిక సమస్యలకూ వైద్యాలయాలు ఈ విద్యాలయాలు అని. కరోనా కారణంగా అవి మూతపడి పిల్లల మానసిక స్థితి మీద తీవ్ర ప్రభావం పడినట్లు ప్రపంచవ్యాప్తంగా అనేక సర్వేల్లో వెల్లడవుతోంది కూడా. భయపెడుతున్న గణాంకాలు ఈ కాలానికి ముందే సగం బాల్యాన్ని హైజాక్ చేసేసింది ఆధునిక సాంకేతికత. కదలకుండా కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి కసరత్తుకు దూరం చేసింది. సామాజిక సంబంధాలను డిక్షనరీలో ఓ అర్థంగా మార్చింది. ఆ దుష్ప్రభావాలను గ్రహించి ఆ జీవన శైలి నుంచి బయటపడే ప్రయత్నం మొదలుపెట్టామో లేదో ఇప్పుడు కరోనా పూర్తిగా నిర్బంధంలోకి నెట్టేసింది. అటు బడి లేక.. ఇటు ఇంటి బయట ఆటలూ లేక పిల్లల మానసిక, శారీరక వికాసానికి కళ్లెం వేసింది. వాళ్లు ఇంట్లోనే ఉంటూండంతో కుటుంబంలోని ఆర్థిక కష్టాలు, హింస వంటి వన్నీ పిల్లలు ప్రత్యక్షంగా చూస్తూన్నారు. దాంతో తెలియకుండానే ఒత్తిడికి లోనవుతున్నారు. ‘ఈ వైరస్ గురించి వింటుంటే చాలా భయమేస్తోంది. కరోనా వల్లే మా నాన్నకు ఉద్యోగం పోయింది. డబ్బు గురించి ఇబ్బంది పడ్తున్నాం. ఇంట్లో గొడవలెక్కువయ్యాయి. ఇంట్లో ఉండాలంటేనే భయమేస్తోంది. ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్దామన్నా లేదు. లోన్లీగా ఫీలవుతున్నాం..’ అంటూ మధనపడుతు న్నారట చాలామంది చిన్నారులు. ఈ నేపథ్యంలో పిల్లలకు ఇచ్చే కౌన్సిలింగ్ ఇటీవలి కాలంలో పది శాతం పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ‘కుటుంబాల్లో బంధుమిత్రుల రాకపోకల్లేక చిన్నారులకు బయటి మనుషులతో పరిచయాలు తగ్గిపోతాయి. ఆ పరిణామం వారి శారీరక, మానసిక పరిణతిపై ప్రభావం చూపెడుతుందని’ చెప్తున్నారు మానసిక వైద్యనిపుణులు. యునెస్కో లెక్కలు పాఠశాలల్లేని కారణంగా పిల్లలపై హింస, దోపిడీ పెరిగినట్లు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు ఎక్కువైనట్టు, బాల కార్మికులు, టీనేజ్ గర్భిణీలు అధికమైనట్టు యునెస్కో తన నివేదికలో వెల్లడించింది. బళ్లు లేక ఉచిత భోజనం అందక పేద విద్యార్థులు పోషణకు దూరమవుతున్నారనీ తెలిపింది. దీన్నిబట్టి అర్థమైన సత్యం ఏంటంటే.. చదువుకి ఆన్లైన్ ప్రత్యామ్నాయంగా అందినా.. బడికి ఆల్టర్నేట్ లేదు అని. పెంపకంలో చదువు ఒక భాగం మాత్రమే. కాని బడి.. పెంపకానికి సిలబస్. పిల్లల వికాసానికి ఒక ప్రిస్క్రిప్షన్. ఇప్పుడా బాధ్యతను సమాజం తీసుకోవాలి. పిల్లల మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కాపాడాలి. చదవండి: అడ్జస్ట్మెంట్ డిజార్డర్ విత్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ -
పాత వస్తువుల అనుబంధాన్ని పలకరిద్దామా..
ఆధునాతన సౌకర్యం పాత కష్టాన్ని మరిపిస్తుండొచ్చు.. కానీ ఆ కష్టంతో ముడిపడి ఉన్న వస్తువులను కాదు.. అవి కనుమరుగైనా.. కొత్తరూపంతో జీవనశైలిలో భాగమైనా.. జ్ఞాపకాలుగా గుర్తుకొస్తునే ఉంటాయి.. ఆ టైమ్‌ను ఆస్వాదిస్తూ ఆ అనుబంధాన్ని పలకరిద్దాం... సాయం కాలం బడి నుంచి రాగానే చేద బావి.. ఆ గచ్చు మీదున్న ఇత్తడి కొప్పెర గంగాళం, సిమెంట్ తొట్టి ఎదురు చూస్తూండేవి. నీళ్లు తోడి వాటి కడుపు నింపి ఆ పూట పనిలో అమ్మకు ఎంతో సాయం చేసినట్టు హీరోయిక్ పోజుతో బయటకు తుర్రుమని ఆటల్లో పడిపోతే.. మళ్లా ఎప్పుడో ఆకాశంలో చుక్కలు తేలాకే ఇంటిదారి పట్టడం. హడావిడిగా హోమ్ వర్క్ చేసేసి.. వేడివేడిగా భోజనం ముగించేసరికి దొడ్లో చిట్టు పొయ్యి.. వేడి నీళ్ల బాయిలర్ దగ్గర గొడవపడుతూ కనిపించే వాళ్లు అక్క, చెల్లి.. పని వంతులేసుకోవడంలో పేచీ వచ్చి. పొట్టు పొయ్యిలో పొట్టు నింపడం అక్కకు మహా చిరాకు.. అలాగని బాయిలర్‌లో నీళ్లు నింపడాన్నేమీ ఇష్టపడేది కాదు. అలా పోట్లాడి ఆ రెండు పనులూ తన మీదే వేసి చల్లగా జారుకుంటుందని చెల్లి షికాయతు. ఆ అలకలు, అరచుకోవడాలతో పొయ్యిలో పొట్టు నింపే బాధ్యత నానమ్మకు చేరేది. రాత్రి ఆ వాకిట్లో 60 వాల్ట్స్ బల్బు వెలుతురులో పొయ్యిలో రోకలి కర్ర పెట్టి నానమ్మ పొట్టు కూరుతుంటే నాన్న బాయిలర్ నింపేవాడు తెల్లవారి వేడినీళ్ల స్నానాల కోసం. ఈ యాది తడమని చలికాలం ఉండదు. వానాకాలం జ్ఞాపకంలోని చెమ్మ ఇగిరిపోలేదు. చూరు కింద నుంచి వాన నీళ్లు జారుతుంటే.. వసారాలో కూర్చోని.. చురుకులు అంటుతున్నా లెక్కచేయకుండా కుంపట్లోంచి వేడివేడి మొక్క జొన్న కంకులను మొక్క జొన్న బూరులో చుట్టి జల్లును చూస్తూ కంకులను తినే గుర్తూ మెదడును మరిపిస్తూనే ఉంటుంది. పొట్టు పొయ్యి, కుంపటి కనిపించకుండా పోయినా..బాయిలర్ అపురూపమైనా.. కొప్పెర, గంగాళం మాత్రం ఇండోర్ ప్లాంట్స్కి పాట్స్గా మారి ఇంటికి అలంకారంగా మెరుస్తున్నాయి. ట్రింగ్ ట్రింగ్.. సెల్ఫోన్లు పుట్టక ముందు కథ. టెలిఫోన్ల కాలం అది. మనకు కావల్సిన కాంటాక్ట్ చెప్పి కనెక్ట్ చేయమని ఎక్స్చేంజ్కి (చాలా వరకు జిల్లా కేంద్రాల్లో ఇలాంటి వెసులుబాటే ఉండేదప్పట్లో)చెప్పి ట్రింగ్ ట్రింగ్ అంటూ అది పిలిచే వరకు వేచి చూడాల్సి వచ్చేది. మనం ఎవరితోనైనా మాట్లాడాలనుకున్నా.. మనతో ఎవరైనా మాట్లాడాలనుకున్నా ఎక్స్చేంజే నంబర్లు కలిపే రాయబారి. తర్వాత కొన్నాళ్లకు మన ఫోన్ నుంచే నేరుగా నంబర్లు కలుపుకొనే సౌకర్యం పొందినా బయటి ఊళ్లకు మాట్లాడే ట్రంక్ కాల్కి ఎక్స్చేంజే ఆధారం. గంటల తరబడి వెయిటింగ్ తరవాత కలిసే బలహీనమైన లైన్లో గొంతు చించుకొని అరిస్తే కాని అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు మాటలు బదిలీ అయ్యేవి కావు. ఎస్టీడీ కోడ్ ఎంటర్ అయ్యాక చెవుల్లోనే కబుర్లు చెప్పుకునే స్థాయికి తగ్గింది స్వరం. సున్నా నుంచి తొమ్మిది అంకెలను డయల్ సర్కిల్లో సర్ది, మౌత్ పీస్, రిసీవర్ ఉన్న హ్యాండిల్‌ను వినమ్రంగా సెట్ చేసి స్టాండ్ మీది మ్యాటీ ఎంబ్రాయిడరీ గుడ్డ పైన ఒద్దికగా తాను ఒదిగి డ్రాయింగ్ రూమ్ కళను పెంచింది.. కాలనీలో ఆ ఇంటికి ప్రత్యేక హోదాను తెచ్చింది టెలిఫోన్. ఇప్పుడు దాని ఉపయోగం ఇంటర్కమ్కే పరిమితమైనా గత వైభోగం మాత్రం ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉంది. ఎక్కా వెలుతురులో ఎక్కాలు నలభై ఏళ్ల కిందటి వరకూ కరెంటు లేని ఊళ్లెన్నో ఈ దేశంలో. ఆ సమస్యనూ అద్భుతమైన జ్ఞాపకంగా వెలిగిస్తోంది ఎక్కా దీపం(కిరోసిన్ బుడ్డి).. లాంతర్ లైట్. మొన్నటి మొన్నటి దాకా అంటే చార్జింగ్ లైట్ల కాంతి ప్రసరించే దాకా కూడా కరెంట్ పోతే వెలుగు రేఖలను అప్పిచ్చిన సాధనాలు ఎక్కా, లాంతర్లే. ఆ దీపాల కిందే ఎక్కాలను బట్టీ వేసిన బాల్యాన్ని ఎవరు మరిచిపోతారు? ఆ దీపాల కిందే చదువుకొని ఇంతవాళ్లమయ్యామని చెప్పుకునే పెద్దవాళ్ల అనుభవాలను గౌరవం నటిస్తూ విన్న రోజులను ఎలా డిలీట్ చేయగలం? సాయంకాలానికి ముందే లాంతరు, ఎక్కా గాజు బుగ్గలను చక్కగా తుడిచి... వత్తిని సరి చేసి.. సంధ్యవేళ కల్లా సిద్ధం చేసే అమ్మ శ్రద్ధ మరుపు తెప్పించేదా? సిరా బుడ్డీ ఖాళీ అయితేనో.. టానిక్ అయిపోతేనో.. వాటిని పడేయకుడా శుభ్రంగా కడిగి.. పొడిపొడిగా తుడిచి.. అందులో కిరసనాయిలు పోసి.. పాత గుడ్డ పీలకను.. దీపం వత్తిగా మలిచి సీసా మూతకు రంధ్రం చేసి అందులో ఈ వస్త్రవత్తిని బిగించి.. ఎక్కాలా మార్చిన అక్కది మామూలు క్రియేటివిటీనా? రాత్రి గాలి వానకు కరెంటు పోతే .. సైకిల్‌మీద నాన్న ఎలా వస్తున్నాడోనని లాంతరు పట్టుకొని గుమ్మం ముందు కాపుకాసే నానమ్మ ఆత్రం ఇప్పటికీ మనసును తడి చేయదా? వీటన్నిటితో ముడిపడి ఉన్న ఆ రెండూ జీవితాంతం గుర్తుండవూ! ఈ కోవలోనిదే పెట్రోమ్యాక్స్.. ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో బిజిలీగా పరిచయం. పెళ్లిళ్లు. జాతర్లు, ఊళ్లో ఉత్సవాల్లో ఇవే దారి చూపే టార్చి లైట్లు. సీరియల్ బల్బ్ సెట్లు వాటి స్థానాన్ని అక్రమించడంతో అవి మసకబారిపోయాయిప్పుడు. సందుగ సంగతులు ‘దిల్ కీ సందూకోమే మేరే అచ్ఛే కామ్ రఖ్నా.. ’ అని ‘అయ్ దిల్ హై ముశ్కిల్ ’ సినిమాలోని ‘అచ్ఛా చల్తా హూ దువావోమే యాద రఖనా’ అనే పాట పల్లవిలో వస్తుంది. అంటే ‘నీ మనసు పెట్టెలో నా మంచితనాన్ని పదిలం చెయ్’ అని అర్థం. పెట్టె అన్న పదం వింటే ఇప్పటికీ తరం అంతరం లేకుండా యాదికొచ్చేది సందుగ.. అంటే ఇనప్పెట్టే. అప్పటి పెళ్లిళ్లల్లో పుట్టింటి కట్నంలో భాగం.. చదువుకోవడానికి హాస్టల్‌కి వెళితే బట్టలతో సహా వస్తువులను భద్రపరిచే పరికరం.. ఇంకా చెప్పాలంటే ప్రేమలేఖలతో సహా కోడలు పుట్టింటి నుంచి తెచ్చుకున్న అపురూపమైన సంగతులెన్నింటినో ఇంట్లోని అటక మీద దాచే రహస్యం.. ఈ సందుగ. ప్రస్తుతం దీనికి ప్రతిగా ఎన్నో రూపాలు వచ్చాయి.. అయినా దీనికి సాటిరానివవి. వెల ఎక్కువే అయినా దాని విలువ చేయనివవి. నేటికీ చాలా కుటుంబాల్లో పెళ్లి కూతురికి కూడా ఇచ్చి పంపిస్తున్నారు ఈ సందుగను. జ్ఞాపకంగానే కాదు సంప్రదాయంగానూ స్థిరపడిపోయిందిది. మామిడి పీట.. నూతిలో వేట ఇప్పుడు ఊరగాయల సీజన్లో రైతు బజార్లో కాయలు కొట్టించుకోవడానికి బారులు తీరాల్సిన ఆగత్యం కాని.. అప్పుడైతే ఆ అవసరం లేదు. కాలనీలో ఏ ఉమ్మడి కుటుంబంలోనో ఊరగాయల కాయలు కొట్టే పీట ఉండేది. ఊరగాయల సీజన్ అంటే ప్రతి కాలనీకి పండగ కాలమే. ఏ ఇంట్లో ఏ రోజు ఊరగాయలు పెట్టుకోవాలో ముందే షెడ్యూల్ సిద్ధమేపోయేది. ఆ జాబితా ప్రకారం ఆ ఊరగాయలు కొట్టే పీట ఇల్లిల్లూ తిరిగేది. ఆ కాయ పులుపు ఊరగాయ ఉప్పులో ఊరకముందే రుచి చూసేది. కన్సూమరిజం వేళ్లూనూకోని.. అందరూ అన్ని వస్తువులనూ కొనుక్కోగల శక్తి లేని కాలమది. అవసరానికి తగ్గట్టుగా వస్తువులను ఇరుగుపొరుగు నుంచి అరువు తెచ్చుకునే పరిస్థితులవి. అలాంటి లిస్ట్‌లో ఊరగాయల పీట ఉన్నట్టే పాతాళ గరిగా ఉండేది. పాతాళ గరిగ తెలియాలంటే చేద బావి తెలుసుండాలి. ఇప్పటిలా ఇంటింటికీ బోర్వెల్ ఉండేదికాదప్పుడు. ఇంటింటికీ నుయ్యి ఉండడమూ గొప్పే. ఆ నుయ్యిలోంచి నీళ్లు తోడుకోవడానికి దానికో చేద.. అది బరువు కాకుండా ఉండడానికి బావికో గిలకా ఉండేవి. మరి ఈ పాతాళ గరిగేంటీ? స్నానాల దగ్గర్నుంచి గిన్నెలు తోముకోవడం, బట్టలు ఉతుక్కోవడం వరకు అన్నీ బావి దగ్గరే జరిగేవి. కడిగిన గిన్నెలు బావి గట్టు మీదే బోర్లించడం, గుడ్డలు పిండుతూ బావి గట్టు మీదే పెట్టడం.. ఇలా ప్రతి పనికి తొలి ఆసరా నూతి గట్టే. అలా గట్టు మీద పెట్టిన ఆ వస్తువులు ఒక్కోసారి చేయి తగిలి బావిలో పడిపోయేవి. నీటి చేద కూడా గిలక మీద నుంచి గిర్రునజారి నూతిలో పడిపోయేది. నీళ్లలోంచి వాటిని తీసే సాధనమే పాతాళ గరిగ. వస్తువులు కాని, చేద కాని బావిలో పడిందంటే ఇంట్లో పిల్లలకు మహా సరదా. సర్రున పక్కింటికి పరిగెత్తి.. పాతాళ గరిగను మోసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్లు. దానికి తాడు కట్టి.. బావిలోకి దింపితే నీళ్లలో మునిగిన వాటన్నిటినీ కొక్కాలకు తగిలించుకుని దర్జాగా పైగి వచ్చేది. ఈ తతంగాన్ని సంబరంగా తిలకించేవాళ్లు పిల్లలు. పైగా పాతాళ గరిగ నీటిలో మునగంగానే ఆకతాయిగా తమ వస్తువులనూ బావిలో వేసేవాళ్లు.. ‘అయ్యో నా బొంగరం పడిపోయింది..’, ‘ ఆ.. నా రబ్బర్ పడిపోయింది..’, ‘నా పెన్సిల్..’ అంటూ! ఇప్పుడు ఇవన్నీ ఆ కాలంలోకి తీసుకెళ్లే టైమ్ మెషీన్ గుర్తులే. అలా వస్తువులను అరువు తెచ్చుకోవడం అప్పుడు నామోషీ కాదు. అదొక అనుబంధం. ఇరుగుపొరుగు మధ్య స్నేహాన్ని పెంచి మానవసంబంధాలను మెరుగుపరిచి.. కాలనీని ఓ కుటుంబంగా చేసిన ఆత్మీయ సాధనం. తిరగలి.. పొత్రం.. పొన్ను రోకలి మధ్యాహ్నం భోజనం కోసం బడి నుంచి ఇంటికి రాగానే అరుగు మీద ఆడవాళ్లు తిరగలిలో మినుములో, శనగలో, గోధుమలో విసురుతూ కబుర్లాడే దృశ్యం కనిపించేది. ఎంత విసురుగా తిప్పినా లయబద్ధంగా తిరుగుతూ.. శ్రుతిలో సన్నగా సడి చేస్తూ ఉండేది తిరగలి. పొత్రం అలా కాదు... రోట్లో ఎంత మెత్తటి వస్తువు వేసినా గరగరమంటూ నలగ్గొట్టడమే! రోకలి సంగతి వేరే చెప్పాలా? వడ్లు, పసుపు కొమ్ములు, మిరపకాయలు ఏవైనా సరే ‘ఆ.. హు’ అంటూ పడే దాని వేటుకు కొన్ని పొట్టు వదుల్చుకుంటే.. మరికొన్ని కాటుకలా మారేవి. టెక్నాలజీ కనిపెట్టిన పిండి మర, గ్రైండర్లలో పడి కొన్నాళ్లు మాయమైనా అవి అలవాటు చేసిన టేస్ట్ ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇవ్వకపోయేసరికి రెట్రో ట్రెండ్‌గా మళ్లీ వాడకంలోకి వచ్చాయి. ఇంకా ఇవి కూడా... వేళకాని వేళ సైకిల్ మీద పోస్ట్ మ్యాన్ ఫాస్ట్‌గా వస్తున్నాడంటే గుండె దడదడలాడేది.‘సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియెట్లీ’ అని రాసున్న కాగితాన్ని ‘టెలిగ్రామ్’ అంటూ చేతిలో పెడతాడేమోనని. ఆ కబురు ఇటీవలే ఆగిపోయింది అధికారికంగా. వేడివేడి టీని కప్పుల్లోకి వంపే ఇండాలియం లోహపు పాత్ర ‘టీ కెటిల్’, సోషల్ మీడియా ఆగమనంతో మార్కెటింగ్ స్టంట్‌గా వచ్చిన గ్రీటింగ్ కార్డ్స్, సినిమా ప్రొజెక్టర్, కాయిన్ బాక్స్ ఫోన్, అయిదు, పది, ఇరవై, పావలా, యాభై పైసల బిళ్లలు, పందిరి మంచం, పడక్కుర్చీ, పాన్దాన్, ఇంటి ఆర్కిటెక్చర్లో భాగమైన పొగగొట్టం, కిరసనాయిలు స్టవ్ వంటివెన్నో వాడకంలో లేకుండా నోస్టాల్జియా మ్యూజియంలో వస్తువులుగా కొలువుతీరాయి. జ్ఞాపకాల తీపి ఊటతో మనసును నింపుతున్నాయి. స్మైల్ ప్లీజ్.. టకటకా ఫొటోలు తీసేసుకొని నచ్చినవి అట్టేపెట్టుకొని నచ్చనివి డిలిట్ చేసే అడ్వాంటేజ్ లేదు ఈ ‘స్మైల్ ప్లీజ్’కి. ఒకటికి పదిసార్లు బ్యాక్‌గ్రౌండ్, సబ్జెక్ట్‌ను చెక్ చేసుకొని అప్పుడు ‘క్లిక్’ మనిపించాలి. ఫొటో తీశాక వెంటనే మానిటర్లో చూసుకునే వెసులుబాటూ ఉండదు. ఎందుకంటే అది డిజిటల్ యుగం కాదు. ఫిల్మ్ యుగం. ఆ రోల్ పూర్తయ్యాక మాత్రమే కెమెరాలోంచి తీసి స్టూడియోలో ఇస్తే డెవలప్ చేసి ఫొటోలుగా కవర్లో పెట్టి ఇచ్చేవారు. ఆ జ్ఞాపకాల ఆల్బంలోనే ఫ్రేమ్ అయింది ‘ఫిల్మ్ రోల్’ కూడా. గ్రామప్రజలకు తెలియజేయునది ఏమనగా.. ... అంటూ దండోరాను ఈజీ చేసిన ఘనతనూ.. ఆ కొలువును తీసేసిన అప్రతిష్టనూ గొంతుక్కట్టుకున్నది మైకు. ఊళ్లోని పంచాయతీ ఆఫీస్ మీదనో... కూడలిలోని రావి చెట్టుకో వేళ్లాడుతూ ఉదయం సుప్రభాతం మొదలు గ్రామపంచాయతీ దండోరాలు, ఊరుమ్మడి పండగలు, జాతర్లలోని ప్రకటనలు, రేడియోలోని పాడిపంట, బాలానందం కార్యక్రమాల వరకు అన్నిటినీ గ్రామ ప్రజలకు వినిపించే ఆ మైక్ కూడా మూగపోయి అలంకారప్రాయమైందిప్పుడు. పాటలే కాదు సినిమానూ వినిపించింది .. అనగానే స్ఫురణకు వచ్చేది టేప్‌రికార్డరే. ఇది ఏలిన కాలం అంతాఇంతా కాదు. చిన్నపిల్లల నుంచి వయసు పైబడ్డ వాళ్లందరి వరకు తన పాటలు, మాటలతో అందరినీ మురిపించింది. రికార్డింగ్ సెంటర్లు, క్యాసెట్ దుకాణాలకు జన్మనిచ్చింది. ఇష్టమైన పాటలను క్యాసెట్లో ‘‘నింపించుకోవడం’’ ఒక కార్యక్రమం. ఇంటికొచ్చి ఆ పాటలను వినడం ఒక వ్యాపకం. పాటలే కాదు.. సినిమాలకూ క్యాసెట్స్ రూపం ఇచ్చింది ఇది. పండగలు, పబ్బాలు అయితే టేప్రికార్డర్లే అప్పటి డీజేలు. సాంకేతిక యుగంలో అత్యంత వేగంగా రూపాంతరం చెంది ఇప్పుడు యాప్స్‌గా కనిపిస్తోంది. కాని ఎక్కువ కాలం ఉనికిని వినిపించింది టేప్‌రికార్డరే. -
36 గ్రహాలపై మనలాగే మరికొందరు!
భూమ్మీద మన మనుషులం మనుగడ సాగిస్తున్నాం. విశాల విశ్వంలో భూమిలాంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. భూమిలాంటి గ్రహాలు ఉన్నప్పుడు, మనుషుల్లాంటి జీవులు మరోచోట ఉండొచ్చు కదా! ఈ విషయమై మనుషుల్లో చిరకాలంగా కుతూహలం దాగి ఉంది. దీని నివృత్తి కోసం కొందరు అన్వేషణ సాగిస్తున్నారు. ఈ అన్వేషణలో అనేక విషయాలు అడపాదడపా బయటపడుతూనే ఉన్నాయి. టెలిస్కోప్‌లు, ఉపగ్రహాల సాయంతో భూమిలాంటి కొన్ని గ్రహాలనైతే శాస్త్రవేత్తలు ఇంతవరకు గుర్తించగలిగారు గాని, మనుషుల్లాంటి గ్రహాంతర జీవులను మాత్రం గుర్తించలేకపోయారు. అంతమాత్రాన గ్రహాంతర జీవుల ఉనికిని కొట్టిపారేయడానికి కూడా వీల్లేదని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. అంతరిక్షంలోని ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. భూమిని పోలిన గ్రహాల గురించి, సౌర కుటుంబానికి వెలుపల ఉన్న మరికొన్ని గ్రహాలపై జీవించే గ్రహాంతర జీవుల ఉనికి గురించి రకరకాల కథనాలూ ఊహాగానాలూ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీటిపై బోలెడంత కాల్పనిక సాహిత్యం ఉంది. కొన్ని సినిమాలూ ఉన్నాయి. వీటన్నింటికీ మించి భూమిని పోలిన గ్రహాల గురించి, గ్రహాంతర జీవుల గురించి అడపాదడపా శాస్త్రవేత్తలు చెబుతున్న అంచనాకు సంబంధించిన కథనాలు కూడా పత్రికలు, టీవీ చానళ్ల ద్వారా జనాలకు తెలుస్తూనే ఉన్నాయి. మనం నివసిస్తున్న భూమి మీద తప్ప మరెక్కడా తెలివి గల మనుషుల్లాంటి జీవులు ఉండే అవకాశమే లేదంటూ అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ మూడేళ్ల కిందట కొట్టిపారేసింది. అప్పటి ‘నాసా’ వాదనకు భిన్నమైన కథనాలు ఇటీవల వెలువడుతుండటం విశేషం. భూమిలాంటి గ్రహాలు 600 కోట్లు! అనంత విశ్వంలో భూమిని పోలిన గ్రహాలు ఏకంగా సుమారు ఆరువందల కోట్ల వరకు ఉన్నాయని శాస్త్రవేత్తల తాజా అంచనా. అంతేకాదు, అలాంటి వాటిలో కనీసం ముప్పయ్యారు గ్రహాలపై మనుషుల్లాగే తెలివితేటలు కలిగిన జీవులు ఏర్పరచుకున్న నాగరికతలు మనుగడలో ఉండవచ్చని కూడా వారి అంచనా. భూమిలాంటి గ్రహాల గురించి, గ్రహాంతర జీవుల ఉనికి గురించి శాస్త్రవేత్తలు ఇటీవల వెల్లడించిన వివరాలను తెలుసుకుందాం... సూర్యుని కేంద్రంగా భూమి సహా తొమ్మిది గ్రహాలు, ఈ గ్రహాలలోని కొన్నింటి ఉపగ్రహాలతో కూడి ఉన్న సౌర కుటుంబం విశాల విశ్వంలోని ఒక గెలాక్సీలో ఉన్న విషయం చాలామందికి తెలిసినదే. మన గెలాక్సీ పేరు ‘మిల్కీవే’. దీనినే తెలుగులో ‘పాలపుంత’ అని పిలుచుకుంటున్నాం. అంతరిక్షంలో ఇలాంటి అనేక గెలాక్సీలు ఉన్నాయి. భూమిలాంటి ఆరువందల కోట్ల గ్రహాలు ఎక్కడెక్కడో వేర్వేరు గెలాక్సీలలో కాదు, మన గెలాక్సీలోనే ఉన్నాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఇదే గెలాక్సీలో సూర్యుని పోలిన నక్షత్రాలు అనేకం ఉన్నాయి. అలాంటి నక్షత్రాల చుట్టూ గ్రహాలు కూడా ఉన్నాయి. సూర్యుని పోలిన ప్రతి ఐదు నక్షత్రాల్లో ఒక దాని చుట్టూ భూమిలాంటి గ్రహాలు తిరుగుతూ ఉన్నాయని, వాటిలో కొన్నింటి పరిమాణం భూమిలో సగం నుంచి భూమికి రెట్టింపు వరకు ఉన్నాయని కెనడాలోని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల తమ తాజా అంచనాను వెల్లడించారు. భూమిలాంటి ఆ ఆరువందల కోట్ల గ్రహాలపైనున్న నేల ఆవాసయోగ్యంగా ఉన్నట్లు కూడా వారు చెబుతున్నారు. ‘నాసా’ కెప్లార్ మిషన్ పంపిన సమాచారాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ విషయమై ఒక అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. ఈ అంచనాకు ఎలా వచ్చారంటే..? మన పాలపుంతలో దాదాపు 40,000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. వీటిలో సూర్యుడిని పోలిన నక్షత్రాలు 7 శాతం ఉన్నాయి. సూర్యుడిని పోలిన నక్షత్రాలను ‘జీ–టైప్’ నక్షత్రాలని శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఇలాంటి జీ–టైప్ నక్షత్రాలు దాదాపు 2800 కోట్లు. వాటన్నింటికీ వాటి వాటి గ్రహ వ్యవస్థలు ఉన్నాయి. సుమారుగా ప్రతి ఐదు జీ–టైప్ నక్షత్రాలలో ఒక దాని చుట్టూ తిరుగుతున్న గ్రహాల్లో భూమిని పోలిన గ్రహాలు కూడా ఉన్నాయి. ఈ లెక్కన మన పాలపుంతలో భూమిలాంటి గ్రహాలు కనీసంగా సుమారు 560 కోట్లు ఉంటాయని, కాస్త అటు ఇటుగా చూసుకుంటే ఇవి దాదాపు 600 కోట్ల వరకు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయని బ్రిటిష్ కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఖగోళ శాస్త్రవేత్త జేమీ మాథ్యూస్ చెబుతున్నారు. మన పాలపుంతలో భూమిని పోలిన దాదాపు 600 కోట్ల గ్రహాలపైనున్న నేల, వాటిపై వాతావరణం ఆవాస యోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని ఆయన అంటున్నారు. ఇదివరకటి పరిశోధనల్లో పాలపుంతలోని సూర్యుని వంటి ‘జీ–టైప్’ నక్షాత్రాల చుట్టూ తిరిగే గ్రహాల్లో భూమిని పోలిన గ్రహాలు 0.02 శాతం వరకు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే, తాజా అంచనాల ప్రకారం ఇవి 7 శాతం వరకు ఉండవచ్చని భావిస్తున్నారు. జేమీ మాథ్యూస్ నేతృత్వంలోని బ్రిటిష్ కొలంబియా వర్సిటీ పరిశోధకుల తాజా అధ్యయనాన్ని ‘ది అస్ట్రోఫిజికల్ జర్నల్’ గత నెల ప్రచురించింది. గ్రహాంతర వాసుల ఉనికిపై అంచనా మన సౌర కుటుంబం ఏర్పడి దాదాపు 450 కోట్ల ఏళ్లు గడిచాయి. మరో వంద కోట్ల ఏళ్లు గడిచాక– అంటే సుమారు 350 కోట్ల ఏళ్ల కిందట భూమిపై జీవం ఆవిర్భవించింది. దాదాపు 2 లక్షల ఏళ్ల కిందట మనుషుల ఆవిర్భావం జరిగింది. నానా పరిణామాల తర్వాత సుమారు 6 వేల ఏళ్ల కిందట నాగరికతలు ఏర్పడ్డాయి. ఇదే లెక్కన మన పాలపుంతలోని సూర్యుని పోలిన గ్రహాలలో దాదాపు సూర్యుని వయసు గల నక్షత్రాలు, వాటి చుట్టూ తిరిగే భూమిని పోలిన గ్రహాలలో దాదాపు 36 గ్రహాలపై మానవులను పోలిన తెలివితేటలు గల జీవులు ఉండటానికి ఆస్కారం ఉందని బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్హామ్కు చెందిన అస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ కాన్సెలైస్ చెబుతున్నారు. గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించి ఈ విధంగా అంచనా కట్టే పద్ధతిని ‘అస్ట్రోబయోలాజికల్ కోపర్నికన్ లిమిట్’ అంటారని ఆయన వివరిస్తున్నారు. ఇదివరకటి కాలంలో గ్రహాంతరవాసుల గురించిన అంచనాలను వెల్లడించడానికి శాస్త్రవేత్తలు గ్రహాంతర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్‌పై ఆధారపడేవారు. గ్రహాంతర ప్రదేశాల నుంచి భూమిపైకి సిగ్నల్స్ వచ్చిన సందర్భాలు ఉన్నా, గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు మాత్రం ఇప్పటి వరకు దొరకలేదు. అయితే, నాటింగ్‌హామ్ శాస్త్రవేత్తలు పాత పద్ధతిలో కాకుండా, మనం ఉంటున్న భూమి మీద అధునాతన మానవ సమూహాలు ఏర్పడటానికి పట్టిన కాలాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. ఇదే లెక్కన సూర్యుని పోలిన మిగిలిన నక్షత్రాల చుట్టూ తిరిగే భూమిలాంటి గ్రహాలపై దాదాపు ఎన్నిచోట్ల మానవులను పోలిన తెలివైన జీవుల సమూహాలు ఉండటానికి వీలుంటుందో ఒక అంచనాను రూపొందించారు. మానవుల్లాంటి తెలివైన గ్రహాంతర జీవులకు ఆవాసానికి ఆస్కారమున్న గ్రహాలు భూమి నుంచి సుమారు 17 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు చెబుతున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి కోసం జరిపే తమ పరిశోధనలో వారి ఉనికి ఒకవేళ బయటపడినా, దాని ప్రయోజనం అంతవరకే పరిమితం కాదని ప్రొఫెసర్ కాన్సెలైస్ అంటున్నారు. గ్రహాంతరవాసుల ఉనికి ఎక్కడైనా ఆధారాలతో సహా ధ్రువీకరించుకోగలిగితే, భూమిపై మానవ నాగరికత ఇంకెన్నాళ్లు మనుగడ సాగించగలదో అంచనా వేయడానికి వీలవుతుందని ఆయన చెబుతున్నారు. పాలపుంతలో భూమ్మీద తప్ప మరే గ్రహంపైనా నాగరిక సమూహాలు మనుగడలో లేవని ఒకవేళ రుజువైతే, మానవాళికి అది అంత మంచి సమాచారం కాదని కూడా అంటున్నారు. అలా కాకుండా, పాలపుంతలోని మరికొన్ని గ్రహాలపై కూడా నాగరిక సమాజాలు మనుగడలోనే ఉన్నట్లు రుజువైతే, మానవాళికి అంతకు మించిన శుభవార్త ఉండదని, అదే గనుక జరిగితే, ఇప్పటి శాస్త్రవేత్తలు కొందరు అంచనా వేస్తున్నట్లుగా భూమిపై మనుషుల మనుగడ మరికొద్ది వందల ఏళ్లకే పరిమితం కాకుండా, ఇంకా చాలాకాలం కొనసాగగలదని ప్రొఫెసర్ కాన్సెలైస్ అభిప్రాయపడుతున్నారు. విశ్వాసాల నుంచి పరిశోధనల దిశగా... గ్రహాంతరవాసుల ఉనికిపై ఆలోచనలు ఈనాటివి కావు. ప్రాచీన నాగరికతలు పుంజుకున్న కాలంలోనే గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించిన ఊహలు, కల్పనలు మనుషుల్లో ఉండేవి. సూర్యుని వంటి నక్షత్రాలు, భూమిలాంటి గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఉంటాయనే విశ్వాసం ఉండేది. భూమిలాంటి గ్రహాలు మరికొన్ని ఉన్నాయని, వాటిపైనా మనుషులను పోలిన జీవులు ఉంటారనే ఊహలు, వాటికి సంబంధించిన వర్ణనలు వివిధ దేశాల పురాణాల్లో కనిపిస్తాయి. గ్రహాంతరాలలో మానవుల వంటి తెలివైన జీవులకు సంబంధించిన విపులమైన వర్ణనలు ప్రాచీన జైన గ్రంథాల్లో ఉన్నాయి. గ్రహాంతరవాసులకు సంబంధించిన ప్రస్తావనలు ఉన్న తొలి గ్రంథాలు జైన గ్రంథాలేనని చరిత్రకారుల అంచనా. భూమిపై మాత్రమే కాకుండా, విశాల విశ్వంలోని మరికొన్ని గ్రహాలపై కూడా మానవుల వంటి జీవులు ఉంటారని బలంగా విశ్వసించే వాదం వ్యాప్తిలోకి వచ్చింది. దీనినే ‘కాస్మిక్ ప్లూరలిజం’ అంటారు. మధ్యయుగాలకు చెందిన ముస్లిం రచయితలు ఫక్ర్ అల్ దిన్ అల్ రాజి, మహమ్మద్ అల్ బకీర్ వంటివారు తమ రచనల్లో ‘ఖురాన్’ నుంచి ఆధారాలను చూపుతూ ‘కాస్మిక్ ప్లూరలిజం’ భావనను సమర్థించారు. పదిహేనో శతాబ్దికి చెందిన ఇటాలియన్ ఖగోళవేత్త కోపర్నికస్ విశ్వం నమూనాను రూపొందించిన తర్వాత ‘కాస్మిక్ ప్లూరలిజం’ సిద్ధాంతాన్ని జనాలు మరింత బలంగా నమ్మడం ప్రారంభించారు. కోపర్నికస్ తర్వాతి కాలంలో ఇంగ్లిష్ వైద్యుడు, తత్వవేత్త జాన్ లాకె, ఇటాలియన్ ఖగోళవేత్త, తత్వవేత్త గియార్దానో బ్రూనోలతో పాటు ఆధునిక కాలంలో బ్రిటిష్ సంతతికి చెందిన జర్మన్ ఖగోళవేత్త విలియమ్ హెర్షెల్ వంటివారు సైతం ‘కాస్మిక్ ప్లూరలిజం’ భావనను సమర్థిస్తూ వచ్చారు. టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భూమికి చేరువలో ఎక్కడైనా జీవరాశులు ఉండకపోతాయా అనే అన్వేషణ ప్రారంభమైంది. తొలినాటి టెలిస్కోప్‌ల పరిమితుల మేరకు నాటి శాస్త్రవేత్తలు కొంత దూరం వరకు మాత్రమే చూడగలిగేవారు. అలాంటి ప్రయత్నాలు చేసిన వాళ్లలో పంతొమ్మిదో శతాబ్ది తొలినాళ్లకు చెందిన అమెరికన్ ఖగోళవేత్త పెర్సివాల్ లోవెల్ అంగారకునిపై కృత్రిమంగా నిర్మించిన కాలువలు తనకు కనిపించాయని ప్రకటించాడు. అంగారకునిపై నాగరిక ప్రపంచం ఉందనేందుకు ఇదే నిదర్శనమనే వాదన వినిపించాడు. ఈ విషయమై ఏకంగా ‘మార్స్ అండ్ ఇట్స్ కెనాల్స్’ అంటూ పుస్తకమే రాసి పడేశాడు. తర్వాతి కాలంలో మరింత శక్తిమంతమైన టెలిస్కోప్‌లతో చేసిన పరిశోధనల్లో ఇది తప్పని తేలింది. అంగారకుని ఉపరితలంపై గల ఎత్తుపల్లాల్లోని వెలుగునీడలను చూసి లోవెల్ అపోహపడి ఉంటాడని శాస్త్రవేత్తలు తేల్చారు. ఒకవైపు టెలిస్కోప్‌ల ద్వారా అన్వేషణ కొనసాగిస్తూనే, మరోవైపు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను కూడా పంపడం మొదలయ్యాక గ్రహాంతర జీవుల కోసం అన్వేషణ మరింత ముమ్మరమైంది. సౌర కుటుంబంలోనే ఇంకెక్కడైనా మానవుల మనుగడకు ఆస్కారం ఉండే ప్రదేశాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి గడచిన శతాబ్దకాలంగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ ప్రయత్నాల్లో భాగంగా సాగుతున్న పరిశోధనల్లో నానాటికీ కొత్త కొత్త విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో ఒక అధ్యయనం బుధగ్రహంపై కొన్ని ప్రదేశాలు ఆవాసయోగ్యంగా ఉన్నట్లు వెల్లడించింది. భూమికి దగ్గరగా ఉండే శుక్ర, అంగారక గ్రహాలపై కూడా జీవజాలం ఆచూకీ కోసం శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తూనే ఉన్నారు. అలాగే, సౌర కుటుంబంలోనివే అయిన గురుగ్రహానికి ఉపగ్రహమైన ‘యూరోపా’, శనిగ్రహానికి ఉపగ్రహాలైన ‘ఎన్సెలాడస్’, ‘టైటాన్’వంటి వాటిపై జీవం మనుగడకు అవకాశం ఉండవచ్చని ఇప్పటి వరకు దొరికిన ఆధారాల నేపథ్యంలో అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మన పాలపుంతలోనే భూమిని పోలిన మరో ముప్పయ్యారు గ్రహాలపై గ్రహాంతరజీవులు ఉండవచ్చన్న తాజా అంచనా వెలుగులోకి రావడం విశేషం. గ్రహాంతర పరిశోధనల కోసం ‘నాసా’ రోబోలు! గురుని ఉపగ్రహమైన యూరోపా, శని గ్రహానికి ఉపగ్రహాలైన ఎన్సెలాడస్, టైటాన్ల ఉపరితల విశేషాలను తెలుసుకోవడానికి అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ రోబోలను పంపాలని భావిస్తోంది. భూమి కంటే భిన్నమైన గురుత్వాకర్షణ, ఎగుడుదిగుడు ఉపరితలాలతో నిండి ఉన్న వీటిపై సునాయాసంగా సంచరించడం ఇప్పటివరకు వినియోగంలో ఉన్న రోవర్లకు సాధ్యం కాదనే అంచనాతో ‘నాసా’కు చెందిన జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీ ఈ రోబోలను ప్రత్యేకంగా ఫుట్‌బాల్ ఆకారంలో రూపొందించడానికి సమాయత్తమవుతోంది. ఈ రోబోలకు ‘స్పారో’ (స్టీమ్ ప్రొపెల్డ్ అటానమస్ రిట్రీవల్ రోబోస్ ఫర్ ఓషియానిక్ వరల్డ్స్) అని నామకరణం కూడా చేశారు. ఇవి ఎలాంటి ఎగుడుదిగుడు ఉపరితలాలపైన అయినా కప్ప మాదిరిగా దుముకుతూ సంచరించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూరోపా, ఎన్సెలాడస్, టైటాన్ల ఉపరితలాలపై గడ్డకట్టి పేరుకుపోయిన మంచు అడుగున ఉప్పునీటి సముద్రాలు ఉండవచ్చని వారు అంచనా వేస్తున్నారు. గురు, శని గ్రహాలకు చెందిన ఉపగ్రహాలపైకి ‘స్పారో’ను పంపినట్లయితే, మరిన్ని విశేషాలు బయటపడగలవని ఆశిస్తున్నారు. - పన్యాల జగన్నాథదాసు -
ఎందుకీ ఆత్మహత్యలు
గూడు కట్టుకున్న దిగులు మాటలతోనే బద్దలవుతుంది.. మనసు తేలికపడుతుంది బతుకు మీద నమ్మకం కలుగుతుంది.. జీవిక పట్ల ఆశ మొదలవుతుంది.. ఇప్పుడు ఈ ప్రపంచానికి కావల్సింది ఆ దిగులు దిబ్బను పగలకొట్టే మాటల డైనమైట్ .. యెస్.. మౌనంతో ముడుచుకుపోయిన మనసును పెకల్చే ఆ డైనమైటే డైలాగ్ ... మనుషుల మధ్య స్నేహాన్ని.. సంబంధాల మధ్య అనుబంధాలను పెంచే డైలాగ్ ఉండాలి.. డైలాగ్‌లేని డార్క్‌నెస్‌లో ముందుగా కూరుకుపొయ్యేది గ్లామర్ వరల్డే... ఆ దుష్ప్రభావమే సినిమా సెలెబ్రిటీల సూసైడ్స్.. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య(14జూన్, 2020) కలవరపెట్టింది. బయటకు కనిపించే కారణాల వరకు అవకాశాల్లేకుండా లేడు. చేతిలో రెండు సినిమాలున్నాయట. ఇప్పటి వరకు చేసినవీ పేరునే కాదు డబ్బునూ ఆర్జించినవే. మరి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను బట్టి ఒంటరితనం, డిప్రెషన్ అని అంచనావేస్తున్నారు. డిప్రెషన్‌కు సినిమా తారలు కొత్తకాదు.. సినిమా తారలకూ డిప్రెషన్ పాత కంపానియనే. హీరో, హీరోయిన్లుగా కాక నటీనటులుగా నిలిచిపోయిన అనాటి కళాకారులు చాలా మందికి తర్వాత కాలంలో వేషాలు కరువై డిప్రెషన్ ఫ్రెండ్ అయింది. వెండితెర వెలుగుల నీడగా మారిన వాళ్లను ఆర్థిక కష్టాలూ ఆటోగ్రాఫ్ అడిగాయి. డీలా పడిపోలేదు. మనసు విప్పి మాట్లాడారు. తాము అనుభవిస్తున్న క్షోభను తోటివారితో పంచుకున్నారు. మాట సాయం, నైతిక స్థైర్యం పొందగలిగారు. గెలుపు, ఓటములు కాదు బతకడం ముఖ్యం అని ముందుకు సాగారు. సంపాదించిన కీర్తిని కాదు బతకాలన్న కాంక్షను సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు టీవీ లేదు.. ప్రైవేట్ చానల్స్ ఊహే అందలేదు. గ్రీన్ రూమ్ తప్ప ఇంకో చోటులో ఇమడలేరు. షూటింగ్ స్పాట్ కాకుండా మరో ప్రపంచం తెలియదు. అంటే ఇంకో ఉపాధి ఊసే లేకపోయినా.. రాకపోయినా బతికారు. ప్రాణం పెట్టుకున్న అభిరుచి జీవిత కాలం భరోసా ఇవ్వకపోయినా దాన్ని వృత్తిగా ఆస్వాదించిన క్షణాలనే నెమరువేసుకుంటూ స్నేహితులను పెంచుకుంటూ జీవించారు. ఈరోజుకీ వాళ్లను తలుచుకుంటోంది కేవలం వాళ్లలోని ప్రతిభతోనే కాదు సమస్యల్లో వాళ్లు ప్రదర్శించిన ధైర్యానిక్కూడా. ఈ స్ఫూర్తే కదా అభిమానులకు కావాల్సింది! ఈ హీరోయిజానికే కదా ఫేవరెట్స్ పెరగాల్సింది. పరిమితి చెదిరి పరిధి పెరిగింది.. ఇదివరకటితో పోలిస్తే అవకాశాలు మెండు. రెమ్యునరేషనూ సంతృప్తికరంగానే ఉంటోంది. ఫాలోయింగ్ ఉన్నప్పుడే లైఫ్‌ను సెటిల్ చేసుకోవాలనే ఎరుకా హెచ్చింది. ఈ సంపాదనను మరో రంగంలో మదుపుగా పెట్టాలనే ఆలోచనా వచ్చింది. పాతతరం నటీనటుల్లా ఎముకలేని దానాలతో కష్టార్జితాన్ని కరిగించుకోవట్లేదు. అవసరం ఉన్నప్పుడు మాత్రం చేయి అందివ్వడానికి వెనకంజ వేయడంలేదు. ఇంతగా ప్లాన్ చేసుకున్న ఈ షెడ్యూల్లో హఠాత్తుగా ఆత్మహత్యలెందుకు ప్లేస్ అవుతున్నాయి? నటనా తృష్ణకు ఈ రోజు సినిమా ఒక్కటే మాధ్యమంగా లేదు. థియేటర్ ఒక్కటే ప్రామాణికంగా కనిపించడం లేదు. ప్రైవేట్ చానెల్స్ వస్తూవస్తూనే సీరియళ్లు, రియాలిటీ షోలతో చాన్స్‌లు చూపించాయి. మాధురి దీక్షిత్, శిల్పా శెట్టి, సొనాలి బెంద్రె, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్స్, జావేద్ జఫ్రీ, అనుపమ్ ఖేర్ (సమ్‌థింగ్ సే టు అనుపమ్ అంకుల్), కిరణ్ ఖేర్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, అనురాగ్ బసు, అను మాలిక్ వంటి దర్శకులు, సంగీత దర్శకులూ ఈ స్పేస్‌ను ఉపయోగించుకుంటున్నారు. ప్రేక్షకులు తమను మరిచిపోకుండా చూసుకుంటున్నారు. అంతెందుకు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తో అమితాబ్‌ను ‘బిగ్ బి’గా నిలబెట్టింది ఈ స్మాల్ స్క్రీనే కదా. సల్మాన్ ఖాన్, సంజయ్‌దత్‌లు ‘బిగ్ బాస్’ను నిర్వహించారు. ఆ ప్రేరణతో దక్షిణాది భాషల్లోనూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ .. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ని ఆడించారు. ‘బిగ్‌బాస్’నూ నడిపించారు. ఇప్పుడు ప్రతి చానెల్లోని దాదాపు అన్ని రియాలిటీ షోలకు సినిమా తారలే యాంకర్లు. ప్రేక్ష మోహతా క్రైమ్ పెట్రోల్ (క్రైమ్ సీరియల్) యాక్టర్. వయసు 26 ఏళ్లు. ఇండోర్‌లోని తన ఇంట్లో మొన్న (2020) మే, 26న ఉరితో జీవితాన్ని అంతం చేసుకుంది. కెరీర్‌కు సంబంధిం చిన ఆందోళన, నిరాశ, వ్యాకులతతో బాధపడుతున్నట్టు సూసైడ్ నోట్లో రాసింది. కుశల్ పంజాబీ మోడల్, సినిమా, టీవీ నటుడు. 2019, డిసెంబర్ 26న ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం.. డిప్రెషనే. నితిన్ కపూర్ తెలుగు సినిమాల నిర్మాత. 2017, మార్చి 14న పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. అతనూ మానసిక అనారోగ్యంతో బాధపడ్డట్టు సమాచారం. ప్రత్యూష బెనర్జీ ‘బాలికా వధు’ సీరియల్లో ఆనంది పాత్రతో ప్రాచుర్యం పొందిన నటి. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ కూడా. 2016, ఏప్రిల్ 1న ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష రాయుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ పొందిన తెలుగు నటి. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ అయ్యే సమయంలో 2002, ఫిబ్రవరి 2న ఆత్మహత్యతో జీవితానికే ముగింపు చెప్పుకుంది. కారణం ప్రేమ వ్యవహారమే. రంగనాథ్ ఒకప్పటి తెలుగు హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాదాపు 300 పై చిలుకు చిత్రాల్లో నటించిన రంగనాథ్ 2015, డిసెంబర్ 19న బలవన్మరణంతో ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఉదయ్ కిరణ్ ‘చిత్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ తో ఫేవరేట్ యాక్టర్‌గా మారాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల డిప్రెషన్‌కు లోనై 2014, జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు. ఫటాఫట్ జయలక్ష్మి తెలుగు, తమిళ, మలయాళ నటి. అంతులేని కథలో ఆమె పోషించిన పాత్ర ఊతపదం ఫటాఫట్. దాంతో ఆమె స్క్రీన్ నేమ్ ‘ఫటాఫట్ జయలక్ష్మి’ అయింది. లవ్ ఫెయిల్యూర్‌తో మనస్తాపం చెంది 1980లో ఆత్మహత్య చేసుకుంది. గురుదత్ వసంత్ కుమార్ శివశంకర్ పడుకోణే తెర మీద గురుదత్ టైటిల్ కార్డ్‌తో కనిపించాడు.. అలరించాడు. ప్యాసా, కాగజ్ కె ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, చౌద్వీ కా చాంద్ సినిమాలు ఇప్పటికీ గురుదత్ను సజీవంగా నిలుపుతున్నాయి. 1964, అక్టోబర్ 10న ఆల్కహాల్లో నిద్రమాత్రలు కలుపుకొని శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. కునాల్ సింగ్ ‘ప్రేమికుల రోజు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా హీరోనే కునాల్ సింగ్. 2008, ఫిబ్రవరి 7న ఉరివేసుకొని చనిపోయాడు. అంతకు కొన్ని నెలల ముందు కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడట మణికట్టు కొసుకొని. జియా ఖాన్ రామ్‌గోపాల్ వర్మ ‘నిశ్శబ్ద్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆమిర్ ఖాన్ ‘గజినీ’లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2013, జూన్ 3న సూసైడ్ చేసుకుంది. కారణం.. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీ కొడుకు సూరజ్ పంచోలీ (‘హీరో’ ఫేమ్)తో ప్రేమ.. వైఫల్యం. సిల్క్ స్మిత తెలియనది ఎవరికి? వందల సినిమాల్లో నటించి అప్పటి యువతకు ఆరాధ్య దేవతగా నిలిచింది. 1996, సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకొని సినిమా అభిమానులందరినీ షాక్‌కు గురిచేసింది. మోనల్ నావల్ తమిళ సినిమాల్లో నటించిన మోనల్... ఫేమస్ హీరోయిన్ సిమ్రన్‌కు చెల్లెలు. 2002లో చెన్నైలోని తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. అక్కడ కూడా మానసిక నిర్బలత్వానికి ఏ వుడ్ అయినా ఒకటే. సైకియాట్రీకన్సల్టేషన్ పట్ల సంకోచాలేమీ లేని పాశ్చాత్య సమాజంలోని నటులు కూడా ఆత్మహత్య అనే బలహీన క్షణాన్ని కౌగిలించుకున్నారు. హాలీవుడ్ ప్రసిద్ధులు రాస్ అలెగ్జాండర్, మార్లిన్ మాన్రో, స్టాన్లీ ఆడమ్స్, ఎలిజబెత్ హార్ట్మన్, బ్రాడ్ డేవిస్, రిచర్డ్ ఫ్రాన్స్ వర్త్, రాబిన్ విలియమ్స్, బ్రిటిష్ యాక్ట్రెస్, మోడల్ లూసీ గార్డన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సూసైడ్స్ లిస్ట్ కూడా పెదద్దే. నటనకే కాదు గొంతు అరువివ్వడానికీ అవకాశాలున్న కాలం ఇది. యానిమేషన్ పిక్చర్స్‌కి కూడా ఫీచర్ ఫిల్మ్స్కున్నంత డిమాండ్ ఉంటోంది. అన్ని భాషల్లోకి అనువాదం అవుతున్న ఈ సినిమాలకు ఆయా భాషల్లోని స్టార్స్ తమ గొంతును అరువిస్తున్నారు. స్వరంతో నటించే ఈ జాబ్ కూడా సంతృప్తినిచ్చేదే.. ఖ్యాతినార్జించి పెట్టేదే. షార్ట్ఫిల్మ్స్కూ కాల్షీట్లు యూట్యూబ్ చానెల్స్ తమ ఉనికితో మరిన్ని ఆపర్చునిటీస్ను పెంచాయి. క్రియేటివిటీనే పెటుబడిగా మార్చాయి. షార్ట్ ఫిల్మ్స్‌కు మెయిన్ స్ట్రీమ్ సినిమా స్టేటస్‌ను తెచ్చాయి. సోషల్ మీడియా దానికి పబ్లిసిటీ పార్ట్నర్ అయింది. ఔత్సాహిక టెక్నీషియన్లు, యాక్టర్లకు బిగ్ స్క్రీన్ ఎంట్రీ టికెట్‌గా, అలాగే బిగ్ స్క్రీన్ టెక్నీషియన్లు, యాక్టర్లకు ఫాలోయింగ్ పెంచే ప్లాట్‌ఫామ్‌గా స్పేస్ తీసుకున్నాయీ యూ ట్యూబ్ చానళ్లు. అనురాగ్ కశ్యప్ వంటి డైరెక్టర్లు, నసీరుద్దీన్ షా, దీప్తి నావల్, నందితా దాస్, కాజోల్ వంటి తారలు యూట్యూబ్ చానెల్ షార్ట్ ఫిల్మ్స్ కోసం కాల్షీట్లు అడ్జస్ట్ చేసినవారే. ఎవర్ ది టాప్ ఈ అవకాశాల పందిరి ఇలా ఉండగానే ఓటీటీ (ఓవర్ ది టాప్) వేదిక తయారైంది. టీవీలు, యూట్యూబ్‌లతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింది అనే మాట వైరల్ అవుతూండగానే యాప్‌ల రూపంలో స్మార్ట్ టీవీల్లోకి దూరిపోయింది. సినిమాతో పోటీ పడే బడ్జెట్.. దానికి మించిన సాంకేతిక విలువలు.. ఫీచర్ ఫిల్మ్ యాక్టర్లూ టచప్ చేసుకునేలా చూశాయి. మూవీస్‌కు స్ట్రీమింగ్ పార్టనర్స్‌గా ఉంటూనే ఒరిజనల్స్‌ను రిలీజ్ చేశాయి. వెబ్ సిరీస్‌తో టీవీ సీరియళ్లు తమ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను తరచి చూసుకోవాల్సిన పరిస్థితి. సృజన, ప్రతిభకు ఆకాశం దాటిపో యింది హద్దు. లైమ్‌లైట్‌లో ఉన్న సినిమా నటీనటులు వెబ్ సిరీస్, ఓటీటీ ఒరిజనల్స్ కోసం డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నారు. దీనికి హాలీవుడ్ కూడా డై హార్డ్ ఫ్యాన్. మన దగ్గరా అన్ని భాషల ఫిల్మ్ వుడ్స్‌కు ఓటీటీ నుంచి ఇన్విటేషన్ ఉంది. వరల్డ్ సినిమాకు ఇంటినే స్క్రీనింగ్ థియేటర్‌గా చేసింది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, జోయా అఖ్తర్‌లు దీనికోసం సినిమాలు తీశారు. సిరీస్‌లూ నిర్మించారు. సైఫ్అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, పంకజ్ త్రిపాఠి, మనీషా కోయిరాలా, వివేక్ ఒబెరాయ్, రీచా ఛద్దా, వికీ కౌశల్, భూమి ఫడ్నేకర్, కియారా అద్వాణి, సుప్రియా పాఠక్, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, రమ్యకృష్ణ వంటి సుప్రసిద్ధులంతా ఓటీటీలో నటించారు. కరోనా వల్ల థియేటర్లో రిలీజ్ కాని షూజిత్ సర్కార్ సినిమా ‘గులాబో సితాబో’ కూడా అమెజాన్‌లో విడుదలైంది. అజయ్ దేవ్గన్ కూడా ఈ వెబ్ చానెల్స్ కోసం సినిమా నిర్మిస్తున్నాడు. అందులో కాజల్, షబానా ఆజ్మీ నటిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నెట్‌ఫ్లిక్స్ కోసం ధర్మ ప్రొడక్షన్స్ తీసిన ‘డ్రై వ్’ అనే చిత్రంలో నటించాడు. ‘బాలాజీ’ (బాలాజీ టెలిఫిలిమ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసుకుంది ‘బాలజీ ఆల్ట్’ పేరుతో. తెలుగు చిత్రసీమా ఓటీటీ తెర మీద కనిపిస్తోంది. నందిని రెడ్డి, జగపతి బాబు వంటి దర్శక, నటుల కంట్రిబ్యూషన్ మొదలైపోయింది. తెలుగు భాష తరపునా ‘ఆహా’ అనే స్క్రీన్ లాంచ్ అయింది. కరోనాతో కలిసొచ్చిన కాలం.. ఫిల్మ్ దునియాలో ఓటీటీ ఒక విప్లవమే. సెన్సార్, డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల తలనొప్పుల్లేకుండా ఓటీటీలో ప్లే చేసుకోవచ్చు. పైగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్లు సిరీస్, సినిమాలు నిర్మించడానికీ సిద్ధంగా ఉన్నాయి భారతీయ ప్రధాన భాషల్లో... కథ నచ్చితే. దీంతో త్వరలోనే ప్రధాన స్రవంతి సినిమా స్కోప్ తగ్గుతుందనే అంచనాలు మొదలయ్యాయి. కరోనా ఆ ‘త్వరలో’ అనే భవిష్యత్తును వర్తమానం చేసేసింది. సమూహాలు.. సమూహ ప్రదేశాలు నిషేధించింది. షూటింగ్స్ ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలు థియేటర్లకు వెళ్లే సీన్ లేదు. అనివార్యంగా ఓటీటీయే కనిపించింది. ‘గులాబో సితాబో’ బోణీ చేసింది. అలా ఓటీటీకి కాలం కలిసొచ్చింది. ఆశావాదం ‘ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తప్పకుండా తెరిచే ఉంటుంది..’ అనే మాటను వింటూనే ఉంటాం. కరోనాతో సినిమాలు ఆగిపోతే... ఒటీటీ ఓపెన్ అయింది. దాని పట్ల ప్రేక్షకులకున్న క్రేజ్ కూడా అర్థమైంది. షూటింగ్‌లు ఆగిపోవడం తాత్కాలికమే (ఈ వ్యాసం రాస్తున్న సమయానికి వీటికీ గ్రీన్‌సిగ్నల్ వచ్చింది). ఇది మనకు మాత్రమే ఉన్న సమస్య కాదు.. ప్రపంచమంతా ఎదుర్కొంటున్నదే. కాబట్టి పరిష్కారమూ అంతే వేగంగా దొరుకుతుంది. ఎటొచ్చి కొంత సంయమనం.. కాస్తంత సహనం అవసరం. కాని ఇప్పుడంతా ఇన్స్టంట్ టైమ్.. వేచి చూసేంత ఓపిక లేదు. క్షణాల్లో ఫలితాలు కావాలి. లేకపోతే భయం.. ఆందోళన.. అభద్రత. దాన్నుంచే ఒత్తిడి.. వ్యాకులత. కుటుంబంతో గడిపితే ఉపశమనం కలుగుతుంది. సన్నిహితులతో చెప్పుకుంటే బరువు దిగుతుంది. ఆ షేరింగే మిస్ అయింది చాలా మంది సెలబ్రిటీల ఆత్మహత్యల కేసుల్లో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సహా. కరోనాతో దారి మూసుకుపోయిందన్న దిగులా? ప్రత్యామ్నాయ వేదిక అనే మరో దారి తెరిచే ఉంది.. దాని కోసం నటించిన అనుభవమూ ఉందన్న ధీమాను పట్టుకోలేని నిస్సహాయతా? అమ్మానాన్న, తోబుట్టువుల ముందు బయటపడితే వాళ్లు టెన్షన్ పడతారేమోనన్న బాధా? ఆ మానసిక సంఘర్షణను స్నేహితులతో చెప్పుకొనీ గుండె నిండా ఊపిరి పీల్చుకోవచ్చు.. ఓస్ ఇంతేనా ఈ పటాటోపం అని పలుచన చేస్తారనే బెరుకా? అయినవాళ్ల దగ్గర ఇన్ని సంకోచాలెందుకు? మనసులో ఉన్నది చెప్పుకోవడానికి తటపటాయిస్తున్నామంటే ఆ చనువు, చొరవ మిస్ అయినట్టే. అంటే అవతలి వాళ్లను మనవాళ్లుగా చూడట్లేదనో.. మనవాళ్లనుకున్నవాళ్లు మనల్ని కేవలం విజేతలుగా మాత్రమే పరిగణిస్తున్నట్టో! ఆ అంతరమే మాటకు, చెవికీ వర్తించి మనసు ముడుచుకుపోయేలా చేస్తుంది. ఇన్సెక్యూరిటీ, యాంగై్జటీ తనను ఆక్యుపై చేస్తున్నా గాంభీర్యం ప్రదర్శించమని పోరుతుంది మెదడు. ఆర్జించిన పేరుప్రఖ్యాతుల మాయ ఇది. అందుకే ఆత్మీయులే ఈ స్పృహతో మెదలాలి. గ్లామర్ మేకప్ కింద తడి చారికలుంటాయి. వాటిని గమనించాలి.. మాటలతో ఆ మనసును కదిలించాలి.. చెవి ఒగ్గాలి. నెమ్మదిగా గూడు కట్టుకున్న దిగులు మాటలుగా కరగడం మొదలుపెడుతుంది. కన్నీళ్లుగా ఉబికి వస్తుంది. దుఃఖంతో బహిర్గతమవుతుంది. ఆ భావోద్వేగమంతా పోయి ఖాళీ అయిన గుండె ధైర్యంతో కొట్టుకోవడం మొదలుపెడుతుంది. నిర్భయంగా ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతుంది నడక. జీవితానికి హ్యాపీ కంటిన్యుయేషనే... తర్వాత అవాంతరాలు ఉండవని కాదు.. లెక్కలోకి రావు అని. ఆత్మహత్యల జాబితా తగ్గుతుందీ అని. డిప్రెషన్ అంతు చూసిన తారలు తాను డిప్రెషన్లోకి వెళ్లానని.. సైకియాట్రిస్ట్, ఫ్యామిలీ సపోర్ట్‌తో బయటపడ్డానని మీడియా ముందు రివీల్ చేసి బాలీవుడ్లో స్టార్ డిప్రెషన్‌ను బయటపెట్టింది దీపికా పడుకోణ్. మానసిక అనారోగ్యం గురించి మాట్లాడితే పోయేదేమీ లేదు వ్యాకులత తప్ప అనే స్థైర్యాన్నీ తోటి సెలబ్రిటీలకు పంచింది. దీనిమీద అవగాహన కలిగించడానికి తన చెల్లి అనిషా పడుకోణ్‌తో కలిసి ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, అలియా భట్ వంటి తారలూ తాము డ్రిపెషన్‌ను ఎదుర్కొన్నామని, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో దాన్నుంచి రిలీవ్ అయ్యామనీ చెప్పారు. దృష్టికి రాని ఇలాంటి సెలబ్రిటీలు ఇంకెందరో ధైర్యమివ్వడానికి! – సరస్వతి రమ -
అడకత్తెరలో పోకచెక్క... భారత్
అటునుంచైనా... ఇటునుంచైనా... ఎటునుంచైనా... ప్రపంచంపై ఆధిపత్యాన్ని సాధించాలనే మొండిపట్టుతో బలప్రదర్శనకు సిద్ధపడుతున్న చైనాకు ముకుతాడు వేయడానికి అమెరికా సన్నాహాలు చేసుకుంటోంది. ప్రస్తుత పరిస్థితులు అంతర్జాతీయ వేదికలపై జరిగే చర్చల ద్వారా సద్దుమణిగితే సరేసరి. లేకుంటే, ఇవి విషమించి మూడో ప్రపంచయుద్ధానికి దారితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘కరోనా’ మహమ్మారి వ్యాపిస్తున్నంత వేగంగానే ప్రపంచ దేశాల నడుమ సమీకరణలూ మారిపోతున్నాయి. ‘కరోనా’ వ్యాప్తికి చైనానే ప్రధాన కారణంగా భావిస్తున్న అమెరికా, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమేననే సంకేతాలు ఇస్తోంది. అమెరికా ఆరోపణలను తోసిపుచ్చుతున్న చైనా, తాను సైతం యుద్ధానికి సిద్ధమేననే రీతిలో సైనిక విన్యాసాలను ముమ్మరం చేస్తోంది. అంతేకాదు, భారత భూభాగాన్ని కబళించే లక్ష్యంతో బలగాలను ముందుకు నడుపుతోంది. మరోవైపు, దక్షిణ చైనా సముద్రంలో జనావాసాలు లేని ఖాళీ దీవులను సైతం కబళించి, వాటిపై తన సార్వభౌమత్వాధికారాన్ని చాటుకునే దిశగా పావులు కదుపుతోంది. ప్రపంచదేశాలన్నీ ఒకవైపు ‘కరోనా’ మహమ్మారి తాకిడికి విలవిలలాడుతుంటే, మరోవైపు చైనా తన దూకుడును ముమ్మరం చేస్తోంది. కొద్దిరోజులుగా భారత్–చైనా సరిహద్దుల వద్ద కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. లడాఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద యథాతథ స్థితిని ఉల్లంఘించిన చైనా బలగాలు, వాస్తవాధీన రేఖను దాటి భారత భూభాగంలోకి చొరబాటు జరిపాయి. చైనా బలగాలు జరిపిన ఈ దుందుడుకు చర్య ఉభయ దేశాల మధ్య కొంత ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. అయితే, పరిస్థితిని చక్కదిద్దేందుకు ఉభయ దేశాలూ లెఫ్టినెంట్ జనరల్ స్థాయి సైనికాధికారుల చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేయడం తాజా పరిణామం. చర్చలతోనే పరిస్థితి సద్దుమణిగితే చాలని చాలామంది ఆశిస్తున్నారు. అయితే, ‘కరోనా’ ధాటికి ప్రపంచమంతా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, చైనా అకస్మాత్తుగా ఎందుకు ఇలాంటి దుందుడుకు చర్యలకు తెగబడుతోంది, ఈ దూకుడు వెనుక చైనా ఉద్దేశం ఏమిటి, ఆకాంక్షలేమిటి అనే అనుమానాలులు ఎవరికైనా తలెత్తుతాయి. వర్తమాన రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తే, ఇలాంటి అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. ఇదీ చైనా ఎత్తుగడ ‘కరోనా’ వ్యాప్తికి సంబంధించి చైనా ప్రపంచదేశాలను ఉద్దేశపూర్వకంగానే అప్రమత్తం చేయలేదని, ‘కరోనా’ వైరస్‌కు సంబంధించిన సమాచారాన్ని ప్రపంచదేశాలతో పంచుకోలేదని ఆరోపిస్తూ అమెరికా అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఈ వ్యవహారంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పాత్రను కూడా అమెరికా తప్పుపడుతోంది. డబ్ల్యూహెచ్‌వో పద్ధతిని మార్చుకోకుంటే, దానికి శాశ్వతంగా నిధులు నిలిపివేసేందుకు వెనుకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ‘కరోనా’ నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై చైనాను ముద్దాయిగా నిలబెట్టేందుకు అమెరికా సన్నద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ వేదికలపై భారత్ తమకు వ్యతిరేకంగా అమెరికాకు వత్తాసు పలకకుండా చూసే లక్ష్యంతోనే చైనా ఇటీవల దూకుడు పెంచింది. టిబెట్ భూభాగంలో సైనిక విన్యాసాలు, లడఖ్ భూభాగంలోకి చొరబాట్లు వంటి చర్యల ద్వారా భారత్‌ను ఆత్మరక్షణలో పడేసి, తన పట్టు నెగ్గించుకోవాలనేదే చైనా ప్రస్తుత లక్ష్యంగా కనిపిస్తోంది. కేవలం ‘కరోనా’ విషయంలోనే కాదు, హాంకాంగ్‌కు యాభయ్యేళ్ల పాటు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు ఇదివరకు 1997లో అంగీకరించిన చైనా, ఇప్పుడు మాట మార్చి, హాంకాంగ్‌లో తన జాతీయ భద్రతా చట్టం అమలును పొడిగించేందుకు సిద్ధపడుతుండటాన్ని కూడా అమెరికా వ్యతిరేకిస్తోంది. ఇక తైవాన్ జలసంధి, దక్షిణ చైనా సముద్ర జలాలు, ఖాళీ దీవుల వరకు తన సార్వభౌమత్వాన్ని విస్తరించుకునేందుకు చైనా సాగిస్తున్న ప్రయత్నాలపై కూడా ఆగ్నేయాసియాలోని పలు దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చైనా సాగిస్తున్న ఈ దుందుడుకు చర్యలన్నింటినీ అమెరికా బాహాటంగానే తప్పుపడుతూ వస్తోంది. అమెరికాతో భారత్ మెరుగైన దౌత్య సంబంధాలనే కలిగి ఉంది. అంతర్జాతీయ వేదికలపై చైనా దుందుడుకు చర్యలు చర్చకు వచ్చినట్లయితే, భారత్ సహజంగానే అమెరికాకు వత్తాసు పలికే అవకాశాలు ఉన్నట్లు పసిగట్టిన చైనా, తాను తలచుకుంటే సరిహద్దుల వద్ద సమస్యలను సృష్టించగలననే విషయాన్ని భారత్‌కు స్పష్టం చేయదలచుకుందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ వేదికలపై అమెరికాకు వత్తాసు పలకకుండా భారత్‌ను తటస్థ వైఖరి అవలంబించేలా చేయడమే చైనా లక్ష్యమని, నయానో భయానో తన లక్ష్యాన్ని సాధించుకునే దిశగానే ఇటీవల దూకుడు పెంచిందని చెబుతున్నారు. భారత్‌ను అన్నివైపుల నుంచి ఇరకాటంలో పెట్టే ఉద్దేశంతోనే చైనా కొంతకాలంగా పాకిస్తాన్, నేపాల్, శ్రీలంకలను దువ్వుతోంది. భారత్ నుంచి తమ దేశానికి వచ్చే వాళ్ల కారణంగానే ‘కరోనా’ వైరస్ వ్యాపిస్తోందంటూ ఇటీవల నేపాల్ ప్రధాని చేసిన ఆరోపణల వెనుక చైనా ప్రోద్బలం ఉండే ఉంటుందని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కోపానికి కారణాలు అమెరికా–చైనా సంబంధాలు ఏనాడూ అంత స్నేహపూర్వకంగా ఉన్న దాఖలాల్లేవు. అగ్రరాజ్యంగా ప్రపంచంపై పెత్తనం చలాయిస్తున్న అమెరికాను అధిగమించి, తిరుగులేని ఆర్థికశక్తిగా ఎదగడానికి చైనా చాలాకాలంగా చాలారకాలుగా ప్రయత్నిస్తోంది. రెండు దేశాల మధ్య అసలే అంతంత మాత్రంగా ఉన్న సరాగాలు ‘కరోనా’ వైరస్ విజృంభణతో పూర్తిగా బెడిసికొట్టాయి. ‘కరోనా’ వైరస్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘చైనీస్ వైరస్’గా అభివర్ణించడంతో చిర్రెత్తిన చైనా, ట్రంప్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఎదురుదాడికి దిగింది. చైనాలోని వుహాన్ నగరంలో ‘కరోనా’ వైరస్ వ్యాప్తి తొలిసారిగా మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ వైరస్‌ను చైనా ఉద్దేశపూర్వకంగా లాబొరేటరీలో సృష్టించిందని, వైరస్ వ్యాప్తికి సంబంధించిన సమాచారాన్ని ప్రపంచానికి వెల్లడించడంలో కూడా ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసిందని ఆరోపణలు గుప్పించిన ట్రంప్, చైనాను కట్టడి చేసేందుకు ఆర్థికపరమైన ఆంక్షలకు తెరలేపారు. మరోవైపు చైనాలో పనిచేస్తున్న అమెరికన్ కంపెనీలు కూడా అక్కడి నుంచి బిచాణా ఎత్తేసి ఇతర దేశాలకు తరలిపోయేందుకు సన్నాహాలు ప్రారంభించాయి. ‘కరోనా’ మహమ్మారి వ్యాప్తి తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అవకాశం దొరికినప్పుడల్లా చైనాపై విరుచుకుపడుతూనే ఉన్నారు. ఈ ఏడాది మార్చి నుంచి జూన్ వరకు గల త్రైమాసికంలో అమెరికా ఆర్థిక పరిస్థితి దారుణంగా కుదేలైంది. ‘కరోనా’ సంక్షోభం దెబ్బకు దాదాపు మూడు కోట్ల మంది అమెరికన్లు ఉపాధి కోల్పోయి నిరుద్యోగులుగా మారారు. ఈ ఏడాది ముగిసే నాటికి అమెరికాలో నిరుద్యోగం 14 శాతానికి చేరుకోగలదని, అలాగే అమెరికా ఆర్థిక వృద్ధి 12 శాతం మేరకు తగ్గిపోగలదని అమెరికా బడ్జెట్ కార్యాలయం అంచనా వేస్తోంది. రెండో ప్రపంచయుద్ధం తర్వాత అమెరికాలో ఈ స్థాయిలో నిరుద్యోగ సమస్య తలెత్తడం ఇదే మొదటిసారి. ఇలాంటి సంక్షోభ పరిస్థితుల్లో ఈ ఏడాది అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీకి సిద్ధపడుతున్న ట్రంప్‌కు గెలుపు సాధించడం అంత తేలిక కాదు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ప్రజల్లో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తలెత్తే సూచనలు ప్రబలంగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు ముంచుకొచ్చేలోగా కుదేలైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం ఎటూ సాధ్యం కాదు. అందుకే ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలనే ఉద్దేశంతో ట్రంప్ తన ప్రజలకు చైనాను బూచిగా చూపిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. చైనా వ్యతిరేకతే ట్రంప్ ప్రచారాస్త్రం చైనా వ్యతిరేక ప్రచారంతోనే ట్రంప్ ఈ ఎన్నికల్లో నెగ్గడానికి ప్రయత్నిస్తారని, చైనా వ్యతిరేక ప్రచారమే ఆయన తిరిగి ఎన్నికయ్యేందుకు ఉపయోగపడగలదని ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’లో ప్రముఖ కాలమిస్ట్ వాల్టర్ రస్సెల్ మీడ్ అభిప్రాయపడ్డారు. ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ సెనేటోరియల్ కమిటీ రూపొందించిన 57 పేజీల ఎన్నికల ప్రచార సారాంశంపై కూడా అమెరికన్ పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. దీని సారాంశమేమిటంటే... ‘కరోనా’ వైరస్ వ్యాప్తికి చైనా నిర్వాకమే కారణమని, డెమోక్రాట్లకు చైనాతో సత్సంబంధాలు ఉన్నాయని విస్తృతంగా ప్రజల్లో ప్రచారం చేయాలని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులందరికీ మార్గదర్శకాలను విడుదల చేశారు. ట్రంప్ తన ప్రత్యర్థి బైడెన్‌ను ‘బీజింగ్ బైడెన్’గా అభివర్ణిస్తూ భారీ స్థాయిలో విడుదల చేసిన ప్రకటనలు రిపబ్లికన్ పార్టీ ప్రచార వ్యూహంపై వెలువడిన కథనాలకు బలం చేకూర్చేవిగానే కనిపిస్తున్నాయి. ట్రంప్ ఏప్రిల్ నెలాఖరులో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎన్నికల్లో తనను ఓడించడానికి చైనా ఎంతకైనా తెగిస్తుందని ఆరోపించారు. ఒకవేళ పరిస్థితులు మరీ శ్రుతిమించితే యుద్ధానికైనా సిద్ధమేననే సంకేతాలు ఇచ్చేందుకు అమెరికా అణుపాటవ పరీక్షలు చేసేందుకు సైతం సమాయత్తమవుతోంది. ట్రంప్ ఆదేశిస్తే మరోసారి అణుపాటవ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా భద్రతాధికారులు ఇటీవల ప్రకటించారు. ఇదివరకు 1992లో చివరిసారిగా అణు పరీక్షలు నిర్వహించిన అమెరికా, ఇన్ని దశాబ్దాల్లో తిరిగి ఎన్నడూ వాటిని పరీక్షించలేదు. చైనా నుంచి సవాళ్లు ఎదురవుతుండటంతో ఇప్పుడు మళ్లీ అణుపరీక్షల వైపు మొగ్గుతుండటం ప్రపంచానికి కొంత ఆందోళనకర పరిణామమే! అడకత్తెరలో పోకచెక్క భారత్ అటు అమెరికా, ఇటు చైనా... మధ్యనున్న భారత్ పరిస్థితి అడకత్తెరలో పోకచెక్క మాదిరిగా ఉన్నట్లే చెప్పుకోవచ్చు. భారత్‌కు అటు అమెరికాతోను, ఇటు చైనాతోను ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆర్థికంగానైనా, ఆయుధ సంపత్తిలోనైనా అమెరికా, చైనాల కంటే భారత్ వెనుకబడి ఉన్నమాట వాస్తవం. చైనాతో పోల్చుకుంటే అమెరికాతో భారత్ సంబంధాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం గడచిన మూడు దశాబ్దాలలో గణనీయంగా పెరిగింది. ఒకవైపు అమెరికాతో వాణిజ్య లావాదేవీలు పెరుగుతూ వస్తున్నా, ఆర్థిక అంశాల్లో ఉభయ దేశాల మధ్య ఇప్పటికీ పరిష్కారం కాని భిన్నాభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. విదేశీ పెట్టుబడులపై పరిమితులు, సుంకాల ధరలు, మేధా సంపత్తి హక్కులు వంటి అంశాల్లో పలుసార్లు చర్చలు కొనసాగినా, ఉభయదేశాలు ఇప్పటి వరకు ఏకాభిప్రాయానికి రావడంలో విఫలమయ్యాయి. ఆర్థిక వ్యవహారాల్లో అమెరికా ఏకపక్ష నిర్ణయాలతో పెత్తనం చలాయిస్తూ ఉండటం భారత్‌కు ఇబ్బందికరమే అయినా, వీలైనంత వరకు చర్చల ద్వారా పరిష్కారానికే ప్రయత్నిస్తూ వస్తోంది. అత్యధిక జనాభా గల భారత్‌ను అమెరికా తన లాభసాటి మార్కెట్‌గా పరిగణిస్తూ వస్తోంది. ఈ మార్కెట్‌పై తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు కొన్ని ఆంక్షలు, కొన్ని సడలింపులతో దాగుడుమూతలు ఆడుతూ వస్తోంది. ఇటీవలి పరిణామాలతో అటు అమెరికాకు, ఇటు భారత్‌కు చైనా ఉమ్మడి తలనొప్పిగా మారింది. చైనా సేనలు సరిహద్దుల వద్ద సాగిస్తున్న దుందుడుకు చర్యలను వీలైనంత వరకు చర్చల ద్వారానే పరిష్కారానికి భారత్ ప్రయత్నిస్తోంది. లడక్, అరుణాచల్‌ప్రదేశ్ భూభాగాల్లోకి చైనా సేనలు ఇప్పటికే పలుసార్లు చొరబాట్లు జరిపాయి. చైనా అధినేత జిన్‌పింగ్ భారత్ వచ్చినప్పుడు మోడీతో ఆయన జరిపిన చర్చలు సామరస్యపూర్వకంగానే జరిగినట్లు కనిపించినా, ఆ తర్వాత సైతం చైనా సేనల తీరు ఏమాత్రం మారలేదు. ఆర్థిక పరిస్థితులు, ఆయుధ సంపత్తి దృష్ట్యా భారత్ తనంతట తానుగా చైనాతో యుద్ధానికి దిగే పరిస్థితులు లేవు. చైనా గనుక దురహంకారంతో యుద్ధ ప్రకటన చేస్తే మాత్రం భారత్‌కు సైతం యుద్ధరంగంలోకి దిగడమే ఏకైక మార్గమవుతుంది. ప్రస్తుత గందరగోళ పరిస్థితులు అమెరికా–చైనా మధ్య యుద్ధానికి దారితీసినా, భారత్–చైనా మధ్య యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితులు ఏర్పడినా, యుద్ధ ప్రభావం ఏ రెండు దేశాలకో పరిమితమయ్యే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఆధిపత్యమే చైనా అంతిమ లక్ష్యం... అత్యధిక జనాభా గల చైనా, అతిపెద్ద ఆర్థిక శక్తుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ‘కరోనా’ దెబ్బకు అమెరికా ఆర్థిక పరిస్థితి కుదేలైన దశలో ఆర్థిక ఆధిపత్యాన్ని సాధించడానికి ఇదే తగిన అదనుగా చైనా భావిస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఆరోపణలను ఏమాత్రం జంకుగొంకు లేకుండా ఘాటైన సమాధానాలతో తిప్పికొడుతోంది. కరోనా వైరస్ వ్యాప్తికి చైనానే కారణమంటూ ట్రంప్ మాటిమాటికీ నిందించడంపై చైనా విదేశాంగ ప్రతినిధి జెంగ్ షువాంగ్ ఘాటుగా ప్రతిస్పందించారు. ‘‘ఎయిడ్స్‌కు దారితీసే హెచ్ఐవీ వైరస్‌ను 1980లలో తొలుత అమెరికాలోనే గుర్తించడం జరిగింది. స్వైన్‌ఫ్లూకు కారణమైన హెచ్1ఎన్1 వైరస్‌ను కూడా 2009లో మొదట అమెరికాలోనే గుర్తించడం జరిగింది. స్వైన్‌ఫ్లూ 214 దేశాలకు విస్తరించి, దాదాపు రెండు లక్షల మంది మరణాలకు కారణమైంది. వీటన్నింటికీ పరిహారం కోసం ఎవరైనా అమెరికాను డిమాండ్ చేశారా?’’ అని ప్రశ్నించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ అమెరికా– చైనాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అమెరికా ఒకవేళ యుద్ధానికి కవ్విస్తే, అందుకు సిద్ధపడే రీతిలో చైనా తన సైన్యాన్ని సన్నద్ధం చేసుకుంటోంది. చైనా ఇటీవల తక్కువ తీవ్రత గల అణ్వాయుధాలను రహస్యంగా పరీక్షించిందనే వార్తలు వెలువడ్డాయి. చైనా ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించకపోయినా, చైనా వద్ద అణ్వాయుధ సంపత్తి బహిరంగ రహస్యమే. అమెరికా–చైనాల కీచులాట యుద్ధానికే దారిసేటట్లయితే, ఆ యుద్ధం ఆ రెండు దేశాలకు మాత్రమే పరిమితం కాదని, అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదనే ఊహాగానాలపై కూడా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. - పన్యాల జగన్నాథదాసు -
వలస పక్షులకు రాదారి గూళ్లు
లోకాన్ని ముంచేసే ముప్పేదో రాబోతోందని తెలిస్తే.. అయినవాళ్ల కోసం మనసు వెదుక్కుంటుంది.. చచ్చినా, బతికినా తనవాళ్లతోనే అని కోరుకుంటుంది.. అలాంటి తండ్లాటే కరోనా కాలంలోనూ కనిపిస్తోంది.. ఆ వైరస్ కన్నా దాన్ని రానివ్వకుండా పెట్టిన లాక్డౌన్ మనుషుల్లో భయాన్ని సృష్టించింది.. కలైనా.. కఠోర వాస్తవాన్నయినా కుటుంబంతో చూద్దాం... కలో గంజో ఏదున్నా కలిసి పంచుకుందాం అనుకొనేలా చేసింది.. పొట్టకూటి కోసం పరాయి గడ్డకు వచ్చిన మనుషులను బాటసారులుగా మార్చింది.. సొంతవాళ్లను చేరుకునేందుకు వందల కొద్ది కిలోమీటర్లు నడిపించింది... గుండెకున్న ఆత్రం కాళ్లకూ ఉన్నా నడిపించే శక్తి కడుపులో నిండాలి కదా! అదిలేక నీరసించి సొమ్మసిల్లారు.. ప్రమాదాల బారినపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు.. అయినా మిగిలిన వాళ్లు ప్రయాణం ఆపలేదు.. ప్రాణం పోయినా సరే.. తనది కాని చోట బతికేదే లేదు అనుకుంటూ నడుస్తూనే ఉన్నారు.. ఆ మొండితనమే కాలే కడపులో శక్తిని రగిలించింది.. తోటి మనుషులను కదిలించింది.. సహాయానికి వేల చేతులను అందించింది. వ్యక్తులుగా.. సమూహాలుగా.. గల్లీల్లో.. హైవేల మీద... ఎక్కడెక్కడ వలస కార్మికులు కనిపించే వీలుందో.. అక్కడక్కడ సహాయక శిబిరాలు వెలిశాయి.. ఉదయం నుంచి రాత్రి వరకు నిరాటంకంగా సాయం అందిస్తూనే ఉన్నారు.. ఏ ఒక్క వలస కార్మికుడూ ఆకలితో ఇల్లు చేరకూడదు.. వాళ్లను భద్రంగా, సగౌరవంగా వాళ్ల ప్రాంతానికి చేర్చాలి అనే లక్ష్యంతో. అలా నిలబడ్డ కొంతమంది వ్యక్తులు.. కొన్ని సమూహాలు.. సంస్థల గురించి... ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు దేశమంతా లాక్డౌన్ అయిపోయింది. అత్యవసర సర్వీసులే గడప దాటాయి. మిగిలిన వాళ్లంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చూసుకుంటూ, వాట్సప్ చాలెంజ్‌లు, టిక్‌టాక్, యూట్యూబ్ వీడియోలతో బిజీగా ఉన్న సమయంలో నెత్తి మీద మూటలతో.. చంకన బిడ్డలతో.. చెప్పుల్లేని కాళ్లతో ఎర్రటి ఎండలో నడుస్తున్నారు వలసకార్మికులు చడీచప్పుడు లేకుండా. వీళ్లు మీడియా కంట పడ్డా.. జనం దృష్టిలోకి రాలేదు మొదట్లో. నడుస్తూ నడుస్తూ ప్రమాదానికి గురైన రెండు మూడు సంఘటనలతో యావద్దేశం ఉలిక్కిపడి వీళ్లవైపు తలతిప్పింది. అప్పటికే జాతీయ రహదారుల మీద బారులుబారులుగా కదులుతున్నారు వీళ్లు. అలాంటి వాటిల్లో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఉన్న నేషనల్ హైవే 44 ఒకటి. ఇది తెలంగాణ మీదుగా వెళ్తుంది. ఉత్తర భారతదేశం నుంచి దక్షిణాదికి వచ్చిన వలసకార్మికులు తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లాలంటే ఇదే రహదారి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వాళ్లకు. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్నవాళ్లకు హైదరాబాద్ .. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ శివార్లలోని మేడ్చల్ సెంటర్ పాయింట్. ఇక్కడే వెలసింది ఒక సహాయక శిబిరం. మేడ్చల్ ఓఆర్ఆర్ ఫుడ్ క్యాంప్.. ఈ క్యాంప్ ఏర్పడక ముందే మేడ్చల్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వాళ్లు కాలినడకన వెళ్తున్న ఈ కార్మికులను చూసి, చలించిపోయారు. వాళ్లను గమ్యం చేర్చడం వల్లకాని పనే.. కనీసం భోజనం పెట్టయినా వాళ్ల కష్టంలో పాలుపంచుకోవాలనుకున్నారు. పది, ఇరవై మందికి సరిపడా వంట చేసి.. దాన్ని పార్సిల్స్‌గా ప్యాక్ చేసుకొని హైవే మీదకు వచ్చి ఈ వలసకార్మికులకు ఆ ప్యాకెట్లు ఇచ్చి వెళ్లిపోయేవారు. అడ్వకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూప్ ఈ ప్రయత్నం ఇలా సాగుతున్నప్పుడే హైదరాబాద్ నగరంలో లాక్‌డౌన్‌తో పనిపోయిన వలసకార్మికులకు ఆహారాన్ని, రేషన్‌ను అందజేస్తున్నారు చాలామంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు. వాటిల్లో ఒక గ్రూపే ‘అడ్వొకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూప్’. కొన్ని స్వచ్ఛంద సంస్థలు, యాక్టివిస్ట్‌లు కలిపి పెట్టిన గ్రూప్ ఇది. ఇందులో రైతు స్వరాజ్య వేదిక నవీన్, మహిళా రైతుల గురించి పనిచేసే స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు సజయ, శాతవాహన యూనివర్సిటీ అధ్యాపకురాలు సూరేపల్లి సుజాత, భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి, అంకురం నిర్వాహకురాలు సుమిత్ర, యాక్టివిస్టులు అంబిక, సునీత అచ్యుత, బ్రదర్ వర్ఘీస్, వీవీ జ్యోతి, రిటైర్డ్ ప్రొఫెసర్ పద్మజా షా, న్యాయవాది వసుధ నాగరాజ్, శ్రుతి మొదలైన వాళ్లంతా ఉన్నారు. ఈ గ్రూప్ జంటనగరాల్లో ఉన్న వలసకార్మికుల కోసం ‘సహాయ’ అనే హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ హెల్ప్‌లైన్‌కు వచ్చే ఫోన్ కాల్స్ తీసుకోవడానికి ఇరవై మంది వాలంటీర్లు పనిచేసేవారు ఎవరి ఇళ్లల్లో వాళ్లుండే. నిత్యావసరాల కోసం ఫోన్ చేసిన కార్మికుల నంబర్ సహా వాళ్ల వివరాలను నమోదు చేసుకొని ‘అడ్వొకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూప్’ వాళ్లకు తెలియపరిచేవారు. ఈ గ్రూప్ సభ్యుల్లో ఎవరు ఆ ఏరియాకు కాస్త దగ్గరగా ఉంటే వాళ్లు వెళ్లి ఆ కార్మికులకు రేషన్ ఇచ్చేవారు. ఇలా మార్చి 25న మొదలైన ఈ సేవ కొనసాగింపే మేడ్చల్ ఓఆర్ఆర్ ఫుడ్ క్యాంప్. సహాయ హెల్ప్‌లైన్ పది మంది వాలంటీర్లతో ప్రారంభమై నలభైమందికి పెరిగి.. ఈ కథనం రాస్తున్నప్పటికి వలసకార్మికులూ సొంతూళ్లకు వెళ్లడం వల్ల సహాయం చేసే అవసరమూ తగ్గి ఇరవై మంది వాలంటీర్లతో నడుస్తోంది. లాక్డౌన్ మూడో దశకు ముందు.. ఒకనాటి రాత్రి.. హైదరాబాద్‌లోనే ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్‌లో ఉన్న వలసకార్మికుల్లో ఓ అమ్మాయికి డెలివరీ అయింది. పాప పుట్టింది. ఆ సమయంలో ఆమెకు అడ్వొకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూపే సహాయమందించింది. మీకేం భయంలేదు.. అని వాళ్లకు ధైర్యమిచ్చేలోపే లాక్డౌన్ మూడో దశను ప్రకటించారు. వలస కార్మికుల్లో నిరాశ. ఇంకెంతలే.. నాలుగు రోజులు ఆగితే లాక్డౌన్ ఎత్తేస్తారు.. రైళ్లు, బస్సులు మామూలుగా తిరుగుతాయి సొంతూళ్లకు వెళ్లిపోవచ్చనుకున్న కార్మికులంతా నిరుత్సాహపడ్డారు. ఇక ఒక్కక్షణం కూడా ఆగకూడదు అని ఉన్న సామానంతా సర్దుకొని ప్రయాణానికి సిద్ధపడ్డారు. వాళ్లలో ఓడియన్ థియేటర్ కాంప్లెక్స్ వలసకార్మికుల్లోని ఛత్తీస్‌గఢ్ కార్మికులూ ఉన్నారు. చంటిపిల్ల తల్లి సంబంధీకులు ఓ ముపై ్ప మంది కాలినడకనే వెళ్లాలనుకున్నారు. ఈ విషయం తెలిసి ఆ బాలింతను కూడా నడిపిస్తారేమోననే భయంతో అప్పటికప్పుడు ఓడియన్ థియేటర్‌కు వచ్చారు అడ్వొకసీ కోవిడ్ లాక్డౌన్ గ్రూప్ సభ్యులు కొందరు. ప్రభుత్వ అధికారుల అనుమతితో ఏదైనా వెహికిల్ మాట్లాడి పంపిస్తామని వాళ్లకు నచ్చజెప్పి.. పర్మిషన్ కోసం ప్రయత్నించారు. కాని అనుమతి దొరకలేదు. సహనం నశించిన ఛత్తీస్‌గఢ్ కార్మికులు నడకమొదలుపెట్టారు మేడ్చల్ వరకూ .అక్కడి నుంచి ఏదైనా ట్రక్కులో వెళ్లిపోతామని. అయితే ఆ బాలింతను, ఆమె భర్త, ఇంకొంతమంది చిన్నపిల్లలను ఈగ్రూప్ సభ్యులు ఆపారు. మేడ్చల్ వరకు కార్లో తీసుకెళ్లి అక్కడ ట్రక్ ఎక్కిద్దామని. వాళ్లకు భోజనం పెట్టి, దారిలోకి కావల్సినవి పార్సిల్ చేయించి ఆ రోజు సాయంకాలం కార్లో మేడ్చల్ తీసుకెళ్లారు గ్రూప్ సభ్యుల్లో ఒకరైన సి. వనజ. దారెంట వందల కొద్ది కార్మికులు నెత్తి మీద మూటలతో నడుస్తూ ఉన్నారు. ‘వాళ్లనలా చూస్తే భయమేసింది. నా వెంట ఉన్న ఆ చంటిపిల్ల కుటుంబాన్ని, ఆ పిల్లలను ట్రక్ ఎక్కించేసి వసు«ధ నాగరాజ్‌కు ఫోన్ చేశా. ఆ రాత్రంతా నాకు నిద్రలేదు. తెల్లవారే వసుధ వచ్చేసింది మేడ్చల్ హైవే దగ్గరకి. ఆ కార్మికులతో మాట్లాడాం. తమిళనాడు, బెంగళూరు నుంచి వస్తున్నారు. రెండు రోజులుగా వాళ్లకు తిండిలేదు, తాగడానికి కనీసం నీళ్లు కూడా లేవు. లారీలను, ట్రక్కులను బతిమాలుకుంటున్నారు. చాలా దయనీయంగా ఉంది వాళ్ల పరిస్థితి. అప్పుడనిపించింది మేం పనిచేయాల్సిన అవసరం ఇక్కడ ఉంది అని. అయితే అప్పటికే చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఇక్కడ సహాయం చేస్తున్నట్టు అర్థమైంది. వాళ్లకు తోడుగా మేమూ స్టార్ట్ చేశాం. మా గ్రూప్‌లో మిగిలిన వాళ్లకూ చెప్పాం. వాళ్లూ వచ్చారు. పళ్లు, బ్రెడ్, బిస్కట్ ప్యాకెట్స్, మంచి నీళ్లు పంచడం మొదలుపెట్టాం. ఒకొక్కళ్లం రోజుకి పది ట్రిప్పులు వేసినా సరిపోయేది కాదు. విపరీతమైన ఎండ. నడుస్తున్న వాళ్లు సేద తీరడానికి అక్కడేదైనా నీడ ఉంటే బాగుండు అనిపించింది. వెంటనే దిలిప్ కొణతంతో మాట్లాడితే, వెంటనే అక్కడ రెండు టెంట్లు వేయించారు. ఇండివిడ్యువల్‌గా హెల్ప్ చేస్తున్న వాళ్లనూ ఈ టెంట్ కిందకే తెచ్చి అందరం కలిసి ఓ గ్రూప్‌గా తయారయ్యాం. ఓ ప్రవాహంలా రావడం మొదలుపెట్టారు కార్మికులు. రోజుకు పదిహేనువేల మంది. ఫుడ్, వాటర్, వాలంటీర్స్ కోసం ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. చైతన్య పింగళి, ఆమెతోపాటు మరికొంత మంది.. వచ్చి చేరారు. అలా అలా సర్వీస్ అనేది ఓ ఉద్యమంలా మారింది. ఆరామ్‌ఘర్‌లో రేషన్ పంపిణీ అయిపోయాక సజయా వచ్చేసింది మేడ్చల్ ఓఆర్ఆర్కి. పీఓడబ్ల్య్లూ సం««ధ్య, కవిత పులి, సూరెపల్లి సుజాత, వీవీ జ్యోతి, నవీన్ సరేసరి. ఇలా చెప్పుకుంటే మేడ్చల్ చుట్టుపక్కల వాళ్లు, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్లు.. టీచర్లు, రిటైర్డ్ పర్సన్స్, గృహిణులు, స్టూడెంట్స్, పిల్లలు.. ఒక్కరు కాదు.. ఎంతమందో! తర్వాత కొంపెల్లిలో కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశాం. ఇక్కడ హైవే మీద టెంట్ల సంఖ్యా పెరిగింది. మేం చేస్తున్నది చూసి లోకల్ అడ్మినిస్ట్రేటర్స్ కూడా స్పందించారు. నాలుగు రోజుల్లో పది టెంట్లు వేయించి, ఆరు వాటర్ ట్యాంకర్లు, నాలుగు టాయ్లెట్లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సాయంత్రం వచ్చి ఆ మరుసటి రోజుకి మా అవసరాలేంటో కనుక్కొని తెల్లవారికల్లా వాటిని అరెంజ్ చేసేవారు. మే 12 నుంచి 26వ తారీఖు వరకు ఒక్కరంటే ఒక్కరు కూడా ఆకలి, దాహంతో ఈ మేడ్చల్ ఓఆర్ఆర్ ఫుడ్ పాయింట్ దాటలేదు. దాదాపు రెండున్నరలక్షల మందికి ఈ ఫుడ్పాయింట్లో భోజనం పెట్టడమే కాదు, వాళ్లు ఇల్లు చేరేవరకు వాళ్లు వెళ్లే దూరాన్ని బట్టి వాళ్లకు సరిపడా ఫుడ్‌ను ప్యాక్ చేసి ఇచ్చాం. మొదట్లో వచ్చినవాళ్లను వచ్చినట్లు ట్రక్కులు మాట్లాడి ఎక్కించేవాళ్లం. అయితే ఎక్కడో ఒక ట్రక్కుకి యాక్సిడెంట్ (మేం పంపించిన వాళ్లవి కాదు) అయిందని తెలిసి ట్రక్స్‌లో పంపించడం అంత సేఫ్ కాదనిపించింది. దాంతో బస్సుల అరెంజ్మెంట్కు స్పాన్సర్షిప్ మొదలైంది. 30 బస్సులు ఆర్గనైజ్ అయ్యాయి. ప్రతి ఒక్కరూ చిన్న నుంచి పెద్ద వరకూ అందరూ దాన్నో బాధ్యతగా ఫీలయ్యారు. అక్కడ ఎవరి బ్యానర్స్ లేవు. ఎవరు ఏది తీసుకొచ్చినా అందరు కలిసే సర్వ్ చేశారు. రోజూ ఉదయం ఎనిమిది గంటలకు వచ్చి రాత్రి పదకొండు గంటల వరకు ఉండేవాళ్లం. లోకల్‌గా ఉండే శ్రీనివాస్ సజ్జ, శ్రీరామ్ ఉదయం ఆరున్నరకే క్యాంప్ ఓపెన్ చేసేవాళ్లు. రోజంతా నిలబడే ఉండేవాళ్లు’ అంటూ మేడ్చల్ ఓఆర్ఆర్ ఫుడ్ క్యాంప్ గురించి చెప్పుకొచ్చారు సి. వనజ. ఆమె అన్నట్లుగా ఈ క్యాంప్‌లో తమ వంతు బాధ్యతను నిర్వహించిన వాళ్లెందరో. ఇండస్ మార్టిన్, అరుణాంక్ లత, మోషే డయాన్, ఉషాజ్యోతి బంధం వంటి యాక్టివిస్ట్‌లు, ఆర్టిస్ట్‌లు సహా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉండే స్టూడెంట్స్, చింతల్‌బస్తీలో ఉండే చిరు వ్యాపారాలు, యువత, బస్సుల ఏర్పాటుకు శక్తి కొలది సహాయం చేసే ప్రియాంక దత్ వంటి సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు మొదలు సామాన్యుల వరకు చెప్పుకుంటూ పోతే ఎందరో మనసున్న మనుషులు. పెర్కిట్ ఫుడ్ క్యాంప్.. మోతే గంగారెడ్డి.. ఫిల్మ్ మేకర్. హైదరాబాద్‌లో నివాసి. ఏప్రిల్ రెండో తారీఖున.. హైదరాబాద్‌లోనే అతనికి ఒక వ్యక్తి కనిపించాడు... తల మీద ఇనప్పెట్టె పెట్టుకొని, పిల్లల్ని వెంటేసుకొని నడుస్తూ. ‘ఎక్కడికి వెళ్తున్నావ్?’ అని అడిగాడు. ‘ఛత్తీస్‌గఢ్ సాబ్ ’ జవాబిచ్చాడు అతను. సొంతూళ్లకు కాలినడక మొదలుపెట్టిన వలసకార్మికుల గురించి వస్తున్న వార్తలను అప్పటికే చదివున్నాడు గంగారెడ్డి. ఆ రోజు ప్రాక్టికల్‌గా చూస్తున్నాడు. వెంటనే వాళ్లకు చేయగలిగిన సాయం చేశాడు. కాని మనసులోంచి ఆ వ్యక్తి ముద్ర చెరిగిపోలేదు. ఇలా హైదరాబాద్ మీదుగా ఎంతమంది వెళుతున్నారో అనే ఆలోచన మొదలైంది అతనిలో. ఒకరోజు రాత్రి రెండు గంటలకు కార్లో సొంతూరు బయలుదేరాడు. అంత రాత్రి కూడా నేషనల్ హై వే మీద వలసకార్మికులు నడుస్తూనే ఉన్నారు. మధ్య మధ్యలో కారు ఆపుతూ ఎక్కడి వెళ్తున్నారు అని అడిగితే.. ‘ఛత్తీస్ గఢ్’ అని కొంతమంది.. ‘మధ్యప్రదేశ్’ అని కొంతమంది.. ‘బిహార్’ అని మరికొంతమంది, ‘యూపీ’ అని ఇంకొంతమంది నుంచి సమాధానం. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు.. తలల మీద, భుజాలకు బరువులు... చంకలో చంటిపిల్లలు.. డబ్బుల్లేవు.. తిండీ లేదు.. తన దగ్గరున్న కొంత డబ్బిచ్చాడు.. ఎంతని ఇవ్వగలడు? ఎంత మందికి అని ఇవ్వగలడు? వాళ్లు వెళ్లే రూట్లో ఉండే ఊళ్లళ్లోని తన ఫ్రెండ్స్‌ని, తెలిసిన వాళ్లందరినీ అలర్ట్ చేశాడు ఆ వలసకార్మికులకు ఏదైనా సహాయం అందించడం గురించి. అక్కడితో ఆగిపోకుండా, తనకు ఎదురైన సంఘటనల గురించి ఎప్పటికప్పుడు ఫేస్బుక్లో పోస్ట్ చేస్తూనే ఉన్నాడు వీడియోలతో సహా. మే ఒకటవ తారీఖున.. తన ఊళ్లోని యూత్‌తో మీటింగ్ పెట్టాడు. అంశం.. వలసకార్మికులే. హైవే మీద తనకు ఎదురైన అనుభవాల గురించి చెబుతూ కాలినడకన వెళ్లే వలసకార్మికులను ట్రాక్టర్ల మీద తీసుకెళ్లి బార్డర్ దాటించే ఏర్పాట్లు ఏమైనా చేద్దామా? అని అడిగాడు. అతని ప్రతిపాదన సబబుగానే అనిపించినా పర్మిషన్ దొరకదని, అనుమతి లేకుండా అంత పెద్ద బాధ్యత తీసుకోవడానికి భయపడ్డారు. చేసేదిలేక తెల్లవారే మళ్లీ హైవే బాటపడ్డాడు గంగారెడ్డి. ఆర్మూర్ గుట్టల మధ్య ఇంకో బారు కనిపించింది అతనికి. మ««ధ్యాహ్నానికి మరొకటి. ఆ పూట వెళ్తున్న వారిలో ..ఒక మహిళ తల మీద మూట ఉంది.. చంకన మూడేళ్ల బిడ్డ.. ఆమె ముందు ఓ అయిదేళ్ల పాపా.. ఆ పాప చంకన యేడాదిన్నర మరో చంటి బిడ్డ. ఆ వరుసలో ఇంకా చిన్న పిల్లలున్నారు.. ఎండకు మొహాలు కమిలిపోయి.. నీళ్లు లేక నోరు పిడచకట్టుకుపోయి... తిండి లేక నీరసపడిపోయి.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్.. మొత్తం నాలుగు రాష్ట్రాల వాళ్లు.. మొత్తం 120 మంది నడుస్తునే ఉన్నారు... అడిగాడు ఎక్కడి నుంచి వస్తున్నారు అని గంగారెడ్డి. తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తున్నారట. 20 రోజులుగా నడుస్తూనే ఉన్నారట. ‘ఏం దేశం? ఏం అభివృద్ధి ఇది?’ ఇది అనుకున్నాడు. వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేస్తే వచ్చారు. ఆ 120 మందిని ఎలాగైనా వెహికిల్స్‌లో పంపించాలని అటుగా వెళ్తున్న లారీలను అపారు. రెండు లారీలు తీసుకెళ్లడానికి ఓకే చెప్పాయి. అవి మహారాష్ట్ర వెళ్తున్నాయి కాబట్టి.. అందరినీ ఆ బార్డర్లో దింపేస్తాం అన్నారు డ్రైవర్లు. ఆ కాస్త దూరం శ్రమ తగ్గినా తగ్గినట్టే కదా.. అని ఒప్పుకున్నారు. ఆ వలసకార్మికులను ఎక్కించి పంపేశారు. మనసు కాస్త కుదుట పడింది. అసలు ఈ హైవే మీద ఎంత మంది నడుస్తున్నారో చూడాలని ఒకరోజు ఇందల్వాయి (నిజామాబాద్ దగ్గర) నుంచి మహారాష్ట్ర బార్డర్ పెన్‌గంగ వరకు ప్రయాణించాడు గంగారెడ్డి. హైవే మొత్తం రైలుపెట్టెలా వరుసగా కార్మికులు నడుస్తూ కనిపించారు. ఆ సమయంలో పెర్కిట్ చౌరస్తా దగ్గర కొంత మంది టీచర్లు, బీడీ కార్ఖానా రాజేశ్వర శర్మ ఈ వలసకార్మికులకు ఫుడ్ పార్శిల్స్ తెచ్చివ్వడం, అలాగే సుంకేట్ గ్రామానికి చెందిన జయప్రకాశ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఊళ్లోని యువతతో కలిసి ఇటుకబట్టీ వలస కార్మికులకు ఫుడ్ అందించడం, ఆర్మూర్ దగ్గర్లోని జానకంపేట్‌కు చెందిన కొందరు, పచ్చల నడుకుడ యూత్, కొంతమంది రైతులు కూడా వలసకార్మికుల ఆకలి తీర్చడం కోసం ప్రయత్నించడం, ముప్కాల్ హైవే మీద అమీనా బేగం అనే ఓ మహిళ రోజుకి కనీసం 250 మంది వలసకార్మికులకు భోజనం పెట్టడం కనిపించింది. వాళ్లందరితో మాట్లాడి వాళ్ల ఇంటర్వ్యూలనూ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు గంగాధర్. అయితే ఇలా ఎవరికి వారు.. వాళ్లకు అనుకూలమైన సమయాల్లో సహాయం అందించడం వల్ల చేస్తున్న సహాయం కూడా సరిగ్గా ఉపయోగపడట్లేదు.. అందిన వాళ్లకు ఆహారం అందుతోంది... అందని వాళ్లు కాలే కడుపుతోనే పొలిమేర దాటుతున్నారని గ్రహించాడు గంగారెడ్డి. వీళ్లందరినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి నిర్విరామంగా సహాయ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. అనుకున్నట్టుగానే ఆ వ్యక్తులందరినీ కలిశాడు. తన స్నేహితులకూ చెప్పాడు. టీచర్స్ గ్రూప్‌కు నాయకత్వం వహిస్తున్న ఎమ్ఈఓ రాజేశ్వర్‌కు ఆ సూచన నచ్చింది. మిగతా వాళ్లూ ఓకే అన్నారు. అంతా కలిసి పెర్కిట్ కూడలి దగ్గర టెంట్లు వేశారు. ఈ విషయాన్ని మళ్లీ ఎఫ్బీలో పోస్ట్ చేసి.. డబ్బు సాయం కోరాడు గంగాధర్. ఎమ్ఈఓ రాజేశ్వర్ అకౌంట్ నంబర్ ఇచ్చాడు. పన్నెండు రాష్ట్రాలు.. నేపాల్ వాళ్లు కూడా ‘మంచి స్పందన వచ్చింది. నా ఫ్రెండ్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. ఎన్ఆర్ఐలూ స్పందించారు. మే 13న మొదలుపెట్టాం. మొదటి రోజు రూ.2.60 లక్షలు వస్తే, రెండో రోజుకి అది రూ. 6 లక్షలకు చేరింది. వారం రోజులకు రూ.20.70 లక్షలు అయ్యాయి. అన్ని డిటైల్స్ ఎప్పటికప్పుడు ఎఫ్బీలో పోస్ట్ చేసేవాళ్లం. అంతా పారదర్శకంగానే సాగింది. కమ్యూనిటీ కిచెన్ ఏర్పాటు చేశాం. మనుషుల ఫ్లోను బట్టి అన్నం ఉడికేది. పొద్దున్నుంచి రాత్రి వరకు వేల మంది కార్మికులు. ఎవరూ ఆకలితో వెళ్లకూడదు. డీహైడ్రేట్ కాకూడదు. చల్లటి నీళ్లు, మజ్జిగ, కీర దోసకాయలు, అరటిపళ్లు కొరత లేకుండా చూసుకున్నాం. అన్నం పెట్టి, మంచినీళ్ల బాటిల్, అరటిపళ్లు, బిస్కట్లు, బ్రెడ్, కీర, మజ్జిగ పాకెట్ పార్సిల్ చేసి ఇచ్చేవాళ్లం. కొంతమంది అయితే 30 గంటలు ఆహారం లేకుండా వచ్చారు నీరసపడిపోయి. దారి తెలియకుండా అలా రోడ్డు పట్టుకుని నడుస్తున్న వాళ్లూ ఉన్నారు. పెర్కిట్ కూడలి దగ్గర పన్నెండు రాష్ట్రాల వాళ్లు వచ్చారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బిహార్, యూపీ, రాజప్థాన్, గుజరాత్, పంజాబ్, అస్సాం, ఒడిశా, వెస్ట్ బెంగాల్, ఢిల్లీతోపాటు నేపాల్ వాళ్లు కూడా ఉన్నారు. ఒడిశా, బెంగాల్ అటువైపు ఎందుకు వచ్చారు అంటే దారి తెలియక. ఇలా వలసకార్మికులు నడుస్తూ కనపడితే వాళ్లు కూడా వీళ్లతో కలిసి నడవడం మొదలుపెట్టారు. వాళ్ల అమాయకత్వం, వాళ్ల కష్టం చూస్తే ఎంత బాధేసిందంటే.. ఏ సమాజంలో ఉన్నాం మనం అనిపించింది. లాక్‌డౌన్‌తో పనిపోతే వాళ్లు డబ్బుల కోసమూ డిమాండ్ చేయలేదు. కనీసం మా ఊరికి బస్సు వేయండీ అని కూడా రిక్వెస్ట్ చేయలేదు. అయ్యా.. మమ్మల్ని వదిలేస్తే మా దారిన మేం పోతాం ఇంటికి అన్నారు. సురక్షితంగా వాళ్లను ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికుంది.. అది కార్మికులుగా తాము డిమాండ్ చేసుకోగల హక్కు అన్న కనీసమైన ఎరుక కూడా వాళ్లకు లేదు. వీళ్లు లేకపోతే నగరాల అభివృద్ధి ఎక్కడిది? వాళ్ల శక్తిని పిండుకుని వాళ్ల కర్మకు వాళ్లను వదిలేశాం. ఇంతకన్నా అమానుషం ఇంకొకటి ఉండదు. వాళ్లకు ఉపయోగపడని ఈ అభివృద్ధి ఎందుకు? నడుస్తూ నడుస్తూ సొమ్మసిల్లిన వాళ్లను చూస్తే కడుపులోంచి దుఃఖం వచ్చేది. ఇక్కడ మానవీయ సందర్భం ఏంటంటే.. చాలా మంది ట్రక్కు డ్రైవర్లు వలసకార్మికులను ఉచితంగానే తీసుకెళ్లారు. మేం డబ్బులిస్తున్నా తీసుకోలేదు. వలసకార్మికులు కూడా నోరు విడిచి అన్నం పెట్టమని అడగలేదు. వెనక వరుసలో ఉన్న వాళ్లకు సరిపోదేమోనని కడుపు నిండకపోయినా మాకు చాలు వాళ్లకు వడ్డించండి అని చెప్పేవారు. వాళ్లను సురక్షితంగా ఇళ్లకు చేర్చాలని స్థానిక నాయకులనూ కోరాం. మంత్రి ప్రశాంత్‌రెడ్డి స్పందించారు. ఆరెంజ్ ట్రావెల్స్ సునీల్ రెడ్డి బస్సులు వేసి హెల్ప్ చేశారు. ఇళ్లకు చేరుకున్న వాళ్లంతా ఫోన్లు చేసి క్షేమంగా చేరుకున్నాం.. తెలంగాణలో దొరికినట్టుగా తర్వాత మాకు ఎక్కడా ఆదరం అందలేదు అని చెప్తుంటే బాధ.. మళ్లీ మళ్లీ దుఃఖం. నిజానికి హై వే అంతా అలా ప్రతి పది కిలోమీటర్లకు ఒక క్యాంప్ పెడితే బాగుణ్ణనిపించింది. అందరినీ కలుపుకొని ఆర్గనైజ్ చేయడానికి ట్రై చేద్దామనుకున్నా, కుదరలేదు. ఎవరూ చెప్పకుండానే అమీనా బేగం, సుంకేట్ యూత్, టీచర్లు, రైతులు, బీడీ కార్ఖానా రాజేశ్వర్, ఇందల్వాయి దగ్గర డాక్టర్ అండ్ మెడికల్ స్టూడెంట్స్ గ్రూప్, మేడ్చల్ హైవే మీది ఫుడ్ క్యాంప్.. వీళ్లంతా వాళ్లంతట వాళ్లే స్పందించి తోటి మనుషుల కష్టాన్ని తగ్గించాలనుకున్నారు.. ఇంతకన్నా ఏం కావాలి. మనసు భారమైనప్పుడు వీళ్లే ఆశను పెంచుతారు నాకే కాదు సమాజానికి కూడా. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా కొంతమంది వస్తూన్నారు కాబట్టి మా ఈ ఫుడ్ క్యాంప్‌ను ఇంకా పదిహేనురోజులు కొనసాగించాలనుకుంటున్నాం’ అని చెప్పాడు మోతే గంగారెడ్డి. ఆంధ్రప్రదేశ్‌లో సేవ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి విజయవాడ – చెన్నై హైవే ఫుడ్ క్యాంప్‌గా మారింది. నిజానికి అక్కడి ప్రభుత్వమే వలసకార్మికుల బాధ్యతను తీసుకుంది. కాలినడకన వస్తు్తన్న వాళ్లకు సహాయం అందించడానికి సూరజ్ ధనుంజయ్ అనే అసిస్టెంట్ కలెక్టర్‌ను నియమించింది. ‘మంచి కోఆర్డినేషన్‌తో ఇక్కడి గవర్నమెంట్ పనిచేసింది’ అన్నారు పీఓడబ్ల్యూ సభ్యురాలు, గుంటూరు పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ రమాసుందరి. ఆంధ్రప్రదేశ్– ఒడిశా బార్డర్ వరకు ప్రభుత్వమే బస్సులు నడిపింది. ప్రతి ఒక్కరినీ స్క్రీనింగ్ చేసి సురక్షితంగా పంపారు. ప్రైవేట్ సంస్థలు, మహిళా సంఘాలు, వ్యక్తులు కూడా వలస కార్మికులకు సహాయం అందించారు. అందులో పీఓడబ్ల్యూ, జమాతే ఇస్లాం హింద్ ఆర్గనైజేషన్‌లోని సాంఘిక సేవా విభాగం కూడా ఉన్నాయి. విజయవాడ – చెన్నై హైవే అప్పటిదాకా ఊళ్లోనే ఉన్న కార్మికులకు సహాయం అందిస్తున్న పీఓడబ్ల్యూ మహిళా సంఘం సభ్యులు వలసకార్మికుల నడక గురించి విని ‘మన హైవే ఎలా ఉందో చూద్దాం’ అని విజయవాడ– చెన్నై హైవే మీదకు వెళ్లారు. సైకిళ్ల మీద వస్తూ కనిపించారు. ఆపి అడిగారు ‘ఎందుకలా రిస్క్ తీసుకుంటున్నారు?’ అని. ‘ఏం చేస్తాం మరి? మీరేమైనా బస్సుల్లో పంపే సహాయం చేయగలరా?’ అని అడిగారు. అప్పటికప్పుడు అంటే ఏ మార్గం తోచలేదు. బస్సులు కాకపోయినా కనీసం ఫుడ్, ప్రయాణంలో అవసరమయ్యే వస్తువులతో కిట్స్ అన్నా ఇవ్వాలి అనుకున్నారు. రమా సుందరి తన దగ్గరి అయిదు వేల రూపాయలతో వస్తువులు కొందామనుకునేలోపు ఆమె స్టూడెంట్ కూడా అయిదువేల రూపాయలను ఇచ్చింది. ఆ పదివేల రూపాయలతో బ్రష్‌లు, పేస్ట్‌లు, టవల్స్, సోప్స్, బిస్కట్, బ్రెడ్ పాకెట్స్ వంటివి కొని కిట్స్లా తయారు చేశారు. మిగిలిన అరెంజ్‌మెంట్స్‌తో తెల్లవారి హైవే మీదకు వెళ్లారు. రెవన్యూ డిపార్ట్మెంట్ వాళ్లకు తెలిసి వాళ్లు వచ్చి టెంట్లు వేసి ఓ సెంటర్లా చేశారు. వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టాఫ్‌ను అక్కడ పెట్టారు. ఒడిశా, బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, బిహార్, యూపీ వాళ్ల ఎక్కువగా వస్తున్నారు. వాళ్లందరికీ ఈ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్లు సహాయం అందించడం మొదలుపెట్టారు. అయితే పీఓడబ్ల్య్లూ వాళ్లు ఆ సెంటర్ కన్నా కాస్త ముందుకు వెళ్లి.. సైకిళ్ల మీద, నడుస్తూ వస్తున్న వాళ్లను ఆపి వాళ్లకు తమ దగ్గరున్న కిట్స్ పంచుతూ ‘ముందు గవర్నమెంట్ సెంటర్ ఉంది.. వాళ్లను సంప్రదించండి మీకు సహాయం అందుతుంది’ అని సూచించే బాధ్యతను తీసుకున్నారు. ‘ప్రభుత్వమే చాలా మంది కార్మికులను పంపింది. అస్సాం వంటి చోట్లకు వెళ్లాల్సిన వాళ్లను రెండు మూడు జిల్లాల వాళ్లు కలిసి డబ్బు పోగేసి పంపారు. చివరకు వెస్ట్‌బెంగాల్ వాళ్లు మిగిలారు. మా దగ్గరున్న ఫండ్స్‌తో ఓ వెహికిల్ మాట్లాడాం. మమతా బెనర్జీ అనుమతించట్లేదని తెలిసినా సాహసించాం.. కనీసం బార్డర్ వరకు అయినా పంపిస్తే అక్కడినుంచి ఎలాగైనా సొంతప్రాంతానికి చేరుకుంటారనే ఆశతో. ఇక వెళ్లిపోతారనగా ప్రభుత్వం వాళ్లను హ్యాండ్ ఓవర్ చేసుకుంది రైలులో పంపిస్తాం అని. వాళ్లను విజయవాడ తీసుకెళ్లాక బెంగాల్లో తుఫాను వల్ల ట్రైయిన్ క్యాన్సిల్ అయిపోయింది. ఆగిపోయారు. వాళ్లలో మాల్డా బ్యాచ్ వాళ్లూ ఉన్నారు. అందులో ఒక అబ్బాయి తండ్రి చనిపోయాడు. ఆ పిల్లాడి కష్టం చూస్తే చాలా బాధేసింది. ఆ పిల్లాడికి కొంత డబ్బు ఇచ్చాం. అయితే తర్వాత తెలిసింది.. తోడుగా ఉన్న ఓ వ్యక్తితో కలిసి ఆ అబ్బాయి నడుచుకుంటూ వెళ్లిపోయాడని. చేరుకున్నాడో లేదో.. ఇటుగా వెళ్లిన చాలామంది పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ల పిల్లలే. కొంతమందైతే తల్లిదండ్రులకు వాళ్లక్కొరే సంతానంగా ఉన్నవాళ్లు. ఇంతదూరం ఎందుకు పంపించారు మీ అమ్మానాన్న అంటే ‘అక్కడ పనుల్లేవ్’ అనే సమాధానం. ఆ పిల్లలంతా ఇక్కడ పానీపూరీ బండ్లు, ఐస్‌క్రీమ్ బండ్లు నడుపుకుంటున్న వాళ్లే. కాళ్లకు చెప్పుల్లేవు, తిండి లేదు. చెప్పులిచ్చి, తిండి పెట్టి .. బాగా నడవండి అని చెప్పి పంపినట్టయింది అనిపించింది. మనం చేసింది కరెక్టేనా అనే బాధ తొలుస్తోంది. వలస కార్మికుల విషయంలో వ్యవస్థలూ స్పందించాలి. ప్రభుత్వాలదే తప్పు. మీకేం కాదు అన్న ఒక ధైర్యాన్ని, భరోసాని ఇవ్వలేకపోయాయి ప్రభుత్వ వ్యవస్థలు’ అంటున్నారు పీఓడబ్ల్యూ సభ్యులు. కత్తిపూడి హైవే ఇక్కడ సహాయకార్యక్రమాలు చేపట్టింది జమాతే ఇస్లాం హింద్ ఆర్గనైజేషన్‌లోని సాంఘిక సేవా విభాగం. ‘చెన్నై నుంచి బిహార్ వెళ్లే వాళ్లు ఈ మార్గం గుండా నడిచారు. అందరూ యంగ్‌స్టర్సే. చెన్నై నుంచి ఎనిమిది రోజులుగా నడుస్తున్నారట. భోజనం పెట్టి, పార్సిల్స్ ఇస్తుంటే, ఏదైనా వెహికిల్ ఉంటే పంపించండి.. కొంత దూరమైనా పర్లేదు అని రిక్వెస్ట్ చేసేవాళ్లు. బాధనిపించింది. కొందరిని హైవే మీద వెళ్తున్న లారీల్లో ఎక్కించాం. అప్పటి నుంచి మా సర్వీస్‌ను కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసుకున్నాం. బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా విడిపోయి తణుకు, రాజమండ్రి, మండపేట హైవేల్లో క్యాంప్‌లు పెట్టాం. కాకినాడ స్టార్టింగ్ పాయింట్. వలస కార్మికులు ముందు కాస్త తక్కువగానే కనిపించినా తర్వాతర్వాత బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా రావడం మొదలైంది. పతి రోజూ అయిదు వందల లీటర్ల మజ్జిగ, ఫుడ్ ప్రిపేర్ చేసేవాళ్లం. వాళ్లకు భోజనం పెట్టి, పార్శిళ్లు ఇచ్చి వెహికిల్స్ ఎక్కిస్తుంటే చల్లగా ఉండండి అని దీవెనలిచ్చేవారు. వాళ్ల మొహాల్లో తృప్తి చూస్తే చాలా సంతోషంగా ఉండేది. ఈద్ కూడా వాళ్లతోనే కలిసి చేసుకున్నాం. అందరికీ వేడివేడి షీర్ కుర్మా పంచాం. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి.. లాక్డౌన్ కంటే ముందు వరకు ఎన్ఆర్సీ, సీఏఏకు వ్యతిరేకంగా మేం ఉద్యమం చేశాం. అప్పటిదాకా క్లోజ్‌గా ఉన్న మా హిందూ ఫ్రెండ్స్ చాలా మంది దూరం పాటించారు. కాని మేం హైవే మీద ఈ సర్వీస్ మొదలుపెట్టాక మళ్లీ వాళ్లంతా మాతో కలసి పాలు పంచుకుంటున్నారు. మానవత్వానికి కులమతాల అడ్డులేదు. మనుషులంతా ఒకటే.. అంతా కలిసే ఉందామనుకుంటారు’ అని చెప్తాడు మెకానికల్ ఇంజనీర్ హసన్ షరీఫ్. -సరస్వతి రమ -
తొలి ముఖ చిత్రం
చిన్నప్పుడు ఇష్టంగా వాడిన వస్తువులు, దిగిన ఫొటోలు వంటివన్నీ అపురూపంగా దాచుకుంటాం. పెద్దయ్యాక చూసుకుని మురిసిపోతాం. ఇప్పుడు రష్మికా మందన్నా ఒక ఫొటోను బయటపెట్టి, తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇదిగో ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ఫొటో ఒకటి ఉంది కదా. ఈ ఫొటోనే రష్మిక షేర్ చేశారు. ఒక పత్రిక కవర్‌పేజీ మీద ఉన్న చిన్నారి రష్మిక చాలా ముద్దుగా ఉంది కదూ. 2001లో ప్రింట్ అయిన తమిళ పత్రిక ‘గోకులం’ ముఖచిత్రం కోసమే రష్మిక ఇలా రెండు చేతులకు వాచీలు పెట్టుకుని పోజిచ్చారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ అలానే రెండు చేతులకు వాచీలు పెట్టుకుని సరదాగా ఫొటో దిగారు. ‘‘నా ఫస్ట్ కవర్ పేజీ ఇది. అప్పుడు జరిగిన ఫొటోషూట్ నాకింకా గుర్తుంది. మా అమ్మగారు ఆ పత్రికను భద్రంగా దాచారు. ఇప్పటికీ నా గురించి ఏ పత్రికలో వచ్చినా దాస్తుంటారు. ఇవాళ నటిగా మీ (ప్రేక్షకులు) ప్రేమను దక్కించుకోవడానికే ఇంతదాకా వచ్చానా? అనిపిస్తోంది. నా ఈ ఎదుగుదలకు కారణం నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు. అలాగే నేను వర్క్ చేసిన, చేస్తున్నవారు కూడా ఓ కారణం. ఒక మైల్స్టోన్ చేరుకునే క్రమంలో చేసిన యుద్ధాలు... సారీ.. ఎక్కువ చెబుతున్నాను కదూ’’ అని పేర్కొన్నారు రష్మికా. -
మహమ్మారి వైరస్‌కు విరుగుడు
ఆధునిక వైద్యశాస్త్రం పురోగతి సాధించిన ప్రస్తుత కాలంలో ఎలాంటి వైరస్‌కు అయినా విరుగుడు దానిని అరికట్టగల వ్యాక్సిన్ మాత్రమే. ఎలాంటి వ్యాక్సిన్లు లేని కాలంలో సైతం రకరకాల వైరస్లు మనుషులను సోకి మహమ్మారి రోగాలను వ్యాప్తి చేసేవి. మహమ్మారి రోగాలు వ్యాపించిన కాలాల్లో పెద్దసంఖ్యలోనే మరణాలు సంభవించేవి. అలాగని మానవాళి పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదు. మనుషుల్లోని రోగనిరోధకత సహజంగానే ఉంటుంది. ఒకసారి ఏదైనా మహమ్మారి వ్యాధి సోకి, దాని నుంచి కోలుకున్న వాళ్లు తిరిగి అది విజృంభించినప్పుడు దానిని సమర్థంగా ఎదుర్కొనే శక్తిని సహజంగానే సంతరించుకుని ఉంటారు. అయితే, సహజ రోగనిరోధక శక్తి తగినంతగా లేనివాళ్లు మాత్రం మహమ్మారి రోగాల తాకిడికి ప్రాణాలను కోల్పోతూ ఉంటారు. ఆధునిక వైద్యరంగం ఎన్నో రకాల మహమ్మారి వ్యాధులకు విరుగుడుగా వ్యాక్సిన్లను తయారు చేయగలిగింది. చాలావరకు రోగాలను సమర్థంగా కట్టడి చేయగలిగింది. ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న నావెల్ కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు సైతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఎందరో శాస్త్రవేత్తలు పలు వ్యాక్సిన్లను ఇప్పటికే రూపొందించారు. వీటిలో కొన్నిటిని ఇప్పటికే మనుషులపై ప్రయోగించడం కూడా ప్రారంభించారు. మరికొన్ని వ్యాక్సిన్లు మాత్రం ఇంకా మనుషులపై ప్రయోగాలు జరిపే దశకు చేరుకోలేదు. ‘వరల్డ్ ఇమ్యూనైజేషన్ వీక్’ (ఏప్రిల్ 24–30) సందర్భంగా ‘కరోనా’ను అరికట్టే లక్ష్యంతో తయారవుతున్న వ్యాక్సిన్ల గురించి, అసలు వ్యాక్సిన్లే లేని కాలంలో ఇమ్యూనైజేషన్‌పై జరిగిన ప్రయోగాల గురించి సంక్షిప్తంగా మీ కోసం.. ఇమ్యూనైజేషన్ ఇమ్యూనైజేషన్‌కు ముందు కాలంలో ‘ఇనాక్యులేషన్’ ద్వారా రోగ నిరోధకతను పెంపొందించే ప్రయత్నాలు చేసేవారు. ‘ఇనాక్యులేషన్’ అంటే, కృత్రిమ పద్ధతిలో వ్యాధి సోకేలా చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని పెంపొందించేలా చేయడమన్న మాట. మశూచి వ్యాధి విజృంభించినప్పుడు క్రీస్తుశకం పదిహేనో శతాబ్దిలో కొందరు ఇలాంటి ప్రయత్నమే చేశారు. మశూచి రోగుల శరీరంపై ఏర్పడిన పొక్కుల నుంచి కారిన రసిని ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడిని ఆరోగ్యవంతుల ముక్కుల్లోకి వెళ్లేలా ఊదేవారు. దీనివల్ల ఆరోగ్యవంతుల్లో మశూచి లక్షణాలు స్వల్పస్థాయిలో ఏర్పడి, కొంతకాలానికి తగ్గిపోయేవి. ఈ ప్రక్రియలో వారి శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేది. తర్వాతి కాలంలో మశూచి వ్యాపించినా, వారిని పెద్దగా ఇబ్బందిపెట్టేది కాదు. ఇలా మశూచిని కృత్రిమంగా సోకేలా చేయడం వల్ల జనాల్లో రోగ నిరోధక శక్తిని పెంపొందించే ప్రక్రియను గురించి పదహారో శతాబ్దికి చెందిన చైనా శాస్త్రవేత్త వాన్ ఖువాన్ తన ‘డౌజెన్ జిన్ఫా’ గ్రంథంలో విపులంగా వివరించాడు. ఆధునిక ఇమ్యూనైజేషన్ ప్రక్రియతో పోల్చుకుంటే, ఈ ఇనాక్యులేషన్ ప్రక్రియ కొంత ముతక పద్ధతేనని చెప్పుకోవచ్చు. అయితే, మశూచి సోకిన వారిలో మరణాల రేటు దాదాపు 20–30 శాతం వరకు ఉంటే, ఇనాక్యులేషన్ ప్రక్రియ ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందించుకున్న వారిలో మరణాల రేటు కేవలం 0.5 నుంచి 2.0 శాతం వరకు మాత్రమే ఉండేది. చైనాలో దాదాపు వందేళ్ల పాటు ఇనాక్యులేషన్ పద్ధతితోనే అంటువ్యాధులపై పోరాటం సాగించారు. అక్కడి నుంచి ఈ పద్ధతి ఈస్టిండియా కంపెనీ ఉద్యోగుల ద్వారా పద్దెనిమిదో శతాబ్ది నాటికి ఇంగ్లాండ్‌కు పాకింది. ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ 1798లో మశూచికి వ్యాక్సిన్‌ను రూపొందించాడు. ప్రపంచంలో ఇదే తొలి వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ రూపకల్పన తర్వాత ఇనాక్యులేషన్ ప్రక్రియ కనుమరుగైంది. ఇమ్యూనైజేషన్ రకాలు... ఇమ్యూనైజేషన్ రెండు రకాలు. ఒకటి: యాక్టివ్ ఇమ్యూనైజేషన్, రెండు: పాసివ్ ఇమ్యూనైజేషన్. మనిషి శరీరంలోకి వ్యాధికారక సూక్ష్మజీవిని పంపడం ద్వారా యాక్టివ్ ఇమ్యూనైజేషన్ జరుగుతుంది. వ్యాధికారక సూక్ష్మజీవి శరీరంలోకి చేరగానే, శరీరంలోని యాంటీబాడీస్ సూక్ష్మజీవికి వ్యతిరేకంగా వెనువెంటనే పోరాటం ప్రారంభిస్తాయి. బాల్యంలో ఒకసారి సోకిన ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడిన తర్వాత తిరిగి ఆ ఇన్ఫెక్షన్లు దాదాపు సోకవు. ఒకవేళ సోకినా, వాటి తీవ్రత నామమాత్రంగా ఉంటుంది. ఆధునిక వ్యాక్సిన్ల ద్వారా కృత్రిమంగా యాక్టివ్ ఇమ్యూనైజేషన్ చేస్తారు. ఈ ప్రక్రియలో వ్యాధికారక సూక్ష్మజీవులను పూర్తిగా గాని, వాటిలోని కొన్ని భాగాలను గాని శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తారు. సూక్ష్మజీవిని పూర్తిగా ఇంజెక్ట్ చేయాల్సి వస్తే, దానిని ముందుగానే నిర్వీర్యం చేస్తారు. మశూచి, గవదబిళ్లలు, రుబెల్లా, ఎఎంఆర్, యెల్లో ఫీవర్, ఆటలమ్మ, రోటావైరస్, ఇన్‌ఫ్లూయెంజా వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పించేందుకు రూపొందించిన వ్యాక్సిన్లు యాక్టివ్ ఇమ్యూనైజేషన్ పద్ధతిలో రూపొందించినవే. పాసివ్ ఇమ్యూనైజేషన్‌లో సూక్ష్మజీవులను లేదా వాటి భాగాలను శరీరంలోకి ఎక్కించరు. దానికి బదులు శరీరంలోని రోగనిరోధక కణాలలోని అంశాలను సంశ్లేషణ చేసి, వాటిని శరీరంలోకి ఎక్కిస్తారు. ఇలా ఎక్కించిన రోగ నిరోధక కణాలు శరీరంలోకి రోగ కారక సూక్ష్మజీవులు చేరినప్పుడు శరవేగంగా స్పందించి, వాటితో పోరాడతాయి. అయితే, పాసివ్ ఇమ్యూనైజేషన్ ఫలితాలు స్వల్పకాలికంగా మాత్రమే ఉంటాయి. టిటానస్ వంటి వ్యాధులను పాసివ్ ఇమ్యూనైజేషన్ పద్ధతిలో కట్టడి చేస్తారు. ఏ విరుగుడుకు ఎన్నాళ్లు పట్టిందంటే..? చరిత్రలో రకరకాల వైరస్లు విజృంభించి, మహమ్మారి రోగాలకు దారితీశాయి. తొలినాళ్లలో విజృంభించిన వైరస్‌లకు విరుగుడు ఔషధాలు అందుబాటులోకి రావడానికి శతాబ్దాలకు శతాబ్దాలే పట్టింది. ఆధునిక కాలంలో ఉనికిలోకి వచ్చిన వైరస్‌లకు విరుగుడు మందులు కొంత త్వరగానే అందుబాటులోకి వచ్చాయి. ఒక్కో వైరస్‌కు, దాని విరుగుడు కనుగొనడానికి పట్టిన కాలం శతాబ్దాల నుంచి కొన్ని నెలల వ్యవధిలోకే కుదించుకుపోయిందిప్పుడు. కొన్ని వైరస్లు కలిగించిన వ్యాధులు, వాటి విరుగుడు కనుగొనడానికి పట్టిన కాలం ఈ పట్టికలో... రోగనిరోధకతే రక్షణ కవచం మన చుట్టూ ఎన్నో రోగకారక సూక్ష్మజీవులు ఉంటాయి. అయితే, జనాభాలో తొంభై శాతం మందిలో వాటి ప్రభావం కనిపించదు. కేవలం పట్టుమని పదిశాతం మందిలోనే రోగ లక్షణాలు కనిపిస్తాయి. మన చుట్టూ రోగకారక సూక్ష్మజీవులు ఉన్నా, వాటి ప్రభావం కనిపించకుండా చేసే రక్షణ వ్యవస్థ మనలోనే ఉంటుంది. అదే మన రోగనిరోధక వ్యవస్థ– ఇమ్యూనిటీ. ఇది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి: ఇన్నేట్ ఇమ్యూనిటీ, రెండు: అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ రోగకారక సూక్ష్మజీవుల నుంచి తొలి అంచె రక్షణ మన చర్మమే కల్పిస్తుంది. ఏదైనా కారణం వల్ల చర్మం తెగడం లేదా కాలడం జరిగితే, అక్కడ ఆ రక్షణ వ్యవస్థ పనిచేయదు. అప్పుడు ఆ రక్షణ బాధ్యతను రక్తంలో ఉండే కొన్ని ప్రొటీన్లు తీసుకుంటాయి. పట్టుబడిన శత్రువును కమాండర్ వద్దకు తీసుకుపోయినట్లుగా శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులను చుట్టుముట్టి కణలలోకి తీసుకువెళతాయి. అక్కడి యాంటీబాడీస్, న్యూట్రోఫిల్స్, మ్యాక్రోఫిల్స్, డెండ్రైటిక్ సెల్స్ వంటివన్నీ మరో అంచెలోని వేర్వేరు స్థాయిల్లో శత్రువుపై దాడి చేసినట్లుగా, సూక్ష్మజీవుల ప్రభావాన్ని అక్కడికక్కడే కట్టడి చేస్తాయి. అక్కడ అవన్నీ చీములా మారి హానికరమైన పదార్థాన్ని బయటకు నెట్టేసి, శరీరానికి రక్షణ కల్పిస్తాయి. రకరకాల బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ మనకు ఇదే రీతిలో రక్షణ కల్పిస్తుంది. అక్వైర్డ్ ఇమ్యూనిటీ మన శరీరంలోకి వ్యాక్సిన్ రూపంలో నిర్వీర్యం చేసిన ఏదైనా వైరస్‌ను ప్రవేశపెట్టినట్లయితే, అప్పుడు మన శరీరంలోని కొన్ని కణాలు ఆ వైరస్‌ను గుర్తుంచుకుంటాయి. ఇలా గుర్తుపెట్టుకునే కణాలనే మెమొరీ సెల్స్ అంటారు. భవిష్యత్తులో మన శరీరంలోకి ఆ వైరస్ ప్రవేశిస్తే, పెద్దసంఖ్యలో రోగ నిరోధక కణాలను అభివృద్ధి చేసి ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసేలా చేస్తాయి. శరీరంలో మరో రెండు రకాల రక్షణ వ్యవస్థలు కూడా పనిచేస్తాయి. వాటిలో మొదటిది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ, రెండోది హ్యూమెరల్ ఇమ్యూనిటీ. శరీరంలోకి ఏదైనా రోగకారక సూక్ష్మజీవి ప్రవేశిస్తే, టి.–లింఫోసైట్స్ అనే కణాలు ఆ సూక్ష్మజీవిని చుట్టుముట్టి, దాన్ని మింగేసి, మన శరీరాన్ని దాని నుంచి రక్షిస్తాయి. టీబీ, లెప్రసీ వంటి వ్యాధులకు కారణమైన సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇలాంటి తరహా రక్షణే దొరుకుతుంది. దీనినే సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అంటారు. ఇక హ్యూమరల్ ఇమ్యూనిటీ యాంటీబాడీస్‌పై ఆధారపడి ఉంటుంది. దీనికి బి–లింఫోసైట్స్ అనే కణాలు దోహదపడతాయి. అయితే, ఇవి రోగకారక సూక్ష్మజీవిపై నేరుగా దాడి చేయవు. రోగకారక సూక్ష్మజీవిని ఎదుర్కొనే యాంటీబాడీస్‌ను అసంఖ్యాకంగా సృష్టించి, దాని బారి నుంచి మనల్ని రక్షిస్తాయి. రోగ నిరోధక వ్యవస్థలో కీలకంగా పనిచేసే టి.లింఫోసైట్స్, బి.–లింఫోసైట్స్ ఎముక మూలుగ నుంచి కాలేయం నుంచి అభివృద్ధి చెందుతాయి. ‘కరోనా’ వ్యాప్తి మరింత ఎక్కువే! ‘కరోనా’ వ్యాప్తికి సంబంధించి ఇప్పటి వరకు వెల్లడైన అధికారిక లెక్కల కంటే నిజానికి దీని బారిన పడిన వారి సంఖ్య మరింత ఎక్కువగానే ఉంటుందని ఒక తాజా అధ్యయనంలో తేలింది. శరీరంలో సమర్థమైన యాంటీబాడీస్ ఉన్నవారు ఈ వైరస్ బారిన పడినా, వ్యాధి లక్షణాలేవీ లేకుండానే బయటపడగలిగినట్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నిపుణులు ఇటీవల చేపట్టిన అధ్యయనంలో తేలింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన శాంటా క్లారా కౌంటీలో 3300 మంది నుంచి సేకరించిన రక్తనమూనాలపై జరిపిన పరీక్షల్లో దిగ్భ్రాంతికరమైన ఫలితాలు వెలుగులోకి వచ్చాయి. వీరిలో 2.5 నుంచి 4 శాతం మంది ‘కోవిడ్–19’ నుంచి కోలుకున్నట్లు ఈ పరీక్షల్లో వెల్లడైంది. వీరెవరూ ‘కోవిడ్–19’ కారణంగా ఆస్పత్రుల్లో చేరకపోవడం విశేషం. ఎందుకంటే, వీరిలో ఎలాంటి వ్యాధి లక్షణాలూ బయటపడలేదు. అయితే, రక్త పరీక్షల్లో మాత్రం వీరిలో కరోనా వైరస్‌ను ఎదుర్కొని తిప్పికొట్టిన యాంటీబాడీస్ బయటపడ్డాయి. శాంటా క్లారా కౌంటీ జనాభా దాదాపు 20 లక్షలు. ఈ ప్రాంతంలో అధికారికంగా దాదాపు వెయ్యికి పైగా మాత్రమే కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా వైరస్‌ను ఎదుర్కొనే యాంటీబాడీస్ ఎవరిలోనూ లేనట్లయితే, ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు దాదాపు 48 వేల నుంచి 81 వేల వరకు నమోదై ఉండేవని స్టాన్ఫోర్డ్ వర్సిటీ నిపుణులు చెబుతున్నారు. ఈ లెక్కన అధికారికంగా వెల్లడించిన లెక్కల కంటే దాదాపు 50 నుంచి 80 రెట్ల మందికి కరోనా వైరస్ ఇప్పటికే సోకి ఉంటుందని, సమర్థమైన యాంటీబాడీస్ ఉన్నవారు ఎలాంటి లక్షణాలూ లేకుండానే దాని నుంచి బయటపడి ఉంటారని వారు చెబుతున్నారు. అయితే, యాంటీబాడీస్ ఉన్నవారికి ఈ వైరస్ మరోసారి సోకదని చెప్పలేమని, మరోసారి సోకినప్పుడు వ్యాధి లక్షణాలు కలిగించకుండా ఉండదని కూడా చెప్పలేమని డబ్ల్యూహెచ్ఓ ఎమర్జింగ్ డిసీజెస్ యూనిట్ అధినేత డాక్టర్ మారియా వాన్ కెర్ఖోవె చెబుతున్నారు. కరోనా వైరస్ ప్రభావంపై మరింత క్షుణ్ణంగా అధ్యయనం జరగాల్సి ఉందని, దీనికి సమర్థమైన వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చేంత వరకు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటమే మంచిదని అంటున్నారు. ‘కరోనా’ వ్యాక్సిన్లు ఎంతవరకు వచ్చాయంటే? ‘కరోనా’ కలకలం గత ఏడాది చివర్లో చైనాలో మొదలై, అనతికాలంలోనే ప్రపంచ దేశాలకు శరవేగంగా పాకిన దరిమిలా, దీని కట్టడి కోసం వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు ముమ్మరంగా మొదలయ్యాయి. దీనిని శాస్త్రవేత్తలు ‘సార్స్’ కరోనా వైరస్–2 అని గుర్తించారు. దీనికే ‘నావెల్ కరోనా వైరస్’ అని నామకరణం చేశారు. దీనివల్ల కలిగే వ్యాధికి ‘కరోనా వైరస్ డిసీజ్–19’– సంక్షిప్తంగా ‘కోవిడ్–19’గా పేరుపెట్టారు. వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు నావెల్ కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే పనిలో తలమునకలుగా ఉన్నారు. ఇప్పటి వరకు దీనికోసం రూపొందించిన వ్యాక్సిన్లలో రెండు వ్యాక్సిన్లు మనుషులపై ప్రయోగించే దశకు చేరుకున్నాయి. ఇవి కాకుండా, దాదాపు మరో అరవై వ్యాక్సిన్లు ప్రీక్లినికల్ దశలో ఉన్నాయి. ‘కోవిడ్–19’ వ్యాధి కట్టడికి రూపొందించిన వ్యాక్సిన్లలో రెండు ఇప్పటికే మనుషులపై ప్రయోగించే దశకు చేరుకున్నాయని, మనుషులపై వీటి ప్రయోగాలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఏప్రిల్ 4న ఒక ముసాయిదా ప్రకటనలో వెల్లడించింది. వీటిలో ఒకదానిని చైనాకు చెందిన కాన్‌సైనో బయోలాజికల్ ఇన్కార్పొరేషన్ సంస్థ బీజింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో టెక్నాలజీ సహకారంతో రూపొందించింది. దీనిని ఇప్పటి వరకు 18–60 ఏళ్ల మధ్య వయసు గల 60 మంది స్త్రీ పురుషులపై ప్రయోగించి, ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ఇక రెండో వ్యాక్సిన్‌ను అమెరికాకు చెందిన మోడర్నా ఫార్మ సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్‌తో కలసి రూపొందించింది. ఇది ‘మెసెంజర్ ఆర్ఎన్ఏ’ వ్యాక్సిన్. దీనిని ఇంతవరకు 18–55 ఏళ్ల మధ్య వయసు గల 45 మందిపై ప్రయోగించారు. చైనా రూపొందించిన వ్యాక్సిన్‌ను షెన్జెన్ జీనో–ఇమ్యూన్ మెడికల్ ఇన్స్టిట్యూట్, అమెరికా రూపొందించిన వ్యాక్సిన్‌ను ఇనోవియో ఫార్మాసూటికల్ సాధ్యమైనంత త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నాయి. భారత్‌లోనూ వ్యాక్సిన్ ప్రయత్నాలు కరోనా వైరస్ కట్టడికి భారత శాస్త్రవేత్తలు కూడా వ్యాక్సిన్ రూపకల్పన చేశారు. గుజరాత్‌కు చెందిన జైడస్ కాడిలా సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే కరోనా వైరస్ కట్టడికి వ్యాక్సిన్‌ను రూపొందించారు. ఇది ‘డీఎన్ఏ ప్లాస్మిడ్’ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ ఇంకా ప్రీక్లినకల్ పరీక్షల దశలోనే ఉంది. డీఎన్ఏ వ్యాక్సిన్లను రోగకారక క్రిమి నుంచి సేకరించిన జన్యువులతో రూపొందిస్తారు. దీనిని మనిషి శరీరంలోకి ఎక్కించాక, ఇది వైరస్‌లోని ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తుంది. మనిషిలోని రోగ నిరోధక కణాలు ఈ వైరల్ ప్రొటీన్లను శత్రువుగా గుర్తించి, వెనువెంటనే ఎదుర్కొని వాటిని మట్టుబెడతాయి. భారత్‌కు చెందిన మరో ఐదు కంపెనీలు కరోనా వైరస్ నిరోధానికి వ్యాక్సిన్‌ను రూపొందించాయి. ఇవి కూడా ఇంకా ప్రీక్లినికల్ పరీక్షల దశలోనే ఉన్నాయి. సీరమ్ ఇన్స్టిట్యూట్, బయోలాజికల్ ఇ, భారత్ బయోటెక్, ఇండియన్ ఇమ్యూనోలాజికల్స్, మైన్‌వ్యాక్స్ కంపెనీలు సైతం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ను రూపొందించాయి. – పన్యాల జగన్నాథదాసు -
గందరగోళంలో భూగోళం
భూగోళం– ఇది మానవాళికి మాత్రమే కాదు, సమస్త జీవరాశికీ ఆలవాలం. నిజానికి ఈ భూమ్మీద మనుషుల ఆవిర్భావం చాలా ఆలస్యంగా మొదలైంది. విశాల విశ్వంలో జరిగిన మహా విస్ఫోటానికి పర్యవసానంగా ఏర్పడిన సౌరకుటుంబంలో కోట్లాది ఏళ్ల కిందట భూమి కూడా పుట్టింది. మన భూగోళం వయసు 454 కోట్ల సంవత్సరాలకు పైమాటేనని శాస్త్రవేత్తల అంచనా. ఇంత సుదీర్ఘమైన వయసు గల భూమిపై ఇప్పటి ఆధునిక మానవుల మనుగడ మొదలై దాదాపు 2 లక్షల సంవత్సరాలు మాత్రమే అవుతోంది. మనుషుల ప్రాబల్యం పెరుగుతూ వస్తున్న కొద్దీ భూమిపై వాతావరణంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఎన్నెన్నో జీవరాశులు కనుమరుగైపోయాయి. యంత్రాల వినియోగం, జీవ ఇంధన వినియోగం పెరిగినప్పటి నుంచి భూ వాతావరణంలో కాలుష్యం పెరిగింది. మనుషులు సృష్టించుకున్న నానా రకాల యంత్రాలు, వాహనాల నుంచి వెలువడే కలుషిత వాయువులు మనుషులనే ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. మానవుల స్వార్థం ఫలితంగా ఇప్పుడు భూగోళం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇప్పటికైనా మెలకువ తెచ్చుకోకుంటే, మానవాళి మనుగడే మరింత క్లిష్టంగా మారే పరిస్థితుల్లో ఉంది. భూగోళం ఏర్పడిన కొత్తలో అగ్నిపర్వతాల క్రియాశీలత, వాయువుల విడుదల వంటి వాటి ఫలితంగా సముద్రాలు ఏర్పడ్డాయి. సౌర కుటుంబం ఏర్పడిన కొత్తలో సూర్యుడి తీక్షణత ఇప్పటితో పోల్చుకుంటే 70 శాతమే ఉండేది. అలాంటి పరిస్థితుల్లో సముద్రాలు గడ్డకట్టిపోకుండా భూమిని ఆవరించి ఉన్న కార్బన్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి వాయువులే దోహదపడ్డాయి. భూగోళంపై జరిగిన అనేకానేక రసాయనిక మార్పుల ఫలితంగా దాదాపు 400 కోట్ల ఏళ్ల కిందట జీవం ఆవిర్భవించింది. క్రమంగా మరో 50 కోట్ల ఏళ్లు గడిచాక, భూమ్మీద ఇప్పుడు నివసిస్తున్న జీవులన్నింటికీ పూర్వీకులు అనదగ్గ జీవులు పరిణామం చెందాయి. కిరణజన్య సంయోగ క్రియ పరిణామం వల్ల సౌరకాంతిని నేరుగా వినియోగించుకోగల జీవులు ఏర్పడ్డాయి. ఫలితంగా అణు రూపంలో ఉన్న ఆక్సిజన్ (ఓ 2) భూ వాతావరణాన్ని ఆవరించుకోవడం మొదలైంది. సౌరకాంతి నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల ప్రభావం వల్ల వాతావరణంలోని ఆక్సిజన్‌లో కొంత ఓజోన్‌గా (ఓ3) మారి, భూమి చుట్టూ ఒక రక్షణ వలయంలాంటి పొరగా ఏర్పడింది. పశ్చిమ ఆస్ట్రేలియా, గ్రీన్‌లాండ్‌లలో దొరికిన శిలాజాలను పరీక్షించిన శాస్త్రవేత్తలు భూమిపై దాదాపు 400 కోట్ల ఏళ్ల కిందటే జీవం ఆవిర్భవించి ఉంటుందనే అంచనాకు వచ్చారు. జీవావిర్భావానికి ముందు, అగ్నిపర్వతాలు క్రియాశీలం కావడానికి ముందు చాలా ఏళ్ల పాటు భూగోళం పూర్తిగా మంచుగోళంగా ఉండేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమ్మీద జీవం ఆవిర్భవించిన తర్వాత కాలక్రమంలో డైనోసార్ల వంటి భారీ జీవులు కూడా ఏర్పడ్డాయి. దాదాపు 24 కోట్ల ఏళ్ల కిందట భారీ డైనోసార్లు ఆవిర్భవించాయి. గ్రహశకలం తాకిడి ఫలితంగా 20 కోట్ల సంవత్సరాల కిందట నేల మీద సంచరించే డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. అదంతా మానవుల ఆవిర్భావానికి మునుపటి ముచ్చట. మానవుల ప్రాబల్యం పెరిగిన తర్వాత, ఆధునిక యుగంలో యంత్రాలు, జీవ ఇంధనాల వినియోగం పెరిగిన తర్వాత మరిన్ని జీవులు సైతం కనుమరుగయ్యాయి. ఇవీ సవాళ్లు... భూగోళానికి మానవుల కారణంగా ప్రధానంగా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఇవన్నీ పరస్పర సంబంధం లేనివేమీ కావు. ఒక సమస్యతో మరొకటి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడి ఉన్నవే. ప్రస్తుతం భూగోళానికి ఎదురవుతున్న ప్రధానమైన సవాళ్లూ, సమస్యలూ ఇవే... కాలుష్యం భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి, సముద్రాలు, నదులు మొదలుకొని చెరువులు, బావుల వరకు నిండి ఉన్న నీరు, నేల మీద వృక్షజాతుల మనుగడకు అవసరమైన మట్టి సమస్తం కాలుష్యానికి లోనవుతున్నాయి. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, యంత్రాలు, మోటారు వాహనాల నుంచి వెలువడే విష వాయువులు, ఎక్కడికక్కడ పేరుకుపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, నీటిలోను, మట్టిలోను కలుస్తున్న భార లోహాలు... ఇవన్నీ నానాటికీ కాలుష్యాన్ని పెంచుతున్నాయి. వీటి కారణంగా భూసారం క్షీణిస్తోంది. గాలీ నీరూ స్వచ్ఛత కోల్పోయి, మనుషుల మనుగడకే ముప్పు తెచ్చేలా మారు తున్నాయి. భూతాపం ఖనిజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్రపరికరాల వినియోగం వల్ల చేటు కలిగించే వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఇవన్నీ భూతాపాన్ని పెంచుతున్నాయి. ఫలితంగా భూ ఉపరితలంతో పాటు సముద్రాల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ధ్రువ ప్రాంతాల్లోని మంచుఖండాలు కరిగి, సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ప్రకృతి సమతుల్యత దెబ్బతిని పలుచోట్ల అకస్మాత్తుగా వరదలు పోటెత్తడం, అనూహ్యంగా మంచు కురవడం, కొన్నిచోట్ల మొక్కలు మొలవని పరిస్థితి ఏర్పడి ఎడారులుగా మారే ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక జనాభా భూగోళం ఏర్పడినప్పటి నుంచి దీని విస్తీర్ణం పెరగకపోయినా, మనుషుల జనాభా మాత్రం విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం భూమ్మీద మనుషుల జనాభా దాదాపు 780 కోట్లకు చేరుకుంది. నీరు, ఆహారం, ఇంధనం వంటి సహజ వనరులు మానవులందరికీ సరిపోయే పరిస్థితులు ఇక ఎన్నాళ్లో ఉండవు. తక్కువ విస్తీర్ణంలోనే అధిక దిగుబడులనిచ్చే పంటలను పండించడం కోసం రసాయనిక ఎరువులు వాడటం, వేసిన పంటలు చీడ పీడలను తట్టుకునేలా వాడే పురుగు మందులు పర్యావరణంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అధిక జనాభా ఫలితంగా తలెత్తుతున్న ఈ సమస్యలన్నీ భూమిపై వాతావరణానికి తీవ్రమైన చేటు తెచ్చిపెడుతున్నాయి. సహజ వనరుల క్షీణత అధిక జనాభా ఫలితంగా భూమిపై సహజ వనరులు అంతకంతకు క్షీణించిపోతున్నాయి. ముఖ్యంగా జీవ ఇంధన వనరులు అడుగంటిపో తున్నాయి. ఖనిజ తైలం నుంచి లభించే పెట్రోలు, డీజిలు వంటి ఇంధనాల లభ్యత ఎంతో కాలం కొనసాగే పరిస్థితులు ఉండవు. ఖనిజ ఇంధనాలకు ప్రత్యమ్నాయంగా సౌరశక్తి, పవన శక్తి వంటి వాటిని ప్రత్యామ్నాయ ఇంధనాలుగా వినియోగించుకుంటే తప్ప పరిస్థితి చక్కబడదు. అయితే, సౌరశక్తిని ఇంధనంగా మలచుకునే సోలార్ ప్యానెల్స్, పవన శక్తిని ఇంధనంగా వాడుకునేందుకు కావలసిన విండ్‌మిల్స్ వంటి వాటి ఏర్పాటు ఖర్చుతో కూడుకున్న పని. భూమ్మీద సహజ వనరులు క్షీణించిపోతూ ఉంటే, మనుషుల మనుగడ మరింత కష్టతరంగా మారక తప్పదు. చెత్త పారబోత చెత్త పారబోత కూడా భూగోళానికి పెను సమస్యగా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలు, పాడైపోయిన ఎలక్ట్రానిక్ వస్తువుల వ్యర్థాలు, ఆహార పదార్థాల ప్యాకేజీలు వంటి చెత్త ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల వల్లనే పోగవుతోంది. ఈ చెత్తంతా సముద్రాల్లోకి, వెనుకబడిన దేశాల భూభాగంలోకి చేరుతోంది. ఈ చెత్తంతా ఒక ఎత్తయితే, అణు వ్యర్థాల పారబోత మరింత ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తోంది. అణు విద్యుత్ కేంద్రాలను నిర్వహించే దేశాలు, వాటి నుంచి వెలువడే వ్యర్థాలను సముద్రాల్లోకి మళ్లిస్తూ ఉండటం వల్ల సముద్రాల్లో సమతుల్యత, జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. అణు వ్యర్థాల కారణంగా మనుషుల్లోనూ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. జీవ వైవిధ్యానికి హాని సముద్రాల్లోకి చేరుతున్న ప్లాస్టిక్, రసాయన వ్యర్థాలు, నేలలోకి ఇంకుతున్న రసాయనిక ఎరువులు, పురుగు మందులు, ఇష్టానుసారం సాగుతున్న నరికివేత వల్ల కనుమరుగవుతున్న అడవుల కారణంగా భూమ్మీద జీవ వైవిధ్యానికి ఎనలేని హాని జరుగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితుల ఫలితంగా ప్రతిరోజూ దాదాపు 150 జీవజాతులు నిశ్శబ్దంగా కనుమరుగైపో తున్నాయి. పిచ్చుకల వంటి చిన్నా చితకా జీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. ఇప్పటికైనా మానవాళి మెలకువ తెచ్చుకుని సత్వరమే దిద్దుబాటు చర్యలను ప్రారంభించకుంటే, భూమ్మీద మిగిలిన జీవరాశులు కూడా వేగంగా అంతరించడమే కాకుండా, చివరకు మనుషుల మనుగడకే ముప్పు వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. సముద్రాల ఆమ్లీకరణ వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ పరిమాణానికి మించి విడుదలవుతున్నందున సముద్ర జలాలు అమ్లీకరణ చెందుతున్నాయి. సముద్ర జలాల ఆమ్లీకరణ ఫలితంగా సముద్రాలను ఆవాసంగా చేసుకునే జలచరాలకు ఆహారంగా ఉపయోగపడే నాచు నశిస్తోంది. నత్తగుల్లలు, పగడపు దిబ్బలు వంటివి కూడా గణనీయంగా నాశనమవుతున్నాయి. గడచిన 250 ఏళ్లలో సముద్ర జలాల ఆమ్లీకరణ బాగా పెరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, సముద్ర జలాల ఆమ్లీకరణ 150 శాతం మేరకు పెరగగలదని, ఈ పరిస్థితి మనుషులకు కూడా చేటు తెచ్చిపెడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఆమ్లవర్షాలు ఖనిజ ఇంధనాల వినియోగం వల్ల వెలువడే కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ వంటి వాయువులు, పరిశ్రమల నుంచి వెలువడే కొన్ని రకాల వాయువులు, అగ్ని పర్వతాలు బద్దలయ్యేటప్పుడు వెలువడే వాయువులు, అడవులలో కుళ్లిన జంతు కళేబరాల నుంచి వెలువడే సల్ఫర్ డయాక్సైడ్ వంటి వాయువులు వాతావరణంలోకి చేరడం వల్ల అక్కడక్కడా ఆమ్లవర్షాలు కురుస్తుంటాయి. ఇటీవలి కాలంలో ఆమ్లవర్షాలు కొంత పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జనావాసాలు ఉన్న చోట తరచుగా ఇలాంటి ఆమ్లవర్షాలు కురిస్తే, ఇవి మనుషుల ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. అడవుల్లో కురిస్తే వన్యజీవులకు, సముద్రాల్లో కురిస్తే జలచరాల మనుగడకు కూడా ఆమ్లవర్షాలు చేటు తెచ్చిపెడతాయి. అడవుల నరికివేత జనాభా పెరుగుతున్న కొద్దీ జనావాసాలను ఏర్పాటు చేసుకోవడానికి మనుషులు అడవుల నరికివేతను ప్రారంభించారు. రకరకాల స్వార్థపు అవసరాల కోసం మనుషులు ఈనాటికీ యథేచ్ఛగా అడవుల నరికివేతకు పాల్పడుతూనే ఉన్నారు. ప్రస్తుతానికి మన భూగోళంలోని స్థలభాగంపై దాదాపు 30 శాతం వరకు అడవులు ఉన్నాయి. అయినా, ఏటా దాదాపు పనామా దేశ విస్తీర్ణానికి సమానమైన విస్తీర్ణంలోని అడవులు నరికివేతకు గురవుతూనే ఉన్నాయి. అంటే, ఏటా దాదాపు 75 వేల చదరపు విస్తీర్ణంలోని అడవులు కనుమరుగవుతున్నాయి. పర్యావరణ సమతుల్యత కోసం అడవుల ఆవశ్యకతను గుర్తించిన తర్వాత కూడా ఈ పరిస్థితి కొనసాగుతుండటమే విషాదం. ఓజోన్ పొర క్షీణత భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఓజోన్ పొర భూమిపై ఉన్న సమస్త జీవరాశికి అదృశ్య కవచంలా పని చేస్తుంది. సూర్యుని నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాల ప్రభావం నుంచి రక్షణ కల్పిస్తుంది. వాహనాలు, పరిశ్రమల కారణంగా వెలువడే హానికరమైన వాయువులు ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నాయి. ముఖ్యంగా రిఫ్రిజరేటర్లు, ఎయిర్ కండిషనర్ల నుంచి వెలువడే క్లోరో ఫ్లోరో కార్బన్లు ఓజోన్‌పొరకు తీరని హాని కలిగిస్తున్నాయి. గడచిన యాభయ్యేళ్లుగా వెలువడుతూ వస్తున్న కలుషిత వాయువుల కారణంగా ధ్రువ ప్రాంతాల్లో ఓజోన్ పొరకు ఏకంగా చిల్లు పడింది. అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు చిల్లు ఏర్పడినట్లు అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 1982లో వెల్లడించింది. అయితే, ఈ చిల్లు కాస్త చిన్నగా తయారైందని ఇటీవల వెల్లడించడం కొంత ఆశాజనకమైన పరిణామం. కరోనా వైరస్ విజృంభణతో మానవాళి హాహాకారాలు చేస్తున్నా, భూగోళానికి మాత్రం కొంత మేలు జరిగిందనే చెప్పవచ్చు. ‘కరోనా’ మహమ్మారిగా మారడంతో చాలా కొద్దిచోట్ల మినహాయించి దాదాపు ప్రపంచమంతటా లాక్డౌన్ అమలవుతోంది. వాహనాల వినియోగం గణనీయంగా తగ్గింది. నిత్యం జనాల ఉరుకులు, పరుగులతో సందడిగా కనిపించే మహా నగరాలన్నీ దాదాపు నిర్మానుష్యంగా మారాయి. అత్యవసర సేవలకు సంబంధించినవి మినహాయిస్తే, మిగిలిన పరిశ్రమలన్నీ మూతబడ్డాయి. ఫలితంగా వాతావరణంలోకి కలుషిత వాయువుల విడుదల గణనీయంగా తగ్గింది. కరోనా వైరస్ గత ఏడాది చివర్లో చైనాలో మొదలైన సంగతి తెలిసిందే. మూడు నెలలు గడవక ముందే ఇది ఖండాంతరాలకు పాకింది. ఫలితంగా వరుసగా వివిధ దేశాలు ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి లాక్డౌన్ బాట పట్టాయి. వివిధ దేశాల్లో అమలవుతున్న లాక్డౌన్ పరిస్థితుల కారణంగా వాతావరణంలోకి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయువుల పరిమాణంలో 40 శాతం వరకు తగ్గుదల నమోదవుతున్నట్లు అంతర్జాతీయ పరిశోధన సంస్థలు చెబుతున్నాయి. లాక్డౌన్ దెబ్బకు వివిధ జాతీయ, అంతర్జాతీయ రహదారుల్లో మోటారు వాహనాల రద్దీ 83 శాతం తగ్గింది. ‘కరోనా’ వ్యాప్తి తర్వాత ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల కర్బన ఉద్గారాలు, కలుషిత వాయువుల పరిమాణం గణనీయంగా తగ్గిందని ‘గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్’ అధ్యక్షుడు రాబ్ జాక్సన్ చెబుతున్నారు. లాక్డౌన్ కారణంగా పలుచోట్ల గడ్డి కోసివేత, అడవుల నరికివేత వంటి పనులు కూడా నిలిచిపోవడం వల్ల వన్యప్రాణులు మరింత స్వేచ్ఛగా మనుగడ సాగించగలుగుతున్నాయని చెబుతున్నారు. అయితే, పర్యావరణానికి ప్రస్తుతం జరిగిన మేలు తాత్కాలికమేనని, ‘కరోనా’ మహమ్మారి సద్దుమణిగి, తిరిగి యథాస్థితికి వచ్చిన తర్వాత పరిస్థితులు షరా మామూలుగానే మారే అవకాశాలు ఉన్నాయని ఆయన అంటున్నారు. – పన్యాల జగన్నాథదాసు ► మానవుల స్వార్థం ఫలితంగా ఇప్పుడు భూగోళం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ► భూమి చుట్టూ ఆవరించి ఉన్న గాలి, సముద్రాలు, నదులు మొదలుకొని చెరువులు, బావుల వరకు నిండి ఉన్న నీరు, నేల మీద వృక్షజాతుల మనుగడకు అవసరమైన మట్టి సమస్తం కాలుష్యానికి లోనవుతున్నాయి. ► యంత్రాల వినియోగం, జీవ ఇంధన వినియోగం పెరిగినప్పటి నుంచి భూ వాతావరణంలో కాలుష్యం పెరిగింది. మనుషులు సృష్టించుకున్న నానా రకాల యంత్రాలు, వాహనాల నుంచి వెలువడే కలుషిత వాయువులు మనుషులనే ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితులు ఇప్పుడు నెలకొని ఉన్నాయి. ► ఖనిజ ఇంధనాల విచ్చలవిడి వినియోగం, ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజరేటర్లు వంటి యంత్రపరికరాల వినియోగం వల్ల చేటు కలిగించే వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ఇవన్నీ భూతాపాన్ని పెంచుతున్నాయి. -
ఖతర్నాక్ కరోనా
‘కరోనా’ వైరస్ పేరు చెబితినే యావత్ ప్రపంచం వణికిపోతోంది. గత ఏడాది చివర్లో చైనాలో మొదలైన ఈ వైరస్ శరవేగంగా కార్చిచ్చులా ప్రపంచమంతటికీ వ్యాపించింది. కీలకమైన వ్యవస్థలన్నింటినీ స్తంభించిపోయేలా చేసింది. జనాలను దాదాపు ఇళ్లకు పరిమితం చేసింది. చైనాలో ఈ వైరస్ వ్యాప్తి మొదలైన తొలినాళ్లలో తేలిగ్గా తీసుకున్న దేశాలే ఇప్పుడు భయంతో గజగజలాడుతున్నాయి. ‘కరోనా’ వైరస్ పరిణామంపై శాస్త్రవేత్తలు చెబుతున్న మాటలను కొందరు ఏమాత్రం పట్టించుకోకుండా దీనిపై రకరకాల వితండ వాదనలను, కుట్ర సిద్ధాంతాలను ప్రచారంలోకి తెస్తున్నారు. ‘కరోనా’ వైరస్ విజృంభణ మొదలైన తర్వాత ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. ప్రకృతిలోనూ చాలా మార్పులు వచ్చాయి. ‘కరోనా’ వైరస్ గురించి, దీని కారణంగా ఏర్పడిన పరిణామాల గురించి కొన్ని విశేషాలు... కరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చెబుతున్నదేమిటంటే.. ఈ వైరస్ కొత్తదేమీ కాదు. ఇది సహజంగానే పరిణామం చెంది మరింత బలం పుంజుకుంది. తొలిసారిగా 2003 సంవత్సరంలో చైనాలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ (సార్స్) వ్యాప్తికి దారితీసినది కూడా ఒక రకమైన ‘కరోనా’ వైరస్సే. తొమ్మిదేళ్ల విరామం తర్వాత– 2012లో మరో రకమైన ‘కరోనా’ వైరస్ విజృంభణ సౌదీ అరేబియాలో కనిపించింది. ఇది మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్’ (మెర్స్) వ్యాప్తికి దారితీసింది. ‘సార్స్’, ‘మెర్స్’ వ్యాధులకు దారితీసిన కరోనా వైరస్లు ప్రపంచమంతటికీ విస్తరించకుండా, అక్కడికక్కడే సద్దుమణిగిపోయాయి. చైనాలో తిరిగి ఉనికిలోకి వచ్చిన ‘కరోనా’ వైరస్ మాత్రం అలాంటిలాంటిది కాదు. ఇది జగమొండి రకం. కొత్త తరహా కరోనా వైరస్ తమ దేశంలో విజృంభిస్తోందంటూ చైనా వైద్యులు 2019 డిసెంబర్ 31న ప్రపంచ ఆరోగ్య సంస్థను (డబ్ల్యూహెచ్‌వో) అప్రమత్తం చేశారు. ఈ కొత్త కరోనా వైరస్‌కు వారు ‘సార్స్–కరోనా వైరస్ 2’గా, దీని ద్వారా వ్యాప్తి చెందే వ్యాధికి ‘కోవిడ్–19’గా నామకరణం చేశారు. శరవేగంగా ఇది దేశాలను దాటి ప్రయాణించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 20 నాటికి ఈ వైరస్ ఏకంగా 1,67,500 మందికి సోకింది. ‘సార్స్’, ‘మెర్స్’ వ్యాధులకు కారణమైన కరోనా వైరస్‌లను, తాజాగా ‘కోవిడ్–19’కు కారణమైన ‘సార్స్–కరోనా వైరస్ 2’ జన్యు క్రమాన్ని పరిశీలిస్తే, ఇది సహజంగానే పరిణామం చెందినట్లు స్పష్టమవుతోందని అమెరికాలోని టులేన్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త రాబర్ట్ ఎఫ్ గ్యారీ, కొలంబియా వర్సిటీకి చెందిన శాస్త్రవేత్త డబ్ల్యూ. అయాన్ లిప్కిన్, ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త ఎడ్వర్డ్ హోమ్స్, బ్రిటన్‌లోని ఎడిన్బర్గ్ యూనివర్సిటీకి చెందిన ఆండ్రూ రాంబాట్ తదితరులు చెబుతున్నారు. ఈ శాస్త్రవేత్తలు ‘కోవిడ్–19’ మహమ్మారి వ్యాప్తికి దారితీసిన తాజా కరోనా వైరస్ జన్యు పరిణామంపై సుదీర్ఘమైన పరిశోధనలు సాగించారు. ఇదివరకటి ‘కరోనా’ వైరస్‌లతో పోల్చుకుంటే, ‘సార్స్–కరోనా వైరస్ 2’లో జీవకణాలలోకి చొరబడగల రిసెప్టర్ బైండింగ్ డోమైన్ (ఆర్బీడీ) మరింత శక్తిమంతంగా పరిణామం చెందినట్లు వీరు చెబుతున్నారు. అందుకే, ‘కోవిడ్–19’, ఇదివరకటి ‘సార్స్’, ‘మెర్స్’లను మించిన మహమ్మారిగా మారిందని వివరిస్తున్నారు. కొన్ని కుట్ర సిద్ధాంతాలు ‘కోవిడ్–19’ మహమ్మారికి కారణమైన కరోనా వైరస్ సహజ పరిణామం చెందినదేనని శాస్త్రవేత్తలు చెబుతున్నా, కొందరు అతితెలివిపరులు మాత్రం కుట్ర సిద్ధాంతాలకు తెరతీస్తున్నారు. ప్రపంచంపై జీవ యుద్ధానికి చైనా పెద్దసంఖ్యలో మరణాలకు దారితీసే వైరస్‌ను సృష్టించిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. జీవ యుద్ధం కోసం చైనా తన ల్యాబొరేటరీలో సృష్టించిన వైరస్, ప్రమాదవశాత్తు అక్కడే లీకై గాల్లో కలిసి, అక్కడికక్కడే ఉత్పతాన్ని సృష్టించడమే కాకుండా, యావత్ ప్రపంచానికీ పెనుముప్పుగా మారిందనే ఊహాగానాలను ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం కేవలం ప్రచారాలకే పరిమితం కాలేదు. అమెరికన్ సెనేటర్ టామ్ కాటన్ సహా కొందరు ప్రముఖులు ఈ విషయమై చైనాకు వ్యతిరేకంగా కోర్టుకెక్కారు. ప్రమాదకరమైన కరోనా వైరస్‌ను విడిచిపెట్టినందుకు చైనా 20 లక్షల కోట్ల డాలర్ల (రూ.1528 లక్షల కోట్లు) పరిహారం చెల్లించాలంటూ వారు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చైనా నుంచి పరిహారంగా కోరుతున్న ఈ మొత్తం చైనా స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) కంటే కూడా చాలా ఎక్కువ. కరోనా వైరస్ సహజసిద్ధంగా పరిణామం చెందినదేమీ కాదని, చైనా శాస్త్రవేత్తలు దానిని ఉద్దేశపూర్వకంగా ల్యాబొరేటరీలో సృష్టించారని బలంగా నమ్ముతున్న వాళ్లలో అమెరికన్ గూఢచర్య సంస్థ ‘సీఐఏ’ మాజీ మిలటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఫిలిప్ గిరాల్డీ వంటి వారు కూడా ఉండటం గమనార్హం. గిరాల్డీ ఇదే వాదనతో రాసి పడేసిన సుదీర్ఘ వ్యాసాన్ని ‘ది స్ట్రాటెజిక్ కల్చర్ ఫౌండేషన్’ గత నెల సంచికలో ప్రచురించింది. ‘కరోనా’ నివారణకు ఏం చేయాలంటే..? ఇప్పటి వరకు ‘కరోనా’ నివారణకు వ్యాక్సిన్ ఏదీ సామాన్యులకు అందుబాటులోకి రాలేదు. అలాగే కరోనా వైరస్ సోకిన తర్వాత కచ్చితంగా నయం చేయగల ఔషధాలు కూడా లేవు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా వైద్యులందరూ రోగ లక్షణాల ఆధారంగానే చికిత్స చేస్తూ వస్తున్నారు. అక్కడక్కడా వివిధ దేశాల్లో శాస్త్రవేత్తలు రూపొందించిన వ్యాక్సిన్లపై ఇంకా ప్రయోగాలు, పరీక్షలు జరుగుతున్నాయి. ఈలోగా ‘కరోనా’ వ్యాప్తిని నిరోధించడానికి మనం చేయగలిగిన ముఖ్యమైన పనులేమిటంటే... ఇదిలా ఉంటే... కరోనా వైరస్ గురించి అమెరికా చైనాపై ఆరోపణలు గుప్పిస్తున్నా, నిజానికి అది అమెరికా సృష్టేనని కూడా కొందరు అమెరికా వ్యతిరేకులు మరో కుట్ర సిద్ధాంతాన్ని వినిపిస్తున్నారు.అమెరికన్ గూఢచర్య సంస్థ సీఐఏ బయోవెపన్ ల్యాబ్‌లో దీనిని తయారు చేశారని వారు ప్రచారం సాగిస్తున్నారు. సీఐఏ అధీనంలోని ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌లో దీనిని తయారు చేశారని చెబుతూ, ఈ వాదనకు బలం చేకూర్చే కొన్ని సంఘటనలను కూడా వారు ఉదహరిస్తున్నారు. వారు చెబుతున్నదేమిటంటే... ఫోర్ట్ డెట్రిక్‌లోని మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ లాబొరేటరీని గత ఏడాది జూలైలో సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) మూసివేయించింది. వైరస్ రహస్య సృష్టి వ్యవహారం బయటకు పొక్కకూడదనే ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌ను సీడీసీ మూసివేయింది. గత ఏడాది ఆగస్టులో చాలామంది అమెరికన్లు ‘ఇన్‌ఫ్లూయెంజా’ బారిన పడ్డారు. వారిలో దాదాపు పదివేల మంది మరణించారు. సీడీసీ ఈ మరణాలకు అసలు కారణాలను వెల్లడించకుండా, నెపాన్ని ఈ–సిగరెట్లపైకి నెట్టేసింది. ఫోర్ట్ డెట్రిక్ ల్యాబ్‌ను మూసివేసిన కొద్ది నెలల్లోనే అమెరికాలోని 22 రాష్ట్రాల్లోని జనాలు తీవ్రమైన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. అమెరికాలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వ్యాపిస్తున్న కాలంలోనే గత ఏడాది సెప్టెంబరులో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలెర్జీ అండ్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ కరోనా వైరస్ నివారణకు వ్యాక్సిన్ తయారీ కాంట్రాక్టును ‘గ్రెఫెక్స్’ కంపెనీకి అప్పగించింది. టెక్సాస్‌కు చెందిన ఈ కంపెనీకి కరోనా వైరస్ వ్యాక్సిన్ తయారీ కాంట్రాక్టు దక్కిన విషయం చాలా ఆలస్యంగా ఈ ఏడాది ఫిబ్రవరి 20న ‘న్యూయార్క్ పోస్ట్’లో వెలుగులోకి వచ్చింది. కాబట్టి, ఇదంతా అమెరికా ఘనకార్యమేనని అమెరికా వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ప్రకృతికి మేలు... కరోనా వైరస్ కారణంగా మనుషులకు కష్టంగానే ఉంటోంది. దీని వల్ల సంభవిస్తున్న అకాల మరణాలు తీవ్ర భయోత్పాతాలకు దారితీస్తున్నాయి. ఇది నాణేనికి ఒకవైపు. మరోవైపు గమనిస్తే, దీని వల్ల ప్రకృతికి మేలు జరుగుతోంది. ప్రకృతి తనను తాను మరమ్మతు చేసుకునేందుకే మహమ్మారి రూపంలో విరుచుకుపడిందని భావిస్తున్నవారూ లేకపోలేదు. ‘కరోనా’ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా వాహనాల వినియోగం గణనీయంగా తగ్గింది. రోడ్ల మీద సంచరించే వాహనాలు, రైళ్లు మాత్రమే కాదు, విమానాలు కూడా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. చాలా వరకు పరిశ్రమలు మూతబడ్డాయి. ఫలితంగా నిత్యం గాలిలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గాయి. వాతావరణంలో స్వచ్ఛత ఏర్పడింది. న్యూయార్ మహానగరాన్నే తీసుకుంటే, ‘కరోనా’ వ్యాప్తి తర్వాత అక్కడ వాయు కాలుష్యం 50 శాతం మేరకు తగ్గింది. చైనాలోనైతే థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు వినియోగం 40 శాతం తగ్గింది. చాలా చోట్ల ఖాళీగా మారిన నగరాల రహదారులపై వన్యప్రాణులు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. వాతావరణంలోకి విడుదలయ్యే కర్బన ఉద్గారాల్లో ఇంతటి తగ్గుదల నమోదు కావడం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. ఇక ఆరుబయట జన సంచారం కూడా గణనీయంగా తగ్గిపోవడంతో చాలా చోట్ల నదులు, సెలయేళ్లు, సరస్సులు కూడా స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతున్నాయి. వాటిలోకి కొత్త కొత్త జలచరాలు వచ్చి చేరుతున్నాయి. వాటంతట అవే సద్దుమణుగుతాయా? సాధారణంగా మహమ్మారి వ్యాధులు వ్యాపించినప్పుడు కొంతకాలానికి వాటంతట అవే సద్దుమణుగుతాయి. అలాగని అవి పూర్తిగా అంతరించాయనుకోవడం సరికాదు. వాటి నిర్మూలనకు వ్యాక్సిన్లు, కచ్చితమైన ఔషధాలు సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల్సిందే. ఒక్కోసారి సద్దుమణిగిన మహమ్మారి వ్యాధులు కొంత వ్యవధి తర్వాత మళ్లీ తిరగబెడుతుంటాయి. ఇదివరకటి కాలంలో ప్లేగు, మశూచి, కలరా వంటి వ్యాధులు ఇలా తిరగబెట్టిన ఉదంతాలు మనకు తెలిసినవే. కరోనా వైరస్ సోకిన రోగుల్లో దాదాపు 25 శాతం మందికి ఎలాంటి వ్యాధి లక్షణాలూ కనిపించడం లేదని, వారి ద్వారా ఇతరులకు వైరస్ సోకే అవకాశాలు ఉంటాయని, అందువల్ల దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్ హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ కనీసం మరో రెండేళ్లు మనుషులను వెన్నాడే అవకాశాలు ఉన్నాయని కూడా ఆయన చెబుతున్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడానికి కనీసం ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం పడుతుందని, సమర్థమైన వ్యాక్సిన్లు పూర్తిగా అందుబాటులోకి వచ్చేంత వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా నేర్పుతున్న పాఠం! కళ్లు నులుముకుంటూనే వంట గదిలోకి పరిగెత్తింది. టిఫిన్ చేయడానికి కావల్సిన పదార్థాలన్నీ సర్దుకుంది. హాల్లోకి వెళ్లి గుమ్మం తెరిచి.. వాకిట్లో ఉన్న పాలపాకెట్, న్యూస్ పేపర్ లోపలికి తెచ్చింది. పాలు స్టవ్ మీద పెట్టి.. బ్రష్ చేసుకుంటూనే పేపర్ తిప్పేసింది. మొహం కడుక్కొని వచ్చి కాఫీ చేసుకొని సిప్ చేసుకుంటూ వెళ్లి భర్తను నిద్రలేపింది. టిఫిన్ రెడీ చేసి.. బిడ్డను నిద్రలేపి.. ఓ వైపు వంట చేసుకుంటూనే కూతురిని స్కూల్‌కి రెడీ చేసింది. ఇంకో వైపు భర్తకు కాఫీ.. టిఫిన్ అందించింది. ఆయన పేపర్ చదువుతూ తీరిగ్గా కాఫీని ఆస్వాదిస్తున్నాడు. గబగబా కూతురికి టిఫిన్ తినిపించి లంచ్ సిద్ధం చేసి.. స్కూల్‌కు పంపింది. ఇంకోసారి కాఫీ తాగాలన్నా టైమ్ లేదు.. ఆఫీస్ నుంచి కాల్స్.. కంప్యూటర్ ఆన్ చేసి.. ఆన్లైన్ మీటింగ్స్‌కు అటెండ్ అవుతూనే ఆఫ్‌లైన్‌లో ఆఫీస్‌కు రెడీ అయిపోయింది. సాయంకాలం.. ఆఫీస్ నుంచి వచ్చీ రాగానే కూతుర్ని గారం చేస్తూనే స్నాక్స్ తినిపించి హోమ్‌వర్క్ చేయించింది. ఇంకో వైపు రాత్రి వంటకు కావల్సినవి సిద్ధం చేసుకుంది. హోమ్‌వర్క్ అయిపోయాక కూతుర్ని కాసేపు ఆడించి.. ఈలోపు ఆఫీస్ నుంచి వచ్చిన భర్తకు కాఫీ ఇచ్చి.. వంట చేసి..తను ఫ్రెష్ అయ్యి డిన్నర్ సర్వ్ చేసింది. బెడ్ టైమ్ స్టోరీస్‌తో బిడ్డను నిద్రపుచ్చి.. తను లేచి.. లాప్‌ట్యాప్ ఆన్ చేసింది.. అటు ఆఫీస్ వర్క్ చేసుకుంటూనే ఇంకోవైపు మధ్యాహ్నం మిగిలిపోయిన బట్టలుతికే పనీ చూసుకుంది.. వాషింగ్ మెషీన్లో బట్టలు వేసి. అప్పటికి రాత్రి పన్నెండు దాటిపోయింది. అలసిపోయి ఉందేమో అలాగే వాషింగ్ మెషీన్ ముందు కుర్చీలో కూర్చోనే నిద్రలోని జారుకుంది.. మధ్యరాత్రి లేచి చూసిన భర్తకు వాషింగ్ మెషీన్ ముందు కునికిపాట్లు పడ్తున్న భార్య కనిపించింది. తన బాధ్యతా రాహిత్యం అప్పుడు గుర్తొచ్చింది. సిగ్గుపడ్డాడు. వెళ్లి భార్యను నిద్రపొమ్మని చెప్పి మిగిలిన పని బాధ్యత తాను తీసుకున్నాడు. ఇది రియల్ వాషింగ్ పౌడర్ వాళ్ల ప్రమోషనల్ యాడ్. కాని ఇందులో చూపించిదంతా సత్యమే. దాదాపు ప్రతి ఇంటిలోని దశ్యమే. ‘మన దేశంలో 71 శాతం మంది మహిళలకు నిద్రలేమితో తెల్లవారుతోందట. వాళ్ల భర్తలతో పోల్చుకుంటే! కారణం.. తెల్లవారి మొదలయ్యే ఇంటి పని పట్ల ఆందోళన’ అనే సమాచారాన్నీ ఇస్తోంది ఈ యాడ్. ఈ ఇన్ఫర్మేషన్లో విశ్వసనీయత ఎంతున్నా ఇళ్లల్లో ఆడవాళ్ల పరిస్థితి చూసినవాళ్లకు ఆ సమాచారం అతిశయోక్తిగా మాత్రం అనిపించదు. ఈ ఉపోద్ఘాతమంతా ఇప్పుడెందుకు అంటే.. మగవాళ్లు ఇంటి బాధ్యతలు పంచుకోవడనికి కరోనా లాక్డౌన్ మంచి అవకాశాన్నిచ్చింది అని చెప్పడానికి. 24 గంటలూ ఇంట్లో ఉంటున్నారు కాబట్టి.. ఇంట్లో అందరినీ సౌకర్యంగా ఉంచడం కోసం ఆమె చేసే సర్కస్ ఫీట్లు అర్థమై ఉండాలి.. ఇక ఉద్యోగినుల విషయానికి వస్తే మీకంటే ముందుగానే లేచి... ఎప్పటిలాగే ఇంటి పని, వంట పని ముగించుకొని మీతోపాటుగా ల్యాప్‌టాప్ తెరిచి ఆఫీస్ పనికీ సిద్ధమవుతూ.. మధ్యమ«ధ్య మీ టీ బ్రేక్... కాఫీ బ్రేక్.. స్నాక్స్ బ్రేక్ మిస్ కానివ్వకుండా వాటినీ సమకూరుస్తూ మళ్లీ తన ఆఫీస్ పనినీ నిర్వహిస్తూ ఆమె చేసే మల్టీ టాస్క్‌నూ గ్రహించి ఉండాలి.. ఆ యాడ్‌లో చెప్పిన విషయమూ అవగతమై ఉండాలి ఇప్పటికే! అందుకే ఈ లాక్డౌన్ టైమ్ పూర్తయ్యేలోపు ఇంటిపనుల్లోనూ పాలుపంచుకునే సంపూర్ణ పురుషుడిలా మారిపోండి. మీ పిల్లలకు రోల్ మోడల్‌గా తయారవ్వండి. మీ ఇంట్లో మహిళలు రేపటి చింతను మరిచిపోయి కంటినిండా నిద్రపోయేలా చూడండి. ఇంటిని ఆరోగ్యంగా ఉంచండి. కరోనా.. జెండర్ ఈక్వాలిటీ లెసన్ నేర్పడానిక్కూడా వచ్చిందేమో! -
మహిళల హక్కులకు రెక్కలు
‘అన్నయ్య, నువ్వు... ఇద్దరూ సరిగ్గా చదవట్లేదు. చదువుకోకపోతే అంతే! పెద్దయ్యాక వాడు కార్లు తుడుచుకుంటాడు.. నువ్వేమో అంట్లు తోముకుందువుగానీ..’ ఒక అమ్మమ్మ అయిదేళ్ల పిల్లతో. ‘నేనెందుకు అంట్లు తోముతా... నేను కూడా కార్లే తుడుస్తా...’ అమ్మమ్మకు చెప్పింది అయిదేళ్ల ఆ పిల్ల. ఫేస్‌బుక్‌లోని ఒక పోస్ట్ ఇది. ఆ చిన్నపిల్ల జవాబు నవ్వు తెప్పించడమే కాదు.. ఆలోచననూ కలిగిస్తుంది. మనలో జీర్ణించుకుపోయిన జెండర్ ఇన్సెన్సిటివిటీనీ ప్రశ్నిస్తుంది. చదువుకోకుండా చేసే పనులకే కాదు చదువుకొని చేసే పనులకూ అంటగట్టిన లింగవివక్ష గత ఇరవైఏళ్లుగా ఎక్కడో ఒక చోట ఎంతోకొంత బ్రేక్ పడుతోంది. ముఖ్యంగా ఈతరం ఆ ప్రయత్నం పట్ల మొండిగానే ఉంది. భవిష్యత్తుకి ఆశ ఆ అయిదేళ్ల అమ్మాయే. ఒకరకంగా చెప్పాలంటే జెండర్ ఈక్వాలిటీకి సంబంధించి అంతకుముందు జరిగిన అనేక పోరాటాల ఫలితమే ఈ రెండు దశాబ్దాల కాలం. భారత స్వాతంత్య్ర సముపార్జనా సమరంలో మహిళలది సమ భాగస్వామ్యం. స్త్రీల విద్య, హక్కుల కోసమూ అంకురార్పణ జరిగిందప్పుడే. వాటి కోసం సావిత్రబాయి పూలే, అనీబిసెంట్, రాజారామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం, దుర్గాబాయి దేశ్‌ముఖ్ వంటి వాళ్లెందరో నడుం బిగించారు. అప్పటిదాకా ఆచారాలు, సంప్రదాయాలుగా ఉన్న ఎన్నో దారుణాలను రూపుమాపేందుకు కృషి చేశారు. ఆ నేపథ్యంలోనే మహిళలు చదువుకోవడానికి ముందుకు వచ్చారు. ప్రాపంచిక జ్ఞానం ఉండాల్సిన అవసరాన్నీ గ్రహించారు. తమ ఒంటి మీది బంగారం కన్నా సామాజిక స్పృహకు విలువెక్కువని గుర్తెరిగారు. వంటింట్లోనే కాదు దేశ రాజకీయాల్లోనూ నిర్ణయాధికారం కావాలని నిశ్చయించుకున్నారు. అయితే స్వాతంత్య్రం సిద్ధించాక ఈ స్ఫూర్తి సున్నా అయింది. మళ్లీ మొదటికి వచ్చింది ఆడవాళ్ల పరిస్థితి. స్వాతంత్య్రానంతరమూ అదలాగే కొనసాగితే నేడు మన దేశ మహిళా ప్రగతి సుస్థిరంగా నిలిచేది. లేట్ ఈజ్ బెటర్‌దేన్ నెవర్.. జీరో అయిన జెండర్ ఈక్వాలిటీ స్ఫూర్తి స్వాతంత్య్రానంతరమూ పిడికిలి బిగించింది. హక్కుల కోసం, సమానత్వం కోసం మళ్లీ పోరాటం మొదలుపెట్టింది. విద్యావకాశాలతో అక్షరాభ్యాసం చేసి.. వైద్య, విజ్ఞాన, వాణిజ్య, సైనిక, న్యాయ, ప్రభుత్వ పాలన, రాజకీయ, సృజనా రంగాల్లో ఉద్యోగాలు సరే.. ఏకంగా నాయకత్వం కోసమే పోటీపడే స్థాయికి ఎదిగింది. దక్కిన అవకాశాలతోనే సామర్థ్యాన్ని నిరూపించుకుంది. అదేమీ ఆషామాషీ ప్రస్థానం కాదు. ఉన్నత చదువుల కోసం.. మెరుగైన ఉపాధి కోసం ఈ రోజు అమ్మాయిలు అవలీలగా సరిహద్దులను దాటగలుగుతున్నారంటే.. ఆ దారి చూపించిన మజిలీయే. వ్యాపార, వాణిజ్య రంగాల్లో మన మహిళలు ప్రపంచ నాయకులుగా నిలబడ్డారంటే.. ఆ పోరాటం పంచిన ప్రేరణే. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజు విజయం సాధించిన ప్రతి వనితను వెన్నుతట్టి ముందుకు తోసింది ఆ నాటి పిడికిలి బలమే. మార్కెట్ చెప్తోంది మారిన తీరు... ‘ఎన్నింటికి వస్తున్నావ్?’ ఆఫీస్‌లో ఉన్న భార్యకు ఫోన్ చేశాడు భర్త. తను ఇల్లు చేరే టైమ్ చెప్పింది భార్య. ఆమె వచ్చేసరికల్లా వంట వండి.. టేబుల్ మీద సర్ది.. కలిసి భోంచేయడం కోసం వెయిట్ చేస్తూంటాడు భర్త. ∙∙ ‘అబ్బాయి బాగున్నాడు. మంచి ఉద్యోగం. ఇల్లు, కారు అన్నీ ఉన్నాయి. అతనితో పెళ్లికి ఎందుకు అభ్యంతరం?’ కూతురుకి కౌన్సెలింగ్ ఇస్తున్నారు తల్లిదండ్రులు. ‘మూడేళ్ల తర్వాత చేసుకుంటాను’ చెప్తుంది కూతురు. ‘మూడేళ్లా?’ నోరు వెళ్లబెట్టారు పేరెంట్స్. ‘వాటన్నిటినీ నేనూ సంపాదించాలిగా!’ నింపాదిగా జవాబు ఇచ్చింది అమ్మాయి. ∙∙ చామనచాయ కంటే తక్కువ రంగున్న అమ్మాయి డ్రెసింగ్ టేబుల్ సొరుగులో ఫెయిర్‌నెస్ క్రీములు ఉండవు.. ఆమె మెదడు ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. రోజూ అద్దంలో చూసుకుంటూ తన ఒంటి రంగు గురించి దిగులు పడదు.. తన కెరీర్లో ఒడిదుడుకులను బేరీజు వేసుకుంటూ పనితీరును మెరుగుపరుచుకుంటూంటుంది. ఆమె..ఆధునిక యువతులకు ప్రతినిధి. పైన ఉదహరించినవన్నీ యాడ్ ఫిల్మ్సే. ఆయా కంపెనీల ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేసేవి. ఈ యాడ్స్‌ను ఇలా చూపించడానికి కారణం మారిన ఆలోచనల తీరే. దాని మీద మార్కెట్ శక్తులు జరిపిన పరిశోధనల ఫలితం. ఒక సమాజపు సంస్కృతి, సంప్రదాయాలు, అభిరుచులు, విశ్వాసాలు, జీవనశైలులను మార్కెట్ కన్నా ముందుగా మార్కెట్ కన్న అందంగా ఎవరు చెప్పగలరు? అందుకే ఉత్పత్తుల ప్రమోషన్లు ఈ రకమైన ఫ్రేమ్‌లోకి మారాయి. అంటే మూసకు చెక్ పడ్డట్టే. పెళ్లి, కెరీర్ వంటి వాటిల్లో నేటి అమ్మాయిలకు స్పష్టత ఉన్నట్టే. ఇదీ సాధికారతలో భాగమే. చదువుల తల్లులు ఆర్థిక శాస్త్రంలో పీజీ చేసింది భావన. పీహెచ్డీ కోసం విదేశీ యూనివర్సిటీల్లో దరఖాస్తు చేసుకుంది. అమెరికా, లండన్... రెండు చోట్లా సీటు దొరికింది. అప్పుడే ఒక ఐఏఎస్ సంబంధమూ వచ్చింది. కూతురి ఆశ, ఆశయం తెలిసిన, అర్థం చేసుకున్న ఆమె తల్లిదండ్రులు ఆ పెళ్లి సంబంధం గురించి భావనను ఒత్తిడి చేయలేదు. నిర్ణయాన్ని ఆమెకే వదిలేశారు. తన పీహెచ్డీకే ప్రాధాన్యమిచ్చి లండన్ వెళ్లిపోయింది భావన. పిల్లల అభిప్రాయాలకు విలువనిచ్చే కుటుంబానికి, అమ్మాయి నిర్ణయాధికారానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఇంకో కుటుంబంలో అమ్మాయి ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా పెళ్లిచేశారు. తన లక్ష్యం గురించి భర్తకు చెప్పింది. అర్థం చేసుకొని ఆమెను ప్రోత్సహించాడు భర్త. తర్వాత తన భార్య ఉద్యోగం చేయడాన్నీ ఇష్టపడ్డాడు. ఇంటి పనుల్లో పాలు పంచుకున్నాడు. యువతలో వచ్చిన మార్పుకు, మహిళా హక్కుల పోరాటంతో పురుషులు గ్రహించిన బాధ్యతకు నిదర్శనం ఇది. వ్యాపారమణులు ‘సర్... మన సేల్స్ పెరగాలంటే ఫలానా ఉచితం, ఫలానా శాతం డిస్కౌంట్ అని పెడదాం. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అందాం...’ అంటూ ఆ చిట్టా చెప్పుకుపోతూనే ఉన్నాడు యజమానితో మేనేజర్. పక్కనే ఉన్న ఆమె నవ్వింది. నవ్వుతూనే ఉంది. ‘ఏమమ్మాయ్... ఎందుకలా నవ్వుతున్నావ్?’అడిగాడు యజమాని కోపంగా. ‘పావలా కోడికి ముప్పావలా మసాలా అంటే ఇదే’ అంది నవ్వుతూనే. ‘అమ్మాయ్...’ కోపం, అవమానంతో యజమాని. ‘క్షమించండి... మీ లాభాలకన్నా ఈ స్కీమ్‌ల ఖర్చే ఎక్కువుండేట్టుంది. దాని బదులు మా దగ్గర కొన్న సరుకుల్లో ఒక్క చచ్చు, బెడ్డ, పుచ్చునైనా పట్టుకోండి చూద్దాం అంటూ చాలెంజ్ పెట్టండి. నాణ్యమైన సరుకును అమ్మండి.. ఎందుకు సేల్స్ పెరగవూ’ అని సలహా ఇస్తుంది ఆ అమ్మాయి సీరియస్‌గా. ఆ ప్లాన్ పారుతుంది. సేల్స్ పెరుగుతాయి. అన్నపూర్ణ ఫుడ్స్ అనే ఆ కంపెనీకి ఆమే మేనేజింగ్ డైరెక్టర్ అవుతోంది. ఇది ‘మిస్టర్ పెళ్లాం’ సినిమా సన్నివేశమే అయినా... నిజ జీవితంలోని స్త్రీల వ్యాపార దక్షతకూ చిహ్నమే. చురుకుదనం, సమయస్ఫూర్తి, వేగంగా నిర్ణయాలు తీసుకోగల తెగువతో ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్నీ ఏలుతున్నారు మన మహిళామణులు. ఇంద్ర నూయి, కిరణ్ మజుందార్ షా పాతవాళ్లే అని కొట్టి పారేయకండి. వీరే.. వందనా లూత్రా, సుచి ముఖర్జీ, రిచా కర్ వంటి కొత్తరక్తానికి రోల్‌మోడల్స్. ఆర్థిక సిరులు.. ‘నాకు బైక్ కావాలి’ కొడుకు డిమాండ్, ‘నేను ఫలానా కోర్స్‌లో జాయిన్ కావాల్సిందే’ కూతురి అవసరం, ‘ఒరేయ్.. గుండె దడగా ఉంటోందిరా.. చెకప్‌కి తీసుకెళ్తావా?’ అమ్మ ఆరోగ్య భయం, ‘అన్నయ్యా.. మీ బావగారు కొత్తగా బిజినెస్ పెడ్తున్నాడు ఎంతో కొంత సర్దగలవా?’ చెల్లి అభ్యర్థన... మతి పోయింది అతనికి. ‘డ్రైవింగ్ లైసెన్స్ రాగానే సరిపోదు నాన్నా.. పెట్రోల్ ఖర్చును భరించే ఉద్యోగమూ కావాలి. అప్పుడు ఆలోచిద్దాం బైక్ గురించి సరేనా?’ అంటూ కొడుకును వెనక్కి లాగి, ‘తప్పకుండా జాయిన్ కావాలి.. ముందు కొంత కట్టి.. తర్వాత వాయిదాల మీద కడతామని మాట్లాడు’ కూతురి అవసరాన్ని సర్దుబాటు చేసి, ‘అత్తయ్యా.. రాత్రికి పెందళాడే తినండి.. ఉదయం, సాయంకాలం నాతోపాటు కాస్త వాకింగ్‌కు రండి’ అంటూ అత్తగారి గ్యాస్ట్రిక్ ట్రబుల్‌ను అర్థం చేసుకొని, ‘నెల జీతం తెచ్చుకునే మీ అన్నయ్యకు మీ ఆయన వ్యాపారంలో హెల్ప్ చేసేంత సీనా పిల్లా’ అంటూ ఆడపడచు దగ్గర చెడ్డరికమై.. తన ఇంటి బడ్జెట్‌కు ఒడిదుడుకుల్లేకుండా చూసుకునే నేర్పరి ఆమె. అందుకే దేశమనే ఉమ్మడి కుటుంబ ఆర్థిక బాధ్యతనూ మహిళకే (నిర్మలా సీతా రామన్) అప్పగించారు. బ్యాంక్ (ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతి భట్టాచార్య) స్టాక్ మార్కెట్ (చిత్రా రామకృష్ణ) నిర్వహణా భారాన్నీ ఆడవాళ్ల మీదే పెట్టారు. ప్రభుత్వ పాలనా విధులు... రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతున్న పురుష ఐఏఎస్ అధికారుల గురించి సినిమాలు వచ్చాయి కాని అలా తెర మీదకు రాని వృత్తి నిబద్ధులైన మహిళా ఐఏఎస్‌లు మనకు చాలా మందే ఉన్నారు. భూ ఆక్రమణ దారులను పరిగెత్తించి, మహిళా సంస్కరణలను చేపట్టిన ఘనతను సొంతం చేసుకున్న ఐఏఎస్‌లలో టీవీ అనుపమ, స్మితా సబర్వాల్, శ్రీదేవసేన వంటి వాళ్లెందరో లెక్కకు మిక్కిలి. రాణి ముఖర్జీ నటించిన మర్దానీ, మర్దానీ–2 సినిమాలు సూపర్ హిట్. అందులోని ఆమె ధైర్యసాహసాలకు ముచ్చటపడని అభిమానుల్లేరు. ఆ రీల్‌కు రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ మీరా బొరాంకర్ అనే ఐపీఎస్ ఆఫీసర్. మహారాష్ట్ర కేడర్‌కు చెందిన ఆమె దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్ గ్యాంగ్స్‌కు వణుకు పుట్టించింది. ముంబైలో అందరూ ఆమెను ‘లేడీ సూపర్‌కాప్’ అని గౌరవంగా పిలుచుకుంటారు. మెరిన్ జోసెఫ్, సంజుక్తా పరాశర్ వంటి సూపర్ కాప్స్ ఉన్నారు! విజ్ఞాన ఖనులు.. ఇల్లు, సంసారమే కాదు సైన్సూ మాకు మచ్చికే అంటున్నారు మనవాళ్లు. అద్దంలో చంద్రుడిని చూపించి పిల్లలకు అన్నం తినిపించినంత తేలికగా చంద్రుడి మీద అధ్యయనం చేసేందుకు శాటిలైట్లనూ పంపారు. ‘చంద్రయాన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లను సక్సెస్ చేశారు. ఇంకెన్నో ప్రయోగాలకు నాయకత్వం వహిస్తున్నారు. మరెన్నో పరిశోధనలకు నడుం బిగిస్తున్నారు. టెస్సీ థామస్, ఎమ్.వనిత, రితూ కరీదార్లు ఉదాహరణలు మాత్రమే. వైద్యవెలుగులు సహనం.. వైద్యుడికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం. అది స్త్రీ నైజం. సేవాతత్పరత ఆమె ఆభరణం. అందుకేనేమో.. చదువు ఆమె చెంతకు చేరిననాటి నుంచీ వైద్యవిద్య వాళ్ల ఐచ్ఛిక విషయమైంది. ఈ రంగంలో తొలి నుంచి పురుషులకు దీటుగానే రాణిస్తున్నారు. గైనకాలజీయే కాదు, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఏదైనా సరే.. అందులో నైపుణ్యాన్ని ఇంటిపేరుగా స్థిరం చేసుకుంటున్నారు. పాత్రికేయ పరాశక్తులు.. యుద్ధ విశేషాలను సామాన్యుల గడపల్లోకి చేర్చే చొరవ పత్రికలు, టీవీ చానళ్లదే. ఆ కవరేజ్ దొరికేది ఎక్కువగా పురుష పాత్రికేయులకే. ‘మేమెందుకు వెళ్లకూడదు?’అని ప్రశ్నించిన ప్రభాదత్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంత పూచీకత్తుతో యుద్ధ వార్తలను రాయడానికి వెళ్లి విజయవంతం అయింది. ఆ స్ఫూర్తి, ధైర్యం, వారసత్వం ఈ తరానికీ సాగింది. యుద్ధ వార్తలను మాత్రమే కాదు.. దేశంలో జరుగుతున్న అన్యాయాలను యుద్ధ ప్రాతిపదికన ప్రజలకు చేరవేసి.. వాళ్లను చైతన్యవంతులను చేసే సీరియస్ జర్నలిజానికి అంకితమయ్యారు.. బర్ఖాదత్, ఫేయ్ డిసూజా, రానా ఆయూబ్, నేహా దీక్షిత్, మస్రత్ జహ్రా వంటి పరాశక్తులెందరో. రాజకీయ రారాణులు ఈ స్ఫూర్తి మాత్రం స్వాతంత్య్ర పూర్వం నుంచి ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. నాడు జాతీయ కాంగ్రెస్‌కు సరోజినీ నాయుడు అధ్యక్షురాలయితే.. ఈ తరంలో సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ అయింది. సుచేతా కృపలానీ పరంపరా కొనసాగుతోంది. జయలలిత, మాయావతి, వసుంధరరాజే, మమతా బెనర్జీల పాలనతో. ఇందిరా గాంధీ తర్వాత ప్రధాని ఎవరూ కాలేకపోయినా ప్రతిభా పాటిల్‌ను రాష్ట్రపతిని చేసి అగ్రరాజ్యం అమెరికా సాధించలేని ఘనతనూ సొంతం చేసుకుంది మన దేశం. అయితే ఇది సరిపోదు.. చట్టసభల్లోనూ స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి. దానికీ పోరాటాలు జరుగుతున్నాయి. విజయమూ వరిస్తుంది. మిలటరీ టాస్క్... వంట కన్నా ఈజీ.. చేసి చూపించారు కూడా. కనుకే కోర్టు కూడా తీర్పు ఇచ్చింది.. ఆర్మీలోనూ కమాండ్ పోస్టులు స్త్రీలకు ఇవ్వాలి అని. వ్యూహం, ప్రతివ్యూహం, సునిశిత దృష్టి, మనో నిబ్బరం.. ఇవన్నీ ఆడవాళ్ల సహజలక్షణాలు. ఆర్మీకి కావల్సిన క్వాలిఫికేషన్స్ కూడా. మరి ఇందులో వీళ్లను బీట్ చేసేదెవరు? ఆలస్యంగా ప్రవేశం దొరికినా.. సంఖ్య పరిమితంగా ఉన్నా .. కనబరచిన ప్రతిభ అసామాన్యం. గరిటనే కాదు.. ఫైటర్ ఫ్లయిట్నూ తిప్పగలమని గుంజన్ సక్సేనా వంటి వారు ఇప్పటికే నిరూపించారు. ఉద్యమ శక్తులు.. అత్తమామలు ఆరళ్లు పెట్టినా, భర్త కొట్టినా, కొడుకు తిండి పెట్టకపోయినా.. మౌనంగా భరిస్తూ బతుకంతా పరాధీనంగా వెళ్లదీసిన గతం గడిచిపోయింది. నోరు విప్పితే కాపురం గడపదాటుతుందనే భయమూ వదిలిపోయింది. నాకు నేను ముఖ్యం.. నాకూ వ్యక్తిత్వం ఉంది.. అమ్మానాన్నలు, అత్తామామలు, భర్త, పిల్లలు ఎవరి దగ్గరి నుంచైనా గౌరవం పొందే హక్కు నాకూ ఉంది అన్న చైతన్యం వచ్చింది. తన శరీరం మీద తనదే హక్కు అనీ గ్రహించారు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నారు. జరిగిన అన్యాయాన్ని ‘మీ టూ’ అంటూ బయటపెట్టడం తెలుసుకున్నారు. ఈ క్రమంలో నేరాల నమోదు పెరగడం శుభ సూచకం. పోరాడితే దక్కేవి మన హక్కులే అన్న సత్యం అవగతమైంది. బడిలో, గుడిలో, ఆఫీసుల్లో, ప్రభుత్వాల్లో, రాజకీయాల్లో, మిలిటరీలో, వ్యాపారాల్లో అన్నింటిలోనూ సమానస్థాయి కోసం పోటీ పెరిగింది. ప్రపంచంలోకెల్లా వర్కింగ్ విమెన్ జనాభా ఎక్కువగా ఉన్న దేశం మనదే. డాక్టర్లు, ఇంజనీర్లు, సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలు మొదలైన ప్రొఫెషనల్స్‌లో మన వాళ్లే ఎక్కువట. సవాళ్లు.. ఇన్ని విజయాలు సాధించినా ఇంకా కొన్ని సవాళ్లు మిగిలిపోయాయి. వాటినీ ఎదుర్కోవాలి. ముఖ్యంగా హింస, దాడులను అరికట్టే విషయంలో. చట్టాలు సహాయపడుతున్నా.. ఆ సమస్యలను ఎదుర్కోవడానికి ఇంకా శక్తి కావాల్సి వస్తోంది. వాటిల్లో ముఖ్యమైనది.. ప్రమాదకరమైనది.. మగపిల్లలతో సమానంగా లేని ఆడపిల్లల సంఖ్య. త్వరలోనే ఇదీ పరిష్కారమవ్వాలి. ప్రగతిని సుస్థిరం చేసుకోవాలి. మహిళలు అన్నిరంగాల్లో ముందున్నారనడంలో సందేహం లేదు. ఆమె హక్కులను అర్థం చేసుకోలేని పురుషులే వెనుకబాటుతనాన్ని అనుభవిస్తున్నారు. తెలివిడి తెచ్చుకోవాల్సింది మగవాళ్లే. అప్పుడే సాధ్యమవుతుంది స్త్రీ, పురుష సమానత్వం లింగ వివక్షను రూపుమాపడం ఈ కాలంలోనూ సాధించాల్సిన లక్ష్యంగా ఐక్యరాజ్య సమితీ అంగీకరించింది. ఈ అంశంపై ‘ది అన్ఫినిష్డ్ బిజినెస్ ఆఫ్ అవర్ టైమ్’ శీర్షికన తన అధికారిక వెబ్సైట్లో ఒక సమగ్ర వ్యాసాన్నే ప్రచురించింది. ఐక్యరాజ్య సమితిలోని మొత్తం 195 సభ్య దేశాల్లో 143 దేశాలు మాత్రమే తమ రాజ్యాంగాల్లో మహిళలకు సమాన హక్కులు కల్పిస్తున్నాయి. వాటిల్లో కూడా చాలా దేశాల్లో .. మహిళల సమాన హక్కులకు ఆచరణ యోగ్యం లేదు. రాజ్యాంగాలకు, చట్టాలకే పరిమితమై ఉన్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో 2010 జూలై 2న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మహిళల కోసం ఐక్యరాజ్య సమితిలో ప్రత్యేక సంస్థ ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఫలితంగా అప్పటి వరకు ఐక్యరాజ్య సమితిలోనే ఉన్న ‘యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ఫండ్ ఫర్ విమెన్’ (యునిఫెమ్), ‘డివిజన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ విమెన్’ (డీఏడబ్ల్యూ), ‘ఆఫీస్ ఆఫ్ ది స్పెషల్ అడ్వైజర్ ఆన్ జెండర్ ఇష్యూస్’, ‘యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ విమెన్’ మొదలైన సంస్థలన్నీ విలీనమై.. మహిళల సాధికారిత, స్వావలంబన కోసం ఏకైక సంస్థగా మారి.. ‘యుఎన్ విమెన్’గా అవతరించింది. ఇంకా సాధించాల్సిన లక్ష్యాలు : పార్లమెంటులో మన పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందలేదు. దాంతో పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం స్వల్పంగానే పెరిగింది. స్వాతంత్య్రం వచ్చాక 1951లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో కేవలం పది మంది మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుత లోక్‌సభలో 78 మంది మహిళా సభ్యులు ఉన్నారు. కార్పొరేట్ రంగంలో... దేశ రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్న కార్పొరేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ నామమాత్రంగా ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఈ రంగంలో మహిళల ఉనికి లేదనే చెప్పొచ్చు. ఇటీవలి కాలంలోనే కొంత మార్పు వచ్చింది. కార్పొరేట్ సంస్థల ఎండీ, సీఈవో స్థాయి పదవుల్లో 3.69 శాతం మంది మహిళలు ఉన్నారు. దేశ రాజకీయాలను పరోక్షంగా శాసిస్తున్న కార్పొరేట్ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ నామమాత్రంగా ఉంటోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఈ రంగంలో మహిళల ఉనికి లేదనే చెప్పొచ్చు. ఇటీవలి కాలంలోనే కొంత మార్పు వచ్చింది. కార్పొరేట్ సంస్థల ఎండీ, సీఈవో స్థాయి పదవుల్లో 3.69 శాతం మంది మహిళలు ఉన్నారు. పోలీసు, రక్షణ బలగాల్లో మహిళల ప్రాతినిధ్యం నామమాత్రంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా పోలీసు బలగాల్లో మహిళలు 7.28 శాతం. వీరిలో కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులే ఎక్కువ. అధికారం గల పోలీసు ఉద్యోగాల్లో మహిళలు ఒక శాతం లోపే. రక్షణ బలగాల్లోని త్రివిధ దళలనూ చూసుకుంటే వైమానిక దళంలోనే మహిళల పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. వైమానిక దళంలో 13.09 శాతం, నావికా దళంలో 6 శాతం, సైనిక దళంలో 3.8 శాతం మహిళలు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కమాండ్ పోస్టుల్లో మహిళల నియామకాలకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునివ్వడం ఆశాజనకమైన పరిణామం. – సరస్వతి రమ -
ప్రమాదం అంచుల్లో వన్యప్రాణులు
మనుషుల స్వార్థానికి అరణ్యాలకు ఆపద ఏర్పడుతోంది. అరణ్యాలనే ఆవాసం చేసుకున్న అసంఖ్యాకమైన వన్యప్రాణుల మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. మనుషుల స్వార్థం ఫలితంగానే దాదాపు పది లక్షలకు పైగా జాతులకు చెందిన వన్యప్రాణులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయని ఐక్యరాజ్య సమితి సహా పలు అంతర్జాతీయ సంస్థలు హెచ్చరికలు చేస్తున్నాయి. వన్యప్రాణులు ఒక్కొక్కటే అంతరించిపోతూ పోతే, చివరకు మనిషి మనుగడకే ముప్పు తప్పదని కూడా చెబుతున్నాయి. ప్రపంచంలో జీవవైవిధ్యం సజావుగా ఉంటేనే భూమ్మీద మనుషుల మనుగడ సజావుగా ఉంటుంది. జీవవైవిధ్యాన్ని కాపాడే వన్యప్రాణులు ఒక్కొక్కటే కనుమరుగైపోతుంటే, చివరకు మనిషి మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు తలెత్తుతాయి. ప్రపంచవ్యాప్తంగా వన్యప్రాణుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మన భారతదేశంలోనూ వన్యప్రాణుల పరిస్థితి భిన్నంగా ఏమీ లేదు. వన్యప్రాణుల వర్తమాన పరిస్థితులపై ఒక సింహావలోకనం.... మిగిలిన ప్రపంచం సంగతలా ఉంచితే, మన భారతదేశంలో దాదాపు 551 వన్యప్రాణుల అభయారణ్యాలు, 18 జీవ వైవిధ్య అభయారణ్యాలు, 104 నేషనల్ పార్కులు ఉన్నాయి. వన్యప్రాణులను, జీవవైవిధ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం వీటిని ఏర్పాటు చేసింది. స్థూలంగా చూసుకుంటే దేశంలోని 5.1 శాతం భూభాగాన్ని– 1.65 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని మన ప్రభుత్వం వన్యప్రాణుల రక్షణ కోసం ఉపయోగిస్తోంది. మన దేశంలోని పడమటి కనుమలు, తూర్పు హిమాలయ ప్రాంతం, భారత్–బర్మా సరిహద్దు ప్రాంతాలు మూడూ ప్రపంచంలోనే గొప్ప జీవవైవిధ్యానికి ఆలవాలయంగా నిలుస్తున్న ముప్పయి నాలుగు ప్రాంతాల్లో కీలకమైనవి. ప్రపంచంలోని దాదాపు 60 శాతానికి పైగా జీవ వైవిధ్యానికి ఆశ్రయం కల్పిస్తున్న పదిహేడు దేశాలలో భారత్ ఒకటి. ప్రపంచంలోని స్తన్యజీవుల్లో 7.6 శాతం, ఉభయచరాల్లో 14.7 శాతం, 6 శాతం పక్షి జాతులు, 6.2 శాతం సరీసృపాలు, 6 శాతం పూలు పూసే వృక్షజాతులు భారత భూభాగంలో ఉన్నాయి. ఇన్ని విశేషాలు ఉన్నా, ప్రపంచంలో చాలా చోట్ల మాదిరిగానే మన దేశంలోనూ వన్యప్రాణుల మనుగడకు పూర్తి భరోసా ఇచ్చే పరిస్థితులేమీ లేవు. మనుషులు అడవులను అడ్డగోలుగా ఆక్రమించుకోవడం, ఎన్ని నిషేధాజ్ఞలు అమలులో ఉన్నా వన్యప్రాణులను యథేచ్ఛగా వేటాడటం, ఖనిజ తైల ఇంధనాలను, రసాయనిక ఎరువులు, పురుగుమందులను యథేచ్ఛగా వాడటం వంటి చర్యలతో ప్రకృతి సమతుల్యత గతి తప్పి వన్యప్రాణుల మనుగడకు ప్రమాదం కలుగుతోంది. మన దేశంలో దాదాపు 132 జీవజాతులు అంతరించిపోయే పరిస్థితులకు చేరువగా ఉన్నాయని, వీటిలో 49 వృక్షజాతులు కూడా ఉన్నాయని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్’ (ఐయూసీఎన్) గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. మన జాతీయ జంతువైన పెద్దపులి మొదలుకొని పలు చిన్నా చితకా జంతువులు, రాబందులు మొదలుకొని పిచ్చుకల వరకు గల పక్షుల సంఖ్య గడచిన శతాబ్దకాలంలో గణనీయంగా తగ్గిపోయింది. ఒక ఉదాహరణ చెప్పుకోవాలంటే, ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో మన దేశంలో దాదాపు 40 వేల పెద్దపులులు ఉండేవి. 2008 నాటికి వీటి సంఖ్య 1,411కు పడిపోయినా, నవసహస్రాబ్ది ప్రారంభంలో ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా 2019 నాటికి 2,967కు చేరుకుంది. మన దేశంలోని మిగిలిన వన్యప్రాణులదీ దాదాపు ఇదే పరిస్థితి. ముప్పులో పదిలక్షల జీవజాతులు ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదిలక్షల జీవజాతుల మనుగడ ముప్పులో ఉందని గత ఏడాది మే నెలలో ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ఒక నివేదిక హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 87 లక్షల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయని, వీటిలో పదిలక్షల జీవజాతుల మనుగడ ముప్పులో ఉందని ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన ‘గ్లోబల్ అసెస్మెంట్ రిపోర్ట్ ఆన్ బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ సర్వీసెస్’ హెచ్చిరిస్తోంది. ప్రపంచంలోని 50 ప్రధాన దేశాల ప్రభుత్వాలు, శాస్త్ర పరిశోధన సంస్థల నుంచి సేకరించిన వివరాలతో 145 మంది శాస్త్ర నిపుణులు 1500 పేజీలతో ఈ నివేదికను రూపొందించారు. పారిస్‌లో గత ఏడాది మే నెలలో జరిగిన సదస్సులో ఈ నివేదిక సారాంశాన్ని 40 పేజీలతో ‘సమ్మరీ ఫర్ పాలసీ మేకర్స్’ పేరిట విడుదల చేశారు. మన పర్యావరణ ఆరోగ్యం శరవేగంగా క్షీణిస్తోందనేందుకు ఈ నివేదికే నిదర్శనమని పారిస్ సదస్సులో ‘ఇంటర్‌గవర్నమెంటల్ సైన్స్ పాలసీ ప్లాట్‌ఫామ్ ఆన్ బయో డైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్ (ఐపీబీఈఎస్) అధ్యక్షుడు రాబర్ట్ వాట్సన్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘మన ఆర్థిక వ్యవస్థలు, మన జీవనోపాధి, ఆహార భద్రత, ఆరోగ్యం, జీవన నాణ్యతలకు సంబంధించిన పునాదులకు మనమే హాని చేసుకుంటున్నాం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘మితిమీరిన చేపల వేట, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆమ్లీకరణ వంటి వాటితో చివరకు సముద్రాలను కూడా దారుణంగా నాశనం చేస్తున్నాం’ అని ఆయన అన్నారు. నవ సహస్రాబ్దిలో ఐక్యరాజ్య సమితి నిర్దేశించుకున్న ప్రపంచ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవాలంటే 2030 నాటికి భూమ్మీద మనుగడ సాగిస్తున్న వాటిలో ప్రమాదం అంచుల్లో ఉన్న 30 శాతం జీవ జాతులను కాపాడుకోవాలని, 2050 నాటికి అంతరించిపోయే స్థితిలో ఉన్నవాటిలో 50 శాతం జీవజాతులను రక్షించుకోవాలని పారిస్ సదస్సులో పాల్గొన్న ‘నేషనల్ జాగ్రఫిక్ సొసైటీ’ ఉపాధ్యక్షుడు జొనాథన్ బెయిలీ పిలుపునిచ్చారు. మన దేశంలో ప్రమాదం అంచుల్లో ఉన్న జీవులు... మన దేశంలో ప్రమాదం అంచుల్లో ఉన్న జీవజాతులు మొత్తం 132 ఉన్నట్లు ఇటీవల అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. ఈ నివేదికలు వెల్లడించిన వాటిలో కొన్ని ప్రధానమైన జీవజాతులు కూడా ఉన్నాయి. మన జాతీయ జంతువుగా గర్వంగా చెప్పుకునే బెంగాల్ పులి (రాయల్ బెంగాల్ టైగర్), గంగా నదీ డాల్ఫిన్, ‘ఘరియాల్’ జాతికి చెందిన మొసలి, కొంగ జాతికి చెందిన ‘ఇండియన్ బస్టర్డ్’, ఖడ్గమృగం, కృష్ణజింక, అడవి గాడిద, నీటి బర్రె, ఏనుగు, నీలగిరి కోతి, రేచు కుక్క, రెడ్ పాండా వంటివి కూడా ఉన్నాయి. పక్షులలో గద్దలు, రాబందులు, పిచ్చుకల సంఖ్య గణనీయంగా తగ్గింది. అడవుల్లోనే కాదు, ఒకప్పుడు పట్టణాల పరిసరాల్లో కూడా కనిపించే ఈ పక్షిజాతులు బొత్తిగా అరుదుగా మారాయి. వీటితో పాటు కొంగ జాతికి చెందిన ‘వైట్ బెల్లీడ్ హెరాన్’, బాతు జాతికి చెందిన బేయర్స్ పోచార్డ్, పిచుకను పోలి ఉండే స్పూన్ బిల్డ్ శాండ్‌పైపర్, హిమాలయ క్రౌంచ పక్షి, మణిపురి క్రౌంచపక్షి, అడవి గుడ్లగూబ, నెమలి జాతికి చెందిన ‘గ్రీన్ పీఫౌల్’, నీలగిరి పక్షి, డాల్మేషియన్ కొంగ, సారస్ కొంగ వంటి పక్షిజాతులు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. జంతుజాతుల్లో పులులు, సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు వంటి వాటితో పాటు హిమాలయన్ తోడేలు, చైనీస్ పంగోలిన్, కశ్మీర్ జింక, రెడ్ పాండా, కస్తూరి మృగం, అడవి దున్న, నీటి బర్రె, జడల బర్రె, నీలగిరి తహర్, వానరాల జాతికి చెందిన లయన్ టెయిల్డ్ మకాక్, జంగుపిల్లి, మంచు చిరుత, నీలగిరి మార్టెన్, ఎలుగు జాతికి చెందిన సన్ బేర్ వంటి జంతువులు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయి. జలచరాల్లో గంగా డాల్ఫిన్, ఘరియాల్ మొసలి వంటి వాటితో పాటు ఆలివ్ రిడ్లే తాబేలు, అస్సాం తాబేలు, కీలెడ్ బాక్స్ తాబేలుతో పాటు ఫిన్ వేల్, బ్లూ వేల్, నైఫ్ టూత్ సా ఫిష్, రెడ్‌లైన్ టార్పెడో బార్బ్, గోల్డోన్ మహాసీర్ మత్స్యజాతులు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా, గోవా తొండ, వాయనాడ్ తొండ, పడమటి కనుమల్లో కనిపించే ‘బ్రాంజ్‌బ్యాక్’ పాము, పూనా బల్లి, కొండ బల్లి, ట్రావెన్కోర్ పాము వంటి సరీసృపాలు దాదాపు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) వెల్లడించిన ప్రకారం 1750 నాటి నుంచి ఇప్పటి వరకు భారత భూభాగంపై కనిపించే వన్యప్రాణి జాతుల్లో నాలుగు, వృక్షజాతుల్లో 18 పూర్తిగా అంతరించిపోయాయి. అంతరించిపోయిన వృక్షజాతుల్లో నాలుగు జాతులు పూలు పూయని జాతులకు చెందినవైతే, 14 పూలు పూసే జాతులకు చెందినవని బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) డైరెక్టర్ ఏఏ మావో ఒక నివేదికలో వెల్లడించారు. అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ నివేదికను గత ఏడాది జూలైలో లోక్‌సభలో చర్చకు ప్రవేశపెట్టింది. ప్రకృతి విపత్తులు, పర్యావరణ మార్పులు, వేట వంటి మానవ తప్పిదాలు వంటి కారణాల వల్ల ఈ జీవజాతులు అంతరించిపోయాయని అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వన్యప్రాణులకు చేటు తెస్తున్న కారణాలు వన్యప్రాణులకు చేటు తెచ్చి పెడుతున్న కారణాలు చాలానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఖనిజ ఇంధనాల వినియోగం వల్ల మితిమీరి పెరుగుతున్న కాలుష్యం, దాని ఫలితంగా పెరుగుతున్న భూతాపం, యథేచ్ఛగా సాగుతున్న అడవుల నరికివేత, విశృంఖలమైన వేట, వ్యవసాయ పద్ధతుల్లో మార్పుల వల్ల పెరిగిన పురుగు మందులు, రసాయనిక ఎరువుల వినియోగం వంటివి వన్యప్రాణుల మనుగడకు తీవ్రస్థాయిలో ముప్పు తెచ్చిపెడుతున్నాయి. ఇవన్నీ మానవ తప్పిదాలు. వీటిని నియంత్రించకుంటే మన కళ్ల ముందే చాలా జీవజాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు కూడా వన్యప్రాణులు అంతరించిపోవడానికి కారణమవుతుంటాయి. గ్రహశకలాలు భూమిని తాకడం, భూకంపాలు, కార్చిచ్చులు వంటి ఉత్పాతాలు జీవరాశికి చేటు తెచ్చిపెడుతుంటాయి. దాదాపు ఆరున్నర కోట్ల ఏళ్ల కిందట గ్రహశకలాలు భూమిని తాకిన ఫలితంగా అప్పటి వరకు భూమ్మీద మనుగడ సాగించిన భారీ జీవులైన డైనోసార్లు పూర్తిగా అంతరించిపోయాయి. అడవుల నరికివేత, కార్చిచ్చుల కారణంగా వన్యప్రాణులు ఆవాసం కోల్పోయి అంతరించిపోయే పరిస్థితులకు చేరుకుంటున్నాయి. జన్యు వైవిధ్యం కొరవడటం కారణంగా కొన్ని ప్రాణులు కనుమరుగయ్యే స్థితికి చేరుకుంటున్నాయి. ఆఫ్రికన్ చిరుతలు జన్యు వైవిధ్యం కొరవడటం కారణంగానే త్వరగా అంతరించిపోతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆహారం కొరవడటం వల్ల మరికొన్ని జీవజాతులు నశిస్తున్నాయి. దోమలను ఆహారంగా తీసుకుంటూ మనుగడ సాగించే కొన్ని రకాల కప్పలు, గబ్బిలాల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గముఖం పడుతోంది. ప్లాస్టిక్, ప్రమాదకరమైన రసాయనాలు సముద్రాల్లో కలుస్తుండటంతో పలు జాతులకు చెందిన సముద్రజీవులు, పగడపు దీవులు వేగంగా నశిస్తున్నాయి. వన్యప్రాణుల పరిరక్షణకు చర్యలు వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మన ప్రభుత్వం కూడా ఈ దిశగా పలు చర్యలు చేపడుతోంది. కేవలం శతాబ్ది వ్యవధిలోనే మన దేశంలో పులుల సంఖ్య 95 శాతానికి పైగా కనుమరుగవడంతో ప్రభుత్వం 1972లో పులులను కాపాడుకోవడానికి ‘ప్రాజెక్ట్ టైగర్’ను ప్రారంభించింది. అదే ఏడాది వన్యప్రాణి పరిరక్షణ చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చింది. ‘ప్రాజెక్ట్ టైగర్’ ఇప్పుడిప్పుడే కొంత ఆశాజనకమైన ఫలితాలను ఇస్తుండటం కొంత ఆశాజనకమైన పరిణామం. దంతాల కోసం ఏనుగుల వేట విచ్చలవిడిగా సాగడంతో ఏనుగుల మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో 1992లో ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను ప్రారంభించింది. అదే రీతిలో మొసళ్లు, తాబేళ్ల పరిరక్షణ కోసం ప్రత్యేకమైన ప్రాజెక్టులను ప్రారంభించింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం రాబందుల పరిరక్షణ కోసం, ఖడ్గమృగాల పరిరక్షణ కోసం కూడా ప్రత్యేక ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రభుత్వాలు వన్యప్రాణుల పరిరక్షణ కోసం ఎన్ని కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుని, అమలులోకి తెచ్చినా, ఖనిజ ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించకుండా జీవవైవిధ్యాన్ని దీర్ఘకాలంలో కాపాడుకోవడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖనిజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవడమే కాకుండా, విరివిగా అడవుల పెంపకం, రసాయన వ్యర్థాలను నదులు, సముద్రాల్లో కలపకుండా జాగ్రత్త పడటం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోవడం వంటి చర్యలను చిత్తశుద్ధితో చేపడితే తప్ప జీవజాతులను కాపాడుకోలేమని వారు చెబుతున్నారు. -
ఈ భారత మహిళల గురించి మీకు తెలుసా?
శాస్త్ర సాంకేతిక రంగాలే ప్రపంచ పురోగతికి ఆధారాలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళల ఉనికి మాత్రం జనాభా నిష్పత్తికి తగినంతగా ఉండటం లేదు. నవ సహస్రాబ్దిలో శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం కొంత పుంజుకున్నా, ఇదివరకటి శతాబ్దాల్లో పరిస్థితులు భిన్నంగా ఉండేవి. మన దేశంలోనైతే మహిళా శాస్త్రవేత్తల సంఖ్య వేళ్లపై లెక్కించే స్థాయిలోనే ఉండేది. మహిళలు చదువుకోవడమే అరుదైన ఆ కాలంలో సైతం కొందరు మహిళలు పరిస్థితులకు ఎదురీది మరీ శాస్త్రవేత్తలుగా తమ సత్తా చాటుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో వారు మైలురాళ్లలా నిలిచిపోయే విజయాలను సాధించారు. ఫిబ్రవరి 28 నేషనల్ సైన్స్ డే సందర్భంగా మన దేశానికి చెందిన కొందరు తొలితరం మహిళా శాస్త్రవేత్తల గురించి... ఈ ఏడాది థీమ్ విమెన్ ఇన్ సైన్స్ వైద్యంలో పట్టా సాధించిన తొలి భారతీయురాలు ఆనందీబాయి జోషి మన దేశంలో పాశ్చాత్య విద్య ప్రాచుర్యంలోకి వస్తున్న తొలి రోజుల్లోనే వైద్యశాస్త్రంలో పట్టా సాధించిన తొలి మహిళ ఆనందీబాయి జోషి. అప్పటి బాంబే ప్రెసిడెన్సీలోని (ఇప్పటి మహారాష్ట్ర) కల్యాణ్ పట్టణంలో 1865 మార్చి 31న బతికి చెడిన భూస్వాముల కుటుంబంలో జన్మించారామె. ఆనాటి పద్ధతుల ప్రకారం ఆమెకు తొమ్మిదేళ్ల వయసులోనే తపాలా గుమస్తాగా పనిచేసే గోపాలరావు జోషితో పెళ్లి జరిగింది. గోపాలరావు జోషి మొదటి భార్య అప్పటికే మరణించింది. ఇద్దరికీ వయసులో ఇరవయ్యేళ్లకు పైనే తేడా. గోపాలరావు జోషి కొంత ఆధునిక భావాలు కలిగిన వ్యక్తి కావడంతో భార్యకు చదువు చెప్పించారు. గోపాలరావు జోషికి కలకత్తా బదిలీ కావడంతో కుటుంబం అక్కడకు చేరుకుంది. పద్నాలుగేళ్ల వయసులో ఆనందీబాయి తొలి బిడ్డకు జన్మనిచ్చింది. తగిన వైద్యం అందనందున ఆ బిడ్డ పట్టుమని పదిరోజుల్లోనే కన్నుమూయడం ఆనందీబాయిని తీవ్రంగా కలచివేసింది. మహిళలకు ఇలాంటి దుస్థితి నుంచి తప్పించడానికి తానే స్వయంగా వైద్యశాస్త్రం అభ్యసించాలని నిశ్చయించుకుంది. ఆ కృతనిశ్చయమే ఆమెను వైద్యశాస్త్రంలో పట్టభద్రురాలైన తొలి భారతీయ మహిళగా చరిత్రలో నిలిపింది. ఆనందీబాయి నిశ్చయానికి భర్త ప్రోత్సాహం తోడైంది. తన భార్య వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటోందని, అందుకు తగిన సహాయం చేయమని కోరుతూ ప్రముఖ అమెరికన్ మిషనరీ రాయల్ వైల్డర్‌కు గోపాలరావు జోషి లేఖ రాశారు. వైల్డర్ ఆ లేఖను తాను నడిపే ‘ప్రిన్స్టన్స్ మిషనరీ రివ్యూ’ పత్రికలో ప్రచురించారు. దానిని చూసిన థియోడిషియా కార్పెంటర్ అనే సంపన్నురాలు ఆనందీబాయికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చింది. కలకత్తాలో ఉంటున్న ఆనందీబాయికి నేరుగా లేఖ రాసింది. అప్పటికి ఆనందీబాయి అనారోగ్యంతో బాధపడుతుండేది. థియోడిషియా ఆమెకు అమెరికా నుంచి మందులు కూడా పంపేది. ఈలోగా గోపాలరావుకు బెంగాల్‌లోని సీరమ్‌పూర్ బదిలీ అయింది. పెన్సిల్వేనియాలోని విమెన్స్ మెడికల్ కాలేజీకి దరఖాస్తు చేసుకోమని థియోడిషియా సూచించడంతో ఆనందీబాయి దరఖాస్తు చేసుకుంది. ఇదిలా ఉంటే, ఒక సందర్భంలో ఆనందీబాయి సీరమ్‌పూర్ కాలేజీలో ప్రసంగం చేసింది. అమెరికాలో వైద్యశాస్త్రం అభ్యసించాలనుకుంటున్నానంటూ ఆమె చేసిన ప్రసంగానికి విపరీతమైన ప్రచారం వచ్చింది. ఆమె చదువు కోసం సంపన్నుల నుంచి విరాళాలు వచ్చాయి. పెన్సిల్వేనియా లోని విమెన్స్ మెడికల్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. కలకత్తా నుంచి ఆనందీబాయి ఓడలో ప్రయాణించి అమెరికా చేరుకుంది. పెన్సిల్వేనియా విమెన్స్ మెడికల్ కాలేజీ నుంచి 1886లో విజయవంతంగా ఎండీ పూర్తి చేసింది. అకుంఠిత దీక్షలో చదువులో మునిగి ఆరోగ్యాన్ని పట్టించుకోకపోవడంతో ఆనందీబాయికి క్షయ సోకింది. పట్టాపుచ్చుకుని ఏడాదైనా గడవక ముందే 1886 ఫిబ్రవరి 26న కన్నుమూసింది. అమెరికా నుంచి వృక్షశాస్త్రంలో పీహెచ్డీ పొందిన తొలి మహిళ జానకి అమ్మాళ్ వృక్షశాస్త్రంలో చిరస్మరణీయమైన పరిశోధనలు సాగించిన జానకి అమ్మాళ్ 1897 నవంబరు 4న అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలిచెర్రిలో జన్మించారు. ఆమె తండ్రి దివాన్ బహదూర్ ఇ.కె.కృష్ణన్ సబ్జడ్జిగా పనిచేసేవారు. తండ్రి ప్రోత్సాహంతో ఆమె ఉన్నత చదువులను కొనసాగించగలిగారు. మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజీ నుంచి 1924లో బోటనీలో ఆనర్స్ డిగ్రీ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం మిషిగాన్ వెళ్లారు. అక్కడ బార్బర్ స్కాలర్షిప్ పొంది 1926లో బోటనీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి స్వదేశానికి తిరిగి వచ్చి, మద్రాసులోని విమెన్స్ క్రిస్టియన్ కాలేజీలో కొంతకాలం అధ్యాపకురాలిగా పనిచేసి, పరిశోధనల కోసం మళ్లీ మిషిగాన్ చేరుకున్నారు. మిషిగాన్ వర్సిటీ నుంచి 1931లో పీహెచ్డీ పొందారు. అమెరికాలోనే వృక్షశాస్త్రంలో పీహెచ్డీ సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. చెరకు, వంకాయలు వంటి పంటల కణనిర్మాణంపై ఆమె చేసిన పరిశోధనలకు అంతర్జాతీయంగా గుర్తింపు దక్కింది. తోటల్లో పెంచుకునే మొక్కలు, వర్షారణ్య వృక్షాలపై ఆమె విస్తృతంగా పరిశోధనలు సాగించి, అంతర్జాతీయంగా మన్ననలు పొందారు. మిషిగాన్ వర్సిటీ ఆమెకు 1956లో ఎల్ఎల్డీ గౌరవ పట్టాను ఇచ్చింది. భారత ప్రభుత్వం 1977లో జానకి అమ్మాళ్‌ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. జమ్ములోని రీజియనల్ రీసెర్చ్ లాబొరేటరీలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా పనిచేసిన కాలంలో 3,254 వృక్షజాతులకు చెందిన 21,500 నమూనాలపై పరిశోధనలు సాగించారు. ఆమె పరిశోధనలు జన్యుశాస్త్రం అభివృద్ధికి ఇతోధికంగా దోహదపడ్డాయి. ఇండియన్ సొసైటీ ఆఫ్ జెనెటిక్స్ అండ్ ప్లాండ్ బ్రీడింగ్, బ్రిటిష్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలకు అధ్యక్ష పదవిలో కొనసాగిన తొలి మహిళగా కూడా జానకి అమ్మాళ్ అరుదైన చరిత్ర సృష్టించారు. అనారోగ్యంతో ఆమె 1984 ఫిబ్రవరి 7న మద్రాసులో కన్నుమూశారు. సైన్స్‌లో డాక్టరేట్ సాధించిన తొలి భారతీయురాలు అసీమా ఛటర్జీ బ్రిటిష్ హయాంలో సైన్స్ విభాగం నుంచి డాక్టరేట్ సాధించిన తొలి భారతీయ మహిళ అసీమా ఛటర్జీ. ఆమె కలకత్తాలో 1917 సెప్టెంబరు 23న జన్మించారు. ఆమె తండ్రి నారాయణ ముఖర్జీ కలకత్తాలో వైద్యుడిగా ప్రాక్టీస్ చేసేవారు. ఆధునిక భావాలు గల ఆయన కుమార్తెను ఉన్నత చదువుల దిశగా ప్రోత్సహించారు. తండ్రి ప్రోత్సాహంతో అసీమా కలకత్తాలోని స్కాటిష్ చర్చి కాలేజీ నుంచి 1936లో కెమిస్ట్రీ ఆనర్స్ డిగ్రీ సాధించారు. తర్వాత 1938లో కలకత్తా యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ‘ఫైటోమెడిసిన్స్’పై ఆమె సమర్పించిన సిద్ధాంత వ్యాసానికి కలకత్తా యూనివర్సిటీ డాక్టరేట్ ఇచ్చింది. ఆమె పరిశోధన ఫలితంగా మూర్ఛ వ్యాధిని, మలేరియాను నయం చేసే మందుల తయారీకి, కేన్సర్ చికిత్సలో ఉపయోగించే కీమోథెరపీ మందుల తయారీకి మార్గం సుగమమైంది. కలకత్తా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తయ్యాక ఆమె అమెరికా వెళ్లి విస్కాన్సిన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలలో పరిశోధనలు సాగించారు. కలకత్తా యూనివర్సిటీ పరిధిలోని లేడీ బ్రాబర్న్ కాలేజీలో కెమిస్ట్రీ విభాగాన్ని స్థాపించిన ఘనత అసీమాకే దక్కుతుంది. పలు శాస్త్ర సాంకేతిక విద్యా సంస్థల్లో ఉన్నత పదవులు నిర్వహించిన అసీమా, 1982–90 మధ్య రాజ్యసభ సభ్యురాలిగా కూడా కొనసాగారు. భారత ప్రభుత్వం ఆమె విశిష్ట సేవలకు గుర్తింపుగా 1975లో ‘పద్మభూషణ్’తో సత్కరించింది. ఇవన్నీ ఒక ఎత్తయితే, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి ఎన్నికైన తొలి మహిళా శాస్త్రవేత్తగా ఆమె సాధించిన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది. రామన్పైనే సత్యాగ్రహం ప్రకటించిన ధీర కమలా సోహనీ శాస్త్ర సాంకేతిక రంగంలో మహిళల పట్ల వివక్ష ఈనాటిది కాదు. తొలి రోజుల్లో వివక్ష మరింత ఎక్కువగా ఉండేది. కేవలం మహిళ అయిన కారణంగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం ఆమె చేసుకున్న దరఖాస్తుకు నిరాకరణ ఎదురైంది. ఆమె దరఖాస్తును తోసిపుచ్చినది ఎవరో కాదు, అప్పట్లో ఆ సంస్థ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ‘నోబెల్’ గ్రహీత సీవీ రామన్. మహిళలు శాస్త్ర పరిశోధనను కొనసాగించలేరంటూ ఆమె దరఖాస్తును రామన్ తోసిపుచ్చారు. పరిశోధన సాగించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలా సోహనీ ఈ తిరస్కారాన్ని తేలికగా తీసుకోలేదు. రామన్ నిర్ణయానికి నిరసనగా సత్యగ్రాహం చేపట్టింది. దెబ్బకు రామన్ దిగివచ్చి, ఆమెను రీసెర్చ్ ఫెలోగా చేర్చుకోక తప్పలేదు. కమలా సోహనీ మధ్యప్రదేశ్‌లోని (అప్పటి సెంట్రల్ ప్రావిన్స్) ఇండోర్‌లో 1912 సెప్టెంబర్ 14న జన్మించారు. ఆమె తండ్రి నారాయణరావు భగవత్, పినతండ్రి మాధవరావు భగవత్– ఇద్దరూ రసాయనిక శాస్త్రవేత్తలే! వారిద్దరూ బెంగళూరులోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ పట్టభద్రులు. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెన్స్ తర్వాతి కాలంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌గా (ఐఐఎస్సీ) మారింది. ఐఐఎస్సీలో రీసెర్చ్ ఫెలోషిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ముందు కమలా సోహనీ బాంబే యూనివర్సిటీ నుంచి 1933లో కెమిస్ట్రీ ప్రధానాంశంగా, ఫిజిక్స్ ద్వితీయాంశంగా బీఎస్సీ, 1936లో కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ డిస్టింక్షన్‌తో పూర్తి చేశారు. కమలా సోహనీ పోరాట ఫలితంగా ఐఐఎస్సీలో మహిళల ప్రవేశానికి 1937 నుంచి మార్గం ఏర్పడింది. ఐఐఎస్సీలో శ్రీనివాసయ్య మార్గదర్శకత్వంలో కమలా సోహనీ పాలు, పప్పుధాన్యాలు, గింజధాన్యాల్లోని ప్రొటీన్లపై పరిశోధన సాగించారు. ఆమె పరిశోధనలకు అంతర్జాతీయ గుర్తింపు లభించడంతో కేంబ్రిడ్జి వర్సిటీ పరిశోధనలు కొనసాగించడానికి ఆమెను ఆహ్వానించింది. అక్కడ ఆమె ప్రఖ్యాత జీవ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ రాబిన్ హిల్ నేతృత్వంలో పద్నాలుగు నెలల్లో పరిశోధన పూర్తి చేసి, సమర్పించిన కేవలం 40 పేజీల సిద్ధాంత వ్యాసానికి పీహెచ్డీ లభించింది. డాక్టరేట్ పూర్తయిన వెంటనే 1939లో ఆమె స్వదేశానికి వచ్చారు. ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో బయోకెమిస్ట్రీ విభాగాధిపతిగా నియమితులయ్యారు. తాజా తాటికల్లు (నీరా) పోషక విలువలపై ఆమె జరిపిన పరిశోధన భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. పోషకాహార లోపంతో బాధపడే పిల్లలకు నీరా ఇవ్వవచ్చని, నీరాను తాటిబెల్లంగా తయారు చేసినట్లయితే, పోషక విలువలను ఎక్కువ కాలం నిల్వ ఉంచవచ్చని ఆమె నిరూపించారు. ‘నీరా’పై పరిశోధన చేసినందుకు ఆమెకు రాష్ట్రపతి అవార్డు దక్కింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 1998లో ఆమెను ఘనంగా సత్కరిస్తుండగా వేదికపైనే కుప్పకూలిపోయిన ఆమె కొద్ది రోజుల్లోనే కన్ను మూశారు. దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్త అన్నా మణి దేశంలోనే తొలి మహిళా వాతావరణ శాస్త్రవేత్తగా ఉన్నత స్థాయికి చేరుకున్న అన్నా మణి మద్రాసు ప్రెసిడెన్సీలోని రామనాథపురం జిల్లా పారంకుడిలో 1918 ఆగస్టు 23న జన్మించారు. ఆమె తండ్రి సివిల్ ఇంజనీరు. చిన్నప్పటి నుంచి పుస్తకాలు, కళలపై అన్నా మణికి విపరీతమైన ఆసక్తి ఉండేది. ఎనిమిదో పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సంప్రదాయం ప్రకారం ఆమెకు వజ్రాల చెవిరింగులు బహుమతిగా కొని తేవడానికి తండ్రి బజారుకు వెళ్లడానికి సిద్ధపడుతుంటే, తనకు వజ్రాల రింగులు వద్దని, వాటికి బదులు ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా’ కావాలని కోరింది. బాల్యంలో ఆమెకు నాట్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. నర్తకి కావాలనుకుంది కూడా. కాలేజీలో చేరిన తర్వాత మాత్రం నాట్యం బదులు పరిశోధనల్లోనే తన భవితవ్యాన్ని తీర్చిదిద్దుకుంది. మద్రాసులోని పచ్చయ్యప్ప కాలేజీ నుంచి 1939లో ఫిజిక్స్, కెమిస్ట్రీలతో బీఎస్సీ ఆనర్స్ పూర్తి చేసింది. మరుసటి ఏడాదే ఆమెకు పరిశోధనలు కొనసాగించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ స్కాలర్షిప్ లభించింది. అక్కడ ప్రొఫెసర్ సాల్మన్ పాపయ్య మార్గదర్శకత్వంలో వజ్రాలు, కెంపులకు గల కాంతిపరావర్తన లక్షణాలపై పరిశోధన సాగించి, పీహెచ్డీ కోసం సిద్ధాంత వ్యాసం సమర్పించారు. అయితే, ఆమె అప్పటికి ఫిజిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయనందున ఆమెకు పీహెచ్డీ ఇచ్చేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారు. మాస్టర్స్ డిగ్రీ కోసం ఆమె లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో చేరారు. భౌతిక శాస్త్రంలో పరిశోధనలు సాగించాలనే లక్ష్యంతో వెళ్లిన ఆమె చివరకు వాతావరణ శాస్త్ర పరిశోధకురాలిగా తేలారు. స్వదేశానికి 1948లో తిరిగి వచ్చాక, పుణేలోని వాతావరణ శాఖ కార్యాలయంలో చేరారు. వాతావరణ పరికరాలపై ఆమె అసంఖ్యాకమైన పరిశోధన పత్రాలను సమర్పించారు. చాలా పరికరాలను ఆమె ప్రామాణీకరించారు. పుణేలో ఆమె ఐదేళ్ల వ్యవధిలోనే వాతావరణ విభాగాధిపతి స్థాయికి ఎదిగారు. ఆమె కింద 121 మంది పురుషులు సిబ్బందిగా పనిచేసేవారు. తర్వాత ఆమె 1968లో డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా పదోన్నతిపై ఢిల్లీ బదిలీ అయ్యారు. కొంతకాలం ఈజిప్టులో ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) కన్సల్టంట్గా పనిచేశారు. జీవితాంతం పరిశోధనలకే అంకితమైన ఆమె వివాహం చేసుకోలేదు. 1994లో పక్షవాతం బారినపడిన ఆమె 2001లో కన్నుమూశారు. సూర్యరశ్మి నుంచి వెలువడే రేడియేషన్ ప్రభావంపై ఆమె జరిపిన పరిశోధనలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు దక్కాయి. ఆమె శత జయంతి సందర్భంగా 2018లో డబ్ల్యూఎంవో తన జర్నల్‌లో ఆమె సంక్షిప్త జీవిత చరిత్రను, ఇంటర్వ్యూను ప్రచురించింది. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టు రూపాబాయి ఫర్దూన్జీ రూపాబాయి ఫర్దూన్జీ హైదరాబాద్‌లోని ఒక పార్శీ కుటుంబంలో పుట్టారు. ఆమె జనన మరణ వివరాలేవీ తెలియవు గాని, నాటి హైదరాబాద్ మెడికల్ కాలేజీలో (ఇప్పటి ఉస్మానియా మెడికల్ కాలేజీ) 1885లో చేరిన ఐదుగురు మహిళా విద్యార్థుల్లో ఆమె ఒకరు. హైదరాబాద్ మెడికల్ కాలేజీ నుంచి ‘హకీం’ పట్టా తీసుకున్నాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ బాల్టిమోర్‌లోని జాన్స్ హాప్కిన్స్ హాస్పిటల్లో పాశ్చాత్య వైద్యంలో డిగ్రీ కోసం చేరారు. అప్పట్లో అమెరికా, ఇంగ్లాండ్‌లలో సైతం చాలా వైద్య కళాశాలలు మహిళలకు ప్రవేశం కల్పించేవి కావు. మహిళలకు ప్రవేశం కల్పించే అతి కొద్ది సంస్థల్లో బాల్టిమోర్‌లోని జాన్స్హాప్కిన్స్ హాస్పిటల్ ఒకటి. బాల్టిమోర్‌లో చదువు పూర్తయ్యాక తిరిగి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లోని తొలి రెండు క్లోరోఫామ్ కమిషన్లలో (1888, 1891) కీలక పాత్ర పోషించారు. తర్వాత 1909లో స్కాట్లాండ్ వెళ్లి, అక్కడ ఎడిన్బర్గ్ యూనివర్సిటీలో చేరారు. అప్పటికి అనెస్థీషియాలో ఏ యూనివర్సిటీలోనూ స్పెషలైజేషన్ కోర్సులు లేవు. అయినా ఆమె ఒకవైపు అనెస్థెటిక్స్లో పరిశోధనలు సాగిస్తూనే, మరోవైపు ఎడిన్బర్గ్ వర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీలలో డిప్లొమాలు పూర్తి చేశారు. అనెస్థెటిక్స్లో అనుభవజ్ఞానం ఉన్నవారి సేవలను శస్త్రవైద్యులు తమకు అవసరమైన సందర్భాల్లో ఉపయోగించుకునేవారు. అలా రూపాబాయి ఫర్దూన్జీ కూడా పలువురు శస్త్రవైద్యులకు అనెస్థటిస్టుగా సేవలందించారు. ప్రపంచంలోనే తొలి మహిళా అనెస్థటిస్టుగా గుర్తింపు పొందారు. ఎడిన్బర్గ్లో పరిశోధనలు పూర్తయ్యాక ఆమె స్వదేశానికి చేరుకున్నారు. హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి, 1920లో రిటైరయ్యారు. -
మహా ‘శివ’రాత్రి మార్మోగిపోయేలా
ముక్కోటి దేవతలలో శివుడు సనాతనుడు. శివుడు భోళాశంకరుడు. శివుడు భక్త వశంకరుడు. శివుడు పంచభూతాలకు అధినాథుడైన భూతనాథుడు. శివుడు భవరోగాలను నయం చేసే వైద్యనాథుడు. సమస్త చరాచర జగత్తుకు ఆయనే విశ్వనాథుడు. ఏదో మాట వరసకు జన్మానికో శివరాత్రి అంటారు గాని, నిజానికి ఏటా మహాశివరాత్రి పర్వదినం వస్తూనే ఉంటుంది. లోక రక్షణ కోసం శివుడు గరళాన్ని దిగమింగి కంఠంలో దాచుకున్న రోజును మహాశివరాత్రిగా పాటించడం ఆనవాయితీగా వస్తోంది. అమృతం కోసం దేవదానవులు క్షీరసాగర మథనం చేస్తుండగా, ముందుగా హాలాహలం పుట్టింది. హాలహల విషజ్వాలలు ముల్లోకాలనూ అల్లకల్లోలం చేస్తుండటంతో దేవదానవులంతా పరమశివుడిని శరణు వేడుకున్నారు. భక్త వశంకరుడైన శివుడు మరో ఆలోచన లేకుండా, హాలాహలాన్ని ఒడిసి పట్టి, దానిని దిగమింగి గొంతులో బిగించి బంధించాడు. గరళమైన హాలాహల ప్రభావానికి శివుని కంఠం కమిలిపోయి నీలిరంగులోకి మారడంతో నీలకంఠుడయ్యాడు. హాలాహల ప్రభావానికి శివుడు స్పృహతప్పిపోయాడు. పార్వతీదేవి భర్త తలను ఒడిలోకి తీసుకుని దుఃఖించసాగింది. జరిగిన పరిణామానికి దేవదానవులందరూ భీతిల్లారు. శోకసాగరంలో మునిగిపోయారు. శివుడు తిరిగి మెలకువలోకి వచ్చేంత వరకు అందరూ జాగరం చేశారు. నాటి నుంచి శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివుని పూజించి, జాగరం చేయడం ఆనవాయితీగా మారినట్లు పురాణాల కథనం. పురాణాలే కాదు, వాటి కంటే పురాతనమైన వేదాల కంటే ముందు నుంచే భారత ఉపఖండంలో ప్రజలు శివారాధన చేసేవారు. మధ్యప్రదేశ్‌లోని భీమ్‌భెట్కా గుహలలోని కుడ్యచిత్రాలు ఆనాటి శివారాధనకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. అవి క్రీస్తుపూర్వం ఎనిమిదివేల ఏళ్ల నాటివని చరిత్రకారుల అంచనా. భీమ్‌భెట్కా గుహలలో శివతాండవ దృశ్యాలు, శివుడి త్రిశూలం, ఆయన వాహనమైన నంది చిత్రాలు నేటికీ నిలిచి ఉన్నాయి. సింధులోయ నాగరికత కాలంలో హరప్పా మొహెంజదారో ప్రాంతాల్లోని ప్రజలు శివుడిని పశుపతిగా ఆరాధించేవారనేందుకు మొహెంజదారోలో జరిపిన తవ్వకాలలో ఆధారాలు దొరికాయి. వేద వాంగ్మయం శివుడిని ప్రధానంగా రుద్రుడిగా ప్రస్తుతించింది. రుగ్వేదంలో మొదటిసారిగా ‘శివ’నామం కనిపిస్తుంది. రుద్రాంశ ప్రళయ బీభత్సాలకు దారితీసే ప్రకృతి వైపరీత్యాలకు కారణమైతే, శివాంశ కాలానుకూలమైన మంచి వర్షాలకు కారణమవుతుందని వేద స్తోత్రాలు చెబుతున్నాయి. గ్రీకు దేవుడు ‘డయోనిసిస్’కు శివుని పోలికలు ఉండటంతో భారత భూభాగంపై దండయాత్రకు వచ్చిన అలెగ్జాండర్ ఇక్కడి శివుడిని ‘ఇండియన్ డయోనిసిస్’గా అభివర్ణించాడు. కాలక్రమేణా భారత ఉపఖండంలో శివుడినే పరమదైవంగా పరిగణించే శైవమతం వ్యాప్తిలోకి వచ్చింది. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో శైవమతం విస్తృతంగా వ్యాపించింది. భగవద్గీత కంటే ముందునాటి శ్వేతాశ్వతర ఉపనిషత్తులో శైవమత మూలాలు కనిపిస్తాయి. భారత ఉపఖండమే కాకుండా, శ్రీలంక, కంబోడియా, వియత్నాం, ఇండోనేసియా వంటి ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. సనాతన మతాలలో శైవమతం శాక్తేయానికి దగ్గరగా ఉండటంతో పలుచోట్ల శివుడితో పాటు శక్తి ఆరాధన జమిలిగా జరిగేది. అందుకే చాలాచోట్ల శైవక్షేత్రాలు, శక్తి పీఠాలు సన్నిహితంగా కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం తొలి సహస్రాబ్దిలో చాలా రాజ్యాలు శైవాన్ని బాగా ఆదరించాయి. ఆ కాలంలోనే విస్తృతంగా శివునికి ఆలయ నిర్మాణాలు జరిగాయి. అందరివాడు శివుడు అందరివాడు. బ్రహ్మవిష్ణు దేవేంద్రాది దేవతలే కాదు, రావణుడు, బాణాసురుడు, భస్మాసురుడు వంటి దానవులు, వాలి వంటి వానరులు, సమస్త రుషులు, ఆది శంకరాచార్యుల వంటి ఆధ్యాత్మిక గురువులు, కన్నప్ప వంటి గిరిజనులు శివుని ఆరాధించిన వారే. కాళహస్తి మహాత్మ్యం కథనం ప్రకారం సాలెపురుగు, సర్పం, ఏనుగు కూడా శివుని పూజించినట్లు తెలుస్తోంది. దేవ దానవ మానవులకే కాదు, చరాచర సృష్టిలోని సమస్త జీవులకు శివుడే దైవమని పురాణాలు చెబుతున్నాయి. రామాయణ, మహాభారత కాలాల నాటికే శైవమత వ్యాప్తి విస్తృతంగా ఉండేది. బ్రహ్మ సృష్టికారకుడని, విష్ణువు స్థితికారకుడని, శివుడు లయకారకుడని పలు పురాణాలు చెబుతున్నా, శైవమతం ప్రకారం సృష్టి స్థితి లయలకు శివుడే కారకుడు. శివుడే పరబ్రహ్మ స్వరూపుడు. శివుడే ఆదిదేవుడు. సమస్త విశ్వానికీ శివుడే అధినాథుడు. కర్ణాటకలోని మురుడేశ్వరుడు శివుడిని వివిధ భంగిమల్లోని విగ్రహమూర్తిగానే కాకుండా, లింగరూపంలో పూజిస్తారు. చాలాచోట్ల శివాలయాల్లో శివుని పూర్తి విగ్రహాలకు బదులు శివలింగాలే కనిపిస్తాయి. శివపురాణం, లింగపురాణాల్లో శివుని మహిమలకు సంబంధించిన గాథలు విపులంగా కనిపిస్తాయి. అంతేకాదు, మిగిలిన పురాణాల్లోనూ శివుని ప్రస్తావన, శివునికి సంబంధించిన గాథలు కనిపిస్తాయి. సనాతన మతాలైన వైష్ణవ, శాక్తేయాల్లోనూ శివునికి సముచిత ప్రాధాన్యం కనిపిస్తుంది. స్మార్త సంప్రదాయంలోని పంచాయతన దేవతల్లో శివుడికీ స్థానం కల్పించారు. వైష్ణవం పుంజుకోక ముందు ఉత్తర దక్షిణ భారత ప్రాంతాల్లోని పలు రాజ్యాల్లో శైవానికి విపరీతమైన ఆదరణ ఉండేది. ప్రతి రాజ్యంలోనూ శివాలయాలు వెలిశాయి. వాటికి సంబంధించిన స్థల పురాణాలూ ప్రాచుర్యంలోకి వచ్చాయి. కుషానుల పాలనలో చలామణీలో ఉన్న బంగారు నాణేలపై నంది వాహనంతో శివుని బొమ్మను ముద్రించారంటే ఆనాటి కాలంలో శైవానికి ఎలాంటి ఆదరణ ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు శైవ క్షేత్రాల్లో ప్రధానమైనవి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలు. ఈ పన్నెండు క్షేత్రాలనూ శైవులు అత్యంత పవిత్ర క్షేత్రాలుగా పరిగణిస్తారు. గుజరాత్‌లోని సోమనాథ క్షేత్రం, జామ్‌నగర్‌లో నాగేశ్వర క్షేత్రం, ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంలోని మల్లికార్జున క్షేత్రం, మధ్యప్రదేశ్‌లో ఉజ్జయినిలోని మహాకాలేశ్వర క్షేత్రం, ఇండోర్ సమీపంలోని ఓంకారేశ్వర క్షేత్రం, ఉత్తరాఖండ్‌లో కేదారనాథ క్షేత్రం, మహారాష్ట్రలో పుణె సమీపంలోని భీమశంకర క్షేత్రం, నాసిక్ వద్ద త్రయంబకేశ్వర క్షేత్రం, ఎల్లోరా వద్ద ఘృష్ణేశ్వర క్షేత్రం, ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని విశ్వేశ్వర క్షేత్రం, జార్ఖండ్‌లో దేవ్‌గఢ్ వద్ద వైద్యనాథ క్షేత్రం, తమిళనాడులో రామేశ్వరంలోని రామనాథ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. ఆంధ్రప్రదేశ్‌లో పంచారామ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు శైవ క్షేత్రాలు పంచారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. అవి: అమరావతిలోని అమరలింగేశ్వరుని ఆలయం, ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం, భీమవరంలోని సోమేశ్వర ఆలయం, పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర ఆలయం, సామర్లకోటలోని కుమార భీమేశ్వర ఆలయం. ఇవి అమరారామం, ద్రాక్షారామం, సోమారామం, క్షీరారామం, భీమారామ క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. పంచభూత క్షేత్రాలు ఐదు శైవ క్షేత్రాలు పంచభూత క్షేత్రాలుగా ప్రసిద్ధి పొందాయి. వీటిలో నాలుగు తమిళనాడులో ఉంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో ఉంది. తమిళనాడులోని జంబుకేశ్వరం జల క్షేత్రంగా, అరుణాచలం అగ్ని క్షేత్రంగా, కంచిలోని ఏకాంబరేశ్వరాలయం పృథ్వీక్షేత్రంగా, చిదంబరంలోని నటరాజ ఆలయం ఆకాశ క్షేత్రంగా, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి వాయు క్షేత్రంగా ప్రసిద్ధి చెందాయి. ఆదియోగి మన పురాణాలు ఆదియోగి శివుడేనని చెబుతాయి. పరమయోగులందరికీ శివుడే గురువని చెబుతాయి. సనాతన మతాలలో యోగసాధనకు విస్తృత ప్రాధాన్యం ఉంది. జీవుని అంతిమ లక్ష్యం కైవల్యమేనని, కైవల్యపథాన్ని చేరుకోవడానికి యోగమే మార్గమని, యోగసాధనతోనే జీవాత్మ పరమాత్మలో లీనమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. యోగ విద్యలో వివిధ పద్ధతులు ఉన్నా, శైవ సంప్రదాయానికి చెందిన గ్రంథాలు ఎక్కువగా హఠయోగానికే ప్రాధాన్యమిచ్చాయి. క్రీస్తుశకం ఒకటో శతాబ్దికి చెందిన ‘ఈశ్వర గీత’, పదో శతాబ్దికి చెందిన ‘శివసూత్ర’, ‘శివసంహిత’ వంటి గ్రంథాలు శైవ సంప్రదాయంలో యోగసాధనకు గల ప్రాశస్త్యాన్ని విపులంగా వివరిస్తాయి. భవబంధాలలో చిక్కుకున్న మనుషులు నిరంతరం ఈతిబాధల్లో కొట్టుమిట్టాడుతుంటారని, పరమాత్మను చేరుకోవాలంటే మనుషులకు యోగమే తగిన మార్గమని పదో శతాబ్దికి చెందిన కాశ్మీర శైవ పండితుడు అభినవగుప్తుడు తన రచనల్లో చెప్పాడు. ఉపఖండానికి వెలుపల... భారత ఉపఖండానికి వెలుపల సైతం ప్రాచీనకాలం నుంచి శివారాధన ఉండేది. ఇండోనేసియాలో శివుడిని ‘బటరగురు’గా ఆరాధిస్తారు. ‘బటరగురు’ అంటే ఆదిగురువు అని అర్థం. ‘బటరగురు’ శిల్పరూపం, ఆరాధన పద్ధతులు దాదాపు మన దేశంలోని దక్షిణామూర్తిని పోలి ఉంటాయి. ఇండోనేసియాలోని లువులో పురాతనమైన ‘బటరగురు’ ఆలయం ఉంది. ఈ ఆలయం క్రీస్తుశకం ఎనిమిదో శతాబ్ది నాటిది. ఆగ్నేయాసియాలో బౌద్ధ ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కాలంలో సైతం జావా దీవుల్లో శివారాధన కొనసాగేది. అక్కడి ప్రజలు శివుడిని బుద్ధుడు, జనార్దనుడు (విష్ణువు)తో సమానంగా ఆరాధించేవారు. అక్కడి ప్రజలు బుద్ధుడిని శివుని తమ్ముడిగా భావిస్తారు. కుషానుల కాలంలో మధ్య ఆసియా ప్రాంతంలోనూ శైవమత ప్రాబల్యం ఉండేది. ప్రస్తుతం ఇరాన్లో ఉన్న సోగ్డియా, యుతియాన్ రాజ్యాలలో శివారాధన జరిగేది. జపానీయులు పూజించే ఏడుగురు అదృష్టదేవతలకు శివతత్వమే మూలమని చరిత్రకారులు భావిస్తారు. తాంత్రిక ఆచారాలు పాటించే వజ్రయాన, మహాయాన బౌద్ధులు శివుడిని కూడా పూజిస్తారు. పరమశివునికి పదివేల పేర్లు ప్రసిద్ధ దేవతలను సహస్రనామ స్తోత్రాలతో అర్చించడం పరిపాటి. అదే కోవలో శివ సహస్రనామ స్తోత్రం కూడా వాడుకలో ఉంది. అంతేకాదు, మహన్యాసంలో శివునికి దశసహస్రనామాలు ఉన్నాయి. అందులోని పదివేల పేర్లూ పరమశివుని గుణ విశేషాలను స్తుతించేవే! మహాదేవుడిగా, మహేశ్వరుడిగా, త్రినేత్రుడిగా, రుద్రుడిగా, హరుడిగా, శంభునిగా, శంకరునిగా భక్తులు శివుడిని ఆరాధిస్తారు. యోగముద్రలో ఉన్న శివుడిని దక్షిణామూర్తిగా, తాండవ భంగిమలోని శివుడిని నటరాజుగా కూడా పూజిస్తారు. శివరాత్రి ప్రశస్తి మహాశివరాత్రి నేపథ్యానికి సంబంధించి క్షీరసాగరమథన ఘట్టం అందరికీ తెలిసినదే. అయితే, ఇదేరోజు ఆదియోగి అయిన శివుడు ఆత్మసాక్షాత్కారాన్ని పొందాడని యోగ, తంత్ర గ్రంథాలు చెబుతున్నాయి. శివరాత్రి రోజున జాగరం ఉంటూ యోగసాధన చేయడం ద్వారా కుండలినీ శక్తి జాగృతమవుతుందని కొందరు నమ్ముతారు. శివరాత్రి రోజున యోగసాధనలో గడిపేవారు తక్కువే గాని, ప్రసిద్ధ శైవ క్షేత్రాలు మొదలుకొని గ్రామ గ్రామాల్లో ఉండే శివాలయాలకు పెద్దసంఖ్యలో భక్తులు చేరుకుని పూజలు, భజనల్లో పాల్గొంటారు. ఆలయ ప్రాంగణాలలో రాత్రంతా జాగరం ఉండేలా నృత్యగాన కార్యక్రమాలతో సందడిగా గడుపుతారు. మన దేశంలోని వివిధ ఆలయాలతో పాటు నేపాల్‌లోని పశుపతినాథ ఆలయంలోను, పాకిస్తాన్‌లోని ఉమర్‌కోట్‌లో ఉన్న శివాలయంలోను శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. మారిషస్‌లో శివరాత్రి రోజున భక్తులు ‘గంగాతలావొ’ సరస్సులో పవిత్రస్నానాలను ఆచరిస్తారు. -
ఆ విషయంలో మనవారే ఎక్కువ..!
మనుషులకు వలసలు కొత్త కాదు. వానరాల నుంచి పరిణామం చెంది నిటారుగా నిలబడటం, రెండు కాళ్లపై నడవడం ప్రారంభించినప్పటి నుంచి ఆదిమానవులు మనుగడ కోసం వలసబాట పట్టారు. మానవజాతి వలసలకు దాదాపు 17.5 లక్షల ఏళ్ల చరిత్ర ఉంది. ఆదిమానవులు తొలుత ఆఫ్రికా నుంచి యూరేసియా వైపు వలసలు సాగించారు. క్రీస్తుపూర్వం 40 వేల ఏళ్ల నాటికి ఈ ఆదిమానవులు ఆసియా, యూరోప్, ఆస్ట్రేలియా ఖండాలకు విస్తరించారు. కాస్త ఆలస్యంగా– అంటే, క్రీస్తుపూర్వం 20 వేల ఏళ్ల నాటికి రెండు అమెరికా ఖండాలకూ వ్యాపించారు. సానుకూల వాతావరణ పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లో మానవులు స్థిర నివాసాలు ఏర్పరచుకోవడంతో నాగరికతలు ఏర్పడ్డాయి. రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి ఏర్పడిన తర్వాత కూడా ఆధిపత్యం కోసం ఒక ప్రాంతంలోని వారు మరో ప్రాంతం మీదకు దండయాత్రలు సాగించడం, దండయాత్రల్లో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలకు కొందరు వలస వెళ్లడం వంటివి కొనసాగాయి. ఆధునిక యుగంలో మనుషుల అవసరాలు, ఆశయాలలో మార్పులు వచ్చినా, వలసలు మాత్రం ఆగలేదు. మెరుగైన ఉపాధి కోసం, జీవన భద్రత కోసం, పురోగతం కోసం ఒక దేశాన్ని వదిలి మరో దేశానికి వలసలు పోతూనే ఉన్నారు. ఆధునిక కాలంలో ఇతర దేశాలకు వలసపోతున్న వారిలో భారతీయులే ఎక్కువగా ఉంటున్నారు. ఆధునిక కాలంలో మెరుగైన ఉపాధి కోసం, ఉన్నత విద్య కోసం, సౌకర్యవంతమైన అధునాతన జీవితం కోసం, స్వదేశంలో ఉంటున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడం కోసం, జీవితంలో మరింతగా అభివృద్ధి సాధించడం కోసం వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి చాలామంది అభివృద్ధి చెందిన సంపన్న దేశాలకు వలస వెళుతున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశమైన మన భారత్ నుంచి కూడా చాలామంది దాదాపు ఇవే కారణాలతో వలసబాట పడుతున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం స్వదేశాలను విడిచి ఇతర దేశాలలో నివసిస్తున్న వలసదారుల సంఖ్య 27.2 కోట్లకు పైగా ఉంటే, అంతర్జాతీయ వలసలలో మన భారతీయులే అగ్రస్థానంలో నిలుస్తున్నారు. భారత్ నుంచి వివిధ కారణాలతో ఇతర దేశాలకు వలస వెళ్లి, అక్కడ నివసిస్తున్న వారి సంఖ్య 1.75 కోట్లకు పైమాటే. ఇదిలా ఉంటే, ఇతర దేశాల నుంచి భారత్‌కు వలస వచ్చి ఉంటున్న వారి సంఖ్య ప్రస్తుతం 51 లక్షలుగా ఉంది. నాలుగేళ్ల కిందటి లెక్కలతో పోల్చుకుంటే భారత్‌కు వలస వచ్చే విదేశీయుల సంఖ్య కాస్త తగ్గింది. 2015 నాటికి భారత్‌కు వలస వచ్చిన వారి సంఖ్య 52 లక్షలు. గడచిన దశాబ్దం లెక్కలను చూసుకుంటే– 2010–19 మధ్య కాలంలో భారత్‌లో ఉంటున్న విదేశీయుల సంఖ్య మొత్తం దేశ జనాభాలో దాదాపు 0.4 శాతం వరకు ఉంటున్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. విద్య, ఉపాధి తదితర కారణాలతో వలస వచ్చిన వారే కాకుండా, వీరిలో భారత్‌లో తలదాచుకుంటున్న కాందిశీకులు సుమారు 2.07 లక్షల మంది వరకు ఉంటున్నారు. భారత్‌కు వలస వస్తున్న విదేశీయుల్లో ఎక్కువగా పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్ దేశాలకు చెందిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. ఆశ్రయమిస్తున్న దేశాల్లో అగ్రగామి అమెరికా విదేశీ వలసదారులకు పెద్దసంఖ్యలో ఆశ్రయమిస్తున్న దేశాల్లో అమెరికా అగ్రగామిగా నిలుస్తోంది. వివిధ దేశాల నుంచి వలస వచ్చి ఉంటున్న వారి సంఖ్య అమెరికాలో దాదాపు 5.1 కోట్లు. జర్మనీ, సౌదీ అరేబియా దేశాలు దాదాపు 1.3 కోట్ల చొప్పున విదేశీ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. రష్యా 1.2 కోట్ల మందికి, యునైటెడ్ కింగ్డమ్ 1 కోటి మందికి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ 90 లక్షల మందికి, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు దాదాపు 80 లక్షల చొప్పున, ఇటలీ సుమారు 60 లక్షల మంది విదేశీ వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. వివిధ భౌగోళిక ప్రాంతాల్లోని జనాభా నిష్పత్తి ప్రకారం చూసుకుంటే, సహారా ఎడారి పరిసరాల్లోని ఆఫ్రికా దేశాల నుంచి అత్యధికంగా 89 శాతం ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. తూర్పు ఆసియా– ఆగ్నేయాసియా దేశాల నుంచి 83 శాతం, లాటిన్ అమెరికన్ దేశాలు– కరీబియన్ దేశాల నుంచి 73 శాతం, మధ్య ఆసియా– దక్షిణాసియా దేశాల నుంచి 63 శాతం ప్రజలు ఇతర దేశాలకు వలస వెళుతున్నారు. విదేశీ వలస దారుల్లో అత్యధికంగా 98 శాతం ఉత్తర అమెరికా దేశాల్లోను, ఉత్తరాఫ్రికా–పశ్చిమాసియా దేశాల్లో 59 శాతం నివాసం ఉంటున్నారు. ఉపాధి, విద్య, ఉన్నతమైన జీవితం వంటి అవసరాల కోసం వివిధ దేశాలకు వలస వెళుతున్న వారి సంగతి ఒక ఎత్తయితే, కొన్ని దేశాల్లో యుద్ధ వాతావరణం కారణంగా అనివార్య పరిస్థితుల్లో బలవంతంగా స్వదేశాల సరిహద్దులు దాటి ఇతర దేశాలకు చేరుకుంటున్న వారి సంఖ్య కూడా ఏటేటా పెరుగుతూ వస్తోంది. ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల విభాగం వెల్లడించిన లెక్కల ప్రకారం 2010–17 మధ్య కాలంలో ఇలా అనివార్యంగా స్వదేశాలను విడిచిపెట్టిన వారి సంఖ్య 1.3 కోట్లకు పైగానే ఉంది. బతికి ఉంటే బలుసాకు తినొచ్చనే రీతిలో ఇలా బలవంతంగా స్వదేశాలను విడిచిపెడుతున్న వారి సంఖ్య అత్య«ధికంగా ఉత్తరాఫ్రికా–పశ్చిమాసియా దేశాల్లోనే ఉంది. ఈ దేశాల నుంచి 46 శాతం మంది వివిధ దేశాల్లో కాందిశీకులుగా తలదాచుకుంటున్నారు. అలాగే, సహారా పరిసర ఆఫ్రికా దేశాల నుంచి 21 శాతం మంది ఇతర దేశాల్లో కాందిశీకులుగా ఉంటున్నారు. అభివృద్ధికి ఆలంబన వివిధ దేశాల అభివృద్ధికి వలసలే ఆలంబనగా నిలుస్తున్నాయి. సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల సాధనలో వలసలు కీలక పాత్ర పోషిస్తాయని, ప్రపంచ దేశాలన్నీ సురక్షితమైన, క్రమబద్ధమైన, బాధ్యతాయుతమైన వలసలకు వెసులుబాటు కల్పించడం ద్వారా సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి వీలవుతుందని ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక వ్యవహారాల అండర్ సెక్రటరీ లియు ఝెన్మిన్ చెబుతున్నారు. వలసల వల్ల కలిగే సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను భారతీయ సామాజికవేత్త రాధాకమల్ ముఖర్జీ 1936లోనే తాను రాసిన ‘మైగ్రంట్ ఆసియా’ పుస్తకం ద్వారా వెల్లడించారు. ఆసియా దేశాల్లో, ముఖ్యంగా భారత్‌లో మిగులు కార్మిక శక్తి అత్యధికంగా ఉందని, ఈ మిగులు కార్మిక శక్తి కార్మికుల అవసరం ఎక్కువగా ఉన్న ఇతర దేశాలకు వలస వెళితే ఉభయ దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వివిధ దేశాల్లో బ్రిటిష్ వలస పాలన కొనసాగుతున్న కాలంలో– 1870–1914 సంవత్సరాల మధ్య కాలంలో భారత్ నుంచి దాదాపు 4 కోట్ల మంది బ్రిటిష్ పాలనలో ఉన్న ఇతర దేశాలకు వలస వెళ్లారు. వీరిలో అత్యధికులు మారిషస్ వెళ్లారు. మారిషస్ ప్రస్తుత జనాభాలో దాదాపు 70 శాతం మంది భారత సంతతికి చెందిన వారే కావడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడిన 1930 దశకంలో భారత్ నుంచి ఇతర దేశాలకు వలసలు గణనీయంగా తగ్గాయి. అప్పటి వరకు భారతీయులు ఎక్కువగా వలస వెళ్లే శ్రీలంక, మయన్మార్, మలేసియాలకు కూడా వలసల సంఖ్య పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చి, కొంత నిలదొక్కుకున్న తర్వాత 1970 దశకం నుంచి భారత్ నుంచి మళ్లీ ఇతర దేశాలకు వలసలు ఊపందుకున్నాయి. స్వాతంత్య్రానికి ముందు భారతీయులు ఎక్కువగా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాలకు వలస వెళ్లేవారు. స్వాతంత్య్రం వచ్చాక ఈ వలసలు పశ్చిమాసియా, అమెరికా, యూరోప్‌ల వైపు మళ్లాయి. పశ్చిమాసియా దేశాలు మినహా మిగిలిన దేశాలు తమ దేశాల్లో చిరకాలంగా నివాసం ఉంటున్న విదేశీయులకు పౌరసత్వ అవకాశాలు కూడా కల్పిస్తుండటంతో పలువురు భారతీయులు అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, దక్షిణాఫ్రికా, మారిషస్, మలేసియా వంటి దేశాల్లో పౌరసత్వం పొంది అక్కడే స్థిరపడి ఉంటున్నారు. వీరంతా భారత్‌లో ఉంటున్న తమ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటున్నారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు కూడా పెడుతున్నారు. స్వదేశాలను విడిచి ఇతర దేశాలకు చేరుకుంటున్న వలసదారులు తాము గమ్యంగా ఎంపిక చేసుకున్న దేశం అభివృద్ధిలో పాలు పంచుకోవడంతో పాటు తమ తమ స్వదేశాల ఆర్థిక పరిపుష్టికి కూడా ఇతోధికంగా దోహదపడుతున్నారు. ఇతర దేశాల్లో ఉంటున్న భారతీయులు కూడా మన దేశ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. ప్రవాస భారతీయులు, ఇతర దేశాల్లో స్థిరపడిన భారత సంతతి ప్రజల ద్వారా గడచిన ఆర్థిక సంవత్సరంలో 8000 కోట్ల డాలర్లు (రూ.5.70 లక్షల కోట్లు) మన దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చి చేరాయి. గడచిన దశాబ్ద కాలంలో వలస వెళ్లిన భారతీయుల ద్వారా ఏటా మన ఆర్థిక వ్యవస్థకు చేరే నిధుల మొత్తం రెట్టింపు కంటే పెరిగింది. భారత సంతతి ప్రజల జనాభా లక్షకు పైగానే ఉన్న దేశాలు 32 వరకు ఉన్నాయి. వీటిలో అత్యధిక సంఖ్యలో భారతీయులు అమెరికాలోనే ఉంటున్నారు. ఈ పది దేశాలతో పాటు కువైట్, మారిషస్, ఖతార్, ఓమన్, సింగపూర్, నేపాల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, ఫిజి, గుయానా, నెదర్లాండ్స్, న్యూజిలాండ్, ఇటలీ, థాయ్‌లాండ్, సురినేమ్, జర్మనీ, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, ఇండోనేసియా వంటి దేశాల్లోనూ భారతీయులు గణనీయమైన సంఖ్యలో ఉంటున్నారు. విదేశాలలో స్థిరపడ్డ భారతీయులలో తెలుగు వారి సంఖ్య కూడా గణనీయంగా ఉంటోంది. పై ఐదు దేశాల్లో తెలుగు వారి సంఖ్య లక్షకు పైగానే ఉంది. పలు దేశాల్లో తెలుగు సంస్థలు కూడా క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. – పన్యాల జగన్నాథదాసు విదేశాల్లో మనవాళ్ల ఘనత విదేశాల్లో స్థిరపడిన భారతీయులు వివిధ రంగాల్లో ఘన విజయాలు సాధిస్తూ స్వదేశానికి గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన హైటెక్ కంపెనీల వ్యవస్థాపకుల్లో 8 శాతం మంది భారత సంతతికి చెందిన వారేనని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వెల్లడించింది. వీరిలో గూగుల్ అధినేత సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల వంటి వారు సాంకేతిక రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపగలుగుతున్నారు. భారత సంతతికి చెందిన వారిలో పలువురు వివిధ దేశాల్లోని చట్టసభల్లోనూ కీలక పదవుల్లో రాణిస్తున్నారు. అమెరికా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, మారిషస్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, దక్షిణాఫ్రికా, టాంజానియా, సురినేమ్, సింగపూర్, న్యూజిలాండ్, మలేసియా వంటి దేశాల చట్టసభల్లో భారత సంతతికి చెందినవారు గణనీయమైన సంఖ్యలో సభ్యులుగా ఉంటున్నారు. -
అంతరిక్షంలో అడ్డాలు
భూమ్మీద జనాభా పెరుగుతోంది. చోటు చాలక జనాలకు ఇరుకిరుకుగా మారుతోంది. జనాభాతో పాటు కాలుష్యమూ పెరుగుతోంది. ఊపిరి తీసుకోనివ్వక ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇదే పరిస్థితులు కొనసాగితే భూమ్మీద మానవాళి అంతరించక తప్పదనే శాస్త్రవేత్తలు హెచ్చరికలు గుబులు రేపుతున్నాయి. అంత విపత్తు ముంచుకు రాకముందే భూమిని విడిచి వేరే చోటు చూసుకోవడమే మేలని కొందరు మేధావులు ఆలోచనలు చేస్తున్నారు. అంతరిక్షంలో అడ్డాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నాలూ సాగిస్తున్నారు. భూమికి దగ్గర్లోనే ఉన్న అంగారక గ్రహాన్ని రేపటి ఆవాసంగా మార్చుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా అనే పెదవి విరుపులు అక్కడక్కడా వినిపిస్తున్నా, అంగారకుడిని ఆవాసంగా చేసుకోవడానికి సాగుతున్న సన్నాహాలు మాత్రం ఆగడం లేదు. సమీప భవిష్యత్తులోనే అంగారకుడిపై జెండా ఎగరేయడానికి మరింత ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేకాదు, ఇదివరకు ఎన్నడూ జరగనంత శరవేగంగా ప్రస్తుత శతాబ్దిలో అంతరిక్ష ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని వినూత్న లక్ష్యాలతో కొనసాగుతున్నాయి. వాటిపై కొంచెం దృష్టి సారిద్దాం... అంగారకుని ఉపరితలంపై ఏమున్నదో, జీవజాలం మనుగడకు అక్కడ ఏమాత్రమైనా ఆస్కారమేమైనా ఉంటుందో లేదో ఇప్పటి వరకు ఇదమిత్థంగా తేలలేదు. మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ప్రయోగించిన ‘మంగల్యాన్’ 2014 సెప్టెంబరు 24న అంగారకుని కక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. ‘మంగల్యాన్’గా మన శాస్త్రవేత్తలు నామకరణం చేసిన ‘మార్స్ ఆర్బిటర్ మిషన్’ వ్యోమనౌకలోని ‘మార్స్ కలర్ కెమెరా’ (ఎంసీసీ) తొలిసారిగా అంగారకుని పూర్తి గోళాకార ఫొటోలను తీసి భూమి మీదకు పంపింది. ఈ ఫొటోలను 2014 సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా పత్రికలన్నీ ప్రముఖంగా ప్రచురించాయి. ఎంసీసీ పంపిన ఫొటోల ఆధారంగానే ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2015 సెప్టెంబరు 24న సమగ్రంగా 120 పేజీలతో రూపొందించిన ‘మార్స్ అట్లాస్’ను విడుదల చేశారు. ‘మంగల్యాన్’ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతూనే ఉంది. ఈ సమాచారం ప్రకారం అంగారకుని ఉపరితలం మానవులకు ఆవాసంగా పనికొస్తుందనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు. అయితే, అమెరికాకు చెందిన ‘స్పేస్ఎక్స్’ సంస్థ సమీప భవిష్యత్తులోనే మనుషులను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. అంతేకాదు, అంగారకునిపై శాశ్వత నివాసయోగ్యమైన సుస్థిర నగరాన్ని నిర్మించాలనేదే తన లక్ష్యంగా ప్రకటించుకుంది. అంగారకునిపైకి 2022 నాటికి ఒక సన్నాహక వ్యోమనౌకను పంపనున్నామని, 2024 నాటికి అక్కడికి మనుషులను పంపనున్నామని ‘స్పేస్ఎక్స్’ సీఈవో ఎలాన్ మస్క్ ప్రకటించడం విశేషం. శత కోటీశ్వరుడైన ఎలాన్ మస్క్ ఇటీవలి కొంతకాలంగా తన సంస్థ లక్ష్యాలను ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ వస్తున్నారు. తన సంస్థలోని శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న రాకెట్ నమూనాలను బయటి ప్రపంచానికి వెల్లడిస్తూ వస్తున్నారు. ఎలాన్ మస్క్ లక్ష్యాలు, ఆయన చేస్తున్న ప్రకటనలపై ప్రపంచవ్యాప్తంగా పత్రికలు, ప్రసార సాధనాల్లో విస్తృతంగా కథనాలు వెలువడుతున్నాయి. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ‘స్పేస్ఎక్స్’ ప్రయోగాల్లోని సాధ్యాసాధ్యాల సంగతి ఎలా ఉన్నా, అక్కడక్కడా కొందరు శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలను కొట్టి పారేస్తూ ప్రకటనలు చేస్తున్నా, ఇవి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నాయి. మానవాళి భవితవ్యంపై కొత్త కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. అంగారకునిపై శాశ్వత నగరం...ఇరవై ఏళ్లలోనే! అంగారకునిపై శాశ్వత నగర నిర్మాణం మరో ఇరవై ఏళ్లలోనే సాధ్యమవుతుందని ‘స్పేస్ఎక్స్’ సీఈవో ఎలాన్ మస్క్ చెబుతున్నారు. ప్రస్తుతం ‘స్పేస్ఎక్స్’ రూపొందించిన ‘స్టార్‌షిప్’ విమానాలకు వంద టన్నుల బరువును అంతరిక్షంలోకి తీసుకుపోయే సామర్థ్యం ఉంది. ఫాల్కన్ రాకెట్ల ద్వారా ఇవి అంతరిక్షానికి చేరుకుంటాయి. అంగారకునిపై నగరాన్ని నిర్మించాలంటే, అందుకు అవసరమైన సామగ్రిని, సిబ్బందిని తీసుకుపోవడానికి వెయ్యి ‘స్టార్‌షిప్’ విమానాలు అవసరం అవుతాయని, ఒక్కో స్టార్‌షిప్ తయారీకి 20 లక్షల డాలర్లు (రూ.14.40 కోట్లు) అవసరమవుతాయని ఎలాన్ మస్క్ చెబుతున్నారు. రోజుకు మూడు చొప్పున ఏడాదికి దాదాపు వెయ్యి ‘స్టార్‌షిప్స్’ను అంగారకునిపైకి పంపగలిగితే, రానున్న ఇరవయ్యేళ్లలోనే అంగారకునిపై శాశ్వత సుస్థిర నగరాన్ని సిద్ధం చేయగలమని చెబుతున్నారు. ఇప్పటికే ‘స్పేక్స్ఎక్స్’ సంస్థ వంద ‘స్టార్‌షిప్స్’ను సిద్ధం చేసింది. ఒకవైపు ‘స్పేస్ఎక్స్’ అంగారకునిపైకి మనుషులను పంపేందుకు సిద్ధపడుతుంటే, మరోవైపు అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ 2024 నాటికి మరోసారి చంద్రునిపైకి వ్యోమగాములను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ‘నాసా’, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ), రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (రాస్‌కాస్మోస్), ‘ఇస్రో’ వంటి సంస్థలు చంద్రుడు, అంగారకుడు సహా వివిధ అంతరిక్ష గోళాల్లో ఏముందో, అక్కడి వాతావరణం ఎలా ఉందో తెలుసుకునే దిశగా ప్రయోగాలు సాగిస్తుంటే, ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ‘స్పేస్ఎక్స్’ సంస్థ ఏకంగా గ్రహాంతర ఆవాసాల ఏర్పాటే లక్ష్యంగా ప్రయోగాలను సాగిస్తోంది. తన లక్ష్యాలను నెరవేర్చుకోవడం కోసం లెక్కకు మిక్కిలిగా వ్యోమనౌకలను, రాకెట్లను సిద్ధం చేసుకుంటోంది. అంగారకునిపై జీవం కోసం వెదుకులాట! అంగారకునిపై జీవం కోసం వెదుకులాటకు పలు దేశాల అంతరిక్ష పరిశోధన కేంద్రాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అమెరికన్ జాతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అంగారకునిపై జీవాన్వేషణ కోసం వచ్చే ఏడాది ఒక రోవర్‌ను అంగారక ఉపరితలంపై ఉన్న ‘జెజెరో’ బిలం వద్దకు పంపడానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ ప్రాంతంలో జీవానికి కీలకమైన కార్బొనేట్స్, నీటితడి గల సిలికా వంటి పదార్థాల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. అంగారకునిపై ‘జెజెరో’ బిలం దాదాపు 350 కోట్ల కిందట ఒక సరస్సుగా ఉండేదని వారు భావిస్తున్నారు. దీనిపై మరింత క్షుణ్ణంగా పరిశోధనలు సాగించే లక్ష్యంతోనే ‘నాసా’ వచ్చే ఏడాది అంగారకునిపైకి రోవర్‌ను పంపడానికి సమాయత్తమవుతోంది. అంగారకునిపై ఒకప్పుడు ద్రవరూపంలో నీరు ఉన్న పరిస్థితి నుంచి ఉపరితలంపై అంతా గడ్డకట్టుకుపోయిన ఎడారి వాతావరణం ఎలా ఏర్పడిందనే దానిపై ‘నాసా’ రోవర్ సమాచారం సేకరిస్తుంది. రోవర్‌తో పాటు ‘నాసా’ పంపే ఆర్బిటర్ అంగారకుని చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తూ, అత్యంత స్పష్టమైన అంగారకుని ఉపరితలం ఫొటోలను పంపుతుంది.‘నాసా’ 2020 జూలైలో ‘మార్స్ మిషన్’ను ప్రయోగించ నుంది. ఇందులోని రోవర్ అంగారకుని ఉపరితలంపైకి 2021 ఫిబ్రవరిలో చేరుకోనుంది. ఒకవైపు ‘నాసా’ ప్రయత్నాలు ఈ దశలో ఉంటే, ‘స్పేస్ఎక్స్’ ఏకంగా అంగారకునిపై నగర నిర్మాణానికి పథక రచన సాగిస్తుండటం విశేషం. అంతరిక్ష విహారయాత్రలకు సన్నాహాలు శాస్త్ర పరిశోధనల కోసం వ్యోమగాములు అంతరిక్ష యాత్రలు చేయడం సరే, వినోదం కోసం, విలాసం కోసం అంతరిక్షంలో విహారయాత్రలు చేయాలనే ఉబలాటం చాలామందికే ఉంటుంది. అలాంటి వారి కోరిక తీర్చడానికి పలు సంస్థలు అంతరిక్ష విహారయాత్రలు చేపట్టడానికి సన్నాహాలు సాగిస్తున్నాయి. ప్రస్తుత శతాబ్ది తొలి దినాల్లోనే రష్యన్ అంతరిక్ష పరిశోధక సంస్థ పర్యాటకుల కోసం అంతరిక్ష విహారయాత్రలు నిర్వహించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రష్యన్ సోయుజ్ వ్యోమనౌకల్లో 2001–2009 మధ్య కాలంలో ఏడుగురు పర్యాటకులు అంతరిక్ష విహారయాత్రలకు వెళ్లి వచ్చారు. అయితే, రష్యన్ అంతరిక్ష పరిశోధక సంస్థ 2010 నుంచి పర్యాటకుల కోసం అంతరిక్ష విహార యాత్రలను నిలిపివేసింది. తొలిసారిగా డెన్నిస్ టిటో అనే ఔత్సాహికుడు 2001లో రష్యన్ వ్యోమగాములతో కలసి అంతరిక్ష విహారయాత్రకు వెళ్లి పది రోజుల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) గడిపి వచ్చాడు. ఇటీవలి కాలంలో కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా ఔత్సాహిక పర్యాటకుల కోసం అంతరిక్ష విహారయాత్రలు నిర్వహించడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాల్లో అమెరికన్ సంస్థ ‘స్కేల్డ్ కాంపోజిట్స్’ 2004లో ప్రయోగించిన ‘స్పేస్‌షిప్ వన్’ భూ ఉపరితలానికి 100 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుకుని విజయవంతంగా తిరిగి వచ్చింది. ఇలా రెండువారాల వ్యవధిలో రెండుసార్లు తన ప్రయోగంలో విజయవంతం కావడంతో కోటి డాలర్ల (రూ.71 లక్షలు) బహుమతి కూడా గెలుచుకుంది. అమెరికన్ నేవీ మాజీ అధికారి అయిన బ్రియాన్ బిన్నీ ‘స్పేస్‌షిప్ వన్’ను భూ ఉపరితలానికి 112 కిలోమీటర్ల ఎత్తు వరకు విజయవంతంగా నడిపి రికార్డు సృష్టించాడు. విమానయాన సంస్థ ‘వర్జిన్ గ్రూప్’ అనుబంధ సంస్థ అయిన ‘వర్జిన్ గాలక్టిక్’ కూడా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి సారించింది. ఈ సంస్థకు చెందిన ‘వీఎస్ఎస్ యూనిటీ’ గత ఏడాది డిసెంబరులో విజయవంతంగా అంతరిక్షానికి చేరుకుని విజయవంతంగా తిరిగి వచ్చింది. అంతకు ముందు 2014లో ఈ సంస్థ అంతరిక్షానికి చేరుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. ‘వర్జిన్ గాలక్టిక్’ అంతరిక్ష విహారయాత్ర కోసం పర్యాటకుల నమోదు కూడా ప్రారంభించింది. అంతరిక్ష విహారయాత్రకు వెళ్లదలచుకున్న పర్యాటకులు ఈ సంస్థకు 2 లక్షల పౌండ్లు (రూ.1.84 కోట్లు) ముందస్తు డిపాజిట్ మొత్తంగా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే అరవై దేశాల నుంచి దాదాపు ఆరువందల మంది ‘వర్జిన్ గాలక్టిక్’ నిర్వహించబోయే అంతరిక్ష యాత్రలో పాల్గొనేందుకు ముందస్తు డిపాజిట్లు చెల్లించారు. ‘వైట్‌నైట్‌టూ’, ‘స్పేస్‌షిప్‌టూ’ వ్యోమనౌకల ద్వారా ఈ అంతరిక్ష విహార యాత్రలను నిర్వహించనున్నట్లు ‘వర్జిన్ గాలక్టిక్’ చెబుతోంది. ఇదిలా ఉంటే, ‘వర్జిన్’కు పోటీ సంస్థలైన ‘బ్లూ ఆరిజిన్’, ‘బోయింగ్’ వంటి సంస్థలు కూడా పర్యాటకులతో అంతరిక్ష యాత్రలు నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. అంతరిక్ష కక్ష్యలో హోటల్ వ్యోమనౌకలో పర్యాటకులను అంతరిక్షానికి తీసుకుపోయి, అక్కడి నుంచి నేల మీదకు తిరిగి తీసుకొస్తే పెద్ద థ్రిల్లేముంటుంది? అంతరిక్ష కక్ష్యలోనే కొన్నాళ్లు విలాసాలను అనుభవించి తిరిగి వస్తే కదా అసలు థ్రిల్లు అనే ఆలోచనతో ‘ఆరియన్ స్పాన్’ అనే అమెరికన్ సంస్థ అంతరిక్ష కక్ష్యలో ఏకంగా ఒక హోటల్‌నే నడిపించడానికి ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తోంది. అంతరిక్షానికి చేరుకున్నాక అక్కడ గురుత్వాకర్షణ ఉండదనే సంగతి తెలిసినదే. అయితే, ‘ఆరియన్ స్పాన్’ తమ హోటల్ గదుల్లోను, కారిడార్లోను కృత్రిమ గురుత్వాకర్షణను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పుకుంటోంది. కృత్రిమ గురుత్వాకర్షణ ఫలితంగా పర్యాటకులు భూమ్మీద హోటళ్లలో గడిపినట్లే, అంతరిక్షంలో ఏర్పాటు చేయనున్న తమ హోటల్లోనూ మామూలుగా నడవడానికి వీలవుతుందని చెబుతోంది. ఈ హోటల్లో బార్, రెస్టారెంట్, స్విమ్మింగ్‌పూల్ వంటి సమస్త విలాసాలను, అధునాతనమైన గదులను ఏర్పాటు చేయనున్నట్లు చెబుతోంది. ఈ హోటల్ గదులకు ఏర్పాటు చేసిన కిటికీల గుండా సూర్యచంద్రులతో పాటు భూమిని కూడా తిలకించడానికి వీలవుతుందని చెబుతోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) అంతరిక్ష కక్ష్యలో చిరకాలంగా ఉన్నట్లే, ‘ఆరియన్ స్పాన్’ ఏర్పాటు చేయనున్న ‘అరోరా స్పేస్ స్టేషన్’ హోటల్ కూడా అంతరిక్ష కక్ష్యలో చిరకాలంగా ఉంటుంది. ఇందులో బస చేయదలచుకున్న పర్యాటకుల కోసం ‘ఆరియన్ స్పాన్’ ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభించింది. అంతరిక్ష హోటల్లో గడపదలచుకున్న పర్యాటకులు ఒక్కొక్కరు 70 లక్షల పౌండ్లు (రూ.64.64 కోట్లు) చెల్లించాల్సి ఉంటుంది. తొలి విడత అతిథులకు 2022 నాటికి ఈ హోటల్లో ఆతిథ్యం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ‘ఆరియన్ స్పాన్’ చెబుతోంది. అంతరిక్ష హోటల్లో బస చేసేందుకు దేశ దేశాల నుంచి సంపన్నులు బారులు తీరుతున్నారు. ఇందులో ఇప్పటికే కొన్ని నెలలకు సరిపడా బుకింగ్‌లు పూర్తయ్యాయంటే, జనాల్లో దీనిపై ఎలాంటి క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మనవాళ్లు ఇంకా దృష్టి పెట్డడం లేదు అంతరిక్ష పర్యాటకంపై మనవాళ్లు ఇంకా దృష్టి పెట్టడం లేదు. అయితే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) తరహాలో ఒక సొంత పరిశోధక కేంద్రాన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసేందుకు ‘ఇస్రో’ సన్నాహాలు చేస్తోంది. ఐఎస్ఎస్లో చేరదలచుకోలేదని, దాని బదులు మనదైన సొంత పరిశోధన కేంద్రాన్నే అంతరిక్షంలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నామని ‘ఇస్రో’ అధినేత శివన్ ప్రకటించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ఐఎస్ఎస్) అమెరికాకు చెందిన ‘నాసా’, యూరోప్‌కు చెందిన ‘ఈఎస్ఏ’, జపాన్‌కు చెందిన ‘జాక్సా’, రష్యాకు చెందిన ‘రాస్‌కాస్మోస్’, కెనడాకు చెందిన ‘సీఎస్ఏ’ భాగస్వాములుగా ఉన్నాయి. భారత్ ఇందులో భాగస్వామిగా చేరే బదులు సొంత పరిశోధక కేంద్రం ఏర్పాటు చేసుకోవడంపైనే మొగ్గు చూపుతోంది. ‘గగన్‌యాన్’ పేరిట ‘ఇస్రో’ తలపెట్టిన ఈ పరిశోధక కేంద్రాన్ని 2022లో అంతరిక్షంలోకి పంపేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపినట్లు శివన్ వెల్లడించారు. అయితే, అంతరిక్షంలో పర్యాటకుల కోసం విహారయాత్రలు చేపట్టే ఆలోచనేదీ తమకు లేదని శివన్ స్పష్టం చేశారు. అంతరిక్షంలోకి పరిశోధక కేంద్రాన్ని పంపేందుకు ముందు 2020లో సూర్యునిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య ఎల్1’ వ్యోమనౌకను సూర్యుని వద్దకు పంపనున్నట్లు తెలిపారు. – పన్యాల జగన్నాథదాసు చంద్రుని మీదకు విహారయాత్ర పర్యాటకులను చంద్రుని మీదకు విహారయాత్రకు తీసుకుపోయేందుకు అమెరికాకు చెందిన ‘బ్లూ ఆరిజిన్’ సన్నాహాలు చేసుకుంటోంది. ‘బ్లూ ఆరిజిన్’ సీఈవో జెఫ్ బెజోస్ ఇటీవల వాషింగ్టన్లో పరిమిత అతిథుల కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో తమ సంస్థ చంద్రుడి మీదకు పంపబోయే బ్లూమూన్ ల్యాండర్‌ను ప్రదర్శించారు. ఈ ల్యాండర్ ద్వారా 2024లో పర్యాటకులను చంద్రుని మీదకు పంపనున్నట్లు ఆయన వెల్లడించారు. తమ సంస్థకు చెందిన శాస్త్రవేత్తలు మూడేళ్లుగా శ్రమించి, మనుషులతో పంపడానికి వీలయ్యే ల్యాండర్‌కు రూపకల్పన చేశారని జెఫ్ బెజోస్ తెలిపారు. మనుషులను చంద్రుడి మీదకు పంపడానికి ముందుగా వచ్చే వేసవిలో దీనిని ప్రయోగాత్మకంగా చంద్రుడి మీదకు పంపనున్నట్లు వెల్లడించారు. చంద్రుడి మీదకు విహారయాత్ర కోసం ఇప్పటికే ఆరుగురు పర్యాటకులు తమ సంస్థ వద్ద పేర్లు నమోదు చేయించుకున్నారని తెలిపారు. -
గుండెల మీద చెయ్యి వేసుకోండి
ప్రకృతి చాలా గొప్పది. పరిణామక్రమంలో... వెన్నెముక ఉన్న జీవుల్లో చేపలు, ఉభయచర జాతులు, పాములు, పక్షులు, పాలిచ్చి పెంచే జంతువులు ఇలా క్రమంగా ఆవిర్భవిస్తూ పోయాయి. చేపలూ, ఉభయచరాల్లో పెద్దగా మాతృ ప్రేమను అనే భావనను ప్రకృతి కలిగించలేదు. కానీ పక్షుల దగ్గరికి వచ్చేసరికి ఆ సహజాతాన్ని సహజంగానే కలిగేలా చేసింది. తమ ప్రజాతి హాయిగా మనుగడ సాగించాలన్న తపన కలిగించడానికి సృష్టి భావనను పెంచింది. కానీ ప్రత్యేకంగా పిల్లలకే కావాల్సిన ఆహారాన్ని తామే తయారు చేసే వ్యవస్థను మాత్రం ప్రకృతి పరిణామం కలిగించలేదు. దాంతో పిట్టలు తమ పిల్లలకు ఎక్కడెక్కడి నుంచో కీటకాలూ, క్రిములూ, పురుగులను పట్టి తెచ్చేవి. మరి తాము పట్టి తెచ్చే లోపు పిల్లలకు ఏదైనా హాని జరిగితే...? బహుశా ఈ ప్రమాదాన్ని నివారించడానికేనేమో... పాలిచ్చి పెంచే జీవుల దగ్గరికి వచ్చే సరికి ఆ ఆహారం తమ ఎదలోనే ఊరే వ్యవస్థను రూపొందించింది. సహజమైన ఏ పరిణామమైనా తన సహజత్వాన్ని తప్పితే ఏదో ఓ సైడ్ఎఫెక్టో, రిస్కో ఉంటుంది. సహజమైన గుణానికి అనుగుణంగా ఉండకపోతే ఏదో ఓ అనర్థం చోటు చేసుకుంటుంది. అది ఆహారపరంగా కావచ్చు. బిడ్డలకు పాలివ్వని అలవాట్ల కారణంగా కావచ్చు. మరింకేదైనా కారణాల వల్లనో కావచ్చు. అలాంటి ఓ సైడ్ఎఫెక్టే... రొమ్ము క్యాన్సర్. దాని గురించి ఒకింత వివరంగా చెప్పుకుందాం. ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో అత్యధికంగా వచ్చేది రొమ్ముక్యాన్సరే. అంతగా అభివృద్ధి చెందని దేశాల్లో మొత్తం మరణాల్లో దాదాపు 1.6 శాతం రొమ్ముక్యాన్సర్ వల్లనే సంభవిస్తున్నాయి. మనదేశంలో ప్రతి 28 మంది మహిళల్లో ఒకరు రొమ్ముక్యాన్సర్ బారిన పడుతున్నారంటే దీని తీవ్రత ఎంతో తెలుసుకోవచ్చు. రొమ్ముక్యాన్సర్ రిస్క్ పల్లెల్లో కంటే నగరాల్లో ఎక్కువ. పల్లెల్లో ప్రతి 60 మందికి ఒకరు రొమ్ము క్యాన్సర్‌కు బారిన పడుతుండగా, నగరాల్లో మాత్రం ప్రతి 22 మందిలో ఒకరు దీనికి గురవుతున్నారు. పల్లె జీవితంలోని సహజత్వంతో పోలిస్తే అంటే నగర జీవితంలోని కృత్రిమత్వం రొమ్ముక్యాన్సర్‌ను పెంచుతోందన్నమాట. కారణాలు వయసు పెరిగే కొద్దీ రొమ్ము క్యాన్సర్ ముప్పూ పెరుగుతుంది. ఇది అందరిలోనూ ఉండే నివారించలేని రిస్క్ ఫ్యాక్టర్. ఆధునిక జీవశైలిలో వచ్చే మార్పులతో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. తల్లులు తమ బిడ్డలకు రొమ్ము పాలు పట్టకపోవడం. బిడ్డ పుట్టాక తల్లులు కనీసం ఆర్నెల్లు/ ఏడాది పాటైనా బిడ్డకు రొమ్ము పాలు పట్టించాలి. అది జరగకపోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ రావచ్చు. మహిళల్లో వచ్చే హార్మోన్ మార్పులు కూడా రొమ్ము క్యాన్సర్‌కు కారణం కావచ్చు. పాశ్చాత్య దేశ వాసులతో పోలిస్తే మన దేశంలో రొమ్ము క్యాన్సర్ త్వరగా గుర్తించినప్పుడు... మన దేశ మహిళల్లో ఉండే జన్యుపరమైన అంశాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. ఆలస్యంగా మొదటిబిడ్డ పుట్టడం... మరీ ముఖ్యంగా 30 ఏళ్ల తర్వాత ∙పిల్లలు లేని మహిళలు ∙కొంతవరకు జన్యుపరమైన అంశాలు. లక్షణాలు రొమ్ము క్యాన్సర్‌ను చాలా తేలిగ్గా గుర్తించవచ్చు. ఉదాహరణకు తమలో అంతకు ముందు కనిపించని గడ్డలు చేతికి, స్పర్శకు తెలుస్తున్నప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఒక్కోసారి అవి నొప్పిగా లేనప్పుడు మహిళలు వాటిని నిర్లక్ష్యం చేస్తుంటారు. అవి హానికరం కానివా, లేక హానికరమైనవా అని తెలుసుకున్న తర్వాతే వాటి గురించి నిశ్చింతగా ఉండాలి. రొమ్ములో ఒక గడ్డలా కదులుతూ రొమ్ముపైనున్న చర్మం నుంచి అది స్పర్శకు అందడం రొమ్ము ఆకృతిలో మార్పులు బాగా ముదిరిన దశలో రొమ్ము అల్సర్స్ రావడం. నిపుల్కు సంబంధించినవి : రొమ్ముపై దద్దుర్ల వంటివి లేదా వ్రణాలు రావడం ∙ రొమ్ము నిపుల్ లోపలికి ముడుచుకుపోయినట్లుగా ఉండటం. రక్తం వంటి స్రావాలు రావడం. చంకల్లో : చివరిదశలో గడ్డ బాగా పెరిగి చంకలోనూ దారి స్పర్శ తెలియడం. ∙భుజానికి సంబంధించి భుజం వాపు కనిపించడం. ∙రొమ్ములో సొట్టలు పడినట్లుగా ఉండటం ∙రొమ్ము పరిమాణంలో మార్పులు వచ్చినట్లుగా అనిపించడం. (నెలసరి సమయంలో రొమ్ములు గట్టిబడి... ఆ తర్వాత మళ్లీ నార్మల్ అవుతాయి. అందుకోసం ప్రతినెలా వచ్చే మార్పుల గురించి అంతగా ఆందోళన అవసరం లేదు. కానీ అలాగే గట్టిబడి ఉండటం కొనసాగితే మాత్రం కాస్త అప్రమత్తంగా ఉండాలి.) రొమ్ము క్యాన్సర్ లక్షణాలను గుర్తించాలంటే... రొమ్ములో కణితి చేతికి తగలడం. రొమ్ములో, చంకలో గడ్డ లేదా వాపు కనిపించడం. చనుమొన సైజులో మార్పు, అది లోపలికి తిరిగినట్లు ఉండటం. రొమ్ముపై చర్మం మందం కావడం, సొట్టపడటం ∙రొమ్ము సైజులో, షేపులో, రంగులో మార్పు కనిపించడం. రొమ్ము మీద ఎంతకూ నయంకాని పుండు. చనుమొన నుంచి రక్తస్రావం. పైన చెప్పిన ఈ లక్షణాలు కనిపించేసరికి రొమ్ము క్యాన్సర్ తొలిదశను దాటిపోయే ప్రమాదం ఉంటుంది. క్యాన్సర్ కణితి రకం, దశ (స్టేజ్), గ్రేడింగ్ వంటి విషయాల మీద ఆధారపడి సర్జరీ, దాంతో పాటు కీమో, రేడియేషన్, హార్మోన్ థెరపీలను నిర్ణయిస్తారు. రొమ్ములోని సన్నటి గొట్టాలు, లోబ్స్కు పరిమితమయ్యే క్యాన్సర్లు, ఇతర భాగాలకు త్వరగా వ్యాపించే క్యాన్సర్ల వంటి రకాలు ఉంటాయి. చికిత్స ఆలస్యం అయ్యేకొద్దీ ఈ క్యాన్సర్లు అదుపు తప్పుతాయి. వయసు పైబడ్డ మహిళల్లో కంటే చిన్న వయసులో వచ్చే రొమ్ము క్యాన్సర్లను అదుపు చేయడం కష్టమవుతుంది. చిన్న వయసులో వచ్చే రొమ్ము క్యాన్సర్ కణితులకు అధికంగా వ్యాపించే గుణం ఉంటుంది. ఈ రోజుల్లో రొమ్ముల్లో ఎలాంటి మార్పులూ బయటకు కనిపించకుండా నిర్వహించే రీ–కన్స్ట్రక్టివ్ ఆంకోప్లాస్టిక్ సర్జరీలూ సమర్థంగా నిర్వహించడం సాధ్యమవుతోంది. కాబట్టి మహిళలు తమ అందం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అవసరమైతే పెట్ సీటీ స్కాన్ ఫ్యామిలీ హిస్టరీలో రొమ్ము క్యాన్సర్ వచ్చినవారు ఎక్కువగా ఉన్నప్పుడు ముందుగానే దీన్ని పసిగట్టడానికి బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 అనే జెనెటిక్ పరీక్షలు చేయించుకోవాలి. ఈ జీన్ మ్యూటేషన్ పరీక్షలు పాజిటివ్ అని వస్తే... డాక్టర సలహా మేరకు మందుగానే రొమ్ములను తొలగించుకోవడంగానీ, లేదా ఎప్పటికప్పుడు పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్తగా ఉండల్సిగానీ ఉంటుంది. ఆ మహిళల వయసు, రిపోర్టుల మీద ఆధారపడి ఏవిధమైన నిర్ణయం తీసుకుంటే వారికి మంచిదనే విషయాన్ని వైద్యులు నిర్ణయించి, వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎవరిలో ఎక్కువ? దగ్గరి బంధువుల్లో (అమ్మ, అమ్మమ్మలు, అక్కచెల్లెళ్లు, మేనత్తల్లో) ఈ క్యాన్సర్ ఉన్నప్పుడు. వారు 40 ఏళ్ల కంటే చిన్నవయసులోనే ఈ క్యాన్సర్‌కు గురైనప్పుడు. రెండు రొమ్ములూ ఈ క్యాన్సర్‌కు గురైన కుటుంబాల్లో. ఆ కుటుంబానికి చెందిన పురుషుల్లో కూడా ఈ క్యాన్సర్ బయటపడ్డప్పుడు. ఆ కుటుంబ సభ్యులలో ఇతర క్యాన్సర్స్ ఎక్కువగా కనిపించడంగానీ లేదా అండాశయాలకు సంబంధించిన క్యాన్సర్స్ వచ్చినప్పుడు. జీన్ మ్యుటేషన్స్ స్ట్రాంగ్‌గా ఉన్నవారిలోనూ... అలాగే పెళ్లి లేటుగా చేసుకోవడం, పిల్లల్ని ఆలస్యంగా కనడం, పిల్లలకు పాలు పట్టకపోవడం, సంతానలేమి సమస్యల పరిష్కారం కోసం అధిక మోతాదుల్లో హార్మోన్ మందుల వాడటం, పదేళ్ల కంటే చిన్నవయసులోనే రజస్వల కావడం, 50 ఏళ్లు పైబడినా నెలసరి ఆగకపోవడంతో పాటు ఈస్ట్రోజెన్ అధిక మోతాదుల్లో దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు... ఇంకా వారికి అధిక బరువు కూడా తోడైతే ఈ క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలలోని పట్టణాల్లో ఈ క్యాన్సర్‌కు గురయ్యే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. ముప్ఫై ఏళ్ల వయసులో రెండు లక్షల మందికి ఒకరిలో కనిపించే ఈ క్యాన్సర్... 80 ఏళ్ల వయసులో ప్రతి పది మందిలో ఒకరిలో కనిపించేంతగా ఎక్కువవుతోంది. చికిత్స : ఇప్పుడు క్యాన్సర్ ఉందని తెలిసినా వైద్యపరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని మొదటి లేదా రెండో దశలో ఉంటే పూర్తిగా నయం చేయవచ్చు. రొమ్ము క్యాన్సర్ తగ్గదనేది అపోహ మాత్రమే. ఇక తొలి దశల్లో తెలిస్తే రొమ్మును తొలగించాల్సిన అవసరం కూడా ఇప్పుడు లేదు. కేవలం క్యాన్సర్ గడ్డను మాత్రమే విజయవంతంగా తొలిగించవచ్చు. రొమ్ము క్యాన్సర్ చుట్టుపక్కలకు కూడా పాకిందని (శాటిలైట్ లీజన్స్ ఉన్నాయని) తెలిసినప్పుడు మాత్రమే రొమ్మును తొలగిస్తారు. అయినా ఇప్పుడు ఉన్నాధునిక వైద్య పరిజ్ఞానంతో రొమ్మును తొలగించినా... లేదా రొమ్ములోనే కాస్తంత భాగాన్ని తొలగించినా మిగతా చోట్ల ఉండే కండరాలతో ఆ ప్రాంతాన్ని భర్తీ చేసే శస్త్రచికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. రొమ్మును పూర్తిగా తొలగించాల్సి వచ్చినా సిలికాన్ ఇంప్లాంట్ ద్వారా కూడా రొమ్ము ఆకృతిని మునుపటిలాగే ఉండేలా చేయవచ్చు. ఇతర చికిత్సలు : ఈ రోజుల్లో శస్త్రచికిత్సతో పాటు, రేడియేషన్ థెరపీ, హార్మోనల్ థెరపీ, కీమోథెరపీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. మాసెక్టమీలో రొమ్మ తొలగిస్తారు. అయితే రొమ్ముక్యాన్సర్ తొలిదశలో ఉంటే రొమ్మును రక్షిస్తూ, క్యాన్సర్ ఇతర అవయవాలకు వ్యాపించకుండా ఆపవచ్చు. ఇందుకోసం సర్జరీని మొదటి చికిత్సగా చేస్తారు. ఇక ఆ తర్వాత వ్యాప్తిని నివారించేందుకు హార్మోన్ థెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీలను చేస్తారు. రొమ్ము క్యాన్సర్ వచ్చిన వారిలో ఇప్పుడు మొదటే దీన్ని కనుగొంటే ఆంకోప్లాస్టీ అనే శస్త్రచికిత్స సహాయంతో రొమ్మును పూర్తిగా రక్షిస్తారు. రొమ్ము సర్జరీతో క్యాన్సర్ గడ్డను తొలగించడంతో పాటు అక్కడ పడిన చొట్టను పూడ్చుతూ ప్లాస్టిక్ సర్జరీని కలగలిపి ఈ శస్త్రచికిత్స చేస్తారు. నివారణ : ఒక మహిళకు రొమ్ము క్యాన్సర్ రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం నివారణలో కీలకం అవుతుంది. ఇందుకోసం వ్యక్తిగత జీవనశైలి, కుటుంబ ఆరోగ్య చరిత్ర, వృత్తి లాంటి అంశాలు ఇందుకోసం ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో కొన్నింటిని ప్రయత్నపూర్వకంగా మార్చుకోవచ్చు. మరికొన్ని మార్చలేనివీ ఉంటాయి. ఈ రెండింటినీ కలుపుకొని క్యాన్సర్ వచ్చే అవకాశాలను అంచనా వేస్తారు. వయసు, జెండర్, రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డ బంధువులతో దగ్గరి బాంధవ్యం, రుతుస్రావ చరిత్ర, ఏ వయసులో రుతుస్రావం ఆగిపోతుంది వంటి అంశాలను మార్చలేం. కానీ... మార్చుకోగల అంశాలు... ఎక్కువ బరువు కలిగి ఉండటం, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, ఎంత మంది పిల్లలు, బిడ్డలకు ఎంతకాలం పాటు రొమ్ముపాలు పట్టారు, ఆల్కహాల్ అలవాట్లు, పోషకాహారం, అబార్షన్ల సంఖ్య. పై అంశాల ఆధారంగా ఒకరికి రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశం ఎంత ఉందో చెప్పడానికి కొన్ని ‘పద్ధతులు’ అందుబాటులో ఉన్నాయి. ఇందులోని ప్రాచుర్యం పొందిన పద్ధతే... ‘గేల్స్ మోడల్’. దీని సహాయంతో ప్రస్తుత వయసు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ సమయంలో రుతుక్రమం మొదలైంది, మొదటి సంతానం ఏ వయసులో కలిగింది, దగ్గరి బంధువుల్లో ఎంత మందికి రొమ్ముక్యాన్సర్ ఉంది లాంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అంచనా వేస్తారు. అయితే ‘గేల్స్ మోడల్’కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇందులో ఒవేరియన్ క్యాన్సర్ చరిత్రను చేర్చలేదు. దగ్గరి బంధువులుగాక... కాస్తంత దూరపు బంధువులు అంటే చిన్నమ్మ పెద్దమ్మలూ, వారి పిల్లలూ, వారి పిల్లల పిల్లలూ (మనవలను) చేర్చలేదు. అయినా చాలా అంశాల ఆధారంగా చాలావరకు దీన్ని అంచనా వేయడానికి అవకాశం ఉంది. ఒకవేళ సదరు మహిళ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశం ఉన్నవారిలో ఉన్నారని తేలితే... దాన్ని బట్టి నివారణ చర్యలు తీసుకోవచ్చు. పౌష్టికాహారం : ముదురు ఆకుపచ్చరంగులో ఉన్న ఆకుకూరలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ క్యాన్సర్ గుణాలున్న అన్ని రకాల కూరగాయలను ఆహారంలో పుష్కలంగా తీసుకోవాలి. వ్యాయామం : మహిళలంతా ఒక మోస్తరు వ్యాయామాలను రోజూ కనీసం 30 నిమిషాలు చేయాలి. వారంలో ఐదు రోజులైనా వ్యాయామం చేయాలి. ఈ వ్యాయామాల వ్యవధిని 45 నిమిషాలకు పెంచుకుంటే రొమ్ముక్యాన్సర్ రిస్క్ మరింత తగ్గుతుంది. అదే కాస్త చిన్న వయసు పిల్లలైతే ఈ వ్యాయామ వ్యవధిని 60 నిమిషాలకు పెంచుకోవాలి. ఆల్కహాల్ అలవాటు ఉంటే దాన్ని పూర్తిగా మానేయాలి. మందులతో నివారణ : కుటుంబ చరిత్రలో ఎవరికైనా రొమ్ముక్యాన్సర్ ఉన్నా లేదా బీఆర్సీఏ అనే జన్యువులో మార్పు ఉన్నా టామోక్సిఫెన్, ర్యాలోక్సిఫీన్ వంటి మందులతో దీన్ని నివారించవచ్చు. ఇలా రొమ్ముక్యాన్సర్ వచ్చాక చేయాల్సిన చికిత్సను నివారించడానికి అవకాశం ఉంది. ∙శస్త్రచికిత్సతో నివారణ: బీఆర్సీఏ అనే జన్యువులో మార్పులు ఉన్నట్లయితే ‘ప్రొఫిలాక్టిక్ మాసెక్టమీ’ అనే ముందస్తు శస్త్రచికిత్సతో రొమ్ము క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఈ–నోస్‌తో ముందే తెలుసుకోవచ్చు... రొమ్ముక్యాన్సర్ విషయంలో ఇది భవిష్యత్తులో కనిపించబోతున్న విప్లవాత్మకమైన ఆశారేఖ. అదేమిటంటే... కొన్ని రకాల క్యాన్సర్లను ఇప్పుడు కేవలం మూత్రపరీక్ష వంటి చిన్న పరీక్షతోనూ తెలుసుకునే సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. ‘ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న బెన్–గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్ కు చెందిన పరిశోధకులు ఈ పరిశోధన తాలూకు ప్రాథమిక అంశాలను రూపొందించారు. దీని సహాయంతో రొమ్ముక్యాన్సర్‌ను చాలా నిశితంగానూ, చాలా త్వరగానూ పట్టేయడానికి వీలవుతుంది. దాంతో చికిత్స ఆలస్యం కావడం అనే పరిస్థితి తప్పిపోయి, ఎంతోమంది మహిళల ప్రాణాలు నిలబడతాయి. ఇదీ క్యాన్సర్ రోగులకు అందుబాటులోకి రాబోతున్న మరో ఆశారేఖ. ఇక్కడ ఒక చిన్న తమాషా కూడా ఉంది. మూత్రం ద్వారా పట్టేసేందుకు ఉద్దేశించిన ఎలక్ట్రానిక్ పరికరాన్ని పరిశోధకులు నిర్మించారు. దీనికి పెద్దగా ఖర్చుకూడా అవసరం లేదు. మూత్రాన్ని పరిశీలించి, రొమ్ముక్యాన్సర్ తాలూకు వాసన పట్టేస్తుందనే ఉద్దేశంతోనో ఏమో ఈ ఎలక్ట్రానిక్ పరికరానికి ‘ఈ–నోస్’ (ఎలక్ట్రానిక్ ముక్కు) అని పిలుస్తున్నారు. దాంతో మహిళారోగులు భవిష్యత్తులో మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్డ్ పరీక్షలతో కాకుండా... కేవలం కొద్ది ఖర్చుతోనే రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది. రొమ్ముక్యాన్సర్ వస్తే దాని నుంచి దాదాపు 90 శాతం మంది రోగులు విముక్తమయ్యేలా ఇప్పటికే సైన్స్ అభివృద్ధి సాధించింది. ఈ–నోస్ వంటి మరెన్నో ఆవిష్కరణలతో దాదాపుగా అందరూ ఈ జబ్బునుంచి విముక్తమయే రోజూ ఒకటి వస్తుంది. ఈలోపు మనం చేయాల్సిందల్లా రొమ్ముక్యాన్సర్‌పై అవగాహన పెంచుకొని, రిస్క్‌ఫ్యాక్టర్లు ఉన్నవారు తగిన స్క్రీనింగ్ పరీక్షలు చేయిస్తూ, నివారణ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే చాలు. -
మస్తు.. ఆకలి పస్తు
ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలామంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు. కొందరు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ అక్కడక్కడా ఆకలిచావులు నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ఒక ఎనిమిదేళ్ల బాలుడు ఆకలితో అలమటిస్తూ కన్నుమూశాడు. ఆకలి సమస్యను నిర్మూలించడమే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాలు. ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా దాదాపు 150 దేశాలు ఆకలి సమస్య నిర్మూలన కోసం నిబద్ధతను ప్రకటిస్తూ విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అక్కడక్కడా కరువు కాటకాలు, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏటా ఎదురవుతూనే ఉన్నా, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంటోంది. పంపిణీ, నిల్వ సజావుగా సాగితే ఆకలిచావులు సంభవించే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండదు. దురదృష్టవశాత్తు ఆహార ధాన్యాల పంపిణీ, నిల్వ సక్రమంగా సాగుతున్న దాఖలాలే తక్కువ. మనుషుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు నానాటికీ పెరుగుతుండటం కూడా ఆకలి సమస్యకు కారణమవుతోంది. భూతాపం పెరుగుతుండటం వల్ల కొన్నిచోట్ల వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు ఆహార ధాన్యాల ఉత్పాదనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఆధునిక శాస్త్ర పరిశోధనలు ఈ పరిస్థితిని సమర్థంగానే ఎదుర్కోగలుగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులను ఇవ్వగల వంగడాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెస్తూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్నిచోట్ల ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంటే, మరికొన్ని చోట్ల సరైన సాధానాసంపత్తి కరువవడం వల్ల తిండిగింజలు వినియోగానికి దక్కకుండాపోతున్నాయి. ప్రపంచంలో కొందరు ఆకలితో అలమటిస్తుంటే, ఇంకొందరు నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. ఆహార పదార్థాల వృథాను సమర్థంగా అరికట్టగలిగితే ఆకలి సమస్యను చాలావరకు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆకలి సమస్యకు ప్రధాన కారణాలు రెండు దశాబ్దాల కిందటి కంటే ప్రస్తుతం ఆకలి సమస్య చాలావరకు తగ్గింది. అయినా, ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 81.5 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పేదరికం, ఉద్యోగ భద్రత కొరవడటం, ఆహార కొరత, ఆహార పదార్థాల వృథా, సాధనా సంపత్తి లోపాలు, అస్థిరమైన మార్కెట్లు, భూతాపం కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, యుద్ధాలు, సంఘర్షణలు, అట్టడుగు వర్గాలపై వివక్ష వంటివి ఆకలి సమస్యకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు 1.25 డాలర్లు (సుమారు రూ.89) లేదా అంతకంటే తక్కువ మొత్తం సంపాదన ఉన్నవారిని పేదలుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 750 కోట్లకు పైగా ఉంటే, సుమారు 140 కోట్ల మంది రోజుకు కనీసం రూ.89 సంపాదనైనా లేని పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచబ్యాంకు చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల్లోనే ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారిలో అత్యధికులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సన్నకారు రైతులేనని కూడా ప్రపంచబ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. ఇక ఉద్యోగాల్లోని అస్థిర పరిస్థితుల వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆహార ధాన్యాలను భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాల్లో దాదాపు 40 శాతం మేరకు తిండి గింజలు వినియోగానికి పనికిరాకుండా నాశనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఆకలి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. యుద్ధ పరిస్థితులు, సంఘర్షణలతో అతలాకుతలమవుతున్న దేశాల్లోనూ జనం ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు మార్కెట్లలో అస్థిరతల వల్ల ఆహార ధాన్యాలు, ప్రధానమైన పంటల ధరలు ఒక్కోసారి విపరీతంగా పెరగడం, ఒక్కోసారి విపరీతంగా పడిపోవడం వల్ల కూడా తాత్కాలికంగా చాలామంది ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, 2009లో మొక్కజొన్న, గోధుమలు, వరి వంటి తిండిగింజల ధరలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆ ఏడాది కొద్దికాలం పాటు ఆకలితో అలమటించే వారి సంఖ్య 5 కోట్ల నుంచి ఏకంగా 10 కోట్లకు పెరిగింది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి జనాభా అవసరాలను తీర్చడానికి ఆహార ధాన్యాల ఉత్పాదన 70 శాతం మేరకు పెరిగితే గాని ఆకలి సమస్యను నివారించడం సాధ్యం కాదు. వ్యవసాయం కోసం సాగుభూముల లభ్యత ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు ఎటూ లేవు. మెరుగైన వంగడాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తిండి గింజల ఉత్పాదనను గణనీయంగా పెంచే ప్రయత్నాలను సాగించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఆహార పద్ధతులను వ్యాప్తిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఇదీ పరిస్థితి మన దేశంలో పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే, 2006–07 నుంచి 2016–17 సంవత్సరాలలో లెక్కలను చూసుకుంటే, దశాబ్ది వ్యవధిలో మూడేళ్లు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మూడేళ్లనూ మినహాయిస్తే, మిగిలిన ఏడేళ్లలోనూ రికార్డులు బద్దలు కొట్టేస్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చినట్లు ప్రభుత్వం బాగానే ప్రచారం చేసుకుంది. దేశవ్యాప్తంగా 2006–07లో 21.7 కోట్ల టన్నుల తిండిగింజల దిగుబడులు వస్తే, 2016–17లో 27.5 కోట్ల టన్నుల దిగుబడులు వచ్చాయి. దేశంలో 2009, 2014, 2015 సంవత్సరాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గడచిన రెండు దశాబ్దాలలో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు, ఆందోళనలు పెరిగాయి. ఈ రెండు దశాబ్దాల్లోనూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన 1.40 కోట్ల మంది రైతులు వ్యవసాయం నుంచి తప్పుకున్నారు. ఒకవైపు ప్రభుత్వం తిండిగింజల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించినట్లు చెబుతున్నా, మన దేశంలో ఇంకా నిత్యం ఆకలిబాధలు పడుతున్నవారి సంఖ్య 27 కోట్లకు పైగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆకలి బాధితుల సంఖ్య మన దేశంలోనే అత్యధికం. తలసరి ఆహార లభ్యత విషయంలోనూ మనది వెనుకబాటే. ‘ఆక్స్‌ఫామ్‘ గత ఏడాది విడుదల చేసిన ‘ఫుడ్ అవైలబిలిటీ ఇండెక్స్’ నివేదిక ప్రకారం తలసరి ఆహార లభ్యతలో భారత్ 97వ స్థానంలో ఉంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016–17లో తిండిగింజల ఉత్పాదన 27.5 కోట్ల టన్నులైతే, అదే ఏడాది తిండిగింజల డిమాండు 25.7 కోట్ల టన్నులు అని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇది నామమాత్రపు మిగులు ఉత్పత్తి మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తిండిగింజల ఉత్పత్తి స్థానిక అవసరాలతో పోల్చుకుంటే 80 శాతం కంటే తక్కువగా ఉంటే, ఆహార కొరత ఏర్పడినట్లు భావించాలి. తిండిగింజల ఉత్పత్తి 80–120 శాతం వరకు ఉంటే, స్వయంసమృద్ధి సాధించినట్లు భావించాలి. ఈ ఉత్పత్తి 120 శాతాన్ని దాటినప్పుడు మాత్రమే మిగులు ఉత్పత్తి సాధించినట్లు పరిగణించాలి. మనదేశం తిండిగింజల ఉత్పాదనలో స్వయంసమృద్ధి సాధించింది. అయితే, సమీప భవిష్యత్తులో కరువు ముంచుకొస్తే, ఇప్పుడున్న బొటాబొటి మిగులు ఏ మూలకూ సరిపోదని నిపుణులు చెబుతున్నారు. భారీ స్థాయిలో ఆహార వృథా ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథా భారీ స్థాయిలో జరుగుతోంది. సంపన్న దేశాలతో పాటు నిరుపేద దేశాల్లో సైతం ఆహార వృథా దాదాపు ఒకే స్థాయిలో జరుగుతోందని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. జనాభా వినియోగించే ఆహార పరిమాణంలో ఇది దాదాపు మూడో వంతు. వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు 2.6 లక్షల కోట్ల డాలర్లు (రూ.184.31 లక్షల కోట్లు). ఎఫ్ఏఓ లెక్కల ప్రకారం సంపన్న దేశాల్లో సగటున ఏటా 67 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుంటే, పేద దేశాల్లో సగటున 63 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. సంపన్న దేశాల్లో ఆహార వృథాకు, పేద దేశాల్లో ఆహార వృథాకు కారణాలు వేర్వేరు. సంపన్న దేశాల్లో విత్తనాలు వేసే నాటి నుంచి పంట కోసే వరకు గల దశల్లో 32 శాతం నష్టం జరుగుతుంటే, వినియోగదారుల వల్ల 61 శాతం మేరకు ఆహార వృథా జరుగుతోంది. పేద దేశాల్లో విత్తనాలు వేసే నాటి నుంచి పంట కోసే వరకు గల దశల్లో 83 శాతం నష్టం జరుగుతుంటే, వినియోగదారుల వల్ల జరుగుతున్న వృథా 5 శాతం మాత్రమే. పేద దేశాల్లో తగిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం, పంట కోతలో ఆధునిక పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల భారీ స్థాయిలో ఆహార నష్టం వాటిల్లుతోంది. వినియోగదారుల వల్ల ఈ దేశాల్లో జరుగుతున్న ఆహార నష్టం తక్కువే అయినా, ఆధునిక వసతులు కొరవడటం కారణంగా చాలా వరకు ఆహారం వినియోగానికి పనికిరాకుండా పోతోంది. మన భారత్ పరిస్థితులనే తీసుకుంటే, దేశంలో తగినన్ని కోల్డ్ స్టోరేజీలు లేని కారణంగా ఏటా భారీ స్థాయిలో కూరగాయలు, పండ్లు వృథా అవుతున్నాయి. మన దేశంలో ఇలా ఏటా వృథా అయ్యే కూరగాయలు, పండ్ల విలువ సుమారు రూ.38,500 కోట్ల వరకు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రపంచీకరణ ఫలితంగా ఆహార వృథా ప్రపంచీకరణ ఫలితంగా నిష్కారణంగా ఆహారం వృథా అవుతోంది. ప్రపంచీకరణ ఫలితంగా సంపన్న దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ సూపర్ మార్కెట్లు విరివిగా పెరిగాయి. సూపర్ మార్కెట్లు షెల్ఫుల్లో అందంగా కనిపించే ఆహార పదార్థాలకే ప్రాధాన్యమిస్తాయి. కాస్త వంకర టింకరగా ఉన్న పండ్లు, కూరగాయలను షెల్ఫులకెక్కించేందుకు ఇష్టపడవు. అలాంటి వాటిని పశువుల దాణాగా పంపడం లేదా వృథాగా పడవేయడం చేస్తుండటంతో వినియోగానికి పనివచ్చే పదార్థాలు అనవసరంగా వృథా అవుతున్నాయి. సూపర్ మార్కెట్ల మరో లక్షణం ఏమిటంటే, ఇవి షెల్ఫుల నిండుగా పండ్లు, కూరగాయలను నిల్వ చేస్తాయి. షెల్ఫులు ఖాళీగా ఉండనివ్వవు. ఒక్కోసారి ఆశించినంత విరివిగా అమ్ముడుపోని పండ్లు, కూరగాయలు షెల్ఫుల్లోనే నాశనమైపోతుంటాయి. ‘బెస్ట్ బిఫోర్’, ‘యూజ్ బై’, ‘సెల్ బై’ వంటి తేదీల లేబుళ్లను గుడ్డిగా నమ్మే వినియోగదారులు ఆహార పదార్థాల లేబుళ్ల మీద తేదీలను మాత్రమే చూసి పారవేసే ఆహార పదార్థాలు కూడా తక్కువ కాదు. సాధారణంగా ‘బెస్ట్ బిఫోర్’ తదితర తేదీలను రిటైలర్లు తమ అంచనా మేరకు వేస్తారు. ఈ తేదీలు కాస్త దాటినప్పటికీ చాలా వరకు పదార్థాలు వినియోగయోగ్యంగానే ఉంటాయి. అయితే, చాలామంది వినియోగదారులు లేబుళ్ల మీద ముద్రించిన తేదీలనే గుడ్డిగా నమ్ముతూ విలువైన ఆహారాన్ని వృథా చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఏటా ఇలా 8.80 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఆహార వృథా కారణంగా పర్యావరణంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతోంది. పెరుగుతున్న భూతాపాన్ని ఆహార వృథా కూడా ఇతోధికంగా ఎగదోస్తోంది. ఆహార వృథా కారణంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోందో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ– ఒక ఆపిల్ పండు మన చేతికి అందటానికి కనీసం 125 లీటర్ల నీరు అవసరం. ఒక ఆపిల్‌ను పాడయ్యే వరకు నిల్వ ఉంచి పారేస్తే, 125 లీటర్ల నీటిని వృథా చేసినట్లే. ఒక్క ఆపిల్‌కే నీటి వృథా ఈ స్థాయిలో ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల్లో జరుగుతున్న ఆహార వృథా కారణంగా ఏ స్థాయి జలనష్టం జరుగుతోందో ఊహించవచ్చు. ఆహార వృథా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 250 క్యూసెక్కుల మేరకు నీటి వృథా పరోక్షంగా జరుగుతోంది. ఈ నీటి పరిమాణం జెనీవా సరస్సులోని నీటి పరిమాణానికి మూడు రెట్లు. ఇదిలా ఉంటే, వృథా అవుతున్న ఆహార పదార్థాల కారణంగా ఏటా అదనంగా 330 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలో కలుస్తోంది. ఇది భూతాపాన్ని తనవంతు పెంచుతోంది. వృథాగా పారవేసిన ఆహార పదార్థాలు కుళ్లిపోయే దశలో విడుదలయ్యే మీథేన్ వాయువు కూడా పర్యావరణంపై ఇదే తీరులో ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేవలం బొగ్గు, చమురు ఇంధనాల వల్ల మాత్రమే కాదు, ఆహార వృథా కారణంగా కూడా భూతాపం అంతకంతకు పెరుగుతోంది. పర్యావరణ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా, ప్రపంచ దేశాలన్నీ ఆహార వృథాను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుంటే, భవిష్యత్తులో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. తలసరి ఆహారలభ్యత అంతంతే తిండిగింజల ఉత్పాదనలో స్వయంసమృద్ధి సంగతి సరే, తలసరి ఆహార లభ్యతలో మనం సాధించిన పురోగతి అంతంత మాత్రమే. మన దేశంలో 1908 నాటికి తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 177.3 కిలోలుగా ఉంటే, 2016 నాటికి తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 177.9 కిలోలు మాత్రమే. చైనాలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 450 కిలోలు కాగా, బంగ్లాదేశ్‌లో ఈ పరిమాణం 200 కిలోలు ఉండటం గమనార్హం. అగ్రరాజ్యమైన అమెరికాలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 1100 కిలోలు. మనదేశంలో ఆకలితో అలమటిస్తున్నవారు కొందరైతే, పోషకాల సంగతి పట్టించుకోకుండా దొరికినదేదో తిని కడుపు నింపుకుంటున్న వారే ఎక్కువ. ఆహార నిపుణుల సూచనల మేరకు పోషకాహారం తీసుకునే పరిస్థితి చాలామందికి లేదు. తీసుకుంటున్న ఆహారానికీ, పోషక ప్రమాణాలకు వ్యత్యాసం మన గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం మేరకు, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం మేరకు ఉంటోంది. అర్ధాకలి, అరకొర ఆహారం వల్ల మన దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఎఫ్ఏఓ విడుదల చేసిన తాజా గణాంకాలు ఇవీ... భారత జనాభాలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు : 14.5% తక్కువ బరువుతో ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలు : 20.8% ఐదేళ్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఉన్నవారు : 37.9% రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు : 51.4% -
దుర్గతి నాశిని
దసరా నవరాత్రులలో దుర్గాదేవిని ఆరాధిస్తారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు దేవీనవరాత్రులు జరుగుతాయి. శరదృతువులో జరిగే నవరాత్రులు గనుక వీటిని శరన్నవరాత్రులని అంటారు. దుర్గాదేవి ఆదిపరాశక్తి. దుర్గతులను నాశనం చేసేది కనుక ఆమెకు దుర్గ అనే పేరు వచ్చింది. హరిహరబ్రహ్మాది దేవతల చేత పూజలందుకునే దుర్గాదేవి మహిషాసుర సంహారం కోసం అవతరించి, మహిషాసురమర్దినిగా పేరుపొందింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత ఆశ్వీయుజ శుద్ధ దశమి నాడు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించినందున ఆనాడు విజయదశమిగా పాటించడం ఆనవాయితీగా వస్తోందని పురాణాల కథనం. అసురులలో మహాబలసంపన్నుడైన మహిషాసురుడు తనకు మరణం ఉండరాదనుకున్నాడు. తన కోరిక నెరవేర్చుకోవడం కోసం మేరుపర్వత శిఖరానికి చేరుకుని, అక్కడ కూర్చుని బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేశాడు. అతడి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకొమ్మన్నాడు. మరణం లేకుండా వరమివ్వమన్నాడు మహిషాసురుడు. పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదని, మరణం లేకుండా ఉండే వరం ప్రకృతి విరుద్ధమని, అలాంటి వరాన్ని ఇవ్వజాలనని అన్నాడు బ్రహ్మదేవుడు. అయినా, మహిషాసురుడు పట్టువదల్లేదు. ‘నీ మృత్యువుకు ఏదైనా ఒక మార్గం విడిచిపెట్టి వరం కోరుకో’ అన్నాడు బ్రహ్మదేవుడు. ‘నా దృష్టిలో ఆడది అంటే అబల. అబల వల్ల నాకెలాంటి ప్రమాదమూ లేదు. అందువల్ల పురుషుల చేతిలో నాకు మరణం లేకుండా వరం ఇవ్వు’ అన్నాడు మహిషాసురుడు. ‘సరే’ అన్నాడు బ్రహ్మదేవుడు. వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలపై యుద్ధాన్ని ప్రకటించాడు. స్వర్గంపై దండెత్తి, దేవతలందరినీ ఓడించాడు. ఇంద్రపదవిని కైవసం చేసుకుని ముల్లోకాలనూ ముప్పుతిప్పలు పెట్టసాగాడు. పదవీభ్రష్టుడైన ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు వెళ్లి మొరపెట్టుకోగా, వారిలో రగిలిన క్రోధాగ్ని ఒక దివ్యతేజస్సుగా మారింది. త్రిమూర్తులదివ్యతేజస్సు కేంద్రీకృతమై ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది. శివుని తేజస్సు ముఖంగా, విష్ణు తేజస్సు బాహువులుగా, బ్రహ్మ తేజస్సు పాదాలుగా కలిగి అవతరించిన ఆమె పద్దెనిమిది భుజాలు కలిగి ఉంది. శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు పాశాన్ని ఆమెకు ఆయుధాలుగా ఇచ్చారు. బ్రహ్మ అక్షమాలను, కమండలాన్ని ఇచ్చాడు. ఆమెకు వాహనంగా సింహాన్ని హిమవంతుడు ఇచ్చాడు. దేవతలందరూ ఇచ్చిన ఆయుధాలను ధరించిన ఆమె మహిషాసురుడిపై యుద్ధానికి వెళ్లింది. మహిషాసురుడి సేనతో భీకరమైన యుద్ధం చేసింది. మహిషాసురుడి సైన్యంలో ప్రముఖులైన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు వంటి వారిని తుదముట్టించిన తర్వాత నేరుగా మహిషాసురుడితో తలపడింది. తొమ్మిదిరోజుల యుద్ధం తర్వాత దశమి నాడు మహిషాసురుడు దేవి చేతిలో హతమయ్యాడు. మహిషాసురుడి పీడ విరగడ కావడంతో ప్రజలు ఆనాడు వేడుకలు జరుపుకున్నారు. మహిషాసురుడిపై విజయం సాధించిన రోజు గనుక విజయదశమిగా, దసరాగా ఈ పండుగను దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రీతుల్లో జరుపుకుంటారు. వైవిధ్యభరితంగా వేడుకలు దసరా నవరాత్రి వేడుకలను దేశం నలుమూలలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రీతిలో జరుపుకొంటారు. దేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో దసరా వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పశ్చిమబెంగాల్, ఒడిశా, అసోం రాష్ట్రాల్లో ఊరూరా దేదీప్యమానమైన అలంకరణలతో దేవీ మండపాలు పెద్దసంఖ్యలో కనిపిస్తాయి. సప్తమి, అష్టమి, నవమి తిథులలో బెంగాలీలు దుర్గామాతకు విశేష పూజలు చేస్తారు. దశమినాడు కాళీమాతను పూజిస్తారు. కోల్‌కతాలో కొలువుతీర్చిన దేవీవిగ్రహాలను నవరాత్రుల చివరిరోజున హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. అదేరోజున కుమారీపూజ చేస్తారు. ఒడిశాలో ఊరూరా వాడవాడలా దుర్గా మండపాలను ఏర్పాటు చేసి, తొమ్మిదిరోజులూ పూజలు నిర్వహిస్తారు. విజయదశమి రోజున విజయదుర్గను ఆరాధిస్తే అపజయాలు ఉండవని ఒడిశా ప్రజల విశ్వాసం. ఒడియా మహిళలు నవరాత్రుల సందర్భంగా మానికలో వడ్లు నింపి, ఆ మానికను లక్ష్మీదేవిలా భావించి పూజిస్తారు. విజయదశమి రోజునే శ్రీరాముడు రావణుడిని వధించాడని విశ్వసిస్తారు. రావణవధకు ప్రతీకగా విశాలమైన కూడళ్లలో, మైదానాల్లో భారీ పరిమాణంలోని రావణుడి దిష్టిబొమ్మలను ఏర్పాటు చేసి, బాణసంచాతో కాలుస్తారు. చాలాసేపు కాలుతూ ఉండే రావణకాష్టాన్ని తిలకించడానికి కూడళ్లలో, మైదానాల్లో జనాలు పెద్దసంఖ్యలో గుమిగూడతారు. విజయదశమి తర్వాత వచ్చే పున్నమి వరకు ఒడిశాలో మహిళలు ‘జొహ్ని ఉసా’ వేడుకలను జరుపుకొంటారు. గౌరీదేవిని ఆరాధిస్తూ జరిపే ఈ వేడుకలో తెలంగాణలోని ‘బతుకమ్మ పండుగ’ వేడుకలను పోలి ఉంటాయి. గుజరాత్లో దసరా వేడుకల సందర్భంగా ప్రధానంగా పార్వతీదేవిని ఆరాధిస్తారు. ఇంటింటా శక్తిపూజ చేయడం గుజరాతీల ఆచారం. ఇంటి గోడలపై శ్రీచక్రం, త్రిశూలం, శక్తి ఆయుధం చిత్రాలను పసుపుతో చిత్రించి, అలంకరిస్తారు. సమీపంలోని పొలం నుంచి తీసుకు వచ్చిన మట్టితో వేదిక ఏర్పాటు చేసి, దానిపై గోధుమలు, బార్లీ గింజలను చల్లి, దానిపై నీటితో నింపిన మట్టి కుండను పెట్టి, అందులో పోకచెక్క లేదా రాగి లేదా వెండి నాణేన్ని వేస్తారు. ఆ మట్టికుండనే దేవీ ప్రతిరూపంగా భావించి పూజిస్తారు. అష్టమి రోజున హోమం చేసి, దశమి రోజున నిమజ్జనం చేస్తారు. దశమి తర్వాత వచ్చే పున్నమి వరకు జరిగే ‘గర్భా’ వేడుకల్లో మహిళలు నృత్యగానాలు చేస్తూ ఉత్సాహంగా పాల్గొంటారు. తెలుగు రాష్ట్రాల్లో దసరా వైవిధ్యం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో దసరా వేడుకలు వైవిధ్యభరితంగా సాగుతాయి. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. తొమ్మిదిరోజులూ అమ్మవారికి వివిధ రకాల అలంకరణలు చేస్తారు. విజయదశమి రోజున అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహిస్తారు. కనకదుర్గ అమ్మవారు కృష్ణానదిలో మూడుసార్లు తెప్పపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారి తెప్పోత్సవాన్ని తిలకించడానికి రాష్ట్ర రాష్ట్రేతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విజయవాడకు తరలి వస్తారు. దసరా రోజున ప్రభల ఊరేగింపు, ప్రభల ఊరేగింపులో జరిగే భేతాళ నృత్యం విజయవాడ దసరా వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం గ్రామంలో దసరా సందర్భంగా ఏనుగు సంబరాలను నిర్వహిస్తారు. దసరా నవరాత్రుల మొదటి రోజున ఏనుగు గుడిలో వయసైన బ్రహ్మచారిని భేతాళుడిగా నిలబెడతారు. తొమ్మిదిరోజులూ భేతాళుడే అమ్మవారి పూజాదికాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వెదురుకర్రలు, గడ్డి, కొబ్బరిపీచుతో తయారు చేసిన ఏనుగు బొమ్మను వివిధ అలంకరణలతో రూపొందించిన అంబారీతో అలంకరిస్తారు. ఇదేరీతిలో మరో చిన్న ఏనుగు బొమ్మను తయారు చేసి, చివరి రోజున బోయీలతో ఊరేగింపుగా తీసుకువెళతారు. విజయనగరంలో దసరా సందర్భంగా గజపతుల ఆడపడుచైన పైడితల్లికి పూజలు చేస్తారు. దసరా తర్వాతి మొదటి మంగళవారం రోజున పైడితల్లికి జాతర నిర్వహిస్తారు. ఈ జాతరలో పూజారిని సిరిమాను ఎక్కించి, మూడు లాంతర్ల కూడలి నుంచి రాజుగారి కోట వరకు మూడుసార్లు ఊరేగిస్తారు. ఈ వేడుకలను తిలకించడానికి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు మూడు రోజుల ముందుగానే విజయనగరం చేరుకుని, వీధుల్లోనే గుడారాలు వేసుకుని మకాం వేసి, ఈ ఉత్సవాలను చూసి ఆనందిస్తారు. కృష్ణాజిల్లా రేవుపట్టణం బందరులో దసరా సందర్భంగా శక్తిపటాల ఊరేగింపు నిర్వహిస్తారు. తెలంగాణలో దసరా నవరాత్రులలో బతుకమ్మ ఉత్సవాలు జరుపుకొంటారు. తంగేడు, గునుగు వంటి రంగురంగుల పూలతో బతుకమ్మలను తీర్చిదిద్ది మహిళలంతా ఉత్సాహంగా ఆటపాటలతో ఆనందిస్తారు. చివరి రోజున నిమజ్జనం చేసిన తర్వాత పండుగ జరుపుకుంటారు. నవదుర్గల ఆరాధన శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ప్రధానమైనవిగా భావిస్తారు. మహారాష్ట్ర, గోవా ప్రాంతాల్లోని గౌడ సారస్వత బ్రాహ్మణులు నవదుర్గలను కులదేవతలుగా ఆరాధిస్తారు. వరాహ పురాణంలో నవదుర్గల ప్రస్తావన కనిపిస్తుంది. నవరాత్రులలో నవదుర్గలను వరాహపురాణ శ్లోకంలో చెప్పిన వరుస క్రమంలో ఆరాధిస్తారు. ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ/ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం/ పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ/ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్ నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మణైవ మహాత్మనా వరాహ పురాణంలోని ఈ శ్లోకం ప్రకారం శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాలరాత్రి, మహాగౌరి, సిద్ధిధాత్రి అనేవి నవదుర్గల పేర్లు. నవరాత్రులలో దుర్గాదేవిని ఈ రూపాలలో అలంకరణలు చేసి, నిష్టగా పూజలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తారు. దేవీసప్తశతిలో మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, నంద, శాకంబరి, భీమ, రక్తదంతిక, దుర్గ, భ్రామరి అనే నామాలను, వారి గాథలను ప్రస్తావించినా, ఈ అవతరాలను ప్రత్యేకంగా నవదుర్గలుగా వ్యవహరించలేదు. అయితే, దసరా నవరాత్రుల్లో కొన్ని ఆలయాల్లో అమ్మవారిని దేవీసప్తశతిలో పేర్కొన్న రూపాలలో అలంకరించి, పూజలు జరుపుతారు.శాక్తేయ సంప్రదాయంలో నవదుర్గలనే కాకుండా, దశ మహావిద్యల రూపాల్లో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. నవరాత్రులలో దశ మహావిద్యల రూపాలైన కాళి, తార, త్రిపురసుందరి, భువనేశ్వరి, భైరవి, ఛిన్నమస్తా, ధూమావతి, బగళాముఖి, మాతంగి, కమలాత్మిక రూపాలలో అమ్మవారిని ఆరాధిస్తారు. అలాగే సప్తమాతృకలైన బ్రాహ్మణి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వరాహి, ఇంద్రాణి, చాముండి రూపాలలో కూడా అమ్మవారిని ఆరాధిస్తారు. విదేశాలలో దసరా దసరా నవరాత్రి వేడుకలను భారత్‌తో పాటు హిందువుల జనాభా ఎక్కువగా ఉండే ఇతర దేశాల్లో కూడా అంగరంగ వైభవంగా జరుపుకొంటారు. నేపాల్‌లో విజయదశమిని ‘బడాదశైం’ అంటారు. నేపాల్‌లో బడా దశైం వేడుకలను హిందువులతో పాటు బౌద్ధులు, అక్కడి గిరిజన తెగకు చెందిన కిరాతులు కూడా వైభవోపేతంగా జరుపుకొంటారు. భారత్‌లో నేపాలీలు ఎక్కువగా ఉండే సిక్కిం, అసోం తదితర ఈశాన్య రాష్ట్రాల్లోను, డార్జిలింగ్ ప్రాంతంలోను కూడా ‘బడాదశైం’ వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. భూటాన్‌లోని లోత్షంపా తెగకు చెందిన వారు, మయన్మార్‌లోని బర్మా గూర్ఖాలు కూడా ఈ వేడుకలను జరుపుకొంటారు. నేపాల్‌లోని కఠ్మాండు లోయలోని నేవా ప్రాంతానికి చెందిన నేవార్లు దసరా వేడుకలను ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి మొదలుకొని పున్నమి నాటి వరకు జరుపుకొంటారు. ఈ వేడుకలను ‘మోహాని‘గా వ్యవహరిస్తారు. నేపాల్‌లోని శక్తి ఆలయాల్లో ‘బడాదశైం’, ‘మోహాని’ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాలలో అలంకరించి పూజలు చేస్తారు. బంధుమిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రత్యేకమైన ఈ విందులను ‘నఖ్‌త్యా’ అంటారు. ఆశ్వీయుజ శుక్ల పాడ్యమి నాడు ‘ఘటస్థాపన’ చేయడంతో ‘బడాదశైం’ వేడుకలు మొదలవుతాయి. నవరాత్రులలో సప్తమి, మహాష్టమి, మహర్నవమి, దశమి రోజులలో విశేషమైన పూజలు చేస్తారు. సప్తమి రోజున ‘ఫూల్‌పత్తి’ వేడుకలను జరుపుతారు. ఈ వేడుకల కోసం కఠ్మాండు లోయకు చెందిన బ్రాహ్మణులు మూడురోజుల ముందే బయలుదేరుతారు. వారు రాచకలశాన్ని, అరటి గెలలను, ఎర్రటి వస్త్రంలో చుట్టిన చెరకు గడలను తీసుకువచ్చి సప్తమినాడు అమ్మవారికి సమర్పిస్తారు. మహాష్టమి రోజున అమ్మవారి ఉగ్రరూపమైన కాళీ రూపంలో అలంకరిస్తారు. ఆ రోజు భారీ స్థాయిలో మేకలను, బర్రెలను బలి ఇస్తారు. మహర్నవమి రోజు విశ్వకర్మను ఆరాధిస్తారు. ఇదేరోజున కఠ్మాండులోని తలేజు ఆలయ ద్వారాలు తెరిచి, భక్తులను లోనికి అనుమతిస్తారు. ఏడాది మొత్తంలో ఈ ఆలయం తెరుచుకునేది మహర్నవమి రోజున మాత్రమే. విజయదశమి నాడు పెరుగన్నంలో సిందూరాన్ని కలిపి, పెద్దలు దానిని పిల్లల నుదుట తిలకంగా అలంకరిస్తారు. ఈ తిలకాన్ని ‘టికా’ అంటారు. తిలకధారణ తర్వాత పెద్దలు పిల్లలకు దక్షిణగా కొంత డబ్బు ఇస్తారు. విజయదశమినాడు మొదలయ్యే ‘టికా’ వేడుకలు ఐదురోజుల వరకు– అంటే పున్నమి వరకు కొనసాగుతాయి. పున్నమి నాడు లక్ష్మీదేవిని పూజించడంతో ఈ వేడుకలు ముగుస్తాయి. శ్రీలంకలో కూడా దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రావణుడు పరిపాలించిన లంకలో దసరా రోజున రావణ దహన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ వేడుకలు దాదాపు ఊరూరా జరుగుతాయి. ఆరుబయటి ప్రదేశాల్లో రావణుడు, కుంభకర్ణుడు, ఇంద్రజిత్తుల భారీ దిష్టిబొమ్మలను నిలుపుతారు. ఈ దిష్టిబొమ్మల్లో ముందుగానే మందుగుండు దట్టించి ఉంచుతారు. రామలక్ష్మణుల వేషాలు ధరించిన వారు నిప్పు ముట్టించిన బాణాలను ఈ దిష్టిబొమ్మల మీదకు సంధించడంతో మందుగుండు అంటుకుని, ఇవి తగులబడతాయి. దసరా నవరాత్రులలో శ్రీలంకవాసులు అమ్మవారిని లక్ష్మి, సరస్వతి, దుర్గ రూపాలలో ఆరాధిస్తారు. బంగ్లాదేశ్‌లో దసరా నవరాత్రులు బెంగాలీ సంప్రదాయ పద్ధతిలో కొనసాగుతాయి. రాజధాని ఢాకాలోని ఢాకేశ్వరి ఆలయంతో పాటు దేశంలోని వివిధ అమ్మవారి ఆలయాల్లో దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఊరూరా వీధుల్లో దుర్గాదేవి మండపాలను ఏర్పాటు చేస్తారు. చివరి రోజున వేడుకలు ముగిసిన తర్వాత మండపాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మట్టి విగ్రహాలను నదులలో నిమజ్జనం చేస్తారు. -
నైపుణ్యం కట్టుకోండి..
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మనం అక్షరాస్యతలో అభివృద్ధి సాధించాం. చాలా అంశాల్లో వ్యత్యాసాలు ఉన్నట్లే, అక్షరాస్యతలో సాధించిన అభివృద్ధిలోనూ వ్యత్యాసాలు ఉన్నాయి. మనదేశంలో కొన్ని ప్రాంతాలు అక్షరాస్యతలో గణనీయమైన అభివృద్ధినే సాధించినా, మరికొన్ని ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా వెనుకబడే ఉన్నాయి. అక్షరాస్యత పెరిగిన కారణంగా, దేశవ్యాప్తంగా ఉన్నత విద్యావంతుల సంఖ్య పెరుగుతోంది. కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి ఏటా బయటకు వచ్చే పట్టభద్రుల సంఖ్య పెరుగుతోంది. స్వాతంత్య్రానికి ముందు మన దేశంలో అక్షరాస్యత తక్కువగానే ఉన్నా, అప్పట్లో పట్టభద్రులైన వారు తక్కువ మందే అయినా, వారిలో చదువుకు తగిన నైపుణ్యాలు ఉండేవి. ఇప్పటి పట్టభద్రుల చేతికి పట్టాలైతే వస్తున్నాయి గాని, వారిలో చదువుకు తగిన నైపుణ్యాలే కొరవడుతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వాలే తగిన చర్యలు ప్రారంభించి పుణ్యం కట్టుకోవాలి. మన దేశంలో ఇప్పటికీ పెద్ద పెద్ద చదువులు చదువుకుంటున్న వారు సైతం చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. దేశంలో ఒకప్పుడు ఉన్నంత దారుణమైన నిరుద్యోగ పరిస్థితులు లేకపోయినా, ఇంజనీరింగ్, టెక్నాలజీ గ్రాడ్యుయేట్లు సైతం అటెండర్ స్థాయి పోస్టులకు దరఖాస్తు చేసుకుంటున్న ఉదంతాలు ఉంటున్నాయంటే పరిస్థితులను ఊహించుకోవాల్సిందే. వాళ్లు ఉద్యోగాలకు పనికిరారు... మన దేశంలో కార్పొరేట్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. ప్రభుత్వాల చొరవతో బహుళజాతి సంస్థలు సైతం ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ సంస్థలన్నింటికీ పెద్దసంఖ్యలోనే వివిధ నైపుణ్యాలకు సంబంధించిన ఇంజనీరింగ్ పట్టభద్రులు పెద్దసంఖ్యలో అవసరం. మన దేశంలో ఐఐటీ వంటి ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థలు, ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలే కాకుండా, పెద్దసంఖ్యలో ఉన్న ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏటా లక్షలాది సంఖ్యలో ఇంజనీరింగ్ పట్టభద్రులు పుట్టుకొస్తున్నారు. వీరి చేతుల్లో పట్టాలైతే ఉంటున్నాయి గాని, వీరు పొందిన పట్టాలకు తగిన నైపుణ్యాలే కొరవడుతున్నాయి. మన దేశంలో తయారవుతున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో దాదాపు 80 శాతం మంది ఉద్యోగాలకు పనికిరారని, వారిలో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు బొత్తిగా లేవని, ‘నాలెడ్జ్ ఎకానమీ’లో వారు ఇమడటం సాధ్యం కాదని ‘ఆస్పైరింగ్ మైండ్స్’ విడుదల చేసిన ‘యాన్యువల్ ఎంప్లాయబిలిటీ సర్వే–2019’ నివేదిక కుండ బద్దలు కొట్టింది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు కోడ్ రాసే నైపుణ్యం కీలకం. మన దేశంలో చక్కగా కోడ్ రాయగలిగే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కేవలం 4.6 శాతం మంది మాత్రమే. పొరుగు దేశమైన చైనా ఈ విషయంలో మరీ అధ్వానంగా ఉంది. అక్కడి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో మంచి కోడ్ రాయగలిగేవారు 2.1 శాతం మంది మాత్రమే. అమెరికన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో మంచి కోడ్ రాయగలిగే వారు 18.8 శాతం మంది వరకు ఉంటున్నారు. చైనా కంటే మెరుగ్గా ఉన్నామని చంకలు గుద్దుకోవాలో, అమెరికా కంటే వెనుకబడినందుకు ఆవేదన చెందాలో మన విద్యావ్యవస్థను శాసిస్తున్న ప్రభుత్వాలే నిర్ణయించుకోవాలి. వివిధ రంగాలకు చెందిన ఇంజనీర్లలో ఉద్యోగాలకు పనికొచ్చేవారి సంఖ్య అత్యంత దయనీయంగా ఉన్నట్లు ‘యాన్యువల్ ఎంప్లాయబిలిటీ సర్వే–2019’ నివేదికలో బయటపడింది. కీలకమైన రంగాల్లో మన ఇంజనీర్ల ఎంప్లాయబిలిటీ పరిస్థితిపై ఈ నివేదిక వెల్లడించిన గణాంకాలు ఇవీ...మిగిలిన విభాగాల్లో కూడా మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లది ఇదే పరిస్థితి. ఎంపిక చేసుకున్న కీలక అంశాల్లోనే కాదు, కనీసం విషయాన్ని ఆకళింపు చేసుకునే నైపుణ్యాలు, సమర్థంగా ఉద్యోగాలు చేయడానికి అవసరమైన భాషా నైపుణ్యాలలో కూడా మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు దారుణంగా వెనుకబడి ఉంటున్నారు. దేశవ్యాప్తంగా మన ఇంజనీరింగ్ విద్య ఎక్కువగా ‘థియరీ’ చదువుకోవడం వరకు మాత్రమే పరిమితమవుతోంది. దాదాపు సగానికి సగం మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రాక్టికల్ శిక్షణకు నోచుకోవడం లేదు. కేవలం 40 శాతం మంది మాత్రమే ఇంటర్న్‌షిప్ పూర్తి చేసుకుంటున్నారు. మిగిలిన 60 శాతం మందికి ఇంజనీరింగ్‌లోని మౌలిక అంశాలు సంబంధిత పరిశ్రమలలో ఎలా ఉపయోగపడతాయనే దానిపై కనీసమైన అవగాహన కూడా ఉండటం లేదు. పురోగతి అక్షరాస్యతకే పరిమితం మనం సాధించిన పురోగతి అంతా అక్షరాస్యతకే పరిమితం. అక్షరాలు కూడబలుక్కుని చదవడం, చేతినంతా కూడదీసుకుని సంతకం చేయడం వస్తే చాలు, అక్షరాస్యుల జాబితాలో చేరిపోవడానికి. అక్షరాస్యతపై రూపొందించుకున్న గణాంకాలకు విద్యా నాణ్యత గురించి ఎలాంటి పట్టింపులూ లేవు. వయోజనుల్లోను, యువజనుల్లోను అక్షరాస్యతపై ‘యూనెస్కో’ 2015లో విడుదల చేసిన గణాంకాలు ఇవీ..చైనా సంగతి సరే, మన కంటే ఆర్థికంగా, సాంకేతికంగా వెనుకబడిన శ్రీలంక, మయాన్మార్లాంటి చిన్న దేశాలు సైతం అక్షరాస్యతలో మనకంటే ముందంజలో ఉన్నాయి. యువజన అక్షరాస్యతలో నేపాల్ మనకంటే ముందంజలో ఉందని ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచానికి కావలసినవి నైపుణ్యాలే! శాస్త్ర సాంకేతిక పురోగతి శరవేగం పుంజుకున్న నేపథ్యంలో ఇప్పటి ప్రపంచానికి కావలసినవి నైపుణ్యాలే! ఉద్యోగాలు పొందాలంటే, వాటికి కావలసిన నైపుణ్యాలు కచ్చితంగా ఉండి తీరాలి. నైపుణ్యాలతో పనిలేని లేదా అరకొర నైపుణ్యాలు సరిపోయే ఉద్యోగాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అతి తక్కువ నైపుణ్యాలతో నెట్టుకొచ్చే ఉద్యోగాల సంఖ్య 2010 నాటికి 74 శాతం ఉంటే, 2020 నాటికి ఈ ఉద్యోగాలు 62 శాతానికి పడిపోతాయని అంచనా. మరోవైపు తగిన నైపుణ్యాలు గల ఉద్యోగుల అవసరం విపరీతంగా పెరుగుతోంది. వచ్చే ఏడాది నాటికి వివిధ రంగాల్లో నైపుణ్యాలు గల ఉద్యోగులు దాదాపు 1.80 కోట్ల మంది అదనంగా అవసరమవుతారు. ఇదే సమయానికి భారత్‌లో 4.70 కోట్ల మంది కార్మికులు చేతిలో పని లేకుండా పోయే పరిస్థితులు ఉన్నాయని, వీళ్లంతా ఎలాంటి నైపుణ్యాలూ లేనివాళ్లే అయి ఉంటారని ‘అప్‌గ్రేడ్’ సంస్థ చేపట్టిన అధ్యయనంలో తేలింది. పని కోల్పోయే ఈ మిగులు కార్మికులకు పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలలో తగిన శిక్షణ కల్పించి, వారిని పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం ఎలా అన్నదే భారత్ ముందు ఉన్న సవాలు అని ‘అప్‌గ్రేడ్’ సంస్థ తరఫున అధ్యయనం చేపట్టిన ఆర్థిక శాస్త్రవేత్తలు మయాంక్ కుమార్, అపూర్వ శంకర్ చెబుతున్నారు. మిగిలిన గ్రాడ్యుయేట్లదీ అదే పరిస్థితి మన ఇంజనీర్ల పరిస్థితి సరే, దేశంలోని మిగిలిన గ్రాడ్యుయేట్లలో కూడా ఉద్యోగాలకు పనికొచ్చేవారు తక్కువగానే ఉంటున్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ వంటి సాధారణ డిగ్రీ కోర్సులు పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లలో కేవలం 25 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలకు అవసరమయ్యే నైపుణ్యాలు ఉంటున్నాయి. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల్లో దాదాపు 48 శాతం సంస్థలు తమ తమ సంస్థల్లో ఖాళీ పోస్టులను నింపడం కష్టంగా ఉందని చెబుతుంటే, ఆ పోస్టులకు కావలసిన నైపుణ్యాలు గల గ్రాడ్యుయేట్లే కరువవుతున్నారని వాపోతున్నాయి, ఈ పరిస్థితుల్లో మన గ్రాడ్యుయేట్లకు తగిన నైపుణ్యాలలో శిక్షణ కల్పిచేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టకపోతే, వీరంతా నిరుద్యోగులుగా మిగిలిపోయి, దేశానికి పెనుభారమయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. దేశ ఆర్థిక పురోగతికి ఇదెంత మాత్రం క్షేమం కాదని ఆర్థిక, సామాజిక నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థిక శక్తిగా ఎదగాలనుకుంటున్న భారత్‌కు ఈ పరిస్థితి పెద్ద అవరోధం కాగలదని కూడా వారు చెబుతున్నారు. మన పట్టభద్రులకు, మిగులు కార్మిక శక్తికి పారిశ్రామిక అవసరాలకు తగిన నైపుణ్యాలను కల్పించే రీతిలో విద్యా వ్యవస్థను తీర్చిదిద్దుకోకుంటే, ఆర్థిక రంగంలో మనకు వెనుకబాటు తప్పదని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నైపుణ్యాల కొరత ఎందుకంటే..? మన దేశంలో నైపుణ్యాల కొరతకు ప్రధాన కారణం విద్యా వ్యవస్థ వైఫల్యమే. ప్రాథమిక, మాధ్యమిక స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైన బోధన, శిక్షణ లభించడం లేదు. చాలా చోట్ల పాఠశాలల్లో ఎనిమిదో తరగతి, ఆపై తరగతులు చదివే వారిలో 25 శాతం మంది విద్యార్థులు వాక్యాలను చదవలేని స్థితిలో, ప్రాథమికమైన లెక్కలు చేయలేని స్థితిలో ఉన్నారని ‘ఏన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్’ (ఏఎస్ఈఆర్) ఈ ఏడాది ప్రారంభంలోనే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు స్కూళ్లు విపరీతంగా పెరిగినా, ఇవేవీ విద్యా నాణ్యతను ఆశించిన స్థాయిలో మెరుగుపరచలేకపోతున్నాయి. గుజరాత్, హర్యానా, అస్సాం, కేరళ వంటి కొద్ది రాష్ట్రాల్లోని విద్యార్థుల అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు మెరుగుపడినా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విద్యార్థుల అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు ఇదివరకటి కంటే దిగజారాయి. ఉత్తరప్రదేశ్‌లోనైతే మూడో తరగతి విద్యార్థుల్లో ఎక్కువశాతం మంది చిన్న చిన్నపదాలను కూడబలుక్కునైనా చదవలేని స్థితిలో ఉన్నారు. సర్వశిక్షా అభియాన్, మాధ్యమిక శిక్షా అభియాన్, మధ్యాహ్న భోజన పథకం, విద్యా హక్కు చట్టం వంటి వాటి ఫలితంగా పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య ఇటీవలి సంవత్సరాలలో గణనీయంగా పెరిగినా, విద్యార్థుల్లో అధ్యయన ప్రమాణాలు, నైపుణ్యాలు కనీస స్థాయిలోనైనా మెరుగుపడకపోవడం విచారకరం. గణాంకాల్లో వీళ్లంతా అక్షరాస్యులుగానే నమోదవుతున్నారు. మన అక్షరాస్యత గణాంకాల్లో కనిపిస్తున్నదంతా వాపు మాత్రమే తప్ప బలుపు ఎంతమాత్రం కాదని విద్యారంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను మెరుగుపరచలేని మన విద్యావ్యవస్థలోని లోపాలకు వారు చెబుతున్న కొన్ని ప్రధాన కారణాలు ఇవీ.. శిక్షణ పొందిన ఉపాధ్యాయుల కొరత ప్రాథమిక స్థాయిలో నాసిరకం బోధన నిరుపేద నిరక్షరాస్యుల కుటుంబాలకు చెందిన పిల్లలకు లభించని ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు కావలసిన కనీస పాఠ్యపరికరాల కొరత పాఠశాలల్లో పిల్లలకు బొమ్మల కథల పుస్తకాలు అందుబాటులో లేకపోవడం సృజనాత్మక అధ్యయనానికి కావలసిన కనీస వసతుల కొరత క్లిష్టమైన విషయాలను విద్యార్థులకు సరళంగా బోధించలేకపోతున్న ఉపాధ్యాయులు బోధనలో నిమగ్నం కావలసిన ఉపాధ్యాయులను ప్రభుత్వాలు ఇతరేతర అవసరాలకు వాడుకోవడం. విద్యా వ్యవస్థను సమూలంగా మెరుగుపరచడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం కేటాయించకపోవడం. వృత్తి విద్యా శిక్షణకు ప్రభుత్వాలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం. సాధించాల్సింది చాలానే ఉంది స్వాతంత్య్రం వచ్చేనాటికి మన దేశంలో అక్షరాస్యులు కేవలం 18 శాతం మాత్రమే. ఇప్పుడు అక్షరాస్యుల సంఖ్య 74 శాతానికి చేరుకుంది. దేశంలోని పిల్లల్లో దాదాపు 95 శాతం మంది పాఠశాలలకు వెళుతున్నారు. అలాగని దేశంలోని అక్షరాస్యులందరికీ ఉపాధికి కావలసిన నైపుణ్యాలు ఉన్నాయని చెప్పడానికి వీల్లేని పరిస్థితులు ఉన్నట్లు వివిధ అధ్యయనాలు, పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. అలాగే పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులకు నాణ్యమైన బోధన అందుతున్న పరిస్థితులు కూడా లేవు. ‘దేశంలోని 35 శాతం యువజనులు, వయోజనులు ఇంకా అక్షరాస్యతకు దూరంగానే ఉన్నారు. ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్నప్పటికీ, దాదాపు 40 శాతం విద్యార్థుల్లో కనీస అధ్యయన నైపుణ్యాలు కనిపించడం లేదు. ఈ పరిస్థితి మన దేశానికి ఒక సవాలు. దీనిని గుర్తించి, ప్రణాళికాబద్ధంగా ఈ సమస్య పరిష్కారానికి సత్వరమే కృషిని ప్రారంభించాల్సి ఉంది’ అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు రాసిన ఒక ప్రత్యేక వ్యాసంలో పేర్కొనడం గమనార్హం. నైపుణ్యాలలో టాప్–5 ఆధునిక పరిస్థితుల్లో ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలు గల కార్మిక శక్తి గల దేశాలలో మనం చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ విషయంలో టాప్–5 దేశాలు, ఆ దేశాల్లో నైపుణ్యాలు గల కార్మికశక్తిపై గణాంకాలు... దేశం నిపుణులైన కార్మికులు దక్షిణ కొరియా- 96 శాతం జపాన్ - 80 శాతం జర్మనీ - 75 శాతం యూకే - 68 శాతం అమెరికా - 52 శాతం మన దేశంలో నైపుణ్యాలు కలిగిన కార్మికుల సంఖ్య పట్టుమని పది శాతం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా నైపుణ్యాలు కలిగిన కార్మికులు 38 శాతం ఉంటే, ప్రపంచవ్యాప్త సగటు కంటే మన దేశంలో నైపుణ్యాలు కలిగిన కార్మికుల సంఖ్య చాలా తక్కువగా ఉండటం గమనార్హం. -
వినాయకుని విశిష్ట ఆలయాలు.. చుట్టేసొద్దాం
వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి. అందుకే ఆయనను విఘ్నేశ్వరుడని అంటారు. ప్రమథగణాలకు అధిపతి గనుక గణపతి అంటారు. పెద్ద ఉదరంతో అలరారుతుంటాడు గనుక లంబోదరుడని అంటారు. మూషికాన్ని వాహనంగా చేసుకున్నందున మూషికవాహనుడని అంటారు. ఏనుగు తల కలిగి ఉండటం వల్ల గజాననుడని, ఒక దంతం విరిగి ఉండటం వల్ల ఏకదంతుడని అంటారు. వినాయకుడు ఎందరికో ఇష్టదైవం. దేశదేశాల్లో వినాయకుడి ఆలయాలు ఉన్నాయి, ఆరాధకులూ ఉన్నారు. సనాతన సంప్రదాయంలో వినాయకుడికి ప్రత్యేకమైన మతం కూడా ఉంది. వినాయకుడే ప్రధాన దైవంగా ఆరాధించే మతాన్ని గాణపత్యం అంటారు. వినాయకుడికి ఎన్నో నామాలు ఉన్నట్లే, ఎన్నో రూపాలు కూడా ఉన్నాయి. వినాయకుడి కథ, వినాయక చవితి పూజావిధానం దాదాపు అందరికీ తెలిసినదే. వినాయకుడికి గల అరుదైన ఆలయాల గురించి తక్కువ మందికి తెలుసు. వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి గల కొన్ని అరుదైన ఆలయాల విశేషాలు మీ కోసం... వరసిద్ధి వినాయక ఆలయం, కాణిపాకం, ఆంధ్రప్రదేశ్ శ్రీవరసిద్ధి వినాయక ఆలయం ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాణిపాకం గ్రామంలో ఉంది. కాణిపాకం వినాయక ఆలయం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. కాణి అంటే పావుఎకరా మాగాణి భూమి అనే అర్థం ఉంది. వరసిద్ధి వినాయకుడు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడు. కాణిపాకం స్థలపురాణం ప్రకారం వెనుకటి కాలంలో ఇక్కడ ముగ్గరు అన్నదమ్ములు ఉండేవారు. ముగ్గరిలో ఒకరు గుడ్డి, ఒకరు మూగ, ఒకరు చెవిటి. అవిటితనాలతో బాధపడుతూనే ఆ అన్నదమ్ములు ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటూ జీవితం గడిపేవారు. వారి పొలంలో ఒక బావి ఉండేది. బావిలోని నీరు ఏతంతో తోడి పొలానికి నీరు పట్టేవారు. ఒకసారి బావిలో నీరు పూర్తిగా ఇంకిపోయింది. మరింత లోతుగా తవ్వితే నీరు పడుతుందేమోననే ఆశతో అన్న దమ్ములు బావిలోకి దిగి తవ్వుతుండగా, గునపానికి గట్టిగా రాతిలాంటిదేదో తగిలింది. గునపం బయటకు తీసి చూడగా, దానికి నెత్తురు అంటుకుని ఉంది. కొద్దిసేపట్లోనే బావిలోని నీరు నెత్తుటి రంగులోకి మారింది. ముగ్గురు అన్నదమ్ముల అవిటితనం కూడా మాయమైంది. బావిని మరింత లోతుగా తవ్వడానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం పూర్తికాకుండానే బావిలోని నీటి నుంచి వినాయకుడి శిలావిగ్రహం బయటపడింది. ఈ మహిమ చూసిన జనాలు కొబ్బరినీళ్లతో విగ్రహానికి అభిషేకాలు చేశారు. అలా అభిషేకించిన కొబ్బరినీరు ఎకరంపావు దూరం కాలువలా ప్రవహించింది. అందువల్ల దీనిని తమిళంలో ‘కాణిపరకం’ అని పిలిచేవారు. రానురాను ఇది కాణిపాకంగా మారింది. ఈ ఆలయంలో వినాయకుని విగ్రహం నేటికీ బావిలోనే కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు తమకు ఇష్టమైన పదార్థాన్ని స్వామివారికి వదిలిపెడితే కోరికలు తీరుతాయని నమ్మకం. అలాగే, కాణిపాకం వినాయకుడు సత్యప్రమాణాల వినాయకుడిగా కూడా ప్రసిద్ధుడు. ఇక్కడ వినాయకుని ఎదుట ప్రమాణం చేసిన వారు సత్యమే పలకాలని, అసత్యం పలికిన వారికి అనర్థాలు తప్పవని కూడా భక్తులు నమ్ముతారు. చోళుల కాలంలో పదకొండో శతాబ్దిలో ఇక్కడ వినాయకునికి ఆలయం నిర్మించారు. పదమూడో శతాబ్దిలో కులోత్తుంగ చోళుడు ఇప్పుడు ఉన్న రీతిలో ఆలయాన్ని మరింత విశాలంగా నిర్మించాడు. మధుర మహాగణపతి, కేరళ కేరళలోని మధుర మహాగణపతి ఆలయం ఒకప్పుడు శివాలయం. పరమశివుడు మదరనాథేశ్వరునిగా ఇక్కడ వెలశాడు. అప్పట్లో ఇది తుళునాడు రాజ్యంలో ఉండేది. స్వయంభువుగా వెలసిన శివలింగానికి తుళురాజులు ఆలయం నిర్మించారు. మదరు అనే వృద్ధురాలు ఈ శివలింగాన్ని కనుగొనడంతో ఆమె పేరిట ఇక్కడి శివుడు మదరనాథేశ్వరునిగా ప్రసిద్ధి పొందాడని ప్రతీతి. ఒకనాడు స్థానిక తుళు బాలుడు ఒకడు ఆలయంలో ఆడుకుంటూ, గర్భగుడిలోని దక్షిణ గోడపై వినాయకుడి బొమ్మ గీశాడు. గోడలపై ఆ బాలుడు గీసిన వినాయకుడి బొమ్మ పరిమాణం నానాటికీ పెరగసాగింది. చూస్తుండగానే కొద్దిరోజుల వ్యవ«ధిలోనే భారీ స్థాయికి పెరిగింది. ఆలయంలోనే ఆటలాడుకునే ఆ బాలుడు ‘బొడ్డ గణేశ‘ (పెద్ద గణపతి) అనేవాడు. నాటి నుంచి ఇది మహాగణపతి ఆలయంగా ప్రసిద్ధి పొందింది. మూడంతస్తులతో నిర్మించిన ఈ ఆలయ వాస్తు, శిల్పకళా కౌశలం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బయటి నుంచి చూస్తే ఏనుగు వీపు ఆకారంలో కనిపిస్తుంది. ఆలయం లోపలి భాగంలో కలపపై చెక్కిన రామాయణ దృశ్యాలు కనువిందు చేస్తాయి. మైసూరు రాజ్యాన్ని పరిపాలించిన టిప్పు సుల్తాను చాలా ఆలయాలపై దాడులు చేసినట్లుగానే ఈ ఆలయంపైనా దాడి చేయడానికి వచ్చాడట. ఆలయ ప్రాంగణంలోని బావినీళ్లు తాగిన తర్వాత మనసు మార్చుకుని ఆలయాన్ని ధ్వంసం చేయకుండానే వెనుదిరిగాడట. తన వెంట ఉన్న సేనలను తృప్తిపరచడానికి ఆలయంపై దాడి చేసినట్లుగా లాంఛనప్రాయంగా బయటి వైపు గోడపై కత్తితో వేటు వేసి, వెనుదిరిగాడట. టిప్పు సుల్తాన్ గోడపై వేసిన వేటు గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది. మయూరేశ్వర ఆలయం, మహారాష్ట్ర మూషిక వాహనుడైన వినాయకుడు నెమలి వాహనంపై కనిపించే అరుదైన ఆలయం ఇది. అందుకే ఇక్కడ వెలసిన వినాయకుడు మయూరేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడు. స్థానికులు ‘మోరేశ్వర్’ అని కూడా అంటారు. మయూరేశ్వరుడు వెలసినందున ఈ క్షేత్రానికి ‘మోర్గాంవ్’ అనే పేరు వచ్చింది. ఇది మహారాష్ట్రలోని పుణె జిల్లాలో ఉంది. గాణపత్య మతం ప్రాచుర్యంలో ఉన్న కాలంలో మోర్గాంవ్ ఆ మతానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని ఎవరు ఎప్పుడు నిర్మించారో తెలియదు. ఇందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేవు. మోరయ గోసావి అనే గాణపత్య సాధువు కారణంగా ఈ ఆలయం ప్రసిద్ధిలోకి వచ్చింది. ఆయన శిష్యులైన పీష్వా ప్రభువుల హయాంలో ఈ ఆలయం వైభవాన్ని సంతరించుకుంది. మహారాష్ట్రలో ప్రాచీన వినాయక క్షేత్రాలు ఎనిమిది ఉన్నాయి. వీటిని అష్ట వినాయక క్షేత్రాలని అంటారు. అష్ట వినాయక క్షేత్రాలకు తీర్థయాత్రగా వెళ్లేవారు మోర్గాంవ్‌లోని మయూరేశ్వరుడి దర్శనంతో యాత్రను ప్రారంభించడం ఆనవాయితీ. మయూరేశ్వరుడిని దర్శించుకోకుంటే, అష్టవినాయక యాత్ర పూర్తి కానట్లేనని అంటారు. ‘సింధు’ అనే రాక్షసుడిని చంపడానికి త్రేతాయుగంలో వినాయకుడు ఇక్కడ మయూరవాహనుడిగా షడ్భుజాలతో అవతరించాడని ‘గణేశ పురాణం’ చెబుతోంది. పీష్వాల కాలంలో ఈ ఆలయాన్ని దర్శించుకున్న సమర్థ రామదాసు ఆశువుగా ‘సుఖకర్తా దుఃఖహర్తా’ అనే కీర్తనను ఆలపించాడు. మయూరేశ్వరుడికి హారతి ఇచ్చేటప్పుడు ఈ గీతాన్ని ఆలపించడం అప్పటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. గణపతిపులే, మహారాష్ట్ర మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఉన్న ఆలయం ఇది. రత్నగిరి పట్టణానికి పాతిక కిలోమీటర్ల దూరంలో కొంకణతీరంలో ఉన్న గణపతిపులే గ్రామంలో లంబోదరుడు పడమటి కనుమల దిగువన స్వయంభువుగా వెలశాడు. మిగిలిన ఆలయాల్లోని దేవతామూర్తులు తూర్పుదిక్కుగా ఉంటే, ఇక్కడి వినాయకుడు మాత్రం పశ్చిమాభిముఖుడై కనిపిస్తాడు. పశ్చిమాభిముఖుడైన స్వామి పడమటి కనుమలకు నిరంతరం రక్షణ కల్పిస్తూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. గణపతిపులే గ్రామంలో స్వయంభువుగా వినాయకుడు ఆవిర్భవించడం వెనుక ఒక స్థలపురాణం ఉంది. గతంలో బలభిత్ భిడే అనే బ్రాహ్మణుడు గ్రామకరణంగా ఉండేవాడు. ఒకసారి అతను గడ్డు సమస్యల్లో చిక్కుకున్నాడు. సమస్యల నుంచి బయటపడటానికి గ్రామం వెలుపల ఉన్న మొగలివనంలో కూర్చుని తన ఇష్టదైవమైన వినాయకుని ధ్యానిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. నాయకుడు కరుణించి, అతనికి కలలో కనిపించి, ఇక్కడ తాను స్వయంభువుగా ఆవిర్భవిస్తానని, తనకు ఆలయం నిర్మిస్తే అన్ని సమస్యలూ తీరిపోతాయని చెప్పాడు. ఇది జరిగిన తర్వాత భిడేకు చెందిన పశువుల మందలోని ఆవులు పాలివ్వడం మానేశాయి. పశువులకు కాపలాగా వెళ్లే మహిళ వాటిని నిశితంగా గమనించగా, మొగలివనంలోని ఒక పుట్ట వద్ద ఆవులన్నీ పాలను ధారగా కార్చేస్తుండటం కనిపించింది. ఇదే విషయాన్ని భిడేకు చెప్పడంతో, మనుషులతో చేరుకుని పుట్టగా పేరుకుపోయిన మట్టిని తొలగించగా, వినాయకుని విగ్రహం కనిపించింది. దాంతో ఆయన ఇక్కడ చిన్న ఆలయం నిర్మించి, గణపతిని పూజించడం ప్రారంభించాడు. అయితే, ఇప్పుడున్న ఆలయాన్ని పీష్వా ప్రభువులు నిర్మంచారు. త్రినేత్ర గణేశ ఆలయం, రాజస్థాన్ త్రినేత్ర గణేశయ ఆలయంలో వినాయకుడు మూడు కన్నులతో భక్తులకు కనువిందు చేస్తాడు. రాజస్థాన్‌లోని రణ్‌థాంబోర్ కోటలో ఉన్న ఈ ఆలయంలోని వినాయకుడిని ‘ప్రథమ గణేశ’ అని కూడా అంటారు. దేశంలో ఇదే మొట్టమొదటి వినాయక ఆలయంగా భావిస్తారు. ఈ ఆలయంలో వెలసిన త్రినేత్ర గణేశ విగ్రహం దాదాపు ఆరున్నర వేల ఏళ్ల కిందటిదని అంచనా. రుక్మిణీ కృష్ణుల వివాహం జరిగినప్పుడు వారు తొలి ఆహ్వాన పత్రికను ఇక్కడి ప్రథమ గణేశునికే పంపారని స్థలపురాణ కథనం. ఇప్పుడు ఈ ఆలయం వెలసిన కోట రణ్‌థాంబోర్ జాతీయ పార్కు పరిధిలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని పదమూడో శతాబ్దిలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు హమీర్ నిర్మించినట్లు చెబుతారు. హమీర్ వినాయకుడికి పరమభక్తుడు. హమీర్ ఇక్కడ ఆలయం నిర్మించడం వెనుక కూడా ఒక గాథ ప్రచారంలో ఉంది. అప్పట్లో రణ్‌థాంబోర్ కోటపై అల్లాఉద్దీన్ ఖల్జీ దాడి చేశాడు. యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగింది. యుద్ధానికి సిద్ధపడి ముందుగా కోటలోని గోదాముల్లో నిల్వచేసిన తిండి గింజలు, ఇతర నిత్యావసరాలు నిండుకున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న రాజు తనను, తన రాజ్యాన్నీ, ప్రజలనూ కాపాడాలంటూ గణపతిని ప్రార్థించాడు. రాజు హమీర్‌కు గణపతి కలలో కనిపించాడు. ‘రేపటి నుంచి నీ సమస్యలన్నీ మటుమాయమైపోతాయి’ అని పలికాడు. మర్నాటికల్లా ఖిల్జీ సేనలు వెనక్కు మళ్లడంతో యుద్ధం ముగిసిపోయింది. గోదాముల్లో తిండి గింజలు వచ్చి చేరాయి. కోట గోడ నుంచి త్రినేత్ర గణపతి విగ్రహం ఆశ్చర్యకరంగా బయటపడింది. ఈ అద్భుత సంఘటనతో గణపతిపై రాజు హమీర్ భక్తివిశ్వాసాలు రెట్టింపయ్యాయి. గణపతిని వృద్ధి సిద్ధి సమేతంగా, గణపతి కొడకులైన శుభ లాభాల విగ్రహాలను, గణపతి వాహనమైన మూషిక విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో శుభకార్యాలు జరిపేటప్పుడు ఇక్కడి ప్రథమ గణపతికి తొలి ఆహ్వాన పత్రికలు పంపిస్తూ ఉంటారు. ప్రథమ గణపతికి తొలి ఆహ్వానం పంపితే, శుభకార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయని నమ్ముతారు. కర్పక వినాయక ఆలయం, తమిళనాడు వినాయకుని అరుదైన ఆలయాల్లో తమిళనాడులోని కర్పక వినాయక ఆలయం ఒకటి. శివగంగై జిల్లాలోని పిళ్లయ్యార్‌పట్టి గ్రామంలో ఉంది ఈ పురాతన ఆలయం. దీనిని స్థానికులు పిళ్లయ్యార్ ఆలయం అని కూడా అంటారు. ఇది గుహాలయం. గుహలో దేవతామూర్తుల పురాతన శిలా విగ్రహాలు కనిపిస్తాయి. ఈ ఆలయం గర్భగుడిలోని గుహలో కనిపించే పద్నాలుగు శిల్పాలు పదో శతాబ్ది నుంచి పదమూడో శతాబ్ది మధ్య కాలానికి చెందినవని అంటారు. పిళ్లయ్యార్‌పట్టి కొండల నడుమ గుహలో వెలసిన కందర్ప వినాయకునికి పాండ్య రాజులు ఆలయాన్ని నిర్మించారు. ఇందులోని మూలవిరాట్టుగా ఉన్న పిళ్లయ్యార్– కందర్ప వినాయకుడి విగ్రహం నాలుగో శతాబ్దికి చెందనదిగా చరిత్రకారుల అంచనా. మిగిలిన చోట్ల వినాయకుడి విగ్రహాలకు తొండం ఎడమ వైపు తిరిగి ఉంటే, ఇక్కడ మాత్రం కుడి వైపు తిరిగి ఉండటం విశేషం. ఈ ఆలయంలోని కాత్యాయనిని, పశుపతీశ్వరుడిని, నాగలింగాన్ని కూడా భక్తులు పూజిస్తారు. ప్రస్తుతం చెట్టియార్లలోని నాగరదర్ వంశీయులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆలయంలో ఏటా వినాయక నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. చింతామన్ గణపతి, మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్‌లోని పురాతన నగరమైన ఉజ్జయినిలో వెలసిన గణపతి ఆలయం ఇది. శైవక్షేత్రంగా, శక్తిపీఠంగా పేరుపొందిన ఉజ్జయినిలో వెలసిన ఈ గణపతి భక్తుల చింతలను తీర్చుతాడని, అందుకే ఇక్కడి గణపతిని చింతాహరణ గణపతి అని, చింతామణి గణపతి అని కూడా అంటారు. ఈ ఆలయంలోని గణపతి స్వయంభువుగా వెలిశాడు. వృద్ధి, సిద్ధి సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ వినాయకుడు స్వయంభువుగా ఎప్పుడు వెలశాడో తెలిపే కచ్చితమైన ఆధారాలేవీ లేవు. అయితే చరిత్రపూర్వయుగం నుంచే ఇక్కడ స్వయంభూ గణపతి వెలసి ఉండవచ్చని కొందరి అంచనా. మాల్వా రాజ్యాన్ని పాలించిన పరమార్ రాజులు పదకొండు–పన్నెండు శతాబ్దాల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఉజ్జయినిలోని మహాకాలేశ్వరుడిని, మహాకాళిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు మహాకాళేశ్వర ఆలయానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతామన్ గణపతి ఆలయాన్ని కూడా తప్పనిసరిగా దర్శించుకుంటారు. ఈ ఆలయంలో గణపతి ఎదుటనే మహావిష్ణువు విగ్రహం కూడా ఉంటుంది. విష్ణువుకు గల సహస్రనామాలలో ‘చింతామణి’ కూడా ఒకటి. అందువల్ల కూడా ఇక్కడ వెలసిన గణపతిని చింతామణి గణపతి అంటారని చెబుతారు. ఇక్కడకు వచ్చే భక్తులు గణపతితో పాటు విష్ణువుకు కూడా పూజలు చేసి వెళుతుంటారు. మహావినాయక ఆలయం, ఒడిశా ఐదుగురు దేవతలను ఏక దైవంగా పూజించే అరుదైన ఈ ఆలయం ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా చండిఖోల్‌లో ఉంది. శివుడు, విష్ణువు, దుర్గ, సూర్యుడు, వినాయకుడు– ఈ ఐదుగురినీ వినాయకుడి రూపంలోనే ఇక్కడ ఆరాధిస్తారు. ఇంకో విశేషమేమిటంటే, ఈ ఆలయంలో పవళింపు సేవ ఉండదు. సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ ఆలయాలను మూసివేసే ముందు పవళింపు సేవ చేస్తారు. ఐదుగురు దేవతలూ ఏకరూపంలో కొలువుదీరడం వల్లనే ఇక్కడ పవళింపు సేవ చేయరని చెబుతారు. ఐదుగురు దేవతల్లో శివ కేశవులు ఉండటం వల్ల ప్రసాదంలో బిల్వపత్రిని, తులసి ఆకులను రెండింటినీ ఉపయోగిస్తారు. అలాగే, ఈ ఆలయంలో అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. చండిఖోల్ పట్టణం రెండు కొండల నడుమ వెలసింది. మొదటి కొండ దిగువన చండీ ఆలయం, రెండో కొండ దిగువన మహావినాయక ఆలయం వెలశాయి. రెండు ఆలయాల వద్ద రెండు విశాలమైన తటాకాలు కనిపిస్తాయి. కళింగ రాజ్యాన్ని తొమ్మిదో శతాబ్ది నుంచి పన్నెండో శతాబ్ది వరకు పరిపాలించిన కేసరి వంశ రాజులు ఇక్కడి మహాగణపతి ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడి కొండలను వరుణుడి కొండలు అంటారు. ధర్మరాజు వరుణుడి కొండల ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని కొంతకాలం పాలించాడనే కథనాన్ని కూడా స్థానికులు చెబుతుంటారు. ఇక్కడి ధర్మరాజు కోటను ‘తెలిగఢ్’కోట అంటారు. మహా వినాయకుడి ఆలయానికి చేరువలో కనిపించే కోట శిథిలాలు ధర్మరాజుకి చెందినవేనని చెబుతారు. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు విజయం సాధించిన తర్వాత కుంతీదేవి ఈ కోట నుంచే బంగారు సంపెంగను శివునికి కానుకగా సమర్పించిందని చెబుతారు. -
ఆరోగ్యంతో ఆడుకోకండి.. ఆరోగ్యం కోసం ఆడండి
ఆధునికత పెరిగిన తర్వాత జనాలు ఆటలకు దూరమవుతున్నారు. ఆటలాడే వయసులోని పిల్లలను మోయలేని చదువుల భారం కుంగదీస్తోంది. క్రీడా మైదానాలు లేని ఇరుకిరుకు పాఠశాలల్లో చదువుకునే పిల్లలు ఆటలకు దూరమవుతున్నారు. దీనివల్ల కొందరు బాల్యంలోనే స్థూలకాయం బారిన పడుతున్నారు. ఇంకొందరు రోగనిరోధక శక్తి నశించి, తరచు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆటలు ఆడే వారికన్నా టీవీల్లో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లు, టెన్నిస్ మ్యాచ్‌లు, ఫుట్‌బాల్ మ్యాచ్‌లు చూసే జనాలే ఎక్కువవుతున్నారు. ఆటలు ఆడితేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది గాని, కుదిరితే స్టేడియంలో, కుదరకుంటే ఇంట్లోనే టీవీల్లో క్రీడల మ్యాచ్‌లు చూసినంత మాత్రాన ఆరోగ్యానికి ఒరిగేదేమీ ఉండదు. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడల గురించి ఒక సింహావలోకనం... ఆటలాడటం మనుషుల సహజ లక్షణం. పాకే వయసు నుంచే పిల్లలు ఆటల వైపు మొగ్గు చూపుతారు. బుడి బుడి అడుగులు వేసే వయసులో చేతికందిన వస్తువులతో తోచిన రీతిలో ఆటలాడతారు. ఆ వయసులోనే వారికి ప్రమాదాలకు తావులేని ఆటబొమ్మలను ఇవ్వాలి. సమవయస్కులైన పిల్లలు కూడా జత చేరితే పిల్లలు మరింత ఉత్సాహంగా ఆటలాడతారు. కాస్త ఊహ తెలిసిన వయసు వచ్చాక వీధుల్లోకి వెళ్లి ఆరుబయట స్నేహితులతో ఆటలాడేందుకు ఇష్టపడతారు. ఆటల వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది. ఆటల్లోని సహజ వ్యాయామం వల్ల శరీరం తీరుగా ఎదుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. తోటి పిల్లలతో ఆడుకోవడం వల్ల సామాజిక నైపుణ్యాలు పెరుగుతాయి. బృందంతో కలసి పనిచేయడం, బృందానికి నాయకత్వం వహించడం, బృందం గెలుపు కోసం కృషి చేయడం వంటి లక్షణాలు పిల్లల్లో సహజసిద్ధంగానే పరిణతిని పెంచుతాయి. చరిత్రపూర్వయుగం నుంచే ఆటలు... చరిత్రపూర్వయుగంలోని ఆదిమానవులు సైతం ఆటలాడేవారు. పాతరాతి యుగంలోనే అప్పటి మానవులు ఆటలాడేవారు. నాటి మానవులు ఆటలాడిన ఆనవాళ్లు ఫ్రాన్స్‌లోని లాస్కాక్స్ గుహల్లో లభించాయి. ఆ గుహల్లోని రాతి గోడలపై అప్పటి మనుషులు పరుగు పందేల్లో పాల్గొంటున్నట్లుగా, కుస్తీలు పడుతున్నట్లుగా ఉన్న చిత్రాలు ఆదిమానవుల క్రీడాస్ఫూర్తికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి. రాతిగోడలపై ఉన్న ఆ చిత్రాలు కనీసం 15,800 ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కొత్తరాతి యుగం నాటికి మనుషులు మరిన్ని కొత్త క్రీడలను కనిపెట్టారు. ఈతకొట్టడం, ధనుర్బాణాలను తయారు చేసి, గురితప్పకుండా బాణాలను కొట్టడం వంటి క్రీడలకు సంబంధించిన గుహా చిత్రాలు జపాన్‌లో లభించాయి. అవి పదివేల ఏళ్ల కిందటివని శాస్త్రవేత్తల అంచనా. మానవుల మేధస్సు వికసించి, నెమ్మదిగా నాగరికతలు ఏర్పడిన కాలంలో మరికొన్ని క్రీడలను మనుషులు కనుగొన్నారు. ప్రాచీన సుమేరియన్, ఈజిప్టు, గ్రీకు, రోమన్, సింధులోయ నాగరికతల కాలంలో మనుషులు ఉత్సాహభరితంగా క్రీడా వినోదాన్ని ఆస్వాదించినట్లుగా అనేక ఆనవాళ్లు దొరికాయి. నాగరికతల వికాసంలో క్రీడలు సుమేరియన్ల కాలంలో కుస్తీలు, బాక్సింగ్, గాలాలతో చేపలు పట్టడం వంటి క్రీడలు ఉండేవి. ఈజిప్టు నాగరికత కాలంలో కుస్తీలు, బాక్సింగ్, చేపలు పట్టడం, లాంగ్ జంప్, ఈత, విలువిద్య వంటి క్రీడలు ఉండేవి. గ్రీకు నాగరికత కాలంలో కుస్తీలు, బాక్సింగ్, విలువిద్యలతో పాటు బల్లేలు విసరడం, బరువైన చక్రాలు విసరడం, రథాల పందేలు వంటి క్రీడలు ఉండేవి. ప్రాచీన నాగరికతలు వికసించిన తొలినాళ్లలో ప్రపంచంలో పలుచోట్ల రకరకాల క్రీడలు అభివృద్ధి చెందాయి. ప్రాచీన రోమ్, మెసొపొటేమియా, చైనా, ఐర్లాండ్, స్కాట్లాండ్ తదితర ప్రాంతాల్లో క్రీడలు ఉండేవి. ప్రాచీన నాగరికతల్లో నాటి మనుషులు ఆడిన క్రీడల్లో కొన్ని నేటికీ ఉనికిలో ఉన్నాయి. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలోని ఒలింపియా పట్టణంలో క్రీస్తుపూర్వం 776లోనే తొలిసారిగా ఒలింపిక్స్ క్రీడల పోటీలు మొదలయ్యాయి. ఒలింపిక్స్ క్రీడల పోటీలు ప్రారంభమైన కొన్నాళ్లకు ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఇస్త్మియాన్, నెమియాన్, పైథియాన్ క్రీడల పోటీలు కూడా జరిగేవి. ఒలింపిక్స్ క్రీడల పోటీలు నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. పైథియాన్ క్రీడల పోటీలు కూడా నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. ఒలింపిక్స్ జరిగిన రెండేళ్లకు పైథియాన్ క్రీడల పోటీలు జరిగేవి. ఇస్త్మియాన్, నెమియాన్ పోటీలు రెండేళ్లకు ఒకసారి జరిగేవి. ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో ఈ నాలుగు క్రీడల పోటీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఉండేవి. మధ్యయుగాల నాటికి మరిన్ని క్రీడలు కొత్తగా వచ్చి చేరాయి. గుర్రపు పందేలు, ఫుట్‌బాల్ తరహా క్రీడలు మధ్యయుగాల నాటివే. ప్రాచీన భారతదేశంలో క్రీడలు ప్రాచీన భారతదేశంలోనూ క్రీడలు ఉండేవి. వేదకాలంలోనే భారత భూభాగంలో జనాలు క్రీడలు ఆడేవారనేందుకు ఆధారాలు ఉన్నాయి. ‘‘కర్తవ్యం నా కుడి చెయ్యి... విజయఫలం నా ఎడమచెయ్యి’’ అనే అర్థంతో కూడిన అధర్వణవేద మంత్రం నాటి భారతీయుల క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుంది. కుస్తీ (మల్లయుద్ధం), బాక్సింగ్ (ముష్టియుద్ధం) వంటి క్రీడలు పురాణకాలంలోనే ఉండేవి. రామాయణ, మహాభారతాల్లో ఈ యుద్ధక్రీడల ప్రస్తావన కనిపిస్తుంది. కంసుడి ఆస్థానంలోని చాణూర ముష్టికులనే మల్లయోధులను కృష్ణబలరాములు మట్టి కరిపించిన పురాణగాథ అందరికీ తెలిసినదే. రథాల పోటీలు, గుర్రపు స్వారీ పోటీలు, విలువిద్య, ఈత, పోలో వంటి క్రీడలతో పాటు మల్లయుద్ధం, ముష్టియుద్ధం, బరువులను ఎత్తడం (వెయిట్ లిఫ్టింగ్), కత్తియుద్ధం (ఫెన్సింగ్), గదాయుద్ధం, బల్లేలను గురిచూసి విసరడం (జావెలిన్ త్రో), కరాటేకు మూలంగా భావిస్తున్న కలరి వంటి యుద్ధ క్రీడలకు కూడా ప్రాచీన భారతదేశంలో విశేష ఆదరణ ఉండేది. బౌద్ధం ద్వారా కలరి యుద్ధక్రీడ క్రీస్తుశకం ఐదో శతాబ్దినాటికి చైనా, జపాన్ వంటి తూర్పుదేశాలకు వ్యాపించి, తర్వాతి కాలంలో ఆధునిక కరాటేగా రూపుదిద్దుకుందని కొందరు క్రీడాచరిత్రకారులు అభిప్రాయపడతారు. బౌద్ధాన్ని బోధించిన గౌతమబుద్ధుడు స్వయంగా మేటి విలుకాడు. ఆయనకు సుత్తి వంటి బరువైన వస్తువులను దూరంగా విసరడంలోనూ నైపుణ్యం ఉండేది. నేటికీ వీధుల్లో పిల్లలు ఆడుకునే గిల్లీదండా, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు ప్రాచీనకాలం నాటివే. మనసును ఏకాగ్రంగా ఉంచుకోవడానికి, శరీరాన్ని దృఢంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రాచీన భారతీయులు క్రీడలకు విశేషమైన ప్రాధాన్యం ఇచ్చేవారు. సింధులోయ నాగరికత నాటి ప్రజలు బల్లెం, ధనుర్బాణాలు, గద, చక్రం, కత్తి, బాకు, గొడ్డలి వంటి ఆయుధాలను ఉపయోగించేవారు. వాటితో యుద్ధక్రీడలూ ఆడేవారు. ప్రాచీన భారతదేశాన్ని సందర్శించిన హ్యుయాన్ త్సాంగ్, పాహియాన్‌లు తమ రచనల్లో నాటి భారతీయులు ఆడుకునే రకరకాల క్రీడలను గురించి వివరించారు. నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు పరుగు పందేలు, కుస్తీ పోటీలు, బంతులతో ఆడే రకరకాల ఆటలు, ఈత, బరువులెత్తడం వంటి క్రీడలతో ఉల్లాసం పొందేవారని వారు రాశారు. పన్నెండో శతాబ్దికి చెందిన సోమేశ్వరుడు తన ‘మనోల్లాస’ గ్రంథంలో భారశ్రమ (వెయిట్‌లిఫ్టింగ్), భ్రమణశ్రమ (పరుగు), మల్లస్తంభ (రెజ్లింగ్), ధనుర్వినోద (విలువిద్య) సహా నాటి జనాలు ఆడుకునే రకరకాల క్రీడలను విపులంగా వివరించాడు. క్రీస్తుశకం పదహారో శతాబ్దిలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించుకున్న పోర్చుగీసు రాయబారి డోమింగో పేస్ ఇక్కడి క్రీడలను చూసి ఆశ్చర్యపోయాడు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా మల్లయోధుడని, గుర్రపుస్వారీలోను, కత్తియుద్ధంలోను ఆయనకు అద్భుతమైన నైపుణ్యం ఉండేదని డోమింగో పేస్ తన రచనల్లో రాశారు. మొఘల్ చక్రవర్తుల హయాంలో కూడా భారతదేశంలో క్రీడలకు విశేషమైన ఆదరణ ఉండేది. ఆగ్రా కోట, ఢిల్లీలోని ఎర్రకోట మొఘల్‌ల హయాంలో క్రీడాపోటీలకు ప్రధాన వేదికలుగా ఉండేవి. ఛత్రపతి శివాజీ మహారాష్ట్రలో విరివిగా హనుమాన్ ఆలయాలను స్థాపించి, ఆ ఆలయాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన క్రీడా వ్యాయామశాలల ద్వారా యువకులను క్రీడల వైపు, వ్యాయామం వైపు ప్రోత్సహించాడు. స్వాతంత్య్రపూర్వం నాటి ప్రముఖుల్లో స్వామి వివేకానంద ఆధ్యాత్మికవేత్త మాత్రమే కాదు, గొప్ప క్రీడాకారుడు, క్రీడాభిమాని కూడా. ఆయనకు ఫుట్‌బాల్, ఫెన్సింగ్, బాక్సింగ్, ఈత, మల్లయుద్ధం వంటి క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. ఒకసారి వివేకానంద ‘భగవద్గీత చదవడం కంటే ఫుట్‌బాల్ ఆడటం ద్వారా స్వర్గానికి త్వరగా చేరువకాగలం’ అని చెప్పిన మాటలు ఆయన క్రీడాభినివేశానికి అద్దం పడతాయి. బ్రిటిష్‌కాలంలో ఆధునిక క్రీడలు బ్రిటిష్‌కాలంలో భారతదేశంలోకి ఆధునిక పాశ్చాత్య క్రీడలు అడుగుపెట్టాయి. బ్రిటిష్‌వారు భారత్‌కు వచ్చేనాటికి ఇక్కడ బాగా ఆదరణ పొందిన క్రీడలను వారు కూడా నేర్చుకున్నారు. బ్రిటిష్‌వారు ఇక్కడకు వచ్చేనాటికి పుణే ప్రాంతంలో ‘పూనా’ అనే ఆట ఆడేవారు. బ్రిటిషర్లు దీనికే కొద్దిపాటి మార్పులు చేసి, ఆధునిక బ్యాడ్మింటన్‌గా ప్రపంచానికి పరిచయం చేశారు. భారతదేశంలో ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడ క్రికెట్. బ్రిటిష్ నావికులు 1721లో కాంబే తీరంలో ఆడటం ద్వారా క్రికెట్‌ను భారతీయులకు పరిచయం చేశారు. స్వాతంత్య్రానికి పూర్వకాలంలో నాటి సంపన్నులు క్రికెట్ ఆడటానికి ఇష్టపడేవారు. పోలో ఆటను అంతకుముందు రకరకాలుగా ఆడేవారు. గుర్రాలపైనే కాకుండా, ఏనుగుల పైనుంచి కూడా ఆడేవారు. అయితే, ఇప్పటి నిబంధనలతో ఆధునిక పోలో క్రీడ పంతొమ్మిదో శతాబ్దిలో మణిపూర్‌లో రూపుదిద్దుకుంది. తర్వాత ఇది యూరోప్, ఉత్తర అమెరికాలకు వ్యాపించింది. భారత్‌లో తొలి ఫుట్‌బాల్ క్లబ్ 1889లో ప్రారంభమైంది. అప్పట్లో భారతీయులు ఈ క్రీడలో కొంత వెనుకబడి ఉండేవారు. దీనిపై బ్రిటిషర్లు వ్యంగ్యాస్త్రాలు సంధించేవారు. దీనిని సవాలుగా తీసుకున్న బెంగాలీ యువత పట్టుదలతో సాధన చేసి, 1911లో బ్రిటిష్ జట్టుతో తలపడినప్పుడు ఫైనల్స్‌లో ఇండియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్‌నే గెలుపు వరించింది. భారత క్రీడాకారులు 1920 నుంచి ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనడం మొదలైంది. నాటి నుంచి నేటి వరకు ఒలింపిక్స్‌లో భారత్ 28 పతకాలను దక్కించుకోగలిగింది. 1928–1980 మధ్యకాలంలో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత్ తొమ్మిది బంగారు పతకాలను దక్కించుకోగా, వాటిలో ఎనిమిది పతకాలు మన హాకీ జట్టు గెలుచుకున్నవే కావడం విశేషం. హాకీని మన జాతీయ క్రీడగా చాలామంది పొరబడతారు గాని, భారత్ ఇంతవరకు ఏ క్రీడనూ జాతీయక్రీడగా ప్రకటించలేదు. ఈ సంగతిని సాక్షాత్తు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ స్వయంగా స్పష్టం చేసింది. అయితే, హాకీ వల్లనే ఒలింపిక్స్‌లో భారత్ అత్యధిక బంగారు పతకాలు సాధించిందన్నది మాత్రం వాస్తవం. 1928, 1932, 1936 సంవత్సరాల్లో జరిగిన ఒలింపిక్స్ పోటీల్లో భారత హాకీ జట్టకు సారథ్యం వహించి, పతకాల పంట పండించిన నాటి మన హాకీజట్టు కెప్టెన్ ధ్యాన్‌చంద్ గౌరవార్ధంగానే ఆయన పుట్టిన రోజును ప్రభుత్వం జాతీయ క్రీడా దినోత్సవంగా ప్రకటించింది. 1928 నాటి ఒలింపిక్స్ పోటీల్లో ధ్యాన్‌చంద్ నేతృత్వంలోని భారత జట్టు ఏకంగా 178 గోల్స్ సాధించి ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఆ పోటీల్లో మరే జట్టు కూడా భారత జట్టుకు దరిదాపుల్లో నిలవలేకపోయాయి. దాదాపు ఆరు దశాబ్దాల పాటు భారత హాకీ జట్టు అంతర్జాతీయ పోటీల్లో ఇదే దూకుడును కొనసాగించింది. కాలక్రమేణా క్రికెట్‌కు జనాదరణ పెరగడంతో హాకీకి ప్రోత్సాహం కరువైంది. భారత హాకీ జట్టు 1980లో చివరిసారిగా ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించింది. అది జరిగిన మూడేళ్లకు 1983లో కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచకప్ గెలుచుకుంది. ఇక అప్పటి నుంచి దేశంలో క్రికెట్‌కు విపరీతంగా జనాదరణ పెరిగింది. అంతకుముందు సంపన్నవర్గాలకే పరిమితమైన క్రికెట్ గల్లీలకు వ్యాపించింది. దేశంలోని ఏ క్రీడాకారుడికీ దక్కని గౌరవం ‘భారతరత్న’ అవార్డు క్రికెట్ క్రీడాకారుడైన సచిన్ టెండూల్కర్‌కు దక్కింది. భారత క్రీడాకారులు పరుగుపందేలు, బ్యాడ్మింటన్, విలువిద్య వంటి క్రీడల్లో సైతం అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నప్పటికీ, క్రికెటర్లకు దక్కుతున్న ప్రోత్సాహం, ఆదరణ మిగిలిన క్రీడాకారులకు దక్కడంలేదు. క్రీడల గురించి కొన్ని విశేషాలు ► మనకైతే జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదుగాని, మన పొరుగు దేశమైన భూటాన్ విలువిద్యను జాతీయక్రీడగా గుర్తించి, ఆ క్రీడను ప్రోత్సహిస్తోంది. ► క్రీడారంగంలో అతి తేలికపాటి, గౌరవనీయమైన పదవి ఒకటి ఉంది. గాలిపటాల క్రీడ (కైట్ సర్ఫింగ్) కోసం సృష్టించిన ఈ పదవిలో ఉన్న వ్యక్తి చేయాల్సిన పనల్లా గాలిపటాలు ఎగరవేయడానికి గాలి అనుకూలంగా ఉందో లేదో చెప్పడమే. ఈ పదవిలో ఉన్న వ్యక్తిని ‘విండ్ డమ్మీ’ అంటారు. ‘గినీపిగ్’ అని కూడా ముద్దుగా పిలుస్తారు. ► సాధారణంగా క్రీడల్లో మహిళలు, పురుషులు ఒకే జట్టులో సమాన సంఖ్యలో ఉండటం కనిపించదు. ‘కోర్ఫ్‌బాల్’ క్రీడలో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నం. ‘కోర్ఫ్‌బాల్’ జట్టులో ఎనిమిది మంది క్రీడాకారులు ఉంటారు. తప్పనిసరిగా సమాన సంఖ్యలో పురుషులు, మహిళలతో కలిసిన జట్టును ఏర్పాటు చేయడమే ‘కోర్ఫ్‌బాల్’ ప్రత్యేకత. ► టెన్నిస్‌లో ఒకప్పుడు కోర్టు బ్యాక్‌గ్రౌండ్‌ను బట్టి తెలుపు లేదా నలుపు రంగు బంతులను మాత్రమే వాడారు. అయితే, ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) 1972లో తొలిసారిగా పసుపు రంగు బంతులను ప్రవేశపెట్టింది. కలర్ టీవీ తెరలపై కొట్టొచ్చినట్టు కనిపించాలనే ఉద్దేశంతోనే ఐటీఎఫ్ నిపుణులు పసుపు రంగును ఎంపిక చేసుకున్నారు. ► కండలను పెంచుకోవడానికి చాలామంది జిమ్‌లకు వెళుతుంటారు గాని, చాలామందికి వాటి చరిత్ర తెలీదు. తొలిసారిగా ప్రాచీన గ్రీకు సామ్రాజ్యంలో క్రీస్తుపూర్వం తొమ్మిదో శతాబ్దిలో జిమ్నాసియమ్లు ఏర్పాటయ్యాయి. వాటిలో వ్యాయామం కోసం వెళ్లేవారు దుస్తులన్నీ తీసేసి పూర్తి నగ్నంగా వ్యాయామాలు చేసేవారు. ఒకవైపు వ్యాయామాలు కొనసాగుతుంటే మరోవైపు ఒక బృందం వాద్యసంగీతం వినిపించేది. ► ‘స్పోర్ట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్’గా రెండుసార్లు ‘టైమ్స్’ మ్యాగజైన్ కవర్పైకెక్కిన ఘనత దక్కించుకున్న ఏకైక క్రీడాకారుడు గోల్ఫ్ క్రీడాకారుడైన టైగర్ వుడ్స్. ‘టైమ్స్’ మ్యాగజైన్ 2000 ఆగస్టు సంచికలో ఒకసారి, ఈ ఏడాది ఆగస్టు సంచికలో ఒకసారి కవర్ పేజీకెక్కాడాయన. క్రీడల్లో మనది ఇంకా కొంత వెనుకబాటే... క్రీడారంగంలో భారత్ ఇంకా కొంత వెనుకబాటలోనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రీడల్లో అగ్రగాములుగా నిలుస్తున్న దేశాల జాబితాలో భారత్ ఇంకా తొలి పదిస్థానాల్లో చోటు పొందలేదు. నాలుగేళ్లకు ఒకసారి వెలువడే ఈ జాబితా గత ఏడాది విడుదలైంది. ఇందులో భారత్ కేవలం 37వ స్థానంలో నిలిచింది. క్రీడల్లో టాప్–10 దేశాలు ఇవే... 1. అమెరికా 2. ఫ్రాన్స్ 3. యునైటెడ్ కింగ్డమ్ 4. స్పెయిన్ 5. ఆస్ట్రేలియా 6. జర్మనీ 7. రష్యా 8. బ్రెజిల్ 9. జపాన్ 10. కెనడా క్రీడలతోనే ఆరోగ్యం క్రీడలతోనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది. చిన్నారులు ఆడుకునేటప్పుడు వారిని ఆటల నుంచి నివారించడం చాలామంది పెద్దలు చేసే పొరపాటు. ఆటల వల్ల పిల్లలు చదువులను నిర్లక్ష్యం చేస్తారని, ఆటల వల్ల పిల్లలు దుందుడుకుగా మారిపోతారని చాలామంది పెద్దలు అనుకుంటూ ఉంటారు. అవన్నీ అపోహలు మాత్రమే. నిజానికి ఆటల వల్లనే పిల్లలు మరింత చురుకుగా తయారవుతారు. కాసేపు ఆటలాడుకుని, విశ్రాంతి తీసుకున్న తర్వాత చదువుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించగలుగుతారు. తోటిపిల్లలతో కలసి ఆడుకోవడం వల్ల నలుగురితో ఎలా మెసలుకోవాలో తెలుసుకోగలుగుతారు. సామాజిక నైపుణ్యాలను మెరుగుపరచుకోగలుగుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా శారీరకంగా దృఢంగా ఎదుగుతారు. క్రీడల వల్ల ఆరోగ్యానికి దీర్ఘకాలిక ప్రయోజనాలు కలుగుతాయి. క్రీడల వల్ల ముఖ్యంగా కలిగే ప్రయోజనాలేమిటంటే... స్థూలకాయం రాదు తరచు క్రీడలు ఆడటం వల్ల స్థూలకాయం రాదు. ఒంట్లోని కొవ్వు కరిగి శరీరం తీరుగా తయారవుతుంది. చురుకుదనం పుంజుకుంటుంది. కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. చిన్నప్పుడు బాగా ఆటలాడేవారు పెద్దయిన తర్వాత కూడా చురుకుగా ఉంటారు. స్థూలకాయం వల్ల వచ్చే డయాబెటిస్, హైబీపీ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారు. మానసిక ఆరోగ్యం క్రీడలు శరీరానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా దోహదపడతాయి. ఆందోళన, దిగులు, కుంగుబాటు వంటి మానసిక సమస్యలను అధిగమించడానికి వ్యాయామం, క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణులు చెబుతుండటం విశేషం. క్రీడల వల్ల ఏకాగ్రత, మానసిక సంయమనం, ప్రతికూల పరిస్థితులను స్థిమితంగా ఎదుర్కోగల శక్తి ఏర్పడతాయని పలు అంతర్జాతీయ అధ్యయనాలు తేల్చాయి. గుండెకు ఆరోగ్యం క్రీడలు ఆడేవారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. క్రీడల వల్ల గుండె ఆరోగ్యంగా, శక్తిమంతంగా ఉంటుంది. క్రీడలు గుండె కండరాల దారుఢ్యానికి దోహదపడతాయి. క్రీడల వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు గుండె నుంచి సక్రమంగా రక్త సరఫరా జరుగుతుంది. క్రీడాకారుల్లో గుండెపోటు మరణాలు సంభవించే అవకాశాలు చాలా అరుదు. అదుపులో రక్తపోటు క్రీడలు ఆడటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. కేవలం ఆహార నియమాలను పాటించడం వల్ల రక్తపోటును నియంత్రించడం దుస్సాధ్యం. ఆహార నియమాలతో పాటు వ్యాయామం, క్రీడల్లో పాల్గొనడం వల్ల రక్తపోటు పెరగకుండా చూసుకోవచ్చని బ్రిటన్‌కు చెందిన నేషనల్ హెల్త్ సర్వీస్ నిపుణులు సూచిస్తున్నారు. క్రీడల వల్ల రక్తపోటును అదుపులో ఉండటమే కాకుండా, పక్షవాతం వంటి జబ్బులు రాకుండా ఉంటాయని వారు చెబుతున్నారు. మెరుగైన రక్తసరఫరా క్రీడల వల్ల శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు సక్రమంగా రక్తం సరఫరా అవుతుంది. ఫలితంగా శరీరంలోని ప్రతి జీవకణానికీ తగినంతగా ఆక్సిజన్ అందుతుంది. కండరాలు, ఎముకలు దృఢంగా తయారవుతాయి. క్రీడలు ఆడేవారికి వెన్నునొప్పి, కీళ్లనొప్పుల వంటి ఇబ్బందులు బాధించే అవకాశాలు తక్కువ. ఈ కారణం వల్లనే క్రీడలు ఆడేవారిలో చాలాకాలం వరకు కండరాలు పట్టు సడలకుండా బిగువుగా ఉండటంతో పాటు వార్ధక్య లక్షణాలు త్వరగా కనిపించకుండా ఉంటాయి. మెరుగైన రోగనిరోధక శక్తి క్రీడలు ఆడేవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా మెరుగుపడుతుంది. ఫలితంగా రుతువులు మారినప్పుడల్లా వచ్చే జలుబు, దగ్గు, చిన్నా చితకా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. క్రీడల్లో పాల్గొనే వారికి బాగా చెమట పట్టి, శరీరంలోని మాలిన్యాలు త్వరగా బయటకు పోతాయి. వేగంగా పరుగులు తీయడం, ఆటలాడటం వల్ల శరీరం ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి, త్వరగా బ్యాక్టీరియా సోకకుండా ఉంటుంది. సానుకూల దృక్పథం క్రీడలు సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయి. దీనివల్ల జీవితంలోని ఒడిదుడుకులను తట్టుకునే శక్తి ఏర్పడుతుంది. బృందంతో కలసి పనిచేయడం, లక్ష్యాలను నిర్దేశించుకుని, ఒకరకమైన స్పష్టతతో లక్ష్య సాధన దిశగా ముందుకు సాగడం, క్రమశిక్షణ వంటి సానుకూల లక్షణాలు క్రీడల వల్ల అలవడతాయని ‘జర్నల్ ఆఫ్ స్పోర్ట్ అండ్ హెల్త్ సైన్స్’ ఒక పరిశోధనాత్మక వ్యాసంలో తెలిపింది. – పన్యాల జగన్నాథదాసు -
రారా కృష్ణయ్య..!
బృందావనమది అందరిదీ అవునో కాదోగాని, గోవిందుడు అందరివాడు. శ్రీమహావిష్ణువు ఎనిమిదో అవతారం శ్రీకృష్ణావతారం. శ్రీమద్భాగవత పురాణంలో, మహాభారతంలో శ్రీకృష్ణుడి గురించిన విపులమైన గాథలు ఉన్నాయి. బాలకృష్ణుడిగా చేసిన చిలిపిచేష్టలు, ఆ చిన్నారి వయసులోనే తనను చంపడానికి మేనమామ కంసుడు పంపిన పూతన, శకటాసుర, ధేనుకాసురాది రాక్షసుల హననం, చివరకు తనను చంపదలచిన మేనమామ కంసుడినే వధించడం శ్రీకృష్ణుడి అవతార మహిమకు నిదర్శనాలుగా చెప్పుకుంటారు. మన్ను తిన్నావెందుకని నిలదీసిన తల్లి యశోదకు తన నోట చతుర్దశ భువనభాండాలను చూపిన బాలకృష్ణుడు తనను తాను సర్వంతర్యామిగా ఆనాడే ప్రకటించుకున్నాడు.యవ్వనారంభంలో రాధా మనోహరుడిగా, గోపికా మానస చోరుడిగా చేసిన రాసలీలలు, అష్టమహిషుల ప్రభువుగా అలరారిన శ్రీకృష్ణుడు మహాభారతంలో పాండవ పక్షపాతిగా, అర్జునుని సారథిగా, యుద్ధానికి వెనుకంజ వేసిన అర్జునుడికి గీతబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. గోపాలుడైన గోవిందుడు ఆబాల గోపాలాన్నీ ఆకట్టుకున్నవాడు. అందుకే గోవిందుడు అందరివాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 24) సందర్భంగా ఈ ప్రత్యేక కథనం... నల్లనివాడు పద్మనయనంబులవాడు గృపారసంబు పై జల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా జిల్లెడు మోమువా డొకడు చెల్వల మానధనంబు దెచ్చె నో! మల్లియలార! మీ పొదలమాటున లేడు గదమ్మ! చెప్పరే! శ్రీకృష్ణుని రూపురేఖల గురించి శ్రీమద్భాగవతంలో పోతనామాత్యుడు చేసిన వర్ణన ఇది. నల్లనివాడు కావడం వల్లనే అతడికి కృష్ణుడనే పేరు వచ్చింది. కృష్ణుడు ఉత్త నల్లనివాడేనా? చాలా అల్లరివాడు కూడా. బాల్యావస్థలో చిన్నికృష్ణుని అల్లరి చేష్టలను కూడా పోతనామాత్యుడు కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. చిన్నప్పుడు అల్లరి చేష్టలతో పెరిగిన కృష్ణుడే మహాభారతంలో రాజనీతి చతురుడైన పార్థసారథిగా, లోకానికి గంభీరంగా కర్తవ్యబోధ చేసిన గీతాచార్యుడిగా కనిపిస్తాడు. అల్లరి కృష్ణుడిగానే అవతార మహిమలు అల్లరి కృష్ణుడిగా పేరుమోసిన చిన్నారి వయసులోనే శ్రీకృష్ణుడు తన అవతార మహిమలను ప్రదర్శించాడు. ద్వాపరయుగంలో లోకంలో అధర్మం ప్రబలింది. బ్రహ్మాది దేవతల ప్రార్థన మేరకు ధర్మపరిరక్షణ కోసం శ్రీమహావిష్ణువు భూమ్మీద అవతరించదలచాడు. దేవకీ వసుదేవులకు జన్మించదలచాడు. అప్పుడు యాదవ క్షత్రియుడైన శూరసేన మహారాజు మధురా నగరాన్ని పరిపాలించేవాడు. ఆయన కుమారుడే వసుదేవుడు. ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకితో వసుదేవునికి వివాహం జరిపిస్తారు. వివాహం తర్వాత చెల్లెలిని అత్తవారింట దిగవిడచడానికి కంసుడు స్వయంగా రథాన్ని నడుపుతాడు. రథం మార్గమధ్యంలో ఉండగానే ‘నీ చెల్లెలికి పుట్టబోయే ఎనిమిదో కుమారుడు నిన్ను సంహరిస్తాడు’ అని అశరీరవాణి పలకడంతో ఆగ్రహోదగ్రుడైన కంసుడు చెల్లెలు దేవకిని, బావ వసుదేవుడిని చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో దేవకికి పుట్టిన ఆరుగురు బిడ్డలను నిర్దాక్షిణ్యంగా తన కత్తికి బలిచేస్తాడు. దేవకి ఏడోగర్భంలో ఉండగా విష్ణువు తన మాయతో ఆ పిండాన్ని నందుడి భార్య అయిన రోహిణి గర్భంలో ప్రవేశపెడతాడు. రోహిణికి కొడుకుగా బలరాముడు పుడతాడు. దేవకికి చెరసాలలోనే గర్భస్రావం అయి ఉంటుందని కంసుడు సరిపెట్టుకుంటాడు. కొన్నాళ్లకు దేవకి ఎనిమిదోసారి గర్భందాలుస్తుంది. శ్రావణ బహుళ అష్టమినాడు రోహిణీ నక్షత్రంలో అర్ధరాత్రివేళ శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడిని పొత్తిళ్లలో పట్టుకుని వసుదేవుడు చెరసాల దాటి బయలుదేరుతాడు. దారిలో ఉన్న యమునా నది రెండుగా చీలి అతనికి దారి ఇవ్వడంతో నందుని ఇంటికి చేరుకుంటాడు వసుదేవుడు. నందుని మరో భార్య యశోద పక్కనున్న శిశువును తీసుకుని, ఆమె పక్కన కృష్ణుడిని విడిచిపెట్టి, తిరిగి చెరసాలకు చేరుకుంటాడు. ఉదయాన్నే దేవకి శిశువును ప్రసవించిందన్న వార్త విన్న కంసుడు బిడ్డను చంపడానికి చెరసాలకు వెళతాడు. పుట్టినది కొడుకు కాదు, ఆడశిశువు అంటూ దేవకీ వసుదేవులు వారిస్తున్నా, కంసుడు ఆ శిశువును లాక్కును నేలకేసి కొట్టబోతాడు. శిశువు యోగమాయగా పైకెగసి, ‘నిన్ను చంపేవాడు వేరేచోట పెరుగుతున్నాడు’ అని చెప్పి మాయమవుతుంది. దేవకీ వసుదేవులను కంసుడు ఇంకా చెరసాలలోనే ఉంచుతాడు. మరోవైపు వ్రేపల్లెలోని నందుని ఇంట కృష్ణుడు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంటాడు. తనను చంపబోయే బాలుడు ఎక్కడున్నాడో వెదికి పట్టుకుని చంపాలంటూ కంసుడు తన చారులను నలువైపులా పంపుతాడు. కంసుడు పంపిన వారిలో పూతన తొలుత కృష్ణుడి జాడ కనుక్కుంటుంది. విషపూరితమైన పాలు ఇవ్వబోయిన పూతనను పాలుతాగే వయసులోనే కృష్ణుడు పరిమార్చుతాడు. దోగాడే వయసులో కృష్ణుడి అల్లరి ఎక్కువవడంతో యశోద అతణ్ణి రోకలికి కట్టేస్తుంది. రోకలిని ఈడ్చుకుంటూ దోగాడుతూనే వెళ్లి మద్దిచెట్ల రూపంలో ఉన్న గంధర్వులకు శాపవిమోచనం కలిగిస్తాడు. బుడిబుడి నడకల ప్రాయంలోనే కంసుడు పంపిన బక, ధేనుక, శకటాసురాదులను సంహరిస్తాడు. ఆరుబయట ఆటలాడుకుంటూ ఒకసారి బాలకృష్ణుడు మన్నుతినడంతో తోటి గోపబాలకులు యశోదకు ఫిర్యాదు చేస్తారు. తినడానికి ఇంట్లో వెన్న మీగడలుండగా మన్ను తిన్నావెందుకని యశోద గద్దించితే, నోరు తెరిచి తన నోటనే ఏడేడు పద్నాలుగు లోకాలనూ చూపించి, ఆమెను సంభ్రమానికి గురిచేస్తాడు. తనను పూజించడం మానేసినందుకు గోకులంపై ఆగ్రహించిన ఇంద్రుడు కుంభవృష్టి కురిపించి, అల్లకల్లోలం సృష్టించినప్పుడు చిటికిన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి, ఆ కొండ నీడన వ్రేపల్లె వాసులకు, గోవులకు రక్షణ కల్పిస్తాడు. కాళింది నదిని విషపూరితం చేస్తూ, జనాలను భయభ్రాంతులను చేస్తున్న కాళీయుని పడగపైకెక్కి తాండవమాడి కాళీయుని మదమణచి తాండవకృష్ణుడిగా చిన్నారి వయసులోనే జేజేలందుకుంటాడు. చిన్న వయసులోనే ఇన్ని మహిమలు చూపినా, మళ్లీ ఏమీ ఎరుగని వానిలాగానే తోటి గోపబాలకులతో కలసి ఆలమందలకు కాపలాగా వెళతాడు. వాళ్లతో కలసి అల్లరి చేస్తూ ఆటలాడుతాడు. ఎవరూలేని గోపాలుర ఇళ్లలోకి చొరబడి వెన్నమీగడలను దొంగిలిస్తాడు. ఇంటి మీదకు తగవులు తెచ్చి, మామూలు అల్లరిపిల్లవాడిలాగానే తల్లి యశోదతో చీవాట్లు తింటాడు. అరుదైన గురుదక్షిణ అల్లరిగా ఆటపాటలతో గడిపే కృష్ణబలరాములకు విద్యాభ్యాసం జరిపించాలనుకుంటాడు నందుడు. సాందీపని మహర్షి గురుకులంలో చేరుస్తాడు. కృష్ణబలరాములు సాందీపని మహర్షి గురుకులంలో చేరేనాటికి ఆయన పుత్రశోకంతో కుమిలిపోతూ ఉంటాడు. బాల్యంలోనే ఆయన కొడుకు ప్రభాస తీర్థంలో మునిగిపోతాడు.. గురువుకు శుశ్రూషలు చేసి మిగిలిన శిష్యుల మాదిరిగానే బలరామ కృష్ణులు విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటారు. విద్యాభ్యాసం పూర్తయి, గురుకులాన్ని విడిచిపెట్టే సమయంలో గురుదక్షిణగా ఏమివ్వమంటారని అడిగాడు కృష్ణుడు. గురుపత్ని విలపిస్తూ ప్రభాసతీర్థంలో మునిగి కనిపించకుండా పోయిన తమ కుమారుడిని తెచ్చివ్వగలరా అని అడుగుతుంది. బలరామకృష్ణులు ప్రభాసతీర్థానికి చేరుకుంటారు. ప్రభాసతీర్థంలో గురుపుత్రుడిని అపహరించుకుపోయిన పాంచజన్యునితో పోరాడి, అతనిని తుదముట్టించి, గురుపుత్రుని సురక్షితంగా తీసుకువచ్చి, అతడిని గురుదక్షిణగా సమర్పించి, గురుకులం వీడి ఇంటికి చేరుకుంటారు కృష్ణబలరాములు. కృష్ణుడిని ఎలాగైనా తుదముట్టించాలన్న పట్టుదలతో కంసుడు పథకం పన్నుతాడు. ఉద్ధవుడిని దూతగా పంపి కృష్ణ బలరాములను మథురకు రప్పిస్తాడు. వారిని చంపడానికి చాణూర ముష్టికులనే మల్లులను ఉసిగొల్పుతాడు. కృష్ణుడు చాణూరుడిని, బలరాముడు ముష్టికుడిని సంహరిస్తారు. తర్వాత కృష్ణుడు కంసుడిని తుదముట్టించి, చెరలో ఉన్న తాత ఉగ్రసేనుని రాజ్యాభిషిక్తుడిని చేసి, తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను కూడా చెర నుంచి విడిపిస్తాడు. గురుకులంలో చెలికాడైన నిరుపేద బ్రాహ్మణుడు సుదాముడు పెద్దయిన తర్వాత తన ఇంటికి వస్తే, సముచిత రీతిలో ఆతిథ్యమిచ్చి, అతడి దారిద్య్రబాధను కడతేరుస్తాడు. అష్టమహిషులు కృష్ణుడు ఎనిమిదిమంది భార్యలను వివాహమాడాడు. రుక్మిణి కృష్ణుడిని ప్రేమించింది. ఆమెను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేయాలని తలుస్తాడు ఆమె సోదరుడు రుక్మి. బలవంతపు పెళ్లి ఇష్టంలేని రుక్మిణి రహస్య సందేశం పంపడంతో కృష్ణుడు ఆమెను ఎత్తుకుపోయి రాక్షసవివాహం చేసుకుంటాడు. అడ్డు వచ్చిన రుక్మికి సగం శిరస్సు, సగం మీసాలు గొరిగి బుద్ధిచెబుతాడు. సత్రాజిత్తు వద్దనున్న శమంతకమణి పోయి, అతడి సోదరుడు ప్రసేనుడు సింహం నోటపడి మరణించడంతో ఆ నింద కృష్ణునిపై పడుతుంది. శమంతకమణిని జాంబవంతుని గుహలో కనుగొన్న కృష్ణుడు అతడిని యుద్ధంలో గెలవడంతో జాంబవంతుడు శమంతకమణితో పాటు తన కూతురు జాంబవతిని కృష్ణుడికి సమర్పిస్తాడు. శమంతకమణిని తిరిగి తెచ్చివ్వడంతో సత్రాజిత్తు తన కూతురు సత్యభామతో కృష్ణుడికి వివాహం జరిపిస్తాడు. వసుదేవుడి చెల్లెలైన శ్రుతకీర్తి కూతురు భద్రను, మరో మేనత్త కూతురు అవంతీ రాజపుత్రిక మిత్రవిందను స్వయంవరంలో పెళ్లాడతాడు. కోసలరాజు నగ్నజిత్తు వద్ద ఏనుగులంత బలం ఉండే ఏడు వృషభాలు ఉండేవి. వాటిని నిగ్రహించిన వానికి కూతురునిస్తానని ప్రకటించడంతో, కృష్ణుడు ఏడు రూపాల్లో ఏడు వృషభాలనూ నిగ్రహించి, నగ్నజిత్తు కూతురు నాగ్నజితిని వివాహమాడతాడు. మద్ర దేశాధిపతి కూతురు లక్షణ స్వయంవరంలో కృష్ణుడిని వరిస్తుంది. ఈ ఎనిమిదిమంది ద్వారా కృష్ణుడికి పదేసిమంది చొప్పున కొడుకులు కలిగారు. మహాభారతంలో కృష్ణుడు మేనత్త కొడుకులైన పాండవులతో కృష్ణుడికి మొదటి నుంచి స్నేహబాంధవ్యాలు ఉండేవి. ముఖ్యంగా పాండవ మధ్యముడైన అర్జునుడితో శ్రీకృష్ణుడిది విడదీయరాని బంధం. నరనారాయణులే ద్వాపర యుగంలో కృష్ణార్జునులుగా జన్మించారని ప్రతీతి. పాండవపత్ని ద్రౌపదిని సొంత చెల్లెలి కంటే ఎక్కువగా చూసుకున్నాడు. శ్రీకృష్ణుడి సలహాల మేరకే ధర్మరాజు మొదలుకొని పాండవులంతా నడుచుకునేవారు. ద్యూత వ్యసనుడైన ధర్మరాజు కృష్ణుడి సలహా తీసుకోకుండానే శకుని ఆహ్వానించగానే మాయజూదంలో చిక్కుకుని సర్వస్వాన్ని కోల్పోతాడు. జూదంలో ధర్మరాజు పణంగా ఒడ్డిన ద్రౌపదిని దుశ్శాసనుడు కురుసభలోకి ఈడ్చుకొచ్చి వలువలు వలిచే ప్రయత్నం చేసినప్పుడు ఆమె తలచినంతనే చీరలు ప్రసాదించి, మానసంరక్షణ చేస్తాడు. మాయజూదంలో ఓటమిపాలై అరణ్య, అజ్ఞాతవాసాల్లో ఉన్న పాండవులకు శ్రీకృష్ణుడు అడుగడుగునా అండగా నిలుస్తాడు. తన రాజ్యానికి బెడదగా ఉన్న జరాసంధుని భీముడి సాయంతో తుదముట్టిస్తాడు. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజసూయం చేసినప్పుడు శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలమిస్తాడు. శిశుపాలుడు దీనిని ఆక్షేపించి, శ్రీకృష్ణుడిని దూషిస్తాడు. మేనత్తకు ఇచ్చిన వరం మేరకు శిశుపాలుడి వందతప్పులను సహించిన శ్రీకృష్ణుడు, అతడు వందతప్పులనూ పూర్తి చేయడంతో ఇక ఏమాత్రం ఉపేక్షించక తన చక్రాయుధంతో అతడిని సంహరిస్తాడు. పాండవుల అరణ్య, అజ్ఞాతవాసాలు పూర్తయిన తర్వాత వారి తరఫున రాయబారిగా కురుసభకు వెళతాడు. దుర్యోధనుడు మొండికేసి సూదిమొన మోపినంత చోటైనా పాండవులకు ఇవ్వననడమే కాకుండా, కృష్ణుడిని బంధించడానికి తెగబడటంతో నిండుసభలోనే విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. విశ్వరూపాన్ని తిలకించడానికి గుడ్డివాడైన ధృతరాష్ట్రుడికి తాత్కాలికంగా చూపునిస్తాడు. యుద్ధం అనివార్యమైనప్పుడు తాను పాండవులపక్షా నిలిచి, అర్జునుడికి సారథిగా కురుక్షేత్ర రణరంగానికి వెళతాడు. రణరంగంలో అయినవారిని చూసి, తాను వారిని తన చేతులతో సంహరించలేనంటూ అర్జునుడు వెనుకాడినప్పుడు కురుక్షేత్రంలో మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించి, గీతబోధ చేసి, అర్జునుడిని యుద్ధోన్ముఖుడిని చేస్తాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం బారి నుంచి ఉత్తర గర్భస్థ శిశువును తన చక్రాన్ని అడ్డువేసి కాపాడతాడు. ఉత్తరకు పుట్టిన కొడుకు పరీక్షిత్తు పాండవుల తర్వాత రాజ్యభారం వహిస్తాడు. అవతార పరిసమాప్తి కురుక్షేత్రం యుద్ధంలో వందమంది కొడుకులనూ పోగొట్టుకున్న గాంధారి, దీనంతటికీ కృష్ణుడే కారణమని తలచి అతడిపై ఆక్రోశం పెంచుకుంటుంది. యుద్ధంలో కురువంశం నాశనమైనట్లే యదువంశం కూడా నాశనమవుతుందని గాంధారి శపిస్తుంది. ఇది జరిగిన కొన్నాళ్లకు యాదవ యువకులు కొందరు కృష్ణుడికి జాంబవతి వల్ల పుట్టిన సాంబుడికి ఆడవేషం కట్టి, నిండుచూలాలి మాదిరిగా అలంకరిస్తారు. అటుగా వచ్చిన మునులను అడ్డగించి, ఆడవేషంలోని సాంబుడిని చూపి, పుట్టబోయేది ఆడబిడ్డో, మగశిశువో చెప్పాలంటూ ఆటపట్టిస్తారు. ఆగ్రహించిన మునులు యదుకులాన్ని నాశనం చేసే ముసలం పడుతుందని శపిస్తారు. సాంబుడికి వేషం తీసేశాక, అతడి దుస్తుల్లోంచి లోహపు ముసలం ఒకటి బయటపడుతుంది. దానిని చూసి యాదవులు భయపడతారు. దానినేం చేయాలని పెద్దలను అడిగితే, అరగదీసి సముద్రంలో కలిపేయమని సలహా ఇస్తారు. వీలైనంత వరకు దానిని అరగదీసి సముద్రంలో కలిపేస్తారు. చిన్న ములుకులాంటి భాగం మిగిలిపోవడంతో దానిని ఒడ్డున పడేస్తారు. ముసలాన్ని అరగదీసిన ప్రదేశంలో రెల్లుగడ్డి మొలుస్తుంది. ములుకులాంటి భాగం ఒక నిషాదుడికి దొరకడంతో, అతడు దానిని తన బాణానికి ములుకులా అమర్చుకుంటాడు. కొన్నాళ్లకు యాదవులు తప్పతాగి వారిలో వారే కొట్లాడుకుని ఒకరినొకరు చంపుకుంటాడు. జరిగిన దారుణానికి తల్లడిల్లిన బలరాముడు యోగమార్గంలో దేహత్యాగం చేస్తాడు. కృష్ణుడు ఒంటరిగా ఒక చెట్టునీడన కూర్చుని వేణువూదుతూ కాలిని ఆడిస్తుండగా, అక్కడేదో మృగం ఉందని భ్రమించి నిషాదుడు బాణం సంధిస్తాడు. ఆ బాణం వల్లనే కృష్ణుడు దేహత్యాగం చేశాడని, బాణాన్ని సంధించిన నిషాదుడు గతజన్మలో వాలి కొడుకైన అంగదుడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. వాలిని రాముడు చెట్టుచాటు నుంచి వధించడం వల్లనే ద్వాపరయుగంలో నిషాదుడిగా జన్మించిన అంగదుడు చెట్టుచాటునున్న కృష్ణుడిపై బాణం సంధిస్తాడని కొన్ని పురాణాల కథనం. శ్రీకృష్ణుడి నిర్యాణంతో ద్వాపరయుగం అంతరించి కలియుగం ప్రారంభమైందని కూడా పురాణాలు చెబుతాయి. అయితే, శ్రీకృష్ణుడు జరామరణ రహితుడని రామానుజాచార్యులు మొదలుకొని గౌడీయ వైష్ణవ గురువుల వరకు పలువురు ఆచార్యలు చెప్పారు. పరమాత్మ అవతారమైన శ్రీకృష్ణుడు ఆదిమధ్యాంత రహితుడని, పాంచభౌతిక దేహానికి అతీతుడని వైష్ణవుల విశ్వాసం. పురాణాలు... చారిత్రక ఆధారాలు... శ్రీకృష్ణుని ప్రస్తావన పురాణాల్లోనే కాకుండా, ఉపనిషద్వాంగ్మయంలోనూ కనిపిస్తుంది. ఉపనిషత్తుల్లో అత్యంత ప్రాచీనమైనదని భావిస్తున్న ‘ఛాందోగ్యోపనిషత్తు’లో కృష్ణుడి ప్రస్తావన కనిపిస్తుంది. కృష్ణుడి ప్రస్తావన ఉన్న తొలిగ్రంథం ఇదే. ఇందులో శ్రీకృష్ణుడు దేవకీసుతుడని, ఘోర అంగీరసుడికి శిష్యుడని ఉంది. ‘నారాయణ అధర్వశీర్ష’, ‘ఆత్మబోధ’ వంటి ఉపనిషత్తులు శ్రీకృష్ణుడు సాక్షాత్తు భగవంతుడని, నారాయణుని అవతారమని చెప్పాయి. హరివంశం, విష్ణుపురాణం వంటి పురాణగ్రంథాల్లో కూడా కృష్ణుని గురించిన గాథలు కనిపిస్తాయి. క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్దిలో మగధ రాజ్యానికి వచ్చిన గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ తన రచనల్లో కృష్ణుడిని ‘హెరాకిల్స్’గాను, బలరాముడిని ‘అగాథకిల్స్’గాను ప్రస్తావించాడు. మధుర రాజైన శూరసేనుడు ‘హెరాకిల్స్’ను పూజించేవాడని మెగస్తనీస్ రాశాడు. క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్ది నాటి గ్రీకు రాయబారి హెలియోడోరస్ విదిశ ప్రాంతంలోని బేస్‌నగర్‌లో నెలకొల్పిన స్థూప శాసనంలో ‘దేవదేవుడైన వాసుదేవుని కోసం’ ఆ గరుడ స్తంభాన్ని భక్తుడైన తాను వేయించినట్లు పేర్కొన్నాడు. ఇండో–గ్రీకు పాలకుడైన అగాథోక్లెస్ క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దిలో కృష్ణబలరాముల బొమ్మలున్న నాణేలను ముద్రించాడు. ఆ కాలంలోనే వృష్టివంశానికి చెందిన ఐదుగురు వీరులు: కృష్ణుడు, బలరాముడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సాంబుడు పూజలందుకునేవారు. మధుర సమీపంలోని మోరా వద్ద లభించిన శాసనంలో ఈ ఐదుగురు వృష్టివంశ వీరులకు పూజలు జరిపేవారనేందుకు ఆధారాలు బయటపడ్డాయి. సుమారు అదేకాలంలో వ్యాకరణకర్త పతంజలి రచనల్లో కృష్ణుడు, సంకర్షణుడు, జనార్దనుడు, బలరాముడు, కేశవుడు వంటి దేవతల పేర్లు కనిపిస్తాయి. కృష్ణుని ఆరాధన... ఆలయాలు... దేశం నలుమూలలా కృష్ణుని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. ఒడిశాలోని పూరీలో జగన్నాథుడిగా, కేరళలోని గురువాయూర్‌లో గురువాయూరప్పగా, గుజరాత్‌లోని నాథద్వారలో శ్రీనాథుడిగా, ఉత్తరప్రదేశ్‌లోని మధుర, బృందావనాలలో శ్రీకృష్ణుడిగా, గుజరాత్‌లోని ద్వారకలో ద్వారకాధీశునిగా, మహారాష్ట్రలోని పండరిపురంలో పాండురంగ విఠలునిగా, తమిళనాడులోని మన్నార్గుడిలో రాజగోపాలునిగా ఆరాధిస్తారు. మీరాబాయి, చైతన్య మహాప్రభువు, సూరదాసు, భక్త జయదేవుడు, మధ్వాచార్యులు, వల్లభాచార్యులు వంటివారు కృష్ణభక్తుల్లో సుప్రసిద్ధులు. భారతీయ సంప్రదాయ సంగీత సాహిత్యాలలో కృష్ణునికి విశేషమైన స్థానం ఉంది. కృష్ణుని గురించిన అనేక కీర్తనలు, కృతులు భారతీయ సంగీత సాహిత్యాలను సుసంపన్నం చేశాయి. భక్తజయదేవుని గీతగోవిందం, అష్టపదులు, సూరదాసు గీతాలు ఇప్పటికీ ఎక్కడో చోట కచేరీల్లో వినిపిస్తూనే ఉంటాయి. పోతన భాగవతంలో శ్రీకృష్ణుని వర్ణన నిరుపమానమైనవి. తెలుగునాట అన్నమయ్య వంటి పలు వాగ్గేయకారులు కూడా శ్రీకృష్ణుని స్తుతిస్తూ రాసిన కీర్తనలు నేటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆధునిక కాలంలో భక్తివేదాంత స్వామి ప్రభుపాద ‘హరేకృష్ణ’ ఉద్యమాన్ని ప్రారంభించి, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణా కాన్షియస్నెస్ (ఇస్కాన్) స్థాపించారు. ‘ఇస్కాన్’ ఆధ్వర్యంలో దేశ దేశాల్లో ఆలయాలు నడుస్తున్నాయి. ధార్మిక జీవనశైలి, భగవద్గీత, కృష్ణతత్వం ప్రచారం చేసే ఉద్దేశంతో ప్రారంభించిన ‘హరేకృష్ణ’ ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో ఆదరణ ఉంది. పలువురు విదేశీయులు సైతం ‘ఇస్కాన్’ ఆలయాల్లో జరిగే వేడుకల్లో పాల్గొంటూ ఉంటారు. జన్మాష్టమి వేడుకలు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున దేశవ్యాప్తంగా వైష్ణవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. వైష్ణవ సంప్రదాయం పాటించేవారు ఇళ్లలో కూడా కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. బాలకృష్ణుని ప్రతిమను ఉయ్యాలలో వేసి పాటలు పాడుతారు. ముంగిళ్లలో బాలకృష్ణుని పాదముద్రలను తీర్చిదిద్దుతారు. ఆ పాదముద్రలనే ఆనవాలు చేసుకుని బాలకృష్ణుడు తమ నట్టింట నడయాడుతాడని కొందరు భక్తులు నమ్ముతారు. ఇంట్లోని పూజమందిరంలో కృష్ణుని ప్రతిమను సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు. పాలు, అటుకులతో తయారుచేసిన మధుర పదార్థాలను, వెన్న మీగడలను కృష్ణునికి నైవేద్యంగా సమర్పించి, బంధుమిత్రులతో కలసి ఆరగిస్తారు. కృష్ణాష్టమి రోజున పూజాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీకృష్ణ లీలలను పఠించడం లేదా ఆలకించడం చేయాలని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజించితే చతుర్విధ పురుషార్థాలూ ప్రాప్తిస్తాయని ‘స్కందపురాణం’ చెబుతోంది. కృష్ణాష్టమి రోజున ఇంట్లో చిన్నారులు ఉంటే కృష్ణుడిలా, గోపికల్లా వారికి వేషాలు కడతారు. కొన్ని చోట్ల ఉట్టికొట్టే వేడుక జరుపుతారు. భాగవత పారాయణ, భగవద్గీత పారాయణ, విష్ణుసహస్రనామ పారాయణ, కృష్ణాష్టక పారాయణ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివిధ ప్రాంతాల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నృత్య సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. -
నువ్వు శాశ్వతం..
జీవితం క్షణభంగురమని పురాతన మతతత్వాలన్నీ చెబుతున్నాయి. మరణాన్ని నేరుగా జయించే మార్గమేదీ నేటి వరకు అందుబాటులో లేదు. అయితే, మరణానంతరం శాశ్వతంగా జీవితం కొనసాగించే మార్గం మాత్రం ఉంది. అదే– అవయవదానం. అవయవదానం చేయండి. జీవితాన్ని శాశ్వతం చేసుకోండి. ఆధునిక వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన మైలురాయి అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం నానాటికీ మెరుగుపడుతూ వస్తోంది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా, నెమ్మదిగా పెరుగుతోంది. అవయవ దాతల సంఖ్య మరింతగా పెరగాల్సి ఉంది. అవయవ దానంపై లేనిపోని అపోహలు, మతపరమైన నమ్మకాలు, ఆచారాల వంటి వాటి కారణంగా చాలామంది అవయవ దానానికి ముందుకు రావడం లేదు. కొన్ని అవయవాలను జీవించి ఉండగానే సేకరించడం జరుగుతుంది. దానివల్ల అవయవ దాతకు గాని, అవయవ గ్రహీతకు గాని ఎలాంటి నష్టం జరగదు. చాలా సందర్భాల్లో బ్రెయిన్ డెడ్ అయినా, సాధారణ కారణాల వల్ల మరణించినా, వారు ముందుగానే అవయవ దానానికి లిఖితపూర్వకంగా సంసిద్ధత వ్యక్తం చేసి ఉన్నట్లయితే, వారి అవయవాలను సేకరించి, అవసరంలో ఉన్న ఇతరులకు అమర్చుతారు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాల ద్వారా గరిష్టంగా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఒక వ్యక్తి నుంచి సేకరించిన కణజాలం ద్వారా గరిష్టంగా యాభై మంది జీవన ప్రమాణాన్ని పొడిగించవచ్చు. అవయవ దాతలు సైతం మరణానంతరం తమ అవయవాలను పొందిన ఇతరుల ద్వారా మరికొంతకాలం వారి జ్ఞాపకాల్లో సజీవంగా ఉండవచ్చు. ఆగస్టు 13న ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవదానం గురించి కొన్ని విశేషాలు... అవయవదానంపైనా, అవయవ మార్పిడి చికిత్స విధానాలపైనా ఇప్పుడిప్పుడే మన దేశంలో ప్రజలకు కొంత అవగాహన ఏర్పడుతోంది. అయినా, ఇంకా ఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు వారిని పీడిస్తూనే ఉన్నాయి. అవయవదానానికి ఏయే అవయవాలు పనికి వస్తాయో, ఎలాంటి పరిస్థితుల్లో దాతల నుంచి అవయవాలను సేకరిస్తారో కూడా చాలామందికి తెలియదు. అవయవదానానికి ఏయే అవయవాలు, కణజాలాలు పనికి వస్తాయంటే... గుండె ప్రాణం నిలిచి ఉండాలంటే గుండె పనిచేస్తూ ఉండాల్సిందే. కొందరిలో గుండె వైఫల్యం కారణంగా, తీవ్రమైన వైరల్ జ్వరాల కారణంగా గుండె పనిచేయడం మానేసే పరిస్థితి తలెత్తుతుంది. ఇలాంటి వారికి ఇతర చికిత్సలేవీ పనిచేయని పరిస్థితుల్లో గుండె మార్పిడి ఒక్కటే దిక్కు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్‌డెడ్ కారణంగా మరణించిన వారి నుంచి సేకరించిన గుండెను వేరు చేసి అమర్చడం ద్వారా గుండె వైఫల్యంతో బాధపడుతున్న వారి ప్రాణాలను కాపాడవచ్చు. తగిన గుండె దొరికేంత వరకు రోగుల ప్రాణాలను నిలిపి ఉంచేందుకు వైద్యులు కృత్రిమ గుండెను ఉపయోగిస్తారు. అవయవదానంపై అపోహలు వాస్తవాలు అవయదానంపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు విస్తృత ప్రచారం సాగిస్తున్నప్పటికీ, చాలామందిలో ఇప్పటికీ అవయవదానంపై ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ అపోహలు ఏమాత్రం వాస్తవం కాదు. ముఖ్యంగా ప్రచారంలో ఉన్న అపోహలు, వాటి వెనుకనున్న వాస్తవాలు ఏమిటంటే... అపోహ: దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు అవయవదానానికి పనికిరారు వాస్తవం: ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారైనా తమ అవయవాలను నిక్షేపంగా దానం చేయవచ్చు. శరీరంలోని వ్యాధిగ్రస్తమైన అవయవాలను విడిచిపెడితే, మిగిలినవి అవయవదానానికి పనికి వస్తాయి. అలాగే, ఇతర అవయవాల్లోని కణజాలం కూడా దానానికి పనికివస్తుంది. అపోహ: వయసు మళ్లిన వృద్ధులు అవయవదానానికి పనికిరారు వాస్తవం: అవయవదానానికి వయసుతో నిమిత్తం లేదు. ఏ వయసులో ఉన్నవారైనా అవయవదానం చేయవచ్చు. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల ప్రకారం 93 ఏళ్ల అమెరికన్ పౌరుడు మరణానంతరం అవయవదానం చేశాడు. అవయవదానానికి సంసిద్ధత వ్యక్తం చేయడానికి కనీసం పద్దెనిమిదేళ్లు నిండి ఉండాలి. దాదాపు ప్రపంచదేశాలన్నీ అనుసరిస్తున్న పద్ధతి ఇది. అపోహ: అవయవదానం మత విశ్వాసాలకు విరుద్ధం వాస్తవం: ప్రపంచంలోని చాలా మతాలు ఆధునికతను అర్థం చేసుకుంటున్నాయి. ఆధునిక శాస్త్ర పురోగతికి ఆటంకం కలిగించే నిబంధనలేవీ విధించడం లేదు. ఇతరుల పట్ల ప్రేమను, దాతృత్వాన్ని వ్యతిరేకించే మతాలేవీ ప్రపంచంలో ఎక్కడా లేవు. ఇస్లామిక్ ఫిక్ కౌన్సిల్ నాలుగో సమ్మేళనం కూడా అవయవదానాన్ని నిస్వార్థమైన దాతృత్వంగా పరిగణిస్తూ, అవయవదానానికి ఆమోదం తెలిపింది. అపోహ: అవయవదానం చేశాక శరీరానికి ఆచార ప్రకారం అంత్యక్రియల నిర్వహణ సాధ్యంకాదు వాస్తవం: అవయవదానం చేసినప్పటికీ, పనికి వచ్చే అవయవాలను తొలగించి, అవసరంలో ఉన్న గ్రహీతలకు అమర్చిన తర్వాత దాత శరీరాన్ని వైద్యులు పూర్తి గౌరవంగా చూస్తారు. తగిన రీతిలో అంత్యక్రియలు నిర్వహించడానికి వీలుగా దానిని సిద్ధంచేసి, సంబంధీకులకు అప్పగిస్తారు. అపోహ: అవయవదాతల నుంచి సేకరించిన అవయవాలను ఎవరైనా అమ్ముకుంటారేమో! వాస్తవం: అవయవదాతల నుంచి సేకరించిన అవయవాలను అమ్ముకోవడాన్ని నిషేధిస్తూ దాదాపు ప్రపంచదేశాలన్నీ కట్టుదిట్టమైన చట్టాలను రూపొందించాయి. అవయవాలను అమ్ముకునే వారికి కఠిన శిక్షలు తప్పవు. దాతల నుంచి సేకరించిన అవయవాలను వైద్యులెవరూ అమ్ముకోరు. అపోహ: అవయవదాత కోమాలోకి వెళితే కోమాలో ఉండగానే అవయవాలు తొలగిస్తారేమో! వాస్తవం: ఇది పూర్తిగా అపోహ. కోమాలో ఉన్నవారిని సాధ్యమైనంత వరకు బతికించడానికే వైద్యులు అన్నివిధాలా ప్రయత్నిస్తారు. బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. ఊపిరితిత్తులు ఊపిరితిత్తులు శరీరంలోని రక్తానికి ఆక్సిజన్ సరఫరా చేస్తాయి. కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపుతాయి. నిరంతరం జరిగే ఈ ప్రక్రియకు కొన్ని కారణాల వల్ల అంతరాయం ఏర్పడుతుంది. ఊపిరితిత్తుల్లో గడ్డలు ఏర్పడటం (సిస్టిక్ ఫైబ్రోసిస్) వంటి పరిస్థితులు తలెత్తితే ఊపిరితిత్తులు శరీరానికి కావాల్సినంత ఆక్సిజన్‌ను అందించే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఊపిరితిత్తులు సామర్థ్యాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో బ్రెయిన్‌డెడ్ లేదా గుండె ఆగిపోవడం వల్ల మరణించిన వారి నుంచి సేకరించిన ఊపిరితిత్తులను రోగులకు అమర్చడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చు. పొగతాగే అలవాటు ఉన్నవారి ఊపిరితిత్తులు ఇందుకు పనికిరావని చాలామంది అనుకుంటారు గాని, అదంతా అపోహ మాత్రమే. పొగతాగే అలవాటు ఉన్నవారి ఊపిరితిత్తుల సామర్థ్యం బాగానే ఉన్నట్లయితే, అవసరమైన రోగులకు వాటిని అమర్చవచ్చు. ఒకే రోగికి ఒక మనిషి మృతదేహం నుంచి సేకరించిన రెండు ఊపిరితిత్తులనూ అమర్చవచ్చు లేదా అవసరంలో ఉన్న ఇద్దరు రోగులకు చెరొక ఊపిరితిత్తిని అమర్చడం ద్వారా రెండు ప్రాణాలను కాపాడటానికి కూడా వీలు ఉంటుంది. పాంక్రియాస్ లివర్‌కు దిగువగా ఉండే పాంక్రియాస్ ఇన్సులిన్ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. టైప్–1 డయాబెటిస్ రోగుల్లో ఇన్సులిన్ అతి తక్కువగా తయారవుతుంది. ఒక్కోసారి అసలు ఏమాత్రం తయారవదు. నిత్యం ఇన్సులిన్ ఇంజెక్షన్లపై ఆధారపడి బతకాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చినా రక్తంలో చక్కెర నియంత్రణకు రాని పరిస్థితులు తలెత్తుతాయి. అలాంటప్పుడు పాంక్రియాస్ మార్పిడి మాత్రమే ఏకైక మార్గం. బ్రెయిన్ డెడ్ లేదా గుండె ఆగిపోవడం వల్ల మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన పాంక్రియాస్‌ను అవసరమైన రోగులకు అమర్చడం ద్వారా వారిని బతికించవచ్చు. అవయవదానంపై ప్రభుత్వాల కృషి అవయవదానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు దేశ దేశాల్లో ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ దిశగా కృషి కొనసాగిస్తున్నాయి. ‘ఆర్గాన్ ఇండియా‘ అనే స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ సహకారంతో అవయవదానంపై విస్తృతంగా ప్రచారం చేస్తూ, ప్రజలను అవయవదానం వైపు ప్రోత్సహిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ ‘జాతీయ అవయవమార్పిడి కార్యక్రమం’ నిర్వహిస్తోంది. మరణానంతరం అవయవదానానికి సంసిద్ధులయ్యేలా ప్రజల్లో అవగాహన కల్పించడం, అవయవాలను అమ్ముకోకుండా ఉండేలా కట్టుదిట్టమైన చట్టాలను అమలు చేయడం, ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వంటివాటిని ఈ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తోంది. అవయవదానం కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు అవయవదానాన్ని ప్రోత్సహించేందుకు ‘జీవన్‌దాన్’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ‘జీవన్‌దాన్’ డైరెక్టర్ డాక్టర్ స్వర్ణలత హైదరాబాద్ కేంద్రంగా అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్నారు. భారత్‌లోని అవయవదాతల్లో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా ఉంటున్నారు. మన దేశంలో కిడ్నీదానం చేసేవారిలో 74 శాతం మంది, లివర్‌దాతల్లో 60.5 శాతం మంది మహిళలే. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా, అవయవదాతల్లో మహిళలే అగ్రస్థానంలో నిలుస్తుండటం విశేషం. భారత్‌లో ప్రతి 10 లక్షల జనాభాకు 0.58 మంది అవయవదాతలే అందుబాటులో ఉన్నారు. ఈ విషయంలో స్పెయిన్ ప్రతి 10 లక్షల జనాభాకు 36 మంది, క్రొయేషియా ప్రతి 10 లక్షల మందికి 32 మంది, అమెరికా ప్రతి 10 లక్షల మందికి 26 మంది అవయవదానంలో ముందంజలో ఉన్నాయి. కిడ్నీ రక్తాన్ని వడగట్టి, వ్యర్థాలను మూత్రం ద్వారా బయటకు పంపే కీలక విధులు నిర్వర్తిస్తుంటాయి కిడ్నీలు. ఏదైనా వ్యాధి కారణంగానైనా, మరే కారణం వల్లనైనా కిడ్నీలు దెబ్బతిన్నట్లయితే, రక్తాన్ని వడగట్టి, వ్యర్థాలను బయటకు పంపే సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఫలితంగా మూత్రం ద్వారా బయటకు పోవలసిన వ్యర్థాలు రక్తంలోనే పేరుకుపోయి, శరీరాన్ని దెబ్బతీస్తాయి. కిడ్నీలు రెండూ విఫలమైన స్థితిలో డయాలసిస్ ద్వారా రక్తంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపుతారు. అయితే, డయాలసిస్‌పై రోగి దీర్ఘకాలం జీవించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో దాతలు ఎవరైనా ముందుకు వచ్చినట్లయితే, వారి నుంచి సేకరించిన కిడ్నీని అమర్చడం ద్వారా రోగిని కాపాడవచ్చు. సాధారణంగా రక్త సంబంధీకుల నుంచి సేకరించిన కిడ్నీలను రోగులకు అమరుస్తుంటారు. కొన్నిసార్లు బయటి దాతల నుంచి సేకరించిన కిడ్నీలను కూడా అమరుస్తారు. బ్రెయిన్‌డెడ్ రోగుల నుంచి సేకరించిన కిడ్నీలయితే, ఒక్కోసారి రెండు కిడ్నీలను కూడా ఒకే రోగికి అమర్చే అవకాశాలు ఉంటాయి. ఇద్దరు రోగులకు అవసరమైతే ఒక్కో రోగికి చెరో కిడ్నీని అమర్చి రెండు నిండు ప్రాణాలను కాపాడేందుకు వీలుంటుంది. ఎముకల కణజాలం ప్రమాదాలు, వ్యాధులు, పుండ్లు వంటి కారణాల వల్ల ఎముకలు కోల్పోయిన వారికి దాతల శరీరం నుంచి సేకరించిన ఎముకల కణజాలాన్ని అమర్చడం ద్వారా వారు కోల్పోయిన ఎముకలు తిరిగి యథాస్థితో పెరిగేలా చేయవచ్చు. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి, అరిగిపోయిన కీళ్ల మార్పిడి చికిత్సల్లో అరిగిపోయిన కీళ్లు తిరిగి త్వరగా కోలుకోవడానికి కూడా ఎముకల నుంచి సేకరించిన కణజాలాన్ని ఉపయోగిస్తారు. పిల్లలకైనా, పెద్దలకైనా గూని కారణంగా వంపు తిరిగిపోయిన వెన్నెముకను నిటారుగా తీర్చిదిద్దడానికి కూడా ఎముకల కణజాలం ఉపయోగపడుతుంది. ఒక వ్యక్తి ఎముకల నుంచి సేకరించిన కణజాలం గరిష్టంగా పదిమంది రోగులకు పునరుజ్జీవనం కలిగించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, ఎముకలను కండరాలకు అతికించి ఉంచే టెండన్ల నుంచి సేకరించిన కణజాలాన్ని కూడా దెబ్బతిన్న టెండన్లను పునరుద్ధరించడానికి ఉపయోగిస్తారు. కార్నియా కంటి ద్వారా చూడాలంటే కంట్లోని కార్నియా, అందులో ఉండే సూక్ష్మభాగాలు సజావుగా ఉండాలి. పుట్టుక నుంచి గాని, మధ్యలో ఏదైనా కారణం వల్ల గాని అంధులుగా మారిన వారికి కార్నియా మార్పిడి చికిత్స ద్వారా తిరిగి చూపు తెప్పించడానికి అవసరం ఉంటుంది. మరణానికి ముందే నేత్రదానానికి సంసిద్ధత వ్యక్తం చేసిన దాతల నుంచి సేకరించిన కార్నియాను అమర్చడం ద్వారా అవసరంలో ఉన్న అంధులకు చూపు తెప్పించడానికి వీలవుతుంది. ఒక్కోసారి ఇతర కారణాల వల్ల మరణించిన వారి కార్నియాలను కూడా వారి బంధువుల అనుమతితో సేకరించవచ్చు. కార్నియా కణజాలాన్ని సేకరించి, అమర్చడం ద్వారా కూడా అవసరంలో అంధులకు చూపు తెప్పించడానికి వీలవుతుంది. చర్మం ఇన్ఫెక్షన్ల కారణంగా, తీవ్రంగా కాలిన గాయాల వల్ల చర్మం బాగా దెబ్బతిని బాధపడుతున్న వారికి చర్మ కణజాల మార్పిడి చికిత్స ద్వారా వారు ఆరోగ్యకరమైన చర్మాన్ని పొందేలా చేయవచ్చు. చర్మదాతల నుంచి చర్మంపై ఉండే పలచని పొరను సేకరించి, అవసరంలో ఉన్న రోగులకు ఉపయోగిస్తారు. చర్మం బాగా దెబ్బతిన్న రోగికి ముగ్గురు దాతల నుంచి సేకరించిన చర్మకణజాలాన్ని ఎక్కించడం ద్వారా చర్మం పూర్తిగా యథాస్థితికి వచ్చేలా చికిత్స చేస్తారు. లివర్ శరీరంలోని అతి సంక్లిష్టమైన అవయవం లివర్. అంతేకాదు, శరీరంలోని అతిపెద్ద గ్రంథి కూడా ఇదే. లివర్ శరీరంలోని అనేక విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఆహారం ద్వారా పొందిన చక్కెరలు, కొవ్వులు, విటమిన్లు వంటి పోషకాలను నియంత్రిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది. రక్తం గడ్డకట్టే ప్రక్రియను నియంత్రిస్తుంది. జీవక్రియల అసమతుల్యతలు, జన్యు కారణాలే కాకుండా హెపటైటిస్–బి, హెపటైటిస్–సి వంటి వ్యాధులు లివర్‌ను పూర్తిగా దెబ్బతీసే పరిస్థితుల్లో లివర్ మార్పిడి అవసరమవుతుంది. మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన లివర్‌నే కాకుండా, జీవించి ఉన్న వ్యక్తుల నుంచి సేకరించిన లివర్ ముక్కను కూడా లివర్ మార్పిడి అవసరమైన రోగులకు అమర్చవచ్చు. కొంతకాలానికి దాతలోను, గ్రహీతలోను కూడా లివర్ పూర్తి పరిమాణానికి ఎదుగుతుంది. ఇద్దరూ ఆరోగ్యంగా ఉండవచ్చు. మరణించిన వ్యక్తుల నుంచి సేకరించిన లివర్ని అవసరాన్ని బట్టి ఇద్దరు రోగులకు అమర్చడానికి కూడా అవకాశాలు ఉంటాయి. గుండె కణజాలం పూర్తిగా గుండెమార్పిడి అవసరం లేని వారికి గుండె కణజాలాన్ని ఉపయోగించి చికిత్స చేస్తారు. అలాగే గుండె వాల్వులను కూడా అమర్చి చికిత్స చేస్తారు. పుట్టుకతో వచ్చే జన్యులోపాల వల్ల గుండెకు రంధ్రం ఏర్పడిన పిల్లలకు, గుండెవాల్వులు దెబ్బతిన్న పెద్దలకు ఇలా గుండె నుంచి సేకరించిన కణజాలాన్ని, వాల్వులను అమర్చడం ద్వారా వారి ప్రాణాలను కాపాడటానికి అవకాశాలు ఉంటాయి. అవయవదానం కోసం యాప్ అవయవదానాన్ని సులభతరం చేసేందుకు బెంగళూరులో స్థిరపడ్డ ఒరియా యువకుడు ప్రతీక్ మహాపాత్రో ఒక యాప్‌ను రూపొందించాడు. అవయవాల అవసరంలో ఉన్నవారు అవయవదాతల వివరాలను క్షణాల్లో తెలుసుకునేలా ఈ యాప్‌ను రూపొందించిన ప్రతీక్ మహాపాత్రో బెంగళూరులోని ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్ ఫైనలియర్ చదువుకుంటున్నాడు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానంతో అతడు రూపొందించిన ఈ యాప్ మైక్రోసాఫ్ట్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో ఈ ఏడాది నిర్వహించిన ‘ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ గుడ్ ఐడియా చాలెంజ్’లో మూడో స్థానంలో నిలిచింది. ఇన్పుట్స్: డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ కథనం: పన్యాల జగన్నాథదాసు -
అయ్యో, పులికెంత కష్టం వచ్చింది..!
పులి చూపే ఒక గాంభీర్యం. పులి నడకే ఒక రాజసం. పులి ఒక సాహస సంకేతం. పులుల ఉనికి అడవికే ఒక అందం. పులుల మనుగడ ఇప్పుడొక ప్రశ్నార్థకం.. పులులు తారసపడితే ఒకప్పుడు మనుషులు భయంతో వణికిపోయి హడలి చచ్చేవారు. వీలైనంత వరకు పులుల కంటబడకుండా వాటికి దూరంగా ఉండేవారు. క్రమంగా కాలం మారింది. పులులకు భయపడే మనుషులే ఎలాంటి జంకుగొంకు లేకుండా వాటిని వేటాడటం మొదలైంది. నాగరికత ముదిరి ఆధునికత విస్తరించడంతో అడవుల నరికివేత నిత్యకృత్యంగా మారింది. పులులకు సహజ ఆవాసాలైన అడవుల విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో అడవుల్లో పులుల సంఖ్య దారుణంగా క్షీణించింది. మనుషుల విచక్షణారాహిత్యం ఫలితంగా పులుల్లోని కొన్ని ఉపజాతులు ఇప్పటికే పూర్తిగా అంతరించిపోయాయి. ప్రపంచంలో ఇంకా మిగిలి ఉన్న పులులు పూర్తిగా అంతరించిపోకుండా ఉండటానికి వివిధ దేశాల ప్రభుత్వాలు నిషేధాజ్ఞలను అమలులోకి తెచ్చాయి. నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాక పులుల శరీరభాగాలకు, వాటి చర్మానికి మరింతగా గిరాకీ పెరిగింది. నిషేధాలు లేనికాలంలో స్వేచ్ఛగా సాగే పులుల వేట నిషేధాలు అమలులోకి వచ్చాక దొంగచాటుగా సాగుతోంది. పులుల చర్మాలు, గోళ్లు, ఇతర శరీరభాగాలు అక్రమమార్గాల్లో దేశదేశాలకు తరలిపోతున్నాయి. పులుల పరిరక్షణ కోసం దేశదేశాల ప్రభుత్వాలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, పులుల మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మిగిలింది. పులులు జంతుజాలంలోని ‘ఫెలిడే’ కుటుంబానికి చెందుతాయి. పిల్లులు కూడా ఇదే కుటుంబానికి చెందుతాయి. ‘ఫెలిడే’ కుటుంబంలో పరిమాణంలో భారీగా కనిపించే నాలుగుజాతుల జంతువుల్లో ఒకటి పులుల జాతి. పులి శాస్త్రీయనామం ‘పాంథెరా టైగ్రిస్’. పులిని ఇంగ్లిష్‌లో ‘టైగర్’ అంటారు. ఈ మాటకు మూలం గ్రీకుపదమైన ‘టైగ్రిస్’. చరిత్రపూర్వ యుగంలో పులులు ఆసియాలోని కాకసస్ నుంచి కాస్పియన్ సముద్ర తీరం వరకు, సైబీరియా నుంచి ఇండోనేసియా వరకు విస్తరించి ఉండేవని వివిధ శాస్త్ర పరిశోధనల్లో తేలింది. పంతొమ్మిదో శతాబ్ది నాటికి పశ్చిమాసియాలో పులులు పూర్తిగా అంతరించాయి. ప్రాచీన పులుల శ్రేణి విడిపోయి పశ్చిమాన భారత్ నుంచి తూర్పున చైనా, ఇండోనేసియా ప్రాంతాల వరకు విస్తరించాయి. పులుల సామ్రాజ్యానికి పడమటి సరిహద్దు సైబీరియాలోని అముర్ నదికి చేరువలో ఉంది. ఇవరయ్యో శతాబ్దిలో ఇండోనేసియాలోని జావా, బాలి దీవుల్లో పులులు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పులులు అత్యధిక సంఖ్యలో మిగిలి ఉన్న దీవి సుమత్రా మాత్రమే. పులులు ఏనాటివంటే..? ‘ఫెలిడే’ కుటుంబానికి చెందిన ‘పాంథెరా పాలియోసినేన్సిస్’ అనే జంతువులు ఒకప్పుడు చైనా, జావా ప్రాంతాల్లో ఉండేవి. ప్రస్తుతం ఉండే పులుల కంటే పరిమాణంలో ఇవి కొంత చిన్నగా ఉండేవి. ఇవి దాదాపు ఇరవై లక్షల ఏళ్ల కిందట భూమ్మీద సంచరించేవని చైనా, జావాల్లో లభించిన వీటి శిలాజాలను పరీక్షించిన శాస్త్రవేత్తల అంచనా. ‘ట్రినిల్ టైగర్’ (పాంథెరా టైగ్రిస్ ట్రినిలెన్సిస్) అనే ఉపజాతి చైనా, సుమత్రా అడవుల్లో పన్నెండు లక్షల ఏళ్ల కిందట సంచరించేవి. ఇప్పటి పులులకు బహుశా ఇవే పూర్వీకులు కావచ్చు. పూర్వ భౌగోళిక యుగం చివరి దశలో పులులు తొలుత భారత్‌లోను, అక్కడి నుంచి ఉత్తరాసియా, పశ్చిమాసియా ప్రాంతాల్లోను అడుగుపెట్టాయి. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభమయ్యే నాటికి ఎనిమిది ఉపజాతులకు చెందిన పులులు మిగిలినా, వాటిలో రెండు ఉపజాతులు అంతరించిపోయాయి. 20వ శతాబ్దిలో అంతరించిపోయిన పులుల ఉపజాతుల్లో బాలి పులి, జావా పులి ఉన్నాయి. చిట్టచివరి బాలి పులి 1937 సెప్టెంబరు 27న వేటగాళ్ల చేతిలో బలైపోయింది. అది మధ్యవయసులోనున్న ఆడపులి. జావాపులి చివరిసారిగా 1979లో చూసినట్లు అధికారికంగా ఆధారాలు ఉన్నాయి. ఆ తర్వాత 1990లలో కూడా కొందరు ఈ పులిని చూసినట్లు చెప్పారు. ఆ తర్వాత జావాపులి జాడ కనిపించలేదు. ఇప్పటికి మిగిలి ఉన్న పులుల జాతుల్లో బెంగాల్ పులి (రాయల్ బెంగాల్ టైగర్), ఇండో చైనీస్ పులి, మలయా పులి, సుమత్రా పులి, సైబీరియన్ పులి, దక్షిణ చైనా పులి మాత్రమే ఉన్నాయి. బెంగాల్ పులి బెంగాల్ పులులు ఎక్కువగా భారత్, నేపాల్, బంగ్లాదేశ్‌లలో కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో కనిపించే పులుల కంటే ఉత్తరభారత్, నేపాల్‌లలో కనిపించే పులులు పరిమాణంలో కాస్త పెద్దగా ఉంటాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలి పాతికేళ్లలోనే దేశంలోని పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో పులుల పరిరక్షణ కోసం భారత ప్రభుత్వం 1972 నుంచి ‘ప్రాజెక్ట్ టైగర్’ కింద చర్యలు ప్రారంభించింది. దీని అమలు కోసం జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థను (నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ) ప్రారంభించింది. బెంగాల్ పులుల సంఖ్య మన దేశంలో దాదాపు రెండువేల వరకు ఉన్నట్లు వన్యప్రాణుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న స్వచ్ఛంద కార్యకర్తలు భావిస్తున్నా, వీటి సంఖ్య 1411 మాత్రమేనని 2014లో పులుల జనాభా సేకరణ చేపట్టిన జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అధికారికంగా ప్రకటించింది. మన దేశంలో పులుల జనాభాను నాలుగేళ్లకు ఒకసారి లెక్కిస్తారు. ఆ లెక్కన 2018లో కూడా పులుల జనాభా సేకరణ జరిపినా, ఇంతవరకు తాజా లెక్కలను ప్రకటించలేదు. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ పరిధిలోని పులుల సంఖ్యపై ప్రకటనలు చేయడంతో కొంత గందరగోళం ఏర్పడింది. దీంతో తాము అధికారికంగా వెల్లడించేంత వరకు రాష్ట్ర ప్రభుత్వాలేవీ పులుల సంఖ్యపై ప్రకటనలు చేయరాదంటూ జాతీయ పులుల పరిరక్షణ ప్రాధికార సంస్థ అన్ని రాష్ట్రాలకూ తాఖీదులు పంపింది. ఇదిలా ఉంటే, తెలంగాణ ప్రభుత్వం ఆమ్రాబాద్ పులుల అభయారణ్యం పరిసరాల్లో అణు విద్యుత్తు ఉత్పాదన కోసం యురేనియం తవ్వకాలను తలపెట్టింది. యురేనియం తవ్వకాలు ఇక్కడి పులుల మనుగడకు ముప్పు కలిగించే ప్రమాదం ఉంది. మహారాష్ట్రలో ఇటీవల ఒక రైతు కుక్కలను చంపడానికి చనిపోయిన ఆవుదూడపై విషం చల్లితే, దానిని తిన్న మూడు పులులు మృత్యువాత పడ్డాయి. తెలిసీ తెలియని పొరపాట్లు, విచక్షణలేని చర్యలు పులుల మనుగడకు సవాలు విసురుతున్నాయి. ఇండో చైనీస్ పులి ఇండో చైనీస్ పులులు ఎక్కువగా కంబోడియా, చైనా, లావోస్, బర్మా, థాయ్‌లాండ్, వియత్నాంలలో కనిపిస్తాయి. వీటి జనాభా 1200 నుంచి 1800 వరకు ఉండవచ్చని అంచనా. బెంగాల్ పులుల కంటే పరిమాణంలో ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి. వీటికి ఆవాసాలుగా ఉన్న అరణ్యాలు తగ్గిపోవడంతో పాటు, చైనా సంప్రదాయక ఔషధాల తయారీ కోసం ఎడాపెడా వేటాడుతూ పోవడంతో ఇండోచైనీస్ పులుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మలయ పులి మలయ ద్వీపకల్పంలోని దక్షిణ భాగంలోనే మలయ పులులు కనిపిస్తాయి. ప్రధాన భూభాగపు పులుల ఉపజాతులన్నింటిలోనూ మలయ పులులే పరిమాణంలో చిన్నవి. ఇప్పటికి జీవించి ఉన్న అన్ని పులుల ఉపజాతులనూ తీసుకుంటే, అతిచిన్న పులుల్లో ఇవి రెండోస్థానంలో నిలుస్తాయి. వీటి సంఖ్య దాదాపు 600 నుంచి 800 వరకు ఉండవచ్చని అంచనా. మలయ పులిని మలేసియా ప్రభుత్వం జాతీయ చిహ్నంగా ఉపయోగించుకుంటోంది. సుమత్రా పులి ప్రస్తుతానికి భూమ్మీద మిగిలిన అన్ని పులుల ఉపజాతుల్లోనూ సుమత్రా పులులు అతి చిన్నవి. ప్రస్తుతం ఇవి దాదాపు అంతరించిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. ఇండోనేసియాలోని సుమత్రా దీవిలో వీటి సంఖ్య ప్రస్తుతం 400 నుంచి 500 వరకు ఉండవచ్చని అంచనా. సైబీరియన్ పులి తూర్పు సైబీరియాలోని అముర్–ఉస్సురి ప్రాంతంలో ఇవి సురక్షితంగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచంలో మిగిలి ఉన్న అన్ని పులుల ఉపజాతుల్లోనూ ఇవే అతిపెద్దవి. వీటి సంఖ్య దాదాపు 450 నుంచి 500 వరకు ఉంటుందని అంచనా. దక్షిణ చైనా పులి దక్షిణచైనా పులులు దాదాపు అంతరించిపోయే దశలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో అంతరించిపోయే దశకు చేరుకున్న పది జంతువుల జాబితాలో దక్షణచైనా పులిని కూడా చేర్చారు. పులుల వేటను అరికట్టడానికి 1977లో చైనా ప్రభుత్వం చట్టాన్ని తెచ్చినా, ఈ పులుల ఉపజాతి క్షీణించిపోవడాన్ని నిరోధించలేకపోయింది. దక్షిణ చైనాలో ఈ ఉపజాతికి చెందిన 59 పులులను నిర్బంధంలో ఉంచారు. ఇవి ఆరు పులుల సంతానానికి చెందినవి కావడంతో, వీటిలో జన్యు వైవిధ్యం తక్కువేనని, అందువల్ల ఇవి నశించిపోవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి జనాభాను పెంచేందుకు తిరిగి వీటిని అడవుల్లోకి విడిచిపెట్టాలని వారు సూచిస్తున్నారు. తెల్లపులి తెల్లపులులు ప్రత్యేకమైన ఉపజాతికి చెందినవేమీ కావు. తల్లి పులిలోనూ తండ్రి పులిలోనూ ఒక అరుదైన జన్యువు ఉన్నట్లయితే, వాటికి తెల్లపులులు పుడతాయి. దాదాపు పదివేల పులుల్లో ఒకటి తెల్లగా పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. తెల్లపులులకు జనాకర్షణ ఎక్కువగా ఉండటం వల్ల జంతుప్రదర్శనశాలల్లో సంకరం చేయడం ద్వారా తెల్లపులుల పునరుత్పత్తి కొనసాగేలా చూస్తున్నారు. తెల్లపులులు మామూలు పులుల కంటే తక్కువకాలం జీవిస్తాయి. వీటిలో తరచుగా అంగిలి చీలి ఉండటం, వెన్నెముక వంకరటింకరగా ఉండటం వంటి శారీరక లక్షణాలు కనిపిస్తాయి. బంగారు మచ్చల పులి బంగారు మచ్చల పులులు కూడా ప్రత్యేకమైన ఉపజాతికి చెందినవి కావు. బెంగాల్ పులుల్లోని ఒక అరుదైన జన్యు పరివర్తనం వల్లనే ఇలాంటి పులులు పుడతాయి. వీటి ఒంటిపై లేత బంగారు రంగులోని ఉన్ని, వెలిసిపోయిన కాషాయ చారలు ఉంటాయి. తెల్లపులులు, బంగారు మచ్చల పులులే కాకుండా, చాలా అరుదుగా నీలం పులులు కూడా కనిపిస్తాయి. అడవి పులుల్లో టాప్ – 5 భారత్ 2,226 రష్యా 433 ఇండోనేసియా 371 మలేసియా 250 నేపాల్ 198 (అడవుల్లో సంచరించే పులుల సంఖ్యపై ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ 2014 నాటి లెక్కల ఆధారంగా వెల్లడించిన వివరాలు ఇవి. తిరిగి 2018లో పులుల జనాభా లెక్కల సేకరణ జరిపినా, ఆ లెక్కలను ఇంతవరకు వెల్లడించలేదు.) పులుల సంఖ్యను రెట్టింపు చేసే దిశగా చాలా దేశాలు చర్యలు ప్రారంభించాయి. వీటిలో కొన్ని కొంత పురోగతిని కూడా సాధించాయి. 2010 నాటి లెక్కలతో పోలిస్తే, భారత్‌లో పులుల సంఖ్య అదనంగా 520 వరకు పెరిగింది. ఇదే కాలంలోరష్యాలో పులుల సంఖ్య అదనంగా 73 మేరకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా అడవుల్లో సంచరించే పులుల సంఖ్య 2014 నాటి లెక్కల ప్రకారం 3,980 వరకు ఉంది. పులుల వేట రాచరికాలు ఉన్నప్పటి నుంచి పులుల వేట కొనసాగేది. వేటగాళ్లు ఏనుగులు, గుర్రాలపై అడవుల్లోకి వెళ్లి బాణాలు, బల్లేలతో పులులను వేటాడేవారు. వేటాడి చంపి తెచ్చిన పులుల చర్మాలను ఇంటి గోడలకు విజయ చిహ్నాల్లా వేలాడదీసేవారు. పంతొమ్మిది, ఇరవయ్యో శతాబ్దాల్లో పులుల వేట మరింత ఉధృతంగా సాగింది. తుపాకుల వంటివి అందుబాటులోకి రావడంతో సంపన్నులైన కొందరు పులుల వేటను సాహస క్రీడగా సాగించేవారు. మన దేశంలో బ్రిటిష్ హయాంలో పులుల వేట విపరీతంగా కొనసాగేది. వేటాడిన పులుల కళేబరాలను పక్కన పెట్టుకుని ఫొటోలు దిగడం అప్పటి కులీనులకు ఫ్యాషన్‌గా ఉండేది. పులులు జనావాసాల మీద దాడి చేయడం కూడా పరిపాటిగా ఉండేది. జనావాసాలకు పులుల బెడద తప్పించడానికి కూడా పులులను వేటాడేవారు. పులులను వేటాడిన వారికి సమాజంలో భయభక్తులతో కూడిన గౌరవం కూడా ఉండేది. భారత్‌లో పులుల వేట ఎంతగా కొనసాగిందంటే కేవలం వందేళ్ల వ్యవధిలోనే పులుల జనాభా 40 వేల నుంచి 1800కు పడిపోయింది. స్వాతంత్య్రం వచ్చిన పాతికేళ్ల తర్వాత ప్రభుత్వం మెలకువ తెచ్చుకుని పులుల సంరక్షణకు నడుం బిగించిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రభుత్వాలు పులుల వేటపై నిషేధాజ్ఞలను అమలులోకి తెచ్చినా, దొంగచాటుగా పులుల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. పులుల ఎముకలు, ఇతర శరీర భాగాలను తూర్పు ఆసియా దేశాల్లోని సంప్రదాయ వైద్య చికిత్సల్లో వాడుతుండటమే ఈ వేటకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సంప్రదాయ ఔషధాలను తయారు చేసేవారు ఎంత ధరనైనా చెల్లించి పులుల శరీర భాగాలను కొనుగోలు చేస్తున్నారు. వాటితో తయారు చేసే ఔషధాలను రెట్టింపు లాభాలకు అమ్ముకుంటున్నారు. పులుల శరీర భాగాలను ఏయే వ్యాధుల చికిత్సలకు వాడతారంటే... పులితోక: పులితోకను స్కిన్ క్యాన్సర్ చికిత్సకు ఉపయోగిస్తారు. పులితోకను మూలికలతో నూరి తయారు చేసిన ఆయింట్మెంట్ పూసినట్లయితే స్కిన్ క్యాన్సర్ సహా ఎలాంటి మొండి చర్మవ్యాధులైనా నయమవుతాయని సంప్రదాయ చైనా వైద్యుల నమ్మకం. పులి ఎముకలు: పులి ఎముకలను నూరి, వైన్‌లో కలిపి తీసుకుంటే టానిక్‌లా పనిచేస్తుందని తైవాన్ సంప్రదాయ వైద్యుల నమ్మకం. పులి ఎముకలను దుష్టశక్తులను పారదోలడానికి భూతవైద్యులు కూడా ఉపయోగిస్తారు. పులికాళ్లు: పులి కాళ్లను పామాయిల్లో నానబెట్టి, వాటిని గుమ్మానికి వేలాడదీస్తే ఇంట్లోకి దుష్టశక్తులు చొరబడవని తూర్పు ఆసియా దేశాల్లో చాలామంది నమ్మకం. పులిచర్మం: పులి చర్మాన్ని విషజ్వరాలకు విరుగుడుగా ఉపయోగిస్తారు. పులి చర్మాన్ని దీర్ఘకాలం ఉపయోగించే వ్యక్తి పులితో సమానమైన శక్తి పొందుతాడని తూర్పు ఆసియా దేశాల్లో నమ్మకం. పులి పిత్తాశయం: పులి పిత్తాశయాన్ని, పిత్తాశయంలోని రాళ్లను తేనెలో కలిపి సేవిస్తే చర్మవ్యాధులు నయమవుతాయని నమ్ముతారు. పులి వెంట్రుకలు: పులి వెంట్రుకలను కాల్చితే వచ్చే పొగ జెర్రులను పారదోలుతుందని నమ్ముతారు. జెర్రులు చేరిన ఇళ్లల్లో తరచుగా పులి వెంట్రుకలను కాల్చడం చైనాలోను, పరిసర తూర్పు ఆసియా దేశాల్లోను ఆచారంగా ఉండేది. పులి మెదడు: పులిమెదడును నూనెలో వేయించి, మెత్తగా ముద్దలా నూరి తయారు చేసుకున్న లేహ్యాన్ని ఒంటికి పట్టించుకుంటే బద్ధకం వదిలిపోతుందని, మొటిమలు మొదలైన చర్మవ్యాధులు దూరమవుతాయని నమ్ముతారు. పులి కళ్లు: పులి కనుగుడ్లను నూరి తయారు చేసిన మాత్రలు జ్వరాలలో వచ్చే సంధిప్రేలాపనలకు విరుగుడుగా పనిచేస్తాయని నమ్ముతారు. పులి మీసాలు: పులి మీసాలను పంటినొప్పులకు విరుగుడుగా ఉపయోగిస్తారు. పులి పంజా: పులి పంజాను మెడలో ఆభరణంలా ధరించినా, జేబులో దాచుకుని తిరిగినా భయాలు తొలగిపోయి, గొప్ప ధైర్యం వస్తుందని నమ్ముతారు. పులి పంజా మొత్తం కాకున్నా, పులి గోళ్లను ధరించినా ఇవే ఫలితాలు ఉంటాయని చెబుతారు. పులి గుండె: పులి గుండెను తిన్నట్లయితే పులిలో ఉండే ధైర్యం, తెగువ, తెలివితేటలు వస్తాయని నమ్ముతారు. పులి పురుషాంగం: పులి పురుషాంగాన్ని వాజీకరణ ఔషధంగా ఉపయోగిస్తారు. -
ఔషధం కురిసే వేళ..
• కవర్ స్టోరీ వానాకాలం వచ్చేసింది. మిగిలిన కాలాలతో పోలిస్తే వానాకాలంలో వ్యాధులు వ్యాపించే అవకాశాలు ఎక్కువ. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల ఈ కాలంలో మరింతగా ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. మామూలు జలుబు, దగ్గులతో మొదలుకొని దోమల వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు, నీటి కాలుష్యం వల్ల తలెత్తే కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ వంటి వ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాతావరణంలోని చల్లదనం వల్ల దీర్ఘకాలంగా ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి కీళ్లనొప్పులు మరింతగా ఇబ్బందిపెడతాయి. వానాకాలంలో సహజంగానే అరుగుదల తక్కువగా ఉంటుంది. కడుపులో ఇబ్బందులు మొదలవుతాయి. కాసేపు ఎండ, కాసేపు వాన.. కొన్నాళ్లు తెరిపి లేకుండా కురిసే వానలు.. వాతావరణంలో ఇలాంటి తేడాల వల్ల చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు కూడా తలెత్తుతాయి. ఇంటి వద్దనే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో వచ్చే చాలా వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్నిసార్లు ఆరోగ్య ఇబ్బందులు తప్పకపోవచ్చు. అలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు ఇంటిపట్టునే పాటించదగ్గ కొన్ని చిట్కాలు మీకోసం... జలుబు, దగ్గులకు... వానాకాలంలో చాలామందిని ఇబ్బంది పెట్టేవి జలుబు దగ్గులే. జలుబు మొదలైతే ఏ పని చేయాలన్నా తోచదు. ముక్కుదిబ్బడతో సరిగా ఊపిరాడదు. ఇక గొంతులో గరగర మొదలై దగ్గు కూడా పట్టుకుంటుంది. ఈ పరిస్థితి నుంచి తేలికగా ఉపశమనం పొందాలంటే... ► జలుబు దగ్గుల నుంచి ఉపశమనానికి మిరియాల కషాయం చాలా ప్రశస్తమైన మార్గం. మిరియాల కషాయాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే... మిరియాలను బాగా దంచుకుని పొడి చేసుకోవాలి. టీస్పూన్ మిరియాల పొడిని రెండుకప్పుల నీళ్లలో వేసి నీరు సగానికి సగం ఇగిరిపోయేంత వరకు మరిగించుకోవాలి. ఇందులో రెండు టీస్పూన్ల తేనె కలుపుకొని, గోరువెచ్చగా అయిన తర్వాత మెల్ల మెల్లగా తాగాలి. మిరియాల కషాయం తీసుకోవడం వల్ల జలుబు దగ్గుల నుంచి తేలికగా ఉపశమనం లభిస్తుంది. ► దాల్చినచెక్క పొడి, శొంఠిపొడి సమపాళ్లలో కలుపుకోవాలి. ఈ పొడి మిశ్రమం ఒక టీస్పూన్ తీసుకుని, రెండు టీస్పూన్ల తేనెతో కలుపుకుని తీసుకున్నట్లయితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ► టీస్పూన్ నిమ్మరసంలో రెండు టీస్పూన్ల తేనె, పావు టీస్పూన్ దాల్చినచెక్క పొడి కలిపి తీసుకుంటే జలుబు, ముక్కు దిబ్బడల నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ► పిప్పళ్లను, బెల్లాన్ని సమభాగాలుగా తీసుకోవాలి. పిప్పళ్లను పొడిగా తయారు చేసుకుని, అందులో బెల్లం కలిపి చిన్న చిన్న ఉసిరికాయల పరిమాణంలో ఉండల్లా తయారు చేసుకోవాలి. జలుబు, దగ్గు ఇబ్బంది పెడుతున్నప్పుడు వీటిని బుగ్గన ఉంచుకుని చప్పరిస్తూ ఉంటే కొంత ఉపశమనం ఉంటుంది. ► అర టీ స్పూన్ కరక్కాయ పొడిని ఒక టీ స్పూన్ తేనెలో కలిపి తీసుకుంటే, దగ్గు నుంచి, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ► ముక్కుదిబ్బడ మరీ ఎక్కువగా ఉన్నట్లయితే వేడినీట్లో కొన్ని చుక్కల నీలగిరి తైలాన్ని, చెంచాడు పసుపును వేసి, ఆ నీటి ఆవిరిని పట్టించడం వల్ల ఉపశమనంగా ఉంటుంది. జలుబు దగ్గులకు తోడు తలనొప్పి కూడా ఉంటే, గుప్పెడు నీలగిరి ఆకులను ముద్దలా నూరి ఒక గుడ్డలో వాటిని మూటలా కట్టి తలకు కట్టుకుంటే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. ► తులసి రసం అర టీస్పూన్, అల్లం రసం అర టీస్పూన్ కలిపి ఒక టీస్పూన్ తేనెతో తీసుకున్నట్లయితే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనంగా ఉంటుంది. అలాగే రావి చిగుళ్ల రసాన్ని తేనెలో కలుపుకుని తీసుకున్నా జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం కలుగుతుంది. చర్మ సమస్యలకు వానాకాలంలో వాతావరణం స్థిరంగా ఉండదు. కాసేపు ఎండ, కాసేపు వాన.. వాతావరణంలో పెరిగే తేమ.. చర్మం తీరులో నానా మార్పులకు దారితీస్తాయి. కొందరికి ముఖం జిడ్డుగా మారుతుంది. పొడి చర్మం ఉన్నవాళ్లకయితే ముఖంపై చర్మం కూడా మరింత పొడిబారిపోయి కాంతిహీనంగా తయారవుతుంది. సరైన చెప్పులు లేకుండా వాననీరు పారుతున్న నేలపై ఎక్కువకాలం నడవాల్సి వస్తే, కాలి వేళ్లు ఒరిసిపోయి ఇబ్బంది పెడతాయి. ► చర్మం జిడ్డుగా మారుతున్నట్లయితే, సబ్బుబదులు సున్నిపిండిని స్నానానికి వాడటం మంచిది. ఆయుర్వేద సున్నిపిండిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెసలు, మినుములు సమభాగాలుగా తీసుకుని పొడి మూకుడులో దోరగా వేయించుకోవాలి. బావంచాలు, గంధకచ్చూరాలు, నాలుగు పసుపుకొమ్ములు వీటికి జతచేసి మిక్సీలో పొడి చేసుకోవాలి. వానాకాలంలో స్నానానికి ఈ పొడిని ఉపయోగంచడం క్షేమం. ► తెరిపిలేని వానల వల్ల బయటి వాతావరణం మరీ చల్లగా ఉన్నట్లయితే, స్నానానికి గంట ముందు ఒంటికి ఆవనూనె పట్టించి, ఆ తర్వాత సున్నిపిండితో స్నానం చేయడం మంచిది. ఇలా చేస్తే బయట ఎంత ముసురు పట్టినా, అంతలోనే ఎండ వచ్చినా చర్మం తాజాగా ఉంటుంది. ► ముఖం జిడ్డుగా మారి, మొటిమలు వంటివి కూడా ఇబ్బంది పెడుతున్నట్లయితే, గుప్పెడు వేపాకులు, నాలుగైదు పసుపుకొమ్ములు కలిపి నూరుకోవాలి. ఇలా నూరుకున్న ముద్దకు చెంచాడు నిమ్మరసం జోడించి, ఫేస్‌ప్యాక్‌లా ముఖానికి పట్టించుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడుక్కుని తేలికపాటి పొడి కాటన్ టవల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ► వర్షాకాలంలో వీలైనంత వరకు సాక్స్ బిగించి, షూస్ ధరించకపోవడమే మంచిది. నీటి మడుగులను తలపించే రోడ్లపై నడవాల్సి వస్తే, షూస్‌లోకి నీరు చేరి, సాక్స్ పూర్తిగా తడిసిపోతాయి. దీనివల్ల పాదాల వేళ్లు ఒరిసిపోయి, ఫంగస్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వేళ్లు ఒరిసిపోయినట్లయితే, ఒరిసిపోయిన చోట వేపాకు, పసుపు ముద్దను పట్టించి, అరగంట తర్వాత పాదాలను గోరువెచ్చని నీట్లో కడిగి, పొడిగా ఆరనివ్వాలి. పాదాలకు గాలి ఆడే చెప్పులు ధరిస్తే వేళ్లు ఒరిసిపోయేంత పరిస్థితి రాదు. ► ముఖం పొడిబారి కాంతిహీనంగా తయారవుతున్నట్లయితే, తాజా వేపాకులు, కలబంద ఆకులు ముద్దగా నూరుకుని ఫేస్‌ప్యాక్‌లా ముఖానికి పట్టించండి. ఆరగంట సేపు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడిగేయండి. దీనివల్ల ముఖంపై తేమ ఆరిపోకుండా ఉంటుంది. ► బాగా వానలో తడిసిపోయే పరిస్థితులు ఎదురైతే, గోరువెచ్చని నీటితో సున్నిపిండి ఉపయోగించి స్నానం చేయండి. ఒంటిని జుట్టును పొడిగా ఆరబెట్టుకోండి. దీని వల్ల చర్మం తాజాగా ఉంటుంది. జుట్టు సమస్యలకు వానాకాలంలో జుట్టును సంరక్షించుకోవడం కొంచెం కష్టమే. తరచు తడిసే పరిస్థితులు ఉంటే తలకు చుండ్రు పట్టడం, జుట్టు బాగా రాలిపోవడం వంటి పరిస్థితులు తలెత్తుతుంటాయి. జుట్టు బలహీనపడి, కాంతిహీనంగా తయారవుతుంది. జుట్టును కాపాడుకోవాలంటే వర్షాకాలంలో బయటకు వెళ్లేటప్పుడు గొడుగు లేదా రెయిన్‌కోట్ తీసుకువెళ్లాల్సిందే. అయినప్పటికీ కొన్ని సమస్యలు తప్పవు. ► తలస్నానానికి రసాయనాలతో తయారైన షాంపూల బదులుగా కుంకుడుకాయలను వాడండి. తలస్నానానికి గంట ముందు భృంగామలక తైలంతో జుట్టు కుదుళ్లకు పట్టేలా నెమ్మదిగా మర్దన చేయాలి. స్నానం తర్వాత తలను బాగా తుడుచుకుని, పొడిగా ఆరిన తర్వాతే దువ్వుకోవాలి. ► జుట్టుకు చుండ్రు పట్టినట్లయితే తాజా వేపాకులు, మెంతులు, ఉసిరికాయలు మెత్తగా నూరుకుని, అందులో చెంచాడు నిమ్మరసం కలుపుకుని తలకు పట్టించాలి. అరగంట తర్వాత కుంకుడుకాయలు లేదా షీకాయ ఉపయోగించి తల స్నానం చేయాలి. ► వారానికి కనీసం రెండుసార్లయినా కుంకుడుకాయలు లేదా షీకాయ ఉపయోగించి తలస్నానం చేయాలి. చుండ్రు నివారణ కోసం తలస్నానానికి ముందు నువ్వులనూనెలో కొన్నిచుక్కల వేపనూనె కలిపి తలకు పట్టించుకోవాలి. అరగంట సేపటి తర్వాత తలస్నానం చేయాలి. ► తలకు చుండ్రుపట్టి ఇబ్బందిగా ఉన్నట్లయితే, తలస్నానానికి గంట ముందు కాస్త పెరుగులో నిమ్మరసం పిండుకుని తలకు బాగా పట్టించాలి. తర్వాత కుంకుడుకాయలు లేదా షీకాయతో తలస్నానం చేయాలి. ► అనుకోకుండా వర్షంలో తడిసినట్లయితే, కేవలం జుట్టు తుడిచేసుకుని అక్కడితో వదిలేయకుండా, గోరువెచ్చని నీటితో తలస్నానం చేసి జుట్టును పొడిగా ఆరబెట్టుకోండి. జుట్టు బాగా ఆరిన తర్వాత కొద్ది చుక్కల వేపనూనె కలిపిన నువ్వులనూనె లేదా ఆమ్లాతైలాన్ని జుట్టుకు పట్టించండి. ఇలా చేయడం వల్ల చుండ్రు సమస్య దాదాపు దరిచేరదు. ► జుట్టు పొడిబారి రాలిపోతున్నట్లయితే, తలస్నానానికి అరగంట ముందు జుట్టుకు తాజా కలబంద గుజ్జును పట్టించండి. కుంకుడు కాయలు లేదా షీకాయతో తలస్నానం చేయండి. తలకు మామూలు నూనెల బదులు భృంగామలక తైలాన్ని వాడండి. జుట్టు దృఢంగా, కాంతివంతంగా తయారవుతుంది. ► జుట్టు రాలిపోవడం, చుండ్రు సమస్యలు వానాకాలంలో ఇబ్బందిపెడుతుంటే, వస కొమ్ములతో చక్కని పరిష్కారమార్గం ఉంది. వసకొమ్ములను రాత్రంతా నానబెట్టి, తర్వాత వాటిని ఎండబెట్టి, పొడి చేసుకోవాలి. ఒక టీస్పూన్ వస కొమ్ముల పొడిని కప్పు పెరుగులో కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత కుంకుడు కాయలు లేదా షీకాయతో తలస్నానం చేయాలి. జీర్ణ సమస్యలకు వర్షాకాలంలో వాతావరణంలోని హెచ్చుతగ్గుల వల్ల జీర్ణప్రక్రియ కొంత మందగిస్తుంది. వర్షం కురుస్తుంటే చాలామంది జిహ్వచాపల్యాన్ని ఆపుకోలేక వేడివేడి బజ్జీలు, పకోడీలు వంటివి ఎక్కడపడితే అక్కడ లాగించేస్తూ ఉంటారు. ఫలితంగా కడుపు ఉబ్బరం, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు మరింతగా ఇబ్బందిపెడతాయి. జీర్ణప్రక్రియను సజావుగా కాపాడుకుంటే, వర్షాకాలాన్ని ఆనందంగా ఆస్వాదించవచ్చు. ► వర్షాకాలంలో వీలైనంత వరకు తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవడమే మేలు. విపరీతంగా మసాలాలు, ఎక్కువ నూనె వాడి తయారు చేసే వంటకాలకు దూరంగా ఉంటే జీర్ణ ప్రక్రియ సజావుగా ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ఆకు కూరలు, ఉడికించిన గింజలు వంటివి తీసుకోవడం వల్ల మలబద్ధకం వంటి సమస్యలను నివారించుకోవచ్చు. ► జీర్ణప్రక్రియ మందగించి, ఆకలి తగ్గిపోయినట్లయితే, భోజనం చేసేటప్పుడు అన్నంలోని మొదటి ముద్దలో నేతిలో దోరగా వేపిన చెంచాడు వాముగింజలను కలుపుకుని తినండి. వానాకాలంలో దొరికే పండ్లు, కూరగాయలను పుష్కలంగా తీసుకోండి. ► శొంఠి, మిరియాలు, పిప్పళ్లు సమభాగాలుగా తీసుకుని పొడిగా తయారు చేసుకోండి. ఈ పొడిని ఒక టీస్పూన్ తీసుకుని, అందులో అంతే పరిమాణంలో బెల్లం, నెయ్యి కలుపుకుని మధ్యాహ్న భోజనంలో మొదటి ముద్దను తీసుకోండి. రాత్రివేళ భోజనం తర్వాత త్రిఫలా చూర్ణం గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోండి. దీనివల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడుతుంది. ► కడుపు ఉబ్బరం ఇబ్బంది పెడుతున్నట్లయితే, పలచని మజ్జిగలో తగినంత ఉప్పు, టీ స్పూన్ మెంతిపొడి కలిపి తీసుకున్నట్లయితే ఉపశమనంగా ఉంటుంది. అల్లం కషాయం తీసుకున్నా కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం లభిస్తుంది. ► ఆకలి మందగించి కడుపు ఉబ్బరంగా ఉన్నట్లయితే వాము, మిరియాలు, ఉప్పు సమభాగాలుగా తీసుకుని పొడిగా తయారు చేసుకోవాలి. ప్రతిరోజూ భోజనానికి ముందు గోరువెచ్చని నీళ్లలో ఈ పొడిని కలుపుకొని సేవిస్తే ఉపశమనంగా ఉంటుంది. ► రాత్రి నీట్లో నానబెట్టిన ఖర్జూరాలు లేదా ఎండుద్రాక్షలను ఉదయాన్నే అల్పాహారానికి ముందు తీసుకున్నట్లయితే జీర్ణశక్తి మెరుగుపడుతుంది. భోజనానికి ముందు అరగ్లాసు పుదీనారసంలో, చెంచాడు అల్లం రసం కలిపి తాగితే జీర్ణశక్తి మెరుగుపడటమే కాకుండా, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ► ఆకలి మందగించినట్లయితే పసుపు, శొంఠిపొడి, ఉప్పు, నెయ్యి అన్నంలో కలుపుకొని మొదటి ముద్దగా తిన్నట్లయితే, జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అజీర్తి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఒంటి కీళ్ల నొప్పులకు దీర్ఘకాలంగా కీళ్లనొప్పులతో బాధపడేవారికి వానాకాలంలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. సాధారణ ఆరోగ్యంతో ఉండేవారిని సైతం ఈ కాలంలో సర్వసామాన్యంగా వచ్చే జలుబు దగ్గులు జ్వరాలతో పాటు ఒంటినొప్పులు బాధిస్తాయి. వయసు మళ్లినవారికైతే ఈ నొప్పులు మరింతగా బాధిస్తాయి. ► మార్నింగ్ వాక్ అలవాటున్న వారు బయట వర్షం కురుస్తున్నప్పుడు వాక్కు బ్రేక్ చెప్పేస్తారు. దీనివల్ల కీళ్లు పట్టేసినట్లవుతాయి. ఉదయపు నడక సాగనప్పుడు ఇంటి పట్టునే వ్యాయామాలు, యోగా వంటివి చేయడం ద్వారా కీళ్ల ఆరోగ్యం అదుపులో ఉంటుంది. ► వానాకాలంలో ఒంటినొప్పులు బాధిస్తున్నట్లయితే అశ్వగంధ, తానికాయ చూర్ణాలను సమభాగాలుగా తీసుకుని, ఆ చూర్ణాల మిశ్రమంలో అంతే పరిమాణంలో బెల్లం కలిపి తీసుకుంటే వాతపు నొప్పులు తగ్గుముఖం పడతాయి. ► శొంఠి, మిరియాలను సమభాగాలుగా తీసుకుని, వాటిని దోరగా వేయించి పొడి చేసుకోవాలి. ఒక టీ స్పూన్ పొడిని తేనెతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ► అశ్వగంధ వేరును మెత్తగా పొడిలా తయారు చేసుకుని, కప్పు నీరు లేదా కప్పు పాలలో వేసి అవి సగానికి సగం ఇగిరేలా మరిగించి కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయాన్ని రోజూ రెండుపూటలా తీసుకున్నట్లయితే నడుం నొప్పి, వెన్నునొప్పి తగ్గుతాయి. ► ఇంగువ, పసుపు ఒక్కో టీస్పూన్ చొప్పున తీసుకుని, బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. మిశ్రమంగా మారిన ఈ పొడిని కాగితంలో వేసి కాల్చి, ఆ వాసనను పీలిస్తే వానాకాలంలో వేధించే పార్శ్వపు తలనొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ► పావులీటరు నీటిలో గుప్పెడు పారిజాతం ఆకులను వేసి, ఆ నీటిని సన్నటి మంటపై మరిగించాలి. సగానికి సగం ఇగిరిపోయేలా నీరు బాగా మరిగిన తర్వాత ఆ నీటిని వడగట్టుకుని, ఆ నీటిలో అర టీస్పూన్ శొంఠిపొడి, ఒక టీస్పూన్ పటికబెల్లం కలిపి రోజూ తాగుతున్నట్లయితే నడుంనొప్పి, వెన్నునొప్పి, కీళ్లనొప్పులు తగ్గుతాయి. ► మునగాకులను, నీలగిరి ఆకులను సమభాగాలుగా తీసుకుని ఒక కప్పు ఆముదంలో మగ్గించి, ఆ మిశ్రమంతో నొప్పులు ఉన్న చోట కాపడం పెడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. -
చంద్రుడిపై కుందేలు ఎలా ఉంది?
చందమామ చుట్టూ ఎన్నో కథలు, కల్పనలు... చందమామ చుట్టూ ఎన్నెన్నో పాటలు, ఆటలు... చంద్రుని మీద కనిపించే మచ్చ కుందేలులా కనిపిస్తుంది. నిజానికి అక్కడ కుందేలేమైనా ఉందా? అక్కడ లేకుంటే భూమ్మీద నుంచి కుందేలును పంపితే– ఆ కుందేలు అక్కడ సంతోషంగా ఉంటుందా? చంద్రుని గురించి మనకు కొంత తెలుసు. చాలా తెలీదు. చంద్రుడి మీద మానవుడు అడుగుమోపి ఐదు దశాబ్దాలు గడిచాయి. అయినా, చంద్రుడి గురించి తెలుసుకోవలసిన సంగతులు కొండంత. నేడు చంద్రయాన్–2 ప్రయోగం సందర్భంగా... అందిన చందమామను మరోసారి అందుకోవడానికి సిద్ధపడుతున్నారు మన శాస్త్రవేత్తలు. చందమామ మీద అందీ అందని రహస్యాలను అందిపుచ్చుకోవడానికి నేడు ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెడుతున్నారు. ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని మైలస్వామి అన్నాదురై నేతృత్వంలో ఇదివరకు విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తల బృందం ఆధ్వర్యంలోనే ‘చంద్రయాన్–2’ ప్రయోగం జరుగుతోంది. భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చరిత్రలో ఈ ప్రయోగం మరో మైలురాయిగా నిలిచిపోతుంది. రష్యా అంతరిక్ష సంస్థ (రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజెన్సీ–రాస్‌కాస్మోస్) సహకారంలో ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు మరోసారి చంద్రుడి మీద పరిశోధనలకు రంగం సిద్ధం చేసుకున్నారు. ‘చంద్రయాన్–2’ మిషన్‌లో భాగంగా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జియోసెంట్రిక్ లాంచ్ వెహికల్–మార్క్3 (జీఎస్ఎల్వీ–మార్క్3 ) వాహనం ద్వారా ఆర్బిటర్, ల్యాండర్, రోవర్లను నేడు చంద్రుని దిశగా అంతరిక్షంలోనికి పంపనున్నారు. ఇందులో మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు తయారు చేసిన లూనార్ ఆర్బిటర్, రోవర్లతో పాటు రష్యా అంతరిక్ష సంస్థ తయారు చేసిన ల్యాండర్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో చక్రాలు కలిగిన రోవర్ యంత్రం సౌరశక్తితో పనిచేస్తూ, చంద్రుని ఉపరితలంపై సంచరించి, అక్కడి మట్టి, రాళ్ల నమూనాలను సేకరించి, వాటి రసాయనిక విశ్లేషణ జరిపి, ఆ సమాచారాన్ని ‘చంద్రయాన్–2’ ఆర్బిటర్ ద్వారా భూమిపైనున్న ‘ఇస్రో’ పరిశోధన కేంద్రానికి చేరవేస్తుంది. ‘చంద్రయాన్–2’ ప్రయోగం కోసం దాదాపు పుష్కరకాలం నుంచే సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రయోగంలో కలసి పాల్గొనాలని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు, రష్యా అంతరిక్ష సంస్థ (రాస్‌కాస్మోస్) 2007 నవంబరు 12న ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందానికి 2008 సెప్టెంబర్ 18న నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలోని కేబినెట్ బృందం ఆమోదం తెలిపింది. ‘ఇస్రో’, రాస్కాస్మోస్ల ఒప్పందం ప్రకారం రోవర్, ఆర్బిటర్ల తయారీ బాధ్యతను ‘ఇస్రో’ తీసుకోగా, ‘రాస్‌కాస్మోస్’ ల్యాండర్ తయారీ బాధ్యతలను చేపట్టింది. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్ చంద్రునికి 200 కిలోమీటర్ల దూరంలోని కక్ష్యలో పరిభ్రమిస్తుంది. ‘రాస్‌కాస్మోస్’ తయారు చేసిన ల్యాండర్.. ‘ఇస్రో’ తయారు చేసిన రోవర్‌ను చంద్రుని ఉపరితలంపైకి దిగవిడుస్తుంది. వీటిని అంతరిక్షంలోకి చేరవేసే జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనం ఆకృతిని ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2009 ఆగస్టులోనే సిద్ధం చేశారు. దీని బరువు 2650 కిలోలు. ల్యాండర్, రోవర్ల బరువు దాదాపు 1250 కిలోలు. ‘ఇస్రో’ రూపొందించిన ఆర్బిటర్‌లో ఐదు ఉపగ్రహాలు ఉంటాయి. వీటిలో మూడు కొత్తగా రూపొందించినవైతే, మిగిలిన రెండూ చంద్రయాన్–1లో ప్రయోగించిన పాత ఉపగ్రహాలే. అయితే, మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు వీటిని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేశారు. అన్నీ స్వదేశీ పరికరాలే... చంద్రయాన్–2 ప్రయోగంలో భాగంగా జీఎస్ఎల్వీ–మార్క్3 వాహనాన్ని భారతీయ కాలమానం ప్రకారం జూలై 14న వేకువ జామున 2.51 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి అంతరిక్షంలోకి పంపనున్నారు. ఇందులోని ల్యాండర్ ద్వారా రోవర్ యంత్రం చంద్రుని ఉపరితలం మీదకు సెప్టెంబర్ 6న చేరుకోగలదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆర్బిటర్ ద్వారా ఐదు, ల్యాండర్ ద్వారా నాలుగు, రోవర్ ద్వారా రెండు సాంకేతిక పరికరాలను ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అంతరిక్షంలోకి పంపుతున్నారు. చంద్రయాన్–2లో భాగంగా, అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, యూరోపియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఈఎస్ఏ) కూడా కొన్ని సాంకేతిక పరికరాలను పంపాలని భావించినా, బరువు పరిమితుల కారణంగా విదేశీ పరికరాలనేవీ ఈ ప్రయోగంలో పంపరాదని ‘ఇస్రో’ బృందం నిర్ణయించింది. చంద్రయాన్–1 తరహాలోనే చంద్రుని ఉపరితలంపై విశేషాలను మరింత లోతుగా తెలుసుకునే ఉద్దేశంతో ‘ఇస్రో’ ‘చంద్రయాన్–2’ ప్రయోగాన్ని తలపెట్టింది. ఇందులో భాగంగా అంతరిక్షంలోకి పంపుతున్న సాంకేతిక పరికరాల ద్వారా చంద్రుని ఉపరితలాన్ని రోవర్ ద్వారా జల్లెడపట్టి, ఉపరితలంపై మట్టిలోని రసాయనాల విశేషాలను, ఒకవేళ చంద్రునిపై నీటి అణువుల జాడ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలని భావిస్తోంది. రోవర్‌కు అమర్చిన టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా–2 (టీఎంసీ–2), మినియేచర్ సింథటిక్ అపెర్చర్ రాడార్ (మినీ–సార్) పరికరాలు చంద్రయాన్–1లో ఉపయోగించిన పరికరాల కంటే మరింత మెరుగైనవి. వీటిలో టీఎంసీ–2 చంద్రుని ఉపరితలానికి చెందిన త్రీడీ మ్యాప్‌లను ఆర్బిటర్‌లోని పరికరాల ద్వారా భూమిపైకి పంపుతుంది. అలాగే, మినీ–సార్ చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలోని పేరుకుపోయి ఉన్న మంచులోని నీటి కణాలను, అక్కడి మట్టిని, మట్టి మందాన్ని విశ్లేషించి, ఆ సమాచారాన్ని భూమిపైకి పంపుతుంది. చంద్రుని చుట్టూ ఆవరించి ఉన్న వాతావరణంలోని అత్యంత ఎగువ పొర అయిన ‘అయానోస్ఫియర్’లోని ఎలక్ట్రాన్ల సాంద్రతను ‘డ్యూయల్ ఫ్రీక్వెన్సీ రేడియో సైన్స్’ (డీఎఫ్‌ఆర్‌ఎస్) పరికరం విశ్లేషిస్తుంది. ఐఆర్ స్పెక్ట్రోమీటర్ పరికరం చంద్రునిపై నీటి అణువుల జాడను, ఖనిజాలను గుర్తించి, ఆ సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తుంది. ఆర్బిటర్‌కు అమర్చిన హైరిజల్యూషన్ కెమెరా (ఓహెచ్‌ఆర్‌సీ) ల్యాండర్ చంద్రుని ఉపరితలంపైన నిర్దేశిత ప్రదేశానికి సురక్షితంగా చేరుకోగానే త్రీడీ ఫొటోలు తీసి, వాటిని భూమిపైకి పంపిస్తుంది. చంద్రయాన్–2లోని ‘సోలార్ ఎక్స్‌రే మానిటర్’ చంద్రుని వాతావరణానికి ఎగువన ఆవరించి ఉన్న ‘కరోనా’ ప్రాంతంలో సూర్యకిరణాల తీవ్రత ఏ స్థాయిలో ఉన్నదీ కొలవడానికి ఉపయోగపడుతుంది. చంద్రుని దక్షిణ ధ్రువప్రాంతంలో సంచరించనున్న రోవర్ తెలుసుకునే సమాచారాన్ని ఆర్బిటర్ ఎప్పటికప్పుడు భూమిపైకి చేరవేస్తూ ఉంటుంది. ఇది చంద్రుని కక్ష్యలో ఏడాది పాటు పరిభ్రమిస్తుంది. చందమామ అందిన రోజు చంద్రుని చుట్టూ ఎన్నో పురాణాలు ఉన్నాయి. అభూత కల్పనలు ఉన్నాయి. అందరాని చందమామను అందుకోవాలనే తపన మానవుల్లో చాలా ఏళ్లుగానే ఉండేది. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ ఈ తపన మరింత ఎక్కువైంది. మానవుడికి సంకల్పబలం ఉండాలే గాని, అసాధ్యమైనదేదీ లేదని నిరూపిస్తూ అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 16న భూమిపై నుంచి చంద్రునిపైకి ప్రయాణించాడు. చందమామ మానవుడి చేతికందిన అద్భుతమైన రోజు అది. అపోలో–11 వ్యోమనౌకలో బయలుదేరిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై అడుగు మోపిన తొట్టతొలి మానవుడిగా చరిత్ర సృష్టించాడు. చంద్రుడి ధూళిని సేకరించి భూమిపైకి విజయవంతంగా తిరిగివచ్చాడు. అయితే, అంతకు పదేళ్ల ముందే, 1959లో రష్యా చంద్రునిపైకి లూనా–2 వ్యోమనౌకను విజయవంతంగా పంపింది. చంద్రుడిపైకి మానవులు పంపిన వస్తువు ఒకటి చేరుకోవడం చరిత్రలో అదే మొదటిసారి. చంద్రునిపైకి వ్యోమనౌకలను పంపడానికి రష్యా అంతకు ముందు మూడుసార్లు చేసిన ప్రయోగాలు విఫలమయ్యాయి. రష్యన్ శాస్త్రవేత్తలు 1958 సెప్టెంబర్ 23, అక్టోబర్ 12, డిసెంబర్ 4లలో పంపిన వ్యోమనౌకలేవీ చంద్రునిపైకి చేరుకోలేకపోయాయి. వరుస వైఫల్యాల తర్వాత ‘లూనా’ ప్రయోగాలకు రష్యా నడుం బిగించింది. ఇందులో భాగంగా 1959 జనవరి 2న ప్రయోగించిన ‘లూనా–1’ చంద్రునికి 5,965 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని తప్పింది. తిరిగి లోపాలను దిద్దుకుని అదే ఏడాది సెప్టెంబర్ 13న పంపిన ‘లూనా–2’ విజయవంతంగా చంద్రునిపైకి చేరుకోగలిగింది. అయితే, చంద్రునిపైకి మనిషిని తొలిసారిగా పంపిన ఘనత మాత్రం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) దక్కించుకోగలిగింది. ‘నాసా’ ఆధ్వర్యంలో జరిపిన ప్రయోగంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ 1969 జూలై 20న చంద్రునిపై తొలి అడుగు మోపి, అక్కడి నుంచి ‘చంద్రుని మీద మనిషి మోపిన తొలి అడుగు మానవాళికే ముందడుగు’ అంటూ సందేశం పంపాడు. చంద్రునిపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మోపిన తొలి అడుగు ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ స్ఫూర్తితోనే చాలా దేశాలు చంద్రుడిని చేరుకోవడానికి, చంద్రుడి రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. నాటి నుంచి నేటి వరకు వివిధ దేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు చంద్రుడి వద్దకు ఉపగ్రహాలు, వ్యోమనౌకలు పంపుతూ కీలకమైన సమాచారాన్ని సేకరిస్తూ వస్తున్నాయి. భూమికి సహజ ఉపగ్రహమైన చందమామ ఏనాటికైనా మానవులకు ఆవాసం కాకపోతుందా అనే ఆశతో చేస్తున్న ప్రయోగాల్లో ఇప్పటికే అనేక విజయాలు సాధించాయి. చంద్రునిపై పంటలు పండించడం ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకోవడానికి చైనా ఇటీవల ఒక ప్రయత్నం చేసింది. చంద్రునిపై పత్తి విత్తనాలను మొలకెత్తించింది. చంద్రుని ఉపరితలంపై రాత్రివేళ అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా మొలకెత్తిన విత్తనం జీవాన్ని పుంజుకోకుండానే అంతరించిపోయింది. ‘చంద్రయాన్–1’ సాధించిందేమిటంటే..? చంద్రునిపై పరిశోధనల కోసం ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇదివరకు చేపట్టిన చంద్రయాన్–1 గణనీయమైన ఫలితాలనే సాధించింది. ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు 2008 అక్టోబర్ 22న ‘చంద్రయాన్–1’ ప్రయోగాన్ని చేపట్టారు. అందులో భాగంగా పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ–సీ 11) ద్వారా పంపిన ఉపగ్రహం చంద్రుని చుట్టూ 3,400 సార్లు పరిభ్రమించి, కీలకమైన సమాచారాన్ని చేరవేసింది. దీని నుంచి 2009 ఆగస్టు 29న కమ్యూనికేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. చంద్రుని ఉపరితలంపై హైడ్రాక్సిల్ (ఓహెచ్), నీరు (హెచ్2ఓ) అణువుల ఉనికిని తొలిసారిగా గుర్తించగలగడం ‘చంద్రయాన్–1’ సాధించిన ఘనవిజయంగా చెప్పుకోవచ్చు. ‘చంద్రయాన్–1’ చంద్రుని ఉపరితలంపై మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్, క్యాల్షియం వంటి మూలకాల ఉనికిని కూడా గుర్తించింది. ‘చంద్రయాన్–1’లో భాగంగా చంద్రునిపైకి చేరుకున్న టెర్రయిన్ మ్యాపింగ్ కెమెరా (టీఎంసీ) ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత స్పష్టతతో కూడిన త్రీడీ చిత్రాలను భూమిపైకి చేరవేయగలిగింది. దీని ద్వారా చంద్రుని ఉపరితలంపై లావా ట్యూబుల ఉనికిని గుర్తించడం సాధ్యమైంది. ఇలాంటి లావా ట్యూబులు భవిష్యత్తులో చంద్రుడు మానవుల ఆవాసంగా ఉపయోపడే అవకాశాలపై గల ఆశలకు ఊపిరిపోస్తున్నాయని శాస్త్రవేత్తల అభిప్రాయం. చంద్రునిపై ఆసక్తి ఏనాటిదంటే? గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్, ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో చంద్రునిపై మనుషుల్లో ఆసక్తి ఆధునిక పరిశోధనలు మొదలు కావడానికి వేల సంవత్సరాల ముందు నుంచే ఉండేది. నాగరికతలు మొదలు కాక ముందు నుంచే భూమ్మీద నివసించే మనుషులు సూర్యచంద్రులను గమనిస్తూనే ఉన్నారు. నాగరికతలు మొదలైన తొలినాళ్లలో సూర్యచంద్రులను దేవతలుగా ఆరాధించడం మొదలైంది. శాస్త్రీయంగా సూర్యచంద్రుల స్వరూప స్వభావాలను తెలుసుకోవాలనే ఆసక్తి క్రీస్తుపూర్వమే మొదలైంది. సూర్యచంద్రులు రెండూ అంతరిక్షంలోని భారీ రాతిగోళాలని క్రీస్తుపూర్వం ఐదో శతాబ్దికి చెందిన గ్రీకు తత్వవేత్త ఆనాక్సగోరాస్ తొలిసారిగా ప్రకటించాడు. శాస్త్రీయమైన దృష్టితో తన పరిశీలనకు తోచిన సంగతి చెప్పిన పాపానికి నాటి గ్రీకు పాలకులు మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడనే ఆరోపణతో ఆయనను ఖైదులో పెట్టారు. నిండు పున్నమినాడు భూమ్మీద మనుషులకు చంద్రుడు పూర్ణ కాంతులతో దర్శనమిస్తాడు. ఎంత పూర్ణకాంతులతో ధగధగలాడుతున్నా చంద్రుడిపై అక్కడక్కడా మచ్చలు కనిపిస్తాయి. ఈ మచ్చలను సైతం నాటి మనుషులు నిశితంగా పరిశీలించారు. చంద్రుడిపై కుందేలు ఆకారంలోని నీడను చూసి అనేక అభూత కల్పనలను ఊహించుకున్నారు. చంద్రుడిపై భారీస్థాయి ఎత్తు పల్లాలు ఉన్నందు వల్లనే చంద్రుడి ఉపరితలంలోని కొన్ని ప్రదేశాలకు సూర్యకాంతి చేరుకోలేకపోతోందని, అందుకే మనకు అక్కడక్కడా మచ్చల్లా కనిపిస్తున్నాయని మొట్టమొదటిసారిగా క్రీస్తుశకం రెండో శతాబ్దికి చెందిన గ్రీకు శాస్త్రవేత్త ప్లూటార్క్ తన ‘ఆన్ ది ఫేస్ ఇన్ ది మూన్స్ ఆర్బ్’ గ్రంథం ద్వారా తెలిపాడు. చంద్రుడిపై పడి పరావర్తనం చెందిన సూర్యకాంతి కారణంగానే చంద్రుడు మనకు వెన్నెల వెలుగులతో కనిపిస్తున్నాడని క్రీస్తుశకం ఐదో శతాబ్దికి చెందిన మన భారతీయ శాస్త్రవేత్త ఆర్యభట్ట తొలిసారిగా ప్రకటించాడు. కొంతకాలానికి మనుషులు ఖగోళ విశేషాలను మరింత నిశితంగా తెలుసుకోవడానికి దుర్భిణుల వంటి సాధనాలను రూపొందించుకున్నారు. గ్రహాలు, నక్షత్రాల తీరుతెన్నులను తెలుసుకునే ఉద్దేశంతో వేధశాలలను ఏర్పాటు చేసుకున్నారు. క్రీస్తుశకం తొమ్మిదో శతాబ్దిలో బాగ్దాద్‌లో ఏర్పాటు చేసిన వేధశాల నుంచి పర్షియన్ ఖగోళ శాస్త్రవేత్త హబాష్ అల్ హసీబ్ అల్ మర్వాజీ చంద్రుని వ్యాసం 3,037 కిలోమీటర్లు ఉంటుందని, భూమికి చంద్రునికి మధ్యనున్న దూరం 3,46,345 కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా వేశాడు. ఆయన అంచనాలు అధునాతన పరిశోధనల్లో నిగ్గుతేలిన అంచనాలకు దాదాపు దగ్గరగా ఉండటం విశేషం. పదహారో శతాబ్దికి చెందిన ఇటాలియన్ శాస్త్రవేత్త గెలీలియో శక్తిమంతమైన టెలిస్కోప్‌ను రూపొందించి, దాని ద్వారా చంద్రుడు, నక్షత్రాలు, గ్రహచలనాలను ఏళ్ల తరబడి పరిశీలించి, అనేక విషయాలను వెల్లడించాడు. అంతరిక్షంలో భారతీయుడు సోవియట్ రష్యా 1984 ఏప్రిల్ 2న ప్రయోగించిన సోయజ్ టీ–11 రాకెట్ ద్వారా భారత పైలట్ రాకేశ్ శర్మ చంద్రమండలానికి చేరువగా అంతరిక్ష కక్ష్యలోకి వెళ్లాడు. అంతరిక్షంలో అడుగు మోపిన తొలి భారతీయుడిగా ఘనత సాధించిన రాకేశ్ శర్మ అంతరిక్షంలో దాదాపు ఎనిమిది రోజులు గడిపాడు. తిరిగి భూమిపైకి చేరుకున్న తర్వాత రష్యన్ బృందంతో కలసి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీతో టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు, ఇందిరాగాంధీ ఆయనను ‘అంతరిక్షం నుంచి చూస్తే భారత్ ఎలా కనిపించింది?’ అని అడిగారు. ఆమె ప్రశ్నకు రాకేశ్ శర్మ ‘సారే జహా సే అచ్ఛా’ (ప్రపంచంలోనే అత్యుత్తమంగా) కనిపించిందని బదులిచ్చాడు. ప్రచ్ఛన్న యుద్ధంతో అందిన చందమామ అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం ఒకరకంగా చంద్రునిపై ఆధునిక పరిశోధనల పురోగతికి దోహదపడింది. ఇరవయ్యో శతాబ్దిలో నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో రెండు దేశాలూ అంతరిక్షంపై ఆధిపత్యం కోసం పోటీ పడ్డాయి. చంద్రునిపై ప్రత్యేకించి దృష్టి సారించాయి. ఎలాగైనా చంద్రునిపైకి చేరుకోవాలనే లక్ష్యంతో శాస్త్రవేత్తలను రంగంలోకి దించి, భారీ స్థాయి పరిశోధనలకు నడుం బిగించాయి. రెండు దేశాల మధ్య నెలకొన్న హోరాహోరీ పోటీలో కొన్ని విఫలయత్నాల తర్వాత 1959లో లూనా–2 ప్రయోగం ద్వారా రష్యా తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత లూనా–3 ప్రయోగాన్ని కూడా విజయవంతంగా చేసింది. చంద్రుని ఉపరితలం ఫొటోలను తీసి ప్రపంచానికి చూపింది. రష్యాను మించిన స్థాయిలో ఏకంగా మనిషినే చంద్రునిపైకి పంపాలని నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ తలచాడు. జాతీయ సత్వర అవసరాల సభలో ఆయన ఈ అంశాన్ని ముందుకు తెచ్చాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’కు భారీగా నిధులు మంజూరు చేశాడు. ఫలితంగా రష్యా చేపట్టిన లూనా–2 ప్రయోగానికి పదేళ్ల తర్వాత 1969లో అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై అడుగుమోపగలిగాడు. వేగం పుంచుకున్న ‘ఇస్రో’ చంద్రునిపై పరిశోధనల్లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్కాస్మోస్లతో పోల్చుకుంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కాస్త వెనుకబడిందనే చెప్పుకోవాలి. ఇస్రో ఆధ్వర్యంలో చంద్రునిపై చేపట్టిన తొలి ప్రయోగం 2008 నాటి ‘చంద్రయాన్–1’. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ‘చంద్రయాన్–2’ కోసం అప్పటి నుంచే సన్నాహాలు ప్రారంభించింది. చంద్రునిపై ‘ఇస్రో’ ప్రయోగాలు ‘చంద్రయాన్–1’ నుంచి వేగం పుంజుకున్నాయి. ‘చంద్రయాన్–2’ పూర్తయిన తర్వాత 2024లో ‘చంద్రయాన్–3’ ప్రయోగం చేపట్టడానికి ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు ఇప్పటికే సన్నాహాలను ప్రారంభించారు. -
జన జగన్నాథుని రథయాత్ర
భగవంతుడు భక్తుల నడుమకు వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకొనే అరుదైన అపురూపమైన వేడుక రథయాత్ర. ఏడాది పొడవునా గర్భాలయంలో కొలువుండే జగన్నాథుడు ఏడాదికోసారి సోదరీ సోదరులైన సుభద్ర, బలభద్రులతో కలసి రథాలను అధిరోహించి, జనం మధ్యకు వచ్చి జరుపుకొనే అపురూపమైన వేడుక రథయాత్ర. జగన్నాథుడు కొలువుతీరిన పూరీ క్షేత్రంలో రథయాత్ర వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఒడిశాలోని పూరీ పట్టణంలో జరిగే రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత భారీస్థాయిలో జరిగే రథయాత్ర జగన్నాథునిదే. అక్షయ తృతీయ నాటితో నాంది జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుక్ల విదియ రోజున జరుగుతుంది. అయితే, రథయాత్ర వేడుక కోసం సన్నాహాలు మాత్రం వైశాఖ శుక్ల తదియ నాడు జరిగే అక్షయ తృతీయ పర్వదినం నుంచే మొదలవుతాయి. వేసవి తీవ్రత మొదలవడంతో విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు. దీనినే ‘గంధలేపన యాత్ర’ అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోజున పూరీ క్షేత్రంలో రథాల తయారీ మొదలవుతుంది. పూరీ రాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాల తయారీ కొనసాగుతుంది. అక్షయ తృతీయ నాటి నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది. చందనయాత్ర 42 రోజుల పాటు కొనసాగుతుంది. అక్షయ తృతీయనాడు మొదలయ్యే చందనయాత్రను రథయాత్ర వేడుకలకు నాందీ ప్రస్తావనగా చెప్పుకోవచ్చు. చందనయాత్ర ప్రథమార్ధాన్ని ‘బాహొరొ చందనయాత్ర’ (బహిర్ చందనయాత్ర) అంటారు. ఇది అక్షయ తృతీయ మొదలుకొని 21 రోజులు కొనసాగుతుంది. బహిర్ చందనయాత్రలో మదనమోహనుడైన జగన్నాథుడిని శ్రీదేవి భూదేవీ సమేతంగా పూరీ ఆలయ సింహద్వారం నుంచి ఊరేగింపుగా బయటకు తీసుకొచ్చి నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్రలో బయటకు తీసుకొచ్చేవి ఉత్సవ విగ్రహాలు మాత్రమే. శ్రీదేవీ భూదేవీ సమేతుడైన మదనమోహనుడితో పాటు రామ కృష్ణులను, నంద భద్ర అనే వారి ధనుస్సులను, పంచపాండవుల స్వరూపాలుగా భావించే ఐదు శివలింగాలను కూడా నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్ర ద్వితీయార్ధాన్ని ‘భితొరొ చందనయాత్ర’ (అంతర్ చందనయాత్ర) అంటారు. ద్వితీయార్ధంలోని 21 రోజుల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే– అమావాస్య, షష్టి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయం లోపలే వేడుకలను నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ‘స్నానయాత్ర’తో చందనయాత్ర వేడుకలు పూర్తవుతాయి. జ్యేష్ఠపౌర్ణమి నాడు ఆలయ పూజారులు మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకను నిర్వహిస్తారు. అందుకే జ్యేష్ఠపౌర్ణమిని ‘స్నానపూర్ణిమ’గా వ్యవహరిస్తారు. జగన్నాథుని అభిషేకించడానికి ఆలయంలోని ‘సునా కువొ’ (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత్ర జలాలను వినియోగిస్తారు. జగన్నాథునికీ తప్పని జ్వరబాధ స్నానపూర్ణిమలో ఏకంగా 108 కుండల నీటిలో జలకాలాడిన జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఆనాటి నుంచి రెండువారాల పాటు పూరీ ఆలయంలో భక్తులకు మూలవిరాట్టుల దర్శనం ఉండదు. మూలవిరాట్టుల స్థానంలో సంప్రదాయక ‘పొటొచిత్రొ’ పద్ధతిలో పెద్దవస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపాలనే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండువారాల కాలంలో జగన్నాథుని మూలవిరాట్టుకు ఛప్పన్న (యాభై ఆరు) భోగాల నైవేద్యం కూడా నిలిచిపోతుంది. జ్వరపీడితుడైన జగన్నాథునికి ఔషధ మూలికలు, ఆకులు, కషాయాలు, కొన్ని పండ్లను మాత్రమే దైతాపతులు సమర్పిస్తారు. జగన్నాథుని తొలుత ఆరాధించిన గిరిజన రాజు విశ్వవసు కూతురు లలిత, బ్రాహ్మణ పూజారి విద్యాపతిల వారసులే దైతాపతులు. జగన్నాథుని ఆరాధనలో వీరికి విశేష అధికారాలు ఉంటాయి. జ్వరపీడితుడైన జగన్నాథునికి పథ్యపానాలు సమర్పించే ప్రత్యేక అధికారం ఈ దైతాపతులకు మాత్రమే పరిమితం. రథయాత్ర వేడుకలు ముగిసేంత వరకు వీరి ఆధ్వర్యంలోనే జగన్నాథుని పూజాదికాలు జరుగుతాయి. జగన్నాథునికి జ్వరం తగ్గేలోగా రథాల తయారీ, వాటి అలంకరణ పూర్తవుతుంది. స్థలపురాణం పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. గిరిజన రాజు విశ్వవసు నీలమాధవుడిని తొలుత ఆరాధించాడని చెబుతారు. నీలమాధవుని విగ్రహం నీలమణితో తయారై ఉండేదని, అది కాలగర్భంలో కలసిపోయిన కొన్నాళ్లకు ఇంద్రద్యుమ్నుడనే రాజు తనకు కలలో కనిపించిన దారువును (కొయ్యదుంగ) విగ్రహాలుగా తయారు చేయించాలని సంకల్పించి, ఈ పని కోసం ఒక వృద్ధ శిల్పిని నియమించాడు. దారువుతో శిల్పాలను మలచేందుకు అంగీకరించిన వృద్ధ శిల్పి రాజుకు ఒక షరతు విధించాడు. తనకు ప్రత్యేకంగా ఒక గదిని ఇవ్వాలని, పని పూర్తయ్యేంత వరకు తనను ఎవరూ కదిలించరాదని చెప్పాడు. రాజు అంగీకరించాడు. ఎన్నాళ్లయినా, శిల్పి ఉన్న గది తలుపులు తెరుచుకోక పోవడం, కనీసం శిల్పాలు చెక్కుతున్న అలికిడైనా వినిపించకపోవడంతో వృద్ధుడైన శిల్పికి ఏమైనా జరిగి ఉండవచ్చని కీడు శంకించిన రాజు గది తలుపులు తెరిచాడు. మొండెం వరకు మాత్రమే చెక్కిన శిల్పాలు అక్కడలా ఉండగానే, శిల్పి అంతర్ధానమయ్యాడు. రాజు తన పొరపాటుకు దుఃఖించగా, జగన్నాథుడు ప్రత్యక్షమై, ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించమని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు వాటిని అలాగే ప్రతిష్ఠించి, పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాతి కాలంలో ముగ్ధమనోహరమైన ఈ దారు విగ్రహమూర్తులను ఆదిశంకరాచార్యలు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు దర్శించుకుని, పూజలు జరిపారు. పూరీక్షేత్రంలో వారి వారి పీఠాలను, మఠాలను కూడా ఏర్పాటు చేసుకుని మరీ జగన్నాథుని సేవించి, తరించారు. ఆదిశంకరాచార్యులు జగన్నాథుని స్తుతిస్తూ జగన్నాథ అష్టకాన్ని రచించారు. ప్రస్తుతం పూరీలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని పదో శతాబ్దికి చెందిన తూర్పు గంగవంశపు రాజులు నిర్మించారు. అనంతవర్మ చోడగంగదేవ్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ప్రారంభమైంది. గుండిచా మందిరం రథయాత్రలో రాజు కూడా సామాన్యుడే రథయాత్ర నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను రథాలపైకి ఎక్కిస్తారు. విగ్రహాలను రథాలపైకి చేర్చే ముందు పూరీ రాజు సామాన్య సేవకుడిలా చీపురు పట్టి, రథాలను శుభ్రం చేస్తారు. రాజు శుభ్రం చేసి వచ్చిన తర్వాత మూడు విగ్రహాలనూ మూడు రథాలపైకి చేరుస్తారు. ఈ తతంగాన్ని ‘పొహాండి’ అంటారు. పూజారుల మంత్రాలు, మేళతాళాల నడుమ విగ్రహాలు రథాలపైకి చేరుకున్న తర్వాత పెద్దసంఖ్యలో భక్తులు వాటికి కట్టిన తాళ్లను పట్టుకుని రథాలను ముందుకు లాగుతారు. పూరీ జగన్నాథ ఆలయం ఎదుట ఉండే ‘బొడొదండొ’ (పెద్దవీధి) మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకు రథయాత్ర సాగుతుంది. జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత వంటి ప్రాచీన పురాణగ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది. తిరుగు రథయాత్ర మూడు రథాలూ ‘గుండిచా’ మందిరం వద్దకు చేరుకున్నాక, జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఆ మందిరంలో ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువుదీరుస్తారు. ‘గుండిచా’ మందిరంలో జగన్నాథుడు దశావతారాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. తోటలో వెలసిన ‘గుండిచా’ మందిరాన్ని జగన్నాథుని ‘వేసవి తోట విడిది’గా పరిగణిస్తారు. జగన్నాథుడు కొలువు తీరిన తొమ్మిదిరోజుల రథయాత్ర వేడుక సమయంలోనే ‘గుండిచా’ మందిరం భక్తులతో కళకళలాడుతుంది. ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఇది ఖాళీగా ఉంటుంది. రథయాత్ర మొదలైన ఐదో రోజున గుండిచా మందిరంలో ‘హీరా పంచమి’ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆరోజు జగన్నాథుడు నరసింహావతారంలో దర్శనమిస్తాడు. గుండిచాలో జరిగే వేడుకల్లో ఇది చాలా ప్రధానమైన వేడుక. జగన్నాథుని ప్రధాన ఆలయంలోనికి విదేశీయులను అనుమతించరు. రథయాత్ర వేడుకల్లోను, గుండిచా మందిరంలో కొలువుండే సమయంలోను విదేశీయులను కూడా జగన్నాథుని దర్శనానికి అనుమతిస్తారు. ఆషాఢ శుద్ధ దశమి నాడు గుండిచా మందిరం నుంచి ‘తిరుగు రథయాత్ర’ ప్రారంభమవుతుంది. దీనినే ‘బాహుడా’ అంటారు. మార్గమధ్యంలోని ‘అర్ధాసిని’ (మౌసి మా–పినతల్లి) మందిరం వద్ద ఆగి, అక్కడ నివేదించే మిఠాయిలను జగన్నాథుడు ఆరగిస్తాడు. ‘బాహుడా’ మరుసటి రోజున ఏకాదశి నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు స్వర్ణాలంకారాలతో రథాలపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వం చేస్తారు. దీనినే ‘సునాబేసొ’ (స్వర్ణ వేషధారణ) అంటారు. స్వర్ణవేషధారణలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు చతుర్భుజాలతో, పాదాలతో పరిపూర్ణంగా దర్శనమిస్తారు. ‘మౌసి మా’ మందిరం వద్ద విరామం తర్వాత రథాలు తిరిగి ప్రధాన ఆలయం వైపు ముందుకు సాగుతాయి. చతుర్దశి ఘడియల్లో రాత్రివేళ జగన్నాథుని ఆలయ ప్రవేశ ఉత్సవం జరుగుతుంది. తనను తీసుకుపోకుండా సోదరీ సోదరులతో కలసి రథాలపై ఊరేగి తిరిగి వచ్చిన జగన్నాథునిపై లక్ష్మీదేవి అలకబూనడం, రసగుల్లాలు ఇచ్చి జగన్నాథుడు ఆమెను ప్రసన్నం చేసుకోవడం వంటి వినోదభరితమైన ఘట్టాలను పూజారులు నిర్వహిస్తారు. దాదాపు పక్షంరోజుల పాటు జగన్నాథుడు లేక చిన్నబోయిన పూరీ శ్రీక్షేత్రంలో ఆషాఢ పూర్ణిమ నాటి నుంచి యథాప్రకారం భక్తుల కోలాహలం మొదలవుతుంది. మూడు రథాల విశేషాలు చాలా పుణ్యక్షేత్రాల్లోని మూలవిరాట్టు విగ్రహాలన్నీ శిలా విగ్రహాలు. పూరీక్షేత్రంలోనివి మాత్రం దారు విగ్రహాలు. రథయాత్రలో వీటిని ఊరేగించే మూడు రథాలను కూడా కలపతోనే తయారు చేస్తారు. మూడు రథాలకు నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. శిల్పులు శాస్త్రప్రామాణికంగా ఈ మూడు రథాలను తయారు చేస్తారు. జగన్నాథుని రథం పేరు ‘నందిఘోష్’, బలభద్రుని రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. వీటిలో జగన్నాథుని రథం ‘నందిఘోష్’ అన్నింటి కంటే పెద్దగా ఉంటుంది. నందిఘోష్కు 16 చక్రాలు ఉంటాయి. దీని ఎత్తు 44.2 అడుగులు, పొడవు 34.6 అడుగులు, వెడల్పు 34.6 అడుగులు. దీని తయారీకి చిన్నా పెద్దా కలుపుకొని 832 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, పసుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘నందిఘోష్’ కావలి దైవం గరుత్మంతుడు, సారథి దారుకుడు. పతాకంపై కొలువుదీరే దైవం ‘త్రైలోక్యమోహిని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: శంఖ, బలాహక, శ్వేత, హరిదాశ్వాలు, ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన శంఖచూడునిగా భావిస్తారు. బలభద్రుని రథం ‘తాళధ్వజ’ను 14 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 43.3 అడుగులు, పొడవు 33 అడుగులు, వెడల్పు 33 అడుగులు. దీని తయారీకి 763 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, నీలం ఆకుపచ్చ కలగలసిన రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘తాళధ్వజ’ కావలి దైవం వాసుదేవుడు. సారథి మాతలి. పతాక దైవం ‘ఉన్నని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనాభ. ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన వాసుకిగా భావిస్తారు. సుభద్ర రథం ‘దర్పదళన్’ను 12 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 42.3 అడుగులు, పొడవు 31.6 అడుగులు, వెడల్పు 31.6 అడుగులు. దీని తయారీకి 593 కలప ముక్కలను ఉపయోగిస్తారు. ఈ రథాన్ని ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘దర్పదళన్’ కావలి దైవం జయదుర్గ. సారథి అర్జునుడు. పతాక దైవం నాదాంబిక. ప్రతీకాత్మకంగా దీనికి పూన్చిన అశ్వాలు: రోచిక, మోహిక, జిత, అపరాజిత. దీనికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన స్వర్ణచూడునిగా భావిస్తారు. ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనాతీతం. పూరీ ఆలయంలోని నైవేద్యాలను సిద్ధం చేసే భోగమంటపం (వంటశాల) ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. జగన్నాథునికి నివేదన పూర్తయిన తర్వాత క్షేత్రపాలిక అయిన విమలాదేవికి నివేదించి, ఆ ప్రసాదాలను ఆలయ ఈశాన్యభాగాన ఉండే ‘ఆనంద బజార్’లో భక్తులకు విక్రయిస్తారు. ప్రసాదాలను వండటానికి ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలనే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యిలపై వండుతారు. భోగ మంటపానికి చేరువలోని ‘గంగ’, ‘యమున’ అనే రెండు బావుల్లోని నీటిని మాత్రమే వంటకాలకు ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఏకకాలంలో యాభైవేల మందికి సరిపోయేలా ఇక్కడ ప్రసాదాలను తయారు చేస్తారు. పర్వదినాల్లోనైతే లక్షమందికి సరిపోయేలా తయారు చేస్తారు. ఏకకాలంలో లక్షమంది కూర్చుని భోజనం చేయగలిగేంత విశాలమైన భోజనశాల ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథునికి నివేదించే ప్రసాదాలను ‘మహాప్రసాదం’గా పరిగణిస్తారు. మహాప్రసాదాన్ని ఆరగిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. పూరీలో నివేదించే ఛప్పన్న భోగాలేమిటంటే... 1. అన్నం 2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు) 3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు) 4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు) 5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 6. నేతి అన్నం 7. కిచిడీ 8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు) 9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు) 10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి) 12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు) 14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు) 15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి) 16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు) 17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు) 19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు) 21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు) 23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు) 27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు) 30. దొహిబొరా (పెరుగు గారెలు) 31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు) 33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం) 35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు) 36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు) 38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు) 39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు) 40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు) 41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు) 42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి) 43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం) 47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం) 48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం) 49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం) 51. పొటొలొ రొసా (పొటల్స్/పర్వల్ కూర) 52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర) 53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం) 54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు) 55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం) పూరీ ఆలయ విశేషాలు పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో నూట ఇరవై ఉపాలయాలు ఉంటాయి. ఆలయ శిఖరంపై అల్లంత దూరం నుంచే కనిపించే అష్టధాతు సుదర్శనచక్రాన్ని జగన్నాథుని ప్రతిరూపంగా భావిస్తారు. దీనినే ‘నీలచక్రం’ అని, ‘పతితపావన’ అని కూడా అంటారు. దూరం నుంచి ఇది నీలికాంతులతో కనిపిస్తుంది. ఆలయ శిఖరంపైనున్న ఈ సుదర్శన చక్రాన్ని తిలకించినంత మాత్రానే పాపాలను హరించి వేస్తుందని భక్తులు నమ్ముతారు. పూరీ ఆలయానికి తూర్పు వైపున సింహ ద్వారంతో పాటు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలలో మరో మూడు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. పూరీ జగన్నాథుని ఆలయం మీదుగా విమానాలు, పక్షులు ఎగురుతూ వెళ్లడం కనపించదు. ఇదొక అరుదైన విశేషం. సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వినిపించే సాగరఘోష ఆలయంలోకి అడుగుపెడుతూనే వినిపించడం మానేస్తుంది. ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించని విధంగా నాటి శిల్పులు దీనిని నిర్మించడం మరో విశేషం. ఎక్కడైనా సముద్రతీరం వద్ద సముద్రం మీదుగా నేలవైపు గాలులు వీస్తాయి. పూరీ తీరంలో మాత్రం సాయంత్రం వేళ పట్టణం మీదుగా గాలులు సముద్రం వైపు వీస్తాయి. పూరీ మహాప్రసాదం ప్రతిరోజూ ఒకే పద్ధతిలో, పరిమాణంలో తయారు చేస్తారు. పర్వదినాల్లో రెట్టింపు పరిమాణంలో చేస్తారు. వచ్చే భక్తుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నా, ఇంతవరకు అక్కడ తయారైన ప్రసాదం వృథా అయిన దాఖలాలు గాని, భక్తులకు చాలని సందర్భాలు గాని లేవు.