భగవంతుడు భక్తుల నడుమకు వచ్చి అంగరంగ వైభవంగా జరుపుకొనే అరుదైన అపురూపమైన వేడుక రథయాత్ర. ఏడాది పొడవునా గర్భాలయంలో కొలువుండే జగన్నాథుడు ఏడాదికోసారి సోదరీ సోదరులైన సుభద్ర, బలభద్రులతో కలసి రథాలను అధిరోహించి, జనం మధ్యకు వచ్చి జరుపుకొనే అపురూపమైన వేడుక రథయాత్ర. జగన్నాథుడు కొలువుతీరిన పూరీ క్షేత్రంలో రథయాత్ర వేడుకలు నేత్రపర్వంగా జరుగుతాయి. జగన్నాథుని రథయాత్రను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఒడిశాలోని పూరీ పట్టణంలో జరిగే రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత భారీస్థాయిలో జరిగే రథయాత్ర జగన్నాథునిదే.
అక్షయ తృతీయ నాటితో నాంది
జగన్నాథ రథయాత్ర ఏటా ఆషాఢ శుక్ల విదియ రోజున జరుగుతుంది. అయితే, రథయాత్ర వేడుక కోసం సన్నాహాలు మాత్రం వైశాఖ శుక్ల తదియ నాడు జరిగే అక్షయ తృతీయ పర్వదినం నుంచే మొదలవుతాయి. వేసవి తీవ్రత మొదలవడంతో విగ్రహాలకు చందన లేపనాన్ని పూస్తారు. దీనినే ‘గంధలేపన యాత్ర’ అని కూడా అంటారు. అక్షయ తృతీయ రోజున పూరీ క్షేత్రంలో రథాల తయారీ మొదలవుతుంది. పూరీ రాజు నివాసం ఎదుట ఆలయ ప్రధాన కార్యాలయానికి చేరువలో రథాల తయారీ కొనసాగుతుంది. అక్షయ తృతీయ నాటి నుంచి జగన్నాథుని చందనయాత్ర కూడా మొదలవుతుంది.
చందనయాత్ర 42 రోజుల పాటు కొనసాగుతుంది. అక్షయ తృతీయనాడు మొదలయ్యే చందనయాత్రను రథయాత్ర వేడుకలకు నాందీ ప్రస్తావనగా చెప్పుకోవచ్చు. చందనయాత్ర ప్రథమార్ధాన్ని ‘బాహొరొ చందనయాత్ర’ (బహిర్ చందనయాత్ర) అంటారు. ఇది అక్షయ తృతీయ మొదలుకొని 21 రోజులు కొనసాగుతుంది. బహిర్ చందనయాత్రలో మదనమోహనుడైన జగన్నాథుడిని శ్రీదేవి భూదేవీ సమేతంగా పూరీ ఆలయ సింహద్వారం నుంచి ఊరేగింపుగా బయటకు తీసుకొచ్చి నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు. చందనయాత్రలో బయటకు తీసుకొచ్చేవి ఉత్సవ విగ్రహాలు మాత్రమే. శ్రీదేవీ భూదేవీ సమేతుడైన మదనమోహనుడితో పాటు రామ కృష్ణులను, నంద భద్ర అనే వారి ధనుస్సులను, పంచపాండవుల స్వరూపాలుగా భావించే ఐదు శివలింగాలను కూడా నరేంద్రతీర్థంలో పడవల్లో ఊరేగిస్తారు.
చందనయాత్ర ద్వితీయార్ధాన్ని ‘భితొరొ చందనయాత్ర’ (అంతర్ చందనయాత్ర) అంటారు. ద్వితీయార్ధంలోని 21 రోజుల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే– అమావాస్య, షష్టి, ఏకాదశి, పౌర్ణమి తిథుల్లో ఉత్సవ విగ్రహాలను బయటకు తీసుకొస్తారు. మిగిలిన రోజుల్లో ఆలయం లోపలే వేడుకలను నిర్వహిస్తారు. జ్యేష్ఠ పౌర్ణమి నాడు జరిగే ‘స్నానయాత్ర’తో చందనయాత్ర వేడుకలు పూర్తవుతాయి. జ్యేష్ఠపౌర్ణమి నాడు ఆలయ పూజారులు మంత్రోక్తంగా జగన్నాథునికి స్నాన వేడుకను నిర్వహిస్తారు. అందుకే జ్యేష్ఠపౌర్ణమిని ‘స్నానపూర్ణిమ’గా వ్యవహరిస్తారు. జగన్నాథుని అభిషేకించడానికి ఆలయంలోని ‘సునా కువొ’ (బంగారు బావి) నుంచి తెచ్చిన 108 కుండల పవిత్ర జలాలను వినియోగిస్తారు.
జగన్నాథునికీ తప్పని జ్వరబాధ
స్నానపూర్ణిమలో ఏకంగా 108 కుండల నీటిలో జలకాలాడిన జగన్నాథునికి జ్వరం వస్తుంది. ఆనాటి నుంచి రెండువారాల పాటు పూరీ ఆలయంలో భక్తులకు మూలవిరాట్టుల దర్శనం ఉండదు. మూలవిరాట్టుల స్థానంలో సంప్రదాయక ‘పొటొచిత్రొ’ పద్ధతిలో పెద్దవస్త్రంపై చిత్రించిన విగ్రహాల రూపాలనే దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండువారాల కాలంలో జగన్నాథుని మూలవిరాట్టుకు ఛప్పన్న (యాభై ఆరు) భోగాల నైవేద్యం కూడా నిలిచిపోతుంది. జ్వరపీడితుడైన జగన్నాథునికి ఔషధ మూలికలు, ఆకులు, కషాయాలు, కొన్ని పండ్లను మాత్రమే దైతాపతులు సమర్పిస్తారు. జగన్నాథుని తొలుత ఆరాధించిన గిరిజన రాజు విశ్వవసు కూతురు లలిత, బ్రాహ్మణ పూజారి విద్యాపతిల వారసులే దైతాపతులు. జగన్నాథుని ఆరాధనలో వీరికి విశేష అధికారాలు ఉంటాయి. జ్వరపీడితుడైన జగన్నాథునికి పథ్యపానాలు సమర్పించే ప్రత్యేక అధికారం ఈ దైతాపతులకు మాత్రమే పరిమితం. రథయాత్ర వేడుకలు ముగిసేంత వరకు వీరి ఆధ్వర్యంలోనే జగన్నాథుని పూజాదికాలు జరుగుతాయి. జగన్నాథునికి జ్వరం తగ్గేలోగా రథాల తయారీ, వాటి అలంకరణ పూర్తవుతుంది.
స్థలపురాణం
పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని, నీలాచలమని, నీలాద్రి అని, జగన్నాథపురి అని కూడా అంటారు. ఇక్కడ వెలసిన జగన్నాథుడిని నీలమాధవుడి ఆరాధిస్తారు. గిరిజన రాజు విశ్వవసు నీలమాధవుడిని తొలుత ఆరాధించాడని చెబుతారు. నీలమాధవుని విగ్రహం నీలమణితో తయారై ఉండేదని, అది కాలగర్భంలో కలసిపోయిన కొన్నాళ్లకు ఇంద్రద్యుమ్నుడనే రాజు తనకు కలలో కనిపించిన దారువును (కొయ్యదుంగ) విగ్రహాలుగా తయారు చేయించాలని సంకల్పించి, ఈ పని కోసం ఒక వృద్ధ శిల్పిని నియమించాడు. దారువుతో శిల్పాలను మలచేందుకు అంగీకరించిన వృద్ధ శిల్పి రాజుకు ఒక షరతు విధించాడు. తనకు ప్రత్యేకంగా ఒక గదిని ఇవ్వాలని, పని పూర్తయ్యేంత వరకు తనను ఎవరూ కదిలించరాదని చెప్పాడు. రాజు అంగీకరించాడు. ఎన్నాళ్లయినా, శిల్పి ఉన్న గది తలుపులు తెరుచుకోక పోవడం, కనీసం శిల్పాలు చెక్కుతున్న అలికిడైనా వినిపించకపోవడంతో వృద్ధుడైన శిల్పికి ఏమైనా జరిగి ఉండవచ్చని కీడు శంకించిన రాజు గది తలుపులు తెరిచాడు.
మొండెం వరకు మాత్రమే చెక్కిన శిల్పాలు అక్కడలా ఉండగానే, శిల్పి అంతర్ధానమయ్యాడు. రాజు తన పొరపాటుకు దుఃఖించగా, జగన్నాథుడు ప్రత్యక్షమై, ఆ విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించమని చెప్పి అదృశ్యమయ్యాడు. రాజు వాటిని అలాగే ప్రతిష్ఠించి, పూజలు చేయడం ప్రారంభించాడు. తర్వాతి కాలంలో ముగ్ధమనోహరమైన ఈ దారు విగ్రహమూర్తులను ఆదిశంకరాచార్యలు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చైతన్య మహాప్రభు సహా ఎందరో ఆధ్యాత్మిక గురువులు దర్శించుకుని, పూజలు జరిపారు. పూరీక్షేత్రంలో వారి వారి పీఠాలను, మఠాలను కూడా ఏర్పాటు చేసుకుని మరీ జగన్నాథుని సేవించి, తరించారు. ఆదిశంకరాచార్యులు జగన్నాథుని స్తుతిస్తూ జగన్నాథ అష్టకాన్ని రచించారు. ప్రస్తుతం పూరీలో ఉన్న జగన్నాథ ఆలయాన్ని పదో శతాబ్దికి చెందిన తూర్పు గంగవంశపు రాజులు నిర్మించారు. అనంతవర్మ చోడగంగదేవ్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ప్రారంభమైంది.
గుండిచా మందిరం
రథయాత్రలో రాజు కూడా సామాన్యుడే
రథయాత్ర నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను రథాలపైకి ఎక్కిస్తారు. విగ్రహాలను రథాలపైకి చేర్చే ముందు పూరీ రాజు సామాన్య సేవకుడిలా చీపురు పట్టి, రథాలను శుభ్రం చేస్తారు. రాజు శుభ్రం చేసి వచ్చిన తర్వాత మూడు విగ్రహాలనూ మూడు రథాలపైకి చేరుస్తారు. ఈ తతంగాన్ని ‘పొహాండి’ అంటారు. పూజారుల మంత్రాలు, మేళతాళాల నడుమ విగ్రహాలు రథాలపైకి చేరుకున్న తర్వాత పెద్దసంఖ్యలో భక్తులు వాటికి కట్టిన తాళ్లను పట్టుకుని రథాలను ముందుకు లాగుతారు. పూరీ జగన్నాథ ఆలయం ఎదుట ఉండే ‘బొడొదండొ’ (పెద్దవీధి) మీదుగా మూడు కిలోమీటర్ల దూరంలోని గుండిచా మందిరం వరకు రథయాత్ర సాగుతుంది. జగన్నాథుని రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన రథయాత్ర. బ్రహ్మపురాణం, పద్మపురాణం, స్కందపురాణం, కపిల సంహిత వంటి ప్రాచీన పురాణగ్రంథాల్లో జగన్నాథుని రథయాత్ర ప్రస్తావన కనిపిస్తుంది.
తిరుగు రథయాత్ర
మూడు రథాలూ ‘గుండిచా’ మందిరం వద్దకు చేరుకున్నాక, జగన్నాథ, బలభద్ర, సుభద్ర విగ్రహాలను ఆ మందిరంలో ఆషాఢ శుద్ధ దశమి వరకు కొలువుదీరుస్తారు. ‘గుండిచా’ మందిరంలో జగన్నాథుడు దశావతారాల రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. తోటలో వెలసిన ‘గుండిచా’ మందిరాన్ని జగన్నాథుని ‘వేసవి తోట విడిది’గా పరిగణిస్తారు. జగన్నాథుడు కొలువు తీరిన తొమ్మిదిరోజుల రథయాత్ర వేడుక సమయంలోనే ‘గుండిచా’ మందిరం భక్తులతో కళకళలాడుతుంది. ఏడాదిలో మిగిలిన రోజుల్లో ఇది ఖాళీగా ఉంటుంది. రథయాత్ర మొదలైన ఐదో రోజున గుండిచా మందిరంలో ‘హీరా పంచమి’ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆరోజు జగన్నాథుడు నరసింహావతారంలో దర్శనమిస్తాడు. గుండిచాలో జరిగే వేడుకల్లో ఇది చాలా ప్రధానమైన వేడుక.
జగన్నాథుని ప్రధాన ఆలయంలోనికి విదేశీయులను అనుమతించరు. రథయాత్ర వేడుకల్లోను, గుండిచా మందిరంలో కొలువుండే సమయంలోను విదేశీయులను కూడా జగన్నాథుని దర్శనానికి అనుమతిస్తారు. ఆషాఢ శుద్ధ దశమి నాడు గుండిచా మందిరం నుంచి ‘తిరుగు రథయాత్ర’ ప్రారంభమవుతుంది. దీనినే ‘బాహుడా’ అంటారు. మార్గమధ్యంలోని ‘అర్ధాసిని’ (మౌసి మా–పినతల్లి) మందిరం వద్ద ఆగి, అక్కడ నివేదించే మిఠాయిలను జగన్నాథుడు ఆరగిస్తాడు. ‘బాహుడా’ మరుసటి రోజున ఏకాదశి నాడు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు స్వర్ణాలంకారాలతో రథాలపై కొలువుదీరి భక్తులకు నేత్రపర్వం చేస్తారు. దీనినే ‘సునాబేసొ’ (స్వర్ణ వేషధారణ) అంటారు. స్వర్ణవేషధారణలో జగన్నాథ, బలభద్ర, సుభద్రలు చతుర్భుజాలతో, పాదాలతో పరిపూర్ణంగా దర్శనమిస్తారు.
‘మౌసి మా’ మందిరం వద్ద విరామం తర్వాత రథాలు తిరిగి ప్రధాన ఆలయం వైపు ముందుకు సాగుతాయి. చతుర్దశి ఘడియల్లో రాత్రివేళ జగన్నాథుని ఆలయ ప్రవేశ ఉత్సవం జరుగుతుంది. తనను తీసుకుపోకుండా సోదరీ సోదరులతో కలసి రథాలపై ఊరేగి తిరిగి వచ్చిన జగన్నాథునిపై లక్ష్మీదేవి అలకబూనడం, రసగుల్లాలు ఇచ్చి జగన్నాథుడు ఆమెను ప్రసన్నం చేసుకోవడం వంటి వినోదభరితమైన ఘట్టాలను పూజారులు నిర్వహిస్తారు. దాదాపు పక్షంరోజుల పాటు జగన్నాథుడు లేక చిన్నబోయిన పూరీ శ్రీక్షేత్రంలో ఆషాఢ పూర్ణిమ నాటి నుంచి యథాప్రకారం భక్తుల కోలాహలం మొదలవుతుంది.
మూడు రథాల విశేషాలు
చాలా పుణ్యక్షేత్రాల్లోని మూలవిరాట్టు విగ్రహాలన్నీ శిలా విగ్రహాలు. పూరీక్షేత్రంలోనివి మాత్రం దారు విగ్రహాలు. రథయాత్రలో వీటిని ఊరేగించే మూడు రథాలను కూడా కలపతోనే తయారు చేస్తారు. మూడు రథాలకు నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయి. శిల్పులు శాస్త్రప్రామాణికంగా ఈ మూడు రథాలను తయారు చేస్తారు. జగన్నాథుని రథం పేరు ‘నందిఘోష్’, బలభద్రుని రథం ‘తాళధ్వజ’, సుభద్ర రథం ‘దర్పదళన్’. వీటిలో జగన్నాథుని రథం ‘నందిఘోష్’ అన్నింటి కంటే పెద్దగా ఉంటుంది. నందిఘోష్‌కు 16 చక్రాలు ఉంటాయి. దీని ఎత్తు 44.2 అడుగులు, పొడవు 34.6 అడుగులు, వెడల్పు 34.6 అడుగులు. దీని తయారీకి చిన్నా పెద్దా కలుపుకొని 832 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, పసుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘నందిఘోష్’ కావలి దైవం గరుత్మంతుడు, సారథి దారుకుడు. పతాకంపై కొలువుదీరే దైవం ‘త్రైలోక్యమోహిని’.
ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: శంఖ, బలాహక, శ్వేత, హరిదాశ్వాలు, ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన శంఖచూడునిగా భావిస్తారు. బలభద్రుని రథం ‘తాళధ్వజ’ను 14 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 43.3 అడుగులు, పొడవు 33 అడుగులు, వెడల్పు 33 అడుగులు. దీని తయారీకి 763 కలప ముక్కలను ఉపయోగిస్తారు. దీనిని ఎరుపు, నీలం ఆకుపచ్చ కలగలసిన రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘తాళధ్వజ’ కావలి దైవం వాసుదేవుడు. సారథి మాతలి. పతాక దైవం ‘ఉన్నని’. ప్రతీకాత్మకంగా ఈ రథానికి పూన్చిన అశ్వాలు: తీవ్ర, ఘోర, దీర్ఘశర్మ, స్వర్ణనాభ. ఈ రథానికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన వాసుకిగా భావిస్తారు.
సుభద్ర రథం ‘దర్పదళన్’ను 12 చక్రాలతో నిర్మిస్తారు. దీని ఎత్తు 42.3 అడుగులు, పొడవు 31.6 అడుగులు, వెడల్పు 31.6 అడుగులు. దీని తయారీకి 593 కలప ముక్కలను ఉపయోగిస్తారు. ఈ రథాన్ని ఎరుపు, నలుపు రంగుల వస్త్రాలతో అలంకరిస్తారు. ‘దర్పదళన్’ కావలి దైవం జయదుర్గ. సారథి అర్జునుడు. పతాక దైవం నాదాంబిక. ప్రతీకాత్మకంగా దీనికి పూన్చిన అశ్వాలు: రోచిక, మోహిక, జిత, అపరాజిత. దీనికి కట్టిన తాడును సర్పజాతికి చెందిన స్వర్ణచూడునిగా భావిస్తారు.
ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు
ఛప్పన్న భోగాల నిత్య నైవేద్యాలు ఆరగించే జగన్నాథుని వైభోగం వర్ణనాతీతం. పూరీ ఆలయంలోని నైవేద్యాలను సిద్ధం చేసే భోగమంటపం (వంటశాల) ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. జగన్నాథునికి ఛప్పన్న (56) ప్రసాదాలను, రోజుకు ఆరుసార్లు నివేదిస్తారు. జగన్నాథునికి నివేదన పూర్తయిన తర్వాత క్షేత్రపాలిక అయిన విమలాదేవికి నివేదించి, ఆ ప్రసాదాలను ఆలయ ఈశాన్యభాగాన ఉండే ‘ఆనంద బజార్’లో భక్తులకు విక్రయిస్తారు. ప్రసాదాలను వండటానికి ఎప్పటికప్పుడు కొత్త మట్టి కుండలనే ఉపయోగిస్తారు. కట్టెల పొయ్యిలపై వండుతారు. భోగ మంటపానికి చేరువలోని ‘గంగ’, ‘యమున’ అనే రెండు బావుల్లోని నీటిని మాత్రమే వంటకాలకు ఉపయోగిస్తారు. ప్రతిరోజూ ఏకకాలంలో యాభైవేల మందికి సరిపోయేలా ఇక్కడ ప్రసాదాలను తయారు చేస్తారు. పర్వదినాల్లోనైతే లక్షమందికి సరిపోయేలా తయారు చేస్తారు. ఏకకాలంలో లక్షమంది కూర్చుని భోజనం చేయగలిగేంత విశాలమైన భోజనశాల ఇక్కడి ప్రత్యేకత. జగన్నాథునికి నివేదించే ప్రసాదాలను ‘మహాప్రసాదం’గా పరిగణిస్తారు. మహాప్రసాదాన్ని ఆరగిస్తే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.
పూరీలో నివేదించే ఛప్పన్న భోగాలేమిటంటే...
1. అన్నం 2. కనికా (బియ్యం, నెయ్యి, పంచదారతో తయారు చేస్తారు)
3. దొహి పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పెరుగు కలిపి తయారు చేస్తారు)
4. ఒద్దా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి అల్లం కలుపుతారు)
5. తీపి కిచిడీ (బియ్యం, పెసరపప్పు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
6. నేతి అన్నం 7. కిచిడీ
8. మిఠా పొఖాళొ (నీట్లో నానిన అన్నానికి పంచదార కలుపుతారు)
9. ఒరియా పొఖాళొ (బియ్యం, నెయ్యి, నిమ్మరసం, ఉప్పుతో చేస్తారు)
10. కాజా 11. గొజ్జా (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేసే మిఠాయి)
12. లడ్డు 13. మగజా లడ్డు (గోధుమపిండితో చేసే లడ్డు)
14. జీరాలడ్డు (గోధుమపిండికి జీలకర్ర చేర్చి తయారు చేసే లడ్డు)
15. వల్లభ (గోధుమపిండితో చేసే ఒక ప్రత్యేక మిఠాయి)
16. ఖురుమా (గోధుమపిండి, పంచదార, ఉప్పుతో చేస్తారు)
17. మొథాపులి (మినుములు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
18. కకరా (గోధుమపిండి, కొబ్బరికోరు, పంచదారతో చేస్తారు)
19. మరిచి లడ్డు (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
20. లుణి ఖురుమా (గొధుమపిండి, నెయ్యి, ఉప్పుతో చేస్తారు)
21. సువార్ పిఠా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
22. చొడెయి లొడా (గోధుమలు, నెయ్యి, పంచదారతో చేస్తారు)
23. ఝిలి (వరిపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
24. కొంటి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
25. మండా (గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
26. ఒమాళు (గోధుమపిండి, నెయ్యి, పంచదారతో చేస్తారు)
27. పూరీ 28. లుచి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
29. బొరా (మినప్పప్పుతో చేసే వడలు)
30. దొహిబొరా (పెరుగు గారెలు)
31. అరిసె 32. త్రిపురి (వరిపిండి, నెయ్యితో చేస్తారు)
33. రొసాపాయిక (గోధుమలతో చేస్తారు) 34. ఖిరి (పాయసం)
35. పాపుడి (పాలమీగడ, పంచదారతో చేస్తారు)
36. కోవా 37. రొసాబొళి (పాలు, పంచదార, గోధుమలతో చేస్తారు)
38. తడియా (తాజా పనీర్, నెయ్యి, పంచదారతో చేస్తారు)
39. ఛెనాఖాయి (తాజా పనీర్, పంచదార, పాలతో చేస్తారు)
40. బపుడి ఖొజా (పాలమీగడ, నెయ్యి, పంచదారతో చేస్తారు)
41. ఖువా మండా (పాలు, గోధుమపిండి, నెయ్యితో చేస్తారు)
42. సొరాపులి (పాలను గంటల తరబడి మరిగించి చేసే మిఠాయి)
43. డల్లి (కందిపప్పుతో చేసే ముద్దపప్పు) 44. ముగొడల్లి (పెసరపప్పు వంటకం) 45. బిరిడల్లి (మినుములతో చేసే పప్పు) 46. ఉరద్ డల్లి (మినప్పప్పు వంటకం)
47. దాల్మా (కందిపప్పు, కాయగూరలు కలిపి చేసే వంటకం)
48. మవుర్ (పప్పులు, కొర్రలతో చేసే వంటకం)
49. బేసొరొ (కలగూర వంటకం) 50. సగొ (తోటకూర వంటకం)
51. పొటొలొ రొసా (పొటల్స్/పర్వల్ కూర)
52. గొటి బైగొణొ (గుత్తివంకాయ కూర)
53. ఖొటా (చింతపండు గుజ్జు, బెల్లంతో చేసే లేహ్యం)
54. రైతా (పెరుగులో కూరగాయల ముక్కలు వేసి చేస్తారు)
55. పిఠా (గోధుమపిండితో చేసే తీపిరొట్టె) 56. బైగని (వంకాయలతో చేసే వంటకం)
పూరీ ఆలయ విశేషాలు
పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పూరీ జగన్నాథ ఆలయ ప్రాంగణంలో నూట ఇరవై ఉపాలయాలు ఉంటాయి. ఆలయ శిఖరంపై అల్లంత దూరం నుంచే కనిపించే అష్టధాతు సుదర్శనచక్రాన్ని జగన్నాథుని ప్రతిరూపంగా భావిస్తారు. దీనినే ‘నీలచక్రం’ అని, ‘పతితపావన’ అని కూడా అంటారు. దూరం నుంచి ఇది నీలికాంతులతో కనిపిస్తుంది. ఆలయ శిఖరంపైనున్న ఈ సుదర్శన చక్రాన్ని తిలకించినంత మాత్రానే పాపాలను హరించి వేస్తుందని భక్తులు నమ్ముతారు. పూరీ ఆలయానికి తూర్పు వైపున సింహ ద్వారంతో పాటు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశలలో మరో మూడు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. పూరీ జగన్నాథుని ఆలయం మీదుగా విమానాలు, పక్షులు ఎగురుతూ వెళ్లడం కనపించదు. ఇదొక అరుదైన విశేషం.
సింహద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు వినిపించే సాగరఘోష ఆలయంలోకి అడుగుపెడుతూనే వినిపించడం మానేస్తుంది. ఆలయం నీడ ఏ సమయంలోనూ కనిపించని విధంగా నాటి శిల్పులు దీనిని నిర్మించడం మరో విశేషం. ఎక్కడైనా సముద్రతీరం వద్ద సముద్రం మీదుగా నేలవైపు గాలులు వీస్తాయి. పూరీ తీరంలో మాత్రం సాయంత్రం వేళ పట్టణం మీదుగా గాలులు సముద్రం వైపు వీస్తాయి. పూరీ మహాప్రసాదం ప్రతిరోజూ ఒకే పద్ధతిలో, పరిమాణంలో తయారు చేస్తారు. పర్వదినాల్లో రెట్టింపు పరిమాణంలో చేస్తారు. వచ్చే భక్తుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నా, ఇంతవరకు అక్కడ తయారైన ప్రసాదం వృథా అయిన దాఖలాలు గాని, భక్తులకు చాలని సందర్భాలు గాని లేవు.
Comments
Please login to add a commentAdd a comment